September 3, 2024

Random thoughts on translation:


(ఇంగ్లీషు నుంచి తెలుగు లోకి అనువదించేవాడిగా నా కొన్ని రీసెంట్ ఆలోచనలు.)  

> అనువాదాలకి సంబంధించి ఇప్పుడు చెలామణీలో ఉన్న సూత్రాలూ, పద్ధతులూ ఎక్కువ ఇంగ్లీషు భాష ఆధారంగా జరిగిన ట్రాన్స్‌లేషన్ స్టడీస్ నుంచి దిగుమతి అయ్యాయి. అవి చాలాసందర్భాల్లో వేరే భాషలకి అప్లయ్ కావు. ఇంగ్లీషుకి చాలా విషయాల్లో చాలా దూరమైన తెలుగుకి అస్సలు అప్లయ్ కావు.

> రానురానూ ఇంగ్లీషు అనువాదకులు పాటించే నియమాలు అతిగా తయారయ్యాయి. మూల రచయిత ఏదో మూలవిరాట్ ఐనట్టూ, అతని ప్రతి అక్షరం శిలాక్షరమన్నట్టూ ఫీలవుతారు. మూల రచన నుంచి ఏ మాత్రం దూరం జరిగినా మహా పాపం అన్నట్టు మాట్లాడతారు. అందుకే నేను ఏదైనా ఇంగ్లీషేతర రచనకి ఏ యాభై అరవై ఏళ్ళ క్రితమో వచ్చిన పాత ఇంగ్లీష్‌ అనువాదం తీసుకోవాలా, ఈ మధ్యనే వచ్చిన కొత్త ఇంగ్లీష్‌ అనువాదం తీసుకోవాలా అన్న చాయిస్‌ దగ్గర.. ఆల్మోస్ట్ ఎప్పుడూ పాత అనువాదం జోలికే పోతున్నాను.

> ఒక అమెరికన్ అనువాదకుడు రష్యన్ నుంచి చేసిన తన అనువాద పుస్తకాలకి రాసే ముందుమాటల్లో చాలా బడాయి పోతాడు. “రష్యన్ మూలంలోని ఫలానా పదాన్ని పాత అనువాదకులందరూ ఇలా పొరబాటుగా అనువదించారూ, నేను మాత్రం సరిగ్గా అచ్చంగా ఇలా అనువదించానూ, ఈ పదం కొంచెం చిత్రంగా ధ్వనించొచ్చూ, కానీ ఇదే సరైనదీ, ఆ ఫలానా దాస్తోయెవ్‌స్కీ ఉద్దేశమో చెహోవ్ ఉద్దేశమో కచ్చితంగా చెప్పే పదం ఇదే…” ఇలా తెగ విశ్లేషిస్తాడు. కానీ ఏ మంచి రచనకైనా ఉండే linguistic textureని పట్టుకోవడంలో మాత్రం ఘోరంగా ఫెయిలవుతుంటాడు. అతని అనువాదాల్లో గొప్ప గొప్ప రష్యన్‌ రచయితలు కూడా ఏమాత్రం చదివించలేని రచయితలుగా తయారవుతారు.

> అనువాదంలో పదాల్నీ వాక్య నిర్మాణాల్నీ మరో భాషలోకి తేవటం కంటే, రచనకి ఉండే లింగ్విస్టిక్ టెక్చర్‌ని, ఎమోషనల్ టోన్‌ని పట్టుకోవడం ముఖ్యం. ఇక్కడ లింగ్విస్టిక్ టెక్చర్ అంటే రచనలో వాడే భాషలోని ప్రతి అంశం మధ్య పరస్పరం పొందిక ఉండటం. (గొంతును వాడటం తెలీనోడు మంచి సింగర్ కాలేనట్టే, భాషని వాడటం తెలీనోడు మంచి రైటరూ కాలేడు. ఇక్కడ భాష తెలియటం అంటే ఎక్కువ వకాబులరీ తెలిసుండటం అని కాదు. తను వాడే భాషలో ఒక పొందికని సాధించటం. ఆ పొందిక మంచి రైటర్లందరి దగ్గరా ఉంటుంది. అనువాదకుడు ఒరిజినల్ రచనలో ఉన్న ప్రతి పదానికీ తన భాషలో అదే అర్థాన్నిచ్చే పదం ఏముందో దాన్ని మటుకు వెతికి పట్టుకుని రిప్లేస్ చేసే ప్రయత్నం చేస్తే ఆ పొందిక ఉండదు. పదాల్ని అనువదించటం కంటే ఆ పొందికని అనువదించటం ముఖ్యం. మంచి రచయితలందరి దగ్గరా భాషలో ఉండే హార్మనీని అనువదించటం ముఖ్యం. అది సాధించలేకపోతే ఒక భాషలో మంచి రైటర్ని ఇంకో భాషలో చెడ్డ రైటరుగా మార్చేసినట్టే.)

> దాస్తోయెవ్‌స్కీ తన “బ్లడ్ బ్రదర్” లాంటోడు అంటాడు జర్మన్ కాఫ్కా. టాల్‌స్టాయ్‌ కంటే ఎత్తయిన రచయిత లేడంటాడు ఐరిష్ జేమ్స్ జాయ్స్. తుర్గెనెవ్ తనకు ఎంత ముఖ్యమో పదే పదే చెప్తాడు అమెరికన్‌ హెమింగ్వే. వీళ్ళందరూ తమకి ఇంత ముఖ్యమైన రష్యన్ రచయితల్ని చదువుకున్నది రష్యన్‌ భాషలో కాదు, అనువాదాల్లోనే. అలాగే ఆ గొప్ప రష్యన్ రచయితలు మళ్ళీ ఇంగ్లీష్ షేక్‌స్పియర్‌ని, ఫ్రెంచ్ వొల్తేర్‌ని అనువాదాల్లోనే చదుకున్నారు. వీళ్ళు చదివిన అనువాదాలేవీ ఒరిజినల్‌ రచనకి పూర్తిగా కట్టుబడిపోయి, పకడ్బందీగా సాగిన లిటరల్ ట్రాన్స్‌లేషన్స్ అయ్యుండవు. అసలు ఆ కాలం నాటికి అలాంటి కాన్సెప్టే ఏదీ ఇంకా అంత డెవలప్‌ కాలేదు. ఆ అనువాదాల్లో మూల రచయితల శైలి ఎంత ఉందో అనువాదకుల శైలి ఎంత ఉందో విడదీసి చెప్పలేం. హెమింగ్వే తనకి తుర్గెనెవ్ ఇష్టం అని చెప్తున్నాడంటే దాని అర్థం Constance Garnett అనే అనువాదకురాలి ద్వారా తనకి తెల్సిన తుర్గెనెవ్ అంటే ఇష్టం అనే అర్థం. ఎందుకంటే కాన్‌స్టాన్స్ గార్నెట్ మూలాన్ని అంత దగ్గరగా అనుసరించలేదనీ, ఒక్కోసారి స్వేచ్ఛ తీసుకుని దూరం జరిగిందనీ తర్వాత చాలామంది విమర్శించారు. అయినా సరే నేను ఇప్పుడు తుర్గెనెవ్‌, చెహోవ్‌, టాల్‌స్టాయ్‌ రచనలేమన్నా చదవాలంటే ముందు వాటికి కాన్‌స్టాన్స్ గార్నెట్ అనువాదం ఉందా లేదా అని వెతుకుతాను. ఎందుకంటే, ఆమె మూలానికి ఎంత దూరమైనా జరిగుండొచ్చు గాక, హెమింగ్వే లాంటోడ్ని అంతగా ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలిగే ఒక తుర్గెనెవ్‌ని సృష్టించగలిగింది. నాకు కావాల్సింది మూలాన్ని కచ్చితంగా పాటించే అనువాదం కాదు. అసలు తుర్గెనెవ్ కూడా కాదు. నాకు కావాల్సింది హెమింగ్వే కూడా ఎంతో ఇష్టపడిన ఒక మంచి రచన. కాన్‌స్టాన్స్‌ గార్నెట్ మీద ఎన్ని విమర్శలున్నా సరే, చెహోవ్ ఆమె అనువాదంలో ప్రకాశించినంతగా నాకు ఇంకే అనువాదంలోనూ ప్రకాశించ లేదు. ఇప్పుడు చెహోవ్ శుద్ధంగా రష్యన్‌లో ఎలా రాస్తాడో నాకు తెలియాల్సిన పని లేదు. ప్రపంచంలో ఎంతోమంది కథా రచయితల్ని ప్రేరేపించి, అలా ప్రేరేపించటం ద్వారా ఆధునిక షార్ట్‌ స్టోరీకి ఒక రూపాన్నిచ్చిన చెహోవ్ నాకు కావాలి. అతను అది సాధించగలిగింది కాన్‌స్టాన్స్ గార్నెట్ అనువాదాల ద్వారానే. 

> నిజానికి దాస్తోయెవ్‌స్కీ శైలి అంతగా బాగోదని, అతని భాష జర్నలిస్టిక్ జార్గాన్ తో నిండి ఉంటుందనీ అంటారు కొంతమంది రష్యన్లు. బహుశా రష్యన్ దాస్తోయెవ్‌స్కీ ఇంగ్లీషులోకి వచ్చేసరికి ఇంకా మంచి రచయిత లాగా మారుతున్నాడేమో ఎవరికి తెలుసు. 

> అలా అని అనువాదకులకి ఏదో మహత్తరమైన ఇంపార్టెన్స్ ఉందీ అని నేనటం లేదు. అలాగైతే అదే ఒక్క దాస్తోయెవ్‌స్కీ వేర్వేరు అనువాదాల్లో జర్మన్ నీషేనీ, ఫ్రెంచ్ కామూనీ, నార్వేజియన్ కనుట్ హామ్సన్‍నీ అంతే సమానంగా కదిలించ గలిగేవాడు కాదు కదా. అసలైన సారం ఉండేది ఎప్పుడూ రచయిత దగ్గరే. అనువాదకులు దాన్ని చెడగొట్టకుండా ఉంటే చాలు. మంచి అనువాదకులైతే మూల రచయితని అన్నిసార్లూ మరీ దగ్గరగా, గుడ్డిగా, మక్కీకి మక్కి ఫాలో అవరు. మూల రచయిత తమ భాషలో రాయాల్సి వస్తే ఎలా రాసుంటాడో ఊహిస్తారు. అలా రాయటానికి ప్రయత్నిస్తారు. పాత అనువాదకులు అదే చేశారు. ఇప్పటి ఇంగ్లీషు అనువాదకుల్లాగ మూల రచయిత వాడిన ప్రతి పదానికి మరీ మత గ్రంథాల్లోని పదాలంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఈ పిచ్చ మరీ పెరిగిపోయి ఈ మధ్య అనువాద యుద్ధాలు జరుగుతున్నాయి. “ఆ పదాన్ని అలా కాదు ఇలా అనువదించాలీ” అని నలుగురైదుగురు అనువాదకులు కొట్టుకుంటుంటే, విమర్శకులు నాలుగైదు అనువాదాల్లో ఒకే పేరాని పక్కన పక్కన పెట్టి ఏది బావుందో ఏది బాలేదో చెప్తుంటే- చదివేవాళ్ళకి సరదాగానే ఉంటుంది. కానీ ఎందుకూ పనికిరాని గొడవలు.
 
  > ఒక ఇంగ్లీషేతర భాషలోని రచనని నేరుగా అదే భాష నుంచి అనువదించటానికి, వయా ఇంగ్లీష్ అనువదించటానికీ మధ్య పోలిక చూపించి, నేరుగా ఆ భాష నుంచి అనువదించిందే అన్నిసార్లూ సుపీరియర్ అనటానికి లేదు. అనువదిస్తున్నప్పుడు మనం రచయిత సమక్షాన్నీ, అతను సృష్టిస్తున్న భావోద్వేగాల ఆవరణనీ ఇంకో భాషలోకి తెస్తున్నాం. అనువాదకుడి ప్రతిభని బట్టి, అనువాదకుడు మూల రచయిత సమక్షాన్ని ఎంత మేరకు ఆవాహన చేసుకోగలిగాడన్నదాన్ని బట్టి, మధ్యలో ఎన్ని భాషలున్నా, అతను మూల రచయిత ఎసెన్స్‌ని పట్టుకోగలడు. ఉదాహరణకి– ఇద్దరు అనువాదకులు ఉన్నారనుకుందాం. ఒకడు దాస్తోయెవ్‌స్కీ బాధేంటో అర్థం కానివాడూ, దాస్తోయెవ్‌స్కీ అంటే పెద్ద అభిమానం కూడా లేనివాడూ, కేవలం ఉద్యోగార్థం దాస్తోయెవ్‌స్కీని నేరుగా రష్యన్‌ నుంచి అనువాదం చేశాడనుకుందాం; రెండోవాడు దాస్తోయెవ్‌స్కీ యాతనేంటో అర్థం చేసుకున్నవాడూ, దాస్తోయెవ్‌స్కీని అతని ఉత్తరాలతో సహా ఇష్టంగా చదువుకున్నవాడూ ఇంగ్లీష్‌ నుంచి అనువాదం చేశాడనుకుందాం. ఈ సందర్భంలో రెండోవాడు చేసిన అనువాదమే ప్రభావవంతంగా ఉంటుంది, వాడు నేరుగా కాకుండా ఇంగ్లీషు నుంచి చేసినా గానీ.

> (ఇన్సిడెంటల్‌గా ఇక్కడ ఒక విషయం గుర్తొస్తుంది: నాలుగైదేళ్ళ క్రితం దాస్తోయెవ్‌స్కీ గొప్ప రష్యన్‌ నవల ‘బ్రదర్స్‌ కరమజవ్‌’ ఇంగ్లీష్‌ నుంచి తెలుగులోకి రావటం నాకు పెద్ద ఈవెంట్ లాగ అనిపించింది. అనువాదం కూడా బానే ఉంది కాబట్టి, ఇన్నాళ్ళూ ఇంగ్లీష్‌ రాకపోవడం వల్ల ఆ గొప్ప రచనని చదవలేనివాళ్లు ఇప్పుడు ఆ రచనని చదువుతారనీ, దాస్తోయెవ్‌స్కీ రాకతో తెలుగు సాహిత్యానికి కొత్త డైమన్షన్‌ ఏడ్‌ అవుతుందనీ అనుకున్నాను. ‘కరమజవ్‌ సోదరులు’ పుస్తకాలు బాగానే అమ్ముడయ్యాయని విన్నాను గానీ, నేను ఎక్స్‌పెక్ట్‌ చేసిన భూకంపమేం రాలేదు. దాన్ని బట్టి నాకు అర్థమైంది గొప్ప రచయితల్ని చదవటానికి కేవలం భాషే అడ్డం కాదని. భాష కంటే ఆ పర్టిక్యులర్‌ టేస్ట్‌ ఉండటం ముఖ్యం అని. ఊరకే గొప్ప రచయిత అన్న పేరూ రెప్యుటేషనే తప్ప దాస్తోయెవ్‌స్కీకి తెలుగోళ్లు అంత సీన్ ఎప్పుడూ ఇవ్వరని, అలాంటి టేస్ట్ మన దగ్గర తక్కువని.) 

> తెలుగు సాహిత్యం మొదలవటమే ఒక అనువాదంతో మొదలైంది. నన్నయ ఆంధ్ర మహా భారతం ఒక క్రియేటివ్‌ ట్రాన్స్‌లేషన్‌. ఆనాటి సంస్కృత కావ్యాల్ని తెలుగులోకి అనువదించిన కవులు మూలంలో వాళ్ళు ఏ అంశాన్ని ఇష్టపడ్డారో, ఏ అంశంతో resonate అయ్యారో దాన్ని ఇంకా పెంచి విస్తరించి రాశారు, నచ్చనివి మొత్తం వదిలేశారు. ఒక్కోచోట కొత్త సన్నివేశాలూ కూడా కలుపుకున్నారు. అఫ్‌కోర్స్‌, ఇప్పుడది సాధ్యం కాదు. ఇప్పుడు అనువాదాల్లో ‘క్రియేటివిటీ’ చూపించడమంటే అది ఘోరమైన పాపం. Author అంటే ultimate authority గా మారిపోయిన ఈ కాలంలో మరీ అంత స్వేచ్ఛ తీసుకోలేం. కానీ మూల రచనకి మరీ కట్టుబానిసల్లా కూడా పని చేయాల్సిన అవసరం లేదనుకుంటాను. ముఖ్యంగా అనువాదకుడు కూడా క్రియేటివ్ రైటరే అయినప్పుడు ఆ స్వేచ్ఛ ఇంకా పెరిగినప్పుడే ఫలితం బావుంటుంది. ఇది చాలా సందర్భాల్లో మూల రచయితలు కూడా ఒప్పుకుంటారు. వాళ్లు ఏ మాత్రం సెన్సిబిల్ ఐనా.

> కానీ చాలామంది మూల రచయితలు కూడా వాళ్ళు రాసిన అక్షరం శిలాక్షరమే అన్న ఫీలింగ్‌లో ఉంటారు. దాన్ని అర్థం చేసుకోగలం కూడా. ఎందుకంటే వాళ్ళు ఏ మాత్రం ప్రతిభ ఉన్న రచయితలైనా సరే ఏ పదం ఊరకే వాడరు. ప్రతి పదం లెక్కేసి బరువు తూచి వేస్తారు. అలాంటప్పుడు రచనలోని ప్రతి పదం మీదా మక్కువ సహజమే. అయితే చనిపోయాక కూడా వాళ్ళ వారసులు, వాళ్ళ అభిమానులూ వాటిని అంతే శిలాక్షరాల్లాగ భావించి అనువాదకుల్ని కట్టడి చేసి వాళ్ల నుంచి లిటరల్ ట్రాన్స్‌లేషన్లు ఎక్స్‌పెక్ట్ చేయటం మంచి చేయదు.  

> ఒక్కోసారి రచయితల వారసుల మూఢ నిర్ణయాలు కూడా అనువాదకుల్ని చాలా ఇబ్బంది పెడతాయి. దీనికి ఒక ఎక్స్‌ట్రీమ్ ఎగ్జాంపుల్ అర్జెంటినా రైటర్ బోర్హెస్ విషయంలో కనిపిస్తుంది. బోర్హెస్ బతికుండగా Norman Thomas di Giovanni అన్నతను బోర్హెస్ ముఖ్యమైన వచన రచనల్ని స్పానిష్ నుంచి ఇంగ్లీషుకి అనువాదం చేశాడు. ఆ అనువాదాల్ని అతను స్వయంగా బోర్హెస్ తో కలిసే చేశాడు. చాలా ఇంగ్లీష్ పాండిత్యం కూడా ఉన్న బోర్హెస్ అనువాదాల విషయంలో నార్మన్ థామస్ డి గియొవానీకి స్వేచ్ఛ ఇచ్చాడు. దేన్నీ ఉన్నదున్నట్టు అనువదించమనలేదు. మూలం నుంచి దూరం జరగాల్సిన సందర్భాల్లో జరగమని ప్రోత్సహించాడు. ఇద్దరూ కలిసి ఒక్కో సందర్భంలో ఇంగ్లీషులో ఎలా ఉంటే బావుంటుందో దానికి తగ్గట్టు మూలాన్ని మోడిఫై చేశారు కూడా. ఐతే బోర్హెస్ చనిపోయాక అతని భార్యకి రాయల్టీలు పంచుకునే విషయంలో అనువాదకుడు నార్మన్ థామస్ డి గియొవానీ తో తేడాలొచ్చాయి. ఆమె ఆండ్రూ హర్లీ అన్న ఇంకొక అనువాదకుడి చేత మొత్తం అనువాదాలన్నీ మళ్ళీ చేయించుకున్నది. అవి నార్మన్ థామస్ డి గియొవన్నీ అనువాదాలతో పోలిస్తే ఇన్ఫీరియర్ ట్రాన్స్‌లేషన్స్ అయినా గానీ ప్రస్తుతం బోర్హెస్ అనువాదాలుగా అవే చెలామణీలో ఉన్నాయి. స్వయంగా బోర్హెస్ ఆమోదం ఉన్న నార్మన్ థామస్ డి గియొవన్నీ అనువాదాలు ఇప్పుడు దొరకటమే లేదు.  

 > ‘‘అనువాదం గురించి 1861–62 సంవత్సరాల్లో చేసిన పెద్ద చర్చలో మాథ్యూ ఆర్నాల్డ్‌, ఫ్రాన్సిస్‌ న్యూమన్‌లు రెండు రకాల అనువాద పద్ధతుల గురించి మాట్లాడుకున్నారు. యథాతథంగా, ఏ పద వైచిత్రినీ వదలకుండా అనువదించటాన్ని న్యూమన్‌ సమర్థించాడు. పాఠకుడికి దారిలో అడ్డుతగిలే, దారిమళ్ళించే ప్రతి వివరాన్నీ తొలగించవచ్చని ఆర్నాల్డ్‌ వాదిస్తాడు. ఆర్నాల్డ్‌ పద్ధతి అనువాదంలో ఒక పొందికైన శైలిని, గాంభీర్యాన్నీ సాధిస్తే, న్యూమన్‌ పద్ధతి ఆశ్చర్యపరిచే వ్యక్తీకరణలకు వీలు కల్పిస్తుంది. కానీ ఈ రెండు పద్ధతులూ కూడా అనువాదకుడి కంటే, అతని సాహిత్య అభిరుచుల కంటే ముఖ్యం కాదు.’’ – ఈ మాటలు ఒక బోర్హెస్‌ వ్యాసం లోవి. ఆ వ్యాసం ‘అరేబియన్‌ నైట్స్‌’కి వచ్చిన అనువాదాల గురించి. ‘అరేబియన్‌ నైట్స్‌’కి రిచర్డ్‌ బర్టన్‌ చేసిన అనువాదాన్ని రిచర్డ్‌ బర్టన్‌ జీవితం, అందులోని అడ్వంచర్లు, ఆయన వ్యక్తిత్వం ఎలా ఇన్‌ఫ్లుయెన్స్‌ చేశాయో చెప్తాడు బోర్హెస్‌. ‘అరేబియన్‌ నైట్స్‌’ అన్నవి జానపద కథలు. దాన్ని ఎలా అనువదించినా అభ్యంతరం చెప్పటానికి Author అంటూ ఒకడు లేడు. ఆధునిక సాహిత్యంలో ‘ఈ రచన నాది’ అని చెప్పుకోవటానికి ఒక రచయిత ఉన్నాడు. ఆ రచయిత ఉన్నంత వరకూ అనువాదకుడి స్వేచ్ఛకి అడ్డే. కానీ ఎప్పుడో 19వ శతాబ్దం రచయితల్ని కూడా ఇప్పుడు అంతే యతాతథంగా అనువదించాలని అనుకోవటం అనవసరం అనుకుంటాను. 

> అనువాదం అన్న సంస్కృత పదానికి అర్థం ‘మరలా ఇంకోసారి వివరించి చెప్పటం’ అని అట. ఇంగ్లీషు నుంచి తెలుగుకి అనువదించేటప్పుడు మూలంలో ఉన్న ప్రతి పదానికి ఇక్కడ అదే అర్థంతో ఉన్న పదం ఏమిటో సరిగ్గా దాన్నే ఎంచుకుని యథాతథానువాదం చేయాలంటే చేయచ్చు. కానీ దానికి ఫలితంగా వచ్చే text అతుకులబొంతలాగ ఉంటుంది. అంటే మూల రచయిత తెలుగువాడై తెలుగులో రాసుంటే అలాంటి ఎగుడుదిగుడు భాష కచ్చితంగా రాయడు. కాబట్టి తెలుగులో అనువదించేటప్పుడు ‘వివరించి చెప్పటం’ తప్పదు, లేదా తెలుగు భాషకి తగ్గట్టు వేరే దారిలో వెళ్ళి చెప్పటం తప్పదు.

(చాలామంది మొదట్లోనే నమ్మే ఆలోచనలకి చుట్టుతిరిగి వచ్చానేమో. ఐనా ఎవడి జర్నీ వాడికి ముఖ్యం కాబట్టి...)

0 comments:

మీ మాట...