October 15, 2018

'ల్యోంపా' - యూరీ ఓలేషా

అలెగ్జాండర్ అన్న పిల్లాడు వంటగదిలో కలప చెక్కుతున్నాడు. అతని వేళ్ళ మీద దెబ్బలు ఊరించే బంగారు రంగులో పొరలుకట్టి ఉన్నాయి. వంటింటి గుమ్మం పెరట్లోకి తెరుచుకొని వుంది [1]; ఇది ఎండాకాలం, తలుపులు ఎప్పుడో తప్ప మూయరు. గుమ్మం దగ్గర గడ్డి మొలిచింది. నాపరాళ్లు నీళ్లు ఒలికి మెరుస్తున్నాయి. ఒక ఎలుక చెత్తకుండీలో తిరుగుతోంది. వంటింట్లో సన్నగా తరిగిన బంగాళదుంపలు వేగుతున్నాయి. కిరోసిన్ పొయ్యి వెలిగించగానే నారింజ రంగు మంట గొప్పగా విరబూసి పైకప్పు దాకా లేచింది. తర్వాత అణకువైన చిన్న నీలం మంటగా సర్దుకుంది. ఉడుకుతున్న నీళ్ళలో గుడ్లు గెంతుతున్నాయి. ఇంకొకతను పీతలు వండుకుంటున్నాడు. కదుల్తున్న పీతని రెండు వేళ్ళతో నడుం దగ్గర పట్టుకుంటున్నాడు. ఆ పీతలు పచ్చగా తూముపైపుల రంగులో ఉన్నాయి. ఉన్నట్టుండి కుళాయి లోంచి రెండు మూడు చుక్కలు తన్నుకొచ్చాయి. కుళాయి పద్ధతిగా ముక్కు చీదుకుంది. తర్వాత పైఅంతస్తులో నీటి గొట్టాలు రకరకాల గొంతులతో మాట్లాడుకున్నాయి. త్వరగా సాయంత్రమయ్యింది. కిటికీలో ఉన్న స్టీలుగ్లాసు మాత్రం గేటులోంచి పడుతున్న ఆఖరు సూర్య కిరణాలకి మెరుస్తోంది. కుళాయి ఇంకా ఏదో మాట్లాడుతూనే ఉంది. పొయ్యి చుట్టూ రకరకాల చప్పుళ్ళు.

సాయంకాంతి రమ్యంగా ఉంది. ఎవరో పొద్దుతిరుగుడు విత్తనాలు తింటున్నారు, పాటలు పాడుతున్నారు. గదుల్లోంచి వీధిలోకి పడుతున్న పసుపురంగు కాంతిలో ఒక తోపుడు బండి వెలుగుతోంది.

వంటింటిని ఆనుకొన్న గదిలో బాగా జబ్బు చేసి పడుకుని ఉన్నాడు పొనోమరేవ్. ఆ గదిలో అతనొక్కడే ఉన్నాడు, కొవ్వొత్తి వెలుగుతోంది, తల దగ్గర మందుల సీసా ఉంది, దానికి మందుల చీటీ వేలాడుతోంది.

పలకరించటానికి వచ్చిన స్నేహితులతో పొనోమరేవ్: “కంగ్రాట్స్ చెప్పండి, చనిపోతున్నాను,” అనేవాడు.

ఆ సాయంత్రానికి అతనిలో భ్రాంతి మొదలైంది. మందులసీసా అతని వంకే చూస్తోంది. దానికి వేలాడుతున్న మందుల చీటీ పొడవాటి చీరకొంగులా ఉంది. మందులసీసా పెళ్ళికి ముస్తాబయిన యువరాణి. సీసా మీద పేరు పొడుగ్గా ఉంది. రోగి కలవరిస్తున్నాడు. ఏదో ఉద్గ్రంథం రాయాలని కాబోలు. దుప్పటితో మాట్లాడుతున్నాడు.

“సిగ్గులేదు నీకూ?’’ గొణిగాడు.

దుప్పటి అతని పక్కనే కూర్చుంటుంది, పడుకుంటుంది, అప్పుడప్పుడూ బైటికి వెళ్తుంది, కబుర్లు మోసుకొస్తుంది.

అతని చుట్టూ అతనికంటూ మిగిలినవి కొన్ని వస్తువులే: మందుసీసా, స్పూను, లైటు, వాల్‌పేపరు. మిగతావన్నీ అతడ్ని వదిలి వెళిపోయాయి. తన జబ్బు ప్రాణాంతకమైనదని అతనికి ఎప్పుడైతే అర్థమైందో, అప్పుడే ఈ వస్తు ప్రపంచం ఎంత పెద్దదో, అందులో తనకు వాటాగా మిగిలింది ఎంత చిన్న భాగమో అర్థమైంది. రోజురోజుకూ వస్తువులు అతన్నించి జారుకుంటున్నాయి. రైలు టిక్కెట్టు లాంటి మామూలు వస్తువు కూడా ఇప్పుడు దొరకనిదైపోయింది. మొదట్లో, అతనికి దూరంగా అంచుల్లో ఉన్న వస్తువులు తరిగిపోయాయి. క్రమంగా ఈ తరుగుదల వేగం పుంజుకొని, అతనికి వైపు, అతని మనసులోకి రావటం మొదలైంది–– పెరట్లోంచి ఇంట్లోకి, ఇంట్లోంచి వరండాలోకి, వరండాలోంచి అతని గదిలోకి.

రోగికి మొదట్లో ఈ అదృశ్యమవుతున్న విషయాలు పెద్ద బాధేమీ కలిగించలేదు.
అమెరికాలాంటి వెళ్ళాలని ఆశపడ్డ దేశాలు మాయమయ్యాయి, అందగాడో డబ్బున్నవాడో అయ్యే అవకాశం మాయమైంది, కుటుంబ సౌఖ్యం మాయమైంది (అతను ఒంటరివాడు)… అయితే ఇవి మాయమవటానికీ అతని జబ్బుకీ ఏ సంబంధమూ లేదు. వయసు మీద పడేకొద్దీ వాటంతటవి దూరమైపోయాయి. అలాగాక, అతని వెంట అడుగులో అడుగేస్తూ వచ్చినవి కూడా దూరమవుతున్నాయని తెలిసాకా- అప్పుడు మొదలైంది అసలు బాధ. ఒకేఒక్కరోజులో వీధి, ఉద్యోగం, ఉత్తరాలు, గుర్రాలు అతడ్ని వదిలేసి వెళ్ళిపోయాయి. తర్వాత ఈ అదృశ్యమవటం కళ్ళుతిరిగే వేగాన్నందుకుంది, దరిదాపుల్లో ఉన్నవి కూడా అదృశ్యమైపోతున్నాయి: ఇప్పటికే వరండా కనిపించకుండా పోయి చాన్నాళ్లయింది; చివరికి సొంత గదిలో, అతని కళ్ళ ముందే, అతని కోటూ, గది గొళ్ళెమూ, చెప్పులూ పనికిరానివైపోయాయి. చావు తనవైపు నడిచి వస్తూ దారిలో ఎదురైన అన్నింటినీ నాశనం చేస్తోందని అతనికి తెలుస్తోంది. ఈ అనంత వస్తు ప్రపంచంలో చావు అతని కోసం మిగిల్చింది కొన్నింటినే. అవి కూడా ఎలాంటివంటే, అతనిలో ఏమాత్రం శక్తి మిగిలివున్నా వాటిని చేరనిచ్చేవాడు కాదు. ఉచ్చపోసుకునే గిన్నె వచ్చింది కొత్తగా. చిరాకుపుట్టించే పరిచయస్తుల చూపులు, పరామర్శలు మొదలయ్యాయి. తను అడగనివీ ఆశించనివీ తనపై చేస్తున్న ఈ దాడిని ఇక నిలువరించలేడని అర్థమైంది. ఇప్పుడు వాటి నుంచి తప్పించుకునే వీల్లేదు. అతనికి ఎంచుకునే స్వేచ్ఛపోయింది.

బయట అలెగ్జాండర్‌ అన్న పిల్లాడు బొమ్మ విమానం తయారు చేస్తున్నాడు.
ఆ పిల్లాడు చుట్టూవున్న వాళ్ళ ఊహకందనంత గంభీరమైనవాడు, లోతైనవాడు. బొమ్మ తయారీలో వాడి వేళ్ళకి దెబ్బలు తగులుతున్నాయి, రక్తం కారుతోంది, చెక్క పొట్టు నేలంతా పడుతోంది, జిగురు మరకలు అంటుతున్నాయి, అందర్నీ సిల్కు పీలికల కోసం బతిమాలుతున్నాడు, ఏడుస్తున్నాడు, దెబ్బలు తింటున్నాడు. పెద్దవాళ్ళు మాకు మేమే కరెక్టనుకుంటారు. ఆ పిల్లాడు మాత్రం పెద్దవాళ్ళ కన్నా హుందాగా ఉంటాడు. పెద్దవాళ్ళలో ఏకొద్దిమందో తప్ప అంత పద్ధతిగా ఆలోచించరు. ఆ బొమ్మ విమానాన్ని ఒక బ్లూప్రింట్‌ ప్రకారం తయారు చేస్తున్నాడు, లెక్కలు కడుతున్నాడు––అతనికి భౌతికశాస్త్ర నియమాలు తెలుసు. పెద్దవాళ్ళు తిట్టినప్పుడు వాళ్ళకి భౌతికశాస్త్ర నియమాల గురించి చెప్పొచ్చు, ప్రయోగాత్మకంగా నిరూపించవచ్చు, కానీ ఏమీ మాట్లాడేవాడు కాదు, పెద్దవాళ్ళ కన్నా ఎక్కువ తెలిసినట్టు ఉండటం ఎందుకో తప్పనిపించేది.
ఆ పిల్లాడి చుట్టూ రబ్బరు బాండ్లు, వైరు ముక్కలు, చెక్కపేళ్ళు, సిల్కు పీలికలు, జిగురు వాసన ఆవరించి ఉన్నాయి. ఆకాశం మెరుస్తోంది. నాపరాళ్ళ మీద పురుగులు మెల్లగా పాకుతున్నాయి. ఒక నాపరాయిలో చిన్న నత్తగుల్ల శాశ్వతంగా ఇరుక్కుపోయి వుంది.

ఈ పిల్లాడు పనిలో ఉండగా ఇంకో పిల్లాడు దగ్గరకి వచ్చాడు. వాడిది మరీ చంటి వయస్సు, వొంటి మీద నీలం చెడ్డీ తప్పితే గుడ్డపీలిక లేదు. అన్నీ ముట్టుకుంటున్నాడు, పనికి అడ్డం వస్తున్నాడు. వాడు దగ్గరకు వచ్చినప్పుడల్లా అలెగ్జాండర్‌ లేచి తరిమేస్తున్నాడు. రబ్బరు బొమ్మలా ఉన్న ఈ చంటిపిల్లాడు వొంటి మీద గుడ్డల్లేకుండానే ఇల్లంతా కలదిరుగుతున్నాడు. ఒక సైకిల్‌ ఉన్న వరండాలోకి వచ్చాడు. (సైకిలు ఒక పెడల్‌తో గోడకి ఆనుకొని వుంది, ఆ పెడల్‌ వల్ల వాల్‌పేపర్‌ చిరుగుతోంది, సైకిల్‌ ఆ చిరుగుని పట్టుకొని వేలాడుతున్నట్టు ఉంది).

ఈ చంటిపిల్లాడు పొనోమరేవ్‌ గదిలోకి వచ్చాడు. వాడి బుర్ర మంచం అంచుల చుట్టూ బంతిలా గెంతుతోంది. జబ్బు మనిషి కణతలు పాలిపోయి ఉన్నాయి, గుడ్డివాడి కణతల్లాగ. పిల్లాడు దగ్గరగా వచ్చి పొనోమరేవ్‌ ముఖాన్ని పరీక్షగా చూశాడు. ప్రపంచం ఎప్పుడూ ఇలాగే ఉంటుందని అనుకున్నాడు: ఎప్పుడూ ఒక గదిలో మంచం మీద ఇలా ఒక గడ్డం మనిషి పడుకునే ఉంటాడనుకున్నాడు. ఆ పిల్లాడు ఇప్పుడిప్పుడే వస్తువుల్ని గుర్తుపడుతున్నాడు; వస్తువుల ఉనికిలో కాలమనే అంశ కూడా ఉంటుందని వాడికి తెలీదు.

మంచం దగ్గరనుంచి కదిలాడు. గదిలో తిరగటం మొదలుపెట్టాడు. చెక్కపలకల నేలనీ, పలకల మధ్య దుమ్మునీ, గోడ మీద పగుళ్ళనీ చూసాడు. పిల్లాడి కళ్ళ ముందు కొన్ని గీతలు కలుస్తున్నాయి, విడిపోతున్నాయి. వస్తువులు ఏర్పడుతున్నాయి. ఉన్నట్టుండి ఏదో మెరిసింది, పిల్లాడు చప్పున అటు తిరిగాడు, కానీ అలా తిరగటం వల్ల దూరం మారి మెరిసిన కాంతి కనపడలేదు. పిల్లాడు ఆ కాంతి కోసం పైకీ కిందకీ చూశాడు, ఫైర్‌ప్లేస్‌ వెనకాల వెతికాడు. చివరకు అయోమయంగా భుజాలెగరేసి వెతకటం మానేశాడు. వాడి కోసం ప్రతిక్షణం ఒక కొత్త వస్తువు పుట్టుకొస్తోంది. సాలీడు ఒక అద్భుతంలా అనిపించింది. కానీ చేత్తో తాకాలన్న ఆలోచనకే అది పారిపోయింది.
జబ్బు మనిషి నుంచి పారిపోతున్న వస్తువులు అతనికి తమ పేర్లను మాత్రమే విడిచిపెడుతున్నాయి.

బయటి ప్రపంచంలో ఒక ఆపిల్‌ పండు ఉంది. అది పచ్చటి గుబుర్ల మధ్య నిగనిగలాడుతోంది, గుండ్రంగా తిరుగుతోంది, తనతోపాటు కొన్ని పగటి దృశ్యాల్ని లాక్కొని తిప్పుతోంది, తోట పచ్చదనాన్నీ, ఒక కిటికీ చట్రాన్నీ. ఆ ఆపిల్‌ పండు కోసమే ఎదురుచూస్తోంది- చెట్టు కింద, నల్లటి నేల మీద, ఎగుడు దిగుడు గుంతల్లోంచి భూమ్యాకర్షణశక్తి. గుంతల్లో పూసల బారుల్లా చీమలు కదులుతున్నాయి. తోటలో న్యూటన్‌ కూర్చొని ఉన్నాడు. ఆ ఆపిల్‌ ముందు ఎన్నో భవిష్యత్తులు చీలి ఉన్నాయి. కానీ అవేవీ పొనోమరేవ్‌ దాకా రావు. అతనికి ఆపిల్‌ అంటే ఒక భావంగా మాత్రమే మిగిలింది. ఒక వస్తువులో పదార్థమంతా పోయి భావం మాత్రమే మిగలటం అతన్ని బాధిస్తోంది.
అతను ఆలోచిస్తున్నాడు: “బయటి ప్రపంచం అంటూ ఏదీ లేదనుకున్నాను. నా కళ్ళు, చెవులే వస్తు ప్రపంచాన్ని సృష్టిస్తున్నాయనుకున్నాను. నేననేవాడ్ని ఉండటం మానేశాకా ప్రపంచం కూడా ఉండటం మానేస్తుందనుకున్నాను. కానీ… ఇప్పుడు బతికున్న నన్ను విడిచిపెట్టి అన్నీ వెళ్ళిపోతున్నాయి. నేనింకా ఉన్నాను కదా! మరి వస్తువులెందుకు ఉండటం లేదు? వాటన్నింటికీ రూపమూ, బరువూ, రంగూ ఇచ్చేది నా మెదడే అనుకున్నాను. ఇప్పుడు అవి నన్ను వదిలి వెళ్ళిపోయాయి. కేవలం వాటి పేర్లే––సారంలేని, వ్యర్థమైన పేర్లు మాత్రమే––నా మెదడులో తిరుగుతున్నాయి. ఏం చేసుకోను ఆ పేర్లని?’’

పొనొమరేవ్‌ చంటిపిల్లాడి వైపు బెంగగా చూసాడు. వాడు అటూయిటూ నడుస్తున్నాడు. వస్తువులన్నీ వాడి వైపు ఆత్రంగా కదులుతున్నాయి. వాటి పేర్లేమీ తెలియకుండానే వాటి వంక చూసి నవ్వుతున్నాడు. వాడు బయటకు వెళితే, వెనక వస్తువులన్నీ కేరింతలు కొడుతూ ఊరేగింపుగా బయల్దేరాయి.

ఆ జబ్బు మనిషి పిల్లాడు వెళ్ళిన వైపు గట్టిగా అన్నాడు: ‘‘రేయ్‌… పిల్లాడా నీకు తెలుసా, నేను చనిపోయాకా ఏదీ మిగలదు. ఆ పెరడూ, చెట్టూ, మీ డాడీ, మమ్మీ… అంతా నాతో తీసుకుపోతాను.’’
వంటగదిలోకి ఒక ఎలుక వెళ్ళింది.

పొనోమరేవ్‌ వింటున్నాడు: ఎలుక ఇల్లంతా తనదే అన్నట్టు హడావిడి చేస్తోంది, కంచాల్ని కదుపుతోంది, కుళాయి తిప్పుతోంది, బకెట్టులో గీరుతున్న చప్పుడు చేస్తోంది.

“అబ్బో అంట్లు తోముతోందే,’’ అనుకున్నాడు పొనోమరేవ్‌.

వెంటనే ఒక ఘోరమైన ఆలోచన వచ్చింది: ఒకవేళ ఎవ్వరికీ తెలియకుండా ఆ ఎలుకకి ఒక పేరు ఉండుంటే? ఆ పేరు ఏమై ఉండచ్చా అని ఆలోచించాడు. అతనిలో భ్రాంతి పెరిగిపోయింది. ఆలోచించిన కొద్దీ భయంతో వణికిపోతున్నాడు. ఆ పేరు గురించి ఆలోచించటం మానేయాలని అనుకుంటున్నాడు, కానీ మానలేకపోతున్నాడు. ఆ అర్థంపర్థంలేని, భయానకమైన పేరు ఒక్కసారి స్ఫురించగానే ఇక తను చనిపోతాడని అతనికి అనిపించింది.

“ల్యోంపా!’’ హఠాత్తుగా భీకరమైన గొంతుతో అరిచాడు.

ఇల్లంతా నిద్రలో ఉంది. తెల్లారగట్ల ఆరుదాటి ఐదు నిమిషాలవుతోంది. అలెగ్జాండర్‌ అన్న పిల్లాడు మాత్రం నిద్రపోలేదు. పెరట్లోకి వంటింటి తలుపు తెరుచుకొని ఉంది. సూర్యుడు ఇంకా ఎక్కడో కిందే ఉన్నాడు.

చావుకి దగ్గరపడ్డ జబ్బు మనిషి వంటగదంతా తిరుగుతున్నాడు. అతని నడుం వంగి వుంది, చేతులు మణికట్టు నుంచి ప్రాణంలేనట్టు వేలాడుతున్నాయి. వెంట తీసుకుపోవటానికి అతను వస్తువుల్ని ఏరుకుంటున్నాడు.

అలెగ్జాండర్‌ పెరటికి అడ్డంగా పరిగెత్తాడు. అతని ముందు బొమ్మ విమానం రివ్వున ఎగిరింది. పొనోమరేవ్‌ ఆఖరుసారి చూసింది అదే.

దాన్ని మాత్రం ఏరుకోలేకపోయాడు. అది ఎగిరిపోయింది.

ఆ మధ్యాహ్నానికి పసుపురంగు అలంకరణలతో వున్న నీలంరంగు శవపేటిక ఒకటి వంటగదిలోకి వచ్చింది. రబ్బరు బొమ్మలా ఉన్న చంటిపిల్లాడు వరండాలో నుంచొని, వీపు వెనక చేతులు కట్టుకుని, దాని వైపు చూస్తున్నాడు. గుమ్మంలో పట్టని ఆ శవపేటికని లోపలికి తీసుకురావటానికి అటూయిటూ తిప్పి నానా ప్రయాస పడాల్సి వచ్చింది. అది అలమారాని గుద్దుకొంది, కంచం కిందపడింది, సున్నం పెచ్చులు ఊడాయి. అలెగ్జాండర్‌ పొయ్యి గట్టు మీదకు ఎక్కి, పెట్టెని కింద నుంచి పట్టుకొని సాయం చేశాడు. వరండా నీడలో శవపేటిక రంగు నల్లగా మారింది, ఆ రబ్బరు బొమ్మలాంటి పిల్లాడు నేలమీద పాదాలు తపతపలాడిస్తూ వరండాలో పరిగెత్తాడు, ‘‘తాతా! తాతా! నీకోసం శవాల పెట్టె తెచ్చారు,’’ అని అరుస్తూ. 


Note:

[1] ఈ కథలోని ఇల్లు ఒక్కో కుటుంబం ఉండే ఇల్లు కాదు. సోవియట్ రష్యాలో చాలా కుటుంబాలు కలిసి ఉండే కమ్యూనల్ అపార్ట్‌మెంట్. ఈ అపార్ట్‌‍మెంట్‌లోని కుటుంబాలన్నింటికీ వంటగది ఉమ్మడిగా ఉండేది.

యూరీ ఓలేషా పరిచయం ఇక్కడ.

(ఈ అనువాదం 'రస్తా' మేగజైన్‌లో పబ్లిష్ అయింది.)