Showing posts with label రచయితల పరిచయాలు. Show all posts
Showing posts with label రచయితల పరిచయాలు. Show all posts

September 10, 2018

యూరీ ఓలేషా (1899-1960) పరిచయం: పాత కొత్త ప్రపంచాల నడిమి నీడలో...

కమ్యూనిస్టు విధానంలో నడిచే సమాజంలోంచి సహజంగానే కొత్త గుణాలతో ఒక కొత్త మనిషి ఉద్భవిస్తాడని మార్క్సిజం ఊహించింది. కానీ కమ్యూనిస్టు రష్యాలో ఈ కొత్త మనిషికి బలవంతంగా మూస పోసే ప్రయత్నం జరిగింది. భౌతికవాద విలువలు మూర్తీభవించిన, మానవ సహజమైన బలహీనతలకు లొంగని, హేతుబద్ధ యంత్రం లాంటి ఈ మనిషి కమ్యూనిజం అమలుకు అత్యంత కీలకమని సోవియట్‌ పాలకులు భావించారు. వీడికి ‘కొత్త సోవియట్‌ మనిషి’ (న్యూ సోవియట్‌ మాన్‌) అని పేరు కూడా పెట్టారు.

పాలకుల బలవంతం మీద ఆ కాలపు సోవియెట్‌ రచయితలు కూడా తమ రచనల్లో ఈ కొత్త సోవియట్‌ మనిషిని ఆదర్శంగా చిత్రించే ప్రయత్నం చేశారు. అయితే యూరీ ఓలేషాకి మాత్రం ఈ మనిషిపై చాలా అనుమానాలున్నాయి. అలాగే కొత్త ప్రపంచం మైకంలో పడి అందరిలా విప్లవానికి ముందంతా చెడ్డదేనన్న తీర్మానానికి వచ్చేయలేదు. విప్లవానంతరం రష్యన్‌ మేధో సమాజం పాత ప్రపంచ విలువల్ని వెనకే వదిలేసి కొత్త విలువల్ని కాంక్షిస్తూ ముందుకు నడిచింది. ఓలేషా కూడా అందరితోపాటు నడిచాడు. అయితే పాత ప్రపంచంలో తనకు విలువైనవన్నీ కూడా వెంట తెచ్చుకోవాలనుకున్నాడు.

యూరీ ఓలేషా (Yury Olesha) పోలండ్‌లో ఒక బతికిచెడ్డ భూస్వామి కుటుంబంలో పుట్టాడు. అతనికి మూడేళ్ళ వయస్సుండగా కుటుంబం రష్యాలోని ఒడెస్సా పట్టణానికి వచ్చి స్థిరపడింది. ఓలేషా చదువంతా అక్కడే సాగింది. విప్లవం తర్వాత కుటుంబం పోలండుకు తిరిగి వెళ్ళిపోయింది. బోల్షెవిక్‌ ఆదర్శాలతో ప్రభావితుడైన ఓలేషా మాత్రం రష్యాలోనే ఉండిపోయాడు. 23 ఏళ్ళ వయస్సులో మాస్కో నగరానికి వచ్చి ఒక రైల్వే పత్రికలో జర్నలిస్ట్‌గా చేరాడు. ఆ పత్రికలో 'చిసెల్' (ఉలి) అన్న మారు పేరుతో వ్యంగ్య రచనలు చేసేవాడు. 28 ఏళ్ళప్పుడు తొలి నవల ‘ఎన్వీ’ రాశాడు. ఇందులో ఇతివృత్తం పాత కొత్త ప్రపంచాల మధ్య సంఘర్షణే. కథలో రెండు ప్రపంచాలకీ ప్రతినిధులనదగ్గ పాత్రలు ఉంటాయి. ఇవాన్‌ అనే పాత్ర ఇలా అంటాడు: ‘‘...కరుణ, సున్నితత్వం, గర్వం, ఈర్ష్య, ప్రేమ--ఒక్క మాటలో చెప్పాలంటే, ఇప్పుడు ముగింపు కొస్తున్న శకంలో మానవాత్మను కమ్ముకొని ఉన్న భావావేశాలన్నింటినీ పూర్తిగా నిర్మూలించాలి. సోషలిస్టు శకం ఈ భావావేశాల్ని కొత్త మానసిక స్థితులతో భర్తీ చేస్తుంది’’. అక్కడితో ఆగడు,‘‘పాత ప్రపంచానికి పూర్తిగా తెరపడేలోగా, ఆ ప్రపంచానికి ప్రాతినిధ్యం వహించే భావావేశాలన్నింటి తోనూ ఒక ఆఖరి ప్రదర్శన ఇప్పించాలనుకుంటున్నాను’’ అంటాడు.

ఓలేషా పాత, కొత్త ప్రపంచాల్లో ఒకటి గొప్పదనీ, ఒకటి తక్కువదనీ అలా ఏం అనుకోలేదు. రెంటినీ సమభావంతోనే చిత్రించాడు. అందుకే ‘ఎన్వీ’ నవల వచ్చినప్పుడు ఆయన దేన్ని సమర్థిస్తున్నాడో ఓ పట్టాన ఎవరికీ అర్థం కాలేదు. అది ఎవరు ఎలా చదివితే వారికి అలా అర్థమయ్యింది. విప్లవానికి ముందున్న ప్రపంచాన్ని వెక్కిరిస్తున్నాడనుకొని మొదట్లో కమ్యూనిస్టు విమర్శకులంతా నవలను ఆకాశానికెత్తేశారు. ఆ నవల కథానాయకుడు కవెల్రోవ్‌ ఒక తాగుబోతు. ఒక సమర్థుడైన సోవియెట్‌ అధికారి పట్ల ఈర్ష్యతో రగిలిపోతుంటాడు. ఈ ఈర్ష్యే నవల ప్రధాన ఇతివృత్తం. కథ చివర్లో కవెల్రోవ్‌ పూర్తిగా ఓడిపోయి మట్టిగొట్టుకు పోతాడు. దీంతో విమర్శకులంతా పాత ప్రపంచానికి ప్రతినిధి అయిన ఒక అసమర్థ పాత్రని నిరసించటమే ఓలేషా ఉద్దేశ్యమనుకొని పొగిడారు. అయితే కథ మొదటి భాగమంతా కవెల్రోవ్‌ చెప్పే కథనంలో అతని స్వాప్నికత, ప్రపంచాన్ని కవితాత్మకంగా స్వీకరించే తీరు వ్యక్త మవుతాయి. విమర్శకులు ఏమనుకున్నా, పాఠకులు మాత్రం ఈ తాగుబోతు పాత్రలోనే తమని తాము చూసుకోవటం మొదలుపెట్టారు. దీంతో విమర్శకులు నవలను మళ్ళీ తిరగదోడారు. ఈసారి విమర్శల పరంపర మొదలైంది. అయినా ఓలేషా తన పద్ధతిలోనే రాయాలని కొన్నాళ్ళు ప్రయత్నించాడు. ఆ ఉరవడిలోనే ‘ల్యోంపా’, ‘లవ్‌’, ‘ద చైన్‌’, ‘చెర్రీస్టోన్‌’ లాంటి మంచి కథలు వచ్చాయి. అయితే కమ్యూనిస్టు ఆదర్శాలకు సాగిలపడనందుకు అతని రచనల్ని ప్రచురించటం ఆపేశారు.

1934లో ‘సోవియట్‌ రచయితల సభలు’ జరిగాయి. సభల ఉద్దేశాన్ని పైకి ఏమని ప్రకటించినా, అసలు ఉద్దేశం మాత్రం రచయితలెలా రాయాలో వాళ్ళకి చెప్పటమే. రచయిత కథను వర్ణించేటప్పుడు తనలో ఇంకిన ప్రపంచాన్ని వ్యక్తం చేయాలనుకుంటాడు. కానీ సోవియట్‌ రాజ్యం తన రచయితల్నుంచి కోరిందల్లా ఇన్‌స్ట్రక్షన్‌ మాన్యువల్స్‌ని మాత్రమే. అందుకు తగ్గట్టు రాయనివాళ్ళని నిషేధించారు. హఠం వీడకపోతే హత్యలూ చేశారు. ఈ సభల్లో ఓలేషా కూడా సంజాయిషీ చెప్పుకోవాల్సి వచ్చింది. తన ‘ఎన్వీ’ నవల వెనుక ఉద్దేశాన్ని వివరించాల్సి వచ్చింది. ఒక రకంగా తన మానాన తనని రాసుకోనివ్వమని బతిమాలుకున్నాడనే చెప్పాలి. ఉపన్యాసంలో ఒక చోట ఇలా అంటాడు: ‘‘ఆర్టిస్టుగా నాలోని స్వచ్ఛమైన చేవతో కవెల్రోవ్‌ పాత్రని సృష్టించాను. తొలి సృజన జోరులో, తొలి స్పందనల ప్రభావంతో ఈ నవల రాశాను. కానీ జనం కవెల్రోవ్‌ని వెకిలి, పనికిమాలిన పాత్ర అన్నారు. నాలోంచి ఎంతో తీసుకుని పుట్టిన కవెల్రోవ్‌ని ఇలా అనటంతో నన్నే నిందించినట్టు బాధ పడ్డాను. అమలినమైన కుతూహలం కలిగి, ప్రపంచాన్ని తనదైన తీరులో చూడగలిగిన మనిషి వెకిలివాడు, పనికిమాలినవాడు ఎలా అవుతాడు. నాలో నేనే ఇలా అనుకున్నాను: అంటే నీకు చెందినదంతా, నువ్వు నీ సామర్థ్యమని అనుకొనేదంతా వెకిలితనం, పనికిమాలినతనమూనా! నన్ను తిట్టిన నా కామ్రేడ్స్‌--కమ్యూనిస్టు సాహిత్య విమర్శకులు--నిజమే చెబుతున్నారని నమ్మాలనుకున్నాను. చివరకు నమ్మాను కూడా.’’

చూట్టూ చాలామంది రాస్తున్నట్టు రాయలేని తన నిస్సహాయతను కూడా వ్యక్తం చేసుకున్నాడు. ‘‘నేను ఒక కన్‌స్ట్రక్షన్‌ సైటుకు వెళ్ళి, అక్కడి శ్రామికుల మధ్య జీవిస్తూ వాళ్ళ గురించి ఒక వ్యాసమో, నవలో రాయగలనేమో--కానీ అది నా ఇతివృత్తం కాదు; నా రక్తంలో పారే ఇతివృత్తం కాదు, నా ఊపిరి కాదు. ఆ ఇతివృత్తాన్ని తీసుకుంటే నేను నిజమైన రచయితను కాను. అప్పుడిక ప్రేరణ నాపై పని చేయదు. ఒక కార్మికుణ్ణి, ఒక విప్లవ నాయకుడ్ని నేను పాత్రలుగా గ్రహించలేను’’ అన్నాడు. కానీ ఇకమీదట తాను రాయదల్చుకుంటే ఆ పని చేయక తప్పదని తెలుసు. అందరూ ఊదరగొడుతున్న ఈ కొత్త మానవుడ్ని ఇష్టం లేకున్నా వస్తువుగా తీసుకోక తప్పదని తెలుసు. కానీ రాయాలంటే వాడితో ఒక సయోధ్య కుదరాలిగా: ‘‘ఈ దేశంలో ఒక కొత్త తరం మనిషి, మొదటి సోవియట్‌ మనిషి, ఇప్పుడే ఆవిర్భవిస్తున్నాడు. నేను అతడివైపు ఆత్రంగా వెళ్ళి అడిగాను: ‘ఎవరు నువ్వు? ఏ రంగులు చూస్తావు? కలలు కంటావా? ఏమనుకుంటావు నీ గురించి? దేనికి ఆశపడతావు? ఎలా ప్రేమిస్తావు? దేన్ని ఒప్పుకుంటావు, దేన్ని కాదంటావు? నీలో హేతువు బలమైనదా, భావావేశమా? సున్నితత్వం నీకు తెలుసా? ఓ సోషలిస్టు సమాజ యువకుడా ఎలాంటి మనిషివి నువ్వు?’’’ అంటాడు.

ఈ సోవియట్‌ రచయితల సభల తర్వాతే రచయితగా ఓలేషా పతనం మొదలైంది. రాయాలనుకున్నది రాయలేడు. అలాగని రచయితై వుండీ రాయటం మానేస్తే ‘సామాజిక పరాన్నజీవి’గా ముద్రవేసి జైల్లో తోసే అవకాశముంది. దాంతో ఇక తప్పక సోవియెట్‌ ఆదర్శాల్ని బలవంతాన వొంట బట్టించుకొనే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో తనను తాను పోగొట్టు కున్నాడు. రచయితగా శక్తులన్నీ ఉచ్ఛ దశలో ఉన్నప్పుడు రాయాలనుకున్నది రాసే అవకాశం లేకపోయింది. ఈ నిరాశలో తాగుడికి లొంగిపోయాడు. నిస్సారమైన రాతలు రాశాడు. ఓలేషాకు యాభైఏళ్ళు దాటాక స్టాలిన్‌ చనిపోయాడు. అప్పుడు తాత్కాలికంగా రచయితలకు కొంత స్వేచ్ఛ దొరికింది. ఓలేషా పాత రచనల్ని పునర్ముద్రించారు. అప్పుడు కూడా ‘‘రచయిత ఈ రచనల్లో వ్యక్తం చేసిన అభిప్రాయాల్ని తర్వాత తప్పు అని ఒప్పుకున్నాడు’’ అన్న ముందుమాట చేర్చి మరీ ప్రచురించారు. ఓలేషా మరో ఆరేళ్ళు బతికి గుండెపోటుతో చనిపోయాడు. ఆఖరు రోజుల్లో రాసిన ‘నో డే వితవుట్‌ ఎ లైన్‌’ అనే ఒక పూర్తికాని స్మృతి రచనలో, ‘‘రచనా జీవితంలో నేను చేసింది ఒక రూపకాలంకారాల దుకాణాన్ని తెరవటం. కానీ ఆ ఖరీదైన, జటిలమైన రూపకాల్ని కొనేందుకు ఎవ్వరూ ముందుకు రాకపోవటంతో ఆ దుకాణం మూసేసాను’’ అని రాసుకున్నాడు. ఎదిగేకొద్దీ మన చూపు ప్రపంచంపై కప్పే అలవాటనే పొరని తీసేయటం, దానిని తిరిగి బాల్య స్వచ్ఛతతో సర్ది చూపించటం ఓలేషా శైలిలో కనిపిస్తుంది.

రష్యన్‌ సాహిత్యంలో పుష్కిన్‌, గొగోల్‌లు ఇద్దరూ రెండు భిన్న సంప్రదాయాలకు ఆద్యులు. ఇంద్రియాలకు తోచే సమస్త ప్రకృతి మీద వాత్సల్యంతో దానిని కవితాత్మకంగా స్పృశించేది పుష్కిన్‌ పద్ధతి అయితే, తీవ్రంగా మెలిపడిన వ్యక్తిత్వంలోంచి ప్రకృతిని తనదైన వికృతిలోకి తర్జుమా చేసుకుని చూడటం గొగోల్‌ పద్ధతి. ఒకరి కలం వెలుపలికి చూస్తుంది, మరొకటి లోపలి లోతుల్ని తవ్వి తీస్తుంది. అటు పుష్కిన్‌ ఇటు గొగోల్‌, అటు టాల్‌స్టాయ్‌ ఇటు దాస్తోయెవ్‌స్కీ... ఇలా భిన్న ధృవాలను తమలో ఇముడ్చుకొని రాసిన అరుదైన రష్యన్‌ రచయితల్లో ఓలేషా ఒకడు. ఈ విషయంలో ఓలేషాకి సరిజోడు మరో రష్యన్‌ రచయిత వ్లాదిమిర్‌ నబొకొవ్‌. ఓలేషా, నబొకొవ్‌ ఇద్దరూ ఒక ఈడు వాళ్ళే. ఇద్దరిదీ ఒకటే చూపు, ఒకటే ప్రతిభ. నిజానికి, ఇద్దరూ ఒకే వయస్సులో రాసిన తొలి నవలల్ని చూస్తే, నబొకొవ్‌ కన్నా ఓలేషా ఎంతో పరిణతితో కనిపిస్తాడు. అయితే నబొకొవ్‌ కమ్యూనిస్టు రష్యా నుంచి బైటపడి బతికిపోయాడు. పూర్తి స్థాయిలో వికసించగలిగాడు. ఓలేషా అక్కడే ఉండి జీవచ్ఛవంగా మిగిలాడు. మొగ్గగానే తెగిపోయాడు. అతని తొలి నవల పరిమళం మాత్రమే అలా మిగిలి తారాడుతోంది.
(ఆంధ్ర జ్యోతి వివిధలో)


July 30, 2018

హొర్హె లూయీ బోర్హెస్‌ (1899-1986) పరిచయం: ‘‘స్వర్గం ఒక లైబ్రరీలా ఉంటుందేమో అనుకుంటాను’’

కథలు రాయటానికి బోర్హెస్‌ జీవితానుభవంపై కన్నా, పఠనానుభవాలపై ఎక్కువ ఆధార పడ్డాడు. తత్త్వశాస్త్ర పఠనంలో తనను బాగా ఆకర్షించిన సమస్యలూ మీమాంసల ఆధారంగా ఆడిన ఆటలే ఆ కథలు చాలావరకూ. అలాని అవేం గంభీరంగా సాగవు. ఉదాహరణకి కొన్ని కథల థీమ్స్‌ ఇలా ఉంటాయి: మన జీవితాన్ని ఎవరో కలకంటున్నారని తెలిస్తే? నిజంగా అమరత్వం లభిస్తే? ఈ విశ్వం అవధిలేని షడ్భుజాకార గ్రంథాలయమైతే? దేవుని అసలు ప్రతినిధి క్రీస్తు గాక జుడాస్‌ అయితే? నామవాచకాల్ని నిరాకరించే ప్రపంచం ఎలా ఉంటుంది? అసలు దేన్నీ మరచిపోలేని మనిషి ఎలా ఉంటాడు? ఇలాంటి ఇతివృత్తాల్ని బోర్హెస్‌ క్రైమ్‌ థ్రిల్లర్లలోకీ, డిటెక్టివ్‌ కథల్లోకీ, నకిలీ పుస్తక సమీక్షల్లోకీ ఇమిడ్చి చెబుతాడు.

హొర్హె లూయీ బోర్హెస్‌ ((Jorge Luis Borges) అర్జెంటీనా రాజధాని బ్యునోస్‌ ఐర్స్‌లో పుట్టాడు. తండ్రి లాయరు, సైకాలజీ బోధించేవాడు. ఆయనకు రచయిత కావాలని ఉండేది. కొంత రాసాడు కానీ పేరు తెచ్చుకోలేకపోయాడు. తండ్రి వల్ల కానిది కొడుకు చేస్తాడన్నది ఆ కుటుంబంలో పైకి ఎవరూ అనకపోయినా అందరూ అంగీకరించిన విషయం. బోర్హెస్‌ ఏడేళ్ళ వయసులోనే ఆస్కార్‌ వైల్డ్‌ కథను అనువదించాడు. అంతకన్నా ముందే సాహిత్య పఠనం ప్రారంభించాడు. తండ్రి లైబ్రరీలో అడుగు పెట్టడమే తన జీవితాన్ని మలుపుతిప్పిన గొప్ప సంఘటన అంటాడు బోర్హెస్‌. నానమ్మ ఇంగ్లాండు మనిషి కావటంతో, ఆమె నుంచి తండ్రికీ, తండ్రి నుంచీ బోర్హెస్‌కీ ఇంగ్లీషు సహజంగా వచ్చేసింది. మాతృభాష స్పానిష్‌ పుస్తకాల కన్నా ముందే ఇంగ్లీషు పుస్తకాలను చదివాడు. తర్వాతెపుడో ప్రసిద్ధ స్పానిష్‌ నవల ‘డాన్‌ కిహోటే’ని చదువుతుంటే, అంతకుముందే చదివిన ఇంగ్లీషు వెర్షన్‌కి ఈ మూలం నాసిరకం అనువాదంలాగ తోచిందట.

బోర్హెస్‌ తాతల తరంలో సైన్యంలో కల్నల్స్‌గా పనిచేసి యుద్ధాల్లో చనిపోయినవారున్నారు. తను మాత్రం ఇలా పుస్తకాల పురుగులాగ మారటం పట్ల బోర్హెస్‌కు కించపడేవాడు. ప్రాణాలకు విలువివ్వని వీరోచితమైన మనుషులంటే ఆకర్షణ ఆయనకు జీవితాంతం ఉంది. తనకు ఆ ధైర్యం లేదన్నది యవ్వనంలో ఆయన్ను వేధించేది. బోర్హెస్‌కు 15ఏళ్ళ వయస్సులో తండ్రికి కంటిచూపుకు వైద్యం చేయించ టానికని కుటుంబం జెనీవాకు వెళ్ళింది. ఇక్కడే ఆడవాళ్ళపై బెరుకుపోగొట్టడానికి తండ్రి స్వయంగా బోర్హెస్‌ను వేశ్య దగ్గరకు పంపించాడు. బోర్హెస్‌కు స్త్రీలతో ప్రేమ సంబంధాలు తక్కువే. 68ఏళ్ళ వయస్సులో చేసుకున్న పెళ్ళి మూడేళ్ళే నిలిచింది.

జెనీవాలో చదువుకుంటూ బోర్హెస్‌ లాటిన్‌, జర్మన్‌, ఫ్రెంచ్‌ భాషలను నేర్చుకున్నాడు. 22ఏళ్ళ వయస్సులో తిరిగి బ్యునోస్‌ ఐర్స్‌ చేరుకున్నాడు. బాల్యంలో వదిలి వెళ్ళిన నగరాన్ని యవ్వనంలో తిరిగివచ్చి కొత్త కళ్ళతో చూసాడు. నగరం మీద రాసిన కవితలతో 1923లో తొలి పుస్తకం పబ్లిష్‌ చేసాడు. అది మొదలు మరో పదేళ్ళలో ఏడు పుస్తకాలు పబ్లిష్‌ చేశాడు (నాలుగు వ్యాస సంపుటులు, మూడు కవితా సంపుటులు). మిత్రులతో కలిసి చాలా సాహిత్య పత్రికల్ని నడిపాడు. ఈ కాలంలో రాసిన పుస్తకాలన్నింటినీ బోర్హెస్‌ తర్వాతి కాలంలో తిరస్కరించాడు. ఒక ఫోజులాగా కారణంలేని దిగులును మీద వేసుకుని హామ్లెట్‌నూ రస్కోల్నికోవ్‌నూ ఒక మూసలో పోసినట్టు ఉండే వాడిననీ, అదే తన కవిత్వంలోనూ ప్రతిబింబించేదనీ తర్వాత చెప్పుకున్నాడు.

తనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన కథల్ని ఆయన 35ఏళ్ళు దాటాక గానీ రాయలేదు. కథలు రాయగలడని ఆయనపై ఆయనకే నమ్మకం ఉండేది కాదు. అందుకని తొలి కథల్ని ఎక్కడా లేని మనుషుల ఆత్మకథల్లాగా, లేని పుస్తకాలకు సమీక్షల్లాగా రాసాడు. తనే ఎడిటర్‌గా పనిచేసే ఒక సాహిత్య పత్రికలో ప్రచురించేవాడు. కథలు రాయగలనని నమ్మకం కుదరటానికి ఆయనకు జరిగిన ఒక ప్రమాదం కారణమైంది. బోర్హెస్‌కు తండ్రిలాగే కంటిచూపు మొదట్నించీ సరిగా ఉండేది కాదు.

ఒకసారి మెట్లు దిగివస్తూ జారిపడ్డాడు. ఆ పడటంలో ఏదో గట్టిగా తలకు తగిలి స్పృహ కోల్పోయాడు. రెండు వారాల పాటు బతుకుతాడో లేదో తెలియని అపస్మారక స్థితిలో గడిపాడు. కోలుకున్నాక, తానిక రచన చేసే శక్తిని కోల్పోయాడని అనిపించింది. ఒకసారి ప్రయత్నం చేయాలను కున్నాడు. కానీ అప్పటిదాకా కవిత్వమే ప్రాణంగా బతికి ఇప్పుడు అది రాయలేనని తెలిస్తే భరించ లేననీ, అలవాటులేని ప్రక్రియలో రాస్తే విఫలమైనా అంత బాధ ఉండదనీ ఒక కథ రాసాడు. ఆ కథ ‘పియర్రె మేనార్డ్‌: ఆథర్‌ ఆఫ్‌ కిహోటే’ ఆయనకు బాగా పేరుతెచ్చింది. తర్వాతిక అంతూపొంతూలేని గ్రంథాలయాల్నీ, మన ప్రపంచంలోకి చొరబడే వేరే ప్రపంచాల్నీ, మొత్తం ప్రపంచాన్ని అన్ని స్థలాల్లోనూ అన్ని కాలాల్లోను ఒకేసారి చూపెట్టగలిగే వస్తువుల్నీ, ఎడతెగక సాగే పుస్తకాల్నీ, అనేక విశ్వాల్నీ ఊహిస్తూ కథలు రాయటం ప్రారంభించాడు. ఫిక్కినోస్‌ (1949), ఎల్‌ అలెఫ్‌ (1952) పుస్తకాలు ఇంగ్లీషులోకి అనువాదమై ఆయనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.

1955లో బోర్హెస్‌ అర్జెంటినా జాతీయ లైబ్రరీకి డైరెక్టర్‌గా ఎంపికయ్యాడు. ‘‘నేను ఎప్పుడూ స్వర్గం ఒక లైబ్రరీలా ఉంటుందేమో అనుకుంటాను’’ అని చెప్పుకున్న బోర్హెస్‌కు ఇది చాలా చక్కగా అమిరే ఉద్యోగం. కానీ అప్పటికే ఆయన్ను అంధత్వపు చీకట్లు పూర్తిగా చుట్టుముట్టాయి. ‘‘దేవుడు నాకు పుస్తకాల్నీ రాత్రినీ ఒకేసారి ఇచ్చాడు’’ అని ఒక కవితలో రాసుకున్నాడు. ఈ అంధత్వం ఫలితంగా బోర్హెస్‌ వచన కవితల్ని పక్కనపెట్టి, ఛందోబద్ధమైన నిర్మాణాన్ని తీసుకున్నాడు. మనసులోనే అల్లగలిగే వీలు, ఆ అల్లికను జ్ఞాపకంలో దాచుకోగలిగే వీలు వచనం కన్నా పద్యానికే ఎక్కువ కాబట్టి, పద్యాలు ఎక్కువగా రాయటం మొదలుపెట్టాడు. అయితే కవిత్వం కన్నా బోర్హెస్‌కు ఆయన కథలే ఎక్కువ పేరు తెచ్చిపెట్టాయి. మనం వాస్తవంగా భావించి నిబ్బరంగా నడిచే మానవానుభవతలంపై మనల్ని బోల్తాకొట్టించే గుంతల్ని తవ్వుతాయి ఆ కథలు.

(ఆంధ్ర జ్యోతి వివిధలో)


July 23, 2018

రాబర్ట్ వాల్సర్ (1878-1956): రోజువారీ కవిత్వం

 ‘‘రాబర్ట్‌ వాల్సర్‌కి ఒక లక్షమంది పాఠకులు గనక ఉన్నట్టయితే ఈ ప్రపంచం ఎంతో బాగుపడేది,’’ అంటాడు ‘సిద్ధార్థ’ నవలా రచయిత హెర్మెన్‌ హెస్సే. అలాగని రాబర్ట్‌ వాల్సర్‌ కలంపట్టి ప్రపంచం బాగు కోసం పూనుకున్నవాడేం కాదు. బహుశా ఆయన్ని చదివి ఆనందించగలిగే పాఠకులు ఆయనలాగే ప్రపంచాన్ని పెద్ద ఫిర్యాదులేం లేకుండా, దాని దయను పెద్ద ఋజువులేం లేకున్నా నమ్ముతూ, దాన్ని మరీ గంభీర దృష్టితో కాకుండా పిల్లల తుంటరితనంతోను కుతూహలం తోను చూడగలరని హెర్మెన్‌ హెస్సే భావం అయ్యుండొచ్చు.

రాబర్ట్‌ వాల్సర్‌ (Robert Walser) స్విట్జర్లాండ్‌లో బెర్న్‌ అనే ప్రాంతంలో 1878లో పుట్టాడు. ఎనిమిదిమంది పిల్లల్లో ఒకడు. నాన్నకి ఒక స్టేషనరీ షాపు ఉంది. పదిహేనేళ్ళకే స్కూలు మానేసి చిన్నాచితకా ఉద్యోగాలు చేసాడు. కవిత్వం రాయటం మొదలుపెట్టాడు. 27 ఏళ్ళ వయస్సులో బెర్లిన్‌లో చిత్రకారుడిగా పనిచేస్తున్న అన్నయ్య దగ్గరికి వెళ్ళాడు. అక్కడ సేవకుల (బట్లర్‌) ఉద్యోగాలకోసం తర్ఫీదు ఇచ్చే స్కూల్లో చేరాడు. ఒక చోట బట్లర్‌గా పనిచేసాడు కూడా. కానీ రచనల ద్వారా వస్తున్న సంపాదనతో బతికేయవచ్చనిపించి ఆ పని మానేసాడు. విరివిగా చిన్నచిన్న వచన ఖండికలు రాసాడు. మూడు నవలలు రాసాడు. చాలా పేరూ వచ్చింది. అయితే నగర జీవితంలో కుదురుకోలేకపోయాడు. నిజానికి బెర్లిన్‌లో ఉండుంటే అక్కడి మేధావుల సర్కిల్‌లోకి సాదరంగానే వెళ్ళగలిగేవాడు, స్థాయికి తగ్గ పనేదో చేస్తూ బానే బతకగలిగేవాడు. కానీ- ఏమాత్రం సాహిత్య వాతావరణం లేని సొంత ఊళ్ళో తను జన్మతహ ఏ వర్గానికి చెందుతాడో వారి మధ్యనే ఉండటానికి ఇష్టపడ్డాడు. కొన్నాళ్ళు అక్కతోపాటు ఉన్నాడు. తర్వాత ఒంటరిగా చిన్న చిన్న అద్దె గదుల్లో బతకటం మొదలుపెట్టాడు.

మరోపక్క అతని రచనలకి డిమాండ్‌ తగ్గుతూ వచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధకాలంలోనూ, ఆ తర్వాతా- ప్రపంచాన్ని కవితాత్మక ధోరణిలో పరికించే వాల్సర్‌ తరహా రచనలకు ఆదరణ తగ్గింది. అతను మాత్రం రాయటం మానలేదు. తరుగుతున్న సంపాదనకు తగ్గట్టు ఖర్చులూ తగ్గించుకున్నాడు. కానీ సరైన దుస్తులు కూడా వేసుకోలేని స్థితికి వచ్చాకా, చుట్టుప్రక్కలవాళ్ళ చూపులు, ఈసడింపులు భరించటం కష్టమైంది. ఒక నవలలో చుట్టూ ఉన్న సమాజంలో కుదురుకోలేకపోతున్న ఒక పాత్ర గురించి వాల్సర్‌ ఇలా రాస్తాడు: ‘‘అతను ఎప్పుడూ మంద తప్పిన మేకపిల్లలా ఉండేవాడు. జనం బతకటం ఎలాగో నేర్పిద్దామని అతన్ని బాధ పెట్టేవారు. దానికి తగ్గట్టే ఏ రక్షణా లేనట్టు ఉండేవాడు. చెట్టు మీద మిగతా ఆకులకన్నా వేరేగా కనిపిస్తుందన్న కారణంగా పిల్లాడు కర్రతో కొట్టి తెంపేసే చిన్న ఆకులా ఉండేవాడు. ఇంకోలా చెప్పాలంటే, రండి నన్ను బాధపెట్టండి పిలుస్తున్నట్టు.’’

గడవటం అంతకంతకూ కష్టం కావటంతో ఉద్యోగంలో చేరాడు కానీ ఎన్నాళ్ళో నిలుపుకోలేకపోయాడు. బాగా తాగేవాడు. రాత్రుళ్ళు నిద్రపట్టేది కాదు. చెవుల్లో ఎవరో మాట్లాడుతున్నట్టు, అరుస్తున్నట్టు వినిపించటం మొదలైంది. పిడుగులు పడుతున్నట్టు, ఎవరో పీక నులిమేస్తున్నట్టు భ్రమలు పెరిగాయి. ఆత్మహత్యకూ విఫలయత్నం చేశాడు (‘‘నాకు కనీసం ఉరితాడు పేనుకోవటం కూడా చేతకాదు’’). చివరకు తన్ను తాను సంభాళించుకునే స్థితిలో లేడనిపించింది. అక్క సలహాతో 1928లో యాభయ్యేళ్ళ వయసులో ఒక మానసిక చికిత్సాలయంలో చేరాడు.

అదిమొదలు, అలాంటి చికిత్సాలయాల్లోనే దాదాపు పాతికేళ్ళ పాటు, చనిపోయేవరకూ జీవితాన్ని గడిపేసాడు. నిజంగా అతని మతి చెడిందా లేదా అన్నది ఇప్పటికీ ఎవరికీ నికరంగా తెలీదు. ఆయన ఆ తర్వాత రాసిన రచనల్లో అందుకు సూచలేం కనపడవు. డాక్టర్లు కూడా ఒక సందర్భంలో కొన్నాళ్ళు బయట గడిపి చూడమని సలహా ఇచ్చారు. కానీ తన ఇష్టాయిష్టాల్తో నిమిత్తం లేకుండా ఒక పద్ధతి ప్రకారం సాగిపోయే ఈ జీవితమే వాల్సర్‌కి నచ్చింది. ‘‘ఆసుపత్రిలో నాకు కావాల్సిన నిశ్శబ్దం దొరుకుతోంది. ఉన్నా లేనట్టే ఎవరికీ కనిపించకుండా మాయమైపోగలుగుతున్నాను’’ అని చెప్పుకున్నాడు.

ఆసుపత్రికి వచ్చే వంటసరుకుల్ని సర్దటం, ఉత్తరాల్ని విడదీయటం, కాయితం సంచుల్ని తయారు చేయటంలాంటి పనులుచేస్తూ ఉండేవాడు. ఇవి లేనప్పుడు బయట నడవటానికి పోయేవాడు. నడవటం అంటే వాల్సర్‌కి ఎంత పిచ్చి ఇష్టమంటే, ఊళ్ళకు ఊళ్ళు దాటి అలా నడుస్తూనే ఉండేవాడు. 1956లో క్రిస్మస్‌ రోజున ఇలాగే బయల్దేరి నడుస్తూనే మంచులో కుప్పకూలిపోయాడు. అప్పుడు పోలీసులు తీసిన ఫోటోలు కొన్ని ఆయన ఆఖరి క్షణాల్ని చూపెడతాయి. మంచులో కొంతదూరం సాగిన ఒక జత పాదముద్రల చివర వాల్సర్‌ శవం ఉంటుంది.

వాల్సర్‌ రచనల్ని అభిమానించిన, ఆయన శైలి నుంచి ఎంతో కొంత అందిపుచ్చుకున్న మరో ప్రసిద్ధ జర్మన్‌ రచయిత ఫ్రాంజ్‌ కాఫ్కా చనిపోయాకా తన రచనల్ని కాల్చేయమని స్నేహితుడికి చెప్పాడు. అయినా స్నేహితుడు కాల్చడనీ, తన రచనలు బయటి ప్రపంచాన్ని ఎలాగో చేరతాయనీ ఆయనకు ఏమూలో నమ్మకం వుండేవుంటుంది. కానీ అసలు బయట ఎవరైనా చదువుతారన్న స్పృహలేకుండా అచ్చంగా తన కోసమే రాసుకున్న రచయితలు ఎవరన్నా ఉంటే వాల్సర్‌ ఆ అరుదైన సమూహంలో ఒకడని అనిపిస్తుంది. ఎందుకంటే పిచ్చాసుపత్రిలో చేరాకా కూడా వాల్సర్‌ రాస్తూనే ఉన్నాడు. పెన్ను వాడటం మానేసి త్వరగా చెరిగిపోయే పెన్సిల్‌తో రాయటం మొదలుపెట్టాడు. ఆలోచనతో పోటీపడి వేగంగా రాసేందుకు తనే ఒక సొంత షార్ట్‌హేండ్‌ శైలిని తయారు చేసుకున్నాడు. ఆయన చనిపోయాకా ఇలా క్లుప్తం చేసిన పదాలతో, చిన్ని చిన్ని అక్షరాల్లో ఇరికించి రాసిన వందల కాయితాలు బయటపడ్డాయి. ముప్ఫైపేజీల్లో ఒక నవల రాసేడంటే ఎంత ఇరికించి రాసేవాడో అర్థం చేసుకోవచ్చు. ఈ రాతనీ, ఆయన షార్ట్‌హాండ్‌ శైలినీ డీకోడ్‌ చేయటానికే పబ్లిషర్స్‌కు చాలా ఏళ్ళు పట్టింది. వీటిని ‘మైక్రోస్ర్కిప్ట్స్‌’ పేరిట ఈమధ్యనే ప్రచురించారు.

వాల్సర్‌ జీవితమంతా దిగులుతోవలోనే గడిచినా, ఆయనకి ప్రపంచంపై అక్కసేమీ ఉన్నట్టు రచనల్లో కనిపించదు. పైగా అదంటే ఎంత ఇష్టమంటే, రాన్రానూ అందులోంచి ఒక కథ పుట్టించాల్సి రావటం కూడా దాన్ని నేరుగా కావలించుకునేందుకు ఒక అడ్డమే అయింది. కథల మీద తన అయిష్టత గురించి ఇలా చెప్పుకొచ్చాడు: ‘‘కథని బాగా అల్లటంలో ఆరితేరినవాళ్ళన్నా, ప్రపంచంలో ఎవర్నైనా సరే పాత్రలుగా తీసేసుకోగలిగే రచయితలన్నా నేను చప్పున దూరం జరుగుతాను. రోజువారీ విషయాల్ని మచ్చిక చేసుకుంటే చాలు, బోలెడు కవిత్వాన్ని విరజిమ్మే అందమూ, ఐశ్వరమూ వాటికి ఉన్నాయి.’’ వాల్సర్‌ వచన ఖండికలు చాలావరకూ అటు కథా కాదు, ఇటు వ్యాసమూ కాదన్నట్టు సాగుతాయి. బయోగ్రాఫికల్‌ స్కెచెస్‌ అనవచ్చు. ఎవరో తీరుబడిగా నడుస్తూ కాలక్షేపం కోసం మనసులో కల్పించుకునే ఉబుసుపోని ఊహలన్నింటినీ అప్పటికప్పుడు వాక్యాల్లోకి తర్జుమా చేసినట్టు ఉంటాయవి. కుతూహలంతో మెరిసే రెండు కళ్ళు ప్రపంచాన్ని ఆత్మీయంగా దర్శిస్తున్నట్టు ప్రతి వాక్యంలోనూ తెలుస్తుంది.

(ఆంధ్ర జ్యోతి వివిధలో)


July 16, 2018

ఆంద్రె బెలీ (1880-1934) పరిచయం: ప్రపంచమనే సంకేతాల అడవిలో...

 రష్యాలో 1890ల్లో జార్‌ చక్రవర్తులకు వ్యతిరేకంగా తిరుగు బాట్లు చెలరేగిన కాలానికీ, 1917లో రష్యన్‌ విప్లవం సఫలమై సోవియట్‌ రాజ్యం ఏర్పడిన కాలానికీ మధ్య- ఆ దేశ సాహిత్యం దాదాపు ఒక ముప్ఫయ్యేళ్ళ పాటు మరో ప్రభావానికి గురైంది. అదే సింబాలిజం.

అటు ప్రపంచమంతా హేతువు ప్రకారం నడుస్తుందని నమ్మే విప్లవకారులకూ, ఇటు ప్రపంచానికి అర్థమంతా బైబిలు పేజీల్లో దొరికేస్తుందని నమ్మే సంప్రదాయవాదులకూ మధ్య ఒక సంశయాత్మక తరంగా ఈ సింబాలిస్టులు పుట్టారు. వీరు సృష్టి రచనకు ఏ సులభమైన తాత్పర్యాన్ని ఒప్పుకోలేదు. ప్రపంచాన్ని అర్థంకాని మర్మాలతో, నిగూఢ సంకేతాలతో (సింబల్స్‌తో) నిండినదిగా చూశారు. రష్యన్‌ విమర్శకుడు మిర్‌స్కీ- సింబాలిజానికి సాహిత్యపరమైన మూలాల్ని ఫ్రెంచ్‌ కవి బాదిలేర్‌ కవిత నొకదానిలో చూడవచ్చని అంటాడు. ‘కరెస్పాండెన్సెస్‌’ అనే ఈ కవితలో మొదటి పంక్తులు ఇలా సాగుతాయి: ‘‘ఈ ప్రకృతి గుడిలో సజీవమైన స్తంభాలు/ ఉండుండి ఏదో గొణుగుతాయి/ మనిషి సంకేతాల అడవిలోంచి నడుస్తాడు/ అవన్నీ అతని వైపు ఎరిగున్నట్టు చూస్తాయి’’. సింబాలిస్టుల దృష్టిలో ప్రపంచం ఇలా నిగూఢ సంకేతాలతో కిక్కిరిసిన ఒక అడవి.

ఆంద్రె బెలీ (Andrei Bely) ఈ సింబాలిస్టుల తరానికి చెందినవాడే. బెలీ మొదట్లో ఎక్కువ కవిత్వం రాసాడు. సింబాలిస్టులందరిలాగే బెలీ కూడా సాహిత్యాన్ని సంగీతానికి చేరువ చేయాలనుకున్నాడు. ఆయన దృష్టిలో పదాలు కేవలం అర్థాన్ని సూచించే సంకేతాలు మాత్రమే కాదు. అవి తమ రూపం ద్వారా, శబ్దం ద్వారా కూడా భావ ప్రసారాన్ని చేయగలవు. పదాలకున్న అర్థ, రూప, శబ్దాల ఈ త్రిముఖ స్వరూపాన్ని పూర్తిగా వాడుకొనేందుకు బెలీ ప్రయత్నించాడు. మిగతా సింబాలిస్టులు ఈ ధోరణిని తమ కవిత్వానికే పరిమితం చేసుకోగా, బెలీ తన నవలల్లో కూడా ఇదే ధోరణిని అనుసరించాడు.

బెలీ ప్రసిద్ధ నవలలు ‘ద సిల్వర్‌ డోవ్‌’, ‘కోతిక్‌ లెతేవ్‌’, ‘పీటర్స్‌బర్గ్‌’ ఈ మూడూ రష్యన్‌ వచన సాహిత్యాన్ని చాలా ప్రభావితం చేసాయి. వీటిలో ‘పీటర్స్‌బర్గ్‌’ను బెలీ మాస్టర్‌పీస్‌గా చెబుతారు. 1905లో జరిగే ఈ కథలో జార్‌ చక్రవర్తుల కోసం పనిచేసే ఒక అధికారిని చంపటానికి అతని కొడుకు చేతికే బాంబ్‌ ఇస్తారు విప్లవకారులు. కథ పైకి రాజకీయంగా కనిపించినా, తండ్రిని చంపటానికి కొడుకు పడే మీమాంసే ఎక్కువ పేజీలుంటుంది. పీటర్స్‌బర్గ్‌ నగరం కూడా కథ అంతటా ఒక పాత్రలా పరచుకొని ఉంటుంది.

బెలీ బోల్షెవిక్‌ విప్లవాన్ని మనస్ఫూర్తిగా సమర్థించాడు. విప్లవం తర్వాత రష్యాలో ఒక తాత్త్విక, పారమార్థిక పునరుజ్జీవనం జరుగుతుందని ఆశించాడు. ఆ దిశగా ఉత్సాహంతో కొంత కాలం పనిచేసాడు కూడా. అయితే సోవియట్‌ సాహిత్యానికి బెలీ లాంటి రచయితల అవసరం లేకపోయింది. 1932లో సోవియెట్‌ ప్రభుత్వం- రచయితలు సమాజం గురించి వాస్తవిక (రియలిస్ట్‌) శైలిలో మాత్రమే రాయాలనీ, ఆ రచనలనే ఆమోదిస్తామనీ అధికారి కంగా ప్రకటించింది. అంటే అందరూ గోర్కీ ‘అమ్మ’ లాంటి నవలలే రాయాలి. కమ్యూనిస్టు విలువల్ని ఎత్తిచూపాలి. ఫ్యాక్టరీ గొట్టాల్నీ, శ్రామికుల చెమటనీ గొప్పగా చూపించాలి. హేతువుతో సరిపోల్చు కోదగ్గ వాస్తవిక శైలికి ఏమాత్రం దూరం జరిగినా ఆ రచనను బూర్జువా బడాయిగా తీసిపారేసేవారు. ఆ రచయితలకు ఆదరణ లేదు, వారి రచనలు ఎవరూ ప్రచురించరు. ఈ స్థితిని వ్యతిరేకించి రాసినవారిని చంపే శారు. మరికొందరు రాయలేనితనం భరించలేక బతికుండీ నిర్జీవులయ్యారు. బెలీ అదృష్టవశాత్తూ 1934లోనే చనిపో యినా, అతని రచనలు మాత్రం అప్రకటిత నిషేధానికి గురయ్యాయి. అతని రచనలే కాదు; వాటి మీద విమర్శలు గానీ, అతని మీద జీవిత చరిత్రలు గానీ రాయటానికి వీల్లేకుండాపోయింది. మరణం తర్వాత దాదాపు ముప్ఫయ్యేళ్ళ పాటు ఆయన పేరు అటు మాతృభూమిలోనూ, ఇటు బయటి ప్రపంచంలోనూ మరుగునపడిపోయింది.

1965లో ప్రముఖ రష్యన్‌ అమెరికన్‌ రచయిత వ్లదిమిర్‌ నబొకొవ్‌ ఒక అమెరికన్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘‘నా దృష్టిలో ఇరవయ్యొవ శతాబ్దపు వచనంలో అద్భుతమైన మాస్టర్‌పీసెస్‌ ఇవి- జేమ్స్‌ జాయ్స్‌ ‘యులిసెస్‌’, కాఫ్కా ‘మెటమార్ఫసిస్‌’, బెలీ ‘పీటర్స్‌బర్గ్‌’, ఇంకా ప్రూస్ట్‌ ఫెయిరీటేల్‌ ‘ఇన్‌ సెర్చ్‌ ఆఫ్‌ ఎ లాస్ట్‌ టైమ్‌’లో మొదటి సగం’’ అన్నాడు. అప్పటికే నబొకొవ్‌కు కేవలం ‘లొలిటా’ నవలకు రచయితగానే కాక, తన మాతృభూమి రష్యాకు చెందిన సాహిత్యంపై నిశితమైన పరిశీలన కలవాడిగా గుర్తింపు ఉంది. ఆయనిక్కడ పేర్కొన్న పేర్లలో జాయ్స్‌, కాఫ్కా, ప్రూస్ట్‌లకు అప్పటికే ఆధునిక సాహిత్యంలో విలువైన స్థానం ఉంది. దాంతో వీళ్ళందరి మధ్యనా కొత్తగా ఈ బెలీ ఎవరా అని చాలామందికి కుతూహలం కలిగింది. ఫలితంగా ఆయన రచనల అనువాదాలు మొదలయ్యాయి. అయితే బెలీ బాషను వాడిన పద్ధతి ఆయన రచనల్ని అనువాదానికి లొంగనివిగా చేసింది. జేమ్స్‌ జాయ్స్‌ ‘యులిసెస్‌’ నవలను వేరే భాషలోకి అనువదిస్తే ఎంత సారం పోతుందో, బెలీ ‘పీటర్స్‌బర్గ్‌’ను ఇంగ్లీషులోకి అనువ దించినా అంతే పోతుంది. ఈ రెండు నవలలకు మధ్య భాషపరంగాను, శైలిపరంగాను, పాత్రలపరంగానూ చాలా పోలికలు ఉండటాన్ని విమర్శకులు గమనించారు (బెలీ పుస్తకం ‘యులిసెస్‌’ కన్నా తొమ్మిదేళ్ళ ముందే ప్రచురి తమైంది). ‘యులిసెస్‌’ను ఇంగ్లీషులో రాయటం వల్ల జాయ్స్‌ ఆధునిక సాహిత్యానికి ఆద్యుడుగా గుర్తింపు పొందాడు. అంతే గొప్ప పుస్తకాన్ని రష్యన్‌ భాషలో రాసి బెలీ ఇప్పటికీ ఎవరో కొద్దిమందికి తప్ప తెలియనివాడుగా మిగిలాడు.

(ఆంధ్ర జ్యోతి 'వివిధ'లో)


July 9, 2018

మార్సెల్ ప్రూస్ట్ (1871-1922) పరిచయం: పోగొట్టుకున్న కాలాన్ని వెతుక్కొంటూ...

 పశ్చిమ దేశాల సాహిత్యంలో ఏ విమర్శకుడైనా జ్ఞాపకం (మెమొరీ) గురించి ఏదైనా మాట్లాడదల్చుకుంటే ఒక్కసారైనా ప్రూస్ట్‌ని తలచుకోవాల్సిందే. అలాగే జ్ఞాపకాల ఆధారంగా రాయదలచ్చుకున్న ఏ రచయితైనా ప్రూస్ట్‌ని అప్పటికే చదివుంటే ఆ ప్రభావంతో పెనుగులాడాల్సిందే. ప్రూస్ట్‌ జ్ఞాపకాన్ని ఇతివృత్తంగా తీసుకుని మొత్తం జీవితాన్నే మరలా పేజీ మీద ఆడించినంత పని చేసాడు. ఆ ఆటను బూతద్దంలో చూసినంత దగ్గరగా చూపించాడు. అయితే ప్రూస్ట్‌ ఉద్దేశంలో, తలచుకుంటే స్ఫురించే జ్ఞాపకాలకు పెద్ద విలువ లేదు. అలాగాక, ఏదో బయటి ప్రభావం వల్ల అనుకోకుండా మనలో పునర్జీవితమై గతాన్ని పూర్ణసారంతో సాక్షాత్కరింపజేసేదే విలువైన జ్ఞాపకం. దీన్ని ‘ఇన్‌వాలంటరీ మెమొరీ’ అన్నాడాయన. అంటే అప్రయత్నంగా తట్టే జ్ఞాపకం. మొదటి రకం జ్ఞాపకం మహఅయితే గతంతో ముడిపడివున్న స్థల కాలాదుల్ని దృశ్య రూపంలో స్ఫురింపజేస్తుంది. కానీ రెండో రకం జ్ఞాపకం మాత్రం గతాన్ని అనుభవించినప్పటి తీవ్రతతోనే స్ఫురింపజేస్తుంది. ఈ తరహా జ్ఞాపకాలు అసలు మనలో ఉన్నాయని కూడా మనకు తెలీదు. మనం కూర్చుని గుర్తు చేసుకుందామని ప్రయత్నిస్తే అవి గుర్తు రావు. గతంతో సంబంధం ఉన్న ఏదో వాసన సోకినపుడో, ఎప్పుటిదో ఒక రుచి మరలా నాలికపై తాకినపుడో, ఒకప్పుడు బాగా ఎరిగుండి తర్వాత మరచిపోయిన వైనమేదో దృశ్యంగా కనులకు తారసిల్లినపుడో... అప్పుడు ఆ జ్ఞాపకం ఒక మెరుపులా మన అంతరంగ గగనంపై వెలుగుతుంది. వర్తమానం మాయమైపోతుంది. కాలాల అవతల్నించి ఎవరో పిలిచినట్టు ఒక్క క్షణం అయోమయంలో పడతాం. గతం తాలూకు అసలైన సారం ఈ ‘ఇన్‌వాలంటరీ మెమొరీ’లోనే ఉంటుందంటాడు ప్రూస్ట్‌. మనిషి మానసిక ప్రవృత్తిలో ఎంతో ముఖ్యమైన ఈ అంశాన్ని ఎత్తిచూపింది ఎవరో సైకాలజిస్టు గాక, ఒక రచయిత కావటం ఆశ్చర్యం.

‘ఇన్‌ సెర్చ్‌ ఆఫ్‌ ఎ లాస్ట్‌ టైమ్‌’ (పోగొట్టుకున్న కాలాన్ని వెతుక్కొంటూ..) అనే ప్రూస్ట్‌ ప్రసిద్ధ నవలలో నేరేటర్‌ ఒక మధ్యాహ్నం టీ తాగుతూ, ‘మేడెలేన్‌’ అని ఫ్రెంచ్‌వారు పిలిచే ఒక రకం కేకు ముక్కని టీలో నంజుకుంటాడు. ఆ కేక్‌ రుచి నాలిక మీద తగలగానే బాల్యంలో అదే కేకును తన బంధువు ఒకావిడ ఇంట్లో తినటం గుర్తొస్తుంది. దాంతో పాటే బాల్యపు జ్ఞాపకాలు, అది వరకూ తనకు గుర్తులేనివి, ఒక ఉధృతిలాగా నేరేటర్‌ని ముంచెత్తుతాయి. అలా మొదలవుతుంది ఏడు సంపుటాల ఈ బృహత్‌ నవల. ‘‘గతాన్ని గుర్తు తెచ్చుకోవటమనేది ఒక వృథా ప్రయాస. అందుకోసమై మన బుద్ధి చేసే ప్రయత్నాలన్నీ ఎప్పుడూ విఫలమే అవుతాయి. మన గతం అంతా మన బుద్ధికి అందకుండా ఏదో బయటి వస్తువులో, ఆ వస్తువు మన గ్రహణేంద్రియాలకు ఇవ్వగల స్ఫురణలో దాగి వుంటుంది. ఆ వస్తువు మనకు తారసిల్లుతుందా లేక ఈలోగానే మనం చనిపోతామా అన్నది మన చేతుల్లో లేదు’’ అని అంటాడు నేరేటర్‌, ఈ మేడెలేన్‌ కేకు గురించి. ఇలా కాలాన్ని దాని అంతస్సారంతో సహా పట్టుకోగలిగే శక్తి మరలా ఒక్క కళకు (ముఖ్యంగా సాహిత్యానికి) మాత్రమే ఉన్నదన్నది ప్రూస్ట్‌ అభిప్రాయం.

మార్సెల్ ప్రూస్ట్‌ (Marcel Proust) ఫ్రాన్సులో సంపన్న కుటుంబంలో పుట్టాడు. డాక్టరైన తండ్రితో పెద్దగా అనుబంధం లేదు. తల్లికి మాత్రం చాలా చేరువ. చిన్నతనం నుంచీ ఉబ్బసం వ్యాధి వల్ల అర్భకంగా పెరిగాడు. హోమో సెక్సువల్‌ అని చాలామందికి అనుమానం. యవ్వనాన్నంతా ఆ రోజుల్లో సంపన్న కుటుంబాలు తరచు ఇచ్చి పుచ్చుకునే విందు వినోదాల్లో పాల్గొంటూ ఖర్చు చేసేసాడు. ఇరవై నాలుగేళ్ళ వయస్సులో ఎంతో ఆర్భాటంగా చాలా ఖర్చుతో మొదటి పుస్తకాన్ని ప్రచురించాడు. అయితే అది అతనికి పేరు తేలేదు. తర్వాత తనదైన కళా దృక్పథం ఏర్పరుచుకొనే ప్రయత్నంలో పదేళ్ళ కాలాన్ని చదవటానికీ, చిత్రకళని ఆస్వాదించటానికీ ఖర్చు చేసాడు. జాన్‌ రస్కిన్‌ కళా సిద్ధాంతాలు అతన్ని బాగా ప్రభావితం చేసాయి. ఇంటిపట్టున తల్లిదండ్రుల నీడలో జీవితం సాఫీగా సాగిపోతున్న సందర్భంలో 1903లో తండ్రి, 1905లో తల్లి చనిపోయారు. తల్లి చనిపోయిన విషాదం అతన్ని చాలా ఏళ్ళ పాటు పీడించింది. 1909లో ముప్ఫై ఎనిమిదేళ్ళ వయస్సులో తన ప్రసిద్ధ నవల ‘ఇన్‌ సెర్చ్‌...’ను మొదలుపెట్టాడు. 51 ఏళ్ళ వయస్సులో చనిపోయే వరకూ ఈ నవల రాస్తూనే వున్నాడు. 1913లో మొదటి సంపుటం ప్రచురితమైంది. ఈలోగా అతని ఆరోగ్యం కూడా క్షీణించసాగింది. నవల రాయకుండానే చనిపోతానేమోనన్న భయంతో చివరి మూడేళ్ళూ తనను తాను ఒక గదిలో బంధించుకున్నాడు. బయటి నుంచి శబ్దాలు వినిపించకుండా బెండు అమర్చిన గోడలతో కట్టిన గది అది. అన్నపానాదులు సమకూర్చి పెట్టడానికి ఒక హౌస్‌కీపర్‌. పగలంతా పడుకుని రాత్రుళ్ళు మేల్కొని తన నవల రాశాడు. మామూలుగా రచయితలు చిత్తుప్రతిని సాఫుచేస్తున్నప్పుడు అనవసరమనిపించి కొంత తీసేస్తారు. కానీ ప్రూస్ట్‌ మాత్రం అంతకంతకూ పెంచి రాసే వాడు. అలా పెంచిన వాక్యాల్ని వేరే కాగితాలపై రాసి వాటిని జత చేయాల్సిన చోట అంటించేవాడు. ఇలాంటి అంటింపులతో ఈ నవల ముద్రణలో మూడు వేల పేజీలకు పైగా చేరింది. నవల చివరి కొన్ని సంపుటాలు ఇంకా సరిదిద్దుతూనే చనిపోయాడు. ఇంతకీ ఈ నవల్లో కథ ఏమిటి? ఈ నవల రాయగల స్థాయికి ప్రూస్ట్‌ (నేరేటర్‌) చేరుకోవటమే నవల్లోని కథ. ఒక్కోసారి పేజీ కూడా దాటేసేంత పొడవుండే ప్రూస్ట్‌ శైలికి పాఠకుడు అలవాటు పడటం కష్టం కాని, అలవాటైతే ఇదే సాహిత్యం చేరగల అవధి ఏమోననిపిస్తుంది.

చాన్నాళ్ళ క్రితం ఒక వెబ్‌సైట్‌ ప్రూస్ట్‌ జీవితాన్ని రెండు మూడు వాక్యాల్లో కుదించి చెప్పమని ఒక పోటీలాగా పెట్టింది. అందులో ఒకరు ఇలా రాశారు: ‘‘జీవితమంతా విందు వినోదాల్లో వృథా చేసుకున్నాడు. చివర్లో వృథా అయిన రోజుల గురించి ఒక పెద్ద నవల రాసి జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు’’.

(ఆంధ్రజ్యోతి 'వివిధ'లో...)