ముందుమాట | మొదటిభాగం | రెండవభాగం | నాలుగవభాగం | ఐదవభాగం | ఆరవభాగం |
ఏడవభాగం | ఎనిమిదవభాగం | తొమ్మిదవభాగం | పదవభాగం | ఆఖరిభాగం | పూర్తి కథ pdf |
“ఏది మన భద్దర్రావ్గాడే?! ఏం షాపు పెట్టేడ్రా?”
పద చూపిస్తానంటూ తీసుకువెళ్ళాడు. గొడుగు తలల్ని తడవకుండా ఆపుతోంది గానీ, కాళ్ళు తడిచిపోతున్నాయి. శేషు గొడుగు అంచుల దాకా తల వంచి గడియార స్తంభాన్ని ఆపాదమస్తకం ఓసారి పరికించాడు. అక్కడక్కడా పెచ్చులూడి లోపల యిటుకలు కన్పించడం మినహా, దిట్టంగానే వుంది. స్తంభం పైనున్న గూళ్ళలో పావురాళ్ళు వానకి తడవకుండా తొడతొక్కిడిగా సర్దుక్కూర్చున్నాయి. కాలక్రమేణా రాజవీధి ప్రాభవం సన్నగిల్లాక, యీ గడియారస్తంభం సెంటరు వూరికి ప్రధానవీధిగా మారింది. అరటి గెలలు వేలాడేసిన బడ్డీకొట్లూ, పొగాకు దుకాణాలు, గోళీసోడా బళ్ళు, నిండా సినిమాపోస్టర్లు అతికించివున్న మంగలి బడ్డీలు, యిడ్లీ ఆవిర్లు కక్కుతున్న కాకాహోటళ్ళూ వీటితో యీ వీధి యెప్పుడూ యెడాపెడా సందడిగా వుంటుంది. ఇపుడు మాత్రం ఆకాశం నుండి వూడి పడుతున్న ఆగంతక చినుకులు తప్ప వేరే సందడేమీ లేదు. సూదావోడు యేదో మాట్లాడుతూనే వున్నాడు: ఆ ప్రక్క వీధిలోనే నారాయణగాడి నగలకొట్టూ, త్రిమూర్తులుగాడి యెరువుల దుకాణం కూడా వున్నాయట. శేషూకి మాత్రం భద్రీనే చూడాలనిపించింది
ఒక పొగాకు దుకాణం ప్రక్కన వున్న షాపులోకి వెళ్ళారిద్దరూ. అదో మెకానిక్ షాపు. మోపెడ్లూ, స్కూటర్ల అస్థిపంజరాలు గోడకి ఆన్చి నిలబెట్టి వున్నాయి. గోడల్నిండా మరకలున్నాయి. నేల మీద పనిముట్లు చిందరవందరగా పడివున్నాయి. వాటి మధ్య ఒక పదేళ్ళ కుర్రాడు బాల్ బేరింగ్స్‌తో గోళీలాట ఆడుతున్నాడు. ఇంకో మూల భద్దర్రావు గ్రీజు మరకల దుస్తుల్లో కూర్చుని టీ తాగుతూ పేపరు చదువుతున్నాడు.
“ఒరే భద్రిగా, నీకోసమెవరో గెస్టొచ్చాడ్రో!” గుమ్మం దగ్గర గొడుగు మూస్తూ సూదావోడు అరిచాడు.
భద్రి పేపర్లోంచి తలెత్తి శేషుని చూసి ఆశ్చర్యపోతే, శేషు యేమో భద్రి వాలకాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఎప్పటిలాగే రింగుల జుట్టుతో వుంటాడని వూహించిన వాడు నున్నగా బట్టతలతో కన్పించేసరికి, “మాయ్యా జుట్టేదిరా!” అంటూ పగలబడి నవ్వడం మొదలుపెట్టాడు. భద్రి పేపరు పక్కనపడేసి మతాబాలా నవ్వుతూ, “యావండి స్పైకరు గారు!” అంటూ పైకి లేచాడు. శేషు యెదురెళ్ళి గట్టిగా కౌగలించుకున్నాడు. భద్రీ మొహమాటంగా విడిపించుకుంటూ, ప్రక్కన వీళ్ళ హంగామా చిత్రంగా చూస్తోన్న కుర్రాణ్ణి, “ఒరే, కూత నువెళ్ళి యింకో రెండు టీలు పట్రారా,” అని పురమాయించాడు.
సూదావోడు, “నాకొద్దురా నేను వెళిపోతా,” అన్నాడు.
“నీ పనికిమాలినెదవా! నీకెవడిస్తానన్నాడురా,” అంటూ అతణ్ణి తీసిపడేసినట్టు చేయి దులుపరించి, అప్పుడే బయటికి పరిగెడుతున్న కుర్రాడికి, “ఒరేయ్! ఓటి పట్రా చాలు,” అని అరిచి చెప్పాడు. శేషు వైపు తిరిగి ఫిర్యాదు చేస్తున్నట్టు, “వొరే శేషు, యీ నాకొడుక్కీమద్దెన బా బలిసిందిరా! పతీ రోజూ పెళ్ళికొడుకులా ముత్తాబై సంచూపుకుంటా యెళ్ళిపోతాడుగానీ, యెపుడైనా ఆగి యేరా మాయా అని పలకరిత్తే ఒట్టు!” అన్నాడు.
అతను చెప్తున్నంత సేపూ సూదావోడు యీ ఆరోపణ నిజం కాదన్నట్టు తల అడ్డంగా వూపాడు. తర్వాత శేషు యేదో న్యాయమూర్తి అన్నట్టు అతనికి ప్రతివాదన వినిపించాడు, “అది కాదురా! తొమ్మిదింటికల్లా మిల్లు కాడుండాలి. ఇయాలంటే సాటర్‌డే కాబట్టి త్వరగా వచ్చేస్తన్నాను. కనవా రోజుల్లో అయితే యెనిమిదీ తొమ్మిదీ అలా అయిపోద్ది. ఈడికేంటి, యెన్నికవుర్లయినా చెప్తాడు. ఈడికి యీడే రాజూ, యీడే బంటూ. ఇష్టవుంటేనే షాపు తెరుస్తాడు. పనుంటే రెంచి తీస్తాడు. లేకపోతే నువ్వే చూసావుగా టీ తాగుతూ పేపరు చదువుకుంటాడు.”
“ఎదవ సొల్లు కవుర్లు చెప్పమాక,” అంటూ అతణ్ణి కొట్టిపారేసాడు భద్రి; శేషు వైపు తిరిగి, “ఒరే నిజమేంటంటేరా, పెళ్ళయిన కాణ్ణించీ యీడు మారిపోయాడురా. అసలెవళ్తోనీ కలవటం లేదు. మరి పెళ్ళాం యేం మందెట్టేసిందో యేటో!”
“అవున్రా మరి, నేనొక్కణ్ణే యెవళ్తోనీ కలవటంలేదు. నేను తప్ప కనవావోళ్ళంతా రోజూ సంకా సంకా రాసేసుకుంటున్నారు! సొల్లుకవుర్లు నాయి కాదు, నీయీ!”
శేషుకి యెందుకో ఒక నమ్మకం వుండేది, తన పరోక్షంలో కూడా యిక్కడ స్నేహాలు యథాప్రకారం కొనసాగుతూంటాయనీ, తన స్నేహితుల మధ్య పరస్పర సౌహార్దృంతో శ్రీపాదపట్నం నిత్యం కళకళ్ళాడుతుంటుందనీను. కానీ వీళ్ళిద్దరూ కేవలం తన రాక వల్లే యిలా కలిసారనీ, లేకపోతే పాఠశాల అంటూ తమకో వుమ్మడి మూలమే లేనట్టు యెవరి దార్లు వాళ్లవిగా వుంటారనీ తెలిసాకా, అది నిజం కాదనిపించింది. ముందు వాళ్ళ గొడవ ఆపడానికి విషయం మార్చాడు, “వదిలేయండ్రా బాబు వెధవ గోల! అది కాదురా భద్రీ, ఆ జుట్టేంట్రా మొత్తం వూడిపోయింది! రింగుల్రింగులుగా భలే హేర్ స్టయిలుండేదిగా నీకు!”
“అందుకే పిల్లనెవరూ యివ్వటం లేదీడికి, ఆ కుళ్ళు లోపల పెట్టుకుని ‘పెళ్ళయ్యాకా మారిపోతన్నారోయ్’ అంటూ పెళ్ళిళ్లయినోళ్ళకి పడేడుస్తున్నాడు,” అంటూ సూదావోణ్ణించి అక్కసుగా వచ్చింది సమాధానం.
“అయబాబోయ్, యెవరూ సేయలేని వత్తాదుపని యెలగపెట్టేహేవురా మరి పెళ్ళి చేసుకునీ, అందికే కుళ్ళిపోతన్నాం నిన్ను చూసి...! గుడిసేటెదవా,” అంటూ భద్రి ముదలకించాడు.
“ఆపండెహె గోల!” అసహనంగా అన్నాడు శేషు.
సూదావోడు ఆగలేదు, “అయినా శేషు నువ్వు మరీ చెప్తావురా! ఆడికి హేర్ స్టయిలెక్కడుండేది? నెత్తి మీద పిచ్చిగ్గూడు మోసినట్టు తిరిగేవోడు” యింకా అంటించాడు.
“ఒరే నువ్వక్కడే వుండరా, పిచ్చికగూడెవరిదో చూపిత్తాను,” అంటూ భద్రి గోడ దగ్గరికి వెళ్ళి అక్కడ తగిలించిన శుభ్రమైన చొక్కా ఒకటి తీసుకొచ్చాడు. దాని జేబులోంచి పర్సు తీసి, అందులోంచి ఓ పాత పాస్పోర్టు ఫోటో బయటకు లాగి సూదావోడి ముఖం ముందు ఆడిస్తూ, “ఇప్పుడు అనరా దీన్ని పిచ్చిగ్గూడని!” అన్నాడు. ఆ నలుపు తెలుపు ఫొటోలోని కుర్రాడి జుట్టు పక్కపాపిడి తీసి నూనెపెట్టిన నిగనిగల్తో వుంది.
“కటౌటు చేయించి షాపు ముందు పెట్టుకోరా, బేరాలు బాగా వత్తాయి. సిగ్గులేదెదవకి, పర్సులో యెవడన్నా దేవుడి ఫొటోనో లవరు ఫొటోనో యింకోళ్ళ ఫోటోనో పెట్టుకుంటారు,” వెక్కిరించాడు సూదావోడు.
శేషుకి కూడా నవ్వొచ్చింది జుట్టు మీద అతని మమకారం చూసి, “పోయిన జుట్టేదో పోయిందిలేరా, గతం గతః అనేసుకోవాలి! ఉన్నవి కాస్తా వూడకుండా వుంటే చాలు,” అన్నాడు.
“అబ్బే గత వని యెలా వదిలేస్తావురా. మన గతం మనది కాదేటి?” తల అడ్డంగా వూపుతూ ఫొటో ఒద్దికగా పర్సులో పెట్టుకున్నాడు భద్రి.
అతను గతాన్ని వదలలేకున్నాడంటే కారణం వుంది. భద్రి హైస్కూల్లో వాలీబాల్ జట్టుకి కెప్టెను. ఎన్.సి.సి కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. చదువులో బట్టీయం ద్వారానే అయినా మంచి మార్కులే తెచ్చుకునేవాడు. కట్టినవే కట్టినా యెపుడూ వుతికి యిస్త్రీ చేసిన బట్టలే మడతనలక్కుండా కట్టుకునేవాడు. పుస్తకాలకి సోవియట్ అట్టలేసి శుభ్రంగా వుంచుకునేవాడు. దీనికి తోడు దస్తూరి కూడా ముత్యాల కోవలా వుండేది. వీటన్నింటికన్నా ముఖ్యంగా, వుపాధ్యాయులకి చేదోడుగా వుండేవాడు. వాళ్ళకి అద్దె యిళ్ళు చూసి పెట్టడం దగ్గర్నించీ, వాళ్ళ యిళ్ళల్లో నవారు మంచాలు బిగించడం దాకా అన్నీ పూనుకుని చేసేవాడు. వాళ్ళు మంచికుర్రాడన్న సదభిప్రాయంతో పరీక్షల్లో అతని జవాబు పత్రాలు కాస్త దయగా దిద్దేవారు. కానీ పదోతరగతిలో పేపర్ల దిద్దుబాటు బడిలో కాకుండా బయట జరగడం వల్లనో యేమో, ఆ యేడాది అతనికి రెండు సబ్జెక్టులు పోయాయి. అతనే కాదు, తోటివాళ్ళెవరూ నమ్మలేకపోయారు. ఎవరితో యిన్నాళ్ళూ గౌరవం అందుకున్నాడో వాళ్లు పై తరగతిలోకి వెళిపోతే, తాను వెనకబడటాన్ని వూహించుకోలేకపోయాడు. ఇక అక్కణ్ణించి తిరిగి కోలుకోలేకపోయాడు.
కుర్రాడు టీ పట్టుకుని వచ్చాడు. సూదావోడు వెళ్ళటానికి సిద్ధమయ్యాడు. “సరేరా శేషూ మరి, రేపొద్దున్న బళ్ళో కలుద్దాం. ఏం ఫంక్షనో యేమోరా బాబూ. ఏం ముహూర్తాన అనుకున్నారో గానీ హెవీ రైన్స్!” అంటూ, వెళ్ళేవాడు తిన్నంగా వెళ్ళక, భద్రి వైపు తిరిగి, “బైరా బట్ట భద్రిగా!” అన్నాడు వెక్కిరింతగా.
భద్రి వుడుకుమోత్తనంతో నేల మీద చేతికందిన యినప గోళీ తీసి “కొండమంగలెదవా!” అంటూ విసిరాడు.
సూదావోడు గొడుగును క్రికెట్ బాట్లా పట్టుకుని దాన్ని ఆడినట్టు నటించాడు. తర్వాత వెక్కిరింతగా నడ్డి ఆడిస్తూ గొడుగు తెరిచి వర్షంలోకి నడిచాడు.
అతను వెళ్ళాకా యిద్దరు స్నేహితులూ అక్కడున్న పీటల మీద కూలబడ్డారు. భద్రి వుత్సాహంగా శేషు తొడ మీద చరిచి, “ఇంకేంటి మాయ్యా కవుర్లు! ఈ రాత్రికి మా యింటికొచ్చేయి పడుకుందాం. పొద్దున్నే యిద్దరూ కలిసెళ్దారి,” అన్నాడు. రాత్రి బాలా యింటి దగ్గర పడుకోవడం ముందే నిశ్చయమయిన సంగతి చెప్పాడు శేషు. తర్వాత యిద్దరూ పాతరోజుల్ని గుర్తు తెచ్చుకున్నారు. పక్కూరి మీద వాలీబాల్ ఆటలో గెలుపులూ, జనార్దనస్వామి రథోత్సవంలో కొట్లాటలూ, పొరుగూరు సైకిళ్ళేసుకు వెళ్ళి చూసిన రికార్డింగ్ డాన్సులు, చెరుకు లారీల వెంట పరుగులూ, పట్టాల మీద అపుడే వెళ్ళిన రైలు అణగదొక్కిన చిల్లర నాణేలు, మిట్టమధ్యాహ్నాలు యేట్లో యీతలూ... యిలా విగత క్షణాలెన్నో అవి గడిచినప్పటి కంటే తీక్షణమైన వాస్తవికతతో కాసేపు వాళ్ళ మనసుల్లో పునరుజ్జీవితమయ్యాయి. ముఖ్యంగా భద్రి ముఖం ఆ జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటున్నపుడు వెలిగిపోయింది. శేషు కూడా అంతే నిమగ్నమై వున్నాడు గానీ, అతని మనసు మధ్య మధ్యలో రేణుకాదేవి మీదకు మళ్ళుతోంది. అతనికి భద్రి మీద అసూయ కలిగింది. వీడు యిదే వూళ్ళో వుంటాడు. ఒకసారి కాకపోతే ఒకసారైనా ఆ వీధిలోంచి వెళ్తూనే వుంటాడు. ఎపుడోకపుడు ఆమె కనిపించకుండానూ పోదు. శేషుకి ఒకసారి వివరం కనుక్కోవాలనిపించింది. కానీ తన ఆత్రం వాడికి దొరికిపోకుండా కనుక్కోవాలి. “ఇంతకీ మనోళ్ళంతా యేం చేస్తున్నార్రా?” వుపోద్ఘాతంగా అడిగాడు.
“చెప్తున్నా కదరా. ఎవడి కాడే అన్నట్టు అయిపోయారు!” అంటూ మొదలుపెట్టాడు భద్రి. పాఠశాల అనే ప్రహరీగోడలున్న ప్రపంచంలో నాయకునిగా మసలుకోవడానికి తగిన లక్షణాలుండి, ప్రపంచమనే గోడల్లేని పాఠశాలలోకి వచ్చేసరికి ఆ లక్షణసంపత్తి యే మాత్రం పనికి రాకపోవడంతో వెనక వరుసలోనే మిగిలిపోయిన అతను, యింకా యెక్కడ తప్పు జరిగిందో తెలియని అయోమయంలోనే వున్నాడు. ఒకప్పుడు బడిలో తన ప్రశస్తితో పోలిస్తే సాపేక్షంగా అనామకులైన వాళ్లంతా యిపుడు వూళ్ళో పెద్ద పేర్లుగా చెలామణీ కావటం వెనుక జీవితం కట్టిన లెక్కయేవిటో అతనికింకా అర్థంకాలేదు. ఆ అక్కసు అతనిలో వుంది. దానికి ముసుగేసే లౌక్యం లేకపోవటంతో, అది యిబ్బందికరమైన నగ్నత్వంతో అతని మాటల్లో బయటపడిపోతోంది. ఒకప్పుడు బడిలో మబ్బుగాళ్ళందరూ యిప్పుడు యెలా వెలిగిపోతున్నారో, దార్లో కనిపిస్తే చూడనట్టు నటించేవాళ్ళెవరో, తమ కళ్లముందు లాగూ లేసుకు తిరిగినవాళ్ళు కూడా మీసాలొచ్చీ రాంగానే యెంత గోరోజనం చూపిస్తున్నారో, గ్రౌండులో యీ కుర్రనాకొడుకుల హవా పెరిగిపోవడంతో తాను వాలీబాల్ ఆడటమే యెలా మానేసాడో అన్నీ చెప్పుకొచ్చాడు.
శేషు అతణ్ణి నేర్పుగా కావాల్సిన విషయంవైపు లాక్కొచ్చాడు. ముందు తమ క్లాసు ఆడవాళ్ళ సంగతులు అడిగాడు. భద్రి మొదట, “మనం ఆడంగుల్ని పెద్ద పట్టించుకోవని నీకు తెలుసు కదరా,” అన్నాడు గానీ, శేషు “అవును మరి నువ్వు చాలా పత్తిత్తువురా!” అంటూ అన్నావజ్ఝుల పద్మావతి పేరు గుర్తుచేసేసరికి సిగ్గుపడి మాట దాటవేసాడు. ఆమె వివరం అడిగితే, యిపుడు పెళ్ళయిపోయిందని, పొరుగూరి బాంకులో పనిచేస్తుందనీ చెప్పాడు. మిగతావారి గురించి కూడా తెలిసిన సంగతులు చెప్పాడు. దాదాపు అందరికీ పెళ్ళిళ్ళయిపోయినాయనీ; వనజాక్షినీ, వెంకటలక్ష్మినీ యిలా కొంతమందిని తప్ప, మిగతా అందరినీ వూళ్ళోనే యిచ్చారనీ; కొంతమంది పిల్లల్ని చంకనేసుకుని అపుడపుడూ తిరణాల్లోనో, నోములప్పుడో కనిపిస్తుంటారనీ; చంద్రావతి విడాకులు పుచ్చుకుందనీ; ముత్యాల సరితాదేవి వరకట్నం గొడవల్లో చనిపోయిందనీ; రాజరత్నం మొగుణ్ణొదిలి యిల్లుకట్టిన తాపీమేస్త్రీతో లేచిపోయిందనీ; సిద్దిరెడ్డి కనకమాలక్ష్మి వార్డు మెంబరుగా పోటీ చేసి గెలిచిందనీ, యిలా శేషు అడిగిన వాళ్ల గురించి కొంత, తనకు గుర్తొచ్చినవాళ్ల గురించి కొంతా చెప్పుకుంటూపోయాడు. ఎంతకీ రేణుకాదేవి ప్రస్తావన రాకపోవడంతో శేషు యిక వుండబట్టలేకపోయాడు. అపుడే గుర్తొచ్చినట్టు, “అవునొరే, సుబ్బరాజుగారి మనవరాలేం చేస్తుందిరా?” అన్నాడు.
“ఆ పిల్లేం చేస్తందో యెవరికీ తెలియదురా బాబు. సుబ్బరాజుగారు వున్నన్నాళ్ళూ ఆయనెంబట అవుపడేది. ఆయన పోయాకా అదీ ఆపడ్డం లేదు. మొన్న గుళ్ళో భజన కాడ కావాల, ఓ మాటు చూసాను. ఏవన్నా తెలిత్తే యిదిగో మన మేట్టారికే తెలియాలి. ఆడే అపుడపుడూ యెళ్ళి కలుత్తుంటాడు. గ్రంథాలయం పుస్తకాలయీ ఆడే మార్సిత్తుంటాడట,” అన్నాడు. మేస్టారంటే బాలాగాడు. ఇప్పుడు వాడు తాము చదివిన బళ్ళోనే తెలుగు టీచరుగా పని చేస్తున్నాడు. చిన్నప్పటి స్నేహితులందరిలోనూ యిప్పటికీ శేషూతో కాస్తో కూస్తో సాన్నిహిత్యం కొనసాగుతోంది వాడితోనే.
శేషు టీ గ్లాసు పూర్తి చేసి ప్రక్కనపెట్టాడు. ఇంకా వర్షం ముమ్మరంగా కురుస్తూనే వుందిగానీ, వెలుతురు బాగా తగ్గిపోయింది. అసలే వర్ణవిహీనమైన యీ తెలుపు నలుపు వాతావరణంలో, వున్న తెలుపు కూడా తగ్గిపోతోంది. మసకచీకట్లు ఆవరిస్తున్నాయి. శేషుకి ఆనందం కలిగింది. ఇంకేముంది, రాత్రి కాసేపు బాలా గాడితో యెలాగోలా కాలక్షేపం చేసి, నిద్రపోతే, తెల్లారిపోతుంది. ఎదురు చూస్తున్న క్షణాల దగ్గరికి ఒక్క గెంతులో వెళ్ళి వాలతాడు. పగలు రైలు ప్రయాణమంతా అనిశ్చిత నిరీక్షణలో చాలా భారంగా గడిచింది. అపుడు కూడా కాలాన్ని నిద్రలో దాటేద్దామని చాలా ప్రయత్నించాడు. పగటినిద్ర అలవాటు లేక ఆ వుపాయం పనిచేయలేదు. అడపాదడపా కునుకైతే పట్టేది గానీ, లేచి వాచీ చూసుకునేసరికి కాలం ఐదు-పది నిముషాలకు మించి దాటి వెళ్ళక వుసూరుమనిపించేది. శ్రీపాదపట్నంలో రైలు దిగిన క్షణం నుంచీ మాత్రం చాలా వేగంగా గడుస్తున్నట్టనిపించింది.
భద్రి యింకా యెవరి గురించో మాట్లాడుతూనే వున్నాడు. శేషు పరాగ్గా వూకొడుతున్నాడు. ఎందుకో తన బాల్యమిత్రుడైన వాలీబాల్ జట్టు కెప్టెనుకీ, యీ మెకానిక్ షాపు వోనరుకీ మధ్య పొంతన కుదుర్చుకోవడం శేషుకి కష్టమయింది. బదులుగా అతని మనసు యిప్పుడిపుడే ఒక కొత్త ఒప్పందానికి రాజీ పడుతోంది. దాని ప్రకారం ఆ బాల్య మిత్రుడు అందరాని మానసచిత్రంగా వెనకే వుండిపోయాడు; యీ మెకానిక్ షాపు ఓనరు యేదో జననాంతర స్నేహభావం పునాదిగా యేర్పడ్డ మిత్రునిలా మళ్ళీ కొత్తగా అలవాటయ్యాడు. శేషు మనసుకు సంబంధించినంత వరకూ వీళ్ళిద్దరూ యిక అతకరు, శాశ్వతంగా వేరుపడిపోయారు. భద్రి భుజం మీద చరిచి, చీకటి పడుతోంది యిక రేపు కలుద్దామన్నాడు. అతను యిచ్చిన గొడుగు తీసుకుని బయల్దేరాడు. గుమ్మం బయట యిందాక టీలు తెచ్చిన కుర్రాడు చూరు నించి ధారగా కారుతున్న చినుకుల తెరకు యివతల నిలబడి, చేతులు వీపు వెనకాల కట్టుకుని, వీధిని పర్యవేక్షిస్తున్నంత దర్జాగా అటూయిటూ చూస్తున్నాడు. శేషు చేత్తో వాడి జుట్టు చెల్లా చెదురు చేసి థాంక్స్ చెప్పి బయటపడ్డాడు.

0 comments:
మీ మాట...