December 18, 2017

స్వభావం

తుఫాను అలలపై సొమ్మసిల్లిన ఓడ
నీరెండ ఒడ్డును కలగన్నట్టు,
తెల్లటి మాయేదో కమ్మిన స్నేహోద్రేకంలో
దొరికిన నెంబర్‌కి ఫోన్‌ చేస్తావు
వినిపించిన గొంతునల్లా అల్లుకుపోదామని.

ఒక్కో చువ్వా పేర్చి కట్టుకున్న ఇనుప పంజరంలోంచి
నువ్‌ వెలార్చే యీ స్నేహఋతు కూజితం వెనగ్గా
జీరగా గీరుకునే ఒక ఆలాపనను
అవతలి మనిషి విన్నూవచ్చు వినలేకపోనూవచ్చు.

మీ మాటలు మర మీది బెల్టుల్లా తిరుగుతుండగానే
నీ తలుపులు ఒక్కోటిగా మూతపడుతుంటాయి
నిజం లెక్కలేనన్నోసారి నిన్ను క్షమించి చేతులు చాస్తుంది
దాని అనాదరపు కౌగిట్లోకి నీరసంగా చేరతావు, ఫోన్‌ పెట్టేసి.

December 1, 2017

స్కూలెల్లను!

లైన్లో పిల్లలందరితో పాటు శివగాడు చిన్న చిన్న అడుగులు వేస్తూ గేటు వైపు నడుస్తున్నాడు. వెనకాలున్న పిల్లాడు షూ తొక్కితే పడబోయాడు. లైన్‌ ఆగిపోయి పిల్లలు ఒకర్నొకరు గుద్దుకున్నారు. కలదొక్కుకుంటూ ఊరికే నవ్వుతున్నారు. ఆయా అరుస్తూ ముందుకొచ్చింది. శివగాడు కోపంగా ముఖంపెట్టి ఫిర్యాదు చెప్పాడు. లైన్లో వాడి ముందున్న పిల్ల చేయిపట్టుకు లాగింది నడవమని.

శివవాళ్ళ నాన్నకి తను లేనప్పుడు శివగాడు బయట ఎలా ఉంటాడో చూడటం ఇష్టం. అందుకని రోడ్డుకి ఇవతలే నిలబడి గేటు కమ్మీల్లోంచి లోపలికి చూస్తున్నాడు. పిల్లల లైను మెట్ల దాగా వచ్చి విడిపోయింది. శివగాడు పైమెట్టు మీద ఆగి పిల్లల భుజాలు తగుల్తుంటే నిలదొక్కుకుంటున్నాడు. బ్యాగ్‌ స్ట్రాప్స్‌ లోకి వేళ్లు దూర్చి, ముందుకి వంగి అటూ ఇటూ వెతుకుతున్నాడు. నాన్న కనిపిస్తే ముఖమంతా నవ్వు. మెట్ల మీంచి గెంతి వీధి దాటబోతోంటే నాన్న ''జార్తరా!'' అని ముందుకొచ్చి ఎత్తుకొన్నాడు.

అక్కడ అమ్మలూ నాన్నలూ పిల్లల్ని ఎత్తుకొంటున్నారు. వాళ్ళ భుజానున్న బాగ్గులు తమ భుజాల మీద వేసుకుంటున్నారు. వేళ్ళు పట్టుకొని నడిపిస్తున్నారు. తలలు చెరుపుతున్నారు. శివా, నాన్నా కూడా వాళ్ళిదరి లోకంలో వాళ్ళున్నారు. నాన్న శివ ముఖంలోకి చూస్తూ అడిగాడు:

''చిన్నిమామా... ఏం చేసేవే ఇవాళ?''

''ఆ...?''

''స్కూల్లో ఏం చేశావూ... అంటున్నా,''

''ఏబీ చదుకున్నా. చదుకుంటే... స్కేలు కొట్టింది.''

''టీచరు కొట్టిందా?''

శివగాడు ఇంకోవైపు చూస్తూ అక్కడ ఎవరో ఉన్నట్టు చూపుడువేలు గాల్లో ఆడించి, '' 'దెబ్బపడతయ్‌!' చెప్పింది. మెప్పెట్టేసింది ఇక్కడా...'' అన్నాడు భుజం చూపిస్తూ.

''మరి కొట్టరా, చదూకోపోతే?''

''స్కూల్‌ బాలే.''

''తప్పమ్మా. ఏబీ చదుకోవాలి. ఏబీ చదూకుంటేనే డబ్బులొస్తాయి.''

''ఆ?''

''డబ్బులొస్తే ఐస్క్రీమ్‌, లాలీపాపా కొనుక్కోవచ్చు''

''లాలీపాప కొనేస్తావా?''

''ఇప్పుడు కాదే. స్కూలెల్లి ఏబీ చదూకొంటే ఆఫీసెళ్ళి డబ్బులు తెచ్చుకోవచ్చు''

''లాలీపాప కావాలి.''

''రేపు కొంటా, స్కూల్‌ వెళ్తావ్‌ కదా, అప్పుడు.''

''స్కూలెల్లను అస్సల''

''తప్పలా అనకూడదు''

''స్కూల్‌ బాలేదే.''

''సర్సరే... రేపు చూద్దాం. అమ్మ అప్పచ్చి చేసింది తిందాం పద.''

''...లాలిపాపా?''

నాన్న తలుపు తీసి లోపలికి వెళ్ళాడు.

అమ్మ వంటింట్లో మూకుట్లో ఏదో తిప్పుతూ వీళ్ళని చూసింది.

నాన్న శివగాడ్ని వొళ్ళో కూచోపెట్టుకొని షూ, సాక్సులు విప్పుతూ, వెనక్కి చూస్తూ చెప్పాడు, ''ఇదిగో నీ కొడుకు స్కూలుకెళ్లడంట.''

''ఏంటీ అప్పుడే!'' అంది అమ్మ.

''టీచర్‌ కొట్టిందట.''

అమ్మ గరిటె గట్టు మీద పెట్టి హాల్లోకి వచ్చింది. నడుం మీద చేయి వేసి నిలబడింది. స్కూల్లో చేర్చి ఇది నాలుగో రోజే. వాళ్ళ కొడుకు మీద ఇంకోళ్ళు చేయి చేసుకోవడం అంటే ఇంకా అలవాటు కాలేదు ఇద్దరికీ. ''కొట్టిందా? ఏరా నాన్నా... మిస్‌ కొట్టిందా?''

శివగాడు తలూపాడు.

''అదేం పొయ్యేకాలం దానికీ. నువ్వెళ్ళి అడక్కపోయావా?''

''ఏం అడుగుతామే. టీచర్లన్నాకా ఓ దెబ్బెయ్యరా? నువ్వూ నేనూ తినలేదా?''

''ఐతే మాత్రం! ఆడెంత ఉన్నాడనీ. వెళ్ళి చెప్పాల్సింది.''

శివగాడు మధ్యలో మాట్లాడాడు, ''ఏబీ రాయ్‌... దెబ్బపడతయ్‌ చెప్పి... స్కేల్‌ కొత్తింది.''

అమ్మ వాడ్ని నాన్న వొళ్ళోంచి ఎత్తుకొంది. ''రా నాన్న... నా తల్లే బంగారం. స్కేల్తో కొట్టిందా. ముండ. నువ్వెళ్ళి చెప్పాల్సింది ప్రిన్సిపాల్‌కి.''

''ఏం చెప్తామే. మళ్ళీ చెప్పామని తెలిస్తే వీడి మీదే ఉంటుంది వాళ్ళ దృష్టంతా,'' అన్నాడు నాన్న.

''నిజమేలే. ఓమ్‌ తల్లి. చిన్నిముండ. కొట్టదులే, నాన్న చెప్తాడు. గులాబ్‌ జామ్‌ చేశా తింటావా?'' అంటూ వంటింట్లోకి వెళ్ళింది.

''స్కూలెల్లను,'' అన్నాడు శివగాడు.

నాన్న హాల్లో చొక్కా బొత్తాలు విప్పుకుంటూ గట్టిగా అన్నాడు, ''ఆ వెళ్ళకు! ఇంట్లోనే అడుక్కోడిపెట్టలా కూర్చొనీ, గుడ్లెట్టు. మూడెళ్లి నాలుగొస్తుంది, సిగ్గులేదు మళ్ళా''.

శివగాడ్ని నడుం మీద పెట్టుకునే అమ్మ గరిటె తిప్పుతోంది. ''ఆ చదివినంతే చదువుతాడు. నువ్వు పెద్ద చదివేసేవా, నేను చదివేసేనా, ఈడిప్పుడు ఊడబొడిచెయ్టానికి. చిన్నపిల్లోణ్ణి పట్టుకుని ఊరికేని. ఏంరా.. బుజిముండా...''

''వంట తినాలా మనం...?''

''ఊ... అయిపోయింది. చల్లారేకా, గిన్నెలో పెడతాను. తిందుగానీ.''

''చాల వేడిగా ఉంతదా...''

అమ్మ వాడి బొజ్జ మీద రుద్దింది. ''ఆకలేస్తుందా చిచ్చితల్లికి,'' అంది. వాడికి కితకితలొచ్చి నవ్వాడు.

బయట నెమ్మదిగా చీకటిపడింది. నాన్న లుంగీ కట్టుకుని మంచం మీద వాలాడు. ఆఫీసులో విషయాలు ఆలోచిస్తూ కణతలు నులుముకొంటున్నాడు, బనీన్లోంచి గుండెల మీద రాసుకుంటున్నాడు. చివరికి మోచేతిలో ముఖం పెట్టుకుని కునికాడు. కాసేపటికి వీపు వెనక ఎవరో ఆనుకున్నట్టు అనిపిస్తే మెలకువ వచ్చి చూశాడు. శివగాడు అటు తిరిగి కూర్చున్నాడు. చేతిలో కారుబొమ్మ పట్టుకొని, పైన గోడ మూలలోకి అక్కడేం లేకపోయినా చూస్తున్నాడు.

నాన్నకి వాణ్ణలా చూస్తే ముచ్చటనిపించింది. వాడెంతసేపుకీ కదలకపోతే ''చింతల్లీ...'' అని పిలిచాడు.

శివగాడు ''ఉం'' అని తిరిగి చూశాడు.

నాన్న వాడి చంకల్లో చేతులేసి గుండెల మీదికి లాక్కొన్నాడు. వాడు రానన్నట్టు గింజుకుంటూ బరువుగా వచ్చాడు.

''ఏం చూత్తన్నావే? పిచ్చిముండ,''

శివగాడు సిగ్గుగా నవ్వి కారుబొమ్మ వేపు చూశాడు. వాడిలోపల ఏముందో అని నాన్నకి బాధగా అనిపించింది.

''అమ్మేదిరా?'' అని అడిగాడు.

శివగాడు ''లాల'' అని బాత్రూం వైపు చూపించాడు- చెంబుడు నీళ్ళు పడిన చప్పుడు వైపుకి.

''బజ్జో కాసేపు'' అని చంకల్లోకి పడుకోపెట్టుకున్నాడు నాన్న.

శివగాడు కారుబొమ్మ గుండెల మీద పెట్టుకొని నాన్న చంకలో పడుకొని ఫ్యాన్‌ వైపు చూస్తున్నాడు.

నాన్నకి మళ్ళీ ఆఫీసు గుర్తొచ్చింది. అక్కడ ఉన్న ఇబ్బంది ఏదో ఉండకపోతేనో అనీ, ఆ పరిస్థితిలో తను ఇంకోలా మాట్లాడివుంటేనో అనీ, మళ్ళీ అలాంటి పరిస్థితే వస్తే 'అప్పుడు ఇలా అనాలి' అనీ ఆలోచించుకుంటున్నాడు.

మధ్యలో ఒకసారి శివగాడు పిలిస్తే చంకలోకి చూసాడు.

శివగాడి కళ్ళు దగ్గరగా పెద్దగా కనిపించాయి. ''స్కూలెల్లాలా?'' అంటున్నాడు.

నాన్న వాడి బుగ్గలు నలిగేలా గుండెల మీదికి లాక్కొన్నాడు. ''చదూకోపోతే ఎలారా మరీ,'' అన్నాడు.

శివగాడు ఇంక ఏడుపుగొంతుతో గట్టిగా మాట్లాడాడు, ''స్కూలు బాలేదే...! బాబులు బాలేదు. ఆంతీ బాలేదు. జారీ బల్ల బాలేదు. బాలేదు అసల!''

''సర్సరె. రేపటి సంగతి కదా. నేను చెప్తాన్లే టీచరుతోటి. టీచరండీ, మా శివని కొట్టద్దండీ. బంగారుతల్లీ, బాగా చదువుకుంటాడూ అని చెబుతాగా రేపు వచ్చి? చెప్పనా?''

''వొద్దు''

''మరి వెళతావా?''

''వొద్దు, బాలేదసల.''

అమ్మ బాత్రూంలోంచి కొత్త నైటీలో వచ్చింది. ''ఊరికే ఎందుకు రాపాడించేస్తన్నావు పిల్లోడ్ని పట్టుకొనీ. వెళ్ళాపోతే మానేస్తాడు. ఏది పట్టుకుంటే అదేనబ్బా మనిషికి...'' అంది అద్దం ముందర జుట్టు తువ్వాల్తో రుద్దుకుంటూ.

శివగాడు చప్పున నాన్న చంకలోంచి లేచివెళ్లి అమ్మ కాలిని కావలించుకున్నాడు. ''అమ్మా... స్కూలెల్లనే,'' అన్నాడు పైకి చూస్తూ.

''వెళ్ళద్దు తల్లీ. నాన్న అలాగే అంటాడు బుద్ధి లేదు అస్సలు.''

''స్కూలెలు ఎలు అంతున్నారు,'' నాన్నని వేలుపెట్టి చూపించాడు.

''నీకేవే, కూర్చొని ఎన్నయినా చెబుతావు. ఐదు వేలు కట్టొచ్చానక్కడ. లెక్కాపత్రం లేకుండా పోతుంది అమ్మా కొడుకులికి. యూనిఫాం అయిపోయింది వచ్చి తీసుకోండని ఆ టైలర్‌గాడు రెండోసారి ఫోన్‌ చేసాడు. జీతం పడనియ్యరా బాబూ అని నా బాధ,'' అన్నాడు నాన్న.

''అసలు ఫీజంతా ఒకేసారి ధారబోసెయ్యమని ఎవడు చెప్పాడు నీకు. మూడు టెరంలు కట్టొచ్చు. అంతా నాకే తెలుసని బయల్దేరతావు. నోరిప్పి మాట్లాడితే కదా అసలు.''

''ఓ నెల ఉండొచ్చు, ఓ నెల వుండాపోవచ్చు. ఉన్నప్పుడే కట్టిపడేస్తే వొదిలిపోతుంది కదాని.''

''ఆ... మరిప్పుడు వాడెళ్ళనంటనాడు ఏం చేస్తావు?''

''అంటాడంటాడు. వాడిష్టమూ, నీ ఇష్టమూని. ఎన్నో రోజని చేరి? ఓ రెండ్రోజులెళ్తే మూడో రోజుకి అదే అలవాటవుతుంది.''

శివగాడు అమ్మ వైపుకీ, నాన్న వైపుకీ మార్చి మార్చి చూస్తున్నాడు. ఇంక తనే మాట్లాడాలని ముందుకొచ్చాడు. ''స్కూలెల్లనసల! బాలేదు స్కూలు. స్కేలు కొత్తింది. మెప్పెస్తుంది,'' అన్నాడు గట్టిగా.

''నోర్ముయ్యరా. వేషాలు,'' అని గొణిగి నాన్న మళ్ళీ మోచేతిలో ముఖం పెట్టుకున్నాడు.

ఈలోగా తలుపు దగ్గర్నుంచి, ''పాలండీ!'' అని వినిపించింది. అమ్మ శివగాడ్ని ''ఉండు నానా,'' అని విడిపించుకుని గిన్నె కోసం వంటగదిలోకి వెళ్ళింది.

శివగాడు మంచం మీద కారు బొమ్మ వైపు చూశాడు. దాన్ని తీసుకోకుండా, చేతులు వేలాడేసుకుని గుమ్మం వైపు నడిచి వెళ్ళాడు. పాలాయన వీడ్ని చూసి, ''టిర్రిక్‌,'' అని నాలికతో చప్పుడు చేశాడు.

శివగాడు నవ్వనా మాననా అన్నట్టు నవ్వాడు.

''పాలు తాగుతున్నావా రోజూనీ?'' అని అడిగాడు ఆయన వంగి.

''ఆ?''

''పాలు... పాలు తాగితే బలమొస్తాది. చూడు కండలు,'' అని చొక్కా చెయ్యి పైకి లాగాడు.

శివ కూడా చొక్కా చేయి లాగి చేతిని చూపించాడు. ''బలం!''

తాత ''అబ్బో'' అన్నాడు.

తర్వాత శివగాడు ముఖం మార్చుకుని తాత దగ్గరికి వెళ్ళి, ''స్కేలు కొత్తింది,'' అని చొక్కా చేతిని భుజం దాకా లాగి చూపించాడు.

శివ వాళ్ళమ్మ గిన్నెతో వచ్చింది. ''ఇంకో రెండ్రోజులాగాలండీ, జీతాలింకా పళ్ళేదు. మొత్తం నాలుగు నాగాలు,'' అంది.

''చూడండమ్మా... చిట్టీలున్నాయి కట్టాల్సినయి,'' అన్నాడు పాలాయన తల గోక్కుంటూ.

శివ చొక్కా కిందికి లాక్కుని మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. మంచం ఎక్కి, నాన్న వీపుకి వీపు ఆనించి, కారు బొమ్మని కావిలించుకున్నాడు. చాలా సేపు కళ్ళు తెరిచి చూస్తూనే  ఉన్నాడు.

ఆఫీసులో గొడవలేవో పెరిగిపెద్దవైపోయినట్టూ, ఉద్యోగం ప్రమాదంలో పడేదాకా వచ్చినట్టూ, ఏవేవో పిచ్చిపిచ్చి కలలొచ్చి నాన్నకి అర్ధరాత్రి ఎప్పుడో మెలకువొచ్చింది. ఇటు తిరిగి చెయ్యేస్తే శివగాడు తగిలాడు. మోచేతి ఊతంతో తలగడ మీద లేచి వాడి ముఖంలోకి చూశాడు. నుదురంతా చెమట చుక్కలున్నాయి. నాన్న వాడి లోకంలోకీ, కలల్లోకీ వెళ్ళాలని ప్రయత్నించాడు; వెళ్ళలేకపోయాడు. కాసేపు నిద్రపోయిన ముఖంలోకి చూశాడు. వాడ్ని మెల్లిగా తలగడ మీదకి లాగి, సందిట్లో పొదువుకొని, వాడి చిన్ని పొట్టని చేత్తో నిమురుతూ మళ్ళీ పడుకున్నాడు.

*


Published in Vaakili

August 1, 2017

తెలిసి రాసేవీ, తెలీక రాసేవీ


ఇసయా బెర్లిన్‌ అని బ్రిటిష్‌ తత్త్వవేత్త చరిత్ర పట్ల టాల్‌స్టాయ్‌ దృక్పథాన్ని చర్చిస్తూ ‘ద హెడ్జిహాగ్ అండ్‌ ద ఫాక్స్‌’ అనే పెద్ద వ్యాసం రాశాడు. వ్యాసం మొదట్లో ఆయన రచయితలందర్నీ ముళ్ళపందులనీ (హెడ్జ్‌హాగ్‌), గుంటనక్కలనీ (ఫాక్స్‌) ఒక సరదా పోలికతో విడదీస్తాడు (తెలుగులో ఇలా అంటే తిట్టినట్టే ఉంది). ఈ వ్యాసాన్నీ, నామిని కైగట్టినకథల్నీ ఒకేసారి చదువుతోంటే నామిని ఈ రెండింట్లో ఏ విభాగానికి చెందుతాడో అన్న ఆలోచన వచ్చింది. ఇసయా బెర్లిన్ ఈ పోలిక తేవటానికి ఒక ప్రాచీన గ్రీకు కవి రాసిన వాక్యం ఆధారం, అది: “గుంటనక్కకి చాలా విషయాలు తెలుసు, కానీ ముళ్ళపందికి ఒకేవొక్క పెద్ద విషయం తెలుసు” అన్నది (The fox knows many things, but the hedgehog knows one big thing). ఈ వాక్యానికి ప్రచారంలో ఉన్న అర్థం ఏమిటంటే- శత్రువు నుంచి కాపాడుకోవటానికి గుంటనక్కకు చాలా ఉపాయాలు తెలుసు, కానీ ముళ్ళపందికి తెలిసిన ఒక్క పెద్ద విషయం ముందు (చూట్టానికి ముళ్ళపొద అన్న భ్రమ కలిగించేట్టు లుంగ చుట్టుకుపోవటం) నక్కకి తెలిసిన అన్ని ఉపాయాలూ బలాదూరే అని. అయితే ఇసయా బెర్లిన్‌ దీన్ని రచయితలకు అన్వయించిన అర్థం వేరేలా ఉంటుంది. కొంతమంది రచయితలు ప్రపంచాన్ని పరస్పరం సంబంధంలేని, ఏ ఒక్క సూత్రానికీ లొంగని వైవిధ్యమైన అంశాలతో నిండినదిగా చూస్తారు. ప్రపంచంలోని అన్ని విషయాల్నీ వ్యాఖ్యానించగల ఒకే సిద్ధాంతం గానీ, అన్నిటిలోనూ అర్థం చూపగల ఏకైక దృక్పథం గానీ సాధ్యమని వీరు అనుకోరు. వీరి రచనల్లోంచి తీసుకోగల ఏకైక అంతస్సూత్రమంటూ ఏదీ ఉండదు. ఇసయా బెర్లిన్‌ వీరిని గుంటనక్కలు అంటాడు. షేక్‌స్పియర్‌, అరిస్టాటిల్‌, మాంటైన్‌, గోథె, పుష్కిన్‌, బాల్జాక్‌, జేమ్స్ జాయ్స్‌ వీరంతా ఈ రకానికి చెందుతారు. మరికొంతమంది రచయితలు ప్రపంచంలోని ప్రతి అంశాన్ని తమదైన ఒకేవొక్క దృక్పథంలోనికి తర్జుమా చేసుకుంటారు. ఆ దృక్పథాన్ని కొలమానంగా చేసుకుని ప్రపంచంలో అన్ని విషయాల్నీ అర్థం చేసుకుంటారు, బేరీజు వేస్తారు, విలువ కడతారు. డాంటే, ప్లేటో, హెగెల్‌, దాస్తోయెవ్‌స్కీ, నీషే, ఇబ్సెన్‌, ప్రూస్ట్‌ ఈ కోవకు చెందినవారంటూ వీరిని ముళ్ళపందుల విభాగంలో చేరుస్తాడు బెర్లిన్‌. నా అభిప్రాయం ప్రకారం నామిని కూడా ఈ కోవకే చెందుతాడు.

నామినికి తెలిసిన “ఒకేవొక్క పెద్ద విషయం” ఊరు. తమ చిన్నప్పటి పల్లెటూరు అదే ఆరోగ్యంతో ఉండాలంటే మనుషుల్లో ఏ విలువలు అవసరమో ఆ విలువలనే కొలమానంగా చేసుకొని నామిని రచయితగా ప్రపంచంలోని ప్రతి అంశాన్నీ బేరీజు వేస్తాడు. ఈ విలువల ఆధారంగా జరిగిన ఎంపికలు నామిని కైగట్టిన కథల్లో ఇదివరకటికన్నా స్పష్టంగా కనిపిస్తాయి (నామిని నవల ‘మూలింటామె’ రెండో భాగంలో కూడా). ఎక్కువ కథల్లో నామిని ఉద్దేశం పల్లెటూరిలో ప్రవేశిస్తున్న అనారోగ్యకరమైన నాగరిక లౌల్యాల్ని చూపెట్టటమనీ, వాటికి లొంగిపోయిన, లేదా లొంగకుండా నిలదొక్కుకున్న ఊరివాళ్ళను పాత్రలుగా చిత్రించటమనీ స్పష్టంగా తెలిసిపోతుంది. ఊళ్ళోకి రియలెస్టేటు చొరబడటం; ఊళ్ళోంచి చెట్టూచేమా మాయమవటం; చద్దికూడు పోయి ఇడ్లీదోసెలూ, మట్టి రోడ్లు పోయి సిమెంటు రోడ్లూ, వాటి మీదకు ఇన్నోవాలు, ఉత్తరేణి పుల్ల పోయి పెప్సొడెంట్‌ టూత్ పేస్టూ, కట్టెపొయ్యె పోయి గ్యాస్‌ స్టవ్వూ రావటం; ఇక్కడి జీవన రీతులపై శ్రీచైతన్య నారాయణాల నుంచి బీటీ వంకాయల దాకా చేస్తున్న ప్రచ్ఛన్న దాడి... ఇలాంటి వివరాలు ఒక్కోసారి కథల ఇతివృత్తాలు గానూ, ఒక్కోసారి ఇతివృత్తాలకు నేపథ్యంలోనూ మసలుతూ నామిని ఉద్దేశానికి సాయపడతాయి. ఈ కైగట్టిన కథల్లోని ప్రపంచాలు చాలావరకు నామిని విలువల కొలమానానికి అనుకూలంగానో, ప్రతికూలంగానో మాత్రమే వ్యక్తమవుతాయి. అయితే నామిని ఇలా ఒక హెడ్జిహాగ్ లాగా గాక, ఫాక్స్‌ లాగా రాసిన కథలు కూడా ఈ పుస్తకంలో కొన్ని ఉన్నాయి: ‘అకా, కేక కా!’, ‘దేముడి పాది’, ‘కడుప్మంట్ బొయ్‌ నవ్వొచ్చే ట్రాపిక్కు’ ఇలాగ. ఈ కథల్లోని ప్రపంచాల వెనుక నామిని విలువల కొలబద్ద కనిపించదు. వీటి ద్వారా ఏమీ చెప్పాలనుకోడు. అర్థం కాకుండా, అర్థం లేకుండా ప్రపంచం ఊరకనే చేసే అలవిమాలిన నృత్యానికి తన పుస్తకం పేజీల్ని వేదికగా అరువిస్తాడు. ఒక పాఠకుడిగా నేను రచయితల్లో హెడ్జిహాగ్‌లకన్నా, ఫాక్సుల వైపే మొగ్గు చూపుతాను. నామిని హెడ్జిహాగ్ గుణాన్ని పక్కనపెట్టి రాసిన ఇలాంటి కథలే ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చాయి. తినటానికి సూపర్‌ మార్కెట్‌ వొంకాయల కూర వద్దని దేదారాకు వండమనే గుడాయన్లూ, దీపం పథకం కింద గ్యాస్‌ స్టవ్వు తీస్కొనే వీలున్నా కట్టెల పొయ్యినే వాడే యిరపచ్చమ్మల కన్నా, మొగుడు చనిపోయిన నాలుగో రోజుకి తిరుపతి పోయి ఫుడ్‌కోర్ట్‌ పెట్టుకున్న తాటాకామె, అత్తారింట్లో కూతురి బాధలు చూళ్ళేక గృహహింస కేసు పెట్టిస్తానని బెదిరించే అంజేరి నాకు నచ్చారు. ఎందుకంటే గుడాయన నామిని విలువల ప్రతినిధి. తాటాకామె ఆ విలువల బరువు మోయటం లేదు. ఆమె ఏంటో బహుశా నామినికి కూడా తెలీదు. 

(‘కొళ్ళో జగ! – నామిని కైగట్టిన కతలు’ పుస్తకం మీద సమీక్ష) 

July 17, 2017

తెలుగు అనువాదంలో టాల్‌స్టాయ్


టాల్‌స్టాయ్ 'వార్ అండ్ పీస్' నవలని చదవాలని అనుకునేవాళ్లు ఇంగ్లీషు రాక, రష్యన్ ఎలాగూ రాక, ఇక గత్యంతరం లేకపోతేనే తెలుగు అనువాదాన్ని చదవండి. అప్పుడు కూడా మీరు టాల్‌స్టాయ్‌ని పూర్తిగా చదవటం లేదన్నది దృష్టిలో పెట్టుకుని చదవండి. ఏ ఇంగ్లీషు అనువాదాలు మంచివో తర్వాత చెబుతాను. నా ఫ్రెండ్స్ తెలుగులోనే చదివారని నేనూ అదే చదవబోయి, మూడు అధ్యాయాల లోపలే ఎందుకు విరమించుకున్నానో అది ముందు చెబుతాను.

నేను చదివిన మొదటి మూడు చిన్న అధ్యాయాల్ని బట్టి బెల్లంకొండ రామదాసు, రెంటాల గోపాలకృష్ణల అనువాదం అస్సలు బాగాలేదు. ఇక ముందు బాగుంటుందనే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కూడా ఇవ్వలేకపోతున్నాను. అనువాదకులు కొన్ని చోట్ల చాలా వదిలేశారు, కొన్ని చోట్ల ఒకే వాక్యంగా ఉన్నదాన్ని విడగొట్టి పాడు చేశారు, కొన్ని చోట్ల అసలు అర్థం చేసుకోవటమే తప్పుగా అర్థం చేసుకున్నారు. ఈ తెలుగు అనువాదాన్ని నేను Louise Maude అనువాదం తోనీ, Ann Dunnigan అనువాదం తోనీ పోల్చిచూసాను. తెలుగు అనువాదకులు పుస్తకానికి రాసిన ముందు మాటలో ఆంగ్లం నుంచి అనువదించామని చెప్పుకున్నారు. Louise and Aylmer Maudeల అనువాదం స్వయంగా టాల్‌స్టాయ్ ఆమోదించింది కాబట్టి ఈ అనువాదకులు దాన్నే వాడి ఉంటారని అనుకుంటున్నాను. గూగుల్ లేని కాలంనాటి కష్టాల్ని ఊహించుకోగలను. అయినా కొన్నిటిని ఒప్పుకోలేకపోయాను. అనువాద లోపాలకు కొన్ని ఉదాహరణలు కింద ఇస్తున్నాను:

అసలు తెలుగు అనువాదంలో మొదటి పేరాయే- "సరే రాకుమారా! ఇప్పుడు నే నేమిటి చెప్పాను? జెనోయా, బాకా బోనపార్టీ హస్తగమైనాయి. అందుచేత నిన్ను జాగ్రత్త పడవలసిందని హెచ్చరిస్తున్నాను" ఇలా మూడు వాక్యాల్లో తేల్చేశారు. కానీ ఇంగ్లీషులో ఏకంగా ఇంత ఉంది:
Maude translation: ‘Well, Prince, so Genoa and Lucca are now just family estates of the Buonapartes. But I warn you, if you don’t tell me that this means war, if you still try to defend the infamies and horrors perpetrated by that Antichrist—I really believe he is the Antichrist—I will have nothing more to do with you, and you are not my faithful slave, as you call yourself. Well, how do you do? How do you do? I see that I have frightened you.—sit down and tell me all the news.’
అలాగే సన్నివేశ చిత్రణలో టాల్‌స్టాయ్ పాత్రల్లో వ్యక్తావ్యక్తంగా పొడచూపే కొన్ని స్వభావగతుల్ని వాటి అన్ని ఛాయల్లోనీ పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. అలాంటి వాక్యాలు ఈ అనువాదంలో బండబారాయి, లేదంటే అర్థాన్ని పోగొట్టుకున్నాయి. అన్నా పావ్‌లోవ్‌నా మొదట్లో 'ఈ పార్టీలు అంటే విసుగు పుడుతుంది' అంటే దానికి బేసిల్ రాకుమారుడు స్పందన తెలుగులో ఇలా ఉంది:
బెల్లంకొండ - రెంటాల తెలుగు అనువాదం: "నీ విలా అంటావని తెలిసినట్టయితే నిజంగా ఆపుచేసి ఉండేవాళ్ళే" అని రాకుమారుడన్నాడు. ఏ మాత్రం తొణక్కుండా చెక్కుచెదరని గడియారం మాదిరి ఈ మాటలు రాకుమారుడు అనేశాడు. 
Dunnigan translation: "Had they known that you wished it, the fete would have been postponed," said the prince, like a wound-up clock, saying by force of habit things he did not even expect to be believed.
Maude translation: ‘If they had known that you wished it, the entertainment would have been put off,’ said the prince, who, like a wound-up clock, by force of habit said things he did not even wish to be believed.
--దీన్ని తెలుగులో సరిగా అనువదిస్తే ఇలా ఉండాలి- "నీవిలా అంటావని తెలిస్తే, వాళ్లు ఆ పార్టీ వాయిదా వేసుకుని ఉండేవాళ్ళే," అన్నాడు రాకుమారుడు, ఒక కీ ఇచ్చిన గడియారంలా, అలవాటు ప్రోద్బలంతో తనే నమ్మని విషయాల్ని మాట్లాడుతూ.

అసలు ఈ బేసిల్ రాకుమారుడు అన్నా పావ్‌లోవ్‌నా ఇంటికి వచ్చినప్పటి నుంచీ, కొంత ఆమె ధోరణికి అనుగుణంగా మాట్లాడుతూనే కొంత అంటీముట్టనట్టు వ్యంగ్య ధోరణిలో మాట్లాడుతూ ఉంటాడు. ఆ ధోరణిని చూపించే చాలా అంశాల్ని సరిగా అనువదించలేదు.

పోనీ ఇవన్నీభరించినా, కొన్ని చోట్ల అసలు అనువాదమే తప్పుగా ఉంది. అన్నా‌పావ్‌లోవ్‌నా ఇచ్చే విందులో ఇద్దరు ప్రముఖులు వస్తారు. వాళ్ళని అన్నా పావ్‌లోవ్‌నా తన ఇతర అతిథులకు ఎలా పరిచయం చేస్తోందో చెప్పటానికి టాల్‌స్టాయ్ ఒక మెటఫోర్ వాడతాడు. నూనె డాగులున్న వంటగదిలో చూస్తే ఎవరికీ తినాలనిపించని మాంసాన్ని తెలివైన హెడ్‌వైటర్ ఎలా ప్రత్యేకమైన వంట అని రుచిగా వడ్డిస్తాడో అలా అన్నా పావ్‌లోవ్‌నా వాళ్ళిద్దర్నీ పార్టీకి వచ్చిన మిగతా అతిథులకి రుచికరమైన మాంసం ముక్కల్లాగా వడ్డిస్తోంది అంటాడు. ఈ తెలుగు అనువాదంలో మాత్రం ఆమె ఏవో రుచికరమైన పదార్థాల్ని వారిద్దరికే వడ్డిస్తోంది అని అర్థం వచ్చేట్టు ఉంది:
Maude translation: Anna Pavlovna was obviously serving him up as a treat to her guests. As a clever maître d’hôtel serves up as a specially choice delicacy a piece of meat that no one who had seen it in the greasy kitchen would have cared to eat, so Anna Pavlovna served up to her guests, first the vicomte and then the abbé, as peculiarly choice morsels. 
బెల్లంకొండ - రెంటాల తెలుగు​ అనువాదం: అన్నా పావ్‌లోవ్‌నా ఇది అవకాశంగా తీసుకుని ఒక హోటలు యజమానురాలిగా ప్రతి పదార్థాన్ని ఎంతో ఏరికోరి తాను స్వయంగా వడ్డించినట్టు చెపుతూ మొట్టమొదట విస్‌కౌంట్ మార్టీ మార్ట్‌కు, తరువాద అబీకి, రెండు చవులూరే ముద్దలు వడ్డించింది.
--ఇక్కడ తెలుగు అనువాదంలో టాల్‌స్టాయ్ పొయెటిక్‌గా వాడిన మెటఫోర్ కాస్తా, ఒక వాస్తవ సన్నివేశంగా మారిపోయింది. అన్నా పావ్‌లోవ్‌నా కాస్తా ఒక హోటల్ యజమానురాలిగా మారిపోయింది. అలాగే ఇదే పేరాకి ముందు పేరాలోనూ ఒక తప్పు ఉంది:
బెల్లంకొండ - రెంటాల తెలుగు​ అనువాదం: "అన్నాపావ్‌లోవ్‌నా గృహంలో సాయంత్రపు సమావేశం ఒక స్థాయి అందుకున్నది. ఒక్క మెటాంటే మాత్రం ఒక మూల అశ్రు కలుషితమైన ముఖం గల వృద్ధ స్త్రీతో కలిసి వివిక్తంగా కూచుని ఉన్నాడు."
--తెలుగులో చదివేవాళ్ళకి ఇంతకుముందు రాని ఈ మగ "మెటాంటే" పాత్ర ఎవడురా అని అనుమానం వస్తుంది. ఫ్రెంచ్ భాషలో "మె టాంటే" అంటే "నా ఆంటీ" అని అర్థం. అంతకుముందు అన్నా‌పావ్‌లోవ్‌నా తన ఇంట్లో పార్టీకి వచ్చిన ప్రతి వాళ్ళనీ ఒక ముసలావిడ దగ్గరికి తీసుకువెళ్ళి "నా ఆంటీ" (ఫ్రెంచ్‌లో "మె టాంటే") అని పరిచయం చేస్తుంది. టాల్‌స్టాయ్ తర్వాత కూడా ఆమెని ఉద్దేశించి ఈ 'మె టాంటే' అన్న పదమే వాడతాడు. ఆమె పక్కన ఒక దిగాలు ముఖంతో ఒక స్త్రీ కూర్చూంటాన్ని టాల్‌స్టాయ్ ఇలా చెప్తాడు:
Maude translation: Anna Pavlovna’s reception was in full swing. The spindles hummed steadily and ceaselessly on all sides. With the exception of 'ma tante', beside whom sat only one elderly lady, who with her thin tear-worn face was rather out of place in this brilliant society, the whole company had settled into three groups.
--దీని తెలుగు అనువాదంలో ఇద్దరు ఆడ మనుషులు కలిసిపోయి ఒకేవొక్క మగ మనిషి మిగిలాడు. అంతే కాదు, పైన ఇంగ్లీషు అనువాదంలో ఉన్న "The spindles hummed steadily and ceaselessly on all sides" అన్న వాక్యం అసలు తెలుగులోకి అనువాదమే కాలేదు. అనువాదయ్యుంటే- "అన్ని వైపులా దారపు కండెలు నింపాదిగా నిరంతరాయంగా తిరుగుతూనే ఉన్నాయి" అని ఉండాలి. బహుశా ఇక్కడ దారపు కండెలు అన్నది టాల్‌స్టాయ్ దేన్ని ఉద్దేశించి వాడాడో అనువాదకులకి అర్థం కాలేదనుకుంటా. అంతకుముందు అధ్యాయంలో తెలుగు అనువాదకులు అనువదించకుండా వదిలేసిన ఒక పోలిక ఇలా సాగుతుంది (నా అనువాదం): "ఒక స్పిన్నింగ్ మిల్లు యజమాని యంత్రాల్ని ఆన్ చేసి తర్వాత కార్ఖానా అంతా కలియదిరుగుతూ​ ఎక్కడైనా ఒక దారపుకండె సరిగా తిరగకపోతే దాన్ని సరి చేస్తూ, లేదా ఎక్కడైనా యంత్రం అనవసర శబ్దాలు చేస్తూంటే దాన్ని చక్కదిద్దుతూ ఎలా సాగుతాడో అలాగే అన్నా‌పావ్‌లోవ్‌నా కూడా ఏదైనా గుంపులో సంభాషణ మందగిస్తే దాన్ని ముందుకు నెడుతూ, ఎక్కడైనా మాటలు మరీ పెచ్చుమీరి గొడవయ్యేట్టుంటే నెమ్మదింపచేస్తూ పార్టీ అంతా కలయదిరుగుతోంది". అనువాదకులు దీన్ని అనువదించలేదు కాబట్టి ఇక్కడ తర్వాతి అధ్యాయంలోని పై వాక్యమూ వదిలేశారు. నిజానికి దారపు కండెలు తిరుగుతూ దారం విప్పుకోవటం అనేది ఈ సందర్భంలో చాలామంచి పోలిక.

ఇదే పార్టీలో బోల్‍కోన్‌స్కీ రాకుమారి పెదవుల వర్ణన ఉంటుంది. అది చదివితే కచ్చితంగా ఆమె ప్రత్యేకమైన అందం పాఠకుడి మనసులో పటం కడుతుంది. ఆ వర్ణన ఇది (మొత్తం పేరా ఇస్తున్నాను):
Dunnigan translation: The young Princess Bolkonskaya had brought her needlework in a gold-embroidered velvet bag. Her pretty little upper lip, shadowed with a barely perceptible down, was too short for her teeth and, charming as it was when lifted, it was even more charming when drawn down to meet her lower lip. As always with extremely attractive women, her defect—the shortness of her upper lip and her half-open mouth—seemed to be her own distinctive kind of beauty. Everyone took delight in watching this pretty little woman, brimming with health and vitality, who, soon to become a mother, bore her burden so lightly. After being in her company and talking to her for a while, old men and somber apathetic young men felt themselves becoming, like her, more animated. Talking to her, and seeing at every word her bright smile and flashing white teeth, made a man feel that he was in particularly amiable humor that evening. And this was true of everyone. 
బెల్లంకొండ - రెంటాల తెలుగు అనువాదం: బోల్‌కోన్‌స్కీ రాకుమారి బంగారు జలతారుతో కుట్టిన తన చేతి సంచిలో కొన్ని అల్లిక వస్తువులు తీసుకొని వచ్చింది. ఆమె పై పెదవి చిన్నది. ఎంతో ముచ్చటగా ఉంది. ఆ చిన్నారి పెదవి క్రిందికి దిగి క్రింది పెదవితో కల్పిన సూచన ఎంతమాత్రం కనిపించడం లేదు. కాని ఈ స్వల్ప దోషం ఒక దోషంగా లేదు. పైగా అందులో ఒక విచిత్రత ఒక వినూత్నత అగుపిస్తోంది. అరవిచ్చిన ఆమె నోరు ఆమెకు మరింత అందాన్నే చేకూరుస్తోంది. సౌందర్యవతియైన స్త్రీకి ఇది వరంలాంటిది. జీవంతోనూ, ఆరోగ్యంతోనూ నిండి పొంగారుతున్న ఆ గర్భవతిని చూచి అందరూ ఎంతో ముచ్చట పడ్డారు. యువకులు, వృద్ధులు -- అందరినీ ఆమె సౌందర్యం ఆకట్టుకొన్నది. ఆమె ముత్యాల పలువరస కనిపించేది.
ఈ పేరాడు తెలుగు అనువాదంలో టాల్‌స్టాయ్‌కి చాలా అన్యాయం జరిగింది (ఆ రాకుమారి అందానికి జరిగిన అన్యాయం చెప్పనే అక్కర్లేదు). ఆమె పై పెదవి మీద సన్నని నూగు తెలుగులోకి రాలేదు. ఆమె పెదవులు రెండూ పళ్ళ మీద మూసుకోలేకపోవటం గురించి టాల్‌స్టాయ్ వర్ణన చదివితే నాకైతే Kalki Koechlin లాంటి ఒక ముఖం కొంత మోడిఫికేషన్లతో మనోఫలకం మీదకు వచ్చింది. తెలుగు అనువాదంలో వట్టి పదాలు చదివాను తప్పించి ఒక ముఖం ఊహల్లో రూపుకట్టలేదు. తెలుగు అనువాదంలో "సౌందర్యవతియైన స్త్రీకి ఇది వరం లాంటిది" అని ఒక వాక్యం ఉంది. అది ఎందుకు వరమో, ఏ రకంగా వరమో అన్నదాని గురించి టాల్‌స్టాయ్‌కే ప్రత్యేకమైన ఏదో ఒక పరిశీలన ఉంటే తప్ప ఆయన అలాంటి చెత్త మామూలు వాక్యం రాయడు. అలాగే గర్భంలో బరువుని చాలా తేలిగ్గా మోస్తుంది (bore her burden so lightly) అన్న అందమైన అబ్జర్వేషన్‌ కూడా తెలుగులో మాయం. అలాగే "యువకులు, వృద్ధులు -- అందరినీ ఆమె సౌందర్యం ఆకట్టుకొన్నది" అని అనువాదంలో ఒక్క ముక్కలో తేల్చిపడేసిన చోట మూలంలో చాలా ఉంది. ఏముందో అనువదించే నా ప్రయత్నం ఇది- "ఆమె సమక్షంలో కాసేపు ఉండి ఆమెతో కాసేపు మాట్లాడిన తర్వాత, ముసలివాళ్లూ, మందకొడిగా ఉన్న యువకులూ కూడా, ఆమె లాగ, ఎంతో చురుకుగా మారిపోయారు. ఆమెతో మాట్లాడుతుంటేనూ, ప్రతీ మాటకీ వెలిగిపోయే ఆమె నవ్వునీ, విచ్చుకునే తెల్లని పలువరసనీ చూస్తుంటేనూ, అక్కడున్న ప్రతి మగవాడికీ ఎందుకో ఈ సాయంత్రాన తన మనసు హాయిగా ఉన్నట్టు తోచింది. అందరి విషయంలోనూ ఇదే జరిగింది."

మూడు చిన్న అధ్యాయాలకే ఇన్ని నగుబాట్లయితే (పైన ఇచ్చిన ఉదాహరణలు నేనేమీ పట్టిపట్టి వెతికినవి కాదు, ఊరకే చూస్తూపోతే దొరికినవే) ఇక నేను తెలుగులో చదవటం కొనసాగించే ధైర్యం చేయలేకపోయాను. ఈ రుజువులతోనే చెబుతున్నాను, ఎవరైనా 'వార్ అండ్ పీస్'ని ఈ తెలుగు అనువాదంలో చదివితే వారు అసలు పుస్తకాన్ని యాభై శాతం మాత్రమే—అది కూడా టాల్‌స్టాయ్ శైలిలోని అందాలన్నీ వదిలేసి, మన పాత పాఠ్యపుస్తకాల్లో పాఠం తర్వాత ఇచ్చే సంక్షిప్త సారాంశం లాంటిది మాత్రమే—చదివినట్టు. నేను చెప్పిన రెండు ఇంగ్లీషు అనువాదాల్లో కనీసం ఆ నవలని ఇంగ్లీషులో ఒక మంచి రచయిత రాసినట్టు అనిపించింది. మనుషులు మాట్లాడుకునే భాషకి మరీ దూరంగా, far-fetched పదాలు లేకుండా ఉంది. కానీ ఈ తెలుగు అనువాదంలో కనిపిస్తున్న శైలి ఏ మంచి తెలుగు రచయితా రాయడు. ముఖ్యంగా సులువైన శైలిని నమ్మే, ఒక masculine, dry శైలిలో రాసే టాల్‍స్టాయ్ తెలుగులో రాసి ఉంటే "అభిరతి", "వివిక్తం" లాంటి భాషతో అస్సలు రాయడు.

* * *

ఇక ఇంగ్లీషులో చదవదల్చుకున్న వారికి కొన్ని సలహాలు: 'వార్ అండ్ పీస్' కి ఇంగ్లీషు అనువాదాల్లో పైన నేను చెప్పిన అనువాదాలు రెండూ మంచివని నేను వెతికి తేల్చుకున్నాను.

మొదటిది Louise Maude & Alymer Maude అనువాదం. వీరిద్దరూ భార్యా భర్తలు. ఈ అనువాదానికి ఉన్న ప్లస్సులు ఏమిటంటే, వీరిద్దరినీ తనకు మంచి అనువాదకులని స్వయంగా టాల్‌స్టాయ్ ఆమోదించాడు. వీరి అనువాదాలు చాలా వెర్షన్లు అందుబాటులో ఉన్నాయి. మంచి వెర్షన్ లింక్ ఈ కింద ఇస్తున్నాను:
http://www.amazon.in/dp/0679405739/ref=wl_it_dp_o_pC_nS_ttl?_encoding=UTF8&colid=2LRIGJ31V6XOE&coliid=IJNN1WR0ETMWI

ఈ Everyman's Library వాళ్ల ఎడిషన్ మూడు వాల్యూముల్లో, మంచి బైండింగ్ తో, బుక్ మార్క్ దారంతో వస్తాయి. ఈ పుస్తకం నేను కొనలేదు. కానీ Everyman వాళ్ళవి ఇవే సిరీస్‌లో నేను టాల్‌స్టాయ్ 'ద కంప్లీట్ షార్ట్ స్టోరీస్' రెండు వాల్యూములు కొన్నాను. దాన్ని బట్టి ఇదీ బాగుంటుందనే అనుకుంటున్నాను. పైగా పెద్ద నవల కనుక మూడు వాల్యూముల్లో తేలికపాటి పుస్తకాలుగా చదువుకోవటం బాగుంటుంది. కానీ ఖర్చు ఎక్కువ. అమెజాన్‌లో దాదాపు రూ.2,500 చూపిస్తోంది. అంత కష్టం అనుకుంటే, ఇదే Maudeల అనువాదాన్ని ఆక్స్‌ఫర్డ్ వాళ్ళు వేసారు.
https://www.amazon.in/dp/0199232768/ref=wl_it_dp_o_pC_nS_ttl?_encoding=UTF8&colid=2LRIGJ31V6XOE&coliid=IU9ACKBYPWEQ8

ఈ ఆక్స్‌ఫర్డ్ వాళ్ళది ఓ 800రూపాయల్లో వచ్చేస్తుంది. కానీ టాల్‌స్టాయ్ తన నవలలో చాలా వరకూ ఫ్రెంచ్ భాషని వాడాడు. ఇంత పెద్ద నవలలో 5శాతానికి పైగా ఫ్రెంచే ఉంటుంది. అసలు నవల మొదటి వాక్యమే ఫ్రెంచ్ లో ఉంటుంది. Maudeలు అనువదించేటప్పుడు ఫ్రెంచ్ అంతట్నీ ఇంగ్లీషులోకి తర్జుమా చేశారు. కానీ ఈ ఆక్స్‌ఫర్డ్ ఎడిషన్ వాడు ఆ ఫ్రెంచ్ ని అంతా తిరిగి చేర్చాడు. దానికి ఇంగ్లీషు అనువాదాన్ని ఫుట్‌నోట్స్ లో ఇచ్చాడు. మీకు ఫ్రెంచ్ వస్తే సరే. కానీ పేజీల కొద్దీ ఫ్రెంచ్‌ ఉండి, దానికి ఇంగ్లీషు అనువాదాన్ని ఫుట్‌ నోట్స్ లో చదవాలంటే చచ్చేచావు. ఆ బాధపడదల్చుకుంటే తప్ప ఇది కొనవద్దు. నోర్టన్ వాళ్ళు వేసింది కూడా Maude అనువాదమే, కొంత మెరుగుపెట్టారట, చివర్లో మంచి విమర్శనాత్మక వ్యాసాలు కూడా ఉంటాయి. కొనుక్కోగలిగితే ఇదీ మంచిదే:
https://www.amazon.in/War-Peace-Norton-Critical-Editions/dp/039396647X/ref=sr_1_5?s=books&ie=UTF8&qid=1500285018&sr=1-5&keywords=tolstoy+stories

ఇక రెండో మంచి అనువాదం Ann Dunnigan చేసింది. గారీ సాల్ మార్సన్ దీన్ని మంచి అనువాదం అని చెప్పాడు కాబట్టి, ఈమె అనువాదంలోనే ఇదివరకూ కొన్ని చెహోవ్ కథలు చదివి ఇష్టపడివున్నాను కాబట్టి నేను దీన్నే చదువుతున్నాను. దీన్ని Signet classics వాళ్ళు వేశారు. దీనితో ఇబ్బంది ఏమిటంటే, ఈ పుస్తకం ఎత్తు తక్కువ, లావు ఎక్కువ. దుబ్బలాగా ఉంటుంది. పేపర్ బాక్ కాబట్టి ఒకసారి చదివితే మళ్ళీ రెండోసారి చదవటానికి పనికి రాకుండా పోతుంది.
https://www.amazon.in/Peace-Signet-Classics-John-Hockenberry/dp/0451532112?_encoding=UTF8&psc=1&redirect=true&ref_=od_aui_detailpages00

ఇవన్నీ ఖర్చనుకుంటే, ఒక మంచి సొల్యూషన్ ఏమిటంటే- హైదరాబాదులో సెకండ్ హాండ్ బుక్ షాపుల్లో తిరిగితే దాదాపు ప్రతి షాపుకీ ఎలా లేదన్నా రెండు మూడు 'వార్ అండ్ పీసు' పుస్తకాలు ఉంటాయి. వీటిల్లో మీ అదృష్టం కొద్దీ పైన చెప్పిన అనువాదాలు రెండు మూడు వందల్లో దొరికేయవచ్చు. నాకు Maude అనువాదం అలానే దొరికింది. ఈ రెండూ గాకపోతే, మూడో ఆప్షన్‌గా Constance Garnett అనువాదం కూడా మంచిదే. అది కూడా సెకండ్ హాండ్ స్టోర్స్ లో దొరుకుతుంది.

అసలు ఎందుకు చదవాలీ అంటే మరో రష్యన్ రచయిత చెప్పిన ఈ మాటలు: "ప్రపంచం తన్ను తానే రాసుకోగలిగితే, అది టాల్‌స్టాయ్ లాగా రాస్తుంది".

Published in Pustakam.net:
http://pustakam.net/?p=19760

June 30, 2017

ఊరట

—ఆగి
ఆమెకు అడ్డుగా నిలబడి
వాడకం చీర, స్నానం సబ్బు,
జాకెట్ చంకల చెమట చంద్రవంక,
వీటి వెనక లీలగా తారాడే ఆమె సొంత
వాసనను ఊపిరితిత్తుల్లోకి పీల్చుకుని
ధ్యాసలన్నీ ఉఫ్ మని ఆర్పేసి
అంతరావయవాల సజీవ ఉష్ణోగ్రత
చర్మం గూండా తెలిసేట్టూ
అణిచే అనాదరించే వాస్తవం
కమ్మటి కలల రంగుల్లోకి చెదిరేట్టూ,
నీకేసి అదుముకొని...
ఆమె ఎడమ చెవీ, నీ ఎడమ చెవీ
లేదూ నీ కుడి చెవీ, ఆమె కుడి చెవీ
నిశ్శబ్దాన్ని మృదులాస్థి మధ్య మర్దిస్తుంటే
ఊపిరులు మెడ మీది అదృశ్య భారాల్ని ఊదేస్తుంటే
ఎదుట ఉన్నదేదీ కనిపించకుండా
లోపల ఉన్నదేదో వినిపించుకుంటూ
దేవుడు ఇంకో మనిషిని ఇచ్చినందుకూ
ఇచ్చీ ఇంకో మనిషిగానే మిగిల్చినందుకూ
నిట్టూర్పులో ఒకసారి మరణించి
“ఏంట్రా పిచ్చోడా” అని వీపు నిమిరితే తేరుకొని
వాస్తవాన్ని సిగ్గుగా ఏరుకొని
ఒకసారి జన్మించి, మళ్ళీ జీవితంలోకి,
ముద్దిచ్చి
విడిపోయి—

*

Published in Andhra Pradesh Magazine September 2017 edition:



June 2, 2017

నివాళి వ్యాసం


ఎవరో సాహితీ మిత్రుడు ఫోన్ చేసి చెబితే తెలిసింది రామారావుకి- పెద్దాయన చనిపోయాడని. తాను ఎప్పట్నుంచో కలుద్దామని ఎదురుచూస్తున్న మనిషి చనిపోయాడంటే రామారావుకి చాలా నిరాశగా అనిపించింది. వెంటనే ఇంకొంతమంది రచయితలకి ఫోన్ చేశాడు. ఓ నలుగురు కలిసి విశాఖపట్నం బయల్దేరదాం అనుకున్నారు. పొద్దున్న అక్కడికి టీవీ వాళ్ళు రావొచ్చు, కాబట్టి రామారావు తన పచ్చటి కాటన్ లాల్చీని బేగ్లో సర్దుకున్నాడు. ఆటో కట్టించుకుని, డిసెంబరు చలికి స్వెటర్లో కూడా వణుకుతూ, బస్టాండ్కి చేరాడు. మిత్రులందరూ అక్కడ కలిసి బస్సెక్కారు. మూడు గంటల తర్వాత సూర్యాపేటలో భోజనాలకని బస్సు ఆపు చేసినపుడు, నలుగురూ ఒక టేబిల్ దగ్గర కూర్చుని, టిఫిన్ చేస్తూ, పెద్దాయన గురించి మాట్లాడుకున్నారు. తక్కినవాళ్ళు ఆయనతో పరిచయాన్ని నెమరు వేసుకుంటుంటే, రామారావు ఆయన రచనల మీదకి మాటలు మళ్ళించాడు. ఇప్పటికైనా ఆయన రచనా సర్వస్వం ప్రచురిస్తే బాగుంటుందని అన్నాడు. మరో మిత్రుడు- అందులో కథలే కాదు; ఆయన డైరీలూ, ఉత్తరాలూ, ఇంకా ఏమున్నా అన్నీ పబ్లిష్ చేయాలన్నాడు. ఎవరి చేతన్నా మోనోగ్రాఫ్ లాంటిది రాయిస్తే ఎలా ఉంటుందీ అని మాట్లాడుకున్నారు. ఈ పుస్తకాలు వేయటానికి ఎవరి వంతు సాయం వాళ్ళు చేద్దాం అనుకున్నారు.

బస్ బయల్దేరాకా, రామారావు బేగ్ లోంచి శాలువా లాగి తల చుట్టూ కప్పుకున్నాడు. కిటికీ అద్దం దళసరిగా నీలంగా ఉండి బయట ఏమీ కనిపించటం లేదు. రామారావు పెద్దాయన గురించి ఆలోచించాడు. కలిసుంటే తనని ఏమని మెచ్చుకునేవాడో, ఏమని ఆశీర్వదించేవాడో ఊహించుకున్నాడు. రామారావుకి ఇది సాహిత్యంలో “సెకండ్ ఇన్నింగ్స్” అంటారు స్నేహితులు. అతను 80’ల చివర్లో పాతికేళ్ళ వయసులో ఉద్యోగం వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చాడు. చుట్టాల కంపెనీలో ఉద్యోగం చేస్తూ, స్టేట్ సెంట్రల్ లైబ్రరీకీ, చుట్టుపక్కల సాహిత్య సభలకీ వెళ్ళేవాడు. తెలుగు సాహిత్యంలో అప్పుడప్పుడే అస్తిత్వ వాదాలు మొదలయ్యాయి. రామారావు అంతకు పదేళ్ళ మునుపే గనక రాయటం మొదలుపెడితే విప్లవ కవిత్వం రాసేవాడేమో. తొంభైల్లో ధోరణి వేరు కనుక అస్తిత్వ వాదాల తరఫున కవిత్వం రాసాడు. ఐదేళ్లలో మూడు కవిత్వ పుస్తకాలు తీసుకొచ్చాడు. తర్వాత పెళ్లవటంతో జీవితం పెద్ద మలుపు తీసుకుంది. కొన్ని నెలలు పత్రికలో సబెడిటర్గా పనిచేశాడు. అక్కడ “సైద్ధాంతిక విబేధాల” వల్ల ఇన్ఛార్జితో గొడవపడి బయటికి వచ్చేసాడు. తర్వాత ఒక ప్రైవేటు కంపెనీలో సేల్స్ డిపార్టుమెంటులో చేరాడు. అక్కడ పని చేసిన నాలుగేళ్ళ కాలాన్ని రామారావు జీవితంలో అత్యంత గడ్డు కాలంగా ఇప్పటికీ గుర్తుంచుకుంటాడు. ఆ సేల్స్ టార్గెట్స్, ఆ ఎవాల్యుయేషన్ మీటింగ్స్…! కనాకష్టమైన జీతంతో, ఓవర్ టైం పని చేస్తేనే తప్ప రాలని కమీషన్లతో, పిల్లాడికి పాల డబ్బాలు కూడా కొనలేని దరిద్రంలో, ఎలాగో నెట్టుకొచ్చాడు. ఈ నాలుగేళ్ళలోనే రామారావుకి కవిత్వం అనేది లోకంలో ఎంత చిన్న విషయమో అర్థమైంది. ఇక దశాబ్దం ముగుస్తుందనగా, బీహెచ్ఇఎల్ లో పెద్ద ఉద్యోగం చేసే ఓ మావయ్య రామారావుని రియలెస్టేట్ వ్యాపారం వైపు మళ్ళించాడు. అప్పుడే సెల్ ఫోన్లు కొత్తగా వచ్చాయి. రామారావు నంబరు అతని సాహిత్య మిత్రుల ఫోన్లలో కన్నా, అతని వ్యాపార మిత్రుల ఫోన్లలోనే ఎక్కువసార్లు ఫీడయ్యింది. కొత్తల్లో తను వెళ్ళాల్సిన తోవ నుంచి పక్కకు వచ్చేసినట్టు అనిపించేది. ఉన్నచోట మనస్ఫూర్తిగా వేళ్ళూనుకోలేనితనం అతడ్ని రెండుగా విడదీసేది. లోపల్లోపల ఎప్పుడూ ఓ ఇద్దరికి పోట్లాట జరుగుతుండేది. పచ్చదనం చచ్చిన కొమ్మల మీంచి కవిత్వం ఎగిరిపోయింది. ఓ రకంగా ఊపిరి పీల్చుకున్నాడనే చెప్పాలి. వ్యాపారాన్ని వ్యాపారంలా చేయగలిగాడు. కాలం కూడా కలిసొచ్చింది. కుటుంబాన్ని ఓ స్థాయికి తీసుకువచ్చాడు, ఇల్లు కొన్నాడు. అప్పటికి జీవితంలో ఓ నిమ్మళం వచ్చింది. పదిహేనేళ్ళ తర్వాత రామారావు మళ్ళీ సాహితీ మిత్రుల నంబర్లు వెతుక్కున్నాడు. సాహిత్య పేజీల్లో ఈవెంట్స్ కాలమ్ ఫాలో అవుతూ తెలిసినవాళ్ళ పేర్లున్న సభలకి వెళ్ళటం మొదలుపెట్టాడు. మళ్ళీ రాయాలని కూడా ప్రయత్నించాడు. కానీ ఎగిరెళ్ళిన పిట్ట ఎక్కడో తప్పిపోయింది. అప్పుడే రామారావుకి ఒకటనిపించింది: భవిష్యత్తులో తెలుగులో కథని వేలుపట్టుకుని నడిపించే మనుషులకి తీవ్రమైన కొరత ఏర్పడబోతోందని; తెలుగులో ఇప్పుడు రాసేవాళ్ళకంటే, దారీతెన్నూ చూపించాల్సిన వాళ్ళ అవసరం ఎక్కువ ఉందని. అప్పట్నించి రామారావు సాహిత్య విమర్శ వైపు మళ్ళాడు.

అప్పటికి పెద్దాయన ఎనభయ్యేళ్ళ వయసులో కూడా చాలా పని చేస్తున్నాడు. పెద్దాయన్ని సాహిత్య లోకంలో ఎవరూ పేరు పెట్టి పిలవరు. పెద్దాయన అంటే అర్థమైపోతుంది. చిన్నప్పుడు ఇంట్లో పిలిచే పేరుతో ఆయన ‘పెద్దోడు చెప్పిన కథలు’ అని యాభయ్యేళ్ళ క్రితం రాసాడు. తర్వాత వయస్సూ, ప్రసిద్ధి పెరిగేకొద్దీ తెలుగు సాహిత్య ప్రపంచానికి కూడా పెద్దాయనైపోయాడు. కథా సంకలనాలకి సంపాదకత్వం వహించటం, పెట్టుబడులు పుట్టించి పుస్తకాలు వేయించటం, కథల మీద సెమినార్లనీ వర్క్షాపులనీ ముందుండి నడిపించటం… ఇలా ఒకటని కాదు, తెలుగులో కథా ప్రక్రియ కోసం ఎంత పాటుపడాలో అంతా పడుతున్నాడు. ఆయన పాతికేళ్ళ క్రితం కథలు రాయటం మానేసాకా, కథలు ఎలా రాయాలో చెబుతూ రాసిన  ‘కథా దీపిక’ పుస్తకం కొత్త కథకులకన్నా, వాళ్ళని అంచనా కట్టడానికి కొత్త విమర్శకులకి బాగా పనికొచ్చింది. రామారావు కూడా రెండేళ్ళ క్రితం ఆ పుస్తకాన్ని బట్టీపట్టినంత పని చేశాడు. అప్పటికే పిల్లలు సెటిలయ్యారు. భార్య బేంకు ఉద్యోగంలో ప్రమోషన్ సంపాయించి ఇల్లుగడవటానికి సరిపడా సంపాయిస్తోంది. ఇక రామారావు రిటైర్మెంట్కు వచ్చేసినట్టు ఫీలయ్యాడు. చేతి నిండా బోలెడంత సమయం. ఇంట్లో ఒక కేలండర్లో మహా కథకుల జయంతులూ, వర్ధంతుల తారీకులన్నీ పెన్నుతో టిక్ చేసిపెట్టుకున్నాడు. ఎవరి జయంతి, వర్ధంతి దగ్గరపడినా ఒక వ్యాసం రాసి సాహిత్య పేజీలకి పంపేవాడు. కథా సంపుటులు, సంకలనాలు ఏం విడుదలైనా ప్రోత్సహిస్తూ సమీక్షలు రాసేవాడు. కొన్నాళ్ళకి ఎక్కడ చూసినా రామారావే కనపడటం మొదలుపెట్టాడు. అలాగే పెద్దాయన దృష్టిలో కూడా పడ్డాడు. తన గురించి ఏదో మంచి మాట అన్నాడని వేరేవాళ్ల ద్వారా తెలియగానే, ఆయన కథల మీద “కథలుగా ఘనీభవించిన సామాజిక చలనాలు” అని ఒక విశ్లేషణాత్మక వ్యాసం రాసేసాడు. ఖచ్చితంగా పెద్దాయన అలవాటు ప్రకారం ఆయన్నుంచి అభినందిస్తూ ఫోన్ వస్తుందని అనుకున్నాడు. కానీ రాలేదు. ఆ తర్వాత కొన్ని వారాలకే పెద్దాయన స్వయంగా తెలుగులో సాహిత్య విమర్శపై ఒక వ్యాసం రాసాడు. ఆ వ్యాసంలో తెలుగులో విమర్శ చనిపోయిందన్న మాట ఒక అపనింద మాత్రమేనని నిరూపించే ప్రయత్నం చేశాడు. రామారావుకి ఏ వ్యాసంలోనైనా అన్ని అక్షరాల గుంపుల మధ్యా తన పేరును చప్పున గుర్తుపట్టగలిగే ప్రతిభ ఎప్పట్నుంచో ఉంది. తన ప్రస్తావన వచ్చే అవకాశం ఉన్న వ్యాసాన్ని ఒకసారి పై నుంచి కిందకి చూస్తూ, అచ్చులో రెండు “రా” అక్షరాలు దగ్గర దగ్గరగా ఎక్కడ రిపీటైనా పసిగట్టేయగలడు. పెద్దాయన వ్యాసాన్ని కూడా అలాగే వెతుక్కున్నాడు. మొదటిసారి వెతికినపుడు పేరు కనపడలేదు. రెండు మూడు సార్లు వెతికినా దొరకలేదు. ఇక మొత్తం చదవక తప్పింది కాదు. వ్యాసంలో ఎక్కడా రామారావు పేరు లేదు. ఒక చోట మాత్రం, తెలుగులో కొందరు మంచి విమర్శకుల పేర్లు వరుసగా వచ్చిన తర్వాత, “వీరే కాదు, సాహిత్యంలో వైయక్తిక ధోరణుల్ని ఓ కంట కనిపెడుతూ, ప్రతి రచననూ దాని సామాజిక స్థలకాలిక నెలవులో నిలబెట్టే బాధ్యతని గురుతరంగా నిర్వరిస్తున్న కొత్త తరం విమర్శకులు ఇంకెందరో ఉన్నారు” అని ఒక వాక్యం ఉంది. రామారావు ఆ వాక్యాన్ని సంతృప్తిగా రెండు మూడుసార్లు చదువుకున్నాడు. పెద్దాయన ఎంతో ఆత్మీయంగా రహస్యంగా తన భుజం తట్టినట్టు అనిపించింది. ఇవాళ కాకపోతే ఏదో ఒక రోజు పెద్దాయన్నుంచి అచ్చులో ప్రశంస అందుకునే తీరతాననీ, “నా సాహితీ వారసుడు రామారావే” అని ఆయన చేతే చెప్పిస్తాననీ అప్పుడు గట్టిగా అనుకున్నాడు. ఇక ఆ అవకాశం లేదు. రామారావుకి దిగులుగా అనిపించింది.  బస్సు అద్దం అవతల అలుక్కుపోయిన వీధి దీపాలతో ఏదో ఊరు వెనక్కి జారుతోంది. అయినా మించిపోయిందేం లేదు, అనుకున్నాడు రామారావు. ఇపుడు పెద్దాయన మీద తను ఎలాగూ ఒక నివాళి వ్యాసం రాస్తాడు. “కథ ఇక అనాథ” లాంటి శీర్షికతో, ఆ వ్యాసం ఒట్టి నివాళి వ్యాసంలా మాత్రమే మిగిలిపోదు. తెలుగు కథకు పెద్దాయన చేసిన దోహదాన్ని రామారావు ఆ వ్యాసంలో ఏ స్థాయిలో నిరూపిస్తాడంటే, అంత చేసిన పెద్దాయన లేకుండా పోయాకా ఆ లోటు భర్తీ చేసేదెవరూ అన్న ప్రశ్న చదివేవాళ్ళకు కచ్చితంగా వస్తుంది, వెంటనే వాళ్ళకి రామారావు పేరే తట్టి తీరాలి. రామారావుకి ఈ నివాళి వ్యాసం ఆలోచన ఇప్పుడు పెద్దాయన పోయాకా వచ్చింది కాదు; ఆయన బతికున్నప్పుడు కూడా రామారావు మనసు లోతుల్లో అతనికే తెలియకుండా ఈ ఆలోచన దాగున్నది. ఒక్కోసారి ఉన్నట్టుండి మనసులోకి వాక్యాలు కూడా తన్నుకొచ్చేవి. వాటిని ఎక్కడైనా రాసి పెట్టుకుంటే మంచిదని కూడా అనిపించేది. ఉండబట్టలేక ఆ వ్యాసానికి సన్నాహం లాంటి ఒక వ్యాసాన్ని పెద్దాయన ఎనభై రెండో పుట్టిన రోజున ఆయన అభిమానులు సహస్ర చంద్ర దర్శనం వేడుక జరిపినప్పుడు రాసాడు. పెద్దాయన పుస్తకం ‘కథా దీపిక’పై పునఃసమీక్షణం అనే నెపం మీద రాసిన ఆ వ్యాసం “పెద్దాయన పాఠాల్ని పాటిస్తున్నామా?” అన్న పేరు మీద ఒక సాహిత్య పేజీలో అచ్చయింది. అది అచ్చయిన నెలకే ఇపుడు పెద్దాయన చనిపోవటంతో ఆయన్ని ఆఖరుసారి అచ్చులో తలచుకున్నది రామారావే అయ్యాడు. ఇది స్ఫురించగానే రామారావుకి సంతోషం కలిగింది. బస్సు కుదుపుల జోలకి ఆగాగి పట్టిన కునుకుల మధ్య ఒక కల కూడా వచ్చింది– పెద్దాయన్నుంచి ఎప్పుడూ రాని ఫోన్ వచ్చినట్టు. ఆ సమయంలో రామారావు ట్రాఫిక్ మధ్యన బండి మీద వెళ్తున్నాడు. బండి రోడ్డు పక్కకు తీసి ఫోన్ ఎత్తి “సార్, సార్” అంటున్నాడు. పెద్దాయన ఏదో పొగడ్తగా మాట్లాడుతున్నాడు. ట్రాఫిక్ శబ్దాలకి కొన్ని మాటలు రామారావు చెవిని చేరటం లేదు. ఫోన్ను చెవికేసి బాగా నొక్కుకుంటున్నాడు. పైగా ఫుట్⁠పాత్ మీద ఒక బొద్దింక రామారావు చెప్పుల్లో దూరాలని ప్రయత్నిస్తోంది. దాన్నించి తప్పించుకుంటూ కలయదిరుగుతున్నాడు. “సార్, సార్” అంటున్నాడు. ఆ పొగడ్తలకి కలలో వొళ్ళంతా తేలికైపోయింది. పెద్దాయన కాసేపు మాట్లాడటం ఆపి, తర్వాత స్పష్టంగా గట్టిగా ఒకటే మాటన్నాడు, “నిన్ను ఒకసారి చూడాలనుందయ్యా, ఈ వాక్యాలు రాసే మనిషిని” అని. రామారావు “సార్!” అని గట్టిగా అరిచాడు. బస్సు దేన్నో ఓవర్ టేక్ చేస్తూ మోగించిన హార్న్ చెవుల్లో చొరబడి మెలకువొచ్చింది. కాసేపు పల్లానికి వేగంగా జారుతున్న పడవలో ఉన్నట్టనిపించింది. హైదరాబాద్ ఫుట్⁠పాత్ మీంచి ఈ చీకటి బస్సులోకి తేరుకోవటానికి కొన్ని క్షణాలు పట్టింది. జీవితంలో అత్యంత మధురమైన ఘట్టం కొన్ని క్షణాల మునుపే జరిగినట్టు అనిపించింది. దాని తాలూకు జాడలేవీ వాస్తవంలో మిగలకపోయినా మనసు మాత్రం తీయదనంతో నిండిపోయింది.

బస్సు ఎన్నడూ వినని పేర్లతో ఉన్న బస్టాండుల్లో ఆగుతోంది. ఎవరూ ఎక్కటం లేదు దిగటం లేదు. ఊళ్ళన్నీ ముణగదీసుకుని పడుకున్న ఈ చలివేళలో బస్టాండుల్లో మాత్రం టీ స్టాళ్ళల్లోంచీ, టిఫిన్ హోటళ్ళలోంచీ వేడి వేడి పొగలు వస్తున్నాయి. రామారావుకి పెద్దాయన్ను బతికుండగా కలవలేదన్న దిగులు నెమ్మదిగా పోయింది. తన జీవితంలో అసలైన అధ్యాయం ఇప్పుడే మొదలవబోతోందని అనిపించింది. తాను అనామకంగా చచ్చిపోడు. తొంభైల కవిత్వంపై వచ్చిన సిద్ధాంత గ్రంథాల్లోని ఫుట్ నోట్సుల్లో ఉండే కవుల పేర్ల జాబితాలో రెండు కామాల మధ్య మాత్రమే తన పేరు మిగిలిపోదు. తెలుగు కథ తనని గుర్తుంచుకుంటుంది, స్మరించుకుంటుంది, చనిపోయాకా తన పేరు మీద కథా పురస్కారాలు ఇస్తారు, తన జయంతికో వర్ధంతికో ఏదో ఒక మూల నుంచి అప్పుడే రెక్కలు విదుల్చుకుంటున్న విమర్శకుడెవరో తనని కృతజ్ఞతగా స్మరించుకుంటూ, తన విమర్శనా సంప్రదాయాన్ని ఉగ్గడిస్తూ నివాళి వ్యాసం రాస్తాడు. జయంత్యుత్సవాలు కూడా జరగచ్చేమో ఎవరు చెప్పొచ్చారు. కానీ అంతకుముందు చేయాల్సిన పని ఎంతో ఉంది. తన కార్యక్షేత్రాన్ని ఆలస్యంగానైనా ఇప్పుడే గుర్తించాడు. పాత కథలు చదవాలి. కొత్త కథలు కూడా చదవాలి. ప్రాచ్య పాశ్చాత్య విమర్శనా సిద్ధాంతాల్ని అధ్యయనం చేయాలి. వాటిని అన్వయించాలి. కొత్త కథకుల్ని వెలికి తీయాలి. ఫోన్ చేసి అభినందించాలి. ప్రోత్సహిస్తూ వ్యాసాలు రాయాలి. రామారావుకి వొళ్ళు జలదరించింది. తన జీవితపు మొదటి భాగంలాగా ఈ రెండో భాగాన్ని అయిపు తైపూ తెలీకుండా చేజారిపోనీయడు. ముందు వీలు చిక్కగానే పెద్దాయన నివాళి వ్యాసం మీద పని చేయాలి. రామారావు మనసులో వాక్యాల తర్వాత వాక్యాలు వచ్చి పడుతున్నాయి. ఇక మిగిలిన ప్రయాణమంతా మెలకువగానే గడిపాడు.

మరుసటి రోజు పొద్దున్న వైజాగ్ బస్టాండులో దిగినాక కూడా రామారావులో ఉత్సాహం అలాగే ఉంది. తెలిమంచు వెనకాల నుంచి లీలగా కనిపిస్తున్న వైజాగ్ కొండలూ, వాటి అవతల కనపడకపోయినా భావంగా తెలుస్తున్న సముద్రమూ రామారావు మనసుని ఆహ్లాదంగా పరిగెత్తిస్తున్నాయి. అందరూ బస్టాండు పక్కనే ఉన్న లాడ్జిలో దిగి, స్నానాలవీ కానిచ్చి, ఆటో కట్టించుకుని పెద్దాయన ఇంటికి వెళ్ళారు. ఇంటి ముందు ఫ్రీజర్ బాక్సులో ఉంచిన పెద్దాయన శరీరాన్నీ, టెంటు నీడలో మసలుతోన్న మనుషుల ముఖాల్లో గాంభీర్యాన్నీ చూసాకా గానీ రామారావు మనసు వర్తమాన కాలగతిలోకి నెమ్మదించలేదు. చాన్నాళ్ళ తర్వాత కలిసిన మిత్రులు కూడా జబ్బచరిచి కావలించుకోవటాలవీ లేకుండా పొడి నవ్వులతో పలకరించుకున్నారు. రామారావు టీవీ వాళ్ళ కోసం చుట్టూ చూసాడు. వచ్చి వెళిపోయారా, ఇంకా రాలేదా? ఈ ప్రశ్న ఎబ్బెట్టుగా అనిపించకుండా ఎవరినైనా ఎలా అడగాలో ఆలోచించాడు. ఫ్రీజర్ బాక్సును చుట్టి నడుస్తున్న వరుసలో చేరి నిల్చొన్నాడు. వరసకు ఒక పక్కన ఏడిచి ఏడిచి అలిసిపోయిన ముఖాలు కొన్ని కనిపించాయి. ఒకావిడ వారగా స్తంభానికి ఆనుకుని, నిద్రకాచిన కళ్ళతో, పెద్దాయన ముఖం కేసి చూస్తూ కూడా ఎటో చూస్తున్నట్టుంది– ఆవిడ పెద్దాయన భార్య అని ఊహించాడు. పెద్దాయన తొలి కథల్లో ‘మల్లెల అలక’ అన్న కథ గుర్తొచ్చింది. ఆ కథలో భర్త నెలవారీ పద్దు వేసుకుంటూ అందులో మల్లెపూల ఖర్చుని కూడా చేర్చటం చూసి భార్య అలుగుతుంది. అందులో భార్య పాత్ర వర్ణనని ఈ ముసలామె ముఖంలో వెతుక్కున్నాడు రామారావు. ఆమె పక్కన కూతుళ్ళూ, మనవలూ కూర్చున్నారు. పెద్దాయన ముఖం ఫొటోల్లో కనిపించిన దేన్నో పోగొట్టుకుని బోసిగా అనిపించింది. రామారావు ఆయనకు నమస్కరిస్తూ, ‘మీ పరంపర కొనసాగుతుంది’ అని మనసులో పట్టుదలగా మాటిస్తూ, ముందుకు కదిలాడు. హాలు గుమ్మం దగ్గర అతని వెంట వచ్చిన మిత్రులు ఎవరో ఒకతనితో మాట్లాడుతున్నారు. రామారావు ఆ గుంపు దగ్గరకు వెళ్ళాడు. మాటల్ని బట్టి అతను పెద్దాయన అల్లుడని తెలిసింది. బయట ఉన్నవాళ్ళలా ఏడ్చేంత బాధలేక అతిథి మర్యాదల బాధ్యతని తీసుకున్నాడు. లోపలికి రమ్మంటున్నాడు. రామారావు అందరితోనూ కలిసి లోపలికి నడిచాడు. హాల్లో నేలంతా పూల రేకలు రాలి ఉన్నాయి. ముగ్గురు నడివయసు మగాళ్ళు సోఫాలో పక్క పక్కన కూర్చుని కూడా ముందుకు వంగి ఎవరికీ వినపడకుండా మాట్లాడుతున్నారు. పిల్లలు ఆ వాతావరణాన్ని లెక్క చేయకుండా అల్లరిగా పరిగెడుతున్నారు. రామారావూ, అతని మిత్రులూ గడపదాటి గుమ్మం వారన నిలబడ్డారు. అల్లుడు పని మనిషిని వెంటబెట్టుకొని వచ్చి టీలు ఇప్పించాడు. ఎదుట గోడ మీద ఇద్దరు భార్యాభర్తల బస్ట్ సైజ్ బ్లాక్ అండ్ వైట్ ఫొటోని చూపిస్తూ ఒక మిత్రుడు, “పెద్దాయన వయసులో చూడు ఆ మీసకట్టూ అదీ…” అంటున్నాడు. అందరూ ఫొటో వైపు చూసారు. ఫొటోలో ఉన్నావిడ మీదకు దృష్టి మళ్ళింది. “అత్తయ్య చనిపోయాకనే ఆయనకి సగం ప్రాణం పోయిందండీ” అంటున్నాడు అల్లుడు. ఇక రామారావు “మరి బయటున్న ఆవిడెవరు” అని అడిగి అభాసుపాలయ్యే సాహసం చేయలేదు. ఢిల్లీ నుంచి వచ్చిన ఈ అల్లుడికి సాహిత్యం గురించి ఏం తెలీదు. రిటైరయ్యాకా హాబీగా చేసిన పనికి ముసలాయనకి ఇంత పేరొచ్చిందా అని ఆశ్చర్యపడుతున్నట్టు ఉన్నాడు. రామారావు మిత్రుల్లో ఒకరు జర్నలిస్ట్ అని తెలిసి జాతీయ రాజకీయాల గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. రామారావు ఆ మాటల్లోకి వెళ్ళలేదు. ఓరగా తెరిచి ఉన్న ఒక గదిలోంచి పుస్తకాల అల్మరా కనిపిస్తోంది. మెల్లగా ఇల్లు చూస్తున్నట్టు అటు ఇటూ నడిచి, ఆ గది వైపు వెళ్ళాడు.

తలుపు తీసుకుని లోపలికి వెళ్తే పవిత్రమైన గర్భగుడిలోకి అడుగుపెట్టినట్టుంది రామారావుకి. గోడల నిండా అల్మరాల్లో పుస్తకాలు సర్ది ఉన్నాయి. కిటికీ వెలుగు పడే మూల పెద్ద టేకు టేబిల్ ఉంది. మాయలో పడినవాడిలా అటువైపు నడిచాడు. బల్ల మీద పుస్తకాలు ఒద్దికగా పేర్చి ఉన్నాయి. పెన్నుల స్టాండు చుట్టూ అట్టా, కాయితాలూ, ఇంకా ఏదో స్టేషనరీ చక్కగా సర్ది ఉంది. కుర్చీ వీపుకు వేలాడుతూ ఊతకర్ర, టేబిల్ మీద కళ్ళజోడు కనిపించాయి. ఇందాక పెద్దాయన ముఖం బోసిగా ఎందుకు అనిపించిందో ఇప్పుడర్థమైంది. పేర్చిన పుస్తకాల పైనున్న పుస్తకం డైరీలాగా అనిపించింది. రామారావుకి ఆత్రం ఆగలేదు. ఒకసారి తలుపు వైపు చూసాడు. బయట ఇంకా ఏవో మాటలు వినపడుతున్నాయి. చేయి చాపి డైరీ అందుకున్నాడు. తిప్పి చూస్తే అందులో ఏవో కొన్ని పద్దులున్నాయంతే. మధ్యలో ఒక తెల్లకాయితం మడతపెట్టి కనిపించింది. మడత విప్పి చూసాడు. అది ఇంకా పోస్టు చేయని ఉత్తరం. ఒక రచయిత్రి పేరుకు “తల్లీ” అని చేర్చి సంబోధిస్తూ ఉంది. “వసంతాన్ని కోయిలలు ఆహ్వానించినట్టు, శిశిరాన్ని మా ముసలాళ్ల కీళ్ళు ఆహ్వానిస్తాయి సలుపులతో” అన్న వాక్యంతో ఉత్తరం మొదలయ్యింది. రామారావు నవ్వుకుని, ఉత్తరం ఓ సారి పైనుంచి కిందకి చూస్తున్నాడు. చప్పున తన పేరు కనిపించింది. నమ్మకం కలగక మరోసారి చూసుకున్నాడు. ఇంటి పేరుతో సహా తన పేరేనని ఖాయం కాగానే వొళ్ళు జలదరించింది. మళ్ళీ ఒకసారి తలుపు వైపు చూసి, కాస్త జలదరింపు తగ్గేలా ఊపిరి గట్టిగా వదిలి, ఆ వాక్యం మొదట్నుంచీ చదివాడు: “…రామారావు రాసిన ఆ పనికిమాలిన వ్యాసం చదివి నేను సంతోషించానా అని అడుగుతున్నావా? సంతోషం మాట పక్కన పెట్టు. ఎందుకీ వెధవ నేను చనిపోకుండానే నాకు పిండాలు పెడుతున్నాడు అనిపించింది. పైగా పుట్టిన రోజు నాడు! మా తరం వాళ్ళందరం ఏదైనా అచ్చుకి ఇచ్చే ముందు పది విషయాలు పది రకాలుగా ఆలోచించేవాళ్ళం. ఇప్పటివాళ్ళకి అదేం లేకుండా పోయింది. వాడో దొంగ సరుకు. తెలుగు సాహిత్యానికి ఈ పరాన్నజీవుల బాధ ఎప్పుడు తప్పుతుందో. కానీ నాకున్న సమయం తక్కువరా, ఇలాంటి వాటి గురించి బాధపడేందుకు.”

రామారావుకి మోకాళ్ళలో బలం తరుక్కుపోయినట్టు అనిపించింది. మళ్ళీ చదవబోతే అక్షరాలను మసకబారుస్తూ కన్నీళ్ళు ఉబికాయి. ఇప్పటిదాకా లేని ప్రయాణ అలసట బరువుగా తల మీదకు దిగినట్టయింది. తలుపు దగ్గరికి నడిచి, అది గాలికి కదిలివుంటుందని బయటివాళ్ళు అనుకునేంత నెమ్మదిగా మూసి, బోల్టు వేశాడు. మళ్ళీ టేబిల్ దగ్గరకు వచ్చాడు. భవిష్యత్తు మీద కల్పించుకున్న ఆశ అంతా ఒక్కసారిగా మాయమైంది. జీవితం మీద కాసేపటి క్రితం వరకూ ఉన్న రుచి పోయింది. కుర్చీలో కూర్చుని టేబిల్ మీద ఆ ఉత్తరం పెట్టి మళ్ళీ చదివాడు. ఉత్తరంలో మిగిలిన భాగం అంతా వేరే విషయాలున్నాయి. మళ్ళీ మళ్ళీ తన మీద రాసిన వాక్యాలే చదువుకున్నాడు. “వాడో దొంగ సరుకు… వాడో దొంగ సరుకు…”! రామారావుకు పూర్తిగా ఓడిపోయి మట్టికొట్టుకుపోవటం ఎలా ఉంటుందో అలవాటు తప్పిపోయి చాలా ఏళ్ళయింది. ఆ భావం పగతీర్చుకున్నట్టు మళ్ళీ మీద పడింది. కిటికీ లోంచి బయటకు చూస్తూండిపోయాడు. కాసేపటికి కళ్ళు తుడుచుకుంటుంటే నిన్న రాత్రి మిత్రుడన్న మాటలు గుర్తొచ్చాయి: పెద్దాయన కథల్నే కాదు; ఆయన ఉత్తరాలనూ, డైరీలనూ కూడా పబ్లిష్ చేయాలన్న మాటలు. ఒకవేళ ఈ ఉత్తరం పబ్లిష్ చేసినా తన ప్రస్తావన ఎలాగూ తీసేస్తారు. ఐతేమాత్రం నోటి మాటగా ఎంతో కొంతమందికి తెలిసిపోదూ? మంచి తెలియటానికి టైం పడుతుంది కానీ, చెడు వరదలా పాకిపోతుంది. ఒకవేళ ఉత్తరం తనంటే గిట్టని వాళ్ళ చేతుల్లో పడి యథాతథంగా పబ్లిష్ అయిపోతే? “పెద్దాయన ముసలాడైపోయాడు కదా, చివరిదశలో విచక్షణ కోల్పోయి ఏదో రాసుంటాడులే” అనెవరైనా అనుకుంటారా? లేదు, ఎవరూ అలా అనుకోరు. ఇది తన జీవితం మీద, తను సాధించాలనుకుంటున్న భవిష్యత్తు మీద విషపు నీడలా పడుతుంది. పైగా తను ఎవరి మాటల్ని భగవాన్ ఉవాచల్లా ఉదహరిస్తూ ఎన్నో వ్యాసాలు రాసాడో, ఎవరిని ఆకాశానికెత్తుతూ కనీసం రెండు పూర్తి వ్యాసాలు రాసుంటాడో ఆయనే తనని “దొంగ సరుకు” అని తేల్చేసినపుడు ఇక తన ఏ మాటకైనా ఏం విలువ ఉంటుంది. ప్రతీ అణా కానీ డొక్కు సున్నాగాడూ ఆ మాటని పట్టుకుని తన మీదకు ఎక్కుపెడతాడు. “ముసలినాకొడుకు!” రామారావు తెలిసీ తెలియనట్టు ఉత్తరాన్ని కసిగా నలిపేస్తూ గొణుక్కున్నాడు. టేబిల్ మీద మడతపెట్టిన కళ్ళజోడు వైపు చూసాడు. ఆ కళ్ళద్దాల వెనక పెద్దాయన కళ్ళు కనిపించి మాయమైనట్టు అనిపించింది. రామారావులో నాగరిక సభ్యత కొంతసేపు ఎదురు తిరిగింది. ఇలా పరాయివాళ్ళ ఉత్తరాన్ని, అదీ ఒక చనిపోయిన మనిషి ఆఖరిసారి రాసుకున్న ఉత్తరాన్ని, పైగా చేరాల్సిన వాళ్ళకి చేరితే వాళ్ళు ఎంతో విలువగా దాచుకునే వాక్యాలున్న ఉత్తరాన్ని- చింపేయటం సభ్యతేనా అనుకున్నాడు. మళ్ళీ ఉండ విప్పి టేబిల్ మీద సాపు చేశాడు. మళ్ళీ చూపు తన మీద రాసిన వాక్యాలపైకే పోయింది. ఈ ఉత్తరం చింపితే లోపల్లోపల తప్పుచేసానని తొలిచే బాధ కన్నా, ఇది బయటపడితే తనకు బయటి నుంచి కలిగే బాధే ఎక్కువ అనిపించింది. ఉత్తరాన్ని వీలైనన్ని చిన్నచిన్న ముక్కలుగా చింపి జేబులో కుక్కుకున్నాడు.

కాసేపు అలాగే కూర్చున్నాడు. ఇదేగాక, ఇంకెవరికైనా ఉత్తరాల్లో తన గురించి చెడుగా రాసి ఉంటాడా? ఇంకెవరి ముందైనా తన గురించి చెడ్డగా మాట్లాడి వుంటాడా? అవి ఎప్పుడైనా బయటపడితే పెద్దాయనపై తాను ఇన్నాళ్ళు వెల్లడించుకున్న ప్రేమాభిమానాలు ఎంత ఎడ్డి యవ్వారంగా కనపడతాయి! “ఆయన పారించిన అక్షర ప్రవాహాలు తెలుగు కథా మాగాణాన్ని ఎల్లకాలమూ పచ్చగా ఉంచుతాయి” లాంటి వాక్యాలతో పెద్దాయన పుట్టిన రోజుకి తను రాసిన వ్యాసం గుర్తుకుతెచ్చుకుంటే రామారావుకి తన చెవి తనే మెలేసుకుని మొట్టికాయ వేసుకోవాలనిపించింది. ఎంత పిచ్చిగా, అమాయకంగా, భోళాగా ప్రేమనీ అభిమానాన్నీ వ్యక్తం చేసుకున్నాడు. మనుషులిలా ఉంటారని తనకేం తెలుసు. ప్రేమకి ద్వేషం బదులొస్తే ఏం చేయగలం. రేపు రాయబోయే నివాళి వ్యాసం ఇంత అమాయకంగా రాయకూడదు. నివాళి వ్యాసమైనంత మాత్రాన ఊరికే డప్పు కొడుతూ రాయాలని ఏముంది. పెద్దాయన పేరుకి తానో మార్క్సిస్టు రచయితనని చెప్పుకునేవాడే కానీ, ఆయనకి మార్క్సిజం పైన పెద్ద అవగాహన లేదు. కథల్లో కూడా అందరూ బాగుండాలనే, అణచివేతల్ని ఎదిరించాలనే ఉట్టి అభ్యుదయానికే ఆయన మార్క్సిస్టు పదజాలంతో ముసుగు తొడిగేవాడు. ఒక ఇంటర్వ్యూలో వాస్తు కలిసిరాక ఇల్లు మారానని నోరు జారి మార్క్సిస్టు మేధావుల చేత మెత్తగా చీవాట్లు తిన్నాడు. నివాళి వ్యాసమైనంత మాత్రాన ఈ వైరుధ్యాలను ప్రస్తావించకూడదని ఏముంది. ఇలాంటివి రాస్తే కొంతమందికి కోపం రావొచ్చు. కానీ ఇంకెన్నాళ్ళు నంగి నంగి మాటలు! నిజాలు దాయటాలు! రామారావుకి నివాళి వ్యాసంపై ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది. మళ్ళీ ఇదివరకటి ఉత్తేజం మనసును ఆవహించింది. జేబులో కాగితం పీలికల స్పర్శను సుఖంగా అనుభవిస్తూ, గది బయటకు వచ్చి తలుపు వేసాడు.


Published in : vaakili.com, June 2017 issue.
Art work by Chary PS

June 1, 2017

ఆఖరి రూపకం

అతను చనిపోయాడని పేపర్లో జిల్లా పేజీలో చదివాను. ప్రమాదాలూ, నేరాల వార్తల మధ్య వచ్చిన ఆ వార్తలో అతనో రచయిత అని కూడా ఎక్కడా లేదు. “రోడ్డు ప్రమాదంలో యువకుని మృతి” అన్న హెడింగ్ కింద ఇచ్చిన వివరాల్లో అతని అరుదైన పేరూ, వయసూ, ఉద్యోగమూ ఉన్నాయంతే. మరుసటి వారం సాహిత్య పేజీల్లో స్నేహితుడైన ఒక రచయితా, ఒక విమర్శకుడూ రాసిన నివాళి వ్యాసాలు తప్పితే ఇంకే చప్పుడూ లేదు. అతను రాసింది కూడా తక్కువే మరి. ఐదేళ్ళ క్రితం పన్నెండు కథలతో మొదటి పుస్తకం వచ్చింది. తర్వాత పత్రికల్లో తొలి నవలా, ఐదారు కథలూ అచ్చయ్యాయి. పుస్తకాల షాపులో పేరు చిత్రంగా అనిపించి అతని కథల పుస్తకం కొని చదివాను (“ఇరుక్కున్న రాతలు”). ఆ తర్వాత అతనేం రాసినా వెతికి చదివాను.

కానీ ఇక్కడ చెప్పదల్చుకున్నది అతని కథల గురించి కాదు. పేపరు వార్తలో ఆ ఏక్సిడెంట్ ఎక్కడ జరిగిందో రాసి, చిన్న బ్లాక్ అండ్ వైట్ ఫొటో కూడా వేసారు. రోడ్డు డివైడర్ మీద ఒరిగిపోయిన స్కూటరూ, అసహజమైన భంగిమలో పడి ఉన్న అతని శరీరమూ ఫొటోలో ఉన్నాయి. వెనక కనిపిస్తున్న బడ్డీ కొట్టును బట్టీ, ఆ పక్కన గోడ మీద అంటించిన పోస్టర్లని బట్టీ ఆ చోటు ఎక్కడో నాకు అర్థమైంది. అది మా ఆఫీసుకు దగ్గర్లోనే.

పేపర్లో అతని ఏక్సిడెంట్ వార్త చదివిన రోజు మధ్యాహ్నం ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్తూ కాసేపు బండి అక్కడ ఆపాను. బడ్డీ కొట్టు దగ్గరకెళ్ళి నిల్చున్నాను. ఇక్కడ్నించి చూస్తే డివైడర్ మీద పెచ్చులేచిన గుంట కొత్తగా కనిపిస్తోంది. పేపర్లో రాసిందాని ప్రకారం అతను వెంటనే చనిపోలేదు, కాసేపు కొన ప్రాణాలతో ఉన్నాడు. అంబులెన్స్ రాకముందే చనిపోయాడు. బహుశా చుట్టూ చేరినవాళ్ళు అతని శరీరాన్ని– చెదిరి సున్నితంగా మారి, రక్తమంటిన శరీరాన్ని– ఏం చేయాలో, ఎక్కడకు కదపాలో ఇంకా నిర్ణయించుకోకుండానే చనిపోయి వుంటాడు. దాదాపు ఇదే టైముకి. ఇప్పుడు ఈ రోడ్డు మీద పెద్ద ట్రాఫిక్ ఉండదు, జనం మసిలేదీ తక్కువే. అతని చుట్టూ చేరినవాళ్ళలో ఈ బడ్డీ కొట్టతనూ, ఈ కొట్టు కస్టమర్లూ తప్పితే ఇంకెవరూ ఉండుండరు. కొట్టు దగ్గర కూల్ డ్రింక్ తాగుతున్న ఈ మనిషి సీసా అలాగే వదిలేసి పరిగెత్తేవాడా, లేక జిహ్వ చాపల్యం కొద్దీ జరిగింది చూసాకా కూడా మిగిలిన రెండు గుక్కలూ తాగేసి పరిగెత్తేవాడా. టిప్పరూ, స్కూటరూ గుద్దుకున్న శబ్దానికి ఆ చెత్తకుండీ కెలుకుతున్న వీధికుక్క తోకను కాళ్ళ మధ్య దోపుకుని పారిపోయేది. కరెంటు తీగల మీది పావురాలు ఎగిరిపోయేవి. ఎన్నింటినో చూసి కవిత్వం చేసిన అతని కళ్ళు ఆఖరిసారి చూసే దృశ్యం ఇదని రాసిపెట్టి ఉంది. చావు లాక్కొని పోయే ఆఖరి క్షణాల్లో మొత్తం జీవితం అంతా బొమ్మలాటలా కళ్ళ ముందు మెదులుతుందని అంటారు. ఆ మాట నేను నమ్మను. గతాన్ని నెమరు వేసుకోవటం అన్నది తీరుబడి సమయాల్లో చేసే పని. చావంత పెద్ద ప్రయాణం ముందు పెట్టుకుని ఎవరూ ఆ పని చేయరు. అదే స్థితిలో నేనుంటే బహుశా నా వెనక మిగిలిపోయే భార్యాబిడ్డల పరిస్థితి తల్చుకుంటాను, వాళ్ళు బావుండాలని దేవుడ్ని ప్రార్థిస్తాను. అతను మాత్రం ఖచ్చితంగా ప్రార్థించి ఉండడు. అతనికి పెళ్ళాం పిల్లలు లేకపోవటం ఒక్కటే కాదు దానికి కారణం. తన జీవితం ఆధారంగా రాసుకున్నాడనిపించిన మొదటి నవలలో (“తప్పిపోయిన దారులు”) అతను దేవుడి మీద నమ్మకం ఎలా పోయిందో వివరంగా రాసుకున్నాడు. అతనికి పదిహేను పదహారేళ్ళొచ్చే సరికే అబ్బిన నాస్తికత్వానికి సైన్సూ హేతువూ కారణాలు కాదు. ఆ వయస్సులో అతని బుద్ధి ఉన్నట్టుండి హద్దుల్ని ఒప్పుకోవటం మానేసింది. పటాల్లో దేవతల బొమ్మల గురించి పాడు ఆలోచనలు చేయటం, మంత్రాల మధ్యలో బూతులు చొప్పించటం మొదలుపెట్టింది. ఈ ఆలోచనల తిరుగుబాటు అప్పటిదాకా పెద్దల ఒరవడిని అమాయకంగా దిద్దుతూ వచ్చిన అతని మనస్సుని యాతన పెట్టింది. వాటి నుంచి బయటపడటానికి హేతువు కాకతాళీయంగా అందించిన నాస్తికత్వాన్ని ఒక ఆసరాగా అందిపుచ్చుకొన్నాడంతే. ఈ ఆపద్ధర్మ నాస్తికత్వం సహజంగానే ఎక్కువ కాలం మిగల్లేదు. అలాగని అతని మనసు తిరిగి భక్తి వైపుకీ మరల లేదు (“సొంతిల్లు కూలిపోయింది” అని రాసుకున్నాడు). చివరికి ఏదో మానవాతీతాన్ని నమ్ముతూనే, దాన్ని రాళ్ళ చుట్టూ జరిగే తంతుతో పోల్చుకోలేని స్థితికి వచ్చి ఆగాడు. కానీ మనసులో తిరిగి వెళ్ళలేని పాత భక్తి పట్ల ఒకలాంటి ఎడబాటు మాత్రం మిగిలిపోయింది. కాలేజీలో తనతో పాటు నాస్తికత్వాన్ని జెండాలాగా తిప్పుకు మోసిన ఒక స్నేహితుడు జీవితంలో తర్వాత ఏవో ఒడిదుడుకులు రాగానే చప్పున ఆధ్యాత్మికతకు లోబడిపోయాడనీ, ఇపుడు ప్రవచనాలకు కూడా హాజరవుతాడనీ తెలిసినపుడు, అతను ఒక స్నేహితుడ్ని మౌఢ్యానికి కోల్పోయానే అని బాధపడుతూనే, తనకు పూర్తిగా మూసుకుపోయిన ఆధ్యాత్మికత అనే తలుపుల్లోంచి లోపలికి పిలుపందుకున్న స్నేహితుడ్ని చూసి ఈర్ష్య కూడా పడతాడు. అలాంటి మనిషి ఆఖరి క్షణాల్ని ప్రార్థన కోసం ఖర్చుపెట్టి ఉండడు. నమ్మేందుకు ఒక రాయిని పోగొట్టుకుని, తప్పిపోయిన దారుల్లో అనాథలా దేవులాడి, ఎప్పటికో ఆ రాయి స్థానంలో సృష్టి సకలాన్నీ తెచ్చి నిలుపుకున్నాడని అతను తన నవలలోని హీరో గురించి రాసుకున్నాడు (అతనూ రచయితే): “అతని మనసులో పెద్ద మాటలూ, పెద్ద అభిప్రాయాలూ చెరిగిపోయాయి. జీవితం తడుముకుని తల మోదుకోవాల్సిన మొండి శిల కాదనీ, ఏరుకునేందుకు ఒడ్డున గులకరాళ్ళను విడిచిపెడుతూ పారే ఏటి ప్రవాహమనీ అనిపించింది. మంచనీ చెడనీ, అందమనీ వికారమనీ, సంతోషమనీ విచారమనీ ఇలా భాషతో వేరుచేయటం పోయింది. ప్రకృతి వైనాలూ, కాలం లోంచి సృష్టి నడక, మనుషుల స్వభావాలూ చర్యలూ బంధాలూ నిర్మాణాలూ... వీటి పైన అభిప్రాయపడటం కాదు, ఇష్టపడటమో అసహ్యించుకోవటమో కాదు, ఇవన్నీ ప్రార్థనలో నమ్మకం బరువుతో కంపించే ఉచ్చారణల్లా మారాయి. ఇది అతను పాటించే ఒక మతమైంది” అని ఉంటాయి ఆ నవల్లో వాక్యాలు. అందుకనే చావు ఎలాగూ ఖాయమని తెలిసిన ఆ క్షణాల్లో అతను పెద్ద పెద్ద విషయాల గురించి ఆలోచించి ఉండడు. గుద్ది వెళిపోతున్న టిప్పర్ వెనక రాసి ఉన్న మాటల్నీ, తన వైపు పరిగెడుతూ వస్తున్న పాదాల్నీ, రోడ్డు మీద కొమ్మల కదిలే నీడల్నీ, ఎగురుతున్న పావురాల్నీ, ఆ పైన మబ్బుల్నీ మాత్రమే మనసులోకి తీసుకుని ఉంటాడు. బహుశా జీవం ఆర్చుకుపోతున్న అతని మెదడు కణజాలంలో ఏదో పదం, ఏదో వాక్యం, అతనికే చెల్లిన ఏదో రూపకం తళుక్కుమనివున్నా ఆశ్చర్యం లేదు. అతని చావు నన్నిలా కదిలించటానికి కారణం కూడా ఆ రూపకాలే. నాకు ఎంతో దగ్గరగా అనిపించిన ఆ వాక్యాల్ని నిర్మించగలిగే చేవ వున్న ఆ మనసు అర్ధాంతరంగా ఎక్కడా లేకుండా మాయమైపోయిందే అని. అతని మీద వచ్చిన రెండు నివాళి వ్యాసాల్లో కూడా “సమాజ శ్రేయస్సుని కాంక్షించిన అతని కలం ఆగిపోవటం పెద్ద లోటు” లాంటివే రాసారు. అతడ్నించి ఇక అందబోని రూపకాల గురించీ, అతనికే చెందిన చూపు గురించీ ఎవరూ బాధ పడలేదు. వాక్యం వాక్యం ఆగి చదువుకున్నవాడిగా నాకు ఆ చూపు విలువ తెలుసు. అతనికీ తెలిసే ఉంటుంది. తను మాత్రమే చెప్పగలిగే కథలేవో చెప్పకుండానే వెళ్ళిపోతున్నానని.

ఎంత ఒంటరిగా అనిపించి ఉంటుంది! ఇళ్ళల్లో, ఆసుపత్రుల్లో తెలిసినవాళ్ళు చుట్టూ ఉండగా చనిపోవటం వేరు, ఇలా రోడ్డు మీద ఒంటరిగా చనిపోవటం వేరు. కానీ ఇంకోలా ఆలోచిస్తే, చనిపోవటం అంటేనే ఆ చనిపోయే ఒక్కడూ ఒంటరిగా చేయాల్సిన పని. ఎలాగూ ఎవరూ వచ్చి సాయం చేయలేనప్పుడు, ఆ క్షణాన పక్కన ఉన్నవాళ్ళు తెలిసినవాళ్ళయితే ఏంటి, తెలియనివాళ్లైతే ఏంటి. తెలిసినా తెలియకపోయినా, ఆ ఆఖరి ప్రయాణంలో చెంత నుండి సాగనంపే ఆఖరి మనుషులు వాళ్ళే కాబట్టి, వాళ్ళ మీద ఎంతో కొంత ఆత్మీయత కలుగుతుందేమో. ఆ క్షణాన అదే కుటుంబం అనిపిస్తుందేమో. ఏం చేయలేక అతని చావుని ఎదురుచూస్తూ చుట్టూ నిలబడిన వాళ్ళని అతను అలాగే ఆత్మీయంగా అనుకుని ఉంటాడా…. ఒకవేళ పారిపోయిన టిప్పర్ డ్రైవరే అక్కడ వచ్చి నిలబడినా….

బడ్డీ కొట్టు దగ్గర ఒక టీ పుచ్చుకొని, సిగరెట్ తాగి, బండి స్టార్ట్ చేశాను. రోడ్డు మీద రాసుకుంటూ పోయే ట్రాఫిక్ మధ్య వెళ్తున్నప్పుడు, ఒకర్నించి ఒకరికి పొంచివుండే ప్రమాదాలకు వెంట్రుకవాసిలో మాత్రమే దూరంగా తప్పుకుపోతున్నప్పుడు, ఒకసారి చుట్టూ తెప్పరిల్లి చూసుకున్నాను: నన్ను దాటుకొని బైక్ మీద పోయిన కుర్రాడూ, నా వెనక హార్న్ కొడుతున్న ఆర్టీసీ బస్సు డ్రైవరూ, వారగా ఫుట్పాత్ మీద చెరుకు రసం అమ్మే ముసలాయనా, ఈ పక్క కార్లో కనిపిస్తున్న తండ్రీ కూతుళ్ళూ… ఈ రోడ్డు మీద వెళ్తున్నంత సేపూ ఇదో క్షణక్షణం సభ్యుల్ని మార్చుకునే తాత్కాలిక కుటుంబం కదా అనీ, వీళ్ళలో ఎవరైనా సరే నాకు అత్యంత ఆత్మీయులయ్యే అవకాశం ఉంది కదా అనీ….

Published in : vaakili.com, June 2017 issue. 

May 1, 2017

నీలా టీచరూ ఇంకో పెద్దకళ్ళ అమ్మాయీ


నా చిన్నతనం ఆలమూరులో గడిచింది. నీలా టీచరు నాకు నాలుగో తరగతిలో టీచరు (ఆమెని ఉత్తి ‘నీల’గా ఎపుడూ చూడలేదు. ‘టీచర్’ అన్నది కూడా ఆమె పేరులో భాగమైపోయింది). ఆమెను చూడగానే మొదట ఎవరికైనా తట్టేది ఆమె అందమే. నాకు ఆ ఏడెనిమిదేళ్ళ వయస్సులో కూడా ఆమె చాలా అందగత్తె అని తెలుస్తూండేది; లేక ఆమె రూపం మనసులో ముద్రించుకుపోయి, తర్వాత అందచందాల విచక్షణ ఎపుడో వచ్చాకా వెనక్కి గతంలోకి చూసి ఆలోచించినపుడు, ఆమెది అరుదైన అందమని తెలిసిందో మరి. ఖచ్చితంగా చెప్పలేను. ఒకవేళ అప్పుడే ఆమె అందగత్తె అని తెలిసినా, అప్పటికే నేను ఎంత ముదురైనా, అందమైన ఆడాళ్ళ పట్ల మగాళ్ళలో ఉండే స్పందన ఏదీ ఉండే అవకాశమైతే లేదు. ఈరోజు కాపోతే రేపైనా “టీచర్, పాస్‌కి టీచర్” అని ఏ మనిషి ముందు చిటికెన వేలు నిలబెట్టాక తప్పదో ఆవిడ అందగత్తె అయితే మాత్రం ఏం ప్రయోజనం. ఇవన్నీ కాదు కానీ, ఇంత అందంగా ఉన్న మనిషి మాకు రోజూ కనపడి పాఠాలు చెబుతోందీ, కోపం వస్తే తిడుతుందీ, చేయి చాపమని బెత్తంతో దెబ్బ వేసేంత దగ్గరగా మసులుతుందీ అన్న గర్వం మాత్రమే ఉండేదేమో. అంటే, మాకు టీచరు కావటం అనే కారణం వల్ల తప్ప వేరే ఏ రకంగానూ బడి బయట ఉండే ప్రపంచంలో అలాంటి మనిషితో మసలుకునే అవకాశం లేదని ఆ వయసులో కూడా ఏ మూలో తెలియటం వల్ల కలిగిన అబ్బరం. ఇది మా మగపిల్లలకే కాదు, మా క్లాసు ఆడపిల్లలకూ ఉండేది అనుకుంటాను.

ఆమెది రాజసపు అందం. అప్పటికి ముప్ఫై-ముప్ఫై ఐదేళ్ళు ఉంటాయేమో. గోధుమ రంగు నిగారింపుతో సాయంత్రమయ్యేకొద్దీ కాస్త జిడ్డు తేలి వెలుగులీనే చర్మం. ఆ ఉంగరాల జుట్టుని పొద్దున్న ఎలాగో జడలోకి బిగించినా, సాయంత్రమయ్యేసరికి తల చుట్టూ పల్చని వెంట్రుకల ఆవరణగా రేగిపోయేది. ఆమె అంత అందగత్తె కాకపోయుంటే దాన్ని చింపిరి జుట్టు అనాల్సి వచ్చేది. ఆమె రూపంలో చప్పున కొట్టొచ్చినట్టు కనిపించేది ముక్కు. మాలో చాలామంది పిల్లలు పెద్దయ్యాకా కూడా అలాంటి ముక్కులు ఎక్కడ కనిపించినా వాటికి ‘నీలా టీచరు ముక్కు’ అనే పేరు పెట్టుకుని ఉంటారేమో. అది బాగా కలిగిన కుటుంబాల్లో, పెద్ద కులాల్లో, మంచి రూపసులైన వారు దట్టించి ఉన్న వంశవృక్షాల్లో మాత్రమే కనిపించే ముక్కు. ఎదుట నుంచి కన్నా పక్క నుంచి చూస్తే దాని అందం తెలుస్తుంది. ఆ ముక్కుకి పైనున్న కళ్ళల్లోనూ, కిందున్న మూతిలోనూ, చుట్టూ చెంపల్లోనూ ఏ ప్రత్యేకతా లేదో, లేక ఆ ముక్కు అందం ముందు అవన్నీ దిగదుడుపైపోయి వాటి వైనం జ్ఞాపకంలో మిగల్లేదో. అందానికి దాహపడటం ఇంకా తెలియని నా చిన్నప్పటి కళ్ళు చుట్టూ ఉన్న అందరి ముక్కుల కన్నా వేరేగా ఉందన్న కారణంతో మాత్రమే ఆ ముక్కుని జ్ఞాపకంలో ఉంచుకున్నదని అనుకుంటాను. ఆమె లావనీ, సన్నమనీ చెప్పలేం. వెడల్పాటి అస్థిపంజరం మీద నిండుగా అమరిన దేహం. ఎప్పుడూ నేత చీరలే కట్టుకునేదని గుర్తు. చూపులు మరీ ముసురుకోకుండా ఉంటం కోసం అవి కట్టుకునేదేమో.

నీలా టీచరుది రాజుల కులం అని అనుకునేవాడ్ని. నాకెవరైనా అలాగని చెప్పారో, లేక ఆమె రూపాన్ని కథల్లో కనిపించే క్షత్రియ వంశ రాణుల రాజసంతో పోల్చుకుని అలా అనుకున్నానో. ఆమె భర్త ఊళ్ళో ఒక పెద్ద మనిషి. ఆయన పేరు పెద్దబ్బుగారనో, బాబ్జీ గారనో, రాపండు గారనో… ఇలా అసలైన పేరుతో సంబంధం లేకుండా, అసలైన పేరు పెట్టి పిలవటం గౌరవం కాదని ఊళ్ళోవాళ్ళు ఆపాదించే పేర్ల లాంటి పేరు. వాళ్ళ ఇల్లు రథం వీధిలో ఉండేది. విశాలంగా, రెండంతస్తుల్లో.

అసలు నీలా టీచరుకి మేం చదివే ప్రభుత్వ ఎలిమెంట్రీ స్కూల్లో ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. బహుశా ఎంతో నిండైన వ్యక్తిత్వం గల ఆ మనిషి, ఇంటి గేటు దాటి బయటకి వచ్చే అవకాశమే లేని ఆ ఊళ్ళో, వేరే ఏ వ్యాపకమూ లేక ఆ స్కూల్లో పాఠాలు చెప్పటానికి చేరిందేమో. ఆమె వంట చేసి,  బట్టలు ఉతికి, బాత్రూం కడిగి, ఇంక ఆ పరిధికి అతీతంగా ఏ ఆలోచనా లేని మనుషుల్లాంటి మనిషి కాదని ఒక్కసారి చూస్తే చాలు తెలిసిపోతుంది. డబ్బు బాగా ఉండటం వల్ల అలాంటి పనులన్నీ చేసిపెట్టేందుకు పనిమనుషులు ఎలాగా ఉండి ఉంటారు. అదని కాదు. ఎందుకో తర్వాతి రోజుల్లో ఆమెను గుర్తుకు తెచ్చుకుంటే- లౌకికాల్ని మించిన విషయాలకీ, గుంభనంగా దాచుకునే ప్రేమలకీ, లోతుల్లో తొలిచే విషాదాలకీ, భౌతికం కాని అసంతృప్తులకీ, స్వార్థాన్ని దాటిన నునులేత ఆదర్శాలకీ చెందిన మనిషి అని అనిపించేది.

ఒకట్రెండుసార్లు ఆమె ఇంట్లోకి వెళ్ళే అవకాశం నాకు నా చిన్న తమ్ముడి వల్ల వచ్చింది. వాడికి అప్పటికి ఇంకా స్కూల్లో చేరే వయస్సు రాకపోయినా ఊరకే మాతో పాటూ వస్తూండేవాడు. చిన్నప్పుడు వాడు చూట్టానికి ముద్దుగా, తెలివితేటల్లో వయసుకు మించిన ఆరిందాతనంతో ఉండేవాడు. అంటే ఈ కారణాలకే నీలా టీచరు మా వాడ్ని ముద్దు చేసేదని కాదు. ఆ మాత్రం ఆరిందాతనం ఆ పల్లెటూళ్ళో మా చిన్నబడి పిల్లలకు చాలామందికి ఉండేదేమో. కానీ మేం ఊళ్ళో రైతుల పిల్లలమో, పేటలో పిల్లలమో కాదు. ఉద్యోగస్థుల పిల్లలం. మా అమ్మ రెవెన్యూ ఆఫీసులో జూనియరసిస్టెంటుగా పని చేసేది. నాన్న అనే మనిషి ఎపుడో ఏడాదికొకసారి కన్పిస్తూ, చుట్టరికమేంటో అర్థంకాని దూరపు చుట్టంలాగా మాత్రమే మా జీవితాల్లో ఉండేవాడు. అమ్మ అతడ్ని వదుల్చుకునే ప్రయత్నంలో ఉన్నదని తర్వాత్తర్వాత తెలిసింది. బహుశా నీలా టీచరు ఆ పల్లెటూళ్ళో తనలాగా ఉద్యోగం చేసే ఒకావిడ పిల్లలం కాబట్టి మమ్మల్ని ప్రత్యేకంగా చూసి ఇంటికి రానిచ్చిందేమో (కానీ మేమేం ఉద్యోగస్థుల పిల్లల్లా పెరగలేదు. ముఖ్యంగా నేను. అప్పటికే నాకు చాలా బూతులు వచ్చు).

నేను మెట్లు ఎక్కి రెండో అంతస్తులోకి వెళ్ళడం జరిగిన తొలి సందర్భాల్లో అదొకటి. అది కొన్ని తరాల్ని దాటుకుని నిలబడిన ఇల్లని కట్టుబడిలో తెలుస్తుంది. అందులో ఉంటున్న వాళ్ళు తరాలుగా డబ్బుకి ఇబ్బంది లేని జీవితాల్ని గడిపారనీ, ఇక ముందు గడుపుతారనీ కూడా తెలుస్తుంది. మా ఇద్దరు తమ్ముళ్ళనీ ఆమె తీసుకురమ్మంటే నేను తీసుకెళ్ళానో, లేదా స్కూలు తర్వాత ఆమే మమ్మల్ని వెంటబెట్టుకుని వెళ్ళిందో గుర్తు లేదు. మాకు తాగటానికి ఏదో ఇచ్చింది. తర్వాత టేపు రికార్డర్ లో పాటలు పెట్టి మా తమ్ముడు చేసే బ్రేక్ డాన్సు చూసి నవ్వింది. నాకు మా తమ్ముడిలా ఆమె కళ్ళల్లో ప్రత్యేకంగా నిలబెట్టగలిగే ప్రతిభలు ఏమైనా ఉండుంటే బాగుండునని అనిపించింది. కానీ అలా వున్నా ఏం ఒరిగేది కాదేమో. నా మూణ్ణాలుగేళ్ళ తమ్ముడిలా నాది ప్రపంచమింకా ఒరుసుకోని మెత్తటి చర్మమున్న పసి వయస్సు కాదు. పైగా బాల్యపు అమాయకత్వం నా కళ్ళను చాలా త్వరగా వదిలి వెళ్ళిపోయింది.

నీలా టీచరు మా స్కూల్లో ఉద్యోగాన్ని ఏదో కాలక్షేపానికే చేసినట్టు కూడా నాకు అనిపించదు. అందరూ చిన్నబడి అని పిలిచే మా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదు వరకూ చెప్పేవారు. రెండు పెద్ద గదుల్లో, బాచీమటం వేసుకుని కూర్చోవటానికి వీలుగా పీటలంత నేలబారుగా చేసిన బల్లల మీద పిల్లలు కూర్చొనేవారు. రెండు, నాలుగు తరగతులు నీలా టీచర్ చెప్తే, అదే గదిలో పిల్లల్ని ఇంకో వైపు కూర్చోబెట్టి ఒకటో తరగతిని ఇంకో మేడం చెప్పేది. పక్క గదిలో మూడు, ఐదు తరగతుల్ని ఇంకో ఇద్దరు మగ మేస్టార్లు చెప్పేవారు. మా స్కూల్లో ఒక టీవీ ఉండేది. అందులో అప్పుడప్పుడూ పిల్లలు చూడదగిన సినిమాలూ, ఏనిమేటెడ్ పిల్లల పాఠాలూ వీడియో కేసెట్లు తెచ్చి వేసేవారు. ఆ టీవీనీ, వీడియో ప్లేయర్నీ, కేసెట్లనీ స్పాన్సర్ చేసింది నీలా టీచరే.

నా జ్ఞాపకం పదే పదే ఈ చిన్నబడి చుట్టూ తిరగటానికి నీలా టీచరు కన్నా ముఖ్యమైన కారణం ఒకటుంది. ఈ స్కూల్లోనే నేను మొదటిసారి ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, ఆ అమ్మాయినే తర్వాత పెళ్ళి చేసుకున్నాను. నేను ముదురేనని చెప్పటానికి ఇదో తిరుగులేని ఋజువు. ప్రేమించటం అంటే ఏంటో తెలిసిపోవటానికి అప్పటికి నేను చూసిన సినిమాలు కూడా మహా అయితే ఓ ఐదారు మాత్రమే అయ్యుంటాయి. ఈ ప్రపంచంలో అదొకటి ఉందని చెప్పే వాతావరణం నా చుట్టూ ఏదీ లేదు. కానీ శ్రీవల్లిని వాళ్ళ నాన్న తీసుకొని వచ్చి నాలుగో తరగతిలో చేర్చిన మొదటి రోజు నుంచే ఆమెని ఇష్టపడటం మొదలుపెట్టాను (అప్పటికి నేను ఐదో తరగతి). ఇది ఎలా జరిగిందీ అని హేతుబద్ధంగా ఆలోచించటం మొదలుపెడితే నాకు నికరంగా తేలేదల్లా హేతువు ఎంత బలహీనమన్నదే. వల్లీ కళ్ళు చాలా అందంగా ఉంటాయి. కిందా పైనా బరువైన కనురెప్పలతో, వాటి మధ్యన కాంతులీనే బరువైన మణులు పొదిగినట్టు ఉబుకుతూ ఉంటాయి. నాకు ఆ తొమ్మిదేళ్ళ పిల్లని ఒకసారి చూడగానే మళ్ళీమళ్ళీ చూడాలనిపించటానికి ఆ కళ్ళు ఏమైనా కారణం అనుకోవచ్చా? కానీ అలాంటి కళ్ళు అందమైనవీ అని తేల్చగలిగే లెక్క ఆ వయసులోనే నాకెక్కడిదీ? ఏమో అప్పటికే పుట్టినప్పటి నుంచీ వేల జతల కళ్ళు చూసి ఉంటాను. ఈ ఒక్క జతా ప్రత్యేకంగా అనిపించి ఉండొచ్చు. మా చిన్నబడిలో ఆ పిల్ల వచ్చి చేరిన మరుక్షణం నుంచీ ఆమె దృష్టిని ఆకట్టుకోవటానికి నేను ప్రయత్నించానని గుర్తుంది. అలాంటి ప్రయత్నాల్లో ఒకటేంటంటే- ఆమె చూస్తున్నదని అనుకుంటూ బ్లాక్ బోర్డు మీద సుద్దతో కృష్ణుడి బొమ్మ గీయటం. నాకు కృష్ణుడి బొమ్మను సులువుగా గీయటం ఎవరో నేర్పారు. రెండు కళ్ళు, కనుబొమ్మల మధ్య ‘యు’ ఆకారంలో నామం, జట్టు మీద ఒక పక్కగా కొప్పు, దాని వెనక వాలినట్టూ నెమలి పింఛం… ఇలా గీశాను. మామూలుగా క్లాసంతా ఉండగా బోర్డు ముందు నిలబడి దాని మీద ఏదైనా రాయటం నాలాంటి బెదురుగొడ్డు పిల్లాడికి చాలా ధైర్యం కావాల్సి వచ్చే పని. పాస్‌బెల్లులో ఆ పిల్ల ఫ్రెండ్స్ తో ఆడుకోవటాన్ని గమనించేవాడిని. నేరుగా వెళ్ళి మాట్లాడవచ్చని తోచలేదు. ఎందుకంటే నా మనసులో ఆమెపై కలుగుతున్నది ఏదో కూడని భావమని నాకు అనిపించేది. కొన్ని రోజుల తర్వాత ఈ విషయాన్ని నా ఫ్రెండ్ తో చెప్పినప్పుడు వాడి రియాక్షన్ కూడా దానికి తగ్గట్టే ఉంది. మేస్టారు లేక ఊరకే అందరం కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు, నాకు ఒకణ్ణే మోయటానికి మరీ బరువైపోతున్న ఈ రహస్యాన్ని ఎవరితోనన్నా చెప్పుకోవాలనిపించింది. పక్కన కూర్చున్న అబ్బాయితో “ఓరే, నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానురా” అని చెప్పేసాను. వాడు “అయ్ బాబోయ్!” అని నవ్వు కలిసిన భయంతో చేత్తో నోరు మూసుకున్నాడు. వాడి వాలకం చూసి నాకూ భయం వేసి ఎవరితోనూ చెప్పవద్దని బతిమాలాను. కానీ ఇది వాడికీ బరువైపోయి మరుసటి రోజే ఎవరికో చెప్పేశాడు. నెమ్మదిగా ఇది క్లాసంతా పాకిపోయింది. ఇది ఎంత ప్రమాదమైన విషయమో తెలియక ఎవడన్నా క్లాసులో లేచి “టీచర్, నాగూ శ్రీవల్లిని ప్రేమిస్తున్నాడంట” అని ఎక్కడ చెప్పేస్తాడోనని హళ్ళిపోయేవాడ్ని. ఎపుడూ అంతదాకా వెళ్ళలేదు కానీ పిల్లల్లో పిల్లల్లోనే అందరికీ తెలిసిపోయింది. ఎంతలా అంటే- ఒక ఏడాది తర్వాత ఈ చిన్నబడిలో ఐదో తరగతి అవగొట్టుకుని, తర్వాత ఆరో తరగతి చదవటానికి మెయిన్ రోడ్డుకి ఆనుకుని ఉన్న పెద్ద బడిలో చేరినపుడు, ఆ ప్రేమ వార్త నాతో పాటూ వచ్చి పెద్దబడిలో చేరిపోయింది (ఇక్కడ ప్రేమని కొటేషన్స్ లో పెట్టాలనిపిస్తుంది కానీ, అసలు అవసరమా అని కూడా అనిపిస్తుంది; మనిషికి చావనేదే లేకపోతే ఖచ్చితంగా అన్ని వయసుల ప్రేమల్నీ కొటేషన్స్ లోనే పెట్టాల్సి వస్తుంది గనుక).

వల్లీ నా కన్నా ఒక క్లాసు తక్కువ కాబట్టి ఇంకా చిన్నబడిలోనే చదివేది. మా తమ్ముళ్ళు కూడా అక్కడే చదువుతున్నారన్న నెపంతో నేను అప్పుడప్పుడూ పెద్దబడి నుంచి బయల్దేరి ఊరి లోపల పెద్ద చెరువునానుకుని ఉండే ఈ చిన్నబడి దాకా పనిగట్టుకు వచ్చి ఆ పిల్లను చూసేవాడ్ని– వీధులమ్మటా పరిగెత్తుకుంటూ, నాలో ఈ భావం నన్ను ఆకాశంలో గాలిపటంలా వెంట లాక్కెళ్తుంటే. ఒక రోజు నీలా టీచర్ నన్ను గమనించి, “ఈ స్కూలు కానపుడు ఎందుకు వస్తున్నావ్ ఇక్కడికి?” అని గదమాయించి పంపేసింది కూడా. ఇంత జరుగుతున్నా, ఆ మొదటి రోజు బోర్డు మీద బొమ్మ గీసి వల్లీ కంట్లో పడటానికి చేసిన ప్రయత్నం తర్వాత, మళ్ళీ ఎప్పుడూ ఆమె కళ్ళల్లో పడాలని ప్రయత్నించ లేదు. నాకు ఆమెని చూస్తే బాగా అనిపించేదంతే. ఆమెని చూడటం కుదరని రోజు, అప్పటికింకా చిన్నబళ్ళోనే చదువుతున్న మా తమ్ముళ్ళు బడి అయిపోయి ఇంటికి వచ్చాకా, “ఒరే వల్లీ ఇవాళ ఏం డ్రస్ వేసుకుని వచ్చిందిరా?” అని అడిగి వేధించేవాడ్ని. అప్పటికే ఆమె గౌన్లూ, పరికిణీ లంగాలూ అన్నీ నాకు గుర్తే. మా తమ్ముళ్ళు ఫలానా డ్రస్ అని చెబితే, ఆ వర్ణన సాయంతో నాకు కనపడని ఆ రోజు ఆమె ఎలా ఉందో ఊహలో చూడగలిగేవాడ్ని. తమ్ముళ్ళిద్దరికీ ఇదేం అర్థమయ్యేది కాదు. వాళ్ళల్లో ఆటల్లో వాళ్ళుండి విసుక్కుంటుంటే వెంటపడి అడగాల్సొచ్చేది. పెద్దన్నయ్య మిగతా వాళ్ళల్లాగాక కొత్తగా ఇదేదో “ప్రేమించటం” అన్న పని చేయగలగటం మాత్రం వాళ్ళకీ గొప్పగానే ఉండేది. నా పెద్దబడి స్నేహితుల్లో కూడా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్న అబ్బాయిగా నాకు గుర్తింపు ఉండేది. అది నాకు ప్రత్యేకంగా, గొప్పగా అనిపించేది. బడిలో ఒక్కడి దగ్గరే కొత్త సైకిలు ఉన్నప్పుడు వాడికి కలిగే బడాయి లాంటిది.

బళ్ళు అయిపోయి మేం ముగ్గురం ఇంటికి వచ్చాకా అమ్మ ఇంకా ఆఫీసు నుంచి ఇంటికి రావటానికి చాలాసేపు పట్టేది. ఒక మూణ్ణాలుగు గంటలు మా అంతట మేం ఇంటి దగ్గర అమ్మ కోసం ఎదురు చూస్తూ గడపాల్సి వచ్చేది. అమ్మ ఆ నాలుగు గదుల ఇంట్లో రెండు గదులకు తాళం వేసి ఇంకో రెండు గదుల్ని మాకోసం వదిలిపెట్టేది. వెలుగు నుంచి చీకట్లోకి రోజు మారుతుంటే ఇంటి చుట్టూ రకరకాల ఆటలు ఆడుకునేవాళ్ళం. వల్లీ తెలిసాకా మాత్రం నేను సాయంత్రాలు తమ్ముళ్ళతో ఆటలు తగ్గించాను. వాళ్ళని ఇంటి దగ్గరే వదిలి, వల్లీ కనిపించే అవకాశమున్న చోట్ల కోసం– అంతకు రెండేళ్ళ క్రితమే అమ్మకు బదిలీ అయితే వచ్చిన ఈ కొత్త ఊరిలో– తెలియని వీధులమ్మటా తిరిగేవాడ్ని. వల్లీని ప్రేమించటం అనేది నాకు ఒక వొళ్ళు జలదరించే సాహసంలాగా అనిపించేది. నా స్నేహితులెవ్వరికీ చేతకాని, పెద్దవాళ్ళు మాత్రమే చేసే పని నేను చేస్తున్నానని అనిపించేది. ఒక రోజు ఆ పిల్లకి తెలియకుండా వెంట వెళ్ళి తన ఇల్లెక్కడో కనుక్కోవటం ఒక సాహసం. ఆ ఇంటి నుంచి ఆమె సాయంత్రాలు బయటికి వచ్చి ఆడే అవకాశమున్న స్థలాల్లో, ఆమె ఎదురయ్యే క్షణం కోసం ఎదురుచూస్తూ తిరగటం ఒక సాహసం. పులి లేనప్పుడు దాని గుహలో సంచరిస్తున్నట్టు భయోద్విగ్నంగా ఉండేది. ఆ అమ్మాయి అనుకోకుండా ఎదురైతే అచ్చం భయమేసినట్టే వొళ్ళు గగుర్పొడిచేది. రాన్రానూ ఆ పిల్ల ఒక ప్రత్యేకమైన, మానవాతీతమైన జీవం అయిపోయింది. నన్ను వశం చేసుకుని ఉన్న చోట ఉండనీయక బలవంతంగా వెంట తిప్పించుకునే భూతం. ఒక పసివాడ్ని లక్ష్యం లేకుండా తెలియని వీధుల్లోకి లాగే శక్తి క్షేత్రం. ఊరిలో దేవీ నవరాత్రులో, అయ్యప్పస్వామి తెప్పోత్సవమో ఇలా ఏవన్నా ఉత్సవాలు జరిగి, అక్కడికి వల్లీ కచ్చితంగా తన ఇద్దరు చెల్లెళ్ళనూ, చిట్టి తమ్ముడ్నీ వెంటేసుకుని వస్తుందనిపిస్తే, నేను అప్పటికే అమ్మ ఇంటికి వచ్చేసినా ఆమెకి ఏదో ఒక అబద్ధం చెప్పి ఆ ఉత్సవానికి చేరుకునేవాడ్ని. అక్కడ మగవాళ్ళు కొత్త చొక్కాలతో, తువ్వాళ్ళు భుజాన్నేసుకునీ, ఆడవాళ్ళు బీరువా పైఅరల్లోంచి తీసిన మడత నలగని చీరల్లో, పూల బుట్టలు చేతపట్టుకునీ తిరిగేవారు; మైకుల్లోంచి దేవుడి పాటలు పక్కనున్నవాడితో కూడా అరిచి మాట్లాడాల్సినంత గట్టిగా మోగుతూండేవి; వీధి వారగా పాతిన గెడకర్రల మీదుగా వేలాడే చిట్టి బల్బుల తోరణాలు నా కళ్ళల్లో వెలుగుతూండేవి; నేను ఆ సందడి మధ్యన, మృగమే చల్లిన మాయలో పడి అడవి మధ్యన దారితప్పిన వేటగాడిలాగా తిరిగేవాడ్ని. ఆ వాతావరణమంతా నా ప్రేమకు నేపథ్యంగా పని చేయటానికే అలా ఏర్పాటైందని అనిపించేది. ఏ గరగల నృత్యమో, ఏ ఆలయపు క్రతువో, ఆకాశంలో విప్పారే ఏ టపాసుల వెలుగో నా పరుగుని ఆపి కాసేపు నన్ను నిలబెట్టినా, మళ్ళీ వాటన్నింటికన్నా ముఖ్యమైన లక్ష్యం నన్ను నిమంత్రిస్తుంటే తెప్పరిల్లి ముందుకు సాగిపోయేవాడ్ని. గరగరమని ఒరుసుకొనే ఈ చీర మడతలూ మెరిసే మట్టిగాజుల మధ్య తిరిగేవాడ్ని; చెవులు హోరెత్తించేలా వినిపిస్తున్నా ఒక్క ముక్కా అర్థం కాని భక్తి పాటలూ పూజారి మంత్రాల మధ్య తిరిగేవాడ్ని; గుడి గోపురం పక్కన తూములో పారే పాలూ కొబ్బరి నీళ్ళ మొహం మొత్తే వాసనల మధ్య, నూనె దీపాల మైకం కమ్మే పొగల మధ్య వెతుక్కొంటూ తిరిగేవాడ్ని. ఇలా ఎంత తిరిగినా, ఎంతసేపవుతున్నా, ఒక్కోసారి ఆ అమ్మాయి కనిపించేది కాదు. అమ్మ నాకు బయట తిరగటానికి ఇచ్చిన సమయం అయిపోయే కొద్దీ నా ఉత్సాహం నీరుగారిపోయేది. అప్పటిదాకా ఆమె ఇక్కడే ఎక్కడో ఉండివుంటుందనే కారణంగా ఎంతో అర్థవంతంగా, గుంభనంగా కనిపించిన ఈ పరిసరాలన్నీ క్రమంగా సారవిహీనమై డొల్లగా మారిపోయేవి. అప్పటిదాకా ఈ మెలికల వీధులన్నీ ఒక ప్రహేళికని పన్ని కావాలని ఆమెను ఎక్కడో దాచాయనీ; నన్ను తిప్పించి తిప్పించి, అలిసిపోయేదాకా నాతో దోబూచులాడి, నా చిత్తశుద్ధిని ఎంతుందో పట్టుదల ఏమాత్రముందో పరీక్షించి, చివరికెప్పుడో అనుకోని క్షణంలో ఆమెను నా ముందుకు తోయటం ద్వారా నా వెతుకులాటనీ నా అలసటనీ మరింత వీరోచితమూ సార్థకమూ చేస్తాయనీ అనుకున్న నాకు, నెమ్మదిగా నాదో ప్రయోజనంలేని పరుగని అర్థమయ్యేది. వీధులన్నీ తమ మాయజాలాన్ని జారవిడుచుకొని జడంగా చచ్చిపోయేవి. ఇంకా అక్కడ పూజలైతే జరిగేవి, జనం ఇదివరకటి కన్నా పల్చబడినా అప్పటికీ ఆ వీధులు మిగతా ఊరికన్నా ప్రకాశంగానే వెలిగేవి, అడపాదడపా ఓ తారాజువ్వ చీకటి ఆకాశంలోకి లేచి టప్‌మని ఒంటరి చప్పుడు చేసేది. నేను మాత్రం ఆ సందడికి వీపు చూపిస్తూ ఒక్కడ్నీ దూరంగా వచ్చేసేవాడ్ని.

వీధి దీపాల కింద తలలు తిప్పి చూసే కుక్కలు; బైట నులక మంచం మీద పడుకుని విసనకర్ర విసురుకుంటూ అలికిడికి తలెత్తిచూసి మళ్ళీ తలగడ సర్దుకుని పడుకునే ముసలాయన; గుడ్డి దీపంతో వెలుగుతున్న ఓ కిటికీ లోపలినుంచి ఆగాగి వినిపిస్తున్న మాటలు; పేడ నీళ్ళ కళ్ళాపులతో నున్నగా మారిన నేల మీద పైకి లేచి కనిపించిన ఒక కంకర్రాయిని తన్నుతూ ఇంటికి వెళ్ళే నేను.

ఒకసారి ఇలాగే ఆమె కనపడని ఉత్సవం నుంచి ఇంటికి నడిచి వస్తూ దారిలో చిన్నబడి దగ్గర ఆగాను. పొద్దున్నపూట పిల్లల మూకుమ్మడి గొంతుల కల్లోలంతో హోరెత్తే ఆ బడి, ఈ రాత్రి పూట మాత్రం, చుట్టుపక్కల గుడ్డిదీపాలతో చప్పుడు లేకుండా ఉన్న ఇళ్ళ కన్నా కూడా చీకటిగా, ఇంకా నీరవంగా ఉంది. చుట్టుపక్కల ఎవరూ లేకపోవటం చూసి, ధైర్యం చేసి బడికి దగ్గరగా వెళ్ళాను. కటకటాల్లోంచి తొంగి చూసాను. ఖాళీ వరండా, మూసి ఉన్న తలుపులూ తప్ప ఏమీ కన్పించలేదు. గోడ వెంట నడుచుకుంటూ బడికి వారకి వెళ్తే పైన ఒక కిటికీ తెరిచి కన్పించింది. అది ఐదో తరగతివాళ్ళు కూర్చునే చోటు పక్కనే ఉన్న కిటికీ. బడి పునాది అంచు కాస్త బయటకొచ్చి ఉంటే దాని మీద ఎక్కి, కిటికీ లోంచి తొంగి చూసాను. అటుపక్క తలుపు చీలిక గూండా సన్నని రేఖలా వచ్చిపడుతున్న వీధి దీపం మసక వెలుగులో ఖాళీ బల్లలు కనిపించాయి. కిటికీ పక్కనే పొడవాటి చెక్కల స్టాండు పైన నల్ల బోర్డు నిలబెట్టి ఉంది. దాని పైన ఏదో లెక్కల పాఠం కనిపిస్తోంది. కిటికీ చువ్వల్ని ఆసరాగా పట్టుకుని, ఒకే కాలు పట్టే ఇరుకు పునాది మెట్టు మీద కాళ్ళు మార్చుకుంటూ, బోర్డు మీద కనిపిస్తున్న అంకెల్ని చూశాను. బహుశా రాఘవయ్య మేస్టారు చెప్పిన ఆ లెక్కల పాఠాన్ని– ఇప్పుడు నా కళ్ల ముందు కనపడుతున్న ఆ అంకెల్నీ, గీతల్నీ– పొద్దున్న క్లాసులో వల్లీ తన కళ్ళతో చూసి ఉంటుంది. బహుశా ఇప్పుడు ఈ రాత్రి ఇదే క్షణాన తన ఇంట్లో కూర్చుని ఇవే లెక్కలపై హోం వర్కు చేస్తూండి వుంటుంది. లేదంటే ఇవే లెక్కల్ని ఎక్కించుకున్న పుస్తకం ఆమె మసలుకునే ఇంట్లో ఏ మూలో ఆమె బ్యాగ్ లో ఉండి వుంటుంది. అవే లెక్కల్ని ఇప్పుడు నా కళ్ళతో నేను చూస్తున్నాను! బడి వెనుక చెరువు మీంచి వణికిస్తూ వస్తున్న తేట గాలికీ, నా వెనుక దూరపు సముద్రంలా వినిపిస్తున్న రావి ఆకుల ఘోషకీ, తుప్పల్లోంచి కీచురాళ్ళ మోతకీ వొళ్ళు జలదరిస్తుంటే, చోటు చాలని ఇరుకు మెట్టు మీద కాళ్లు నొప్పెడుతుంటే ఎక్కువ సేపు నిలబడలేకపోయాను. కానీ ఆమెతో నన్ను కలుపుతూ ఏర్పడిన ఆ చిన్న లంకె, ఆమె లోకంలోకి తెరుచుకున్న ఆ చిన్న ద్వారం– ఆ రోజు ఉత్సవంలో ఆమె కనిపించని దిగులుని తుడిచేయలేకపోయినా– ఇంటికి ఇంకాస్త తక్కువ దిగులుతో వెళ్ళగలిగేట్టు చేసింది.

ఒక్కోసారి ఆమె కనిపించేది కూడా. నేను రావటమే ఆమె కోసం వచ్చినా, ఆమె ఖచ్చితంగా వస్తుందని అనుకునే వచ్చినా, అలా ఆమె హఠాత్తుగా కనిపిస్తే నాకు ఒక అద్భుతం జరిగినట్టే ఉండేది. నేను ఆమె ప్రతి కదలికనీ మళ్ళీ ఆమె కళ్ల ముందు లేనప్పుడు కూడా గుర్తుగా వుండేట్టు అతి శ్రద్ధగా మనసు మీద ముద్రించుకునేవాడ్ని. అయితే ఇన్ని చోట్ల నా సమక్షం తారసపడుతున్నా అది ఆమె గమనింపుకు వచ్చి ఉండదు. ఎందుకంటే తన అల్లరిలో తనుండేది. క్షణం కుదురులేకుండా ఎప్పుడూ ఒక సందడి నుంచి మరో సందడికి పరిగెడుతున్నట్టు ఉండేది (ఆమె వదిలి వెళ్ళిన సందడీ, ఆమె వచ్చి చేరిన సందడీ రెండూ ఆమె పుట్టించినవే అయినా). ఆమె కాళ్ళ చుట్టూ గౌను అంచు ఎప్పుడూ మొదలూ తుదీ లేని అలలా అల్లల్లాడుతూనే ఉండేది. పళ్ళు కనిపించే పెద్ద సిరి నవ్వుతో, క్షణం కళ్ళు తిప్పితే మళ్ళీ అక్కడ కనిపించని చంచలత్వంతో ఒక తుళ్ళింతగా ఉండేది.

అయితే నా బడి తర్వాత చక్కర్లు మాన్పించటానికి అమ్మ మా ముగ్గురన్నదమ్ముల్నీ ట్యూషన్ లో పడేయాలనీ, ఆ విధంగా తను ఆఫీసు నుంచి లేటుగా తిరిగి వచ్చేదాకా మేం కుదురుగా ఉంటామనీ అనుకుంది. చిన్న బడిలో మూడో తరగతికి పాఠం చెప్పే సూర్రావుగారి దగ్గర మా ముగ్గుర్నీ ట్యూషన్లో చేర్చింది. సూర్రావుగారు ఒక హేపీ మనిషి, ఆయనది ఒక హేపీ కుటుంబం. ఆయన భార్యకీ ఆయనకీ మధ్య ఎప్పుడూ మేం పిల్లలమే ప్రేక్షకులుగా ఏదో ఒక పరాచికాల యుద్ధం నడుస్తూండేది. వాళ్ళ మధ్య ఎప్పుడూ తీరని కోపాలు ఉండేవి కాదు. ఆమె కోపాన్ని తగ్గించటానికి ఆయన హ్యూమర్ సాయపడేది. నవ్వించే శక్తితో జీవితాన్ని నెట్టుకువచ్చేసే మనిషని ఇప్పుడనిపిస్తుంది. ఆ ఇంటి గొళ్ళెం తలుపు తీస్తే, కుళాయి పళ్ళెం ఎదురయ్యేది, తర్వాత లోపలికి చిన్న సందుండేది, అది దాటితే పెంకుటింటి వసారాలోకి వచ్చేవాళ్ళం. అక్కడ కూర్చోపెట్టి ట్యూషన్ చెప్పేవాడు. రెండు మూడు రోజులకే ఆ ట్యూషన్‌లో నన్ను కట్టిపడేసినట్టు అనిపించటం మొదలైంది. పైగా ఆయన లెక్కల మీదే శ్రద్ధపెట్టేవాడు. నాకు లెక్కలు వచ్చేవి కాదు. ఏదన్నా లెక్క చేయమంటే, టెక్స్ట్‌బుక్‌ చివరి పేజీల్లో జవాబు చూసి, అక్కడున్న సంఖ్య వచ్చేదాకా కూడికలూ తీసివేతలూ భాగాహారాలూ ఇలా నానా రకాలుగా ఏదో ఒకటి చేసేసి ఆ అంకె రప్పించేవాడ్ని– ఆయన జవాబు చూస్తాడే తప్ప దాన్ని ఎలా రప్పించాననేది గమనించడన్న ఆశతో. ఆయన నేను ఇచ్చిన తెల్లకాయితాల నోటు బుక్కు ఒక చేతిలో పట్టుకుని, రెండో చేత్తో నా చెవితమ్మె పట్టుకుని, కాసేపు వదలకుండా నన్ను దాన్తో పట్టి ఊపుతూ “కిట్టించేసావురా ఎదవకానా” అని తిట్టేవాడు. ఈ బాధ పడలేక ఆ ట్యూషన్ ఎగ్గొట్టేందుకు కుట్రలు పన్నటం మొదలుపెట్టాను. ట్యూషన్‍కి బయల్దేరినట్టే బయల్దేరి, నా పుస్తకాలూ, తమ్ముళ్ళ పుస్తకాలూ కరెంటు స్తంభాలకు ఉండే తుప్పు పట్టిన ఇనుప బాక్సుల్లో దాచేసి, కొత్తగా కట్టిన రామాలయం చుట్టూ గచ్చు మీద పాల కనికెలతో దాడీ ఇప్పి దాడీ వేసే ఆట ఆడుకునేవాళ్ళం. లేదంటే, అప్పుడప్పుడూ ఆ గుళ్ళో టీవీలో అదేపనిగా వేసే లవకుశ లాంటి సినిమాలు చూసేవాళ్ళం. (ఈ కథలో ఇన్ని గుళ్ళు ఉండటం యాదృచ్ఛికం కాదు. దక్షిణ కాశీ అని పిలిచే ఊళ్ళలో ఆలమూరు కూడా ఒకటి.) ఒక్కోసారి ఇంకో ఫ్రెండు తోడు దొరికితే ఊరి చివర పాడుబడిన ఒక రైస్ మిల్లుదాకా పోయేవాళ్ళం. పని చేయని యంత్రాల మధ్య ఆడుకునేవాళ్ళం. అక్కడ దొరికే అభ్రకం పెచ్చుల్ని పగలగొట్టుకుని ఆ మెరుపుల్ని మేం చూసే వీధి నాటకాల్లో నటుల్లాగా చెంపలకి పూతలాగా పూసుకునేవాళ్ళం. ఒక్కోసారి అటూయిటూ తోటలే ఉన్న నిర్మానుష్యపు దారుల్లో నడుస్తూ దెయ్యాల కథలు చెప్పుకునేవాళ్ళం. దొరికితే చెట్టుకు కట్టేస్తారన్న భయం వల్ల ఇంకా రంజుగా ఉండే ఆట కాబట్టి- మామిడి తోటల మీదకి గుంపులుగా వెళ్ళి కాయల్ని దొంగతనాలు చేసేవాళ్ళం. ఇక ట్యూషన్ అయిపోతుందనే టైముకి మళ్ళీ కరెంటు స్తంభాల మెయిన్ బాక్సుల్లోంచి పుస్తకాలు తీసుకుని ఇంటికి వచ్చేసేవాళ్ళం. నెల తర్వాత సూర్రావు మేస్టారికి ఫీజు ఇవ్వటానికి కలిసినపుడు కానీ అమ్మ ముందు మా బండారం బయటపడలేదు.

అమ్మకి అదేదో పాత సినిమాలో ఒక అమ్మ కోరిక లాగా మా ముగ్గుర్లో ఒకడు డాక్టరూ, ఒకడు ఇంజనీరు, ఒకడు కలెక్టరూ అవ్వాలని ఉండేది. కానీ మమ్మల్ని పెద్దగా ప్రైవేటు స్కూళ్ళలో చదివించటానికి తగినంత జీతం గానీ, ఆఫీసు పని వల్ల దగ్గర కూర్చోబెట్టుకుని చదివించేంత టైము గానీ ఉండేవి కాదు. మేం చుట్టుపక్కల పేటల్లో ఉండే పిల్లలతో తిరుగుతూ, బూతు పాటలు నేర్చుకుంటూ, పనికి మాలిన అల్లరి చేస్తూ తిరిగేవాళ్ళం. అప్పుడప్పుడూ మేం తాను అనుకున్న దారిలో ఏ మాత్రం వెళ్ళటం లేదని తెలిసినప్పుడల్లా అమ్మ అగ్నిపర్వతంలా బద్దలైపోయేది. “నువ్వు పెద్దవాడిగా ముందుండి మిగతా ఇద్దరికీ వివరం చెప్పాల్సింది పోయి” అనేది మా ఇంట్లో స్టాకు డైలాగు. మరీ అంత చిన్నప్పటి నుంచీ ఈ బాధ్యతల అవగాహన నాలో కల్పించటానికి చేసిన ఈ అతి ప్రయత్నం ఎదురు దెబ్బకొట్టి ఏం జరిగిందంటే- నేను నిజంగా బాధ్యతలు భుజాన్నేసుకోవాల్సిన వయసు వచ్చినా కూడా ఆ పని చేయలేదు. దానికి అప్పుడప్పుడూ సిగ్గుపడతాను కానీ, సిగ్గుపడి మారాలని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు (అందుకే నాకు చెల్లెళ్ళు లేనందుకు ఎన్నిసార్లు బాధపడినా, ఉండుంటే వాళ్ళకు పెళ్ళి చేసి సాగనంపాల్సిన బాధ్యత నుంచి తప్పించినందుకు దేవుడికి థాంక్స్ కూడా చెప్పుకుంటాను.)

మేం సుర్రావు మాస్టారి ట్యూషన్‌కి వెళ్ళటం లేదని తెలిసిన సందర్భం అమ్మ అగ్నిపర్వతంలా బద్దలైన, నాకు గుర్తుండిపోయిన, ఒక సందర్భం. అలా బద్దలవటంలో కూడా అమ్మకి ఒక పద్ధతి ఉండేది. ఆరోజూ రోజూలాగే ఆఫీసు నుంచి వచ్చింది. బయట్నించి చూస్తే అమ్మకు విషయం తెలిసిపోయిన జాడలేం లేవు. నెమ్మదిగా సైకిలు స్టాండు వేసి, గచ్చు మీద కబుర్లు చెప్పుకుంటున్న మా వైపు తిన్నగా రాకుండా, ఇంటి వార పొడుగ్గా పెరిగిన కరివేరు చెట్టు వైపు వెళ్ళి, దాని కొమ్మ ఒకటి పీకి, దాని నిండా ఉన్న ఆకుల్ని శ్రద్ధగా తురిమి, తర్వాత నన్ను లోపలికి తీసుకెళ్ళి, నాచేత నాట్యం చేయిస్తూ చితక్కొట్టింది. “నాన్న బుద్ధులు ఎక్కడికిపోతాయ్ దరిద్రుడా” అని చెడ తిట్టింది. తర్వాత కాసేపటికి అంత కోపమూ ద్రవించిపోయి, తను కూడా కళ్ళనీళ్ళు పెట్టుకుని, నన్ను దగ్గరికి తీసుకుని ముద్దు చేసి, ఈసారి మెత్తగా బుద్ధి చెప్పింది, నేను గునుస్తూ గారం గుడుస్తూ వింటూంటే.

ఈసారి మేం ట్యూషన్‌కి సక్రమంగా వెళ్ళేట్టు చేయడానికి అమ్మ ఓ కొత్త పథకం ప్రారంభించింది. ఏరోజుకారోజు ట్యూషన్‍కి వెళ్ళినట్టు సూర్రావు మేస్టారి చేత సంతకం పెట్టించుకుని తారీకు వేయించుకుని రావాలి. అయితే నెల తర్వాత మళ్ళీ ట్యూషన్‌లో అడుగుపెట్టిన నాకు మళ్ళీ ఇంకెప్పుడూ మానేయాలని అనిపించలేదు. ఎందుకంటే అదే ట్యూషన్లో వల్లీ తన చెల్లెళ్ళూ, తమ్ముడితో సహా చేరి కనిపించింది. వల్లీకి మనుషులంటే వాళ్ళెంత మంది ఉంటే అంత సరదా. మేం ముగ్గురం, వాళ్ళు నలుగురు- మాతో స్నేహం చేస్తే మేం పెద్ద జట్టయిపోతాం. తొందర్లోనే నన్ను తన జట్టులో చేర్చుకుంది. నాకు చిన్నప్పుడు యాదృచ్ఛికాలనేవి యాదృచ్ఛికంగా ఎప్పుడో ఓసారి మాత్రమే జరుగుతాయని తెలీదు. అందుకే నేను ఎంతో ఇష్టపడిన ఈ పిల్ల మసలుకునే ఆవరణలోకి నా ప్రయత్నం ఏమీ లేకుండానే వచ్చిపడటంలోని యాదృచ్ఛికతని గొప్పగా అనుకుని సంబరపడిపోలేదు. పుట్టిబుద్ధెరిగి కొన్నాళ్ళే అవటం మూలాన ప్రపంచమంటేనే ఇంత అనీ, మనం అనుకున్నవన్నీ మన మనసెరిగినట్టు ఇక్కడ జరిగిపోతాయనీ అనుకున్నాను. అలాగని ప్రతి రోజూ ట్యూషన్‌కి వెళ్ళేముందు దేవుడి పటం ముందు కళ్ళు గట్టిగా మూసుకుని, “ఓం నమశ్శివాయ, ఈ రోజు వల్లీ ట్యూషన్‌కి వచ్చేలా చేయి, ఓం నమశ్శివాయ ఈ రోజు వల్లీ ట్యూషన్‌కి వచ్చేలా చేయి” అని ప్రార్థించటం మాత్రం మర్చిపోయేవాడ్ని కాదు. ఒకవేళ ప్రార్థించాక కూడా ఆమె రాకపోతే ఆ రోజు ప్రార్థనలోనే ఏదో లోటు చేసానని బాధపడేవాడ్ని. మరుసటి రోజు మనస్సు ఏ పక్కకీ పోనివ్వకుండా ఇంకాస్త శ్రద్ధగా ప్రార్థించేవాడ్ని. అప్పుడే కాదు, ఇప్పటికీ వల్లీకీ నాకూ మధ్యనున్న బంధంలోని సిమ్మెట్రీ దేవుడున్నాడేమోనని అనుమానం కలిగేలా చేస్తుంది. విశ్వం మంత్రజాలమయం అనిపిస్తుంది. మేం ముగ్గురన్నదమ్ములం, వాళ్ళు ముగ్గురక్కచెల్లెళ్ళు– తోకలా ఒక తమ్ముడు. వల్లీ అంటే పెద్దన్నయ్యకి ఇష్టమని అమ్మతో ఎక్కడ చెప్పేస్తారోనని, మా ఇద్దరు తమ్ముళ్ళనీ కూడా మిగిలిన ఇద్దరు అక్క చెల్లెళ్ళనీ ప్రేమించమని చెప్పి చెడగొట్టే ప్రయత్నం చేసేవాడిని. అయితే వాళ్ళు మరీ చిన్నపిల్లలు. మా పెద్ద తమ్ముడికి వల్లీ పెద్ద చెల్లెలంటే వళ్ళు మంట. ఇద్దరూ ఎప్పుడూ కొట్టుకునేవారు. వల్లీ చిన్న చెల్లి మా చిన్న తమ్ముడ్ని మేకపిల్ల ఎక్కించుకునేది. వల్లీ నేనూ అంతకన్నా పెద్దరికంతో ఏం ప్రవర్తించేవాళ్ళం కాదు. ఆమె రమ్మన్న చోటికల్లా వెళ్ళి, ఆడమన్న ఆటల్లా ఆడేవాడ్ని. చివరకు శివాలయంలో దేవగన్నేరు చెట్టు కింద తనతో ఆడపిల్లలా ఉప్పులగుప్ప కూడా తిరిగేవాడ్ని. నాకు ఆ శివాలయం, ఉత్తపుణ్యానికి పూలు రాల్చే ఆ దేవగన్నేరు చెట్టూ అలాగే మనసులో ఉండిపోయాయి. మన వాళ్ళు మాట్లాడితే మల్లెలూ, గులాబీలూ అంటారు కానీ, అటు అందానికి అందమూ, మంచి వాసనకి వాసనా ఉండే ఈ దేవగన్నేరు పూవు పేరెందుకు ఎత్తరో అర్థం కాదు. రేకల అంచులో తెల్లగా ఉండి, బొడ్డులోకి పోయే కొద్దీ మెల్లగా పసుపు రంగులోకి మారే పువ్వు రూపాన్ని అక్షరాల్లో వర్ణించగలను కానీ, బొడ్డులో ముక్కు దూర్చి ఎంత పీల్చినా తనివి తీరని వాసనని ఎలా వర్ణించాలి. పదును అంచులున్న పళ్ల మధ్య దళసరి పూరేకని పెట్టి చిన్నగా కొరికితే పళ్ళకు దారిస్తూ వేరయ్యే రేక మృదుత్వమూ, నాలిక్కి అంటే చిరు చేదూ నాకు తెలుసు. రేకలు పట్టు లేకుండా చప్పున విడిపోతాయన్న మాటేగానీ మిగతా విషయాల్లో నా వరకూ ఈ పువ్వుకి సాటి వచ్చే పువ్వు లేదు. శివాలయంలో వల్లీతో ఆడిన ఆటల వల్లనో ఏమో ఈ పువ్వు ఎప్పుడు చూసినా తర్వాత చాలా ఏళ్ళ దాకా వల్లీయే చప్పున గుర్తొచ్చేది– మళ్ళీ స్వయంగా వల్లీనే నా జీవితంలోకి వచ్చి, ఇక పువ్వుల్లోనూ, అందమైన కళ్ళల్లోనూ, రాత్రి వచ్చి పగలు మరుపులోకి జారిపోయే కలల మనోజ్ఞతలోనూ ఆమెని వెతుక్కోవాల్సిన అవసరం తీరిపోయేంత వరకూ. నిజానికి ఇప్పటికీ మనం యాదృచ్ఛికాల తరచుదనాన్ని తక్కువ అంచనా వేస్తామేమోననిపిస్తుంది. ప్రపంచంలో మనం ఊహించిన దానికన్నా ఎక్కువ సిమ్మెట్రీనే ఉన్నదనిపిస్తుంది.

ప్రతి రోజూ సమయానికన్నా ముందే వచ్చి ట్యూషన్ లో కూర్చుని, వల్లీ వస్తుందా రాదా అని తను వచ్చేదాకా వేరే ఏమీ పట్టనట్టు అయిపోయి, తలుపు బయట అడుగుల చప్పుడు కోసమూ, గొళ్ళెం కదిలిన చప్పుడు కోసమూ ఎదురు చూడటం నా వల్ల కాకపోయింది. కాబట్టి అవసరం లేకపోయినా సందులూ గొందుల్లోంచి చుట్టుతిరిగి వల్లీ వాళ్ల ఇల్లున్న సందులోంచి వెళ్ళటమూ, ఏదో అటుగా వెళ్తూ ఆగినట్టు వల్లీ ఇంటి ముందు ఆగి వాళ్ళనీ మాతో పాటు ట్యూషన్‌కి పిలుచుకుని వెళ్ళటమూ మొదలుపెట్టాను. మొదటి రోజు గడప మీద మునివేళ్ళపై లేచి వాళ్ళ ఇంటి తలుపు గొళ్ళెం కొట్టినపుడు గుండె గట్టిగా కొట్టుకుంది. బుర్ర మీసంతో, ఛాతీ నిండా వెంట్రుకలతో, వంటి మీద లుంగీ మాత్రమే కట్టుకున్నాయన తలుపు తీశాడు. నేను పిరికితనాన్ని దాచుకుని వల్లీని ట్యూషన్‌కి పిలుచుకునివెళ్ళటానికి వచ్చామని చెప్పాను. ఆయనకి ఈ ముగ్గురు డింభకుల్నీ చూసి ఏమనిపించిందో! తన పిల్లల్ని పిలుచుకుని వచ్చేందుకు తలుపుకు అడ్డం తొలిగాడు. లోపల ఒక వాకిలీ, తులసికోట, తులసి కోటకు ఎదురుగా మేం నిలబడిన ద్వారానికి కుడివైపున కాస్త పాడుపడ్డ ఇల్లు. తర్వాతి నుంచీ రోజూ వాళ్ళింటి మీంచి వెళ్తూ వాళ్ళని పిలుచుకుని వెళ్ళేవాళ్ళం. ఒక వర్షం రోజున రెండే గొడుగుల్లో ఆరుగురమూ ఇరుక్కుని తడిసీ తడవకుండా వెళ్ళటం గుర్తుంది. వాళ్ళ ఇల్లున్న వీధి నుంచి బయటకొస్తే శివాలయం వీధిలోకి వస్తాం, శివాలయం చుట్టుతిరిగి పైకి వెళ్తే కమ్మోళ్ళ పెద్ద ఇళ్ళున్న వీధిలోకి వెళ్తాం, తర్వాత గ్రంథాలయం వీధి, తర్వాత విశాలంగా బ్యాంకు వీధి, అది వెళ్ళే కొద్దీ సన్నంగా చివరికి చిన్న వీధిలాగా మారిపోయేది, ఆ చిన్న వీధిలో ఒక పెంకుటింటి ముందాగి గొళ్ళెం తలుపు తీస్తే ట్యూషన్‌లో ఉంటాం.

వల్లీ కొన్నాళ్ళకి చిన్నబడిలో చదువు పూర్తి చేసుకుని నేను చదివే పెద్ద బడికే వచ్చి చేరింది. ఆమె వచ్చేసరికే ఆ స్కూల్లో ఒక ప్రేమికుడిగా నా గుర్తింపు క్లాసులో చాలామంది పిల్లలకి పాకిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఇదే బడిలో చేరటంతో నాకు వెక్కిరింపులు మొదలయ్యాయి. ఆమె కనిపించినప్పుడల్లా మా క్లాసు పిల్లలు కొంతమంది నా వైపు తల తిప్పి చూసేవారు. అప్పుడప్పుడూ పాస్‌బెల్లులో ఆమె అటుగా వెళ్తున్నప్పుడు నన్ను “నాగ-వల్లి” అని గట్టిగా పిలిచి ఏడిపించేవారు.

నాకు బొమ్మలు వేయటం వచ్చు. అలాగే షాపుల మీద ఉండే పేర్లలాగా ఇంగ్లీషులో అందంగా అక్షరాలు రాసేవాడ్ని. ఒకసారి పెద్దబడిలో బెంచీలో నా పక్కన కూర్చున్న ఒక అబ్బాయి ఎందుకో గుర్తు లేదు అలా అందంగా “LOVE” అనే అక్షరాల్ని రాయమన్నాడు. నేను దళసరిగా పెద్దబరిలో రాసి, అక్షరాల వెనుక వాటి నీడలు కిందకి సాగినట్టు షేడింగ్ కూడా ఇచ్చాను. ఇంటి దగ్గర దానికి స్కెచ్ పెన్నులతో రంగులు వేసి తెద్దామని జేబులో పెట్టుకున్నాను. నాకు ప్రేమ లేఖలు అనే కాన్సెప్ట్ తెలియదు. ఎందుకో ఆ సాయంత్రం ట్యూషన్ అయ్యాకా వల్లీవాళ్ళూ, మేం ముగ్గురమూ కలిసి వస్తుంటే, నా పెద్ద తమ్ముడు నా జేబులో ఉన్న ఆ కాయితాన్ని తీసి వల్లీకి ఇచ్చాడు. నేను లాక్కోవటానికి ప్రయత్నించాను. ఆమె అందకుండా పరిగెత్తింది. పరిగెత్తి దూరంగా ఆగి కాయితం విప్పి చూసుకుంది. ఇంటి వైపు పరిగెత్తడం మొదలుపెట్టింది. ఆమె నుంచీ ఆ కాయితాన్ని లాక్కొని ప్రమాదాన్ని ఆపాలని నేను వెనక పరిగెట్టాను. కానీ కాసేపటికి తనని అందుకోలేక, పైగా భయంతో కాళ్ళు కూడా వణుకుతుండటంతో, ఆగి నడుస్తూ వెళ్ళాను. వీధులన్నీ దాటి శివాలయం దగ్గరకు వచ్చేసరికి బయట గోడకి ఆనుకుని ఉన్న మెట్టు మీద కూర్చుని ఉంది వల్లీ, తల వళ్ళో పెట్టుకుని ఏడుస్తూ. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ ఆ ఏడుపు చూస్తే ఎందుకో తను ఇంట్లో ఈ విషయం చెప్పదేమోలే అనిపించింది. ఏడిచే ఆడపిల్లని ఏం చేయాలో నాకు తెలీలేదు. అందుకే తిన్నగా నడుస్తూ తన పక్క నుంచే వెళ్ళిపోయాను.

మరసటి రోజు ఓపక్క గుండెలు గుబగుబ లాడుతుండగానే, మరో పక్క అన్నిటికీ తెగించిన ధైర్యంతో ఆమె ఇంటి తలుపు తట్టాను. తలుపు వల్లీనే తీసింది. ముఖం కోపంగా పెట్టుకుని పక్కకు జరిగి నిలబడింది. తులసి కోట దగ్గర కూరలు తరుగుతూ ఒకామె నన్ను చూసింది. లోపలికి రమ్మంది. ఆమె, వల్లీ అమ్మ, “నువ్వెంత, నీ వయసెంత, నువ్వు చేసే పనులేంటి?” అని మొదలుపెట్టి తిట్టింది. మళ్ళీ ఈ వీధిలోకి వస్తే కాళ్ళూ చేతులూ విరగ్గొడతానని కూడా చెప్పింది. బుద్ధిగా చదువుకోపొమ్మంది.

నాకు అది చాలా పెద్ద అవమానంలా అనిపించింది. ట్యూషన్‌లో వల్లీతో మాట్లాడటం మానేశాను. వాళ్ళింటి మీద నుంచి వెళ్ళటం మానేశాను. కొన్ని రోజులకి వల్లీనే వాళ్ళ చెల్లెలు చేతికి చిన్న చీటీ ఇచ్చి పంపింది. అందులో తన కొక్కిరాయి అక్షరాల్లో “మళ్ళీ ఇదివరకట్లా స్నేహంగా ఉందాం” అని ఉంది. కానీ నాకు మాట్లాడబుద్ధి వేయలేదు. వల్లీ మామూలుగానే నవ్వేది. మా తమ్ముళ్ళతో మాట్లాడేది. కానీ ఒక మనిషిని ఇష్టపడుతున్నాననే దాచుకోవాల్సిన నిజాన్ని తడబడి అలా తన ముందే ఎబ్బెట్టుగా బయటపడి ఒప్పేసుకోవటం, ఆమె మళ్ళీ దాన్ని క్షమించి ఫర్లేదులే నువ్వు చిన్నబుచ్చుకోవటం నేను గమనించనట్టే ఇదివరకట్లా మామూలుగా ఉందాం అన్నట్టు వుండటం నాకు నచ్చక, ఎంతో పరువు తక్కువలాగా అనిపించి మాట్లాడలేకపోయాను. వల్లీ ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తించేది. ఒక్కోసారి జట్టు పీసు కొట్టిన ఫ్రెండ్‌తో మసలుకొన్నట్టు నన్ను చూడగానే ముఖం ఇలా పెట్టుకుని వెళ్ళిపోయేది. ఒక్కోసారి ఉన్నట్టుండి ఎదురైతే నవ్వు ఆపుకోలేకపోయేది.

స్కూల్లో, ట్యూషన్‌లలోనే గాక బయట కూడా ఎదురుపడేవాళ్లం. చిన్నబడి పక్కనుండే రావి చెట్టు కొమ్మలకి అట్లతద్ది రోజున ఉయ్యాళ్లు కట్టేవారు. అదంతా పడుచులూ, పడుచువాళ్ల పండగ. అమ్మాయిలు ఎక్కేసరికి అబ్బాయిలు ఉయ్యాళ్ళని మరింత దురుసుగా ఊపేవారు. ఉయ్యాలకున్న పీట చెరువు అంచు దాటి నీటి మీది దాకా వెళ్ళిపోయేది. బయటపడలేక భయాన్ని దిగమింగుకుని ఏడవలేక నవ్వే ఆడవాళ్ళ ముఖాలూ, అలా దిగమింగుకోలేక వెర్రి కేకలు పెట్టే ఆడవాళ్ళ ముఖాలూ కూడా చూడటానికి బాగుండేవి. అపుడపుడూ సందు దొరకబుచ్చుకుని పిల్లలం దూరేవాళ్ళం. ఆటల్లో కింది బొత్తాం చిరిగిన చొక్కాతో వల్లీ ఉయ్యాలూగుతుంటే పచ్చగా ఆమె పొట్ట కనిపించింది. వినాయక నవరాత్రులకి రథం వీధికి అడ్డంగా తెర కట్టి సినిమాలు వేసేవారు. ఎపుడూ ఒకట్రెండు పాత సినిమాలే తిప్పి తిప్పి వేసేవారు. కానీ మాకు సినిమా మీద పెద్ద దృష్టి ఉండేది కాదు. ఆరు బయట ఆకాశం కింద నడి వీధిన అలా తెల్లని తెరపై పెద్ద పెద్ద ఆకారాలు తేలుతుంటే, ఆ వెలుగులో కింద రోడ్డు ఇసకలో పిల్లలమందరం ఇరుకిరుగ్గా కూర్చుని ఆడుకోవటం ఒక అనుభవం. తెరకి అటు వైపు చూస్తే సినిమా ఒకలానూ, ఇటు వైపు నుంచి చూస్తే మరోలానూ కనిపిస్తుంది. ఇట్నించి చూసినపుడు మన పద్ధతిలో పవిట వేసుకున్న హీరోయిన్, అటు వెళ్ళి చూసేసరికి ఉత్తరాది వాళ్ళలా పవిట తిరగేసి వేసుకుని కన్పిస్తుంది. ఇటు వైపు హీరో కుడి చేత్తో పట్టుకున్న పిస్తోలు, అటు వైపు వెళ్ళేసరికి ఎడం చేతిలోకి మారుతుంది. ఈ సినిమాకి ఒకసారి వల్లీ వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి వచ్చింది. ఆమె రావటం నేను చూడకముందే మా ఫ్రెండ్స్‌ చూసేసి గుసగుసగా నాకు చెప్పారు. వీధివార ఒక పెద్ద ఇంటి ఎత్తయిన గచ్చు మీద ఆడవాళ్ల మధ్యన కూర్చుని తెరవంక చూస్తున్న వల్లీ ముఖం వైపు చూస్తూండిపోయాను, ఆమెకి ఎవరో చూస్తున్నారనిపించి నా వైపు తల తిప్పి చూసేవరకూ.

దోబూచులాటలతో ఒక ఏడాది గడిచిపోయింది. ఆ వేసవి సెలవుల్లో చెప్పాపెట్టకుండా వల్లీ్వాళ్ళు ఆలమూరు వదిలి వెళిపోయారు. కొత్త తరగతిలోనూ, అదీ కొత్త స్కూల్లోనూ చేరిన ధ్యాసలో నేను ఆమె లేకపోవటాన్ని పట్టించుకుని బాధపడింది తక్కువే. కానీ ఎదిగేకొద్దీ ఆమె నాలో అంతకంతకూ బలపడింది. యవ్వనంలోకి వచ్చాకా కూడా, నేను ఎవరితోనూ ప్రేమలో లేకుండా నా మనసుని ఖాళీగా ఉంచిన విరామాల్లో, ఆమె నాకు గట్టిగా గుర్తుకువచ్చేది. ఎందుకో అలాంటి అమ్మాయే నాకు నప్పుతుందని నాలో ముద్రపడిపోయింది. నేను చదువయ్యాకా ఇంటి నుంచి బయటకు వచ్చి ఒంటరిగా నగరంలో ఉన్న రోజుల్లో, నాతో పాటు సమాంతరంగా ఎదిగివున్న ఆమె ఊహే నా ప్రేయసి అయ్యేది, నన్ను కాపాడేది. నాకు వాస్తవంలో ఆదర్శంగా అనిపించిన భావాలన్నీ కలల్లో ఆమెకు ఆపాదించబడేవి. ఆమె కలలోకి వచ్చాకా నిద్ర లేచిన పగళ్ళు ఎంతో ఉత్తేజంతో జీవితం పట్ల ప్రేమనీ అనురక్తినీ పెంచేవిగా ఉండేవి. నేను కొత్తగా ఎవరితో ప్రేమలో పడినా వాళ్ళల్లో ఎంతో కొంత ఆమెను వెతుక్కున్నాను. ఎంతైనా నా ప్రేమల వరుసలో ఆమె మొదటిది కాబట్టో మరేమో. ఇంతిలా ఉన్నా ఎప్పుడూ ఆమెని వెతికే ప్రయత్నం చేయలేదు. యాదృచ్ఛికాల మీద పెట్టుకున్న నమ్మకమో, నా జీవితానికి శాపమైన ఒళ్ళు బద్దకమో, ఒకవేళ కలిసినా మున్ముందు ఎంతో అందమైన ఆడపిల్లగా ఎదుగుతుందని నాకు కచ్చితంగా తెలిసిన ఆ అమ్మాయి చుట్టూ ముసురుకునే ఎందరో మగాళ్ళ మధ్య చిన్నప్పడు ఒక ప్రేమలేఖ కాని ప్రేమలేఖ ఇచ్చిన ఈ నల్ల పిల్లాడ్ని ఎందుకు గుర్తుంచుకుంటుందిలేమ్మన్న నిరాశో, ‘పదోతరగతి అయ్యాకా పెళ్ళి చేసుకోవడం’ తన లక్ష్యమని అప్పుడే చెప్పిన పిల్లని వెతికి దొరకబుచ్చుకున్నా ఆమె నాది కావటం అసాధ్యమని తెలియటమో… ఇన్ని కలిసి నన్ను మరీ పట్టుబట్టి ఆమెను వెతక్కుండా చేశాయి.

కానీ మళ్ళీ పంతొమ్మిదేళ్ళ తర్వాత ఆమె కలిసింది. అప్పటి నన్ను గుర్తుంచుకుంది, ఇప్పటి నన్ను ఇష్టపడింది. మా పెళ్ళయి మాకు బిడ్డ పుట్టిన నాలుగేళ్ళకి కానీ మా ఇద్దరికీ ఆలమూరు వెళ్ళడం కుదరలేదు.

బైక్ మీద రావులపాలెం గోదారి దాటి, జొన్నాడ దాటి, ఇంకా వున్న ఇటిక బట్టీలు దాటి, జ్ఞాపకం కన్నా ఎంతో ఇరుకనిపించిన ఆలమూరు వీధుల్లోకి వచ్చాం. చిన్నప్పుడు మా ఇంటి నుండి ఎంతో దూరం అనిపించిన చిన్నబడి ఇప్పుడు చప్పున వచ్చేసింది. రావి చెట్టు కొన్ని కొమ్మల్ని కోల్పోయి, విశాలత్వాన్ని కుదించుకున్నట్టు అనిపిస్తూ, ఉండటమైతే ఉంది. పక్కన చిన్నబడి కూడా ఉంది. సాయంత్రం కాబట్టి బడి మూసి ఉంది. కొంతమంది పిల్లలు ఇంకా స్కూలు యూనిఫారాల్లోనే పక్కనున్న ఇసుక గుట్టల్లో ఆడుకుంటున్నారు. బండి ఆపి వల్లీ నేనూ బడిని చూసుకున్నాం. ఇప్పుడు వర్తమానంలో నిజంగా కళ్ళ ముందున్న పరిసరాలకూ, ఇన్నాళ్ళుగా మా మనసులో ఊహలుగా మెదిలిన పరిసరాలకూ పొంతన కుదరటం లేదు. మా మనసులో ఉన్న చిన్నబడి రూపం ఏదో ఒక్కనాటిది కాదు; వేర్వేరు ఋతువుల్లో వేళల్లో, వేర్వేరు మూలల నుంచి కనిపించిన దాని వేర్వేరు వైనాలన్నీ ఒకదానిపై ఒకటిగా పేరుకున్న దృశ్యాల దొంతర– చిన్నప్పుడు పలక మీద ఒకే అక్షరాన్ని పదే పదే ఒరవడి దిద్దితే ఏర్పడే అక్షరాల దొంతర లాంటిది. అది ఇప్పుడు మా కళ్ళ ముందున్న ఈ ఒక్కనాటి వాస్తవాన్ని మించిన వాస్తవం. బడి వరండాకు అప్పటిలాగే కటకటాలు ఉన్నాయి. తలుపులకు మాత్రం రంగు మారింది. చుట్టూ ప్రహరీ గోడ వచ్చి చేరింది. ఆ కట్టడంలో అప్పటిలాగే మిగిలిన కొన్ని భాగాల్ని చూస్తూంటే మనసులో ఏదో మడత విప్పుకుంటోంది, ఏదో జ్ఞాపకం రెక్కలు విదిలించుకుని లేవబోతోంది. అంతలోనే అదే కట్టడంలో మారిపోయిన భాగాలు కంటపడగానే జ్ఞాపకం రెక్కలు తెగి వర్తమానంలోకి వచ్చి పడుతోంది. ఒక పక్కన కాలంలో వెనక్కి కదులుతున్నట్టు ప్రయాణపు కుదుపూ, మరో పక్క అదంతా భ్రమేనని తేలి ఉన్నచోటే తెప్పరిల్లటం… ఇదంతా ఎలా ఉందంటే, మన చుట్టూ మనం గిర్రున బొంగరంలా తిరిగి తిరిగి ఒక్కసారే ఆగితే, అప్పటిదాకా సాగిన చలనానికీ ఉన్నట్టుండి ఈ స్థిరత్వానికీ మధ్య భౌతికమైన సర్దుబాటులో మెదడు ఎలాంటి అయోమయానికి గురవుతుందో, అలాంటి అయోమయమే నా మనసుకు కలుగుతూ చిరాకనిపించింది. శ్రీవల్లి ఫోటోలు తీస్తోంది. ఇసకలో ఆడుకుంటున్న పిల్లలు ఆగి మమ్మల్ని చూస్తున్నారు. బడి ఎదుట ఇళ్ళల్లో పనులు ముగించుకుని కబుర్లు చెప్పుకుంటున్న ఆడవాళ్ళు మా వంక కుతూహలంగా, అనుమానంగా చూస్తున్నారు. తడుముతున్నట్టు ఉన్న వాళ్ళ చూపులూ, ఇక్కడ ఏదీ వెనక్కి తిరిగి రాదని తెలిసిన నిరాశా మమ్మల్ని అక్కడ ఎక్కువ సేపు ఉండనీయలేదు. పరిసరాల మూగతనాన్ని మనసులోనే తిట్టుకుంటూ, “పోదాం పద” అన్నాను. వల్లీ ఈసారి బండెక్కేటప్పుడు రెండు వైపులా కాళ్ళేసి కాక, ఊళ్ళో ఆడవాళ్ళలా రెండు కాళ్ళూ ఒక పక్కకు పెట్టుకుని కూర్చుంది. నెమ్మదిగా వల్లీ పాత ఇంటి మీదుగా పక్కనే శివాలయం వైపు వెళ్ళాం. మంటపం ముందు పిల్లలు క్రికెట్ ఆడుకుంటున్నారు. ఆశ్చర్యంగా చుట్టూ పూలను పారేసుకుని దేవగన్నేరు చెట్టు అలాగే నిలబడి ఉంది. వల్లీ కొన్ని పూలు తలలో తురుముకుంది. గుళ్ళోకి ఎవరో వెళ్ళటం చూసిన పూజారి భార్య లోపలికి వచ్చి వల్లీతో మాట్లాడింది. మెట్టినింట్లో అడుగుపెట్టినప్పటి నుంచీ ఇదే ఊళ్ళో జీవితం గడిపేసిన ఆమెకి- ఇలా జ్ఞాపకాల్ని వెతుక్కుంటూ ఇంకో ఊరికి అది తప్ప మరో పనేం లేకుండా రావటమనేది తన తర్వాతి తరం పిల్లలకు మాత్రమే వీలయ్యే ఒక పాషనబుల్ విషయంగా అనిపిస్తున్నదన్న సంగతి దయగా నవ్వుతోన్న ఆమె ముఖ కవళికే చెబుతోంది.

బండి మీద ఇంకొన్ని వీధులు తిరుగుతూ రథం వీదికి వచ్చాం. నీలా టీచరు ఇంటి మీంచీ వెళ్తుంటే మా ఇద్దరికీ ఆమెని చూడాలనిపించింది. ఇంటి గడపకీ, గేటుకీ మధ్యన బోలెడు దూరంతో, పై అంతస్థుకి పెంకుల కప్పుతో ఆ పెద్ద ఇల్లు ఇంకా అలానే ఉంది. తమ దగ్గర చదువుకున్న పిల్లలు పెద్ద ఉద్యోగాల్లో కుదురుకుంటే సంతోషపడే టీచర్లుంటారు కానీ, చదువుకున్న పిల్లల్లో ఓ ఇద్దరు ఒకర్నొకరు పెళ్ళి చేసుకుంటే సంతోషించే టీచర్లు ఉండరనీ, అదొక తుంటరితనంగా చిరాగ్గా కూడా చూస్తారనీ ఇద్దరికీ తెలుసు. కాబట్టి మా ఇద్దరిలో ఎవరో ఒక్కరే ఆమె దగ్గర చదువుకున్నట్టు చెబుదాం అనుకున్నాం. నువ్వంటే నువ్వనుకుంటూ, ఎవరన్నది తేలకుండానే గేటు తోసుకుంటూ లోపలికి వెళ్లాం. ఎవరో వచ్చారని లోపలివాళ్ళు గ్రహించేంత గట్టిగానే గేటు వేస్తూ చప్పుడు చేసాం. ఇంటి చీకట్ల లోంచి ఎవరో కదిలి రావటం కనిపించింది. నాకు ఒక క్షణం ఇక్కడిదాకా వచ్చాకా ఇక వెనక్కి వెళ్ళలేం అనిపించింది. కానీ బయటకు వచ్చిన మనిషి నీలా టీచరు కాదు. ఆమె బంధువు. నీలా టీచరు ఇప్పుడు ఈ ఇంట్లో ఉంటం లేదనీ, ఊరి చివర కొత్తగా ఇల్లు కట్టుకుని అక్కడకు మారిపోయారనీ చెప్పిందావిడ. మాకు నీలా టీచర్ని తప్పకుండా చూడాలనేం లేదు. మా ఇద్దరిలో ఎవరమూ చిన్నప్పటి టీచర్లని మళ్లా కలిస్తే వాళ్ళు “మేం పాఠాలు చెప్పిన తీరు వల్లే కదా ఇదంతా” అని మురిసిపోయేంత పెద్ద ఉద్యోగాలు చేయటం లేదు. మేం ఆనందంగా ఉన్నాం. కానీ మన జనానికి అది పెద్ద సాధించటం కిందకి రాదు. మళ్ళీ బండెక్కి ఇంకొన్ని వీధులు తిరుగుతుంటే మళ్ళీ అదే భావం– పరిసరాలన్నీ ‘మీరసలు ఎందుకొచ్చారిక్కడికీ’ అని ఇబ్బందిగా, నిరసనగా అడుగుతున్నట్టు.

కాసేపు ఏ లక్ష్యమూ లేకుండా బండి మా ఇద్దర్నీ మోసుకుంటూ, హేండిల్‌బార్ మీద నా చేతులు అప్పుడు పుట్టిన బుద్ధికి ఎటు తిప్పితే అటు తీసుకువెళ్తూ చాలా వీధులు తిరిగాం. సూర్రావు మాస్టారు అద్దెకుండి మాకు ట్యూషన్ చెప్పిన ఇల్లు అలానే ఉంది. స్థలం కొనుక్కునేవాళ్ళు సంప్రదించాల్సిన నంబరు ఆ పెంకుటింటి చూరుకి వేలాడదీసి ఉంది. మరికొన్ని వీధులు తిరిగాకా బండి తెలియకుండానే మమ్మల్ని ఊర్నించి బైటకు పోయే రోడ్డు మీదకు తీసుకు వచ్చింది. చూస్తూ పోతుంటే, అసలు ఊరు కూడా ఊర్నించి బయటకు వచ్చేస్తున్నట్టుంది. ఎందుకంటే, ఊరి లోపల అంతా పాతబడినట్టు ఉంటే, ఊరి చివర మాత్రం వరుసగా కొత్తగా కట్టిన ఇళ్ళు చాలా ఉన్నాయి, అవన్నీ ఊరిని వదిలి ఆ రోడ్డు మీదుగా పోతే వచ్చే మండపేట టౌను వైపుగా బారులు తీరి నడుస్తున్నట్టు.

మేము ఒక సందు మలుపు తిరిగి లోపలకు వెళ్ళాం. నీలా టీచరు కొత్త ఇల్లు మోడ్రన్‌గా ఉంది. పాత ఇంటిలా తరాల్ని చూసిన గంభీరత్వంతో కాక, కోణాలన్నీ చక్కగా తీర్చి, ఏ భాగాలకి నప్పే రంగు ఆ భాగానికి వేసుండి, అక్కడక్కడా అద్దాలతో ఉంది. గేటు తాళం వేసి ఉంది. గేటు గ్రిల్ లోంచి లోపల చిన్న తోట కనిపిస్తోంది. కాసేపు ఊహలో నీలా టీచరు ఆ తోటలో తిరుగుతున్నట్టు ఊహించుకున్నాను. వరండాలో ఖాళీగా ఉన్న కుర్చీలో ఆమె కూర్చున్నట్టు ఊహించుకున్నాను. ఇంతలో ఎవరో అబ్బాయొచ్చి ఇంట్లోవాళ్ళు హైదరాబాద్‌ చుట్టాలింటికి వెళ్లారని చెప్పాడు. వల్లీ ఇంక అక్కడ తనకు ఉండబుద్ధేయటం లేదన్నది. బయల్దేరి వచ్చేశాం.

తర్వాత కొన్ని వారాలకి ఒక రాత్రి నిద్రపట్టకపోతే ఎందుకో మళ్ళీ ఆ రోజు మేమిద్దరం నీలా టీచరు ఇంటికి వెళ్ళిన సన్నివేశం గుర్తుకువచ్చింది. అపుడు నా గురించి నాకు ఓ విషయం ఆశ్చర్యమనిపించింది. ఆ రోజు నీలా టీచరు కోసం వెళ్ళిన రెండు ఇళ్ళల్లోనూ, ఆమె కాసేపట్లో మా ముందుకొస్తుందని ఎదురుచూసిన ఆ కొద్ది క్షణాల్లోనూ, ఆ వచ్చే ఆమె నేను చిన్నప్పుడు ఎలా చూసానో అలాగే ఉంటుందనుకున్నాను. పాతికేళ్ళ తర్వాత- ఆ గిరజాల జుట్టు నెరిసిపోయి, ఆ చర్మం వడలిపోయి, ఆ కళ్ళు అలసిపోయీ, కళ్లజోడుతో ఉన్న మనిషి వచ్చే అవకాశం ఉందని నాకు కనీసం తట్టలేదు కూడా. నేను మళ్ళీ ఆమెను కలిసే ప్రయత్నం చేయకపోతే, ఆమె ఎప్పటికీ అలానే ఉండిపోతుంది. చిన్నబడిని రెండోసారి చూసి అంతకుముందు నా జ్ఞాపకంలో ఉన్న పాత చిన్నబడిని కొంతైనా కల్తీ చేసుకున్నాను. నీలా టీచరు రూపాన్ని కూడా అలా కల్తీ చేసుకోవాలా? ఆ రాత్రే ఆమె గురించి ఏదైనా రాయాలనిపించింది. కానీ ఆమెనీ, నన్నూ కలుపుకొని ఒక కథ అంటూ ఏమీ లేదు. అసలు ఆమె రూపం గురించి తప్ప, అంతరంగం గురించి నాకు ఏమీ తెలీదు. ఆమె కళ్ళ వెనుక, కపాలపు చీకట్లలో ఏం జరిగేది. ఆమె సంతోషం తెలిసిన మనిషేనా, లేక దిగులు మనిషా. గదిలో ఒక్కతే ఉన్నప్పుడు ఆమె ఎక్కడకు ఎగిరిపోవాలని అనుకునేది, అసలు ఆ ధ్యాస ఉండేదా. ఆమె ఎవర్నైనా ప్రేమించిందా, లేక బాబ్జీ/ అబ్బుగారు/ రాంపండుని మినహాయించి మరో తోడు లేని, ఆ నిమిత్తమూ అవసరమూ లేని లోకమా. నిజమైన నీలా టీచర్ గురించి అంచనాలు తప్ప నా దగ్గర ఏదీ లేవు. అంచనాలతో సృష్టించే కల్పన నిజమైన నీలా టీచర్‌ని కల్తీ చేస్తుంది. ఆమె కథేమీ నా దగ్గర లేకుండా ఆమె గురించి కథ ఎలా చెప్పటం…

Published in : vaakili.com, may 2017 issue. 

Art work by : B. Kiran Kumari 

April 24, 2017

తర్వాతి రోజుల్లో ఒక రోజు

“ఇలా అంటున్నానని కాదు. ఇన్నాళ్లు వెంటపడ్డావు. కాల్సూ, చాటింగ్, మెసేజెస్, మెయిల్స్... దక్కించుకునేదాకా ఒంటికాలి మీదున్నట్టు బిహేవ్ చేశావు. కానీ ఇప్పుడు కలిసాకా నీకసలు నా మీద అంత కోరిక కూడా ఉన్నట్టు అనిపించట్లేదు. రెండోసారికే చేతులెత్తేసావ్,” అన్నది తను. మంచం మీంచి వంగి కింద పడిన నైటీ అందుకుని రొమ్ముల మీంచి అడ్డంగా వెనక్కి కప్పుకుంది.

నేను ఒళ్ళోకి చూసుకున్నాను. అసలు విషయం చల్లగా ముడుచుకుపోయి ఉంది. ఫాను గాలికి తడారి పొరలు కడుతోంది.

అందివచ్చిన అబద్ధం... “ఫెర్మార్మెన్స్ ఏంగ్జయిటీ ఏమో”

ఆమె లాడ్జి గదిని చిరాగ్గా చూస్తోంది. “ఐ హేట్ దిస్ ప్లేస్!”

చుట్టూ చూసాను ఆమె కళ్లతో. “మళ్ళీసారికి మంచి ప్లేస్ చూద్దాంలే.”

“ఇంతకన్నా మంచి ప్లేసుకి డబ్బులు పెట్టే సీన్ నీకుందనుకోవటం లేదు. అయినా మళ్ళీ వస్తాననే అనుకుంటున్నావా?”

“ప్లీజ్! ఈసారి ఇలా అవదులే. ఎందుకో ఇవాళ మనసు బాలేదు.”

లేచి బాత్రూమ్ వైపు వెళ్ళింది. తలుపు సన్నగా జారేసింది. నీటి చప్పుడు. ఆమె తలుపు గెడ వేస్కోపోవటం నాకు నచ్చింది. అంత దగ్గరైనట్టు.

అడ్డంగా చుట్టుకున్న నైటీతోనే బైటికి వచ్చింది. వెళ్ళి సింక్ అద్దం ముందు నిలబడింది, వీపు నా వైపు పెట్టి. అద్దంలోకి చూస్తూ జుట్టు సరి చేసుకుంటోంది.

“నేను ఇప్పుడు కాపోతే ఒకప్పుడైనా అందగత్తెనే. నా వంకా, నా వొంటి వంకా కోరికగా చూసే కళ్లు ఎలా ఉంటాయో నాకు తెలుసు. కళ్ళు అబద్ధం చెప్పవు... యు హేట్ మై బాడీ!”

నైటీ ఆమెను పిర్రల దాకానే కవర్ చేసింది. కొవ్వు నిలవై సొట్టలుపడిన తొడలు. గంట క్రితం మొదటిసారి చూసిన తన పొట్ట గుర్తొచ్చింది. స్ట్రెచ్ మార్కులతో కొద్దిగా కిందకి జారి...

“ఛా! అదేం లేదు. ఐ లవ్ యువర్ బాడీ.”

తను అద్దంలోంచే నా వైపు చూసి అవునా అన్నట్టు వెటకారంగా నవ్వింది. “దెన్ యు రియల్లీ ఆర్ ఎ పాథెటిక్ పెర్ఫామర్. ఎందుకంటే నాకు ఏం తీరలేదు. పిచ్చ పిచ్చగా ఉంది.”

నాకు కోపం వచ్చింది. ప్రతీకారంగా “నిజమే, నీ వొళ్ళు నాకు నచ్చలేదు,” అని ఒప్పేసుకోవాలనిపించింది. “నీ వొళ్ళు చీరల్లో, చుడీదార్లలో నన్ను చీట్ చేసింది” అని అవమానించాలనిపించింది. కానీ ఆమె తీరులో ఆమె వొంటి కన్నా ఎక్కువ ఏదో ఉంది. ఉన్నదో, నేను కల్పించుకున్నదో. అది ఇంకా కరగలేదు. దూరం చేసుకోవాలని లేదు.

తలగడని మంచం చెక్కకి నిలువుగా ఆన్చి, జారబడ్డాను. కోపాన్ని అణిచేసిన తియ్యటి గొంతుతో “ఇలా రా” అన్నాను, రొమాంటిక్‌గా చేతులు చాపుతూ.

తను నా వైపూ, నా చేతుల వైపూ ఏ భావం లేకుండా చూసింది. తనలో తను ఏదో ఆలోచించుకుంటున్నట్టు కిందికి చూసింది. తర్వాత నెమ్మదిగా కదిలి మంచం వైపు వచ్చింది.

మంచం దగ్గర నిలబడి, నైటీని నేల మీదికి వదిలేసింది.

అప్రయత్నంగా ఆమె పొత్తి కడుపు వైపు జారబోయిన నా చూపును తను పసిగట్టిందని గ్రహించి, వెంటనే తన రొమ్ముల వైపూ, ముఖం వైపూ చూసాను. “రా,” అన్నాను.

“నేను నచ్చానా?” అంది.

తన పొత్తి కడుపు వైపు చూడకుండా నిగ్రహించుకున్నాను.

ఆమె ఇందాకటి లాగే మంచం అంచున కూర్చుంది. నిట్టూర్చింది. మాట్లాడింది. “నేను లాబ్‌కి సెలవు పెట్టి, టికెట్లు బుక్ చేసుకుని, అబద్ధాలాడి ఒక్కత్తినే ట్రైన్ ఎక్కి, తెలిసిన వాళ్ళెవరూ లేని ఈ చెత్త ఊళ్ళో దిగి, నువ్వేదో ఇలాంటి చచ్చు ప్లేసు బుక్ చేస్తే వచ్చి, ఇక్కడ అందరూ చూసే చెత్త చూపుల్ని భరించీ... ఇదంతా ఎందుకంటే... కాస్త ప్రేమగా దగ్గరకు తీసుకుంటావని. నువ్వు ముందే ‘ఒసే బట్టల్లేకుండా కూడా రెండు మూడు ఫోటోలు పంపూ’ అనుంటే సరేనని పంపేదాన్ని--”

“ప్చ్...”

“లేదు లేదు... లెట్స్ బీ ఫ్రాంక్. మగాళ్ల చూపులు తెలుస్తాయి. అంతేకాదు, నిన్నూ పంపమనే దాన్ని. ఎందుకంటే, బట్టల్లేకుండా చూస్తే నువ్వు బాతులా ఉన్నావు. పైగా నీ సరంజామా...” (నా గజ్జల్లోకి వేలు పెట్టి చూపించింది) “...అంత చిన్నది ఉంటుందనుకోలేదు.”

“మూస్తావా...”

“చెప్పనీ. నీ కళ్ళు చాలా మాట్లాడతాయి. మేం నోటితోనే మాట్లాడాలి. యు నో... నేను ఒక మనిషితో పదిహేనేళ్ళు ఉన్నాను. ఎప్పుడూ హేపీగా లేను. ఐ యామ్ ఎ ఫైర్ దట్స్ నెవర్ బీన్ పుట్ అవుట్.”

ఆమె ఫేస్‌బుక్ లో పోస్ట్ చేసే ప్రేమ కవితల్లాంటివి గుర్తొచ్చాయి. రాసేది ఇంగ్లీషులో కాబట్టి చెవికి అలవాటు కాని పదాలనే ఒక్క కారణంతో బాగున్నాయేమో అనిపించేవి. అవెప్పుడూ పెద్ద విషయం కాదు. కానీ ఆమె మత్తు కళ్ళు, చంపే నవ్వు, చెంపల నూగు... వాటికి కొనసాగింపుగా చీర లోపల అంతా ఎంత నున్నగా ఊహించుకున్నానో... నిన్నటిదాకా... ఫోన్లో నా గ్రహణేంద్రియాన్ని మత్తు జీరతో తడిమే ఒక గొంతుగా మాత్రమే ఉన్నప్పుడు...

“సో... అదీ సంగతి. నువ్వూ ఏం మన్మధుడివి కాదు. ఇదేదో సాగాలంటే మనిద్దరం ఆ మాత్రం ఫెయిర్‌గా ఉంటం మంచిది” కళ్ళెగరేస్తూ నా వైపు చూసింది, నీ వంతు అన్నట్టు. ముఖంలో చీలితనం...

నాకు నవ్వొచ్చింది. పక్క మీద నా వేళ్ళు కాళ్ళలా నటిస్తూ నడిచాయి. ఆమె చేతిని పట్టి లాగాయి. నా నవ్వు అర్థం కానట్టు చూస్తోంది. కాళ్ళు మంచం మీదకు తెచ్చి నా వైపుకు జరిగింది. తన నడుం చుట్టూ చేతులు వేసి ఒడిలో కూర్చోబెట్టుకున్నాను. నా భార్య గుర్తొచ్చింది, బెడ్‌రూంలో. ఈనుప్పుల్లలాగా సన్నగా... అది సన్నం కూడా కాదు, ఎండుకట్టెలాంటి బక్కతనం. వెనక్కి తిరిగి నిల్చుంటే పిర్రలు పక్కల నుంచి బాగా నొక్కుకుపోయి. మా ఊరి కాలవలో బట్టలిప్పుకు దిగి స్నానం చేసే పిచ్చి ముసలాయన గుర్తుకొస్తాడు.

ఈమె నా ఒళ్ళో కూర్చొని మెడ చుట్టూ చేతులు వేసి కళ్ళల్లోకి చూస్తోంది, “నన్నెవరన్నా చులకన చేస్తున్నారనిపిస్తే, వాళ్ళకా ఛాన్సివ్వకుండానే ఎక్కడుంచాలో అక్కడుంచుతా. అదో డిఫెన్సివ్ మెకానిజం అనుకో” అంటూ నా ముక్కుని తన ముక్కుతో కొట్టింది. ఏమంటావ్ అన్నట్టు కళ్ళెగరేస్తూ తల వెనక్కి వంచి చూసింది.

ఆమె మత్తు కళ్ళు...

ఒత్తయిన పిర్రల కింద నలుగుతోన్న నాలో కదలిక మొదలైంది.

కరెంట్ పోయి ఫేన్ ఆగి నాకు మెలకువ వచ్చేసరికి తను నిద్రపోతోంది. గదిలోకి వెలుగు రానిస్తున్న ఒకేవొక్క కిటికీ వైపు నడిచాను, అద్దంలో తారసిల్లిన నడివయసు గరుకు ముఖాన్ని దాటుకొంటూ.

రెండో అంతస్తు కిటికీ నుంచి కింద సాయంత్రపు ట్రాఫిక్ కదులుతూ కనిపిస్తోంది. ఎదుటి ఫ్లైవోవర్ మీద చివరి ఎండ పడుతోంది. ఎవరో చల్లుతోన్న గింజల కోసం చాలా పావురాళ్ళు అటూయిటూ ఎగురుతున్నాయి. వాటిని చూస్తూ, కాలేజీ రోజుల్లో నేను సైకిల్ మీద అటుగా వెళ్ళే సమయానికే పూలు కోసుకునే నెపంతో గుమ్మంలోకి వచ్చే ఒక అమ్మాయి ముఖాన్ని తల్చుకుంటూ, సిగరెట్ కాల్చుకున్నాను.
*