January 15, 2021

‘‘మంచి కథ అంటే’’

(‘సారంగ’ వెబ్ మేగజైన్ లో ‘మంచి కథ అంటే’ అన్న శీర్షికకు రాయమని అడిగినప్పుడు రాసింది)

అమీబా పటము గీచి భాగాలు గుర్తించుము అన్నట్టే ఉంది నా ప్రాణానికి- ‘‘మంచి కథ అంటే" అన్న ప్రశ్న. ఆబ్జెక్టివ్‌ సమాధానమంటూ ఒకటుంటే- అది నాకు తెలియదు. ‘‘నీ దృష్టిలో మంచి కథ ఏంటి’’ అని ప్రశ్నని కొంచెం మోడిఫై చేసుకుంటున్నాను. చాలామంది ‘‘మంచి కథ’’ ఇదంటూ చెప్పిన ఆబ్జెక్టివ్‍ ప్రమాణాలు పాఠకుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పినవనిపిస్తాయి. క్లుప్తత, ఒకే సంఘటన, చెప్పకుండా చూపించటం, చదివేవాడు మద్దతిచ్చేకనీసం ఒక పాత్ర, కథని ముందుకు నడిపే ప్రతి ఒక్క వాక్యమూ... ఇట్లాంటి సూత్రాలన్నీ నాకు consumerist in essence అనిపిస్తాయి. అంటే కళని కూడా దాని వినియోగదారులకు తగినట్టు ease of utilityతో మలవడం అన్నమాట. మనం ఏ సూపర్ మార్కెట్‍కి వెళ్లినా- వుమన్ హార్లిక్స్, మదర్ హార్లిక్స్, కిడ్స్ హార్లిక్స్ ఇలా అరలన్నీ వినియోగదారుడి అటెన్షన్ కోసం ఆత్రపడుతూ ఉంటాయి కదా, అలాగ. మంచి కథ గురించి ఆబ్జెక్టివ్‍గా చెప్పగలిగిందేమన్నా ఉంటే- ‘‘మంచి కథ టెంప్లేట్‍ని పాటించదు’’ అన్న ఒక్క ముక్క చెప్పవచ్చు. కానీ ఇది చాలా shallow marker. ఇంకా లోపలికి వెళ్లేకొద్దీ చీకటి.... Murky waters. ఆ లోతుల్లోకి మునుగీతకొట్టి, సబ్‌కాన్షస్ చీకట్లలోకి పోయి, ఏ చట్రానికీ ఇమడనీ ఏ చట్రంలోనూ పట్టనీ మనదైనతనం కోసం, మన హ్యూమన్ కండిషన్ కోసం, ప్రపంచం మీదకి ప్రసరించే మనకే ప్రత్యేకమైన గమనింపు కోసం వెతుక్కోవాలి. నిద్రలేచిన దగ్గర్నుంచి మనకి ప్రపంచం surfaces మాత్రమే చూపిస్తుంది. సమస్త మానవ వ్యాపారాల పైపొరే మనకి కనిపిస్తుంది. చొచ్చుకుపోయి ఇంటీరియర్స్‌ లోకి చొరబడే కథ మొత్తం సమాజానికి కూడా మంచిది. ఐతే రాసేవాడు అంతరంగపు పెక్యులియర్ రంగుల్ని ఉన్నదున్నట్టు ఫాలో కావాలి. ప్రపంచాన్ని తాను ఎలా లోపలికి తీసుకుంటున్నాడు అన్నదే వాడికి ప్రమాణం కావాలి. సాహిత్య వ్యవస్థలో చెల్లుబాటైన కథన రీతుల్ని గానీ, ఆ కథలలో ఒప్పుకోబడిన ఇతివృత్తాల పంథా గానీ, ఆ ఇతివృత్తాలలో వెల్లడవుతున్న నైతిక వ్యవస్థలుగానీ... ఇవేమీ ప్రమాణం కాకూడదు. "మంచి నీతిని చెప్పేది మంచి కథ" అన్న ప్రిమిటివ్ వాదనని తిరస్కరించేవాళ్లు కూడా నీతిగా నడిచే ఆలోచనల్నీ, మర్యాదపూర్వకమైన జీవితాల్నీ చిత్రించే కథల్ని మాత్రమే మనస్ఫూర్తిగా ఒప్పుకోగలరు. ఇది మన తెలుగులోని all pervasive middle-class mentalityకి తార్కాణం. చెలామణీలో ఉన్న ప్రతి నీతికీ శాశ్వతమైన చెల్లుబాటు ఉందని నమ్మి నడిచే కథలూ, ప్రపంచం కౌగిలిలో సభా మర్యాద పాటించే రచయితలూ మానవానుభవం గురించి చెప్పగలిగేది పెద్దగా ఏం ఉండదు.    

మనం పూర్తి రాజకీయమనుకునే అంశాలకి వేరే డైమెన్షన్లు కూడా ఉంటాయి. సిరియా ఒక్క రాజకీయ సమస్యే కాదు. నవ నాగరికత ముందు వెక్కిరింత. మనం నమ్మి నడయాడే నేలల డొల్లతనాన్ని ఋజువుచేసే నిజం. మానవ జన్మ మూలంలోనే ఉన్న భయానక నిష్ఫలత్వానికి తార్కాణం. Syria is one great reason for you to not to take any happiness for granted, ever. రచన రాజకీయసమస్యలోని ఎటర్నల్ అంశాలని ఇతివృత్తంగా తీసుకున్నప్పుడు దాని శక్తి మరింత పెరుగుతుంది. ఎందుకంటే చరిత్రలో చాలా సిరియాలు ఉన్నాయి, ఇక ముందు కూడా ఉంటాయి. రాజకీయ సమస్యని నేరుగా ఎడ్రస్ చేసేవాటికంటే, అందులో అంతర్లీనంగా ఉండే కాలాతీతమైన అంశాల్ని ఎడ్రస్ చేసేవి, అవి more powerful. కాఫ్కా ఏ రాజకీయ సమస్యనీ నేరుగా కథల్లోకి తీసుకోకపోయినా, తన ఇంటీరియర్ లాండ్ స్కేప్‍ని మాత్రమే ఇతివృత్తంగా తీసుకున్నా, ఆధునిక రాజకీయ సంక్షోభాలకు చాలా రిలెవెంట్ అయిన texts రాయగలిగాడు. మనిషి మీద వ్యవస్థల అజమాయిషీ గురించి, వాటి క్రమబద్ధమైన మోహరింపు గురించి... చాలా స్పష్టంగా రాశాడు.

"Craft is dangerous" అంటాడు చార్లీ కాఫ్మన్. సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నట్టు క్రాఫ్ట్ త్వరగానే పట్టుబడిపోతుంది. ఇక దానితో దేన్నైనా కిట్టించేస్తారు. ఒక ఆదివారం కులాసాగా కూర్చుని కథ రాసేస్తారు. ఇలా కిటుకు తెలిసిపోయిన వాళ్ళని చేయితిరిగిన రచయితలంటారు. ఇలా తయారైతే కష్టం. రాయటం ఎప్పుడూ భయోద్విగ్నమోహం లాగే ఉండాలి. అన్‌సెర్టెనిటీ ఉండాలి. చేయి చీకట్లో తడుముకోవాలి, అది ఎన్నో కథ ఐనా సరే. ఈమధ్య ఇంకెవరో చెప్పిన పోలిక కూడా బాగా నచ్చింది. నాక్కూడా గుర్తుంటుందని ఇక్కడ పెడుతున్నాను. సముద్రంలోకి నడుచుకుంటూ పోతున్నప్పుడు ఒక దశ దాటాకా కాళ్ల కింద భూమి తగలటం మానేస్తుంది. అలాంటి స్థితిలో, అసలు రాయటం మొదలవుతుంది.