March 11, 2012

మిత్రభేదం (మొదటిభాగం)

ముందుమాట | రెండవభాగం | మూడవభాగం | నాలుగవభాగంఐదవభాగం | ఆరవభాగం |
ఏడవభాగం | ఎనిమిదవభాగం | తొమ్మిదవభాగం | పదవభాగం | ఆఖరిభాగం | పూర్తి కథ pdf |          


( 1 )

బేగు భుజాన వేసుకు రైలుదిగి  యెన్నో యేళ్ల తర్వాత మరలా సొంత వూళ్ళో అడుగు పెడుతున్న కథానాయకుల్తో తెలుగులో యెన్ని కథలు మొదలవలేదు. ఈ కథా అలాగే మొదలవుతుంది.  శేషు అలాగే బేగు భుజాన వేసుకు రైలు దిగాడు. చుట్టూ పరిసరాల్ని అనురాగంతో తరచి చూసుకున్నాడు.  శ్రీపాద పట్నం రైల్వే స్టేషను చాలా చిన్నది. ఈ ఒక్క రైలూ తప్పించి యిక్కడ ఆగేవన్నీ గూడ్సు బళ్ళే. ప్రస్తుతం వాన వచ్చేట్టు యీదురుగాలులు వీస్తుండటంతో, అతనితో పాటు అక్కడ దిగిన కొద్దిమందీ త్వరగా యిళ్ళు చేరేందుకు సామాన్లతో పిల్లలతో కుస్తీపడుతున్నారు. వాళ్ళలో యెవరన్నా తెలిసినవాళ్ళు వున్నారేమోనని ముఖాలు వెతికాడు. ఎవరూ పోలిక తేలలేదు. అతనికి ఆ మందతో కలిసి బయటకు నడవాలనిపించలేదు. వాళ్ళు టౌనుకెళ్ళి పనులు చూసుకొస్తున్నవాళ్ళో, లేదంటే యే చుట్టంచూపుకో పొరుగూరు వెళ్ళి వస్తున్నవాళ్ళో అయివుంటారు.  వాళ్ళకు సంబంధించినంతవరకూ యీ స్టేషనులో రైలు దిగడమనేది మరో నిత్యనిరాసక్తానుభవం మాత్రమే. తన విషయంలో అలాక్కాదు. పన్నెండేళ్ళ తర్వాత శ్రీపాదపట్నం వస్తున్నాడు. ఈ అనుభవపు స్వచ్ఛతనీ, మనసు వుద్విగ్నతనీ  కల్తీ కానీయకూడదు. కాస్త ఆగి వెళ్దామని అక్కడవున్న బెంచీ మీద కూర్చున్నాడు.

ఎక్కేవాళ్ళని యెక్కించుకుని రైలు బయల్దేరింది.  రైలు వెళిపోగానే కళ్ళ ముందో గోడ కూలినట్టయి ప్లాట్ఫాం వున్నట్టుండి  బోసిపోయింది.  పట్టాల మధ్యన ఒక కుక్క యేకాగ్రంగా యేదో వెతుక్కుంటోంది.  పట్టాల అవతల పంటపొలాలు దిగంతం దాకా విస్తరించి వున్నాయి.  మేఘావృతమైన ఆకాశం ప్రకృతివర్ణ ఛాయను తగ్గించి యేదో మందకొడి అందాన్ని అద్దింది. పొలాల పైన తూనీగలు గాభరాగానో, సంబరంగానో, లేక వట్టి సహజాతపు అలవాటుగానో అల్లల్లాడుతున్నాయి. పొలాల  అవతల దిగంతరేఖ మీద కనిపిస్తున్న తాటి చెట్ల తలల మీద వుండుండి ఓ మెరుపు మెరిసినపుడల్లా, పరిసర ప్రపంచం లిప్తమాత్రం ఫొటో నెగెటివ్‌లా వెలిగి ఆరిపోతోంది.  ప్రకృతి వేదిక మీద యీ సౌందర్య విన్యాసానికి ప్రస్తుతం యేకైక ప్రేక్షకుడైన శేషు మాత్రం, అన్యమనస్కంగా సిగరెట్టు తీసి వెలిగించాడు. అతని అంతరంగ వేదికపై ఆడుతోన్న స్మృతి చిత్రాల తీక్షణత ముందు కళ్ళ యెదుటి దృశ్యాలు వెలవెలబోయాయి. ఈ అంతర్ముఖ యేకాంతంలో అతణ్ణి  రేణుకాదేవి ఆలోచనలు చుట్టుముట్టాయి.  ఇన్నాళ్ళూ పగటికలల యితివృత్తంగా మాత్రమే వున్న తామిద్దరి కలయికా, యిపుడు కనుచూపుమేరలో, భవిష్యత్తు క్షితిజరేఖ మీద, ఒక ఆనవాలు పట్టగలిగే వాస్తవంగా మిలమిల్లాడుతోంది. గడిచిన యిన్నేళ్ళ కాలం బాల్యపు కలతల్ని కరిగించేయగలుగుతుందా; కలతల్ని కరిగించేయగలిగిన కాలం, ఆ చెలిమినీ కరిగించేసి వుంటే!  అప్పటికే రైలుప్రయాణ పర్యంతం యీ ప్రశ్నల పర్యవసానాల్ని రకరకాల కల్పనలుగా  అల్లుకుని అలసిపోయాడు. ఇక యిప్పుడు భవిష్యత్తుని దాని మానాన వదిలేసి, కల్పనల ప్రయాస అవసరంలేని గతం వైపు ఆలోచనల్ని మళ్ళించాడు.

రేణుకాదేవిని అతను మొట్టమొదటిసారి చూసింది శ్రీపాదపట్నం హైస్కూల్లో ఒకమిట్ట మధ్యాహ్నం యేదో తరగతి జరుగుతున్నపుడు.  విద్యార్థులందరి దృష్టీ  మేస్టారు చెప్తున్న పాఠం మీద నుండి అప్పుడే తరగతిగది గుమ్మంలో ప్రత్యక్షమైన రెండు ఆకారాల వైపు మళ్ళింది.  అక్కడ సుబ్బరాజుగారి పాలేరు, పరికిణీ జాకెట్టులో బెరుకు చూపులు చూస్తున్న ఒక అమ్మాయితో నిలబడివున్నాడు.  మేస్టారు యెవరమ్మా అని అడిగారు.  పాలేరు సమాధానం చెప్పాడు, మన సుబ్బరాజుగారి మనవరాలండీ. ఇయాలే బడిలో చేర్చారు అయ్యగారు. కూకోబెడదారని తీస్కొచ్చా. నువ్వెళ్ళు బుజ్జమ్మా. మేటారు సూపెడతారు యెక్కడ కూకోవాలో...! అంటూ తన చేతిలో వున్న సీవండి పుస్తకాల పెట్టెని ఆమెకిచ్చి లోపలికి పంపించాడు.

మేస్టారు ఆమె పేరూ యితర వివరాలూ అడిగి, వెళ్ళి ఆడపిల్లల వరసలో కూర్చోమన్నారు. మొదటి బెంచీ పిల్ల్లలు పరికిణీలు సర్దుకుంటూ ప్రక్కకి జరిగి కుతూహల దృక్కులతో ఆమెని తమ మధ్యకి ఆహ్వానించారు. మేస్టారు సుద్దముక్క తీసుకుని బోర్డు వైపు తిరగగానే, వాళ్ళ కుతూహలం గుసగుసల ప్రశ్నావర్షమై కురిసింది. ఆమె బెదురుగా ముక్తసరి సమాధానాలిస్తోంది. మగపిల్లల వరసలో కూర్చున్న శేషు పాఠం వినకుండా ఆమెనే చూస్తున్నాడు. అతను, అటు వెనక బెంచీల  ఆకతాయి గుంపుకీ యిటు ముందు బెంచీల బాగా చదివే గుంపుకీ, రెంటికీ కాకుండా, మధ్య బెంచీల్లో కూర్చుంటాడు.  సందర్భాన్ని బట్టి యే గుంపులోనైనా చేరిపోగలడు.  తరగతిలో అతనికంటూ ఓ హోదా వుంది. తోటివాళ్ళు అతని చలాకీతనానికి ఆకర్షితులై అతని స్నేహవర్గంలో చేరడమో, లేక వికర్షితులై వైరి వర్గంగా మారడమో అవుతూంటుంది. అతణ్ణి పట్టించుకోకుండా మాత్రం యెవరూ వుండరు. అతనూ యీ ప్రాముఖ్యతని నూటికి నూరుపాళ్ళూ ఆస్వాదిస్తాడు. దాన్ని నిలబెట్టుకునే లక్షణాలు స్వతస్సిద్ధంగా వున్నాయి. తరగతిలోకి కొత్తవాళ్ళెవరొచ్చినా గుణగణాలు అంచనాకట్టి పనికొచ్చేవాళ్ళయితే, ప్రత్యర్థులు లాగేసుకోక ముందే, చురుగ్గా ఆకర్షించి జట్టులోకి చేర్చుకుంటాడు. జట్టులో చేరేదాకనే అతని ప్రయత్నం వుంటుంది, తరువాత వాళ్ళే అతని కూడా వుండటానికి ప్రయత్నిస్తారు. మామూలుగా అమ్మాయిల విషయంలో యిలాంటి కష్టం పడేవాడు కాదు. కానీ యిప్పుడు సందర్భం వేరు. సుబ్బరాజుగారి విశాలమైన రెండంతస్తుల మేడ అంటే శేషుకి యెంతో కుతూహలం. దారిన పోయినపుడల్లా ఆ యింటి యెత్తరుగుల మీద పడక్కుర్చీలో కూర్చుని పావురాళ్ళకి నూకలు జల్లుతూ కనిపించే సుబ్బరాజు గారంటే యింకా ఆసక్తి. శేషు తండ్రి అపుడపుడూ సుబ్బరాజుగారి కబురందుకుని వెళ్ళినపుడు శేషు కూడా తోకలా వెంట వెళ్ళేవాడు. ఒకసారైతే తండ్రితోబాటూ గడప దాటి యింటి లోపలికి కూడా వెళ్ళగలిగాడు. కానీ యెపుడూ మెట్లెక్కి పై అంతస్తు  దాకా వెళ్ళలేదు.  ఇపుడీ పిల్ల స్వయానా ఆ సుబ్బరాజుగారి మనవరాలు!  ఈ అర్హత చాలు ఆమెకు జట్టులో చోటివ్వటానికి.

లెక్కల తరగతి అవగానే పాస్ బెల్లు మోగడంతో పిల్లలంతా గండి కొట్టిన వరదలా ఆటమైదానంలోకి పరుగులెత్తారు. శేషు కూడా వెళ్ళాడు గానీ, ఓ రెణ్ణిముషాల్లో మళ్ళీ వెనక్కు వచ్చేసాడు.  లాగు వెనకాల దాచిపెట్టుకున్న అతని చేతుల్లో ఒక పుల్ల ఐసు వుంది. ముందోసారి లోపలికి తొంగి చూశాడు. ఖాళీ బెంచీల మధ్య వంటరిగా కూర్చుని వుంది రేణుకాదేవి. ఆమెను ఆవరించి మేజాబల్లలపై పుస్తకాల సంచులు, సీవండి పెట్టెలు తమ యజమానుల గైర్హాజరీలో విశ్రాంతి తీసుకుంటున్నాయి. ఆమె కంపాక్సు బాక్సును అపురూపంగా సర్దుకుంటున్నదల్లా, అలికిడికి తలెత్తి చూసింది: ఆ కళ్ళల్లో బెరుకు, కుతూహలాల మిశ్రమ భావం. శేషు వెర్రి నవ్వొకటి నవ్వుతూ బెంచీల మధ్య నుండి ఆమె దగ్గరకు నడిచి, చేతిలోని బహుమతిని బయటపెట్టాడు. అప్పటికే అది కరిగి అతని చేతి మీదుగా చల్లగా క్రిందకు కారిపోతోంది. కిటికీలోంచి లోపలకు ప్రతిఫలిస్తున్న మధ్యాహ్నపు యెండలో దానిపైన అవిర్లు తేరుతూ కనిపిస్తున్నాయి.  మొదట ఆమె మొహంలో అయిష్టత కదలాడినా, కొత్త పరిసరాల్లో యీ కొత్త చెలిమి ప్రతిపాదనను తిరస్కరించి వ్యతిరేకత కొనితెచ్చుకోవడం యెందుకనుకుందేమో, మర్యాదపూర్వకంగా ఆరిందా నవ్వొకటి సన్నగా నవ్వి, కంపాక్సు మడిచి ఒద్దికగా బల్ల మీద పెట్టి, ఐసు చేతుల్లోకి తీసుకుంది. శేషు ఆమెకు యెదురుగా వున్న బెంచీల వరుసలో కూర్చున్నాడు. ఐసు నీరు పరికిణీ మీదకు జారకుండా దూరంగా పట్టుకుని, మళ్ళీ తనది కాని నవ్వొకటి అతనికి అప్పగించింది. ప్రతిగా  అతనూ నవ్వాడు. మరలా గంట మోగి పిల్లల మూక అంతా లోపలికొచ్చేసేలోగా యిద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. నిజానికి యెక్కువగా శేషునే మాట్లాడాడు. రేణుకాదేవి మాట్లాడిన కాసిని మాటలూ అతని పశ్నలకు సమాధానాలే.  ఈ యేకపక్ష సంభాషణలో అతని వంతుగా స్వీయపరిచయాన్ని (అమ్మా, నాన్న, అన్నయ్య, కుమ్మరి చక్రం), యీ బడి టీచర్ల పరిచయాన్నీ (డ్రిల్లాయన మంచోడు, సోషలోడు సోదిగాడు, లెక్కలోడిక్కాస్త మూలశంక వగైరా)  కానిచ్చాక, రేణుకాదేవి ఆమె వంతుగా రాల్చిన మాటల ముత్యాల్లోంచి తన తల్లి తండ్రీ చనిపోవడం, సుబ్బరాజుగారు మనవరాల్ని యింటికి తెచ్చేసుకోవడం యిత్యాది వివరాలు యేరుకోగలిగాడు.  ఈలోగా గంట మోగడంతో యెవరి చోటులో వాళ్ళు సర్దుక్కూర్చున్నారు.

బడి ముగిసాక, గుంపులు గుంపులుగా నడుస్తున్న పిల్లల మేళంతో కలవకుండా ఒక్కతే పెట్టె మోసుకుంటూ పోతున్న ఆమెని కనిపెట్టి మరలా పలకరించాడు. రేణుకాదేవి రెండు నెలలు ఆలస్యంగా బడిలో చేరింది; కాబట్టి అప్పటి దాకా అయిన  పాఠాల నోట్సు కావాలంటే యిస్తానన్నాడు. అతని యిల్లు వుండేది బడి దరిదాపుల్లోనే. రేణుకాదేవి యింటికి వెళ్ళేదీ అటువైపే కావడంతో యిద్దరూ అక్కడ ఆగారు. ముంగిలి చుట్టూ కొబ్బరాకుల దడి కట్టివున్న  పాక అది. లోపల మల్లెపొదలూ, నందివర్ధనం మొక్కలతో, పాక చూరు మీదకు పాకిన గుమ్మడి పాదుతో అంతా పచ్చగా వుంది. కుమ్మరి చక్రం దగ్గర పనిచేస్తున్న తండ్రి వీళ్ళిద్దరి రాక గమనించి, యీ పిల్లెవర్రా? అనడిగాడు కొడుకుని.

సుబ్బరాజుగారి మనవరాలంట నానా!

శేషు నోటి వెంట యీ మాట రాగానే, వాళ్ల నాన్న సారె వదిలేసి సంబరంగా లేచి వాళ్ళావిణ్ణి పిలిచాడు.  నల్లగా కళైన ముఖంతో, కాసంత బొట్టుతో, కాళ్ళకు కడియాల్తో ఒకావిడ గుమ్మంలో ప్రత్యక్షమైంది. విషయం తెలియగానే, ఏడోతరగతి చదువుతున్నదని కూడా ఖాతరు చేయకుండా, రేణుకాదేవిని అమాంతం చంకనెత్తేసుకుంది. సిగ్గుతో బిక్క చచ్చిపోయిన పిల్లను అలాగే వంటగదిలోకి తీసుకుపోయి, దూలానికి కట్టిన వుట్టి దింపి, పిడతలోంచి గిన్నెలోకి కాస్త జున్ను తీసి పెట్టింది. పేడ అలికిన నేల మీద కూర్చోవడానికి యిబ్బంది పడుతుందని తీసుకెళ్ళి బియ్యం పెట్టె మీద కూర్చోబెట్టింది. తాను మట్టి పొయ్యి దగ్గరికి పోయి గరిటె తిప్పుతూ, రేణుకాదేవి తల్లి గురించి చాలా సంగతులు గుర్తు తెచ్చుకుంది.  రేణుకాదేవి జున్ను సంగతి కూడా మర్చిపోయి అమ్మ తాలూకు చిన్నప్పటి చేష్టలన్నీ కళ్ళు విప్పార్చుకు విన్నది. సంతోషపు జ్ఞాపకాల నెమరువేత అయ్యాకా, శేషు తల్లి తన చిన్ననాటి నేస్తానికి చివరికే గతి పట్టిందో గుర్తుతెచ్చుకుని చెంగుతో కళ్ళద్దుకుంది.

రేణుకాదేవికి జరుగుతున్న మర్యాదలు చూసిన శేషు, సాక్షాత్తూ ఆమెను స్నేహితురాలిగా యింటికి తీసుకు వచ్చినందుకు తనకూ జున్ను జుర్రుకునే భాగ్యం పట్టబోతోందని ఆశించాడు గానీ, అమ్మ మాత్రం రాత్రే కదరా తిన్నావని గసిరి తరిమేసింది. ఎట్టకేలకు అమ్మ వదిలిపెట్టాకా ఆమెని వేరే గదిలోకి తీసుకెళ్ళాడు. ఆ గదిలో వాళ్ళన్నయ్య సామాను వుంది. శేషు దృష్టిలో వాళ్ళన్నయ్య ఒక అద్భుతమూ, ఆదర్శమూ, దైవదత్తమైన బహుమానమూను.  అతనిప్పుడు టౌను కాలేజీలో చదువుతూ అక్కడే హాస్టల్లో వుంటున్నాడు. ఒకప్పుడు శేషు చదివిన బడిలోనే అత్యుత్తమ విద్యార్థిగా మన్ననలందుకున్నాడు.  ఊరివాళ్ళు అడపాదడపా అతని సత్ప్రవర్తనతో శేషు కొక్కిరాయి వేషాల్ని పోల్చి, యీడి అన్నయ్య యెంత కుదురో, యీడంత పోకిరీ యెదవ అని తీర్మానించినపుడు శేషు కాసేపు అసూయపడేవాడు గానీ, అలాంటి అన్నయ్యకు తాను ముద్దుల తమ్ముణ్ణని గుర్తుతెచ్చుకుని గర్వపడేవాడు. ప్రస్తుతం రేణుకాదేవికి అన్నయ్య నోటు పుస్తకాల్లో అందమైన దస్తూరినీ, సైన్సు రికార్డుల్లో అతను వేసిన బొమ్మల్నీ, జిల్లాస్థాయి ఆటలపోటీల్లో అతను గెల్చుకు వచ్చిన కప్పుల్నీ వ్యాఖ్యాన సహితంగా చూపిస్తున్నాడు. ఇంటికి తోటివాళ్ళెవరు వచ్చినా శేషు మొదట ప్రదర్శించేది వాటినే. అన్నయ్యని అభిమానించడంలో అతని వుదారతనీ, అన్నయ్య ఘనతలు తనవే అన్నట్టు బడాయిపోవటంలో అతని బోళాతనాన్నీ చూసాక, రేణుకాదేవికి అతని పట్ల బెరుకు తగ్గింది. హఠాత్తుగా అతని వాక్ప్రవాహానికి అడ్డంపడుతూ, మా అమ్మ కూడా చాలా బావుండేది, అంది. ఆమె అర్థాంతరంగా ఆ ప్రసక్తి యెందుకు తెచ్చిందో శేషూకి వెంటనే అర్థం కాలేదు. కానీ తొలిసారి యే ప్రోద్బలమూ లేకుండా స్వంతంగా మాట్లాడటంతో, వుత్సుకంగా చెప్పమన్నట్టు వూకొట్టాడు.  ఆమె వుత్సాహంగా అమ్మ యెప్పుడూ నా కూడానే తిరిగేది... నేనేమో అమ్మ కూడా— అంటూ మొదలుపెట్టింది గానీ, అక్కడితో చెప్పదలచింది అయిపోయినట్టు వున్నట్టుండి మిన్నకుండిపోయింది. కాసేపు మూగగా  అటక వంకా నేల వంకా చూసి, తాను యింకా యేదో మాట్లాడబోతోందని యెదురుచూస్తున్న అతని ముఖకవళిక గమనించి, మొహమాటంగా అంతే! అని తలదించుకుని వేళ్ళతో నులకమంచం మీద దుప్పటిని క్రింద కన్నాల్లోకి గుచ్చుతోంది. అప్పటికే శేషూకి ఆమెతో సంభాషణ జరిపే తీరు బోధపడింది.  తానే చొరవగా వివరాలు అడుగుతూ మాటల్లోకి దించాడు.  ఆమె ఒక్కోచోట వాక్యాల్ని అర్థాంతరంగా ముగించినా, విషయక్రమాన్ని ముందువెనుకలుగా కలగాపులగం చేసి చెప్పినా అర్థమైనట్టే తలూపాడు. తల్లి గురించి మాట్లాడినంతసేపూ ఆమె కళ్ళముందే విచ్చుకుంటున్న పువ్వులా ప్రకాశవంతమైంది. అమ్మకి ఒక్కోసారి నవ్వొస్తే పొట్టనెప్పి వచ్చేదాకా పడిపడి నవ్వేదనీ, జడవేస్తూ మంచి కథలు చెప్పేదనీ, గుళ్ళో ప్రదక్షిణలు చేసేటప్పుడు యెత్తుకు తిప్పేదనీ, యిద్దరూ కలిసి తోటలో బోలెడు మొక్కలు పాతి పెంచారనీ, వాటి పూలు రాలాకనే తల్లో పెట్టుకునేదనీ... యిలా యేదో కొన్ని కవుర్లు చెప్పగలిగింది. ఈ సంగతులన్నీ ఆమె యిదివరకూ యెవరితోనూ చెప్పుకున్నవి కాదు. ఈ యిష్టాన్ని పంచుకోవడంతోనే శేషు కూడా ఆమెకు యెంతో యిష్టుడైపోయాడు.  ఇలా అని శేషు గమనించలేదు. రేణుకాదేవికీ తెలియదు. ఒక స్నేహం మాత్రం మొదలయింది.

*     *     *
కొసకంటా కాలిన సిగరెట్టు వేడి వేళ్ళకి చురుక్కుమని తగలడమూ, అపుడే మొదలైన వాన జల్లు చల్లగా ముఖాన్ని తడపడమూ దాదాపు ఒకేసారి జరిగి, అతణ్ణి ప్రస్తుత ప్రపంచంలోకి తెప్పరిల్లేలా చేశాయి. ఇందాక యెదుట దిగంతం దాకా కనిపించిన పంటపొలాల దృశ్యం యిపుడు పల్చని వాన తెర వెనుక అస్పష్టమైంది. తాటి చెట్ల వరసైతే అసలు కనపట్టమే లేదు. కుక్క పట్టాల మీద పచార్లు ఆపి  ప్లాట్ఫాం మీదకు గెంతి వళ్ళాడించుకుంటూ వాన చినుకుల్ని దులుపుకుంటోంది.  ఏటవాలు వాన అప్పటికే ప్లాట్ఫారాన్ని సగం దాకా తడిపేసింది. తడిభాగంతో యుద్ధంలో వోడి పోతున్న పొడిభాగం వెనక్కు జారుకుంటోంది. వాన జోరు చూస్తే యిక్కడే నిలేసేలా వుందని లేచాడు. బేగులోంచి రైన్ జాకెట్ తీసి తలని కప్పేలా వేసుకుని స్టేషను బయటికి వచ్చాడు.

పేరుకి యిది శ్రీపాదపట్నం రైల్వేస్టేషనే గానీ, వూరు మాత్రం యింకో ఆరేడు కిలోమీటర్ల అవతల వుంటుంది. బస్సెక్కాలంటే వానలో రోడ్డు దాటక తప్పదు. ఒక్క వుదుటున పరిగెత్తి అపుడపుడే నిండుతున్న వానగుంటల మీంచి గెంతుకుంటూ రోడ్డు అవతల వున్న చిన్న ఆలయంలోకి చేరుకున్నాడు.  ఏదో గ్రామదేవత ఆలయం. బస్సొచ్చే వరకూ యిక్కడ తల దాచుకోవచ్చు. ఇదివరకూ యిక్కడ యీ ఆలయం వుండేది కాదు. బాట మీదకు పూలు రాలుస్తూ పెద్ద నిద్రగన్నేరు చెట్టూ, దాని మొదట్లో బండగా చెక్కిన యేదో అనాథ దేవతా విగ్రహం వుండేవి. స్టేషను నుండి వూరికి వెళ్ళేవాళ్ళు ఆ చెట్టు నీడన నిలబడి బస్సుకోసమో, గుర్రపు జట్కా కోసమో వేచిచూసేవారు. శేషుకి ఆ దృశ్యం యేదో యిటీవలి జ్ఞాపకంలా యెంత స్పష్టంగా గుర్తుందంటే, యిప్పుడు దాని స్థానే యీ ఆలయం వున్నట్టుండి నిన్నకు నిన్న మొలుచుకు వచ్చిందా అనిపించింది.  చూడటానికి మాత్రం బాగా పాత కట్టడంలానే కనిపిస్తోంది. అక్కడక్కడా గోడ పగుళ్ళలోంచి మొలిచిన రావి మొలకలూ, సున్నం వెలిసి లోపల సిమెంటు కనిపిస్తున్న స్తంభాలూ, మనుషులు చిరకాలంగా మసలుకుంటున్నారనటానికి గుర్తుగా జిడ్డు తేలిన అంచులూ...  యింత పాతగా కనిపిస్తున్న యీ ఆలయం తన కన్నా వయసులో చిన్నదంటే ఆశ్చర్యమేసింది. బాల్యావస్థలో వున్నపుడు పరిసర ప్రపంచంలో దాదాపు ప్రతీదీ మనకన్నా ప్రాచీనమైనదే అయివుంటుంది.  ఊరి చివరి చింతచెట్టూ, యేటి ఒడ్డున పడవా, మనం చదివే బడీ అన్నీ మనకన్నా ప్రాచీనమైనవే; మనం భూమ్మీద లేకముందు నుంచీ వున్నవే. దాంతో యీ పరిసరాల ప్రాచీనత్వం పట్లా, సాపేక్షంగా మన నూతనత్వం పట్లా అదో అలవాటైన నమ్మకం యేర్పడిపోతుంది. కానీ అది యెన్నాళ్ళో నిలిచేది కాదు.  జీవితగమనంలో యేదో ఒక రోజు తేరుకుని చుట్టూ చూసేసరికి అకస్మాత్తుగా ప్రపంచంలో చాలా అంశాలు మనకన్నా యిటీవలివే కనిపించడం మొదలవుతాయి. కాలం కసాపిసా తొక్కి వెళ్ళిన జాడల్తో నీరసించి కన్పిస్తున్న నిర్మాణాలూ, పరిసరాలూ కూడా చాలా సందర్భాల్లో మనకన్నా పడుచువే అని తెలుస్తుంది. వాటిపై కాలపు జాడలు సాపేక్షంగా మనమెంత పాతవాళ్ళమో స్ఫురింపజేస్తాయి. ఆ స్ఫురణ అంత ఆనందకరమైందేమీ కాదు. ఈ ఆలయాన్ని చూసేసరికి తన వయసే కాదు, గడిచిన  పన్నెండేళ్ళ కాలం కూడా చాలా యెక్కువని అర్థమైంది.

1 comment:

  1. బాగుంది! మిగతా భాగాలకోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటాను. వర్ణనలతో కథలోని వాతావరణాన్ని చక్కగా కళ్ళకి కట్టిస్తున్నాను.

    కాని చాలా చోట్ల ఇది ఇంగ్లీషుకి తెలుగు అనువాదంలాగ అనిపించింది. కొన్ని ఉదాహరణలు:

    "మేఘావృతమైన ఆకాశం ప్రకృతివర్ణ ఛాయను తగ్గించి యేదో మందకొడి అందాన్ని అద్దింది."
    "ఆమెను ఆవరించి మేజాబల్లలపై పుస్తకాల సంచులు,"
    "శేషు దృష్టిలో వాళ్ళన్నయ్య ఒక అద్భుతమూ, ఆదర్శమూ, దైవదత్తమైన బహుమానమూను"

    ReplyDelete