ఇసయా బెర్లిన్ అని బ్రిటిష్ తత్త్వవేత్త చరిత్ర పట్ల టాల్‌స్టాయ్ దృక్పథాన్ని చర్చిస్తూ ‘ద హెడ్జిహాగ్ అండ్ ద ఫాక్స్’ అనే పెద్ద వ్యాసం రాశాడు. వ్యాసం మొదట్లో ఆయన రచయితలందర్నీ ముళ్ళపందులనీ (హెడ్జ్‌హాగ్), గుంటనక్కలనీ (ఫాక్స్) ఒక సరదా పోలికతో విడదీస్తాడు (తెలుగులో ఇలా అంటే తిట్టినట్టే ఉంది). ఈ వ్యాసాన్నీ, నామిని కైగట్టినకథల్నీ ఒకేసారి చదువుతోంటే నామిని ఈ రెండింట్లో ఏ విభాగానికి చెందుతాడో అన్న ఆలోచన వచ్చింది. ఇసయా బెర్లిన్ ఈ పోలిక తేవటానికి ఒక ప్రాచీన గ్రీకు కవి రాసిన వాక్యం ఆధారం, అది: “గుంటనక్కకి చాలా విషయాలు తెలుసు, కానీ ముళ్ళపందికి ఒకేవొక్క పెద్ద విషయం తెలుసు” అన్నది (The fox knows many things, but the hedgehog knows one big thing). ఈ వాక్యానికి ప్రచారంలో ఉన్న అర్థం ఏమిటంటే- శత్రువు నుంచి కాపాడుకోవటానికి గుంటనక్కకు చాలా ఉపాయాలు తెలుసు, కానీ ముళ్ళపందికి తెలిసిన ఒక్క పెద్ద విషయం ముందు (చూట్టానికి ముళ్ళపొద అన్న భ్రమ కలిగించేట్టు లుంగ చుట్టుకుపోవటం) నక్కకి తెలిసిన అన్ని ఉపాయాలూ బలాదూరే అని. అయితే ఇసయా బెర్లిన్ దీన్ని రచయితలకు అన్వయించిన అర్థం వేరేలా ఉంటుంది. కొంతమంది రచయితలు ప్రపంచాన్ని పరస్పరం సంబంధంలేని, ఏ ఒక్క సూత్రానికీ లొంగని వైవిధ్యమైన అంశాలతో నిండినదిగా చూస్తారు. ప్రపంచంలోని అన్ని విషయాల్నీ వ్యాఖ్యానించగల ఒకే సిద్ధాంతం గానీ, అన్నిటిలోనూ అర్థం చూపగల ఏకైక దృక్పథం గానీ సాధ్యమని వీరు అనుకోరు. వీరి రచనల్లోంచి తీసుకోగల ఏకైక అంతస్సూత్రమంటూ ఏదీ ఉండదు. ఇసయా బెర్లిన్ వీరిని గుంటనక్కలు అంటాడు. షేక్‌స్పియర్, అరిస్టాటిల్, మాంటైన్, గోథె, పుష్కిన్, బాల్జాక్, జేమ్స్ జాయ్స్ వీరంతా ఈ రకానికి చెందుతారు. మరికొంతమంది రచయితలు ప్రపంచంలోని ప్రతి అంశాన్ని తమదైన ఒకేవొక్క దృక్పథంలోనికి తర్జుమా చేసుకుంటారు. ఆ దృక్పథాన్ని కొలమానంగా చేసుకుని ప్రపంచంలో అన్ని విషయాల్నీ అర్థం చేసుకుంటారు, బేరీజు వేస్తారు, విలువ కడతారు. డాంటే, ప్లేటో, హెగెల్, దాస్తోయెవ్‌స్కీ, నీషే, ఇబ్సెన్, ప్రూస్ట్ ఈ కోవకు చెందినవారంటూ వీరిని ముళ్ళపందుల విభాగంలో చేరుస్తాడు బెర్లిన్. నా అభిప్రాయం ప్రకారం నామిని కూడా ఈ కోవకే చెందుతాడు.
నామినికి తెలిసిన “ఒకేవొక్క పెద్ద విషయం” ఊరు. తమ చిన్నప్పటి పల్లెటూరు అదే ఆరోగ్యంతో ఉండాలంటే మనుషుల్లో ఏ విలువలు అవసరమో ఆ విలువలనే కొలమానంగా చేసుకొని నామిని రచయితగా ప్రపంచంలోని ప్రతి అంశాన్నీ బేరీజు వేస్తాడు. ఈ విలువల ఆధారంగా జరిగిన ఎంపికలు నామిని కైగట్టిన కథల్లో ఇదివరకటికన్నా స్పష్టంగా కనిపిస్తాయి (నామిని నవల ‘మూలింటామె’ రెండో భాగంలో కూడా). ఎక్కువ కథల్లో నామిని ఉద్దేశం పల్లెటూరిలో ప్రవేశిస్తున్న అనారోగ్యకరమైన నాగరిక లౌల్యాల్ని చూపెట్టటమనీ, వాటికి లొంగిపోయిన, లేదా లొంగకుండా నిలదొక్కుకున్న ఊరివాళ్ళను పాత్రలుగా చిత్రించటమనీ స్పష్టంగా తెలిసిపోతుంది. ఊళ్ళోకి రియలెస్టేటు చొరబడటం; ఊళ్ళోంచి చెట్టూచేమా మాయమవటం; చద్దికూడు పోయి ఇడ్లీదోసెలూ, మట్టి రోడ్లు పోయి సిమెంటు రోడ్లూ, వాటి మీదకు ఇన్నోవాలు, ఉత్తరేణి పుల్ల పోయి పెప్సొడెంట్ టూత్ పేస్టూ, కట్టెపొయ్యె పోయి గ్యాస్ స్టవ్వూ రావటం; ఇక్కడి జీవన రీతులపై శ్రీచైతన్య నారాయణాల నుంచి బీటీ వంకాయల దాకా చేస్తున్న ప్రచ్ఛన్న దాడి... ఇలాంటి వివరాలు ఒక్కోసారి కథల ఇతివృత్తాలు గానూ, ఒక్కోసారి ఇతివృత్తాలకు నేపథ్యంలోనూ మసలుతూ నామిని ఉద్దేశానికి సాయపడతాయి. ఈ కైగట్టిన కథల్లోని ప్రపంచాలు చాలావరకు నామిని విలువల కొలమానానికి అనుకూలంగానో, ప్రతికూలంగానో మాత్రమే వ్యక్తమవుతాయి. అయితే నామిని ఇలా ఒక హెడ్జిహాగ్ లాగా గాక, ఫాక్స్ లాగా రాసిన కథలు కూడా ఈ పుస్తకంలో కొన్ని ఉన్నాయి: ‘అకా, కేక కా!’, ‘దేముడి పాది’, ‘కడుప్మంట్ బొయ్ నవ్వొచ్చే ట్రాపిక్కు’ ఇలాగ. ఈ కథల్లోని ప్రపంచాల వెనుక నామిని విలువల కొలబద్ద కనిపించదు. వీటి ద్వారా ఏమీ చెప్పాలనుకోడు. అర్థం కాకుండా, అర్థం లేకుండా ప్రపంచం ఊరకనే చేసే అలవిమాలిన నృత్యానికి తన పుస్తకం పేజీల్ని వేదికగా అరువిస్తాడు. ఒక పాఠకుడిగా నేను రచయితల్లో హెడ్జిహాగ్‌లకన్నా, ఫాక్సుల వైపే మొగ్గు చూపుతాను. నామిని హెడ్జిహాగ్ గుణాన్ని పక్కనపెట్టి రాసిన ఇలాంటి కథలే ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చాయి. తినటానికి సూపర్ మార్కెట్ వొంకాయల కూర వద్దని దేదారాకు వండమనే గుడాయన్లూ, దీపం పథకం కింద గ్యాస్ స్టవ్వు తీస్కొనే వీలున్నా కట్టెల పొయ్యినే వాడే యిరపచ్చమ్మల కన్నా, మొగుడు చనిపోయిన నాలుగో రోజుకి తిరుపతి పోయి ఫుడ్‌కోర్ట్ పెట్టుకున్న తాటాకామె, అత్తారింట్లో కూతురి బాధలు చూళ్ళేక గృహహింస కేసు పెట్టిస్తానని బెదిరించే అంజేరి నాకు నచ్చారు. ఎందుకంటే గుడాయన నామిని విలువల ప్రతినిధి. తాటాకామె ఆ విలువల బరువు మోయటం లేదు. ఆమె ఏంటో బహుశా నామినికి కూడా తెలీదు.
(‘కొళ్ళో జగ! – నామిని కైగట్టిన కతలు’ పుస్తకం మీద సమీక్ష)
0 comments:
మీ మాట...