March 18, 2012

మిత్రభేదం (ఎనిమిదవభాగం)

ముందుమాట | మొదటిభాగం | రెండవభాగం | మూడవభాగం | నాలుగవభాగం | ఐదవభాగం
ఆరవభాగం | ఏడవభాగం | తొమ్మిదవభాగం | పదవభాగంఆఖరిభాగం | పూర్తి కథ pdf |    

అనుకున్న ప్రకారమే మరుసటి రోజు బడి మానేసాడు. కాని ఇంట్లోనే వుంటే సుబ్బరాజుగారి పాలేరుకి దొరికిపోతానేమోనని భయమేసింది. ఎందుకన్నా మంచిదని పూసావోడి పడవెక్కి వాడితో పాటూ తిరిగాడు. సాయంత్రమయ్యేసరికి బాలా వచ్చి యేవీ జరగలేదని చెప్పాడు. రేణూ మామూలుగానే వుందట. బాలా కదిపితే మామూలుగానే మాట్లాడిందట కూడా.

శేషూ మర్నాడు వుత్కంఠగా బడికి వెళ్ళాడు. ఎప్పుడూ లేని ఆత్రుతతో రేణూ రాకకై యెదురుచూసాడు. ఆమె పుస్తకాల దొంతరని ఛాతీకేసి హత్తుకుని, తన యిద్దరు స్నేహితురాళ్లతో కలిసి, యెప్పటిలాగే లోనికి ప్రవేశించింది. తరగతి జరుగుతున్నపుడు మధ్యమధ్యలో ఆమె వైపు చూసాడు. తాను చూస్తున్నాడన్న యెరుక ఆమెకు వుందని తెలుసు. ఆమె ముఖంపై నిర్లక్ష్యం తారాడుతుంది. ఆ కవళిక అతనికి చిరపరిచితమే. వాళ్ళిద్దరి మధ్యా యే గొడవ జరిగినా, మళ్ళీ అతను బతిమాలుకునేవరకు, ఆమె ముఖంపై యిదే కవళిక కనిపిస్తుంది. కాని యిదివరకట్లా వెళ్ళి బతిమాలా లనిపించలేదు. ఒక కారణం: మొన్నటి రాత్రి పడ్డ భయమంతా (అలా కంగారుగా వీధుల్లో పరిగెత్తడమూ, బాలా దగ్గర పిరికిగా బైటపడాల్సిరావడమూ అదంతా), యిపుడు వుత్త భయమేనని తేలిపోగానే, ఆమె మీద కోపంగా మారింది. ఆమె వల్లనే అలాంటి పరిస్థితి కలిగిందన్న దుగ్ధ అతనిలో యింకా రగులుతోంది. అది త్వరగా చల్లారిపోయేదే, దీనికి రెండో కారణం ఆజ్యం పోయకుండా వుంటే! ఆ  రెండో కారణం: ఆమె యివాళ క్లాసులో ప్రవర్తిస్తున్న తీరు. గొడవ పడినపుడు యిదివరకూ కూడా అతని పట్ల యిలాగే నిర్లక్ష్యాన్ని కనపరిచినప్పటికీ, అది అతని గుర్తింపు కోసం అర్రులు చాస్తున్నట్టుండేది; అతను వచ్చి బతిమాలుకునే దాకా ఒక తీక్షణమైన తపస్సులా అతని వైపు యెక్కుపెట్టి వుండేది; దాని తీవ్రత ఆమె చుట్టూ ప్రతీ అంశం మీదా ప్రసరించేది. దాంతో అతనితో మాటల్లేనపుడు మొత్తం ప్రపంచంతోనే మాటల్లేనట్టు ముభావంగా వుండేది. మామూలుగానే వేరెవరితోనూ అంత కలివిడిగా వుండేది కాదు గనుక, యీ సమయాల్లో మరింత యేకాకిలా కనిపించేది. జాలి కలిగేది. ఆ ప్రోద్బలంతోనే వెళ్ళి మాటకలిపి జట్టులోకి చేర్చుకునేవాడు. కానీ యిపుడామె అలా జాలిగొలిపే స్థితిలో యేం లేదు. ఇదివరకూ గొడవ పడినపుడు ఒక సరళరేఖలా ఆమె వైపు నుంచి అతణ్ణి చేరే నిర్లక్ష్యం, యిపుడు అతనితో నిమిత్తం లేనట్టు ఒక వలయాకృతిలో ఆమె చుట్టూ పరచుకుని వుంది. ఆ వలయంలోకి అతనికి తప్ప మిగతా అందరికీ ప్రవేశం వుంది. రేణూ ప్రస్తుతం స్నేహితురాళ్ళతో సరదాగానే మసలుకుంటోంది. పాస్‌బెల్లులో బయటకు వెళ్ళి ఆటలాడింది, తరగతి విరామంలో కబుర్లు చెప్పింది. ఈ మార్పు శేషూలో కసి పుట్టించింది. ఇన్నాళ్ళూ అతనికి అధికారపీఠం అప్పగించి, దాని పరిధిలో ఒబ్బిడిగా మసులుకుని, యిపుడు ఆమే ఆ పీఠాన్ని అతని కాళ్ల క్రింద నుండి లాగేసుకోవడాన్ని సహించలేకపోయాడు. ఇదెక్కడి దాకా వెళ్ళగలదో చూడాలనుకున్నాడు.

ఆ మరుసటి రోజే అతనికి కసి వెళ్ళగక్కే అవకాశం ఒకటి దొరికింది. ఆ రోజు లెక్కల మేస్టారు ఒక ప్రక్క పెద్దపరీక్షలు దగ్గరపడుతున్నా యింకా పాఠ్యప్రణాళిక పూర్తవటం లేదన్న పూనకంలో వున్నారు. తరగతి అంతట్నీ పట్టుకు చెరిగేస్తున్నారు. ఆ వరుసలో  రేణూ వంతు వచ్చినపుడు నిలబెట్టి  యేదో ప్రశ్న అడిగారు. రేణూ సమాధానం చెప్పలేకపోయింది. ఆడపిల్ల కాబట్టి బెత్తం పక్కనపెట్టి వెటకారానికి పని చెప్పారు. రేణూ ఆ మధ్య యెపుడో కంపాక్సు బాక్సులో రేగొడియాలు పెట్టుకు దొరికిపోయింది. దాన్ని యీ సందర్భానికి అన్వయించి వెటకరించారు. అప్పటికే తరగతి అంతా ఆయన కోపానికి బిక్కచచ్చిపోయి వుండటంతో యెవరూ నవ్వే సాహసం చేయలేదు. శేషూ మాత్రం పనిగట్టుకు బల్ల మీదకు వంగి ఆమెకు వినపడేట్టు కిసుక్కుమని నవ్వాడు. ఆమె కూర్చున్నాక ఆగ్రహావమానాలతో గడ్డకట్టి వున్న ఆమె ముఖాన్ని ఓరగా చూసి నిర్థారించుకున్నాడు కూడా. తన వైరభావాన్ని ఆమెకు తెలియజేయగలిగినందుకు సంతృప్తి కలిగింది. ఈ సంఘటన ప్రభావం అతను వూహించిన దానికన్నా యెక్కువగానే కనిపించింది. ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆ రోజంతా చాలా అసహనంగా ముళ్ళమీద కూర్చున్నట్టు కనపడింది. మునుపటి అలవోకయైన వుత్సాహం లేదు.  శేషూ మాత్రం మామూలు కన్నా యెక్కువ వుత్సాహాన్ని ప్రదర్శించాడు. ఒక ఖాళీ పీరియడ్లో చాలా అట్టహాసంగా అల్లరి చేసాడు. ఆ పీరియడంతా యెవరి గోల వారిది అన్నట్టు సాగింది. కొంతమంది ఒక గుంపుగా బల్లల మీద గుమికూడి కాగితం ముక్కలతో రాముడూసీతా ఆట ఆడారు. శేషూ ఆడపిల్లల్లోంచి కూడా కొందర్ని ఆటలో కలుపుకున్నాడు. వాళ్ళల్లో రేణూ స్నేహితురాళ్ళు సరితాదేవీ, వనజాక్షి కూడా వున్నారు. ఆమెని మాత్రం కొట్టొచ్చేట్టు తెలిసేలా నిర్లక్ష్యం చేసాడు. ఆమె వెనక బెంచీలోకి వెళ్ళిపోయి నిజంగా చదువుతున్నట్టే భృకుటి ముడివేసి పుస్తకంలో తల దూర్చింది. ఆమెలో యిదివరకట్లాంటి తీవ్రమైన ప్రతిస్పందన రప్పించగలిగినందుకు శేషూకి సంతోషం కలిగింది.

ఆ మరుసటి ఆదివారం రేణూ  ప్రతీ వారంలా శేషూ వాళ్ల యింటికి రాలేదు. బడిలో అలవాటుగా కూర్చునే స్థానం కూడా మార్చేసుకుంది. మామూలుగా వాళ్ళిద్దరూ ఆడ, మగపిల్లల బెంచీల వరసల్లో మధ్యనుండే సందుకి చెరోవైపూ కూర్చునేవారు.  ఆమె యిపుడు సందువైపు కాక గోడ వైపు కూర్చుంటోంది. తరగతిలో ఆమె ప్రవర్తనలోనూ మార్పు వచ్చింది. ఈ మధ్యే తోటివాళ్లతో కలివిడిగా వుండటం మొదలుపెట్టిందల్లా మళ్ళీ మానేసింది. ఎప్పుడూ చూసినా నిశ్శబ్దంగా, ముభావంగా వుంటోంది. ఎపుడు వెళ్తుందో యెపుడు వస్తుందో అజాపజా తెలియటం లేదు. ఇదివరకూ యే యేకాకితనం ఆమె మీద జాలి కలిగించి సంధికి పురికొల్పేదో, యిపుడు ఆమె అదే స్థితిలోకి వచ్చింది. అయినా శేషూ చొరవ చేయలేకపోయాడు. ఇదివరకూ వాళ్ళమధ్య యెలాంటి గొడవలు జరిగినా, వాటి వెనుక కారణాలేవీ అటుపిమ్మట ఆమెతో సంధి ప్రతిపాదనకి అహాన్ని అడ్డు తెచ్చేటంత తీవ్రమైనవి కావు. కానీ ఆమెను ముద్దు పెట్టుకోవడమన్న ప్రస్తుత కారణం అతని యిష్టానిష్టాల్తో నిమిత్తం లేకుండా మనసులోకి అపరాధభావనను జొరబడేలా చేస్తోంది. ఆ అపరాధభావన గాఢతరమయ్యే కొద్దీ అతనిలో అహమూ పెరుగుతోంది. దాన్ని సమర్థించుకోవడానికి ఆమె కొట్టిన చెంపదెబ్బను గుర్తు తెచ్చుకునేవాడు. తాను ముద్దు పెట్టుకోవడం వల్లే ఆమె కొట్టిందని అనుకునేవాడు కాదు, తాను పెట్టిన ముద్దుకీ ఆమె కొట్టిన దెబ్బకీ చెల్లుకి చెల్లనుకునేవాడు; యిక వెళ్ళి బతిమాలాల్సిన పని లేదనుకునేవాడు. ఇదంతా తాను వూహించని దారిలో వెళ్తున్నట్టు అపుడపుడూ అనిపించేది.  కాని ఆమెను గురించిన ఆలోచనలు అతని మనస్సాక్షి నుండి యెంత అహానికి విరుద్ధమైన అవగాహనని ఆశించేవంటే, అసలామె గురించి ఆలోచించడమే తగ్గించేసాడు.

ఈ లోగా బడిలో మండలస్థాయి వాలీబాల్ పోటీలకు సన్నాహం మొదలవడంతో ఆ హడావిడిలో పడిపోయాడు. డ్రిల్ మాస్టారు సాధన నిమిత్తం ఆటగాళ్ళకు చివరి పీరియడ్లలో పాఠాల నుండి మినహాయింపు యిప్పించారు. జట్టంతా మైదానంలో చేరి బడి ముగిసే దాకా ఆడేవారు. శేషూ సాయంత్ర మెపుడవుతుందా అని యెదురు చూసేవాడు. కోర్టులో అడుగు పెట్టి నెట్ కట్టింది తరువాయి, చుట్టూ ముగ్గుతో గీసిన అవుట్‌లైను సరిహద్దుగా అదొక చిన్ని ప్రపంచంలా మారిపోయేది. బంతి గాల్లో వున్నంత సేపూ ఆ ప్రపంచం వుత్తేజంతో కంపించేది. బడి గంట కొట్టి పిల్లలంతా బయటపడ్డాకనే సమయ స్పృహ కలిగేది. బంతి, నెట్టు డ్రిల్ మాస్టారుకి అప్పగించి బయటపడేవారు. శేషు బాలాతో కలిసి యింటికి నడిచేవాడు. ఒక రోజు అనుకోని దృశ్యం యెదురైంది. గేటు దగ్గర బాలాతో పాటూ రేణూ కూడా నిల్చొని వుంది. ఇది అతను వూహించలేదు. వాళ్ల వైపు నడుస్తున్నంత సేపూ యెలా ప్రవర్తించాలో తేల్చుకోలేక గజిబిజిపడ్డాడు. ఆటలో కీలక సన్నివేశాల్ని బాలాతో చర్చిస్తూ హుషారుగా యింటికి వెళ్ళవచ్చనుకున్న అతనికి యిపుడీ పరిస్థితి యెదురవడం యిబ్బందిని కలిగించింది. రేణూ పెదాల వెనక కనిపించీ కనిపించని నవ్వు తారాడుతోంది. మామూలుగా అలాంటి ఔదార్యం తన వైపు నుంచి ఆమెకు అందేది. ఆమె నుంచి స్వీకరించాల్సిన అవసరం యెపుడూ రాలేదు. ఆ అవసరం యిపుడూ లేదనిపించింది. తిన్నగా బాలా దగ్గరకు నడిచి ప్రక్కన రేణూ లేనే లేనట్టు, ఏరా రావట్లేదా?" అనడిగాడు. బాలా అయోమయంగా రేణూ వైపూ అతని వైపూ మార్చి మార్చి చూసాడు.

నువ్వు నాతో వస్తే రా, నే పోతున్నా, అని నడుచుకుంటూ వచ్చేసాడు శేషూ.

బాలా కాసేపటికి పరిగెత్తుకుంటూ వచ్చి పక్కన చేరాడు. యేరా, అలా వచ్చేసావు? రేణూ నీతో మాట్లాడదామనే వచ్చింది, అన్నాడు.

శేషూ మాట్లాడకుండా నడుస్తున్నాడు.

అలా వుండకూడదురా బాబూ ఫ్రెండ్స్ తోటి. కలిసిపోవచ్చు కదరా?

నువ్వు నడువెహె!

అలా వుండకూడదురా బాబూ!

పెద్దొత్తాదువి నువ్చెప్తే గానీ తెలీదురా మాకు! నేనోటిచెప్పనా? కలిసిపోటానికి నాకేం బాధ లేదు. కానీ ఆ పిల్ల అంతా  మనవే అన్నట్టు యెన్నాళ్ళు వుంటదిరా? మనవేవన్నా యెలకాలం వెనకుంటామా? లేనపుడు కూడా సత్తువగా నిలబడాలా వద్దా. అస్తమానం మన యెమ్మట పడి తిరిగితే అది రాదు కదా? అందుకే యిలా వుంటున్నా... అన్నాడు.

నిజానికి యీ మాటలు మాట్లాడక మునుపు శేషూ యిలా యెపుడూ ఆలోచించలేదు. మాట్లాడాకా మాత్రం యిదే నిజమని తనను నమ్మించుకోవడం మొదలుపెట్టాడు. ఆమె మంచి కోసమే ఆమెతో మాట్లాడట్లేదని తన మనస్సాక్షిని కూడా సమర్థవంతంగా సముదాయించగలిగాడు. దాంతో యిదివరకట్లా యే అపరాధ భావనతోనూ కొట్టుమిట్టాడాల్సిన అవసరం లేకపోయింది. రేణూ వునికిని నిశ్చింతగా తన ప్రపంచ పరిధుల అవతలకి నెట్టివేయగలిగాడు. అతనికి యీ క్రమంలో పెద్ద లోటేమీ కూడా కనపడలేదు. వెళ్ళి మాట్లాడితే ఆమె కోసమే మాట్లాడాలనుకునేవాడు. ఒక్కోసారి ఆమె మూగదానిలా తరగతిలో వుండీ లేనట్టు మసలుకుంటుంటే వెళ్ళి పలకరించాలనిపించేది. ఆ ప్రయత్నాన్ని యెప్పటికపుడు వాయిదా వేస్తూనే వుండేవాడు. చూస్తుండగానే యిద్దరి మధ్యా పరిస్థితి యెంత జటిలమైపోయిందంటే, అన్నీ అధిగమించి చేరువైనా ఆమెతో యిదివరకటి తేలికపాటి స్నేహం మరలా సాధ్యమవుతుందనిపించలేదు.

ఈలోగా యేడాది చివరికి వచ్చేయడంతో  ప్రయివేటు క్లాసుల్తో, ఒంటిపూటబళ్ళతో రోజులు చురుకుగా గడిచిపోయాయి.తేరుకునేసరికి పరీక్షలు దగ్గరకొచ్చేసాయి. శేషూ మొదటి రోజే గమనించాడు, రేణూ పరీక్షలకు హాజరవటం లేదని. బాలాని వెళ్ళి విషయం కనుక్కోమన్నాడు. ఇక బడికి రాననీ, చదువు మానేసానని చెప్పిందట. వెళ్ళి కలవాలా వద్దా అని ముందు వెనకలాడి చివరకు మానేసాడు.  పైగా అతను యెపుడు పరీక్షలు పూర్తవుతాయా అన్న ఆత్రుతలో వున్నాడు. ఎందుకంటే అతని అన్నయ్య వేసవి సెలవుల్లో నగరానికి తీసికెళ్తానని ముందే మాట యిచ్చాడు.

శేషూ అన్నయ్యకి యిటీవలే మంచి ప్రభుత్వోద్యోగం వచ్చింది. నగరంలో గవర్నమెంటు క్వార్టర్సులో వుంటున్నాడు. ఇచ్చిన మాట ప్రకారమే శేషూని తీసుకు వెళ్ళి అన్నీ తిప్పి చూపించాడు. అన్నయ్యకి సెలవైన రోజుల్లో యిద్దరూ ఎగ్జిబిషన్లకీ, జూ పార్కుకీ, సినిమాలకీ తిరిగారు. అతను వుద్యోగానికి వెళిపోయిన రోజుల్లో శేషూ బాల్కనీలో కూర్చుని రోడ్డు మీద వచ్చేపోయే కార్లనూ, మోటార్ సైకిళ్ళనూ వాటి వాటి కంపెనీ పేర్ల పరంగా విడదీసి లెక్కపెట్టేవాడు. ఏవి యెన్నొచ్చాయో కాగితం మీద రాసుకునేవాడు. ముఖ్యంగా మోటార్‌సైకిల్ నడిపేవాళ్ళని ఆరాధనగా చూసేవాడు. ముఖంలో హీరోయిజమేమీ కనపడనీయకుండా వాళ్ళు  వాటిని నడపగలగడం ఆశ్చర్యమనిపించేది. ఎండ తగ్గాక క్వార్టర్స్ పైన మిద్దె మీదకు చేరి, తక్కువ యెత్తులో యెగిరివెళ్ళే విమానాల కోసం యెదురుచూసేవాడు. రాత్రుళ్ళు దుకాణాల లైట్లతో, ప్రకటనల హోర్డింగులతో ప్రకాశవంతంగా వెలుగుతున్న నగరాన్ని చూసినపుడు అతనికి వేరే లోకంలో వున్నట్టుండేది.  అంతా బానే వుండేది గానీ, అన్నయ్య వుద్యోగం నుండి యింటికి వచ్చాకా ముందే కొనేసిన పదో తరగతి పుస్తకాల్ని చదివించడం మాత్రం నచ్చేది కాదు. వేసవి సెలవుల్లో చదవటమేమిటనుకునేవాడు. ఆ సమయాల్లో శ్రీపాదపట్నం గుర్తొచ్చేది. కొన్నాళ్ళే కదా అని సరిపుచ్చుకున్నాడు. అయితే వేసవి సెలవులు ముగిసాకా తెలిసింది, అతని బాగోగులకై కొన్ని వూహించని నిర్ణయాలు ముందే జరిగిపోయాయని. శ్రీపాదపట్నంలోనే వుంటే తమ్ముడు పబ్లిక్ పరీక్షలు కొండెక్కించేస్తాడని తీర్మానించి,  పదోతరగతి నగరంలోనే చదివించాలని అతని అన్నయ్య యేకపక్ష నిర్ణయం తీసేసుకున్నాడు. శేషూ గోలపెట్టాడు గానీ యేం చెల్లలేదు. వేసవి సెలవలు ముగియడం, అతణ్ణి ఒక ప్రైవేటు స్కూల్లో చేర్చడం అయిపోయాయి.

స్కూల్లో చేరిన కొన్ని రోజులకు శేషూ, అతని అన్నయ్యా కలిసి శేషూ సామాను పట్టికెళ్ళటానికి శ్రీపాదపట్నం వచ్చారు. ఒక రోజు శేషు అన్నయ్యతో పాటూ రాజు గారి మేడకు వెళ్ళాడు. అన్నయ్య  సుబ్బరాజుగారితో వూళ్ళో యిల్లు అమ్మకానికి పెట్టడం గురించి యేదో మాట్లాడుతున్నాడు. శేషూ మధ్యమధ్యలో కళ్ళెత్తి రేణూ గదివైపు చూస్తున్నాడు. కాసేపటికి మాటల్లో ఆమె ప్రసక్తి వస్తే, సుబ్బరాజుగారు రేణుకాదేవీ! అంటూ పిలిచారు. ఆయన కూర్చున్న వుయ్యాల బల్ల వెనక నుంచి, వంటగదిలోంచి కామోసు, బయటకి వచ్చింది. అన్నయ్య ఆమెకని తెచ్చిన పట్టీలు యిస్తే తీసుకుని, అతణ్ణి కాసిని కుశల ప్రశ్నలడికి, శేషూ వైపు చూడనైనా చూడకుండా మళ్ళీ వచ్చిన దారినే వెళిపోయింది. తరువాత సంభాషణ ఆడపిల్లల చదువు మీదకు మళ్ళింది. అన్నయ్య యేదో సమర్థనగా మాట్లాడబోతే సుబ్బరాజుగారు పెదవి విరిచారు. శేషూని మాత్రం మీ అన్నయ్యలా వృద్ధిలోకి రావాలంటూ భుజం చరిచి చెప్పారు. శేషూ వినయంగా తలూపాడు. అదే అతను రేణూని చివరిసారి చూడటం. సుబ్బరాజుగారు కాఫీ తాగి వెళ్ళమన్నపుడు రేణూయే వచ్చి యిస్తుందనుకున్నాడు గానీ, వంటావిడ యిచ్చివెళ్ళింది. రేణూతో మాట్లాడే అవకాశం గనక దొరికివుంటే ఆ పట్టీల యెంపికలో తాను అన్నయ్యకు సాయపడిన సంగతి చెప్దామనుకున్నాడు. కాని ఆమె మరలా బయట కనిపించలేదు.

అతను కూడా వున్న కొద్ది రోజులూ స్నేహితులకు వీడ్కోళ్ళు పలకడంలో నిమగ్నమైపోయాడు. వాళ్ళంతా ఒక్కొకరు ఒక్కోరకంగా ప్రతిస్పందించారు. కొందరు అనుకోనంత బెంగ పడ్డారు. కొందరు అనుకోనంత తేలిగ్గా తీసుకున్నారు. బాలా పోస్టల్ శాఖ వాళ్ళ డైరీ ఒకటి  బహుమతిగా యిచ్చి అందులో ఆలోచనలు రాసుకొమ్మన్నాడు. ఉత్తరాలు రాయటానికి చిరునామా తీసుకున్నాడు. భద్రీ స్టేషన్ దాకా వస్తానని బయల్దేరాడు. అందరూ కలిసి జట్కా యెక్కారు. అన్నయ్య ముందు కూర్చుని, బండి తోల్తున్న ముసలాడితో పిచ్చాపాటీ వేసుకున్నాడు. ముసలాడు తన కొడుకు అటు చదువూ చదవక, యిటు పనిలోకి రమ్మంటే నామోషీ పడుతున్న విషయాన్ని ఫిర్యాదుగా చెప్తున్నాడు. పిల్లలిద్దరూ బండి వెనుక కాళ్ళు క్రిందకి వేలాడేసి కూర్చుని వాలీబాల్ జట్టులో మార్పులూచేర్పుల గురించి మాట్లాడుకుంటున్నారు. గుర్రపు డెక్కలతో పాటూ పరిగెత్తలేక ఆయాసంగా వెనకపడుతున్న వూరి దారులు ప్రతీ మలుపుకీ ఒక రాగంతో, ప్రతీ గతుకుకీ ఒక గమకంతో వీడ్కోలు పాడుతున్నాయి. స్టేషన్లో  రైలు బయల్దేరబోతుందనగా, భద్రీ హఠాత్తుగా కిటికీలోంచి చేయిపెట్టి శేషూ జేబులో ఒక పదిరూపాయల కాగితం కుక్కాడు; అవసరానికి వాడుకొమ్మన్నాడు.  శేషూ కిటికీలోంచి భద్రీ రూపం కనుమరుగయ్యేదాకా చేయి వూపాడు. తర్వాత రైలు పెట్టె లోపలి సందడిలో నిమగ్నమైపోయాడు.

2 comments:

  1. ఆదివారం కదా మెహెర్ గారూ! మీరు ఇంకాస్త పెద్ద భాగం ఇస్తే ఎంత బాగుండేది..ఇట్టే అయిపోయినట్టు అనిపించింది :(. గుండె నిండలేదింకా:)

    ReplyDelete
    Replies
    1. Sorry about that. కానీ పదకొండు అంకెకి ముందే ఓ ప్రాముఖ్యత ఆపాదించుకుని అన్ని భాగాలనుకున్నాము నేను, సంహిత. పైగా కథా పరంగా కూడా దీన్ని యిక్కడికి ముగించటమే సరైన విభజన అనిపించింది. అదీగాక, చివరి భాగం యింకా రాయకపోవటమూ, డెడ్‌లైన్ సమీపిస్తుండటమూ, వీటన్నిటి దృష్ట్యా ఒక భాగం తగ్గించడం అంటే నా పీక మీద నేనే కత్తిపెట్టుకోవడమే! :)

      Delete