పూర్వవిద్యార్థుల పునస్సమ్మేళనోత్సవం అందరికీ మొదలై చాలాసేపయింది గానీ, శేషూకి యింకా మొదలవనట్టే వుంది. రేణూ యింకా రాలేదు. వస్తుందన్న ఆశ క్షణక్షణానికీ సన్నగిల్లుతోంది. చివరికి యిక ఆమె రాదన్న సంగతి ఒప్పేసుకుని, యింటికి వెళ్ళి కలవాలన్న నిశ్చయాన్ని బలపరుచుకుంటూ, వున్నట్టుండి నిస్సారమైన వర్తమానంలోకి మెల్లగా సర్దుకుంటున్నాడు.
వేడుక తరగతి గదిలోనే జరుగుతోంది. బల్లలు పేర్చి చేసిన వేదిక మీద సోషల్ టీచరు మైకు ముందు నిలబడి ప్రసంగిస్తున్నాడు. ఆయన వెనుక, ఆ యిరుకు వేదిక మీద సరిపోయేట్టు అర్థవలయంలో పేర్చిన కుర్చీల్లో, మిగతా టీచర్లు కూర్చున్నారు. వారిలో యెవరూ యిపుడు శ్రీపాదపట్నం బళ్ళో పనిచేయటం లేదు. కాబట్టి వారికి కూడా యీ వేడుక పాత సహోద్యోగులతో పునస్సమ్మేళనం లాంటిదే. తెలుగు మేడం లెక్కల మేస్టారితో పిల్లల పెళ్ళిళ్ళ గురించి ఆరా తీస్తోంది. సైన్సు, హిందీ టీచర్లిద్దరూ యిటీవలి పేస్కేలు సవరణల జీవో గురించి మాట్లాడుకుంటున్నారు. రిటైరయి చాన్నాళ్లయిన డ్రిల్లుమాస్టరు మాత్రం వేదిక యెదుట చెరువులో గుర్రపుడెక్కలా విస్తరించిన విద్యార్థుల ముఖాల్లో యెవరి ముఖాన్నైనా నిజంగా గుర్తుపట్టగలరేమో చూస్తున్నారు. బాలా కార్యక్రమ సంచాలకుని హోదాలో వేదికకు ఓ మూల ఒద్దికగా నిలబడి వున్నాడు. చేతిలో కార్యక్రమాల జాబితా పట్టుకుని, సోషల్ టీచరు ప్రసంగం పూర్తవటం కోసం చూస్తున్నాడు.
సోషల్ టీచరు పాతికేళ్ల తన వృత్తి జీవితంలో తాను సాధించిన వుద్యోగ విజయాల్ని నెమరు వేసుకుంటున్నాడు. గతంలో వేరే వూళ్ళలో జరిగిన యిలాంటి వేడుకల్లో తనకు యెదురైన అనుభవాల్ని పంచుకుంటున్నాడు. తన పాత విద్యార్థుల్లో యిప్పుడు గొప్పగొప్ప స్థానాల్లో వున్నవారెవరో, వాళ్ళు ఆ చలవంతా తనకే యెలా ఆపాదించారో చెప్తున్నాడు. వాళ్ళలో ఒక డిప్యుటీ కలెక్టరు, ఒక ఎన్టీపిసి వుద్యోగి, ఒక సగ్గుబియ్యం ఫాక్టరీ యజమాని... వీళ్ళ గురించి ప్రముఖంగా చెప్పాడు. ముఖ్యంగా సగ్గుబియ్యం ఫాక్టరీ యజమానైతే ఒకసారి యీయన బస్టాండులో నిలబడివుంటే కారాపి యెక్కించుకున్నాడట. దారంతా యీయన క్రమశిక్షణ తనకు జీవితంలో యెదగటానికి యెలా పనికొచ్చిందో చెప్తూనే వున్నాడట.
శేషూకి చిన్నప్పుడు యీయన పాఠం యెంత భారంగా గడిచేదో, యిపుడీ ప్రసంగమూ అంతే భారంగా గడుస్తోంది. పైగా ప్రక్కన కూర్చున్న సూదావోడు, శేషూకి యే విషయాలపై ఆసక్తి వుంటుందని తాననుకుంటున్నాడో వాటిని ప్రస్తావించి, అతణ్ణి సంభాషణలోకి దించాలని ప్రయత్నిస్తున్నాడు. అతను ప్రయత్నించే కొద్దీ శేషూలో విసుగు పెరుగుతోంది. ఇటు ప్రక్కన కూర్చున్న భద్రీ యీ లోకంలో లేనట్టు ప్రసంగంలో లీనమైపోయాడు. అమ్మాయిల గుంపులో యెవరి వళ్ళోనో చంటిపిల్ల యేడవడం మొదలుపెట్టింది. ద్వారంలోంచి బయట మైదానంలో వేసిన టెంటు కనిపిస్తుంది. దాని క్రింద, చెల్లాచెదురుగా వున్న మడతరేకు కుర్చీల మధ్యన, ఒక కుక్క పడుకుని వెనక కాలితో మెడ గోక్కుంటుంది.
శేషూకి రేణూ వస్తుందన్న ఆశ మిగిలున్నంత వరకూ యీ వేడుక సరదాగానే గడిచింది. అసలు యివాళ వుదయాన్నించీ అతనికి సంబరంగానే వుంది. అతను పొద్దున్న లేచేసరికి బాలా యింట్లో లేడు. పూలదండలవీ పురమాయించటానికి తెల్లారగట్లే వెళిపోయాడట. శేషూని బడి దాకా తీసుకువెళ్లటానికి యెవరో కుర్రవాణ్ణి పంపుతానని చెప్పాడట. సూర్రావుగారన్నారు. శేషూ గుమ్మంలోకి వచ్చి తెల్లవారిన శ్రీపాదపట్నాన్ని యిష్టంగా చూసుకున్నాడు. నిన్న వర్షపు వాతావరణంలోనూ, చీకటిలోనూ వూరు కాస్త అపరిచితంగా కనపడింది. ఇప్పుడు యింద్రజాలికుడు ముసుగు తీసి చూపించినట్టు ఒక్కసారి తన చిన్నప్పటి వూరు ప్రత్యక్షమైంది. వరండాలో వుదయపు కాషాయరంగు యెండపడుతోంది. నిన్న అంత కుంభవృష్టి కురిపించిన ఆకాశం యిపుడు ఒక్క మేఘపు జాడ లేకుండా చేతులు ముంచాలనిపించేంత నీలంగా వుంది. వాన కడిగిన వాతావరణం స్పష్టంగా, నిర్మలంగా వుంది. శేషూకి ఒకసారి బయట తిరిగి రావాలనిపించింది. ఇంట్లోకి వెళ్ళి ఆదరాబాదరాగా కాలకృత్యాలు కానిచ్చేసుకుని, సూర్రావుగారిచ్చిన కాఫీ తాగి, వీధిలోకి వచ్చాడు.
పంట్లాం జేబుల్లో చేతులు దూర్చి నడుస్తున్నాడు. వెనుక నుండి తూర్పు నీరెండ నులివెచ్చని శాలువాలా వీపుకు తగుల్తోంది. పొడుగ్గా సాగిన తన నీడను తనే అనుసరిస్తున్నాడు. ఒక ముంగిట్లో కళ్ళాపి జల్లిన నేల మీద యెవరో పరికిణీ జాకెట్టులో వున్న అమ్మాయి నిద్రకళ్లతో ముగ్గు దిద్దుతోంది. ముగ్గు మీద నీడపడటంతో తలెత్తి అతణ్ణి చూసింది. అతని కళ్ళల్లో ప్రస్తుతం ప్రతీ పరిసరం పట్లా వ్యక్తమవుతున్న మోహాన్ని తనకు అన్వయించుకున్నట్టుంది; ఆమె పసి కళ్ళలోకి అకస్మాత్తుగా స్త్రీత్వపు జాణతనం వచ్చి చేరింది. చప్పున కళ్ళు దించుకుని, అతను చూస్తున్నాడన్న యెరుక తెచ్చిన విలాసంతో ముఖం మీది ముంగురుల్ని చెవి మూలకి తోసుకుంటూ, ముగ్గుదిద్దటంలో నిమగ్నమైంది. శేషు మనసులోకి మంచు సమీరం వీచినట్టయింది. తానీ వూళ్ళో వున్నపుడు ఆమె యింకా అమ్మ చంక కూడా దిగని చంటిపిల్లయి వుంటుంది. అతని పెదాలపైకి ఆహ్లాదకరమైన చిరునవ్వు వచ్చింది. ఆమెను కూడా శ్రీపాదపట్నపు సుందర మూర్తిమత్వంలో భాగంగా కలుపుకుంటూ ముందుకు సాగిపోయాడు.
చెట్ల గుబుర్ల వెనకనుంచి గుర్తు తెలియని పిట్టలు, రోజూలాగే యివాళా తెలవారినా, యిదే సృష్టికి తొలి వుదయమన్నట్టు కూస్తున్నాయి. పాలేర్లు సైకిళ్ళ మీద గడ్డి మోపులతో యెదురవుతున్నారు. పాలకావిడి మోసుకుంటూ గోవిందు యింటింటికీ ‘పాలండీ!’అని అరుస్తూ తిరుగుతున్నాడు. గోడ మీద తడిసిన సినిమా పోస్టర్ని ఒక మేక ఆబగా నముల్తోంది. అతనికి సంబంధించినంతవరకూ కాల ప్రమాణం నశించింది. చిన్నప్పుడు యెన్నోసార్లు యిలాంటి తూర్పు యెండలోనే, యిలాంటి ముగ్గుల మధ్యనుంచే, అమ్మ సంత నుండి యేదో తెమ్మని పురమాయిస్తే యీ వీధమ్మటా వెళ్ళేవాడు. ఆ లాగూ తొడుక్కున్న పిల్లాడు యిప్పుడే తన ప్రక్కనుంచి సైకిలాట ఆడుకుంటూ పరిగెత్తుకు పోయినా శేషు ఆశ్చర్యపడే స్థితిలో లేడు. అంతగా అతనిలో వర్తమాన స్పృహ చెరిగిపోయింది. ఊరుకూడా యేమంత మారలేదు. కొన్ని చోట్ల పూరిళ్ల స్థానే పెంకుటిళ్ళూ, పెంకుటిళ్ల స్థానే మిద్దెయిళ్ళూ వచ్చాయి. కానీ అవేమీ వూరి ఆత్మని కలుషితం చేసేంత మార్పును తేలేదు.
ఇపుడు రాజవీధి అతనికి యేమంత దూరం కాదు. అయినా అటు వెళ్ళబుద్దేయలేదు. నిన్నటి దాకా చాలా అసహనం కలిగించిన నిరీక్షణ, యిపుడు కొద్ది సేపట్లో ముగిసిపోనున్నదని తెలియగానే, స్వభావాన్ని మార్చుకుంది. ఈ కాసేపూ నిరీక్షణలోంచి కూడా మాధుర్యాన్ని పిండుకోవాలనిపించింది. ఇంతలో దగ్గరగా యేదో వాహనం చప్పుడు వినపడటమూ, అతను తేరుకు చూసేలోగానే భుజం మీద యెవరో చరచడమూ జరిగిపోయాయి.
మోపెడ్ మీద వున్న శంకూగాణ్ణి వెంటనే గుర్తుపట్టలేకపోయాడు. మోటార్‌సైకిలు మీద నప్పే నల్లకళ్ళద్దాల్ని మోపెడ్ మీద పెట్టుకున్నాడు. నుదుటి మీదకు పంకు స్టయిల్లో జుట్టు పడుతోంది. మీసం నల్ల సెలొఫిన్ టేపును మూతికొలతకు కత్తిరించి అతికించినట్టుంది. శేషూని స్కూల్లో దింపటానికి బాలా పంపుతానన్నది వాణ్ణే అట. ఇద్దరూ అలా మార్గమధ్యంలో నిలబడే కుశలం మాట్లాడుకున్నారు. ఇంతలో మరో స్నేహితుడు త్రిమూర్తులు అటు వెళ్తూ వీళ్ళిద్దర్నీ చూసి స్కూటర్ హార్న్ మోతతో అట్టహాసంగా తన రాకని ప్రకటించాడు. కాలు కదపనక్కర్లేని జీవితం వంట్లో తెచ్చిన కొవ్వుతో బాగా లావయ్యాడు. శేషూని తన యెరువుల దుకాణానికి రమ్మన్నాడు. శేషూ స్కూలుకి వెళ్ళాల్సిన సంగతి చెప్పబోయాడు గానీ శంకూగాడు, “ఇపుడు వెళ్తే అక్కడ పనులన్నీ మన నెత్తి మీద వేస్సేలా వున్నార్రా బాబూ,” అంటూ త్రిమూర్తులతో వెళ్ళటానికే సిద్ధమయ్యాడు. ముగ్గురూ బళ్ళెక్కి బయల్దేరారు.
రోడ్డుకు కాస్త యెత్తుగా కట్టిన నాలుగు దుకాణాల వరుసలో ఆ దుకాణం ఒకటి. ముందు గదిలో గోడలకి కట్టిన అరల్లో పురుగుమందుల డబ్బాలు, విత్తనాల పాకెట్లూ అమ్మకానికి పెట్టివున్నాయి. త్రిమూర్తులు కౌంటరు వెనక కూలబడ్డాడు. మిగతా యిద్దరూ యెదుట కుర్చీల్లో కూర్చున్నారు. శంకూగాడు కళ్ళజోడు కౌంటరు మీద పడేసి, గాలి తగిలేట్టు కాలరు వెడల్పు చేసుకుంటూ, “ఒరే మేవంటే యెలాగా లెక్కలేదు; పన్నెండేళ్ల తర్వాత వచ్చిన వాళ్లకైనా మర్యాదలేవీ వుండవా,” అన్నాడు. “నీదేవుందిలేరా వూరి మీద పడి యెలాగైనా బతికేస్తావు,” అని, త్రిమూర్తులు పక్క వీధిలో కాకాహోటల్నించి అందరికీ టిఫిను పురమాయించాడు. సంభాషణలో వాళ్ళిద్దరూ యెవరి గురించి వాళ్ళు చెప్పుకున్నదాని కన్నా ఒకడు రెండోవాడి గురించి బయటపెట్టిందే యెక్కువ వుంది. శంకూ గాడి రంకు వ్యవహారాల గురించి త్రిమూర్తులు వెటకరించాడు. త్రిమూర్తులు తాగుబోతు ప్రహసనాల గురించి గురించి శంకూ దెప్పిపొడిచాడు. అంతేకాదు, శేషూని యెరువు బస్తాల సరుకువున్న వెనక గదిలోకి తీసికెళ్ళి, అక్కడ టేబిల్మీద నిన్న రాత్రి తాలూకు మందు గ్లాసుల్ని ఋజువుగా చూపించాడు. త్రిమూర్తులు కులాసాగా కౌంటరు వెనకాలే కూర్చుని, “ఇప్పుడు కాపోతే యెపుడు సుఖపడతాంరా,” అంటూ శంకూ గాణ్ణి తీసిపారేసాడు. “ఈ యెరువుల కంపు మధ్యనెలా తాగుతున్నార్రా బాబూ,” అని శేషూ ఆశ్చర్యపడ్డాడు. “ఆడేవన్నా అమృతం తాగుతున్నాడా ప్లేసు చూసుకు తాగటానికి,” అన్నాడు శంకూ.
వాళ్ళ మాటలు సాగుతోంటే, మధ్యలో భద్రీ అటువైపుగా సైకిలేసుకు వెళ్తూ కనిపించాడు. శేషూ బిగ్గరగా ఆగమని పిలిచి, అతను ఆగాక పైకి రమ్మన్నాడు. భద్రీ మొహమాటంగా, కొట్టుకాడ యేదో బేరం నిలబడివుందని, యింకా తానమదీ కూడా చేయలేదని, స్కూలు కాడ కలుద్దామనీ చెప్పి వెళిపోయాడు. అతను వెళ్ళగానే త్రిమూర్తులు, “ఊళ్ళో ఈడికొక్కడికే కామోసు కొంపలంటుకునే పన్లు, మనవే యేబ్రాసెదవలం,” అన్నాడు శంకూతో. “నువ్వు మళ్ళీ పత్యేకంగా చెప్పాలేంటి, ఆడక్కడ తిరగేసి మరగేసి చెప్పింది అదే,” అన్నాడు శంకూ. శేషూకి అపుడు స్ఫురించింది, భద్రీ కనపడగానే తను మాత్రమే లేచి మాట్లాడాడని, మిగతా యిద్దరూ యేమీ మాట్లాడలేదనీను. చిన్నప్పుడు వీళ్ల మధ్య యేవైనా గొడవలు వుండేవేమో గుర్తు తెచ్చుకోవటానికి ప్రయత్నించాడు. ఏవీ గుర్తు రాలేదు. తర్వాత యెందుకో యిక అక్కడ మనస్ఫూర్తిగా గడపలేకపోయాడు. ఏదో నిషిద్ధ ప్రదేశంలో యిష్టానికి విరుద్ధంగా చిక్కుపడిపోయినట్టనిపించింది. పొద్దున్న వీధుల్లో తిరిగినంతసేపూ తన మనసు చషకంలో జాలువారిన అనుభూతి మధువులో యిపుడేదో చేదు చుక్క కలిసినట్టనిపించింది.
ఈలోగా యింకో ఇద్దరు స్నేహితులు దుకాణం దగ్గరికి చేరారు. వాళ్ళలో ఒకడు వూరి మాజీ సర్పంచి గారి అబ్బాయి. పేరు సుబ్బారావు. బళ్ళో చదివేటప్పుడు యితను కాక యింకో ముగ్గురు సుబ్బారావులు వుండటంతో యితణ్ణి ‘వుడుకుమోతు సుబ్బారావని’ పిలిచేవారు. ఏం ఆట ఆడినా యేదో ఒక గొడవ లేవదీసేవాడు. కానీ యెవరూ మద్ధతివ్వకపోవటంతో ఆట మధ్యలో మానేసి వెళిపోయేవాడు. ఇప్పుడు ఖాళీగా వున్నాడు. వరసగా పోటీ పరీక్షలు రాస్తున్నాడు గానీ యింకా ఫలితం దక్కలేదు. పాత స్నేహితులెవరితోనూ పెద్దగా కలవడు. త్రిమూర్తులుతో పేకాటపరిచయం మాత్రం సాగుతోంది. అతని చిన్నప్పటి వుడుకుమోత్తనాన్ని గుర్తు చేసి శేషూ కాసేపు యేడిపించాడు. రెండోవాడి పేరు కుమార్. వీళ్ల నాన్నగారు పదకొండేళ్ళ క్రితం వుద్యోగరీత్యా యీ వూరికి బదిలీ అవడంతో పదోతరగతిలో యిక్కడ బళ్ళో చేరాడు. కాబట్టి శేషూకి యితని గురించి తెలియదు. కానీ నడమంత్రంగా శ్రీపాదపట్నం వచ్చినవాడు యీ వూరిని సొంత వూరన్నట్టు, తన స్నేహితుల గురించి బాగా తెలిసినట్టూ మాట్లాడుతుంటే, అతని పట్ల అకారణంగా అయిష్టత కలిగింది.
గడియారం యెట్టకేలకు యెదురుచూసిన భంగిమ అభినయించింది. శేషూ అందర్నీ తొందర పెట్టి లేవదీసాడు. అంతా కలిసి స్కూటర్ల మీదా, సైకిళ్ల మీదా బయల్దేరారు. దారిలో రాజవీధి గుండా వెళ్తున్నపుడు, రాజుగారి మేడ వైపు చూడకుండా ప్రయత్నపూర్వకంగా తల రెండో వైపు తిప్పుకున్నాడు. రావిచెట్టు అలానే వుంది. లంగరేసిన పడవలు యేటి అలల్తో పాటు సోమరిగా వూగుతున్నాయి. ఆ పరిసరాలన్నీ కొద్ది మార్పులతో యెప్పటిలానే వున్నాయి. కానీ అతని పాత యిల్లు మాత్రం అక్కడ లేదు. ఆ పాక స్థానే ఒక పెంకుటిల్లు వుంది. కొబ్బరాకుల దడి స్థానే ప్రహరీ గోడ వుంది. బోసిముడ్డితో వున్న చంటాడొకడు యింటి గేటు మీద కాళ్లు పెట్టి దాని సీలల ఆధారంగా ముందుకీ వెనక్కీ వూగుతున్నాడు. ఆ యింటి కప్పు మీద నాచు పట్టి నల్లబారిన బంగాళాపెంకు చూస్తే, అసలు యెప్పుడైనా అక్కడ తమ పాక వుండేదా, అనిపించింది.
బడి మైదానంలో పెద్ద టెంటు వేసి వుంది. అప్పటికే వచ్చినవాళ్ళలో మగవాళ్లు ఒక టెంటు కిందా, ఆడవాళ్లు ఒక టెంటు క్రిందా మడతరేకు కుర్చీల్లో కూర్చున్నారు. అమ్మాయిల హాజరు అనుకున్నదానికన్నా యెక్కువగానే వుంది. దాదాపు అందరి దగ్గరా, వళ్ళో కూర్చునో చెంగుకు వేలాడుతూనో, పిల్లలు కనిపిస్తున్నారు.
శేషు అందరితో పాటూ మగవాళ్ళు కూర్చున్న కుర్చీల వైపు వెళ్లాడు. హర్షాతిరేకమైన కేకలూ, పిలుపులతో అతణ్ణి తమ మధ్యకి ఆహ్వానించారు. పోటెత్తిన అలలా మాటలు మొదలయ్యాయి. ఏ సంభాషణా పరిపూర్ణంగా ముగియటం లేదు. అనూహ్యమైన మలుపులు తిరుగుతూ పోతుంది. సంభాషణలో భాగస్వాములు కూడా క్షణక్షణానికీ మారుతున్నారు. మారిన రూపురేఖల గురించి మాటలు దొర్లుతున్నాయి. కొన్ని సార్లు ఆయా స్నేహితుల కన్నా ముందే, వాళ్ళ కొత్త బట్టతలల్నీ, బానపొట్టల్నీ, తాడి యెత్తుల్నీ పలకరించడం జరుగుతోంది. ప్రస్తుతం ఎవరెవరు యేమేం చేస్తున్నారో ఆరాలు జరిగాయి. బడుగు జీవితాల్లో స్థిరపడిన వాళ్ళు కొందరు యే బేషజం లేకుండానే జీవిక గురించి చెప్పేస్తున్నారు; కొందరు మాత్రం గంభీరంగా మెళ్ళో పతకాన్ని యెత్తి చూపించినట్టు చెపుతున్నారు; మరి కొందరు మాదేవుందిరా అంటూ మొదలుపెట్టి, యేదో అలా పోతుంది అంటూ ముగిస్తున్నారు. జీవితంలో బాగుపడిన వాళ్ళు తమ వివరాల్ని అట్టహాసమైన నిరాడంబరతతోనో, నకిలీ మొహమాటంతోనో ప్రకటిస్తున్నారు. కాసేపటికి పాత రోజుల వైపు కబుర్లు మళ్లాయి. ఒకరితో మరొకరికి వున్న జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నారు. కాని కొన్ని జ్ఞాపకాలు మాత్రమే వాటిలో భాగమైన అందరికీ వుమ్మడిగా గుర్తున్నాయి. శేషూకి చాలా సందర్భాల్లో తన గురించి యెదుటివాళ్ళు చెప్తున్న జ్ఞాపకాలు గుర్తు లేవు సరికదా, ఆ జ్ఞాపకంలో కనిపిస్తున్న వ్యక్తి అసలు తనలానే అనిపించటం లేదు. అతను గుర్తు చేసుకున్న జ్ఞాపకాలు కూడా, అవతలి వాళ్ళ ముఖంలో అయోమయాన్ని బట్టి చూస్తే, చాలా వరకూ అతనికే పరిమితమయ్యాయి.
క్రమేపీ తన రాక కలిగించిన కోలాహలం సద్దుమణిగాకా, శేషూ ఆడవాళ్ల గుంపును శ్రద్ధగా పరిశీలించాడు. ఉద్విగ్నతను వుగ్గబట్టుకుంటూ, గులకరాళ్ళ కుప్పలో పగడపురాయి కోసం వెతికినట్టు ఒక్కొక్క అమ్మాయి ముఖాన్ని పట్టిపట్టి చూస్తూ, రేణూ కాదని తేలగానే మరో ముఖం వైపు చూపు మళ్ళిస్తూ, చివరికి గుండె తరుక్కుపోయే నిరాశతో అందర్నీ లెక్కలోంచి మినహాయించాడు. అక్కణ్ణించి లేచి బాలాని వెతుక్కుంటూ తరగతి గదిలోకి వెళ్లాడు. అక్కడ బాలా, కోటావోడూ కలిసి సౌండ్ సిస్టమ్ వాళ్లతో యేదో మాట్లాడుతున్నారు. కోటావోడితో పలకరింపులయ్యాకా, బాలాని పక్కకి తీసుకొచ్చి రేణూ రాలేదన్న సంగతి గుర్తు చేసాడు. బాలా తలకొట్టుకుని, సముదాయింపుగా యేదో చెప్పి పంపాడు.
బయటకొచ్చి వసారాలో నడుస్తుంటే, ప్రక్క గదిలో కొందరమ్మాయిలు కొంగులు నడుముకు బిగించి ఒక పెద్ద గుండిగలో రస్నా కలుపుతూ కనిపించారు. వాళ్ళ దగ్గర్నించి శంకూ గాడు పళ్ళెంలో రస్నా గ్లాసులు పెట్టుకుని వస్తూ యెదురయ్యాడు. వాడా పళ్ళాన్ని అమ్మాయిల గుంపు దగ్గరకు తీసికెళ్తున్నాడు. “ఏరా వస్తావా, పరిచయం చేస్తాను,” అన్నాడు. శేషూ పదమన్నాడు.
ఇంకా దగ్గరకు వెళ్ళకముందే గుంపులో కొందరమ్మాయిలు అతణ్ణి చూసి తుంటరితనం వ్యక్తమవుతున్న ముఖాల్తో యేదో చెవులు కొరుక్కున్నారు. శంకూ రస్నా పళ్ళెం వాళ్లకిస్తూ, యెవరో చెప్పుకోండంటూ శేషూని ముందుకు తోసాడు. తెలియక పోవటమేవిటంటూ కొందరు పేరు చెప్పారు. అందరూ తలో ప్రశ్నా గుప్పించారు. వీళ్ళ గుంపుకు మధ్య కూర్చున్న అమ్మాయి పేరు సిద్దిరెడ్డి కనకమాలక్ష్మి (పెళ్లయ్యాక మెండు కనకమాలక్ష్మిగా మారింది). చిన్నప్పుడు, పెద్దగా చదివేది కాదు గానీ, రణపెంకి అల్లరి చేస్తుండేది. మగవాళ్లతోనూ పేచీలు పెట్టుకునేది. శేషు కాసేపు అక్కడ కూర్చుని ఆమెని ఆటపట్టించాడు. చెలికత్తెల సాయంతో ఆమె కూడా దీటుగానే స్పందించింది. వాళ్ళలో అన్నావజ్ఝుల పద్మావతి కూడా వుంది. చిన్నప్పుడు భద్రీ యీ అమ్మాయిని తన మూగ తరహాలో ఆరాధించేవాడు. ఆమెకి యివ్వాలని యివ్వలేక చాన్నాళ్ళు ఒక హృదయం గుర్తు గ్రీటింగ్ కార్డు పుస్తకాల మధ్యపెట్టుకుని తిరిగాడు కూడా. అప్పట్లో ఒకసారి యీ అమ్మాయి శేషూని యేదో పుస్తకం అడిగితే, అతను భద్రీ దగ్గర్నించి గ్రీటింగ్ కార్డు నొక్కేసి, ఆ పుస్తకంలో పెట్టి యిచ్చేసాడు. ఆమె యేడ్చి రెండ్రోజులు స్కూలుకు రాలేదు. భద్రీ కూడా కొన్నాళ్ళు శేషుతో గుర్రుగా వున్నాడు. ఇప్పుడా సంగతి గుర్తు చేస్తే ఆమె సిగ్గుపడింది.
శేషు వాళ్ల దగ్గర్నించి లేచి వెళ్తూ, ఆ ప్రక్కనే కూర్చుని పిల్లాడికి రస్నా పట్టిస్తున్న వనజాక్షి దగ్గర ఆగాడు. చిన్నప్పుడు రేణూకున్న కొద్దిమంది స్నేహితురాళ్లలో యీమె ఒకరు. లేని పెద్దరికంతో శేషూని పలకరించింది. తమకు సమవయస్కుడైనా సరే, తమకన్నా పెద్దవాడే అయినా సరే, బ్రహ్మచారయితే చాలు మగవాణ్ణి యింకా యీడురాని విభాగంలోకే లెక్కగట్టే కొందరు పల్లెటూరి వివాహితల తరహా ఆమెది. అతను తన వివరాలు చెప్పాడు. రస్నా బట్టల మీద ఒంపుకుంటున్న బుడ్డాడి బుగ్గ గిల్లుతూ, వాడి పేరు అడిగాడు. వాడు ఆమె మూడో కొడుకు. ఇంకా బళ్ళో చేర్చలేదు. పెద్ద పిల్లలిద్దరూ ఆమెను వదిలి మసలుకోవడం నేర్చుకున్నారు గానీ, వీడు మాత్రం కొంగు వదలడు. ఆమెకు పదో తరగతి అవంగానే మావయ్యతో పెళ్లయిపోయింది. అత్తారిది పొరుగూరే. వాళ్లాయన నేతపని చేస్తాడు.
కాసేపు యీ కబుర్లయాక, సాధ్యమైనంత అలవోకగా ధ్వనించేట్టు, “అవునింతకీ, మీ ఫ్రెండేది యెక్కడా కనిపించట్లేదు?” అన్నాడు.
ఆమె వున్నట్టుండి ఆదుర్దాగా చూస్తూ, “ఎవరు, సరితాదేవేనా! సచ్చిపోయింది తెలీదా?” అంది. అతను ఆ సంగతి భద్రీ ద్వారా యిదివరకే తెలుసుకున్నాడు. కానీ యిపుడామె ప్రస్తావన వచ్చాకా, తానడిగింది రేణూ గురించి అని అనలేకపోయాడు. ఆశ్చర్యం ప్రకటించాడు. ఆమె “అయ్యో నీకెవరూ చెప్పలేదా” అంటూ, సరితాదేవి అత్తారింటిని కచ్చగా తిడుతూ, ఆ వృత్తాంతం చెప్పుకొచ్చింది.
ఆ ప్రస్తావన సద్దుమణిగాక, అపుడడిగాడు రేణూ గురించి.
ఆమె నవ్వింది, “అదేంటి శేషూ, నీకే తెలుస్తాదనుకున్నానే! మా కన్నా యెక్కువ నీ కూడానే కదా తిరుగుతా వుండేది. నువ్వెళ్ళేక బడి కూడా మానేసిందిగా!”
“లేదు, నే వెళ్లక ముందే మానేసింది!”
“అవునా, యేమోలే... నేనలా అనుకునేదాన్ని యెందుకో... మీకిద్దరికీ యేదో గొడవైందనీ కట్టా! అడిగితే సెప్పేది కాదు. తొమ్మిదిలో కదా మానేసిందీ?”
“ఊ...”
“అపుడాలింటికెళ్ళేను. నా కూడా సరితే కావాల, వచ్చింది. అడిగేవిలా, ఏవైందే అని. సదువు నచ్చలేదంట. ఎందుకంటే సెప్పదు. ఏదో మట్టుకు అయింది, క్లాసులో కూడా దిగాలుగా కూసునేది. ఏంటో యేవైనా ఆ పిల్లదంతా అదో మాదిరి కదా!”
“ఊ...”
“నీతో మట్టుకు బా సరదాగా వుండేదనుకుంటాలె. అయినా యే మాట కామాటే చెప్పుకోవాలి, మాతో కూడా ఆ చివర్లో మంచి బాగా కలిసిపోయింది పాపం. కాస్త ఫ్రెండ్సయ్యీ లోపడే మానేసిందని బాధగా వుండేది సరితకీ నాకూని. పదోక్లాసు కూడా వుండుంటే బాండేది. నువ్వు కూడా అపుడే యెళిపోయావు కదా. కానీ ఆ యేడు చూడాలి శేషు! పబ్లిక్ పరీచ్చలనే సరికి జనం తెగ విరగబడి సదివేసేవోళ్ళులే...,” అంటూ పదవతరగతి కవుర్లు కొన్ని చెప్పుకొచ్చింది. శేషూ అన్యమనస్కంగా విన్నాడు.
ఉపాధ్యాయులు ఒక్కొకరుగా రావడం మొదలైంది. చుట్టుప్రక్కల వూళ్ళలో పని చేసేవాళ్ళు సొంత స్కూటర్ల మీదే వచ్చారు. దూరాలనించి వచ్చేవాళ్ళని మాత్రం విద్యార్థులే బస్టాండు నుంచో, రైల్వేస్టేషను నుంచో తమ వాహనాల మీద తీసుకొస్తున్నారు. ఒకరు రిక్షాలో వచ్చారు. వచ్చినవాళ్ళంతా బడలిక తీర్చుకుని, వేదిక మీద సుఖాసీనులయ్యాక, మైకులో బయటనున్న విద్యార్థులందరినీ తరగతి గదిలోకి రావలసిందిగా ప్రకటించారు. శేషూ అందరితో పాటూ లేచి వెళ్తున్నాడు. ఇంతలో డ్రిల్లు మాస్టారిని సైకిలు వెనక యెక్కించుకుని భద్రీ అపుడే బడి ఆవరణలోకి ప్రవేశించాడు. సైకిలు స్టాండు వేసి యిద్దరూ నడిచి వస్తున్నారు. డ్రిల్లు మాస్టారు అతని భుజం మీద చేయి వేసి నవ్వుతుంటే, అతను చేతులు వూపుకుంటూ యేదో చెప్తున్నాడు. ఇందాక త్రిమూర్తులు గాడి దుకాణం దగ్గర అతణ్ణి నిర్లక్ష్యం చేసాడన్న అపరాధ భావన యే మూలో వుండటంతో, శేషూ వాళ్లకు యెదురెళ్ళాడు. భద్రీ అతణ్ణి డ్రిల్లు మాస్టారికి పరిచయం చేయబోయాడు గానీ, ఆయన మధ్యలోనే అడ్డం వచ్చి అతణ్ణి గుర్తుపట్టానన్నారు. ఒకమారు అతను జిల్లాస్థాయి గ్రిగ్ పోటీల్లో ఒక్కడే మూడు కప్పులు తేవడాన్ని గుర్తు చేసుకున్నారు. శేషు, ఆ కప్పులు తెచ్చింది తాను కాదని, తన అన్నయ్యనీ చెప్పాడు. ఆయన యిబ్బందిగా “వయసురా నాయనా!” అంటూ నవ్వారు; అన్నయ్య గురించి వివరాలు అడిగారు. ఈలోగా ఆయన్ని చూసి మిగతా విద్యార్థుల్లోని ఆయన అభిమానులు చుట్టూ చేరారు. ఆయన కొంతమందిని గుర్తు పడుతున్నారు. చాలామందిని గుర్తు పట్టగలిగా ననుకుంటున్నారు. గుర్తుపట్టలేదని చెప్పి యెవర్నీ బాధపెట్టడం ఆయనకి యిష్టం లేదులా వుంది. ఈ స్కూలుతో ఆయన అనుబంధం గట్టిది. ఆయన సర్వీసులో దాదాపు తొలి అర్థభాగమంతా యిక్కడే గడిచింది.
తరువాత అందరూ తరగతి గదికి వున్న రెండు గుమ్మాల్లోంచీ క్రిక్కిరిసి లోపలికి వచ్చారు. అంతా ఒకేసారి లోపలికి రావటమూ, చోటు కోసం బెంచీల చుట్టూ మూగడంతో గది అంతా చిన్నప్పుడు పాసుబెల్లు ముగిసినప్పటి గోలలా వుంది. అప్పటికే ఒక బెంచీ మీద చోటు సంపాయించిన సూదావోడు, శేషూని వచ్చి కూర్చోమంటూ లోపలికి జరిగాడు.
శేషూ భద్రీని రెండో ప్రక్కన కూర్చోపెట్టుకుని, “యేరా, యిందాక అలా ముఖం చాటేశావే, త్రిమూర్తులు గాడి షాపు దగ్గర?” అని అడిగాడు.
బదులుగా భద్రీ, సూదావోడికి వినపడకుండా శేషూ చెవి దగ్గర నోరు పెట్టి, “నీకు తెలీదెహె! యింకా మనోళ్ళు అప్పుడు మాదిరే వుంట్నారనుకున్నావా యేటి? అయితే కులగజ్జి, లేకపోతే డబ్బు గజ్జి! మనకేవో అలాంటివి పడవు,” అన్నాడు.
శేషూకి యిది నమ్మబుద్ధి కాలేదు. భద్రీ చూసే పద్ధతిలో లోపం అనుకున్నాడు. కానీ ఆ నమ్మకానికి చప్పున యెదురొస్తూ ఒక నిజం స్ఫురించింది; యిందాక త్రిమూర్తులు కొట్టులో పోగైన జట్టంతా ఒకే కులానికి చెందినవాళ్లు. వాళ్ళిపుడు యెక్కడున్నారా అని చుట్టూ చూసాడు. అంతా ఒకే చోట ఆఖరి బెంచీలో కుదురుకున్నారు. వాళ్ళు మాత్రమే కాదు, చాలామంది విషయంలో యెవరు యెక్కడ కూర్చున్నారన్న దానిపై వారి వారి సామాజిక, ఆర్థిక స్థానాల ప్రభావం కనిపించింది.
* * *
0 comments:
మీ మాట...