Showing posts with label Literary Musings. Show all posts
Showing posts with label Literary Musings. Show all posts

September 26, 2024

Random thoughts on language in fiction:

(తెలుగులో కథలు రాసేవాడిగా కథల్లో భాష మీద నా రీసెంట్ ఆలోచనలు కొన్ని. ఇవి మిగతా వాళ్ళకీ, మిగతా ప్రక్రియలకీ అప్లయ్‌ అవ్వచ్చు కాకపోవచ్చు.)

> నా మొదటి కథ నాకు పాతికేళ్ళ వయసప్పుడు రాసింది. దాన్ని అప్పట్లో బ్లాగులో పోస్ట్ చేస్తే కింద కామెంట్లలో “నాణ్యమైన తెలుగు” అనీ, “తెలుగంటే ఇలా ఉండాలీ” అనీ కొన్ని కామెంట్లు వచ్చాయి. నిజానికి అందులో తెలుగు కంటే సంస్కృతమే ఎక్కువ ఉంది. ఉదాహరణకి కొన్ని వాక్యాలు: “సృష్టి యావత్తూ నా నిశ్వాసాలకు సంకోచిస్తూ, ఉచ్ఛ్వాసాలకు వ్యాకోచిస్తున్న చిత్తభ్రమ”, “నాలో సుడులు తిరుగుతూ చెలరేగుతున్న కాంక్షా సంవర్తానికి ఆమె కేంద్రకమైంది”... ఇలాంటి గరుకు, ఎగుడుదిగుడు, సంకర భాష రాశాను. చివరికి పళ్ళు తోముకోవటానికి కూడా “దంతధావనం” అని రాశాను. ఒకవేళ అదే కథని నేను ఇప్పుడు 2024లో రాస్తే చదివినవాళ్ళు ఎవ్వరూ అందులోని భాషని “నాణ్యమైన తెలుగు” అని పొగడరు. ఎందుకంటే ఇప్పుడు నా ఆలోచనలకి తెలుగు మాటలు చప్పున తట్టకపోతేనో/ తెలుగు మాటలు లేకపోతేనో– వెంటనే ఇంగ్లీషు వైపయినా వెళ్ళిపోతాను గానీ, సంస్కృతం హేంగోవర్‌ ఉన్న తెలుగు జోలికి మాత్రం వెళ్ళను. కారణం సింపుల్– ఇంగ్లీషు బతికున్న భాష, సంస్కృతం చచ్చిపోయిన భాష. ఈ మొదటి కథని చాలా ఏళ్ళ తర్వాత ఎప్పుడో చదివితే ప్రతీ వాక్యానికీ చిరాకేసింది. ఇంక లాభం లేదని కథని మళ్ళీ డ్రాఫ్ట్‌లో పెట్టి మామూలు భాషలోకి “ట్రాన్స్‌‍లేట్” చేయటానికి వీలైనంత ట్రై చేశాను. ఐనా దీన్ని నా కథల పుస్తకంలోకి తీసుకోబుద్ధి కాలేదు. ఇదనే కాదు, నా కొన్ని పాత కథల్లో అక్కడక్కడా ఈ భాష ఉంటుంది. కథల పుస్తకం పబ్లిష్ చేసేటప్పుడు వీలైన చోట్ల రివైజ్ చేసుకుంటూ వచ్చాను. ఐనా ఇంకా కొంత సంస్కృత–-తెలుగు అలాగే ఉండిపోయింది. ఫిక్షన్‌ మీద నా అవగాహన పెరిగేకొద్దీ నా భాష సింప్లిఫై అవుతూ వచ్చింది. ముఖ్యంగా నోటి మాటలకి దగ్గరగా వెళ్తూ వచ్చింది. —అంటే నా నోటి మాటలకి. 

> తూర్పు గోదావరి జిల్లాలో తండ్రులూ తాతల కాలం నుంచి వ్యవసాయం వదిలి ఉద్యోగాలే చేస్తున్న మిడిల్‌ క్లాస్‌ ఫేమిలీలో నేను పుట్టి పెరిగాను. కాబట్టి నా మాటలకి మరీ సినిమాల్లో వినిపించేంత గోదావరి జిల్లాల యాస ఉండదు గానీ కొంత ఉంటుంది. ఆ యాస కూడా అవతల మాట్లాడేది ఎవరూ అన్నదాన్ని బట్టి అప్రయత్నం గానే స్విచ్‌ ఆన్‌/ స్విచ్‌ ఆఫ్‌ అవుతూ ఉంటుంది. అంతగా పరిచయం లేనివాళ్ళ ముందు కుదురుగా మాట్లాడతాను. ఏ చిన్నప్పటి ఫ్రెండ్‌ తోనో ఐతే పరమ యాస వచ్చేస్తుంది. దానికితోడు ఇరవయ్యేళ్ళుగా హైదరాబాద్‌లో ఉండబట్టి కొన్ని తెలంగాణ పదాలు నా భాషలో కలిసిపోయాయి. అలాగే ఇక్కడ ముస్లిం వెండర్స్‌తో మాట్లాడేటప్పుడు అరకొర హైదరాబాదీ ఉర్దూ కూడా బైటపడుతుంది. ఇలా నా జీవితం నడిచిన దారిని బట్టి నాకంటూ ఓ మాట తీరు ఏర్పడింది. ఇదే నా మాండలికం.

> ‘‘మాండలికం’’ అనే పదానికి ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఇరుకైన అర్థం. భాషకి ప్రాదేశిక మండలం మాత్రమే ఉండదు, అంతరంగ మండలం కూడా ఒకటి ఉంటుంది. మొన్నామధ్య ఒక పోస్టులో రాశాను: ‘‘ప్రతి మనిషికీ తన ఆవరణ ఉంటుంది, తను సౌకర్యంగా మసలుకునే స్పేస్ ఉంటుంది. అది వాడి ‘మండలం’. అందులోంచి వచ్చే మాటే మాండలికం. మాండలికం లేని మనిషంటూ ఎవడూ ఉండడు, యాసలేని మాట ఎవడి నోటి నుంచీ రాదు.’’  

> పైగా కథల్లో భాష ఎలా ఉండాలీ అన్న దాన్ని రచయిత మాట్లాడే భాష మాత్రమే అన్నిసార్లూ డిసైడ్‌ చేయదు. ఆ కథ దేని గురించీ అన్నది కూడా డిసైడ్‌ చేస్తుంది. ఫరెగ్జాంపుల్‌ ఈమధ్య రాసిన నా నవలలో కేరెక్టర్లు ఇరవైల వయసులోని వాళ్ళు, వాళ్ళ కథ 2020ల్లో జరుగుతుంది. కథ చెప్పే గొంతు వీలైనంత వరకు ఆ పాత్రలకు నప్పే ఆవరణ లోనే ఉండాలనుకున్నాను. అందుకే ఎక్కువ ఇంగ్లీషు పదాలు వాడాను. ఉద్దేశపూర్వకం గానే ‘దిగులు’ అన్న పదానికి బదులు ‘డల్‌’ అని రాశాను. ‘ప్రవర్తన’ అన్నదానికి ‘బిహేవియర్‌’ అని రాశాను. ఇలాంటివి చాలా చోట్ల చేశాను.

> అందుకే ‘‘తెలుగు భాషని కాపాడాలీ’’ అని ఉద్యమాలు చేసేవాళ్ళు ఆ బాధ్యతని కథలు రాసుకునే వాళ్ళ మీద పెడితే పనవదు. ఫిక్షన్‌కి– ముఖ్యంగా రియలిస్టిక్‌ ఫిక్షన్‌కి– వేరే డిమాండ్లు ఉంటాయి, రియలిస్టిక్ రైటర్లు మొదట వాటికే తలొగ్గుతారు. 

> రియలిస్టిక్‌ రైటర్లకి ఆపుకోలేని దురద ఒకటి ఉంటుంది. తాము చూసిన ప్రపంచాన్నీ, తమ అంతరంగం లోకి డిస్టిల్ ఐన ప్రపంచాన్నీ ఏ మార్పూ లేకుండా ఉన్నది ఉన్నట్టు కథల్లో చూపెట్టాలని. ఎవరూ వాళ్ళని ఇలాగే రాయాలని అడగకపోయినా, ఇలా రాస్తేనే వాళ్ళకు తృప్తి. ఉన్నదున్నట్టు చెప్పలేకపోతే కథలో ఏదో లోటు చేసినట్టూ, ఆ కథ ఇంకా పూర్తి కానట్టూ ఉంటుంది. నేను రియలిస్టిక్‌ రైటర్‌ని మాత్రమే కాదు. కొన్ని కథల్ని అబ్సర్డ్/ డ్రీమీ లాండ్‌ స్కేప్‌లో కూడా చెప్పాను. ఐతే రియలిస్టిక్‌ రైటింగ్‌ దగ్గరకు వచ్చేసరికి ప్రపంచానికి ఎంత దగ్గరగా అద్దం పట్టగలిగానూ అన్నదే నాకు ముఖ్యం. ఒక్కోసారి రీడర్స్‌కి అసభ్యం/ అభ్యంతరకరం/ అశ్లీలం అనిపించే ఎలిమెంట్స్‌ ఉన్నా సరే రియలిస్టిక్ రైటర్లు ఈ విషయంలో పాపం ఏం చేయలేరు. 

> ఈమధ్య రాసిన నవలలో కొన్ని చోట్ల బూతులు ఉండటం గురించి కొంతమంది నాతో మాట్లాడారు. మామూలుగా  సోకాల్డ్‌ సభ్య సమాజాన్ని ఇబ్బంది పెట్టే అంశాలు ఏమైనా కథల్లో ఉంటే మనవాళ్ళు– ‘‘మాంసం తిన్నామని ఎముకలు మెళ్ళో వేసుకుంటామా,’’ అన్న రొడ్డకొట్టుడు సామెత ఒకటి వినిపిస్తారు. కానీ ఇలా ఎముకలు మెళ్లో వేసుకోవటం రియలిస్టిక్‌ ఫిక్షన్‌ విషయంలో తప్పదు మరి. లిటరేచర్‌ దగ్గర కూడా పౌడరు పూసుకుని దొంగ వేషాలు వేయాలంటే కష్టం.

> పుస్తకాల్లో బూతుల విషయంలోనూ, సెక్స్ విషయంలోనూ పెద్ద పెద్ద యుద్ధాలు వెస్ట్రన్‌ లిటరేచర్‌లో ఇరవయ్యో శతాబ్దం మొదట్లో జరిగాయి. ఫ్లోబేర్‌, డి.హెచ్‌. లారెన్స్‌, జేమ్స్‌ జాయ్స్‌, హెమింగ్వే, హెన్రీ మిల్లర్‌ వీళ్ళందరి మీదా ‘‘అశ్లీలం’’ అన్న టాగ్ పడింది, ఒక్కోసారి కోర్టు కేసులు కూడా నడిచాయి, పుస్తకాలు బాన్‌ అయ్యాయి, ఆ తర్వాత పత్రికల్లో పెద్ద పెద్ద చర్చలు జరిగాయి. భాష టెక్చర్‌లో ఎంతో సహజంగా ఇమిడిపోయే బూతుల్ని భాషే ప్రధానాంగంగా నడిచే సాహిత్యం లోకి తేవటానికి అప్పటి రచయితలు చాలా యుద్ధాలే చేశారు. ఒక్కోసారి కోర్టులతోనూ, ఒక్కోసారి సొంత పబ్లిషర్లతోనూ. ఉదాహరణకి, హెమింగ్వే మొదటి నవల ‘సన్‌ ఆల్సో రైజెస్‌’లో ‘‘బిచ్‌’’ అన్న ఒక్క పదాన్ని ఎలౌ చేయటానికి ఆ పుస్తకం పబ్లిషర్‌ చాలా సందేహించాడు. ముందు జాగ్రత్తగా జడ్జీలతో కూడా మాట్లాడాక గానీ ఒప్పుకోలేదు. ఐనా గానీ ఆ ఒక్క పదానికే ఆ పుస్తకం ఒక అమెరికన్‌ రాష్ట్రంలో బాన్‌ అయ్యింది (1927లో). హెమింగ్వే ఎడిటర్‌ ఐన మాక్స్‌వెల్ పెర్కిన్స్‌ అటు పబ్లిషర్ల భయాలకీ, ఇటు హెమింగ్వే మొండిపట్టుకీ మధ్య నలిగిపోయేవాడు. హెమింగ్వే బూతుల విషయంలో నిక్కచ్చిగా ఉండేవాడు. ‘‘నేను దేని గురించి రాస్తున్నానూ అనేదానికంటే, నా భాషని పూర్తిగా వాడుకోగలుగుతున్నానా లేదా అన్నదానికే ఎక్కువ విలువ ఇస్తాను,’’ అంటాడు ఒక ఉత్తరంలో. హెమింగ్వే తర్వాతి నవల ‘టు హేవ్‌ అండ్‌ హేవ్‌ నాట్‌’లో ‘‘fuck’’ అన్న ఇంగ్లీష్ పదాన్ని మధ్యలో అక్షరాలు తీసేసి ‘‘f––k’’ అని ప్రింట్‌ చేశారు. ఇంకో నవల ‘ఫర్‌ హూమ్‌ బెల్‌ టోల్స్‌’లో హెమింగ్వే బూతులు వాడటానికి ఇంకో కిటుకు కనిపెట్టాడు. బూతులకు బదులు ‘obsenity’ (అశ్లీలం), లేదా ‘unprintable’ (అచ్చువేయలేనిది) అన్న పదాల్ని వాడాడు. అంటే బూతుల్ని తను వాడకుండానే రీడర్స్‌ మైండ్‌లో సృష్టించాడన్నమాట. (మన సినిమా దర్శకుడు జంధ్యాల ఒక సినిమాలో కేరెక్టర్‌ బూతులు మాట్లాడినప్పుడల్లా స్క్రీన్‌ మీద ‘‘బూతూ బూతూ’’ అని టైటిల్‌ వేసినట్టు). ఉదాహరణకి ఆ నవల్లో ఒక వాక్యం: ‘‘Where the obscenity have you been?’’ (అంటే ‘‘Where the fuck have you been?’’ అనటానికి బదులుగా అన్న మాట). కొన్ని చోట్ల ‘‘fuck’’ అన్న పదం బదులు ‘‘muck’’ (మురికి) అన్న పదం కూడా వాడాడు. అంటే ‘‘Go fuck yourself’’ బదులు ‘‘Go muck yourself’’ అనీ ఇలాగ. ఉదాహరణకి ఇలాంటి ఇంకో వాక్యం: ‘‘muck my grandfather and muck this whole treacherous muck-faced mucking country and every mucking Spaniard in it’’.

> ఏ భాషలోనైనా ఏమాత్రం మారకుండా కాలాలు దాటి నిలిచే పదాలు బూతులే. భాషలో బూతుల కంటే సజీవమైన, ప్రాచీనమైన భాగం ఇంకోటి ఉండదని నా ఫీలింగ్.  మన తెలుగు బూతులు కూడా చాలా ప్రాచీనం. ఉదాహరణకి 1750 దరిదాపుల్లో వచ్చిన కూచిమంచి  జగ్గకవి ‘చంద్రరేఖావిలాపం’ కావ్యంలో ఆనాటి కావ్య భాష మధ్యలో అప్పటికీ ఇప్పటికీ ఒకేలా చెక్కుచెదరని బూతులు కనిపిస్తాయి.

> బూతుల విషయంలో కాస్త తగ్గమని హెమింగ్వేని ఆయన ఎడిటర్‌ మాక్స్‌వెల్‌ పెర్కిన్స్‌ బతిమాలితే, హెమింగ్వే ఇచ్చిన సమాధానం: ‘‘ఇంకో పదంతో మార్చగలిగే వీలుందా లేదా అని ముందు ఒకసారి ఆలోచించకుండా నేను ఎప్పుడూ ఏ ఒక్క పదమూ వాడలేదు’’. (Never used a word without first considering whether or not it was replaceable.)

> ఇప్పుడు తెలుగు లోనూ కొంతమంది రైటర్లు బూతులు స్వేచ్ఛగా వాడుతున్నారు. కానీ ఆ విషయం మీద ఏమైనా విమర్శలు వస్తే– పల్లెటూరి జీవితం గురించి ఆ భాషలో చెప్పటానికి బూతులు వాడక తప్పదూ అన్న సమర్థన వాళ్ళ దగ్గర ఉంది. నిజానికి ఆ సమర్థన కూడా అవసరం లేదు. ఆల్టిమేట్‌గా– బూతులతో ఏ రైటర్‌కైనా ఉన్న కంఫర్టే అతని బూతుల వాడకాన్ని డిక్టేట్‌ చేస్తుంది. అలాంటి భాష అస్సలు పడని రీడర్‌ ఎవరైనా ఉంటే వాడు ఒకసారి చదివాక ఇంక మళ్ళీ ఆ రైటర్‌ జోలికి ఎలాగూ వెళ్ళడు. నా వరకూ బూతులతో కంఫర్ట్‌ నేను ఎవరితో మాట్లాడుతున్నానూ అన్నదాన్ని బట్టి ఉంటుంది. చిన్నప్పటి ఫ్రెండ్‌ ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు నా ప్రతి రెండో మాటకీ బూతు ఉంటుంది. నా రాతలతో నాకు అంతకుమించిన ఇంటిమసీనే ఉంటుంది. కాబట్టి అక్కడ నాకు దాపరికాల్లేవు. మాంసం తిని ఎముకల్ని బాక్ పాకెట్స్‌లో దాచుకోవటాల్లేవు.  

> కొన్ని వర్గాల్ని కించ పరిచే మాటలు నా చిన్నప్పుడు చుట్టూ అతిమామూలుగా వినపడిపోయేవి. ఇప్పుడు వాటి లక్షణం ఏంటో అర్థమమ్యాక వ్యక్తిగా నేను అలాంటి మాటలు వాడను. అయితే కథా రచయితగా కథలో ఒక పాత్రకి అలాంటి ఆటిట్యూడ్‌ ఏదైనా ఉంటే చూపించటానికో, లేదా ఆ అవగాహన లేని పాత్రని వాస్తవికంగా చూపించటానికో గేరంటీగా అలాంటి మాటల్ని ఆ పాత్రకి వాడతాను (అంతేతప్ప- నా అవగాహనకి తగినట్టు ఆ పాత్రని ఎట్టిపరిస్థితుల్లోనూ సరిదిద్దను). ఇప్పుడు అమెరికాలో Politically-correct/ woke culture ద్వారా మాటలపై నిషేధం ఒకటి మొదలైంది. చనిపోయిన పాత రైటర్ల పుస్తకాల్లోని భాషని కూడా సవరిస్తున్నారు. క్లాసిక్‌ చిన్నపిల్లల రచయిత ఐన Roald Dahl పుస్తకాల్లోంచి ‘‘fat’’, ‘‘ugly’’ అన్న పదాలను కూడా తొలగించారు. ఇది ఒక చెత్త ట్రెండ్‌. భాషని అదుపు చేయటం ఫాసిజానికి మొదటి దశ. అది రైట్ నుంచి వచ్చినా, లెఫ్ట్ నుంచి వచ్చినా, దానికి ఎటువంటి ప్రోగ్రెసివ్ రీజన్స్ చూపించినా… చివరకు వెనకాల ఉండేవి మాత్రం ఫాసిస్ట్ ఇంటెన్షన్లే.   

> కొన్ని వర్గాల్ని కించ పరిచే తిట్లు నా చిన్నప్పుడు చుట్టూ అతిమామూలుగా వినపడిపోయేవి. ఇప్పుడు వాటి లక్షణం ఏంటో అర్థమమ్యాక నేను అలాంటి మాటలు వాడను. అయితే కథలో ఒక పాత్రకి ఉన్న అలాంటి ఆటిట్యూడ్‌ ఏదైనా ఉంటే చూపించటానికో, లేదా ఆ అవగాహన లేని పాత్రని చూపించటానికో గారంటీగా అలాంటి మాటలు ఆ పాత్రకి వాడతాను. ఇప్పుడు అమెరికాలో Woke culture ద్వారా మాటలపై నిషేధం ఒకటి మొదలైంది. చనిపోయిన పాత రైటర్ల పుస్తకాల్లోని భాషనీ సవరిస్తున్నారు. క్లాసిక్‌ చిన్నపిల్లల రచయిత Roald Dahl పుస్తకాల్లోంచి ‘‘fat’’, ‘‘ugly’’ అన్న పదాలను కూడా తొలగించారు. ఇదో చెత్త ట్రెండ్‌. భాషని అదుపు చేయటం ఫాసిజానికి మొదటి దశ. అది రైట్ నుంచి వచ్చినా, లెఫ్ట్ నుంచి వచ్చినా, దానికి ఎటువంటి ప్రోగ్రెసివ్ రీజన్స్ చూపించినా… చివరకు వెనక ఉండేవి మాత్రం ఫాసిస్ట్ ఇంటెన్షన్లే. 

> ఈమధ్య రాసిన నవలలో ప్రెజెంట్‌ కంటిన్యవస్‌ టెన్స్‌ వాడిన సందర్భాల్లో ప్రూఫ్ మిస్టెక్స్ సరిగా చూసుకోలేదని ఒకరిద్దరు అనుకున్నారు. కానీ అవి అచ్చు తప్పులు కావు,  అలా కావాలనే చేసాను. తెలుగులో ప్రెజెంట్ కంటిన్యువస్ సెన్స్‌ని ‘‘ఆమె వంట చేస్తోంది/ వర్షం పడుతోంది’’ ఇలా ‘‘స్తోంది/ తోంది’’ అని వాడి రాస్తారు. నాకు ఇలా రాయటం ఎప్పుడూ ఎబ్బెట్టు గానే అనిపించింది. బైట ఎవరూ ఇలా మాట్లాడగా నేనెప్పుడూ వినలేదు. రాసే భాష కూడా అంతా మాట్లాడినట్టుగానే ఉండాలీ అని నేను అనను. కానీ నాకే ఈమధ్య అలా రాయబుద్ధి కావటం లేదు. అలా రాయకపోయినా సందర్భాన్ని బట్టి ప్రెజెంట్‌ కంటిన్యువస్‌ టెన్స్‌ అర్థమైపోతుందని నేను అనుకుంటున్నాను.  

>  సాహిత్యం ఎప్పుడైతే చుట్టూ జీవితంతోనూ, మనుషులతోనూ, వాళ్ల మాటలతోనూ సంబంధం తెగ్గొట్టుకుంటుందో అప్పుడు ఒక సెల్ఫ్ రిఫరెన్షియల్ పరిభాష (జార్గాన్) ఏర్పడుతుంది. అంటే ఆ భాష మళ్ళీ పరస్పరం రచయితలకే సులువుగా అర్థమవుతుంది. లేదంటే చదివీ చదివీ అలవాటు పడిపోయి ఆ భాష నేర్చేసుకున్న పాఠకులకి అర్థమవుతుంది. ఇలాంటి భాష సాంఘిక వ్యాసాలకో, సంపాదకీయ వ్యాసాలకో అవసరం కావచ్చు. కానీ కథలకి అవసరం లేదు. ఐనా సరే, కథల్లో కూడా, నేరేషన్‌లోనే గాక ఇంకా ఘోరంగా పాత్రల నోట పలికించే డైలాగుల్లో కూడా, ‘‘ఆత్మాశ్రయత’’, ‘‘ఆర్ద్రత’’, ‘‘సాంద్రత’’, ‘‘మార్మికత’’, ‘‘పారదర్శకత’’, ‘‘పరాధీనత’’, ‘‘స్థానభ్రంశం’’ లాంటి భాష వాడేస్తారు. ఈ విషయంలో కొత్త రైటర్లు చాలా బెటరు. భాష ఎక్కువ తెలియకో ఏమో మరి ఏం చెప్పాలన్నా తెలిసిన భాష లోనే అందంగా నెట్టుకొస్తున్నారు. కానీ వాళ్ళలో కూడా చాలామంది ఎప్పుడో చచ్చిపోయిన న్యూస్ పేపర్ భాషని ఇంకా మోస్తున్నారు. లేదంటే డెభ్బైలు ఎనభైల పాపులర్‌ నవలల్లోని భాష వాడుతున్నారు. ‘‘హృదయంలో తియ్యని అలజడు’’లు, ‘‘లతలా అల్లుకుపో’’వడాలు, ‘‘ఊహించని పరిణామానికి విస్తుపో’’వడాలు, ‘‘మనసంతా చేదైపో’’వడాలు... ఇదంతా వాడేసి వాడేసి అరిగిపోయిన భాష. అర్థాన్ని మెకానికల్ గా  విసర్జించే చచ్చు భాష. వీటిని  ‘‘Cliches’’ అంటారు. క్లీషేలకి ఎవ్వరూ అతీతులు కాదు. ఎవరైనా సరే అలవాటులో పొరపాట్లాగా ఎప్పుడోకప్పుడు వాడేస్తుంటారు. అది ఫర్లేదు కానీ, అసలు ఫలానాది క్లీషే అని గుర్తే పట్టలేకపోతే మాత్రం కష్టమే.

> ఈమధ్య సంస్కృత పదాలకి ఆల్టర్నేటివ్‌గా ఎప్పటివో పాత అచ్చ తెలుగు పదాల్ని తెచ్చి వాడుతున్నారు. నాటి గ్రామీణులు వాడేవారంటూ అమ్మమ్మల నుంచి తాతయ్యల నుంచి సేకరించిన పదాల్ని తెచ్చి ఇది స్వచ్ఛమైన తెలుగు అంటూ కథల్లో ఇముడుస్తున్నారు, మళ్ళీ అవి అర్థం కావటానికి కింద ఫుట్ నోట్స్ ఇస్తున్నారు. నా వరకూ నాకు సంస్కృత - తెలుగు ఎంత పనికిరానిదో ఇప్పుడెవరూ మాట్లాడని ఈ అచ్చ తెలుగూ అంతే పనికి రానిది. 

> “విశ్వానికే సొంతంగా జ్ఞాపక శక్తి అంటూ ఉంటే తప్ప ప్రతి ముసలాడి, ప్రతి ముసలామె చావుతోనూ ఎన్నో అమూల్యమైన విషయాలు శాశ్వతంగా మరణిస్తాయి” అంటాడు బోర్హెస్ ‘విట్నెస్’ అనే ఓ కథలో. ఓ రెండు పేరాల ఆ కథ మొదలవటం ఒక మురికి గుర్రాల శాలలో చావు ముంగిట ఆఖరి పూట గడుపుతున్న ముసలాడితో మొదలవుతుంది. అతనితోపాటే చనిపోయే విషయాల్ని కొన్నింటిని తల్చుకుంటాడు  బోర్హెస్. అనంత కాలంలో ఎప్పుడో ఒక రోజు ఎవరికీ తెలియకుండానే క్రీస్తును చూసిన ఆఖరి కళ్ళు చచ్చిపోయి ఉంటాయంటాడు. తను చనిపోయాకా తనతో చనిపోయేవేమిటీ అని తల్చుకుంటాడు. కొన్ని ఇమేజెస్ గుర్తు తెచ్చుకుంటాడు. ఒక పెద్ద దేవదారు బీరువాలో ఒక సొరుగు లాగితే కనపడిన సువాసనల సబ్బు గురించి తల్చుకోవటంతో కథ ముగుస్తుంది.  ఒక్కోసారి వందల యేళ్ళ చరిత్ర ఉన్న భాషలు కూడా ఎవరో ఒక్క మనిషితో చచ్చిపోతాయి. లింగ్విస్టులు మృత భాషలు అని ప్రకటించిన ప్రతి భాషా కూడా ప్రపంచం నుంచి ఇలా ఎవరో ఒక్క మనిషి నిష్క్రమణ తోనే మాయమై ఉంటుంది, వాటిని మాట్లాడే ఆఖరి ముసలాయనో, ముసలామో చనిపోవటంతోటే. ఇక వాళ్ళు చనిపోయిన తర్వాత పాత పుస్తకాల నుంచో, లేదా వాళ్ళ ఆఖరి దశలో నేరుగా వాళ్ళ నుంచో ఆ భాషలోని పద సంపదని సేకరించవచ్చు. కానీ దాన్ని మళ్ళీ జనం నాలుకల మీదకి చెలామణీ లోకి తేలేం. జనం నాలుకల మీద వినపడని భాష కథలకి పని రాదు. భాషా చరిత్రల నమోదుకు పనికొస్తుందంతే. భాషా గమనం అనేది వెనక్కు మళ్ళని ప్రవాహం. దాని ప్రవాహ గమనాన్ని నిర్దేశించే శక్తి సాహిత్యానికి లేదు.  

> రియలిస్టిక్ జానర్‌లో కథలు రాసేవాడికి చుట్టూ వినపడే పలుకు చాలా ముఖ్యం. కాబట్టి చుట్టూ సొసైటీ అంతా భాష పరంగా ఎటుపోతుంటే వాడూ అటే పోక తప్పదు. ఎటోపోతున్న సొసైటీని వాడు వెనక్కి లాక్కు రాలేడు. భాషని ఉద్ధరించే పని మీదేసుకుని ఏ మంచి కథా రచయితా తను సృష్టించే ప్రపంచాల్ని అసహజంగా పలికించడు. అలాగని వాడి వల్ల భాషకి ఏ ప్రయోజనమూ ఉండదనీ కాదు. చుట్టూ వినపడే భాషనే కొత్త రకంగా పలికిస్తూ, దాని చేత దానికి అలవాటు లేని పనులు చేయిస్తూ, అందీ అందని ఆలోచనల వైపు దాన్ని ఎక్కుపెడుతూ, శక్తికి మించిన ఎత్తులకి దాన్ని ఎగరవేస్తూ, ఆవేశాలు నింపి దాన్ని వెలిగిస్తూ,  కరిగిస్తూ... వాడు భాషకి మళ్ళీ మళ్ళీ యవ్వనాన్ని తెస్తుంటాడు. కానీ వాడు ఇదంతా భాషని బాగు చేద్దాం అని చేయడు.

July 19, 2024

శ్రీరమణ గారు

జర్నలిస్ట్ అన్న పేరుమీద నా ఇల్లు గడుస్తుందంటే ఇదంతా మొదలైంది శ్రీరమణ గారి వల్ల. పదిహేనేళ్ల క్రితం ఒక ఏడ్ ఏజెన్సీలో కాపీ రైటర్/ ట్రాన్సులేటర్/ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగం చేసుకుంటూ బ్లాగులో రాతలు రాసుకునేవాడిని. అక్కడ గిలికిన నాలుగు రాతలేవో అప్పట్లో ‘నవ్య’ పత్రిక ఎడిటర్ గా పని చేసే ఆయనకి పంపి ఉద్యోగం కావాలని ఉత్తరం రాశాను. ఆయన వెంటనే పిలిచి ఉద్యోగమిచ్చారు. ఏ అనుభవం లేనివాడికి, డిగ్రీ కూడా ఫెయిలైనవాడికి. ఆ తర్వాత ఒక న్యూస్ ఛానెల్లో మూడేళ్లు ఆయనతో దగ్గరగా కలిసి పని చేశాను. ఆయనకి ఈమెయిల్ నేనే క్రియేట్ చేసి, నేనే మెయింటైన్ చేసేంత దగ్గరగా, టేబిల్ కి ఆయన అటూ నేను ఇటూ కూర్చుని పని చేశాం. బ్లాగులో రాసుకున్న నా తొలి కథలు రెండింటిని ఆయన తను గౌరవ సంపాదకత్వం వహించే పత్రికల్లో మళ్ళీ వేశారు. నా ‘రాజుగారి మేడ కథ’ విషాదాంతం చేయటం ఆయనకి నచ్చలేదు. ఆవైపు మొగ్గు ఎక్కడా ఆయనకి నచ్చేది కాదు. ఆ కథ మొదటి డ్రాఫ్ట్ చూసి ఎలా ముగిస్తే బావుంటుందో సలహాలు కూడా ఇచ్చారు. అప్పట్లోనే ఏదో అకాడమీ కోసం నాకు చలం మోనోగ్రాఫ్ రాసే బాధ్యత అప్పగించారు. దాన్తో చలాన్ని లోలోపలికంటా చదివే అవకాశం వచ్చింది. కానీ మరీ లోతుగా చదివేసరికి చలం నేను నిభాయించలేనంత బరువైన ఇతివృత్తమైపోయాడు. చివరికి ఏం  రాయలేక చేతులెత్తేశాను. ఆ మూడేళ్ళు కలిసి పని చేసింతర్వాత ఒకసారి కినిగెకి ఇంటర్వ్యూ (bit.ly/3O18kNW) చేయటానికి తప్ప మళ్లా పెద్దగా కలిసింది లేదు. ఫోన్లలో అడపాదడపా మాటలుండేవి. బాల వ్యాకరణానికి దువ్వూరి రమణీయ వ్యాఖ్య నాకు ఇచ్చానని ఎప్పుడు మాట్లాడినా గుర్తు చేసేవారు. అది ఇంకా నా దగ్గరే ఉంది. ఆయన రచయితగా నాకు చిన్నప్పుడే తెలుసు. ఆంధ్రప్రభలో ‘శ్రీ ఛానెల్’ అని నా టెన్త్ ఇంటర్ రోజుల్లో వస్తుండేది, బాపు బొమ్మలతో. బాపు రమణల అసోసియేషన్ ని బట్టి ఈ శ్రీరమణ అంటే ముళ్ళపూడి వెంకటరమణే మారుపేరుతో రాస్తున్నాడు అనుకునేవాడిని చాన్నాళ్లు. కొలీగ్ గా ఉన్నప్పుడు ఆయన రాయటం చాలా దగ్గరగా చూశాను. కాలమ్ రాస్తే పేపరు మీద ఒక్క కొట్టివేత లేకుండా మొదటి నుంచి చివరిదాకా చక్కటి దస్తూరితో రాసి దాన్నే ఫైనల్ గా ఇచ్చేసేవాడు. ఇలా ఎన్ని చెప్పినా, ఈ పేరా మొదటి వాక్యంలోని కృతజ్ఞతే ఇక్కడ ముఖ్యంగా వ్యక్తం చేసుకోదలచింది. మనిషిని ఎప్పుడు తలచుకున్నా నవ్వు ముఖంతోనే గుర్తుకు వస్తాడు. ఆయన నిలబడిన చుట్టుపక్కల ఎంత రద్దీ ఉన్నా ఆయన సమక్షం వల్ల అది నెమ్మదించినట్టనిపిస్తుంది. I loved him.

May 16, 2024

రచయితలు - పుట్టిన రోజులు

రైటర్ల బయోగ్రఫీల్నో, వాళ్ళ మీద వికీపీడియా ఎంట్రీల్నో చదివేటప్పుడు వాళ్ళు ఏ వయసులో ఏం చేశారన్నది తెలుసుకోవటమంటే నాకు చాలా ఇంట్రెస్ట్. వాళ్ళు మొదటి కథ ఏ వయసులో రాశారూ, వాళ్ళ వర్జినిటీ ఏ వయసులో పోయిందీ, ఏ వయసులో పిల్లల్ని కన్నారూ… ఇలాంటి వివరాలు. కాఫ్కా 1912లో ఫెలిస్‌ని కలిశాడూ అంటే ఆ ఏడాదికి కాఫ్కా వయసెంత ఉంటుందో నాకు తెలియాలి. కానీ ఇంకోపక్క నేను లెక్కల్లో పరమ వీకు. ఎక్కాలు కూడా తడుంకుంటాను. 1883లో పుట్టిన కాఫ్కాకి 1912లో ఎంత వయసుంటుందో లెక్కగట్టాలంటే, చదవటం కాసేపు ఆపి, 1883 నుంచి 1900కి పదిహేడేళ్ళూ + 1900 నుంచి 1912కి పన్నెండేళ్ళూ, రెండూ కలిపితే అప్పటికి కాఫ్కా వయసు 29 ఏళ్ళూ అని ఇలా లెక్కేసుకోవాలి. అందుకే రౌండ్ ఫిగర్ కాని సంవత్సరాల్లో పుట్టిన రైటర్లతో చిరాకు. దాస్తోయెవస్కీ (1821), ఫ్లాబెర్ట్ (1821), జేమ్స్ జాయ్స్ (1882) నవొయ షిగా (1883), చలం (1894)... ఇలాంటివాళ్లన్నమాట. ఇలా కష్ట పెట్టకుండా పుడతారు కొంతమంది రైటర్లు. ఉదాహరణకి హెమింగ్వే, నబొకొవ్, బోర్హెస్ ముగ్గురూ చక్కగా టైం చూసుకుని ఒకే ఏడాది 1899లో పుట్టారు. వీళ్ళ లైఫ్‌లో ఏ ఈవెంట్ ఏ ఏడాది జరిగినా గానీ అప్పటికి ఒక ఏడాది కలుపుకుంటే అదే వాళ్ళ వయసు. హెమింగ్వే 1926లో మొదటి నవల పబ్లిష్ చేశాడూ అని చదవగానే +1 కలుపుకుని ఇరవై ఏడేళ్ళ వయస్సులో రాశాడన్నమాట అనేసుకోవచ్చు సులువుగా. నబొకొవ్ 1940లో అమెరికా ఓడ ఎక్కాడూ అంటే నలభై ఒక్కేళ్ళకు అని అర్థమైపోతుంది ఈజీగా. ఇలా దేవుడు రైటర్లని పుట్టించేటప్పుడు కాస్త నా లాంటి లెక్కల్రాని రీడర్ల సౌకర్యం గురించి కొంచెం ఆలోచించాలి.

April 27, 2024

@ తెలుగు క్రిటిక్స్

? తెలుగులో క్రిటిక్స్ అంతరించిపోయారూ, క్రిటిసిజం మళ్ళీ మొదలవ్వాలీ అన్న మాటలు విన్నప్పుడల్లా నాకు కొన్ని హారర్ సినిమాలు గుర్తొస్తాయి. అంటే ఫరెగ్జాంపుల్ మమ్మీ లాంటి సినిమాల్లో వందలేళ్లుగా నిద్రపోయిన దెయ్యాన్ని నిద్రలేపాకా ఆ లేపినవాళ్ళే ఎందుకు లేపామా అని బాధపడే పరిస్థితులు వస్తాయి కదా అలాగన్నమాట, అంటే లేపి తన్నించుకోడం లాగన్నమాట. 

? ఐనా అసలు ఇప్పుడు విమర్శ లేదూ అంటానికి ఒకప్పుడేమైనా పెద్ద గొప్ప విమర్శ ఉండేడిచిందా? ఓ.. అని నోరేసుకు పడిపోటమే విమర్శ అయితే రాచమల్లు రాంచంద్రారెడ్డి, అక్కిరాజు ఉమాకాన్తం లాంటోళ్ళు విమర్శకులే. ఇంక వల్లంపాటి, చేకూరి లాంటోళ్ళయితే మంచి కథో కవితో వచ్చి ముక్కు మీద గుద్దినా గుర్తుపట్టలేరని నా ఫీలింగ్. మోడ్రన్ తెలుగు లిటరేచర్‌లో విమర్శ ఎప్పుడూ లేదు. 

? ప్రపంచంలో ఎక్కడైనా ఒక రైటర్ రాసిందాన్ని ఒక సోషల్ డాక్యుమెంట్ లాగ, సోషల్ రియాలిటీకి ఎవిడెన్స్ లాగ తీసుకుని సోషియాలజిస్టులు వాళ్ళ కామెంటరీలు వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ మటుకు ముందే ఐడియలాజికల్ బాక్‌గ్రౌండ్లతో సోషియాలజిస్టులు చేసిన కామెంటరీలని రైటర్ల ముందుపెట్టి ఫాలో అవమంటారు. గొర్రెల్లాంటి కొంతమంది రైటర్లు వాటిని బాగా ఫాలో అవుతున్నారనో సరిగా ఫాలో అవటం లేదనో తేల్చి చెప్పటమే ఇక్కడ క్రిటిసిజం, అలాంటి సూడో సోషియాలజిస్టులే ఇక్కడ క్రిటిక్స్, వాళ్ళ సెల్ఫ్ రిఫరెన్షియల్ గేమే ఇక్కడ canon. ఇకముందైనా ఇక్కడ వచ్చే ఏ క్రిటిసిజమూ అంతకుమించి ఉండదు. అంతోసిదానికోసం అది లేదే అని ఓ ఫీలైపోనవసరం లేదు. అది చస్తే చచ్చినందుకు సంతోషం కూడా. 

? క్రియేటివ్ ఎనర్జీ అనేది బ్యూటిఫుల్ విషయం. రాసినంతమంది రాసినన్ని విధాలుగా రాస్తారు. ఇప్పటిదాకా తెలుగులో ఎంచి చెప్తామని, దారి చూపిస్తామని బయల్దేరిన క్రిటిక్స్ అందరూ పక్కదారి పట్టించినవాళ్ళే. అలాంటోళ్ళు ఉన్నా లేకపోయినా ఏం పెద్ద తేడా పడదు. కతలూ కవితలూ రాసే జనాభా మరీ ఫేస్బుక్ పట్టనంత ఎక్కువైపోయి వాళ్ళంతా ఎలా పడితే అలా రాసేసి పుస్తకాలేసేసుకున్నా సరే… కొంపేం మునగదు మంచి విషయమే. కాలం కంటే పెద్ద క్రిటిక్ ఎవ్వడూ ఎలాగా లేడు.

 + + + 

 @ క్రిటిక్స్ 

 ఒక నలుగురి గురించి చెప్తాను. 

 DS Mirsky: డి.ఎస్. మిర్‌స్కీ అంటే ఉత్తి మిర్‌స్కీ కాదు; రాకుమారుడు (ప్రిన్స్) మిర్‌స్కీ. కానీ రాచరికం అంతా పేరుకే. ఎప్పుడు ఊహించుకున్నా కుట్లూడిపోయిన కోటుతో, రెండ్రోజుల గడ్డంతో గుర్తొస్తాడు. రష్యన్ విప్లవం తర్వాత కొన్నాళ్ళు విదేశాల్లో తలదాచుకున్నాడు. కానీ రష్యా మీద బెంగతో వెనక్కి పోకుండా ఉండలేకపోయాడు. కానీ పాపం స్టాలిన్‌కి స్వతంత్రమైన ఆలోచన, సున్నితత్వం, తెలివీ అంటే ఏవగింఫు కాబట్టి మిర్‌స్కీని అట్నించటే సైబీరియా లేబర్ క్యాంపులకి పంపాడు (ఇక్కడ పెట్టిన ఫొటో అరెస్ట్‌కి ముందు తీసిన ఆయన మగ్ షాటే). సైబీరియా మంచు లోనే బరువులు మోస్తూ చచ్చిపోయాడు. అయితే ఆయన చావు బతుకుల విషయం కాదు ఇక్కడ చెప్పదల్చుకున్నది. ఆయన ‘హిస్టరీ ఆఫ్ రష్యన్ లిటరేచర్’ అనో పుస్తకం రాశాడు. అది అవటానికి లిటరరీ హిస్టరీనే గానీ, అందులో క్రిటిసిజం కూడా ఉంటుంది. నేను ప్రింట్ తీసి బైండ్ చేయించి మొత్తం ఒకసారి చదివేను. తర్వాత నాకు చదవాలనిపించిన ఒక్కో రైటర్ మీద ఉన్న అధ్యాయాల్ని మటుకు తీసుకుని చాలాసార్లు చదివేను. అంతకుముందు దాకా నాకు సాహిత్యాన్ని ఒక ఆర్గనైజేషన్‌గా– అంటే పరస్పర ఆదాన ప్రదానాల మీద నడిచే వ్యవస్థ లాగ చూట్టం మీద నమ్మకం ఉండేది కాదు. ఈ పుస్తకం చదివాక అభిప్రాయాలు మారాయి. ఒక లిటరరీ ట్రాడిషన్ తనని తనే తీర్చిదిద్దుకుంటూ, తనని తనే మోడిఫై చేసుకుంటూ ఎలా ముందుకి ప్రవహిస్తుందన్నది అదంతా కళ్ళ ముందు జరుగుతున్నట్టే చెప్తాడు. ఒక పుష్కిన్ గానీ, ఒక దాస్తోయెవ్‌స్కీ గానీ, ఒక చెహోవ్ గానీ వాళ్ళంతట వాళ్ళుగా పుట్టలేదు, ఎవరికి వారుగా రాసుకుంటూ పోలేదు. పరస్పరం అందించుకున్నారు, పరస్పరం స్పందించారు. అలా రష్యన్ సాహిత్యం మొత్తం ఎలా తనని తాను మలుచుకుందో ఒక ఐదొందల పేజీల్లో ఎంతో సాంద్రంగా, కానీ ఎంతో ఇష్టంగా చదివించేలాగ చెప్తాడు. అలాగని ఏ రచయితనీ పొలోమని పొగడటం గానీ, ఆకాశానికెత్తటం గానీ ఉండదు. వాళ్ళకి అంత తాహతు ఉన్నా కూడా. పైగా ఇదంతా చదివినా మిర్‌స్కీ ఫేవరెట్ రైటర్ ఎవరంటే మనం చెప్పలేం. అలాగని లిటరరీ హిస్టరీ కాబట్టి పుట్టిన గిట్టిన తేదీల క్రానాలజీతో, ఎండుగా రుచీపచీలేని పాండిత్యంతో కూడా ఉండదు (ఈ కోవలోవే మన పింగళి లక్ష్మీకాంతం, ఆరుద్ర పుస్తకాలు చదవబోతే నీరసం వచ్చింది). ఏదో చార్లెస్ డార్విన్ ‘అరిజన్ ఆఫ్ స్పీషీస్’ గురించి చెప్తున్నంత మెథాడికల్‌గా చెప్పుకుంటూ పోతాడు. కానీ అందులోనే ఎంతో ఎమోషన్ ఉంటుంది. అదెలాగంటే ఆ రీసెర్చ్‌నీ, అందులోని డిస్కవరీల్నీ ఆత్మలోకి ఆకళింపు చేసుకున్న తీరునీ— అంటే ఈ పేజీల్లో గాక, ఈ పేజీల వెనక ఒక్క మనిషి ఖర్చు పెడుతున్న సృజనాత్మక శక్తినీ ఒకసారి తల్చుకుంటే ఒళ్ళు గగుర్పొడిచే ఎమోషన్ కలుగుతుంది నాకైతే. 

 Ueada Makoto: ఈయన ఎలా బతికాడో ఎలా చనిపోయాడో వివరాలేవీ పెద్ద ఎప్పుడూ వెతకలేదు. ఈయన రాసిన విమర్శ చూస్తే మటుకు చాలా డియర్ మనిషి అనిపిస్తాడు. ‘మోడ్రన్ జాపనీస్ రైటర్స్ అండ ద నేచర్ ఆఫ్ లిటరేచర్` అన్న పుస్తకం పూర్తిగా చదివాను. ఇందులో మోడ్రన్ జాపనీస్ రచయితల గురించి (అంటే లేట్ నైన్టీత్ సెంచరీలో పుట్టి ఎర్లీ ట్వంటీయత్ సెంచరీ లోకి రాసినవాళ్ల గురించి) వ్యాసాలుంటాయి. నత్సుమే సొసేకీ, నవోయ షిగా, అకుతగవ ర్యసునొకె, యుకియొ మిషిమా లాంటి జాపనీస్ నవలా రచయితల్ని ఎనిమిది మందిని సెలెక్ట్ చేసి రాశాడు. ఇందాక డి.ఎస్. మిర్‌స్కీ పుస్తకం అంత స్కోప్ లేకపోయినా అదే సోల్ ఉంటుంది ఇందులో కూడా. ఆ ఎనిమిది మంది జాపనీస్ నవలా రచయితలూ వెస్ట్రన్ ట్రాడిషన్ నుంచి ఏమేం తీసుకున్నారో, దాన్ని లోకల్ జాపనీస్ ఈస్థటిక్స్‌కి తగ్గట్టు అన్వయించుకుంటూ ఎలా దిగుమతి చేసుకున్నారో చెప్తుంటే ఒక నవల లాగ చదువుకుంటూ పోవచ్చు. ముఖ్యంగా నవొయ షిగా అన్న రచయితని ఇంకా దగ్గరగా నాకు పరిచయం చేసింది. ఆయన మీద ఉన్న ఒక్క అధ్యాయాన్ని ఇప్పటికి మూడు సార్లు చదివాను. ఎన్నోసార్లు అనువదించాలనిపించింది. బహుశా షిగా గురించి షిగా చెప్పుకుంటే కూడా అంత వివరంగా చెప్పుకోలేడేమో అనిపిస్తుంది. అలాగే మరో పుస్తకం ‘లిటరరీ అండ్ ఆర్ట్ థియరీస్ ఇన్ జపాన్’ అన్నది. పుస్తకం పూర్తిగా చదవలేదు గానీ, ఇందులో నోరినాగ అన్న జాపనీస్ క్రిటిక్ మీద రాసిన చాప్టర్ నాకు చాలా ఇష్టం. అది కూడా అనువదించాలని చాలాసార్లు అనిపించింది. దీని ఆధారంగా ఒక పోస్ట్ కూడా ఇదివరకు పెట్టాను. ఒక క్రిటిక్ మీద ఇంకో క్రిటిక్ వ్యాసం రాస్తే అది ఒక కథల్రాసుకునేవాడ్ని నాకెందుకు అంత నచ్చింది? అందులో నోరినాగ వివరించిన 'Mono no aware’ అన్న ఒక కాన్సెప్ట్ గురించి ఉయెద మకొతొ ఎంతో బాగా చెప్తాడు. చెహోవ్ కథల నుంచి చైలాన్ సినిమాల దాకా వాళ్ళ ఆర్ట్‌లో నాకు కామన్‍గా నచ్చుతున్నదేమిటో నాకే అర్థమయ్యేలా ఆ కాన్సెప్ట్ ఎంతో వివరంగా మాటల్లో పెట్టి చెప్పింది. 

Joseph Frank: ఈయన్ని క్రిటిక్ అనొచ్చో లేదో నాకు తెలియదు. ఇందాక ఓ లిటరరీ హిస్టారియన్‌ని క్రిటిక్స్ కేటగిరీలో చేర్చినట్టే ఇప్పుడు ఒక బయోగ్రాఫర్నీ చేరుస్తున్నాను మరి. ఈయన దాస్తోయెవస్కీ బయోగ్రాఫర్. దాస్తోయెవస్కీ జీవితం రాయటానికి ఏకంగా ఒక్కోటీ ఐదొందల పేజీలుండే ఐదు వాల్యూములు ఖర్చుపెట్టాడు. నేను ఐదు పుస్తకాలూ చదివేయలేదు. ఆ ఐదు పుస్తకాల్నీ కలిపి ఒక్కటిగా చేసి తెచ్చిన వెయ్యి పేజీల ‘ఎ రైటర్ ఇన్ హిస్ టైమ్’ అన్న పుస్తకం మటుకు చదివాను. ఒక రచయితని అతను బతికిన స్థలకాలాల contextలో ఇంత లోతుగా చూడొచ్చా అనిపించింది. అసలు ఒక రచయిత తన స్థల కాలాల్లో ఇంత విడదీయరానంతగా ఇమిడిపోతాడా అనిపించింది. (ఇది అందరి విషయంలోనూ అప్లయ్ కాకపోవచ్చు, కానీ దాస్తోయెవస్కీ విషయంలో అప్లయ్ అవుతుంది, అది జోసెఫ్ ఫ్రాంక్ గుర్తుపట్టాడు). ఒక్క దాస్తోయెవస్కీ జీవితం అని గాక, ఆయన్ని మలిచిన ప్రతీ ఆ కాలపు వివరం మనకు ఇందులో తెలుస్తుంది. ఒకరకంగా చూస్తే దాస్తోయెవస్కీ అన్న కేరెక్టర్‌ని వెంబడిస్తూ ఆనాటి కాలాన్ని ఎక్స్‌ప్లోర్ చేస్తున్న నవల లాగా సాగుతుంది. ఇలాంటి బయోగ్రాఫర్‌ని దొరకపుచ్చుకోవటంలో మటుకు దాస్తోయెవస్కీ చాలా లక్కీ, టాల్‌స్టాయి కంటే కూడా. 

 James Wood: ఇక్కడ చెప్పిన నలుగురిలో ఇంకా బతికున్నది ఈయనొక్కడే. బేసిగ్గా పెద్ద పెద్ద మేగజైన్స్‌కి బుక్ రివ్యూలు రాస్తాడు. కొంత nasty caustic wit, కొంత ‘ప్లేయింగ్ టు ద గాలరీ’ కనిపిస్తాయి. నిజానికి నాకు నచ్చిన రచయితలెవరూ ఈయనకి పెద్ద నచ్చరు (హెమింగ్వే, నబొకొవ్). ఈయనకు నచ్చిన రచయిలెవరూ నాకు పెద్ద నచ్చలేదు. ఉదాహరణకి, సాల్ బెల్లోని ఎప్పుడు ప్రయత్నించినా ఇష్టంగా చదవలేకపోయాను. కానీ ఈయన సాల్ బెల్లో గురించి రాసిన వ్యాసాలు చదువుతుంటే నాకు కలిగే ‘an idea of Saul Bellow’... నా ఊహల్లో నేను కట్టుకున్న సాల్ బెల్లో… ఆ ఊహ మటుకు నాకు ఎంతో ఇష్టం, ఎంతో ముఖ్యం. ఎందుకు ముఖ్యమంటే మనకి ఒక్కోసారి నేరుగా రచయితలే ఉదాహరణగా నిలబడక్కర్లేదు. అలాంటి ఉదాహరణలు సాధ్యమేనన్న పాజిబిలిటీ వేరేవాళ్ళ మాటల్లో చూచాయగా రూపుకట్టినా చాలు, అది ఎంతో ఇన్‌స్పిరేషన్ ఇస్తుంది. మంచి క్రిటిక్స్ చుట్టూ రాస్తున్న రచయితల గురించి రాయటమే కాదు, ఆ రాయటంలో ఇంకా పుట్టని రచయితల్ని కూడా ఊహించి, ఆ ఊహల్ని మన కళ్ళ ముందు నిలపగలరు. 

 * * * 

ఈ పైన చెప్పినోళ్ళు గొప్పోళ్ళనో, వాళ్ళని చదవమనో కాదు ఇదంతా. క్రిటిసిజం అంటే ఏమని నా దృష్టిలో పెట్టుకుని దీనికి ముందు పోస్ట్ రాసానా అని తల్చుకుంటే ఈ నలుగురి పేర్లూ వెంటనే గుర్తొచ్చాయి, వాళ్ళు నాకేం ఇచ్చారో చెప్పాలనుకున్నా అంతే. నిజానికి నేనెప్పుడూ “విమర్శ” అని పని గట్టుకుని చదవలేదు. అందుకే ఈ నలుగురిలో కూడా ఒకరు లిటరరీ హిస్టారియన్, ఒకరు బయోగ్రాఫర్ ఉన్నారు. నా వరకూ నాకు విమర్శ చేయాల్సిన పని (సాహిత్య సారాంశాన్ని విడమర్చి చెప్పటమన్నది) చాలాసార్లు రైటర్లే స్వయంగా చేశారు. అలాగని రైటర్లు పని గట్టుకుని విమర్శ వ్యాసాలు కూడా రాయక్కర్లేదు. వాళ్ళు వాళ్ళ ఇంటర్వ్యూల్లోనో, ఉత్తరాల్లోనో, డైరీల్లోనో, ఆత్మకథల్లోనో ఒకట్రెండు వాక్యాల్లో చేసిన అబ్జర్వేషన్స్ ఎంతో వాల్యుబుల్‌గా ఉంటాయి. 

ఉదాహరణకి మూడ్రోజుల క్రితం నేనొక హెమింగ్వే ఉత్తరం నుంచి కొన్ని మాటల్ని షేర్ చేశాను. అక్కడ ఆయన “ఎక్కడా పొరపాట్న కూడా నీ నవల్లోకి పెర్ఫెక్ట్ కేరెక్టర్లని రానివ్వకు,” అని తోటి రైటర్‌కి ఉత్తరం రాస్తూ జేమ్స్ జాయ్స్ ‘యులీసెస్‌’ నవలని పాడు కాకుండా కాపాడింది లెపోల్డ్ బ్లూమ్ అన్న కేరెక్టరే ననీ, స్టీఫెన్ డెడాలస్ అన్న మెయిన్ కేరెక్టర్ కాదనీ అంటాడు. స్టీఫెన్ డెడాలస్ అనే కేరెక్టర్ ఆల్మోస్ట్ జేమ్స్ జాయ్స్ తన మోడల్‌ లోనే సృష్టించుకున్న పెర్ఫెక్ట్ కేరెక్టరు. బ్లూమ్ మాత్రం జాయ్స్ ఎక్కడ్నుంచో ఏరేరి తెచ్చి కల్పించిన very human, very flawed కేరెక్టరు. ఇదే అబ్జర్వేషన్ మీద క్రిటిక్ ఒక వ్యాసం రాయొచ్చు. కానీ హెమింగ్వే లాంటోడు ఒక ఉత్తరంలో పాసింగ్ రిమార్క్ లాగా రాసిన వాక్యం ఇచ్చే హిట్ వేరే ఉంటది. నబొకొవ్ క్రిటిసిజం అని పనిగట్టుకుని పెద్దగా ఏం రాయలేదు. కానీ ఆయన ఉద్యోగార్థం ఒక యూనివర్సిటీలో లిటరేచర్ క్లాసులు చెప్పటం కోసం రాసుకున్న నోట్స్ అన్నీ కలిపి ఆయన చనిపోయిన తర్వాత రెండు పుస్తకాలుగా వేశారు. అలాగే గొగోల్ మీద బయోగ్రఫీలాగ రాసిన పుస్తకం కూడా ఒకటుంది. గొప్పగా ఉంటాయవి. తెలుగులో కూడా విమర్శకులు అన్న పేరు తగిలించుకున్నవాళ్ళు రాసినవి గాక ఇలా రచయితలు రాసినవే ఏ కాస్తో పనికొచ్చేవి ఉన్నాయి. శ్రీశ్రీ వ్యాసాలు, కృష్ణశాస్త్రి ‘కవి పరంపర’లో వ్యాసాలు, శేషేంద్ర ‘రక్తరేఖ’లో అబ్జర్వేషన్లు నాకు వెంటనే గుర్తొస్తున్నాయి. కానీ నేను మాట్లాడేది మోడ్రన్ తెలుగు లిటరేచర్ గురించి. వ్యాసుడు, కాళిదాసు, తిక్కన, పెద్దనల గురించో, బెంగాలీ రవీంద్రుడి గురించో కాదు. 

పైన నేను చెప్పిన నలుగురి లాంటి వాళ్ళ పుస్తకాలు చదివితే లిటరేచర్ మీద ప్రేమ పుడుతుంది. వాళ్ళు ఒక ఆర్ట్ వర్క్‌ గురించి మాట్లాడితే నేరుగా లైఫ్‍ గురించే మాట్లాడుతున్నట్టు ఉంటుంది. జ్ఞాపకం, కలలు, అన్‌కాన్షస్… ఫలానా ఆర్ట్ వర్క్ లో పైకి కనపడని లోతుల్లోకి సాయంగా చేయి పట్టుకుని తీసుకెళ్ళినట్టు ఉంటుంది. అలాంటోళ్ళెవరైనా ఆధునిక తెలుగు సాహిత్యంలో క్రిటిక్ అన్న పేరు మీద చెలామణీ అయ్యారా? థియరీ పుస్తకాల్లోంచి సగం సగం జీర్ణం చేసుకున్న సోషియలాజికల్ డిస్కోర్సులు తెచ్చి ఒర్రుడే తప్ప ఇంకేమైనా ఉండిందా? పునాదీ ఉపరితలం! లేదంటే చిన్నయ్య నన్నయ్య! కాదంటే పోస్ట్‌లూ లిక్విడ్లూ! ఉదాహరణకి What is the nature of Telugu prose? చలం మొదలుకొని రావిశాస్త్రి మీదుగా అది ఎలా మారుతూ ఇప్పుడు ఎక్కడికి వచ్చి ఆగింది? ఇది ఇప్పటికిప్పుడు రాస్తుంటే తట్టిన ఒక ఉదాహరణ అంతే. ఇలాంటి బేసిక్ విషయాల మీద ఎవరూ ఒక పేరాగ్రాఫ్ ఖర్చు పెట్టినట్టు ఎక్కడా కనపడదు. చిల్లర సోషలాజికల్ డిస్కోర్సు మాత్రం ఎక్కడ పడితే అక్కడ కుప్పలుతెప్పలుగా క్రిటిసిజం అంటే అదొక్కటే అన్నట్టు పొంగి పొర్లుతూ వచ్చింది. పోనీ అదైనా సోషల్ డైనమిక్స్‌ గురించి సైద్ధాంతిక అవగాహనతో మాట్లాడిందే తప్ప నేరుగా చుట్టూ లైఫ్‌ గురించి చుట్టుపక్కల మనుషుల గురించి నిశితంగా మాట్లాడుతున్నట్టు ఎప్పుడూ మాట్లాడలేదు. ఇప్పుడది పాపం చచ్చిపోయిందీ అంటున్నారు. చచ్చిపోయినట్టు నాకైతే అనిపించటం లేదు. ఇంకా ఎక్కడ చూసినా అదే కనపడతా ఉంది. ఒకవేళ అది చచ్చినా పెద్ద తేడా పడేదేం లేదూ అన్నది నా ఫీలింగ్. As I said before, creating something is in itself a beautiful thing. ఆ వాతావరణం ఒకటి ఉంటే చాలు. ఒకరి నుంచి ఒకరు ఇన్‌స్పయిర్ అవుతారు. అందులోంచి నేర్చుకుంటారు. కొత్తవి పుడతాయి.

October 25, 2023

చెఖోవ్ మీద గోర్కీ, కుప్రిన్, బునిన్ వ్యాసాలు

రచయిత చనిపోయాక రాసే నివాళి వ్యాసాలు రెండు రకాలు: ఒకటి- అతని రచనల విలువా, సాహిత్యంలో అతని స్థానం ఏమిటన్నది అంచనా వేసేవి. రెండు- ఈ రచనల గొడవంతా పక్కనపెట్టి రచయిత స్వభావాన్ని, అతనితో ఉన్న పరిచయాన్ని తల్చుకునేవి. నాకు ఈ రెండో రకంవి ఎక్కువ నచ్చుతాయి. ఇలాంటి వ్యాసాలతో వచ్చే పుస్తకాలు కూడా చదువుకోవటానికి బావుంటాయి. ఒకరకంగా ఫిక్షన్ తర్వాత ఇది నా ఫేవరెట్ జాన్రా (రచయితల డైరీలు, ఉత్తరాలతోపాటు). మామూలు మనుషులు ఎంత రసవత్తరంగా బతికినాసరే, దాని గురించి అక్షరాల్లో ఋజువు చెప్పగలిగే సాక్షులెవ్వరూ దరిదాపుల్లో ఉండరు గనుక, ఆ జీవితాలు ఎవ్వరికీ తెలియకుండా మట్టిలో కలిసిపోతాయి. రచయితల విషయంలో మటుకు వాళ్ళు ఎంత మామూలుగా బతికినాసరే, దాన్ని నమోదు చేయటానికి వాళ్ళ చుట్టుపక్కల కాస్త వాక్యం పట్టుబడినవాళ్లుంటారు. అదొక ప్రివిలేజి. ఈ నివాళి వ్యాసాల్ని కల్పితమేమీ లేకుండానే జీవితం కథలుగా మారే సందర్భాలుగా చూస్తాను. అలాగని ఈ నివాళి వ్యాసాల్లో కూడా ఫిక్షన్ కలిపి కమ్మగా వడ్డించేవాళ్ళు లేరనటం లేదు. కానీ అవి కూడా చదువుకోవటానికి, నవ్వుకోవటానికి బాగానే ఉంటాయి. ఒకాయన రాసిన రెండు మూడు నివాళి వ్యాసాల్లో ఒకేలాంటి సన్నివేశం తిప్పితిప్పి వస్తూంటుంది- చనిపోయిన రచయితని ఈయన మూడో మనిషెవరూ లేనిచోట కలుస్తాడు, ఆ చనిపోయిన రచయిత ఈయన గురించి తియతియ్యగా పొగుడుతాడు, ‘నా తర్వాత ఇంకెవ్వరూ రారనుకున్నాను నువ్వొచ్చావు’ అంటాడు. ఇంకొకాయన తన అభిప్రాయాలని ఆ చనిపోయిన మనుషులకి ఆపాదించి వాళ్ళ నోట్లోంచి ప్రసంగాలు ఇస్తుంటాడు. ఇంకొకడు బతికున్న  మనుషుల మీద పగ తీర్చుకోవటానికి చనిపోయిన మనుషుల నోళ్ళలో తన మాటలు కూరుతుంటాడు. మరొకడెవడో ‘ఎంత గొప్ప రైటర్ అయితేనేం పాపం చివర్లో పచ్చళ్ళు అమ్ముకున్నాడ’ని జాలి పడతాడు. ఒక కమ్యూనిస్టు విమర్శకుడి స్మరణ సంచికలో అందరూ అతని సైద్ధాంతిక నిబద్ధతని తల్చుకుంటూ రాస్తే, కొడుకు మాత్రం ‘మా నాన్న ఇల్లు గాలికి వదిలేసి జెండాలు పట్టుకుని తిరిగినా అమ్మ దగ్గరుండి చదివించబట్టి సాఫ్ట్వేర్ జాబు తెచ్చుకుని అమెరికాలో సెటిల్ అవ్వవగలిగాను‘ అన్న ధోరణిలో రాస్తాడు. ఇవన్నీ కూడా నాకు కథల్లాగే ఉంటాయి. ఆత్మీయంగా రాసేవాళ్ళు ఒకలాంటి కథలు చెప్తే, ఇలాంటివి రాసేవాళ్ళు ఇంకోలాంటి కథలు చెప్తారు. అవి వాళ్ళనే బైటపెట్టేట్టు ఉంటాయి. అందుకే ఈ పుస్తకాలు బావుంటాయి నాకు. ఒక మనిషి మిగిల్చిపోయిన ఖాళీ చుట్టూ వీళ్ళంతా చేరి తమ జ్ఞాపకాల్లోంచి ఏరిన ముక్కలతో మళ్ళీ అతని ఉనికిని పేర్చడానికి ప్రయత్నించడం... అవన్నీ పొసిగీ పొసగకా ఒక అసహజమైన మూర్తి ఏర్పడటం, దాంట్లోనే ఏ మూలో ప్రాణమున్న అసలు మనిషి మినుమినుకులాడటం... ఇది బావుంటుంది. ముఖ్యంగా ఆ మనిషి మనం ఎంతో ఇష్టపడి ఎప్పుడూ కలవని రచయిత అయినప్పుడు. నాకు ఎంతో నచ్చిన కొందరు రచయితల స్వభావాల్ని నేను ఇలా స్మృతి రచనల్లోంచే ఏరుకుని కట్టుకున్నాను. 

చెఖోవ్ ఉత్తరాలు చదువుతుండగా– మధ్యలో అతని మీద మాక్సిమ్ గోర్కీ, అలెగ్జాండర్ కుప్రిన్, ఇవాన్ బునిన్ రాసిన ఈ స్మృతి రచనల పుస్తకం మీదకు దృష్టిపోయింది. ఇది ఉందని ఎప్పడో తెలుసు, కానీ పూర్తిగా చదవటం ఇప్పుడే కుదిరింది. రాసినవాళ్ళల్లో గోర్కీ అందరికీ తెలిసినవాడే. కుప్రిన్ తెలుగువాళ్లకి రాళ్లవంకీ కథల పుస్తకంతో, యమకూపం నవలతో తెలుసు. ఇవాన్ బునిన్ బహుశా నోబెల్ బహుమతి పొందిన ఒకానొక రైటరుగా తెలిసుండాలి. వీళ్లు ముగ్గురూ చెఖోవ్ కంటే దాదాపు పదేళ్ళు చిన్నోళ్ళు. నలభై నాలుగేళ్ళ వయస్సులో చనిపోయిన చెఖోవ్ కి చివరి పది పదిహేనేళ్ళల్లో పరిచయమైనవాళ్ళు. వీళ్ళ ముగ్గురి వ్యాసాల్లోనూ దాదాపు ఒకే రకమైన చెఖోవ్ కనపడతాడు. కానీ నుదురు ముడి వేసుకుని గంభీరంగా కనిపించే ఈ చెఖోవే నిజమైన చెఖోవ్ అని నేను అనుకోను. ఎందుకంటే వీళ్ళకు తెలిసిన చెఖోవ్ క్షయ రోగం ముదిరి చావు పొంచి ఉందని తెలిసినవాడు, ఆ ఎరుక తెచ్చే గాంభీర్యమో నైరాశ్యమో ఉట్టిపడేవాడు. అంతకుముందులా చిలిపిగా, సరదాగా, ప్రాంక్‌లూ ప్రాక్టికల్ జోకులేసే చెఖోవ్ వీళ్ళకు పెద్దగా తెలియదు (ఆ చెఖోవ్ తొలి రోజుల్లో రాసిన ఉత్తరాల్లో కనపడతాడు). కాబట్టి ఆ సరదా చెఖోవ్ వీళ్ళు రాసిన ఈ వ్యాసాల్లో అరుదుగా మాత్రమే బైటకొస్తుంటాడు. అలా బైటకొచ్చిన సందర్భాల్ని ముగ్గురూ గుర్తుపట్టి అపురూపంగా తల్చుకుంటారు. ఈ కింద కోట్ చేసిన గోర్కీ మాటల్లో కనపడే చెఖోవే దాదాపు మిగతా ఇద్దరి వ్యాసాల్లోనూ కనపడతాడు—అంతరంగంలో పూర్తి స్వేచ్ఛ పొందిన మనిషి, రచయితలంటే ఇలా ఉండాలన్న అంచనాలకి అందని మనిషి, జీవితానికి సంబంధించిన గంభీరమైన సంభాషణలంటే దూరం జరిగే మనిషి, ఎవరైనా స్వభావాన్ని దాచి ముసుగేసుకుంటే అస్సలు భరించలేని మనిషి…:

“He was always himself, inwardly free, and he never troubled about what some people expected and others—coarser people—demanded of Anton Chekhov. He did not like conversations about deep questions, conversations with which our dear Russians so assiduously comfort themselves…’’

ఈ ‘‘inwardly free’’ అన్న అర్థంలో చెఖోవ్ గురించి ముగ్గురూ మాట్లాడతారు. చెఖోవ్ మతం నుంచి, సమాజంలో చర్విత చర్వణంగా దాపురించే సంప్రదాయాల నుంచి, దేశభక్తి లాంటి అందరూ గుడ్డిగా ఒప్పుకునే చట్రాల నుంచి, సామాజిక సిద్ధాంతాల ఒరవడి నుంచి పూర్తిగా విముక్తి చెందిన మనిషి. నేను ఆయన కథలు చదివి ‘‘ఆయన ఇలాంటివాడయ్యుంటాడు’’ అని చేసుకున్న ఊహలని నిర్ధారించి చెప్పేలాంటి మాటలు ఈ పుస్తకంలో చాలా ఉన్నాయి. అవ్వేగాక, రచన గురించి చెఖోవ్ చెప్పిన మాటల్ని కూడా కొన్ని చోట్ల కోట్ చేశారు. ముఖ్యంగా కుప్రిన్ వ్యాసంలో. అవి కొన్నే అయినా నాకు ఆసక్తిగా అనిపించింది. మామూలుగా ఈ 19వ శతాబ్దం రచయితల ఇంటర్వ్యూలెక్కడా దొరకవు. వీళ్ళెవ్వరూ 20వ శతాబ్దం రచయితల్లాగ  ‘పారిస్ రివ్యూ’ ఇంటర్వ్యూల లాంటి ఇంటర్వ్యూల్లో తమ రచనా పద్ధతుల గురించి చెప్పుకోలేదు. అందుకే ఈ రెమీనిసెన్సుల్లో చెఖోవ్ తన రచన గురించి మాట్లాడిన మాటలు నాకు ప్రత్యేకంగా అనిపించాయి.  

చెఖోవ్ ఎప్పుడూ నోట్సు రాసి పెట్టుకోవద్దు అన్నాడట కుప్రిన్ తో. అంటే రచయితలు జ్ఞాపకంలో ఉంచుకోవాలని కొన్ని సంఘటనలని రాసి పెట్టుకుంటారు కదా, అలాగ. ఉండాల్సిన పెద్ద విషయాలైతే ఎలాగూ జ్ఞాపకంలో ఉంటాయన్నది ఆయన థియరీ: ‘‘Chekhov had just strongly advised us not to have recourse to notebooks for help but to rely wholly on our memory and imagination. ‘The big things will remain’—he argued—‘and the details you can always invent or find’.”

కథలకి టైటిల్స్ పెట్టడానికి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదని నేను అనుకుంటాను. పది కథల్లో నీకథకి ఒక ఐడీ కార్డులాగ తప్పితే టైటిల్స్ లో నాకే పరమార్థం కనపడదు. అలా అనుకునే నాకే ‘మరీ ఇంత మామూలు టైటిలా’ అనిపించేలాంటి టైటిల్స్ పెట్టాడు చెఖోవ్. ‘My Life’, ‘The Student’, ‘The Letter’, ‘The Bet’, ‘The Kiss’, ‘The Party’, ‘Misery’, ‘Neibhours’... ఇంతకన్నా టైటిల్స్ దొరకలేదా అనిపిస్తుంది అంత మంచి కథలకి. కానీ ఈ విషయం మీద ఆయనకో స్పష్టత ఉందని అర్థమైంది ఈ మాటల్లో: ‘‘Put as plain a title as possible—any that occurs to your mind—and nothing else. And again, why those subtitles: a psychological study, genre, nouvelle? All these are mere pretense. Also use as few brackets, italics and hyphens as possible. They are mannerisms.”

ఇంకోటి చెఖోవ్ ని ఏమాత్రం చదివున్న వాళ్ళకైనా తెలిసిపోయేదే. ఆయన ఎప్పుడూ ఇతివృత్తాలు గొప్పగా, ప్రత్యేకంగా ఉండాలని అనుకోలేదు: ‘‘Why write about a man getting into a submarine and going to the North Pole to reconcile himself with the world, while his beloved at that moment throws herself with a hysterical shriek from the belfry? All this is untrue and does not happen in reality. One must write about simple things: how Peter Semionovitch married Marie Ivanovna. That is all.’’ (‘‘ప్రపంచంతో సంధి కుదుర్చుకోవటానికి సబ్ మెరైన్ ఎక్కి ఉత్తర ధ్రువం పోయే మనిషి గురించీ, ఈలోగా ఇక్కడ గంటస్తంభం మీంచి పెద్ద పొలికేక పెడుతూ దూకి ఆత్మహత్య చేసుకునే అతని ప్రేయసి గురించీ ఎందుకు రాయడం? అదంతా అవాస్తవం, నిజజీవితంలో జరిగేది కాదు. రాస్తే మామూలు విషయాల గురించి రాయి: మేరీ ఇవనోవ్నా ని పీటర్ సెమీయొనోవిచ్ ఎలా పెళ్ళి చేసుకున్నాడు. అది చాలు.’’)

కుప్రిన్ రాసిన వ్యాసంలోనే చెఖోవ్ చెప్పిన ఇదో మంచి మాట ఉంది. నువ్వు వర్ణించే దాని మీద నువ్వే మచ్చటపడిపోకూడదు అంటాడు. దూరంగా నిలబడి వర్ణించమంటాడు. మనసులో వర్ణించేదాని మీద కొంత చికాకుపెట్టుకుని మరీ వర్ణించమంటాడు:

‘‘He also taught that an author should be indifferent to the joys and sorrows of his characters. ‘In a good story’—he said—‘I have read a description of a restaurant by the sea in a large city. You saw at once that the author was all admiration for the music, the electric light, the flowers in the buttonholes; that he himself delighted in contemplating them. One has to stand outside these things, and, although knowing them in minute detail, one must look at them from top to bottom with contempt. And then it will be true’.”

ఈ ముగ్గురు రాసిన వ్యాసాల్లోనూ ఉమ్మడిగా కనపడేది ఇంకొటకటి ఉంది— పని చేయటం అంటే చెఖోవ్ కి ఎంత ఇష్టమన్నది. సోమరిపోతు పాత్రలెన్నో రాసిన ఈ మనిషి పని, పని, పని అని పలవరిస్తుంటాడు. డాక్టరుగా ప్రాక్టీసు చేస్తూ, ఊళ్లల్లో స్కూళ్లు కట్టిస్తూ, నలుగురైదుగురున్న ఉమ్మడి కుటుంబాన్ని పోషిస్తూ, క్షయ రోగంతో చివరి రోజుల్లో చాలా బాధ పడుతూ, నలభై నాలుగేళ్ళ జీవితంలోనే అన్నేసి కథలు రాసిన చెఖోవ్ యువ రచయితలకి ఈ మాటలు చెప్పాడంటే నమ్మాలి. ఎంత రాయగలిగితే అంత రాయమంటాడు. సరిగా రాకపోయినా ఫర్లేదంటాడు. తర్వాత అదే వస్తుంది. ముందు యవ్వనాన్నీ, చేవనీ వేస్టు చేసుకోకూడదు. అది పని చేయాల్సిన వయసు. కుప్రిన్ కి ఇలా చెబుతాడు, ‘‘నువ్వు బాగా రాస్తావు. కానీ నీ దగ్గరున్న పదాలు చాలా తక్కువ. పదాలని సంపాదించాలి, మాటతీరుని పట్టుకోవాలి, అది జరగాలంటే రోజూ రాయాలి.’’: “ ‘Write, write as much as possible’—he would say to young novelists. ‘It does not matter if it does not come off. Later on it will come off. The chief thing is, do not waste your youth and elasticity. It's now the time for working. See, you write superbly, but your vocabulary is small. You must acquire words and turns of speech, and for this you must write every day’.”

ఫలానావాడ్ని ‘‘ప్రతిభలేనివాడు’’ అనటమే చెఖోవ్ కి తెలిసిన పెద్ద తిట్టు అంటాడు బునిన్: ‘‘The word ‘talentless’ was, I think, the most damaging expression he could use. His own failures and successes he took as he alone knew how to take them.’’

గొప్ప రచయితలని చదివి ‘‘వీళ్ళలాగ రాయలేనప్పుడు ఎందుకూ ఇక రాయడం’’ అని నిరుత్సాహపడే కొంతమంది నాకు తెలుసు. నాకు అలాంటి నిరుత్సాహం ఎప్పుడూ అర్థం కాలేదు. చెఖోవ్ అదే చెప్తాడు— పెద్ద కుక్కలుంటాయి, బుజ్జి కుక్కలుంటాయి, పెద్ద కుక్కల్ని చూసి బుజ్జి కుక్కలు డీలా పడకూడదు. ఎవరి చేతనైనట్టు వాళ్ళు మొరగాలి, దేవుడు ఇచ్చిన గొంతుతో…: ‘‘There are big dogs and little dogs, but the little dogs should not be disheartened by the existence of the big dogs. All must bark—and bark with the voice God gave them.’’

చెఖోవ్ అన్నాడని గోర్కీ రాసిందాన్ని మాత్రం అనువదించి పెడతాను. ఇది రచనకు సంబంధించింది కాదు, సమాజం గురించి. ఇక్కడ ‘రష్యన్’ అన్న మాట తీసేసి, ‘ఇండియన్’ అనో ‘తెలుగువాడు’ అనో పెడితే ఇది మన గురించే అనిపిస్తుంది:

‘‘రష్యన్ మనిషి ఓ చిత్రమైన జీవి. వాడొక జల్లెడ లాంటివాడు. వాడిలో ఏదీ మిగలదు. యవ్వనంలో ఆబగా తనకు ఎదురైన ప్రతీదీ ఆకళింపు చేసుకుంటాడు, కానీ ముప్పయ్యేళ్ళ తర్వాత బుర్రలో బూడిద తప్ప ఏమీ మిగలదు…. చక్కగా, మానవీయంగా బతకాలంటే పని చేయాలి, నమ్మకంతో, ప్రేమతో పని చేయాలి. కానీ అది మనవల్ల కాదు. ఆర్కిటెక్టు ఒకటి రెండు మంచి బిల్డింగులు కడతాడు, ఇక్క అక్కడితోసరి, తక్కిన జీవితమంతా కూర్చుని పేకాడతాడు, లేదంటే ఏదో నాటకాల గుంపు వెంటపడుతూ కనపడతాడు. డాక్టరుకి ప్రాక్టీసు పెరిగాక ఇక సైన్సు మీద ఆసక్తి పోతుంది, మెడికల్ జర్నల్ తప్పితే ఇంకేదీ చదవడు, నలభయ్యేళ్ళు వచ్చేసరికి సకల రోగాలకి కఫమే మూలమని నిజంగా నమ్మటం మొదలుపెడతాడు. చేసే పనికి అర్థమేమిటో తెలిసిన సివిల్ సర్వెంటు ఒక్కడిని కూడా నేను కలవలేదు: మామూలుగా వాడు నగరంలోనో, జిల్లాకి ముఖ్య పట్టణంలోనో కూర్చుంటాడు, ఊళ్లకి నివేదికలు రాసి పంపుతుంటాడు. వాడు రాసే ఒక నివేదిక ఊరిలో ఎవరిదో స్వేచ్ఛని పూర్తిగా హరించి వేయవచ్చు–కానీ దాని గురించి మన సివిల్ సర్వెంటు ఎంత తక్కువ ఆలోచిస్తాడంటే, నరకం గురించి నాస్తికుడు ఆలోచించినంత. మంచి డిఫెన్స్ అని పేరు మోసాక ఇక ఆ లాయరు న్యాయం గురించి పట్టించుకోవటం మానేస్తాడు, ప్రాపర్టీ హక్కుల్నీ, జూదశాలల్నీ మాత్రమే డిఫెండ్ చేస్తాడు, ఆయెస్టర్లు తింటాడు, సకల కళలనీ సమాదరిస్తాడు. ఒక నటుడు రెండు మూడు మంచి పాత్రల్ని పోషించాక, ఇక తన డైలాగుల్ని చూసుకోవటం మానేస్తాడు, సిల్కు హాటు పెట్టుకుని తానో జీనియస్సునని నమ్మటం మొదలుపెడతాడు. రష్యా ఒక తృప్తి లేని సోమరిపోతుల నేల: హితవుకి మించి తింటారు, హద్దు మీరి తాగుతారు, పగలే నిద్రపోతారు, నిద్రలో గురకపెడతారు. ఇల్లు చూసుకోవటానికి మనిషి కావాలి కాబట్టి పెళ్ళి చేసుకుంటారు, సమాజంలో గొప్ప కోసం ఇద్దరు ముగ్గుర్ని ఉంచుకుంటారు. వాళ్ళ సైకాలజీ ఒక కుక్క సైకాలజీ: వాళ్లని కొడితే జాలిగా కూస్తూ ఓ మూలకి వెళ్లిపోతారు; ముద్దు చేస్తే వెల్లకిలా పడుకుని గాలిలో కాళ్ళు ఊపుతూ తోకాడిస్తారు.’’

https://www.gutenberg.org/files/37129/37129-h/37129-h.htm

October 18, 2023

పెర్ఫెక్ట్ పేజీలు

చదివేటప్పుడు 'ఇది పెర్ఫెక్షన్!' అనిపించటం ఎప్పుడో తప్ప జరగదు. ఒక్క పేరా విషయంలోనైనా సరే. అలాంటిది ఇవాళ మధ్యాహ్నం ఇవాన్ తుర్గెనెవ్ 'ఫస్ట్ లవ్' నవలలో (Andrew R. Macandrew అనువాదంలో) ఏకంగా ఒకటిన్నర పేజీల పెర్ఫెక్షన్ చూశాను (ఆ జోరులోనే ఇందాకటి పోస్టు). నవలను నెరేట్ చేసే పదహారేళ్ల కుర్రాడు తను ప్రేమించిన అమ్మాయి దగ్గర వీడ్కోలు తీసుకొని అర్ధరాత్రి ఇంటికొస్తాడు. అతనికి నిద్ర పట్టని ఆ రాత్రిని రచయిత ఒకటిన్నర పేజీల్లో చెప్తాడు. అక్కడ పెర్ఫెక్షన్ ఏంటీ అన్నది అది చదివితేనే తెలుస్తుంది, కానీ పెర్ఫెక్షన్ ఎలా ఉంటుందీ అన్నది మటుకు ఇక్కడ చెప్పగలను: పదం తర్వాత పదం అది తప్ప ఇంకోటి రావటానికి వీల్లేదన్నట్టే వస్తుంది. వాక్యం తర్వాత వాక్యమూ అలాగే వచ్చికూచుంటుంది. ఆ వాక్యాలతో నీ చుట్టూ విప్పారే ప్రపంచం అసలు ప్రపంచం కంటే రియల్‌గా ఉంటుంది. ఆ వాక్యాల్లో ఉన్నది అంతకుముందు ఏ రచయితా రాయనట్టు, అసలు అలాంటి అనుభవం భాషలోకి రావటం ఇదే తొలిసారి అన్నట్టు ఉంటుంది. అలాంటి స్పష్టతతో, inevitablityతో ఒకటిన్నర పేజీల వచనం చదివాక ఇక యథాలాపంగా ముందుకు చదువుకుంటూపోవటం వీలు కాదు. ఆ ధారాపాతం నుంచి తేరుకుని, 'ఇప్పుడు నాకేం జరిగిందీ' అని గిల్లి చూసుకుని, పేజీలు వెనక్కి తిప్పి, మళ్ళీ చదువుకుంటాం. నేనైతే 'ఫస్ట్ లవ్' నవలలోని ఆ ఒకటిన్నర పేజీలనూ మళ్ళీ చదవటమే కాదు, నా దగ్గరున్న ఇంకో రెండు అనువాదాలు కూడా తీసుకుని ఆ పేజీలు ఎక్కడున్నాయో వెతికి చదివాను. ఇలాంటి పేజీలు లైఫ్ లో ఓ పది దొరికితే గొప్పే మరి! ఇలా ఇంకెప్పుడైనా అనిపించిందా అని ఆలోచించగానే– చప్పున బిభూతి భూషణ్ బంధోపాధ్యాయ 'అపరాజితుడు' నవల (కాత్యాయని అనువాదం) గుర్తొచ్చింది. ఆ నవలలో కొడుకు లేని సమయంలో సర్వజయ ఒంటరిగా చనిపోతుంది. ఆమె చనిపోయిన రాత్రిని ఒకట్రెండు పేజీలలో అనుకుంటాను చెప్తాడు రచయిత. ఆ పేజీలు చదివినప్పుడూ ఇలాగే, 'ఇది పెర్ఫెక్షన్' అనుకున్నానని గుర్తొచ్చింది. ఇంకా ఆలోచిస్తే ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితం చదివిన దాస్తోయెవస్కీ 'క్రైమ్ అండ్ పనిష్మెంట్' నవలలో (Constance Garnett అనువాదంలో) మార్మెలాడోవ్ తాగి వాగే పేజీలు గుర్తొచ్చాయి. ప్రూస్ట్ పేజీలు కొన్ని ఇప్పుడు గుర్తొస్తున్నాయి. ఇవిగాక ఇంకా ఉండే ఉంటాయి. కానీ ఎన్నో ఉండవు. వేళ్ల మీద లెక్కపెట్టచ్చు. టాలెంటెడ్ రచయితలు మహాయితే ఒక పేరా పెర్ఫెక్ట్ వచనాన్ని ఎప్పుడన్నా రాయగలరేమో. కానీ పేజీని దాటి అలా రాయాలంటే మాత్రం టాలెంట్ కి మించి ఏదో కావాలి. ఆ 'ఏదో' ఉన్నవాళ్లు కూడా ఈ విన్యాసాన్ని వాళ్ళ మొత్తం పుస్తకాల్లో రెండుమూడుసార్లు చేయగలరేమో, అని నా ఫీలింగ్.

September 6, 2023

పడి మునకలు కవర్ మీద చెహోవ్ బొమ్మ లేకపోవటమ్ గురించి

 ప్రపంచం మొత్తాన్నీ పొందికగా నడిపించగల ఒకేవొక్క మత గ్రంథాన్నో పౌర స్మృతినో నిర్మించాలంటే అందుకు సరైన ముడి సరుకు చెహోవ్ కథల్లో దొరుకుతుందీ అని నేననుకుంటాను. అలాగ నాది చెహోవ్ మతం, నేను చెహోవ్ దేశ పౌరుడ్ని. చెహోవ్ కథల వెనక (ముఖ్యంగా ఆయన జీవితంలో ఆఖరి పదిహేనేళ్ళలో రాసిన కథల వెనక) వ్యక్తావ్యక్తంగా తోచే నైతిక సారాన్నే నేను జీవితాన్ని నడుపుకోవటానికి ఆదర్శమని భావిస్తాను. కానీ అది ఏమిటో స్పష్టంగా మాటల్లో చెప్పమంటే నాకు కష్టం. అదే దాని అందం కూడా. ఇక్కడ సోషల్, పొలిటికల్ ఇష్యూస్ మీద రకరకాల వాదనలు జరుగుతుంటాయి. మనుషులు ఎటోఒకవైపు బలంగా నిలబడతారు. బల్లగుద్ది తీర్మానిస్తారు. నేను మటుకు ఎటూ గట్టిగా మాట్లాడలేను. పైగా నాలోని ఈ అశక్తతను ఒక అపురూపంగా కాపాడుకోవాల్సిన విషయంగా కూడా చూస్తాను. వ్యక్తి వ్యక్తికీ మారే ప్రపంచపు కంప్లెక్సిటీ, ఎవరో ఒకానొక వ్యక్తికి అన్వయించాక మాత్రమే అర్థంలోకి ఒదిగే ప్రపంచపు సింప్లిసిటీ... ఇవి నాకు చాలా ముఖ్యం. ఈ పట్టింపు చెహోవ్ కథల్లో కనపడుతుంది. అలాగైతే మరి ఈ పేరాను మొదలుపెడుతూ నేను చేసిన హైపాథెసిస్ ని కొట్టిపడేసేది కూడా, అంటే ప్రపంచాన్ని ఏకమొత్తంగా తీసుకొని ఏదైనా మాట్లాడటాన్ని అసాధ్యం చేసేది కూడా, చెహోవ్ కథలేనన్నమాట! ఈ వైరుధ్యంలోనే ఎక్కడో చెహోవ్ రిలవెన్స్ ఉంది. తన ethos ఏంటీ అన్నది చెహోవ్ కూడా ఎక్కడా స్పష్టంగా మాటల్లో పెట్టలేదు. ఒక ఉత్తరంలో బహుశా యథాలాపంగా ఇలా రాస్తాడు:

"My holy of holies is the human body, health, intelligence, talent, inspiration, love, and absolute freedom--freedom from violence and falsehood, no matter how the last two manifest themselves."

కానీ ఇదేనా, ఇంతేనా అంటే ఇంతకుమించి చాలా ఉంది కదా అనిపిస్తుంది. 'లేడీ విత్ ద లిటిల్ డాగ్' అన్న కథలో ఒక వివాహేతర సంబంధాన్ని గురించి చెహోవ్ రాసిన తీరు చూసి టాల్‌స్టాయ్, "ఇది ప్రపంచం పట్ల ఒక స్పష్టమైన దృక్పథం లేని, ఫలితంగా మంచీ చెడుల మధ్య విచక్షణ తెలీని మనిషి రాసిన కథ" అని విమర్శిస్తాడు (వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు తన నవల్లో అన్నా కరెనినాను రైలు కిందకి తోసి దండించిన టాల్‌స్టాయ్). మంచీ చెడుల మధ్య విచక్షణ తెలీనివాడు కాదు చెహోవ్. అలా మంచీ చెడులను విచక్షించగల ప్రమాణం కోసం మతంవైపో సంప్రదాయంవైపో సమాజంవైపో చట్టంవైపో చూడడు; ఆ కథలో ఉన్న "ఎవరో ఒకానొక వ్యక్తి"వైపూ, ఆ ఒకానొక సందర్భం వైపూ చూస్తాడు.

మొన్న రిలీజైన నా వ్యాసాల పుస్తకం బాక్ కవర్ పేజీ మీద నాకు బాగా నచ్చిన, నా రీడింగ్/ రైటింగ్ లైఫ్‌ని మలచిన కొంతమంది రచయితల ఫొటోలని ఉంచాను. కానీ ఆ ఫొటోల్లో చెహోవ్ మాత్రం లేడు. ఎందుకంటే ఆయన మీద రాసిన రాత ఒక్కటి కూడా ఆ పుస్తకంలో లేదు. రాసే సందర్భం ఎందుకో రాలేదంతే. ఆ వరసలో చెహోవ్ లేకపోవటం నావరకూ లోటే కానీ, ఏమీ రాయకుండా ఊరికే ఫొటో పెట్టబుద్ధేయలేదు. మిగతావాళ్ల ఫొటోలను మాత్రం ఇదే వరుసలో ఉంచమని చెప్పాను. దీన్ని నా ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అని కూడా అనుకోవచ్చు. వీళ్ళలో ఒకరిద్దరిని కొంతమంది గుర్తుపట్టలేదు. అందుకే అక్కడ ఫొటోలు వుంచిన వరుసలోనే వాళ్ల పేర్లిస్తున్నాను.

Tripura

Kafka

Chalam

Dostoevsky

Nabokov

Borges

Tolstoy

Flaubert

Salinger

(బాక్ కవర్ మీద ఉన్న కొటేషన్ 'పుస్తకాల్ని ఎందుకు పద్ధతిగా సర్దుకోవాలంటే!' అన్న లోపలి వ్యాసం నుంచి తీసుకున్నది. 'పడి మునకలు' అంటే ఏంటని ఒకరిద్దరు అడిగారు. టైటిలుకి అంత లోతైన అర్థమేం లేదు. పుస్తకాల్లో పడి మునకలేయటం అని అంతే.)

May 27, 2023

"meta" games are as old as Borges


టారంటీనో తను తీయబోతున్న తర్వాతి సినిమా 'ద మూవీ క్రిటిక్' గురించి మాట్లాడింది ఇందాక చదివాను. తన సినిమాలో కల్పిత పాత్ర అయిన ఆ మూవీ క్రిటిక్ నిజంగా బతికుంటే ఎలాంటివాడో, వాడు ఎప్పుడు పుట్టుంటాడో, రివ్యూలు ఎలాంటి శైలిలో రాస్తాడో, ఎలాంటి సినిమాలని ఇష్టపడుతూ రాస్తాడో, వాడు రివ్యూలు రాసే పత్రిక పేరేమిటో... ఇలా ఏదో చెప్పుకుంటూ పోతున్నాడు. తన ముందు సినిమా 'Once Upon a Time in Hollywood' లో కూడా కల్పిత పాత్రయిన ఏక్టర్ రిక్ డాల్టన్ విషయంలో కూడా ఇలాగే వాడేదో నిజంగా బతికిన నటుడన్నట్టు వాడెలాంటి సినిమాల్లో నటించుంటాడో, ఆ ఫేక్ సినిమా క్లిప్పింగులూ, ఫేక్ పోస్టర్లతో సహా చూపిస్తాడు. ఈమధ్య తన పాడ్‌కాస్టులో కూడా రిక్ డాల్టన్ ఏ నిజమైన సినిమాలకి ఆడిషన్ ఇచ్చాడో, వాడిది ఏ డైటో, ఏ బ్రాండ్ సిగరెట్టో అన్న లెవెల్లో డిస్కస్ చేశాడని విన్నాను. ఒక కల్పిత పాత్రని రియల్ లైఫ్ లో సిచ్యుయేట్ చేయటానికి చుట్టూ కొన్ని plausible facts పేర్చటం ఏదో గొప్ప ఆర్టన్నట్టు, అవి ఊహించటమే ఆ పాత్రని నిజం చేసేస్తుందన్నట్టు... ఈ హడావిడి అంతా నాకు కొంచెం ఓవర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి మెటా ఆటలన్నీ లిటరేచర్ లో ఇంతకంటే బాబులా ఆడినవాడిని ఆల్రెడీ చూసున్నాను కాబట్టి. 

అర్జెంటినా రచయిత బోర్హెస్ ఒక నవల రాయాలనుకున్నాడు. కానీ ఆయనకి కథలు తప్ప నవల రాసేంత ఓపిక లేదు. కాబట్టి ఒక కల్పిత రివ్యూయర్‌ని సృష్టించి వాడి చేత తను రాయాలనుకుని రాయలేకపోయిన నవల మీద తనే రివ్యూ రాసి ఆ రివ్యూనే కథలా ప్రెజెంట్ చేస్తాడు. అలాగే ఆయన 'గార్డెన్ ఆఫ్ ఫోర్కింగ్ పాత్స్' అన్న కథ రెండో ప్రపంచ యుద్ధంలో ఒక గూఢచారి ఇచ్చిన స్టేట్మెంటులో మొదటి రెండు పేజీలూ మిస్సయిన ఒక భాగం లాగ ప్రెజెంట్ చేస్తాడు. 'పీరే మెనార్డ్: ఆథర్ ఆఫ్ డాన్ కిహోటే' అన్న కథని ఒక కల్పిత రచయిత మీద క్రిటికల్ ఎస్సే లాగ రాస్తాడు. 'సర్క్యులర్ రూయిన్స్' అనే ఇంకో కథ ఒకడు అడవిలో పాడుబడ్డ దేవాలయానికి రావటంతో మొదలవుతుంది. వాడి ఉద్దేశం ఒక మనిషిని సృష్టించటం. ఆ పాడుబడిన గుడిలో నిద్రపోతాడు. ఆ నిద్రలో కనే కలల్లో ఒక మనిషిని రక్తమాంసాల్తో సహా, అవయవాల్తో సహా ఊహిస్తాడు. చివరికి ఆ మనిషిని వాస్తవ ప్రపంచంలోకి తెచ్చి వదులుతాడు. బైటి ప్రపంచంలోకి సాగనంపుతాడు. ఆ మనిషి వెళ్లిపోయాక, కథ చివర్లో వీడికి అర్థమయ్యేదేంటంటే- తను కూడా ఎవడి కలలోనో భాగమని. బోర్హెస్ ఇంకా ఇలాంటివి బొచ్చెడు రాశాడు. ఆయనే కాదు. జేమ్స్ జాయ్స్ కూడా ఒక కల్పిత రచయిత మీద వాడు ఉన్నాడన్నట్టు వాడి బిబిలియోగ్రఫీతో సహా కోట్ చేస్తూ ఎక్కడో ఉపన్యాసమిస్తే నిజంగానే అక్కడున్నవాళ్లందరూ సాహిత్య ప్రపంచానికి అంతవరకూ తెలియని కొత్త మహాద్భుతమైన రచయిత ఎవడో పుట్టుకొచ్చాడన్నట్టు నమ్మేశారట. నబొకొవ్ 'లొలీటా' నవల నిజంగా ఫలానా జైల్లో అరెస్టయి ఉన్నవాడు రాసుకున్న ఆత్మకథ లాగ, ఆ కథని వాడి లాయరే బైటి ప్రపంచానికి తెస్తున్నట్టు ఆ లాయరు రాసిన ముందుమాటతో సహా మొదలవుతుంది. నబొకొవ్ 'పేల్ ఫైర్' నవలేమో ఒక కల్పిత కవి రాసిన లాంగ్ పొయెంకి ఇంకో కల్పిత ప్రొఫెసర్ రాసిన క్రిటికల్ నోట్స్ లాగ ఉంటుంది. ఇలాంటి మెటా ఆటలన్నీ సాహిత్యంలో వందేళ్ల క్రితం నాటివి. అక్కడ పాతబడిపోయిన తర్వాత ఇప్పుడు ఈ "మెటా" అన్నది సినిమాల్లో పెద్ద విషయమయ్యింది.   

కానీ ఎందుకో ఈ మెటా గేమ్స్ అన్నీ సినిమాల దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం తేలిపోయినట్టనిపిస్తున్నాయి. ఒక పాత్రని రియల్‌గా అనిపించేట్టు చేసే ప్రయత్నంలో బైటి ప్రపంచంలో ఉన్న facts అన్నీ తెచ్చి ఆ పాత్ర చుట్టూ పేర్చటం పెద్ద విషయమేం కాదు. కానీ ఆ కేరెక్టరుని emotinally plausible human being గా మార్చటంలో ఉంటుంది అసలు పనితనం. నువ్వు ఒక పాత్రని సృష్టించి వాడు రాజమండ్రిలో ఫలానా హాస్పిటల్లో పుట్టాడని, వాడు ఫలానా కంపెనీ డైపర్స్ వాడేవాడని, వాడి ఉగ్గుగిన్నె ఈ షాపులో కొన్నారని రాసినంత మాత్రాన వాడు వాస్తవం అయిపోడు. వాడి అంతరంగం plausible గా ఉండాలి. వాడి స్వభావం consistent గా ఉండాలి. అవి నప్పేట్టు నమ్మేట్టు లేనప్పుడు నువ్వు రియల్ వరల్డ్ నుంచి ఎన్ని ఫాక్ట్స్ తెచ్చి వాడికి అప్లయి చేసినా వాడు నిజం అయిపోడు. ఆ ప్రయాస అంతా ఒక జిమ్మిక్ లాగ మిగులుతుందంతే.

March 29, 2023

'mono no aware' as a mode of perception

నాలుగేళ్ల క్రితం సంగతి... చెహోవ్ కథలేవో చదువుతున్నాను. నవోయా షిగా ‘డార్క్ నైట్ పాసింగ్’ నవల మొదటిసారి చదువుతున్నాను. ఓజు, నూరీ బిల్గె చైలాన్ సినిమాలు చూస్తున్నాను. నా కథలు ‘ముక్కు’, ‘డిగ్రీ ఫ్రెండ్స్’ లాంటివి రాస్తున్నాను.... ఇవన్నీ నన్ను ఒకలాంటి ఈస్థటిక్ స్థితిలోకి తీసుకువెళ్లాయి. అప్పుడే జపనీస్ ఈస్థటిక్స్ గురించి కొన్ని పుస్తకాలు చదువుతున్నాను. ఆ వరుసలో ఉయెద మకొతో రాసిన ‘Literary and Art Theories in Japan’ అన్న పుస్తకమూ, అందులో ‘Norinaga - On the Art of Writing (Shintoism and the Theory of Literature)’ అన్న అధ్యాయమూ దొరికాయి. ఆ అధ్యాయంలో సాహిత్యం గురించి నోరినాగ చెపుతున్న ప్రతి మాటా నా లోపల రూపంలేకుండా తిరుగుతున్న ఆలోచనల్ని ఒక చోటకు తెచ్చి పేర్చినట్టు అనిపించింది. పీచుమిఠాయి మెషీన్లో గింగిరాలు తిరుగుతున్న గులాబీరంగు దారప్పోగుల్ని ఒక పుల్లకి చుట్టి మనకిస్తాడు కదా అమ్మేవాడు... అలా నాలో అస్పష్టంగా చక్కర్లు కొడుతున్న ఆలోచనల్ని ఒక పర్యవసానానికి గుదిగుచ్చి నాకే బహుమతిగా ఇచ్చాడు నోరినాగ (1730-1801). ముఖ్యంగా నోరినాగ చెబుతున్న ‘mono no aware’ అన్న భావన నాకు నచ్చే తరహా రచనలకు, సినిమాలకు మూలం అనిపించింది. 

‘‘Living in this world, a person sees, hears and meets all kinds of events. If he takes them into his heart and feels the hearts of the events within it, then one may say the person knows the hearts of the events, the cores of the facts–he knows 'mono no aware'." - Norinaga 

(‘‘ప్రపంచంలో తన జీవిత గమనంలో మనిషి ఎన్నో రకాల ఘటనలను చూస్తాడు, వింటాడు. అతను ఆ ఘటనలను మనసులోకి తీసుకొని, వాటి వెనుక సారానికి స్పందించగలిగితే, అతనికి ‘మోనో న అవారె’ తెలుసు అని చెప్పవచ్చు’’)

ఈ ‘మోనో న అవారె’ అన్న జపనీస్ పదబంధం చాలా vauge expression. వర్డ్ టు వర్డ్ అర్థం చెప్పినా భావం అర్థం కావటం కష్టమే నంటారు. లిటరల్ అర్థం చెప్పమంటే: ‘‘చుట్టూ ప్రాపంచిక విషయాల్లో నిన్ను ‘ఆహ్’ అని నిట్టూర్చేట్టు చేసే అంశ’’ అని చెప్పచ్చు. "The 'Ah'ness of things", "the pathos of things" అని అర్థాలు రాస్తున్నారు ఇంగ్లీషులో. కానీ ఇది దుఃఖం కాదు, విషాదం కాదు. తెచ్చిపెట్టుకున్న కవితాత్మక ఉద్వేగం కూడా కాదు. మామూలు మనుషులకు అందని ఎలివేటెడ్ భావమేదో కూడా కాదు. ప్రపంచపు నశ్వరత్వం స్ఫురణకు వచ్చినప్పుడు దాని సౌందర్యం మనలో కలిగించే తేలికపాటి నిట్టూర్పు అనొచ్చేమో. జీవితాన్ని ఆలాపనలా వెన్నాడే ఒక దిగులు అనొచ్చేమో. కొన్ని రోజులు మాత్రమే బతికుండే చెర్రీపూలు చెట్ల నుంచి రాలుతున్నప్పుడు కలిగే భావనను ‘మోనో న అవారె’ కు ఒక ఉదాహరణగా ఎక్కువసార్లు చెబుతారు. అలాగని ఈ నిట్టూర్పు, దిగులు బుద్ధిస్ట్ వైరాగ్యం నుంచి వచ్చింది కాదు. వైరాగ్యంతో కూడిన బుద్ధిస్ట్, నీతిబద్ధమైన కన్ఫ్యూషియస్ స్పందనలను సాహిత్యంలో వ్యతిరేకిస్తాడు నోరినాగ. ఆయన ఈ ‘మోనో న అవారె’ అన్న భావాన్ని మానవ స్వభావంలోని ఒక సహజసిద్ధ స్పందనగా అర్థం చెప్పి, దాన్ని సాహిత్యానికి అన్వయిస్తాడు. మానవ స్వభావాన్ని ఉన్నది ఉన్నట్టు చూపటం, in itself, సాహిత్యానికి చాలా ముఖ్యమంటాడు. ఎందుకంటే, ఆధునిక మానవుడు స్వాభావికమైన స్పందనల నుంచి దూరం జరిగాడు కాబట్టి. సాహిత్యం చేయాల్సిన పని మనిషి స్వాభావికత్వాన్ని అతనికి గుర్తుచేయటం అంటాడు నోరినాగ. ఇలాంటి సాహిత్యంలో నంగి నైతికతకి, దొంగ ఉదాత్తతకి చోటుండదు. అది మనుషుల్ని పెడస్టల్ మీద కూచోబెట్టదు. విలువల తీర్పులివ్వదు. అందులోని పాత్రల్లోను, సన్నివేశాల్లోను ప్రతి చదువరి మామూలు మనిషిగా తన సహజసిద్ధ స్పందనలను గుర్తుపట్టగలుగుతాడు. 

" 'Mono no aware' penetrates into the heart deeper than reason or will, than Confucian teachings of good and evil. This explains why a scrupulous man at times feels tempted to break a comandment, or infact does so. 'Mono no aware' is more deeply rooted in the human heart and more valid in its application than Confucian or Buddhist teachings. And this is why a literary work filled with ethically repugnant incidents may deeply move the readers' heart. 

If, then, 'mono no aware' is a mode of cognition more intuitive, far-reaching, and valid than others, what would ultimate human reality be like seen through it? Norinaga answers that it is foolish, effeminate, and weak. 'All human feelings,' he says, 'are quite foolish in their true, natural state. People try hard to trim, modify, and improve them so that they may appear wise, but as a result they gain only some decorated feelings, and not true natural ones.' The innermost human heart is as foolish and weak as a woman's or a child's. Any feeling that is manly, discreet, and righteous is not a true human feeling; it is artificial, it is made up by reading books, by conforming to social norms, by adheing to Buddhist or Confucian disciplines--in brief, by suppressing one's heart in one way or another. 'The original, natural heart of man,' Norinaga writes, 'is most straightforward, senseless, poor, and unsightly.' " 

(‘‘ ‘మోనో న అవారె’ తార్కికమైన ఉద్దేశాల కంటేను, మంచీ చెడుల గురించి కన్ఫ్యూషియస్ బోధనల కంటేను కూడా లోతుగా మనసులోకి చొచ్చుకుపోతుంది. అందుకే ఎంతో పట్టింపు ఉన్న మనిషి కూడా ఒక్కోసారి నీతిని తప్పి మసలుకుంటాడు. ‘మోనో న అవారె’ అన్నది కన్ఫ్యూషియస్ లేదా బుద్ధిస్టు బోధనల కంటే లోతుల్లో మానవ హృదయంలో పాతుకొని ఉండేది. అందుకే నీతి బాహ్యమైన సన్నివేశాలతో కూడిన ఒక సాహిత్య రచన కూడా చదువరుల మనసును కదిలించవచ్చు.

మరి ఈ ‘మోనో న అవారె’ ప్రకారం మానవ స్వభావం ఎలాంటిది? అది తెలివితక్కువది, సుకుమారమైనది, దుర్బలమైనది. మనుషుల భావావేశాలన్నీ లోతుల్లోకి వెళ్లి పరిశీలిస్తే వెర్రిమొర్రివేనంటాడు నోరి నాగ. తెలివిగా కనపడటానికి మనుషులు వాటికి అందమైన కత్తిరింపులు చేసి, మెరుగుపెట్టుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఫలితంగా వాళ్లు నిజమైన, సహజమైన భావోద్వేగాలను పోగొట్టుకుని అలంకరించిన భావాలతో మిగిలిపోతారు. ధీరోదాత్తమైన, ఆచితూచివ్యక్తమయ్యే, స్వాభిమానగర్వంతో ఉన్న ఏ భావోద్వేగమూ నిజమైన మానవ ఉద్వేగం కాదు; అది కృత్రిమంగా, పుస్తకాలు చదివో, సామాజిక నియమాలను అనుసరించో, బుద్ధిస్టు కన్ఫ్యూషియన్ నియమాల సాధన వల్లనో తయారైంది మాత్రమే.’’)

పునాదులు దొరకని బోలు ఆశావాదం ఉట్టిపడే కవితల్లోనో, వర్తమాన ప్రపంచం వల్లించే పాజిటివ్ నీతుల మధ్యే తన్నుకులాడే కథల్లోనో ఈ ‘మోనో న అవారె’ దొరకదు. తార్కిక జ్ఞానంతో పొరలు కట్టని మానవ స్వభావాన్ని స్వచ్ఛంగా వ్యక్తం చేసే రచనల్లోనే అది దొరుకుతుంది. అలాంటి రచన చదువరుల్ని కూడా తెచ్చిపెట్టుకున్న స్వభావాల నుంచి విడుదల చేస్తుంది. ఇలా “సహజ మానవ స్వభావ చిత్రణ” లాంటి మాటలు వినపడగానే అడవుల్లో గిరిజనుల గురించి రాసిన నవలలో, పల్లెటూళ్లల్లో పొలంగట్ల మీద జరిగే కథలో, చెరువగట్టున కూర్చుని చందమామ మీద రాసే కవితలో... ఇవే తడతాయి మనవాళ్లకి. ఈ milieu లో కథ నడిపితే చాలు అదేదో సహజత్వం వచ్చేసినట్టు అనుకుంటారు. రచయితకి సహజ మానవ స్పందనల పట్ల ఎరుక లేనప్పుడు వాడు కథ ఎక్కడ నడిపినా అది అసహజంగానే ఉంటుంది. చెహోవ్ కథలు, షిగా ‘డార్క్ నైట్ పాసింగ్’ నవల, ఓజు సినిమాలు ‘మోనో న అవారె’కి గొప్ప ఉదాహరణలు అనిపిస్తాయి నాకు. 

‘Norinaga - On the Art of Writing (Shintoism and the Theory of Literature)’ అన్న అధ్యాయం ఆర్కైవ్.ఆర్గ్ లో దొరుకుతుంది. కానీ అదొక్కటీ చదవటం కంటే, చెహెవ్ చివర్లో రాసిన కథలో, షిగా నవలో, ఓజు సినిమాలో చూసి అది చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది. Otherwise you would just translate him into whatever false equivalencies you surround yourself with.

https://archive.org/.../literaryarttheo.../page/196/mode/2up

January 14, 2023

పెంచలదాస్ కథ

మనిషిగా మనం జ్ఞాపకాల కుప్పలం అంతే. ‘‘నేను ఇదీ’’ అని చెప్పుకోవటానికి ఎవరి దగ్గరా జ్ఞాపకం తప్ప వేరే ఋజువేం ఉండదు. ఒకడు తను మాత్రమే అథెంటిక్‌గా చెప్పుకోగల జ్ఞాపకానుభవాన్ని కథగా చెప్పుకున్నాడనుకుందాం ("అథెంటిక్" అన్నది ఇక్కడ చిన్న మాట కాదు, నువ్వు చదువుతున్నది ఒకడు బతికాడు). తెలుగులో దాన్ని నొస్టాల్జిక్ సాహిత్యం కేటగిరీలోకి చేరుస్తారు. అందులో ఏమాత్రం బాల్యం కనిపించినా ఇక నొస్టాల్జియా తప్ప ఇందులో ఏముంది అనేస్తారు. పత్రికలూ న్యూస్‌ఛానెళ్లూ సోషల్ మీడియా బ్రౌజింగులూ ఎన్జీవో పనుల ద్వారా తెలిసిన విషయాల్ని, అప్పటికి వాళ్లకున్న అవగాహనతోనో ఆనాటికి పాషనబుల్ అయిన ఐడియాలజీ ఆసరాతోనో అర్థం చేసుకుని, తెలిసీ తెలియని ప్రపంచాల్ని గిలికి పారేస్తే, అవి ఇక్కడ ముఖ్యమైన కథలు అవుతున్నాయి. ఏది అథెంటిక్, ఏది ఫాల్తూ అన్నది చప్పున పసిగట్టే (మామూలు) పాఠకులు అంతరించి మ్యూచువల్ అప్రిసియేషన్ క్లబ్బులు మాత్రమే మిగిలిన చోట మంచి కథలు రద్దీలో తప్పిపోవటం చాలా సులువు. నాకు తెలిసిన చాలా కథలు అలా తప్పిపోయాయి. చివరకి తెలుగులో మంచి కథలకి ఉండాల్సిన లక్షణాల్లో అలా ఎవరికంటా పడకుండా తప్పిపోవటం కూడా ఒకటేమో అనిపించటం... grim view, I know. ఎనీవేస్... ఇక్కడ చెప్పదల్చుకుంది: ఈ పెంచలదాస్ కథ గురించి. క్రాఫ్ట్ అంటే కాయితం మీద తెలివైన వాక్యాలు రాయటమనీ కొత్తగా కనపడటమనీ అనుకుంటారు చాలామంది. రాయాలనిపించిన థీమ్‌ ని imperceptible gradations తో, లోపలి కట్టుబడి ఏం తెలీకుండా చెప్పగలగటంలో ఉంది అసలైన క్రాఫ్ట్. అది ఈ కథలో ఉంది. ఉందని తెలీనివ్వని అల్లిక అలవోకగా కుదిరింది.

నామినితో నేను చేసిన ఇంటర్వ్యూలో మాండలికం గురించి ఒక ప్రశ్న అడిగితే ఆయన ఇచ్చిన జవాబు ఇది: ‘‘అసలు ‘మాండలికం’ అంటే రైతులకు తెలీదు. నాకైనా కతల్రాసినాకే ఆ పేరు తెలిసింది. అదెవరో తెలుగు పండితుడు సృష్టించిన పదం. పల్లెటూరోళ్ల మాట, నిజానికి చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా చిన్నచిన్న తేడాల్తో అవే మాటలు. వాడు విరుడ్డం మనిసి అంటారు. విడ్డూరం నోట్లో పడి విరుడ్డం అయ్యింది. ...నోట్లో నాని నాణ్యంగా వచ్చిన పదాల్ని మాండలికం అనేస్తున్నారు.’’ అన్నాడు. ప్రతి మనిషికీ తన ఆవరణ ఉంటుంది, తను సౌకర్యంగా మసలుకునే స్పేస్ ఉంటుంది. అది వాడి "మండలం" అనుకోండి. అందులోంచి వచ్చే మాటే మాండలికం. మాండలికం లేని మనిషంటూ ఎవడూ ఉండడు, యాసలేని మాట ఎవడి నోటి నుంచీ రాదు. రాయటానికి తెలుగులో గ్రాంథికం అన్న పేరుతో ఒకప్పుడు కృతకమైన భాష ఒకటి చెలామణీలో ఉండేది. దాన్ని కాదని వచ్చిన వ్యవహారికంలో కూడా ఆ కృతకత్వం పూర్తిగా పోలేదు. అయితే అది మెల్లగా పత్రికల ద్వారానూ పాఠ్యపుస్తకాల ద్వారానూ ఒక ఒరవడిలోకి సర్దుకుంది. అదే సాహిత్యంలోనూ స్థిరపడింది. దాన్నే ప్రామాణిక భాష అంటున్నారు. ఒక కథకుడు తన ఆవరణలో వినపడే భాషతో, ముఖ్యంగా పల్లెటూరి నేపథ్యం నుంచి ఏదైనా రాస్తే దాన్ని మాండలికం అనేస్తున్నారు. కానీ నిజానికి ఆ మాండలికమే ప్రకృతి, "ప్రామాణిక" భాష అని అందరూ రాసేదే వికృతి. ఈ "ప్రామాణిక" భాష అనేది పత్రికల్లోనూ, పాఠ్య పుస్తకాల్లోనూ, రొడ్డకొట్టుడు కథల్లోనూ తప్ప జీవితంలో ఎక్కడా కనపడదు, వినపడదు. ఈ ప్రామాణిక భాషలో రాసేవాళ్లు కథల్లో ఒక భాష మాట్లాడతారు, వాళ్లని కలిస్తే వేరే భాష మాట్లాడతారు. అందుకే దాన్ని ‘‘నేర్చిన’’ భాష అంటాడు నామిని. మీరు పెంచలదాస్ ని కలిస్తే మీకు ఈ కథలో కనపడే భాషే అతని దగ్గరా వినిపిస్తుంది. ఇది మాండలికం కాదు. ఆయన మసిలిన ఆవరణ నుంచి ఆయన అంతరంగంలోకి ఇంకిన భాష.

నేను నామిని కథలు కొన్నింటికి ప్రూఫ్ చూశాను. ఆయన భాష విషయంలో చాలా పట్టింపుగా ఉంటాడు. "మీద" బదులు "మింద" అనే ఉండాలి. "అసహ్యా"న్ని "అసింకం" అనే రాస్తాడు. ఈ పెంచలదాస్ కథకి కూడా ఫాంట్ కన్వర్షన్ చేసినప్పుడు తప్పులొస్తే ప్రూఫ్ చూశాను. ఒకచోట "లేకుండా" అని పడితే "లేకండా" అని సరిదిద్దాడు. భాషా వ్యాకరణం ఎలా ఉన్నా, ఆయన అంతరంగ వ్యాకరణం "లేకుండా" అన్న మాటని ఒప్పుకోదు. "ఇలా ఎవడి లెక్క వాడి కుంటే భాష భ్రష్టుపట్టిపోదూ" అంటాడు పండితుడు. "నీ భాషా మాన సంరక్షణని నువ్వు పాఠ్య పుస్తకాలకీ, పరిశోధనా వ్యాసాలకీ, పత్రికా సంపాదకీయాలకీ అప్లయి చేయి, కవిత్వం దగ్గరా కథల దగ్గరా ఇట్టాంటి రచ్చ పెట్టకు" అంటాడు కథకుడు. "అయినా మరీ ఇంత గాఢమైన మాండలికం రాస్తే ఎట్లా? కొంచెం సామాన్య పాఠకులను కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా" అంటాడు మిడిల్ క్లాసు పాఠకుడు. ఒకడు తన జీవితానుభవాన్ని దాన్ని ఆవరించుకున్న భాషలో కూర్చి నీ ముందుకు తెస్తుంటే, చదవటానికి నువ్వు ఇబ్బంది పడుతున్నావంటే, అది కథ రాసినవాడు పట్టించుకోవాల్సినంత ముఖ్యమైన ఇబ్బంది కాదు. చదివేవాడే ప్రయత్నం మీద సరిచేసుకోవాల్సిన ఇబ్బంది. ఈ కథలో నాకు అర్థం కాని పదాలు లేవని కాదు. టైటిలే నాకు అర్థం కాలేదన్నాను. ‘‘ఏటి వెంబడి పిల్లంగ్రోవి ఏడుస్తూ పోయింది’’ అని అర్థం చెప్పారు పెంచలదాస్. ఒక కథకి అంత అందమైన పేరు విని చాన్నాళ్లయింది.

September 23, 2022

పబ్లిషర్ ఒక రైటర్ ని చంపగలడా?

చంపగలడు. ఎలాగా అంటే రచయితల పుస్తకాల్ని చెత్తగా పబ్లిష్ చేసి. కేశవరెడ్డి కంటే కె.ఎన్.వై. పతంజలి వెయ్యిరెట్లు బెటర్ రైటరు. కానీ ఇప్పటి జెనరేషన్లో కేశవరెడ్డి పుస్తకాలు చదివేవాళ్లల్లో సగం మంది కూడా పతంజలిని చదవరు. దానికి మేజర్ కారణం పతంజలి పుస్తకాలని మనసు ఫౌండేషన్ ప్రచురించిన పద్ధతే అనుకుంటాను. మనసు ఫౌండేషన్ పతంజలి రచనలన్నీ కలిపేసి సగటు తెలుగు నిఘంటువులంత బరువుతో హార్డ్ బౌండుతో రెండు పుస్తకాలుగా పబ్లిష్ చేసింది. ఆ పుస్తకాలు ఒక్కోటీ కొనాలన్నా ఐదొందల పైనే. ఆ పుస్తకాలు మార్కెట్లో ఉన్నన్నాళ్లూ ఇంకో పబ్లిషరెవ్వరూ వాటిని ఏ రచనలకు ఆ రచనలుగా విడదీసి చిన్నచిన్న పుస్తకాలుగా ప్రచురించరు. పోనీ వాళ్లైనా ఆ పని చేయరు. తెలుగులో ఇదో మాయదారి సంప్రదాయం. ఇదే హాని రావిశాస్త్రికీ జరిగింది. 2005-2007 మధ్యలో అనుకుంటాను రావిశాస్త్రి రచనా సర్వస్వం అని మనసు ఫౌండేషనే ఒక టెలీఫోన్ డైరెక్టరీ లాంటి పుస్తకాన్ని, టెలీఫోన్ డైరెక్టరీ లాంటి క్వాలిటీతోనే ప్రచురించింది. నేను అది కొన్నాను. కానీ దాన్ని చదవాలంటే అయితే రెండు డంబెల్స్ తీసుకుని చేతి కండలైనా పెంచుకోవాలి, లేదంటే వ్యాసపీఠం ఒకటి కొనుక్కొని దాని ముందు బాచీమటమో పద్మాసనమో వేసుకు కూర్చోవాలి. అలాగ రావిశాస్త్రిని ‘రాశి’శాస్త్రి లాగా మార్చి పదేళ్లపాటు ఎవరూ చదవకుండా చేశారు. ఈలోగా ఒక తరం రావిశాస్త్రిని స్కిప్ అయ్యే ఉంటుంది. నేను రావిశాస్త్రి అభిమానినేం కాదు. ఆ సిమిలీల బలహీనతకి చిరాకేస్తుంది కూడా. కానీ 'వెన్నెల', 'మామిడి చెట్టు' లాంటి మంచి కథలు కొన్ని ఏరి ఒక కలెక్షన్ వేస్తే చాలా మంచి పుస్తకమవుతుంది. రచయిత చచ్చిపోయాకా ఇక చదవనక్కర్లేదన్నట్టూ ఇలా అల్మరాల్లో దిట్టంగా కనపడితే చాలన్నట్టూ కుప్పపోసి ప్రచురించటం ఎందుకో. శ్రీశ్రీని ఇలాగే చేశారు, శ్రీపాదని ఇలాగే చేశారు. పీహెచ్డీ పరిశోధకుల కోసం రచనాసర్వస్వాలు వేస్తే వేయొచ్చు. కానీ దాన్తోపాటే ఏ రచనకి ఆ రచనగా విడివిడి పుస్తకాలుగా ఎందుకు వేయరో.

అందేంటీ అంత విలువైన  సాహిత్యాన్ని కుర్రాళ్లు చవకగా కొనుక్కొని ఫాంటు జేబుల్లో దోపుకొనేందుకు వీలుగా చవక కాయితం మీద పాకెట్ సైజులోనే ప్రచురించాలా, అంటారా? ఒక్కో రచనకి ఒక్కో స్వభావం ఉంటుంది, ఒక్కో రచయితకి ఒక్కో స్వభావం ఉంటుంది. ‘కేచర్ ఇన్ ద రై’ని వింటర్ కోటు జేబులో దోపుకోగలిగే సైజులోనే ప్రచురించాలని శాలింజర్ కి తెలుసు. అలాగే ‘కేచర్ ఇన్ ద రై’నీ, శాలింజర్ మరో నవల ‘సేమోర్: ఏన్ ఇంట్రడక్షన్’ని కలిపి ఒకే పుస్తకంలో వేస్తే అది రమణ మహర్షి హుడీ వేసుకొని స్కేట్ బోర్డింగ్ చేస్తున్నట్టు ఉంటుంది. చలం ఫక్తు గ్రాంథికంలో క్లాసిక్ శైలిలో రాసిన ‘శశిరేఖ’నీ, కన్షెషనల్ శైలిలో పొయెటిక్ టోన్ లో రాసిన ‘అమీనా’ ని ఒకే పుస్తకంలో వేస్తే బిర్యానీ రైసులో సాంబారు పోసినట్టు ఉంటుంది. చలం ఏలూరు వీధుల్లో మడత నలగని పంచెలు కట్టుకుని క్లబ్బులో పేకాటకి పోయినవాడు కాదు. పతంజలి లైబ్రరీల్లో రిఫరెన్సులు తిరగేసి పరిశోధనా వ్యాసాలు రాసిన విమర్శకుడు కాదు. వేయటానికి ఒక పుస్తకాన్ని ఎంచుకోవటంతోనే పబ్లిషర్ల పని అయిపోదు. వాళ్ల రచనల్ని, వాళ్ల స్వభావాలనీ పుస్తకం భౌతిక రూపంలో కూడా గౌరవించాలి పబ్లిషర్లు.  

ఇప్పుడు ఈ పోస్టు పెడదామనిపించటానికి అసలు కారణం చలం పుస్తకాలే. బహుశా ఒక పదేళ్ల క్రితం అనుకుంటాను చలం పుస్తకాల హక్కులన్నీ సౌరీస్ నుంచి వేరే పబ్లిషర్ కి వెళ్లిపోయాయని విన్నాను. ఆ తర్వాత కొన్నాళ్లకే మార్కెట్ లో- ఒక అన్ని పుస్తకాల్లాంటి, అన్ని పుస్తకాల్లో కనపడే ఫాంట్ల లాంటి ఫాంట్ల తోటి, అన్ని పుస్తకాలకుండే కవర్లలాంటి కవర్లతోటి, రెండొందలుపైగా బరువైన పేజీలతోటి, మర్యాదస్తుల వాసన కొట్టే రచయితలందరి పుస్తకాల మధ్య జస్ట్ మరో పుస్తకంగా కలిసిపోతూ, నాకంతకముందు తెలీని చలమొకడు పుస్తకాల షాపుల్లో ప్రత్యక్షం కావటం మొదలుపెట్టాడు. అంతకుముందు నాకు దొరకని పుస్తకాలు ఈ సిరీసులో కొన్ని ఉండటంతో తప్పనిసరై వీటిలో కొన్ని కొన్నాను. అలాగే మ్యూజింగ్స్ నా దగ్గర బాగా చిరిగిపోతూండటంతో దాన్నీ కొత్త వెర్షన్ కొన్నాను. కానీ ఎప్పుడు తెరిచి చదవబుద్ధేయలేదు. పేజీలు ఊడిపోతున్నా ఎందుకో ఆ పాత పుస్తకాలే చదవబుద్ధవుతుంది. 

చలం అంటే ఫాంటూ, పేజీల రంగూ, కవర్ పేజీ మీద బొమ్మా వీటికంటే ఎక్కువ అని నాకూ తెలుసు. చలం ఒక బతికే పద్ధతి, జీవితాన్ని చూసే పద్ధతి. ఎలాగో కలాగ మరి ఎవరి ఉద్దేశమో తెలీదుగానీ ఆ పాత పుస్తకాలకి అలాంటి ఒక చలానికి నప్పే శైలి అమిరింది. పింక్ రంగు అట్ట మీద మధ్యలో ఫ్రేములో పైబొత్తాలు లేని చొక్కా వేసుకొని గాలికి ఎగిరే జుట్టు కింద వెర్రి నవ్వు నవ్వుతూ కవరు తిప్పగానే ఆల్మోస్ట్ బూడిదరంగు నాసి పేజీల మీద వ్యక్తమయ్యేవాడే నా వరకూ నాకు అసలు చలం. ఆ పుస్తకాలని బస్టాండులో చదువుతూ చదువుతూ మధ్యలో సిటీబస్సు రాగానే చుట్ట చుట్టి జేబులో దొపుకొని బస్సెక్కేయచ్చు. పైగా ఆ పాత పుస్తకాల్ని వేసినవాళ్లు ఏ రచనకి ఆ రచన విడిగా వేశారు. అమీనాని అమీనాలాగా, అరుణని అరుణలాగా ఉండనిచ్చారు. ఈ కొత్త పబ్లిషర్లలాగా ఎలా పడితే అలాగ అన్నీ కలిపేసి కుమ్మరించేయలేదు. మార్కెట్లో ఈ కొత్త చలాన్ని చూసి నాకైతే కంగారు పట్టుకుంది. ఆ పాత పింక్ అట్టల చలం ఇంక దొరకడేమోనని. దొరికినవాటిని దొరికినట్టు, ఇప్పటికిప్పుడు చదివినా చదవకపోయినా, పోగేసి దాచుకోవాలనిపించింది. పాత పుస్తకాల షాపుల్లో దొరికితేనో, ఎవరైనా ఫ్రెండ్స్ ఇళ్లల్లో కనపడితే వాళ్లని మొహమాటపెట్టో అవి చాలావరకు తెచ్చుకున్నాను. అయితే పేజీలు పెళుసైపోయి, కుట్ల నుంచి దారాలు ఊడిపోయే స్థితిలో ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు జేబులో దోపుకుపోయేంత nonchalance వాటి పట్ల ప్రదర్శిచంలేనంత అబ్బరం అయిపోయాయి. చలం అబ్బరంగా బతకనూ లేదు, రాయనూ లేదు. 

ఇప్పుడే నా యూట్యూబు హోమ్ పేజీలో చలం పుస్తకాల కొత్త వెర్షన్ కి సంబంధించి ఎనిమిదేళ్ళ క్రితంనాటి వీడియో ఒకటి కనపడింది. చలాన్ని రామ్ గోపాల్ వర్మ ఆవిష్కరిస్తున్నాడు. (https://youtu.be/RzpQvRAtKQU) టేస్ట్ లెస్ నెస్ అనేది ఒక చోట ఒకలాగ మాత్రమే వ్యక్తమై ఊరుకోదనటానికి నిదర్శనంలాగ ఉంది ఆ వీడియో. అది చూడగానే నాకు ఇదంతా గుర్తుకు వచ్చి, ఇలాగ ఆవేశపడ్డా అన్నమాట. 

Can a publisher really kill a writer? Maybe a natural force like Chalam can't be stopped no matter what, but a mere talent like Ra.Vi. Sastry most certainly wouldn't be able to surive these fuck ups.

July 23, 2022

001 : “తోస్తే తప్ప కదలకపోతే ఎలారా!”

లావుగా, దర్జాగా తాతయ్య మెట్లెక్కుతుంటే, శేషూ వెనకాల ఫాలో అయ్యాడు. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, అడ్మిషన్స్ సమయం. తాతయ్య గుమాస్తాల దగ్గరకు వెళ్లి మాట్లాడాడు. తర్వాత చొరవగా ప్రిన్సిపల్ గదిలోకి కూడా వెళ్ళిపోయాడు. శేషు మాత్రం ఆఫీసు హాల్లోనే ఆగిపోయాడు. సొట్టల బీరువాల్లోంచి బ్రౌన్ రంగు ఫైళ్లు, పై పెచ్చులూడి ఇనుము కనిపిస్తున్న టైపు రైటర్లు… శేషు దిక్కులు చూస్తున్నాడు. పంజాబీ డ్రెస్సుల్లో అమ్మాయిలు, మోచేతుల మీదకి షర్టులు మడత పెట్టిన అబ్బాయిలూ గుమాస్తాల్ని విసిగిస్తున్నారు. అక్కడ శేషు స్థానంలో ఓ పదేళ్ల కుర్రాడున్నా ఇంకాస్త చొరవగా ఉండేవాడేమో. శేషుకి ఎన్నో మిల్లీ మీటరు దగ్గర జుట్టు పాపిడి తీయాలో తెలుసు, టీషర్టు కూడా ఇస్త్రీ చేసి వేసుకోవటం తెలుసు. ఏ కాలేజీ ఎంచుకోవాలో ఏ కోర్సు తీసుకోవాలో మటుకు తెలీదు. ఇంటర్ అయింతర్వాత వేసవి సెలవులన్నీ వాణీ వాళ్ల ఇంటి చుట్టూ రేంజర్ సైకిలు మీద తిరగటంతోనే సరిపొయ్యింది. వాణీ చిరాగ్గా ఉన్నప్పుడు చిరాగ్గా చూసేది, ప్రసన్నంగా ఉన్నప్పుడు ప్రసన్నంగా చూసేది. ఆ పిల్లకి వీడు ఉన్నా లేకపోయినా తేడాపడని జీవితం ఉంది. అందులో దూరాలని వీడి ప్రయత్నం. అదేం తేలకుండానే, ఒకరితో ఒకరు ఒక్క మాటా మాట్లాడకుండానే, వేసవి సెలవులు అయిపోయాయి. ఆ రోజు తాతయ్యే గుర్తు చేసి బయల్దేరదీశాడు. 

తాతయ్య టీవీఎస్ నడిపాడు. శేషు వెనకాల కూర్చున్నాడు. దారంతా పొలాల మీంచి చెమ్మ గాలి. మండపేట పొలిమేరల్లో ఒకసారి తాతయ్య బండి ఆపి దిగాడు. శేషు కాసేపట్లో కురిసే వానకి ఈ ఎర్ర కంకర్రోడ్డు మీద దుమ్మంతా ఎలా అణగారి పోతుందో ఆలోచించాడు. తాతయ్య జిప్ పెట్టుకుని నడిచి వస్తూ, బండి మీద ఆపిన తిట్లు కొనసాగించాడు, “ఎవడో ఒకడు వెనక నుంచి తోస్తే తప్ప కదలకపోతే ఎలారా? మూతి మీదకి మీసాలు, ముడ్డి కిందకి పద్దెనిమిదేళ్లూ వస్తున్నాయి”. శేషుకి నాన్న లేడు కాబట్టి అధికారమంతా తాతయ్యదే. శేషుకి ఆపైన ఇంకో పద్దెనిమిదేళ్లు వచ్చినా చొరవా పెద్దరికం రాబోవని అప్పుడు తాతయ్యకింకా తెలీదు. కానీ అప్పుడప్పుడూ ధైర్యం పాలపొంగులా వచ్చిపోతుండేది. ఆ ధైర్యంలో తీసుకున్న నిర్ణయాల ఫలితాల్ని మాత్రం, ఆ పొంగు చల్లారింతర్వాత, ఏ చొరవా పెద్దరికం లేని మనిషే మళ్ళీ ఫేస్ చేయాల్సి వచ్చేది. 

ప్రిన్సిపల్ రూము తలుపు తెరుచుకుంది. తాతయ్య దళసరి ఫ్రేము కళ్ళజోడు తొంగి చూసింది. “రావేం లోపలికి?” అన్నాడు. శేషుకి ఇంక తప్పలేదు. లోపల ప్రిన్సిపల్ తెల్ల చొక్కాని నల్ల ఫాంటులోకి టక్ చేసుకుని, గ్లోబ్ ఉన్న టేబిలు వెనక కూర్చున్నాడు. తాతయ్య కూర్చుంటూ, “వీడేనండీ,” అన్నాడు. “ఇంటరు బైపీసీ ఎందుకు తీసుకున్నావు, ఎంపీసీలో చేరకపోయావా?” అన్నాడు ప్రిన్సిపల్. శేషుకి ఇప్పుడు ఏదో ఒకటి ప్రత్యేకంగా మాట్లాడి రానున్న మూడేళ్లూ ఈ ప్రిన్సిపల్ దృష్టిలో ‘నోటెడ్’ ఐపోవటం ఇష్టం లేదు. అందుకే ఏం మాట్లాడలేదు. “లెక్కల మాస్టారి మనవడివి లెక్కలంటే భయపడితే ఎట్లారా… ?” అన్నాడు మళ్లీ ప్రిన్సిపల్. శేషుకి ఈమధ్యనే ఎవరన్నా “రా”, “ఒరే” అంటే ఒళ్లు మండటం మొదలైంది. నవ్వొకటి మూతికి అతికించాడు. తాతయ్య చేతులు రెండూ వదులుగా జోడించి, “మీరే ఓ కంట కనిపెడుతుండాలి మావాడ్ని, మీ చేతుల్లో పెడుతున్నాను” అన్నాడు. తర్వాత ముసలాళ్లిద్దరూ వాళ్ల టీచింగ్ కెరీర్లు ఎక్కడ కలిసినట్టే కలిసి ఎలా వేరైపోయాయో మాట్లాడుకున్నారు.

బైటికి వచ్చాకా తాతయ్య అంతకుముందులేని హుషారుతో ఉన్నాడు. బండి తీయబోతూ కాలేజీ బిల్డింగు వైపు చూశాడు. “అలా పోయొద్దామేంట్రా ఒకసారి అన్నాడు.” ఇద్దరూ చినుకుల్ని దాటుకుంటూ వరండాలోకి నడిచారు. ఇనుప దూలాల మీద నిలబడిన పాత బిల్డింగు. క్లాసు రూముల్లో బల్లలన్నీ ఖాళీగా ఉన్నాయి. తాతయ్య క్లాసు గుమ్మాల పైన రాసున్న పేర్లు చదువుతూ నడుస్తున్నాడు. శేషు చెవుల్లో కాలేజీ లైఫ్ మీద సినిమా పాటలేవో విన్పిస్తున్నాయి. ఆ ఖాళీ వరండాలో గుండెలకి పుస్తకాలానించుకుని అమ్మాయిలు ఎదురొస్తున్నట్టు ఊహించుకున్నాడు. మనసంతా జలపాతం వచ్చిపడుతున్నంత బరువుగా, అది వెదజల్లే నురగంత తేలిగ్గా కూడా ఉంది. “డిగ్రీ ఫస్ట్ ఇయర్, బైపీసీ,” అని చదివాడు తాతయ్య. నీలం రంగు గుమ్మం మీద తెల్లటి పెయింటుతో ఆ అక్షరాలు రాసి ఉన్నాయి. తలుపు తీసుకుని లోపలికి నడిచారు. ఖాళీ బ్లాక్ బోర్డు మీద సుద్దపొడి తుడిచిన ఆనవాళ్లున్నాయి. తాతయ్య అటువైపున్న కిటికీల దగ్గరకు వెళ్ళి బైట ఏముందో తొంగి చూస్తున్నాడు. శేషు బల్లల దగ్గర ఆగాడు. బల్లల మీద బాణం దూసుకెళ్లిన లవ్ గుర్తుల్లో అమ్మాయిలవీ అబ్బాయిలవీ పేర్లున్నాయి. వృత్తలేఖినుల్లో యవ్వనపు బలం అంతా చొప్పించి చెక్కల్ని తొలిచేసారు. బల్లల మధ్య నడిచాడు. అలవాటుగా ఆఖరి బెంచీ మీద కూర్చున్నాడు. అక్కడి నుంచి బ్లాక్ బోర్డు వైపు చూస్తుంటే, మున్ముందు ఆ గదిని హోరెత్తించబోయే స్టూడెంట్స్ సందడి కళ్ళ ముందు మెదిలింది. “పదరా” అంటున్నాడు తాతయ్య టీచింగ్ ప్లాట్ ఫాం దగ్గర నిలబడి. ఆయన మొహంలో నవ్వుంది. ఏదో అనబోతున్నాడేమో అనిపించింది. కానీ ఏం అనకుండానే బైటకి నడిచాడు. శేషు బల్లల మధ్య నుంచి నడిచి బైటికి వచ్చేసరికి ఆయన వరండాలో పిట్టగోడకి జారబడి ఉన్నాడు. వెనకాల అశోక వృక్షాలూ, పచ్చగడ్డీ అన్నీ తడిచిన రంగుల్లో ఉన్నాయి. శేషు తాతయ్య ముందు నిలబడి “పదా?” అన్నాడు. 

తాతయ్య బొజ్జ మీద చేతులు కట్టుకుని ఏదో మాట్లాడేదుంది ఆగమన్నట్టు తల ఆడించాడు. నిట్టూర్చి, “చాలా ముఖ్యమైన రోజులురా ముందున్నవి. బాగా చదువుకోవాలి మరి!” అన్నాడు. ఇద్దరూ నడిచారు. తాతయ్య శేషూ భుజం మీద చేయి వేసాడు. ఇద్దరికీ అలవాటు లేని ఆ చేయి కాసేపు అక్కడే ఉంది. శేషుకి అది బరువుగా అనిపించింది. తాతయ్య మాటలు కూడా మోయటానికి బరువుగానే ఉన్నాయి. అప్పటిదాకా మొగ్గల్లోంచి పుప్పొళ్లు చిప్పిల్లే లోకం వాడి కళ్ల ముందు ఉంది. ఇప్పుడు బాధ్యతల దిట్టమైన చెట్టుమాను ల్లోంచి భవిష్యత్తు ఇరుగ్గా కనపడుతోంది. ఫాంట్ అంచు దులుపుకుంటున్న సాకుతో కిందికి వొంగాడు. తాతయ్య చేయి భుజం మీంచి జారిపోయింది. మళ్ళీ పైకి లేచి, తేలికపడ్డ భుజాలతో ముందుకు నడిచాడు.


July 8, 2022

ప్రతి అడుగూ పట్టి పట్టి నడవటం Vs కాలు జారి పడి ప్రవాహంలో కొట్టుకుపోవటం

"The book just came to me. All I had to do was be there with buckets to catch it,” అంటాడు సాల్ బెల్లో తన 'ఆగీమార్చ్' నవల రాయటం గురించి. ఆ నవల మొదటి పేరా చదువుతుంటేనే అది వరదలా రచయిత వొళ్లో వచ్చి పడిందన్న సంగతి మనకు అర్థమవుతుంది. రాసేవాళ్లకి అలా ఎప్పుడో తప్ప జరగదు. అలా జరిగిన రోజే- అది ‘‘మన రోజు’’. అలాంటి రోజొకటి వస్తుందని ఎదురుచూట్టం కోసమే- మిగతా రోజులన్నీ ఉంటాయి. ఈ మిగతా రోజుల్లో రాయటం రాయటంలా ఉండదు. తుప్పుపట్టి బిగుసుకుపోయిన నట్లను రెంచీతో విప్పటంలా ఉంటుంది. అసలు రాయటమంటేనే ఇలా అక్షరాల్ని ముందేసుకుని చెమటోడ్చటం అంటారు కొంతమంది. హెమింగ్వే రాయటమంటే టైప్ రైటరు ముందు కూర్చుని రక్తం కక్కుకోవటం అంటాడు. కానీ ఆయన పొంగి కాయితంపైకి ప్రవహించిన రోజుల్లేవంటేనూ, అవే రైటరుగా ఉండటాన్ని జస్టిఫై చేసే రోజులని ఆయన అనుకోడంటేనూ- నేను నమ్మలేను. 

‘‘ఆగీమార్చ్’’ నవలకి ముందు కూడా సాల్ బెల్లో రెండు నవలలు రాశాడు. కానీ అవి రాస్తున్నప్పుడు ఆయన ఫ్రెంచి రచయిత ఫ్లాబెర్ట్ ప్రభావంలో ఉన్నాడు. వచనం మీద కూడా కవిత్వమంతటి శ్రద్ధ పెట్టడమన్నదీ, ఒక వచన వాక్యం మీద రోజులకొద్దీ పని చేయటమన్నదీ బహుశా సాహిత్యంలో ఫ్లాబెర్ట్ తోనే మొదలైంది. మెల్లగా ఆధునిక వెస్ట్రన్ సాహిత్యంలో అదో ప్రమాణంగా చెలామణీలోకి వచ్చేసింది. కానీ ఆ మోడల్ సాల్ బెల్లోకి నప్పలేదు: “In writing [my first two books] I accepted a Flaubertian standard. Not a bad standard, to be sure, but one which, in the end, I found repressive.” (నా మొదటి రెండు పుస్తకాలూ రాయటంలో ఫ్లాబెర్టియన్ ప్రమాణాన్ని ఒప్పుకున్నాను. అందులో లోటేం లేదు నిజానికి, కానీ నాకు మాత్రం అదో కట్టడిలా మారింది.)

ఏ రచయితకైనా సరే తొలిరోజుల్లో రాయటంలో ఒక ‘‘సులువు’’ ఉంటుంది. అది లేకపోతే అసలు ఎవ్వరూ రాయటం జోలికే రారు. కానీ రాను రానూ చుట్టూ ఉన్న సాహిత్య వ్యవస్థ గురించి తెలిసేకొద్దీ, అందులో ఏం చెల్లుబాటవుతాయన్నది అర్థమయ్యేకొద్దీ, ఆ ప్రమాణాలని మన్నించేకొద్దీ, కొంతమందిలో ఆ సులువు మెల్లగా పోతుంది. మళ్ళీ ఆ ధారలాంటి వేగాన్ని పట్టుకోగలగటం- ఎలాంటిదంటే- పికాసో తన చిత్రకళా నైపుణ్యాన్నంతా మధ్యలో వదిలిపడేసి మళ్లీ పిల్లల్లా గీయటం మొదలుపెట్టడం లాంటిది. తొలిరోజుల్లో ఉండే ఆ సులువును నిలబెట్టుకోగలిగినవాళ్లు అదృష్టవంతులు. కొంతమంది దాన్ని నిలబెట్టుకోలేరు, అలాగని ప్రతి వాక్యం పట్టిపట్టి రాయటమన్న పద్ధతికి పూర్తిగా అలవాటూ పడలేరు. దాన్తో ఇక రాయటం అంటేనే ఇటుకా ఇటుకా పేర్చి కట్టే ఏ సరదా లేని తాపీ పని అన్న అర్థం ఇచ్చుకుని రాజీపడతారు. పరధ్యాసగా రెయిలింగ్ లో పెట్టిన చేయి ఇరుక్కుపోతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది పరిస్థితి. ముందసలు రాయటం అంటే ఇది కాదనీ, ఇక్కడ ఇరుక్కుపోయామని ఒప్పుకోగలగటం అవసరం. అప్పుడే అన్ లెర్నింగ్ వీలవుతుంది. అదో పెద్ద ప్రయాస. రాయటం మొదలెట్టిన రోజుల్లో మన చేతికి మన పెన్నుతో ఏ సౌకర్యం ఉంటుందో అది మళ్లీ రావాలంటే, ముందు మనతో మనకి ఆ పాత సౌకర్యం రావాలి. సాహిత్య మనే ఆర్గనైజేషన్ మనమీద పన్నిన ఉచ్చుల్ని వొల్చుకోవాలి. మనసులోని ఎచ్చులన్నీ కక్కుకోవాలి. తొలి అమాయకత్వం తలుపు తట్టాలి. అదీ మనమూ ఇక ఎప్పటికీ ఒక్కటైతే కాము. కానీ సయోధ్య సాధ్యమే. పైగా ఈ తప్పిపోయి మళ్లీ వెనక్కి దారి వెతుక్కునేవాళ్లకి ఆ ప్రయాణం మంచే చేస్తుంది, వాళ్ల రాతలో. 

***

దాస్తోయెవస్కీని తీసిపడేస్తూ నబొకొవ్ అన్న ఒక మాటని బోర్హెస్ ఇలా తిప్పికొడతాడు (ఒక్క వాక్యంలో ముగ్గురు మెగాస్టార్లు పట్టేశారు!):

"In the preface to an anthology of Russian literature, Vladimir Nabokov stated that he had not found a single page of Dostoevsky worthy of inclusion. This ought to mean that Dostoevsky should not be judged by each page but rather by the total of all the pages that comprise the book." 

బోర్హెస్ మాటల్ని ఇలా అనువదించొచ్చు: "రష్యన్ సాహిత్య సంకలనానికి నబొకొవ్ ముందుమాట రాస్తూ, దాస్తోయెవస్కీ సాహిత్యంలో ఒక్క పేజీకి కూడా అందులో చేరే అర్హత లేదన్నాడు. బహుశా ఆయన దాస్తోయెవ‌స్కీ అర్హతని ఒకొక్క పేజీని బట్టి కాకుండా, పుస్తకంలోని అన్ని పేజీలనీ కలిపి అంచనా వేసుండాల్సింది." ఇది చదివినప్పుడు చప్పట్లు కొట్టబుద్ధేసింది. 

దాస్తోయెవస్కీ మొదట్నుంచీ ఒక సలువుని, వేగాన్ని నిలుపుకున్న రచయిత. ఆయనకి అద్దకం పని చేతకాదు. ఈ విషయంలో టాల్ స్టాయితో పోల్చుకుని చిన్నబుచ్చుకునేవాడు. అసలు తనకు జీవితమే తీరుబడిగా రాసే వెసులుబాటు కల్పించలేదని వాపోయేవాడు: ‘‘ఇలా కంగారు కంగారుగా రాయాల్సి రావటం ఎంత బాధో నాకే తెలుసు... దేవుడా! జీవితమంతా నాది ఇదే పరిస్థితి. …టాల్‌స్టాయి అలాక్కాదు, అతనికి డబ్బుకి లోటు లేదు, మర్నాటి కోసం తడుముకోవాల్సిన అవసరం లేదు, కాబట్టి రాసినవాటికి తీరుబడిగా కూర్చొని ఎన్నైనా మెరుగులు దిద్దుకోవచ్చు”. కానీ నిజానికి ఇది జీవితం పెట్టిన ఇబ్బందేం కాదు. దాస్తోయెవస్కీ తత్త్వమే అంత. రాయటం మొదలుపెడితే ఆపటం కష్టం. వాక్యం గీక్యం అని పట్టింపులుండవు. డెడ్ లైన్ హడావిడిలో సెక్రటరీకి డిక్టేట్ చేయాల్సివచ్చినప్పుడు రాసిన ‘గాంబ్లర్’ నవలని ఎంత వేగంతో రాశాడో, లైఫ్ లో కాస్తో కూస్తో సెటిలయ్యాకా రాసిన ‘బ్రదర్స్ కరమజవ్’ నవలనూ అంతే వేగంతో రాశాడు. నబొకొవ్ అలాక్కాదు. వాక్యం మీద శ్రమించే బాపతు. "My Pencils Outlast Their Erasers" (నా పెన్సిళ్ల కంటే ముందే ఎరేజర్లు అరిగిపోతాయి) అంటాడు ఒక ఇంటర్వ్యూలో. అలాంటి నబొకొవ్ కూడా ఒక ఇంటర్వ్యూలో ‘‘రచయితగా మీ ముఖ్యమై ఫెయిల్యూర్ ఏంటి’’ అని అడిగితే మొదటగా చెప్పింది, ‘స్పాంటేనిటీ’ లేకపోవటం గురించి: ‘‘Lack of spontaneity; the nuisance of parallel thoughts, second thoughts, third thoughts; inability to express myself properly in any language unless I compose every damned sentence in my bath, in my mind, at my desk.’’ కానీ ఇదే నబొకొవ్ ఆ స్పాంటేనిటీ లేకపోవటాన్నే చాలాచోట్ల గొప్పగా ప్రచారం చేసుకున్నాడనిపిస్తుంది. అంటే, ప్రతిపేరా అబ్బరంగా ఒక ఇండెక్స్ కార్డు మీద రాయటం, రాస్తున్నది అంతా మైండులో పూర్తయ్యాక మాత్రమే రాయటం మొదలుపెట్టడం… ఇలాంటివి. 

అసలు చదివేవాళ్లకి ఈ తేడాలన్నీ తెలుస్తాయా అంటే- అందరికీ తెలీవు. ఆత్మలేని అద్దకంపనిని గొప్ప రచన అనుకునే పాఠకులూ ఉంటారు. ఇలాంటి ఎక్కువమంది పాఠకులు ఒప్పుకోవటమే తన రచన నాణ్యానికి గీటురాయి అనుకునే రచయితకి అసలీ ఇబ్బందే ఉడదు. 

December 30, 2021

ఇంకా రాయని కథలు

 ఇంకా రాయని కథలు అనుకోగానే కొన్ని దృశ్యాలు గుర్తొస్తాయి. గౌతమీ ఎక్స్‌ప్రెస్ హైదరాబాదు నుంచి రాజమండ్రి వెళ్తూ తెల్లారగట్ల గోదావరి దాటుతున్నప్పుడు కిటికీల్లోంచి లోపలికి ఎండ పడుతుంది. కింద పడవల్లో పొద్దుటి నీడలు తెడ్లు తిప్పుతూ ఉంటాయి. గుడిసెలోంచి ఇంటామె బైటికి వచ్చి దాకతో నీళ్లు ఇసకలో కుమ్మరిస్తుంది. స్నాన ఘాట్లోంచి ఒక ముసలాయన మెట్లెక్కుతూ ఉంటాడు. రాజమండ్రి స్టేషనుకి ముందు పట్టాలు విడిపోతూ కలుస్తూ ఉంటాయి. సిటీలో కాలు నిలదొక్కుకోవటానికి తంటాలు పడుతూ, మధ్య మధ్యలో ఇలా ఊరెళ్లినప్పుడల్లా, లోపల్నించి ఊరే బెంగ ఆ పరిసరాలపై తాటి తాండ్ర కమ్మదనంలా పరుచుకునేది. ఆ జిల్లా మనుషుల మాటా కట్టూ వాసనల వెనకాల నేనెన్నటికీ చొరబడలేని కథలేవో తారాడి మాయమయ్యేవి. అరటి గెలలు వేలాడే బడ్డీ కొట్ల నీడల్లో ఒక ఆర్టోస్ తాగి ఆ బెంగని దిగమింగేయటం తప్ప చేసేదేం లేదు. నాకు ముఖాల్ని మాత్రం చూపించి భావాన్ని దాచి పెట్టుకునే కథలు. నేనింకో మనిషినైతే తప్ప చెప్పలేని కథలు. అనుభవాల కుండ కంచంలో బోర్లిస్తే ఏవో నాలుగైదు మెతుకులే రాలతాయి. మనుషుల్ని అక్షరాలతో ముసురుకోవాలనిపిస్తుంది. నేను ప్రేమించలేనివాళ్లెవ్వరూ కనపడరు. కానీ భాష మోసం చేస్తుంది. దగ్గర ఉన్నది ఎవరిచేతో ఎంగిలిపడినట్టు ఉంటుంది. కొత్తది తెచ్చుకోవటానికి శక్తి సరిపోదు. ఈ లోగా ఆ నేల కాలంలోనూ దూరమవుతుంది. నా ప్రేమంతా నాతోపాటు ఇక్కడ ముసలిదవుతుంది. ఆ తాటి చెట్ల వెనకాల పైకి లేచే సూర్య బింబం మాత్రం అంతే పసి వెచ్చదనంతో ఇవాళ కూడా అక్కడి గడ్డి మీద మంచు చుక్కల్ని కరిగిస్తుంది.


September 24, 2021

ఒక పుల్‌స్టాపో, కామానో...


ముందు నా చదువు గురించి చెప్తాను. తర్వాత నా రాత గురించి. నన్ను ఇలా అకడమికాతీత చదువుల వైపు నెట్టింది మా అమ్మే. తర్వాత అందుకు బాధపడింది కూడా అమ్మే. అమ్మ అంటే ఆకుల వీర వెంకట సత్య సుబ్బలక్ష్మి. రెవిన్యూలో జూనియర్ అసిస్టెంటుగా మొదలై డిప్యుటీ తాసిల్దారుగా మొన్నటేడాది రిటైరయ్యింది. రిటైరయ్యే దాకా కూడా లైబ్రరీని వదల్లేదు. తన టేస్టు మాత్రం ఇన్నేళ్ళ తర్వాత కూడా ఎక్కడ మొదలయ్యిందో అక్కడి నుంచి ఒక్క ఇంచు కదల్లేదు. అమ్మ పుస్తకం సజెస్ట్ చేసిందంటే దాని జోలికెళ్ళను. అలాగే నా కథలూ మా అమ్మకి నచ్చవు. నేను ఎప్పుడో హైదరాబాదుకి వచ్చిన కొత్తల్లో తనకి రాసిన ఉత్తరాలు తప్పితే మా అమ్మకి నా రాతలేం నచ్చవు. బేసిగ్గా అసలేం చూసుకుని నాకింత గీరో అమ్మకి అర్థం కాదు. ఈమధ్యే వొళ్ళు పొగరు తగ్గించుకొమ్మని తిడుతూ ఉత్తరం కూడా రాసింది. అమ్మకి నేను డాక్టరవ్వాలని ఉండేది. నేను కూడా బలవంతం బ్రాహ్మణార్థంగా కొన్నాళ్లు ఆ హోప్స్ ఎంటర్టయిన్ చేశాను. కొన్నాళ్లంటే ఎమ్సెట్టులో పదమూడు వేలో రాంక్ వచ్చేవరకూ, డిగ్రీలో పదమూడు సబ్జెక్టులు పోయేవరకూ. నా క్లాసు రూము చదువు ఎంత కుంటుపడిందో, నా లైబ్రరీ చదువు అంత జోరుగా నడిచింది. నేను మొదట చదివిన సాహిత్యం లైబ్రరీ పుస్తకమే. నా మూడో తరగతి అయ్యాక అమ్మకి అమలాపురం నుంచి ఆలమూరుకి ట్రాన్స్‌ఫర్ అయింది. నేను ఆలమూరు చిన్నబడిలో నాలుగో తరగతిలో చేరాను. అమ్మ ఆలమూరు వచ్చేటప్పుడు అమలాపురం లైబ్రరీలో డిపాజిట్టు డబ్బులు వదిలేసుకుని దానికి బదులు తెన్నేటి సూరి ‘చంఘిజ్ ఖాన్’ నవల తెచ్చుకుంది. అది అలా చాన్నాళ్లు ఇంట్లో ఉండిపోయింది. దాని కవరు పేజీ బాపూ వేశాడు. ఎరుపు రంగు కుర్తా వేసుకున్న చంఘిజ్ ఖాన్ వెనక పులి తిరుగుతూంటుంది. అమ్మ ఆ నవలలో చంఘిజ్ ఖాన్ ఎంట్రీ సీను గురించి తెగ వర్ణించి చెప్తూ ఉండేది. నేను ఆ ఒక్క సీను కోసం చదవటం మొదలుపెట్టి ఐదో తరగతిలోనే అర్థమైనా కాకపోయినా మొత్తం పుస్తకం చదివేశాను. నా పదో తరగతి లోపుగా ఆ పుస్తకాన్ని ఇంకో రెండు మూడు సార్లు చదివి ఉంటాను. అది నా మొదటి పుస్తకం. Not bad for a start. అయితే తర్వాత చాలా చెత్త చదివాను. అమ్మకి ఆఫీసు పని వల్ల లైబ్రరీకి వెళ్ళే టైముండేది కాదు. కాబట్టి నన్ను పుస్తకాలు తెమ్మని పంపేది. పంపే ముందు ఫలానా వాళ్లవి తెమ్మని, ఫలానా వాళ్ళవి తేవొద్దని కొన్ని పేర్లు చెప్పి పంపేది. అలా నేనూ మెల్లగా లైబ్రరీ మరిగాను. ఎంతగా అంటే అమ్మ నాకు దొరక్కుండా పుస్తకాలు బీరువాలో కూడా దాచుకొనేది కొన్నాళ్లు. అమ్మ ఆఫీసుకి వెళ్లేకా తాళం కనిపెట్టి మరీ చదివాను. పదో తరగతిలోగా అప్పటి పాపులరు రచయితలవి రచనా సర్వస్వాలే చదివేశాను. అంటే అప్పటి టాప్ టెన్ పాపులర్ చెత్త రచయితల్లో ఒక్కో రచయితవీ కనీసం ఐదు పుస్తకాలు చదివాను. ఒకడివైతే మొత్తం ముప్ఫై పుస్తకాలు. క్లాసిక్ రచయితల పుస్తకాలూ మధ్య మధ్యలో తెచ్చేవాడ్ని. చలం, గోపీచంద్, కొ.కు., సాంకృత్యాయన్, నండూరి అనువాదంలో మార్క్ ట్వేన్, అలెక్స్ హేలీ రూట్స్ అనువాదం, ముళ్లపూడి, మధురాంతకం రాజారాం వీళ్లవి కూడా అడపాదడపా చదివేవాడ్ని. కానీ వేంపల్లి నిరంజన్ రెడ్డి ‘అంధయాగం’ ముందు గోపీచంద్ ‘మెరుపుల మరకలు’ ఎందుకూ సరిపోయేది కాదు. ఒక చలం కథ మాత్రం విపరీతంగా నచ్చేసిందని గుర్తుంది. కథ పేరు ‘యవ్వనవనం’. ఆ కథలో పదిహేనేళ్ళ కుర్రాడు ఊళ్ళోకి వచ్చిన నాటకాల గ్రూపులో రాజకుమారుడి వేషం వేసే అమ్మాయితో ప్రేమలో పడతాడు. పదో తరగతిలో ఆ కథ చదివి ఆ కుర్రాడ్ని నేనే అయిపోయాను. ఆమెని కళ్లల్లో కట్టుకొని ప్రేమించాను. మళ్ళీ మళ్ళీ చదివిన కథ అది. ఇంటర్లోకి వచ్చాక ఇంకాస్త విచక్షణ వచ్చింది. గోర్కీ ‘నా బాల్యం’, ‘నా బాల్య సేవ’, ‘నా విశ్వ విద్యాలయాలు’ మా ఇంటి లోతైన కిటికీ గూట్లో కూర్చుని వరస సాయంత్రాలు చదివాను. బహుశా నా రష్యన్ ప్రేమల పరంపరలో మొదటివాడు గోర్కీ. అప్పట్లోనే కాశీభట్లని చదవటం నా రీడింగ్ లైఫ్‌లో పెద్ద ఈవెంట్. ఆంధ్రప్రభలో ‘నేనూ చీకటి’ సీరియలైజేషనుతో మొదటిసారి ఆయన్ని చదివాను. స్వాతి మంత్లీలో అనుబంధంగా వచ్చిన ‘దిగంతం’ నవల వరుసగా రెండు మూడు రోజుల్లో రెండుమూడు సార్లు చదివాను. కాశీభట్ల ఈ పుస్తకాల్లో కాఫ్కా, అయాన్ రాండ్‌... ఇలా ప్రపంచ దేశాల రచయితల పేర్లను కోట్ చేసేవాడు. వీడెవడి చేతో ఇంత కొత్తగా రాయిస్తున్న వాళ్లని కూడా ఎలాగోలా చదవాలనుకునేవాడ్ని. ఇంటికి వారం వారం వచ్చే ‘ఆంధ్రప్రభ’లో అనుకోకుండా కనిపించిన కాశీభట్ల తప్పితే అప్పటి కంటెంపరరీ రైటర్స్ ఎవరూ తెలీదు. ఆలమూరు లైబ్రరీలో అన్నీ పాత పుస్తకాలే ఉండేవి. దాన్తో అక్కడ అస్తమానూ కనపడే చలం, గోపీచంద్‌, మల్లాది, మైనంపాటి వీళ్లంతా కంటెంపరరీస్ అనిపించేది. ఇక్కడ కొంచెం వెనక్కి వెళ్లి నా తొలి రాతల గురించి చెప్తాను, సరికొత్త నూతన అపూర్వ పేరాలో…

స్కూలు వేసవి సెలవల్లో మా తాతయ్య మా ముగ్గురన్నదమ్ముల చేత దక్షిణ భారత హిందీ ప్రచార సభ వాళ్ల హిందీ పరీక్షలు కట్టించేవాడు. పదో తరగతి సెలవుల్లో ఒకసారి ఆ హిందీ టెక్స్ట్ పుస్తకాల్లో ఉన్న ఒక నాటకాన్ని తెలుగులోకి అనువదించటం మొదలుపెట్టాను. కథ నాది కాకపోయినా, కేవలం పదాలు మాత్రమే నావైనా సరే– నా పెన్ను కింద నుంచి ఒక కొత్త రచన రూపం తీసుకోవటం గొప్పగా అనిపించింది. ఆ ధైర్యంతో తర్వాత కొన్ని రోజులకే ఒక నోటు పుస్తకం తీసుకుని వరుసగా ఓ పది పేజీల్లో కథ రాసేసాను. అది ఒకడు సైకిలు నేర్చుకోవటంలో పడే తంటాల గురించిన కామెడీ కథ. కథ పూర్తయ్యాక చదువుకున్నప్పుడు బాలేదనిపించింది కానీ, రాస్తున్నప్పుడు వచ్చిన కిక్కే వేరు. నేను రచయితని అవ్వాలనుకోవటం ఆ రోజుల్లోనే ఎప్పుడో మొదలైందనుకుంటాను. ఎందుకంటే– బాగా గుర్తు– పదో తరగతిలో ఓ ఇంగ్లీషు పాఠంలో ఏదో సందర్భంలో ‘‘మ్యుజిషియన్లకీ, రైటర్స్‌కీ మెమొరీ చాలా ముఖ్య’’మన్న ఒక వాక్యం చదివి నేను చాలా వర్రీ అయ్యాను. ‘‘అరె నాకు జ్ఞాపక శక్తి చాలా తక్కువ కదా మరెలాగా’’ అన్నది నా బాధ. అప్పట్లోనే డైరీలు రాయటం మొదలుపెట్టాను. కొత్త సంవత్సరం సండే సప్లిమెంట్‌లో డైరీల గురించి పడిన ఆర్టికల్ చదివి డైరీలు రాయాలని ఫిక్సయ్యాను. ఇంక ఒకటే రాయటం. ఫలానా రోజున జరిగిన విషయాల్ని మళ్ళీ ఎప్పుడో చదువుకుంటే గుర్తొచ్చేలా రాయటమన్నది డైరీ ఉద్దేశం అయినప్పుడు, ఆ డైరీ ఎంట్రీలు చాలా డీటెయిల్డుగా రాయటం ముఖ్యం కదా అనుకున్నాను. కానీ ఒక అనుభవాన్ని అందులోని ఏ డీటెయిల్ జ్ఞాపకంగా దాచుకుంటుందో పట్టుకోవటం చాలా కష్టమైన విషయం. అప్పటి నాకే కాదు, ఇప్పటి నాకు కూడా. కాలేజీ రోజులు చాలా ముఖ్యమైనవని అప్పట్లో సినిమాలన్నీ ఊదరగొట్టేవి. ఆ రోజులు మళ్ళీ రావు గనక వాటిని డైరీల్లో ఇంకా వివరంగా రాయాలనుకున్నాను. అలా డీటెయిల్స్ నాకు ఒక అబ్సెషన్‌లాగా మారిపోయాయి. నా చొక్కా రంగు  నుంచి, ఫలానా విషయం జరిగిన టైమ్ నుంచి, వెళ్ళిన చోటులో వాతావరణం వాసన దాకా అన్నీ ఆ ఎంట్రీల్లో ఇమిడ్చేయాలని ప్రయత్నించేవాడిని. దాన్తో ఏదో ఉదయం బస్సు కోసం ఎదురుచూట్టం కూడా నా డైరీలో పేజీలకి పేజీలు ఆక్రమించేది. మళ్ళీ ఆ రాయటంలో భాష మీద గానీ, పదాల ఎంపిక మీద గానీ, వాక్యం తీరు మీద గానీ శ్రద్ధ ఏం ఉండేవి కాదు. అసలవి ముఖ్యమే కాదు. ఆ ఎంట్రీ చదివితే ఆ రోజు జరిగింది ఉన్నదున్నట్టు గుర్తుకు రావాలంతే. దాన్తో ఆ ఎంట్రీలన్నీ కర్త కర్మ క్రియలతో రాసిన చాకలిపద్దుల్లాగా ఉండేవి. తర్వాత చాలాఏళ్ళకి ఒకసారి చదువుకుంటే అన్ని వివరాల దట్టింపు వల్ల అసలు ఆ పేజీల్లో ఉన్నవి నా అనుభవాలేనా అన్నంత దూరం జరిగిపోయి కనిపించాయి. ఒకేసారి అన్నీ కట్టగట్టి చింపేశాను (ఎప్పుడో త్రిపురని చదువుకున్నాక గానీ జ్ఞాపకం నుంచి రాతకి ఒక అనుభవాన్ని ఎలా బదిలీ చేయాలో అర్థం కాలేదు).

నేను డిగ్రీ మూడేళ్ళలో పదమూడు సబ్జెక్టులు ఫెయిలయ్యానని ఆఖరు సంవత్సరం ఎవరో కాలేజీవాళ్ళే చెప్పేదాకా అమ్మకి తెలీదు. మొదటి సంవత్సరంలోనే చదువుని సీరియస్సుగా తీసుకోవటం మానేశాను. తీసుకోవటం లేదన్న భయం ఏ మూలో ఉండేది, కానీ ఇంకోలా ఉండలేకపోయేవాడ్ని. పరీక్షల రోజుల్లో కూడా సినిమాలకి వెళ్ళాను. అన్ని సబ్జెక్టులు పోయాయని ఒకేసారి తెలిసేసరికి అమ్మకి ఏమనాలో అర్థం కాలేదు. నేను అప్పటికే హైదరాబాద్ వెళ్లి సినిమా దర్శకుడైపోదామన్న ఆలోచనలో ఉన్నాను. మధ్యలో సినిమా ఎందుకు వచ్చిందీ అంటే– రచయిత అయిపోయి పుస్తకాలు రాసేస్తే డబ్బులు రావన్న విషయం అప్పటికే తెలుసు కాబట్టి, కనీసం ఆ రాసేదేదో సినిమాల్లో రాస్తే డబ్బులైనా వస్తాయి కాబట్టి– సినిమా అన్నమాట. కానీ హైదరాబాదు వెళ్ళటానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. అమ్మకి చెప్పకుండా వెళ్దాం అనుకున్నాను కాబట్టి అమ్మని అడగబుద్ధేయలేదు. దాన్తో ఈనాడు ఆదివారం వాడు కథలు రాస్తే పారితోషకం ఇస్తాడని చదివి వరుసగా రెండు కథలు రాసి పోస్టు చేసేసాను. ఆ తర్వాత ఒక నెల రోజుల పాటు ప్రతి వారం లైబ్రరీకి వెళ్ళి కథ కోసం వెతుక్కోవటం, నిరాశగా వెనక్కి రావటం. నెల తర్వాత రెండు కథలూ రిజెక్టెడ్ స్టాంపుతోటి పోస్టులో తిరిగి వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటి దాకా నేను ఒక్క కథని కూడా మళ్ళీ ఏ పత్రికకీ పంపలేదు. గత పదిహేనేళ్ళుగా జర్నలిజంలోనే ఉన్నా సరే. నా ‘చేదుపూలు’ కథల్లో ఒక్కటి కూడా ప్రింట్ పత్రికలో పడింది లేదు. 

ఈనాడు నుంచి ఈ రిజెక్టెడ్ ఉత్తరం అమ్మ చూసి అడిగాకా అప్పుడు నా హైదరాబాదు ప్లాను చెప్పాను. అప్పుడు తనే కూడావచ్చి దింపి మరీ వెళ్లింది. హైదరాబాదు వచ్చాకా నా లైబ్రరీ చదువులో ఉన్న ఖాళీలు నింపుకునే పన్లో పడ్డాను. అంటే నా ఆలమూరు లైబ్రరీలో దొరకని క్లాసిక్ పుస్తకాలు చదవటం అన్నమాట. అవేమీటో నాకు అప్పటికే అవగాహన ఉంది. సీరియల్స్‌కి అసిస్టెంటు డైరెక్టరుగా చేరాకా కాసిని జీతం డబ్బులు వచ్చీ రాగానే అబిడ్సులో విశాలాంధ్ర పుస్తకాల షాపుకి వెళ్లాను. అన్ని పేరంటాల్లోనీ కనపడే ఆడపడుచుల్లాంటి పుస్తకాలు కొన్నుంటాయి కదా, క్లాసిక్స్ అని చెప్పుకునేవి, అవన్నీ కొనేశాను: అంటే బుచ్చిబాబు ‘చివరకి మిగిలేది’, గోపీచంద్ ‘అసమర్థుడి జీవయాత్ర’, కొ.కు ‘చదువు’, చలం ‘మైదానం’, ‘ప్రేమలేఖలు’, ‘మ్యూజింగ్స్’.... వీటన్నిట్లోకీ ‘మ్యూజింగ్స్’ నాకు బాగా నచ్చింది. ఫిలసాఫికల్ బెంట్ అంటారు కదా… ఆ పుస్తకం చదివాకే అది ఏర్పడింది. అది చదవకపోతే, ఆ తర్వాత చదివిన ఫిలాసఫీ పుస్తకాలేవీ నాకు అర్థమయ్యేవి కాదు. తర్వాత ఎన్ని దేశాల వాళ్ళు ఎంతమందిని చదివినా చలం అంత విస్తృతి ఉన్నవాడూ, చలం అంత కాంట్రడిక్షన్లని ఇముడ్చుకున్నవాడు, చలంలా బతికినవాడూ ఒక్కడంటే ఒక్క రచయిత కూడా తగల్లేదు. చివరకి చలం మెచ్చుకున్న రచయితలు కూడా చలం కంటే దిగదుడుపే అనిపిస్తారు. వీళ్లని అవజేసిం తర్వాత– గాడ్ ఫాదర్ సినిమా చూసిన ఊపులో– గాడ్ ఫాదర్ నవల తెచ్చుకుని చదివాను. పల్లెటూళ్లల్లో పెరిగిన తెలుగుమీడియం వాడ్ని నేను ఇంగ్లీషు పుస్తకం చదవగలనని నాకే తెలీదు. (ఆ పుస్తకం పరమ చెత్త. ఒక చెత్త పుస్తకం నుంచి గొప్ప సినిమా ఎలా తీయాలన్నదానికి చదవొచ్చు). తర్వాత ఇంగ్లీషు చదవగలుగుతున్నానన్న ధైర్యంతో కాఫ్కా మూడు నవలలూ, అయాన్ రాండ్ రెండు నవలలూ తెచ్చేసుకున్నాను. కాఫ్కా డైరీస్ సిటీ సెంట్రల్ లైబ్రరీలో దొరికితే ఏదో బంగారు కడ్డీలే దొరికినట్టు చొక్కా కింద దాచుకుని వచ్చేశాను (అప్పటికింకా అమెజాన్లూ ఫ్లిప్ కార్టులూ రాలేదు). తర్వాత దాస్తోయెవస్కీ ‘క్రైమ్ అండ్ పనిష్మెంట్’, ‘బ్రదర్స్ కరమజవ్’ బుక్ ఎగ్జిబిషన్‌లో కొనుక్కున్నాను. ఒక వయసులో భాష చాలా సులువుగా వచ్చేస్తుందనుకుంటాను. 2004 నుంచి 2008 మధ్యలో నేను చదివిన ఇంగ్లీషు పుస్తకాలకి లెక్కే లేదు. ఈ అన్ని పుస్తకాల్లోకీ నామీద బాగా పని చేసింది కాఫ్కా డైరీస్. పుస్తకాల అల్మరాలోంచి ఏ పుస్తకం తీస్తావో వొళ్లు దగ్గరపెట్టుకుని తీయి అని త్రిపుర జాగ్రత్త చెప్పింది కాఫ్కా గురించే. కాఫ్కా డైరీస్ చదివాక కాఫ్కా రోగం నాకు అంటుకుంది. అంటే రచనకి పూర్తిగా మనల్ని మనం ఇచ్చేసుకోవటం. ఈ పుస్తకం ప్రపంచాన్ని ఇంకోలా చూట్టం నేర్పింది. భరించలేనంత దగ్గరగా! నాకు డైరీ ఎలా రాసుకోవాలో కూడా నేర్పింది. పొద్దున్నే నిద్ర లేవగానే అప్పటికే మరపులోకి జారుతున్న రాత్రి కలల్ని పట్టిపట్టి గుర్తుతెచ్చుకునిమరీ రాసుకునేవాడ్ని. డైరీని ఇదివరకట్లా మళ్ళీ ఎప్పుడో చదివే నా భవిష్యత్తు వెర్షనుకి గుర్తుండాలన్నట్టు రాయటం కాక, అప్పటికప్పుడు ఇంప్రెషన్స్ లాగా రాసుకోవటం అలవాటైంది. ఆ ప్రభావంలో నేను రాసుకున్న డైరీ నాకెంత ఇష్టమంటే ఓ మూడేళ్ళు కలిపి రాసుకున్న అదొక్క డైరీనే ఇప్పటికీ దాచుకున్నాను. అలాగే కాఫ్కా తన డైరీల్లో చాలా రైటింగ్ ఎక్సర్సయిజుల్లా రాసుకుంటాడు. ఒక్కోసారి ఏవి డైరీ ఎంట్రీలో, ఏవి రైటింగ్ ఎక్సర్సయిజులో కూడా సగం దాకా చదివాక గానీ అర్థం కావు. నేను కూడా అదే కోవలో ఏం తడితే అది రఫ్ నోటు పుస్తకాల్లో రాసేవాడిని. అంటే ఒక ఊహలో నిన్ను నువ్వు నిలుపుకొని ఇక అది నిన్ను ఎటు తీసుకెళ్తే అటు-- ముందేముందో తెలీకుండా-- వెళ్ళిపోవటం. ఇలా ఆఫీసులో ఖాళీ దొరికినప్పుడూ, లోకల్ రైలు కోసం ఎదురు చూస్తున్నప్పుడూ, రాత్రుళ్లు నిద్రపట్టనప్పుడూ… ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ రాస్తూనే ఉండేవాడిని. అలా ఓ నాలుగైదు రఫ్ నోట్స్ బుక్స్ ఖర్చయ్యాయి ఈ రాతలతో. కాఫ్కా డైరీస్ నన్ను సినిమా పిచ్చి నుంచి కూడా క్యూర్ చేసేసింది (నా సాహిత్యం పిచ్చికి సమాంతరంగా సాగిన సినిమా పిచ్చి గురించి రాస్తే ఇంకో ఇంత పెద్ద రాత అవుతుంది). ప్రపంచ సాహిత్యం ఇలా నా ముందు తెరుచుకున్నాక తెలుగు సాహిత్యం జోలికి దాదాపు వెళ్ళలేదు. కాఫ్కా, దాస్తోయెవస్కీ తోపాటు, నబొకొవ్, చెస్టర్టన్, బోర్హెస్, ఫ్లాబెర్ట్… వీళ్లవే గాక వీళ్ల గురించి రాసినవి కూడా విపరీతంగా చదివేవాడ్ని. వీళ్లతో పాటు తర్వాత చదివిన టాలుస్టాయి, చెఖోవ్, బెకెట్, ప్రూస్ట్, శాలింజర్ లాంటివాళ్లు నా చేతనాకాశంలో మెగాస్టార్లు (టాలుస్టాయిని తోలుస్తాయి అనో, చెఖోవ్ చెహోవ్ అనో, ప్రూస్ట్‌ని ప్రూ అనో అనాలని సజెషన్లు ఇవ్వబాకండి, నాకు వళ్లు మండే విషయాల్లో అలాంటి pedantry కూడా ఒకటి). నేను చదువుకున్నదంతా దాదాపు ఇలా ''వొట్టి'' కథలే అయినా– సైన్సు కానీ, ఫిలాసఫీ కానీ, చరిత్ర కానీ, సోషియాలజీ కానీ చదువుకోని లోటు నాకెప్పుడూ తెలియలేదు. నిజానికి ఆయా శాస్త్రాల్లో గొప్పవనే పుస్తకాలు ఎప్పుడు తెరిచి చదవబోయినా, నాకు ఈ రచయితల కథలు కలిగించిన జీవిత స్పృహ ముందు ఆ పుస్తకాల్లో జ్ఞానం తీసికట్టుగా కనిపించేది. ఈ రచయితలు వాళ్ల కథల ద్వారా శాస్త్రీయ, చారిత్రక, సామాజిక, సైద్ధాంతిక సత్యాలకు మించిన సత్యాలను నాకు ఇచ్చారు. వీళ్లల్లో నబొకొవ్ నాకు రచయిత అంటే ఒక sovereign being అన్నది నేర్పాడు. నబొకొవ్ ఇంకా చాలా నేర్పాడు: పాటించలేనివి, ఆయన్ని ఆదర్శంగా పెట్టుకుంటే అనుసరించటానికి అసాధ్యమైనవి. నా డీటెయిల్స్ పిచ్చి నబొకొవ్ ని చదివాకా మరింత ముదిరిపోయింది. అది నా మొదటి ముద్రిత కథలో కనిపిస్తుంది. ‘‘ముద్రిత’’ కథ అంటే బ్లాగులో నేనే పోస్టు చేసిన కథ. నాకు 2007లో తెలిసింది తెలుగులో బ్లాగులు రాయొచ్చని. ఇంటర్నెట్ సెంటరుకి వెళ్లి నాకూ ఒక బ్లాగు పెట్టేసుకున్నాను ‘నా గొడవ’ అని. మొదలుపెట్టిన మూడో నెలకి ఒక కథ రాశాను. ఎప్పుడో పదో తరగతిలో రాసినంతా, ఈనాడుకి పంపటానికి డిగ్రీ చివర్లో రాసినంతా, తర్వాత నా డైరీల్లో రాసుకున్నంతా సులువు కాలేదు– ఈసారి కథ రాయటం. దీనికి కారణం నబొకోవే. ఆయన్ని చదివిన తర్వాత రాయటం ఒక టార్చరస్ యవ్వారం అయిపోంది. ఆ కథ ఒక భార్యాభర్తల గురించి. నాకు అప్పటికి పెళ్లి కాలేదు. పెళ్లిలో ఉండటం అంటే ఏంటో తెలీదు. తెలీని అనుభవాన్ని నిర్మించటానికి నేను డీటెయిల్స్ మీద ఆధార పడ్డాను. రాయటమన్నది నిర్మించటం లాగా తయారయ్యింది. ప్రతీ రెండో వాక్యం ఒక నిర్మాణమే. కొంతమంది నచ్చిందన్నారు. కానీ ఈ యాతన తర్వాత నాకు రెండో కథ రాయటానికి భయమేసింది. కథని ప్రయత్నపూర్వకంగా నా అనుభవానికి దూరంగా, నా నుంచి స్వతంత్రంగా నిలబెట్టే ఈ ప్రయాస నుంచి విడుదలవటానికీ, మళ్లీ రాయటం గురించి ఏమీ తెలియకముందున్న ఒక అలవోకడని వెనక్కి తెచ్చుకోవటానికీ నాకు చాన్నాళ్లు పట్టింది. ఇదంతా ఒక కొలిక్కి వచ్చింది మాత్రం త్రిపురని చదివాకే. రచనలో డీటెయిల్స్ ముఖ్యమే కానీ– ఎందుకు ముఖ్యమన్నదీ, ఎంతవరకూ ముఖ్యమన్నదీ ఆయన్ని చదివాకా తెలిసింది. అది తెలిసాక, రాయటం మళ్లీ ఒక ఆనందపెట్టే పని అయ్యింది. కథ రాయటమంటే బ్లూ ప్రింట్ ఆధారంగా ఇల్లు కట్టడం లాంటిది కాదనీ, తెలీని దారుల్లో ఇంకా రూపించని దేన్నో వెతుక్కోవటం లాంటిదనీ అర్థమైంది. రాస్తూనే రచనని వెతుక్కోవటం అన్న ఈ పద్ధతిలో నేను రాసిన మొదటి కథ ‘లోయల్లో ఊయల’ (2014). ఆ తర్వాతి కథల్లో పైన చెప్పిన రెండు పద్ధతులూ వేర్వేరు లెవెల్స్‌లో ఉన్నాయి. అంటే ఒక్కో కథని ఒక్కో పద్ధతి డామినేట్ చేసింది. కానీ పూర్తిగా రెండో పద్ధతిలో రాసింది ‘ముక్కు’ (2019). నా కథల్లో నా ఫేవరెట్. పదోతరగతిలో నా మొదటి కథ రాసినప్పుడు ఏ "కిక్" గురించి చెప్పానో అలాంటిది ఈ కథ రాసే ఆద్యంతం అనుభవించాను. నా కథలు చూట్టానికి పెర్సనల్ అనుభవాల్ని బయటకి చెప్పుకోవటమే పనిగా రాసినట్టుంటాయి. కానీ నన్ను ఎక్సైట్ చేసిన వేర్వేరు వ్యక్తీకరణ విధానాల్ని కాయితం మీద పెట్టి టెస్టు చేసుకోవటం కూడా నాకు ముఖ్యం. అలా టెస్టు చేసుకోవటానికి ఒక ఇతివృత్తం అంటూ ఉండాలి గనక, అది సిద్ధంగా దొరికేది నా అనుభవంలోనే గనుక, ఆ కారణం చేతనే అవి పెర్సనల్ కథలయ్యాయి.

2007 నుంచి 2012 దాకా బ్లాగుని చాలా శ్రద్ధగా రాశాను. అది నేను నడిపే నా పత్రిక అన్నట్టు ఫీలయ్యేవాడిని. అస్తమానూ కథలే అంటే రాయటం అంటే కష్టం కాబట్టి, చదివేవాళ్లకి బ్లాగులో తరచూ ఏదన్నా కొత్త విషయం కనిపించాలి కాబట్టి, కేవలం ఆ రీజన్ కోసమే, వ్యాసాలు, అనువాదాలు మొదలుపెట్టాను. వ్యాసాలు రాయటం మొదలుపెట్టగానే నా గురించి నాకొక భయంకరమైన నిజం తెలిసింది. నేను ఒక పుస్తకాన్ని/ రచయితని అయితే ఇష్టపడతాను, లేదంటే తీసిపారేస్తాను. నాకు మిడిల్ గ్రౌండ్ అంటూ లేదు. అందరూ నెత్తికెక్కించుకునే చాలామంది రచయితలు నాకు ఎక్కరు. బ్లాగులో నా మొదటి వ్యాసంలోనే అయాన్ రాండ్ నాకు ఎంత నచ్చదో రాశాను. ఇప్పటికీ తెలుగులో గొప్పవాళ్లనబడే రచయితల్లో చాలామంది రచనలు నాకు నచ్చవు. గోపీచంద్, చాసో, రావిశాస్త్రి, కాళీపట్నం, కేశవరెడ్డి.. వీళ్ల రచనల మీడియోకర్ క్వాలిటీకి, గొప్ప రచయితలుగా వీళ్లకున్న పేరుకీ మధ్య నాకు పొంతన కనపడదు. అండర్రేటెడ్ జీనియస్సులని చెప్పబడే చండీదాస్, సి.రామచంద్రరావు లాంటి వాళ్ల రచనలు పరమ చప్పగా కనిపిస్తాయి. వీళ్లందరికంటే, అరివీర ఇడియోసింక్రాటిక్గా రాసిన, కవికొండల లాంటి వాళ్ల కథలే బాగుంటాయి. మామూలుగా ఇలాంటి అభిప్రాయాలు అందరు పాఠకులకూ ఉంటాయి. కానీ ఆ పాఠకులు రచయితలు కూడా అయినప్పుడు ఇలాంటి అభిప్రాయాలని ప్రకటించటంలో కొంచెం మితం పాటిస్తారు. బహుశా ఎందుకంటే– రచయితలు స్వయంగా ఇలాంటి అభిప్రాయాలు ప్రకటించినప్పుడు–  చూసేవాళ్లు దాన్ని ఒక చదువరి అభిప్రాయంగా కన్నా, వృత్తిపరమైన స్పర్థగా చూసే అవకాశం ఉంది కాబట్టి, లేదంటే ‘‘నువ్వు వాళ్లకంటే గొప్పగా రాస్తావా?’’, ‘‘అసలు వాళ్ళని అనేంత స్థాయి నీకుందా?’’ లాంటి ఎత్తిపొడుపులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి. అయితే స్వయంగా ముద్రిస్తున్న నా పత్రిక లాంటి బ్లాగులో మొహమాటం ఏముంది. బ్లాగు రాయటంలో అలవాటైన ఈ నిర్మొహమాటం నాకు తర్వాత కూడా కొనసాగుతూనే వచ్చింది. నేను గొప్పగా రాస్తానో లేదో నాకు తెలీదు (తెలీనక్కర్లేదు, నాకు రాయటం సంతోషాన్నిచ్చినంత వరకూ) కానీ, నేను గొప్ప రచయితల్ని చదివే గొప్ప చదువరిని. ఆంటన్ చెహోవుని చదివిన చూపుతోనే చాగంటి సోమయాజుల్నీ చదువుతాను. ఈ రెండో ఆయన తెలుగోడని డిస్కౌంటు ఇవ్వలేను. త్రిపురని గొప్పోడన్నానంటే మరి తెలుగోడన్న డిస్కౌంటిచ్చి అనటం లేదు. సెలీన్నో, జాక్ కురవాక్నో చదివిన చూపుతోనే ఆ మాట అంటాను. ప్రతిభకి నా మనసులో ఉండే కొలమానం ప్రపంచవ్యాప్తంగా ఏ రచయితకైనా సమానంగా అన్వయించాలి కదా. వీటిని ప్రమాణాలుగా తీసుకోమని ఎవ్వర్నీ అడగటం లేదు. ఇవ్వన్నీ సాహిత్యమనే వ్యవస్థలో రికార్డు అవ్వాలని లేదు. కానీ నా అభిరుచులే నన్ను మలిచేవి. వాటి విషయంలో దాపరికం అనవసరం. అవి ఇంకెవరి అభిరుచులతోనో కలవటం లేదని కుక్కజెట్టీలు ఇంకా అనవసరం. వ్యాసాలు రాయటం ఒకవిధంగా నా అభిరుచిని నాకు స్పష్టం చేసింది. ఆలోచన ప్రధానమైన ఇలాంటి రచనల్లోనూ ఒక ఆనందం ఉంటుంది. ఆలోచన  వాక్యం నుంచి వాక్యానికి ఎలా ప్రసారమవుతున్నదీ, ఎక్కడ ఒక ఆలోచన చక్కగా ముగిసి దాని అనివార్య పర్యవసానమైన రెండో ఆలోచన వైపు మరుసటి పేరాతో ఏ తీరున మొదలవుతున్నదీ… ఇలాంటి నిర్వహణను గమనించటం… వ్యాసాలు చదువుతున్నప్పుడూ, రాస్తున్నప్పుడూ ఆనందాన్నిస్తుంది. I have had this pleasure... plenty of it.

అనువాదాలు చేసేటప్పుడు నాకు దొరికే ఆనందం వేరు. అనువాదం వెనుక నా ఉద్దేశం చాలావరకూ– ఈ ఫలానా రచయిత ఎక్స్‌ప్రెషన్ తెలుగులో ఎలా ఉంటుందీ అన్న కుతూహలమో, ఈ ఫలానా రచయిత కోసం తెలుగుని ఎలాంటి కొత్త దారుల్లో నడపవచ్చో అన్న ఉత్సాహమో. అంతేగాక, అనువాదం అంటే మనం అభిమానించిన రచనని అత్యంత దగ్గరగా వెళ్లి చదవటం. అనువాదం కంటే దగ్గరి పఠనం ఇంకేమీ ఉండదు. మొన్నామధ్య యూరీ ఓలేషా కథ ‘ల్యోంపా’ని నేను ఎంతో సంతోషంతో అనువదించాను. ఆ కథని నా అంత దగ్గరగా ఓలేషా కాలంలోనైనా ఎవరైనా చదివుంటారా అన్నది అనుమానమే! బ్లాగులో నా మొదటి అనువాదం ఎడ్గార్ అలెన్ పో ‘టెల్ టేల్ హార్ట్’కి చేశాను. దానికి నేను పూర్తిగా డిక్షనరీ మీద ఆధారపడ్డాను. ఒక్క పదం కూడా వదలకుండా చేద్దామని ప్రయత్నించాను. ఇలా లిటరల్‌గా అనువాదం చేయటంలో అస్సలు ఆనందం లేదు. కథలు రాయటం విషయంలో నా ప్రయాణం కాన్షస్ కనస్ట్రక్షన్ నుంచి స్పాంటేనిటీ వైపు ఎలా మళ్లిందో, అనువాదాల విషయంలో కూడా అలా లిటరల్ అనువాద పద్ధతి నుంచి స్వేచ్ఛానువాద పద్ధతికి మళ్లటానికి కొంచెం సమయం పట్టింది. నా కాఫ్కా అనువాదాలవన్నీ సక్సెస్ అని చెప్పను. నా శక్తి మేరకు చేశాను. అవి సక్సెస్ కావటం కంటే నాకు ముఖ్యమైనది, ఇందాకే చెప్పినట్టు, అనువాదం సాకుతో కాఫ్కాని అత్యంత దగ్గరగా చదవటం. కాఫ్కా పేజీలని నీళ్లల్లో నాన్చి ముద్దచేసి మింగటమొక్కటే తరువాయి! 

బ్లాగు రాయటం అంటే ఏదో నేనున్న నా గూటి నుంచి శూన్యంలోకి కొన్ని కూతలు కూయటం అనుకున్నానంతే. మళ్లీ అక్కడ ఒక బ్లాగింగ్ కమ్యూనిటీ ఉందని మెల్లగా తెలిసింది. కొంతమంది బయట కలిసి మీటింగులు కూడా పెట్టుకునేవాళ్లు. అప్పట్లో బ్లాగులు రాసినవాళ్లల్లో ఎక్కువమంది కంప్యూటర్ని ఇళ్లల్లో వాడే వీలున్నవాళ్లు–అంటే ఎక్కువగా ఎన్నారైలు, టెకీలు. నేను ఈ రెండు విభాగాలకీ చెందను. బ్లాగులున్నాయి కాబట్టి నేను రాయటం మొదలుపెట్టలేదు. అప్పటికే పుస్తకాలకి పుస్తకాలే రాతలతో నింపేస్తున్నాను. పత్రికలకంటే ఎక్కువ స్వేచ్ఛనిచ్చే మాధ్యమం కోసం ఎదురుచూస్తున్నాను. ఎన్నారైలు తెలుగు ప్రాంతం నుంచి దూరం వచ్చేసిన వాళ్లు. టెకీలు అంతకుముందులేని క్యుబికల్స్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన తొలి తరంవాళ్లు. బ్లాగుల్లో అటు ఎన్నారైలు, ఇటు టెకీలు ఇద్దరూ వేర్వేరు కారణాల వల్ల ఇంగ్లీషు ప్రభావంలేని అచ్చ తెలుగులోనే రాయాలన్న పట్టుదలతో ఉండేవారు. పరమ కృతకమైన, వెగటైన ‘అంతర్జాలం’, ‘జాలగూడు’ లాంటి పదాలు అప్పట్లోనే పుట్టాయి. ఒక కమ్యూనిటీలో మసులుతున్నప్పుడు తెలీకుండానే మనమీద ఆ ప్రభావం పడుతుంది. నా మొదటి కథలో భాష చూస్తే నాకే ఎంతో ఎబ్బెట్టుగా ఉంటుంది. మెల్లగా ఆ కృతకత్వం నుంచి దూరం వచ్చి, కాస్త సాహిత్య పరంపర అయిన భాష వైపు, ఇంకా సాధ్యమైతే నా నోటి నుంచి వచ్చేలాంటి భాష వైపు రావటానికి సమయం పట్టింది. అలాగే బ్లాగుల్లో కొంతమంది ఎన్నారైలు తెలుగు సంస్కృతి మీద బెంగతో మరీ వెనక్కి ప్రాచీన సాహిత్యం దాకా వెళ్లిపోయేవారు. అప్పట్లో నేనూ కొన్ని కావ్యాలు కొన్నాను. చదివే ప్రయత్నం చేశాను. నా ఈ కుతూహలం చూసి అప్పట్లో నా కొలీగైన శ్రీరమణగారు ‘‘ఒక చోట ఆగితే బాగుంటుంది’’ అని సలహా ఇచ్చారు. అందుకని కాదు కానీ, ఆ పాత సాహిత్యం నా ఉద్దేశాలకి ఎందుకూ పనికి రానిదని అర్థమైంది. ఆ సాహిత్యంలోని ప్రపంచాలూ మనుషులూ నా ఆవరణకి చాలా దూరమని అనిపించింది. రాసేవాడిగా నాకు ''ఇప్పుడు'' నా చుట్టూ ఉన్న జీవితం ముఖ్యం, నన్ను రోడ్డుమీద రాసుకుంటూ పోయే మనుషులు నాకు ముఖ్యం. నేను సృష్టించాల్సింది ఈ ప్రపంచాన్ని, ఈ మనుషుల్ని, అందుకు వాడాల్సింది నా చుట్టూ వినపడే భాషని. నాకు తిక్కనైనా, పోతనైనా పూర్తిగా అనవసరం. ఎక్కడో ఇరవయ్యో శతాబ్దం జపనీస్ రచయిత షిగా వీళ్లందరికంటే ప్రాచీనుడిగా అనిపిస్తాడు. వీళ్లందరికంటే దగ్గరగా నా అనుభవాల గురించి నాతో మాట్లాడతాడు. ఈ సాహిత్య వ్యవస్థ ఎంత ఘనమైనదైనా, నాతో మాట్లాడిందాకానే నాకు దానితో నిమిత్తం. క్రమంగా ఈ నిర్ణయానికి వచ్చాకా, నా పరిధిలో నాకు ముఖ్యమైనవే మిగిలాయి. సమయం ఆదా అయ్యింది.

నా బ్లాగులో పోస్టు చేసిన ‘రంగువెలిసిన రాజుగారి మేడ’ అన్న కథని నరేష్ నున్నా ‘పాలపిట్ట’కి పంపాడు. అలాగే సాక్షి సాహిత్యం పేజీలో కొత్తగా రాస్తున్నవాళ్లంటూ నన్నూ పరిచయం చేశాడు. అలా కంటెంపరరీ తెలుగు సాహిత్యంలో ఉన్నవాళ్లకి నేనొకడ్ని తెలిశాననుకుంటాను. ఆ కథ పడినప్పుడు కేశవరెడ్డి నుంచి లక్ష్మీపార్వతి దాకా నాకు ఫోన్లు చేశారు. కొన్ని రచయితల సమావేశాలకి రమ్మని ఆహ్వానాలందాయి. భుజం తట్టడానికి కొన్ని చేతులు పైకి లేచాయి. నాకు దారి చూపటానికి వాళ్ళ వాళ్ళ దారుల్లోంచి పిలుపులు వినపడ్డాయి. రచన నచ్చిందని రచయిత మీద ఇష్టంతో కలవటం వేరు. కేవలం వాళ్లూ రచయితలన్న కారణాన ఆ గుంపులో భాగంగా కలవటం వేరు. ఆ కథ వల్ల వచ్చిన అలాంటి ఆహ్వానాలన్నీ కాదన్నాను. చాలామంది రాయటం మొదలుపెడుతూనే ‘‘రచయిత’’లన్న సమూహంలో భాగమనే ధోరణిలోకి వెళ్ళిపోతారు. వాళ్ల వ్యక్తిత్వానికి ముఖ్యమైన ఐడెంటిటీ ‘‘రచయిత’’ అన్నదే అవుతుంది. కానీ నాకు అది ఒప్పలేదు. ‘‘రచయిత’’ అన్నదే నా ముఖ్యమైన ఐడెంటిటీ అయితే, రాస్తున్నవాళ్లతో రోజల్లా కలబోసుకోవటమే నా పని అయితే, మరి ఏదన్నా రాయటానికి నన్ను జీవితమెలా సోకుతుంది, నాదాకా రావటానికి జీవితానికి సందెక్కడ దొరుకుతుంది? నేను కొడుకుని, అన్నయ్యని, భర్తని, తండ్రిని, స్నేహితుడిని, మోహితుడిని, మా ఓనరు ఇంట్లో అద్దెకుండేవాడ్ని, మా పాలవాడికి ఖాతావున్నవాడిని, ఒక పరిచయస్థుడికి తీర్చలేనంత అప్పున్నవాడిని, రోడ్డు మీద నా బండి గుద్ది రచ్చపెట్టుకున్నవాడికి అపరిచిత కోపధారి మనిషిని, "ఇన్ని దినాల జీవితం పన్నిన వ్యూహంలో" అనుభవాల మలుపుల్లో చిక్కుకుని దారీతెన్నూ తెలియకుండా గమిస్తున్నవాడిని… ఇవన్నీ నాకు రాసేవాడిగా చాలా ముఖ్యమైన ఐడెంటిటీలు. నేను వీటన్నిటినీ నిలుపుకోవాలి. ‘‘రచయిత’’ అనే తొక్కలో ఐడెంటిటీ కంటే ఇవి వందరెట్లు ముఖ్యం. నాకు వీటితో పరిచయం పోతే– ఇక ‘‘రచయిత’’ అన్న ఐడెంటిటీ ఉన్నా ఒకటే ఊడినా ఒకటే. ఎందుకంటే ఇక ఆ తర్వాత రాసేదంతా డొల్ల అక్షరమే. కాబట్టి ‘‘రచయిత’’ అన్న ఐడెంటిటీ వైపు నన్ను గుంజాల్సింది నా రాత మాత్రమే. దానికి అతీతంగా ప్రతి ఆహ్వానాన్నీ, ప్రతిపాదననీ కాదన్నాను. ఒకసారి ఒక తోటి రచయిత నాకు ఫోన్ చేసి కలుస్తా అన్నాడు. రమ్మన్నాను. అతను చౌరస్తాకి వస్తే వెళ్లి రిసీవ్ చేసుకున్నాను. ఇంటికి వచ్చాక అతను: ‘‘మీరు రిక్లూసివ్ అనీ, ఎవ్వర్నీ కలవరనీ నాతో ఒకరు చెప్పారు. మీరు బానే రిసీవ్ చేసుకున్నారు’’ అన్నాడు. ఈ ‘‘రిక్లూజివ్’’ అన్న విశేషణం సంపాదించటానికి శాలింజర్ అన్న రచయిత ఎవరికీ తెలియని ఒక ఊరికి పోవాల్సి వచ్చింది, ఇంటి చుట్టూ పెద్ద కంచె కట్టుకోవాల్సి వచ్చింది, ఏవో అత్యవసరాలకి తప్ప బైటకి రాకుండా దశాబ్దాలపాటు జర్నలిస్టుల నుంచీ ఫొటోగ్రాఫర్ల నుంచీ దాక్కోవాల్సి వచ్చింది– నాకు మాత్రం సాహిత్య సమావేశాలకి వెళ్లకపోవటం ఒక్కటీ సరిపోయింది. నేను సాహిత్యమనే వ్యవస్థలో భాగం కాదల్చుకోలేదే తప్ప, ఏ స్నేహ ప్రతిపాదననీ ఎప్పుడూ తిరస్కరించలేదు. ఆ స్నేహం ‘‘రచయిత’’ అన్న ఐడెంటిటీని దాటి ఉండాలని కోరుకున్నానంతే. అలాంటి స్నేహాలు కొన్ని ఏరుకున్నాను, కొన్ని కలిసి వచ్చాయి. కొన్ని మాటలు బాల్య స్నేహితుల దగ్గరే వెళ్లబోసుకోగలను, కొన్ని నా రాతలు పునాదిగా కలిసిన స్నేహాల దగ్గర మాత్రమే వెళ్లబోసుకోగలను.

సాహిత్య వ్యవస్థకు అతీతంగా, దాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని కార్యక్షేత్రాలుంటాయి. సమాజాన్ని మార్పు వైపు జరిపేందుకు కావాల్సిన సామూహిక యత్నాలుంటాయి. ఇక్కడ పనిచేసేవాళ్ల వల్ల ముఖ్యమైన పనులు జరుగుతాయి. అవేవీ నా కార్యక్షేత్రం కాదు. ఇక్కడ మొదలవుతోన్న ఈ వాక్యం చివర్న రాబోయే పదానికి నికరమైన అర్థం కూడా ఇచ్చుకోకుండానే– నేను ఇండివిడ్యువలిస్టుని. వ్యక్తి నాకు ముఖ్యం. వ్యక్తిగా ఇక్కడ నేను ఆక్రమించుకున్న, నా చేత నిండిన పరివలయం నాకు ముఖ్యం. ఇది నా అస్తిత్వం. పుట్టి పోయేలోగా నాకు ఇవ్వబడిన కాలం. నా చేతనలోకి ప్రవహిస్తోన్న ఈ స్థల కాలాల అనుభవాన్ని అథెంటిక్గా, నిస్సిగ్గుగా, నిజాయితీగా వెలిబుచ్చుకోవటమన్నది నాకు నేను అప్పజెప్పుకున్న పని. నేను విపరీతంగా ప్రేమించిన, పైన ప్రస్తావించిన నా మెగాస్టార్లు కూడా ఇదే పనిని ఎవరికి వాళ్లు అప్పజెప్పుకున్నారు. జీవితాలు వెచ్చించి రాశారు. చదివిన నాకెంతో ఇచ్చారు: వ్యక్తిగా నా జీవితాన్ని మరింత ఎరుకతో చూసేలా చేశారు, నన్ను తాకే సమాజం పట్ల మరింత సున్నితంగా మనగలిగే మనిషిగా తయారు చేశారు. ఇదే అనుభవాన్ని నా రాతలు ఇంకొరికి ఇవ్వటం ఇవ్వలేకపోవటం అన్నది నా పనిలో నా నేర్పుకి సంబంధించినది. నా ఉద్దేశం మాత్రం అది కాదు. నేను చెప్పిన మెగాస్టార్ల ఉద్దేశమూ అది కాదు. రచన ఒక సహజాతం. అప్పగించబడిన డెస్టినీ. అది పాటించాలి. అంతే! ఇలాంటి నిర్వచనం ఇవ్వటం ద్వారా నేను వందలాది వేరే రకం రచయితల్ని, వేరే రకం రచనల్నీ వెలి వేస్తున్నానని తెలుసు. ఈ పరిమితమైన అర్థంలో మాత్రమే నన్ను నేను రచయితగా చూసుకుంటాను. కానీ మరి ఈ పరిమిత వలయంలో కొన్ని పాలపుంతలే తిరుగాడుతున్నాయి. లెక్కపెడితే జీవితం చాలనన్ని నక్షత్రాలున్నాయి.

ఎవరి కోసం రాస్తున్నారూ అనే ప్రశ్న ఒకటి ఉంది. ‘‘నా కోసం నేను రాసుకుంటున్నాను’’ అన్న జవాబు పట్ల విపరీతమైన నిరసన కనపడుతుంది. ‘‘నీ కోసం నువ్వు రాసుకుంటే రాసి నీ సొరుగులోనే పెట్టుకోవచ్చు కదా’’ అనబుద్ధవుతుంది. కానీ ఇది ఆ జవాబుని సరిగ్గా అర్థం చేసుకోలేక అనే మాట. నబొకొవ్‍ని ఒక ఇంటర్వ్యూలో ‘‘మీ ఆదర్శ పాఠకులు ఎవరు?’’ అని అడిగారు. ఆయన సమాధానం: ‘‘నేను నా పాఠకులెవరూ అని ఊహించుకున్నప్పుడల్లా ఓ గది నిండా నా ముసుగులే తొడుక్కుని కూర్చున్న మనుషులు కనిపిస్తారు’’ అని. దానర్థం ఆయన తన కోసమే రాసుకుంటాడు, కానీ తన కోసమే రాసుకోడు. తన లాంటి మనుషులు ఉన్నారన్న నమ్మకంతో రాస్తాడు. నబొకొవ్‍ని నేను ప్రేమించానంటే నాలో ఎక్కడో నబొకొవ్ ఉన్నట్టే. కాఫ్కాని నేను ప్రేమించానంటే కాఫ్కాలో ఎక్కడో నేను ఉన్నట్టే. త్రిపురని నేను ప్రేమించిన క్షణంలో త్రిపురా నేనూ ఒక్కటే. ఇలాంటి క్షణం కోసమే ఇలాంటి రచయిత రాసేది. ఈ ఒక సర్క్యూట్ పూర్తవటం కోసమే అతని రచన అచ్చయ్యేది, పుస్తకంగా వచ్చేది. నా కథల పుస్తకం 'చేదుపూలు' వేయటం ప్లెజంట్ అనుభవం అని చెప్పను. ఒక చోట ఇరుక్కుని విసిగించి ఇంకో చోట నుంచి ఎలాగో బైటపడింది. పుస్తకంగా చూసుకున్నప్పుడు మాత్రం బావుంది. ‘‘ఇవి ఎన్నో నేనుల్లో కొన్ని నేనులు కాగితం దాకా వచ్చే ధైర్యం చేస్తే పుట్టిన కథలు’’ అని ముందుమాటలో రాశాను. అవును, ‘చేదుపూలు’ కథలన్నీ కూడినా నేను రాను. ‘చేదుపూలు’ కథలన్నీ నాలోంచి తీసేస్తే మాత్రం చాలా కోల్పోయిన శేషాన్ని అవుతాను.  అందుకే ఆ పుస్తకానికి ముఖచిత్రంగా ఏం బొమ్మ వేయిద్దాం అని ఆలోచిస్తుంటే ఒక బోర్హెస్ మాట గుర్తొచ్చింది:

“A man sets out to draw the world. As the years go by, he peoples a space with images of provinces, kingdoms, mountains, bays, ships, islands, fishes, rooms, instruments, stars, horses, and individuals. A short time before he dies, he discovers that the patient labyrinth of lines traces the lineaments of his own face.”

(ఒక మనిషి ప్రపంచాన్ని బొమ్మ గీద్దామని పూనుకుంటాడు. ఊళ్ళూ, రాజ్యాలూ, కొండలూ, సముద్రతీరాలు, ఓడలూ, చేపలూ, గదులూ, పనిముట్లూ, నక్షత్రాలూ, గుర్రాలూ, వ్యక్తుల బొమ్మలతో కాన్వాసు మొత్తం క్రిక్కిరిసిపోయేలా చేస్తాడు. అతను చనిపోబోయే కొద్ది క్షణాలకు ముందు తాను ఎంతో ఓర్పుతో గీసిన ఆ గీతల అల్లిక తన ముఖ కవళికలనే అనుకరిస్తున్నదని గుర్తుపడతాడు).

అందుకే ఆ కథలకి నా ముఖం తప్ప మరింకేమీ నప్పదనిపించింది. ‘చేదుపూలు’ పుస్తకం వచ్చి రెండేళ్లవుతోంది. ఆ పుస్తకానికి వెనక మాత్రం ఇప్పుడు చెప్పుకున్న చరిత్రంతా ఉంది. ఈ పనిని చిన్నప్పుడు ఏ అమాయకత్వంలో నాకు నేను అప్పజెప్పుకున్నానో తెలీదు. పని మొదలుపెట్టాకా మాత్రం సగంలో ఆపేసిపోలేను. వాక్యం చివర్న ఒక చుక్క అద్దనిదే వదిలేయాలనిపించదు. ‘చేదుపూలు’ పుస్తకం నాకు చుక్కో, కామానో తెలీదు. ఒక రిలీఫ్ ఖచ్చితంగా. ఏదో పెద్ద కథ ముగిస్తే వచ్చే రిలీఫ్!