April 30, 2012

"నెంబర్ వన్ పుడింగి" మీద అభిప్రాయం

కథల మీద సమీక్షలుంటాయి. స్వీయకథల మీద సమీక్ష లేముంటాయి. అవి రాసిన వ్యక్తుల మీద ఏర్పడే అభిప్రాయాలుంటాయి తప్ప. ఈ పుస్తకం వెలువడిన కొత్తల్లో వచ్చిన ప్రతిస్పందన చూసాక "చెడ్డ పుస్తక"మేమో అని నిజంగా అనుకున్నాను. దీని జోలికి పోలేదు. కానీ కనకప్రసాద్ ఎప్పటికీ పూర్తికాని ఆ మాయదారి "మూడు లాంతర్లు"లో నామిని పేరు పదే పదే పలవరించడం చూసాను. కనకప్రసాద్ కథల మీద ఇష్టం కొంత ఆయన అభిరుచుల మీదకూ పాకటంతో చూద్దాంలెమ్మని దీన్ని కొన్నాను. ఇదే నేను మొదటిసారి నామిని రచన పూర్తిగా చదవటం (రెండు మూడు కథల్ని మినహాయిస్తే). పూర్తి చేసాకా దీని పట్ల చాలామందిలో వెల్లువెత్తిన అసహనాన్ని తల్చుకుంటే ఒకటే అనిపించింది. మన తెలుగువారిని ఒక బొంగులో మర్యాదస్తుల మనస్తత్త్వం రోగంలా అంటుకుని ఎలా పీడిస్తుందో కదా అని. సాహిత్యం గురించి మాట్లాడుతూ ఆ ఆవరణలోనే మసిలే వాళ్ళకి కూడా కళాకారుల తత్త్వం గురించి ఎంత తక్కువ తెలుసో కదా అని. ఇక్కడ చాలా మంది రచనలకిచ్చే విలువ కన్నా, వాటిని రాసిన రచయితలతో ఏర్పడే ఒక సుహృద్భావ వాతావరణానికి ఎక్కువ విలువిస్తారు. అది వ్యక్తులకి ఏం చేకూర్చినా, సాహిత్యానికి చేటు చేస్తుంది. గుడ్డి విగ్రహారాధన ఒకటి ఏడిచింది మన పాఠకులకు. స్వంత వివేచన పక్కనపెట్టి నలుగురూ ఏ పల్లకీ మోస్తుంటే దాని కింద కెళ్ళి తమ భుజమూ అరువిచ్చేస్తారు.

పుస్తకంలో అభ్యంతరకరమైనవేం నాకు కనిపించలేదు. "కోతి కొమ్మచ్చి"లో ముళ్ళపూడి పేరు చెప్పకుండా కన్నప్ప అంటూ నటుడు కృష్ణంరాజుని పుస్తకమంతా ఆడిపోసుకున్నా, కేవలం పేరు చెప్పని ఆయన మర్యాద కారణంగా కామోసు, అంతా పాపం కదా అనుకుని ముళ్ళపూడి జట్టు చేరిపోయారు. నామిని పేర్లు చెప్పేసరికి అందరూ పిర్రల కింద టపాసులు పేలినట్టు హడలిపోయారు. నాకైతే ఎవర్నీ పనిగట్టుకుని బురదలోకి లాగాలని చూసినట్టు కనపళ్ళేదు. తన మానాన తన కథ చెప్పుకున్నాడు. ఆ కథలో పాత్రధారులైన వాళ్ళ పేర్లకున్న మర్యాదల్ని లెక్కలోకి తీసుకోలేదు. వాటినీ దాచకుండా చెప్పుకున్నాడు. తన కథల్లో ఎలాగైతే వాస్తవ ప్రపంచంలోని వ్యక్తుల్ని ఉన్నవాళ్ళనున్నట్టు కాగితం మీదకి లాక్కొచ్చాడో ఇక్కడా అలాగే చేసాడు.

ఎందుకో "కోతి కొమ్మచ్చి" నాకు మొదటి భాగంతోనే చాలనిపించింది, ఇది మాత్రం రెండో భాగం కూడా ఉంటే బావుణ్ణనిపించింది. లేదా ఈ భాగమే ఇంకా విస్తారంగా రాసి వుంటే బావుణ్ణనిపించింది. చాలాచోట్ల ఎవరో తరుముతుంటే రాసినట్టుంది. దేన్నో నిరూపించి చూపాలన్న తాపత్రయం కనిపించింది. జీవితంలో పడ్డ అవమానాలకి సినిమాటిక్ జస్టిఫికేషన్స్ అన్వయించుకోవడం కనిపించింది. సహజంగానే సాహిత్యాదర్శాల మీద ఆయనిచ్చిన ప్రవచనాలూ నాకు సమ్మతం కాలేదు. కానీ ఆయన చాసోని, పసలపూడి కథల్నీ, కేశవరెడ్డి ఇత్యాదుల రచనల్నీ అచ్చంగా నా కారణాల్తోనే తీసిపారేయటం మాత్రం చిత్రమనిపించింది. పుస్తకమంతా పూర్తయ్యాకా వ్యక్తిగా నామిని గురించి ఒకటే తీర్మానానికొచ్చాను: బయటి ప్రపంచానికి తనను ఎలా చూపించుకునే ప్రయత్నం చేసినా, నామిని తనదైన ఒక స్ట్రిక్ట్ మోరల్ కోడ్‌తో తంటాలు పడే మనిషి అని.