December 6, 2013

శిలువ మోసిన రచయిత


“నేను సాహిత్యం తప్ప మరేమీ కాను.”
“సాహిత్యం ద్వారానే జీవితాన్ని పట్టుకుని వేలాడుతున్నాను. దాన్ని కోల్పోతే అంతా కోల్పోయినట్టే.”
“రచన చావు కన్నా గాఢమైన నిద్రలాంటిది. శవాల్ని వాటి సమాధుల్లోంచి లాగనట్టే, రాత్రుళ్లు నన్నూ నా డెస్కు నుంచి లాగలేరు.”
“నేను సాహిత్యానికి కనపడని గొలుసుల ద్వారా కట్టివేయబడ్డాను, ఎవరన్నా దగ్గరకొస్తే నా గొలుసులు ముట్టుకుంటున్నారేమో అని అరుస్తాను.”
“నాకు తగ్గ జీవన శైలి ఏమిటంటే, నేను ఒక విశాలమైన సెల్లార్‌లో ఒక మారుమూల గదిలో దీపం ముందు నా రాతసామాగ్రి పెట్టుకుని కూర్చుంటాను. భోజనం తెచ్చేవాళ్లు కూడా నా దగ్గరకు రారు, నా గదికి చాలా దూరంగా సెల్లార్ అవతల ఎక్కడో ఉన్న గుమ్మం దగ్గర పెడతారు. ఈ సెల్లార్ గదుల గూండా ఆ భోజనం దాకా నడిచి వెళ్లటమే నా ఏకైక వ్యాయామం. తర్వాత మళ్ళీ రాతబల్ల దగ్గరకు వెళిపోతాను, తాపీగా తింటాను, మళ్లా రాయటం మొదలుపెడతాను. ఎలా రాస్తాననుకున్నావ్! ఎంతెంతటి లోతుల్లోంచి తవ్వి తీస్తాననుకున్నావ్! అదీ శ్రమ లేకుండా! ఎందుకంటే తీక్షణమైన ఏకాగ్రత శ్రమ తెలియనీయదు.”

* * *

ఏమిటీ గొంతు? ఈ మనిషి సాహిత్యానికి ఇంతగా ఎందుకు బంధీ అయిపోయాడు? సాహిత్యానికీ జీవితానికీ ఇంత గట్టి లంకె ఎలా వేసుకున్నాడు? ఇలాంటివాడు సృష్టించిన సాహిత్యం ఎలాంటిది?

ఎవరైనా సాహిత్యం పట్ల ఇంత అంకితభావం ప్రదర్శించారంటే, బహుశా వాళ్ళు తమ రచనల ద్వారా ఏదో బృహత్తరమైన మంచికో మార్పుకో పాటుపడుతూండి ఉంటారనీ, వారి ఆదర్శం అంత బృహత్తరమైంది కాబట్టే జీవితం మొత్తాన్ని సాహిత్యానికి అంకితం చేయగలిగేంత ధైర్యం చేయగలిగారనీ అనుకునేవాళ్ళందరూ… కళ స్వరూపతత్త్వాలు ఎరుగనివాళ్ళే. కాఫ్కాలో మరీ అంత బడాయి లేదు. అతను సాహిత్యానికి పరమార్థం దాని వెలుపల వెతుక్కోలేదు. సాహిత్యానికి అతను అన్వయించుకున్న పరమార్థం – ఆత్మాతిశయ కళాకారుల దృక్కోణం నుంచి చూస్తే – చాలా బడుగుది. ఒక ఉత్తరంలో ఇలా రాశాడు: “చేరవేయలేనిదాన్ని చేరవేయాలని ప్రయత్నిస్తాను, వివరించలేనిదాన్ని వివరించాలనుకుంటాను, నా మజ్జాగతమైనదీ నేను మాత్రమే అనుభూతించగలిగేదీ ఏమిటో అది చెప్పాలనుకుంటాను.”

అతను కలాన్ని పట్టుకుని తనకు తెలియని వలయాల్లోకి వెళ్ళలేదు. తన లోపలి వలయాల్లోనే తిరిగాడు. కానీ ఆ కలం తాకిడికి అతని లోపలి వలయాల్లో పుట్టిన ప్రకంపనాలతో పాటూ ఆధునిక మానవుని మౌలిక స్వభావమేదో అనుకంపించింది. అందుకే అతని సాహిత్యం ఇరవయ్యో శతాబ్దపు సందిగ్ధ మానవుని మనఃచైతన్యానికి ప్రాతినిధ్యం వహించగలిగింది. “డాంటే, షేక్‌స్పియర్‌, గెథెలకూ వారి వారి కాలాలకూ ఎలాంటి సంబంధం ఉందో, కాఫ్కాకూ మన కాలానికీ అలాంటి సంబంధమే ఉంది” అంటాడు కవి డబ్ల్యూహెచ్ ఆడెన్. కాఫ్కా రచనలకు ఈ గుణం ఎలా అబ్బిందో తెలుసుకోవాలంటే అతని జీవితం గురించి క్లుప్తంగానైనా తెలుసుకోవాలి.

జన్మ


నలభై యేళ్లకే జీవితం చాలించిన కాఫ్కా 1883 జూలై 3 న జర్మనీలో యూదుల కుటుంబంలో పుట్టాడు. తండ్రి హెర్మన్ ఒక ఫాన్సీ కొట్టు నడిపేవాడు. వ్యక్తిగా కాఫ్కా ఎదుగుదలపై హెర్మన్ చాలా ప్రతికూల ప్రభావాన్ని చూపించాడు. కాఫ్కా తన తండ్రి నుంచి ప్రేమనూ, తన వ్యక్తిత్వానికి ఒప్పుదలనూ జీవితాంతం ఆశిస్తూనే ఉన్నాడు. చిన్నప్పుడు తండ్రితో పాటూ స్విమ్మింగ్‌పూల్‌కు వెళ్ళిన సందర్భాన్ని పెద్దయ్యాకా ఇలా గుర్తు చేసుకున్నాడు: “మనమిద్దరం ఒకే స్నానాల పాకలో దుస్తులు విడిచే వాళ్ళం. ఒకపక్క నేనేమో బక్కగా, నీరసంగా, తేలికగా ఉండేవాణ్ణి. ఇంకో పక్క నువ్వు, బలంగా, పొడవుగా, విశాలంగా ఉండేవాడివి. ఆ చిన్ని పాకలో కూడా నాకు నేను ఓ పేలవమైన నమూనాలా అనిపించేవాణ్ణి, నీ ఒక్కడి దృష్టిలోనే కాదు, మొత్తం ప్రపంచం దృష్టిలో, ఎందుకంటే నువ్వే నాకన్నింటికీ కొలమానం.”

తండ్రి హెర్మన్ స్వయంకృషితో నిరుపేద స్థితి నుంచి పైకి ఎదిగాడు. చూట్టానికి ధృఢంగా కఠినంగా కనపడేవాడు, సంపాదనే ప్రధానమనే మధ్యతరగతి మనస్తత్వం, ఒకవేళ లోపలెక్కడన్నా అనురాగం ఉన్నా దాన్ని వ్యక్తం చేయటం నామోషీగా భావించే మనిషి. ఆయన కాఫ్కా నుంచి తన లాంటి బలమైన వ్యక్తిత్వాన్నే ఆశించాడు. కానీ కాఫ్కా పూర్తిగా భిన్న ధృవం. సున్నితస్తుడు, సిగ్గరి, అర్భకుడు, ఆధారపడే మనస్తత్వం కలవాడు. తండ్రి ఈ గుణాల్ని ఎత్తి చూపించి కాఫ్కాని సందు దొరికినప్పుడల్లా కించపరిచే వాడు.

తల్లి జూలీకి కొడుకుపై చాలా ప్రేమ ఉంది, కానీ భర్తంటే అంతకుమించిన హీరో వర్షిప్ ఉంది. దాంతో భర్తకీ కొడుక్కీ మధ్య ఏ ఘర్షణ తలెత్తినా ఆమె భర్త పక్షమే వహించేది. కాఫ్కాకు శైశవంలో తల్లిదండ్రుల సాంగత్యం చాలా తక్కువ లభించింది. వాళ్ళిద్దరూ కాఫ్కాను ఆయాల చేతుల్లో వదిలి ఫాన్సీ కొట్టు వ్యాపారం చూసుకోవటానికి వెళిపోయేవారు. (ఆ రోజుల్లో పిల్లలు ఆయాల సంరక్షణలో పెరగటమన్నది మామూలు విషయమే.) కాఫ్కాకు ముగ్గురు చెల్లెళ్ళు. ఎల్లి, వల్లి, ఓట్ల అనే ఈ ముగ్గురిలోనూ చిన్న చెల్లి ఓట్ల అంటే కాఫ్కాకు చాలా ఇష్టం. ఆమె ధైర్యమూ, స్వేచ్ఛా కాంక్షా గల యువతిగా ఎదిగింది. పెద్దయ్యే కొద్దీ ఆ ఇంట్లో అన్నయ్య పక్షం వహించేది ఆ పిల్ల ఒక్కతే.

కాఫ్కా స్కూలు చదువు పూర్తయ్యాకా, పదేళ్ళ వయసులో (1893లో) జర్మన్ జిమ్నాజియంలో చేరాడు. తర్వాతి ఎనిమిదేళ్ళూ ఇక్కడే చదివాడు. కాఫ్కా తనకంటూ ఒక వ్యక్తిత్వాన్ని కూర్చుకున్నది ఇక్కడే. రచయిత కావాలన్న ఆశ ఇప్పట్లోనే బలపడింది. అప్పుడపుడూ నాటకాలు రాసి ఇంట్లో చెల్లెళ్ళతో కలిసి ఆడేవాడు. విపరీతంగా చదివేవాడు కూడా. కౌమారంలోనే గెథె, క్లీస్ట్, నీషే, స్పినోజా, డార్విన్ లను చదువుకున్నాడు. ముఖ్యంగా నీషే ప్రభావం ఎక్కువగా ఉండేది. కాల్పనిక సాహిత్యం కన్నా, రచయితల ఆత్మకథల పైనా, ఉత్తరాలపైనా ఎక్కువ ఆసక్తి చూపించేవాడు. ఒక మిత్రునికి ఇరవయ్యేళ్లప్పుడు రాసిన ఉత్తరంలో ఇలా అంటాడు: “మనల్ని గాయపరిచి, తూట్లు పొడిచే పుస్తకాలే మనం చదవాలి. మన తల మీద మొట్టి నిద్ర లేపకపోతే ఎందుకిక పుస్తకాలు చదవటం? ఆనందం కోసమా! అసలు పుస్తకాలు లేకపోయినా మనం ఆనందంగానే ఉండగలం, ఆనందపెట్టే పుస్తకాలు మనమే చిటికెలో రాయగలం. నిజమైన పుస్తకాలు వేరు. అవి ఒక విపత్తులా, మనకన్నా ఎక్కువగా మనం ప్రేమించిన వారి చావులా, అందరికీ దూరంగా అడవుల్లోకి వెలి వేయబడటంలా, ఒక ఆత్మహత్యలా మనల్ని కదిలించాలి. మనలో గడ్డకట్టుకుపోయిన సముద్రాలకి పుస్తకం ఒక గొడ్డలిపెట్టు కావాలి.” అతని సున్నితత్వంపై పుస్తకాలు నిజంగా అలాంటి ప్రభావాన్నే చూపించేవి.

పద్దెనిమిదేళ్ళ వయసులో (1901లో) జిమ్నాజియం నుంచి బయటపడి జర్మన్ యూనివర్శిటీలో చేరాడు. అప్పటికే మానసికంగా రాయటమే తన డెస్టినీ అన్న నిర్ణయానికి వచ్చేశాడు. కానీ, లౌకిక ప్రపంచంలో ఏం చేయాలన్న దానిపై ఓ నిర్ణయానికి రాలేదు. అందుకే యూనివర్శిటీలో చేరిన కొత్తల్లో ఏ సబ్జెక్టులు ఎంపిక చేసుకోవాలో తెలియక తడబడ్డాడు. ఒక మిత్రుడు చేరాడని తనూ కెమిస్ట్రీలో చేరాడు. కానీ చివరకు అక్కడ కుదురుకోలేక న్యాయశాస్త్రం వైపు మళ్ళాడు. అదీ సొంత ఆసక్తితో కాదు, దానికైతే ఉద్యోగావకాశాలు ఎక్కువన్న తండ్రి పోరు పడలేక.

ఈ యూనివర్శిటీలో చదువుతుండగానే అతనికి మాక్స్ బ్రాడ్‌ అనే తోటి యూదు యువకునితో పరిచయమైంది. వీరిద్దరూ జీవితాంతం సన్నిహిత మిత్రులుగా కొనసాగారు. మాక్స్‌బ్రాడ్ కూడా రచయితే. కాఫ్కా రచనా వ్యాసంగంలో ఇతని పాత్ర చాలా ముఖ్యమైంది. స్వీయశంక వల్ల మొదలు పెట్టిన రచనల్ని పూర్తిచేయకుండానే చింపేసే మిత్రుణ్ణి, రాయమంటూ పదే పదే ముందుకు తోశాడు, అవి ప్రచురితమయ్యేలా శ్రద్ధ తీసుకున్నాడు.

కాఫ్కాను ప్రేమ కన్నా ముందు సెక్సే పలకరించింది. ఇరవయ్యేళ్ళ వయసులో ఇంటి ముందున్న ఒక షాపులోని సేల్స్ గర్ల్‌తో అంతకుముందు ఏ సన్నాహమూ అటుతర్వాత ఏ కొనసాగింపూ లేని అనుభవమది. సెక్సు పట్ల కాఫ్కా ఆజన్మాంతం ద్వైధీభావంతోనే ఉన్నాడు. ఒక పక్క కాంక్ష ఉసిగొల్పుతున్నా, శరీర పరిధి దాటి పైకి ఎగరలేని సెక్సు స్వభావం అతణ్ణి కుంగదీసేది. “ఇద్దరు కలిసున్న పాపానికి భరించాల్సిన శిక్ష సంభోగం” అని ఒక చోట రాసుకున్నాడు. అయినా స్త్రీ సాంగత్యానికి లోటు లేదు. స్వతహాగా మితభాషీ బిడియస్తుడే గానీ, ఆరడుగుల ఎత్తూ, కట్టిపడేసేకళ్ళూ, వయసెంత పెరిగినా పద్దెనిమిదేళ్ళ కుర్రాడిలానే కనిపించే రూపమూ… ఈ లక్షణాల కారణంగా అమ్మాయిల్ని ఆకట్టుకునే దందాలో ఎప్పుడూ పెద్దగా వెనకపడలేదు. తొలిరోజుల్లో వేశ్యల దగ్గరకూ తరచూ వెళ్ళేవాడు. కాఫ్కా రచనల్లోని ఆడ పాత్రల్లో అతని సామాజిక వర్గానికి చెందిన స్త్రీల కన్నా, ఈ వేశ్యల జాడలే ఎక్కువ కనిపిస్తాయి; వాటిలో వేశ్యా సహజమైన చొరవా, జాణతనమూ ఎక్కువ.

ఇరవైమూడేళ్ళ వయసులో (1906లో) న్యాయశాస్త్ర పట్టభద్రునిగా యూనివర్శిటీ నుంచి బయటి ప్రపంచంలో అడుగుపెట్టాడు. తర్వాత, అప్పటి న్యాయ విద్యా నియమాల ప్రకారం, ఏడాది పాటు కోర్టు గుమాస్తాగా పని చేశాడు. ఆ తర్వాత ఒక ఇటాలియన్ భీమా సంస్థలో ఉద్యోగిగా చేరాడు. కానీ పదిగంటల పనితో రాపాడించేస్తుంటే రాసుకోవటానికి వీలుచిక్కకపోవడంతో, అక్కడ ఎంతోకాలం పని చేయలేకపోయాడు.

ఆ మరుసటి ఏడాదే (1908), ఇరవై అయిదేళ్ళ కాఫ్కా ‘కార్మిక ప్రమాద భీమా సంస్థ’లో గుమాస్తాగా చేరాడు. ఇదే అతను చివరి దాకా చేసిన ఉద్యోగం. మరో పదేళ్ళ పాటు, అంటే ముప్ఫై నాలుగేళ్ళ వయసులో తనకు క్షయ వ్యాధి ఉందని తెలిసేదాకా, ఇక్కడే పని చేశాడు. అతని ఉద్యోగ జీవితమంతా సాఫీగానే సాగింది. కాఫ్కా ఉత్తరాల్లోనూ, డైరీల్లోనూ ఆఫీసు పని మీద చాలా అయిష్టత వ్యక్తం చేస్తాడు, అది తన రచనా సమయాన్ని తినేస్తోందని వాపోతాడు, కానీ ఆఫీసులో మాత్రం అతను చాలా పనిమంతుడిగా పేరు తెచ్చుకున్నాడు, పలుమార్లు ప్రమోషన్లు పొందాడు. ఆ సంస్థ అతణ్ణి ఎంత విలువైన ఉద్యోగిగా గుర్తించో చెప్పటానికి ఒక ఉదాహరణ చాలు: క్షయ వ్యాధి ఉందని ఖరారయ్యాకా అతను పదవీవిరమణ ఇప్పించమని ఆఫీసును కోరాడు. కానీ అతణ్ణి వదులుకోవటం ఇష్టం లేక, కోలుకున్నాకనే వచ్చి చేరమని సెలవు ఇచ్చింది. ఆరోగ్యం సహకరించక కాఫ్కా తర్వాతి అయిదేళ్ళూ ఆ సెలవు పొడిగిస్తూనే ఉన్నాడు. అయినా అతనికి జీతం మాత్రం అందుతూనే ఉంది. ఇక రెండేళ్లలో చనిపోతాడనగా కాఫ్కాయే వాళ్ళను బలవంతంగా ఒప్పించి బయటకు వచ్చాడు.

ఇదంతా తర్వాతి సంగతి. ఈ ఆఫీసులో చేరటంతోనే, కాఫ్కా రచనా జీవితం కూడా మొదలైంది. చదువు పూర్తయింది, ఒక స్థిరమై ఉద్యోగం దక్కింది, దాంతో రచన తప్ప వేరే పెద్ద ఏంబిషన్లేవీ లేని కాఫ్కా, తిన్నగా ఆ వ్యాసంగంలో మునిగిపోయాడు. ఈ ఆఫీసు పని వేళలు కూడా అతనికి అనుకూలంగా ఉండేవి. ఉదయం ఎనిమిదింటికి మొదలై మధ్యాహ్నం రెండున్నరకు పూర్తయిపోయేది. ఇంటికి వచ్చి భోం చేసి రాత్రి ఏడింటి దాకా నిద్రపోయేవాడు. సాయంత్రం కాసేపలా నగర వీధులమ్మటా నడిచేవాడు, లేదంటే మిత్రులతో గడిపేవాడు. రాత్రి పదయ్యాకా ఇల్లు చేరేవాడు. అప్పుడిక రచయిత అవతారం దాల్చేవాడు. తన గదిలో డెస్కు ముందు కూర్చుని రాయటం మొదలుపెట్టేవాడు. అర్థరాత్రి ఒంటిగంటా, రెండింటి వరకూ రాసేవాడు. వెల్లువలా వస్తోందనిపిస్తే ఒక్కోసారి తెల్లారే దాకా రాస్తూనే ఉండేవాడు.

జీవితాన్ని ఇలా సాహిత్యానికే అంకితం చేసుకోవటమనే విషయంలో కాఫ్కాకు హీరోలు లేకపోలేదు. వారిలో ఫ్రెంచి రచయిత ఫ్లాబె (Flaubert) ముఖ్యుడు. కాఫ్కా అతణ్ణి తన నలుగురు రక్త సహోదరుల్లో (blood brothers) ఒకడిగా భావించేవాడు (మిగతా ముగ్గురూ: ఫైదోర్ దాస్తోయెవ్‌స్కీ, హెన్రిక్ వోన్ క్లీస్ట్, ఫ్రాంజ్ గ్రిల్‌పార్జర్). ఫ్లాబె నవల “సెంటిమెంటల్ ఎడ్యుకేషన్” గురించి కాఫ్కా ఒక ఉత్తరంలో ఇలా రాశాడు: “ఆ పుస్తకాన్ని ఇష్టపడినంతగా మళ్ళా ఒకళ్ళిద్దరు వ్యక్తుల్ని మాత్రమే ఇష్టపడ్డాను; దాన్ని ఎప్పుడు ఎక్కడ తీసినా తుళ్ళిపడి పూర్తిగా నిమగ్నమైపోతాను, నేను ఆ రచయితకు మానసిక పుత్రుణ్ణేమో అనిపిస్తుంది, కానీ కాస్త బలహీనమైన ఎబ్బెట్టయిన పుత్రుణ్ణి.” కాఫ్కా తన ఉత్తరాల్లో గానీ, డైరీల్లో గానీ ఎక్కడా ఈ స్థాయిలో ఏ పుస్తకం గురించీ రాయలేదు. ఫ్లాబె కూడా జీవితం మొత్తం సాహిత్యమయం చేసుకున్నాడు. నిజానికి ఈ అరుదైన జాతికి అతణ్ణే ఆదిపురుషునిగా చెప్పుకోవచ్చు. పెళ్ళి చేసుకోకుండా, క్రాయిసెట్ అనే చిన్న పల్లెటూళ్ళో స్థిరపడిపోయి, కేవలం రాతకే అంకితమైపోయిన అతణ్ణి, ఆ చుట్టుపక్కల వాళ్ళంతా క్రాయిసెట్ సన్యాసి అని పిలిచేవారట. కానీ ఫ్లాబెకు కాఫ్కాకు ఒక తేడా ఉంది. ఫ్లాబె సాహిత్యం కోసం సన్యాసం మాత్రమే తీసుకున్నాడు. కానీ కాఫ్కా సాహిత్యానికి బంధితుడై చిక్కిపోయాడు. అది వినా జీవితం లేదు. దీన్ని నిరూపించే సంఘటన ఈ కాలంలోనే జరిగింది.

కాఫ్కా బావ (చెల్లెలి భర్త) తనకు అందిన కట్నంతో ఒక ఆస్బెస్టాస్ ఫాక్టరీ పెట్టాలనుకున్నాడు. అందులో కాఫ్కాను భాగస్వామిగా తీసుకోవాలనుకున్నాడు. కాఫ్కా కూడా మొదట్లో ఉత్సాహం చూపించాడు. తండ్రి దృష్టిలో తాను సమర్థుడైన కొడుకుగా నిలిచేందుకు ఇదో అవకాశమని భావించాడు. స్వయంగా కొంత డబ్బు కూడా పెట్టుబడిగా పెట్టాడు. కానీ దాని తాలూకు రాతవ్యవహారాల్లో పాల్గొనాల్సి రావటం, పనిలో కొంత తానూ భుజాన మోయాల్సి రావటం – వీటి వల్ల అతను రాసుకోవడానికి మాత్రమే అట్టేపెట్టుకున్న సమయంలో కొంత కోతపడింది. రాయలేకపోతున్నానే అన్న ఆందోళన బద్దలవటానికి ఎంతో కాలం పట్టలేదు. కాఫ్కా బావ ఒకసారి రెండు వారాల పాటు ఎక్కడికో వెళ్లాడు. దాంతో కాఫ్కాయే ఫాక్టరీకి వెళ్లి అక్కడి పనులు చూసుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. కాఫ్కా ఇక భరించలేకపోయాదు. వెళ్లనని మొరాయించాడు. ఇంట్లో ఒత్తిడి మొదలైంది. తండ్రి అలవాటైన మందలింపులతో కొడుకుని ముట్టడించసాగాడు. దీనికి మిగతా కుటుంబ సభ్యులూ తోడయ్యారు. చివరికి ఎప్పుడూ అన్నయ్య పక్షం వహించే చెల్లెలు ఓట్ల కూడా అతనికి ఎదురు తిరిగింది. ఈ పరిస్థితుల్లోనే ఒక రోజు కాఫ్కా తన పై అంతస్తు గదిలో కిటికీ అద్దానికి తల ఆనించి, కిందకు తదేకంగా చూస్తూ, దూకేద్దామా అని ఆలోచించాడు. “కానీ చచ్చిపోవటంతో పోలిస్తే బతికి ఉండటమే నా రాతకు తక్కువ అడ్డు వస్తుంది” అని వాపోతూ మిత్రుడు బ్రాడ్‌కు ఉత్తరం రాశాడు. బ్రాడ్ కంగారుపడి, కాఫ్కా తల్లికి రహస్యంగా ఉత్తరం రాసి పరిస్థితి వివరించాడు. ఫాక్టరీకి వెళ్లి పనులు చూసుకొమ్మన్నందుకు కొడుకు చావు దాకా ఆలోచిస్తున్నాడని తెలిసి తల్లి బెంబేలెత్తిపోయింది. అతణ్ణి ఆ పని బాధ్యతల్నుంచి పూర్తిగా తప్పించింది. కానీ తండ్రి దృష్టిలో అతను మరింత పనికిరానివాడిగా మిగిలాడు.

సాహిత్యం చుట్టూ ఇంతగా జీవితాన్ని అల్లేసుకున్నా, కాఫ్కా దాన్ని ఒక కెరీర్‌గానో, గుర్తింపు తెచ్చే వ్యాసంగం గానో ఎప్పుడూ భావించలేదు. జీవితంతో లంకె నిలిపే ఏకైక ఆసరాగా సాహిత్యాన్ని చూశాడు. ఆ దిశగా అతని పయనం తప్పించలేని నుదుటి రాతలా సాగిపోయింది. ఈ కాలంలోనే తన డైరిలో ఇలా రాసుకున్నాడు: “నా అస్తిత్వం పట్టాల్సిన మార్గం రచనే అన్నది ఒక్కసారి నా అంతర్నిర్మాణంలో ఖరారైపోగానే, నాలో సర్వశక్తులూ అటే దూకాయి. దాంతో అప్పటిదాకా సెక్సుకూ, తిండికీ, తాగుడుకూ, తాత్త్వ వివేచనకూ, అన్నింటి కన్నా ముఖ్యంగా సంగీతానికీ కేటాయించిన శక్తులన్నీ ఖాళీ అయిపోయాయి. నేను ఆ విషయాల్లో తుప్పుపట్టిపోయాను. కానీ ఇది తప్పదు. ఎందుకంటే, నా శక్తులన్నీ ఏకమైనా అది ఎంత బలహీనమైన కూడిక అంటే, అవన్నీ ఒక్క తాటిపై నడిస్తేనే నా రచనకు కనీసం సగమైనా సాయపడగలవు. ఇప్పుడిక నా అభివృద్ధి సంపూర్ణం, త్యాగం చేయటానికి ఇంకేం మిగల్లేదు; ఈ సంక్లిష్టమైన అమరికలోంచి నా ఆఫీసు పని ఒక్కటీ తీసి పక్కన పెడితే చాలు, నేను నా అసలైన జీవితాన్ని ప్రారంభించగలను; అప్పుడిక, నా రచనా వ్యాసంగపు పురోగతితో పాటూ, నా ముఖం కూడా సహజమైన తీరులో ముసలిదవుతుంది.”

మాక్స్ బ్రాడ్‌‌లా మరికొందరు రచయితలు కూడా మిత్రులు కావటంతో, చుట్టూ అనుకూలమైన వాతావరణం కూడా ఏర్పడినట్టయింది. ఈ కాలంలో రాసిన చిన్న చిన్న స్కెచ్‌లు ఒక మిత్రుడు నడిపే పత్రికలో వచ్చాయి. తర్వాత ఇవే “మెడిటేషన్స్” పేరుతో పుస్తకంగా అచ్చయ్యాయి. ఇదే కాఫ్కా మొదటి పుస్తకం. కాఫ్కా జీవిత కాలంలో అచ్చయిన పుస్తకాలు చాలా తక్కువ. అన్నీ కలిపితే ఏడు సన్నపాటి పుస్తకాలు తేలతాయి. వీటిలో ఎనిమిది పెద్ద కథలున్నాయి, ముఫ్ఫై చిన్న స్కెచ్‌ల లాంటివి ఉన్నాయి. ఈ సమయంలోనే (1910) కాఫ్కా డైరీ కూడా రాయటం మొదలుపెట్టాడు. ఇందులో రోజుల గురించి రాసుకోవటమే గాక, రైటింగ్ ఎక్సర్సయిజుల్లాంటివి కూడా రాసుకున్నాడు. ఈ అలవాటు చివరిదాకా పోగొట్టుకోలేదు.

ఇంట్లో వాతావరణం మాత్రం అతణ్ణి ఎంతో కొంత నలిబిలి చేస్తూనే ఉండేది. చిరు అలికిడికి కూడా ఇబ్బంది పడే అతని వినికిడిపై ఇంట్లోని సాంసారికమైన చప్పుళ్ళేవో నిరంతరం దాడి చేస్తూనే ఉండేవి. రాయటం తనకెంత ముఖ్యమనేది ఇంట్లో ఎవరూ పట్టించుకోకపోవటం అతణ్ణి ఇబ్బంది పెట్టేది. తండ్రి హెర్మన్ అయితే పట్టించుకోకపోవటం మాట అటుంచి, ద్వేషించేవాడు కూడా. కొడుకు గౌరవప్రదమైన ఉద్యోగం చేస్తూ ఏదో మిగిలిన సమయాన్నే రాయటానికి వాడుకుంటున్నా, అది ఆయనకు నచ్చేది కాదు. ఆయన కాఫ్కా రచనా వ్యాసంగాన్నే కాదు, దాంతో సంబంధం ఉన్న కాఫ్కా మిత్రుల్ని కూడా సహించలేకపోయేవాడు. వాళ్ళెవ్వరు ఇంటికి వచ్చినా సరైన ఆదరం లభించేది కాదు. తండ్రి ద్వేషించే కొద్దీ కాఫ్కా మరింతగా సాహిత్యంలోకి కుంచించుకుపోయేవాడు. కానీ చివరకు అక్కడ రాసేది కూడా తండ్రి గురించే. జీవిత చరమాంకంలో తండ్రిని ఉద్దేశించి రాసిన (కానీ ఆయనకు ఇవ్వకుండా వదిలేసిన) ఒక ఉత్తరంలో: “నా రాతలన్నీ నీ గురించే; నీ గుండెల మీద పడి వెళ్ళగక్కుకోలేని ఆక్రోశాన్నే అక్కడ వెళ్ళగక్కుకున్నాను. అదంతా నీకు నేను ఉద్దేశపూర్వకంగా, తాత్సారం చేస్తూ పలుకుతున్న వీడ్కోలు లాంటిది,” అంటాడు.

తన బలహీన స్వభావాన్ని అలుసుగా తీసుకుని మనుషులు తాను సృష్టించుకున్న – సాహిత్యానికి మాత్రమే పరిమితమైన – వలయంలోకి చొరబడవచ్చునన్న భయం కాఫ్కాలో ప్రవేశించటానికి ఈ ఇంటి వాతావరణమే కారణం. ఇదే అతనిలో కుటుంబ జీవితం పట్ల విరక్తి కలగజేసింది, పెళ్ళి పట్ల భయాన్ని పెంచింది. అలాగని ఒంటరితనమూ భరించలేకపోయేవాడు. అపుడే అతని జీవితంలోకి ఫెలిస్ అనే అమ్మాయి ప్రవేశించింది. ఇక రచనకు తప్పనిసరైన ఒంటరితనానికీ – తోడు కోసం ఆరాటానికీ మధ్య ఐదేళ్ళపాటు సాగబోయే భారీ సంగ్రామానికి తెర లేచింది.

భయం


1912 ఆగస్టు 14న, ఇరవై తొమ్మిదేళ్ళ కాఫ్కా, ఓ సాయంత్రం తన మిత్రుడు మాక్స్ బ్రాడ్ ఇంటికి ఓ విందుకు వెళ్ళాడు. అక్కడ ఫెలిస్‌ను తొలిసారి చూశాడు. తొలి చూపు ప్రేమ అనటానికి లేదు, కానీ ఆమె పట్ల ఆకర్షితుడయ్యాడు. వారం తర్వాత డైరీలో ఆమె గురించి మొదటి ఎంట్రీ రాసుకున్నాడు, నెల తర్వాత ఆమెకు మొదటి ఉత్తరం రాశాడు.

ఈ ఉత్తరం రాసిన రెండు రోజులకే, కాఫ్కా జీవితంలో అంతకన్నా ముఖ్యమైన సంఘటన జరిగింది. ముందు దాని గురించి చెప్పుకోవాలి. సెప్టెంబరు 22 రాత్రి మొదలై 23 తెల్లారే వరకూ కూర్చుని, “ద జడ్జిమెంట్” అనే కథ రాశాడు. “నా రాతలన్నీ నీ గురించే” అని కాఫ్కా తన తండ్రిని ఉద్దేశించి అన్న మాటలకు ఈ రచనే తొలి సాక్ష్యం. ఈ కథలో, ఒక తండ్రి కొడుకు మీద అనూహ్యమైన ఆరోపణలు చేస్తాడు, చివర్లో ఎందులోనన్నా దూకి చావమంటాడు, కొడుకు ఆ తీర్పును మారుమాటాడకుండా అంగీకరించి బ్రిడ్జి మీంచి నదిలోకి దూకి చనిపోతాడు. సాహిత్యానికే జీవితాన్ని అంకితం చేసుకోవటం పట్ల అతనిలో ఇంకా ఏమైనా అనుమానాలుంటే, ఈ కథతో అవన్నీ తీరిపోయాయి. ఈ కథ రాసిన వెంటనే డైరీలో ఇలా రాసుకున్నాడు: “ ‘ది జడ్జ్‌మెంట్’ అనే కథను ఒకే సిట్టింగులో రాత్రి పదింటి నుంచి ఉదయం ఆరింటి మధ్యలో రాసాను. అదేపనిగా కూర్చోవటం వల్ల నా కాళ్ళు బాగా తిమ్మిరెక్కిపోయి వాటిని డెస్కు కింద నుంచి బయటకు తీయటమే కష్టమైంది. తీవ్రమైన అలసటా, ఆనందమూను. ఏదో నీటి మీద జారుతున్నంత తేలిగ్గా కథ కళ్ళెదుటే ఎదిగింది. రాత్రి ఎన్నోసార్లు నా వీపు నిటారు చేసుకున్నాను. అంతా ఎలా చెప్పవచ్చో, అన్ని వింత కల్పనల కోసమూ ఒక గొప్ప జ్వాల ఎలా సిద్ధంగా ఉంటుందో, అవి అందులో పడి ఎలా ఆహుతవుతూ తిరిగి ప్రభవిస్తుంటాయో అనుభూతి చెందాను. కిటికీ బయట ఆకాశంలో నీలిమ చేరింది. బండేదో దొర్లుకుంటూ పోయింది. ఇద్దరు వంతెన దాటుతున్నారు. గడియారం వైపు ఆఖరుసారి చూసింది రెండింటికి. పనిమనిషి వరండాలో అడుగు పెట్టేసరికి, నేను చివరి వాక్యం రాస్తున్నాను. లైటార్పటం, పగటి వెలుగు. నా గుండె చుట్టూ సన్నని మంట. అర్థరాత్రి దాటాకా మాయమైన అలసట. నిలువునా కంపిస్తూ చెల్లెళ్ళ గదిలోకి ప్రవేశించటం. అంతకుముందు, పనిమనిషి ఎదుటే ఒళ్ళు విరుచుకుంటూ, ‘ఇప్పటిదాకా రాస్తూనే ఉన్నాను’ అని చెప్పటం. అప్పుడే వేసినట్టు చెదరని పక్క… రాస్తే ఇలాగే రాయాలి, ఇదే స్పష్టతతో, దేహాత్మల్ని ఏ తొడుగుల వెనకా దాచకుండా రాయాలి.”

కాఫ్కా ఎలాంటి రచనానుభవాన్ని మనసులో పెట్టుకుని, అది సాధ్యమేనని గుడ్డిగానమ్ముతూ, ఇన్నాళ్ళూ సాహిత్యాన్ని పట్టుదలగా పట్టుకున్నాడో, అలాంటి రచనానుభవం నిజంగా సాధ్యమేనని ఈ రాత్రితో అతనికి తేలిపోయింది. మానసికంగా అతని రచనా జీవితం ఈ రాత్రే మొదలైందని చెప్పాలి. ఇదే ఊపులో కాఫ్కా రాసి ఉంటే, ఆయన రచనల జాబితా ఇప్పుడు లభ్యమవుతున్న దానికన్నా రెండింతలు ఉండేదే. కానీ కాఫ్కాకు చివరి దాకా అర్థం కానిదేమిటంటే, సాహిత్యం మాత్రమే మనిషి జీవితానికి సంపూర్ణత చేకూర్చలేదు. మనిషి సహజాతాల్లో తోడు కోసం ఆరాటం కూడా ఒకటి, అది తీరనప్పుడు ఒంటరితనం నలిపేస్తుంది. మరీ సున్నితమైన కాఫ్కాను – నీషేను చదివి, దేవుడు చనిపోయాడన్నది జీర్ణించుకుని, ఆధునిక మానవుని అస్తిత్వం జన్మతోనే అనాథ అని నమ్మిన కాఫ్కాను – ఈ ఒంటరితనం మరింత దట్టంగా కమ్ముకుంది. అదే ఆయన్ను ఫెలిస్ వైపు మళ్ళేలా చేసింది. రచనలు చేయాల్సిన ఎన్నో విలువైన రాత్రులను ఆయన ఫెలిస్‌కు ఉత్తరాలు రాయటంలో గడిపేశాడు. తన కాల్పనిక రచనల సైజుని మించి పోయేటంత లేఖా సాహిత్యం సృష్టించాడు.

ఫెలిస్‌ బెర్లిన్ లో ఉండేది. డిక్టేటింగ్ మెషీన్‌లు తయారు చేసే కంపెనీలో ఎగ్జిక్యుటివ్ సెక్రటరీగా పని చేసేది. మన హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో అక్క పాత్ర వేసిన కథానాయికకు ఎన్ని కష్టాలుంటాయో అన్నీ ఫెలిస్‌కూ ఉన్నాయి. ఉద్యోగం చేస్తూ కుటుంబ బాధ్యత మోయాల్సి రావటం, బాధ్యత లేని తండ్రి, అడ్డదారులు పట్టిన తమ్ముడూ, పెళ్ళి కాకుండా తల్లయిన చెల్లాయీ… ఇలాగ. ఆమె ఫక్కా మధ్యతరగతి (బూర్జువా) మనస్తత్వం ఉన్న మామూలు అమ్మాయి. ధైర్యస్తురాలు, సహనశీలి, కలివిడి మనిషి, సంప్రదాయబద్ధురాలు. ఆమె కాఫ్కా నుంచి కోరుకున్నదల్లా ఒక భర్తని.

కానీ కాఫ్కా ఆమె నుంచి ఆశించింది వేరు. తనకు ఎప్పుడూ పొత్తుకుదరని ప్రపంచానికి ఆమెను ప్రతినిధిగా చూశాడు. ఆమెతో సామరస్యమైన సాహచర్యం సాధ్యమైతే, అది ప్రపంచంతోనూ లభించినట్టే అనుకున్నాడు. కానీ ఇది జరగాలంటే, ఒకటి: కాఫ్కాకు సాహిత్యం పట్ల ఉన్న తీవ్రమైన అంకితభావాన్ని ఆమె అర్థం చేసుకోవాలి. రెండు: కాఫ్కా సాహిత్యాన్ని కూడా అర్థం చేసుకోవాలి. కాఫ్కా ఉత్తరాల ద్వారా ఈ బృహత్ప్రయత్నం మొదలుపెట్టాడు. కానీ స్వభావరీత్యా ఆమెలో ఆ రెండు లక్షణాలూ లేవు. సాహిత్యం పట్ల అతనికున్న పాషన్‌ను ఒక మామూలు హాబీగా మాత్రమే అర్థం చేసుకుంది. ఆమెకు సంబంధించినంత వరకూ, కాఫ్కా ఒక రచయిత అవటం కాకపోవటం అన్నది, తమ బంధంతో నిమిత్తమున్న విషయమే కాదు. ఇది కాఫ్కాకు తొందర్లోనే అర్థమైంది.

ఆ ఏడాది చివర్లోనే విడుదలైన తన పుస్తకం ‘మెడిటేషన్స్’ను ఆమెకు చదవమని పంపించాడు. ఆమె నచ్చలేదని చెప్పి ఉన్నా, అర్థం కాలేదని చెప్పి ఉన్నా అర్థం చేసుకునేవాడే. కానీ ఆమె చూపించిన నిరాసక్తతను మాత్రం ఒప్పుకోలేకపోయాడు. కాఫ్కాకు ఈ బంధం పట్ల భయాలు మొదలయ్యాయి. తనను సాహిత్యానికి దూరం చేసే సాధారణ గృహస్థు జీవితం అతనికి ఎట్టి పరిస్థితుల్లోనూ వద్దు. అయినా ఆమె నుంచి దూరం జరగలేకపోయాడు. ఇలా ఎటూ తెగని ఊగిసలాటతో తనను బాధపెట్టుకోవడమే కాదు, ఆమెనూ విపరీతంగా బాధపెట్టాడు. ఆకర్షణా వికర్షణలూ ఒకే బలంతో అతనిపై పని చేసి వణికించాయి. ఆమె పట్ల అబ్సెసివ్ గా మారిపోయాడు. ఒక్కోసారి నెలకు యాభై పైగా ఉత్తరాలు రాసిన సందర్భాలున్నాయి. వీళ్ళీద్దరి బంధం దాదాపుగా ఉత్తరాల మీదే సాగింది. ఐదేళ్ళ అనుబంధంలో వాళ్ళు ముఖాముఖీ కలుసుకున్నది చాలా తక్కువ. ఇంతాజేసి ప్రాగ్ నుంచి బెర్లిన్ నగరానికి రైలు ప్రయాణం కేవలం ఏడుగంటలే. అయినా కాఫ్కా కదిలేవాడు కాదు. ఆమె రమ్మని బలవంతపెట్టినా, తాను రాసుకునే సమయం పాడవుతుందన్న సాకుతో వాయిదా వేసేవాడు, కానీ నిజానికి ఆ సమయాన్ని కూడా ఆమెకు ఉత్తరాలు రాయటంలోనే గడిపేసేవాడు. ఆ ఉత్తరాల వెనక ఉన్నది ఒకటే లక్ష్యం. తనకూ సాహిత్యానికీ మధ్యనున్న అవినాభావ సంబంధం ఎంత గట్టిదో ఆమె అర్థం చేసుకోవాలి, అంగీకరించాలి. అంతేకాదు, తనలోని భయాలనూ, దిగుళ్లనూ, చెడునూ, సున్నితత్వాన్నీ అన్నింటినీ ఆమె ముందు నగ్నంగా బయట పెట్టాడు. ఈ ఉత్తరాలన్నీ చదివితే మనకు అందులో ప్రేమ కాదు కనిపించేది, తన ఉనికికై కాఫ్కా చేసుకుంటున్న అప్పీలు కనిపిస్తుంది. ఆ అప్పీలు ఆమె ముందు కూడా కాదు. ప్రపంచం ముందు. ప్రపంచానికి ఆమె కేవలం ఒక ప్రతినిధి అంతే.

ప్రస్తుతం కాఫ్కా ఉత్తరాలు మనకు మిగిలాయి కానీ, ఆమె ఉత్తరాలేవీ మిగల్లేదు. కాబట్టి, ఆమె వైపు కథేమిటన్నది స్పష్టంగా తెలియదు. కానీ కాఫ్కా ఉత్తరాల్లోనే కొన్ని చోట్ల ఆమె వెర్షన్ కూడా చూచాయగా బోధపడుతుంది. ఆమె అతని ఆత్మదూషణల్నీ, సాహిత్యమనే తన ఒంటిస్తంభం మేడ చొరబాటుకు గురవుతుందేమో అన్న భయాల్నీ, నిరాధారమైన ఆరోగ్య శంకల్నీ, వీటన్నింటినీ చాలా ఓర్పుగా భరించింది. తన పద్ధతిలో సముదాయించటానికి కూడా ప్రయత్నించింది: “మరీ అంత విశ్లేషణ పనికి రాదు, నన్ను గుడ్డిగా నమ్మేయరాదూ”, “నీ అంత స్పష్టంగా చూడగల మనిషిని ఒంటరితనం మరింత డిప్రెస్ చేస్తుంది”, “అలా బయటి ప్రపంచానికి బొత్తిగా దూరంగా ఉండిపోకూడదు”; ఇలాంటి వాక్యాలు కాఫ్కా మళ్ళీ తన జవాబుల్లో కోట్ చేయటం వల్ల బయటపడ్డాయి. కాఫ్కా తన నిద్రలేముల గురించీ, తలపోట్ల గురించీ పదే పదే రాస్తుంటే, అలా ఉన్న శక్తినంతా రాయటానికే ఖర్చుపెట్టవద్దని నచ్చచెప్పటానికి ప్రయత్నించేది. ఆమె నుంచి ఈ తరహా మాటలు వచ్చినపుడల్లా, ఆమె తన రచనా వ్యాసంగం జోలికి వస్తుందన్నంత గాభరా పడిపోయేవాడు. ఎప్పటిలాగే మందలిస్తున్న ధోరణిలో రచన తనకు ఎంత ముఖ్యమన్నది రాసేవాడు: “నాకు చేతనైన ఆ ఒక్క పని పైనా నా శక్తులన్నీ ఖర్చు పెట్టకూడదా? అలా చేయకపోతే నా కన్నా మూర్ఖుడెవడూ ఉండడు! నా రాతలు ఎందుకూ పనికిరానివే కావచ్చు; అలాంటప్పుడిక నేనూ ఎందుకూ పనికిరాని వాణ్ణే. అలాగని ఈ విషయంలో నన్ను నేను మినహాయించుకుంటే, నన్ను నేను చంపుకున్నట్టే.” చివరకు పెళ్ళి పట్ల భయాల్ని కూడా నిస్సంకోచంగానే రాశాడు. తనను తాను ఒక సామాజికునిగా (సోషల్ ఆనిమల్), కుటుంబీకునిగా (ఫామిలీ మాన్), అన్నింటికన్నా ముఖ్యంగా సంభాషణా చతురునిగా (కాన్వర్సేషనలిస్టు) ఊహించుకోలేకపోయేవాడు. చివరకు తల్లిదండ్రుల పడగ్గదిలో మంచం మీద నైట్ డ్రస్సులు ఒద్దికగా పేర్చి ఉండే దృశ్యాన్ని కూడా భరించలేకపోయేవాడు. కుటుంబ జీవితానికి ప్రతీకగా కనిపించేదేదైనా అతణ్ణి అంతగా వెగటు పర్చేది. ఫెలిస్‌కు ఈ అతి సున్నితత్వం అర్థమయ్యేది కాదు; ఒకసారి మాక్స్ బ్రాడ్ బెర్లిన్ వస్తే అతణ్ణి కలిసి తన గోడు వెళ్ళబోసుకుంది. బ్రాడ్ తన మిత్రుని తరపున మాట్లాడి ఆమెకు సర్ది చెప్పటానికి ప్రయత్నించాడు. “అతని అతిసున్నితత్వాన్ని మీరు కాస్త భరించాలి. ఆ క్షణాన తన మూడ్‍ ఎలా ఉందో అలాగే స్పందిస్తాడు. అన్ని విషయాల్లో అబ్సొల్యూట్‌నూ అల్టిమేట్‌నూ మాత్రమే ఆశించే వ్యక్తి, ఎన్నటికీ రాజీ పడడు.”

వాళ్ళిద్దరికీ పరిచయమైన తొలినెలల్లో, ఈ బంధం ఇంకా ఇంత గందరగోళంలో పడక ముందు, అది కాఫ్కాకు సృజనాత్మకంగా చాలా బలాన్నిచ్చింది. కాబట్టే “ద జడ్జిమెంటు” కథ రాసిన తర్వాతి నెలలోనే తన అసంపూర్ణ నవలాత్రయంలో మొదటిదైన “తప్పిపోయిన మనిషి” (దీనికి తర్వాత బ్రాడ్ పెట్టిన పేరు “అమెరికా”) రాయటం మొదలుపెట్టి, మొదటి అధ్యాయం “ద స్టోకర్” పూర్తి చేశాడు. ఆ తర్వాతి నెలలోనే తన ప్రసిద్ధ నవలిక “మెటమార్ఫసిస్” పూర్తి చేశాడు. తండ్రితో అతని అనుబంధపు నీడలు ఈ మూడు రచనల మీదా పడ్డాయి.

కాఫ్కా రచనలన్నీ అంతే. అవన్నీ అతని జీవితానుభవాల నుంచి ఎదిగినవే అయినా, వాటిలో ఆ జాడల్ని పసిగట్టడం చాలా కష్టం. సీతాకోకలో దాని గొంగళి అంశను ఎంతమాత్రం చూడగలమో, ఆయన రచనల్లో ఆయన జీవితాన్నీ అంతే చూడగలం. అది పూర్తిగా రూపాంతరం పొందాకనే రచనల్లోకి వచ్చింది. అయితే కాఫ్కా ముందున్న రచయితలూ అదే కదా చేసింది? ఎవరైనా జీవిత పరిధి నుంచే కదా రచనల్ని సృష్టించేది? మరి కాఫ్కా వాళ్ళ కన్నా ఏ విధంగా భిన్నం?
వాళ్ళందరి విషయంలోనూ ఈ రూపాంతరక్రియకు పూర్వముండే జీవితానికీ, తర్వాత పుట్టిన రచనకూ కొంతైనా పోలిక చూపించవచ్చు. ఎందుకంటే జీవితం ఎలాంటి రియాలిటీలో నడుస్తుందో దాన్నే రచనకు కూడా భూమికగా స్వీకరించారు. కాఫ్కా మాత్రం తన జీవితానుభవాల్ని రచనగా మార్చేటప్పుడు రియాలిటీని భూమికగా స్వీకరించలేదు, వాటిని రియాలిటీతో ఏ మాత్రం సంబంధం లేని రూపంలోకి మార్చాడు; కలల్లోకి రూపాంతరం చెందించాడు, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, పీడకలల్లోకి.

కాఫ్కా రచనాప్రక్రియ మన కలల నిర్మాణాన్ని ఫాలో అవుతుంది. మన కలల్లో ఒక ధోరణి ఉంటుంది. వాటిలో కనపడే దృశ్యాలకూ, వాటివల్ల కలిగే భావాలకూ పొంతన ఉండదు. కనపడే దృశ్యాలతో ఏ మాత్రం సంబంధంలేని భావాలేవో కలుగుతాయి. కలలో మనం చందమామని చూసి కూడా భయపడవచ్చు. మరి వాస్తవజీవితంలో ఆహ్లాదకారకమైన చందమామ కలలో భయకారకమెలా అయింది? అంటే, నిజానికి కాలేదు. కలలో మనకు భయం కలిగేది చందమామ ‘వల్ల’ కాదు, మనలో ఆల్రెడీ ఉన్న భయమే చందమామ మీదకూ ప్రసరించి దాన్ని కూడా భయావహం చేస్తుంది, అదే స్థానంలో మరే ఇతర అప్రమాదకర (benign) దృశ్యాలున్నా కూడా – సూర్యాస్తమయం, చెట్టు మీద కాకులు, దగ్గరగా ఎగిరే విమానం – అలాంటి భయమే కలగవచ్చు. అంటే, కల ఒక భావంతో మొదలవుతుంది, ఇక తర్వాత కలలో ఏ దృశ్యం వచ్చి పడినా, అది ఆ పూర్వనిశ్చిత భావాన్నే ప్రకటిస్తుంది. కాబట్టి, ఆ చందమామ కలకు సంబంధించినంత వరకూ దృశ్యం వల్ల భయం కాదు, భయం వల్ల దృశ్యం. ఇక్కడ భయం ప్రేరేపిత భావం కాదు, ప్రేరేపక భావం. దీన్ని ఒక్క భయం అనే భావానికే కాదు; ఆహ్లాదం, కామం, ఉద్వేగం, జుగుప్స ఇలా ఏ భావానికైనా వర్తింపజేయవచ్చు. కానీ కాఫ్కా జీవితాన్ని ప్రధానంగా నిర్దేశించిన ఏకైక భావం భయం: తండ్రి పట్ల భయం, ఆరోగ్యం పట్ల భయం, సెక్సువల్ ఇంటిమసీ పట్ల భయం, పెళ్ళి పట్ల భయం, చివరకు సాహిత్యం పట్ల కూడా భయమే. ఒకచోటైతే “the very impossibility of living” గురించి కూడా రాస్తాడు. కాఫ్కా ఉత్తరాల్లో ఎక్కువసార్లు కన్పించే పదం భయం (angst).

కాఫ్కా కూడా తత్పూర్వ రచయితల్లా జీవితానుభవాల్నించే సృష్టించాడు నిజమే. కానీ జీవితానుభవాల్ని యథాతథంగా తీసుకోలేదు, అవి తనలో కలిగించిన భావాల్ని మాత్రం తీసుకున్నాడు. ఆ భావాన్ని తనలో నింపుకుని, ఆ భావం పూనినవాడై, ఆ భావంతో మమేకమై… కలం కదిపాడు. ఇక అతను రాసింది ఏదైనా ఆ భావం మాత్రం ఆ సృష్టి అంతటా ఒక పారదర్శకపు పొరలా పరుచుకుని ఉంటుంది. పాఠకుని మనసు ఆ భావాన్ని అనుభూతి చెందుతుంది, కానీ అతని బుద్ధికి మాత్రం ఆ భావానికీ, రచనలోని వివరాలకూ తార్కికమైన సంబంధమేమిటో అందదు. అచ్చంగా కలల్లోలాగానే. కానీ ఎంతైనా పుస్తకం అనేది ఒక కాంక్రీటు వాస్తవం. అందులో వ్యాకరణానుగుణమైన వాక్యాలూ, వర్ణితమైన సన్నివేశాలూ ఒక తార్కికమైన క్రమాన్నీ, మెటీరియల్ ఉనికినీ కలిగి ఉంటాయి. పైగా కాఫ్కా మామూలు రియలిస్టు రచయితల కన్నా అత్యంత స్పష్టంగా తన కాల్పనిక ప్రపంచాల్ని తీర్చిదిద్దుతాడు. దాంతో అవి తార్కికంగా అత్యంత స్పష్టంగా ఉంటూనే, వాటి అర్థం మాత్రం కలల్లోలా అలికేసినట్టు ఉంటుంది. ఈ కాంబినేషన్ పాఠకుల్ని చిత్రమైన ఆకర్షణతో కట్టిపడేస్తుంది. వారికి కాఫ్కాను చదవడం మెలకువలో ఉండి కలగంటున్నట్టుగా తోస్తుంది. అందుకే ఈ రచనల్ని స్పష్టమైన కలలు (lucid dreams) అనవచ్చు. ఈ కారణం చేతనే, కాఫ్కా రచనల్ని ఆత్మకథాత్మకాలుగా పరిగణించి వాటి విలువని లెక్కగట్టలేం. కాఫ్కా జీవితాన్ని పూర్తిగా లెక్కలోంచి మినహాయించినా కూడా, అతని రచనలు వింత సౌందర్యంతో, సొంత సత్యంతో, సంపూర్ణ స్వతంత్రతతో మన్నుతాయి.

దీనికి “మెటమార్ఫసిస్” నవలిక ఉదాహరణ. “గ్రెగర్ జమ్జా ఒక ఉదయం కలత కలల్నించి నిద్ర లేచే సరికి, తన మంచంపై తాను ఒక పెద్ద కీటకంగా మారిపోయి ఉండటాన్ని చూసుకున్నాడు” అనే వాక్యంతో మొదలవుతుందీ కథ. ఇక అక్కణ్ణించి గ్రెగర్ జమ్‌జా ఈ కొత్త రూపంలో తన రోజువారీ జీవితం గడిపేందుకు ఉద్యుక్తుడవటాన్నీ, అందులో ఎదురయ్యే ఇబ్బందుల్నీ భీతి గొలిపే స్పష్టతతో చూపిస్తుంది. కాఫ్కా జీవించి ఉండగా ప్రచురితమైన రచనలన్నింటిలోకీ ఇదే ఎక్కువ ప్రసిద్ధి పొందింది. ఈ రచనతో సాహిత్యంలో మోడర్నిటీ ఆరంభమైందటారు. ఈ రచన మొదటి వాక్యంలో కనిపించే సృజనాత్మక ధైర్యం ఎందరో రచయితల్ని ప్రేరేపించింది. ఎందరో అప్పటిదాకా తమ కాళ్ళను కట్టి పడేసిన వాస్తవికతా శృంఖలాల్ని తొలగించుకుని, తమ అంతర్లోకాల్ని స్వాప్నిక పక్షాలపై సృజనాకాశంలోకి స్వేచ్ఛగా ఎగరవేశారు. కాగితం మీద ఏదైనా సాధ్యమేననే ఎరుక వల్ల కలిగిన స్వేచ్ఛా భావమది.

ప్రముఖ స్పానిష్ రచయిత గాబ్రియెల్ గార్సియా మార్కెజ్ తనపై మెటమార్ఫసిస్ ప్రభావాన్ని ఇలా చెప్తాడు: “నా పదిహేడేళ్ళపుడు ‘మెటమార్ఫసిస్’ చదివాకా అనిపించింది, నేను రచయితను కాగలనని. ఆ రచనలో గ్రెగర్ జమ్‌జా ఒక ఉదయం నిద్ర లేచి భారీ కీటకంగా మారిపోయాడన్నది చదివాకా, నాలో నేను అనుకున్నాను, ‘ఇలా రాసే వీలుందని నాకు తెలీదే, ఉన్నట్టయితే, నేను ఖచ్చితంగా కలం పట్టాల్సిందే.’ ” మార్కెజ్ ప్రసిద్ధ రచన “ఒన్ హండ్రడ్ ఇయర్స్ ఆఫ్ సొలిట్యూడ్”లో వాస్తవికత నుంచి విముక్తి పొందిన ఇలాంటి స్వేచ్ఛే కనిపిస్తుంది. దీన్నే మాజిక్ రియలిజం అన్నారు.

1912 – 1913 కాలంలో కాఫ్కాను పూనిన ఈ సృజనావేశం ఇంకెన్ని రాయించేదో. కానీ అతనే తవ్వుకున్న ఊబి క్రమేపీ అతణ్ణి లోనికి లాక్కోసాగింది. ఫెలిస్ తనను అర్థం చేసుకునే మనిషి కాదని కాఫ్కాకు అర్థమైనా, ఎందుకో ఆమెకు మరింత చేరువ కాకుండా నిగ్రహించుకోలేకపోయాడు. దీనికి కాఫ్కాలోనే ఉన్న మరో అంశ కారణం. నిజానికి సాహిత్యం తన జీవితానికి పట్టుకొమ్మ అంటూ ఎంతగా తనకు తాను చెప్పుకున్నా, సృజనకు అనివార్యమైన ఒంటరితనం చుట్టుముట్టినపుడు మాత్రం, కాఫ్కా సాహిత్యాన్ని ఒక శాపంగా కూడా భావించేవాడు. ప్రపంచపు అమాయక సంరంభంలో భాగం కాకుండా సాహిత్యం తనను పట్టి బంధిస్తున్నట్టు భావించేవాడు. ప్రపంచంలోకి పారిపోవాలని చూసేవాడు. ఇక్కడే ప్రపంచానికి ప్రతినిధిగా తానే ప్రతిష్టించుకున్న ఫెలిస్ అనే మూర్తి అతనికి శరణ్యమైంది. “ఆమె లేకుండా బతకలేను, అలాగని ఆమెతోనూ బతకలేను” అనే స్థితికి వచ్చేశాడు. వెర్టిగో ఉన్న వాడు బంగీజంప్ చేయాల్సి వస్తే ఇక చస్తే చచ్చానులే అనే ఏ తెగింపుకు చేరుకున్నాకా ముందుకు దూకుతాడో, అలాంటి తెగింపుతో, పెళ్ళి చేసుకొమ్మని కూడా అడిగేశాడు. 1913 జులైలో ఎంగేజ్మెంటు కూడా అయిపోయింది. మరుసటి ఏడాది మే నెలలో పెళ్ళి నిశ్చయమైంది. ఇంతా చేసి ఇప్పటిదాకా వాళ్ళిరువురూ కలిసిందీ, ముఖాముఖీ మాట్లాడుకున్నదీ ఒక్క రోజు మాత్రమే.

పెళ్ళికి తలైతే ఊపాడు గానీ, తీరా అది దగ్గర పడే కొద్దీ కాఫ్కాలో భయం పెరగసాగింది. తన డైరీలో పెళ్ళి పర్యవసానంగా వచ్చే సానుకూలతల్నీ, ప్రతికూలతల్నీ జాబితాగా రాసుకున్నాడు. ప్రతికూలతలే ఎక్కువ బరువు తూగాయని వేరే చెప్పనక్కర్లేదు. ఫెలిస్ కు ఇదంతా తెలియక మొదట్లో అంతా బానే ఉందని నమ్మినా, నెమ్మదిగా ఆమెకు కూడా కాఫ్కా ఊగిసలాట తాలూకు పొడ తగలడం మొదలైంది. దాని విశ్వరూపం ఎలాంటిదో ఆమెకు పూర్తిగా తెలిసింది మాత్రం, ఆమె తండ్రికి కాఫ్కా రాసిన ఒక ఉత్తరం చదివాక. సంప్రదాయం ప్రకారం కూతురి చేయి కోరుతూ తండ్రికి రాయాల్సిన ఉత్తరం ఒకటి కాఫ్కా రాసి పంపాడు. ఈ ఉత్తరంలో కాఫ్కా నిజాయితీతో పాటూ, అతని మొండితనం కూడా వ్యక్తమవుతుంది. మాక్స్ బ్రాడ్ తన మిత్రుడి గురించి చెపుతూ, అతను “అన్ని విషయాల్లో అబ్సొల్యూట్‌నూ అల్టిమేట్నూ్ ఆశించే వ్యక్తి” అని ఎందుకన్నాడో ఇక్కడ బోధపడుతుంది. కాఫ్కాకు సంబంధించినంతవరకూ, సాహిత్యం తనకు ఎంత ముఖ్యమన్నది ఫెలిస్ కు మాత్రమే అర్థమయితే చాలదు, ఆమె కుటుంబం మొత్తానికీ అర్థమవ్వాలి; వాళ్ళు కూడా అతణ్ణీ, అతని జీవన శైలినీ అంగీకరించాలి. ఇలాంటి ఉత్తరాన్ని ప్రపంచంలో ఏ ప్రేమికుడూ ప్రేయసి చేయి అడుగుతూ ఆమె తండ్రికి రాసి ఉండడు. అందులో ఒక భాగం ఇలా సాగుతుంది: “మీకు మీ కూతురు గురించి తెలుసు: ఆమె చలాకీగా, ఆరోగ్యంగా, ధీమాగా ఉండే అమ్మాయి; అలాంటి వాళ్ళు చలాకీగా, ఆరోగ్యంగా, ధీమాగా ఉండే వాళ్ళతో కలిసి జీవించాలి. మీకు నా గురించి పెద్దగా తెలీదు, ఇప్పటికే నా గురించి మీ కూతురుకు 500 లకు పైగా ఉత్తరాల్లో చెప్పిందంతా మళ్ళీ చెప్పలేను. కానీ ఒక్క విషయం దృష్టిలో పెట్టుకోండి చాలు: నా అస్తిత్వమంతా సాహిత్యం వైపే వెళ్తుంది; ముప్ఫయ్యేళ్ళ వయసు దాకా నేను ఎక్కడా తప్పకుండా ఈ తోవనే అనుసరించాను, దీన్ని వదిలేయాల్సి వస్తే నేను జీవించటం మానేస్తాను. నేను ఎలాంటి వాణ్ణయినా, ఎలాంటి వాణ్ణి కాకపోయినా, అంతా దీని చలవే. నేను ముక్తసరి మనిషిని, ఎవరితోనూ కలవను, గంటు ముఖం పెట్టుకుని ఉంటాను, స్వార్థపరుణ్ణి, ఆరోగ్యం పట్ల నిత్య శంకితుణ్ణి, నిజంగానే పెద్ద ఆరోగ్యవంతుణ్ణి కూడా కాదు. నేను నా కుటుంబంతో కలిసి ఉంటాను, వాళ్ళు చాలా ఆప్యాయత చూపించే మనుషులు, అయినా వాళ్లతో నేను ఒక అపరిచితుడి కన్నా అధ్వాన్నంగా ప్రవర్తిస్తాను. గత కొన్నేళ్ళలో నేను నా తల్లితో పది మాటలకన్నా ఎక్కువ మాట్లాడి ఉండను, తండ్రితో తప్పనిసరి పలకరింపుల్ని దాటి వెళ్ళను. నా పెళ్ళయిన చెల్లెళ్ళతోనూ, బావగార్లతోనూ అస్సలే మాట్లాడను, అలాగని వాళ్ళ పట్ల వ్యతిరేకత ఏం లేదు. నాకు కుటుంబ జీవితం అలవాటు లేదు. మరి ఆరోగ్యకరమైన వ్యక్తిత్వం కలిగి, ఆనందకరమైన వైవాహిక జీవితం రాసిపెట్టి ఉన్న మీ కూతురు, ఇలాంటి మనిషితో జీవించాలా? అతను ఆమెను ప్రేమిస్తున్నంత మాత్రాన, తన తప్పని సరి వ్యాసంగం కారణంగా తన సమయాన్నంతా ఒకే గదిలో గడిపే అలాంటి మనిషితో పాటూ ఆమె కూడా ఒక సన్యాసి తరహా జీవితం గడపాలా?” ఈ ఉత్తరం మొదట ఫెలిస్‌ను చేరింది. ఆమెకు ఈ ధోరణి అలవాటే. అందుకే దాన్ని తండ్రికి ఇవ్వలేదు. మూడో వ్యక్తి ఎవరైనా కలగజేసుకుంటే ఈ అయోమయం కాస్త చక్కబడుతుందేమో అన్న ఆశతో, ఆఫీసులో తన కొలీగ్ ఐన గ్రెటె బ్లోచ్ అనే అమ్మాయిని కాఫ్కా దగ్గరకు మధ్యవర్తిగా పంపించింది. ఇద్దరూ కలిసి మాట్లాడుకున్నారు. తర్వాత కాఫ్కా గ్రెటెకు కూడా ఉత్తరాలు రాయటం ప్రారంభించాడు. ఈ ఉత్తరాల్లో అతను ఫెలిస్‌తో పెళ్ళి పట్ల తనకున్న భయాల గురించి ఉన్నదున్నట్టు – స్వయానా ఫెలిస్‌కి రాసినట్టే – గ్రెటె కు కూడా రాశాడు. గ్రెటె ఈ ఉత్తరాల్ని తీసుకెళ్ళి ఫెలిస్‌కు చూపించింది. నిజానికి ఈ ఉత్తరాల ద్వారా ఫెలిస్‌కు కొత్తగా బయటపడిందేమీ లేదు. కానీ తమ అనుబంధానికే పరిమితం కావాల్సిన ఈ భయాల్ని ఇలా తన స్నేహితురాలితో కూడా పంచుకోవటం భరించలేకపోయింది. ఓ పక్క అతను పెళ్ళి తర్వాత కాపురం పెట్టడానికి ప్రాగ్ పట్టణంలో ఇళ్ళు వెతుకుతూ కూడా, మనసులో ఇలాంటి అనుమానాలు పెట్టుకున్నాడంటే సహించలేకపోయింది. అయితే గ్రెటె వెన్నుపోటు పొడిచిందని తెలియని కాఫ్కా, కొన్ని రోజుల తర్వాత, 1914 జూలై 11న, ఫెలిస్‌ను కలవటానికి బెర్లిన్ వెళ్ళి ఒక హోటల్లో దిగాడు. ఉన్నట్టుండి ఫెలిస్, గ్రెటె, ఆమె చెల్లెలూ కలిసి అతణ్ణి హోటల్లో ముట్టడించారు. ఈ సంఘటనకు కాఫ్కా తర్వాత తన డైరీలో ‘ట్రిబ్యునల్ ఎట్ ద హోటల్’ (హోటల్లో విచారణ సంఘం) అని పేరుపెట్టాడు. అక్కడ జరిగింది నిజంగా విచారణ లాంటిదే. అతను గ్రెటెకు రాసిన ఉత్తరాలే ప్రోసిక్యూషన్ డాక్యుమెంట్లుగా పనికొచ్చాయి. ఫెలిస్ వాటిని పట్టుకుని, అందులో ముందే అండర్‌లైన్ చేసిన వాక్యాల్ని పైకి చదివింది. అందరూ అతనిపై వ్యతిరేక ఆరోపణలు చేశారు. ఎంగేజ్మెంటు కేన్సిల్ అయింది. ఈ విచారణ పర్యంతం కాఫ్కా మాత్రం ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. అతనికి తన దోషం ఏమిటో స్పష్టంగా తెలియలేదు, కానీ దోషాన్ని మాత్రం అంగీకరించాడు. అచ్చం జోసెఫ్ కె లాగానే! కాఫ్కా ప్రసిద్ధ నవల “ద ట్రయల్” లో ముఖ్యపాత్ర జోసెఫ్ కె. ఈ సంఘటన జరిగిన తర్వాతి నెలలోనే కాఫ్కా ఆ నవల రాయటం ప్రారంభించాడు. ఇందులో జోసెఫ్ కె ఒక ఉదయాన నిద్ర లేచి చూసేసరికి, పక్క గదిలో అతణ్ణి అరెస్టు చేయటానికి ఇద్దరు కాపలాదారులు ఎదురుచూస్తూంటారు. అక్కణ్ణుంచి నవల చివరి దాకా, అతనికి తన నేరమేమిటో తెలియదు, కానీ కోర్టుల చుట్టూ లాయర్ల చుట్టూ తిరుగుతూంటాడు, చివరకు తెలియని నేరానికి శిక్షను కూడా అంగీకరిస్తాడు.

ఫెలిస్ నుంచి తాత్కాలికంగా విముక్తి చెంది, మళ్ళీ తన ఒంటరి జీవితంలోకి వచ్చిపడిన కాఫ్కా, ఈ “ట్రయల్” నవల రాయటంలో నిమగ్నమైపోయాడు. ఈ నవల కోసం ఆఫీసు నుంచి రెండు వారాల సెలవు కూడా తీసుకున్నాడు. మళ్ళీ రెండేళ్ళ క్రితం “ద జడ్జిమెంట్” కథ రాసిన రోజులు గుర్తుకు వచ్చాయి. అప్పుడంత సృజనావేశం మాత్రం ఇప్పుడు లేదు: “రెండేళ్ళ క్రితంలా ఇప్పుడు నేను నా రచనతో పూర్తిగా కప్పబడి కాపాడబడి లేను, కానీ నా శూన్యమైన, మొహంమొత్తే, పిచ్చి బ్రహ్మచారి జీవితానికి కనీసం ఇలా ఏదో ఒక సార్థకత ఉంది. పూర్తిగా శూన్యంలోకి చూస్తూ కూర్చోకుండా, మరోమారు నాతో నేను సంభాషణ కొనసాగించుకోగలుగుతున్నాను.” ఇది కాఫ్కా రచనా వ్యాసంగంలో రెండో ఉచ్ఛ దశ. ఈ దశలోనే “ట్రయల్” నవలతో పాటూ, రెండేళ్ళ క్రితం మొదలుపెట్టిన “తప్పిపోయిన మనిషి” (అమెరికా) నవలను కూడా పూర్తి చేశాడు (అంటే ఇప్పుడున్న అసంపూర్ణ స్థితికి తెచ్చి వదిలేశాడు). “ఇన్ ద పీనల్ కాలనీ”, “విలేజ్ స్కూల్ మాస్టర్” అనే మరో రెండు పెద్ద కథల్ని కూడా రాశాడు.

ఒక పక్క ప్రపంచ రాజకీయ పరిస్థితి మారింది. మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. కానీ కాఫ్కాకు సమకాలీన రాజకీయ పరిస్థితుల పట్ల పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. కాఫ్కా రచనలు ఎప్పుడూ అతని అంతర్లోకపు వెలుగునీడల్ని పట్టించుకున్నాయే తప్ప, బయటి ప్రపంచం వైపు చూపు సారించింది లేదు. కొంతమంది అతని రచనల్లో కొన్ని తర్వాతి నాజీ దురాగతాలకు జోస్యం చెప్పాయనీ (“ఇన్ ద పీనల్ కాలనీ”), బ్యూరాక్రసీ లోని అవినీతిని ఎండగట్టాయనీ (“ద ట్రయల్”) అంటారు. కానీ మొదటి ప్రపంచ యుద్ధం మొదలవుతుంటే అతను తన డైరీలో రాసుకున్న ఒక ఎంట్రీ అలాంటి వాదనల్ని వెక్కిరిస్తుంది: “జర్మనీ రష్యా మీద యుద్ధం ప్రకటించింది. మధ్యాహ్నం ఈత కొట్టాను”.

ట్రయిల్ నవలా రచన కొంతకాలం బానే సాగింది గానీ, తర్వాత ఇక ముందుకు కదలక ఎక్కడిదక్కడే నిలిచిపోయింది. ఒంటరితనం మళ్ళీ అతణ్ణి కమ్ముకోసాగింది. అతనికి మళ్ళీ ప్రపంచం కావాల్సి వచ్చింది. మళ్ళీ ఫెలిస్‌కు ఉత్తరాలు రాయటం ప్రారంభించాడు. తమ ఎంగేజ్మెంటు పెళ్ళి దాకా రాలేకపోవటానికి కారణం ఆమే అన్నాడు. ఆమె తనకూ రచనకూ గల సంబంధాన్ని ఎప్పుడూ మనస్ఫూర్తిగా అర్థం చేసుకోలేదనీ, అర్థం చేసుకున్నా అంగీకరించలేదనీ అన్నాడు: “నా రచనకు గాఢ మైత్రీ నీతోనే, బద్ధ శత్రుత్వమూ నీతోనే, అందుకే, అది నిన్ను ఎంతగా ఇష్టపడిందో, తనను తాను కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చేసరికి అంతగానూ వ్యతిరేకించింది” అని రాశాడు. ఫెలిస్ రచనకూ అతనికీ గల సంబంధాన్ని పూర్తిగా ఎప్పుడూ అంగీకరించ లేదన్నది నిజమే. ఆమె దాన్ని తనకో సవతిలా చూసింది. అందువల్లే కాఫ్కా ఎప్పుడూ ఆమెను రెండు చేతులా తన జీవితంలోకి ఆహ్వానించలేకపోయాడు. అలాగని పూర్తిగా కాదననూ లేకపోయాడు. కాఫ్కాకు పరిస్థితి అతని ఉత్తరాల ద్వారా మనకు తెలిసిందే, కానీ ఫెలిస్ ఏ కారణాల వల్ల అతనితో మళ్ళీ సయోధ్యకు సిద్ధమైందో తెలియదు. ఏదేమైనా ఆమె వైపు నుంచి కూడా మళ్ళీ ఉత్తరాలు మొదలయ్యాయి. ఈసారి అడపాదడపా కలుసుకోవటం కూడా మొదలుపెట్టారు. 1916 లో మరియెన్‌బాద్‌లో ఒక హోటల్లో ఓ పది రోజులు కలిసి కూడా గడిపారు. ఆ రోజుల్లో తన డైరీలో ఇలా రాసుకున్నాడు: “ఫెలిస్‌తో కలిసి జీవించటం అసాధ్యం; అసలు ఎవరితోనైనా కలిసి జీవించటం అసాధ్యమే; నేను బాధపడేది దానికి కాదు; నాకు ఒంటరిగా బతకగలగటం కూడా అసాధ్యమవటమే పెద్ద బాధ”. కానీ ఈ లోపలి గాభరాను బయటకు ప్రదర్శించకుండా మేకపోతు గాంభీర్యంతో ముందుకెళిపోయాడు. ఫలితంగా, మరలా రెండేళ్ళకు 1917 జూలైలో కాఫ్కా ఫెలిసీల రెండో ఎంగేజ్మెంటు జరిగింది. ఎంగేజ్మెంటు ఫంక్షను కూడా జరిగింది. కానీ ఈ సారి అతని లోపలి భయాలకు విధి ఒక తరుణోపాయాన్ని ముందు తెచ్చి నిలబెట్టింది.

విడుదల


1917 ఆగస్టు 9 రాత్రి, ముప్ఫై నాలుగేళ్ళ కాఫ్కా, విపరీతంగా రక్తం కక్కుకున్నాడు. డాక్టర్లు దాన్ని క్షయ వ్యాధిగా నిర్థారించారు. అప్పట్లో అది ప్రాణాంతక వ్యాధి. కాఫ్కా వెంటనే ఫెలిస్‌తో ఎంగేజ్మెంటు కాన్సిల్ చేసుకున్నాడు. పెళ్ళితో తాను సాగించిన ఐదేళ్ళ పోరాటానికి విధి నిర్దేశించిన ముగింపే ఈ వ్యాధి అని భావించాడు. చాన్నాళ్ళ తర్వాత ఇంకో ప్రేయసి (మిలెనా)కు రాసిన ఉత్తరంలో, ఫెలిస్‌తో ఒకవేళ పెళ్ళి జరిగినా అది ఎక్కువకాలం కొనసాగేది కాదంటూ ఇలా తీర్మానించాడు: “అలా సాగుతుందని స్వయానా నేనే ఆమెతో నమ్మబలికినా, అప్పుడప్పుడూ ఆమెను చాలా తీవ్రంగా ప్రేమించినా, పెళ్ళి కన్నా ముఖ్యమైంది వేరే ఏదీ లేదని నాకు తెలిసినా, అది ఎక్కువ కాలం సాగేది కాదు. దాదాపు ఐదేళ్ళు ఆమెపై దాడి చేశాను (పోనీ, నాపై నేనే చేసుకున్నాను) – కానీ అదృష్టవశాత్తూ ఆమె చాలా పటిష్టమైనది, ప్రష్యన్ – జ్యూయిష్ మిశ్రమం, దృఢమైన తిరుగులేని మిశ్రమం. కానీ నేనంత బలవంతుణ్ణి కాదు, పైపెచ్చు ఆమె బాధ మాత్రమే పడేది, నేను దాడీ చేసేవాణ్ణి బాధా పడేవాణ్ణి.”

క్షయ అని తేలిన తర్వాత ఎంగేజ్మెంటు కాన్సిల్ చేసుకోవటంతో పాటూ, ఆఫీసు నుంచి సెలవు కూడా తీసుకున్నాడు. ఈ సెలవును పదవీ విరమణ దాకా పొడిగిస్తూనే ఉన్నాడు. అప్పట్లో అతని చిన్న చెల్లి ఓట్ల తండ్రిని వ్యతిరేకించి (కాఫ్కా ఎన్నడూ చేయలేని ధైర్యంతో) బయటకు వచ్చి ఒక చిన్న పల్లెటూరు ‘జారూ’లో వ్యవసాయ క్షేత్రాన్ని కొనుక్కుని పని చేస్తోంది. కాఫ్కా ప్రాగ్ పట్టణాన్ని వదిలి చెల్లి దగ్గరకు వెళిపోయాడు. ఒక ఎనిమిది నెలలు అక్కడే గడిపాడు. దరిమిలా ఒక సందర్భంలో తాను జీవితంలో అత్యంత ఆనందంగా గడిపింది ఈ ఎనిమిది నెలలే అని చెప్పాడు. ఆ పల్లెటూరిలో, తత్వవేత్త కీర్క్‌గార్డ్‌ను చదువుతూ, చుట్టుపక్కల వనాల్లో తిరుగుతూ, ఊరి రైతు జనం మధ్య మసలుతూ కాలం గడిపాడు. రచన పట్ల ఇదివరకంతటి తీవ్రమైన నిబద్ధత లేకపోయినా, రాస్తూనే ఉన్నాడు. “జాకాల్స్ అండ్ అరబ్స్”, “కంట్రీ డాక్టర్” లాంటి రచనలు చేసింది ఈ కాలంలోనే. “నాకు ఇప్పటికీ ఆనందం దొరికేది ప్రపంచాన్ని [రచన ద్వారా] స్వచ్ఛమైన, నిజమైన, నిలకడైన స్థితికి లేపి నిలబెట్టగలిగినపుడే” అని డైరీలో రాసుకున్నాడు.

క్షయ నిర్థారణ అయ్యాకా కాఫ్కా ఎక్కువ సమయం వేర్వేరు ప్రాంతాల్లోని శనటోరియమ్స్‌లో గడపటం ప్రారంభించాడు. ఇలాంటి ఒక శనటోరియమ్‌లోనే పరిచయమైన ఇరవైయేడేళ్ళ జూలీ వోరిజెక్‌తో ప్రేమలో పడ్డాడు. ఆమె చెప్పులు తయారు చేసే చర్మకారుల కుటుంబానికి చెందిన అమ్మాయి. సరదాగా మాట్లాడుతుంది. మాక్స్ బ్రాడ్‌కు రాసిన ఒక ఉత్తరంలో ఆమె సమక్షంలో గత ఐదేళ్లలో ఎన్నడూ లేనంతగా నవ్వానని రాసుకున్నాడు కాఫ్కా. అంతేకాదు, ఫెలిస్‌తో వివాహాన్ని రద్దు చేసుకోవటానికి అతను ఏ క్షయ వ్యాధిని కారణంగా చూపించాడో, అది ఇపుడు జూలీతో పెళ్ళి ప్రతిపాదన చేయటానికి మాత్రం అడ్డు రాలేదు. (ఫెలిస్ అనే అబ్సెషన్ నుంచి విముక్తుడు కావటానికి కాఫ్కా ఈ వ్యాధిని ఒక వంకలా వాడుకున్నాడనటానికి ఇదే ఋజువు.) కానీ అతని ఇంట్లో వ్యతిరేకత వచ్చింది. మంచి కుటుంబానికి చెందిన అమ్మాయి ఫెలిస్‌ను వదిలేసి, ఈ అలగా పిల్లను చేసుకోవటమేమిటని తండ్రి మండిపడ్డాడు. “ఆ పిల్ల బాగా ఏరి ఎంపిక చేసుకున్న రవికేదో తొడుక్కుని ఉంటుంది – ఇక్కడ ప్రాగ్‌లో యూదు అమ్మాయిలంతా అందుకు తప్ప ఇంకెందుకూ పనికి రారు, దాంతో నువ్వేమో పెళ్ళికి తయారైపోయావు – అంతకన్నా ఇంకేదైనా చేయచ్చని తట్టలేదా? నీకంత బెరుగ్గా వుంటే చెప్పు, నేనే నిన్ను నా వెంట తీసుకెళ్తాను,” అంటూ, ఆమెను పెళ్ళి చేసుకోవటం కంటే వేశ్య దగ్గరకెళ్ళి కుతి తీర్చుకోవటం నయమనే అర్థం వచ్చేలా మాట్లాడాడు. తల్లిదండ్రుల వ్యతిరేకత వల్ల కాఫ్కా చివరకు ఈ పెళ్ళి ఆలోచన మానేశాడు. ఈ విషయంలో తండ్రి ప్రవర్తించిన తీరుకో, లేక, ఇక మృత్యువు గుమ్మం దగ్గరే ఎదురుచూస్తోంది కాబట్టి అరకొరగా మిగిలిన లెక్కలు తేల్చేసుకోవాలనో తెలియదు గానీ, ఈ సమయంలోనే కాఫ్కా తండ్రికి ఒక పెద్ద ఉత్తరం రాశాడు. బహుశా ఏ కొడుకూ ఏ తండ్రికీ రాసి ఉండనంతగా పెద్ద ఉత్తరం ఇది. దాదాపు వందపేజీలకు పైగా ఉత్తరమైతే రాశాడు గానీ తండ్రికి పంపే ధైర్యం మాత్రం చేయలేకపోయాడు. మరణానంతరం ఇది “లెటర్ టూ ఫాదర్” పేరిట ప్రచురితమైంది.

ఎక్కువగా శనటోరియాల్లో ఉంటూ, అడపాదడపా చిన్న చిన్న కథా రూపమైన రచనలు చేస్తూ గడుపుతున్న ఈ కాలంలోనే మరో ముఖ్యమైన ప్రేమానుభవం అతని చెంతకు వచ్చింది. 1920 జనవరిలో వియెన్నా నుంచి మిలెనా జెసెంకా అనే ఇరవైనాలుగేళ్ల వివాహిత కాఫ్కాకు ఉత్తరం రాసింది. ఉత్తరంలో కాఫ్కా రచన “ద స్టోకర్”ను చెక్ భాషలోకి అనువదించటానికి అనుమతి కోరింది. ఆ విధంగా కాఫ్కా జీవితంలో మరో ఉత్తరాల ప్రేమ మొదలైంది. కానీ ఇది మొదటి ప్రేమంత గుడ్డిదీ, అవకతవకదీ కాదు. మిలెనా ఫెలిస్‌లా కాదు. ఆమె కాఫ్కాకు మేధోపరంగా తగిన జోడీ. స్వయంగా రచనాశక్తి ఉన్న వ్యక్తి. పైగా అతణ్ణి సంపూర్ణంగా అర్థం చేసుకుంది. కళాకారునిగానే కాదు, వ్యక్తిగానూ అతణ్ణి అతని సమకాలీనుల కన్నా, మిత్రుల కన్నా కూడా చక్కగా అంచనా వేసింది. మాక్స్ బ్రాడ్‌కు రాసిన ఓ ఉత్తరంలో: “అతణ్ణి అందరూ అబ్‌నార్మల్ అంటారు గానీ, అదే అతనిలో సుగుణం. అతనితో ఇదివరకూ ఉన్న స్త్రీలందరూ మామూలు స్త్రీలు, మరోలా జీవించటం చేతకానివాళ్ళు. నా దృష్టిలో మనమే రోగగ్రస్తులం; అతనొక్కడే ఆరోగ్యవంతుడు, అతను మాత్రమే సరిగా చూడగలవాడూ, సరిగా అనుభూతించగల వాడు, అతను మాత్రమే స్వచ్ఛమైన వాడు. అతను జీవితాన్ని నిరాకరించేవాడు కాదు; అతను నిరాకరించేదల్లా ఇలాంటి జీవితాన్ని. నాకే గనక అతనితో ఉండే వీలుంటే, నాతో చాలా సంతోషంగా ఉండేవాడు” అని రాసింది. కానీ ఆమెకు ఆ వీల్లేకపోయింది. దీనికి ఒక కారణం ఆమె వివాహం. ఆమె భర్తతో ఆమెకు చాలా సమస్యలున్నాయి, కానీ అతణ్ణి వదిల్లేని ఒక అనిశ్చిత ప్రేమ కూడా ఉంది. ఇంకోకారణం, కాఫ్కాతో జీవితమంటే ఒక సన్యాసి తరహా జీవితం అవుతుందని ఆమెకు తెలుసు. జీవితం పట్ల ఎన్నో ఆకాంక్షలతో, విభిన్న ఆసక్తులతో ఉన్న ఈ అమ్మాయి దీనికి సిద్ధం కాలేకపోయింది. ఇద్దరూ మొదట్లో ఒకట్రెండు సార్లు కలుసుకున్నారు, సెక్సు అనుభవం కూడా అయింది. కానీ కాఫ్కా సహజంగానే తన ఈ చివరి రోజుల్లో చెంతనుండే తోడు కోరుకున్నాడు. పైపెచ్చు మిలెనా బాగా భావోద్వేగాలున్న అమ్మాయి. ఆరోగ్యపరంగా అంతకంతకూ క్షీణిస్తున్న కాఫ్కా ఈ ఉద్వేగపూరితమైన అనుబంధాన్ని భరించలేకపోయాడు. ఒక దశలో ఇక తనకు ఉత్తరాలు రాయవద్దని అల్టిమేటం ఇచ్చేశాడు. మిలెనా హతాశురాలైంది. కానీ ఇది తప్పదనీ, తమది ఎటూ చేరని బంధమనీ ఆమెకూ తెలుసు. తర్వాత అడపాదడపా అతణ్ణి కలుసుకునేది గానీ, ఆ బంధం క్రమేపీ వీగిపోయింది.

1922లో కాఫ్కా మరో నవలా ప్రయత్నం చేశాడు. ఇది అతని అసంపూర్ణ నవలాత్రయంలో చివరిదైన “ద కాసల్”. కాఫ్కా నవలలన్నీ అసంపూర్తివి కావటం అతని పాఠకులకు ఎన్నడూ ఇబ్బంది కాలేదు. ఒకరకంగా అవి ఆద్యంతాలతో నిమిత్తం లేని రచనలు. వాటికి నడకే ముఖ్యం, ఎక్కడ మొదలైందీ, ఎక్కడ ముగిసిందీ అన్నది కాదు. “ద కాసల్” కూడా అంతే. ఒక మంచు కురుస్తున్న రాత్రి ‘కె’ అనే వ్యక్తి ఒక గ్రామంలోకి ప్రవేశిస్తాడు. అతనికి అక్కడ లాండుసర్వేయరుగా వచ్చి చేరమని కబురొస్తుంది. ఆ గ్రామానికి మధ్యలో ఉన్న ఎత్తయిన కోట ఆ గ్రామాన్ని పాలిస్తుంది. అక్కణ్ణించే తనకు కబురొచ్చిందని కె అనుకుంటాడు. కానీ ఆ కోట ఉద్యోగులు అలాంటి కబురేమీ తాము పంపలేదంటారు. చివరిదాకా ‘కె’ లాండు సర్వేయరుగా తన ఉనికికో అర్థాన్ని సంపాదించేందుకు కోట చుట్టూ తిరుగుతూ ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. చివరకు ఈ ప్రయత్నమే అతని ఉనికికి అర్థంగా మిగులుతుంది.

“లెటర్ టూ ఫాదర్” రాసిన తర్వాత తండ్రీ-కొడుకూ ఇతివృత్తాలూ, “ద ట్రయల్” రాసిన తర్వాత దోషమూ-శిక్ష ఇతివృత్తాలూ ఇక కాఫ్కాను వెంటాడటం మానేశాయి. అతని తర్వాతి రచనల్లోని ఇతివృత్తాల ధోరణి మారింది. సొంత భయాల నుంచి బయటపడ్డాడు. ఆధునిక మానవునిగా తనకు సంక్రమించిన భయాల్ని ఇతివృత్తంగా తీసుకుని రాయసాగాడు. మనిషికీ-మృత్యువుకూ, మనిషికీ-సృష్టికర్తకూ, మనిషికీ-అతణ్ణి ఆవరించిన నిర్దయాపూరిత సృష్టికి గల సంబంధాలు ఈ దశలో అతని ఇతివృత్తాలు. ప్రముఖ అర్జెంటినా రచయిత బోర్హెస్, “దేవునితోనూ, గ్రహింప శక్యం కాని అతని సృష్టితోనూ మనిషికున్న నైతిక సంబంధమే కాఫ్కా రచనల ఇతివృత్తం” అన్నది ఈ దశలోని రచనల గురించే. వీటిలో “ద కాసల్”, “ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా”, “ద బర్రో” ముఖ్యమైనవి. ఈ కాలంలో రాసిన మరికొన్ని రచనల ఇతివృత్తాలు కళాకారునికీ-అతని కళకీ, కళాకారునికీ-అతని పరిసరాలకూ గల సంబంధాన్ని చర్చిస్తాయి: “ఫస్ట్ సారో”, “హంగర్ ఆర్టిస్ట్”, “జోసిఫీన్ ద సింగర్, ఆర్ ద మౌస్ ఫోక్” వీటిలో ముఖ్యమైనవి. ఈ చివరి కథే అతను చివరగా రాసింది.

ఎవరైనా కాఫ్కా గురించి రాయటం మొదలుపెట్టారంటే, అతను తన రచనలన్నింటినీ మరణానంతరం కాల్చేయమన్నాడన్న సంగతి ప్రస్తావించకుండా ముగించరు. కాఫ్కా ఈ పనిని మిత్రుడు మాక్స్ బ్రాడ్‌కు అప్పగించాడు. అతని కోసమని అట్టేపెట్టిన ఒక చీటీలో ఇలా రాశాడు: “నా రచనలన్నింటిలోనూ ఎంచదగినవి ఇవే: ‘ద జడ్జిమెంట్’, ‘ద స్టోకర్’, ‘మెటమార్ఫసిస్’, ‘ఇన్ ద పీనల్ కాలనీ’, ‘ఎ కంట్రీ డాక్టర్’, ఇవిగాక ఒక చిన్న కథైన ‘హంగర్ ఆర్టిస్ట్’. ఈ ఐదు పుస్తకాల్నీ, ఈ చిన్న కథనూ ఎంచదగినవీ అంటున్నానంటే దానర్థం వాటిని మరలా ముద్రించి తర్వాతి తరాలకు అందివ్వమని కాదు; అసలు అవి మొత్తంగా తుడిచిపెట్టుకుపోయే వీలుంటే నాకు అంతకన్నా కావాల్సిందేమీ లేదు. కానీ అవంటూ ఎలాగూ ఉన్నాయి గనుక, ఎవరన్నా వాటిని దగ్గర ఉంచుకోదలిస్తే ఉంచుకోవచ్చు. మిగతా అన్నీ – లేఖలూ, నోటుబుక్సూ, రాతప్రతులూ, అడపాదడపా పత్రికల్లో ప్రచురితమైన రచనలూ అన్నీ – మినహాయింపులేవీ లేకుండా కాల్చేయాలి.” కానీ మాక్స్ బ్రాడ్ ఈ పని చేయలేదు. ఈ చీటీలో ప్రస్తావించిన వాటితో పాటూ, ఎన్ని లభ్యమైతే అన్ని రచనలూ ప్రచురితమయ్యేలా శ్రద్ధ తీసుకున్నాడు. తానే వాటికి సంపాదకునిగా కూడా మారాడు. అసంపూర్ణ నవలల్లో అధ్యాయాల్ని ఒక వరుసలో కూర్చాడు, కొన్నింటికి ఆకర్షణీయమనుకున్న పేర్లు పెట్టాడు. ప్రాణ స్నేహితుని ఆఖరు కోరిక పట్ల తాను చూపించిన ఈ అవిధేయతకు మాక్స్ బ్రాడ్ ఎప్పుడూ చింతించలేదు, సాహితీ ప్రపంచమూ అతణ్ణి తప్పు పట్టలేదు. తాను ఈ కోరికను పాటించబోనన్న సంగతి కాఫ్కాకు కూడా ముందే తెలుసని బ్రాడ్ అన్నాడు. ఈ ఆఖరు కోరిక నుంచి ఎంతోమంది అనేకరకాల తాత్పర్యాలు తీశారు. కానీ రచయిత బోర్హెస్ ఒక ఇంటర్య్వూలో వెల్లడించిన అభిప్రాయం సరైనదనిపిస్తుంది: “అతను బ్రాడ్‌ని కాల్చేయమని అడిగాడు నిజమే. కానీ బ్రాడ్ అలా చేయడని అతనికీ తెలుసు. ఆ రచనలన్నీ అసమగ్రమైనవని కాఫ్కాకు తెలుసు, అది తనకి తెలుసన్న సంగతి లోకానికి కూడా తెలియాలని అలా రాశాడు, అతను అవి కూడా ముద్రింపబడాలనే అనుకున్నాడు; తన గొప్ప కావ్యాన్ని మిత్రుడికి వదిలేసి, దాన్ని ధ్వంసం చేయమన్నాడు. అలా జరగదని ఇద్దరికీ తెలుసు. ఎంతైనా వాళ్ళిద్దరూ మిత్రులు.”

దీనికి కాఫ్కా మాటల్లోనే ఇంకో ఋజువు కూడా ఉంది. దాదాపు పదేళ్ల క్రితం 1912లో, ఇంకా మృత్యువు జాడ ఏదీ కనుచూపు మేరలో లేని ఇరవై తొమ్మిదేళ్ల ప్రాయంలోనే, ఏదో భవిష్యత్తు తెలిసిన వాడిలా, మాక్స్ బ్రాడ్‌కు ఒక ఉత్తరంలో ఇలా రాశాడు: “మన రచనల్లో అసమగ్రంగా ఉన్న వాటిని ఇక అలాగే వదిలేసే వెసులుబాటు ఉండేది మనం మృత్యుశయ్య మీద ఉన్నపుడు మాత్రమే.” తనకు ఇప్పుడా వెలుసుబాటు ఉందని కాఫ్కాకు తెలుసు. కానీ, బోర్హెస్ చెప్పినట్టు, తన తక్కిన రచనలతో పోలిస్తే, ఈ రచనలు కాస్త అసమగ్రమైనవే అన్నది తనకు తెలుసున్న సంగతి అందరికీ తెలియాలని, ఈ తెలివైన చీటీ జత చేశాడు. అయితే, తాను సమగ్రమని అనుకున్న రచనలకన్నా (ఒక్క మెటమార్ఫసిస్‌ను మినహాయిస్తే), ఈ అసమగ్ర రచనలతోనే కాఫ్కాకు ఎక్కువ పేరు వచ్చింది.

కాఫ్కా 1922 జూలైలో తన ఆఫీసు ‘కార్మిక ప్రమాద భీమా సంస్థ’ నుంచి పింఛనుతో పూర్తిగా పదవీవిరమణ పొందాడు. ఇంట్లో తక్కువా, శనటోరియాల్లో ఎక్కువగా రోజులు గడపసాగాడు. వ్యాధి అంతకంతకూ ముదురుతూ వచ్చింది. కానీ, విధి అల్లికలోని చివరి మెలికలాగా, అతని జీవితంలో ఏకైక ఆనందకర ప్రేమానుభవం ఈ సమయంలోనే అతనికి ఎదురుపడింది.

1923 జూలైలో ఒక సముద్రతీర రిసార్టులో సేదతీరటానికి వెళ్ళిన కాఫ్కాకు అక్కడ పాతికేళ్ల డోరా డైమంట్ పరిచయమైంది. ఆమె కళ్ళనిండా స్వతంత్రపు కలలతో ఇల్లు వదిలి పారిపోయిన అమ్మాయి. ప్రస్తుతం బెర్లిన్‌లో ఒక అనాథాశ్రమంలో కిండర్‌గార్డెన్ టీచరుగా పని చేస్తూ, జీవితాన్ని తేలికగా సరదాగా గడిపేస్తోంది. ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం చాలా త్వరగా చిక్కనైపోయింది.

ఇప్పటిదాకా తన తల్లిదండ్రుల్నీ, ప్రాగ్ పట్టణాన్నీ విడిచి బయటకు వచ్చే ధైర్యం చేయలేని కాఫ్కా, ఇపుడు డోరాతో కలిసి బతకటానికి బెర్లిన్ నగరానికి మకాం మార్చాడు. ఇద్దరూ ఒక చిన్న ఫ్లాట్‌ తీసుకుని సహజీవనం ప్రారంభించారు. ఇప్పుడిక కాఫ్కాలో సాహిత్యానికీ – స్త్రీ తోడుకూ మధ్య ఘర్షణ లేదు. ఒకప్పుడు ఫెలిస్ అతను రాస్తుండగా చూడాలని ఉందని రాస్తే, రాసేటప్పుడు ఒంటరితనం ముఖ్యమనీ, పక్కన ఎవరున్నా రాయలేననీ చాంతాడు లెక్చరు దంచినవాడల్లా, ఇప్పుడు తాను రాసుకుంటున్న గదిలోనే డోరా కుట్టుపని చేసుకుంటున్నా ఇబ్బందిపడని స్థితికి వచ్చాడు.

మొదట్లో అతను సాహిత్యానికి తన మీద చాలా అజమాయిషీ ఇచ్చేసుకున్నాడు. దాని ప్రతీ డిమాండ్‌నీ సప్లయి చేయటానికి ప్రయత్నించాడు, చేశాడు కూడా. కానీ అతణ్ణి అంతగా తన అధీనంలోకి తెచ్చుకున్న సాహిత్యం, సందు దొరికినపుడల్లా అతనిపై దాడి చేసే ఒంటరితనాన్నించీ, భయాల్నించీ, అతణ్ణి కాపాడుకోలేకపోయింది. చావు ఒక ఖరారైన సత్యంగా కనుచూపుమేరలోకి వచ్చి నిలబడ్డాకా మాత్రమే, సాహిత్యం తనను అన్నింటి నుంచీ కాపాడలేదని కాఫ్కాకు అర్థమైంది. ఒక పూర్తి జీవితాన్ని ఒంటి చేత్తో సార్థకం చేయగలిగేంతటి శక్తి రచనా వ్యాసంగానికి లేదని తెలుసుకున్నాడు. మనిషి సహజాతాల్లో ఒకటైన తోడు కోసం ఆరాటం తీరకపోతే అతను చావును రెండు చేతులా సంతృప్తిగా ఎన్నటికీ ఆహ్వానించలేడని గ్రహించాడు. దాంతో సాహిత్యం నుంచి అతనికి ఎట్టకేలకు విడుదల లభించినట్టయింది.

డోరా కూడా అతని గత ప్రేయసులందరి కన్నా భిన్నమైంది. ఫెలిస్ కాఫ్కా నుంచి ఒక భర్తను కోరుకుంది, మిలెనా అతణ్ణించి ఒక మేధోపరమైన సాంగత్యాన్ని కోరుకుంది, కానీ డోరా అతణ్ణించి అచ్చంగా ఒక ప్రేమికుణ్ణి మాత్రమే కోరుకుంది. అంతే కాదు, సాహిత్యాన్ని అతని మరో ప్రేయసిగా, తన సవతిగా, చాలా తేలికగా అంగీకరించింది. అంగీకరించటం కూడా కాదు, అతనిలో సాహిత్యాంశ ఒకటి ఉందని గమనింపుకు కూడా రానంతగా ప్రేమించింది. దీనికి ఋజువేంటంటే, అతను “ట్రయల్” అనే నవలొకటి రాశాడని అది ప్రచురితమయ్యేదాకా ఆమెకు తెలియదు. She loved him to that level of distraction: “కాఫ్కాతో కలిసి ఉన్నంత కాలమూ నేను చూడగలిగింది అతణ్ణీ నన్నూ మాత్రమే. నాకు అతను తప్పించి అతనికి చెందిన తక్కినవన్నీ సంబంధం లేనివీ, పరిహాసాస్పదమైనవీను. అతని రచనా వ్యాసంగం గురించి నన్నడిగితే ఎక్కువలో ఎక్కువ అది అంత ముఖ్యం కాదని చెప్తాను” అంటుంది. అంతే కాదు, కాఫ్కా తదనంతరం ఆమె కాఫ్కా గురించి చెప్పింది చూస్తే, మనకు తెలిసిన కాఫ్కా ఈ కాఫ్కా ఒకరేనా అనిపిస్తుంది. కాఫ్కా ఎప్పుడూ సరదాగానే ఉండేవాడనీ, నవ్వని సమయాలు అరుదనీ చెప్పిందామె.

కానీ, ఎట్టకేలకు దక్కిన ఈ ప్రేమకు విధి కేటాయించిన నిడివి పదకొండు నెలలు మాత్రమే. ఈ కాస్త సమయం కూడా వాళ్ళు అనేక ఒడిదుడుకుల మధ్య గడిపారు. ఒకపక్క కాఫ్కా ఆరోగ్యం క్షీణిస్తోంది, మరోపక్క ప్రపంచవ్యాప్తంగా పెచ్చరిల్లిన ఆర్థిక సంక్షోభం ఈ జంటనీ పీడించింది. ధరలు పెరగటంతో కాఫ్కా పింఛను ఇద్దరికీ సరిపోయేది కాదు. చివరకు హోటల్లో భోజనం చేయటం కూడా అరుదైన సందర్భాలకు మాత్రమే పరిమితమైన లగ్జరీగా మారిపోయింది. కొత్త సంవత్సరం రోజైతే, కిరసనాయిల్ లేక, ఇద్దరూ కొవ్వొత్తుల మీద వంట వండుకున్నారు. అద్దెలు చెల్లించలేక పదే పదే ఇళ్ళు మారాల్సి వచ్చేది. కానీ ఈ ఒత్తిడులు పూర్తిగా కాఫ్కా మీద పడకుండా డోరా అతణ్ణి కాచుకునేది. అందుకే, బహిరంగంగా పరిస్థితులు ఎంత గడ్డుగా ఉన్నా, అంతరంగంలో అతను అత్యంత ప్రశాంతంగా ఉన్నది ఈ కాలంలోనే. బెర్లిన్‌లో కాఫ్కా ఇంటికి చుట్టంచూపుగా వచ్చిన మాక్స్ బ్రాడ్, అక్కడి సన్నివేశాన్ని ఇలా గుర్తు చేసుకున్నాడు: “నాకక్కడ సంతోషపర్వం ఎదురైంది. నా మిత్రుణ్ణి ఎట్టకేలకు ఉల్లాసంగా చూశాను; అతని శారీరక ఆరోగ్యం మరింత దిగజారిందన్నది నిజమే. కానీ అప్పటికైతే అది కూడా ఏమంత ప్రమాదకరం కాదనిపించింది. నా మిత్రుడు సరైన దారిలో పడ్డాడు, తన జీవితపు చివరి ఏడాదిలో జీవితభాగస్వామితో ఆనందంగా ఉన్నాడు.”

కానీ అప్పుడప్పుడూ భూతాలు చుట్టుముట్టేవి. ‘భూతాల’న్నది కాఫ్కా తన భయాలన్నింటికీ కలిపి పెట్టుకున్న పేరు. ఈ తీవ్రత అధికమైన ఒక సందర్భంలో, ఆ భూతాల్నించి విముక్తి పొందాలంటే తాను రాసినవి కాల్చేయటమే ఏకైక మార్గమని చెప్పి, డోరా చేత తన రచనలు కొన్నింటిని కాల్పించేశాడు.

మృత్యువుతో కాఫ్కా భేటీ ఏమంత ప్రశాంతంగా సాగలేదు. శారీరక బాధ అధికమైంది. ఆసుపత్రిలో చేరక తప్పలేదు. జీవితాంతం మద్యం జోలికి పోని కాఫ్కా, బాధ భరించలేక వైను కొద్ది కొద్ది డోసులు తాగటం మొదలుపెట్టాడు. చివరకు ఇన్‌ఫెక్షన్ పాకి గొంతు వాచిపోయింది. మాట్లాడే వీల్లేక చీటీల ద్వారా విషయం తెలియజేసేవాడు. ఉపశమనం కోసం నరాల్లోకి ఆల్కహాలిక్ ఇంజక్షన్లు ఇచ్చేవారు. 1924 జూన్ 4 న బాధ తీవ్రమైపోయింది. ఆ సాయంత్రం డోరా బయటి నుంచి పూలను తీసుకువస్తే, అలాంటి స్థితిలో కూడా, అందర్నీ ఆశ్చర్యపరుస్తూ, అతి కష్టం మీద పైకి లేచి పూల వాసన చూశాడు. అతను మాట్లాడిన చివరి మాటలు, డాక్టరుతో: “పొలాల్లో లిల్లీలు తీసుకురండి, కానీ ఇంజక్షన్ మాత్రం వద్దు.” కాఫ్కా అంత్యక్రియల్లో డోరా సృహతప్పి కూలబడిపోయింది. కాఫ్కా తండ్రికి ఈ ప్రదర్శన నచ్చక అటు తిరిగి నిలబడ్డాడు. కానీ మిగతా కుటుంబం డోరాను బాగానే ఆదరించింది. ఆమే కాఫ్కా భార్య అన్నట్టు అతని రచనల రాయల్టీలను ఆమెకే అందే ఏర్పాటు చేసింది.

కాఫ్కా చనిపోయిన మూడు రోజులకు, అతని పాత ప్రేయసి మిలెనా రాసిన నివాళి ఒక పత్రికలో వచ్చింది. కాఫ్కాను ఆమె ఎంత లోతుగా అర్థం చేసుకుందో ఈ నివాళి చెప్తుంది. అందులో ఒక భాగం: “అతను సిగ్గరి, భయస్తుడు, సున్నితమనస్కుడు, మంచివాడు, కానీ అతను రాసిన పుస్తకాలు మాత్రం క్రూరమైనవీ, బాధపెట్టేవీను. అతను ప్రపంచాన్ని అదృశ్య భూతాలతో నిండినది గానూ, అవి ఎల్లపుడూ నిస్సహాయమానవులపై విరుచుకుపడి, వారిని నాశనం చేయటానికి ప్రయత్నిస్తున్నట్టుగానూ చూశాడు. అతను నిశిత దృష్టిగలవాడు; జీవించలేనంత విజ్ఞుడూ, పోరాడలేనంత బలహీనుడూను. కానీ ఇది స్వచ్ఛమైన మనుషులకు ఉండే బలహీనత; భయాలకూ, అపార్థాలకూ, నిర్దయకూ, అసత్యాలకూ ఎదురెళ్లలేని బలహీనత. వారు తమ బలహీనతల్ని మొదటే ఒప్పేసుకుని, లొంగిపోయి, తద్వారా విజేతలే సిగ్గుపడేలా పరిస్థితి కల్పిస్తారు. అతను తోటి మనుషుల్ని అర్థం చేసుకున్న తీరు ఒంటరిగా జీవించే వాళ్ళకి మాత్రమే సాధ్యం, అలాంటి వాళ్ళ గ్రహణ ఎంత సున్నితంగా శృతి చేయబడి ఉంటుందంటే, క్షణమాత్ర భంగిమల విన్యాసాన్ని బట్టి వారు అవతలి మనిషిని ఆమూలాగ్రం చదివేయగలరు. ప్రపంచం గురించి అతని జ్ఞానం విస్తారమైనదీ లోతైనదీను, అసలు అతనే ఒక విస్తారమైన లోతైన ప్రపంచం.”

అయితే విధి కాఫ్కా జీవితాన్ని త్వరగా ముగించి మంచి పనే చేసిందని చెప్పాలి. తన అంతర్లోకపు నీడల్నే తట్టుకోలేనంత సున్నితమైన కాఫ్కా, తదనంతర కాలంలో చుట్టూ చిక్కబడిన నాజీ దురాగతాల చీకట్లను అసలు భరించలేకపోయేవాడు. ఆ యాతనలేవీ కంటపడకుండా మృత్యువు సరైన అదనులో అతని కళ్ళు మూసేసింది. కానీ అతని కుటుంబం మాత్రం తప్పించుకోలేకపోయింది. అతని చెల్లెళ్ళూ ఇతర బంధువులంతా కాన్సన్‌ట్రేషన్ కాంపుల్లో చనిపోయారు. మిలెనా కూడా అక్కడే చనిపోయింది. డోరా తప్పించుకోగలిగింది. మాక్స్ బ్రాడ్ కూడా చివరి క్షణాల్లో తప్పించుకున్నాడు. తన పేరు సాహితీ చరిత్రలో శాశ్వతం చేయబోయే కాఫ్కా రచనలున్న సూట్‌కేసు తీసుకుని, 1939లో, ఇక నాజీలు చుట్టుముట్టేస్తున్నారనగా, ప్రాగ్ వదిలి పాలస్తీనా పారిపోయాడు.

కాఫ్కా డైరీలో ఒక మాట ఉంటుంది: “పరిమిత వలయం స్వచ్ఛమైనది” (Limited circle is pure), అలాగే ఇంకో చోట ఇలా రాస్తాడు: “జీవిత ప్రారంభంలో చేయాల్సిన ముఖ్యమైన పని: నీ జీవిత కక్ష్యను అంతకంతకూ కుదించుకుంటూ రావాలి, అంతేకాదు అడపాదడపా నువ్వు ఆ కక్ష్యకు వెలుపలే ఎక్కడన్నా నక్కావేమో తనిఖీ చేసుకుంటూ ఉండాలి.” ఈ రెండు వాక్యాలు ఒకే భావాన్ని వ్యక్తీకరిస్తాయి. జీవిత పరిధిని కుదించుకోవటం గురించి. కాఫ్కా తన వలయాన్ని అంతకంతకూ కుదించుకుంటూ వచ్చాడు. జీవించే క్రమంలో జీవితానికి అదనంగా, అనవసరంగా వచ్చి అంటుకునే ప్రతీ అల్పత్వాల్నీ నిర్మూలించుకుంటూ వచ్చాడు. చివరికి ఓ స్వచ్ఛమైన వలయం మిగిలింది. అది ఆధునిక మానవాళికంతటికీ ప్రాతినిధ్యం వహించగలిగేంత స్వచ్ఛమైనది. ఆ వలయాన్ని విశ్వనియమాల వలయంతో పోల్చి సరిచూశాడు, తేలిన అసంగతాలకు భయపడ్డాడు, బాధపడ్డాడు, ఆధునిక మానవుని తరపున… శిలువ మోశాడు.

December 5, 2013

పర్యవేక్షణ

డిన్నరు అయ్యాక లివింగ్‌ రూములో కూర్చుని ఆ ఇంటివాళ్లతో కబుర్లలో పడ్డాడు. పరాగ్గా వాచీ వంక చూసుకునేవరకూ అంత టైమయిందని తెలీనే తెలీలేదు. ఇంకా ఆలస్యమైతే వెనక్కి ఆటోలు దొరకటం కష్టం. అందుకనే కబుర్ల ఉరవడి తగ్గుముఖం పట్టినపుడు తన వైపు నుంచి పెంచే ప్రయత్నం చేయలేదు. అట్టహాసంగా మోకాళ్లపై అరచేతుల్తో చరుచుకుని చిప్పల చుట్టూ నిమురుకున్నాడు. అప్పుడే గుర్తొచ్చినట్టు ఈసారి జనాంతికంగా వాచీ వైపు చూసుకున్నాడు. భార్యని ఓసారి తలపంకిస్తూ సంప్రదించాడు. ఇక బయల్దేరతామంటూ ఇద్దరూ పైకి లేచారు. వీడ్కోలు కూడా అతని అంచనాలకు మించిన సందడితోనే జరిగింది. అతని భార్యకు ఇంటావిడ బొట్టూ జాకెట్టూ పెట్టింది (ఇట్టే వరసలు కలిపేసుకునే ఆడాళ్ల తీరు మీద మగవాళ్లిద్దరూ చిలిపిగా జోకులేసుకున్నారు). ''డ్రాప్‌ చేస్తా ఉండం''డంటూ ఇంటాయన కారు తాళాలు వెతకబోయాడు. ఆ ఆఫర్‌ అంగీకరించకపోవటమే మర్యాద అని తెలిసిన అతను ''అయ్యయ్యో భలేవారే అదేం వద్ద''న్నాడు. ఇంటిల్లిపాదీ బయటి గేటు దాకా వచ్చి సాగనంపింది. అతనూ భార్యా  వీడ్కోలుగా చేతులూపుతూ రోడ్డు మీదకు నడిచారు. అదృష్టవశాత్తూ సెంటర్లో ఉన్న ఒకే ఒక్క ఆటో, కదలబోతున్నదే, వీళ్లని చూసి ఆగింది.

బోసి రోడ్ల మీద ఆటో సాఫీగా సాగిపోతోంది. ఎడాపెడా చల్లటిగాలి తగులుతోంది. భార్య బోళాగా అతని భుజం మీద తల వాల్చి తన వంతు ఆనందాన్ని ఒప్పేసుకుంది. పైకి గుంభనంగా ఉన్నాడు కానీ లోపల అతనికీ ఆనందంగానే ఉంది. ఏ వ్యవహారం మీద సిటీ వచ్చాడో దానికి సాయపడటమే కాకుండా, ఆ ఇంటాయన తనను సాదరంగా డిన్నరుకి పిలవటం, వాళ్ల అంతస్తుకు తూగేవాళ్లు కాకపోయినా ఆ తేడా చూపించకుండా ఎంతో ఆప్యాయంగా మసలుకోవటం అతనికి నచ్చింది. అతనిలోని సంతృప్తికి చుట్టూ పరిసరాలూ స్పందిస్తున్నట్టున్నాయి. ట్రాఫిక్‌ పల్చబడటంతో సోడియం స్ట్రీట్‌ లైట్లు నిలకడైన నీడల్ని మాత్రమే మిగుల్చుకున్నాయి, సేల్స్‌బాయ్స్‌ షాపు షట్టర్లు దించుతున్నారు, ఒక పళ్లబండివాడు సంపాదన లెక్కబెట్టుకుంటున్నాడు, కొందరు బిచ్చగాళ్లు పీలికల దుప్పట్లు మీదికి లాక్కుంటూ ఫుట్‌పాత్‌పై మునగదీసుకుంటున్నారు... పట్టణం బడలికగా ఆవలిస్తోంది. అతనికి ఈ రాత్రి అచ్చంగా అమరిందనిపించింది. కాసేపటి తర్వాత, భార్యాభర్తలిద్దరూ సిటీలో విడిది చేసిన చుట్టాలింటికి ముందు ఆటో ఆగింది.

కిందకు దిగుతూ పర్సు కోసం వెనక జేబులో చేయి పెట్టి అక్కడ ఏమీ తగలక పోవటంతో కంగారుగా తడుముకున్నాడు. మిగతా జేబులు కూడా చూడమంటున్న భార్యని ''నువ్వుండవే'' అని అదిలిస్తూ మిగతా జేబులు కూడా చూసుకున్నాడు. వెంటనే గుర్తొచ్చింది, ఇందాక డిన్నరు తర్వాతి కబుర్లలో ఏదో విజిటింగ్‌ కార్డు ఇవ్వటానికి పర్సు బయటకు తీశాడు! అతని ముఖం తెల్లబోయింది. మళ్లీ వెనక్కి వెళ్లటమన్న ఊహ పళ్లు గిట్టకరుచుకునేలా చేసింది. పర్సుపోతే పోయింది, కానీ అంత పరిపూర్ణంగా ముగిసిన కలయికకి ఇలా ఒక నేలబారు కొనసాగింపును జత చేస్తూ అక్కడికి మళ్ళీ వెళ్లాలంటే ముఖం చెల్లలేదు. కానీ వెంటనే గుర్తొచ్చింది, రేపు ఊరెళ్లాల్సిన రైలు టికెట్టు ఆ పర్సులోనే ఉంది, వెళ్లక తప్పదు. భార్యని ఇంట్లోకి పంపి, అదే ఆటోవాణ్ణి రానూపోనూ మాట్లాడుకుని బయల్దేరాడు.

ఎదురు కానున్న సన్నివేశాన్నీ, ప్రవర్తించాల్సిన విధాన్నీ అన్ని వేరియేషన్స్‌తోనూ ఉత్కంఠగా అల్లుకుంటూ వెళ్లాడు. తలుపు తెరిచిన ఇంటాయన ఆశ్చర్యంగా ముఖం పెట్టాడు, ఇంటిల్లిపాదీ పర్సు కోసం హంగామాగా వెతికారు, దొరికిందాన్ని ఛలోక్తులతో తీసుకొచ్చి అతని చేతిలో పెట్టారు. వాళ్లు మళ్లీ బయటి గేటు దాగా వచ్చి సాగనంపుతారేమో అని (సాగనంపరేమో అని కూడా), అతను హడావుడిగా ఇంటి గుమ్మం దగ్గరే వీడ్కోలు తీసుకుని బయల్దేరాడు.

ఈ అనవసరపు మారు ప్రయాణం మొత్తాన్నీ కలలోలా దాటేసి, ఇందాకటి సంతృప్తిని అవిచ్ఛిన్నంగా కొనసాగించాలని ఉంది. కానీ ఆటో మళ్లీ అవే బోసి రోడ్ల గుండా వాస్తవపు అతిక్రమించలేని నిడివిని పాటిస్తూ సాగుతోంది. అవే సోడియం లైటు నీడలు. రోడ్డుపై పాంప్లెట్లు గాలివాటుకి బద్ధకంగా కదులుతున్నాయి. ఓ ఆవు డివైడర్‌ మీద పరిచిన నకిలీ గడ్డిని వాసన చూస్తోంది. మున్సిపాలిటీ వాళ్లు పనికిలోకి దిగేముందు బీడీలు కాల్చుకుంటున్నారు. అతనికి అసహనంగా అనిపించింది. అసలేమిటిది? అంత చక్కగా  పూర్తయిన మొదటి ప్రయాణానికి మళ్ళీ ఈ రెండో ప్రయాణం తోకలా ఎందుకు వచ్చి చేరింది? ఇలా అర్ధరాత్రిపూట పడకేసిన ప్రపంచపు వీపు వెనక సాగుతోన్న ఈ పునరుక్తి వల్ల ఎవరికి లాభం?--అంటూ మొదలైన ప్రశ్నలు--ఇక్కడ ప్రతీదానికీ ఓ పద్ధతీ పరమార్థమూ ఉంటాయనుకోవటం భ్రమేనా? ఇది నిజంగానే ఏ పర్యవేక్షణా లేని అనాథ లోకమా?--దాకా సాగాయి. కానీ ఆటో ఇంటి దగ్గర ఆగేసరికి, బహుశా ఇందాక ఆనందం ఎక్కడ తెగిందో మళ్లీ ఆ చోటుకే రావటం మూలానేమో, అతను ఈ ప్రశ్నల్ని మర్చిపోయాడు, పునరుక్తిని మనసులోంచి చెరిపేశాడు. ఆటోవాడికి ఆ రెండో ట్రిప్పుగ్గాను ఇంకో రెండొందలు ఇచ్చేసి మెట్లు ఎక్కాడు.

ఆటోవాడు నోట్లు ముద్దుపెట్టుకుని కాబినెట్లో పెట్టుకున్నాడు. ఎవళ్నయినా ఏమార్చచ్చు గానీ, రేపు ఎంకటేసుగాణ్ణి తప్పించుకోటం కష్టమే. తన బర్త్‌ డే అని తెలీగానే పీక పుచ్చుకుని పార్టీ ఏదిరా మరి అని దొబ్బుతాడు. కనీసం దేవికాలో బిర్యానీ ఐనా ఇప్పించకపోతే ఎదవ నరగోల. అసలే బేరాలేయీ తగల్లేదీ రోజు ఎలారా బాబూ అనుకున్నాడు. కానీ తక్కువ పడిందనుకున్న రెండొందలూ గభాల్న భలే చేతిలో పడ్డాయి. కిక్కురాడ్డుని చేత్తో జప్పున లాగి దడదడళ్లాడ్తున్న ఆటోని ఇంటికి పోనిచ్చాడు.

(కినిగె పత్రికలో ప్రచురితం)

September 24, 2013

ఇంకేం మిగలకపోవటం

అసలే వాళ్ళిద్దరిదీ ఎన్నో లెక్కలూ ఈక్వేషన్ల బరువుతో నలిగిపోయున్న సిటీ ప్రేమ. వేర్వేరు సిటీల్లో ఉద్యోగాలవటంతో ఇంకా పలచబడిపోయింది. అతని లోనైతే దాదాపు అడుగంటిపోయింది. ఈ నిజం ఆమెతో గడిపిన ఈ వీకెండ్‌లో ఖరాఖండీగా తేలిపోయింది. ఆమె మాత్రం, వెనక్కి తీసుకెళ్ళే రైల్లో కూర్చుని, ప్లాట్ఫాం మీద నిలబడ్డ అతని కళ్ళలోకి చూస్తూ, కిటికీ ఊచల మీద ఉన్న అతని చేయి నిమురుతూ, ఇంకా ఒక రిలేషన్‌‌లో ఉన్న నమ్మకంతోనే మాట్లాడింది. ఒక్క కుదుపుతో రైలు కదిలింది, ఆమె కూర్చున్న బోగీ నెమ్మదిగా దూరమైంది, ఆమె ఎప్పట్లాగే కిటికీ ఊచల్లోంచి చేయి బైటపెట్టి ఊపుతోంది. ఆ బోగీ మిగతా బోగీల వరసలో కలిసిపోయాక కూడా ఆ ఊగుతున్న చేయి ఒక్కటీ అలా కనపడుతూనే ఉంది. ఇన్నాళ్లలో అతనికి మొదటిసారి అనిపించింది– ఇట్నుంచి తిరిగి చేయి ఊపినా ఊపకపోయినా ఆమెకి ఎలాగూ తెలీదు కదా అని. దూరంగా ఆమె చేయి ఇంకా గాల్లో ఆడుతుండగానే, అతను చేతుల్ని ఫాంట్ జేబుల్లో దోపుకుని గేటు వైపు నడిచాడు.