October 15, 2007

సరిహద్దుకిరువైపులా

అతడు:

నా ముక్కు పుటాల్లోంచి వేడి ఆవిర్లు పొంగు కొస్తున్నాయ్ ఆమెనిలా చూస్తూంటే. ఇవాళెందుకో కోరికల తుఫానులో దేహం చిగురుటాకులా వణికిపోతోంది. శరీరంలో ఒకే అంగాన్ని ఇరుసుగా చేసి కాంక్ష నా అస్తిత్వాన్నంతటినీ గానుగ తిప్పుతోంది. సుజాత మాత్రం తనపాటికి తను సోఫాలో కూర్చుని చీరకు డిజైన్ కుట్టుకుంటోంది. నిజానికి, బాహ్యపరిశీలనకు, నేను కూడా నా పాటికి ఎదుట టి.వి.లో ప్రసారమౌతున్న క్రికెట్‌మ్యాచ్‌కి అంకితమైపోయినట్లే కనిపిస్తాను; కాని అసలు విషయం అదికాదు — వాంఛ వేయిపడగలెత్తి కాటేస్తే వంటినిండా విషపు సంచలనంతో కమిలి పోతూన్నాను. మరే పరిస్థితుల్లోనైనా ఉన్నపళాన ఆమెను నా చేతుల్లోకి లాక్కొని కోరిక పండించుకొనేవాణ్ణే. కానీ ఇపుడు పరిస్థితి వేరు — శారీరకంగా సమీపంగానే ఉన్నా ఇద్దర్నీ వేరుపరుస్తూ యోజనాల అదృశ్య దూరాలు బారలు చాస్తున్నాయి. కారణం, చిన్న పోట్లాటవల్ల నాల్గురోజుల్నించీ ఇద్దరి మధ్యా మాటల్లేవు. చూపుల కలయిక కూడా అరుదైపోయింది. పొరబాట్న కలిసినా తడబడి వెంటనే తలో దిక్కుకూ మరలిపోతున్నాయి. పొడిమాటలు, మొండి నిశ్శబ్దాలు. ఇంట్లో దాదాపు ప్రచ్ఛన్నయుధ్ధ వాతావరణం అలుముకొని ఉంది. ఇప్పటిదాకా తనవైపు నుండి గానీ, నావైపు నుండి గానీ ఎటువంటి సంధి ప్రయత్నాలూ లేవు. ఇలా ఎంతోకాలం కొనసాగదనీ, ఇంకో రెండు-మూడు రోజుల్లో కలిసిపోతామనీ తెలుసు; కానీ పరిస్థితి చూస్తుంటే రెండు-మూడు రోజులంటే వల్లకాదనిపిస్తోంది; ఆమె నాకు ఇపుడే ఈ క్షణమే కావాలనిపిస్తోంది.

నాలో ఇలా సుడులు తిరుగుతూ చెలరేగుతున్న కాంక్షా సంవర్తానికి కేంద్రకమైకూడా తను మాత్రం — ప్రశాంతంగా, పరధ్యానంగా, అమాయకంగా, అందంగా — వళ్ళో పరుచుకున్న తన గంధం రంగు సిల్కు చీరపై మాగ్నెటా రంగు అంచుతో డైసీ పూలు అల్లుకుంటోంది. తను కూర్చున్న సోఫా నేను కూర్చున్న సోఫాకు ఎడంప్రక్కగా తొంభైడిగ్రీల లంబంలో ఉంది. మధ్య టీపాయ్, దాని పైన చిందర వందరగా న్యూస్‌ పేపర్లు. టీపాయ్‌కు ఆవలిపక్క, నాకు ఎదురుగా, అర్థంలేకుండా గోల పెడుతూన్న టెలివిజన్. తను ఒక కాలు నేలమీద ఆన్చి మరోకాలు సోఫాలో మడతేసి కూర్చుంది. వంగపండు రంగు నైటీ మీద తెలుపు రంగులో సన్నని లతల అల్లిక. వదులైన జడలోంచి ఒక పాయ ఊడి వచ్చి ఫాన్‌ గాలికి చెంపపై అందంగా, అల్లరిగా జీరాడుతోంది. నా నరాల్ని మరింత మెలితిప్పేస్తున్నది ఆమె భంగిమ: కుడిచేత్తో సూదిని వస్త్రంలో జొనిపి మరలా దారంతో వెనక్కి లాగేటపుడు (వింటినారికి శరసంధానం చేసి లాగినట్టు), నైటీ మాటున ఆ ప్రౌడ పరిపక్వ పయోధరాల లయబద్దమైన కదలిక నా గొంతులో తడార్పి, మాటిమాటికీ గుటకలు మింగేలా చేస్తుంది.

ఏం చేయాలి? ఎలా ప్రసన్నం చేసుకోవాలి? మాట్లాడాలి సరే — ఏం మాట్లాడాలి, ఎలా ప్రారంభించాలి? నాలుగు రోజుల ఈ నిశ్శబ్దాన్ని తెరదించడానికి కృతకంగా ధ్వనించని ఏ అంశం సంభాషణకు అక్కరకొస్తుంది? సంభాషణార్హమైన, సందర్భోచితమైన అంశాలను వెతుకుతూ మెదడు అరలన్నీ గజిబిజిగా కలియబెడుతున్నాను. ప్రస్తావించదగిన అంశాలకు ప్రారంభ వాక్యాలను మనసులోనే సమీక్షించి చూసుకుంటున్నాను. ఇంతలో వికెట్ పడింది: రనౌట్. అవకాశాన్ని ఒడిసిపట్టి ఆశువుగా ఓ స్టేట్‌మెంట్‌ని బయటకొదిలేసాను, "వీడికీ జన్మకి క్రీజ్‌లో బాట్ పెట్టడం తెలీదు." ప్రతిగా నిశ్శబ్దం. కనీసం ఓ ఆబ్లిగేటరీ చిరునవ్వు కూడా రాలేదు ఆమె పెదాలపై. ఓ మారు అభావంగా తల యెత్తి టి.వి. వైపు చూసి, మరలా తల దించుకుని తన పనిలో నిమగ్నమైపోయింది. అంతు తెలియని లోయలోకి అనంతంగా జారిపోతున్న భావన. నేనా వాక్యాన్ని పలికిన తీరు తనను ఉద్దేశించినట్టూలేదు, స్వగతంలానూలేదు. ఏదో ఒకటి మాట్లాడేయాలన్న తొందరలో భావోచితమైన ఉచ్ఛారణ, సరైన స్వరస్థాయి లేకుండా అపరిపక్వంగా బయటకు వదిలేసిన ఆ లజ్జాకరమైన వాక్యం గది వాతావరణంలో ఇంకా చక్కర్లు కొడుతూ నన్ను పరిహసిస్తూన్నట్లనిపించింది. వీడికీ – జన్మకి – క్రీజ్ – లో – బాట్ – పెట్టడం – తెలీదు: నేను సయోధ్యకు ప్రయత్నిస్తున్నానని అర్థమైపోతుందేమో, లోకువ కట్టేస్తుందేమో, అసలు వినబడిందాలేదా! వికెట్ పడటంతో ప్రత్యక్ష ప్రసారం ఆగి మధ్యలో ప్రకటనలు ప్రారంభమయ్యాయి. ఏదో టూత్‌పేస్ట్ ప్రకటన వస్తుంది: ఒక మూడేళ్ళ ఉంగరాల జుట్టు చిన్నిపాప విసుగ్గా, నిద్రకళ్ళు నులుముకుంటూ విశాలమైన స్నానాల గదిలోకి ప్రవేశిస్తుంది. ఇపుడు పళ్ళు తోముకోవడానికి గునుస్తున్న ఆ పాపముందు కంటైనర్లో ఉన్న టూత్‌బ్రష్‌లూ, టంగ్‌క్లీనర్లూ భారీ ఏనిమేటెడ్ ఆకారాల్లో ప్రత్యక్షమవుతాయి; పాప చుట్టూ గంతులేస్తూ డాన్స్‌చేస్తూ, మార్కెట్లోకి రుచికరమైన కొత్త టూత్‌పేస్టు వచ్చిందనీ, ఇక దంతధావనం సరదా వ్యవహారం కాబోతుందనీ అర్థం వచ్చేట్టు ఓ పాటందుకొంటాయి; పాపకు ఆ కొత్త టూత్‌పేస్టుని పరిచయం చేస్తాయి. ఇక్కడా ఏనిమేటెడ్ టూత్‌పేస్ట్‌తో కలిసి ఆ పాప భాంగ్రా స్టైల్లో తడబడుతూ వేసే స్టెప్పులంటే సుజాతకు చాలా ఇష్టం. ఈ ప్రకటన ఎప్పుడు ప్రసారమౌతున్నా పనులన్నీ ప్రక్కన పెట్టేసి టి.వి. దగ్గిరకొచ్చి ముచ్చటగా చూస్తుండిపోతుంది. ఇపుడూ అంతే, కుట్టడం ఆపి టి.వి.కి కళ్ళప్పగించేసింది. పెదాలపై సన్నని పరధ్యానపు చిరునవ్వొకటి కదలాడుతోంది. నేను ఛక్‌మని రిమోట్‌తో ఛానల్ మార్చేసాను! ఇది నా ప్రమేయమేమీ లేకుండానే ఓ అసంకల్పిత (ప్రతీకార) చర్యలా జరిగిపోయింది. హఠాత్తుగా ఛానెల్ మారడంతో పగటికలలోంచి మేల్కొన్నదానిలా కొద్దిగా తత్తరపడి, పెదాలపై చిరునవ్వు క్రమంగా కరిగిపోతూంటే, తలత్రిప్పి, గదిలో నా ఉనికిని అప్పుడే గ్రహించినట్టు నావైపు కొత్తగా చూసింది. నేను అదే సమయానికి కాంక్షాతప్త నయనాలతో బేలగా తనవైపే చూస్తూ పట్టుబడిపోయాను. మా ఇద్దరి కళ్ళూ కలుసుకున్నపుడు ఆమె పెదాల చివుర్లలో ఇంకా ఆ టి.వి. ప్రకటన తాలూకు చిరునవ్వు కొంతమిగిలేఉంది. నా మొహం పై అది పూర్తిగా మాయమైపోయింది. కళ్ళు తిరిగి వళ్ళోకి వాల్చేసింది. మొహంలో కనిపించీ కనిపించనట్టు అలుముకొంటున్న అప్రసన్నత — లేక నా భ్రమేనా...! సూదితో మరో రెండు కుట్లులాగి ఏదో గుర్తొచ్చినట్టు తలెత్తి గోడ గడియారం వైపు చూసింది. 11.00 PM: నిద్రకుపక్రమించే సమయం. చీరను సోఫాలో పడేసి పైకిలేచింది. ఆమె ముఖ కవళికల్లో, కదలికల్లో నా చూపులన్నీ తనపైనే కేంద్రీకృతమై ఉన్నాయన్న ఎరుక తేటతెల్లమౌతుంది. పైకిలేచి నాకు అభిముఖంగాఉన్న వంటగదిలోకి నడిచింది. ఇపుడామె పృష్ఠభాగంలో, రెండు పిరుదుల మధ్యా నైటీ ఇరుక్కుని, లోతుగా నితంబ విభాజక రేఖ కనిపిస్తుంది. వంటగదిలో ద్వారం ప్రక్కగా ఉన్న ఫ్రిజ్ తలుపు తెరిచి బాటిల్ ఎత్తి నీళ్ళు త్రాగుతోంది. (ప్రొఫైల్‌లో శంఖంలాంటి మెడపై గట గటా గుటకల కదలికలు.) బాటిల్ మూత బిగించి లోపలపెట్టి, ఎడమ ముంజేత్తో నోరు తుడుచుకుని, మరలా హాల్లోంచి నన్ను దాటుకుంటూ వెనక బెడ్రూంలోకి వెళ్ళిపోయింది.

నేను టి.వి. కట్టేసి బాల్కనీలోకి నడిచాను. బాల్కనీలోకి ఎందుకు; నేరుగా బెడ్రూంలోకి ఎందుకుకాదు — బహుశా, ఖచ్చితంగా చేతికందబోతోందని తెలిసిన ఆనందాన్ని కావాలని ముందుకు పొడిగించడంలో, వాయిదా వేయడంలో, ఆ విలంబంలో ఉండే ఆనందాన్ని ఆస్వాదించడానికనుకుంటా. (నేను ఈ సరికే ఒక నిశ్చయాని కొచ్చేసాను: ఏమైనా సరే ఇవాళ ఆమె నాక్కావాలి; ఎలా మభ్య పెట్టైనా సరే!) బయట చలిగా ఉంది. శీతపవనం కదిలినప్పుడల్లా వంటిమీద చలిపొక్కుల్లేస్తున్నాయి. ఎదుట బిల్డింగ్ బాల్కనీలో, పడక్కుర్చీలో ఒక ముసలాయన దగ్గుతున్నాడు. లోపల కుటుంబమంతా కలిపి — క్రికెట్‌ మ్యాచ్ అనుకుంటా, చూస్తూ — కిటికీ లోంచి కనిపిస్తున్నారు. — రగులుతున్న రిరంస నాలో పరిసర దృష్ఠిని మసకబారేలా చేస్తుంది. కళ్ళైతే దృశ్యాల్ని గ్రహిస్తున్నాయి గానీ అవి మెదడులో నమోదు కావడం లేదు. సృష్ఠి యావత్తూ నా నిశ్వాసాలకు సంకోచిస్తూ, ఉచ్ఛ్వాసాలకు వ్యాకోచిస్తున్న చిత్తభ్రమ. ఇప్పుడు నాకు నైఋతి దిశగా సుమారు పది అడుగుల దూరంలో ఆమె నిద్రపోతోంది. మధ్యలో గోడలున్నాయి, తలుపులున్నాయి; కానీ వీటన్నింటినీ దాటుకుని, ఆమెను కేంద్రంగా చేసుకుని అదృశ్య అయస్కాంత తరంగాలేవో నలుదిశలా విస్తరిస్తున్నట్టూ, ఆ కంపనాలేవో నా గుండె కంపనాలతో అనునాదం చెందుతున్నట్టూ భ్రమ కలుగుతోంది. బాల్కనీలో ఓ రెండు నిముషాలు కాలయాపన చేసాను. ఇక నాలో కొసప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న విచక్షణ పూర్తిగా చచ్చిపోయిందన్న నమ్మిక కలిగాక, నేనో నిగిడిన మాంసఖండంగా తప్ప మరేమీకాకుండా మిగిలాక, జలాంతర ప్రవాహంలో గమిస్తున్నవాడిలా — తేలికగా, తేలిపోతూ — బెడ్రూంవైపు నడిచాను. చల్లని గ్రానైట్ టైల్స్ మీద నా వెచ్చని పాదాలు ఆవిరి జాడల్ని అచ్చువిడుస్తున్నాయి. ఇదిగో స్వర్గపు ద్వారం! కర్టెన్ ప్రక్కకునెట్టి లోపలికి ప్రవేశించాను.

గది నిండా బెడ్‌లాంప్ తాలూకు నీలి కాంతి పరచుకొని ఉంది. మూసివున్న కిటికీ అద్దం బయటి వీధి దీపపు కాంతిని పల్చగా వడగట్టి మంచం ఉపరితలంపై నలుచదరంగా పరుస్తుంది. సుజాత మంచానికి ఒక చివర కుడిచేయి తలక్రింద ఒత్తుగా పెట్టుకొని పడుకుంది; ఎడమ చేయి నడుం మీదగా సాగి జఘనం దిగువన విశ్రమించింది. ఎందుకో అసంగతంగా, గదిలోని జడపధార్థాలన్నీ — గోడ మీద ఆయిల్ పెయింటింగ్, షెల్ప్‌లో పుస్తకాలు, అలారం టైంపీసు, మంచం అడుగున హవాయి చెప్పులూ — అన్నీ ప్రాణం తెచ్చుకుని నన్నే పరికిస్తున్న భావన కలిగింది. గది గోడలపై నగ్నంగా వెలుగుతున్న నీలి కాంతి నా ఇంద్రియాలపై హింసాత్మకమైన ఒత్తిడి తీసుకువస్తుంది. నేను ముందుకు కదిలాను. నా నీడ ముందుకు కదిలింది. నేను పిల్లిలా మంచంపైకి చేరాను. నా నీడ పిల్లి నీడలా మంచం పైకి చేరింది. నెమ్మదిగా అలికిడి తెలియకుండా సర్దుకుని పడుకున్నాను. ఇపుడు తన వీపుభాగం నావైపు ఉంది. తన జడ మెడ వంపులోంచి అటు ప్రక్కకి జారిపోయింది. తన వంటి పరిమళం — తనకు మాత్రమే ప్రత్యేకమైన పరిమళం, నాకు మాత్రమే దగ్గిరగా తెలిసిన పరిమళం, వడలిన సంపెంగపూల పరిమళానికి కొంచెం అటూఇటూగా ఉండే పరిమళం — నా నాసిక లోకి మెత్తగా, మత్తుగా ప్రవహిస్తుంది. మస్తిష్కమంతా మొద్దుబారిపోగా, మెలివేస్తున్న నరాల ఉద్విగ్నత ఇక ఏ మాత్రం భరించలేక — మొదట మెత్తగా తర్వాత బరువుగా — తన జబ్బపై చేయివేసి నొక్కాను.

"చేయి తియ్యి నవీన్ చిరాగ్గాఉంది"

నా మొదటి ప్రతిస్పందన ఉలికిపాటు. క్షణాల్లో తన తిరస్కారం నాలో ఇంకి, నిద్రపోతున్న అహాన్ని తట్టిలేపింది: "చిరాగ్గావుంది కాబట్టి చేయి వేయొద్దా లేక నేను చేయి వెయ్యడమే చిరాగ్గా ఉందా?"

"రెండు ఒకటే"

ఇక్కడే నన్నునేను నియంత్రించుకుని ఉండాల్సింది. ఏ శాడిస్టిక్ ఇన్‌స్టింక్ట్ ప్రేరేపించిందో, బహుశా తనది చివరిమాట కానీయకూడదన్న పంతమేమో, అనేసాను: "ఫ్రిజిడ్!" తనకు వినబడేట్టు గొణిగి అటు తిరిగి పడుకున్నాను. క్షణం నిశ్శబ్దం. నావెనుక తను మంచం మీంచి లేచిన అలికిడి.

"ఏమన్నావ్...! సేయిటెగైన్" — రొప్పుతున్న ధ్వని

సీన్ చేయొద్దు పడుకో" — నా నాలుకకు నాతో నిమిత్తంలేని స్వతంత్ర అస్థిత్వం ఉందా అన్న అనుమానం. మరలా నిశ్శబ్దం. క్షణం ప్రక్కన క్షణం. క్షణం ప్రక్కన క్షణం. క్షణం ప్రక్కన క్షణం. కాలం భౌతిక రూపం ధరించి నా ముందు దొర్లుతున్న భావన. ఇక భరించలేక తనవైపు తిరిగాను. తన సిల్హౌట్ ఆయాసంతో రొప్పుతోంది. వెనక వీధిదీపపు మసక వెలుతురు తన కేశాల అంచుల్ని రాగి రంగులో వెలిగిస్తోంది. ముప్పిరిగొంటున్న భావోద్వేగాల్ని నిభాయించుకోవడానికన్నట్లు రెండు చేతులూ నడుంపై ఆన్చి నిల్చొంది.

"నా వల్ల కాదు నవీన్ ఇలా... నేను మెషీన్ని కాదు. నాకూ... నాకూ ఫీలింగ్స్ ఉంటాయి," ఇంకా ఏదో మాట్లాడబోయింది. కానీ అప్పటికే కళ్ళు కల్హార సరస్సులై ఉబికి వస్తున్నాయి. ఎగశ్వాస ఆరంభమైంది. గొంతు లోంచి వెల్లువై పొంగుకొస్తున్న దుఃఖం ఏమీ మాట్లాడనీయడంలేదు. ముఖ కండరాలు అదుపు తప్పి వంకర్లు పోతూంటే, రెండు చేతుల్లో ముఖం దాచుకొని కుప్పలా నేల కూలిపోయింది; మోకాళ్ళను దగ్గిరగా కావలించుకొని మొహాన్ని మధ్య ఇరికించి గుక్క త్రిప్పుకోకుండా వెక్కి వెక్కి ఏడుస్తుంది. నిశీథి నిశ్శబ్దంలో ఆమె రోదన వికృతంగా ధ్వనిస్తుంది.

ఆమె ఏడవడం ప్రారంభించగానే నాలో మొదట కలిగన బిత్తరపాటు, ఇవాల్టికిక నా కాంక్ష తీరదని అర్థమై నిరాశగా, ఆమె బేలతనంపై చిరాకుగా మారి; వెంటనే, ఒక పక్క ఆమె గుండెలవిసేలా రోదిస్తుంటే మరోప్రక్క శరీర సౌఖ్యం గురించి చింతిస్తున్న నా స్వార్థం స్ఫురించి నన్ను అపరాధ భావనలోకి నెట్టేసింది. ఇపుడిక రక్తంలో ఉడుకు లేదు, నెమ్మదిగా నరాల్లో సంచలనం సద్దుమణిగింది. ఆమెను దగ్గిరకు తీసుకొని గుండెలకు హత్తుకోవాలనిపించింది — కోరికతో కాదు, ఓదార్పుతో. కాని దగ్గిరకు వెళ్ళే సాహసం చేయలేకపోయాను. క్షణం క్రితం నాకూ, ఇప్పటి నాకూ ఒక మృగానికీ మనిషికీ ఉన్నంత తేడా ఉంది; కానీ నా స్పర్శ ఆ తేడాని ఆమెకు తెలియజేయగల్గుతుందా. అందుకే — ఆమె జాలిగా, బేలగా ఏడుస్తుంటే నేనలాగే మంచం చివర కూర్చుని నిస్సహాయంగా చూస్తుండిపోయాను.

ఆమె :

రచయితలందరూ స్వార్థపరమైన మనస్తత్వమే కలిగి ఉంటారా అన్న అనుమానం వస్తుంది నవీన్‌ని చూస్తూంటే. నాల్గురోజుల క్రితం జరిగిన సంఘటన తల్చుకుంటే ఇంకా కంపరంతో వంట్లోంచి వణుకుపుడుతోంది. సాధారణంగా నవీన్ తన రచనల గురించి అవి చిత్తుప్రతి దశలో ఉన్నపుడు నాతో చర్చించడు; నేనూ వివరం అడగను. పుస్తక రూపంలో వెలువడ్డాక తెచ్చిస్తాడు. మొన్నకూడా ఒక కథల సంపుటిని, అది నగర ప్రముఖుల సమక్షంలో ఆవిష్కృతమయ్యాక, తెచ్చిచ్చి చదవమన్నాడు.

అందులో ఒక కథ పేరు "రెండో తేనె చందమామ". కథనం కథానాయకుడి స్వగతంగా ఉత్తమ పురుషలో సాగుతుంది. అతనూ అతని భార్యా వివాహం అయిన పది సంవత్సరాల తరువాత, తమ మధ్య క్రమంగా పేరుకుపోతూవస్తున్న శూన్యత, స్తబ్దతలకు తెరదించడానికి సెకండ్ హనీమూన్‌లా కాశ్మీరు విహార యాత్రకు వెళతారు. జమ్ములో ఒకరోజు విడిది తరువాత అద్దెకారులో పెహెల్‌గావ్‌కు ప్రయాణమౌతారు. మార్గమధ్యంలో మంచు తుఫాను మొదలవుతుంది. ఘాట్‌రోడ్ మీద అడుగు ఎత్తులో పేరుకుపోయిన మంచు కారుని ముందుకీ వెనక్కీ కదలనివ్వదు. చాలాసేపు కారులోనే వెయిట్ చేస్తారు. తుఫాను వెలిసాక, చుట్టూ ఎల్లలులేని తెల్లదనం ఆహ్వానిస్తుంటే, జంకుతూనే కారుదిగి బయటకు అడుగు పెడతారు. రోడ్డు అంచుకి వెళ్ళి తొంగిచూడబోతూ ప్రమాదవశాత్తూ కాలుజారి ఇద్దరూ ఒకరి మీంచి ఒకరు పొర్లుకుంటూ, జంటగా, ఏటవాలుగా మంచు లోయలోకి జారిపోతారు. అక్కడ, వణికిస్తున్న మంచుపై వళ్ళే నెగళ్ళుగా చలి కాచుకుంటూ, నిర్మానుష్యమైన ప్రకృతి మధ్య, పైన్ వృక్షాల క్రింద, మంచుపై శాలువా పరచి నిస్సిగ్గుగా, యధేచ్చగా శృంగారంలో పాల్గొంటారు. చివర్లో ఒక వర్ణన ఇలా కొనసాగుతుంది: ". . . సౌఖ్య శిఖరాన్ని చేరుతున్న ఉద్వేగంలో — కళ్ళు అరమోడ్పులై, భృకుటి ముడిపడి, వేడి ఊరుపులతో ముక్కుపుటాలు వెడల్పవుతుంటే, అధరాలు మధురమైన బాధతో అదురుతుంటే — పళ్ళన్నీ గిట్టకరచి ఓపలేని తమకంతో చివరగా ఒక్కసారి వణికింది; నా భుజం చీలిపోతుందేమో అన్నంత ఒత్తిడితో గోళ్ళతో గట్టిగా నొక్కి వదిలేసింది." — వస్తువేమీ లేక పోయినా కేవలం శైలీ సంవిధానాలతో కథను నడిపించిన నేర్పును అభినందించేదాన్నే — అక్కడ కథానాయిక నేనే కాకపోయివుంటే; భావప్రాప్తి పర్యంతం వర్ణించబడుతున్న ముఖారవిందం నాదే కాకపోతే!

నన్ను నిలువునా కుచించుకు పోయేలా చేసింది ఆయన సహోద్యోగులుగానీ, నా పరిచయస్తులుగానీ ఇది చదివితే ఏమనుకుంటారో అన్న ఆలోచన కాదు (అది కూడా, అఫ్‌కోర్స్); అసలు కారణం ఈ క్షణం వరకూ మా ఇద్దరికీ మాత్రమే సొంతమనుకున్న ఓ అందమైన జ్ఞాపకం ఇకనుండి పదిమంది పరమూ కాబోతోందన్న బాధ. అహ, నిజానికి ఒక జ్ఞాపకాన్ని కోల్పోయిన బాధ కూడా కాదు; ఎందుకో దాన్ని అలా రాయడం ద్వారా ఆ జ్ఞాపకానికి నేనిచ్చిన విలువ అతనివ్వలేదన్న భావన కల్గింది. నేను చీట్ చేయబడ్డానన్న ఉక్రోషం; నా నుండి విలువైన వస్తువునెవరో దగ్గరివాళ్ళే దోచుకున్న నిస్సహాయత. వెళ్ళి నవీన్‌ని నిలదీసాను. ఏమిటి అభ్యంతరమన్నాడు.

"అది మనిద్దరికీ మాత్రమే సంబంధించింది. దాన్ని అలా కథరాసి రచ్చ చేయడం అసహ్యంగా అనిపించలేదూ?!"

"ఓ అందమైన జ్ఞాపకాన్ని అక్షరాల్లోకి అనువదించాలనుకున్నానంతే," — అతని సమాధానం.

"అది నీకు మాత్రమే సంబంధించిన జ్ఞాపకమైతే అక్షరాల్లోకి మార్చుకో అంగట్లో అమ్ముకో నాకనవసరం; కానీ అది మనిద్దరికీ సంబంధించింది, దాన్ని బయట పెట్టే ముందు నన్ను కూడా అడిగుండాల్సింది."

దరిమిలా ఇలా ఓ పది నిముషాలపాటు కొనసాగిన వాదనతో నాకు మరోసారి రూఢి అయ్యిందేమిటంటే, రచయితలతో వాదించడం కష్టం. అసలు తనకిది ఒక సమస్య లాగానే కనిపించలేదు. కాసేపు నాకు ఈస్థటిక్స్ గురించి లెక్చరిచ్చాడు; ఒక రచయితకు తన జీవితమే ముడిసరుకన్నాడు; రచన అంటే జీవితమనే బావిలోంచి కలమనే చేదతో అనుభవాల నీటిని తోడివేయడమే నన్నాడు. మరి వ్యక్తిగత అనుభవాలే రచనకు ముడిసరుకైతే ఇక ఊహాశక్తికి చోటెక్కడ అన్న అనుమానమొచ్చింది నాకు; కాని అడగలేదు. ఎందుకంటే నా సమస్య అసలది కాదు; ఏమిటన్నది వివరించి చెప్పగలిగే నేర్పు, వాక్చాతుర్యం నా దగ్గిర లేవు. అప్పటికే నా మెదడు పొరల్లో తిలక్ "ద్వైతం" గింగుర్లు తిరుగుతుంది: "నువ్వు మావూరొచ్చినపుడు/ నేను మీ వూళ్ళో వున్నాను// నువ్వు మద్రాసులో రైలు దిగే వేళకి/ నేను కలకత్తా రైలెక్కుతున్నాను...." ఇలా ఇక ఎంత వాదించినా ఇంతే, దిగంతంలో ఎక్కడో కలుస్తాయని భ్రమింప జేసే రైలు పట్టాల్లా వాదన అనంతంగా సాగిపోతూనే ఉంటుంది. అయినా నా మౌనంతో అతనికి నేను సమాధానపడ్డానన్న అపోహ కలగనియ్యడం ఇష్టం లేక, అపుడింకా నా చేతిలోనే ఉన్న అతని కథల పుస్తకాన్ని రెండు చేతుల్తో అతని ముఖం ముందు తెరచి పట్టుకుని, మధ్యలోకి చించివేసాను. విస్తుపోయి చూస్తున్న అతని చూపులకు సంతృప్తి చెంది, మౌనంగా, అతని రాతబల్ల ప్రక్కన ఉన్న డస్ట్‌బిన్‌లోకి దాన్ని విసిరేసి వచ్చేసాను. తర్వాతి రోజునుండీ మా మధ్య మాటల్లేవు; ఇదిగో, ఇలా శ్మశాన నిశ్శబ్దం.

చెవుల్లోకి ఏదో అలవాటైన జింగిల్ చొరబడుతుంటే నా ఆలోచనల్ని ప్రక్కకి విదిలించి టి.వి. వైపు చూసాను. ఆ అడ్వర్టైజ్‌మెంట్. . . ఉంగరాలజుట్టమ్మాయి. . . కుందేలు పిల్లలా భలే ఉంటుంది. చిట్టి చేతులు రెండూ పైకెత్తి, మూసిన గుప్పెట్లోంచి చూపుడువేళ్ళు బయటకి నిలబెట్టి, భాంగ్రా దరువుకి భుజాలు పైకీ క్రిందకీ ఊగిస్తూ. . . [. . .] అసలు మా ఇద్దరి మధ్యా ఇన్ని సమస్యలకూ కారణం పిల్లలు లేకపోవడమేనా! — సడెన్‌గా ఛానెల్ మారింది. ఆలోచన చెదిరింది. తలత్రిప్పి చూసాను. నేనప్పటి వరకూ అక్కడ నవీన్ ఉనికినే మర్చిపోయాను; అపుడు గమనించాను, ఆ చూపు. . . నాకు తెలుసు దాని అర్థమేమిటో: కళ్ళలో నగ్నంగా బుసలు కొడ్తూన్న కామం. కడుపు తరుక్కుపోతున్న భావన కల్గింది. ఎందుకు మా మధ్య ప్రతీ సమస్యా చివరకు పక్క మీదే సర్దుబాటవుతుంది? ఎందుకు ఎప్పుడూ పక్క మీదే అతని క్షమాపణల పర్వం మొదలౌతుంది (తప్పు తనదైనా నాదైనా)? ఎందుకు ఒక స్వచ్ఛమైన, పారదర్శకమైన మామూలు సంభాషణతో మా ఏ సమస్యా పరిష్కారం కాలేదు. అయితే నేనెప్పుడూ శృంగారాన్ని నా తురుపుముక్కగా వాడుకోలేదు; అదింకా నీచమని తెలుసు. — టై పదకొండయింది. వళ్ళోని చీరని ప్రక్కన పడేసి లేచాను. లేచి, వంటింట్లోకి వెళ్ళి, ఫ్రిజ్‌లోంచి బాటిల్‌తీసి నీళ్ళు త్రాగే పర్యంతం — చూడనక్కర్లేదు — అతని చూపులు నా వంటినే తడుము తుంటాయని తెలుసు. బాటిల్‌ని అవసరమైన దానికన్నా ఎక్కువ జాగ్రత్తతో పైకి ఎత్తాను. మూత బిగించేటపుడు అవసరమైన దానికన్నా గట్టిగా బిగించాను. హాల్లోంచి అతన్ని దాటి వెళ్ళేప్పుడు కళ్ళను అతనివైపు మరలకుండా ప్రయత్నపూర్వకంగా నియంత్రించుకున్నాను.

బెడ్‌రూమ్‌లోకి వచ్చి మంచంవార ఒత్తిగిలి పడుకున్నాను. మూసిన కిటికీ అద్దం మీద ఆవలి వైపున్న కాశీరత్నం తీగె ఛాయా రూపంలో గుబులుగా కదులుతుంది. ఎందుకో ఒక కన్నీటి చుక్క జారి నాసిక అంచున తడబడుతూ నిలిచింది. తుడుచుకోవాలనిపించలేదు. ఇపుడేం జరగబోతోందో తెలుసు. ఇలా చాలాసార్లు జరిగింది. నా అస్తిత్వం ముందు పెద్ద ప్రశ్నార్థకాన్ని నిలబెట్టే ఘర్షణలు, అతనికి కేవలం చిలిపి తగాదాల్లా కనిపిస్తాయి. నా శరీరం కోసం అతని దేబిరింపులు, నేను నా శరీరం తప్ప మరేమీ కాదేమోనన్న నూన్యతను కలుగజేస్తాయి. "అతనో కళాకారుడు, అతనికి విశాలత్వం కావాలి, అతని స్పేస్ అతనికి ఇవ్వాలి" అని నేను వెనక్కి తగ్గుతూ వస్తున్నాను; కానీ ఆ ప్రయత్నంలో ఇక్కడ నాకే చోటు లేకుండా పోతోందన్న సంగతి గమనించలేకపోయాను. మరో కన్నీటి చుక్క తరుముకొచ్చింది. నాసిక అంచున నిలిచిన మొదటి కన్నీటి చుక్కని కలసి "ఛలో దూకేద్దా"మంది. రెండూ జతగా క్రిందకు రాలిపోయాయి. - ఇపుడు వస్తాడు. "సుజీ" అంటాడు. "సారీ" అంటాడు. మాట కలుపుతాడు. నన్ను తడుముతాడు. నా చలివిడి ముద్ద శరీరంపై సరీసృపమై ప్రాకుతాడు. ఆటవిక లయ ఆగి పోయాక, ఆత్రం తీరిపోయాక అలసటగా అటు తిరిగి పడుకుంటాడు. అసలు నేను నిజంగా భావప్రాప్తి పొంది ఎన్నాళ్ళయింది? అడిగితే, డిమాండ్ చేస్తే తట్టుకోగలడా?

కర్టెన్ కదిలిన అలికిడి. కన్నీళ్ళు తుడుచుకోవా లనుకున్నాను; కానీ నేను మెలకువగా ఉన్నానని అతనికి తెలియడం ఇష్టంలేక మెదలకుండా పడుకున్నాను. ఎందుకో నా మీద నాకే భయం కలుగుతూంది. నాకు తెలుస్తుంది — ఇవాళ నాకు అతీతంగా; నా సత్తువతో, స్థైర్యంతో నిమిత్తం లేకుండా నేనతన్ని వ్యతిరేకించబోతున్నాను. కానీ అది నాలోనే మరో నాకు ఇష్టం లేదు. (అలాగని ఇదేమీ మమతల పొదరిల్లు కాదు, కూలిపోతోందేమో అని కలవరపడటానికి; కానీ ఇది కాకపోతే ఏదీ అన్నది స్పష్టంగా తెలియడం లేదు.) ఎందుకీ స్థితి తెచ్చుకున్నాను. . . కానీ మరోదారి నా చేతుల్లో ఉందా. . . [. . .] హఠాత్తుగా నా చేతనా తలాన్ని పెల్లగించుకుని బాల్యపు జ్ఞాపక చిత్రమొకటి మొకటి జలలా ఉబికి వచ్చింది: మా మండువా లోగిలి పెంకుటింట్లో, ఓ మసక వెలుతుటి గదిలో, నవ్వారు మంచం మీద అమ్మ ఒడిలో తల పెట్టుకొని నేను జ్వరంతో పడుకుని ఉన్నాను. అమ్మ నా తల నిమురుతూ జ్వరం నుండి నా దృష్ఠి మరల్చడానికి ఏదో కథ చెప్తుంది. నానమ్మ క్రింద కూర్చుని పొత్రంలో కషాయానికి అల్లం నూరుతూ, "పిల్లది మరీ అబ్బర"మంటూ ప్రేమగా విసుక్కుంటూంది. నాన్న తన ఆదుర్దా నాకు కనిపించనీయకుండా గది బయటే పచార్లు చేస్తున్నాడు. — అదీ పొదరిల్లంటే, నా సామ్రాజ్యం, నేను మహా రాణి; నా చుట్టూ రక్షణగా ప్రేమ ఆప్యాయతల కోటగోడ ఉంది. అదే ఇక్కడ లోపించింది. స్పష్టంగా ఇదీయని వివరించలేని అభద్రతా భావన. పెళ్ళయి పదేళ్ళయినా ఇంకా ఇదే నా జీవితం అంటే నమ్మకం కలగడంలేదు; సొంత జీవితాన్ని ఎక్కడో పోగొట్టుకుని, అద్దెకో జీవితాన్ని తెచ్చుకుని జీవిస్తున్న దిగులు. "రిక్లెయిమ్ యువర్ లైఫ్" — ఏదో టి.వి. ప్రకటనకు టాగ్‌లైన్. . . క్లెయిమ్ చేసుకోనా ఇప్పుడు . . . లేక ఈసరికే చేయి దాటిపోయిందా?

భుజం మీద — వెచ్చగా, అసౌకర్యంగా — అతని చేయి పడింది.భూమ్మీద ఇన్నేళ్ళ నా మనుగడలో అంత జుగుప్సాకరమైన పధార్థమేదీ నా శరీరాన్ని స్పృశించలేదనిపించింది. అసహ్యాన్ని గొంతులోనే అణుచుకుంటూ, చిరాగ్గా ఉంది తీసేయమన్నాను.

"చిరాగ్గావుంది కాబట్టి చేయి వేయొద్దా లేక నేను చేయి వేయడమే చిరాగ్గా ఉందా?" — వెటకారాన్ని ప్రశ్నగా మార్చి అడిగాడు.

ఎందుకు మాట్లాడిస్తావ్. . . నిశ్శబ్దాన్ని వినలేవా. . . .

"రెండూ ఒకటే," పూడుకుపోతున్న గొంతును పెగుల్చుకుని ఆ మాత్రం బయటకు అనగలిగాను.

అపుడు వినబడింది — తనలో తను గొణుక్కుంటూ అన్న మాట. నన్ను గాయ పరచాలని అన్నాడో లేక నిజంగా అతని అభిప్రాయమదేనో తెలీదు; నాకు మాత్రం సూటిగా తగిలింది: విషంలో ముంచి వదిలిన బాణంలా, నిర్దయగా గుండె లోతుల్ని కెలుకుతూ. . . [. . .] నేను జడురాలినా. నాకు స్పందనలు లేవా. అసలతనికి తెలుసా ఎలా స్పందింపజేయాలో— మనసునైనా, శరీరాన్నైనా. దిగ్గున లేచి నిల్చొన్నాను. ఉద్వేగంతో కాళ్ళు వణుకుతున్నాయి. అతను అటుతిరిగి పడుకుని ఉన్నాడు. అతనన్నది స్పష్ఠంగానే వినబడినా, అతను మళ్ళీ అదే మాట రెట్టిస్తే తట్టుకునే శక్తి ఇప్పుడు నాలో లేదని తెలిసినా, మళ్ళీ ఆ మాట అనొద్దని మనసులోనే కోరుకుంటూ , సవాలు చేస్తున్నట్టు మళ్ళీ ఆ మాట అనమన్నాను.

సీన్ చేయకుండా పడుకోమన్నాడు. దిసీస్ ఇట్. . . డెడ్ ఎండ్ . . . "గొప్ప విభాజక క్షణం". ఈ క్షణం తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే నా జీవిత విస్తారంలో పదేళ్ళ ఖాళీ కనబడబోతూంది. కారణమిదని సమాధానపడేందుకు ఏమీ మిగల్చని ఖాళీ. అర్థం పర్థం లేని ఖాళీ. అతను నా వైపుకు తిరిగాడు. నీళ్ళు నిండిన నా కళ్ళు అతని చిత్రాన్ని మసకబార్చాయి. ఏదో మాట్లాడబోయాను, కానీ స్వర తంత్రులు మొండికేసాయి. అతని ముందు బలహీనంగా, బేలగా బయటపడ కూడదని ఎంత ప్రయత్నించినా కెరటంలా పొంగుకొస్తున్న దుఃఖం సహకరించడంలేదు. కాళ్ళు పట్టు వదిలేసినయ్. అలాగే నేలకూలిపోయాను. గుండె తెరిపి పడేదాకా ఏడిచాకా, వెక్కిళ్ళ మధ్య, నా అంతిమ నిర్ణయాన్ని అతనికి చెప్పాను: "నాకు డైవోర్స్ కావాలి."

***************

అతడు (లేదా) నేను:

ఇపుడిలా తనులేని ఏకాంతంలో టేబిల్‌లాంప్ వెలుగులో నా రాతబల్ల ముందు కూర్చుని, అసలీ కథ నేనెందుకు రాస్తున్నానూ అని తర్కించుకుంటే, సమాధానంగా 'ప్రోస్ట్' కొటేషన్ ఒకటి స్ఫురణకు వస్తుంది: "కేవలం కళ ద్వారానే మనం మననుండి విముక్తులమై మరొకరి కళ్ళతో వీక్షించగలం". బహుశా ఈ కథ ఆమె కళ్ళతో నన్ను నేను చూసుకొనే ప్రయత్నమేమో.

ఆమె వెళిపోయిన తర్వాత రెండు రోజులవరకూ నాకేం అర్థంకాలేదు. తన చర్య అర్థరహిత మనిపించింది. నేను అప్పటివరకూ విడాకులకు దారి తీసేంతటి సమస్యలేవీ మా మధ్య లేవనే భావిస్తూ వచ్చాను. ఆ సమయంలో ఈ హఠాత్పరిణామం నన్ను నిర్ఘాంతపరిచింది; ఒకరకమైన ఆలోచనారహిత స్తబ్దత నన్నావరించింది. మొదట ఈ కథ కేవలం నా వెర్షన్ వరకూ మాత్రమే రాద్దామని ప్రారంభించాను. కానీ రాస్తున్నకొద్దీ నిజానికి నా తరపున రాయడానికేమీ లేదని అర్థమైంది; అసలు కథంతా ఆమె తరపునే ఉందనిపించింది. నెమ్మదిగా మొత్తం సంఘటనను ఆమె దృక్కోణంలోంచి పరికించడానికి ప్రయత్నించాను. ఒక భర్తగా ఆమె తరపునుండి నేనెపుడూ ఆలోచించ లేకపోయాను, ఐ టుక్ హెర్ ఫర్ గ్రాంటెడ్; కానీ ఒక రచయితగా నాకు నేను ఎలాంటి మినహాయింపులూ ఇచ్చుకోలేదు. అప్పటివరకూ ఏ మాటకైతే ఆమె ప్రతిస్పందనను విపరీతమనీ అసంగతమనీ భావించానో నిజానికి ఆ మాటకూ ఆమె ప్రతిస్పందనకూ సంబంధం లేదనీ, చాలాకాలంగా లోపల్లోపలే కూడగట్టుకుంటూ వస్తున్న ఆక్రోశం లావాలా పెల్లుబికి బయటకు పొర్లడానికి అది కేవలం ఒక చివరి ఉద్దీపన మాత్రమేననీ అర్థమైంది. అసలు కారణం: మేమిరువురం ఒక కుటుంబం అన్న భావనను నేనామెకు కల్పించ లేకపోయాను; అది నా ఓటమి.

ఇపుడు నా ముందో బృహత్తర లక్ష్యం ఉంది: నా భార్యని తిరిగి గెలుచుకోవడం. ఎలా అంటే ఏమో. . . పక్కా ప్రణాళికలాంటిదేమీ లేదు. . . క్షమాపణ లేఖ దగ్గర్నించీ కాళ్ళు పట్టుకోవడందాకా అన్ని స్ట్రాటజీలూ పరిశీలనలో ఉన్నాయి. కానీ ఇలా మాత్రం నావల్ల కాదు: ఇంట్లో ప్రతీమూల, ప్రతీ వస్తువూ, ప్రతీ గాలివాటు పరిమళం ఆమె లేని శూన్యతను ఎత్తిచూపి గుండె బరువును పెంచుతున్నాయి. నిన్న అర్థరాత్రి కలత నిద్రలో తనింకా నా ప్రక్కనే ఉందని భ్రమిస్తూ, కాసేపు ఖాళీ పరుపు తడుముకొని తుళ్ళిపడి లేచాను. తర్వాత మంచపు ఆ ఖాళీ అర్థభాగం నన్ను మరిక నిద్ర పోనీయలేదు. మొన్న అంతే — ఆఫీసు నుండి వచ్చి, పరధ్యానంగా తాళం తీసి లోపల అడుగు పెడుతూ, "ఐయామ్ హోమ్" అంటూ చీర్‌ఫుల్‌గా, అలవాటుగా అరిచాను. బాల్కనీ రెయిలింగ్ మీంచి పావురం ఒకటి హడిలి ఎగిరిపోయింది. దాని రెక్కల తాటింపు తప్ప అంతా నిశ్శబ్దం. ఇక వంటగదిలోకైతే, అడుగు పెట్టినప్పుడల్లా చిన్నసైజు నెర్వస్ బ్రేక్‌డవున్ లాంటిది అనుభవానికొస్తుంది. నాకు తెలియకుండానే ఆమె నా జీవితంతో ఎంతగా పెనవేసుకుపోయిందో ఇపుడర్థమవుతుంది. ఇపుడామెను వెనక్కి రమ్మని ప్రాధేయపడానికి నాకే అహపు అడ్డుగోడలూ అవరోధం కాదు. "ఏమనుకున్నా సుజాతే కదా" అన్న ధీమాతో ఉన్నాను ప్రస్తుతం. అండ్ చివరిగా... ఈ కథ ఖచ్చితంగా ప్రచురణకోసం కాదు (అఫ్‌కోర్స్).

— నవీన్ .