రోడ్డు మీద పడి ఉన్న ఆ ఐదొందల నోట్ల బొత్తిని మొదట చూసింది నేనొక్కణ్ణే కాదు. ఆ వారన ఇంకా మనుషులు నడుస్తున్నారు. పక్కనే వెళ్తున్న ట్రాఫిక్ లోని కార్లలోంచి కూడా కొంతమంది దానివంక చూసే ఉంటారు. ఎంతమంది చూసినా- ఆ సమయంలో దానికి దగ్గర్లో నడుస్తున్నది నేనే. దాన్ని నాది చేసుకోవటమా, లేదా ఎవరిదో వాళ్ళకు అప్పజెప్పటమా అన్న నిర్ణయం తీసుకోవాల్సింది నేనే. అది ఎవరి జేబులోంచో పడికూడా ఎంతోసేపై ఉండదు. ఎంతోసేపైవుంటే ఈపాటికే బొత్తి లోంచి నోట్లు గాలికి ఎగిరిపోయుండేవి. ఇప్పుడిప్పుడే మడత నుంచి వేరై రెపరెపలాడుతున్నాయి. నేను ఓ నిర్ణయానికొచ్చేసరికే వాటిని దాటి రెండడుగులు ముందుకేస్సాను. అప్పుడిక తెగించి, వెనక్కి వొంగి, వాటిని చేతిలోకి తీసుకున్నాను. క్షణం క్రితం దాకా రోడ్డు మీద ఎవరి చూపుకూ నోచుకోని నన్ను ఇప్పుడు చాలా కళ్ళు చూస్తున్నాయని తెలుసు. ఎవరూ నన్నేం అనలేదు. నేను దొంగనో, లేక డబ్బుని చెందాల్సినవాళ్ళకి చేర్చే బాధ్యతాయుతమైన పౌరుడినో, లేక డబ్బులు నావేనో ఇంకా ఎవరూ తేల్చుకోలేదు. నేను ఎవ్వరికీ అంత సమయమివ్వదల్చుకోలేదు. త్వరగా నడిస్తే ఈ చూపుల పరిధి దాటిపోవచ్చు. ఎవరూా ఎక్కువసేపు ఆగి నన్నే పట్టించుకోరు. ఈ రోడ్డు ఎవ్వరికీ అంత ఛాన్సివ్వదు. ముందుకు తోస్తూనే ఉంటుంది. నేను నడవటం మొదలుపెట్టాను. నడుస్తూ నడుస్తూ వెనక్కి చూస్తే... ఒకతను మటుకు దూరంగా నా వెనకే నడుస్తున్నట్టు కనిపించాడు. నేను అతని వంక చూసి చటుక్కున కళ్లు తిప్పుకున్న కాసేపట్లో అతనో నీలం రంగు సఫారీ సూటు వేసుకున్న మనిషని అర్థమైంది. ఆ డబ్బులు అతనివే కావచ్చు, కాకపోయినా తనవే అని బుకాయించటానికి కావచ్చు, లేదా జనంలేని చోట నన్ను నిలదీసి నేను దొంగనే అని తేల్చుకుని నాతో పాటు సొమ్ము పంచుకోవటం కోసం కావచ్చు. నేను ఇప్పుడే జేబులో కుక్కిన ఐదొందల నోట్లు ఎన్నో తెలీదు కానీ, బొత్తి మందాన్ని బట్టి నాకు ఉన్న ఒక పెద్ద అప్పు తీర్చేటన్ని అని మాత్రం తెలుస్తోంది. వేగంగా నడుస్తున్నాను, వెనక వెంటపడుతున్న నీడని వదిలించుకోవటం ఎలాగా అని ఆలోచిస్తూ.... ఒకవేళ ఈ డబ్బులు అతనివే అయితే, నేను పూర్తి దొంగతనంలోకి దిగిపోయి, నడక వేగం పెంచి, అవసరమైతే పరుగులోకి మారి, ఈ రద్దీలో తప్పించుకోవచ్చు. ఒకవేళ ఈ డబ్బుని నాతో పంచుకోవాలని చూస్తున్న తోడుదొంగైతే, అసలెందుకివ్వాలి వాడికి? ఒకవేళ వాడు ఈ డబ్బు నాదో కాదో తేల్చుకుని ఎవరిదో వాళ్లకి అప్పజెప్పేందుకు వస్తున్న మంచి పౌరుడైతే, నన్ను ఇందాక వదిలి బైటికి దూకిన మనస్సాక్షిలాగ? నాకు ఒక ఆలోచన తట్టింది. తట్టీతట్టగానే నా ముందు ఒక పోలీస్ స్టేషను ఉంది. నా ఆలోచన ఏంటంటే- నేను ఈ డబ్బుల్ని పోలీస్ స్టేషన్లో అప్పజెప్పేవాడిలాగా లోపల అడుగుపెడతాను. పోలీస్ స్టేషన్ అన్నాక చాలా గదులుంటాయి, చాలా రద్దీ ఉంటుంది. నేను నిజంగా డబ్బులప్పగిస్తున్నట్టు తాత్సారం చేసేలోగా- వెనక వస్తున్నవాడు తోడుదొంగైతే అక్కడితో నన్ను వెంటాడటం ఆపి తన దారిన వెళ్ళిపోతాడు. మంచిపౌరుడైనా, మరీ మంచిపౌరుడైతే తప్ప, నాతోపాటు లోపలికి రాడు. ఆ డబ్బు వాడిదైతే మాత్రమే లోపలికి వస్తాడు. ఈ లోపులో నన్ను నేను పోలీసు ప్రోసీజర్లో చిక్కుపడిపోకుండా కాపాడుకుంటే చాలు. ఈ పోలీస్ స్టేషన్లో ఉన్నది రెండు గదులే. మొదటి గదిలో ఉన్న పోలీసుల్ని నాకు రెండోగదిలో పనుందని నమ్మిస్తూ దాటేశాను. రెండో గదిలో అడుగుపెట్టకుండా గుమ్మం ముందు తచ్చాడుతున్నాను. నన్ను వెంటాడుతున్న సఫారీ సూటువాడు మొదటి గదిలోకి వచ్చి ఆగాడు. వాడు ఒకసారి నన్నూ, ఇంకోసారి మొదటి గదిలో ఏదో పనిలో ఉన్న పోలీసుల్నీ మార్చి మార్చి చూస్తున్నాడు. ఏదో చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. వాడి చూపులో బాధపెట్టే కొంటెతనం. నాకున్న అప్పు మనసులో రూపం తెచ్చుకుని వద్దూ వద్దూ అని అరుస్తోంది. ఇందాక రోడ్డు మీదే పారిపోతే బాగుండేది. ఇప్పుడిక పరిగెత్తే ఛాన్స్ కూడా లేదు. నన్ను నేనే పోలీస్ స్టేషన్లోకి నెట్టుకున్నాను. మొదటిగదిలో ఒక పెద్ద టేబిల్ చుట్టూ కూర్చున్న పోలీసుల దగ్గరికి వెళ్ళాను. ఆ డబ్బుల కట్టని టేబిల్ మీద పెట్టాను. ఆ కట్టలో నోట్లు ఇప్పుడు నావికాని పరాయితనంతో లెక్కపెట్టుకోమ్మని వెక్కిరింతగా రెపరెపలాడుతున్నాయి. పోలీసులు నేను చెప్పింది విన్నారు. మంచివాణ్ణని పొగిడారు. డబ్బు సొరుగులో వేసుకున్నారు, బహుశా తర్వాత జేబుల్లో వేసుకుంటారు. నేను ఆ సఫారీ సూటువాడి వైపు చూశాను. వాడు నాలో ఇంకేంత నిశ్శబ్దంగా ఒక నవ్వు నవ్వి బైటకి నడిచి వెళ్ళిపోయాడు.
(ఈ ఫిక్షన్ నాది కాదు, నా కలల్ని రాసేవాడెవ్వడో ఆడిది. ఆడి క్రెడిట్ నేనెందుకు తీసుకోవాలని.)
0 comments:
మీ మాట...