September 26, 2024

Random thoughts on language in fiction:

(తెలుగులో కథలు రాసేవాడిగా కథల్లో భాష మీద నా రీసెంట్ ఆలోచనలు కొన్ని. ఇవి మిగతా వాళ్ళకీ, మిగతా ప్రక్రియలకీ అప్లయ్‌ అవ్వచ్చు కాకపోవచ్చు.)

> నా మొదటి కథ నాకు పాతికేళ్ళ వయసప్పుడు రాసింది. దాన్ని అప్పట్లో బ్లాగులో పోస్ట్ చేస్తే కింద కామెంట్లలో “నాణ్యమైన తెలుగు” అనీ, “తెలుగంటే ఇలా ఉండాలీ” అనీ కొన్ని కామెంట్లు వచ్చాయి. నిజానికి అందులో తెలుగు కంటే సంస్కృతమే ఎక్కువ ఉంది. ఉదాహరణకి కొన్ని వాక్యాలు: “సృష్టి యావత్తూ నా నిశ్వాసాలకు సంకోచిస్తూ, ఉచ్ఛ్వాసాలకు వ్యాకోచిస్తున్న చిత్తభ్రమ”, “నాలో సుడులు తిరుగుతూ చెలరేగుతున్న కాంక్షా సంవర్తానికి ఆమె కేంద్రకమైంది”... ఇలాంటి గరుకు, ఎగుడుదిగుడు, సంకర భాష రాశాను. చివరికి పళ్ళు తోముకోవటానికి కూడా “దంతధావనం” అని రాశాను. ఒకవేళ అదే కథని నేను ఇప్పుడు 2024లో రాస్తే చదివినవాళ్ళు ఎవ్వరూ అందులోని భాషని “నాణ్యమైన తెలుగు” అని పొగడరు. ఎందుకంటే ఇప్పుడు నా ఆలోచనలకి తెలుగు మాటలు చప్పున తట్టకపోతేనో/ తెలుగు మాటలు లేకపోతేనో– వెంటనే ఇంగ్లీషు వైపయినా వెళ్ళిపోతాను గానీ, సంస్కృతం హేంగోవర్‌ ఉన్న తెలుగు జోలికి మాత్రం వెళ్ళను. కారణం సింపుల్– ఇంగ్లీషు బతికున్న భాష, సంస్కృతం చచ్చిపోయిన భాష. ఈ మొదటి కథని చాలా ఏళ్ళ తర్వాత ఎప్పుడో చదివితే ప్రతీ వాక్యానికీ చిరాకేసింది. ఇంక లాభం లేదని కథని మళ్ళీ డ్రాఫ్ట్‌లో పెట్టి మామూలు భాషలోకి “ట్రాన్స్‌‍లేట్” చేయటానికి వీలైనంత ట్రై చేశాను. ఐనా దీన్ని నా కథల పుస్తకంలోకి తీసుకోబుద్ధి కాలేదు. ఇదనే కాదు, నా కొన్ని పాత కథల్లో అక్కడక్కడా ఈ భాష ఉంటుంది. కథల పుస్తకం పబ్లిష్ చేసేటప్పుడు వీలైన చోట్ల రివైజ్ చేసుకుంటూ వచ్చాను. ఐనా ఇంకా కొంత సంస్కృత–-తెలుగు అలాగే ఉండిపోయింది. ఫిక్షన్‌ మీద నా అవగాహన పెరిగేకొద్దీ నా భాష సింప్లిఫై అవుతూ వచ్చింది. ముఖ్యంగా నోటి మాటలకి దగ్గరగా వెళ్తూ వచ్చింది. —అంటే నా నోటి మాటలకి. 

> తూర్పు గోదావరి జిల్లాలో తండ్రులూ తాతల కాలం నుంచి వ్యవసాయం వదిలి ఉద్యోగాలే చేస్తున్న మిడిల్‌ క్లాస్‌ ఫేమిలీలో నేను పుట్టి పెరిగాను. కాబట్టి నా మాటలకి మరీ సినిమాల్లో వినిపించేంత గోదావరి జిల్లాల యాస ఉండదు గానీ కొంత ఉంటుంది. ఆ యాస కూడా అవతల మాట్లాడేది ఎవరూ అన్నదాన్ని బట్టి అప్రయత్నం గానే స్విచ్‌ ఆన్‌/ స్విచ్‌ ఆఫ్‌ అవుతూ ఉంటుంది. అంతగా పరిచయం లేనివాళ్ళ ముందు కుదురుగా మాట్లాడతాను. ఏ చిన్నప్పటి ఫ్రెండ్‌ తోనో ఐతే పరమ యాస వచ్చేస్తుంది. దానికితోడు ఇరవయ్యేళ్ళుగా హైదరాబాద్‌లో ఉండబట్టి కొన్ని తెలంగాణ పదాలు నా భాషలో కలిసిపోయాయి. అలాగే ఇక్కడ ముస్లిం వెండర్స్‌తో మాట్లాడేటప్పుడు అరకొర హైదరాబాదీ ఉర్దూ కూడా బైటపడుతుంది. ఇలా నా జీవితం నడిచిన దారిని బట్టి నాకంటూ ఓ మాట తీరు ఏర్పడింది. ఇదే నా మాండలికం.

> ‘‘మాండలికం’’ అనే పదానికి ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఇరుకైన అర్థం. భాషకి ప్రాదేశిక మండలం మాత్రమే ఉండదు, అంతరంగ మండలం కూడా ఒకటి ఉంటుంది. మొన్నామధ్య ఒక పోస్టులో రాశాను: ‘‘ప్రతి మనిషికీ తన ఆవరణ ఉంటుంది, తను సౌకర్యంగా మసలుకునే స్పేస్ ఉంటుంది. అది వాడి ‘మండలం’. అందులోంచి వచ్చే మాటే మాండలికం. మాండలికం లేని మనిషంటూ ఎవడూ ఉండడు, యాసలేని మాట ఎవడి నోటి నుంచీ రాదు.’’  

> పైగా కథల్లో భాష ఎలా ఉండాలీ అన్న దాన్ని రచయిత మాట్లాడే భాష మాత్రమే అన్నిసార్లూ డిసైడ్‌ చేయదు. ఆ కథ దేని గురించీ అన్నది కూడా డిసైడ్‌ చేస్తుంది. ఫరెగ్జాంపుల్‌ ఈమధ్య రాసిన నా నవలలో కేరెక్టర్లు ఇరవైల వయసులోని వాళ్ళు, వాళ్ళ కథ 2020ల్లో జరుగుతుంది. కథ చెప్పే గొంతు వీలైనంత వరకు ఆ పాత్రలకు నప్పే ఆవరణ లోనే ఉండాలనుకున్నాను. అందుకే ఎక్కువ ఇంగ్లీషు పదాలు వాడాను. ఉద్దేశపూర్వకం గానే ‘దిగులు’ అన్న పదానికి బదులు ‘డల్‌’ అని రాశాను. ‘ప్రవర్తన’ అన్నదానికి ‘బిహేవియర్‌’ అని రాశాను. ఇలాంటివి చాలా చోట్ల చేశాను.

> అందుకే ‘‘తెలుగు భాషని కాపాడాలీ’’ అని ఉద్యమాలు చేసేవాళ్ళు ఆ బాధ్యతని కథలు రాసుకునే వాళ్ళ మీద పెడితే పనవదు. ఫిక్షన్‌కి– ముఖ్యంగా రియలిస్టిక్‌ ఫిక్షన్‌కి– వేరే డిమాండ్లు ఉంటాయి, రియలిస్టిక్ రైటర్లు మొదట వాటికే తలొగ్గుతారు. 

> రియలిస్టిక్‌ రైటర్లకి ఆపుకోలేని దురద ఒకటి ఉంటుంది. తాము చూసిన ప్రపంచాన్నీ, తమ అంతరంగం లోకి డిస్టిల్ ఐన ప్రపంచాన్నీ ఏ మార్పూ లేకుండా ఉన్నది ఉన్నట్టు కథల్లో చూపెట్టాలని. ఎవరూ వాళ్ళని ఇలాగే రాయాలని అడగకపోయినా, ఇలా రాస్తేనే వాళ్ళకు తృప్తి. ఉన్నదున్నట్టు చెప్పలేకపోతే కథలో ఏదో లోటు చేసినట్టూ, ఆ కథ ఇంకా పూర్తి కానట్టూ ఉంటుంది. నేను రియలిస్టిక్‌ రైటర్‌ని మాత్రమే కాదు. కొన్ని కథల్ని అబ్సర్డ్/ డ్రీమీ లాండ్‌ స్కేప్‌లో కూడా చెప్పాను. ఐతే రియలిస్టిక్‌ రైటింగ్‌ దగ్గరకు వచ్చేసరికి ప్రపంచానికి ఎంత దగ్గరగా అద్దం పట్టగలిగానూ అన్నదే నాకు ముఖ్యం. ఒక్కోసారి రీడర్స్‌కి అసభ్యం/ అభ్యంతరకరం/ అశ్లీలం అనిపించే ఎలిమెంట్స్‌ ఉన్నా సరే రియలిస్టిక్ రైటర్లు ఈ విషయంలో పాపం ఏం చేయలేరు. 

> ఈమధ్య రాసిన నవలలో కొన్ని చోట్ల బూతులు ఉండటం గురించి కొంతమంది నాతో మాట్లాడారు. మామూలుగా  సోకాల్డ్‌ సభ్య సమాజాన్ని ఇబ్బంది పెట్టే అంశాలు ఏమైనా కథల్లో ఉంటే మనవాళ్ళు– ‘‘మాంసం తిన్నామని ఎముకలు మెళ్ళో వేసుకుంటామా,’’ అన్న రొడ్డకొట్టుడు సామెత ఒకటి వినిపిస్తారు. కానీ ఇలా ఎముకలు మెళ్లో వేసుకోవటం రియలిస్టిక్‌ ఫిక్షన్‌ విషయంలో తప్పదు మరి. లిటరేచర్‌ దగ్గర కూడా పౌడరు పూసుకుని దొంగ వేషాలు వేయాలంటే కష్టం.

> పుస్తకాల్లో బూతుల విషయంలోనూ, సెక్స్ విషయంలోనూ పెద్ద పెద్ద యుద్ధాలు వెస్ట్రన్‌ లిటరేచర్‌లో ఇరవయ్యో శతాబ్దం మొదట్లో జరిగాయి. ఫ్లోబేర్‌, డి.హెచ్‌. లారెన్స్‌, జేమ్స్‌ జాయ్స్‌, హెమింగ్వే, హెన్రీ మిల్లర్‌ వీళ్ళందరి మీదా ‘‘అశ్లీలం’’ అన్న టాగ్ పడింది, ఒక్కోసారి కోర్టు కేసులు కూడా నడిచాయి, పుస్తకాలు బాన్‌ అయ్యాయి, ఆ తర్వాత పత్రికల్లో పెద్ద పెద్ద చర్చలు జరిగాయి. భాష టెక్చర్‌లో ఎంతో సహజంగా ఇమిడిపోయే బూతుల్ని భాషే ప్రధానాంగంగా నడిచే సాహిత్యం లోకి తేవటానికి అప్పటి రచయితలు చాలా యుద్ధాలే చేశారు. ఒక్కోసారి కోర్టులతోనూ, ఒక్కోసారి సొంత పబ్లిషర్లతోనూ. ఉదాహరణకి, హెమింగ్వే మొదటి నవల ‘సన్‌ ఆల్సో రైజెస్‌’లో ‘‘బిచ్‌’’ అన్న ఒక్క పదాన్ని ఎలౌ చేయటానికి ఆ పుస్తకం పబ్లిషర్‌ చాలా సందేహించాడు. ముందు జాగ్రత్తగా జడ్జీలతో కూడా మాట్లాడాక గానీ ఒప్పుకోలేదు. ఐనా గానీ ఆ ఒక్క పదానికే ఆ పుస్తకం ఒక అమెరికన్‌ రాష్ట్రంలో బాన్‌ అయ్యింది (1927లో). హెమింగ్వే ఎడిటర్‌ ఐన మాక్స్‌వెల్ పెర్కిన్స్‌ అటు పబ్లిషర్ల భయాలకీ, ఇటు హెమింగ్వే మొండిపట్టుకీ మధ్య నలిగిపోయేవాడు. హెమింగ్వే బూతుల విషయంలో నిక్కచ్చిగా ఉండేవాడు. ‘‘నేను దేని గురించి రాస్తున్నానూ అనేదానికంటే, నా భాషని పూర్తిగా వాడుకోగలుగుతున్నానా లేదా అన్నదానికే ఎక్కువ విలువ ఇస్తాను,’’ అంటాడు ఒక ఉత్తరంలో. హెమింగ్వే తర్వాతి నవల ‘టు హేవ్‌ అండ్‌ హేవ్‌ నాట్‌’లో ‘‘fuck’’ అన్న ఇంగ్లీష్ పదాన్ని మధ్యలో అక్షరాలు తీసేసి ‘‘f––k’’ అని ప్రింట్‌ చేశారు. ఇంకో నవల ‘ఫర్‌ హూమ్‌ బెల్‌ టోల్స్‌’లో హెమింగ్వే బూతులు వాడటానికి ఇంకో కిటుకు కనిపెట్టాడు. బూతులకు బదులు ‘obsenity’ (అశ్లీలం), లేదా ‘unprintable’ (అచ్చువేయలేనిది) అన్న పదాల్ని వాడాడు. అంటే బూతుల్ని తను వాడకుండానే రీడర్స్‌ మైండ్‌లో సృష్టించాడన్నమాట. (మన సినిమా దర్శకుడు జంధ్యాల ఒక సినిమాలో కేరెక్టర్‌ బూతులు మాట్లాడినప్పుడల్లా స్క్రీన్‌ మీద ‘‘బూతూ బూతూ’’ అని టైటిల్‌ వేసినట్టు). ఉదాహరణకి ఆ నవల్లో ఒక వాక్యం: ‘‘Where the obscenity have you been?’’ (అంటే ‘‘Where the fuck have you been?’’ అనటానికి బదులుగా అన్న మాట). కొన్ని చోట్ల ‘‘fuck’’ అన్న పదం బదులు ‘‘muck’’ (మురికి) అన్న పదం కూడా వాడాడు. అంటే ‘‘Go fuck yourself’’ బదులు ‘‘Go muck yourself’’ అనీ ఇలాగ. ఉదాహరణకి ఇలాంటి ఇంకో వాక్యం: ‘‘muck my grandfather and muck this whole treacherous muck-faced mucking country and every mucking Spaniard in it’’.

> ఏ భాషలోనైనా ఏమాత్రం మారకుండా కాలాలు దాటి నిలిచే పదాలు బూతులే. భాషలో బూతుల కంటే సజీవమైన, ప్రాచీనమైన భాగం ఇంకోటి ఉండదని నా ఫీలింగ్.  మన తెలుగు బూతులు కూడా చాలా ప్రాచీనం. ఉదాహరణకి 1750 దరిదాపుల్లో వచ్చిన కూచిమంచి  జగ్గకవి ‘చంద్రరేఖావిలాపం’ కావ్యంలో ఆనాటి కావ్య భాష మధ్యలో అప్పటికీ ఇప్పటికీ ఒకేలా చెక్కుచెదరని బూతులు కనిపిస్తాయి.

> బూతుల విషయంలో కాస్త తగ్గమని హెమింగ్వేని ఆయన ఎడిటర్‌ మాక్స్‌వెల్‌ పెర్కిన్స్‌ బతిమాలితే, హెమింగ్వే ఇచ్చిన సమాధానం: ‘‘ఇంకో పదంతో మార్చగలిగే వీలుందా లేదా అని ముందు ఒకసారి ఆలోచించకుండా నేను ఎప్పుడూ ఏ ఒక్క పదమూ వాడలేదు’’. (Never used a word without first considering whether or not it was replaceable.)

> ఇప్పుడు తెలుగు లోనూ కొంతమంది రైటర్లు బూతులు స్వేచ్ఛగా వాడుతున్నారు. కానీ ఆ విషయం మీద ఏమైనా విమర్శలు వస్తే– పల్లెటూరి జీవితం గురించి ఆ భాషలో చెప్పటానికి బూతులు వాడక తప్పదూ అన్న సమర్థన వాళ్ళ దగ్గర ఉంది. నిజానికి ఆ సమర్థన కూడా అవసరం లేదు. ఆల్టిమేట్‌గా– బూతులతో ఏ రైటర్‌కైనా ఉన్న కంఫర్టే అతని బూతుల వాడకాన్ని డిక్టేట్‌ చేస్తుంది. అలాంటి భాష అస్సలు పడని రీడర్‌ ఎవరైనా ఉంటే వాడు ఒకసారి చదివాక ఇంక మళ్ళీ ఆ రైటర్‌ జోలికి ఎలాగూ వెళ్ళడు. నా వరకూ బూతులతో కంఫర్ట్‌ నేను ఎవరితో మాట్లాడుతున్నానూ అన్నదాన్ని బట్టి ఉంటుంది. చిన్నప్పటి ఫ్రెండ్‌ ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు నా ప్రతి రెండో మాటకీ బూతు ఉంటుంది. నా రాతలతో నాకు అంతకుమించిన ఇంటిమసీనే ఉంటుంది. కాబట్టి అక్కడ నాకు దాపరికాల్లేవు. మాంసం తిని ఎముకల్ని బాక్ పాకెట్స్‌లో దాచుకోవటాల్లేవు.  

> మనం వాడే బూతులన్నీ ఆడవాళ్ళనీ, అణచివేతకి గురైన వర్గాలనీ కించపరిచే పదాలతో ఉంటాయని ఒక వాదన. అవును, ఎక్కువ శాతం అవే ఉంటాయి. కానీ ఇందాకే చెప్పినట్టు– రియలిస్టిక్‌ రైటర్‌కి ప్రపంచాన్ని ఉన్నదున్నట్టు చూపించటం ముఖ్యం. అందులో వాల్యూ జడ్జిమెంట్స్‌ జోలికి వాడు పోడు. వాడు ఏ ప్రపంచం గురించి రాస్తున్నాడో, ఏ మనుషుల గురించి రాస్తున్నాడో అదే వాడి భాషని డిసైడ్‌ చేస్తుంది. ‘‘కానీ రచయితలు ఇలా ఉండకూడదూ, వాళ్లు ఉన్న ప్రపంచాన్ని ఉన్నదున్నట్టు చూపించటం కాదూ, ఒక పురోగామి ప్రపంచాన్నీ ఆదర్శ ప్రపంచాన్నీ చూపిస్తూ రాయాలీ’’ అనేవాళ్లు ఉంటారు. అది వాళ్ళ అభిప్రాయం అంతే. ఇలాంటి ఎసెర్షన్లకి, ‘‘ఎందుకలాగ? ఎవరన్నారు అలాగ?’’ లాంటి సింపుల్ క్వశ్చన్లు రివర్స్ లో అడిగితే నికరమైన జవాబు ఏదీ ఉండదు.  

> కొన్ని వర్గాల్ని కించ పరిచే తిట్లు నా చిన్నప్పుడు చుట్టూ అతిమామూలుగా వినపడిపోయేవి. ఇప్పుడు వాటి లక్షణం ఏంటో అర్థమమ్యాక నేను అలాంటి మాటలు వాడను. అయితే కథలో ఒక పాత్రకి ఉన్న అలాంటి ఆటిట్యూడ్‌ ఏదైనా ఉంటే చూపించటానికో, లేదా ఆ అవగాహన లేని పాత్రని చూపించటానికో గారంటీగా అలాంటి మాటలు ఆ పాత్రకి వాడతాను. ఇప్పుడు అమెరికాలో Woke culture ద్వారా మాటలపై నిషేధం ఒకటి మొదలైంది. చనిపోయిన పాత రైటర్ల పుస్తకాల్లోని భాషనీ సవరిస్తున్నారు. క్లాసిక్‌ చిన్నపిల్లల రచయిత Roald Dahl పుస్తకాల్లోంచి ‘‘fat’’, ‘‘ugly’’ అన్న పదాలను కూడా తొలగించారు. ఇదో చెత్త ట్రెండ్‌. భాషని అదుపు చేయటం ఫాసిజానికి మొదటి దశ. అది రైట్ నుంచి వచ్చినా, లెఫ్ట్ నుంచి వచ్చినా, దానికి ఎటువంటి ప్రోగ్రెసివ్ రీజన్స్ చూపించినా… చివరకు వెనక ఉండేవి మాత్రం ఫాసిస్ట్ ఇంటెన్షన్లే. 

> ఈమధ్య రాసిన నవలలో ప్రెజెంట్‌ కంటిన్యవస్‌ టెన్స్‌ వాడిన సందర్భాల్లో ప్రూఫ్ మిస్టెక్స్ సరిగా చూసుకోలేదని ఒకరిద్దరు అనుకున్నారు. కానీ అవి అచ్చు తప్పులు కావు,  అలా కావాలనే చేసాను. తెలుగులో ప్రెజెంట్ కంటిన్యువస్ సెన్స్‌ని ‘‘ఆమె వంట చేస్తోంది/ వర్షం పడుతోంది’’ ఇలా ‘‘స్తోంది/ తోంది’’ అని వాడి రాస్తారు. నాకు ఇలా రాయటం ఎప్పుడూ ఎబ్బెట్టు గానే అనిపించింది. బైట ఎవరూ ఇలా మాట్లాడగా నేనెప్పుడూ వినలేదు. రాసే భాష కూడా అంతా మాట్లాడినట్టుగానే ఉండాలీ అని నేను అనను. కానీ నాకే ఈమధ్య అలా రాయబుద్ధి కావటం లేదు. అలా రాయకపోయినా సందర్భాన్ని బట్టి ప్రెజెంట్‌ కంటిన్యువస్‌ టెన్స్‌ అర్థమైపోతుందని నేను అనుకుంటున్నాను.  

>  సాహిత్యం ఎప్పుడైతే చుట్టూ జీవితంతోనూ, మనుషులతోనూ, వాళ్ల మాటలతోనూ సంబంధం తెగ్గొట్టుకుంటుందో అప్పుడు ఒక సెల్ఫ్ రిఫరెన్షియల్ పరిభాష (జార్గాన్) ఏర్పడుతుంది. అంటే ఆ భాష మళ్ళీ పరస్పరం రచయితలకే సులువుగా అర్థమవుతుంది. లేదంటే చదివీ చదివీ అలవాటు పడిపోయి ఆ భాష నేర్చేసుకున్న పాఠకులకి అర్థమవుతుంది. ఇలాంటి భాష సాంఘిక వ్యాసాలకో, సంపాదకీయ వ్యాసాలకో అవసరం కావచ్చు. కానీ కథలకి అవసరం లేదు. ఐనా సరే, కథల్లో కూడా, నేరేషన్‌లోనే గాక ఇంకా ఘోరంగా పాత్రల నోట పలికించే డైలాగుల్లో కూడా, ‘‘ఆత్మాశ్రయత’’, ‘‘ఆర్ద్రత’’, ‘‘సాంద్రత’’, ‘‘మార్మికత’’, ‘‘పారదర్శకత’’, ‘‘పరాధీనత’’, ‘‘స్థానభ్రంశం’’ లాంటి భాష వాడేస్తారు. ఈ విషయంలో కొత్త రైటర్లు చాలా బెటరు. భాష ఎక్కువ తెలియకో ఏమో మరి ఏం చెప్పాలన్నా తెలిసిన భాష లోనే అందంగా నెట్టుకొస్తున్నారు. కానీ వాళ్ళలో కూడా చాలామంది ఎప్పుడో చచ్చిపోయిన న్యూస్ పేపర్ భాషని ఇంకా మోస్తున్నారు. లేదంటే డెభ్బైలు ఎనభైల పాపులర్‌ నవలల్లోని భాష వాడుతున్నారు. ‘‘హృదయంలో తియ్యని అలజడు’’లు, ‘‘లతలా అల్లుకుపో’’వడాలు, ‘‘ఊహించని పరిణామానికి విస్తుపో’’వడాలు, ‘‘మనసంతా చేదైపో’’వడాలు... ఇదంతా వాడేసి వాడేసి అరిగిపోయిన భాష. అర్థాన్ని మెకానికల్ గా  విసర్జించే చచ్చు భాష. వీటిని  ‘‘Cliches’’ అంటారు. క్లీషేలకి ఎవ్వరూ అతీతులు కాదు. ఎవరైనా సరే అలవాటులో పొరపాట్లాగా ఎప్పుడోకప్పుడు వాడేస్తుంటారు. అది ఫర్లేదు కానీ, అసలు ఫలానాది క్లీషే అని గుర్తే పట్టలేకపోతే మాత్రం కష్టమే.

> ఈమధ్య సంస్కృత పదాలకి ఆల్టర్నేటివ్‌గా ఎప్పటివో పాత అచ్చ తెలుగు పదాల్ని తెచ్చి వాడుతున్నారు. నాటి గ్రామీణులు వాడేవారంటూ అమ్మమ్మల నుంచి తాతయ్యల నుంచి సేకరించిన పదాల్ని తెచ్చి ఇది స్వచ్ఛమైన తెలుగు అంటూ కథల్లో ఇముడుస్తున్నారు, మళ్ళీ అవి అర్థం కావటానికి కింద ఫుట్ నోట్స్ ఇస్తున్నారు. నా వరకూ నాకు సంస్కృత - తెలుగు ఎంత పనికిరానిదో ఇప్పుడెవరూ మాట్లాడని ఈ అచ్చ తెలుగూ అంతే పనికి రానిది. 

> “విశ్వానికే సొంతంగా జ్ఞాపక శక్తి అంటూ ఉంటే తప్ప ప్రతి ముసలాడి, ప్రతి ముసలామె చావుతోనూ ఎన్నో అమూల్యమైన విషయాలు శాశ్వతంగా మరణిస్తాయి” అంటాడు బోర్హెస్ ‘విట్నెస్’ అనే ఓ కథలో. ఓ రెండు పేరాల ఆ కథ మొదలవటం ఒక మురికి గుర్రాల శాలలో చావు ముంగిట ఆఖరి పూట గడుపుతున్న ముసలాడితో మొదలవుతుంది. అతనితోపాటే చనిపోయే విషయాల్ని కొన్నింటిని తల్చుకుంటాడు  బోర్హెస్. అనంత కాలంలో ఎప్పుడో ఒక రోజు ఎవరికీ తెలియకుండానే క్రీస్తును చూసిన ఆఖరి కళ్ళు చచ్చిపోయి ఉంటాయంటాడు. తను చనిపోయాకా తనతో చనిపోయేవేమిటీ అని తల్చుకుంటాడు. కొన్ని ఇమేజెస్ గుర్తు తెచ్చుకుంటాడు. ఒక పెద్ద దేవదారు బీరువాలో ఒక సొరుగు లాగితే కనపడిన సువాసనల సబ్బు గురించి తల్చుకోవటంతో కథ ముగుస్తుంది.  ఒక్కోసారి వందల యేళ్ళ చరిత్ర ఉన్న భాషలు కూడా ఎవరో ఒక్క మనిషితో చచ్చిపోతాయి. లింగ్విస్టులు మృత భాషలు అని ప్రకటించిన ప్రతి భాషా కూడా ప్రపంచం నుంచి ఇలా ఎవరో ఒక్క మనిషి నిష్క్రమణ తోనే మాయమై ఉంటుంది, వాటిని మాట్లాడే ఆఖరి ముసలాయనో, ముసలామో చనిపోవటంతోటే. ఇక వాళ్ళు చనిపోయిన తర్వాత పాత పుస్తకాల నుంచో, లేదా వాళ్ళ ఆఖరి దశలో నేరుగా వాళ్ళ నుంచో ఆ భాషలోని పద సంపదని సేకరించవచ్చు. కానీ దాన్ని మళ్ళీ జనం నాలుకల మీదకి చెలామణీ లోకి తేలేం. జనం నాలుకల మీద వినపడని భాష కథలకి పని రాదు. భాషా చరిత్రల నమోదుకు పనికొస్తుందంతే. భాషా గమనం అనేది వెనక్కు మళ్ళని ప్రవాహం. దాని ప్రవాహ గమనాన్ని నిర్దేశించే శక్తి సాహిత్యానికి లేదు.  

> రియలిస్టిక్ జానర్‌లో కథలు రాసేవాడికి చుట్టూ వినపడే పలుకు చాలా ముఖ్యం. కాబట్టి చుట్టూ సొసైటీ అంతా భాష పరంగా ఎటుపోతుంటే వాడూ అటే పోక తప్పదు. ఎటోపోతున్న సొసైటీని వాడు వెనక్కి లాక్కు రాలేడు. భాషని ఉద్ధరించే పని మీదేసుకుని ఏ మంచి కథా రచయితా తను సృష్టించే ప్రపంచాల్ని అసహజంగా పలికించడు. అలాగని వాడి వల్ల భాషకి ఏ ప్రయోజనమూ ఉండదనీ కాదు. చుట్టూ వినపడే భాషనే కొత్త రకంగా పలికిస్తూ, దాని చేత దానికి అలవాటు లేని పనులు చేయిస్తూ, అందీ అందని ఆలోచనల వైపు దాన్ని ఎక్కుపెడుతూ, శక్తికి మించిన ఎత్తులకి దాన్ని ఎగరవేస్తూ, ఆవేశాలు నింపి దాన్ని వెలిగిస్తూ,  కరిగిస్తూ... వాడు భాషకి మళ్ళీ మళ్ళీ యవ్వనాన్ని తెస్తుంటాడు. కానీ వాడు ఇదంతా భాషని బాగు చేద్దాం అని చేయడు.

September 3, 2024

Random thoughts on translation:


(ఇంగ్లీషు నుంచి తెలుగు లోకి అనువదించేవాడిగా నా కొన్ని రీసెంట్ ఆలోచనలు.)  

> అనువాదాలకి సంబంధించి ఇప్పుడు చెలామణీలో ఉన్న సూత్రాలూ, పద్ధతులూ ఎక్కువ ఇంగ్లీషు భాష ఆధారంగా జరిగిన ట్రాన్స్‌లేషన్ స్టడీస్ నుంచి దిగుమతి అయ్యాయి. అవి చాలాసందర్భాల్లో వేరే భాషలకి అప్లయ్ కావు. ఇంగ్లీషుకి చాలా విషయాల్లో చాలా దూరమైన తెలుగుకి అస్సలు అప్లయ్ కావు.

> రానురానూ ఇంగ్లీషు అనువాదకులు పాటించే నియమాలు అతిగా తయారయ్యాయి. మూల రచయిత ఏదో మూలవిరాట్ ఐనట్టూ, అతని ప్రతి అక్షరం శిలాక్షరమన్నట్టూ ఫీలవుతారు. మూల రచన నుంచి ఏ మాత్రం దూరం జరిగినా మహా పాపం అన్నట్టు మాట్లాడతారు. అందుకే నేను ఏదైనా ఇంగ్లీషేతర రచనకి ఏ యాభై అరవై ఏళ్ళ క్రితమో వచ్చిన పాత ఇంగ్లీష్‌ అనువాదం తీసుకోవాలా, ఈ మధ్యనే వచ్చిన కొత్త ఇంగ్లీష్‌ అనువాదం తీసుకోవాలా అన్న చాయిస్‌ దగ్గర.. ఆల్మోస్ట్ ఎప్పుడూ పాత అనువాదం జోలికే పోతున్నాను.

> ఒక అమెరికన్ అనువాదకుడు రష్యన్ నుంచి చేసిన తన అనువాద పుస్తకాలకి రాసే ముందుమాటల్లో చాలా బడాయి పోతాడు. “రష్యన్ మూలంలోని ఫలానా పదాన్ని పాత అనువాదకులందరూ ఇలా పొరబాటుగా అనువదించారూ, నేను మాత్రం సరిగ్గా అచ్చంగా ఇలా అనువదించానూ, ఈ పదం కొంచెం చిత్రంగా ధ్వనించొచ్చూ, కానీ ఇదే సరైనదీ, ఆ ఫలానా దాస్తోయెవ్‌స్కీ ఉద్దేశమో చెహోవ్ ఉద్దేశమో కచ్చితంగా చెప్పే పదం ఇదే…” ఇలా తెగ విశ్లేషిస్తాడు. కానీ ఏ మంచి రచనకైనా ఉండే linguistic textureని పట్టుకోవడంలో మాత్రం ఘోరంగా ఫెయిలవుతుంటాడు. అతని అనువాదాల్లో గొప్ప గొప్ప రష్యన్‌ రచయితలు కూడా ఏమాత్రం చదివించలేని రచయితలుగా తయారవుతారు.

> అనువాదంలో పదాల్నీ వాక్య నిర్మాణాల్నీ మరో భాషలోకి తేవటం కంటే, రచనకి ఉండే లింగ్విస్టిక్ టెక్చర్‌ని, ఎమోషనల్ టోన్‌ని పట్టుకోవడం ముఖ్యం. ఇక్కడ లింగ్విస్టిక్ టెక్చర్ అంటే రచనలో వాడే భాషలోని ప్రతి అంశం మధ్య పరస్పరం పొందిక ఉండటం. (గొంతును వాడటం తెలీనోడు మంచి సింగర్ కాలేనట్టే, భాషని వాడటం తెలీనోడు మంచి రైటరూ కాలేడు. ఇక్కడ భాష తెలియటం అంటే ఎక్కువ వకాబులరీ తెలిసుండటం అని కాదు. తను వాడే భాషలో ఒక పొందికని సాధించటం. ఆ పొందిక మంచి రైటర్లందరి దగ్గరా ఉంటుంది. అనువాదకుడు ఒరిజినల్ రచనలో ఉన్న ప్రతి పదానికీ తన భాషలో అదే అర్థాన్నిచ్చే పదం ఏముందో దాన్ని మటుకు వెతికి పట్టుకుని రిప్లేస్ చేసే ప్రయత్నం చేస్తే ఆ పొందిక ఉండదు. పదాల్ని అనువదించటం కంటే ఆ పొందికని అనువదించటం ముఖ్యం. మంచి రచయితలందరి దగ్గరా భాషలో ఉండే హార్మనీని అనువదించటం ముఖ్యం. అది సాధించలేకపోతే ఒక భాషలో మంచి రైటర్ని ఇంకో భాషలో చెడ్డ రైటరుగా మార్చేసినట్టే.)

> దాస్తోయెవ్‌స్కీ తన “బ్లడ్ బ్రదర్” లాంటోడు అంటాడు జర్మన్ కాఫ్కా. టాల్‌స్టాయ్‌ కంటే ఎత్తయిన రచయిత లేడంటాడు ఐరిష్ జేమ్స్ జాయ్స్. తుర్గెనెవ్ తనకు ఎంత ముఖ్యమో పదే పదే చెప్తాడు అమెరికన్‌ హెమింగ్వే. వీళ్ళందరూ తమకి ఇంత ముఖ్యమైన రష్యన్ రచయితల్ని చదువుకున్నది రష్యన్‌ భాషలో కాదు, అనువాదాల్లోనే. అలాగే ఆ గొప్ప రష్యన్ రచయితలు మళ్ళీ ఇంగ్లీష్ షేక్‌స్పియర్‌ని, ఫ్రెంచ్ వొల్తేర్‌ని అనువాదాల్లోనే చదుకున్నారు. వీళ్ళు చదివిన అనువాదాలేవీ ఒరిజినల్‌ రచనకి పూర్తిగా కట్టుబడిపోయి, పకడ్బందీగా సాగిన లిటరల్ ట్రాన్స్‌లేషన్స్ అయ్యుండవు. అసలు ఆ కాలం నాటికి అలాంటి కాన్సెప్టే ఏదీ ఇంకా అంత డెవలప్‌ కాలేదు. ఆ అనువాదాల్లో మూల రచయితల శైలి ఎంత ఉందో అనువాదకుల శైలి ఎంత ఉందో విడదీసి చెప్పలేం. హెమింగ్వే తనకి తుర్గెనెవ్ ఇష్టం అని చెప్తున్నాడంటే దాని అర్థం Constance Garnett అనే అనువాదకురాలి ద్వారా తనకి తెల్సిన తుర్గెనెవ్ అంటే ఇష్టం అనే అర్థం. ఎందుకంటే కాన్‌స్టాన్స్ గార్నెట్ మూలాన్ని అంత దగ్గరగా అనుసరించలేదనీ, ఒక్కోసారి స్వేచ్ఛ తీసుకుని దూరం జరిగిందనీ తర్వాత చాలామంది విమర్శించారు. అయినా సరే నేను ఇప్పుడు తుర్గెనెవ్‌, చెహోవ్‌, టాల్‌స్టాయ్‌ రచనలేమన్నా చదవాలంటే ముందు వాటికి కాన్‌స్టాన్స్ గార్నెట్ అనువాదం ఉందా లేదా అని వెతుకుతాను. ఎందుకంటే, ఆమె మూలానికి ఎంత దూరమైనా జరిగుండొచ్చు గాక, హెమింగ్వే లాంటోడ్ని అంతగా ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలిగే ఒక తుర్గెనెవ్‌ని సృష్టించగలిగింది. నాకు కావాల్సింది మూలాన్ని కచ్చితంగా పాటించే అనువాదం కాదు. అసలు తుర్గెనెవ్ కూడా కాదు. నాకు కావాల్సింది హెమింగ్వే కూడా ఎంతో ఇష్టపడిన ఒక మంచి రచన. కాన్‌స్టాన్స్‌ గార్నెట్ మీద ఎన్ని విమర్శలున్నా సరే, చెహోవ్ ఆమె అనువాదంలో ప్రకాశించినంతగా నాకు ఇంకే అనువాదంలోనూ ప్రకాశించ లేదు. ఇప్పుడు చెహోవ్ శుద్ధంగా రష్యన్‌లో ఎలా రాస్తాడో నాకు తెలియాల్సిన పని లేదు. ప్రపంచంలో ఎంతోమంది కథా రచయితల్ని ప్రేరేపించి, అలా ప్రేరేపించటం ద్వారా ఆధునిక షార్ట్‌ స్టోరీకి ఒక రూపాన్నిచ్చిన చెహోవ్ నాకు కావాలి. అతను అది సాధించగలిగింది కాన్‌స్టాన్స్ గార్నెట్ అనువాదాల ద్వారానే. 

> నిజానికి దాస్తోయెవ్‌స్కీ శైలి అంతగా బాగోదని, అతని భాష జర్నలిస్టిక్ జార్గాన్ తో నిండి ఉంటుందనీ అంటారు కొంతమంది రష్యన్లు. బహుశా రష్యన్ దాస్తోయెవ్‌స్కీ ఇంగ్లీషులోకి వచ్చేసరికి ఇంకా మంచి రచయిత లాగా మారుతున్నాడేమో ఎవరికి తెలుసు. 

> అలా అని అనువాదకులకి ఏదో మహత్తరమైన ఇంపార్టెన్స్ ఉందీ అని నేనటం లేదు. అలాగైతే అదే ఒక్క దాస్తోయెవ్‌స్కీ వేర్వేరు అనువాదాల్లో జర్మన్ నీషేనీ, ఫ్రెంచ్ కామూనీ, నార్వేజియన్ కనుట్ హామ్సన్‍నీ అంతే సమానంగా కదిలించ గలిగేవాడు కాదు కదా. అసలైన సారం ఉండేది ఎప్పుడూ రచయిత దగ్గరే. అనువాదకులు దాన్ని చెడగొట్టకుండా ఉంటే చాలు. మంచి అనువాదకులైతే మూల రచయితని అన్నిసార్లూ మరీ దగ్గరగా, గుడ్డిగా, మక్కీకి మక్కి ఫాలో అవరు. మూల రచయిత తమ భాషలో రాయాల్సి వస్తే ఎలా రాసుంటాడో ఊహిస్తారు. అలా రాయటానికి ప్రయత్నిస్తారు. పాత అనువాదకులు అదే చేశారు. ఇప్పటి ఇంగ్లీషు అనువాదకుల్లాగ మూల రచయిత వాడిన ప్రతి పదానికి మరీ మత గ్రంథాల్లోని పదాలంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఈ పిచ్చ మరీ పెరిగిపోయి ఈ మధ్య అనువాద యుద్ధాలు జరుగుతున్నాయి. “ఆ పదాన్ని అలా కాదు ఇలా అనువదించాలీ” అని నలుగురైదుగురు అనువాదకులు కొట్టుకుంటుంటే, విమర్శకులు నాలుగైదు అనువాదాల్లో ఒకే పేరాని పక్కన పక్కన పెట్టి ఏది బావుందో ఏది బాలేదో చెప్తుంటే- చదివేవాళ్ళకి సరదాగానే ఉంటుంది. కానీ ఎందుకూ పనికిరాని గొడవలు.
 
  > ఒక ఇంగ్లీషేతర భాషలోని రచనని నేరుగా అదే భాష నుంచి అనువదించటానికి, వయా ఇంగ్లీష్ అనువదించటానికీ మధ్య పోలిక చూపించి, నేరుగా ఆ భాష నుంచి అనువదించిందే అన్నిసార్లూ సుపీరియర్ అనటానికి లేదు. అనువదిస్తున్నప్పుడు మనం రచయిత సమక్షాన్నీ, అతను సృష్టిస్తున్న భావోద్వేగాల ఆవరణనీ ఇంకో భాషలోకి తెస్తున్నాం. అనువాదకుడి ప్రతిభని బట్టి, అనువాదకుడు మూల రచయిత సమక్షాన్ని ఎంత మేరకు ఆవాహన చేసుకోగలిగాడన్నదాన్ని బట్టి, మధ్యలో ఎన్ని భాషలున్నా, అతను మూల రచయిత ఎసెన్స్‌ని పట్టుకోగలడు. ఉదాహరణకి– ఇద్దరు అనువాదకులు ఉన్నారనుకుందాం. ఒకడు దాస్తోయెవ్‌స్కీ బాధేంటో అర్థం కానివాడూ, దాస్తోయెవ్‌స్కీ అంటే పెద్ద అభిమానం కూడా లేనివాడూ, కేవలం ఉద్యోగార్థం దాస్తోయెవ్‌స్కీని నేరుగా రష్యన్‌ నుంచి అనువాదం చేశాడనుకుందాం; రెండోవాడు దాస్తోయెవ్‌స్కీ యాతనేంటో అర్థం చేసుకున్నవాడూ, దాస్తోయెవ్‌స్కీని అతని ఉత్తరాలతో సహా ఇష్టంగా చదువుకున్నవాడూ ఇంగ్లీష్‌ నుంచి అనువాదం చేశాడనుకుందాం. ఈ సందర్భంలో రెండోవాడు చేసిన అనువాదమే ప్రభావవంతంగా ఉంటుంది, వాడు నేరుగా కాకుండా ఇంగ్లీషు నుంచి చేసినా గానీ.

> (ఇన్సిడెంటల్‌గా ఇక్కడ ఒక విషయం గుర్తొస్తుంది: నాలుగైదేళ్ళ క్రితం దాస్తోయెవ్‌స్కీ గొప్ప రష్యన్‌ నవల ‘బ్రదర్స్‌ కరమజవ్‌’ ఇంగ్లీష్‌ నుంచి తెలుగులోకి రావటం నాకు పెద్ద ఈవెంట్ లాగ అనిపించింది. అనువాదం కూడా బానే ఉంది కాబట్టి, ఇన్నాళ్ళూ ఇంగ్లీష్‌ రాకపోవడం వల్ల ఆ గొప్ప రచనని చదవలేనివాళ్లు ఇప్పుడు ఆ రచనని చదువుతారనీ, దాస్తోయెవ్‌స్కీ రాకతో తెలుగు సాహిత్యానికి కొత్త డైమన్షన్‌ ఏడ్‌ అవుతుందనీ అనుకున్నాను. ‘కరమజవ్‌ సోదరులు’ పుస్తకాలు బాగానే అమ్ముడయ్యాయని విన్నాను గానీ, నేను ఎక్స్‌పెక్ట్‌ చేసిన భూకంపమేం రాలేదు. దాన్ని బట్టి నాకు అర్థమైంది గొప్ప రచయితల్ని చదవటానికి కేవలం భాషే అడ్డం కాదని. భాష కంటే ఆ పర్టిక్యులర్‌ టేస్ట్‌ ఉండటం ముఖ్యం అని. ఊరకే గొప్ప రచయిత అన్న పేరూ రెప్యుటేషనే తప్ప దాస్తోయెవ్‌స్కీకి తెలుగోళ్లు అంత సీన్ ఎప్పుడూ ఇవ్వరని, అలాంటి టేస్ట్ మన దగ్గర తక్కువని.) 

> తెలుగు సాహిత్యం మొదలవటమే ఒక అనువాదంతో మొదలైంది. నన్నయ ఆంధ్ర మహా భారతం ఒక క్రియేటివ్‌ ట్రాన్స్‌లేషన్‌. ఆనాటి సంస్కృత కావ్యాల్ని తెలుగులోకి అనువదించిన కవులు మూలంలో వాళ్ళు ఏ అంశాన్ని ఇష్టపడ్డారో, ఏ అంశంతో resonate అయ్యారో దాన్ని ఇంకా పెంచి విస్తరించి రాశారు, నచ్చనివి మొత్తం వదిలేశారు. ఒక్కోచోట కొత్త సన్నివేశాలూ కూడా కలుపుకున్నారు. అఫ్‌కోర్స్‌, ఇప్పుడది సాధ్యం కాదు. ఇప్పుడు అనువాదాల్లో ‘క్రియేటివిటీ’ చూపించడమంటే అది ఘోరమైన పాపం. Author అంటే ultimate authority గా మారిపోయిన ఈ కాలంలో మరీ అంత స్వేచ్ఛ తీసుకోలేం. కానీ మూల రచనకి మరీ కట్టుబానిసల్లా కూడా పని చేయాల్సిన అవసరం లేదనుకుంటాను. ముఖ్యంగా అనువాదకుడు కూడా క్రియేటివ్ రైటరే అయినప్పుడు ఆ స్వేచ్ఛ ఇంకా పెరిగినప్పుడే ఫలితం బావుంటుంది. ఇది చాలా సందర్భాల్లో మూల రచయితలు కూడా ఒప్పుకుంటారు. వాళ్లు ఏ మాత్రం సెన్సిబిల్ ఐనా.

> కానీ చాలామంది మూల రచయితలు కూడా వాళ్ళు రాసిన అక్షరం శిలాక్షరమే అన్న ఫీలింగ్‌లో ఉంటారు. దాన్ని అర్థం చేసుకోగలం కూడా. ఎందుకంటే వాళ్ళు ఏ మాత్రం ప్రతిభ ఉన్న రచయితలైనా సరే ఏ పదం ఊరకే వాడరు. ప్రతి పదం లెక్కేసి బరువు తూచి వేస్తారు. అలాంటప్పుడు రచనలోని ప్రతి పదం మీదా మక్కువ సహజమే. అయితే చనిపోయాక కూడా వాళ్ళ వారసులు, వాళ్ళ అభిమానులూ వాటిని అంతే శిలాక్షరాల్లాగ భావించి అనువాదకుల్ని కట్టడి చేసి వాళ్ల నుంచి లిటరల్ ట్రాన్స్‌లేషన్లు ఎక్స్‌పెక్ట్ చేయటం మంచి చేయదు.  

> ఒక్కోసారి రచయితల వారసుల మూఢ నిర్ణయాలు కూడా అనువాదకుల్ని చాలా ఇబ్బంది పెడతాయి. దీనికి ఒక ఎక్స్‌ట్రీమ్ ఎగ్జాంపుల్ అర్జెంటినా రైటర్ బోర్హెస్ విషయంలో కనిపిస్తుంది. బోర్హెస్ బతికుండగా Norman Thomas di Giovanni అన్నతను బోర్హెస్ ముఖ్యమైన వచన రచనల్ని స్పానిష్ నుంచి ఇంగ్లీషుకి అనువాదం చేశాడు. ఆ అనువాదాల్ని అతను స్వయంగా బోర్హెస్ తో కలిసే చేశాడు. చాలా ఇంగ్లీష్ పాండిత్యం కూడా ఉన్న బోర్హెస్ అనువాదాల విషయంలో నార్మన్ థామస్ డి గియొవానీకి స్వేచ్ఛ ఇచ్చాడు. దేన్నీ ఉన్నదున్నట్టు అనువదించమనలేదు. మూలం నుంచి దూరం జరగాల్సిన సందర్భాల్లో జరగమని ప్రోత్సహించాడు. ఇద్దరూ కలిసి ఒక్కో సందర్భంలో ఇంగ్లీషులో ఎలా ఉంటే బావుంటుందో దానికి తగ్గట్టు మూలాన్ని మోడిఫై చేశారు కూడా. ఐతే బోర్హెస్ చనిపోయాక అతని భార్యకి రాయల్టీలు పంచుకునే విషయంలో అనువాదకుడు నార్మన్ థామస్ డి గియొవానీ తో తేడాలొచ్చాయి. ఆమె ఆండ్రూ హర్లీ అన్న ఇంకొక అనువాదకుడి చేత మొత్తం అనువాదాలన్నీ మళ్ళీ చేయించుకున్నది. అవి నార్మన్ థామస్ డి గియొవన్నీ అనువాదాలతో పోలిస్తే ఇన్ఫీరియర్ ట్రాన్స్‌లేషన్స్ అయినా గానీ ప్రస్తుతం బోర్హెస్ అనువాదాలుగా అవే చెలామణీలో ఉన్నాయి. స్వయంగా బోర్హెస్ ఆమోదం ఉన్న నార్మన్ థామస్ డి గియొవన్నీ అనువాదాలు ఇప్పుడు దొరకటమే లేదు.  

 > ‘‘అనువాదం గురించి 1861–62 సంవత్సరాల్లో చేసిన పెద్ద చర్చలో మాథ్యూ ఆర్నాల్డ్‌, ఫ్రాన్సిస్‌ న్యూమన్‌లు రెండు రకాల అనువాద పద్ధతుల గురించి మాట్లాడుకున్నారు. యథాతథంగా, ఏ పద వైచిత్రినీ వదలకుండా అనువదించటాన్ని న్యూమన్‌ సమర్థించాడు. పాఠకుడికి దారిలో అడ్డుతగిలే, దారిమళ్ళించే ప్రతి వివరాన్నీ తొలగించవచ్చని ఆర్నాల్డ్‌ వాదిస్తాడు. ఆర్నాల్డ్‌ పద్ధతి అనువాదంలో ఒక పొందికైన శైలిని, గాంభీర్యాన్నీ సాధిస్తే, న్యూమన్‌ పద్ధతి ఆశ్చర్యపరిచే వ్యక్తీకరణలకు వీలు కల్పిస్తుంది. కానీ ఈ రెండు పద్ధతులూ కూడా అనువాదకుడి కంటే, అతని సాహిత్య అభిరుచుల కంటే ముఖ్యం కాదు.’’ – ఈ మాటలు ఒక బోర్హెస్‌ వ్యాసం లోవి. ఆ వ్యాసం ‘అరేబియన్‌ నైట్స్‌’కి వచ్చిన అనువాదాల గురించి. ‘అరేబియన్‌ నైట్స్‌’కి రిచర్డ్‌ బర్టన్‌ చేసిన అనువాదాన్ని రిచర్డ్‌ బర్టన్‌ జీవితం, అందులోని అడ్వంచర్లు, ఆయన వ్యక్తిత్వం ఎలా ఇన్‌ఫ్లుయెన్స్‌ చేశాయో చెప్తాడు బోర్హెస్‌. ‘అరేబియన్‌ నైట్స్‌’ అన్నవి జానపద కథలు. దాన్ని ఎలా అనువదించినా అభ్యంతరం చెప్పటానికి Author అంటూ ఒకడు లేడు. ఆధునిక సాహిత్యంలో ‘ఈ రచన నాది’ అని చెప్పుకోవటానికి ఒక రచయిత ఉన్నాడు. ఆ రచయిత ఉన్నంత వరకూ అనువాదకుడి స్వేచ్ఛకి అడ్డే. కానీ ఎప్పుడో 19వ శతాబ్దం రచయితల్ని కూడా ఇప్పుడు అంతే యతాతథంగా అనువదించాలని అనుకోవటం అనవసరం అనుకుంటాను. 

> అనువాదం అన్న సంస్కృత పదానికి అర్థం ‘మరలా ఇంకోసారి వివరించి చెప్పటం’ అని అట. ఇంగ్లీషు నుంచి తెలుగుకి అనువదించేటప్పుడు మూలంలో ఉన్న ప్రతి పదానికి ఇక్కడ అదే అర్థంతో ఉన్న పదం ఏమిటో సరిగ్గా దాన్నే ఎంచుకుని యథాతథానువాదం చేయాలంటే చేయచ్చు. కానీ దానికి ఫలితంగా వచ్చే text అతుకులబొంతలాగ ఉంటుంది. అంటే మూల రచయిత తెలుగువాడై తెలుగులో రాసుంటే అలాంటి ఎగుడుదిగుడు భాష కచ్చితంగా రాయడు. కాబట్టి తెలుగులో అనువదించేటప్పుడు ‘వివరించి చెప్పటం’ తప్పదు, లేదా తెలుగు భాషకి తగ్గట్టు వేరే దారిలో వెళ్ళి చెప్పటం తప్పదు.

(చాలామంది మొదట్లోనే నమ్మే ఆలోచనలకి చుట్టుతిరిగి వచ్చానేమో. ఐనా ఎవడి జర్నీ వాడికి ముఖ్యం కాబట్టి...)

August 21, 2024

ఇద్దరూ కలవక ముందు


నా మొదటి నవల ‘ఇద్దరూ కలవక ముందు’ పబ్లిష్ అయ్యింది. ఇప్పటిదాకా కథలే రాసినోడ్ని ఇప్పుడో నవల కూడా రాసానన్న ఫీలింగ్ బావుంది. కథల్లో చేయలేనివి కొన్ని నవల కాబట్టి చేయగలిగాను అనిపించింది. నవల రాయటానికి పెద్ద కష్టమైతే పడలేదు. రాయటానికి కూర్చుంటే చాలు రాయాల్సింది ఒళ్ళోకి వచ్చి పడతానే  ఉంది. ఒకప్పటితో పోలిస్తే నాకు రాయటంతో పెరిగిన సౌకర్యమే దీనికి కారణం అనుకుంటాను. అలాగే ‘వెళ్ళిపోవాలి’ అనే సినిమా తీయటం కూడా దీనికి ఇన్‌డైరెక్టుగా ఒక కారణం. కొన్ని నెలల పాటు వీలు చిక్కినప్పుడల్లా నేనే డైరెక్ట్ చేసి, నా కెమెరాతో షూట్ చేసి, నా కంప్యూటర్లో ఎడిట్ చేసి బైట పెట్టిన ఆ సినిమా నాకు లాంగ్‌ టెర్మ్‌లో ఒక ఎఫర్ట్ పెట్టడం ఎలాగో నేర్పింది. అలాగే ధైర్యం చే‍సి పనిలో దూకేశాక సమయానికి వచ్చి ఆదుకునే serendipities మీద నమ్మకాన్ని కలిగించింది. ఈ క్వాలిటీస్ నాకు నవల రాయటంలో ఉపయోగపడ్డాయి. అలాగే సినిమా తీయగలిగినోడ్ని పుస్తకం వేయలేనా అన్న ధీమాతో ఈ పుస్తకాన్ని నేనే డిజైన్ చేసుకుని నేనే ప్రింటర్ కి ఇచ్చి వేసుకున్నాను (ఈ మినిమలిస్ట్ కవర్ డిజైన్ చేసింది చారీ పిఎస్). ఇక మీదట ‘ఒరవడి బుక్స్’ అన్న పేరు మీద నా పుస్తకాలు వస్తాయి. ఈ సందర్భంగా ఇంతకుముందు మూడు పుస్తకాలు వేసి నా పేరుని రీడర్స్ ముందుకి తీసికెళ్ళిన నా ముగ్గురు పబ్లిషర్స్ ‘పల్లవి’ (కాఫ్కా అనువాదం), ‘ఛాయా’ (నా కథలు), ‘బోధి’ (వ్యాసాలు) వాళ్ళకి కూడా థాంక్స్ చెప్పుకోవాలి. ఆ ఎక్స్‌పోజరే ఇప్పుడీ పుస్తకానికి హెల్ప్ ఐతే అవ్వాలి. ఐనా ఎందుకైనా మంచిదని చాలా తక్కువ కాపీలే వేశాను.

ఈ నవల రాసినంత కాలం ఫిక్షన్ రాయటాన్ని ఫుల్ వాల్యూమ్‌లో ఎంజాయ్ చేశాను. ఇలా ఒక పెద్ద నెరేటివ్ ఊహించటంలో, రాయటంలో ఉండే సరదా వేరే అని అర్థమైంది. టైటిల్‌ ఏం చెప్తుందో అదే ఈ నవల్లోని కథ. ఒక అబ్బాయీ అమ్మాయీ కలుసుకోకముందు వాళ్ళ వాళ్ళ జీవితాల్లో జరిగే కథ. వాళ్ళ ప్రపంచాలు ఎలా ఉంటాయో, ఆ ప్రపంచంలో ఏముంటాయో అవే ఈ పుస్తకంలో ఉంటాయి. అంతకుమించి ఎగస్ట్రాలేం చేయలేదు. కథని ఎంత నేరుగా, ఎంత దగ్గరగా చెప్పొచ్చూ అని తప్ప, ఇంకే పెద్ద పెద్ద సైకలాజికల్, సోషిలాజికల్, ఫిలసాఫికల్ ఫోజులూ కొట్టలేదు. పుస్తకం లోంచి బైటకొచ్చి కూడా నిలబడి మాట్లాడగలిగే కోటబుల్ కోట్స్ జోలికీ, అద్దంలో చూసుకుంటూ సెల్ఫీలు తీసుకునే సొగసరి వాక్యాల జోలికీ అస్సలు పోలేదు. భాషని ఎక్కడా బడాయి పోనివ్వలేదు. నాకైతే నేనిలాంటిది రాయగలగటం చాలా నచ్చింది.  This cute little simple beautiful book is also the happiest thing I ever wrote.

August 19, 2024

కాశీభట్ల లేడు...

కాశీభట్ల చనిపోయాడని తెలిసి- నా ఫోనులో కాల్ లాగ్ ఓపెన్ చేసి చూసుకుంటే ఇప్పటికి ఇరవై రోజుల క్రితం జూలై 31న మేం మాట్లాడుకున్నట్టు ఉంది. ఆంధ్రజ్యోతి వివిధలో ‘నవలా శిల్పం’ అన్న ఫీచరు కోసం ఆయన ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు నేను చేసిన కాల్ అది. అయితే అంతకుముందు చేసిన కాల్ ఇప్పట్లోది కాదు. బహుశా ఎప్పుడో నాలుగైదేళ్ళ క్రితంది అయ్యుంటుంది. మామధ్య మాట్లాడుకునే ఫ్రీక్వెన్సీ అంతలా తగ్గిపోయింది. ఒకప్పుడు, అంటే 2010 దరిదాపుల్లో ఒక సమయంలోనైతే, దాదాపు రోజూ కాల్స్ ఉండేవి. ఒక్కో కాల్ గంటలు గంటలు సాగేది. ఎక్కువ ఆయన మాట్లాడుతుంటే నేను విన్నదే ఉండేది. ఆయన అలాంటి కాల్స్ అప్పట్లో ఇంకొంతమందికి చేసేవారని తర్వాత తెలిసింది. నా మటుకు నాకు అవి చాలా అపురూపంగా ఉండేవి, కాబట్టి ఆఫీస్ అవర్స్ లో ఎంత పనిలో ఉన్నా గానీ సీటు నుంచి లేచి ఆఫీసు బైటకి వచ్చి, అప్పటికింకా ఫ్లైవోవర్ లేని ఖాళీ జూబ్లీ హిల్స్ రోడ్ నంబరు 51 లో పైకీ కిందకీ నడుచుకుంటూ మాట్లాడుతూ పోయేవాడ్ని. ఆయన ఎప్పుడైనా ‘వేణుగోపాల్ పదాలు’ అని రాసినవి వినిపించేవాడు (తర్వాత ఆ నోట్ బుక్స్ మొత్తం పోగొట్టుకున్నాడట). కానీ కాశీభట్లతో ఇలా పెర్సనల్‌గా పరిచయం అయి ఫోనులో మాట్లాడటం మొదలు పెట్టకముందే నేను కాశీభట్ల రచనల మాయ నుంచి బైటకొచ్చేశాను. కానీ ఒకప్పుడు నన్ను ఎంతో పట్టి ఊపేసిన ఆ రచయిత పట్ల ఫాసినేషన్ అప్పటికింకా జ్ఞాపకంలో అలాగే మిగిలిపోయి, ఒక్కోసారి రెండు మూడు గంటలు కూడా ఆయన మాటలు అలాగే వింటూ ఉండిపోయేవాడ్ని. 

నేను పదో తరగతిలో ఉండగా సీరియలైజైన ఆయన ‘నేనూ చీకటి’ నవలని ఆంధ్రప్రభ పేజీల్లో చంద్ర బొమ్మలతో చదవటం ఆయనతో నా మొదటి ఎన్కౌంటర్. అప్పటి నుంచి ఒక ఏడెనిమిదేళ్ళు చాలా ఇంటెన్స్‌గా ఆయన  రచనల్ని వెతుక్కున్నాను, దొరికితే ఆబగా చదువుకున్నాను. డిగ్రీలో ఉండగా  స్వాతి మంత్లీకి అనుబంధ నవలగా వచ్చిన ‘దిగంతం’ నవలని మూడు రోజుల్లో మూడు సార్లు బాక్ టు బాక్ చదవటం గుర్తుంది. డిగ్రీ అవగానే 2002లో హైదరాబాద్ వచ్చాక నేను వెతుక్కున్న తొలి తెలుగు పుస్తకాలు ఆయనవే. షాపుల్లో దొరికిన పుస్తకాలన్నీ కొన్నాను. ‘నేనూ చీకటి’ పదో తరగతిలో మొదటిసారి చదివినప్పుడు శైలి కొత్తగా ఆకట్టుకుంటున్నా చాలావరకూ అర్థమయ్యేది కాదు. ఈసారి కాస్త అర్థం చేసుకుంటూ ఆ స్టయిల్‌కి ఆశ్చర్యపోతూ మళ్ళీ మళ్ళీ చదివాను. ఆ నవలకి శేషేంద్ర ముందుమాటలో రాసినట్టు… అది నాకో బౌద్ధిక భూకంపమే! ‘తెరవని తలుపులు’, ‘మంచుపూలు’, ‘తపన’, ‘కాశీభట్ల వేణుగోపాల్ కథలు’... ఇవన్నీ 2002 - 2005 మధ్యనే చదివేశాను. వీటిలో కొన్ని పుస్తకాలు రెండేసి సార్లు చదివుంటాను. అప్పట్లో నాకు తెలిసిన తెలుగు సాహిత్య ప్రపంచంలో – పాతోళ్ళు కానీ కొత్తోళ్ళు గానీ – అలాంటి రైటర్ ఇంకెవరూ కనపడ లేదు. కానీ ఆ స్టయిల్ ఎంత ప్రత్యేకమైనదంటే ఆ పుస్తకాలన్నీ తొందర్లోనే నన్నొక సాచురేషన్ పాయింట్‌కి తీసుకొచ్చేశాయి. కొంతమంది రచయితల శైలి హరికేన్ లాంతరులా నిదానంగా రాత్రంతా వెలిగేదైతే, ఇంకొంతమంది రచయితలది తారాజువ్వలా ఒకేసారి ఉవ్వెత్తున లేచి ఆకాశాన్నంతా వెలుగు రవ్వల గొడుగులతో వెలిగించి క్షణాల్లో మాయమైపోయేది. కాశీభట్లది ఈ రెండో రకం శైలి. ఆ మాయ కొంచెంసేసే ఉంటుంది, కానీ అది ఉన్నప్పుడు ఆ వెలుగు తప్ప ఇంకేదీ ఆనదు. పైగా నా విషయంలో అప్పుడే కాఫ్కా, దాస్తోయెవస్కీ లాంటి బైటి ప్రపంచం సాహిత్యం పరిచయం అవటం కూడా కారణం కావొచ్చు (కాఫ్కా అన్న పేరు నాకు మొదటిసారి పరిచయమైందీ కాశీభట్ల పేజీల్లోనే). 2009 - 2010 మధ్యలో రైటర్ అరుణ పప్పు నాకు ఆయన నంబరిచ్చి పరిచయం చేసే సమయానికే, నాకు రీడర్‌గా ఒకప్పుడు ఆయన మీద ఉన్న ఇంటెన్స్ లవ్ తగ్గిపోయింది (రీడర్‌గా నేను ఆయనకు ఎందుకు దూరమయ్యానన్నది ఆయన ‘కాలం కథలు’ పుస్తకానికి 2013లో రాసిన ఒక రివ్యూలో రాశాను). 

ఆ తర్వాత రెండేళ్ళేమో ఆయనతో ఫోనులో మాట్లాడినప్పుడంతా కాశీభట్ల అనే రచయితతో కంటే కాశీభట్ల అన్న మనిషితోనే ఎక్కువ మాట్లాడాను. తాగుడు తనను పూర్తిగా కంట్రోల్‌ లోకి తీసేసుకున్నదని ఆయన అప్పటికే గుర్తు పట్టారు. దాన్తో పెనుగులాడుతున్నారు. పదే పదే ఓడిపోతున్నారు. నాతో కూడా ఎక్కువ తాగినప్పుడే మాట్లాడేవారు. రెండు మూడు గంటలు మాట్లాడి, ఫోన్ కూడా ఆఫ్ చేయడం మర్చిపోయి పక్కన పడేసి మగతలో జారిపోయే వరకూ, నేను ఇటువైపు ఊ కొడుతూనే ఉండేవాడ్ని. ఆయన్ని అప్పుడే మొదటిసారి 2010 అక్టోబరులో కలిశాను (ఈ కింద ఫొటో అప్పటిదే). ఆయన ఏదో పని మీద హైదరాబాద్ వస్తే కలిశాం. శారీరకంగా అప్పుడు చాలా బలంగానే ఉన్నాడు. తాగుడు ఎఫెక్ట్ శరీరం మీద పడకుండా ఉందటానికి తను చేసే రెగ్యులర్ డంబెల్ ఎక్సర్‌సైజుల గురించి కూడా చెప్పాడు. చేతి మీద చొక్కా మడిచి బైసప్ బలం కూడా చూపించాడని గుర్తుంది. ఆ రోజు రోడ్డు దాటడంలో, మెట్లు ఎక్కడంలో ఆయన స్పీడులో నాకు తెలిసిన ఆ ఆరోగ్యం మళ్ళీ ఒక మూడేళ్ళ తర్వాత నేను కలిసినప్పుడు కూడా లేదు. ఆ తర్వాత ఇంకో రెండేళ్ళకనుకుంటా ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. ఫోన్లో ఆయన మాటల్లో ఆయన ఒంటరితనం తెలిసేది. 2011లో ఒకసారి కర్నూలు వెళ్ళి కలిశాను. అప్పుడు ఆయన చాలా బాడ్ షేప్‌లో ఉన్నాడు. ఆయన ఉన్న ఇల్లూ, ఆవరణ మాత్రం నచ్చాయి. వాళ్ళ అక్కలు చేసిపెట్టిన వంటలు కూడా. ఆ తర్వాత నా వ్యక్తిగత జీవితంలో హడావిడి వల్ల ఆయనతో కాంటాక్ట్ తగ్గిపోయింది. మళ్ళీ 2013 చివర్లో నేను ఎడిటర్‌గా పని చేసిన కినిగె వెబ్ మేగజైన్ కోసం ఆయన ఇంటర్వ్యూ చేశాను. అది చాలా పెద్ద ఇంటర్వ్యూ. అది కూడా కర్నూలు వెళ్ళే చేశాను. చేసేప్పుడంతా ఆడియో రికార్డ్ చేసుకున్నాను. అది వింటూ ఆయన మాటల్లాగే ఉండేలా టైప్ చేసి ఎడిట్ చేశాను. ఎప్పుడో రెండేళ్ళ తర్వాత ‘విషాద ఏకాతం’ పుస్తకం కోసం నన్ను ముందు మాట రాయమంటే (2015-16 అనుకుంటాను), “ఆ ఇంటర్వ్యూ ఉందిగా అందులో మీ గురించి మీరు చెప్పుకున్న దానికంటే నేను కొత్తగా ఏం చెప్పగలను” అని అన్నాను. అది ఆ పుస్తకం చివర్లో వేశారు (ఇంకో పోస్టులో ఆ ఇంటర్వ్యూ పెడతాను). ఆ తర్వాత మా మాటలు తగ్గిపోయాయి. “కభీ తన్హాయియోం మే హమారీ యాద్ ఆయేగీ” అన్న ముబారక్ బేగం గొంతు వినపడే ఆయన ఫోన్ రింగ్ టోన్ నాకు వినపడటం తగ్గిపోయింది. బహుశా నిజంగానే మేరీడ్ లైఫ్ హడావిడిలో నాకు ఒంతరితనాలు లేక ఆయన జ్ఞాపకం తగ్గిపోయిందేమో. 2019లో నా చేదుపూలు, కాఫ్కా మెటమార్ఫసిస్ ట్రాన్స్‌లేషన్ పుస్తకాలుగా వస్తే ఆయనకు పంపాను. కథల గురించి మాట్లాడారు. కొన్ని నవలలు కావాల్సినవి కథల్లాగ రాశేసావ్ అన్నారు. కోవిడ్ తర్వాత మేం మాట్లాడుకున్నది దాదాపు లేదు. మొన్న మళ్ళీ ఇంటర్వ్యూ కోసం కాల్ చేసేంత వరకూ. ఈసారి ఆ పాత రింగ్ టోన్ వినపడ లేదు. ఆయన గొంతు తాగటం మానేసి చాన్నాళ్ళయినా తాగినట్టే డెలిబరేట్‌గా ఆగి ఆగి వచ్చింది. దానికి అనారోగ్యం కారణం అని అర్థమైంది. చాలా ఒంటరిగా అనిపించటం గురించీ, ఇదివరకట్లా నిక్కచ్చిగా అభిప్రాయాలు చెప్తే అది చుట్టుపక్కల సాయం చేసేవాళ్ళనీ పలకరించేవాళ్ళనీ దూరం చేస్తుందన్న మొహమాటం గురించీ మాట్లాడారు. ఆ మొహమాటం రాతలోకీ పాకుతుందన్నారు. ప్రశ్నలు పంపిస్తే టైమ్ తీసుకు రాస్తానని పది రోజుల తర్వాత జవాబులు పంపారు. అందులో కొన్నింటికి జవాబులు సరిగా రానట్టు అనిపిస్తే మళ్ళీ ఫోన్ చేసి ఆ ప్రశ్నలడిగి కాల్ రికార్డ్ చేసుకున్నాను.   

ఆమధ్య ఒక వ్యాసంలో, “కాశీభట్లని చదవటం నా రీడింగ్ లైఫ్‌లో పెద్ద ఈవెంట్” అని రాశాను. తెలుగులో ఆ తర్వాత త్రిపుర తప్ప నాకు మళ్ళీ అలాంటి పెద్ద ఈవెంట్సేం తగల్లేదు. డిగ్రీలో ‘దిగంతం’ చదివినప్పుడు నాకు కలిగినంత ఇంటెన్స్ రీడింగ్ ఎక్స్‌పీరియన్స్ మళ్ళీ ఎప్పుడూ కలగలేదు. అంటే వాక్యం చదివి అర్థమైందని ఊరకే ముందుకు పోబుద్ధి కాక మళ్ళీ అదే వాక్యం దగ్గర రెండు మూడు సార్లు చదువుతూ ఆగిపోయేంత ఇంటెన్సిటీ. తెలుగులో వచన సాహిత్యంలో భాషని అలా వాడినవాళ్లు ఎవరూ లేరు. ఆయన శైలి తెలుగు నుంచి ఇంకే భాషకీ అనువాదంలో తీసుకెళ్ళటానికి వీల్లేనిది. ఆయన నవల ‘అసత్యానికి ఆవల’  ఈ ఏడాదే చదివాను. ఆ నవలలో ఆ మొదటి ఐదారు పుస్తకాల్లో ఉన్నంత ఇంటెన్సిటీ ఎక్కడా లేదు. ఇదివరకట్లా ఎక్కడా వాక్యం ఆగి చదువుకోబుద్ధి కాలేదు. కానీ కాల్పనిక ప్రపంచాల్ని వేళ్ళ కింద నుంచి పుట్టించటంలో ప్రతి రచయితా ఎంజాయ్ చేసే “ఫ్లో” ఒకటుంటుంది… కాలం తెలీకుండా లీనమైపోవటం… ఊహల్లోని ప్రపంచాన్ని వాస్తవమని బలంగా నమ్మి అక్షరాల్తో అంతే బలంగా అంతే నమ్మికతో దానికో రూపునివ్వటం… ఈ ప్రాసెస్‌ని ఆయన ఇంకా అంతే మానసిక యవ్వనంతో, అంతే బలంగా ఎంజాయ్ చేస్తున్నాడని అర్థమవుతుంది ఆ నవల చదివినంత సేపూ. 

తుమ్మితే చిరిగిపోయే బోలు ఆశావాదాన్నీ, కడిగితే చెరిగిపోయే పైపై ఉదాత్తతల్నీ జెండాల్లాగ పట్టుకుని ఊరేగేవాళ్ళు కొంతమంది ఆయన రచనల ఇతివృత్తాల  మీద “చీకటి” అని బ్రాండ్ ఏసేసి తీసిపారేయటం నాకు తెలుసు. దానికి తోడు ఆయన కూడా పదే పదే చీకటీ చీకటీ అని పలవరిస్తూ ఆ లేబెల్‌కి బోలెడు సాయం చేశాడు. కానీ వాక్యానికి ఆయనిచ్చే బరువునీ లోతునీ గమనించి మాట్లాడినవాళ్లు తక్కువ. తెలుగు వచన వ్యాకరణానికి అనుకరణకి అసాధ్యంగా ఆయన చేసిన దోహదాన్ని పసిగట్టినవాళ్లు తక్కువ. ఆయన్ని అనుకరించటానికి ఎవరు ట్రై చేసినా రెండో వాక్యానికి ఆ సంగతి అర్థమైపోతుంది. అది అంత ప్రత్యేకమైన శైలి. మూడు చుక్కలు ఎక్కువ పెట్టాడనో, వచనాన్ని పంక్తుల్లా లైను కింద లైను రాసి పుస్తకాల సైజు పెంచాడనో… వీటిని బట్టి పుస్తకాల వాల్యూని కొలిచే ఎడ్డినా కొలతల గాళ్ళు ఆయన్ని చదవాలంటే ముందుగా అసలు ఆళ్ళ మెదడు పని చేసే డైమెన్షన్‍ని మార్చుకోవాలి. ఆ అవసరం లేదంటే ఇంపోర్ట్ ఫ్రెండ్లీ సరుకులు బొచ్చెడున్నాయ్ చుట్టూతా… ఆటితో సంతృప్తి పడిపోచ్చు. నేను మటుకు నా రీడింగ్‍ లైఫ్‌లో కొన్ని మళ్ళీ తిరిగిరాని, మళ్ళీ రిపీట్ కాని క్షణాల్నిచ్చిన రైటరుగా, తెలుగు వాక్యానికి ఉన్న యునీక్ పాసిబిలిటీస్ అర్థమయ్యేట్టు చేసిన రైటరుగా, చుట్టూ పాతుకుపోయిన పెడాంట్రీల్నీంచీ సాహిత్య చాదస్తాల్నించీ స్వేచ్ఛ చూపించిన రైటర్లలో ఒకరిగా ఆయన్ను గుర్తుంచుకుంటాను. 

2013లో నేను చేసిన ఇంటర్వ్యూ లోంచి కాశీభట్ల మాటలు:—

"సగటు మనిషిని నేను. గొప్ప గొప్ప ఘటనలేవీ నా జీవితంలో ఘటించలేదు. మామూలు సాదా సీదా third rate drunkard నేను. నేను చూసిన జీవితాన్ని కొద్దిగా పాలిష్ చేసి, అందంగా చూపియ్యటానికి ప్రయత్నిస్తాను. ఏదో ఉద్గ్రంథం రాసేయ్యాలని ఫ్యూచర్ ప్లాన్స్ ఏమీ లేవు. మీరు గమనిస్తే, నా పుస్తకాలేవీ వందపేజీలు దాటవు. నేను చెప్పదల్చుకున్నది అంతా కండెన్స్‌డ్ గా ఉంటుంది. I hurry towards the end. చివరి వాక్యం కోసం పరిగెడుతుంటాను. అక్కడికి వచ్చాకా ‘ఆహ్’ అన్న రిలీఫ్."

“మొన్నే ఎవరో ఈ రాతల వల్ల డబ్బులొస్తాయా అనేదో అంటే అన్నాను. ‘డబ్బులేముందండీ! నా జేబులో వెయ్యి రూపాయలు మీ జేబులోకొస్తే మీదవుతుంది. కానీ నా పుస్తకం మీ దగ్గరకు వచ్చినా అది కాశీభట్ల వేణుగోపాల్ పుస్తకమే అవుతుంది’ అని గర్వంగా చెప్పాను. నా రచనలు పరమ చెత్త రచనలే అయి ఉండొచ్చు గాక, వాటిని తీసుకెళ్లి మీ జాబితాల్లో అట్టడుగున పెడితే పెట్టొచ్చు గాక… కానీ అవి నావి. నేను గర్వంగానే ఫీలవుతాను.”


July 19, 2024

శ్రీరమణ గారు

జర్నలిస్ట్ అన్న పేరుమీద నా ఇల్లు గడుస్తుందంటే ఇదంతా మొదలైంది శ్రీరమణ గారి వల్ల. పదిహేనేళ్ల క్రితం ఒక ఏడ్ ఏజెన్సీలో కాపీ రైటర్/ ట్రాన్సులేటర్/ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగం చేసుకుంటూ బ్లాగులో రాతలు రాసుకునేవాడిని. అక్కడ గిలికిన నాలుగు రాతలేవో అప్పట్లో ‘నవ్య’ పత్రిక ఎడిటర్ గా పని చేసే ఆయనకి పంపి ఉద్యోగం కావాలని ఉత్తరం రాశాను. ఆయన వెంటనే పిలిచి ఉద్యోగమిచ్చారు. ఏ అనుభవం లేనివాడికి, డిగ్రీ కూడా ఫెయిలైనవాడికి. ఆ తర్వాత ఒక న్యూస్ ఛానెల్లో మూడేళ్లు ఆయనతో దగ్గరగా కలిసి పని చేశాను. ఆయనకి ఈమెయిల్ నేనే క్రియేట్ చేసి, నేనే మెయింటైన్ చేసేంత దగ్గరగా, టేబిల్ కి ఆయన అటూ నేను ఇటూ కూర్చుని పని చేశాం. బ్లాగులో రాసుకున్న నా తొలి కథలు రెండింటిని ఆయన తను గౌరవ సంపాదకత్వం వహించే పత్రికల్లో మళ్ళీ వేశారు. నా ‘రాజుగారి మేడ కథ’ విషాదాంతం చేయటం ఆయనకి నచ్చలేదు. ఆవైపు మొగ్గు ఎక్కడా ఆయనకి నచ్చేది కాదు. ఆ కథ మొదటి డ్రాఫ్ట్ చూసి ఎలా ముగిస్తే బావుంటుందో సలహాలు కూడా ఇచ్చారు. అప్పట్లోనే ఏదో అకాడమీ కోసం నాకు చలం మోనోగ్రాఫ్ రాసే బాధ్యత అప్పగించారు. దాన్తో చలాన్ని లోలోపలికంటా చదివే అవకాశం వచ్చింది. కానీ మరీ లోతుగా చదివేసరికి చలం నేను నిభాయించలేనంత బరువైన ఇతివృత్తమైపోయాడు. చివరికి ఏం  రాయలేక చేతులెత్తేశాను. ఆ మూడేళ్ళు కలిసి పని చేసింతర్వాత ఒకసారి కినిగెకి ఇంటర్వ్యూ (bit.ly/3O18kNW) చేయటానికి తప్ప మళ్లా పెద్దగా కలిసింది లేదు. ఫోన్లలో అడపాదడపా మాటలుండేవి. బాల వ్యాకరణానికి దువ్వూరి రమణీయ వ్యాఖ్య నాకు ఇచ్చానని ఎప్పుడు మాట్లాడినా గుర్తు చేసేవారు. అది ఇంకా నా దగ్గరే ఉంది. ఆయన రచయితగా నాకు చిన్నప్పుడే తెలుసు. ఆంధ్రప్రభలో ‘శ్రీ ఛానెల్’ అని నా టెన్త్ ఇంటర్ రోజుల్లో వస్తుండేది, బాపు బొమ్మలతో. బాపు రమణల అసోసియేషన్ ని బట్టి ఈ శ్రీరమణ అంటే ముళ్ళపూడి వెంకటరమణే మారుపేరుతో రాస్తున్నాడు అనుకునేవాడిని చాన్నాళ్లు. కొలీగ్ గా ఉన్నప్పుడు ఆయన రాయటం చాలా దగ్గరగా చూశాను. కాలమ్ రాస్తే పేపరు మీద ఒక్క కొట్టివేత లేకుండా మొదటి నుంచి చివరిదాకా చక్కటి దస్తూరితో రాసి దాన్నే ఫైనల్ గా ఇచ్చేసేవాడు. ఇలా ఎన్ని చెప్పినా, ఈ పేరా మొదటి వాక్యంలోని కృతజ్ఞతే ఇక్కడ ముఖ్యంగా వ్యక్తం చేసుకోదలచింది. మనిషిని ఎప్పుడు తలచుకున్నా నవ్వు ముఖంతోనే గుర్తుకు వస్తాడు. ఆయన నిలబడిన చుట్టుపక్కల ఎంత రద్దీ ఉన్నా ఆయన సమక్షం వల్ల అది నెమ్మదించినట్టనిపిస్తుంది. I loved him.

May 16, 2024

రచయితలు - పుట్టిన రోజులు

రైటర్ల బయోగ్రఫీల్నో, వాళ్ళ మీద వికీపీడియా ఎంట్రీల్నో చదివేటప్పుడు వాళ్ళు ఏ వయసులో ఏం చేశారన్నది తెలుసుకోవటమంటే నాకు చాలా ఇంట్రెస్ట్. వాళ్ళు మొదటి కథ ఏ వయసులో రాశారూ, వాళ్ళ వర్జినిటీ ఏ వయసులో పోయిందీ, ఏ వయసులో పిల్లల్ని కన్నారూ… ఇలాంటి వివరాలు. కాఫ్కా 1912లో ఫెలిస్‌ని కలిశాడూ అంటే ఆ ఏడాదికి కాఫ్కా వయసెంత ఉంటుందో నాకు తెలియాలి. కానీ ఇంకోపక్క నేను లెక్కల్లో పరమ వీకు. ఎక్కాలు కూడా తడుంకుంటాను. 1883లో పుట్టిన కాఫ్కాకి 1912లో ఎంత వయసుంటుందో లెక్కగట్టాలంటే, చదవటం కాసేపు ఆపి, 1883 నుంచి 1900కి పదిహేడేళ్ళూ + 1900 నుంచి 1912కి పన్నెండేళ్ళూ, రెండూ కలిపితే అప్పటికి కాఫ్కా వయసు 29 ఏళ్ళూ అని ఇలా లెక్కేసుకోవాలి. అందుకే రౌండ్ ఫిగర్ కాని సంవత్సరాల్లో పుట్టిన రైటర్లతో చిరాకు. దాస్తోయెవస్కీ (1821), ఫ్లాబెర్ట్ (1821), జేమ్స్ జాయ్స్ (1882) నవొయ షిగా (1883), చలం (1894)... ఇలాంటివాళ్లన్నమాట. ఇలా కష్ట పెట్టకుండా పుడతారు కొంతమంది రైటర్లు. ఉదాహరణకి హెమింగ్వే, నబొకొవ్, బోర్హెస్ ముగ్గురూ చక్కగా టైం చూసుకుని ఒకే ఏడాది 1899లో పుట్టారు. వీళ్ళ లైఫ్‌లో ఏ ఈవెంట్ ఏ ఏడాది జరిగినా గానీ అప్పటికి ఒక ఏడాది కలుపుకుంటే అదే వాళ్ళ వయసు. హెమింగ్వే 1926లో మొదటి నవల పబ్లిష్ చేశాడూ అని చదవగానే +1 కలుపుకుని ఇరవై ఏడేళ్ళ వయస్సులో రాశాడన్నమాట అనేసుకోవచ్చు సులువుగా. నబొకొవ్ 1940లో అమెరికా ఓడ ఎక్కాడూ అంటే నలభై ఒక్కేళ్ళకు అని అర్థమైపోతుంది ఈజీగా. ఇలా దేవుడు రైటర్లని పుట్టించేటప్పుడు కాస్త నా లాంటి లెక్కల్రాని రీడర్ల సౌకర్యం గురించి కొంచెం ఆలోచించాలి.

April 27, 2024

@ తెలుగు క్రిటిక్స్

? తెలుగులో క్రిటిక్స్ అంతరించిపోయారూ, క్రిటిసిజం మళ్ళీ మొదలవ్వాలీ అన్న మాటలు విన్నప్పుడల్లా నాకు కొన్ని హారర్ సినిమాలు గుర్తొస్తాయి. అంటే ఫరెగ్జాంపుల్ మమ్మీ లాంటి సినిమాల్లో వందలేళ్లుగా నిద్రపోయిన దెయ్యాన్ని నిద్రలేపాకా ఆ లేపినవాళ్ళే ఎందుకు లేపామా అని బాధపడే పరిస్థితులు వస్తాయి కదా అలాగన్నమాట, అంటే లేపి తన్నించుకోడం లాగన్నమాట. ? ఐనా అసలు ఇప్పుడు విమర్శ లేదూ అంటానికి ఒకప్పుడేమైనా పెద్ద గొప్ప విమర్శ ఉండేడిచిందా? ఓ.. అని నోరేసుకు పడిపోటమే విమర్శ అయితే రాచమల్లు రాంచంద్రారెడ్డి, అక్కిరాజు ఉమాకాన్తం లాంటోళ్ళు విమర్శకులే. ఇంక వల్లంపాటి, చేకూరి లాంటోళ్ళయితే మంచి కథో కవితో వచ్చి ముక్కు మీద గుద్దినా గుర్తుపట్టలేరని నా ఫీలింగ్. మోడ్రన్ తెలుగు లిటరేచర్‌లో విమర్శ ఎప్పుడూ లేదు. ? ప్రపంచంలో ఎక్కడైనా ఒక రైటర్ రాసిందాన్ని ఒక సోషల్ డాక్యుమెంట్ లాగ, సోషల్ రియాలిటీకి ఎవిడెన్స్ లాగ తీసుకుని సోషియాలజిస్టులు వాళ్ళ కామెంటరీలు వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ మటుకు ముందే ఐడియలాజికల్ బాక్‌గ్రౌండ్లతో సోషియాలజిస్టులు చేసిన కామెంటరీలని రైటర్ల ముందుపెట్టి ఫాలో అవమంటారు. గొర్రెల్లాంటి కొంతమంది రైటర్లు వాటిని బాగా ఫాలో అవుతున్నారనో సరిగా ఫాలో అవటం లేదనో తేల్చి చెప్పటమే ఇక్కడ క్రిటిసిజం, అలాంటి సూడో సోషియాలజిస్టులే ఇక్కడ క్రిటిక్స్, వాళ్ళ సెల్ఫ్ రిఫరెన్షియల్ గేమే ఇక్కడ canon. ఇకముందైనా ఇక్కడ వచ్చే ఏ క్రిటిసిజమూ అంతకుమించి ఉండదు. అంతోసిదానికోసం అది లేదే అని ఓ ఫీలైపోనవసరం లేదు. అది చస్తే చచ్చినందుకు సంతోషం కూడా. ? క్రియేటివ్ ఎనర్జీ అనేది బ్యూటిఫుల్ విషయం. రాసినంతమంది రాసినన్ని విధాలుగా రాస్తారు. ఇప్పటిదాకా తెలుగులో ఎంచి చెప్తామని, దారి చూపిస్తామని బయల్దేరిన క్రిటిక్స్ అందరూ పక్కదారి పట్టించినవాళ్ళే. అలాంటోళ్ళు ఉన్నా లేకపోయినా ఏం పెద్ద తేడా పడదు. కతలూ కవితలూ రాసే జనాభా మరీ ఫేస్బుక్ పట్టనంత ఎక్కువైపోయి వాళ్ళంతా ఎలా పడితే అలా రాసేసి పుస్తకాలేసేసుకున్నా సరే… కొంపేం మునగదు మంచి విషయమే. కాలం కంటే పెద్ద క్రిటిక్ ఎవ్వడూ ఎలాగా లేడు. + + + @ క్రిటిక్స్ ఒక నలుగురి గురించి చెప్తాను. DS Mirsky: డి.ఎస్. మిర్‌స్కీ అంటే ఉత్తి మిర్‌స్కీ కాదు; రాకుమారుడు (ప్రిన్స్) మిర్‌స్కీ. కానీ రాచరికం అంతా పేరుకే. ఎప్పుడు ఊహించుకున్నా కుట్లూడిపోయిన కోటుతో, రెండ్రోజుల గడ్డంతో గుర్తొస్తాడు. రష్యన్ విప్లవం తర్వాత కొన్నాళ్ళు విదేశాల్లో తలదాచుకున్నాడు. కానీ రష్యా మీద బెంగతో వెనక్కి పోకుండా ఉండలేకపోయాడు. కానీ పాపం స్టాలిన్‌కి స్వతంత్రమైన ఆలోచన, సున్నితత్వం, తెలివీ అంటే ఏవగింఫు కాబట్టి మిర్‌స్కీని అట్నించటే సైబీరియా లేబర్ క్యాంపులకి పంపాడు (ఇక్కడ పెట్టిన ఫొటో అరెస్ట్‌కి ముందు తీసిన ఆయన మగ్ షాటే). సైబీరియా మంచు లోనే బరువులు మోస్తూ చచ్చిపోయాడు. అయితే ఆయన చావు బతుకుల విషయం కాదు ఇక్కడ చెప్పదల్చుకున్నది. ఆయన ‘హిస్టరీ ఆఫ్ రష్యన్ లిటరేచర్’ అనో పుస్తకం రాశాడు. అది అవటానికి లిటరరీ హిస్టరీనే గానీ, అందులో క్రిటిసిజం కూడా ఉంటుంది. నేను ప్రింట్ తీసి బైండ్ చేయించి మొత్తం ఒకసారి చదివేను. తర్వాత నాకు చదవాలనిపించిన ఒక్కో రైటర్ మీద ఉన్న అధ్యాయాల్ని మటుకు తీసుకుని చాలాసార్లు చదివేను. అంతకుముందు దాకా నాకు సాహిత్యాన్ని ఒక ఆర్గనైజేషన్‌గా– అంటే పరస్పర ఆదాన ప్రదానాల మీద నడిచే వ్యవస్థ లాగ చూట్టం మీద నమ్మకం ఉండేది కాదు. ఈ పుస్తకం చదివాక అభిప్రాయాలు మారాయి. ఒక లిటరరీ ట్రాడిషన్ తనని తనే తీర్చిదిద్దుకుంటూ, తనని తనే మోడిఫై చేసుకుంటూ ఎలా ముందుకి ప్రవహిస్తుందన్నది అదంతా కళ్ళ ముందు జరుగుతున్నట్టే చెప్తాడు. ఒక పుష్కిన్ గానీ, ఒక దాస్తోయెవ్‌స్కీ గానీ, ఒక చెహోవ్ గానీ వాళ్ళంతట వాళ్ళుగా పుట్టలేదు, ఎవరికి వారుగా రాసుకుంటూ పోలేదు. పరస్పరం అందించుకున్నారు, పరస్పరం స్పందించారు. అలా రష్యన్ సాహిత్యం మొత్తం ఎలా తనని తాను మలుచుకుందో ఒక ఐదొందల పేజీల్లో ఎంతో సాంద్రంగా, కానీ ఎంతో ఇష్టంగా చదివించేలాగ చెప్తాడు. అలాగని ఏ రచయితనీ పొలోమని పొగడటం గానీ, ఆకాశానికెత్తటం గానీ ఉండదు. వాళ్ళకి అంత తాహతు ఉన్నా కూడా. పైగా ఇదంతా చదివినా మిర్‌స్కీ ఫేవరెట్ రైటర్ ఎవరంటే మనం చెప్పలేం. అలాగని లిటరరీ హిస్టరీ కాబట్టి పుట్టిన గిట్టిన తేదీల క్రానాలజీతో, ఎండుగా రుచీపచీలేని పాండిత్యంతో కూడా ఉండదు (ఈ కోవలోవే మన పింగళి లక్ష్మీకాంతం, ఆరుద్ర పుస్తకాలు చదవబోతే నీరసం వచ్చింది). ఏదో చార్లెస్ డార్విన్ ‘అరిజన్ ఆఫ్ స్పీషీస్’ గురించి చెప్తున్నంత మెథాడికల్‌గా చెప్పుకుంటూ పోతాడు. కానీ అందులోనే ఎంతో ఎమోషన్ ఉంటుంది. అదెలాగంటే ఆ రీసెర్చ్‌నీ, అందులోని డిస్కవరీల్నీ ఆత్మలోకి ఆకళింపు చేసుకున్న తీరునీ— అంటే ఈ పేజీల్లో గాక, ఈ పేజీల వెనక ఒక్క మనిషి ఖర్చు పెడుతున్న సృజనాత్మక శక్తినీ ఒకసారి తల్చుకుంటే ఒళ్ళు గగుర్పొడిచే ఎమోషన్ కలుగుతుంది నాకైతే. Ueada Makoto: ఈయన ఎలా బతికాడో ఎలా చనిపోయాడో వివరాలేవీ పెద్ద ఎప్పుడూ వెతకలేదు. ఈయన రాసిన విమర్శ చూస్తే మటుకు చాలా డియర్ మనిషి అనిపిస్తాడు. ‘మోడ్రన్ జాపనీస్ రైటర్స్ అండ ద నేచర్ ఆఫ్ లిటరేచర్` అన్న పుస్తకం పూర్తిగా చదివాను. ఇందులో మోడ్రన్ జాపనీస్ రచయితల గురించి (అంటే లేట్ నైన్టీత్ సెంచరీలో పుట్టి ఎర్లీ ట్వంటీయత్ సెంచరీ లోకి రాసినవాళ్ల గురించి) వ్యాసాలుంటాయి. నత్సుమే సొసేకీ, నవోయ షిగా, అకుతగవ ర్యసునొకె, యుకియొ మిషిమా లాంటి జాపనీస్ నవలా రచయితల్ని ఎనిమిది మందిని సెలెక్ట్ చేసి రాశాడు. ఇందాక డి.ఎస్. మిర్‌స్కీ పుస్తకం అంత స్కోప్ లేకపోయినా అదే సోల్ ఉంటుంది ఇందులో కూడా. ఆ ఎనిమిది మంది జాపనీస్ నవలా రచయితలూ వెస్ట్రన్ ట్రాడిషన్ నుంచి ఏమేం తీసుకున్నారో, దాన్ని లోకల్ జాపనీస్ ఈస్థటిక్స్‌కి తగ్గట్టు అన్వయించుకుంటూ ఎలా దిగుమతి చేసుకున్నారో చెప్తుంటే ఒక నవల లాగ చదువుకుంటూ పోవచ్చు. ముఖ్యంగా నవొయ షిగా అన్న రచయితని ఇంకా దగ్గరగా నాకు పరిచయం చేసింది. ఆయన మీద ఉన్న ఒక్క అధ్యాయాన్ని ఇప్పటికి మూడు సార్లు చదివాను. ఎన్నోసార్లు అనువదించాలనిపించింది. బహుశా షిగా గురించి షిగా చెప్పుకుంటే కూడా అంత వివరంగా చెప్పుకోలేడేమో అనిపిస్తుంది. అలాగే మరో పుస్తకం ‘లిటరరీ అండ్ ఆర్ట్ థియరీస్ ఇన్ జపాన్’ అన్నది. పుస్తకం పూర్తిగా చదవలేదు గానీ, ఇందులో నోరినాగ అన్న జాపనీస్ క్రిటిక్ మీద రాసిన చాప్టర్ నాకు చాలా ఇష్టం. అది కూడా అనువదించాలని చాలాసార్లు అనిపించింది. దీని ఆధారంగా ఒక పోస్ట్ కూడా ఇదివరకు పెట్టాను. ఒక క్రిటిక్ మీద ఇంకో క్రిటిక్ వ్యాసం రాస్తే అది ఒక కథల్రాసుకునేవాడ్ని నాకెందుకు అంత నచ్చింది? అందులో నోరినాగ వివరించిన 'Mono no aware’ అన్న ఒక కాన్సెప్ట్ గురించి ఉయెద మకొతొ ఎంతో బాగా చెప్తాడు. చెహోవ్ కథల నుంచి చైలాన్ సినిమాల దాకా వాళ్ళ ఆర్ట్‌లో నాకు కామన్‍గా నచ్చుతున్నదేమిటో నాకే అర్థమయ్యేలా ఆ కాన్సెప్ట్ ఎంతో వివరంగా మాటల్లో పెట్టి చెప్పింది. Joseph Frank: ఈయన్ని క్రిటిక్ అనొచ్చో లేదో నాకు తెలియదు. ఇందాక ఓ లిటరరీ హిస్టారియన్‌ని క్రిటిక్స్ కేటగిరీలో చేర్చినట్టే ఇప్పుడు ఒక బయోగ్రాఫర్నీ చేరుస్తున్నాను మరి. ఈయన దాస్తోయెవస్కీ బయోగ్రాఫర్. దాస్తోయెవస్కీ జీవితం రాయటానికి ఏకంగా ఒక్కోటీ ఐదొందల పేజీలుండే ఐదు వాల్యూములు ఖర్చుపెట్టాడు. నేను ఐదు పుస్తకాలూ చదివేయలేదు. ఆ ఐదు పుస్తకాల్నీ కలిపి ఒక్కటిగా చేసి తెచ్చిన వెయ్యి పేజీల ‘ఎ రైటర్ ఇన్ హిస్ టైమ్’ అన్న పుస్తకం మటుకు చదివాను. ఒక రచయితని అతను బతికిన స్థలకాలాల contextలో ఇంత లోతుగా చూడొచ్చా అనిపించింది. అసలు ఒక రచయిత తన స్థల కాలాల్లో ఇంత విడదీయరానంతగా ఇమిడిపోతాడా అనిపించింది. (ఇది అందరి విషయంలోనూ అప్లయ్ కాకపోవచ్చు, కానీ దాస్తోయెవస్కీ విషయంలో అప్లయ్ అవుతుంది, అది జోసెఫ్ ఫ్రాంక్ గుర్తుపట్టాడు). ఒక్క దాస్తోయెవస్కీ జీవితం అని గాక, ఆయన్ని మలిచిన ప్రతీ ఆ కాలపు వివరం మనకు ఇందులో తెలుస్తుంది. ఒకరకంగా చూస్తే దాస్తోయెవస్కీ అన్న కేరెక్టర్‌ని వెంబడిస్తూ ఆనాటి కాలాన్ని ఎక్స్‌ప్లోర్ చేస్తున్న నవల లాగా సాగుతుంది. ఇలాంటి బయోగ్రాఫర్‌ని దొరకపుచ్చుకోవటంలో మటుకు దాస్తోయెవస్కీ చాలా లక్కీ, టాల్‌స్టాయి కంటే కూడా. James Wood: ఇక్కడ చెప్పిన నలుగురిలో ఇంకా బతికున్నది ఈయనొక్కడే. బేసిగ్గా పెద్ద పెద్ద మేగజైన్స్‌కి బుక్ రివ్యూలు రాస్తాడు. కొంత nasty caustic wit, కొంత ‘ప్లేయింగ్ టు ద గాలరీ’ కనిపిస్తాయి. నిజానికి నాకు నచ్చిన రచయితలెవరూ ఈయనకి పెద్ద నచ్చరు (హెమింగ్వే, నబొకొవ్). ఈయనకు నచ్చిన రచయిలెవరూ నాకు పెద్ద నచ్చలేదు. ఉదాహరణకి, సాల్ బెల్లోని ఎప్పుడు ప్రయత్నించినా ఇష్టంగా చదవలేకపోయాను. కానీ ఈయన సాల్ బెల్లో గురించి రాసిన వ్యాసాలు చదువుతుంటే నాకు కలిగే ‘an idea of Saul Bellow’... నా ఊహల్లో నేను కట్టుకున్న సాల్ బెల్లో… ఆ ఊహ మటుకు నాకు ఎంతో ఇష్టం, ఎంతో ముఖ్యం. ఎందుకు ముఖ్యమంటే మనకి ఒక్కోసారి నేరుగా రచయితలే ఉదాహరణగా నిలబడక్కర్లేదు. అలాంటి ఉదాహరణలు సాధ్యమేనన్న పాజిబిలిటీ వేరేవాళ్ళ మాటల్లో చూచాయగా రూపుకట్టినా చాలు, అది ఎంతో ఇన్‌స్పిరేషన్ ఇస్తుంది. మంచి క్రిటిక్స్ చుట్టూ రాస్తున్న రచయితల గురించి రాయటమే కాదు, ఆ రాయటంలో ఇంకా పుట్టని రచయితల్ని కూడా ఊహించి, ఆ ఊహల్ని మన కళ్ళ ముందు నిలపగలరు. * * * ఈ పైన చెప్పినోళ్ళు గొప్పోళ్ళనో, వాళ్ళని చదవమనో కాదు ఇదంతా. క్రిటిసిజం అంటే ఏమని నా దృష్టిలో పెట్టుకుని దీనికి ముందు పోస్ట్ రాసానా అని తల్చుకుంటే ఈ నలుగురి పేర్లూ వెంటనే గుర్తొచ్చాయి, వాళ్ళు నాకేం ఇచ్చారో చెప్పాలనుకున్నా అంతే. నిజానికి నేనెప్పుడూ “విమర్శ” అని పని గట్టుకుని చదవలేదు. అందుకే ఈ నలుగురిలో కూడా ఒకరు లిటరరీ హిస్టారియన్, ఒకరు బయోగ్రాఫర్ ఉన్నారు. నా వరకూ నాకు విమర్శ చేయాల్సిన పని (సాహిత్య సారాంశాన్ని విడమర్చి చెప్పటమన్నది) చాలాసార్లు రైటర్లే స్వయంగా చేశారు. అలాగని రైటర్లు పని గట్టుకుని విమర్శ వ్యాసాలు కూడా రాయక్కర్లేదు. వాళ్ళు వాళ్ళ ఇంటర్వ్యూల్లోనో, ఉత్తరాల్లోనో, డైరీల్లోనో, ఆత్మకథల్లోనో ఒకట్రెండు వాక్యాల్లో చేసిన అబ్జర్వేషన్స్ ఎంతో వాల్యుబుల్‌గా ఉంటాయి. ఉదాహరణకి మూడ్రోజుల క్రితం నేనొక హెమింగ్వే ఉత్తరం నుంచి కొన్ని మాటల్ని షేర్ చేశాను. అక్కడ ఆయన “ఎక్కడా పొరపాట్న కూడా నీ నవల్లోకి పెర్ఫెక్ట్ కేరెక్టర్లని రానివ్వకు,” అని తోటి రైటర్‌కి ఉత్తరం రాస్తూ జేమ్స్ జాయ్స్ ‘యులీసెస్‌’ నవలని పాడు కాకుండా కాపాడింది లెపోల్డ్ బ్లూమ్ అన్న కేరెక్టరే ననీ, స్టీఫెన్ డెడాలస్ అన్న మెయిన్ కేరెక్టర్ కాదనీ అంటాడు. స్టీఫెన్ డెడాలస్ అనే కేరెక్టర్ ఆల్మోస్ట్ జేమ్స్ జాయ్స్ తన మోడల్‌ లోనే సృష్టించుకున్న పెర్ఫెక్ట్ కేరెక్టరు. బ్లూమ్ మాత్రం జాయ్స్ ఎక్కడ్నుంచో ఏరేరి తెచ్చి కల్పించిన very human, very flawed కేరెక్టరు. ఇదే అబ్జర్వేషన్ మీద క్రిటిక్ ఒక వ్యాసం రాయొచ్చు. కానీ హెమింగ్వే లాంటోడు ఒక ఉత్తరంలో పాసింగ్ రిమార్క్ లాగా రాసిన వాక్యం ఇచ్చే హిట్ వేరే ఉంటది. నబొకొవ్ క్రిటిసిజం అని పనిగట్టుకుని పెద్దగా ఏం రాయలేదు. కానీ ఆయన ఉద్యోగార్థం ఒక యూనివర్సిటీలో లిటరేచర్ క్లాసులు చెప్పటం కోసం రాసుకున్న నోట్స్ అన్నీ కలిపి ఆయన చనిపోయిన తర్వాత రెండు పుస్తకాలుగా వేశారు. అలాగే గొగోల్ మీద బయోగ్రఫీలాగ రాసిన పుస్తకం కూడా ఒకటుంది. గొప్పగా ఉంటాయవి. తెలుగులో కూడా విమర్శకులు అన్న పేరు తగిలించుకున్నవాళ్ళు రాసినవి గాక ఇలా రచయితలు రాసినవే ఏ కాస్తో పనికొచ్చేవి ఉన్నాయి. శ్రీశ్రీ వ్యాసాలు, కృష్ణశాస్త్రి ‘కవి పరంపర’లో వ్యాసాలు, శేషేంద్ర ‘రక్తరేఖ’లో అబ్జర్వేషన్లు నాకు వెంటనే గుర్తొస్తున్నాయి. కానీ నేను మాట్లాడేది మోడ్రన్ తెలుగు లిటరేచర్ గురించి. వ్యాసుడు, కాళిదాసు, తిక్కన, పెద్దనల గురించో, బెంగాలీ రవీంద్రుడి గురించో కాదు. పైన నేను చెప్పిన నలుగురి లాంటి వాళ్ళ పుస్తకాలు చదివితే లిటరేచర్ మీద ప్రేమ పుడుతుంది. వాళ్ళు ఒక ఆర్ట్ వర్క్‌ గురించి మాట్లాడితే నేరుగా లైఫ్‍ గురించే మాట్లాడుతున్నట్టు ఉంటుంది. జ్ఞాపకం, కలలు, అన్‌కాన్షస్… ఫలానా ఆర్ట్ వర్క్ లో పైకి కనపడని లోతుల్లోకి సాయంగా చేయి పట్టుకుని తీసుకెళ్ళినట్టు ఉంటుంది. అలాంటోళ్ళెవరైనా ఆధునిక తెలుగు సాహిత్యంలో క్రిటిక్ అన్న పేరు మీద చెలామణీ అయ్యారా? థియరీ పుస్తకాల్లోంచి సగం సగం జీర్ణం చేసుకున్న సోషియలాజికల్ డిస్కోర్సులు తెచ్చి ఒర్రుడే తప్ప ఇంకేమైనా ఉండిందా? పునాదీ ఉపరితలం! లేదంటే చిన్నయ్య నన్నయ్య! కాదంటే పోస్ట్‌లూ లిక్విడ్లూ! ఉదాహరణకి What is the nature of Telugu prose? చలం మొదలుకొని రావిశాస్త్రి మీదుగా అది ఎలా మారుతూ ఇప్పుడు ఎక్కడికి వచ్చి ఆగింది? ఇది ఇప్పటికిప్పుడు రాస్తుంటే తట్టిన ఒక ఉదాహరణ అంతే. ఇలాంటి బేసిక్ విషయాల మీద ఎవరూ ఒక పేరాగ్రాఫ్ ఖర్చు పెట్టినట్టు ఎక్కడా కనపడదు. చిల్లర సోషలాజికల్ డిస్కోర్సు మాత్రం ఎక్కడ పడితే అక్కడ కుప్పలుతెప్పలుగా క్రిటిసిజం అంటే అదొక్కటే అన్నట్టు పొంగి పొర్లుతూ వచ్చింది. పోనీ అదైనా సోషల్ డైనమిక్స్‌ గురించి సైద్ధాంతిక అవగాహనతో మాట్లాడిందే తప్ప నేరుగా చుట్టూ లైఫ్‌ గురించి చుట్టుపక్కల మనుషుల గురించి నిశితంగా మాట్లాడుతున్నట్టు ఎప్పుడూ మాట్లాడలేదు. ఇప్పుడది పాపం చచ్చిపోయిందీ అంటున్నారు. చచ్చిపోయినట్టు నాకైతే అనిపించటం లేదు. ఇంకా ఎక్కడ చూసినా అదే కనపడతా ఉంది. ఒకవేళ అది చచ్చినా పెద్ద తేడా పడేదేం లేదూ అన్నది నా ఫీలింగ్. As I said before, creating something is in itself a beautiful thing. ఆ వాతావరణం ఒకటి ఉంటే చాలు. ఒకరి నుంచి ఒకరు ఇన్‌స్పయిర్ అవుతారు. అందులోంచి నేర్చుకుంటారు. కొత్తవి పుడతాయి.

February 15, 2024

నా తొలి పారితోషికం | ఇసాక్ బాబెల్

కథ అనువాదం : మెహెర్

వేసవి కాలంలో టిఫ్లిస్‌లో ఉండటం, అదీ ఇరవయ్యేళ్ళ వయస్సులో ఉండటం, పైగా ప్రేమించేవాళ్ళు ఎవ్వరూ లేకపోవటం దురదృష్టం. నాది అదే దురదృష్టం. అప్పుడు కాకస్ మిలిటరీ జిల్లాలో ఒక ప్రింటింగ్ ప్రెస్‌లో ప్రూఫ్ రీడర్‌గా పని చేసేవాడ్ని. అటక మీదుండే నా గది కిటికీల కింద కురా నది పారేది. సూర్యుడు పొద్దున్నే కొండల వెనక నుంచి లేస్తూ దాని మురికి సుడుల్ని వెలిగించేవాడు. నాకు ఆ అటక మీద గదిని అద్దెకిచ్చింది కొత్తగా పెళ్ళయిన ఒక జార్జియన్ జంట. మొగుడికి తూర్పు మార్కెట్టులో మాంసం కొట్టుండేది. నా గది గోడల అవతల ఆ మొగుడూ పెళ్ళాలు కామంతో పిచ్చెక్కి ఒక చిన్న గాజు కూజాలో ఇరుక్కున్న రెండు పెద్ద చేపల్లాగ మెలికలుపడి పొర్లేవారు. ఈ సోయి లేని చేపల తోకలు నా గది గోడ కేసి కొట్టుకునేవి. గది మొత్తం కదిలిపోయేది, ఎండకి మాడిన ఆ గదిని కూసాల్తో సహా పెరికేసి అనంతంలోకి విసిరేసేవారు. తీరని కక్ష లాంటి కామంతో వాళ్ళ పళ్ళు బిగపట్టుకుపోయేవి. పొద్దున్నే పెళ్ళాం రొట్టెలు కొంటానికి కిందకు వెళ్ళేది. అప్పుడు ఆమెకున్న నీరసానికి మెట్ల మీంచి పడిపోకుండా రెయిలింగ్ పట్టుకు దిగేది. కింది మెట్టు కోసం గాల్లో తడుముకునే చిన్ని పాదాలతో ఆమె కిందకి దిగుతుంటే, ఆమె మొహం మీద నవ్వు జబ్బు పడి లేచినవాళ్ళ మొహం మీది నవ్వులా ఉండేది. తన చిన్న బాయిల మీద చేయి వేసి దార్లో ఎదురైనవాళ్ళ ముందు మర్యాదగా వొంగేది— అస్సిరియా నుంచొచ్చిన ముసలాడి ముందు, కిరోసిన్ అమ్ముతూ తిరిగేవాడి ముందు, ముడతలతో ఎండిన మొహాల్తో మార్కెట్లో ఊలు ఉండలమ్మే గయ్యాళి ముసలమ్మల ముందు. రాత్రుళ్ళు నా పొరుగింట్లోంచి వాళ్ళ రొప్పుళ్ళూ మూలుగులూ ఆగిన తర్వాత మొదలయ్యే నిశ్శబ్దం ఫిరంగి గుండు పడే ముందు వచ్చే కూత కంటే పదునుగా ఉండేది.

ఇరవై ఏళ్ళ వయస్సులో, ట్రిఫ్లిస్‌లో ఉంటూ, ఇలా రాత్రిపూట పక్క గదుల్లోంచి హోరెత్తే నిశ్శబ్దాలని వినాల్సి రావటం దురదృష్టం. దాన్నించి తప్పించుకుందామని గదిలోంచి బైటకొచ్చి కురా నది ఒడ్డు దాకా పోయేవాడ్ని. అక్కడ ఆవిర్లు కక్కే ట్రిఫ్లిస్ వేసవి ఉక్కపోత ఎదురయ్యేది. అది వొంటి చుట్టూ కమ్మేసి సత్తువంతా లాగేసేది. ఎండిన గొంతుతో ఆ గూని వీధుల్లో తిరిగేవాడ్ని. ఆ ఉక్కపోత నన్ను  మళ్ళీ గది వైపే తరిమేసేది. ప్రేమ కోసం చూట్టం తప్ప అక్కడ చేయటానికేం లేదు. అది దొరికింది కూడా. మంచికో చెడుకో నేను ఎంచుకున్నది ఒక వేశ్యని. ఆమె పేరు వెరా. ప్రతి రాత్రీ గోలోవిన్ వీధిలో ఆమె వెనకాలే తిరిగేవాడ్ని, ఆమెని పలకరించే ధైర్యం చేయలేక. మరి ఆమెకివ్వటానికి నా దగ్గర డబ్బులూ లేవు, మాటలూ లేవు— ఆ అరిగిపోయిన మోత లాంటి ప్రేమ మాటలు. చిన్న వయసు నుంచీ నాకున్న శక్తులన్నీ నవలలు, నాటకాలు, కథలు ఊహించటానికే ఖర్చు పెట్టాను, వేలకొద్దీ ఊహించాను. అవన్నీ బండరాయి మీద కప్పల్లా నా గుండెకి అతుక్కునే ఉండిపోయాయి. నాకున్న గీర వల్ల వాటిని అప్పుడే రాయదల్చుకోలేదు. టాల్‌స్టాయ్ లాగా రాయలేనప్పుడు ఎందుకు రాయటం. కథ రాశానంటే అది కాలాలు దాటి అలా నిలిచిపోవాలి. లోతైన ఆలోచనలు, పట్టి ఊపేసే ఉద్వేగాల మీద ఎంత శ్రమైనా ఎప్పుడు పడొచ్చంటే వాటికి మంచి తొడుగులు తొడిగి బైటకు పంపగలిగినప్పుడు. కానీ అలాంటి తొడుగులు తయారు చేయటం ఎలాగ?

ఒక ఐడియాకి వశం అయిపోయి, దాని పాము లాంటి చూపుకి లొంగిన మనిషి అరిగిపోయిన ప్రేమ మాటలు వల్లించలేడు. అలాంటి మనిషి బాధొస్తే ఏడవటానికి ఆలోచిస్తాడు. సంతోషంతో నవ్వేంత తెలివి ఉండదు. కలల్లో బతికేవాడ్ని కావటం వల్ల నాకు ఆనందమనే వింత కళలో నేర్పు అబ్బలేదు. కాబట్టి నా ముష్టి సంపాదన లోంచి పది రూబుళ్లు తీసి వెరాకి ఇవ్వక తప్పదు.

ఇలా ఒక నిర్ణయానికి వచ్చాకా, నేను సాయంత్రాలు వెళ్లి సింపతీ రెస్టారెంటు గుమ్మం దగ్గర వెయిట్ చేయటం మొదలుపెట్టాను. జార్జియన్ రాజవంశీకులు నీలి రంగు కుర్తాల్లో, మెత్తటి లెదర్ బూట్లలో దర్జాగా నా పక్క నుంచి నడిచిపోతున్నారు. వాళ్ళు వెండి టూత్ పిక్‌లతో పళ్లు కుట్టుకుంటూ ఎర్రటి మేకప్పేసుకున్న అమ్మాయిల్ని— పెద్ద పాదాలూ, సన్నటి పిర్రలూ ఉన్న జార్జియన్ అమ్మాయిల్ని ఓర కంట చూస్తున్నారు. మునిమాపు ఆకాశంలో ఇంకా కొంచెం నీలం ఉంది. వీధి పొడవునా తుమ్మ పూలు సన్నగా వణికే గొంతుతో పాడుతున్నాయి. తెల్ల కోట్లు వేసుకున్న గుమాస్తాల గుంపు వీధమ్మటా నడిచి వెళ్తోంది. కబ్జెక్ కొండల మీంచి వెచ్చటి గాలులు వీస్తున్నాయి.

వెరా చీకటి పడిన తర్వాత వచ్చింది. పొడవుగా, తెల్లటి ముఖంతో, ఆమె ఆ కోతి గుంపు ముందు తేలుతున్నట్టు వచ్చింది, చేపల బోటు ముందుండే వర్జిన్ మేరీ విగ్రహం లాగ. ఆమె సింపతీ రెస్టారెంట్ గుమ్మం దాకా రాగానే నేను ఆమె వెనకాల నడిచాను.

“ఎక్కడికి వెళ్ళేది?”

ఆమె వెడల్పయిన గులాబీ రంగు వీపు నా ముందు కదులుతోంది. ఇప్పుడు వెనక్కి తిరిగింది:

“ఏమన్నావ్?” ముఖం చిట్లించింది, కానీ కళ్ళు నవ్వుతున్నాయి. 

“ఎక్కడికి వెళ్తున్నావ్ అన్నాను.”

నా గొంతులో మాటలు ఎండు పుల్లల్లాగా విరిగాయి. ఆమె నడక వేగం మార్చి నాతో కలిసి నడిచింది. 

“పది రూబుళ్ళు… ఇవ్వగలవా?”

నేను వెంటనే ఒప్పుకోవటం చూసి ఆమెకు డౌటొచ్చింది. 

“అసలు నీ దగ్గర పది రూబుళ్ళు ఉన్నాయా?”

మేం ఒక గుమ్మం లోకి వెళ్ళి నిలబడ్డాం. ఆమెకి నా పర్స్ ఇచ్చాను. ఆమె తన మబ్బు రంగు కళ్ళు చిట్లించి, పెదాలు కదుపుతూ అందులో మొత్తం ఇరవై ఒక్క రూబుళ్ళు లెక్కపెట్టింది. బంగారు కాసుల్నీ వెండి కాసుల్నీ వేటికవి వేరు చేసింది. 

పర్సు నాకు తిరిగి ఇచ్చేస్తూ, “నాకు పది ఇవ్వు. ఇంకో ఐదు ఖర్చు పెట్టుకుందాం. మిగతాది నీకు నెల గడవటానికి సరిపోతుంది. నీకు మళ్ళీ జీతం ఎప్పుడొస్తుంది?”

నాలుగు రోజుల్లో వస్తుందన్నాను. తిరిగి వీధిలోకి వచ్చాం. వెరా నా చేయి పట్టుకుని తన భుజం నాకేసి ఆనించింది. మేం చల్లబడుతున్న వీధిలోకి నడిచాం. పేవ్మెంట్ అంతా కుళ్ళిన కూరగాయలు కార్పెట్‌ లాగ పరిచి ఉన్నాయి.

“బోర్‌జోమ్ వెళ్తే ఎంత బావుంటుందో, అక్కడ ఇంత ఉక్కపోత ఉండదు,” అందామె. 

వెరా జుట్టు ఒక రిబ్బనుతో ముడేసింది. వీధి లైట్ల వెలుగు ఆ రిబ్బను మీద పడి ఒంపు తిరుగుతూంది.

“సరే అయితే బోర్‌జోమ్ చెక్కేద్దాం,” అన్నాను. 

‘చెక్కేద్దాం’... అదీ నేనన్న మాట. ఎందుకన్నానో తెలీదు. 

“నా దగ్గర అంత డబ్బు లేదు,” అంది వెరా ఆవలిస్తూ, నన్ను పూర్తిగా మర్చిపోయి. నన్ను పూర్తిగా మర్చిపోవటానికి కారణం ఆమెకి ఇంక ఈ రోజు గిట్టుబాటైపోవటమే, నా దగ్గర్నించి తేలికగా డబ్బు దొరికేసింది. నేను ఆమెని పోలీసులకి పట్టించేవాడ్ని కాదనీ, రాత్రి ఆమె దగ్గర్నుంచి డబ్బులూ చెవి కమ్మలూ దొబ్బుకుపోయేవాడ్ని కాదనీ ఆమెకి తెలుసు.

మేం సెయింట్ డేవిడ్ మౌంట్ కిందకి వచ్చాం. అక్కడ ఒక బార్‌లో నేను కెబాబ్స్ ఆర్డర్ ఇచ్చాను. అవి టేబిల్‍ దాకా రాకముందే వెరా అక్కడి నుంచి లేచి కొందరు ముసలి పర్షియన్ల దగ్గరకు వెళ్ళి కూర్చుంది. వాళ్ళు వ్యాపారం గురించి మాట్లాడుతున్నారు. నిలబెట్టిన ఊత కర్రల మీద ఆనుకుని, ఆలివ్ రంగు బుర్రలు ఆడిస్తూ, వాళ్లు బారు ఓనరుతో వ్యాపారం పెంచుకోవటానికి ఇదే సరైన టైమ్ అని చెప్తున్నారు. వెరా వాళ్ళ మాటల్లో దూరింది. ఆ ముసలివాళ్ళకి వంత పాడింది. ఖచ్చితంగా వ్యాపారం పెంచాలనీ, దాన్ని మిహైలోవ్‌స్కీ వీధిలోకి మారిస్తే ఇంకా బాగుంటుందనీ చెప్పింది. ఆ ఓనరు అనుమానంగా తలాడిస్తూ నిట్టూరుస్తున్నాడు. నేను కెబాబ్స్ ఒక్కడ్నే తింటున్నాను. వెరా భుజాలు ఆమె సిల్కు డ్రెస్ చంకల్లోంచి మెత్తగా కిందకి ప్రవహించాయి. ఆమె పిడికిళ్ళని బల్లకేసి గుద్దుతూ మాట్లాడుతోంది, వెలిసిన కోట్లు పసుపు గెడ్డాల మధ్య ఆమె చెవి జూకాలు ఊగుతున్నాయి. ఆమె మళ్ళీ మా టేబిల్ దగ్గరకు వచ్చేసరికి కెబాబ్ చల్లారిపోయింది. ఆమె ముఖం ఆవేశంతో ఎరుపెక్కి ఉంది. 

“ఆ గాడిద ఇక్కడ్నించి కదలడు… ఈ తూర్పు దేశం వంటలతో మిహైలో‌వ్‌స్కీ వీధిలో నిజంగా మంచి బిజినెస్ చేయొచ్చు తెలుసా!”

వెరా స్నేహితులు ఒకరి తర్వాత ఒకరు మా టేబిల్ దగ్గర ఆగి వెళ్తున్నారు— సిర్కాసియన్ కుర్తాలు వేసుకున్న జమీందార్లు, నడి వయసు ఆఫీసర్లు, ఉన్ని కోట్లు తొడుక్కున్న షాపు ఓనర్లు, కుండల్లాంటి పొట్టలతో ఎండకి కమిలిన చర్మంతో బుగ్గల మీద ఎండిన పొక్కులున్న ముసలాళ్ళు. మేము హోటల్‌కి వెళ్ళేసరికి అర్ధరాత్రయ్యింది. కానీ అక్కడ కూడా వెరాకి చేయటానికి వంద పనులున్నాయి. అక్కడ ఒక ముసలావిడ అర్మావిర్‌‌ పట్నంలో ఉన్న కొడుకుని చూట్టానికి రెడీ అవుతోంది. వెరా నన్ను వదిలి వెళ్ళి ఆమెకి సర్దుకోవటంలో సాయపడింది— ముసలావిడ సూట్‍కేస్‌‌ని మోకాళ్ళతో నొక్కి మూసింది, తలగడల్ని తాడుతో కలిపి కట్టింది, కేకుల్ని ఒక నూనె పీల్చే పేపర్లో చుట్టింది. వలతో అల్లిన టోపీ పెట్టుకున్న ఆ వెడల్పాటి భుజాల ముసలావిడ ఎర్రటి హేండ్ బేగ్ భుజానికి తగిలించుకుని హోటల్లో ఒక్కో గదికీ వెళ్ళి గుడ్ బై చెప్తోంది. రబ్బరు బూట్లతో కారిడార్లన్నీ కల తిరిగింది, మొహం మీద ముడతలన్నీ విడేలాగ నవ్వుతోంది ఏడుస్తోంది. ఆమెని సాగనంపటానికి ఏకంగా గంట పైనే పట్టింది. నేను అప్పటి దాకా ముక్క వాసన కొట్టే ఒక గదిలో వెయిట్ చేశాను. ఆ గదిలో కొన్ని మూడుకాళ్ళ కుర్చీలు, ఒక మట్టి పొయ్యి, గది మూలల్లో తడి మురికి మరకలు.

ఇంతసేపు టౌను వీధులన్నీ తిరిగి ఇంత యాతన పడ్డాకా ఇప్పుడు నా సెక్స్ కోరికే నాకు శత్రువు లాగ కనిపిస్తోంది, నేను తప్పించుకోలేని శత్రువు లాగ…

బైట నాకు తెలియని లోకం నడుస్తూనే ఉంది, ఉండుండి నవ్వులు వినపడుతున్నాయి. ఒక తెల్లటి ద్రవం నిండిన గాజు కూజాలో ఈగలు చస్తున్నాయి. ఒక్కో ఈగ చావు ఒక్కోలా ఉంది. కొన్ని చాలాసేపు గింజుకుని గింజుకుని చస్తున్నాయి. కొన్ని ఒకసారి చిన్నగా వణికి చచ్చిపోతున్నాయి. కూజా పక్కన పీలికలైన టేబిల్‌ క్లాత్ మీద ఒక పుస్తకం ఉంది: బోయర్ల చరిత్ర మీద గోలోవిన్ రాసిన పుస్తకం. చేతికొచ్చిన పేజీ తెరిచాను. ఒక వరుసలో ఉన్న అక్షరాలు మెల్లగా తారుమారై అలికేసినట్టు అయిపోయాయి. నాకు ఎదురుగా ఉన్న కిటికీలోంచి పెద్ద రాతి కొండలో ఒక భాగం కనిపిస్తూంది, దాన్ని చుట్టి ఒక టర్కిష్ వీధి పైకి వెళ్తూంది.

వెరా గదిలోకి వచ్చింది. “ఇప్పుడే ఫియొదొస్య మావ్రికెయెన్న ను సాగనంపాం. ఆవిడ మాకు అమ్మ లాంటిది. ఒక్కర్తే వెళ్తోంది, తోడు వెళ్ళడానికి ఎవ్వరూ లేరు, ఎవ్వరూ…” అంది.

వెరా మోకాళ్లు విడదీసి మంచం మీద కూర్చుంది. ఆమె కళ్ళు ఇంకా బాధ్యత, స్నేహాల స్వచ్ఛమైన లోకాల్లోకి చూస్తున్నాయి. తర్వాత నా వైపు కళ్ళు తిప్పి డబల్ బ్రెస్టెడ్ జాకెట్‌‌ వేసుకున్న నన్ను చూసింది. చేతులు ముడేసి ఒళ్ళు విరుచుకుంది.

“ఎదురు చూసీ చూసీ అలసిపోయుంటావు కదా… అయిపోయిందిలే, ఇక మొదలుపెడదాం.”

కానీ ఆమె ఏం చేస్తుందో నాకేం అర్థం కాలేదు. ఆమె చేసేవన్నీ ఒక డాక్టర్ ఆపరేషన్‌కి రెడీ అవుతున్నట్టు ఉన్నాయి. ఒక కిరోసిన్ స్టవ్ వెలిగించి దాని మీద గిన్నెడు నీళ్లు పెట్టింది. ఒక శుభ్రమైన తువ్వాలు మంచం హెడ్‌బోర్డ్‌ మీద వేసింది. దానికే ఒక ఎనీమా బేగ్ తగిలించింది. దాన్నుంచి గోడ మీదకి ఒక తెల్లటి ట్యూబ్ వేలాడుతోంది. నీళ్ళు మరిగాకా వాటిని ఆ బేగ్‌లో పోసింది, అందులో ఒక ఎర్రటి పటిక ముక్క వేసింది, తర్వాత తన డ్రెస్ తల మీంచి విప్పింది. కుంగిన భుజాలతో, నలిగిన పొట్టతో, ఒక పెద్ద శరీరం ఉన్న మనిషి నా ముందు నిలబడింది. ఆమె ఎండిన నిపిల్స్ గుడ్డిగా ఓ పక్కకి తిరిగి ఉన్నాయి.

“ఈలోగా నీళ్ళు రెడీ అవుతాయి గానీ… నువ్వు రా పిల్లాడా!” అంది నా ప్రేయసి. 

నేను కదల్లేదు. దిగులుతో మొద్దుబారిపోయాను. నా ఒంటరితనానికి బదులు నేను కోరుకున్నది ఇదా! ఈ దరిద్రం కారే దీనమైన గుహ, ఈ చచ్చిన ఈగలు, ఈ మూడు కాళ్ళ కుర్చీలు…

ఓ నా యవ్వన దేవతలారా! ఈ వికారమైన సన్నివేశానికీ, నా పక్కింటివాళ్ళు గోడ అవతల తియ్యగా మూలుగుతూ చేసుకునే సెక్స్‌కీ ఎంత తేడా… 

వెరా బాయిల చేతులు పెట్టి ఊపింది. 

“ఎందుకలా మొహం వేలాడేసుకుని కూర్చున్నావ్? రా ఇలా!” 

నేను కదల్లేదు. 

లోపలి లంగాని పొట్ట మీదకి లాక్కొని మళ్ళీ మంచం మీద కూర్చుంది.

“డబ్బులు వేస్ట్ అయ్యాయని బాధపడుతున్నావా?”

“ఆ బాధేం లేదు,” వణికే గొంతుతో అన్నాను.

“బాధేం లేదా? కొంపదీసి దొంగవి కాదు కదా?”

“దొంగని కాదు.”

“మరి? దొంగల కోసం పని చేస్తావా?”

“నేనో కుర్రాడ్ని.”

“కనపడుతోంది, నువ్వేం ఆవు వని అనుకోలేదులే,” గొణుక్కుంది. ఆమె కళ్ళు మూతలు పడుతున్నాయి. వెనక్కి పడుకొని, నన్ను తన మీదకి లాక్కొని, చేతులతో నా ఒళ్ళు తడుముతూంది. 

“నేనో కుర్రాడ్ని. ఆర్మేనియన్లతో పెరిగినవాడ్ని. అర్థమవుతోందా?” గట్టిగా అన్నాను.

ఓ నా యవ్వన దేవతలారా! ఇరవయ్యేళ్ళ నా జీవితంలో గత ఐదేళ్ళూ నేను కథలు అల్లటంలోనే గడిపేశాను, వేలకొద్దీ కథలు నా బుర్రని పీల్చి పిప్పి చేశాయి. ఈ కథలన్నీ బండరాయి మీద కప్పల్లా నా గుండెకి అతుక్కునే ఉండిపోయాయి. ఇప్పుడు వీటిలో ఒక కథ, నా ఒంటరితనానికున్న బలం చేత, ఊడి భూమ్మీద పడింది. నా మొదటి రీడర్ ఒక టిఫ్లిస్ వేశ్య అవ్వాలని రాసిపెట్టుందేమో. ఎక్కడ్నించి పుట్టుకొస్తున్నాయో అర్థంకాని నా ఊహలకి నేనే ఆశ్చర్యపోతూ ఒక కథ చెప్పటం మొదలుపెట్టాను— ఆర్మేనియన్‌లతో పెరిగిన ఒక కుర్రాడి కథ. నేనే గనక క్రాఫ్ట్‌ పట్ల అంత శ్రద్ధలేని ఒళ్ళు బద్ధకం మనిషినై ఉంటే ఒక డబ్బున్న ఆఫీసరు ఇంట్లోంచి వెళ్ళగొట్టేసిన కుర్రాడి కథ లాంటి చచ్చుపుచ్చు కథ ఏదో ఒకటి కల్పించి చెప్పేవాడ్ని— ఆ తండ్రి కఠినుడు, ఆ తల్లి త్యాగమయి, ఇలాగ. కానీ నేను ఆ తప్పు చేయలేదు. బాగా అల్లిన కథ నిజ జీవితానికి దగ్గరగా ఉండక్కర్లేదు. జీవితమే బాగా అల్లిన కథలా ఉండాలని తపిస్తుంది. అందుకని, పైగా నా శ్రోతని ఆకట్టుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి, నా కథలో నేను ఖెర్సాన్ జిల్లాలో అల్యోష్కీ అనే టౌన్‌లో పుట్టాను. నా తండ్రి ఒక స్టీమ్ బోటు కంపెనీలో డ్రాఫ్ట్‌లు రాసేవాడు. ఆయన పగలనకా రాత్రనకా డ్రాయింగ్ బోర్డు మీదకి వొంగి పని చేసేవాడు, పిల్లలకి మంచి చదువు చెప్పించాలని, కానీ మాది తల్లి పోలిక, తిండంటే ఇష్టం, సరదాలంటే ఇష్టం. నేను పదేళ్ళ వయస్సుకే తండ్రి జేబులోంచి డబ్బులు దొబ్బటం మొదలుపెట్టాను, కొన్నాళ్ళకే ఇంటి నుంచి బకూ పట్నం పారిపోయి అమ్మ తరఫు చుట్టాల దగ్గర చేరాను. నాకు వాళ్ళ ద్వారా స్టేఫాన్ ఇవనోవిచ్‌ అనే ఆర్మేనియన్ పరిచయం అయ్యాడు. నేను అతనికి దగ్గరయ్యాను, ఇద్దరం నాలుగేళ్ళు కలిసి ఉన్నాం.

“అప్పుడు నీ వయస్సెంత?”

“పదిహేనేళ్ళు.”

ఇప్పుడు ఈ ఆర్మేనియన్ ఎంత చెడ్డవాడో, నన్నెలా చెడగొట్టాడో చెప్తానని వెరా ఎదురుచూస్తోంది. 

“మేం నాలుగేళ్ళు కలిసి ఉన్నాం. నేను ఇప్పటి దాకా స్టేఫాన్ ఇవనోవిచ్ అంత మంచి మనసున్న మనిషిని, నమ్మితే ప్రాణమిచ్చే స్నేహితుడ్ని చూడలేదు— ఎంతో నిజాయితీపరుడు, మర్యాదస్థుడు. ప్రతి స్నేహితుడి మాటా నమ్మేవాడు. ఆ నాలుగేళ్ళల్లో నేను ఎంతో వ్యాపారం నేర్చుకోవాల్సింది. కానీ ఇటు పుల్ల తీసి అటు పెట్టేవాడ్ని కాదు. నా మనసంతా బిలియర్డ్స్ ఆట మీదే ఉండేది. స్టేఫాన్ ఇవనోవిచ్ ఫ్రెండ్స్ అందరూ కలిసి అతన్ని నాశనం పట్టించారు. అతను ఫ్రెండ్స్ పేర్ల మీద బినామీ బిల్లులు రాస్తే వాళ్ళు వాటిని కేష్ చేసుకున్నారు.”

బినామీ బిల్లులు…! అసలా మాట ఎందుకు తట్టిందో నాకే తెలీదు. కానీ భలే మంచి ఆలోచన. “బినామీ బిల్లులు” అని నా నోటమ్మటా రావటంతోనే ఇక వెరా నేను చెప్పేదంతా నిజమని నమ్మటం మొదలుపెట్టింది. ఒంటి చుట్టూ శాలువా కప్పుకుంది, ఆ శాలువా భుజాల మీద వణుకుతోంది.

“స్టేఫాన్ ఇవనోవిచ్ పూర్తిగా దివాలా తీసేశాడు. అపార్టుమెంట్ ఖాళీ చేయాల్సి వచ్చింది, అతని ఫర్నిచర్ వేలం వేశారు. తర్వాత అతను ఊళ్ళు తిరుగుతూ సేల్స్‌మన్ ఉద్యోగం చేయటం మొదలు పెట్టాడు. ఆ డబ్బు లేనోడి దగ్గర ఇక నేను ఉండలేను, కాబట్టి ఒక డబ్బున్న ముసలి చర్చ్ వార్డెన్‌తో కలిసి ఉంటం మొదలుపెట్టాను.” 

ఈ ‘చర్చి వార్డెన్’ అన్నది నేను వేరే ఎవరో రచయిత నుంచి దొబ్బుకొచ్చిన ఐడియా: ఒక నిజమైన ప్రాణమున్న కేరెక్టర్‌ని కల్పించే శక్తి లేని ఒక సోమరి మెదడులోంచి పుట్టిన ఐడియా అది. 

నేను ‘చర్చ్ వార్డెన్’ అనగానే వెరా కళ్ళల్లో రెప్ప పడింది, ఆమె నా మాయ నుంచి జారిపోయింది. పరిస్థితి మళ్ళీ అదుపులోకి తెచ్చుకోవటానికి నేను ఆ ముసలి చర్చ్ వార్డెన్ ఊపిరితిత్తుల్లోకి ఆస్తమా రోగాన్ని తెచ్చి కూరాను. ఆస్తమా ఎటాక్స్ వల్ల ఆ ముసలాడు రొప్పుతూ గస పెట్టేవాడు. రాత్రుళ్ళు మంచం మీంచి ఉన్నపళంగా లేచి కిరోసిన్ కంపు కొట్టే బకూ గాలి లోంచి ఆబగా ఊపిరి పీల్చుకునేవాడు. అతను కొన్నాళ్ళకే చనిపోయాడు. ఆస్తమా ఊపిరాడనివ్వలేదు. నా చుట్టాలేమో నన్ను రానివ్వరు. అలా ఈ ట్రిఫ్లిస్‌లోకి వచ్చిపడ్డాను, జేబులో ఇరవై రూబుళ్ళతో— ఆ ఇరవై రూబుళ్ళే ఇందాక వెరా గోలోవిన్ వీధిలో ఒక గుమ్మంలో నుంచుని లెక్కపెట్టింది. నేను ఉంటున్న హోటల్లోని ఒక వెయిటర్ డబ్బున్న కస్టమర్లని నా దగ్గరకి పంపిస్తా అన్నాడు, కానీ ఇప్పటి దాకా వాడు పంపింది పొట్టలు కిందకి వేలాడే దుకాణం ఓనర్లనే. వాళ్ళకి వాళ్ళ దేశమన్నా, పాటలన్నా, వైన్ అన్నా ఇష్టం, కానీ వేరే దేశాల నుంచి వచ్చిన మనుషుల్ని, వాళ్ళు మగాళ్ళుకానీ ఆడాళ్ళుకానీ, అణగదొక్కేస్తారు, దొంగ పొరుగింటోడి తోటని అణగదొక్కినట్టు.

తర్వాత ఈ దుకాణం ఓనర్ల గురించి నేను ఎక్కడో విన్న విషయాల్ని చెప్పుకుంటూ పోయాను. నా మీద నాకే జాలితో గుండె తరుక్కుపోయింది. పూర్తిగా నాశనమైపోయాను. బాధతో, ఇన్‍స్పిరేషన్‌తో కదిలిపోయాను. నా ముఖం మీద చల్లటి చెమటలు ఎండలో వెచ్చటి పచ్చికలో పాములు పాకినట్టు పాకుతున్నాయి. మాట్లాడటం ఆపాను, ఏడుపొచ్చింది, తల పక్కకు తిప్పుకున్నాను. అంతటితో నా కథ అయిపోయింది. కిరోసిన్ స్టవ్ ఎప్పుడో ఆరిపోయింది. మరిగిన నీళ్ళు మళ్ళీ చల్లారాయి. రబ్బరు ట్యూబు గోడకి వేలాడుతోంది. వెరా నిశ్శబ్దంగా కిటికీ దగ్గరకు వెళ్ళింది. ఆమె అందమైన వీపు నా ముందు బాధతో కదులుతోంది. కిటికీలోంచి కనపడుతున్న కొండ అంచుల చుట్టూ వెలుగు పేరుకుంటుంది.

“ఏంటీ మనుషులు! దేవుడా, ఇలాంటి ఘోరాలు చేస్తారా మనుషులు!,” వెరా అటే చూస్తూ గొణిగింది. 

చేతులు చాపి కిటికీ తలుపులు బార్లా తెరిచింది. వీధిలో తడిసిన నాపరాళ్ళు బుస కొడుతున్నాయి. దుమ్ము మీద నీరు చల్లిన వాసనొస్తూంది. వెరా తల అడ్డంగా ఆడిస్తోంది.

“అయితే నువ్వూ ఒక లంజ దానివే అన్నమాట… మాలాగ!” అంది. 

నేను తల దించుకున్నాను. 

“అవును. నేనూ లంజనే!”

వెరా నా వైపు తిరిగింది. మడతలు పడిన లంగా పక్కకు వేలాడుతోంది.

“దారుణం!” ఇప్పుడింకా గట్టిగా అంది, “దేవుడా, ఇలాంటి ఘోరాలు చేస్తారా మనుషులు! …సర్లే, ఇంతకీ నువ్వు ఎప్పుడైనా ఆడదానితో పడుకున్నావా?”

నేను నా చల్లటి పెదాల్ని ఆమె చేతికేసి ఒత్తాను.

“లేదు. వాళ్ళు నన్ను దగ్గరికి రానివ్వరు కదా?”

నా తల ఆమె బాయిల మీద ఊగుతూంది. అవి నా మీద పొంగుతున్నాయి. బిగిసిన నిపిల్స్ నా చెంపలు నొక్కుతున్నాయి. అవి తడిగా కళ్ళు తెరిచి, లేగ దూడల్లాగ ఒరుసు కుంటున్నాయి. పైనుంచి వెరా కిందకి నన్ను చూసింది.

“చెల్లెలివిరా! నా చెల్లె ముండవిరా నువ్వు,” అంటూ నా పక్కనే నేల మీదకి జారింది. 

ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటడుగుతాను: మీరెప్పుడైనా ఒక పల్లెటూరి వడ్రంగిమేస్త్రి తన తోటి మేస్త్రీతో కలిసి ఇల్లు కట్టడం చూశారా? వాళ్ళు ఒక దుంగని చిత్రిక పడుతుంటే చెక్కపేళ్ళు ఎంత వేగంగా బలంగా హాయిగా ఎగురుతాయో చూశారా? ఆ రాత్రి నాకు ఆ ముప్ఫయ్యేళ్ళామె తన పనిలో కిటుకులన్నీ నేర్పింది. ఆ రాత్రి మీరెప్పటికీ తెలుసుకోలేని రహస్యాలు తెలుసుకున్నాను, మీరెన్నటికీ అనుభవించలేని ప్రేమని అనుభవించాను, ఒక ఆడది ఇంకో ఆడదానితో చెప్పుకునే మాటలు విన్నాను. తర్వాత అవి మర్చిపోయాను: వాటిని మేం గుర్తుంచుకోకూడదు.

తెల్లారుతుంటే నిదరపోయాం. మళ్ళీ మా శరీరాల వేడికే మాకు మెలకువ వచ్చింది. మంచం మీద రాతి బండలా వాలింది వేడి. లేచాకా ఒకర్ని చూసి ఒకరు నవ్వుకున్నాం. ఆ రోజు నేను ప్రింటింగ్ ప్రెస్‌కి వెళ్ళలేదు. పాత టౌను బజారుకు వెళ్ళి టీ తాగాం. ఒక నెమ్మదస్తుడైన టర్కిష్ పెద్దాయన తువ్వాలు చుట్టిన సమోవార్ లోంచి మాకు టీ పోశాడు. అది ఎర్రటి ఇటుక రంగులో, రక్తం కక్కుతున్నట్టు ఆవిర్లు కక్కుతూంది. మసక బారిన ఎండ మా గ్లాసుల పక్కన మెరుస్తూంది. గాడిదల అరుపులూ కమ్మరోళ్ళ సుత్తిదెబ్బలూ కలిసి వినిపిస్తున్నాయి. టెంట్స్ కింద మాసిన తివాచీల మీద రాగి కూజాలు నిలబెట్టి ఉన్నాయి. ఎద్దు పేగుల్లోకి కుక్కలు ముట్టెలు దూర్చుతున్నాయి. ఎక్కడి నుంచో దుమ్ము తెరలు టిఫ్లిస్ వైపు వీస్తున్నాయి, ఈ గులాబీపూల మేకమాంసాల ఊరి వైపు. సూర్యుడి ఎర్రటి మంటని కమ్మేసే దుమ్ము. ఆ టర్కిష్ పెద్దాయన మాకు ఇంకాస్త టీ పోసి, మేం ఎన్ని రోల్స్ తిన్నామో అబకస్ మీద లెక్కపెడుతున్నాడు. ప్రపంచం మమ్మల్ని సంతోష పెట్టడానికే ఉంది. మొహం నిండా పూసల్లా చెమటపడుతుంటే గ్లాసు బోర్లించాను. టర్కిష్ పెద్దాయనకు డబ్బులిచ్చేశాక, రెండు ఐదు రూబుల్ కాసుల్ని వెరా వైపు తోశాను. ఆమె తొడ బొద్దుగా నా కాలి మీద ఉంది. ఆ డబ్బులు మళ్ళీ నా వైపే తోసేసి, తొడ వెనక్కి లాక్కుంది. 

“ఏం చెల్లెమ్మా గొడవ పడాలనుందా నాతో?”

నాకు గొడవ పడాలని లేదు. మళ్ళీ సాయంత్రం కలుద్దామనుకున్నాం. నేను నా రెండు బంగారు కాసుల్నీ నా పర్సులో పెట్టుకున్నాను — అది నా తొలి పారితోషికం. 

ఆ తర్వాత చాలా ఏళ్ళు గడిచాయి. ఆ తర్వాత చాలామంది నుంచి డబ్బు తీసుకున్నాను— సంపాదకుల నుంచి, మేధావుల నుంచి, పుస్తకాలమ్మే యూదుల నుంచి. ఓడిన గెలుపుల గురించి, గెలుపుగా మారిన ఓటముల గురించి, చావుల బతుకుల గురించి రాసినందుకు వాళ్ళు నాకు నామమాత్రంగా డబ్బు ఇచ్చారు— యవ్వనంలో నా తొలి “పాఠకురాలి” నుంచి నేను తీసుకున్నదానికంటే చాలా తక్కువ డబ్బు. కానీ నాకెప్పుడూ కోపం రాలేదు. కోపం ఎందుకు రాలేదంటే చనిపోయేలోగా ఇంకొకటి దక్కించుకుంటాను — బహుశా అదే ఆఖరిది కావచ్చు — ప్రేమగా ఇచ్చే చేతుల్లోంచి ఇంకో బంగారు కాసు.


(1922 – 1928)