ఆదివారం కాబట్టి ఓల్డుమాంకు క్వార్టరూ, అరకిలో చికెనూ గదికి తెచ్చుకున్నాడు రాములు. మందులోకి పావుకిలో ఫ్రై చేసుకున్నాడు, ఇంకో పావుకిలో అన్నంలో కలుపుకుతింటానికి వండుకుందామనుకున్నాడు. ఉల్లిపాయలు తరుగుతుండగా, తలుపు తోసుకుని లోపలికి వచ్చాడు మల్లేషన్న. లక్కపిడతల గదిలోకి రాక్షసాకారం దూరినట్టుంది.
రాములు పని ఆపి ఇటు తిరిగాడు. “అన్నా, ఇలా వచ్చావ్? కూచో” అంటూ గదిలో ఉన్న ఒక్క రేకు కుర్చీ అటు జరిపాడు.
మల్లేషన్న కూర్చున్నాడు. అతని మొహం రాయిలాగా గరుగ్గా ఉంది. వేసుకున్న తెల్లచొక్కా బానపొట్ట మొదలయ్యేదాకా బొత్తాలు విప్పి వుంది. అక్కడ రుద్రాక్షమాల వేలాడుతోంది. మణికట్టుకి కాశీతాడు, కడియాలు.
“చికెను పీసులున్నయి తింటవా?” అన్నాడు రాములు.
“బాలాజీ గాన్ని తీస్కపోయిర్రు,” అన్నాడు మల్లేషు. అది వార్త చెప్తున్నట్టు లేదు, నిలదీస్తున్నట్టుంది.
“ఎవరే!” అన్నాడు రాములు.
“నీకు తెల్వదా?” ఒక కనుబొమ్మ పైకిలేపుతూ అన్నాడు మల్లేషు.
“నాకెట్ల తెలుస్తదన్నా. సండే మనం గది దాటిపోం,” అంటూ చికెను పీసులున్న కంచం అతని చేతికందియ్యబోయాడు రాములు.
“నీ యవ్వ నకరాలూ!” అంటూ విసిరికొట్టేసరికి కంచం ఎగిరి గోడకి తగిలి కిందపడింది.
రాములు తుళ్ళిపడ్డాడు. కంచం గింగిరాలు తిరుగుతున్న శబ్దానికి మొహం చిట్లిస్తూ, “ఏమైందన్నా!” అన్నాడు.
మల్లేషు కుర్చీలోంచి ఇంతెత్తున లేచి గుద్దుకునేంత దగ్గరగా వచ్చాడు. వెనక్కి అడుగేస్తున్న రాముల్ని కాలర్ పట్టుకుని దగ్గరగా గుంజుకున్నాడు. ఇద్దరి ఎత్తుల్లో తేడా వల్ల రాములు కాలి వేళ్ళ మీద నిలబడాల్సి వచ్చింది. “రేయ్… ముసల్నాకొడకా. గలీజు మాటలు రానీకు. బాలాజీగాన్ని రాత్రి పోలీసులు పట్టుకున్నరు. గది గుడ సరుకు దాచిన కాడ్నే పట్టుకున్నరు. అక్కడ దాచిపెట్టినమని బయటోనికెవ్వనికి తెల్వదు. నీకు తప్ప.”
రాములు బట్టతల మీంచి చెమటచుక్కలు జరజర జారిపోతున్నాయి. “అన్న! నేనెవ్వరికి చెప్పలేదే. ఒట్టే–”
“థూ నీ!” అంటూ కాలర్ వదుల్తూనే విసురుగా ముందుకు నెట్టడంతో రాములు నేల మీద పడ్డాడు. “రేయ్, పోలీసోళ్ళ దగ్గరికెళ్ళింది నువ్వో కాదో నాకు ఇంకా ష్యూర్ గా తెల్వక ఆగుతున్నా సూడు. ఒకడు తప్పు జేసిండని సక్కంగ తెల్వకుండ నేను వాని జోలికి పోను. నువ్వో కాదో తెల్వనీకి నాకు పెద్ద టైం పట్టదు. కానీ నువ్వేనని తెల్సిందే అనుకో…,” అని ఆగి, పొత్తికడుపు దగ్గర చొక్కా పైకెత్తాడు. అక్కడ పొట్టకీ, బెల్టూకీ మధ్య ఇరికి ఒక కత్తి పిడి కనిపించింది.
రాములు చూపు అక్కడే ఆగిపోయింది.
మల్లేష్ నాలిక మడతపెట్టి చూపుడువేలు ఆడిస్తూ వెనక్కి తిరిగి వెళ్లాడు. వెళ్తూ తలుపు పక్కన నీళ్ళ కుండని పచ్చడిగా తన్నేసి వెళ్ళిపోయాడు.
రాములు పడిన చోట నుంచి లేచి కూర్చున్నాడు. అతని వొళ్ళు వణకుతోంది. మొన్న జేమ్స్ ప్రసాద్ గాడి శవాన్ని మోసుకొస్తున్నప్పుడూ ఇలాగే వణికింది. జేమ్స్ ప్రసాదు గాడి పెళ్ళాం వాడు కనపడటం లేదని గగ్గోలు పెడితే రాములూ ఇంకో ఇద్దరూ కలిసి రోజంతా వెతికారు. రైలు పట్టాల పక్కన తుప్పల్లో జేమ్స్ ప్రసాద్ శవం దొరికింది. మెడ తెగ్గోయడంతో తల ఓపక్కకి అసహజంగా ఒరిగింది. రక్తం కంకర్రాళ్ల మీద నల్లగా ఎండిపోయింది. ఈ జేమ్సు ప్రసాద్ చనిపోక రెండ్రోజుల ముందు కల్లుకంపౌండులో ఇదే మల్లేష్ తమ్ముడైన బాలాజీతో గొడవపడ్డాడు. చివర్లో పోలీసులకి రిపోర్టిస్తానని బెదిరించి దూకుడుగా బయటకు వచ్చేశాడు. ఇంతాజేసి పోలీస్టేషన్ వైపు పోయిందీ లేదు పాడూ లేదు. కానీ, అన్నదమ్ములు రిస్కు తీసుకోదల్చుకోలేదు.
అప్పట్నించీ జేమ్సు ప్రసాద్ శవం రాములుకి పదే పదే గుర్తుకు వస్తోంది. వచ్చినప్పుడల్లా భయంతో బుర్రేం పన్చేయటం లేదు. ఇందాక మల్లేష్ ముందు కూడా అదే పరిస్థితి. లేదంటే తను అమాయకుణ్నని నిరూపించుకునేవాడే.
రాములు నెమ్మదిగా పైకి లేచి నేల మీద పడ్డ చికెను ముక్కలన్నీ కంచంలోకి ఎత్తుకున్నాడు. వంటగట్టు మీదున్న మందు బాటిలూ, స్టీలుగ్లాసూ తీసుకుని నీళ్ళ కోసం కుండ వేపు వెళ్ళబోయినవాడల్లా పగిలిన పెంకులు చూసి ఆగిపోయాడు. గొణుక్కుంటూ ఉల్లిపాయల కడుగునీళ్ళున్న దాక తీసుకుని గది మూలకి పోయి కూర్చున్నాడు. అక్కడేం లేకపోయినా గోడ వైపే చూస్తుండిపోయాడు. జేమ్సు ప్రసాద్ గతే తనకూ పడుతుందా! చటుక్కున లేచి తలరుద్దుకుంటూ అటూయిటూ పచార్లు చేశాడు. కాసేపటికి తాను ఊరికే పచార్లు చేస్తున్నానని గుర్తొచ్చి మళ్ళీ మూలకొచ్చి కూర్చున్నాడు. పెగ్గు కలుపుకుని, గుటకేసి, గోడకి తల జారేసి కళ్ళు మూసుకున్నాడు. ఆ చీకట్లో ఒక నిజం ముందుకి తన్నుకొచ్చి నిలబడింది. అవును, తను మళ్ళీ ఇక్కడ్నించీ పారిపోబోతున్నాడు! జీవితమంతా పరిగెట్టినట్టే మళ్ళీ పరిగెట్టబోతున్నాడు! ముప్ఫయ్యేళ్ల క్రితమే వెనకడుగు వేయకుండా ఉంటే ఇప్పుడు ఎదిరించి నిలబడగలిగే ఒక అవకాశం అయినా ఉండేది.
ముప్ఫయ్యేళ్ళ క్రితం వైజాగ్ రెల్లి వీధిలో ఒక పేకాట పాకలో గొడవ పెద్దదైంది. గొడవకొచ్చిన వాడు చేపలపడవ మీద కళాసి. మాటా మాటా పెరిగింది. ఇద్దర్నీ ఎగదోయడానికి జనం చుట్టూ చేరడంతో కొట్టుకోవడానికి ఒక చిన్న గోదా లాంటి స్థలం కూడా తయారైంది. రాములు ఎదురుతిరగడానికీ, వెనక్కితగ్గడానికీ మధ్య ఊగిసలాడుతున్నాడు. సరిగ్గా అప్పుడే కళాసీ పంట్లాం వెనుక నుంచి కత్తి తీశాడు. దూలానికి వేలాడుతున్న గుడ్డిబల్బు కాంతిలో తళుక్కుమన్న దాని మొన రాములు జ్ఞాపకంలో ఇంకా వెలుగుతోంది. అది తనలో ఏదో ధైర్యమిచ్చే నరాన్ని శాశ్వతంగా తెంచేసింది. వెనక్కి తిరిగి జనాన్ని తప్పించుకుంటూ, వాళ్ళ గేలి నవ్వులకు దూరంగా పాక నుండి బయటకు వచ్చేశాడు. ఆ రాత్రి కళాసీ బాగా తాగి వెర్రెత్తిపోయి తన కోసం పేటంతా వెతుకుతున్నాడని తెలిసి రాత్రికి రాత్రే ఊరు వదిలిపారిపోయాడు.
అప్పటి నుండీ మొదలైంది, కత్తులంటే భయం. అంతకుముందు రాములు అంత పిరికివాడు కాదు. నిజానికి తుపాకీ అన్నా అంత భయం లేదు. తుపాకీదేముంది, తూటా సూటిగా దూసుకుపోతుంది. ఆయువుపట్టుకి కన్నం పడితే నొప్పి తెలిసేలోగా ప్రాణం పోతుంది.
కానీ కత్తి అలా కాదు. పదునైన ఇనుము వంట్లో కండని వేరు చేస్తూ లోతుగా చొరబడితే తళుక్కుమనే బాధ. చొరబడి ఊరుకోదు, తూటాలాగా సూటిగా పోదు. దాన్ని చేతిలో ఉంచుకున్న వాడి క్రూరత్వాన్ని బట్టి ఎలా తిప్పితే అలా మెలితిరుగుతుంది. కన్నం చేసి ఊరుకోదు, కెలికి కకావికలం చేస్తుంది.
అందుకే ఆ రోజు పారిపోయాడు. కానీ అది ఒకసారితో ఆగలేదు.
మనం భయపడుతున్నామని తెలిస్తే కుక్కలు ఇంకా వెంటపడతాయని చిన్నప్పుడు రాములుకి ఎవరో చెప్పారు. కత్తులు కూడా అలాగే అతని వెంటపడ్డాయి ఎక్కడకు వెళ్ళినా. ‘కత్తిపోటు వల్ల యువకుడి దుర్మరణం’ లాంటి వార్తలు చదివినా అతని ఊహలు వికృతమైన బాధతో మెలితిరిగేవి. తర్వాత బెజవాడలో ఉండగా రెండు గ్రూపుల మధ్య గొడవలో అతను ఇరుక్కున్నాడు. అతను పని చేసే బారు ఓనరు కూతుర్ని ఎవరో ఏడిపించడంతో ఆయన కొందరు మనుషుల్ని పంపిస్తూ రాముల్ని కూడా వెంట వెళ్ళమన్నాడు. బయల్దేరినవాళ్ళు ఆ అమ్మాయి చదివే కాలేజీకి వెళ్ళి ఏడిపించిన కుర్రాళ్ళని బయటకు లాగి కొట్టారు. ఒకడ్ని మంగలి షాపుకి లాక్కుపోయి గుండు కూడా కొట్టించారు. అన్ని తన్నుల్లో రాములూ ఓ తన్ను తన్నాడేమో. తన్నులు తిన్నవాళ్ళకి పొలిటికల్ బలం ఉంది. నాల్రోజుల తర్వాత బారు ఓనర్ని, ఆయన ఫామిలీని ఇంట్లో ఉండగానే కాల్చేశారు. చివరకు ఇదంతా కులాల గొడవగా తయారై, ఆ ఏరియాలో కర్ఫ్యూ కూడా మొదలైంది. అతనితో పాటు గొడవకు వెళ్ళిన వాళ్ళలో ఇద్దర్ని వీధుల్లో నరికేశారని ఆ మధ్యాహ్నమే తెలిసింది. చీకటి పడేదాకా ఓ కన్‌స్ట్రక్షన్ సైటులో దాక్కున్నాడు. తన గదీ, సామానూ, చీటీల మీద రావాల్సిన డబ్బూ అంతా వదిలేసుకుని రాత్రికి బొంబాయికి రైలెక్కేశాడు.
బొంబాయి కూర్లా ఏరియాలో ఒక లాడ్జిలో పనికి కుదిరాడు. పక్కన ఇండస్ట్రియల్ ఏరియాల నుండి స్క్రాపు కూడా కలెక్ట్ చేసేవాడు. కొన్నేళ్ళకు స్టేషన్ దగ్గర టిఫినుబండి నడిపే శ్రీదేవి తో కలిసి ఉండటం మొదలుపెట్టాడు. ఇద్దరూ ఆదివారాలు మంచి బట్టలేసుకుని బీచికి వెళ్ళడం, పావ్ బాజీ తిని, సినిమా చూసి రాత్రెప్పుడో రైలెక్కి గదికి రావడం… రోజులు బాగా గడుస్తున్నాయనుకున్నాడు. ఈలోగా అక్కడ లోకల్ భాయ్ దగ్గరి టపోరీల్లో ఒకడు శ్రీదేవిని కోరుకున్నాడు. వాడి కాలర్ పట్టుకుని తన్నటం అటుంచి, తను ప్రవర్తించిన తీరుకి శ్రీదేవి చూసిన చూపు రాములుకి ఇంకా గుర్తుంది. ప్రేమగా నవ్వే పెదాలు జుగుప్సగా విచ్చుకోవడం చూశాడు. అయినా అవతలివాడికి ఎదురెళ్ళలేకపోయాడు.
తర్వాత అక్కడ్నించి మళ్ళీ వెనక్కి బెంగుళూరు, చెన్నై, తిరుపతి… చివరికి హైదరాబాద్. ఇప్పుడు ఇక్కడ్నించి కూడా…
కానీ ఇదివరకటి కన్నా ఈ సారి శ్రమ ఎక్కువ. అప్పుడంటే వయసులో ఉన్నాడు. ఒక ప్లేసు మారిపోగానే ఇంకో ప్లేసు ఆకట్టుకునేది. ఏ ప్లేసైనా ఒకటే అనిపించేది. ఇప్పుడలా కాదు.
రాములు ఇప్పుడు ముసలాడైపోయాడు. ఇప్పుడిప్పుడే ఈ ఫతేనగర్ ఏరియాలో సెటిలైపోదాం అనుకుంటున్నాడు. ఇక్కడ తనకు లోటేమీ లేదు. చుట్టూ చాలా ఫ్యాన్ల ఫాక్టరీలున్నాయి. బోలెడంత స్క్రాప్ దొరుకుతుంది. కాలవ పక్కన చిన్న బడ్డీ పెట్టుకున్నాడు, స్క్రాపు కలెక్ట్ చేసి డీలర్లకు అమ్ముకుంటున్నాడు. ఇదే బిల్డింగు చివరగదిలో బయట వంటపనులకి వెళ్ళే ఫాతిమా దగ్గరకు రాత్రుళ్ళు వెళ్తుంటాడు. ఈ మధ్య ఆమె దగ్గరకి ఓ మెకానిక్కు కూడా వెళ్తున్నాడని తెలిసింది. అమాయకపుది, దానికేం తెలీటం లేదు. ఎప్పటికైనా తెలిసొచ్చి తన గదికి మకాం మార్చేస్తుంది. అప్పుడు ఈ ఒంటి గది కాస్తా ఇల్లవుతుంది. తను ఈ వయసులో ఇక డబ్బు సంపాదించలేడని రాములుకి అర్థమైంది. జీవితం అలా సాగిపోతే చాలనుకుంటున్నాడు. మొన్నటి దాకా అలాగే సాగింది కూడా.
మొన్నే రాములు ఖర్మ కొద్దీ ఒక రోజు కల్లుకంపౌండులో బాలాజీ గాడు తగిలాడు. ఏదో మాటలు కలిసాయి. డబ్బు సంపాయించటం గురించి టాపిక్కొచ్చింది. బాగా తాగి వున్న బాలాజీ అంతకుముందు రాత్రి కొంతమంది కుర్రాళ్ళతో కలిసి రైల్వే సరుకు దొంగిలించటం గురించి చెప్పాడు. ట్రాక్ రిపెయిర్ల కోసం తెచ్చిన బోల్టులూ, ఫిష్ ప్లేట్లూ, లైనర్లూ ఇంకా చాలా పెద్ద ఇనుప మెటీరియల్ తెచ్చి ఒక చోట దాచారు. వాటిని కొంటానికి ఒక డీలర్ కూడా దొరికాడట. ఇదంతా వాడికి తనతోనే ఎందుకు చెప్పుకోవాలని అనిపించిందో రాములుకి అర్థం కాలేదు. కానీ ఇప్పుడు వాడి అన్న వచ్చి బెదిరించిన తీరుని బట్టి ఆ విషయాన్ని వాడు పంచుకున్న అతికొద్దిమందిలో తను ఒకడు. మొత్తానికి ఇప్పుడు ఆ సరుకు దాచిన చోటుని పోలీసులు ఎలా పట్టేసారో పట్టేశారు. కేసు ఋజువైతే బాలాజీగాడు ఐదేళ్ళు బొక్కలోకి పోవడం ఖాయం.
మల్లేష్ నిజంగానే తప్పు ఎవరిదో తేల్చుకోకుండా తన జోలికి రాడు. కానీ తప్పొప్పులు నికరంగా తేల్చగలిగే తెలివితేటలు మల్లేష్ కి ఉన్నాయన్న నమ్మకం రాములుకి లేదు. ఆ మొండి వెదవకి ఇప్పుడు కావాల్సిందల్లా తన తమ్ముడ్ని బొక్కలోకి తోయించిన వాళ్ళ మీద కసి తీర్చుకోవడం. దాని కోసం ఎక్కువకాలం ఓపికపట్టే రకం కాదు. ఈలోగా రాములే దోషి అని తేల్చుకునేందుకు అన్ని కారణాలూ వాడే కల్పించుకుంటాడు. బ్రిడ్జి కింద పిట్టలోళ్ళు కొంతమంది మల్లేష్ ఏం చెప్తే అది చేస్తారు. రెండుమూడు వేల సుపారీకే మనుషుల్ని చంపేసే రకాలు వాళ్ళు. జేమ్సు ప్రసాద్ ని వాళ్ళతోనే చంపించి ఉంటాడు మల్లేష్.
జేమ్స్ ప్రసాద్ గుర్తుకురాగానే గ్లాసు మొత్తం ఎత్తి పోసేసుకుని ఒక్క ఉదుటున లేచాడు రాములు. మూలనున్న ఇనుప ట్రంకు పెట్టి గది మధ్యకి లాగాడు. ముఖ్యమైనవన్నీ అందులో సర్దటం మొదలుపెట్టాడు. తప్పదు, అయినా ఏ ప్లేసైతే ఏముంది బతకటానికి. ఇక్కడ్నించి ఇంకో చోటుకి. అక్కడ ఎవడైనా కత్తి చూపిస్తే మళ్ళీ ఇంకో చోటుకి. పరిగెడుతూనే ఉంటాడు. ఒరిస్సా, కలకత్తా, ఢిల్లీ… పరిగెత్తేంత సత్తువ లేదు కానీ పరుగు అతని ఒంట్లో ఒక భాగమైపోయింది.
వణుకుతున్న వేళ్ళతో ఆయాసపడుతూ సామానంతా సర్దేశాడు. కిటికీ లోంచి చీకటి పడటం తెలుస్తోంది. చప్పుడు చేయకుండా ఫతేనగర్ స్టేషన్ పోయి రైలెక్కితే సికింద్రాబాద్ చేరుకుంటాడు. అక్కడ్నించి బొచ్చెడు రైళ్ళు దొరుకుతాయి. మెట్ల వైపు నడుస్తూంటే ఫాతిమా గదికి తాళం వేసి కనిపించింది. ఆమె రావటానికి ఇంకో గంట పడుతుంది. కానీ వీడ్కోలు చెప్పేందుకు ఆగాలనిపించలేదు. వండకుండా మిగిలిన పావుకిలో మాంసం వున్న కవర్ని ఆమె తలుపు గెడకి తగిలించాడు. మెట్లు దిగి కిందకు వచ్చేశాడు.
రాములు పెట్టె భుజం మీద మోసుకుంటూ బ్రిడ్జి పక్కన సందులోంచి పట్టాల మీదకు వచ్చాడు. కీచురాళ్ళ శబ్దం మధ్య నుంచి నడుస్తున్నాడు. దూరంగా ఫతేనగర్ లోకల్ రైల్వే స్టేషన్ కనిపిస్తోంది. ఫ్లాట్ఫాం చివర డల్లుగా వెలుగుతున్న ఒక ట్యూబులైటు కింద కూర్చుని గుడుంబా తాగుతూ కొంతమంది కనపడుతున్నారు. రాములు బరువుతో ఒగుర్చుకుంటూ ఫ్లాట్ ఫాం ఎక్కబోయిన వాడల్లా ఉన్నట్టుండి ఆగిపోయాడు. కొంత దూరంలో నేల మీద సిట్టింగేసిన ముగ్గురిలో ఒకడు మల్లేష్!
రాములు బిక్కచచ్చిపోయాడు. వెంటనే వెనక్కి తిరిగి అటు వైపు ప్లాట్ఫాం దిక్కు నడిచాడు. వెలుతురు పెద్దగా లేదు కాబట్టి మల్లేష్ తనను చూసివుండకపోవచ్చు.
కానీ అవతలి ప్లాట్ఫాం మీదకు అడుగుపెడుతుండగానే తనది అడియాస అని అర్థమైపోయింది.
మల్లేష్ అటు పక్క లేచి నిల్చోవడం తన చూపు అంచుల్లోంచి తెలుస్తోంది. ప్రాణాలన్నీ తోడేస్తూ మల్లేష్ పిలుపు వినపడింది.
“రేయ్… రాములు!”
రాములు వినపడనట్టు నడుస్తున్నాడు.
“నిన్నేరా. నీయవ్వరేయ్!”
ఇక ఆగక తప్ప లేదు. అటు తిరిగి చూశాడు.
మల్లేష్ కొద్దిగా తూలుతూ అటు వైపు ఫ్లాట్ ఫాం దిగి ఇటువైపు వస్తున్నాడు.
రాములుకి పారిపోదామా అనిపించింది. మల్లేష్ గాడు పరిగెత్తలేడు, కానీ మల్లేష్ తో పాటు కూర్చున్నవాళ్ళు కూడా పైకి లేచి ఇటొస్తున్నారు, వాళ్ళు చూట్టానికి కుర్రాళ్ళ లాగే ఉన్నారు.
చేసేదిలేక పెట్టె కింద పెట్టి నిల్చున్నాడు.
మల్లేష్ పట్టాలు దాటి ఈ ప్లాట్ ఫాం పైకి ఎక్కుతున్నాడు. మొహం వెటకారంగా నవ్వుతోంది. “మనుషుల్ని గుర్తువట్టనంత ఎక్కేషిందనుకుంట్నావ్ ర నాకు?”
“లేదన్నా.. ఇక్కడకే. సనత్ నగర్ పోతున్న.”
దగ్గరకు వచ్చి భుజం మీద చేయి వేశాడు మల్లేష్. “నువ్వు ఎక్కడికన్న పోబై. పిలిస్తే ఆగల్నా లేదా? బలిసిందిరా నీకు. నీ దోస్తు జేమ్సుగాడిట్లనే ఎగస్ట్రాలు చేశిండు సచ్చే ముంగట.”
ఆ మాట తర్వాత రాములుకి ఇక ఏం వినపడలేదు. చప్పున వెనక్కి తిరిగి పరిగెత్తాడు. రెండడుగులు వేశాడో లేదో తలకి వెనుక నుంచి ఏదో వచ్చి గట్టిగా తాకింది. తల పట్టుకుని నేలజారిపోతున్న రాముల్ని మల్లేష్ తో పాటు వచ్చినవాళ్ళలో ఒకడు మెడ వెనకనుంచి చేయి వేసి నిటారుగా నిలబెట్టాడు. కదలకుండా పట్టుకున్నాడు.
మల్లేష్ నెమ్మదిగా వచ్చి రాములు ముందు నిలబడ్డాడు. పక్కవాడి వైపు చూస్తూ, “నువ్ జెప్పరా.. ఈని తప్పేం లేకుంటె ఎందుకు ఉర్కుతుండ్రా ఈడు?” అంటూ, బెల్టు దగ్గర చేయి పెట్టాడు.
అది సర్దుకోవడానికో, గోక్కోవడానికో, లేక కత్తే తీయడానికో రాములుకి తెలీదు. మధ్యాహ్నం అక్కడ కత్తి చూసిన సంగతి మాత్రం గుర్తొచ్చిందంతే. వెనకవాడు పట్టుకుని ఉండగానే ఒక కాలు మల్లేష్ వైపు ఆడించాడు.
ఆ దెబ్బ మల్లేష్ పొట్టకి తగిలి అతనో అడుగు వెనక్కి వేశాడు. అక్కడే ఒక క్షణం పాటు నిలబడ్డాడు. ఆవేశంతో ఒగురుస్తూ పక్కన నిల్చున్నవాడ్ని, “రేయ్ ఇటియ్యరా బై!” అని అడిగాడు. పక్కవాడు జేబులోంచి తీసిచ్చిన కత్తి అందుకుని “సచ్చినవ్ రా ఇయ్యాల నువ్వు” అంటూ పెనుగులాడుతున్న రాములు పీక పట్టుకున్నాడు. రెండో చేత్తో కత్తిని రాములు పొట్టలోకి దింపాడు.
రాములు కేక ఆ ఖాళీ ప్లేసులో గట్టిగా వినపడింది. వెనక ఉన్నవాడు వదిలేయటంతో రాములు కిందపడిపోయాడు. విప్పారిన కళ్ళతో తలెత్తి మల్లేషు వైపు చూశాడు.
మల్లేష్ తో వచ్చిన ఇద్దరూ నడుం మీద చేతులు వేస్కొని తొంగి చూస్తున్నారు. ఒకడు “అట్ల పొడిసినవేందన్నా!” అంటున్నాడు.
“కాలెత్తుతుండ్రా లంజొడ్కు!” అంటున్నాడు మల్లేష్.
ఇంకొకడు వెనక్కి తిరిగి ఫ్లాట్ఫాం వైపు చూశాడు. ఇటు వైపు పరిగెత్తుకుంటూ వస్తున్న కొన్ని అడుగుల శబ్దం వినపడుతోంది.
“అన్నా… పా! రచ్చయితది ఇక్కడ!”
కాళ్ళు కదిలాయి. ముగ్గురూ వచ్చిన తోవనే వెనక్కి మళ్ళారు.
ఈలోగా పరిగెత్తుకొస్తున్న కాళ్ళు రాములు దగ్గరికి వచ్చి ఆగాయి. షెడ్డు పాషా, వాడి దగ్గర పన్చేసే కుర్రాడూ, ఇంకెవరో ఇద్దరు ముగ్గురున్నారు.
ఒకడు రాముల్ని లేపి కూర్చోబెట్టాడు. “ఏమైందన్నా” అని అడుగుతున్నారు ఎవరో. రాములు పట్టాలు దాటుతున్న మల్లేష్ వైపే చూస్తున్నాడు.
మల్లేష్ వెనక్కి తిరిగి చూస్తూ దాటుతున్నాడు. పక్కనున్నవాడు మల్లేష్ చేతుల్లోంచి రక్తం ఓడుతున్న కత్తిని లాగి తుప్పల్లో పడేశాడు.
రాములు చొక్కా ఎత్తి చూసుకున్నాడు. అక్కడ బనీన్ అంతా రక్తంతో తడిసిపోయి వుంది. కానీ అంతా మొద్దుబారిపోయి ఉంది. నొప్పేం తెలీటం లేదు.
“ఇంతేనా” అని గొణుక్కున్నాడు.
పక్కవాడు “ఏందీ” అని అడిగాడు అర్థం కానట్టు.
రాములు కళ్ళు మెరుస్తున్నాయి. ఒక్క ఉదుటున పైకి లేచాడు. “ఇంతేనా!” అని గట్టిగా అరిచాడు. చుట్టుపక్కల వాళ్ళు దూరంగా జరిగారు.
పట్టాలు దాటుతున్న మల్లేష్ కూడా ఆగాడు.
రాములు అతని వైపు నడుస్తూ…
“నీయవ్వ దీనికారా భయపడింది
దీనికా భయపడింది
దీనికా”
- అని అరిచాడు. మల్లేష్ వైపు దూసుకెళ్ళాడు.
రాములుకి ఏం కాలేదని మల్లేష్ కి అర్థమైంది. రాములు చేత తన్నించుకున్న పౌరుషం మళ్ళీ రెచ్చిపోయింది. పక్కవాళ్ళు వెనక్కి లాగుతున్నా ఆగలేదు.
ఇద్దరూ పట్టాల మధ్య కలుసుకున్నారు.
రాములు మల్లేష్ మీదకు చెయ్యెత్త బోయాడు.
మల్లేష్ దాన్ని రాములు వీపు వెనక్కే మడిచి ఓ గెంటు గెంటాడు.
రాములు తుప్పల్లోకి తూలి పడ్డాడు.
అక్కడ కనపడింది కత్తి. వణుకుతున్న చేతుల్తో దాన్ని ఒడిసిపట్టుకున్నాడు. అతని పిడికిలి చల్లారిన ఇనుములా పిడి చుట్టూ బిగుసుకుంది. తటాల్న లేచి మల్లేష్ మీదకు వచ్చాడు.
మల్లేష్ మళ్ళీ రాముల్ని గెంటబొయ్యాడు. కానీ అరచేయి సర్రున కోసుకుపోయింది. రాములు కత్తి ఆడిస్తూ మల్లేష్ చుట్టూ గెంతుతున్నాడు. మల్లేష్ తో వచ్చిన కుర్రాళ్ళిద్దరూ అతడ్ని పట్టుకునే ప్రయత్నం చేసినా అందలేదు. వాళ్లలో ఒకడు రాముల్ని వెనక నించి పొడిచాడు. అయినా కాచుకోవడానికి ప్రయత్నించ లేదు. వెనక్కి కూడా తిరగలేదు. మల్లేష్ చుట్టూ పూనకంలా గెంతుతూ కత్తి ఆడిస్తున్నాడంతే. ఒక్కోసారి ఈ కత్తి పోట్లు గాల్లోకి దిగుతున్నాయి, ఒక్కోసారి మల్లేష్ ని తాకుతున్నాయి.
మల్లేష్ ఒక పోటు కాచుకోబోయి రైలుపట్టా తగిలి తూలిపడ్డాడు. రాములు వెంటనే అతని మీదకెక్కి కూర్చున్నాడు. ఈసారి కత్తిని ప్రాణాంతకమైన తావుల్లో దించాడు. నెమ్మదిగా మల్లేష్ లో ప్రతిఘటన తగ్గింది. శరీరం చావు ముందు కదలికలేవో చేస్తోంది. రాములు పైకి లేచి బిత్తరపోయి చూస్తున్న కుర్రాళ్ళ వైపు తిరిగాడు. అతని ముఖం మీది రక్తమూ, వెర్రితనమూ చూసి భయపడ్డారు వాళ్ళు. వెనక్కి తిరిగి పరిగెత్తారు. రాములు వాళ్ళ వెంటపడబోయి ప్లాట్ ఫాం మీద పడిపోయాడు. పైకి లేవబోయి కుప్పకూలిపోయాడు.
కాసేపు చుట్టూ అరుపులు వినపడ్డాయి. దగ్గరకొచ్చిన కొన్ని అడుగులు అతడ్ని తాకేందుకు భయపడి చుట్టు తిరిగాయి. ఎవరో భుజాల కింద చేతులు వేసి వెల్లకిలా పడుకోబెట్టారు. కొన్ని చేతుల మీద గాల్లోకి లేవటం రాములుకి తెలిసింది. తర్వాత స్పృహ తప్పింది.
మెలకువ వచ్చేసరికి కళ్ళకి తెల్లటి వెలుగు తగిలింది. అతనో కదులుతున్న అంబులెన్సులో ఉన్నాడు. కాళ్ళ దగ్గర తెల్లటి కోటు వేసుకు కూర్చున్న కుర్రాడు అతని మీదకు వంగి చూసి ఇంకొకతనితో ఏదో చెప్తున్నాడు. రాములు తల తిప్పి చూశాడు. అంబులెన్సు రెండో గోడకి ఆనించి వున్న స్ట్రెచర్ మీద ఒక శవం ముసుగేసి వుంది. ఆ తెల్లటి ముసుగు కింద నుంచి ఒక చేయి కాశీతాడు, కడియాలతో వేలాడుతోంది.
రాములు లేవబోయాడు. తెల్లకోటు యువకుడు రాములుని మధ్యలోనే ఆపి, వెనక్కి పడుకోబెడుతూ, అనునయంగా మీదకి వంగి చెప్తున్నాడు, “ఏం కాలేదు, కంగారు పడకు. హాస్పిటల్ కి వచ్చేస్తున్నాం.”
రాములు అది కాదన్నట్టు చేయాడిస్తూ అన్నాడు, “నాకు ఏదో ఒక మందిచ్చేయండి సార్. నేను బానే వున్నాను. హాస్పిటల్ కి వద్దు.”
“వచ్చేశాం. ఇంకెంతో దూరం లేదు.”
“లేదు లేదు మీకు అర్థం కాటం లేదు. దూరం అని కాదు, నాకు టయిం లేదు. నేను వెళ్ళాలి.”
“ఎక్కడికీ వెళ్ళక్కర్లేదు. కేసేం అవదు. ఫస్ట్ వీడే పొడిచాడని అక్కడ అంతా చెప్తున్నారు,” అన్నాడు ఆ యువకుడు మల్లేష్ శవం వైపు చూపిస్తూ.
రాములు ముఖం బాధగా పెట్టి, డాక్టర్ కి అర్థమయ్యేట్టు చెప్పే ప్రయత్నం చేశాడు: “అది కాదు డాట్టరు. మీకర్థం కాటం లేదు. నేను చాలా చోట్లకి ఎళ్ళాలి. ఎక్కడెక్కడ బతికేనో అక్కడకల్లా ఎళ్ళాలి. మొత్తం బతుకంతా మళ్ళీ ఎనక్కెళ్ళాలి. వైజాగు, బొంబాయి… చాలా చోట్లకి పోవాలి. చాలా మందిని కలవాలి. చాలామందికి ఎదురెళ్ళాలి. నేనేంటో చెప్పాలి నాకొడుకులకి. టయిం లేదు డాట్టరు. నాకు ఏదో మందిచ్చేయండి. ఇక్కడ దింపేయండి…” అంటూ తలాడిస్తున్నాడు. అతని మాట సణుగుడులోకి మారిపోయింది, అర్థం కాని ప్రేలాపనలోకి దిగిపోయింది, ఆడుతున్న తల నెమ్మదిగా ఆగిపోయింది.
(Retelling of Dashiell Hammett’s Afraid of a Gun - వాకిలిలో ప్రచురితం. కినిగెలో పని చేస్తున్నప్పుడు చిన్న చిన్న జాన్ర కథల్ని స్వేచ్ఛానువాదం చేసి మారు పేరు మీద వేద్దామని ఈ కథతో మొదలుపెట్టాను. కినిగె ఆగిపోయాకా దీన్ని 'వాకిలి'కి ఇచ్చాను. ఈ కథకు మూలమైన కథ మీద నాకే ఆసక్తీ లేదు. అది చిన్నదనీ, కాస్త పేరున్న డాషియెల్ హామెట్ రాసిందనీ మాత్రమే ఎంచుకున్నాను. కానీ అనువదించేటప్పుడు నాకు తెలిసిన వాతావరణం కొంతవచ్చి కలిసింది.)

***