September 26, 2024

Random thoughts on language in fiction:

(తెలుగులో కథలు రాసేవాడిగా కథల్లో భాష మీద నా రీసెంట్ ఆలోచనలు కొన్ని. ఇవి మిగతా వాళ్ళకీ, మిగతా ప్రక్రియలకీ అప్లయ్‌ అవ్వచ్చు కాకపోవచ్చు.)

> నా మొదటి కథ నాకు పాతికేళ్ళ వయసప్పుడు రాసింది. దాన్ని అప్పట్లో బ్లాగులో పోస్ట్ చేస్తే కింద కామెంట్లలో “నాణ్యమైన తెలుగు” అనీ, “తెలుగంటే ఇలా ఉండాలీ” అనీ కొన్ని కామెంట్లు వచ్చాయి. నిజానికి అందులో తెలుగు కంటే సంస్కృతమే ఎక్కువ ఉంది. ఉదాహరణకి కొన్ని వాక్యాలు: “సృష్టి యావత్తూ నా నిశ్వాసాలకు సంకోచిస్తూ, ఉచ్ఛ్వాసాలకు వ్యాకోచిస్తున్న చిత్తభ్రమ”, “నాలో సుడులు తిరుగుతూ చెలరేగుతున్న కాంక్షా సంవర్తానికి ఆమె కేంద్రకమైంది”... ఇలాంటి గరుకు, ఎగుడుదిగుడు, సంకర భాష రాశాను. చివరికి పళ్ళు తోముకోవటానికి కూడా “దంతధావనం” అని రాశాను. ఒకవేళ అదే కథని నేను ఇప్పుడు 2024లో రాస్తే చదివినవాళ్ళు ఎవ్వరూ అందులోని భాషని “నాణ్యమైన తెలుగు” అని పొగడరు. ఎందుకంటే ఇప్పుడు నా ఆలోచనలకి తెలుగు మాటలు చప్పున తట్టకపోతేనో/ తెలుగు మాటలు లేకపోతేనో– వెంటనే ఇంగ్లీషు వైపయినా వెళ్ళిపోతాను గానీ, సంస్కృతం హేంగోవర్‌ ఉన్న తెలుగు జోలికి మాత్రం వెళ్ళను. కారణం సింపుల్– ఇంగ్లీషు బతికున్న భాష, సంస్కృతం చచ్చిపోయిన భాష. ఈ మొదటి కథని చాలా ఏళ్ళ తర్వాత ఎప్పుడో చదివితే ప్రతీ వాక్యానికీ చిరాకేసింది. ఇంక లాభం లేదని కథని మళ్ళీ డ్రాఫ్ట్‌లో పెట్టి మామూలు భాషలోకి “ట్రాన్స్‌‍లేట్” చేయటానికి వీలైనంత ట్రై చేశాను. ఐనా దీన్ని నా కథల పుస్తకంలోకి తీసుకోబుద్ధి కాలేదు. ఇదనే కాదు, నా కొన్ని పాత కథల్లో అక్కడక్కడా ఈ భాష ఉంటుంది. కథల పుస్తకం పబ్లిష్ చేసేటప్పుడు వీలైన చోట్ల రివైజ్ చేసుకుంటూ వచ్చాను. ఐనా ఇంకా కొంత సంస్కృత–-తెలుగు అలాగే ఉండిపోయింది. ఫిక్షన్‌ మీద నా అవగాహన పెరిగేకొద్దీ నా భాష సింప్లిఫై అవుతూ వచ్చింది. ముఖ్యంగా నోటి మాటలకి దగ్గరగా వెళ్తూ వచ్చింది. —అంటే నా నోటి మాటలకి. 

> తూర్పు గోదావరి జిల్లాలో తండ్రులూ తాతల కాలం నుంచి వ్యవసాయం వదిలి ఉద్యోగాలే చేస్తున్న మిడిల్‌ క్లాస్‌ ఫేమిలీలో నేను పుట్టి పెరిగాను. కాబట్టి నా మాటలకి మరీ సినిమాల్లో వినిపించేంత గోదావరి జిల్లాల యాస ఉండదు గానీ కొంత ఉంటుంది. ఆ యాస కూడా అవతల మాట్లాడేది ఎవరూ అన్నదాన్ని బట్టి అప్రయత్నం గానే స్విచ్‌ ఆన్‌/ స్విచ్‌ ఆఫ్‌ అవుతూ ఉంటుంది. అంతగా పరిచయం లేనివాళ్ళ ముందు కుదురుగా మాట్లాడతాను. ఏ చిన్నప్పటి ఫ్రెండ్‌ తోనో ఐతే పరమ యాస వచ్చేస్తుంది. దానికితోడు ఇరవయ్యేళ్ళుగా హైదరాబాద్‌లో ఉండబట్టి కొన్ని తెలంగాణ పదాలు నా భాషలో కలిసిపోయాయి. అలాగే ఇక్కడ ముస్లిం వెండర్స్‌తో మాట్లాడేటప్పుడు అరకొర హైదరాబాదీ ఉర్దూ కూడా బైటపడుతుంది. ఇలా నా జీవితం నడిచిన దారిని బట్టి నాకంటూ ఓ మాట తీరు ఏర్పడింది. ఇదే నా మాండలికం.

> ‘‘మాండలికం’’ అనే పదానికి ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఇరుకైన అర్థం. భాషకి ప్రాదేశిక మండలం మాత్రమే ఉండదు, అంతరంగ మండలం కూడా ఒకటి ఉంటుంది. మొన్నామధ్య ఒక పోస్టులో రాశాను: ‘‘ప్రతి మనిషికీ తన ఆవరణ ఉంటుంది, తను సౌకర్యంగా మసలుకునే స్పేస్ ఉంటుంది. అది వాడి ‘మండలం’. అందులోంచి వచ్చే మాటే మాండలికం. మాండలికం లేని మనిషంటూ ఎవడూ ఉండడు, యాసలేని మాట ఎవడి నోటి నుంచీ రాదు.’’  

> పైగా కథల్లో భాష ఎలా ఉండాలీ అన్న దాన్ని రచయిత మాట్లాడే భాష మాత్రమే అన్నిసార్లూ డిసైడ్‌ చేయదు. ఆ కథ దేని గురించీ అన్నది కూడా డిసైడ్‌ చేస్తుంది. ఫరెగ్జాంపుల్‌ ఈమధ్య రాసిన నా నవలలో కేరెక్టర్లు ఇరవైల వయసులోని వాళ్ళు, వాళ్ళ కథ 2020ల్లో జరుగుతుంది. కథ చెప్పే గొంతు వీలైనంత వరకు ఆ పాత్రలకు నప్పే ఆవరణ లోనే ఉండాలనుకున్నాను. అందుకే ఎక్కువ ఇంగ్లీషు పదాలు వాడాను. ఉద్దేశపూర్వకం గానే ‘దిగులు’ అన్న పదానికి బదులు ‘డల్‌’ అని రాశాను. ‘ప్రవర్తన’ అన్నదానికి ‘బిహేవియర్‌’ అని రాశాను. ఇలాంటివి చాలా చోట్ల చేశాను.

> అందుకే ‘‘తెలుగు భాషని కాపాడాలీ’’ అని ఉద్యమాలు చేసేవాళ్ళు ఆ బాధ్యతని కథలు రాసుకునే వాళ్ళ మీద పెడితే పనవదు. ఫిక్షన్‌కి– ముఖ్యంగా రియలిస్టిక్‌ ఫిక్షన్‌కి– వేరే డిమాండ్లు ఉంటాయి, రియలిస్టిక్ రైటర్లు మొదట వాటికే తలొగ్గుతారు. 

> రియలిస్టిక్‌ రైటర్లకి ఆపుకోలేని దురద ఒకటి ఉంటుంది. తాము చూసిన ప్రపంచాన్నీ, తమ అంతరంగం లోకి డిస్టిల్ ఐన ప్రపంచాన్నీ ఏ మార్పూ లేకుండా ఉన్నది ఉన్నట్టు కథల్లో చూపెట్టాలని. ఎవరూ వాళ్ళని ఇలాగే రాయాలని అడగకపోయినా, ఇలా రాస్తేనే వాళ్ళకు తృప్తి. ఉన్నదున్నట్టు చెప్పలేకపోతే కథలో ఏదో లోటు చేసినట్టూ, ఆ కథ ఇంకా పూర్తి కానట్టూ ఉంటుంది. నేను రియలిస్టిక్‌ రైటర్‌ని మాత్రమే కాదు. కొన్ని కథల్ని అబ్సర్డ్/ డ్రీమీ లాండ్‌ స్కేప్‌లో కూడా చెప్పాను. ఐతే రియలిస్టిక్‌ రైటింగ్‌ దగ్గరకు వచ్చేసరికి ప్రపంచానికి ఎంత దగ్గరగా అద్దం పట్టగలిగానూ అన్నదే నాకు ముఖ్యం. ఒక్కోసారి రీడర్స్‌కి అసభ్యం/ అభ్యంతరకరం/ అశ్లీలం అనిపించే ఎలిమెంట్స్‌ ఉన్నా సరే రియలిస్టిక్ రైటర్లు ఈ విషయంలో పాపం ఏం చేయలేరు. 

> ఈమధ్య రాసిన నవలలో కొన్ని చోట్ల బూతులు ఉండటం గురించి కొంతమంది నాతో మాట్లాడారు. మామూలుగా  సోకాల్డ్‌ సభ్య సమాజాన్ని ఇబ్బంది పెట్టే అంశాలు ఏమైనా కథల్లో ఉంటే మనవాళ్ళు– ‘‘మాంసం తిన్నామని ఎముకలు మెళ్ళో వేసుకుంటామా,’’ అన్న రొడ్డకొట్టుడు సామెత ఒకటి వినిపిస్తారు. కానీ ఇలా ఎముకలు మెళ్లో వేసుకోవటం రియలిస్టిక్‌ ఫిక్షన్‌ విషయంలో తప్పదు మరి. లిటరేచర్‌ దగ్గర కూడా పౌడరు పూసుకుని దొంగ వేషాలు వేయాలంటే కష్టం.

> పుస్తకాల్లో బూతుల విషయంలోనూ, సెక్స్ విషయంలోనూ పెద్ద పెద్ద యుద్ధాలు వెస్ట్రన్‌ లిటరేచర్‌లో ఇరవయ్యో శతాబ్దం మొదట్లో జరిగాయి. ఫ్లోబేర్‌, డి.హెచ్‌. లారెన్స్‌, జేమ్స్‌ జాయ్స్‌, హెమింగ్వే, హెన్రీ మిల్లర్‌ వీళ్ళందరి మీదా ‘‘అశ్లీలం’’ అన్న టాగ్ పడింది, ఒక్కోసారి కోర్టు కేసులు కూడా నడిచాయి, పుస్తకాలు బాన్‌ అయ్యాయి, ఆ తర్వాత పత్రికల్లో పెద్ద పెద్ద చర్చలు జరిగాయి. భాష టెక్చర్‌లో ఎంతో సహజంగా ఇమిడిపోయే బూతుల్ని భాషే ప్రధానాంగంగా నడిచే సాహిత్యం లోకి తేవటానికి అప్పటి రచయితలు చాలా యుద్ధాలే చేశారు. ఒక్కోసారి కోర్టులతోనూ, ఒక్కోసారి సొంత పబ్లిషర్లతోనూ. ఉదాహరణకి, హెమింగ్వే మొదటి నవల ‘సన్‌ ఆల్సో రైజెస్‌’లో ‘‘బిచ్‌’’ అన్న ఒక్క పదాన్ని ఎలౌ చేయటానికి ఆ పుస్తకం పబ్లిషర్‌ చాలా సందేహించాడు. ముందు జాగ్రత్తగా జడ్జీలతో కూడా మాట్లాడాక గానీ ఒప్పుకోలేదు. ఐనా గానీ ఆ ఒక్క పదానికే ఆ పుస్తకం ఒక అమెరికన్‌ రాష్ట్రంలో బాన్‌ అయ్యింది (1927లో). హెమింగ్వే ఎడిటర్‌ ఐన మాక్స్‌వెల్ పెర్కిన్స్‌ అటు పబ్లిషర్ల భయాలకీ, ఇటు హెమింగ్వే మొండిపట్టుకీ మధ్య నలిగిపోయేవాడు. హెమింగ్వే బూతుల విషయంలో నిక్కచ్చిగా ఉండేవాడు. ‘‘నేను దేని గురించి రాస్తున్నానూ అనేదానికంటే, నా భాషని పూర్తిగా వాడుకోగలుగుతున్నానా లేదా అన్నదానికే ఎక్కువ విలువ ఇస్తాను,’’ అంటాడు ఒక ఉత్తరంలో. హెమింగ్వే తర్వాతి నవల ‘టు హేవ్‌ అండ్‌ హేవ్‌ నాట్‌’లో ‘‘fuck’’ అన్న ఇంగ్లీష్ పదాన్ని మధ్యలో అక్షరాలు తీసేసి ‘‘f––k’’ అని ప్రింట్‌ చేశారు. ఇంకో నవల ‘ఫర్‌ హూమ్‌ బెల్‌ టోల్స్‌’లో హెమింగ్వే బూతులు వాడటానికి ఇంకో కిటుకు కనిపెట్టాడు. బూతులకు బదులు ‘obsenity’ (అశ్లీలం), లేదా ‘unprintable’ (అచ్చువేయలేనిది) అన్న పదాల్ని వాడాడు. అంటే బూతుల్ని తను వాడకుండానే రీడర్స్‌ మైండ్‌లో సృష్టించాడన్నమాట. (మన సినిమా దర్శకుడు జంధ్యాల ఒక సినిమాలో కేరెక్టర్‌ బూతులు మాట్లాడినప్పుడల్లా స్క్రీన్‌ మీద ‘‘బూతూ బూతూ’’ అని టైటిల్‌ వేసినట్టు). ఉదాహరణకి ఆ నవల్లో ఒక వాక్యం: ‘‘Where the obscenity have you been?’’ (అంటే ‘‘Where the fuck have you been?’’ అనటానికి బదులుగా అన్న మాట). కొన్ని చోట్ల ‘‘fuck’’ అన్న పదం బదులు ‘‘muck’’ (మురికి) అన్న పదం కూడా వాడాడు. అంటే ‘‘Go fuck yourself’’ బదులు ‘‘Go muck yourself’’ అనీ ఇలాగ. ఉదాహరణకి ఇలాంటి ఇంకో వాక్యం: ‘‘muck my grandfather and muck this whole treacherous muck-faced mucking country and every mucking Spaniard in it’’.

> ఏ భాషలోనైనా ఏమాత్రం మారకుండా కాలాలు దాటి నిలిచే పదాలు బూతులే. భాషలో బూతుల కంటే సజీవమైన, ప్రాచీనమైన భాగం ఇంకోటి ఉండదని నా ఫీలింగ్.  మన తెలుగు బూతులు కూడా చాలా ప్రాచీనం. ఉదాహరణకి 1750 దరిదాపుల్లో వచ్చిన కూచిమంచి  జగ్గకవి ‘చంద్రరేఖావిలాపం’ కావ్యంలో ఆనాటి కావ్య భాష మధ్యలో అప్పటికీ ఇప్పటికీ ఒకేలా చెక్కుచెదరని బూతులు కనిపిస్తాయి.

> బూతుల విషయంలో కాస్త తగ్గమని హెమింగ్వేని ఆయన ఎడిటర్‌ మాక్స్‌వెల్‌ పెర్కిన్స్‌ బతిమాలితే, హెమింగ్వే ఇచ్చిన సమాధానం: ‘‘ఇంకో పదంతో మార్చగలిగే వీలుందా లేదా అని ముందు ఒకసారి ఆలోచించకుండా నేను ఎప్పుడూ ఏ ఒక్క పదమూ వాడలేదు’’. (Never used a word without first considering whether or not it was replaceable.)

> ఇప్పుడు తెలుగు లోనూ కొంతమంది రైటర్లు బూతులు స్వేచ్ఛగా వాడుతున్నారు. కానీ ఆ విషయం మీద ఏమైనా విమర్శలు వస్తే– పల్లెటూరి జీవితం గురించి ఆ భాషలో చెప్పటానికి బూతులు వాడక తప్పదూ అన్న సమర్థన వాళ్ళ దగ్గర ఉంది. నిజానికి ఆ సమర్థన కూడా అవసరం లేదు. ఆల్టిమేట్‌గా– బూతులతో ఏ రైటర్‌కైనా ఉన్న కంఫర్టే అతని బూతుల వాడకాన్ని డిక్టేట్‌ చేస్తుంది. అలాంటి భాష అస్సలు పడని రీడర్‌ ఎవరైనా ఉంటే వాడు ఒకసారి చదివాక ఇంక మళ్ళీ ఆ రైటర్‌ జోలికి ఎలాగూ వెళ్ళడు. నా వరకూ బూతులతో కంఫర్ట్‌ నేను ఎవరితో మాట్లాడుతున్నానూ అన్నదాన్ని బట్టి ఉంటుంది. చిన్నప్పటి ఫ్రెండ్‌ ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు నా ప్రతి రెండో మాటకీ బూతు ఉంటుంది. నా రాతలతో నాకు అంతకుమించిన ఇంటిమసీనే ఉంటుంది. కాబట్టి అక్కడ నాకు దాపరికాల్లేవు. మాంసం తిని ఎముకల్ని బాక్ పాకెట్స్‌లో దాచుకోవటాల్లేవు.  

> మనం వాడే బూతులన్నీ ఆడవాళ్ళనీ, అణచివేతకి గురైన వర్గాలనీ కించపరిచే పదాలతో ఉంటాయని ఒక వాదన. అవును, ఎక్కువ శాతం అవే ఉంటాయి. కానీ ఇందాకే చెప్పినట్టు– రియలిస్టిక్‌ రైటర్‌కి ప్రపంచాన్ని ఉన్నదున్నట్టు చూపించటం ముఖ్యం. అందులో వాల్యూ జడ్జిమెంట్స్‌ జోలికి వాడు పోడు. వాడు ఏ ప్రపంచం గురించి రాస్తున్నాడో, ఏ మనుషుల గురించి రాస్తున్నాడో అదే వాడి భాషని డిసైడ్‌ చేస్తుంది. ‘‘కానీ రచయితలు ఇలా ఉండకూడదూ, వాళ్లు ఉన్న ప్రపంచాన్ని ఉన్నదున్నట్టు చూపించటం కాదూ, ఒక పురోగామి ప్రపంచాన్నీ ఆదర్శ ప్రపంచాన్నీ చూపిస్తూ రాయాలీ’’ అనేవాళ్లు ఉంటారు. అది వాళ్ళ అభిప్రాయం అంతే. ఇలాంటి ఎసెర్షన్లకి, ‘‘ఎందుకలాగ? ఎవరన్నారు అలాగ?’’ లాంటి సింపుల్ క్వశ్చన్లు రివర్స్ లో అడిగితే నికరమైన జవాబు ఏదీ ఉండదు.  

> కొన్ని వర్గాల్ని కించ పరిచే తిట్లు నా చిన్నప్పుడు చుట్టూ అతిమామూలుగా వినపడిపోయేవి. ఇప్పుడు వాటి లక్షణం ఏంటో అర్థమమ్యాక నేను అలాంటి మాటలు వాడను. అయితే కథలో ఒక పాత్రకి ఉన్న అలాంటి ఆటిట్యూడ్‌ ఏదైనా ఉంటే చూపించటానికో, లేదా ఆ అవగాహన లేని పాత్రని చూపించటానికో గారంటీగా అలాంటి మాటలు ఆ పాత్రకి వాడతాను. ఇప్పుడు అమెరికాలో Woke culture ద్వారా మాటలపై నిషేధం ఒకటి మొదలైంది. చనిపోయిన పాత రైటర్ల పుస్తకాల్లోని భాషనీ సవరిస్తున్నారు. క్లాసిక్‌ చిన్నపిల్లల రచయిత Roald Dahl పుస్తకాల్లోంచి ‘‘fat’’, ‘‘ugly’’ అన్న పదాలను కూడా తొలగించారు. ఇదో చెత్త ట్రెండ్‌. భాషని అదుపు చేయటం ఫాసిజానికి మొదటి దశ. అది రైట్ నుంచి వచ్చినా, లెఫ్ట్ నుంచి వచ్చినా, దానికి ఎటువంటి ప్రోగ్రెసివ్ రీజన్స్ చూపించినా… చివరకు వెనక ఉండేవి మాత్రం ఫాసిస్ట్ ఇంటెన్షన్లే. 

> ఈమధ్య రాసిన నవలలో ప్రెజెంట్‌ కంటిన్యవస్‌ టెన్స్‌ వాడిన సందర్భాల్లో ప్రూఫ్ మిస్టెక్స్ సరిగా చూసుకోలేదని ఒకరిద్దరు అనుకున్నారు. కానీ అవి అచ్చు తప్పులు కావు,  అలా కావాలనే చేసాను. తెలుగులో ప్రెజెంట్ కంటిన్యువస్ సెన్స్‌ని ‘‘ఆమె వంట చేస్తోంది/ వర్షం పడుతోంది’’ ఇలా ‘‘స్తోంది/ తోంది’’ అని వాడి రాస్తారు. నాకు ఇలా రాయటం ఎప్పుడూ ఎబ్బెట్టు గానే అనిపించింది. బైట ఎవరూ ఇలా మాట్లాడగా నేనెప్పుడూ వినలేదు. రాసే భాష కూడా అంతా మాట్లాడినట్టుగానే ఉండాలీ అని నేను అనను. కానీ నాకే ఈమధ్య అలా రాయబుద్ధి కావటం లేదు. అలా రాయకపోయినా సందర్భాన్ని బట్టి ప్రెజెంట్‌ కంటిన్యువస్‌ టెన్స్‌ అర్థమైపోతుందని నేను అనుకుంటున్నాను.  

>  సాహిత్యం ఎప్పుడైతే చుట్టూ జీవితంతోనూ, మనుషులతోనూ, వాళ్ల మాటలతోనూ సంబంధం తెగ్గొట్టుకుంటుందో అప్పుడు ఒక సెల్ఫ్ రిఫరెన్షియల్ పరిభాష (జార్గాన్) ఏర్పడుతుంది. అంటే ఆ భాష మళ్ళీ పరస్పరం రచయితలకే సులువుగా అర్థమవుతుంది. లేదంటే చదివీ చదివీ అలవాటు పడిపోయి ఆ భాష నేర్చేసుకున్న పాఠకులకి అర్థమవుతుంది. ఇలాంటి భాష సాంఘిక వ్యాసాలకో, సంపాదకీయ వ్యాసాలకో అవసరం కావచ్చు. కానీ కథలకి అవసరం లేదు. ఐనా సరే, కథల్లో కూడా, నేరేషన్‌లోనే గాక ఇంకా ఘోరంగా పాత్రల నోట పలికించే డైలాగుల్లో కూడా, ‘‘ఆత్మాశ్రయత’’, ‘‘ఆర్ద్రత’’, ‘‘సాంద్రత’’, ‘‘మార్మికత’’, ‘‘పారదర్శకత’’, ‘‘పరాధీనత’’, ‘‘స్థానభ్రంశం’’ లాంటి భాష వాడేస్తారు. ఈ విషయంలో కొత్త రైటర్లు చాలా బెటరు. భాష ఎక్కువ తెలియకో ఏమో మరి ఏం చెప్పాలన్నా తెలిసిన భాష లోనే అందంగా నెట్టుకొస్తున్నారు. కానీ వాళ్ళలో కూడా చాలామంది ఎప్పుడో చచ్చిపోయిన న్యూస్ పేపర్ భాషని ఇంకా మోస్తున్నారు. లేదంటే డెభ్బైలు ఎనభైల పాపులర్‌ నవలల్లోని భాష వాడుతున్నారు. ‘‘హృదయంలో తియ్యని అలజడు’’లు, ‘‘లతలా అల్లుకుపో’’వడాలు, ‘‘ఊహించని పరిణామానికి విస్తుపో’’వడాలు, ‘‘మనసంతా చేదైపో’’వడాలు... ఇదంతా వాడేసి వాడేసి అరిగిపోయిన భాష. అర్థాన్ని మెకానికల్ గా  విసర్జించే చచ్చు భాష. వీటిని  ‘‘Cliches’’ అంటారు. క్లీషేలకి ఎవ్వరూ అతీతులు కాదు. ఎవరైనా సరే అలవాటులో పొరపాట్లాగా ఎప్పుడోకప్పుడు వాడేస్తుంటారు. అది ఫర్లేదు కానీ, అసలు ఫలానాది క్లీషే అని గుర్తే పట్టలేకపోతే మాత్రం కష్టమే.

> ఈమధ్య సంస్కృత పదాలకి ఆల్టర్నేటివ్‌గా ఎప్పటివో పాత అచ్చ తెలుగు పదాల్ని తెచ్చి వాడుతున్నారు. నాటి గ్రామీణులు వాడేవారంటూ అమ్మమ్మల నుంచి తాతయ్యల నుంచి సేకరించిన పదాల్ని తెచ్చి ఇది స్వచ్ఛమైన తెలుగు అంటూ కథల్లో ఇముడుస్తున్నారు, మళ్ళీ అవి అర్థం కావటానికి కింద ఫుట్ నోట్స్ ఇస్తున్నారు. నా వరకూ నాకు సంస్కృత - తెలుగు ఎంత పనికిరానిదో ఇప్పుడెవరూ మాట్లాడని ఈ అచ్చ తెలుగూ అంతే పనికి రానిది. 

> “విశ్వానికే సొంతంగా జ్ఞాపక శక్తి అంటూ ఉంటే తప్ప ప్రతి ముసలాడి, ప్రతి ముసలామె చావుతోనూ ఎన్నో అమూల్యమైన విషయాలు శాశ్వతంగా మరణిస్తాయి” అంటాడు బోర్హెస్ ‘విట్నెస్’ అనే ఓ కథలో. ఓ రెండు పేరాల ఆ కథ మొదలవటం ఒక మురికి గుర్రాల శాలలో చావు ముంగిట ఆఖరి పూట గడుపుతున్న ముసలాడితో మొదలవుతుంది. అతనితోపాటే చనిపోయే విషయాల్ని కొన్నింటిని తల్చుకుంటాడు  బోర్హెస్. అనంత కాలంలో ఎప్పుడో ఒక రోజు ఎవరికీ తెలియకుండానే క్రీస్తును చూసిన ఆఖరి కళ్ళు చచ్చిపోయి ఉంటాయంటాడు. తను చనిపోయాకా తనతో చనిపోయేవేమిటీ అని తల్చుకుంటాడు. కొన్ని ఇమేజెస్ గుర్తు తెచ్చుకుంటాడు. ఒక పెద్ద దేవదారు బీరువాలో ఒక సొరుగు లాగితే కనపడిన సువాసనల సబ్బు గురించి తల్చుకోవటంతో కథ ముగుస్తుంది.  ఒక్కోసారి వందల యేళ్ళ చరిత్ర ఉన్న భాషలు కూడా ఎవరో ఒక్క మనిషితో చచ్చిపోతాయి. లింగ్విస్టులు మృత భాషలు అని ప్రకటించిన ప్రతి భాషా కూడా ప్రపంచం నుంచి ఇలా ఎవరో ఒక్క మనిషి నిష్క్రమణ తోనే మాయమై ఉంటుంది, వాటిని మాట్లాడే ఆఖరి ముసలాయనో, ముసలామో చనిపోవటంతోటే. ఇక వాళ్ళు చనిపోయిన తర్వాత పాత పుస్తకాల నుంచో, లేదా వాళ్ళ ఆఖరి దశలో నేరుగా వాళ్ళ నుంచో ఆ భాషలోని పద సంపదని సేకరించవచ్చు. కానీ దాన్ని మళ్ళీ జనం నాలుకల మీదకి చెలామణీ లోకి తేలేం. జనం నాలుకల మీద వినపడని భాష కథలకి పని రాదు. భాషా చరిత్రల నమోదుకు పనికొస్తుందంతే. భాషా గమనం అనేది వెనక్కు మళ్ళని ప్రవాహం. దాని ప్రవాహ గమనాన్ని నిర్దేశించే శక్తి సాహిత్యానికి లేదు.  

> రియలిస్టిక్ జానర్‌లో కథలు రాసేవాడికి చుట్టూ వినపడే పలుకు చాలా ముఖ్యం. కాబట్టి చుట్టూ సొసైటీ అంతా భాష పరంగా ఎటుపోతుంటే వాడూ అటే పోక తప్పదు. ఎటోపోతున్న సొసైటీని వాడు వెనక్కి లాక్కు రాలేడు. భాషని ఉద్ధరించే పని మీదేసుకుని ఏ మంచి కథా రచయితా తను సృష్టించే ప్రపంచాల్ని అసహజంగా పలికించడు. అలాగని వాడి వల్ల భాషకి ఏ ప్రయోజనమూ ఉండదనీ కాదు. చుట్టూ వినపడే భాషనే కొత్త రకంగా పలికిస్తూ, దాని చేత దానికి అలవాటు లేని పనులు చేయిస్తూ, అందీ అందని ఆలోచనల వైపు దాన్ని ఎక్కుపెడుతూ, శక్తికి మించిన ఎత్తులకి దాన్ని ఎగరవేస్తూ, ఆవేశాలు నింపి దాన్ని వెలిగిస్తూ,  కరిగిస్తూ... వాడు భాషకి మళ్ళీ మళ్ళీ యవ్వనాన్ని తెస్తుంటాడు. కానీ వాడు ఇదంతా భాషని బాగు చేద్దాం అని చేయడు.

September 3, 2024

Random thoughts on translation:


(ఇంగ్లీషు నుంచి తెలుగు లోకి అనువదించేవాడిగా నా కొన్ని రీసెంట్ ఆలోచనలు.)  

> అనువాదాలకి సంబంధించి ఇప్పుడు చెలామణీలో ఉన్న సూత్రాలూ, పద్ధతులూ ఎక్కువ ఇంగ్లీషు భాష ఆధారంగా జరిగిన ట్రాన్స్‌లేషన్ స్టడీస్ నుంచి దిగుమతి అయ్యాయి. అవి చాలాసందర్భాల్లో వేరే భాషలకి అప్లయ్ కావు. ఇంగ్లీషుకి చాలా విషయాల్లో చాలా దూరమైన తెలుగుకి అస్సలు అప్లయ్ కావు.

> రానురానూ ఇంగ్లీషు అనువాదకులు పాటించే నియమాలు అతిగా తయారయ్యాయి. మూల రచయిత ఏదో మూలవిరాట్ ఐనట్టూ, అతని ప్రతి అక్షరం శిలాక్షరమన్నట్టూ ఫీలవుతారు. మూల రచన నుంచి ఏ మాత్రం దూరం జరిగినా మహా పాపం అన్నట్టు మాట్లాడతారు. అందుకే నేను ఏదైనా ఇంగ్లీషేతర రచనకి ఏ యాభై అరవై ఏళ్ళ క్రితమో వచ్చిన పాత ఇంగ్లీష్‌ అనువాదం తీసుకోవాలా, ఈ మధ్యనే వచ్చిన కొత్త ఇంగ్లీష్‌ అనువాదం తీసుకోవాలా అన్న చాయిస్‌ దగ్గర.. ఆల్మోస్ట్ ఎప్పుడూ పాత అనువాదం జోలికే పోతున్నాను.

> ఒక అమెరికన్ అనువాదకుడు రష్యన్ నుంచి చేసిన తన అనువాద పుస్తకాలకి రాసే ముందుమాటల్లో చాలా బడాయి పోతాడు. “రష్యన్ మూలంలోని ఫలానా పదాన్ని పాత అనువాదకులందరూ ఇలా పొరబాటుగా అనువదించారూ, నేను మాత్రం సరిగ్గా అచ్చంగా ఇలా అనువదించానూ, ఈ పదం కొంచెం చిత్రంగా ధ్వనించొచ్చూ, కానీ ఇదే సరైనదీ, ఆ ఫలానా దాస్తోయెవ్‌స్కీ ఉద్దేశమో చెహోవ్ ఉద్దేశమో కచ్చితంగా చెప్పే పదం ఇదే…” ఇలా తెగ విశ్లేషిస్తాడు. కానీ ఏ మంచి రచనకైనా ఉండే linguistic textureని పట్టుకోవడంలో మాత్రం ఘోరంగా ఫెయిలవుతుంటాడు. అతని అనువాదాల్లో గొప్ప గొప్ప రష్యన్‌ రచయితలు కూడా ఏమాత్రం చదివించలేని రచయితలుగా తయారవుతారు.

> అనువాదంలో పదాల్నీ వాక్య నిర్మాణాల్నీ మరో భాషలోకి తేవటం కంటే, రచనకి ఉండే లింగ్విస్టిక్ టెక్చర్‌ని, ఎమోషనల్ టోన్‌ని పట్టుకోవడం ముఖ్యం. ఇక్కడ లింగ్విస్టిక్ టెక్చర్ అంటే రచనలో వాడే భాషలోని ప్రతి అంశం మధ్య పరస్పరం పొందిక ఉండటం. (గొంతును వాడటం తెలీనోడు మంచి సింగర్ కాలేనట్టే, భాషని వాడటం తెలీనోడు మంచి రైటరూ కాలేడు. ఇక్కడ భాష తెలియటం అంటే ఎక్కువ వకాబులరీ తెలిసుండటం అని కాదు. తను వాడే భాషలో ఒక పొందికని సాధించటం. ఆ పొందిక మంచి రైటర్లందరి దగ్గరా ఉంటుంది. అనువాదకుడు ఒరిజినల్ రచనలో ఉన్న ప్రతి పదానికీ తన భాషలో అదే అర్థాన్నిచ్చే పదం ఏముందో దాన్ని మటుకు వెతికి పట్టుకుని రిప్లేస్ చేసే ప్రయత్నం చేస్తే ఆ పొందిక ఉండదు. పదాల్ని అనువదించటం కంటే ఆ పొందికని అనువదించటం ముఖ్యం. మంచి రచయితలందరి దగ్గరా భాషలో ఉండే హార్మనీని అనువదించటం ముఖ్యం. అది సాధించలేకపోతే ఒక భాషలో మంచి రైటర్ని ఇంకో భాషలో చెడ్డ రైటరుగా మార్చేసినట్టే.)

> దాస్తోయెవ్‌స్కీ తన “బ్లడ్ బ్రదర్” లాంటోడు అంటాడు జర్మన్ కాఫ్కా. టాల్‌స్టాయ్‌ కంటే ఎత్తయిన రచయిత లేడంటాడు ఐరిష్ జేమ్స్ జాయ్స్. తుర్గెనెవ్ తనకు ఎంత ముఖ్యమో పదే పదే చెప్తాడు అమెరికన్‌ హెమింగ్వే. వీళ్ళందరూ తమకి ఇంత ముఖ్యమైన రష్యన్ రచయితల్ని చదువుకున్నది రష్యన్‌ భాషలో కాదు, అనువాదాల్లోనే. అలాగే ఆ గొప్ప రష్యన్ రచయితలు మళ్ళీ ఇంగ్లీష్ షేక్‌స్పియర్‌ని, ఫ్రెంచ్ వొల్తేర్‌ని అనువాదాల్లోనే చదుకున్నారు. వీళ్ళు చదివిన అనువాదాలేవీ ఒరిజినల్‌ రచనకి పూర్తిగా కట్టుబడిపోయి, పకడ్బందీగా సాగిన లిటరల్ ట్రాన్స్‌లేషన్స్ అయ్యుండవు. అసలు ఆ కాలం నాటికి అలాంటి కాన్సెప్టే ఏదీ ఇంకా అంత డెవలప్‌ కాలేదు. ఆ అనువాదాల్లో మూల రచయితల శైలి ఎంత ఉందో అనువాదకుల శైలి ఎంత ఉందో విడదీసి చెప్పలేం. హెమింగ్వే తనకి తుర్గెనెవ్ ఇష్టం అని చెప్తున్నాడంటే దాని అర్థం Constance Garnett అనే అనువాదకురాలి ద్వారా తనకి తెల్సిన తుర్గెనెవ్ అంటే ఇష్టం అనే అర్థం. ఎందుకంటే కాన్‌స్టాన్స్ గార్నెట్ మూలాన్ని అంత దగ్గరగా అనుసరించలేదనీ, ఒక్కోసారి స్వేచ్ఛ తీసుకుని దూరం జరిగిందనీ తర్వాత చాలామంది విమర్శించారు. అయినా సరే నేను ఇప్పుడు తుర్గెనెవ్‌, చెహోవ్‌, టాల్‌స్టాయ్‌ రచనలేమన్నా చదవాలంటే ముందు వాటికి కాన్‌స్టాన్స్ గార్నెట్ అనువాదం ఉందా లేదా అని వెతుకుతాను. ఎందుకంటే, ఆమె మూలానికి ఎంత దూరమైనా జరిగుండొచ్చు గాక, హెమింగ్వే లాంటోడ్ని అంతగా ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలిగే ఒక తుర్గెనెవ్‌ని సృష్టించగలిగింది. నాకు కావాల్సింది మూలాన్ని కచ్చితంగా పాటించే అనువాదం కాదు. అసలు తుర్గెనెవ్ కూడా కాదు. నాకు కావాల్సింది హెమింగ్వే కూడా ఎంతో ఇష్టపడిన ఒక మంచి రచన. కాన్‌స్టాన్స్‌ గార్నెట్ మీద ఎన్ని విమర్శలున్నా సరే, చెహోవ్ ఆమె అనువాదంలో ప్రకాశించినంతగా నాకు ఇంకే అనువాదంలోనూ ప్రకాశించ లేదు. ఇప్పుడు చెహోవ్ శుద్ధంగా రష్యన్‌లో ఎలా రాస్తాడో నాకు తెలియాల్సిన పని లేదు. ప్రపంచంలో ఎంతోమంది కథా రచయితల్ని ప్రేరేపించి, అలా ప్రేరేపించటం ద్వారా ఆధునిక షార్ట్‌ స్టోరీకి ఒక రూపాన్నిచ్చిన చెహోవ్ నాకు కావాలి. అతను అది సాధించగలిగింది కాన్‌స్టాన్స్ గార్నెట్ అనువాదాల ద్వారానే. 

> నిజానికి దాస్తోయెవ్‌స్కీ శైలి అంతగా బాగోదని, అతని భాష జర్నలిస్టిక్ జార్గాన్ తో నిండి ఉంటుందనీ అంటారు కొంతమంది రష్యన్లు. బహుశా రష్యన్ దాస్తోయెవ్‌స్కీ ఇంగ్లీషులోకి వచ్చేసరికి ఇంకా మంచి రచయిత లాగా మారుతున్నాడేమో ఎవరికి తెలుసు. 

> అలా అని అనువాదకులకి ఏదో మహత్తరమైన ఇంపార్టెన్స్ ఉందీ అని నేనటం లేదు. అలాగైతే అదే ఒక్క దాస్తోయెవ్‌స్కీ వేర్వేరు అనువాదాల్లో జర్మన్ నీషేనీ, ఫ్రెంచ్ కామూనీ, నార్వేజియన్ కనుట్ హామ్సన్‍నీ అంతే సమానంగా కదిలించ గలిగేవాడు కాదు కదా. అసలైన సారం ఉండేది ఎప్పుడూ రచయిత దగ్గరే. అనువాదకులు దాన్ని చెడగొట్టకుండా ఉంటే చాలు. మంచి అనువాదకులైతే మూల రచయితని అన్నిసార్లూ మరీ దగ్గరగా, గుడ్డిగా, మక్కీకి మక్కి ఫాలో అవరు. మూల రచయిత తమ భాషలో రాయాల్సి వస్తే ఎలా రాసుంటాడో ఊహిస్తారు. అలా రాయటానికి ప్రయత్నిస్తారు. పాత అనువాదకులు అదే చేశారు. ఇప్పటి ఇంగ్లీషు అనువాదకుల్లాగ మూల రచయిత వాడిన ప్రతి పదానికి మరీ మత గ్రంథాల్లోని పదాలంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఈ పిచ్చ మరీ పెరిగిపోయి ఈ మధ్య అనువాద యుద్ధాలు జరుగుతున్నాయి. “ఆ పదాన్ని అలా కాదు ఇలా అనువదించాలీ” అని నలుగురైదుగురు అనువాదకులు కొట్టుకుంటుంటే, విమర్శకులు నాలుగైదు అనువాదాల్లో ఒకే పేరాని పక్కన పక్కన పెట్టి ఏది బావుందో ఏది బాలేదో చెప్తుంటే- చదివేవాళ్ళకి సరదాగానే ఉంటుంది. కానీ ఎందుకూ పనికిరాని గొడవలు.
 
  > ఒక ఇంగ్లీషేతర భాషలోని రచనని నేరుగా అదే భాష నుంచి అనువదించటానికి, వయా ఇంగ్లీష్ అనువదించటానికీ మధ్య పోలిక చూపించి, నేరుగా ఆ భాష నుంచి అనువదించిందే అన్నిసార్లూ సుపీరియర్ అనటానికి లేదు. అనువదిస్తున్నప్పుడు మనం రచయిత సమక్షాన్నీ, అతను సృష్టిస్తున్న భావోద్వేగాల ఆవరణనీ ఇంకో భాషలోకి తెస్తున్నాం. అనువాదకుడి ప్రతిభని బట్టి, అనువాదకుడు మూల రచయిత సమక్షాన్ని ఎంత మేరకు ఆవాహన చేసుకోగలిగాడన్నదాన్ని బట్టి, మధ్యలో ఎన్ని భాషలున్నా, అతను మూల రచయిత ఎసెన్స్‌ని పట్టుకోగలడు. ఉదాహరణకి– ఇద్దరు అనువాదకులు ఉన్నారనుకుందాం. ఒకడు దాస్తోయెవ్‌స్కీ బాధేంటో అర్థం కానివాడూ, దాస్తోయెవ్‌స్కీ అంటే పెద్ద అభిమానం కూడా లేనివాడూ, కేవలం ఉద్యోగార్థం దాస్తోయెవ్‌స్కీని నేరుగా రష్యన్‌ నుంచి అనువాదం చేశాడనుకుందాం; రెండోవాడు దాస్తోయెవ్‌స్కీ యాతనేంటో అర్థం చేసుకున్నవాడూ, దాస్తోయెవ్‌స్కీని అతని ఉత్తరాలతో సహా ఇష్టంగా చదువుకున్నవాడూ ఇంగ్లీష్‌ నుంచి అనువాదం చేశాడనుకుందాం. ఈ సందర్భంలో రెండోవాడు చేసిన అనువాదమే ప్రభావవంతంగా ఉంటుంది, వాడు నేరుగా కాకుండా ఇంగ్లీషు నుంచి చేసినా గానీ.

> (ఇన్సిడెంటల్‌గా ఇక్కడ ఒక విషయం గుర్తొస్తుంది: నాలుగైదేళ్ళ క్రితం దాస్తోయెవ్‌స్కీ గొప్ప రష్యన్‌ నవల ‘బ్రదర్స్‌ కరమజవ్‌’ ఇంగ్లీష్‌ నుంచి తెలుగులోకి రావటం నాకు పెద్ద ఈవెంట్ లాగ అనిపించింది. అనువాదం కూడా బానే ఉంది కాబట్టి, ఇన్నాళ్ళూ ఇంగ్లీష్‌ రాకపోవడం వల్ల ఆ గొప్ప రచనని చదవలేనివాళ్లు ఇప్పుడు ఆ రచనని చదువుతారనీ, దాస్తోయెవ్‌స్కీ రాకతో తెలుగు సాహిత్యానికి కొత్త డైమన్షన్‌ ఏడ్‌ అవుతుందనీ అనుకున్నాను. ‘కరమజవ్‌ సోదరులు’ పుస్తకాలు బాగానే అమ్ముడయ్యాయని విన్నాను గానీ, నేను ఎక్స్‌పెక్ట్‌ చేసిన భూకంపమేం రాలేదు. దాన్ని బట్టి నాకు అర్థమైంది గొప్ప రచయితల్ని చదవటానికి కేవలం భాషే అడ్డం కాదని. భాష కంటే ఆ పర్టిక్యులర్‌ టేస్ట్‌ ఉండటం ముఖ్యం అని. ఊరకే గొప్ప రచయిత అన్న పేరూ రెప్యుటేషనే తప్ప దాస్తోయెవ్‌స్కీకి తెలుగోళ్లు అంత సీన్ ఎప్పుడూ ఇవ్వరని, అలాంటి టేస్ట్ మన దగ్గర తక్కువని.) 

> తెలుగు సాహిత్యం మొదలవటమే ఒక అనువాదంతో మొదలైంది. నన్నయ ఆంధ్ర మహా భారతం ఒక క్రియేటివ్‌ ట్రాన్స్‌లేషన్‌. ఆనాటి సంస్కృత కావ్యాల్ని తెలుగులోకి అనువదించిన కవులు మూలంలో వాళ్ళు ఏ అంశాన్ని ఇష్టపడ్డారో, ఏ అంశంతో resonate అయ్యారో దాన్ని ఇంకా పెంచి విస్తరించి రాశారు, నచ్చనివి మొత్తం వదిలేశారు. ఒక్కోచోట కొత్త సన్నివేశాలూ కూడా కలుపుకున్నారు. అఫ్‌కోర్స్‌, ఇప్పుడది సాధ్యం కాదు. ఇప్పుడు అనువాదాల్లో ‘క్రియేటివిటీ’ చూపించడమంటే అది ఘోరమైన పాపం. Author అంటే ultimate authority గా మారిపోయిన ఈ కాలంలో మరీ అంత స్వేచ్ఛ తీసుకోలేం. కానీ మూల రచనకి మరీ కట్టుబానిసల్లా కూడా పని చేయాల్సిన అవసరం లేదనుకుంటాను. ముఖ్యంగా అనువాదకుడు కూడా క్రియేటివ్ రైటరే అయినప్పుడు ఆ స్వేచ్ఛ ఇంకా పెరిగినప్పుడే ఫలితం బావుంటుంది. ఇది చాలా సందర్భాల్లో మూల రచయితలు కూడా ఒప్పుకుంటారు. వాళ్లు ఏ మాత్రం సెన్సిబిల్ ఐనా.

> కానీ చాలామంది మూల రచయితలు కూడా వాళ్ళు రాసిన అక్షరం శిలాక్షరమే అన్న ఫీలింగ్‌లో ఉంటారు. దాన్ని అర్థం చేసుకోగలం కూడా. ఎందుకంటే వాళ్ళు ఏ మాత్రం ప్రతిభ ఉన్న రచయితలైనా సరే ఏ పదం ఊరకే వాడరు. ప్రతి పదం లెక్కేసి బరువు తూచి వేస్తారు. అలాంటప్పుడు రచనలోని ప్రతి పదం మీదా మక్కువ సహజమే. అయితే చనిపోయాక కూడా వాళ్ళ వారసులు, వాళ్ళ అభిమానులూ వాటిని అంతే శిలాక్షరాల్లాగ భావించి అనువాదకుల్ని కట్టడి చేసి వాళ్ల నుంచి లిటరల్ ట్రాన్స్‌లేషన్లు ఎక్స్‌పెక్ట్ చేయటం మంచి చేయదు.  

> ఒక్కోసారి రచయితల వారసుల మూఢ నిర్ణయాలు కూడా అనువాదకుల్ని చాలా ఇబ్బంది పెడతాయి. దీనికి ఒక ఎక్స్‌ట్రీమ్ ఎగ్జాంపుల్ అర్జెంటినా రైటర్ బోర్హెస్ విషయంలో కనిపిస్తుంది. బోర్హెస్ బతికుండగా Norman Thomas di Giovanni అన్నతను బోర్హెస్ ముఖ్యమైన వచన రచనల్ని స్పానిష్ నుంచి ఇంగ్లీషుకి అనువాదం చేశాడు. ఆ అనువాదాల్ని అతను స్వయంగా బోర్హెస్ తో కలిసే చేశాడు. చాలా ఇంగ్లీష్ పాండిత్యం కూడా ఉన్న బోర్హెస్ అనువాదాల విషయంలో నార్మన్ థామస్ డి గియొవానీకి స్వేచ్ఛ ఇచ్చాడు. దేన్నీ ఉన్నదున్నట్టు అనువదించమనలేదు. మూలం నుంచి దూరం జరగాల్సిన సందర్భాల్లో జరగమని ప్రోత్సహించాడు. ఇద్దరూ కలిసి ఒక్కో సందర్భంలో ఇంగ్లీషులో ఎలా ఉంటే బావుంటుందో దానికి తగ్గట్టు మూలాన్ని మోడిఫై చేశారు కూడా. ఐతే బోర్హెస్ చనిపోయాక అతని భార్యకి రాయల్టీలు పంచుకునే విషయంలో అనువాదకుడు నార్మన్ థామస్ డి గియొవానీ తో తేడాలొచ్చాయి. ఆమె ఆండ్రూ హర్లీ అన్న ఇంకొక అనువాదకుడి చేత మొత్తం అనువాదాలన్నీ మళ్ళీ చేయించుకున్నది. అవి నార్మన్ థామస్ డి గియొవన్నీ అనువాదాలతో పోలిస్తే ఇన్ఫీరియర్ ట్రాన్స్‌లేషన్స్ అయినా గానీ ప్రస్తుతం బోర్హెస్ అనువాదాలుగా అవే చెలామణీలో ఉన్నాయి. స్వయంగా బోర్హెస్ ఆమోదం ఉన్న నార్మన్ థామస్ డి గియొవన్నీ అనువాదాలు ఇప్పుడు దొరకటమే లేదు.  

 > ‘‘అనువాదం గురించి 1861–62 సంవత్సరాల్లో చేసిన పెద్ద చర్చలో మాథ్యూ ఆర్నాల్డ్‌, ఫ్రాన్సిస్‌ న్యూమన్‌లు రెండు రకాల అనువాద పద్ధతుల గురించి మాట్లాడుకున్నారు. యథాతథంగా, ఏ పద వైచిత్రినీ వదలకుండా అనువదించటాన్ని న్యూమన్‌ సమర్థించాడు. పాఠకుడికి దారిలో అడ్డుతగిలే, దారిమళ్ళించే ప్రతి వివరాన్నీ తొలగించవచ్చని ఆర్నాల్డ్‌ వాదిస్తాడు. ఆర్నాల్డ్‌ పద్ధతి అనువాదంలో ఒక పొందికైన శైలిని, గాంభీర్యాన్నీ సాధిస్తే, న్యూమన్‌ పద్ధతి ఆశ్చర్యపరిచే వ్యక్తీకరణలకు వీలు కల్పిస్తుంది. కానీ ఈ రెండు పద్ధతులూ కూడా అనువాదకుడి కంటే, అతని సాహిత్య అభిరుచుల కంటే ముఖ్యం కాదు.’’ – ఈ మాటలు ఒక బోర్హెస్‌ వ్యాసం లోవి. ఆ వ్యాసం ‘అరేబియన్‌ నైట్స్‌’కి వచ్చిన అనువాదాల గురించి. ‘అరేబియన్‌ నైట్స్‌’కి రిచర్డ్‌ బర్టన్‌ చేసిన అనువాదాన్ని రిచర్డ్‌ బర్టన్‌ జీవితం, అందులోని అడ్వంచర్లు, ఆయన వ్యక్తిత్వం ఎలా ఇన్‌ఫ్లుయెన్స్‌ చేశాయో చెప్తాడు బోర్హెస్‌. ‘అరేబియన్‌ నైట్స్‌’ అన్నవి జానపద కథలు. దాన్ని ఎలా అనువదించినా అభ్యంతరం చెప్పటానికి Author అంటూ ఒకడు లేడు. ఆధునిక సాహిత్యంలో ‘ఈ రచన నాది’ అని చెప్పుకోవటానికి ఒక రచయిత ఉన్నాడు. ఆ రచయిత ఉన్నంత వరకూ అనువాదకుడి స్వేచ్ఛకి అడ్డే. కానీ ఎప్పుడో 19వ శతాబ్దం రచయితల్ని కూడా ఇప్పుడు అంతే యతాతథంగా అనువదించాలని అనుకోవటం అనవసరం అనుకుంటాను. 

> అనువాదం అన్న సంస్కృత పదానికి అర్థం ‘మరలా ఇంకోసారి వివరించి చెప్పటం’ అని అట. ఇంగ్లీషు నుంచి తెలుగుకి అనువదించేటప్పుడు మూలంలో ఉన్న ప్రతి పదానికి ఇక్కడ అదే అర్థంతో ఉన్న పదం ఏమిటో సరిగ్గా దాన్నే ఎంచుకుని యథాతథానువాదం చేయాలంటే చేయచ్చు. కానీ దానికి ఫలితంగా వచ్చే text అతుకులబొంతలాగ ఉంటుంది. అంటే మూల రచయిత తెలుగువాడై తెలుగులో రాసుంటే అలాంటి ఎగుడుదిగుడు భాష కచ్చితంగా రాయడు. కాబట్టి తెలుగులో అనువదించేటప్పుడు ‘వివరించి చెప్పటం’ తప్పదు, లేదా తెలుగు భాషకి తగ్గట్టు వేరే దారిలో వెళ్ళి చెప్పటం తప్పదు.

(చాలామంది మొదట్లోనే నమ్మే ఆలోచనలకి చుట్టుతిరిగి వచ్చానేమో. ఐనా ఎవడి జర్నీ వాడికి ముఖ్యం కాబట్టి...)