January 26, 2014

'మెటమార్ఫసిస్' - ఫ్రాంజ్ కాఫ్కా

1


గ్రెగర్ జమ్జా ఒక ఉదయం కలత కలల్నించి నిద్ర లేచే సరికి, మంచంపై తానో ఒక పెద్ద కీటకంగా మారిపోయి ఉన్నాడని గమనించాడు. అతను గట్టిగా పెంకు లాగా ఉన్న వీపు మీద పడుకుని ఉన్నాడు, తల కొంచెం పైకెత్తి చూస్తే ఉబ్బెత్తుగా బ్రౌన్ రంగులో ఉంది పొట్ట, దాన్ని అడ్డంగా విడదీస్తూ బిరుసైన చాపాలుగా వంగిన పలకలు ఉన్నాయి, పొట్ట మీద దుప్పటి నిలకడగా నిలవలేక ఏ క్షణానైనా జారిపోయేట్టుంది. ఈ శరీరపు భారీతనం పోలిస్తే చాలా బక్కగా ఉన్న కాళ్ళు బోలెడన్ని అతని కళ్ళ ముందు నిస్సహాయంగా కదులుతున్నాయి.

‘ఏమయింది నాకు?’ అనుకున్నాడు. ఇది కలైతే కాదు. అతని గది, మనుషులుండే మామూలు గది, బహుశా కాస్త చిన్నది, చిరపరిచితమైన నాలుగు గోడల మధ్యా స్తబ్ధుగా ఉంది. బల్ల మీద కొన్ని దుస్తుల శాంపిళ్లు విప్పి పడేసి ఉన్నాయి – జమ్జా ఒక ట్రావెలింగ్ సేల్స్‌మెన్ – బల్ల పైనున్న గోడ మీద అతను ఈమధ్యే ఒక పత్రికలోంచి కత్తిరించి అందమైన గిల్టు ఫ్రేములో బిగించి పెట్టుకున్న బొమ్మ ఒకటి వేలాడుతోంది. అందులో ఒక అమ్మాయి ఉన్ని టోపీ పెట్టుకుని, ఉన్ని శాలువా వేసుకుని, నిటారుగా కూర్చుంది, ముంజేతిని పూర్తిగా కప్పేసిన ఉన్ని చేతొడుగును చూపరుల వైపు చాపుతోంది.

తర్వాత గ్రెగర్ కిటికీ వైపు చూశాడు, బయట వాతావరణం మబ్బుగా ఉంది – కిటికీ చువ్వల మీద వాన చినుకుల చప్పుడు వినిపిస్తోంది – అతనికి దిగులుగా అనిపించింది. ‘ఇంకాసేపు నిద్రపోతే ఈ గోలంతా మర్చిపోవచ్చు,’ అనుకున్నాడు, కానీ అది అంత సులువు కాదని వెంటనే అర్థమైంది, అతనికేమో కుడి వైపుకు ఒత్తిగిలి పడుకోవటం అలవాటు, ఇప్పుడున్న స్థితిలో అది కుదరటం లేదు. ఎంత బలంగా అటు వైపు ఊగినా, తిరిగి మళ్ళీ తన వీపు మీదకే వచ్చి పడుతున్నాడు. అలా ఓ వంద సార్లయినా ప్రయత్నించి ఉంటాడు, కలవరంగా అల్లల్లాడుతున్న తన కాళ్ళను చూడలేక కళ్ళు కూడా మూసుకున్నాడు, చివరికి తన పక్క భాగంలోంచి సన్నగా ఇదివరకెన్నడూ లేని ఓ నొప్పి మొదలవటంతో ఇక ఆ ప్రయత్నం మానుకున్నాడు.

‘దేవుడా! ఈ గొడ్డు చాకిరీ ఉద్యోగాన్ని ఎందుకు ఎన్నుకున్నానో నేను! పొడిచిన పొద్దు గుంకే దాకా ప్రయాణాలతోనే సరిపోతోంది. ఆఫీసులో ఒక చోట నిలకడగా కూర్చుని చేసే పనితో పోలిస్తే, అసలే ఇందులో ఉద్యోగపరమైన ఒత్తిళ్ళు చాలా ఎక్కువ. అవి చాలవన్నట్టు, ఈ ప్రయాణాల అలసట, రైళ్ళు అందుతాయో లేదోననే గాభరా, వేళా పాళా లేని చెత్త తిండి, చిరకాలం మిగిలే దగ్గరి స్నేహాలకు అవకాశం లేకుండా ఎప్పటికీ పరిచయమాత్రంగానే మిగిలిపోయే ఎడతెగని ముఖాల ప్రవాహం... గంగలో కలవనీ ఇదంతా!’ అతనికి పొట్ట మీద చిన్న దురద మొదలైంది; తన్ను తాను నెమ్మదిగా మంచం పై భాగానికి లాక్కున్నాడు, అలాగైతే తల కాస్త పైకెత్తి చూసే వీలుంది; అతనికి దురద పెడుతున్న చోటు కనిపించింది, అక్కడ తెల్లని చుక్కల్లాంటి మచ్చలు గుంపుగా ఉన్నాయి, అవేమిటో అతనికి అర్థం కాలేదు; పరీక్షిద్దామని ఒక కాలు అక్కడ తగిలించాడు గానీ ఆ స్పర్శకు వళ్లంతా జివ్వుమనటంతో చప్పున వెనక్కు లాక్కున్నాడు.

మళ్ళీ యథాస్థానానికి జారిపోయాడు. ‘మరీ పెందలాడే లేస్తే ఒక్కోసారి ఇలాంటి పిచ్చి భ్రమలే కలుగుతాయి,’ అనుకున్నాడు, ‘ఏ మనిషికైనా సరిపడా నిద్ర అవసరం. మిగతా సేల్స్‌మెన్స్ అంతా జనానాలో ఆడవాళ్ళలా సుఖంగా ఉంటారు. మొన్నటికి మొన్న, పొద్దున్నే నేను కలెక్ట్ చేసిన ఆర్డర్లు రాద్దామని హోటల్‌కి వెళ్ళేసరికి, ఆ దొరగార్లందరూ ఇంకా టిఫిన్లు తినటంలోనే ఉన్నారు. అదే నేను గనక అలా చేస్తే మా యజమాని వెంటనే నన్ను ఉద్యోగంలోంచి పీకి పారేస్తాడు. ఏమో ఎవరు చెప్పొచ్చారు, అలా జరగటమే మంచిదేమో. నా తల్లిదండ్రుల గురించి ఆలోచించి వెనక్కు తగ్గాల్సి వస్తోంది గానీ, లేకపోతే ఎప్పుడో రాజీనామా ఇచ్చేసేవాణ్ణి, తిన్నగా లోపలికి దూసుకుపోయి మా యజమాని ముందు నిలబడి అతని గురించి నేనేమనుకుంటున్నానో నిర్మొహమాటంగా చెప్పేసేవాణ్ణి, దెబ్బకి డెస్కు మీంచి జారి పడేవాడు! అయినా అదేం పద్ధతో, అలా డెస్కు మీద ఎత్తుగా కూర్చుని ఉద్యోగులతో కిందికి చూస్తూ మాట్లాడటం, పైగా అతనికి చెవుడు కావటంతో దగ్గరగా మాట్లాడితే తప్ప వినపడదు కూడానూ. ఏదో ఒకటిలే, నాకు మాత్రం ఇంకా ఆశ చావలేదు; అతనికి నా తల్లిదండ్రులు చెల్లించాల్సిన బాకీ మొత్తం తీర్చేశాకా (దానికి ఒక ఐదారేళ్ళు పట్టొచ్చు) అప్పుడిక నేననుకున్నట్టే చేస్తాను. ఈ చాకిరీ నుంచి పూర్తిగా బయటపడతాను. అదంతా తర్వాత గానీ, ప్రస్తుతానికి, నేను ఇక లేవటం మంచిది, నా రైలు ఐదింటికి బయల్దేరిపోతుంది.’

అతను పక్కన సొరుగులబల్ల మీద టిక్ టిక్ మంటున్న అలారం వైపు చూశాడు. ‘అరె!’ అనుకున్నాడు. అప్పుడే ఆరున్నర దాటిపోయింది, అలారం ముళ్ళు ముందుకు కదుల్తూనే ఉన్నాయి, పావు తక్కువ ఏడు అవటానికి ఇంకెంతో సేపు పట్టదు. అలారం మోగలేదా? మంచం మీంచి చూట్టానికైతే అది నాలుగు గంటలకు సరిగ్గానే పెట్టి ఉంది; చెవులు చిల్లులు పడే ఆ మోతకి ఎవరన్నా ప్రశాంతంగా పడుకోగలరా? మరి, తను మాత్రం ప్రశాంతం కన్నా కూడా గాఢంగా నిద్రపోయాడు. ఇపుడేం చేయాలి? తర్వాతి రైలు ఏడింటికి ఉంది; పిచ్చెత్తినట్టు పరిగెడితే తప్ప దాన్నందుకోలేడు, పైగా అతని శాంపిళ్ళన్నీ ఇంకా సర్దకుండా ఎక్కడివక్కడే పడి ఉన్నాయి; అతనికి వంట్లో ఏమంత చురుగ్గా కూడా అనిపించటం లేదు. ఒకవేళ ఆ రైలు అందుకోగలిగినా, యజమానితో చీవాట్లు ఎలాగూ తప్పవు, ఎందుకంటే ఇప్పటికే ఐదింటి రైలు దగ్గర కూలీ ఎదురు చూసి చూసి వెళ్ళిపోయుంటాడు, బహుశా ఈపాటికే నేను రాలేదన్న విషయం చేరవేస్సి ఉంటాడు. అసలే వాడు యజమానికి ఒక చెంచా లాంటి వాడు, వెన్నెముక లేని మూర్ఖుడు. తనకు ఒంట్లో బాగా లేదని చెప్తే? కానీ అదేమంత నమ్మశక్యంగా ఉండదే. గ్రెగర్ తన ఐదేళ్ళ ఉద్యోగ జీవితంలో ఎన్నడూ సెలవు పెట్టి ఎరుగడు. యజమాని తప్పకుండా ఆరోగ్య బీమా వైద్యుణ్ణి వెంటబెట్టుకుని వచ్చేస్తాడు, అప్పుడిక తన సోమరితనానికి తల్లిదండ్రులు మాట పడాల్సి వస్తుంది, సంజాయిషీ ఏమన్నా చెపుదామన్నా యజమాని వినే రకం కాదు, బీమా వైద్యుణ్ణి చూపించి తన నోరు మూయిస్తాడు, ఆ బీమా వాడి దృష్టిలోనేమో ప్రపంచం అంతా ఆరోగ్యంగా ఉండి కూడా పని ఎగ్గొట్టే మనుషుల్తో కిక్కిరిసిపోయి ఉంటుంది. నిజానికి తన విషయంలో ఆ వైద్యుడి అభిప్రాయం తప్పేమీ కాదు కూడా? కాస్త నిద్రమత్తు తప్పిస్తే (అది కూడా ఇంత నిద్ర తర్వాత అర్థరహితమే) గ్రెగర్ బానే ఉన్నాడు, చాలా ఆకలిగా కూడా ఉంది.

మంచం మీంచి దిగేందుకు ఇంకా మనస్కరించక, అతను వేగంగా ఇదంతా ఆలోచిస్తుండగా – అలారం ఇక పావుతక్కువ ఏడును చూపించబోతోందనగా – తలగడ వైపున్న తలుపు దగ్గర, సంకోచంగా తడుతున్న చప్పుడు వినపడింది. ‘గ్రెగర్,’ అంది ఓ గొంతు – అది అతని తల్లి గొంతు – ‘పావుతక్కువ ఏడయిపోయిందిరా. రైలు అందుకోవా?’ ఎంత మార్దవమైన గొంతు! గ్రెగర్ దానికి బదులివ్వబోయిన వాడల్లా, తన గొంతు విని తానే తుళ్ళిపడ్డాడు; అది అవటానికి తన గొంతే కానీ, దాంతో పాటూ, అట్టడుగునుంచి, ఏదో కీచుమనే శబ్దం పెల్లుబుకుతోంది; దాని వల్ల అతని మాటలు క్షణం పాటు మాత్రమే స్పష్టంగా వినపడుతున్నాయి, మరుక్షణం ఎంతగా కలుషితమైపోతున్నాయంటే, అవతలి వాళ్ళకు తాము వింటున్నది అసలు మాటలేనా అన్న సందేహం కలిగి తీరుతుంది. గ్రెగర్ వివరంగా జవాబిద్దామనుకున్న వాడల్లా, ఇక చేసేది లేక, ‘ఇప్పుడే లేస్తున్నా అమ్మా,’ అని మాత్రం అనగలిగాడు. మధ్యలో చెక్క తలుపు వుండటం వల్ల గ్రెగర్ గొంతులోని మార్పు బయటికి తెలిసినట్టు లేదు, తల్లి ఈ మాటలకు సంతృప్తి చెంది వెళ్ళిపోయింది. కానీ ఈ క్లుప్త సంభాషణ కారణంగా ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ, తాము అనుకున్నట్టు గ్రెగర్ ఇంకా ఆఫీసుకు బయల్దేరలేదనీ, ఇంట్లోనే ఉన్నాడనీ అర్థమైంది, దాంతో అతని తండ్రి పక్కనున్న తలుపుల్లో ఒక దాన్ని నెమ్మదిగానే కానీ, పిడికిలితో తట్టసాగాడు. ‘గ్రెగర్, గ్రెగర్, ఏమైంది నీకు?’ అన్నాడు. కాసేపాగి, ఇంకాస్త కటువైన గొంతుతో, ‘గ్రెగర్! గ్రెగర్!’ అని మళ్ళీ పిలిచాడు. ఈలోగా రెండో పక్క తలుపు నుంచి అతని చెల్లాయి గొంతు మృదువుగా, జాలిగా వినిపించింది: ‘గ్రెగర్? వంట్లో బాలేదా? ఏమైనా కావాలా?’ అందామె. గ్రెగర్ ఇరు వైపులకూ ఒకేసారి, ‘నేను వస్తున్నాను,’ అంటూ జవాబిచ్చాడు, తన గొంతును మామూలుగా ధ్వనింపజేసేందుకు చాలా ప్రయాసతో ప్రతీ పదాన్నీ పట్టి పట్టి పలుకుతూ, పదాల మధ్య పెద్ద విరామాలిస్తూ మాట్లాడాడు. తండ్రి తిరిగి తన టిఫిన్ దగ్గరకు వెళ్ళిపోయాడు, చెల్లాయి మాత్రం గుస గుసగా, ‘తలుపు తీయి, గ్రెగర్, దయచేసి,’ అంది. కానీ గ్రెగర్‌కు ఆ ఉద్దేశం లేదు, అలా తలుపులు మూసి పడుకునే తన అలవాటును అభినందించుకున్నాడు కూడా, ట్రావెలింగ్ సేల్స్‌మెన్‌గా రాత్రుళ్ళు తలుపులన్నీ బిడాయించుకు పడుకోవటం అలవాటైంది, ఆఖరుకు అది తన ఇల్లయినా సరే.

మొదట నింపాదిగా లేవాలి, డ్రెస్ చేసుకోవాలి, అన్నింటికన్నా ముఖ్యంగా టిఫిన్ చేయాలి; అప్పుడు తర్వాతి సంగతి ఆలోచించాలి, అంతే తప్ప, ఊరకనే ఇలా మంచం మీద పడుకుని ఆలోచించటం వల్ల ప్రయోజనమేం లేదు. అతనికో సంగతి గుర్తొచ్చింది, ఇదివరకూ కూడా చాలాసార్లు నిద్రలో ఏదో ఇబ్బందిగా అనిపించేది, తీరా లేచి చూసేసరికి అదంతా సరైన భంగిమలో పడుకోకపోవటం వల్ల కలిగిన భ్రమగా తేలేది, పొద్దున్నే చుట్టుముట్టిన ఈ భ్రమలన్నీ క్రమంగా ఎలా తొలిగిపోనున్నాయో చూడాలని అతనికి చాలా కోరికగా ఉంది. ఇక తన గొంతులో వచ్చిన మార్పు బహుశా జలుబు చేస్తుందనటానికి ఒక సూచన మాత్రమే, అది ట్రావెలింగ్ సేల్స్‌మెన్లందరికీ ఎదురయ్యే ఇబ్బందే.

దుప్పటిని తప్పించటం సులువుగానే అయిపోయింది, కాస్త బోర విరుచుకోగానే అది కిందకు జారిపోయింది. తర్వాతే అసలు కష్టం మొదలైంది, దీనికి కారణం అతను బాగా వెడల్పుగా ఉండటమే. లేచి కూర్చోవాలంటే భుజాలూ చేతులూ కావాలి; కానీ అతనికి ఉన్నవల్లా బోలెడు కాళ్ళు మాత్రమే, అవి అంతూపొంతూ లేకుండా ఏవేవో కదలికల్ని ప్రదర్శిస్తున్నాయి, వాటిని అదుపు చేయలేకపోతున్నాడు. ఏ కాలునైతే వంచాలని అనుకున్నాడో, అదే అన్నింటి కన్నా ముందు నిటారుగా అయ్యేది; అతి కష్టం మీద ఆ కాలు చేత చేయించాలనుకున్నది చేయించగలిగినా, ఈలోగా మిగతా కాళ్ళన్నీ అదుపు తప్పి ఏదో బాధాకరమైన కలవరంతో అల్లల్లాడేవి. ‘మంచం మీద సోమరిగా పడుకోవటం వల్ల ప్రయోజనం లేదు,’ తనకు తాను చెప్పుకున్నాడు గ్రెగర్.

ముందు తన దిగువ భాగాన్ని మంచం మీంచి బయటకు నెట్టాలని ప్రయత్నించాడు, కానీ ఇప్పటిదాకా అతని కంటపడనిదీ, కనీసం ఊహకు కూడా సరిగా అందనిదీ అయిన ఈ దిగువ భాగాన్ని కదపటం చాలా కష్టమైంది; ఆ పని చాలా నెమ్మదిగా సాగింది; చివరికి, ఆరాటం కట్టలుతెంచుకోవటంతో, ఒక్కసారి బలమంతా కూడగట్టుకుని తనను తాను గుడ్డిగా ముందుకు నెట్టుకున్నాడు, కానీ దిశను తప్పుగా అంచనా వేశాడు, శరీరం మంచం కింది అంచుకు బలంగా గుద్దుకుంది; ప్రాణాలు జిల్లార్చుకుపోయినంత బాధ కలిగాకా గానీ అతనికి అర్థం కాలేదు, తన శరీరమంతటిలోనూ ఆ దిగువ భాగమే అత్యంత సున్నితమైన భాగమని.

దాంతో ఇపుడు ఎగువ భాగాన్ని బయట పడేయాలని ప్రయత్నించాడు, జాగ్రత్తగా తన తలను మంచం వారనున్న అంచు వైపు జరిపాడు. అది తేలిగ్గానే అయిపోయింది, దాంతో పాటే అతని మిగతా శరీరం కూడా, కాస్త వెడల్పుగా బరువుగా ఉన్నా కూడా, నెమ్మదిగా తల జరిగిన వైపుకే జరిగింది. అలా అంచెలంచెలుగా జరుపుకుంటూ వచ్చాడు. కాసేపటికి తల మంచం అంచు దాటి గాల్లో వేలాడేదాకా వచ్చింది, ఇక అంతకన్నా ముందుకు జరపాలంటే భయమేసింది, ఈ పద్ధతిలో గనక కిందపడితే, తలకు దెబ్బ తగలకుండా కాచుకోవటం చాలా కష్టం. ఏదేమైనా ఇప్పుడు మాత్రం స్పృహ కోల్పోకూడదు; అంతకన్నా ఎలా ఉన్నవాడు అలా మంచం మీదనే ఉండిపోవటం మంచిది.

మరోమారు ప్రయాసపడి, తిరిగి యథాస్థానానికి వచ్చి, ఆయాసంగా ఊపిరి తీసుకుంటూ, ఇందాకటి కన్నా తీవ్రంగా అల్లల్లాడుతున్న తన చిన్ని కాళ్ళను చూశాడు, వాటి అరాచకత్వాన్ని అదుపు చేసి క్రమశిక్షణలో పెట్టే మార్గమేమీ తోచలేదు, ఇక మంచం మీద ఉండటం తన వల్ల కాదనుకున్నాడు, దాన్నించి బయటపడటానికి ఎంతకు తెగించినా ఫర్లేదనిపించింది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కంగారుగా నిర్ణయాలు తీసుకోవటం కన్నా, స్థిరంగా నింపాదిగా ఆలోచించటం చాలా ముఖ్యమన్న సంగతి కూడా మర్చిపోకూడదు. ఇలా అనుకుంటూ కాసేపు తన చూపును నిశ్చలంగా కిటికీ మీదే నిలిపి ఉంచాడు, కానీ బయట కూడా అతణ్ణి ఉత్తేజపరిచే దృశ్యమేదీ కనిపించలేదు, అంతా తెల్లవారుఝాము పొగమంచు, అది కూడా ఎంత దట్టంగా ఉందంటే వీధి అవతలి భాగం కూడా కనిపించటం లేదు. ఈ లోగా అలారం మళ్ళీ కొట్టింది, ‘ఏడయిపోయింది, అయినా ఇంకా మంచు విడవలేదు,’ అనుకున్నాడు. తర్వాత కాసేపు కదలకుండా పడుకున్నాడు, శ్వాస నెమ్మదిగా తీసుకున్నాడు, అలాంటి సంపూర్ణ స్తబ్ధత మళ్ళీ తనను అలవాటైన, ఖచ్చితమైన వాస్తవికతలోకి తెచ్చిపడేస్తుందన్నది అతని ఆలోచన కావచ్చు.

మళ్ళీ వెంటనే అనుకున్నాడు: ‘ఏడుంపావు కాకుండానే నేను మంచం దిగి తీరాలి. ఆఫీసు ఏడింటికి తెరుస్తారు, ఆ లోగా ఆఫీసు నుంచి ఎవరో ఒకరు వివరం కనుక్కోవటానికి వచ్చే అవకాశం ఉంది.’ ఈ ఆలోచన రాగానే ఇక ఆలస్యం చేయకుండా, తన మొత్తం శరీరాన్ని పడవలా అటూ యిటూ ఊపుకుంటూ మంచం మీంచి కింద పడే సన్నాహాన్ని ప్రారంభించాడు. ఈ పద్ధతిలో కింద పడినపుడు, నేల తాకిన మరుక్షణం తలను పైకెత్తగలిగితే చాలు, దానికి దెబ్బ తగలకుండా కాపాడుకోవచ్చు. వీపు గురించేం భయపడనక్కర్లేదు, అది గట్టిగానే ఉన్నట్టుంది; పైగా కింద తివాచీ ఉంది కాబట్టి పెద్దగా దెబ్బేమీ తగలదు. ఇక ఆలోచించాల్సిందల్లా, కింద పడగానే అయ్యే చప్పుడు గురించే, దానివల్ల తన చుట్టూ ఉన్న తలుపుల కావల ఆందోళన పెంచిన వాడవుతాడు, కానీ ఆ పాటి రిస్కు తీసుకోక తప్పేట్టు లేదు.

గ్రెగర్ అప్పుడే మంచం మీంచి సగం బయటకు వేలాడుతున్నాడు. ఈ పద్ధతి ప్రయాసగా కన్నా ఒక ఆటలాగా ఉంది, తాను చేయాల్సిందల్లా అటూ ఇటూ ఊగటమే. కానీ ఎవరన్నా వచ్చి సాయపడితే ఇదంతా ఎంత సులభంగా అయిపోయేదో కదా అనిపించింది. ఇద్దరు బలంగా ఉన్న వ్యక్తులు – తండ్రీ, పనమ్మాయి చాలు – ఈ పనికి సరిపోతారు; వాళ్ళు చేయాల్సిందల్లా, తన వీపు కిందకు చేతులు దూర్చి, మంచం మీంచి గాల్లోకి పైకి లేపి, ఆ బరువుతో పాటూ తామూ వంగాలి, తర్వాత జాగ్రత్తగా తనని నేల మీద పల్టీ కొట్టేట్టు చేస్తే చాలు, అక్కడి దాకా వచ్చాకా, ఇక తన బక్కపల్చటి కాళ్ళు అక్కరకు వస్తాయనే ఆశ. కానీ ఇలా తలుపులన్నీ మూసి ఉండగా తను సాయానికి రమ్మని పిలిస్తే మాత్రం ఎవరు రాగలరు. తన తెలివితక్కువ ఆలోచనకు తనకే నవ్వొచ్చింది.

అతను అంచు దగ్గరికి వచ్చేశాడు, ఇంకొంచెం ఊగినా బాలన్సు నిలుపుకోవటం కష్టమయ్యేట్టుంది, ఏడుంపావు కావటానికి ఐదే నిముషాలుంది, కాబట్టి ఇక తాడో పేడో తేల్చుకోవటానికి సిద్ధమైపోయాడు – సరిగ్గా అప్పుడు ఎవరో బెల్లు మోగించిన చప్పుడైంది. అతను బిర్రబిగుసుకుపోయాడు, ‘ఆఫీసు నుంచి ఎవరో వచ్చారు,’ అనుకున్నాడు, అతని బక్క కాళ్లు వేగంగా కొట్టుకోసాగాయి. క్షణం పాటు అంతటా నిశ్శబ్దం ఆవరించింది. ఏదో వెర్రి ఆశతో ‘వాళ్ళు తలుపు తీయ’ర్లెమ్మంటూ తనను తాను సముదాయించుకున్నాడు. కానీ ఎప్పటిలాగే పనమ్మాయి దబదబా అడుగులేసుకుంటూ వెళ్ళి తలుపు తెరిచింది. గుమ్మం దగ్గర మాట వినపడగానే గ్రెగర్‌కు అర్థమైపోయింది: వచ్చింది ఎవరో కాదు, స్వయానా పెద్దగుమాస్తానే. చిన్న లోటుపాట్లు కూడా పెద్ద అనుమానాలకు తావిచ్చే ఇలాంటి ఆఫీసులో పని చేయటం తన ఖర్మ కాకపోతే మరేమిటి? వీళ్ళ దృష్టిలో ఉద్యోగులందరూ పనిదొంగల కిందే లెక్కా! తనలాంటివాడు ఒక్కడూ ఉండడా, నిజాయితీ నిబద్ధతలు కలవాడూ, ఒక ఉదయం గంటా రెండుగంటల ఆఫీసు సమయాన్ని వృథా చేసినందుకే మనస్సాక్షి చేత చిత్రవధకు గురై మతి భ్రమించి, చివరకు మంచం మీంచి లేవడమే కష్టమయ్యే పరిస్థితికి చేరుకునేవాడూ, అలాంటి వాడు ఒక్కడూ ఉండడా? విషయమేంటో కనుక్కురమ్మని అప్రెంటిసునో ఎవర్నో పంపితే చాలదా (నిజానికి అది కూడా అనవసరమే)? ఇంతోసి దానికి స్వయంగా పెద్దగుమాస్తానే కదిలి రావాలా, వచ్చి ఈ వ్యవహారం సాక్షాత్తూ పెద్దగుమాస్తా అంతటి వాడు మాత్రమే నిగ్గు తేల్చాల్సినంత గంభీరమైంది కామోసని తన అమాయకమైన కుటుంబం కంగారుపడేట్టు చేయాలా? గ్రెగర్ మొదట ఆచితూచి జరుగుదామనుకున్నవాడల్లా, ఈ ఆలోచనల వల్ల కలిగిన ఆందోళనతో, ఒక్క ఉదుటున తన్ను తాను మంచం మీంచి కింద పడేసుకున్నాడు. చప్పుడు కాకుండా తివాచీ కొంతవరకూ కాపాడింది, అదీగాక అతని వీపు కూడా మరీ గట్టిదేం కాదు, అందుకే మెల్లగా దబ్బుమన్న శబ్దం మాత్రం వచ్చింది. కానీ పడేటప్పుడు తన తల తగినంతగా పైకెత్తక పోవటం వల్ల, అది కింద కొట్టుకుంది; దాన్ని బాధగా చికాగ్గా మెలి తిప్పుకుంటూ తివాచీ కేసి రాసాడు.

‘లోపల ఏదో పడిన చప్పుడైంది,’ ఎడమవైపున్న గదిలో పెద్దగుమాస్తా అన్నాడు. ఇలాంటి పరిస్థితే ఎపుడన్నా పెద్దగుమాస్తాకు ఎదురైతే ఎలా ఉంటుందా అనిపించింది గ్రెగర్‌కు. ఈ ఆలోచనకు స్పందనగా అన్నట్టు, పక్క గదిలో పెద్దగుమాస్తా తోలు బూట్లు కిర్రుమనిపిస్తూ నడవటం వినిపించింది. గ్రెగర్‌కు కుడి వైపునున్న గది నుంచి చెల్లాయి అతణ్ణి కూడా ప్రస్తుత సన్నివేశంలోకి గుంజుతున్నట్టు గుసగుసగా అంది: ‘గ్రెగర్, పెద్దగుమాస్తా ఇక్కడే ఉన్నారు.’ ‘నాకు తెలుసు,’ గ్రెగర్ తనలో తాను అనుకున్నాడే గానీ చెల్లాయికి వినపడేట్టు గొంతు పెంచి మాట్లాడే ధైర్యం చేయలేకపోయాడు.

‘గ్రెగర్,’ తండ్రి ఎడమ వైపు గది నుంచి అన్నాడు, ‘పెద్దగుమాస్తా వచ్చారు, నువ్వు పొద్దున్న రైలుకి ఎందుకు రాలేదో కనుక్కోవాలనుకుంటున్నారు. మాకేం చెప్పాలో తెలియటం లేదు. ఆయన నీతో ముఖాముఖీ మాట్లాడతారట. కాబట్టి దయచేసి తలుపు తీయి. నీ గది కాస్త అశుభ్రంగా ఉన్నంత మాత్రాన ఆయనేం అనుకోరు.’ వెనక నుంచి పెద్దగుమాస్తా కూడా ‘గుడ్ మార్నింగ్, మిస్టర్ జమ్జా,’ అంటూ పలకరించాడు. తండ్రి అలా తలుపు దగ్గర మాట్లాడుతుండగా, తల్లి పెద్దగుమాస్తాతో, ‘వాడికి వంట్లో బాలేదు, నమ్మండి. లేకపోతే రైలు అందుకోకుండా ఎందుకు ఆగిపోతాడు? ఆ పిల్లాడు పని గురించి తప్ప వేరే ఏదీ ఆలోచించడు. నాకైతే వాడు అలా సాయంత్రాలు కూడా ఇంటి పట్టునే ఉండిపోవటం ఒక్కోసారి కోపం కూడా తెప్పిస్తుంది; వాడు గత వారమంతా ఊళ్ళోనే ఉన్నాడు, అయినా ప్రతీ సాయంత్రమూ ఇంట్లోనే గడిపాడు. ఇదే లివింగ్ రూమ్‌లో ఊరకనే కూర్చుని పేపర్ చదువుకోవటమో, లేదంటే తన రైల్వే టైమ్‌టేబిల్స్ చూసుకోవటమో చేస్తూంటాడు. ఆ ఫ్రేమ్‌లు తయారు చేయటమన్నది ఒక్కడే వాడు విశ్రాంతి కోసం చేసే వ్యాపకం. మొన్నో రెండు మూడు సాయంత్రాలు కూచుని ఒక చిన్న ఫోటో ఫ్రేమ్ తయారు చేశాడు; అదెంత అందంగా ఉందో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. వాడి గదిలోనే వేలాడుతోంది; గ్రెగర్ తలుపు తీయగానే చూద్దురుగాని. మీర్రావటం కూడా ఒకందుకు మంచిదే అనిపిస్తోంది. మా అంతట మేము వాడి చేత తలుపు తీయించలేకపోయేవాళ్ళం; చాలా మొండివాడు. పైగా ఏదో సుస్తీ చేసి ఉంటుంది; పొద్దున్న చెప్పటమైతే అలాంటిదేమీ లేదని చెప్పాడునుకోండి,’ అంటోంది. ‘నేను వస్తున్నా,’ గ్రెగర్ నెమ్మదిగా పట్టి పట్టి అన్నాడు, వాళ్ళ సంభాషణలో ఏ మాటా తప్పిపోకుండా వినాలని కట్టెలా కదలకుండా ఉండిపోయాడు. పెద్ద గుమాస్తా తల్లి మాటలకు జవాబుగా, ‘నాక్కూడా అది తప్ప వేరే కారణమేమీ తోచటం లేదండీ. మరీ పెద్ద ఇబ్బందేమీ కాబోదనే ఆశిద్దాం. కానీ ఒకటి మాత్రం చెప్పాలి, మంచికో చెడుకో, మాలాంటి వ్యాపారస్తులం అప్పుడప్పుడూ ఇలాంటి చిన్న చిన్న అనారోగ్యాల్ని దులిపేసుకుని పనిలో పడిపోక తప్పదు,’ అంటున్నాడు. తండ్రి అసహనంగా తలుపు తడుతూ, ‘పెద్దగుమాస్తా గారు లోపలికి రావచ్చా?’ అని అడిగాడు. ‘వద్దు,’ అన్నాడు గ్రెగర్. ఆ జవాబుతో ఎడమ వైపు గదిలో ఇబ్బందికరమైన నిశ్శబ్దం రాజ్యమేలింది; కుడి వైపు గదిలో చెల్లాయి వెక్కి వెక్కి ఏడ్వటం మొదలుపెట్టింది.

చెల్లాయి ఎందుకు అటు తిరిగి వచ్చి మిగిలిన వాళ్ళతో కలవటం లేదు? బహుశా ఆమె ఇప్పుడే నిద్ర లేచి ఉంటుంది, ఇంకా పడక దుస్తుల్లోనే ఉండుంటుంది. అయినా అసలెందుకు ఏడుస్తోంది? తానింకా లేవనందుకా, పెద్దగుమాస్తాని లోపలికి రానివ్వనందుకా, ఉద్యోగం పోగొట్టుకునే పరిస్థితిలో పడ్డాడనా, అలా జరిగితే ఆఫీసు యజమాని తన తల్లిదండ్రుల్ని పాత అప్పుల కోసం వేధిస్తాడనా? కానీ ఇప్పటికైతే అవన్నీ అనవసర భయాలే. గ్రెగర్ ఇంకా ఇక్కడే ఉన్నాడు, కుటుంబాన్ని గాలికొదిలేసే ఉద్దేశం అతనికేమీ లేదు. ఇపుడు అతని పరిస్థితేం బాలేక తివాచీ మీద వెల్లకిలా పడి ఉన్నాడన్నది నిజమే, ఈ సంగతి తెలిస్తే వాళ్ళు కూడా పెద్దగుమాస్తాని లోపలికి రానివ్వకూడదనే కోరుకునేవారు. కానీ ఇలాంటి చిన్నపాటి అమర్యాదకే – తాను తర్వాత సరైన సంజాయిషీ ఇచ్చుకోగల దానికే – తన ఉద్యోగం పోతుందన్నట్టు ఎందుకిలా కంగారుపడుతున్నారు? తననిలా కన్నీళ్ళతోనూ ప్రాధేయపడటాల్తోనూ ఇబ్బంది పెట్టడం మానేసి, కాసేపు మనశ్శాంతిగా వదిలేస్తే బాగుండుననిపించింది గ్రెగర్కిో. అయితే ఈ పరిస్థితి వాళ్ళనెంత కంగారు పెట్టి ఉంటుందో కూడా తాను ఊహించగలడు, వారి ప్రవర్తననూ అర్థం చేసుకోగలడు.

‘మిస్టర్ జమ్జా,’ పెద్దగుమాస్తా గొంతు పెంచుతూ అన్నాడు, ‘నీ పద్ధతేం బాలేదు. ఇలా గదిలో దాక్కుని, లోపలికి రావాలనుకునేవాళ్ళకి వద్దని పెడసరం సమాధానాలిస్తూ, నీ తల్లిదండ్రుల్ని చాలా కంగారు పెడుతున్నావు, అంతేగాక – మాట వచ్చింది గనక చెపుతున్నాను – నీ ఆఫీసు విధుల్ని కూడా నిర్లక్ష్యం చేస్తున్నావు. నేను ఇప్పుడు నీ తల్లిదండ్రుల తరపునే కాదు, మన యజమాని తరపున కూడా మాట్లాడుతున్నాను, నాకు తక్షణం ఒక స్పష్టమైన సంజాయిషీ కావాలి. ఆశ్చర్యమేస్తోంది, నిజంగా ఆశ్చర్యమేస్తోంది. నిన్ను నేనెప్పుడూ ఒక నెమ్మదస్తుడైన, పద్ధతి గల కుర్రాడనుకున్నాను, ఇప్పుడు ఉన్నట్టుండి ఇలా నీ వెర్రి చేష్టలన్నీ ప్రదర్శించటానికి ఎందుకు ఉబలాటపడుతున్నావో అర్థం కావటం లేదు. అప్పటికీ మన యజమాని నీ గైర్హాజరుకి ఒక కారణం ఏమై ఉండచ్చో ఊహించాడు – ఈ మధ్యే నీకు డబ్బులు వసూలు చేసే అధికారం అప్పగించబడింది కదా, దాని గురించి – కానీ అలాంటిదేం అయి ఉండదు లెమ్మంటూ నేను నీ తరపున మాట ఇచ్చేంత దాకా వెళ్ళాను. కానీ ఇప్పుడు నీ యీ మొండితనం చూస్తుంటే, నీ తరపున మాట్లాడలనే కోరికే చచ్చిపోతోంది. ఇంకోటేంటంటే, ఆఫీసులో నీ స్థానం మరీ అంత పదిలమేం కాదు. ఈ విషయం నిన్ను పక్కకు పిల్చి చెపుదామనుకున్నాను, కానీ నువ్వు నా సమయాన్నంతా ఇలా నిష్పలంగా వ్యర్థం చేస్తుంటే, ఇక నీ తల్లిదండ్రులు మాత్రం దీన్ని వింటే తప్పేముందనిపిస్తోంది. కాబట్టి చెప్తున్నాను, గత కొంత కాలంగా నీ పనితీరు చాలా పేలవంగా ఉంది; ఇది వ్యాపారం తక్కువ జరిగే సీజన్ అన్నది నిజమే, అది మేం అర్థం చేసుకోగలం, కానీ వ్యాపారం అస్సలు జరగని సీజన్ అంటే మాత్రం, మిస్టర్ జమ్జా, అలాంటిది ఉండదు, ఉంటానికి వీల్లేదు.’

ఈ మాటలతో గ్రెగర్‌‍ను గాభరా చుట్టుముట్టింది, తన పరిస్థితి ఏంటన్నది కూడా మర్చిపోయాడు: ‘కానీ సర్, నేను ఇప్పుడే, ఇంకొక్క క్షణంలో తలుపు తెరుస్తాను. కాస్త అనారోగ్యం అంతే, తల తిప్పడం వల్ల లేవలేకపోయాను. ఇంకా మంచం మీదే పడుకుని ఉన్నాను. కానీ ఇప్పుడు అంతా సర్దుకుంది. ఇప్పుడే మంచం మీంచి లేస్తున్నాను. ఒక్క అర క్షణం ఓపిక పట్టండి! అనుకున్నంత బాగా ఏం లేదు నా పరిస్థితి. ఇలాంటి అనారోగ్యాలు ఎంత హఠాత్తుగా మనల్ని చుట్టుముడతాయో కదా! నిన్నటికి నిన్న కూడా అంతా బానే ఉంది, నా తల్లిదండ్రుల్ని అడగండి వాళ్ళే చెప్తారు, ఉంటే గింటే ఏదో కొద్దిగా శంకలా అనిపించిందేమో. ఏవో లక్షణాలు కనపడే ఉంటాయి. అపుడే నేను ఆఫీసుకు తెలియజేసి ఉంటే పోయేదేమో! కానీ ఇలాంటి చిన్న చిన్న సుస్తీలు వచ్చిపోతాయనుకుంటాం గానీ, మనల్నిలా ఇంటి దగ్గరే కట్టిపడేస్తాయని ఊహించం కదా సర్! దయచేసి మా తల్లిదండ్రుల గురించి కొద్దిగా ఆలోచించండి! మీరు చేస్తున్న ఆరోపణలకి ఏ ఆధారం లేదు; అలాంటివి ఇదివరకెన్నడూ నా దగ్గర మాటమాత్రంగానైనా ప్రస్తావనకు రాలేదు. బహుశా నేను పంపించిన చివరి విడత ఆర్డర్లు ఇంకా మీ కంటపడుండవు. పోన్లెండి అదలా ఉంచండి, నేను ఇదిగో ఇపుడే ఎనిమిదింటి రైలుకి బయల్దేరి పోతాను; ఈ కాసేపూ విశ్రాంతి తీసుకోవటం వల్ల కాస్త తేరుకున్నాను. నా కారణంగా మీరు ఇక్కడ ఆగిపోవద్దు సర్; కన్నుమూసి తెరిచేలోగా ఆఫీసు ఆవరణలో ఉంటాను, దయచేసి ఈ సంగతి నా మాటగా యజమానికి తెలియజేయండి, నా తరపున క్షమాపణల్ని స్వీకరించమని చెప్పండి!’

తానేం మాట్లాడుతున్నాడో తనకే తెలియకుండా, ఇదంతా ఆదరాబాదరాగా వెళ్ళగక్కేస్తూ, బహుశా ఇందాక మంచం మీద చేసిన సాధన వల్ల కాబోలు, గ్రెగర్ చాలా సులభంగా బీరువా దాకా చేరగలిగాడు, దానికి ఆనుకుని తన్ను తాను నిటారుగా పైకి నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నాడు. అతను నిజంగా తలుపు తీయాలనే అనుకున్నాడు, పెద్ద గుమాస్తా ఎదుటపడి మాట్లాడాలనే అనుకున్నాడు; తన సమక్షానికై ఇంతగా ఆరాటపడుతున్న వీళ్ళంతా ఒకసారి తాను ఎదుటపడ్డాకా ఏమంటారో తెలుసుకోవాలన్న ఆత్రం అతనిలో ఉంది. ఒకవేళ వాళ్ళు భయపడితే, ఇక తాను చేయగలిగిందేమీ లేదు, వచ్చి ప్రశాంతంగా పడుకోవచ్చు. అలాక్కాక వాళ్ళు దీన్నంతా మామూలుగా తీసుకున్నా కూడా, అతను పెద్ద కంగారు పడక్కర్లేదు, కొద్దిగా త్వరపడితే ఎనిమిదింటికల్లా స్టేషన్ చేరుకోగలడు. బీరువా నున్నగా ఉండటం వల్ల పదే పదే కిందకు జారిపోయాడు, కానీ చివరకు మొండితనం తెచ్చుకుని ఒక్క ఉదుటున పైకి లేచి, నిటారుగా నిలబడ్డాడు; దిగువ భాగాలు తీవ్రంగా సలుపుతున్నాయి, కానీ ఆ బాధను లక్ష్యపెట్టడం మానేశాడు. ఇప్పుడు నెమ్మదిగా ఒక కుర్చీ వెన్ను మీదకు జారాడు, తన బక్క కాళ్ళతో దాని అంచుల్ని ఒడిసిపట్టాడు. ఇలా తనను తాను అదుపులోకి తెచ్చుకున్నాక, కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాడు; ఇప్పుడు అతనికి పెద్దగుమాస్తా మాటలు వినపడుతున్నాయి.

‘అందులో ఒక్క ముక్కన్నా అర్థమైందా? మనల్నేం వెర్రి వెధవల్ని చేయటానికి ప్రయత్నించటం లేదు కదా?’ పెద్దగుమాస్తా తల్లిదండ్రులతో అంటున్నాడు. తల్లి అప్పటికే కన్నీళ్ళతో ఉన్నట్టుంది, ‘అయ్యో దేవుడా, అక్కడ వాడి పరిస్థితేం బాగుండి ఉండదు, ఇక్కడ మనమేమో వాణ్ణింకా బాధపెడుతున్నాం. గ్రెటె! గ్రెటె!’ ఆవిడ అరిచింది. ‘ఏమ్మా?’ చెల్లాయి రెండో వైపు నుంచి పలికింది. వాళ్ళిద్దరూ గ్రెగర్ గది మీదుగా మాట్లాడుకుంటున్నారు. ‘నువ్వు వెంటనే వైద్యుణ్ణి పిలుచుకురావాలి. గ్రెగర్ వంట్లో బాలేదు. పరిగెత్తు, వెంటనే. విన్నావుగా గ్రెగర్ మాటలు ఎలా ఉన్నాయో?’ అందావిడ. ‘ఏదో జంతువు మాట్లాడినట్టు ఉంది,’ అన్నాడు పెద్దగుమాస్తా, బిగ్గరగా మాట్లాడుతున్న తల్లి గొంతుతో పోలిస్తే అతని గొంతు చాలా నెమ్మదిగా ఉంది. తండ్రి హాల్లోంచి వంటగది వైపు చప్పట్లు చరుస్తూ, ‘అన్నా! అన్నా!’ అంటూ పనమ్మాయిని పిలిచి, ‘వెంటనే వెళ్ళి తాళాలు బద్దలగొట్టేవాణ్ణి పిలుచుకురా!’ అన్నాడు. అప్పటికే ఇద్దరమ్మాయిలూ స్కర్టులు రాసుకుంటున్న చప్పుడుతో హాల్లోంచి పరిగెడుతున్నారు – చెల్లాయి ఇంత త్వరగా ఎలా బట్టలు వేసుకోగలిగిందో? – ఫ్రంట్ డోరు విసురుగా తెరిచారు. ఆ తలుపును మళ్ళీ మూసిన శబ్దమేమీ వినపడలేదు; బహుశా దాన్ని తెరిచే వదిలేశారు కాబోలు, ఏదో పెద్ద విపత్తు సంభవించిన ఇళ్ళల్లోనే అలా జరుగుతుంది.

గ్రెగర్కి  ఇప్పుడు కాస్త స్థిమితంగా అనిపించింది. అతను మాట్లాడిన మాటల్లో కొంచెం కూడా స్పష్టత లేదు (అతనికి మాత్రం స్పష్టంగానే అర్థం అవుతున్నాయి, బహుశా అతని చెవి వాటికి అలవాటు పడటం వల్ల కాబోలు, ఇదివరకటి కన్నా కూడా స్పష్టంగా అర్థం అవుతున్నాయి), కానీ కనీసం అతనికేదో అయిందన్న సంగతైనా అవతలి వాళ్ళకు అర్థమైంది, సాయం చేయటానికి సిద్ధమవుతున్నారు. ఆ దిశగా జారీ అయిన తొలి ఆదేశాల్లో ధ్వనించిన ధీమా అతనికి ఊరట కలిగించింది. తాను మళ్ళీ మానవ సమూహంలో భాగం కాబోతున్నట్టు అనిపించింది, వైద్యుణ్ణించీ తాళాలు బద్దలుగొట్టేవాణ్ణించీ – వాళ్ళిద్దరి మధ్యా పెద్ద తేడా లేనట్టే – గొప్ప గొప్ప ఫలితాల్ని ఊహించాడు. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఉంది గనుక అందుకోసం తన గొంతు సిద్ధం చేసుకుంటూ చిన్నగా దగ్గాడు, ఆ దగ్గిన చప్పుడు గట్టిగా రాకుండా జాగ్రత్త పడ్డాడు, తన దగ్గు కూడా ఇక మనిషి దగ్గులా ఉండదేమోనని అతని భయం, ఈ విషయంలో తన జడ్జిమెంటుని తానే నమ్మటం మానేశాడు. ఈలోగా పక్క గదిలో పూర్తి నిశ్శబ్దం ఆవరించింది. బహుశా తల్లిదండ్రులు పెద్దగుమాస్తాతో కలిసి టేబిల్ దగ్గర కూర్చుని తనకు వినపడకుండా మాట్లాడుకుంటున్నారేమో, లేదా అందరూ కలిసి తన తలుపు దగ్గర గుమికూడి నిశ్శబ్దంగా వింటున్నా వింటూండచ్చు.

గ్రెగర్ కుర్చీ వెన్ను మీద అలాగే ఆనుకుని, దాన్ని ముందుకు నెడుతూ దానితో పాటూ తాను కూడా తలుపు దాకా వచ్చాడు, అక్కడకు చేరాకా కుర్చీని వదిలి వచ్చి తలుపు మీద పడ్డాడు, కాసేపు తంటాలు పడి నిటారుగా నిలబడ్డాడు – అతని కాలి అంచుల్లోని మెత్తలకు అంటుకునే గుణం ఉండటం అతనికి కలిసొచ్చింది – నిలబడ్డాక కాసేపు ప్రయత్నాలకు విరామమిచ్చాడు. తర్వాత నెమ్మదిగా తన నోటిని వాడుతూ తాళాన్ని తిప్పటానికి ప్రయత్నించాడు. కానీ అతనికి నోట్లో పళ్ళు లేవు – మరి తాళాన్ని దేంతో పట్టుకోవాలి? – ఈ లోటు తీర్చటానికే అన్నట్టు అతని దవడలు మాత్రం చాలా దృఢంగా ఉన్నాయని ఋజువైంది; వాటి సాయంతో మెల్లగా తాళాన్ని కదపగలిగాడు, ఈ ప్రయత్నం వల్ల తనకు కలుగుతున్న నష్టం కూడా పట్టించుకోవటం లేదు, అతని నోటి నుంచి ఒక గోధుమరంగు ద్రావకం కారుతోంది, తాళాన్ని తడుపుతూ నేలకి జారుతోంది. ‘అదిగో వినండి, తాళం తిప్పుతున్నాడు,’ బయట పెద్దగుమాస్తా అన్నాడు. ఇది గ్రెగర్‌కి చాలా ఉత్సాహాన్ని కలగజేసింది; నిజానికి తల్లిదండ్రులతో సహా వాళ్ళంతా కూడా చప్పట్లూ కేరింతలతో తనను ప్రోత్సహించాలి: ‘రా గ్రెగర్, రా! తిప్పు తాళం, తిప్పు!’ అని అరవాలి. బయట అందరూ తన ప్రయత్నాల్ని ఊపిరి సలపని ఉత్కంఠతో చూస్తున్నట్టు ఊహించుకుంటూ, అతను శక్తి నంతా కూడదీసుకుని దవడల్ని తాళం చుట్టూ బిగించాడు. తిరుగుతున్న తాళంతో పాటూ తానూ చుట్టూ కదలసాగాడు; కాసేపు దాన్ని తన నోటి సాయంతో పైకి గెంటుతున్నాడు, మళ్ళీ ఇంకాసేపు, తన శరీరం బరువంతా దానికి వేలాడేసి కిందకు గుంజుతున్నాడు. ఎట్టకేలకు క్లిక్ మన్న చప్పుడుతో తాళం తిరిగింది, అతనికి ఈ ప్రయాస నుంచి విముక్తి లభించింది. ఊరటగా నిట్టూర్చి, ‘తాళం బద్దలుగొట్టే వాడి అవసరం లేదిక!’ అని అనుకున్నాడు.

తలుపు తెరవటానికి అతను పాటించిన పద్ధతి వల్ల, తలుపు పూర్తిగా తెరుచుకునేదాకా అతను ఎవరికీ కనిపించే అవకాశం లేకపోయింది. మొదట తలుపుకి ఒక వైపునున్న రెక్క పట్టుకుని దాంతో పాటూ వెనక్కు జరుక్కుంటూ రావాలి, ఇలా చేయటంలో ఏ మాత్రం పట్టు తప్పినా గుమ్మం వారనే వెల్లకిలా పడిపోయే ప్రమాదం ఉంది. ఎవర్నీ పట్టించుకునే తీరిక లేకుండా అతను ఈ కష్టమైన కసరత్తులో మునిగి ఉండగా, పెద్దగుమాస్తా నోటి వెంబడి ‘ఓహ్’ అంటూ గాలి వదిలిన శబ్దం వినపడింది. ఇప్పుడు గ్రెగర్ కూడా అతణ్ణి చూడగలుగుతున్నాడు, అతను ఇప్పటిదాకా తలుపు దగ్గరే నిలబడినట్టున్నాడు, ఇప్పుడు తన చేతిని నోటికి అడ్డంగా పెట్టుకుని ఏదో అదృశ్యశక్తి తనను నిర్విరామంగా వెనక్కు నెడుతున్నట్టు ఒక్కొక్క అడుగే వెనక్కు జరుగుతున్నాడు. గ్రెగర్ తల్లి మొదట తండ్రిని గట్టిగా పట్టేసుకుంది, తర్వాత గ్రెగర్ వైపుగా రెండు అడుగులు వేసింది, క్రమంగా నేల మీదకు వాలిపోయింది, చుట్టూ ఆవిడ స్కర్టు గుండ్రంగా ఉబ్బి నెమ్మదిగా అణగారింది, ఆవిడ ముఖం రొమ్ముల్లోకి కుంగిపోయి కనపడటం లేదు. తండ్రి గ్రెగర్‌ను తిరిగి గదిలోకి తరిమేయదల్చుకున్నట్టు బెదిరింపుగా పిడికిలి బిగించాడు, తర్వాత ఏం చేయాలో పాలుపోనట్టు అయోమయంగా లివింగ్ రూమంతా కలయజూశాడు, వెంటనే అరచేతుల్తో కళ్ళు కప్పేసుకుని తన భారీ ఛాతీ ఊగిపోయేలా వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టాడు.

గ్రెగర్ ఆ గదిలోకి వెంటనే రాలేదు, తలుపు రెండో రెక్క గట్టిగా బోల్టు వేసి ఉంటే దానికి ఆనుకున్నాడు, ఇప్పుడు అతని శరీరం అర్ధభాగం మాత్రమే కనపడుతోంది, పైన తల ఒక వైపుకు వాలి ఉంది, దానితో అందరి వైపూ ఓరగా తొంగి చూస్తున్నాడు. బయట వాతావరణంలో ఇప్పుడు కాస్త వెలుగొచ్చినట్టుంది; వీధవతల ఒక పొడవాటి బూడిద రంగు భవనంలో కొంత భాగం కనిపిస్తోంది – అది ఒక ఆసుపత్రి – దానికి వరుస కిటికీలున్నాయి; వాన ఇంకా పడుతూనే ఉంది, ఇందాకటి కన్నా పెద్ద చినుకుల్తో పడుతోంది, చూట్టానికి ఎవరో ఒక్కొక్క చినుకునూ పట్టుకుని భూమ్మీదకు గిరవాటేస్తున్నట్టున్నాయి. టేబిల్ మీద టిఫిన్ దండిగా వడ్డించి ఉంది, తండ్రికి రోజులో టిఫినే ప్రధాన ఆహారం, కాబట్టి గంటల కొద్దీ దాని ముందు కూర్చుని అన్ని న్యూస్ పేపర్లూ చదువుతూ నెమ్మదిగా తింటాడు. ఎదుట గోడకి ఒక ఫోటో వేలాడుతోంది, అది గ్రెగర్ సైన్యంలో పని చేసినప్పటిది, అందులో అతను లెఫ్టినెంట్ హోదాలో, కత్తి పిడిపై చేయి వేసి, లెక్కలేనట్టు నవ్వుతూ, తన యూనిఫాంకూ, సైనిక ఠీవికీ దక్కాల్సిన గౌరవాన్ని తనకిమ్మన్నట్టు నిల్చున్నాడు. హాల్లోకి వెళ్ళే తలుపు తెరిచి ఉంది, ఫ్రంట్ డోరు కూడా తెరిచే ఉండటంతో, ఇక్కణ్ణించే బయట లాండింగూ, మెట్ల పైభాగమూ కనపడుతున్నాయి.

గ్రెగర్ నోరు విప్పాడు – అతనికి తెలుసు ప్రస్తుతం అక్కడ నిబ్బరంగా ఉన్నది తానొక్కడే అని – ‘సరేనా, నేను ఇప్పుడే రెడీ అయి, నా శాంపిల్సు తీసుకుని బయల్దేరిపోతాను. మీరు నన్నిక వదులుతారా? నేనేం మరీ అంత మొండిఘటాన్ని కాదనీ, నాకు నా పని అంటే చాలా ఇష్టమనీ మీకూ తెలుసు కదా సార్; రోజూ ప్రయాణాలు తప్పని ఈ ఉద్యోగం కాస్త కష్టమే, కానీ అది లేకుండా నన్ను నేను ఊహించుకోలేను. ఎక్కడికి సార్ వెళ్తున్నారు? మళ్ళీ ఆఫీసుకు వెళ్తున్నారా? అంతే కదూ? ఇక్కడ పరిస్థితి ఉన్నదున్నట్టు చెప్తారు కదూ? ఒక వ్యక్తి తాత్కాలికంగా పని చేయలేని పరిస్థితిలో పడినంత మాత్రాన, అతను ఇదివరకూ ఎంత పనిమంతుడో మర్చిపోకూడదు కదా, ఆ కష్టమేదో దాటిపోయాకా అతను అంతకుముందు కన్నా చలాకీగా చురుకుగా పని చేసి తీరతాడని నమ్మకపోతే ఎలా. మన ఆఫీసు యజమానికి నేను చాలా బాకీ ఉన్నానని మీకూ తెలుసు. మరోపక్క నాకు నా తల్లిదండ్రుల పట్లా, చెల్లాయి పట్లా నెరవేర్చాల్సిన బాధ్యతలున్నాయి. నేను చాలా ఇరకాటంలో ఉన్నాను, కానీ ఎలాగోలా బయటపడతానన్న ఆశ ఉంది. ఈలోగా మీరు పరిస్థితుల్ని మరింత కనాకష్టం చేయొద్దు. దయచేసి ఆఫీసులో నా తరపున మాట్లాడండి! ట్రావెలింగ్ సేల్స్‌మెన్లంటే ఎవరికీ సానుభూతి ఉండదు, నాకు తెలుసు. వాళ్ళేదో మూటల కొద్దీ డబ్బు కూడబెట్టి విలాసంగా బతుకుతారని అంతా అనుకుంటారు. ఈ తప్పుడు అభిప్రాయాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఎవరికీ లేకపోవటంతో అదలా చెల్లుబాటైపోతోంది. కానీ మిగతా సిబ్బంది మాట ఎలా ఉన్నా, మీకు ఈ విషయాలపై మంచి అవగాహన ఉంది, నిజానికి – మనలో మన మాటగా చెప్తున్నాను – మన యజమాని కన్నా మంచి అవగాహన ఉంది, ఆయన ఎంత లేదన్నా యజమాని కాబట్టి, తన ఉద్యోగుల్లో కొందరి పట్ల తప్పుడు అభిప్రాయమున్నా చెల్లిపోతుంది. మీరుమాత్రం అలాక్కాదు, మీకు అంతా తెలుసు, ట్రావెలింగ్ సేల్స్‌మెన్ ఏడాది పొడుగునా ఆఫీసు ఆవరణలో లేకుండా బయటే తిరుగుతుంటాడు గనుక, కిట్టనివాళ్ళు అతనిపై నిరాధారమైన ఫిర్యాదులు చేయటం, అపనిందలు మోపటం చాలా సులువు, అతను వాటిని అరికట్టలేడు, ఎందుకంటే చాలా వరకూ అవి ఉన్నాయన్న సంగతే అతనికి తెలియదు, ఎప్పుడో ఏదో ప్రయాణాన్ని ముగించుకుని అలసటగా తిరిగి వచ్చాకనే వాటి పర్యవసానాలు అతనికి ఎదురవుతాయి, ఇక అప్పటికి అవి ఎక్కణ్ణించి పుట్టుకొచ్చాయో తెలుసుకోవాలన్నా తెలుసుకోలేడు. సార్, అలా వెళ్ళిపోకండి, నా మాటల్లో కొంతైనా నిజం ఉందని మీరు నమ్ముతున్నారని ఏదో ఒక మాట ద్వారా చెప్పకుండా దయచేసి అలా వెళ్ళిపోకండి!’

కానీ గ్రెగర్ మాట్లాడటం మొదలుపెట్టాడో లేదో పెద్దగుమాస్తా వీపు చూపిస్తూ అటు తిరిగిపోయాడు, నోరు బార్లా తెరిచి, వణుకుతున్న భుజాల మీదుగా గ్రెగర్ వైపు అలాగే చూస్తూండిపోయాడు. గ్రెగర్ మాట్లాడుతున్నంత సేపూ అతను స్థిరంగా లేడు, గ్రెగర్ మీంచి కళ్ళు తప్పిపోనివ్వకుండా తలుపు వైపు వెళ్ళటం మొదలుపెట్టాడు, కానీ, తాను ఈ గది వదిలి వెళ్ళటం ద్వారా ఏవో అదృశ్య ఆదేశాల్ని ధిక్కరిస్తున్నట్టు, చాలా నెమ్మదిగా వెళ్ళాడు. గడప దాకా చేరుకున్నాక, ఏదో ముల్లు దిగినవాడిలా చప్పున కాలెత్తి లివింగ్ రూము నుంచి హాల్లోకి అడుగుపెట్టాడు. ఒకసారి హాల్లోకి చేరుకోగానే, బయట అలౌకిక మోక్షమేదో తనకు అందుబాటులో ఉన్నట్టుగా, చేతుల్ని సాగినంట దూరం మెట్ల వైపు చాపాడు.

గ్రెగర్‌కి ఒకటే అర్థమైంది, ఆఫీసులో తన స్థానం గల్లంతవకుండా ఉండాలంటే, పెద్దగుమాస్తాను ఇలాంటి అభిప్రాయంతో బయటకు వెళ్ళనివ్వకూడదు. తల్లిదండ్రులు ఇదంతా అర్థం చేసుకునే స్థితిలో లేరు; వాళ్ళు గత కొన్నేళ్ళుగా గ్రెగర్ ఆఫీసులో అతని స్థానానికి ఢోకా లేదన్న నమ్మకానికి వచ్చేశారు, పైగా తమ ముందున్న తక్షణ సమస్యలో పడి ప్రస్తుతం భవిష్యత్తు ఆలోచించే శక్తి కోల్పోయారు. కానీ గ్రెగర్‌కి ఆ శక్తి ఇంకా ఉంది. పెద్దగుమాస్తాని ఆపాలి, సముదాయించాలి, బుజ్జగించాలి, ఎలాగైనా బుట్టలో పడేయాలి; కుటుంబ భవిష్యత్తంతా దాని మీదే ఆధారపడి ఉంది! చెల్లాయి ఇక్కడ ఉండుంటే బాగుండేది! ఆమె పరిస్థితిని అర్థం చేసుకోగలదు; ఇందాక గ్రెగర్ ఇంకా తన గదిలో ఉలుకూపలుకూ లేకుండా పడి ఉండగానే, ఆమె అంతా గ్రహించిన దానిలా కన్నీరు పెట్టుకుంది. పైగా పెద్దగుమాస్తా కాస్త స్త్రీ పక్షపాతి కావటం మూలాన ఖచ్చితంగా ఆమె మాట వినేవాడు; ఆమె ఉండుంటే ఈ పాటికి ఫ్రంట్ డోరు మూసేసి, పెద్దగుమాస్తాని లోపలికి రప్పించి అతని భయం తొలిగేలా సముదాయించేది. కానీ ఇప్పుడామె లేదు, ఏం చేసినా గ్రెగరే చేయాలి. ఇలా అనుకోవటం ఆలస్యం, తన గమనశక్తి ఎలాంటిదో తనకింకా తెలియదన్న సంగతి మర్చిపోయి, అసలు తాను ఇప్పటి దాకా మాట్లాడిందంతా ఎవరికీ అర్థం కాకపోయి ఉండవచ్చన్నది కూడా పట్టించుకోకుండా, తలుపుని వదిలిపెట్టి, మిగిలిన గుమ్మం ఖాళీలోంచి బయటకు దూరాడు; అప్పటికే మెట్ల లాండింగ్ దగ్గర రెయిలింగ్‌ను ఆత్రంగా రెండు చేతుల్తోనూ పట్టుకోవటానికి ప్రయత్నిస్తున్న పెద్దగుమాస్తా వైపు వెళ్ళాలన్నది అతని ఉద్దేశం; కానీ అటువైపు అడుగు వేయబోయిన మరుక్షణం గాల్లో ఆసరా కోసం అల్లల్లాడుతూ, చిన్నగా కేక పెట్టి, తన అనేకమైన కాళ్ళ పై పడ్డాడు. అలా పడ్డాడో లేదో, తన శరీరానికి ఈ ఉదయం నుంచీ ఎప్పుడూ లేనంత సౌకర్యం లభించినట్టయింది; ఇపుడు అతని అన్ని కాళ్ళ కిందా నికరమైన ఆధారం ఉంది; అవి తాను ఎలా చెప్తే అలా నడుచుకోవటం చూసి సంతోషించాడు; ఎటు కావాలంటే అటు తనను తీసుకు వెళ్ళటానికి అవి తెగ ఉబలాటపడుతున్నాయి; ఇక తన కష్టాలన్నీ ఓ కొలిక్కి వచ్చేశాయన్నంత ధీమా కలిగింది. కదలాలన్న ఆత్రాన్ని ఉగ్గబట్టుకున్న అతని శరీరం సన్నగా కంపిస్తోంది, అదే సమయంలో, అతనికి దగ్గరగా, సరిగ్గా ఎదురుగా ఉన్న తల్లి – అప్పటి దాకా పరధ్యానంలో ఉన్నదల్లా – ఉన్నట్టుండి పైకి లేచింది, చేతులు బారజాచి, వేళ్ళు విప్పార్చి, ఒక్కపెట్టున, ‘ఎవరైనా కాపాడండి, నన్ను కాపాడండి!’ అంటూ అరిచింది; గ్రెగర్‌ని మరింత స్పష్టంగా చూడటానికన్నట్టు కొంగలా మెడ ముందుకి చాస్తూనే, అతనికి దూరంగా వెనక్కు నడవసాగింది; తన వెనక టిఫిన్ వడ్డించిన టేబిల్ ఉందన్న సంగతి మర్చిపోయింది; కంగారులో దాన్ని గుద్దుకుంది; టేబిల్ మీద ఒక పెద్ద కాఫీ గిన్నె బోర్లా పడి అందులోని ద్రవమంతా వలికి ఎడతెగని పాయగా కింద తివాచీ మీదకు కారుతోంది, అయినా ఆవిడ దాన్ని గమనించలేదు.

‘అమ్మా,’ మృదువుగా పిలుస్తూ ఆవిడ వైపు చూశాడు గ్రెగర్. తాత్కాలికంగా పెద్దగుమాస్తా అతని ఆలోచనల్లోంచి తప్పుకున్నాడు; మరోపక్క కారుతున్న కాఫీని చూస్తూ తన దవడల్ని టకటకలాడించకుండా ఉండలేకపోయాడు. అది చూసి తల్లి మరో కేక పెట్టి టేబిల్ మీంచి లేచింది, ఆవిడ వైపే వస్తున్న తండ్రి చేతుల్లో గువ్వలా ఒదిగిపోయింది. కానీ గ్రెగర్‌కి తల్లిదండ్రుల్ని పట్టించుకునేంత తీరిక లేదు; పెద్దగుమాస్తా అప్పుడే మెట్ల మీదకు వెళ్ళిపోయాడు; తన చుబుకాన్ని రెయిలింగ్ మీద ఆన్చి చివరగా ఒకసారి తొంగి చూస్తున్నాడు. అతణ్ణి అందుకోవాలని గ్రెగర్ ముందుకు పరిగెత్తాడు; పెద్దగుమాస్తా ఇది ముందే ఊహించినట్టున్నాడు, పెద్ద పెద్ద అంగలతో బోలెడు మెట్లు ఒకే సారి దూకేస్తూ పారిపోయాడు; అతని అరుపులు ఇంకా స్టెయిర్ కేసంతా మార్మోగుతూనే ఉన్నాయి. అప్పటిదాకా తక్కిన వాళ్ళతో పోలిస్తే కాస్త నిబ్బరంగానే ఉన్న తండ్రి, ఇప్పుడు పెద్దగుమాస్తా పారిపోవటం చూసి అయోమయానికి గురైనట్టున్నాడు, ఆ అయోమయంలో పెద్దగుమాస్తాను ఆపాలన్న సంగతి మర్చిపోయి, ఆ ప్రయత్నంలోనే ఉన్న గ్రెగర్‌కు సాయపడ్డం మానేసి, ఆయన తన కుడి చేత్తో పెద్దగుమాస్తా తాలూకు ఊతకర్రని అందుకున్నాడు, (పెద్దగుమాస్తా దాంతో పాటూ తన టోపీనీ, ఓవర్‌‍కోటునీ కూడా అక్కడే కుర్చీ మీద వదిలేశాడు), ఎడం చేత్తో టేబిల్ మీదున్న పెద్ద న్యూస్‌పేపర్‌ని అందుకున్నాడు, వాటిని గాల్లో ఆడిస్తూ, కాళ్ళను నేల మీద తాటిస్తూ, గ్రెగర్‌ని తిరిగి తన గదిలోకి తరిమేయటానికి ప్రయత్నించాడు. గ్రెగర్ ఎంత వేడుకొన్నా లాభం లేకపోయింది, అసలు ఆ వేడికోళ్ళు ఆయనకి అర్థం కాలేదు కూడా; గ్రెగర్ అణకువని సూచిస్తూ తన తల అటూయిటూ ఎంత వంచినా, తండ్రి అంతకంతకూ గట్టిగా నేల మీద కాళ్ళు తాటిస్తూనే ఉన్నాడు. తల్లి గదికి ఆవలి వైపునున్న కిటికీని దభాల్న తెరిచి, చలి వాతావరణాన్ని సైతం లెక్క చేయకుండా, తలని చేతుల్తో గట్టిగా పట్టుకుని బయటపెట్టింది. మెట్ల మీదుగా వీధిలోని బలమైన ఈదురు గాలి లోపలికి వీచింది, కర్టెన్లు ఉబ్బెత్తుగా పైకి లేచాయి, టేబిల్ మీద న్యూస్‌పేపర్లు ఒకదాన్నొకటి రాసుకున్నాయి, పేజీలు విడిపోయి నేల మీద పడి రెపరెపలాడాయి. తండ్రి ఏ మాత్రం నెమ్మదించటం లేదు, అడవి మనిషిలా ఏవో బుసకొడుతున్నట్టు చప్పుళ్ళు చేస్తూ, అతణ్ణి వెనక్కి తరుముతూనే ఉన్నాడు. కానీ గ్రెగర్‌కు ఇంకా వెనక్కు నడిచే పద్ధతి అంతగా పట్టుబడలేదు, దాంతో చాలా నెమ్మదిగా కదులుతున్నాడు. అటు వైపు తిరిగి ముందుకి నడిచే అవకాశం దొరికితే క్షణంలో తన గదిలో ఉండేవాడు, కానీ అలా అటు వైపు తిరిగే లోగా, తండ్రి సహనం మరింత నశించే ప్రమాదం ఉంది, ఇప్పటికే ఆయన ఏ క్షణాన్నైనా కర్రతో గ్రెగర్ తల మీదో, వీపు మీదో దెబ్బ వేసేలా ఉన్నాడు. కానీ చివరకు గ్రెగర్‌కి మార్గాంతరం లేకపోయింది, ఈ కంగారులో వెనక్కు వెళ్ళాల్సిన దిశను అదుపులో ఉంచుకోవటం చాలా కష్టమవుతోంది; ఇక ఓ నిశ్చయానికి వచ్చి, తనకు ఎంత వేగం సాధ్యమో అంత వేగంగా, అంటే నిజానికి చాలా నెమ్మదిగా, తనను తాను అటు తిప్పుకునే ప్రయత్నంలో పడ్డాడు, మధ్య మధ్యలో తండ్రి వైపు జంకుగా ఓర చూపులు చూస్తున్నాడు. బహుశా గ్రెగర్ సదుద్దేశం అర్థమైంది కాబోలు, తండ్రి ఇక జోక్యం చేసుకోవటం మానేశాడు, అంతేకాదు, గ్రెగర్‌కు సాయంగా అడపాదడపా తన కర్రతో మార్గ నిర్దేశం కూడా చేశాడు. కానీ ఆ బుసకొట్టే చప్పుడు కూడా మానేస్తే బాగుండేది! అది గ్రెగర్ మతి పోయేలా చేస్తోంది. దాని ధ్యాసలో పడి ఒకసారి అటు తిరగవలసిన వాడే పొరబాట్న ఇటు తిరగబోయాడు. ఎలాగైతేనేం, చివరికి తన తలను గుమ్మానికి అభిముఖంగా తీసుకు రాగలిగాడు. అప్పుడు ఇంకో సమస్య ఎదురైంది, ఇప్పుడున్న భంగిమలో ముందుకు వెళితే తన శరీరం వెడల్పు ఆ గుమ్మంలో పట్టదు. బోల్టు వేసి ఉన్న రెండో తలుపు కూడా తీసేస్తే గ్రెగర్‌కి మార్గం సుగమం అయ్యేది. కానీ తండ్రి అదంతా ఆలోచించే మూడ్‌లో లేడు. గ్రెగర్‌ని వీలైనంత త్వరగా గదిలోకి తోలేయడమే ఆయన ఏకైక లక్ష్యం. గ్రెగర్ ఇందాకట్లా పైకి లేచి నిటారుగా నిలబడితే ఆ గుమ్మంలోంచి సులువుగా లోపలికి వెళ్ళగలడు, కానీ తండ్రి అలాంటి సన్నాహాలేవీ అనుమతించే స్థితిలో లేడు. నోటితో బిగ్గరగా చప్పుడు చేస్తూ, అసలు గ్రెగర్‌కి దారిలో ఏ అడ్డూ లేదన్నట్టే ముందుకు తరుముతున్నాడు; గ్రెగర్‌కి తన వెనుక ఆ శబ్దాలు చేస్తున్న తండ్రి ఒక్కడేనా అన్న అనుమానం కలిగింది; ఇప్పుడిక తప్పదు, ఏమైతే అదయిందిలే అని సూటిగా గుమ్మం వైపు దూసుకుపోయాడు. అతని శరీరం ఒక పక్కంతా పైకి లేచిపోయింది, అతను గుమ్మానికి ఒక కోణంలో ఏటవాలుగా ఆగిపోయాడు, అతని పక్క భాగం ఒరుసుకుని చిట్లిపోయింది, తెల్లని తలుపు మీద వికృతమైన మరకలు అంటుకుపోయాయి, అతను ఉన్న చోటే బిగుతుగా ఇరుక్కుపోయాడు, తనంతట తాను ఇక ముందుకు కదిలే వీల్లేదు, శరీరానికి ఒక వైపు బక్కపల్చటి కాళ్ళు గాల్లో వేలాడుతూ అల్లకల్లోలంగా కంపిస్తున్నాయి, రెండో వైపంతా నేల కేసి బాధాకరంగా నొక్కివేయబడింది – సరిగ్గా ఇప్పుడు అతని తండ్రి వెనక నుంచి తన్నిన తన్ను గ్రెగర్‌కి ఒక విముక్తిలా పని చేసింది, అతను గది లోతుల్లోకి ఎగిరిపడ్డాడు, విపరీతంగా రక్తం స్రవించాడు. ఊతకర్రతో నెట్టడంతో తలుపు దఢాల్న మూసుకుపోయింది, ఎట్టకేలకు అంతా నిశ్శబ్దం ఆవరించింది.

2


గ్రెగర్ గాఢ నిద్ర నుంచి – నిజానికి మూర్ఛలా అనిపించిన గాఢ నిద్ర నుంచి – సాయంత్రానికి కానీ లేవలేకపోయాడు. అప్పటికి నిద్ర ఎలాగూ తీరిపోయింది కాబట్టి, ఎవరూ కదపకపోయినా కాసేపట్లో తనంత తానుగా లేచే వాడే, కానీ ఈలోగా చకచకా పరిగెత్తిన పాదాల సవ్వడీ, హాల్లోకి వెళ్ళే తలుపు ఒబ్బిడిగా జారేసిన అలికిడీ, తనను నిద్రలేపినట్టు అనిపించింది. బయట్నుంచి వీధి దీపాల వెలుతురు పైన సీలింగ్ మీదా, ఫర్నిచర్ ఉపరితలాల మీదా సన్నగా పడుతోంది, కానీ నేల మీద గ్రెగర్ పడుకున్న చోట అంతా చీకటిమయంగా ఉంది. అతను నెమ్మదిగా లేచాడు, తన ముఖానికి ఇరుపక్కలా ఉన్న స్పర్శకాలతో గుడ్డిగా తడుముకుంటూ (ఇప్పుడే వాటి ఉపయోగమేమిటో మొదటిసారి తెలిసొచ్చింది), తలుపు దగ్గర అలికిడేమిటో చూడటానికి దేక్కుంటూ వెళ్ళాడు. అతని ఎడమ భాగం అంతా ఒకే పొడవాటి గాయంలా బిరుసెక్కి సలుపుతోంది, తన రెండు వరుసల కాళ్ళ మీదా కుంటుతూ నడుస్తున్నాడు. పైగా పొద్దుటి గొడవలో ఒక కాలు తీవ్రంగా దెబ్బతింది – అసలు ఆ ఒక్కటే దెబ్బతిందంటే అదృష్టమనే చెప్పాలి – ఇప్పుడా కాలు ఎందుకూ పనికిరాకుండా మిగతా శరీరంతో పాటూ ఈడ్చబడుతోంది.

తలుపు దాకా వచ్చాకా, తనను అక్కడికి రప్పించిందేమిటో అర్థమైంది: తిండి వాసన. అక్కడ ఒక గిన్నె నిండా చిక్కటి పాలున్నాయి, అందులో తెల్లని రొట్టె తునకలు తేలుతున్నాయి. అతను ఆనందంతో ఎగిరి గంతేసినంత పని చేశాడు, పొద్దున్న కన్నా ఇప్పుడు మరింత ఆకలిగా ఉంది, చటుక్కున తన తలను కళ్ళు కూడా మునిగేంతగా పాలలో ముంచేశాడు. కానీ వెంటనే నిరాశగా తలను వెనక్కు తీసేసుకున్నాడు. తన శరీరపు ఎడమ భాగంలోని నొప్పి దానికి ఒక కారణం (మొత్తం శరీరమంతా సంకోచ వ్యాకోచాలతో సాయపడితే తప్ప అతను తినలేడు), అదీ గాక ఎందుకో పాలు అస్సలు తాగాలనిపించలేదు, మామూలుగా అతనికి పాలంటే చాలా ఇష్టం, చెల్లాయి వాటిని అక్కడ తెచ్చి పెట్టింది కూడా అందుకే; అలాంటిది ఇప్పుడు మాత్రం వెగటు పుట్టింది, గిన్నెకి దూరంగా వెనక్కు వచ్చేశాడు.

తలుపు సందులోంచి చూస్తే లివింగ్ రూములో అప్పుడే గ్యాస్ లైటు వెలుగుతూ కనిపిస్తోంది, మామూలుగా ఈ సమయంలో తండ్రి ఈవెనింగ్ పేపరు చేతపుచ్చుకుని, అందులో వార్తల్ని తల్లికో చెల్లాయికో పైకి చదివి వినిపించేవాడు (ఈ తంతు గురించి చెల్లాయి ఎప్పుడూ ఉత్తరాల్లో రాస్తుండేది), కానీ ఇపుడు అంతా నిశ్శబ్దంగా ఉంది. ఒకవేళ పైకి చదివి వినిపించే అలవాటు ఈ మధ్య పోయిందనుకున్నా, ఈ నిశ్శబ్దం ఒక్క లివింగ్ రూమ్‌కే పరిమితం కాలేదు, ఇల్లు మొత్తం అలానే ఉంది, అలాగని ఫ్లాటులో మనుషుల్లేరా అంటే ఉన్నారు. ‘నా కుటుంబం ఎంత ప్రశాంతమైన జీవితం గడుపుతోందో,’ గ్రెగర్ తనలో తాను అనుకున్నాడు, అలా చీకట్లో కూర్చుని, తన కుటుంబానికి ఇలాంటి అందమైన ఫ్లాటు ఏర్పాటు చేయగలిగినందుకు గర్వపడ్డాడు. కానీ ఇప్పుడీ ప్రశాంతతా, సౌకర్యవంతమైన జీవితమూ అన్నీ ఒక ముగింపుకి వచ్చే పరిస్థితి దాపురించిందా? ఇలాంటి ఆలోచనల వైపు దృష్టి మళ్ళకుండా గ్రెగర్ గదిలో అటూ ఇటూ పాకాడు.

ఎంతకీ ముగియని ఆ సాయంత్రంలో అప్పుడప్పుడూ గదికి ఇరువైపులా ఉన్న తలుపులు వారగా తెరుచుకునేవి, మళ్ళా వెంటనే మూసుకుపోయేవి; బహుశా ఎవరో రావాలనుకుని మళ్ళా వెనక్కు జంకుతున్నారు. గ్రెగర్ వెళ్ళి లివింగ్ రూము దగ్గరే కాపు కాశాడు, ఆ తటపటాయిస్తున్న అతిథులెవరో చూసి, వాళ్ళని ఎలాగైనా లోపలికి రప్పించాలన్నది అతని ఆలోచన; కానీ ఆ తలుపు మళ్ళీ తెరుచుకోలేదు, అతను అక్కడ పడిగాపులు కాయటమే మిగిలింది. ఇవాళ పొద్దున్న గది తలుపులు మూసి ఉన్నపుడేమో అందరూ లోపలికి రావాలని ఒకటే ఉబలాట పడ్డారు; ఇప్పుడు మాత్రం, స్వయంగా తానే ఒక తలుపు తెరిచినా, మిగతా తలుపులన్నీ కూడా తెరుచుకున్నా, తలుపులకు తాళాలు కూడా బయటే ఉన్నా, ఎవరూ లోపలికి రావటం లేదు.

రాత్రి బాగా పొద్దుపోయాకా గానీ లివింగ్ రూములో లైటు ఆరలేదు, తల్లిదండ్రులూ, చెల్లాయీ అప్పటిదాకా మెలకువగానే ఉన్నారని గ్రెగర్‌‌గ్రహించాడు, వాళ్ళు మునివేళ్ళ మీద నడవటం స్పష్టంగానే వినపడింది. లైటు ఆరిపోయాకా, ఇక తెల్లారే వరకూ ఎవరూ గ్రెగర్ జోలికి వచ్చే అవకాశం లేదు కాబట్టి, తన జీవితాన్ని మళ్ళీ ఒక క్రమంలో పెట్టుకోవటం ఎలాగన్నది ఆలోచించేందుకు తగినంత సమయమూ, తీరికా లభించినట్టే. కానీ పైకప్పు అంతెత్తున ఉన్న ఈ గదిలో ఇలా నేల మీద బోర్లా పడుకోవటం – అది తన గదే అయినా, గత ఐదేళ్ళుగా అందులోనే ఉంటున్నా – ఏదో చెప్పలేని ఆందోళనకు గురి చేసింది, దాంతో, అప్రయత్నంగానే జరజరా పాక్కుంటూ వెళ్ళి, ఏ మాత్రం సిగ్గు పడకుండా, సోఫా కిందకు దూరాడు, అక్కడ తన వీపు కాస్త నొక్కుకుపోతున్నా, తల ఎత్తే వీల్లేకపోయినా, చాలా సుఖంగా అనిపించింది, కానీ అతని శరీరం వెడల్పు ఆ సోఫా కన్నా పెద్దది కావటం చేత పూర్తిగా నక్కే వీల్లేక కొంత భాగం బయటకు కనిపిస్తూనే ఉంది.

మొత్తం రాత్రంతా సోఫా కిందే గడిపాడు, అప్పుడప్పుడూ చిన్నపాటి కునుకు తీసేవాడు, కానీ ఆకలి వల్ల మళ్ళా మెలకువ వచ్చేసేది, అప్పుడప్పుడూ తనకెదురైన కష్టం గురించీ, తన అస్పష్ట ఆశల గురించీ ఆలోచించేవాడు, అవన్నీ ఒకే తీర్మానాన్ని చేరేవి, అదేమిటంటే, ఈ పరిస్థితిలో కంగారుపడకూడదు, తన ఓపిక అంతా కూడగట్టుకోవాలి, ఈ పరిస్థితి వల్ల కలిగే ఇబ్బందిని ఎదుర్కోవటంలో తన కుటుంబానికి తన వంతు సాయపడాలి.

మరుసటి రోజు తెల్లారగట్ల, ఇంకా చీకట్లు కూడా తొలగకుండానే, గ్రెగర్‌కి తన కొత్త నిర్ణయాల్లో ఏ మాత్రం బలముందో పరీక్షించుకునే అవకాశం చిక్కింది. అప్పటికే చెల్లాయి పూర్తిగా ముస్తాబై, అతని గదికి హాల్లోంచి ఉండే తలుపు తీసి అతను ఎక్కడ ఉన్నాడా అన్నట్టు తొంగి చూసింది. అతను వెంటనే కనపడలేదు, చివరికి సోఫా మీద ఆమె చూపు పడనే పడింది – మరి ఎక్కడో అక్కడ ఉండక ఏం చేస్తాడు, ఉన్నపళాన ఎగిరిపోలేడు కదా – అతణ్ణి చూడగానే ఎంతగా ఉలికిపడిందంటే, ఇక ఆ దృశ్యం భరించలేనట్టు, తలుపు దఢాల్న మూసేసింది. కానీ తన ప్రవర్తనకు తానే సిగ్గుపడింది కాబోలు, మళ్ళీ తెరిచింది, తర్వాత, ఎవరో రోగినో, ఎరుగనివాణ్ణో కలవటానికొస్తున్నట్టుగా, మునివేళ్ళ మీద జాగ్రత్తగా నడుస్తూ లోపలికి వచ్చింది. గ్రెగర్ తన తలను సోఫా అంచు దాకా సాగదీసి ఆమె వంక చూస్తున్నాడు. తాను పాలు ముట్టుకోకుండానే వదిలేశాడని గమనిస్తుందా, అలా చేసింది ఆకలి లేక కాదని అర్థం చేసుకుంటుందా, అతనికి హితవు చేసే ఇంకో తిండేదైనా తీసుకు వస్తుందా? ఒకవేళ ఆమె గమనించకపోతే, తాను ఆకలితో చావనైనా చస్తాడు గానీ, ఆమెకు ఆ విషయం తెలియజెప్పే ప్రయత్నం చేయడు (లోపల్లోపల మాత్రం వెంటనే సోఫా కింద నుంచి పాక్కుంటూ వెళ్ళి, ఆమె కాళ్ళ మీద పడిపోయి, తింటానికి ఏదన్నా తీసుకురమ్మని దేబిరించాలన్నంత ఆత్రం ఉంది). కానీ ఆమె గమనించింది, గిన్నె అంచుల చుట్టూ కొద్దిగా వలకడం మినహాయిస్తే, పాలు ఎలా పెట్టినవి అలానే ఉండటం చూసి ఆశ్చర్యపోయింది; వెంటనే గిన్నెను బయటకు తీసుకుపోయింది. వట్టి చేతులతో కాదు, గుడ్డతో పట్టుకుని. బదులుగా ఏమి తీసుకు వస్తుందా అని గ్రెగర్ చాలా ఉత్కంఠతో ఎదురు చూశాడు, రకరకాల ఊహాగానాలు చేశాడు. కానీ ఆ దయగల తల్లి చివరికి ఏం తెచ్చిందో అతనెన్నటికీ ఊహించగలిగే వాడు కాదు. అసలు అతనికి ఏం ఇష్టమో తెలుసుకోవటానికన్నట్టు, రకరకాల తిండి పదార్థాలు ఏరి, వాటన్నింటినీ ఒక పాత న్యూస్ పేపరు మీద పరిచి తీసుకువచ్చింది. అవి: సగం కుళ్ళిన పాత కూరగాయలు; నిన్న రాత్రి భోజనంలో మిగిలిన ముడుసులు, వాటి మీద గడ్డకట్టిన తెల్లని సాస్; కొన్ని ఆల్మండ్లు, రైసిన్లు; గ్రెగర్ కొన్ని రోజుల క్రితమే పులిసిపోయిందని వదిలేసిన పెరుగు; ఒక ఎండు రొట్టె ముక్క, నెయ్యి పూసిన మరో రొట్టె ముక్క, నెయ్యితో పాటూ ఉప్పు చల్లిన ఇంకో రొట్టె ముక్క. ఇవి గాక, ఇందాకటి గిన్నెలో కొంచెం నీరు పోసింది తెచ్చింది (బహుశా ఆ గిన్నె ఇక గ్రెగర్‌కి తప్ప ఇంకెవరికీ వాడరు కాబోలు). తర్వాత, తన సమక్షంలో తినటానికి ఇబ్బంది పడతాడని గ్రహించి, ఎంత త్వరగా వచ్చిందో అంతే త్వరగా అక్కణ్ణించి వెళ్ళిపోయింది, తాను వెళ్ళిపోయానని ఖాయంగా తెలియటానికి తలుపు అవతల్నించి అతనికి వినపడేలా తాళం కూడా తిప్పింది. గ్రెగర్ తన కళ్ళ ముందు వడ్డించిన భోజనం వైపు బక్కపల్చటి కాళ్ళను టకటకలాడిస్తూ వెళ్ళాడు. ఆ వెళ్ళటంలో పెద్దగా ఇబ్బంది లేకపోవటాన్ని బట్టి అప్పుడే తన గాయాలన్నీ పూర్తిగా మానిపోయాయని అర్థమైంది; ఇది అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది, ఒక నెల క్రితం పొరబాట్న వేలు తెగితే ఆ చిన్నపాటి గాయం నిన్నా మొన్నటి దాకా కూడా సలిపిన సంగతి గుర్తొచ్చింది. ‘నాలో సున్నితత్వం తగ్గి మొద్దుబారిపోతున్నానా?’ అనుకున్నాడు, కానీ అప్పటికే పెరుగు మీద పడి ఆబగా జుర్రుకుంటున్నాడు, ఎందుకో మిగతా అన్ని పదార్థాల కన్నా పెరుగు పట్ల ఉగ్గబట్టుకోలేనంత బలమైన ఆకర్షణ కలిగింది. కళ్ళ వెంబడి ఆనంద బాష్పాలు కారుతుంటే, వేగంగా ఒకదాంతర్వాతొకటి... పెరుగూ, కూరలూ, సాస్ అన్నీ లాగించేశాడు; తాజా తిండి పదార్థాలు మాత్రం ఎందుకో అతనికి రుచించలేదు, సరికదా, అసలు వాటి వాసనే భరించలేకపోయాడు, తాను తినే పదార్థాల్ని వాటికి దూరంగా లాక్కుపోయి మరీ తిన్నాడు. తినటం అంతా పూర్తి చేసి, అక్కడే సోమరిగా పడుకుని కునుకు తీస్తుండగా, బయట నుంచి చెల్లాయి తాళం చాలా నెమ్మదిగా తిప్పటం మొదలుపెట్టింది, అది అతనక్కణ్ణించి వెళ్ళిపోవాలన్న దానికి సూచన. ఉలిక్కిపడి లేచి మళ్ళీ సోఫా కిందకు దూరిపోయాడు. కానీ అంత సుష్టుగా భోజనం చేసిన తర్వాత శరీరం కాస్త ఉబ్బటంతో చెల్లాయి ఆ గదిలో ఉన్న కాసేపూ సోఫా కింద ఉండటానికి కూడా అతను చాలా కష్టపడాల్సి వచ్చింది, ఆ ఇరుకైన జాగాలో శ్వాస అందటం కష్టమైంది. ఓ పక్క స్పృహ కోల్పోతున్నంత పనవుతున్నా, అతను ఉబ్బిపోతున్న కళ్ళతో చెల్లాయిని అలాగే చూస్తూండిపోయాడే తప్ప కిక్కురుమనలేదు. ఇదేమీ తెలియని ఆమె ఒక చీపురు తీసుకుని, అతను ఎంగిలి చేసిన పదార్థాలతో పాటూ అసలు ముట్టుకోకుండా వదిలేసిన పదార్థాలను కూడా అవి ఇక ఎందుకూ పనికి రావన్నట్టు తుడిచి, ఆ చెత్తనంతట్నీ ఒక బకెట్టులోకి ఎత్తి, దాన్ని ఒక చెక్క మూతతో మూసి, గదిలోంచి బయటకు తీసుకుపోయింది. ఆమె అలా వెళ్ళిందో లేదో గ్రెగర్ సోఫా నుంచి బయటపడి పొట్ట సాగదీస్తూ వళ్ళు విరుచుకున్నాడు.

గ్రెగర్‌భోజనం ప్రతి రోజూ ఇదే పద్ధతిలో అయ్యేది, తల్లిదండ్రులూ పనమ్మాయీ ఇంకా నిద్రలేవకముందే ఒకసారీ, కుటుంబమంతా మధ్యాహ్న భోజనం చేశాకా మరొకసారీ వడ్డించబడేది, మధ్యాహ్న భోజనం కాగానే తల్లిదండ్రులిద్దరూ కాసేపు కునుకు తీసేవారు, పనమ్మాయిని చెల్లాయి ఏదో ఒక పని మీద బయటకు పంపించేది. అతను తిండికి మాడకూడదని ఆమెకి ఎంత ఉందో ఆమె తల్లిదండ్రులకూ అంతే ఉంటుందనటంలో సందేహమేం లేదు, కానీ ఆ ఏర్పాట్ల గురించి ప్రత్యక్షంగా తెలుసుకునేంత ధైర్యం వారికి లేదేమో, లేదా అసలే బాధలో ఉన్న వాళ్ళని మరింత బాధ పెట్టకూడదన్న ఉద్దేశంతో అతని చెల్లే వాళ్ళను ఈ బాధ్యత నుంచి మినహాయించిందో.

ఆ మొదటి రోజు ఇంటికి పిలుచుకువచ్చిన వైద్యుణ్ణీ, తాళాలు పగలగొట్టేవాణ్ణి, తిరిగి ఏ సాకు చెప్పి వెనక్కు పంపించారో గ్రెగర్‌ తెలుసుకోలేకపోయాడు; అతను మాట్లాడేది ఇతరులకు అర్థం కావట్లేదు సరే, కానీ తమ మాటలైనా అతనికి అర్థం కావచ్చేమో అన్న అనుమానం వాళ్ళలో ఎవరికీ రాలేదు, చెల్లాయితో సహా; అందుకే అతని గదిలో ఉన్నపుడు ఆమె అడపాదడపా నిట్టూర్పులు విడవటమో, దేవుళ్ళకు మొర పెట్టుకోవడమో చేసేదే తప్ప, అంతకుమించి ఏమీ మాట్లాడేది కాదు. కానీ రోజులు గడిచి ఈ పరిస్థితికి అలవాటుపడే కొద్దీ ఆమె నోరు విప్పటం ప్రారంభించింది, ఆ మాటల్లో జాలి ఉండేది, కనీసం ఉండేదని అనుకోవచ్చు. తాను పెట్టిన పదార్థాలన్నింటినీ గ్రెగర్ ఖాళీ చేసినపుడు, ‘ఇవాళ బాగా తిన్నాడు,’ అనేది, దానికి విరుద్ధంగా జరిగినపుడు (రాన్రానూ అలా జరగటం ఎక్కువైంది), ఆమె చాలా బాధగా: ‘మళ్ళీ ఇవాళ అంతా వదిలేశాడు,’ అనేది.

 గ్రెగర్‌కి ఏ వార్తా సూటిగా తెలిసేది కాదు, పక్క గదుల నుంచి కొంత విని తెలుసుకునేవాడు, చిన్నగా ఏ గొంతు వినపడినా, అతను వెంటనే అటువైపున్న తలుపు దగ్గరకు వెళ్ళి తన శరీరం మొత్తాన్ని దానికి అదిమిపెట్టి శ్రద్ధగా వినేవాడు. తొలి రోజుల్లో అతని ప్రస్తావన పరోక్షంగానైనా లేకుండా ఏ సంభాషణా పూర్తయ్యేది కాదు. ఒక రెండ్రోజులైతే భోజనాలైనప్పుడల్లా గ్రెగర్‌ని ఏం చేయాలన్న విషయమై చర్చలు సాగేవి; భోజనాలయ్యాకా కూడా అవే కొనసాగేవి, ఫ్లాట్‌లో ఒంటరిగా ఉండటానికి ఎవరూ ఇష్టపడక, అలాగని దాన్ని ఖాళీగానూ వదిలేయలేక, కుటుంబసభ్యుల్లో ఎవరో ఒక ఇద్దరు ఎప్పుడూ ఇంట్లో ఉండేలా చూసుకునేవారు. పనమ్మాయైతే – ఆమెకు విషయం ఎంత వరకూ తెలుసో తెలియదు గానీ – మొదటి రోజే తల్లి కాళ్ళ మీద సాగిలబడిపోయి తనను పనిలోంచి తీసేయమని బతిమాలింది, ఒక పావుగంట తర్వాత సెలవు తీసుకుని వెళ్తూ, తనను తీసేయటం ద్వారా ఈ కుటుంబం తనకు ఎంతో మేలు చేసినట్టు కళ్ళమ్మటా నీళ్ళతో కృతజ్ఞతలు తెలుపుకుంది, ఈ విషయం గురించి బయటెక్కడా మాట్లాడనని ఎవరూ అడక్కపోయినా ఒట్టు కూడా వేసింది.

దాంతో ఇప్పుడు వంటపని తల్లి పైనా, చెల్లాయి పైనా పడింది; అయినా అదేం పెద్ద పని కాదు, ఈ మధ్య ఆ కుటుంబం సరిగా తిండి తినటమే తగ్గించింది. ఇంకో ముద్ద తినమంటూ వాళ్ళు ఒకర్నొకరు నిష్పలంగా బతిమాలుకోవటం గ్రెగర్ వినిపిస్తూనే ఉండేది, దానికి స్పందన కూడా ఎప్పుడూ ఒకటే: ‘వద్దు, సరిపడా తిన్నాను,’ అన్న అర్థం వచ్చేలా ఏదో అనేవాళ్ళు. వాళ్ళు తాగేది కూడా తక్కువే. చెల్లాయి తరచూ తండ్రిని బీరేమైనా కావాలా అని అడిగేది, స్వయంగా తనే వెళ్ళి తెస్తాననేది; ఆయన్నుంచి జవాబేమీ రాకపోతే, కూతురి చేత పని చేయించుకుంటున్నాడనే బాధ నుంచి తప్పించటానికన్నట్టు, ఎవర్నయినా పంపించయినా తెప్పిస్తాననేది; కానీ చివరకు తండ్రి ‘వద్దు’ అని గట్టిగా చెప్పటంతో ఆ ప్రస్తావన ముగిసేది.

తండ్రి మొట్టమొదటి రోజే కుటుంబం ఆర్థిక పరిస్థితి ఏమిటో, ఇప్పుడు తమ ముందున్న అవకాశాలేమిటో తల్లికీ చెల్లాయికీ వివరించి చెప్పాడు. చెప్తున్నవాడల్లా మధ్య మధ్యలో టేబిల్ దగ్గర్నుంచి లేచి వెళ్ళి, ఐదేళ్ళ క్రితం తన వ్యాపారం దివాలా తీసినపుడు రక్షించి తెచ్చుకున్న ఒక ఇనప్పెట్టె నుంచి, ఏదో రసీదు పుస్తకమో నోటు పుస్తకమో పట్టుకొచ్చేవాడు. పకడ్బందీగా ఉండే ఆ ఇనప్పెట్టె గడియ తెరుచుకోవటం, అందులోంచి కావాల్సింది తీసుకున్నాకా మళ్ళీ మూసేయటం ఇవన్నీ గ్రెగర్‌కి వినపడేవి. అతను గదిలో బంధీ అయిన దగ్గర్నుంచీ ఇప్పటిదాకా విన్న విషయాలన్నింటిలోకీ కాస్త సంతోషాన్ని కలిగించే విషయం తండ్రి ఇచ్చిన ఈ వివరణలే. గ్రెగర్ ఇప్పటి దాకా తండ్రి పాత వ్యాపారం నుంచి ఒక్క పైసా కూడా మిగల్లేదని అనుకునేవాడు, తండ్రి కూడా మిగిలిందని ఎప్పుడూ చెప్పలేదు, గ్రెగర్ గుచ్చి అడగనూ లేదు. ఆ రోజుల్లో గ్రెగర్‌కున్న లక్ష్యమల్లా ఒకటే, తన కుటుంబాన్ని నిరాశలో కూరుకుపోయేట్టు చేసిన ఆ దివాలా తాలూకు జ్ఞాపకాల్నించి వాళ్ళను వీలైనంత తొందరగా బయటపడేయటం. అందుకు తన శక్తులన్నీ కూడదీసుకుని పని చేశాడు, చిన్న గుమాస్తా స్థాయి నుంచి చాలా వేగంగా ట్రావెలింగ్ సేల్స్‌మెన్ స్థాయికి చేరుకున్నాడు, ఆ హోదాకి చేరాకా అతని రాబడి అవకాశాలు పెరిగాయి, అతని విజయాలు కమీషన్ల రూపేణా తక్షణం డబ్బుగా మారేవి, దాన్ని వెంటనే తీసుకెళ్ళి ఆనందాశ్చర్యాలతో మెరిసే కుటుంబ సభ్యుల కళ్ళ ముందే టేబిల్ మీద పెట్టేవాడు. ఆ రోజులే వేరు, గ్రెగర్ తర్వాత కూడా డబ్బు బానే సంపాదించినా, కుటుంబం ఖర్చులన్నీ తనే భరించినా, ఆ రోజుల వైభవం మళ్ళీ ఆ స్థాయిలో ఎప్పుడూ పునరావృతం కాలేదు. వాళ్ళకు అది మామూలైపోయింది, కుటుంబానికీ, గ్రెగర్‌కీ కూడా; డబ్బు కృతజ్ఞతాపూర్వకంగానే తీసుకునేవాళ్ళు, అతను కూడా ఆనందంగానే ఇచ్చేవాడు, కానీ ఇదివరకట్లా అందులో ఎటువంటి ఆత్మీయ భావనా ఉండేది కాదు. చెల్లాయితో మాత్రం ఎప్పుడూ సన్నిహితంగానే ఉండేవాడు, ఆమె భవిష్యత్తు కోసం గుట్టుగా ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నాడు. ఆమె గ్రెగర్‌లా గాక సంగీత ప్రియురాలు, పైగా మనసు కరిగేలా వయొలిన్ వాయించగలదు, కాబట్టి, ఎంత ఖర్చయినా ఎలాగోలా భరించి, ఆమెను వచ్చే ఏడాది సంగీత కళాశాలలో చేరుద్దాం అనుకున్నాడు. గ్రెగర్ ఇంటి దగ్గర ఉండేది తక్కువే అయినా, ఆ ఉన్న కొన్ని సందర్భాల్లోనూ చెల్లాయితో ఎప్పుడు మాట్లాడినా ఈ సంగీత కళాశాల ప్రస్తావనకు వచ్చేది, కానీ దాన్ని అందరాని కలగానే చూసేవారు, తల్లిదండ్రులైతే ఆ ప్రస్తావన కూడా ఇష్టపడేవారు కాదు; కానీ ఈ విషయంలో గ్రెగర్ నిర్ణయం తీసేసుకున్నాడు, రాబోయే క్రిస్మస్ పండగ నాడు ఆ నిర్ణయాన్ని అట్టహాసంగా ప్రకటించాలనుకున్నాడు కూడా.

గ్రెగర్ అలా తలుపులకు ఆనుకు నిలబడి వింటున్నప్పుడు ఇలాంటి నిష్పలమైన ఆలోచనలే అతని మనసులోకి వచ్చి పోయేవి. ఒక్కోసారి భరింపరాని నిస్పృహ ఆవరించి వినటం మానేసి పరాకులో పడిపోయేవాడు, అతని తల పొరబాట్న తలుపుకు తగిలేది, చప్పున దాన్ని నిటారుగా నిలబెట్టుకునేవాడు, ఎందుకంటే ఏ చిన్న అలికిడైనా పక్క గదిలో అందరూ నిశ్శబ్దమైపోయేవారు. కొద్ది విరామం తర్వాత తండ్రి, బహుశా తలుపు వైపు చూస్తూ కాబోలు, ‘ఏం చేస్తుంటాడో ఇప్పుడు,’ అనేవాడు, ఆ తర్వాత నెమ్మదిగా అంతరాయాన్నించి తేరుకుని సంభాషణ తిరిగి కొనసాగేది.

ఈ సమయంలోనే గ్రెగర్‌‍తండ్రి ద్వారా ఒక కొత్త విషయం తెలుసుకున్నాడు (తండ్రి ఇలాంటివి చెప్పినవే మళ్ళీ మళ్ళీ చెప్పేవాడు, దానికి ఒక కారణం ఆయన ఈ విషయాల్ని పట్టించుకుని చాలా కాలం అవటమూ, మరో కారణం తల్లి వాటిని మొదటిసారి విన్నపుడే అర్థం చేసుకోలేకపోవటమూను), ఇంతకీ విషయమేమిటంటే, తండ్రి వ్యాపారం దివాలా తీసినా కూడా ఆ పాత రోజుల నాటి డబ్బు కొంత మిగిలింది, అది అవటానికి చిన్నమొత్తమే కానీ, దాని మీద వచ్చే వడ్డీని కదపకపోవటంతో, ఇప్పుడు కాస్త పెద్ద మొత్తంగా మారింది. అదేగాక, గ్రెగర్ నెలనెలా ఇంటికి తెచ్చిన డబ్బు – అతను అవసరాలకంటూ కొంత చిల్లర మాత్రమే చెంత ఉంచుకునేవాడు – పూర్తిగా ఖర్చయిపోలేదు, అది కూడా ఓ మాదిరి పెట్టుబడిగా ఎదిగింది. ఇది వింటూ గ్రెగర్ తలుపు వెనక నుంచి తల ఉత్కంఠగా ఆడించాడు, ఈ అనుకోని పొదుపూ, ముందుచూపూ అతనికి పట్టరాని ఆనందాన్ని కలిగించాయి. నిజానికి ఈ డబ్బు ఉందని ముందే తెలిస్తే అతను దాంతో తండ్రి తన యజమానికి పడ్డ బాకీ తీర్చేసి ఉండేవాడు, ఆ రకంగా ఆ వెట్టిచాకిరీ ఉద్యోగం నుంచి త్వరగా బయటపడగలిగేవాడు, కానీ ఇప్పటి పరిస్థితుల్ని బట్టి చూస్తే తండ్రి ఇలా చేయటమే మంచిదైందనిపించింది.

కానీ ఈ డబ్బు మీద వచ్చే వడ్డీ ఒక కుటుంబం గడవటానికి సరిపోయేది కాదు; మహ అయితే ఒక ఏడాదో రెండేళ్ళో గడుస్తాయి, అంతే. కాబట్టి ఆ డబ్బు అత్యవసరమైనపుడు వాడుకునేలా ఓ పక్కన అట్టే పెట్టడానికి మాత్రమే పనికొస్తుంది; రోజు గడవటానికి కావాల్సిన డబ్బు కోసం మాత్రం పని చేయక తప్పదు. తండ్రి ఆరోగ్యంగానే ఉన్నాడు కానీ, ముసలివాడైపోయాడు, పైగా గత ఐదేళ్ళుగా ఏ పనీ చేసినవాడు కాదు; కాబట్టి ఆయన్నుంచి పెద్దగా ఆశించగలిగేదేమీ లేదు; కఠినంగా శ్రమించినా వైఫల్యాలమయంగానే సాగిన ఆయన జీవితంలో ఆయన కాస్త విశ్రాంతి తీసుకున్నాడంటే అది ఈ గత ఐదేళ్ళలోనే, ఈ కాలంలో ఆయన చాలా లావెక్కాడు, ఇప్పుడైతే కదలటం కూడా బాగా బరువుగా కదుల్తాడు. ఇక తల్లి విషయానికొస్తే, ఉబ్బసం వల్ల ఆవిడకు ఫ్లాట్‌లో ఉండటమే కష్టం, శ్వాస అందక చాలాసార్లు తెరిచిన కిటికీ ముందు సోఫాలో కూలబడిపోతుంది, అలాంటావిడ ఇప్పుడు డబ్బు కోసం పని చేయగలదా? ఇక చెల్లాయి, ఆమెకు పదిహేడేళ్ళొచ్చాయన్న మాటే గానీ ఇంకా చిన్న పిల్లే, అందమైన దుస్తులు వేసుకోవటం, ఆలస్యంగా నిద్ర లేవటం, ఇంటి పనుల్లో చేతనైనంత సాయం చేయటం, ఏవో చిరు సరదాల్లో పాలుపంచుకోవటం, అన్నింటికన్నా ముఖ్యంగా వయొలిన్ వాయించటం, ఇలా సాగే జీవితంలో జోక్యం చేసుకోవటమే పెద్ద పాపం, అలాంటిది డబ్బు కోసం ఆమెను పనిలో పెట్టాలా? ఇంట్లో సంభాషణ ఇలా సంపాదన మీదకు ఎప్పుడు మళ్ళినా, గ్రెగర్ అప్పటి దాకా తలుపు ఆనుకుని వింటున్నవాడల్లా, దాన్ని వదిలేసి, పక్కనున్న చల్లని తోలు సోఫా మీద కూలబడేవాడు, సిగ్గుతో, బాధతో అతని వళ్ళు కాగిపోయేది.

అతను ఎన్నో ఎడతెగని రాత్రుళ్ళు అలాగే కూలబడి, కంటి మీద కునుకన్నది లేకుండా, సోఫాని గీరుకుంటూ గడిపేసేవాడు. లేదంటే ఒక్కోసారి గదిలోని పెద్ద కుర్చీని కిటికీ దాకా లాక్కువెళ్ళటమనే బృహత్ ప్రయత్నం మొదలుపెట్టేవాడు, తర్వాత ఆ కుర్చీ మీద నిలబడి, కిటికీ అంచు అందుకుని, దాని గాజు పలకకు ముఖాన్ని ఆనించేవాడు, ఇదివరకటి రోజుల్లో ఇలా కిటికీ దగ్గర నిలబడటం వల్ల కలిగిన స్వేచ్ఛా భావనని తిరిగి పొందటానికి తప్ప ఈ చర్య వల్ల వేరే ప్రయోజనం లేదు, ఎందుకంటే, అతని కంటి చూపుకు ఇప్పుడు దగ్గరున్న వస్తువులే అంతంత మాత్రంగా కనపడుతున్నాయి; ఇదివరకూ కిటికీ లోంచి ఎపుడు చూసినా వీధవతల ఆసుపత్రి అడ్డు వస్తోందనీ అది తప్ప వేరే ఏం కనిపించటం లేదని విసుక్కునేవాడు, ఇపుడు అది కూడా స్పష్టంగా కనిపించడం మానేసింది; తాను పట్టణ ప్రాంతంలోని చార్లటన్ వీధిలో నివసిస్తున్నాడని అతనికి ఖాయంగా తెలిసి ఉండబట్టి గానీ, లేదంటే ఇప్పుడు కిటికీ బయట కనపడేది బూడిదరంగు ఆకాశమూ నేలా హద్దుల్లేకుండా కలిసిపోయిన ఒక బీడు దృశ్యమేమో అనుకునేవాడు. చురుకైన అతని చెల్లాయి కిటికీ దగ్గర ఈ పెద్ద కుర్చీని రెండు మూడు సార్లు గమనించటంతోటే విషయం అర్థం చేసుకుంది; తర్వాత ఆమె గది తుడవటానికి వచ్చినపుడల్లా, ఆ కుర్చీని జాగ్రత్తగా కిటికీ దగ్గరకు జరిపేది, కిటికీ రెక్క తెరిచి పెట్టేది.

గ్రెగర్‌కి చెల్లాయితో మాట్లాడే వీలుండి ఉంటే – ఆమె తన కోసం చేస్తున్న ఈ పనులన్నింటికీ కృతజ్ఞత తెలుపుకోగలిగే వీలుండి ఉంటే – ఆమె చూపిస్తున్న ఈ శ్రద్ధను ఇంకాస్త తేలిగ్గా స్వీకరించగలిగేవాడు, కానీ ఆ వీల్లేకపోవటం వల్ల, అతనికెందుకో ఇబ్బందిగా అనిపించేది. ఆమె తనవంతుగా ఈ పనుల్లో అప్రియత్వాన్ని కప్పిపుచ్చటానికి వీలైనంత ప్రయత్నించేది, సహజంగానే కాలక్రమేణా అందులో ఆరితేరింది, కానీ సమయం గడిచే కొద్దీ అసలు రంగు బయటపడసాగింది. అసలామె లోపలికి అడుగుపెట్టే తీరే అతనిలో కంగారు పుట్టించడం మొదలైంది. ఆమె గదిలోకి ఇలా వచ్చిందో లేదో, కనీసం తలుపు మూయటానికి కూడా ఆగకుండా (గ్రెగర్ గది ఇతరుల దృష్టిలో పడకుండా తాను ఇదివరకూ పాటించిన జాగ్రత్తను ఇప్పుడు మర్చిపోయి), తిన్నగా కిటికీ దగ్గరకు దూసుకు వెళ్ళి, తనకు ఊపిరాడటం లేదన్నట్టు, దాన్ని విసురుగా అసహనంగా తెరిచేది, తర్వాత, బయట వాతావరణం ఎంత చలిగా ఉన్నా, కాసేపు అలా కిటికీ ముందే నిలబడి పెద్దగా ఎగశ్వాసతో ఊపిరి పీల్చుకునేది. రోజుకి రెండుసార్లు ఈ అలజడితోనూ, చప్పుళ్ళతోనూ ఆమె గ్రెగర్‌ను బెంబేలెత్తించ సాగింది; ఆమె గదిలో ఉన్న కాసేపూ అతను సోఫా కింద దూరి గజ గజ వణికిపోయేవాడు, కానీ అతనికి తెలుసు, కిటికీలు మూసి ఉన్న గదిలో ఆమె తనతో ఉండలేదు కాబట్టే, తనను ఇంతగా ఇబ్బంది పెట్టాల్సి వస్తోందని.

ఒక రోజు ఆమె మామూలు కన్నా కాస్త పెందలాడే రావటం మూలాన, అతను ఇంకా కిటికీ దగ్గరే నిలబడి ఉండగా ఆమె కంటపడ్డాడు, అతని భీకరాకారం నిశ్చలంగా నిలబడి బయటకు చూస్తోంది, అతను అక్కడ ఉన్నప్పుడు కిటికీ తెరిచే వీల్లేదు, కాబట్టి ఆమె కిమ్మనకుండా అక్కణ్ణించి వెళ్ళిపోయుంటే గ్రెగర్ పెద్దగా ఆశ్చర్యపోయేవాడు కాదు, కానీ ఆమె ఆ వెళ్ళటం మామూలుగా వెళ్ళలేదు, ఉలికిపడినట్టు ఒక్కసారిగా బయటకు గెంతి తలుపు దఢాల్న మూసేసింది (అప్పటికే గ్రెగర్ రూపాంతరం చెంది ఒక నెల కావొస్తుంది, కాబట్టి ఆమె అతని రూపం చూసి మరీ అంత హడలిపోవాల్సిన పన్లేదు), కొత్తవాళ్ళెవరైనా ఆమె హడావిడి చూస్తే, గ్రెగర్ ఆమె మీద పడి కరిచేందుకే అక్కడ కాపు కాసి ఉన్నాడేమో అనుకునేవారు. అతను వెంటనే సోఫా కిందకు పాకి దాక్కున్నాడు, కానీ ఆమె మళ్ళీ మధ్యాహ్నం దాకా వెనక్కు రాలేదు, వచ్చే దాకా అతను సోఫా కిందే ఎదురుచూడాల్సి వచ్చింది, మధ్యాహ్నం వచ్చినపుడు ఆమె మామూలు కన్నా కాస్త చీకాకుగా ఉన్నట్టు తోచింది. అప్పుడు అతనికి అర్థమైంది, తన రూపమంటే ఆమెకు ఇంకా అసహ్యమే, బహుశా ఎప్పటికీ అసహ్యంగానే మిగిలిపోవచ్చు, అంతెందుకు, ఈ సోఫా కింద నుంచి కనపడే తన కొద్ది పాటి శరీరాన్ని చూసి పారిపోకుండా ఉండటానికి కూడా ఆమె చాలా నిగ్రహించుకుంటుందేమో. ఆమెకు ఆ ఇబ్బంది కూడా లేకుండా చేద్దామని ఒక రోజు సోఫా మీదున్న దుప్పటిని తన వీపు మీదకి మార్చుకున్నాడు – ఈ పనికి నాలుగు గంటల పైనే పట్టింది – తాను ఏ మాత్రం కనపడకుండా ఉండేట్టుగా దాన్ని అమర్చుకున్నాడు, ఇప్పుడు చెల్లాయి కిందకు వంగినా అతణ్ణి చూడలేదు. ఈ అమరిక అనవసరమని ఆమెకు అనిపిస్తే ఆ దుప్పటిని తీసేసేదే (ఎందుకంటే ఇలా తన్ను తాను కప్పివుంచుకుని గ్రెగర్ సుఖపడేదేం లేదని ఎవరికైనా అర్థమవుతుంది), కానీ ఆమె ఎలా ఉన్నదాన్ని అలాగే వదిలేసింది, అంతే కాదు, ఈ అమరిక పట్ల ఆమె స్పందన ఏమిటో చూద్దామని గ్రెగర్ తన దుప్పటిని కొంచెం పైకెత్తినపుడు, ఆమె తన వంక కృతజ్ఞతా భావంతో చూసినట్టు కూడా అనిపించింది.

తల్లిదండ్రులైతే మొదటి రెండు వారాలూ అతని గది దరిదాపులకు వచ్చే ధైర్యం కూడా చేయలేకపోయారు, అతని చెల్లాయి పడుతున్న శ్రమని మాత్రం మెచ్చుకునేవారు (ఇదివరకట్లా ఆమెను అక్కరకు రాని పిల్లగా చూడటం మానేశారు), రోజులు గడిచే కొద్దీ వాళ్ళలో కాస్త ధైర్యం వచ్చింది, చెల్లాయి అతని గది సర్దుతుంటే ఇద్దరూ బయట నిలబడటం ప్రారంభించారు, ఆమె బయటకు రాగానే లోపలి విషయాలన్నీ అడిగి కనుక్కునేవారు, ఆమె వెళ్ళినపుడు అతనేం చేస్తున్నాడో, ఆ రోజు ఏం తిన్నాడో, ఈ సారి అతని ప్రవర్తన ఎలా ఉందో, పరిస్థితిలో ఏమన్నా మెరుగుదల కన్పించిందో లేదో, ఇవన్నీ ఆమెను అడిగి చెప్పించుకునేవారు. అతని తల్లయితే తాను కూడా గ్రెగర్‌ని చూస్తానని పట్టుబట్టడం మొదలుపెట్టింది, మొదట్లో తండ్రీ, చెల్లాయీ ఇద్దరూ కలిసి తార్కికమైన వాదనలతో ఎలాగోలా నచ్చజెప్పి ఆపగలిగారు (ఈ వాదనల్ని గ్రెగర్ చాలా శ్రద్ధగా విని, పూర్తిగా ఏకీభవించాడు), కానీ రాన్రానూ ఆవిణ్ణి బలవంతంగా ఆపాల్సి వచ్చేది, అంతా అయ్యాకా ఆవిడ ఇలా అరిచేది: ‘నన్ను నా బిడ్డను చూడనివ్వండి, వాడు కష్టంలో ఉన్నాడు! ఎందుకు అర్థం చేసుకోరు నన్ను?’ ఇలాంటి మాటలు విన్నప్పుడు గ్రెగర్‌కి కూడా ఆవిణ్ణి లోపలికి రానివ్వటమే మంచిదేమో అనిపించటం మొదలైంది, రోజూ కాకపోయినా, కనీసం వారానికోసారి రానివ్వచ్చు; ఎంతైనా ఆవిడ చెల్లాయి కన్నా మెరుగ్గా పరిస్థితుల్ని అర్థం చేసుకోగలదు, చెల్లాయి పడే కష్టం తక్కువనేం కాదు గానీ, నిజానికి ఆమె ఇంకా చిన్న పిల్లే, బహుశా బాల్య సహజమైన తెంపరితనంతోనే ఇదంతా తన భుజాల మీద వేసుకుందేమో కూడా.

తల్లిని చూడాలన్న గ్రెగర్ కోరిక త్వరలోనే తీరింది. ఈ మధ్య అతను తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకులెమ్మని పగటిపూట కిటికీ దగ్గర గడపటం మానుకున్నాడు, ఇక మిగిలిన కొన్ని చదరపు అడుగుల నేలా ఎంతసేపని పాకుతాడు, రాత్రంతా ఒకే చోట కదలకుండా పడుకోవాలంటే దుర్భరంగా ఉండేది, మరోపక్క తిండిపట్ల ఇదివరకటి అనురక్తి కూడా చాలా త్వరగా క్షీణించిపోసాగింది, దాంతో, ఇక వేరే కాలక్షేపం ఏం లేక, అతను గోడల మీదా, పై కప్పు మీదా అడ్డదిడ్డంగా పాకటం అలవాటు చేసుకున్నాడు. అన్నింట్లోకీ పైకప్పు నుంచి వేలాడటం అతనికి బాగా నచ్చిన విన్యాసం; నేల మీద నిలబడటంతో పోలిస్తే ఇది చాలా భిన్నమైనది; ఈ భంగిమలో మామూలు కన్నా బాగా శ్వాస తీసుకోగలిగేవాడు, శరీరం అంతా సన్నగా కంపిస్తూండేది, సంతృప్తమయమైన ఈ పరాకులో పడి ఒక్కోసారి పట్టుకోల్పోయి కింద కూడా పడిపోయేవాడు. కానీ ఇదివరకటి కన్నా మెరుగ్గా శరీరాన్ని అదుపులో ఉంచుకోవటం అలవాటవటంతో, అంత ఎత్తు నుంచి కింద పడినా ఏ దెబ్బా తగలకుండా కాచుకోగలిగేవాడు. గ్రెగర్‌కి ఓ కొత్త కాలక్షేపం దొరికిందన్న సంగతి చెల్లాయి త్వరలోనే గుర్తించింది – ఎందుకంటే అతను పాకిన చోటల్లా ఏదో జిగట పదార్థం జాడలుగా అంటుకునేది – వెంటనే ఆమె బుర్రలో ఒక ఆలోచన పుట్టుకొచ్చింది, గ్రెగర్‌కు పాకటానికి తగినంత చోటు కల్పించాలి, అందుకోసం అతనికి అడ్డు లేకుండా కొంత ఫర్నిచర్‌ని తొలగించాలి, వీటిలో ముఖ్యమైనవి అతని మేజాబల్ల, బీరువా. కానీ వాటిని కదపటం ఆమె ఒక్కదాని వల్లా అయ్యే పని కాదు; తండ్రిని సాయం అడిగే ధైర్యం చేయలేకపోయింది; పనమ్మాయి సాయానికి రావటమన్న ప్రస్తకే లేదు, ఎందుకంటే, పాత వంటమనిషి మానేసిందగ్గర్నుంచీ మేకపోతు గాంభీర్యంతో ఎలాగో నెట్టుకొస్తోన్న ఈ పదహారేళ్ళ అమ్మాయి ముందే ఒక షరతు విధించింది, అదేమిటంటే, ఎవరైనా తెరవమంటే తప్ప ఆమె వంటగది తలుపు ఎప్పుడూ మూసే ఉంచుతుంది; దాంతో ఇక చెల్లాయికి మిగిలింది ఒకటే దారి. ఒకరోజు, తండ్రి ఇంట్లో లేనపుడు, తల్లిని పిలుచుకొచ్చింది. ఆవిడ రావటం ఆనందంతో తబ్బిబ్బుగా మాట్లాడుతూనే వచ్చింది, కానీ గ్రెగర్ గది గుమ్మం దాకా వచ్చేసరికి మౌనం దాల్చింది. మొదట చెల్లాయి లోపలికి వచ్చి అంతా సక్రమంగా ఉందో లేదో చూసింది; ఆ తర్వాతే తల్లిని లోపలికి రానిచ్చింది. గ్రెగర్ కంగారుగా తన దుప్పటిని మరింత కిందకు లాక్కుని, దాన్ని అటూ ఇటూ గుంజుతూ మడతలు పడేట్టు చేశాడు; ఇప్పుడు చూట్టానికి ఆ సోఫా మీద ఒక దుప్పటి కాజువల్‌గా పడి ఉన్నట్టు కనిపిస్తుంది. గ్రెగర్ ఈసారి దుప్పటి చాటు నుంచి చూసే ప్రయత్నం కూడా చేయలేదు; తల్లి దర్శన భాగ్యాన్ని తర్వాతెప్పటి కన్నా వాయిదా వేసుకున్నాడు, అసలు ఆమె రావటమే మహద్భాగ్యమనుకున్నాడు. చెల్లాయి, ‘రా అమ్మా, నీకు కనిపించడు,’ అంటోంది, ఆమె తల్లి చేయి పట్టుకుని లోపలికి నడిపిస్తున్నట్టుంది. కాసేపటికి ఆ ఇద్దరు బక్క ప్రాణులూ కలిసి చాలా బరువైన ఆ బీరువాని కదపటానికి చేస్తున్న చప్పుడు గ్రెగర్‌కి వినిపించసాగింది, తల్లి మందలిస్తున్నా వినకుండా, చెల్లాయి ఎక్కువ బరువు తన మీదే వేసుకుంటోంది, ఎక్కడ మీద పారేసుకుంటుందోనని తల్లి భయం. ఇద్దరూ కాసేపు తంటాలు పడ్డారు. ఒక పావుగంట తర్వాత, ఇక తల్లి చేతులెత్తేసింది, ఆ బీరువా ఎక్కడుందో అక్కడే వదిలేయటం మంచిదని తీర్మానించింది. ఎందుకంటే, మొదటి కారణం, అది చాలా బరువుగా ఉంది, తండ్రి వచ్చేలోగా ఆ పని పూర్తవటం అన్నది అసాధ్యం, చివరికి ఎలాగూ మధ్యలోనే వదిలేయాల్సి వస్తుంది, అప్పుడది గ్రెగర్ కదలికలకు ఇదివరకటి కన్నా పెద్ద ఆటంకం అవుతుంది; రెండో కారణం, అసలు ఫర్నిచర్ తొలగించటం ద్వారా గ్రెగర్‌కి తాము మేలే చేస్తున్నామా అన్నది కూడా ఖచ్చితంగా తెలియదు. కీడే ఎక్కువని ఆవిడ ఉద్దేశం; ఆ బోసిపోయిన గోడలు చూస్తే ఆవిడకే గుండెలు దేవేస్తున్నాయే; మరి గ్రెగర్‌కి కూడా అలానే అనిపించదని గారంటీ ఏంటి, అతను ఈ ఫర్నిచర్‌కి చాన్నాళ్ళుగా అలవాటు పడిపోయాడు, ఇపుడు గది ఖాళీ చేస్తే అందరూ తనని వెలి వేశారని అనుకునే అవకాశం ఉంది. ‘పైగా వాడికి అనిపించదూ,’ ఆమె మెల్లగా అంది – నిజానికి ఆవిడ ఇదంతా గుసగుసగానే మాట్లాడుతోంది, తన మాటలు అతనికి అర్థం కావని ఎలాగూ తెలుసు, వినిపించకూడదని కూడా అనుకుంటుంది – ‘ఇలా ఫర్నిచర్ తొలగించటం వల్ల వాడు ఇక ఎప్పటికైనా బాగవుతాడన్న ఆశ మనం వదిలేసుకున్నట్టూ, వాడి మానాన వాణ్ణి కర్కశంగా విడిచిపెట్టినట్టూ వాడికి అనిపించదూ? అందుకే గది ఎలా ఉందో అచ్చం అలాగే వదిలేయటం మంచిది. అలాగైతే, వాడు మళ్ళీ మనలో ఒకడయ్యాకా, అంతా ఇంతకుముందులాగే ఉందనీ, ఏదీ మారలేదనీ గమనిస్తాడు, అప్పుడు ఈ మధ్యలో జరిగిందంతా మర్చిపోవటం వాడికి ఇంకాస్త సులభమవుతుంది.’

తల్లి మాట్లాడిన ఈ మాటలు విన్నాకా గ్రెగర్కుు ఒకటే అనిపించింది, గత రెండు నెలలుగా మనిషన్న వాడితో మాటలు లేకపోవటం వల్లనూ, మొనాటనస్‌గా సాగే కుటుంబ జీవితం వల్లనూ, తన బుద్ధి మందగించినట్టుంది; లేదంటే గది ఖాళీగా ఉంటే బాగుంటుందనే ఆలోచన తనకసలు ఎలా కలిగింది? పాత ఫ్యామిలీ ఫర్నిచర్‌తో సౌకర్యవంతంగా అమరిన ఈ గది ఒక గుహలా మారితే చూడాలని తానెలా అనుకున్నాడు, అందులో స్వేచ్ఛగా పాకటానికీ, నిరాటంకంగా నలుదిక్కులకీ వెళ్ళటానికీ ఏ అడ్డూ లేకపోవచ్చు గాక, కానీ దానికి బదులుగా చెల్లించాల్సిన మూల్యం తన మానవ గతాన్ని పూర్తిగా మర్చిపోవటమే కాదూ? నిజానికి ఇప్పటికే తాను ఆ మరుపు అంచుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు, ఇప్పుడు తల్లి గొంతు, చాన్నాళ్ళుగా వినని తన తల్లి గొంతు విన్నాడు కాబట్టే తిరిగి తెలివిలో పడ్డాడు. అవును, ఒక్క వస్తువు కూడా కదపటానికి వీల్లేదు; ఎలా ఉన్నది అలాగే ఉండాలి; ఈ ఫర్నిచర్ తన మీద కలిగించే మంచి ప్రభావం తనకు అత్యవసరం; దారీతెన్నూ లేని తన పాకుళ్ళలో ఫర్నిచర్ అడ్డం వస్తే మాత్రం ఏమైంది, అదేం పెద్ద నష్టం కాదు, అదీ తన మంచికే.

కానీ చెల్లాయి ఆలోచన వేరేలా ఉంది; గ్రెగర్కి్ సంబంధించిన వ్యవహారాల్లో ఆమె తల్లిదండ్రుల ముందు ఒక స్పెషల్ ఎక్స్‌పర్టు హోదా ప్రదర్శించటానికి బాగా అలవాటు పడిపోయింది; ఇప్పుడు తల్లి కలగజేసుకుని తనకు సలహా ఇవ్వబోవటంతో ఆమె మరింత రెచ్చిపోయి, ముందు అనుకున్నట్టుగా ఒక్క బీరువానూ, మేజాబల్లనే కాదు – తప్పనిసరైన ఒక్క సోఫా మినహాయించి – చిన్న చెక్క ముక్కన్నది కూడా మిగలకుండా ఫర్నిచర్‌అంతా బయటకు పట్టుకుపోదామని పట్టుబట్టడం మొదలుపెట్టింది. ఈ పట్టుదల వెనుక పసితనపు మంకుపట్టు కొంతా, ఈ మధ్య ఆమెలో అనూహ్యంగా పెరిగిన ఆత్మవిశ్వాసం కొంతా ఉన్నాయి; పైగా గ్రెగర్‌కి పాకటానికి చాలా చోటు అవసరమనీ, అతనెలాగూ ఈ ఫర్నిచర్‌వాడేది లేదనీ ఆమెకు నిజంగానే అనిపించింది. దానికి తోడు, ఆ వయసు ఆడపిల్లలలో సహజంగా ఉంటూ, ఏ సందు దొరికినా వ్యక్తం కావాలని చూసే, సాహసకాంక్ష కూడా తన వంతు పాత్ర పోషించింది. అదే ఆమె చేత గ్రెగర్ పరిస్థితిలోని తీవ్రతను ఉన్నదానికన్నా రెట్టింపు చేసి చూసేలా చేసింది, అప్పుడైతే అతని కోసం మరింత పెద్ద విన్యాసాలు చేయొచ్చు. ఎందుకంటే, గ్రెగర్ ఒంటరిగా ఖాళీ గోడల్ని ఏలే ఆ గదిలోకి అడుగు పెట్టే ధైర్యం అప్పుడు ఒక్క గ్రెటె‌కి తప్ప ఇంకెవరికీ ఉండబోదు.

అందుకే తల్లి ఎంత నచ్చచెప్పినా ఆమె తన నిర్ణయాన్ని ససేమిరా మార్చుకోలేదు, ఓ పక్క తల్లి కూడా తానున్నది గ్రెగర్ గదిలో అన్న గాభరాలో పడి, తన జడ్జిమెంటుపై తనకే నమ్మకం లేని స్థితిలో ఉంది; దాంతో ఇక నచ్చచెప్పడం మానేసి, బీరువా బయటకు సాయంపట్టడంలో కూతురికి సాయంగా తనూ ఓ చేయి వేసింది. పోనీ బీరువా పోతే పోయింది, కానీ మరింకేమీ పట్టికెళ్ళటానికి వీల్లేదు; మేజాబల్ల ఖచ్చితంగా ఉండాల్సిందే. ఆ ఇద్దరు ఆడవాళ్ళు ఆపసోపాలు పడుతూ బీరువాను గుమ్మం దాటించారో లేదో, గ్రెగర్ సోఫా కింద నుంచి తల బయటకు పెట్టి ఈ విషయంలో తాను చాకచక్యంగా ఎలా జోక్యం చేసుకోవాలా అన్నది పరిశీలించాడు. కానీ ఇంతలో అతని తల్లి గదిలోకి తిరిగి వచ్చింది. చెల్లాయి పక్క గదిలోనే ఉండిపోయి, బీరువా తానొక్కతే మోసేయాలని, దాని చుట్టూ చేతులు బిగించి, అటూ ఇటూ ఊగిస్తోంది, కానీ ఒక్క అంగుళం కూడా కదపలేకపోతోంది. తల్లికి గ్రెగర్ ఆకారం అలవాటు లేదు; భయపడే అవకాశం ఉంది; కాబట్టి గ్రెగర్ కంగారుగా సోఫాకి అటువైపు దాక్కున్నాడు. కానీ ఈ క్రమంలో సోఫా మీది దుప్పటి చిన్నగా ఊగటాన్ని అరికట్టలేకపోయాడు. ఆ మాత్రం కదలిక సరిపోయింది, తల్లి అప్రమత్తం కావటానికి. ఆవిడ ఉన్న చోటే స్థాణువై ఆగిపోయింది, క్షణం పాటు కదలకుండా అలాగే నిలబడి, చప్పున వెనక్కి తిరిగి కూతురు దగ్గరకు వెళ్ళిపోయింది.

జరుగుతున్నది పెద్ద ఉపద్రవమేం కాదనీ, వాళ్ళు చేస్తున్నదల్లా కొంత ఫర్నిచర్‌ని బయటకు తీసుకువెళ్ళడమేననీ గ్రెగర్ ఎంతగా తనకు తాను నచ్చచెప్పుకోవటానికి ప్రయత్నించినా, గదిలోకి ఆ ఇద్దరాడవాళ్ళ రాకపోకలు, ఒకర్ని ఉద్దేశించి ఒకరి అరుపులు, ఫర్నిచర్ నేల మీద ఈడుస్తున్న చప్పుడు, వీటన్నింటి వల్లా నలువైపుల్నుంచీ తనను ఏదో పెద్ద అపాయం చుట్టుముడుతున్నట్టు అతనిలో కంగారు మొదలైంది. తన తలనూ కాళ్ళనూ దగ్గరగా ముడుచుకుని నేలకు కరచుకుపోయి పడుకున్నా లాభం లేకపోయింది, ఇదంతా తాను ఎక్కువ సేపు భరించలేడన్న నిజాన్ని అంగీకరించక తప్పలేదు. వాళ్ళు తన గదిని నామరూపాల్లేకుండా చేస్తున్నారు; అత్యంత ప్రియమైన వస్తువులన్నింటినీ తనకు కాకుండా చేస్తున్నారు; తాను ఫ్రేమ్‌లు తయారుచేయటానికి వాడే పొట్టి రంపమూ, ఇంకా వేరే పనిముట్లూ ఉన్న బీరువా ఇప్పటికే బయటకు తీసుకుపోయారు; ఇప్పుడు నేలలో దిగబడి ఉండే తన మేజాబల్లని బయటకు పెకలించటానికి అటూ యిటూ ఆడిస్తున్నారు, అతను కమర్షియల్ అకాడెమీలో వ్యాకరణ విద్యార్థిగా ఉన్నప్పటి నుంచీ ఆ బల్ల మీదే హోమ్వర్కు చేసుకునేవాడు, అవును, తన ప్రైమరీ స్కూలు రోజుల్నించీ, దాన్నే వాడేవాడు, ఇప్పుడు అది కూడా దూరమైపోతోంది – దాంతో ఇక అతనికి ఆ ఆడవాళ్ళ ఉద్దేశాలూ మంచివో కావో ఆలోచించే తీరికా ఓపికా లేకపోయింది, అసలు వాళ్ళ ఉనికే మర్చిపోయాడు, ఎందుకంటే వాళ్ళు పూర్తిగా అలిసిపోయి ఇక నిశ్శబ్దంగా పని చేసుకుంటూ పోతున్నారు, తడబడుతూ బరువుమోస్తున్న వాళ్ళ పాదాల చప్పుడు తప్ప మరింకేం వినపడటం లేదు.

అప్పుడు అతను తన మరుగు నుంచి బయటకు వచ్చాడు – ఆ సమయంలో ఇద్దరాడవాళ్ళూ పక్క గదిలో ఉన్నారు, మేజాబల్లకు ఆనుకుని ఆయాసపడుతూ కాస్త విరామం తీసుకుంటున్నారు – అతను ముందు ఏ సామాను రక్షించుకోవాలో తెలియక, కంగారుగా ఓ నాలుగుసార్లు అటూ ఇటూ చక్కర్లు కొట్టాడు, అప్పుడు కనిపించింది, గోడ మీద ఉన్ని దుస్తుల్లో మునిగిపోయిన అమ్మాయి బొమ్మ, అప్పటికే ఆ గోడ అంతా ఖాళీ కావటంతో అది మరింత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది, అతను జరజరా దాని మీదకు పాకాడు, ఆ బొమ్మపై ఉన్న గాజుపలక కేసి తనను అదుముకున్నాడు, అతని వేడి పొట్టకు ఊరట కలిగిస్తూ గట్టిగా అతుక్కుపోయింది. వాళ్ళు దేన్నయినా పట్టుకుపోనీ, ఈ బొమ్మని మాత్రం పట్టికెళ్ళటానికి వీల్లేదు. అతను ఇప్పుడా బొమ్మను పూర్తిగా ఆక్రమించుకుని ఉన్నాడు. తల మాత్రం లివింగ్ రూము తలుపు వైపు తిప్పి ఆడవాళ్ళిద్దరూ ఎప్పుడు తిరిగి వస్తారా అని చూస్తున్నాడు.

వాళ్ళిద్దరూ విరామాన్ని త్వరగానే ముగించుకుని తిరిగి వచ్చారు; గ్రెటె తల్లి చుట్టూ చేయి వేసి దాదాపు ఆమెను మోస్తున్నట్టే లోపలికి తీసుకు వచ్చింది. ‘చెప్పు, ఇప్పుడేం తీసుకెళ్దాం?’ అంటూ గదంతా కలయజూసింది. అప్పుడు, ఆమె కళ్ళు, గోడ మీంచి తన వైపే చూస్తున్న గ్రెగర్ కళ్ళతో కలిశాయి. బహుశా తల్లి పక్కనే ఉండటం వల్ల కాబోలు, గ్రెటె ఏమీ చూడనట్టే తమాయించుకుంది, తల్లి దృష్టి అటు వైపు పోకుండా తన తలను ఆవిడకు తలకు బాగా దగ్గరగా తెచ్చి, కంపిస్తున్న గొంతుతో, గబగబా, ‘ఏమ్మా, ఇంకాసేపు లివింగ్ రూములోనే రెస్టు తీసుకుందామా,’ అంది. గ్రెగర్‌కు ఆమె ఉద్దేశమేమిటో స్పష్టంగానే అర్థమైంది: ముందు అమ్మని జాగ్రత్తగా బయటకు పంపించి, తర్వాత నన్ను కిందకు తరిమేయాలనుకుంటోంది. అదెలా జరుగుతుందో నేనూ చూస్తాను! అతను బొమ్మకు మరింత దగ్గరగా అదుముకుపోయాడు. దాన్ని మాత్రం వదులుకునే సమస్యే లేదు, అంత దాకా వస్తే గ్రెటె ముఖం మీదకే దూకుతాడు.

కానీ గ్రెటె మాటలు తల్లి గాభరాను మరింత పెంచాయి; ఆవిడ వారగా వంగి, పువ్వుల వాల్ పేపర్ మీద ముక్కుపొడుం రంగులో ఉన్న మరకను చూడనే చూసింది, తాను చూస్తోంది గ్రెగర్‌నే అని ఇంకా జీర్ణించుకోక ముందే, ‘దేవుడా, అయ్యో దేవుడా!’ అంటూ జీరగా పూడుకుపోయిన గొంతుతో గట్టిగా అరిచింది, సర్వం కోల్పోయినట్టు చేతులు వేలాడేసి సోఫా మీద కూలబడిపోయింది, ఇక మళ్ళీ కదల్లేదు. ‘ఏయ్ గ్రెగర్! నిన్నే,’ చెల్లాయి ఆగ్రహంతో పిడికిలి బిగించి అరిచింది. గ్రెగర్ రూపాంతరం తర్వాత ఆమె అతనితో మాట్లాడటం ఇదే మొదటిసారి. తల్లికి స్పృహ తప్పకుండా ఏదన్నా అరుకు తేవాలని ఆమె పక్క గదిలోకి పరిగెత్తింది; గ్రెగర్ కూడా సాయపడాలనుకున్నాడు – ఆ బొమ్మని తర్వాతైనా కాపాడుకోవచ్చనిపించింది – కానీ అతని పొట్ట ఆ గాజు పలకకు గట్టిగా అంటుకుపోవటంతో బలవంతాన ఊడ పెరుక్కోవాల్సి వచ్చింది; గోడ దిగి పాత రోజుల్లోలా చెల్లాయికి ఏదో సలహా ఇవ్వటానికన్నట్టు పక్క గదిలోకి పరిగెత్తాడు; తీరా వెళ్ళాక ఏం చేయాలో తోచలేదు, ఆమె వెనక ఊరికే అలా నిలబడ్డాడు; ఆమె అక్కడున్న అరుకు సీసాలన్నీ ఆదరాబాదరాగా వెతుకుతున్నదల్లా ఎందుకో వెనక్కు చూసి హడలిపోయింది; ఒక సీసా గచ్చు మీద పడి పగిలింది; ఏదో మంట పుట్టించే ద్రావకం అతని చుట్టూ ఒలికింది; గ్రెటె ఇంక ఆలస్యం చేయకుండా మోసుకెళ్ళగలిగినన్ని మందు సీసాల్ని చేజిక్కించుకుని తల్లి దగ్గరకు పరిగెత్తింది, గది లోపలికి వెళ్ళగానే కాలితో తలుపును వెనక్కు తన్ని మూసేసింది. ఇప్పుడు గ్రెగర్ తల్లి నుంచి వేరైపోయాడు, ఆవిడేమో లోపల తన కారణంగా మరణపు అంచుల్లో ఉంది; కానీ తలుపు తీసే ధైర్యం చేయలేకపోయాడు, తీస్తే చెల్లాయి బెదిరి పారిపోగలదు, ఇప్పుడు తల్లికి ఆమె అవసరం చాలా ఉంది; ఎదురుచూడటం తప్ప తాను చేయగలిగిందేమీ లేదు; తన్ను తాను తిట్టుకుంటూ గాభరాగా అటూ ఇటూ పాకడం మొదలుపెట్టాడు, గోడలూ, ఫర్నిచర్, పైకప్పు, అన్నీ ఎడాపెడా పాకేస్తున్నాడు, కాసేపటికి గది మొత్తం తన చుట్టూ గిర్రున తిరుగుతున్నట్టనిపించింది, నిస్సత్తువగా గది మధ్యన ఉన్న టేబిల్ మీద కుప్పకూలిపోయాడు.

సమయం గడిచింది; గ్రెగర్ ఎక్కడివాడక్కడే నీరసంగా పడిపోయి ఉన్నాడు; చుట్టూ నిశ్శబ్దంగా ఉంది, అది శుభ సూచకమే కావచ్చు. ఇంతలో డోర్‌బెల్ మోగింది. పనమ్మాయి వంటగదికి తాళం వేసుకుని లోపలే కూర్చోవటంతో, గ్రెటె బయటకెళ్ళి తలుపు తీసింది. తండ్రి లోపలికి వస్తూనే, ‘ఏమైంది?’ అన్నాడు; బహుశా గ్రెటె వాలకం చూడగానే విషయం కనిపెట్టేసినట్టున్నాడు. గ్రెటె ఆయన గుండెల మీద తల వాల్చినట్టుంది, ఆమె గొంతు పూడుకుపోయినట్టు వినిపించింది: ‘అమ్మ స్పృహ తప్పింది, కానీ ఇప్పుడు బానే ఉంది. గ్రెగర్ అదుపు తప్పాడు’ అందామె. ‘అనుకుంటూనే ఉన్నాను. మీకు చెప్తూనే ఉన్నాను కూడా, కానీ మీ ఆడాళ్ళు నా మాట వినే రకాలు కాదుగా,’ అన్నాడు తండ్రి. గ్రెగర్‌కి అర్థమైంది, చెల్లాయి అతి క్లుప్తంగా చెప్పిన విషయాన్ని తండ్రి వేరేలా అర్థం చేసుకున్నాడు, తానేదో హింసాత్మకంగా ప్రవర్తించానని అనుకుంటున్నాడు. ఇప్పుడు గ్రెగర్‌కి సంజాయిషీ ఇచ్చుకునే వీలూ సమయమూ లేవు, తండ్రిని ఏదోలా శాంతపరచక తప్పదు. అతను చకచకా తన గది తలుపు దగ్గరకు వెళ్ళి దానికి బాగా అతుక్కుపోయి నిలబడ్డాడు. ఇలాగైతే తండ్రి హాల్లోకి వచ్చి చూసినపుడు, తాను తిన్నగా తన గదిలోకి వెళ్ళిపోవాలన్న సదుద్దేశంతోనే ఉన్నాడనీ, తనను తరమక్కర్లేదనీ అర్థం చేసుకుంటాడు; కానీ ముందు ఈ తలుపు తెరుచుకుంటే బాగుణ్ణు.

కానీ తండ్రి ఇలాంటి సున్నితమైన భేదాల్ని పట్టించుకునే మూడ్లో లేడు; లోపలికి వస్తూనే, గ్రెగర్‌ని చూసి, ‘ఆహ్!’ అని అరిచాడు; ఆ గొంతులో పట్టరాని ఆగ్రహమూ, దొరికాడన్న ఉత్సాహమూ ఒకేసారి ధ్వనించాయి. గ్రెగర్ తలుపు మీంచి తల తిప్పి తండ్రి వైపు చూశాడు. ఆయన ఎంత దృఢంగా నిలబడ్డాడో! తండ్రి ఇలా ఉంటాడని గ్రెగర్ ఎప్పుడూ ఊహించలేదు; తానీ మధ్య ఇరవైనాలుగ్గంటలూ అడ్డదిడ్డంగా పాకటమనే సరదాలో పడి ఇంట్లో ఏమవుతుందో పట్టించుకోవటం మానేశాడు, పరిస్థితులు చాలా మారి ఉంటాయని ముందే గ్రహించాల్సింది. అయితే మాత్రం, మరీ ఇంత మార్పా! అసలు ఈ కనిపించేది నిజంగా తన తండ్రేనా? తాను ఉద్యోగ ప్రయాణాల నిమిత్తం బయటకు వెళ్ళేటపుడు, ఎప్పుడు చూసినా నిస్సత్తువగా మంచం మీద పడుకుని కనిపించే మనిషి ఈయనేనా; మళ్ళీ సాయంత్రాలు తిరిగి వచ్చినపుడు డ్రెస్సింగ్ గౌన్ వేసుకుని పడక్కుర్చీలో నడుంవాల్చి కనిపించే మనిషి ఈయనేనా; ఆ సమయాల్లో పైకి లేచే ఓపిక కూడా లేనట్టు ఓ చెయ్యి మాత్రం ఎత్తి పలకరించి ఊరుకునేవాడు; అలాగే అరుదైన సందర్భాల్లో (ఏడాదికి కొన్ని ఆదివారాల్లోనో, యూదు సెలవుదినాల్లోనో) కుటుంబమంతా కలిసి సరదాగా బయట వాకింగ్‌కు వెళ్ళినపుడు కూడా, ఆయన తన పాత ఓవర్‌కోటు తొడుక్కుని, అసలే నింపాదిగా నడిచే గ్రెగర్‌కీ అతని తల్లికీ మధ్య, వాళ్ళ కన్నా కూడా నింపాదిగా నడిచేవాడు, ప్రతి అడుక్కీ తన వంపు తిరిగిన ఊతకర్రని ఎదురుగా మోపుతూ నడిచేవాడు, తాను ఏదైనా చెప్పాలనుకున్నపుడు ఉన్న చోటే ఆగిపోయి, ముందు వెళ్తున్న వాళ్ళని తన చుట్టూ గుమికూడేట్టు చేసుకునేవాడు; ఆ మనిషీ ఈ మనిషీ ఒకరేనా? ఇప్పుడీయన నిటారుగా దృఢంగా ఉన్నాడు, గిల్టు బొత్తాలు మెరుస్తోన్న బిగుతైన నీలం యూనిఫాం తొడుక్కున్నాడు, అది బాంకు బంట్రోతులు తొడుక్కునే యూనిఫాం; ఎత్తుగా బిరుసుగా ఉన్న దాని కాలర్ మీద ఆయన బలమైన కింది చుబుకం ఉబ్బి బరువుగా వేలాడుతోంది; గుబురుల్లాంటి కనుబొమ్మల కింద నల్లని కళ్ళు చురుగ్గా సూదుల్లా చూస్తున్నాయి; ఇదివరకూ ఎప్పుడూ చెదిరి కనిపించే ఆయన తెల్లని జుట్టు ఇప్పుడు తిన్నగా తీసిన పాపిటకు చెరో వైపూ నున్నగా తళతళ్ళాడేలా దువ్వబడింది. ఆయన తన టోపీ విసిరాడు – దాని మీద ఏదో బాంకుకి సంబంధించిన లోగో ఉంది – అది గదికి అడ్డంగా ఎగిరి గాల్లో వంకీ కొడుతూ సోఫా మీద పడింది, తన కోటు అంచులు వెనక్కు పడేట్టు చేతుల్ని పంట్లాం జేబుల్లో దోపుకుని, భీకరమైన ముఖంతో గ్రెగర్ వైపు నడిచాడు. ఆయన ఏం చేయాలనుకున్నాడో ఆయనకైనా తెలుసో లేదో; ముందైతే కాలు మాత్రం ఎత్తుగా లేపాడు; ఆయన బూటు అంచుల భారీ పరిమాణం గ్రెగర్‌ను నిశ్చేష్టుణ్ణి చేసింది. అతను ఇక ఏమీ ఆలోచించలేదు; ఈ కొత్త జీవితం మొదలైన తొలి రోజు నుంచీ అతనికి ఒకటి ఖాయంగా తెలుసు, తండ్రి తనతో ఎంత వీలైతే అంత కర్కశంగా వ్యవహరించాలన్నది ఒక పద్ధతిగా పెట్టుకున్నాడు. అందుకే అతను వెంటనే తండ్రికి అందకుండా పారిపోవటం మొదలుపెట్టాడు, తండ్రి ఆగినప్పుడల్లా ఆగుతున్నాడు, ఆయన ఏ మాత్రం కదిలినా మళ్ళీ పాకుతున్నాడు. ఇలా వాళ్ళిద్దరూ గది చుట్టూ చాలా చక్కర్లు కొట్టారు, కానీ ఫలితమేం తేలలేదు, అసలు దాన్ని తరమటం అని కూడా అనలేం, అంత నెమ్మదిగా సాగుతోంది. అందుకే గ్రెగర్ ఇంకా నేలనే అంటిపెట్టుకుని పాకుతున్నాడు, అదీ గాక ఇప్పుడు తాను గోడల మీదా, పైకప్పు మీదా పాకటం మొదలుపెడితే, తండ్రి దాన్ని ధిక్కారంగా భావించి మరింత రెచ్చిపోతాడేమో అని అతని భయం. కానీ నేల మీద ఎక్కువ సేపు పాకడం కూడా కష్టమేనేమో. ఎందుకంటే, తండ్రి వేసిన ఒక్కొక్క అడుగుకీ బదులుగా తాను కాళ్ళతో అనేకమైన కదలికల్ని చేపట్టాల్సి వస్తోంది. ఊపిరాడక ఆయాసం మొదలయింది, అయినా అలా తూలుతూనే పరిగెడుతున్నాడు; చివరికిక కళ్ళు కూడా మూసేసుకుని తన శక్తులన్నీ గుడ్డిగా పరిగెత్తటానికే ఖర్చుపెడుతున్నాడు; తప్పించుకోవడానికి పరుగును మించిన దారేదన్నా ఉందేమో అన్నది ఆలోచించటం కూడా మానేసి పరిగెడుతున్నాడు; ఈ అయోమయంలో పాకటానికి గోడలున్నాయన్న సంగతి కూడా మర్చిపోయాడు (అయినా నిజానికి ఆ గోడలకి జారేసిన ఫర్నిచర్ అంతా పదునైన కోణాలతోనూ, చువ్వలతోనూ ఉంది) – ఉన్నట్టుండి ఏదో వస్తువు అతని పక్క నుంచి విసురుగా దూసుకుపోయింది; నేల మీద పడి అతని ముందు నుంచి దొర్లుకుంటూ పోయింది. అది ఒక ఏపిల్; వెనువెంటనే ఇంకో ఏపిల్ కూడా ఎగురుతూ వచ్చింది; గ్రెగర్ స్థాణువై ఆగిపోయాడు; ఇక పరిగెత్తి లాభం లేదు; తండ్రి దొరికిందల్లా విసరటానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు, ఆయన అల్మరాలోని పళ్ళ గిన్నె నుంచి జేబులు నింపుకున్నాడు, ఒక్కో ఆపిల్ విసురుతున్నాడు, ప్రస్తుతానికైతే ఇంకా ఒక్కటీ సూటిగా తగిలేలా విసరలేకపోయాడు. ఎర్రెర్రని ఆపిల్ పళ్ళు కరెంటు తాకినట్టు నేలంతా దొర్లుతున్నాయి, ఫిరంగి గుళ్ళలా ఒక దాని తర్వాత మరొకటొచ్చి పడుతున్నాయి. ఒక ఆపిల్ పెద్ద ప్రమాదం లేకుండానే అతని వెనక భాగాన్ని రాసుకుంటూ పోయింది. కానీ వెనువెంటనే ఎగురుకుంటూ వచ్చిన మరో పండు మాత్రం, అతని వెనక భాగంలోకి దూరి, లోపలికంటా చొచ్చుకుపోయింది; మెలితిప్పే బాధ భంగిమ మారిస్తే పోతుందేమో అన్నట్టు, గ్రెగర్ ముందుకు కదలటానికి ప్రయత్నించాడు; కానీ మేకు కొట్టినట్టు ఉన్న చోటి నుంచి అస్సలు కదల్లేకపోయాడు, సర్వేంద్రియాలూ అయోమయంతో కంపిస్తుండగా, నేల మీద చదునుగా కూలబడిపోయాడు. ఇక స్పృహ ఇక కోల్పోతున్నాడనగా, తన గది తలుపు ధడాల్న తెరుచుకోవటమూ, తల్లి పరిగెత్తుకుంటూ రావటమూ అతనికి కనిపించింది, ఆవిడ వెనకనే చెల్లాయి అరుస్తూ వెంటపడింది, ఆవిడ పెట్టీ కోటు మాత్రమే వేసుకుని ఉంది, (ఇందాక స్పృహతప్పినపుడు గాలి ఆడేందుకు వీలుగా చెల్లాయి ఆవిడ పై దుస్తుల్ని తొలగించినట్టుంది); ఇప్పుడు ఆవిడ అతని తండ్రి వైపు పరిగెడుతోంది, ఆవిడ వెనకాలే వదులు చేయబడిన లోదుస్తులన్నీ నేల జారుతున్నాయి; స్కర్టు కాలికి అడ్డుపడటంతో తిన్నగా వచ్చి తండ్రి మీద పడింది, ఆయన్ను గట్టిగా కౌగిలించుకుని, ఒకటే శరీరంగా ఐక్యమైపోయింది – ఇక గ్రెగర్ చూపు పూర్తిగా మసకబారుతుండగా – ఆవిడ తండ్రి మెడ చుట్టూ చేతులు వేసి గ్రెగర్‌‌ని చంపొద్దని వేడుకుంటోంది.

3


ఈ గాయం గ్రెగర్‌ని నెల రోజుల పాటు లేవనీయకుండా చేసింది, దాని గుర్తుగా ఆ ఆపిల్ ఇంకా అతని మాంసంలోనే ఉంది, దాన్ని తొలగించే ధైర్యం ఎవరికీ లేకపోయింది. ఈ గాయం వల్ల తండ్రికి మాత్రం ఒక విషయం అర్థమైంది, ఎంత జుగుప్సాకరమైన రూపంలో ఉన్నా, గ్రెగర్‌కూడా తన కుటుంబంలో ఒక సభ్యుడే, అతణ్ణి శత్రువుగా చూడకూడదు, కుటుంబం పట్ల తన బాధ్యతలో భాగంగా, జుగుప్సను అణచుకుని, అతణ్ణి భరించాలి, తప్పదు.

గాయం కారణంగా గ్రెగర్ కొన్ని కదలికల్ని శాశ్వతంగా కోల్పోయాడు, ఇపుడు రోగిష్టి ముసలివాడిలా కొన్ని నిముషాలపాటు నరకప్రాయంగా కష్టపడితే తప్ప గదిలో ఆ చివర్నించి ఈ చివరి దాకా పాకలేకపోతున్నాడు, ఇక గోడ మీద పాకడమన్న ప్రశ్నే లేకుండా పోయింది, అయితే క్షీణించిన ఈ పరిస్థితికి ఊరటగా అతనికొక సదుపాయం అందజేయబడింది: ప్రతీ రోజూ సాయంత్రం వేళ లివింగ్ రూము వైపు తలుపు కాసేపు తెరిచి ఉంచేవాళ్ళు, అతను ఆ సమయం ఎప్పుడవుతుందా అని ఓ గంటా రెండు గంటల ముందు నుంచే తలుపు వైపు చూస్తూండేవాడు; అది ఎప్పటికో తెరుచుకునేది, బయట అతని కుటుంబమంతా టేబిల్ చుట్టూ చేరి దీపం వెలుగులో మాట్లాడుకునేవారు, అతను వాళ్ళెవరికీ కనపడని తన గది చీకటి మూలలో కూర్చుని, ఇదివరకట్లా దొంగచాటుగా కాకుండా, పరస్పర ఒప్పందం మీదే, వాళ్ళ సంభాషణ వినేవాడు.

అయితే ఈ సంభాషణలు పాతరోజుల్లోలా సరదాగా సాగేవి కావు, అప్పట్లో గ్రెగర్ ఎక్కడో తాను బస చేసిన చిన్న మురికి హోటల్ గదిలో చెమ్మటిల్లిన మంచం మీద అలసటగా వాలిన క్షణాల్లో కూడా ఈ సంభాషణల్ని ఎంతో మురిపెంగా తలుచుకునేవాడు. ఇప్పటి సంభాషణల్లో జీవం లేదు. రాత్రి భోజనం కాగానే తండ్రి పడక్కుర్చీలోనే నిద్రపోయేవాడు; తల్లీ, చెల్లాయీ చప్పుడు చేయవద్దని ఒకరికొకరు జాగ్రత్త చెప్పుకునేవారు; తల్లి దీపం వైపుకు బాగా వంగి ఏదో ఫాషన్ స్టోరు కోసం లోదుస్తులు కుట్టేది; సేల్స్ గర్ల్‌గా ఉద్యోగం సంపాయించిన చెల్లాయి, అంతకంటే మెరుగైన అవకాశాల కోసం, రాత్రుళ్ళు ఫ్రెంచీ, షార్ట్‌హాండూ నేర్చుకునేది. అప్పుడపుడూ తండ్రి ఉన్నట్టుండి లేచేవాడు, తాను అప్పటిదాకా నిద్రలోకి జారుకున్నాడన్న సంగతి మర్చిపోయినట్టు, తల్లితో, ‘ఇవాళ ఇంతసేపు కుడుతున్నావేమిటే!’ అనేవాడు, అన్న మరుక్షణం మళ్ళీ నిద్రలోకి జారుకునేవాడు, ఆడవాళ్ళిద్దరూ ఒకరివైపొకరు చూసి నీరసంగా నవ్వుకునేవారు.

అదేం మంకుతనమో గానీ, తండ్రి ఇంటి దగ్గర కూడా తన బాంకు బంట్రోతు యూనిఫాంని విప్పటానికి ఒప్పుకునేవాడు కాదు, ఓ పక్క ఆయన పాత డ్రెస్సింగ్ గౌను ఊరకనే బట్టలకొక్కేనికి వేలాడేది, ఆయన మాత్రం, విధి నిర్వహణకు ఎప్పుడంటే అప్పుడు తయారే అన్నట్టూ, ఇక్కడ కూడా పై అధికారికి ఏ క్షణానైనా అందుబాటులో ఉన్నట్టూ, యూనిఫాం పూర్తిగా ధరించి, అలానే పడక్కుర్చీలో పడుకునేవాడు. అసలే ఆ యూనిఫాం ఏ మంత కొత్తది కాదు, దానికి తోడు ఇలా అతిగా వాడటం వల్ల, గ్రెగర్ తల్లీ చెల్లాయీ ఎంత శ్రద్ధగా ఉతికి పెడుతున్నా, క్రమంగా దాని మెరుగు తగ్గిపోసాగింది. గ్రెగర్ చాలాసార్లు సాయంత్రమల్లా ఆ మరకలతో నిండిన, పాలిష్డ్ బొత్తాలతో మెరిసే యూనిఫాంని అలాగే చూస్తూండిపోయేవాడు. తండ్రి మాత్రం అంత ఇబ్బందికరమైన యూనిఫాంలోనూ చాలా ప్రశాంతంగా నిద్రపోయేవాడు.

గడియారం పది కొట్టగానే తల్లి మెత్తని మాటలతో తండ్రిని నిద్ర లేపేది, ఆయన్ని మంచం మీదకు వెళ్ళి పడుకోమని బతిమాలేది, ఇలా కుర్చీలో పడుకోవటం వల్ల సరైన నిద్ర పట్టదు, మళ్ళీ తెల్లారి ఆరింటికి లేచి డ్యూటీకి వెళ్ళాలంటే మంచి నిద్ర తప్పనిసరి. కానీ ఆయన మాత్రం, ఈ మధ్య బాంకు బంట్రోతు అయిందగ్గర్నుంచీ కొత్తగా నేర్చిన మంకుతనం ప్రదర్శిస్తూ, తానింకా కాసేపు టేబిల్ దగ్గరే కూచుంటాననేవాడు, కానీ మళ్ళీ నిద్రలోకి జారుకునేవాడు; ఇక ఆ తర్వాత ఆయన్ని పడక్కుర్చీ నుంచి కదపాలంటే విశ్వప్రయత్నమే చేయాల్సొచ్చేది. గ్రెగర్ తల్లీ చెల్లాయీ కలిసి లోపలికి వెళ్లి పడుకొమ్మని ఎంతగా పోరినా, ఆయన పైకి లేవటానికి ససేమిరా అంటూ కళ్ళు కూడా తెరవకుండా ఓ పావుగంట తల అడ్డంగా ఆడిస్తూనే ఉండేవాడు. గ్రెగర్ తల్లి ఆయన భుజాన్ని పట్టుకు లాగుతూ, చెవిలో బుజ్జగింపుగా మాట్లాడేది, చెల్లాయి కూడా తన పని పక్కన పెట్టి తల్లికి సాయం వెళ్ళేది, అయినా ఆయన అంగుళం కదిలేవాడు కాదు. సరికదా మరింతగా పడక్కుర్చీలో కూరుకుపోయేవాడు. ఇలా లాభం లేదని ఆడవాళ్ళిద్దరూ ఆయన చంకల కింద చేతులు పెట్టి పైకి లేపేందుకు ప్రయత్నించేవారు, అప్పుడు కానీ కళ్ళు తెరిచే వాడు కాదు, అటూ ఇటూ ఆడవాళ్ళిద్దరి వైపూ మార్చి మార్చి చూస్తూ, ‘ఇదీ, ఈ ముసలితనంలో నాకు దొరికిన మనశ్శాంతి!’ అనేవాడు, నెమ్మదిగా ఇద్దరాడవాళ్ళ మీదా బరువు మోపి కాళ్ళపై లేచి నిలబడేవాడు, వాళ్ళు మీదే వాలిపోయి గుమ్మం దాకా వెళ్ళేవాడు, అక్కడ ఇద్దర్నీ విడిపించుకుని వాళ్ళకి చేయి ఊపుతూ తనంతట తాను లోపలికి నడిచేవాడు, ఆయనకు మంచం దగ్గర సాయపడేందుకు తల్లి తన కుట్టుపనీ, చెల్లాయి తన పెన్నూ వదిలేసి, ఆయన వెనకే లోపలికి వెళ్ళేవారు.

ఇలా పని భారంతో కుంగి అలసిపోతున్న కుటుంబంలో మరీ అవసరమైతే తప్ప గ్రెగర్‌ని పట్టించుకునే తీరిక ఎవరికుంటుంది? ఇంట్లో మనుషుల సంఖ్య కూడా తగ్గిపోయింది; పనమ్మాయిని పంపించేశారు; ఒక చప్రాసీని మాత్రం కుదుర్చుకున్నారు. ఆమె పొడుగ్గా, మొరటు శరీరంతో, ముగ్గుబుట్టలాంటి తెల్లని చింపిరి జుట్టుతో ఉండేది; ఉదయమూ, సాయంత్రమూ వచ్చి ఇల్లు ఊడ్చి వెళ్ళిపోయేది; ఇక మిగతా పనంతా అతని తల్లే తన కుట్టుపనితో పాటూ చూసుకునేది. గతంలో ఏవైనా వేడుకలూ పండుగలూ వచ్చిన సందర్భాల్లో తల్లీ చెల్లాయీ ఎంతో ఇష్టంగా వేసుకునే ఇంటి నగలు కూడా ఇప్పుడు అమ్మేసుకోవాల్సి వచ్చింది, అవి అమ్మగా వచ్చిన ధరల గురించి ఒక రోజు వాళ్ళు మాట్లాడుకుంటుంటే గ్రెగర్‌కి ఈ విషయం తెలిసింది. వాళ్ళు అన్నింటికన్నా ఎక్కువగా ఈ ఫ్లాట్ గురించే వాపోయేవారు, అది ప్రస్తుత పరిస్థితిలో వాళ్ళకో మోయలేని బరువుగా మారింది, కానీ గ్రెగర్‌ని ఇక్కణ్ణించి బదలాయించటం అసాధ్యం గనుక, దీన్ని వదిలి వెళ్ళలేకపోతున్నారు. కానీ గ్రెగర్‌కి తెలుసు, అదొక్కటే కారణం కాదని, అంతగా అతణ్ణి బదిలీ చేయాలనుకుంటే అదేం పెద్ద విషయం కాదు, తగిన కొలతలున్న పెట్టెకి గాలి ఆడేలా కన్నాలు చేసి అందులో అతణ్ణి మోసుకుపోవచ్చు, కానీ వాళ్ళు మారలేకపోవటానికి అసలు కారణం నిస్పృహ, తాము ఓ వెలికి రాలేని ఊబిలో కూరుకుపోయామన్న నిస్పృహ, తమ స్నేహితుల్లో గానీ బంధువుల్లో గానీ ఎవరికీ దాపురించనంత పెద్ద దౌర్భాగ్యం తమకు దాపురించిందన్న నిరాశ. వాళ్ళు ఇప్పటికే పేదవాళ్ళ నుంచి ప్రపంచం ఏం ఆశిస్తుందో అదంతా నెరవేరుస్తున్నారు; తండ్రి బాంకు గుమాస్తాలకు టిఫిన్ తెచ్చిపెడుతున్నాడు, తల్లి అపరిచితుల కోసం లోదుస్తులు తయారు చేస్తోంది, చెల్లాయి కస్టమర్ల ఆదేశానుసారం కౌంటరు వెనుక అటూ యిటూ తిరుగుతోంది; ఇక ఇంతకన్నా చేయటం ఆ కుటుంబానికి సాధ్యం కాదు. తండ్రిని మంచం మీద పడుకోబెట్టిన తర్వాత, తల్లీ చెల్లాయీ తిరిగి లివింగ్ రూములోకి వచ్చి, తమ పనుల్ని ఎక్కడివక్కడే వదిలేసి, కుర్చీల్ని దగ్గరకు లాక్కొని, చెంపా చెంపా రాసుకునేంత దగ్గరగా కూర్చునేవారు; తల్లి గ్రెగర్ గది వైపు చూపిస్తూ, ‘గ్రెటె, ఆ తలుపు మూసేయ్,’ అనేది, అతను చీకట్లో మిగిలిపోయేవాడు, ఆ పక్కగదిలో ఆడవాళ్ళిద్దరూ కలిసి ఏడ్చి తమ కన్నీటి బరువు దింపుకునేవారు, లేదా బహుశా ఎండిపోయిన కళ్ళతో టేబిల్ కేసి చూస్తూ కూచునేవారు. ఇలాంటప్పుడే గ్రెగర్ గాయం ఎవరో పనిగట్టుకు కెలికినట్టు మళ్ళీ సలిపేది.

గ్రెగర్ పగలూ రాత్రీ కూడా ఎప్పుడూ నిద్ర లేకుండానే గడిపేసేవాడు. ఒక్కోసారి పగటికలలు అల్లుకునేవాడు, ఈసారి తలుపు తెరవగానే పాత రోజుల్లోలాగే తాను బయటకు వెళ్ళి కుటుంబ బాధ్యతల్ని తన చేతిలోకి తీసుకోబోతున్నట్టు ఊహించుకునేవాడు; అప్పుడప్పుడూ అతని ఆలోచనల్లో, చాన్నాళ్ళ విరామం తర్వాత, పాత పరిచయాల రూపాలు కదలాడేవి; తన ఆఫీసు యజమానీ పెద్దగుమాస్తా, తోటి సేల్స్‌మెన్లూ అప్రెంటిసులూ, బాగా మందబుద్ధి అయిన ఆఫీసు బాయ్, పక్క ఆఫీసుల్లో పని చేసే ఇద్దరు ముగ్గురు స్నేహితులూ, ఒక పల్లెటూరి హోటల్లో పనమ్మాయీ – ఇది ఒక చిరు తీపి జ్ఞాపకం –, ఒక టోపీల దుకాణంలో కేషియర్ అమ్మాయి, ఈమె మనసు గెలుచుకోవటానికి చాలా నిజాయితీగా ప్రయత్నించాడు గానీ మరీ తాత్సారం చేశాడు – వీళ్ళతో పాటూ అతను ఎప్పుడో మర్చిపోయిన వాళ్ళూ, అపరిచితులూ, అందరూ అతని మనో ఫలకంపై కదలాడేవారు, కానీ వీళ్ళలో ఎవరూ అతనికి గానీ, అతని కుటుంబానికి గానీ ప్రస్తుతం ఏ మాత్రం సాయం చేయలేనంత దూరంలో ఉన్నట్టు కనిపించేవారు, వాళ్ళ రూపాలు మాయమయ్యాకా అతనేం పెద్ద బెంగపడే వాడు కాదు. కానీ ఒక్కోసారి అతను తన కుటుంబం గురించి ఇంతగా ఆందోళన పడటం మానేసేవాడు, వాళ్ళు తనని ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారో తలుచుకోగానే కోపంతో ఉక్కిరిబిక్కిరయ్యేవాడు, అలాంటప్పుడు నిజానికి ఏదీ తినాలనిపించకపోయినా, ఆకలి కూడా వేయకపోయినా, వంటగదిలోకి వెళ్ళి తనకు న్యాయంగా దక్కాల్సిన తిండి అంతా తినేయాలని ప్రణాళికలు వేసుకునేవాడు. చెల్లాయి ఇదివరకట్లా అతనికి ఏది నచ్చుతుందో ఆలోచించి తేవటం మానేసింది, పొద్దున్నా మధ్యాహ్నం తాను పనికి వెళ్ళే హడావిడిలో ఉన్నపుడు, పాచిపోయిన తిండి ఏదో తెచ్చి, కాలితో అతని గదిలోకి తోసి వెళ్ళిపోయేది; మళ్ళీ సాయంత్రం వచ్చాకా, అసలు ఆ తిండి కొద్దిగా అయినా తిన్నాడా, లేక – ఈ మధ్య తరచూ జరుగుతున్నట్టే – ఎలా ఉన్నది అలాగే ముట్టుకోకుండా వదిలేశాడా అన్నది కూడా చూడకుండా, చీపురుకట్టతో ఒక్క ఊడ్పు ఊడ్చి బయటకు నెట్టేసేది. ఈ మధ్య అతని గది తుడవటానికి ఆమెకు సాయంత్రం మాత్రమే వీలు చిక్కుతోంది, అప్పుడు కూడా ఆ పని చాలా అరకొరగా చేస్తుంది. రాన్రానూ గది గోడల పొడవునా బూజు వేలాడుతోంది, అక్కడక్కడా చెత్తా చెదారం ఉండలు కడుతున్నాయి. గ్రెగర్ మొదట్లో దీన్ని చెల్లాయికి దృష్టికి తేవాలని ప్రయత్నించేవాడు, ఆమె లోపలికి వచ్చినపుడు గదిలో మురికి బాగా కొట్టొచ్చినట్టు కనిపించే ఏదో ఒక మూలకు వెళ్ళి నిలబడేవాడు, తనని అలాంటి పరిస్థితిలో చూస్తే అయినా ఆమెలో పశ్చాత్తాపం కలుగుతుందని భావించేవాడు. కానీ అతను వారాల తరబడి అక్కడే నిలబడినా, ఆమె చేత తన గదిలో ఏ మార్పూ తెప్పించలేకపోయాడు; ఆ మురికి అతని కెంత స్పష్టంగా కనిపిస్తుందో ఆమెకూ అంతే స్పష్టంగా కనిపిస్తుంది, అందులో అనుమానం లేదు, కానీ ఆమె దాన్నలాగే వదిలేయాలన్న నిర్ణయానికొచ్చేసింది. అలాగని ఆ పని వేరే వాళ్ళనీ చేయనిచ్చేది కాదు, గ్రెగర్ గది శుభ్రం చేసే హక్కు తన ఒక్కదానికే సొంతమన్న విషయంలో ఇదివరకెన్నడూ లేని సున్నితత్వాన్ని ప్రదర్శించేది, ఒక సందర్భంలో తల్లి అతని గదిని శుభ్రంగా కడిగింది, కడగటమంటే కొన్ని బకెట్ల నీరు మాత్రం తెచ్చి పోసింది – ఆ తడి గ్రెగర్‌ను మరింత చికాకు పరిచింది, కడుగుతున్నంత సేపూ అతను ముఖం ముడుచుకుని సోఫా మీద కదలకుండా కూర్చున్నాడు – కానీ ఇలా చేసినందుకు తల్లి త్వరలోనే తగిన గుణపాఠం నేర్చుకోవాల్సి వచ్చింది. చెల్లాయి ఆ సాయంత్రం గ్రెగర్ గదిలోని మార్పును చూడగానే, అక్కసుతో రగిలిపోతూ, లివింగ్ రూములోకి విసవిసా నడిచి వెళ్ళింది, ఆమె తల్లి గారంగా చేతులెత్తుతున్నా ఆగకుండా, ఒక్క పెట్టున వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది, తండ్రి పడక్కుర్చీలో ఉలిక్కిపడి లేచాడు, తల్లిదండ్రులిద్దరూ మొదట ఏం చేయాలో తోచనట్టు చూస్తూండిపోయారు, తర్వాత తాము కూడా అందులో పాలుపంచుకున్నారు; తండ్రి, కుడివైపునున్న తల్లిని చూస్తూ, గ్రెగర్ గది శుభ్రం చేసే బాధ్యతను కూతురికే వదిలేయనందుకు మందలించాడు; ఎడమ వైపునున్న చెల్లాయిని చూస్తూ, ఆమె ఇక ఎన్నడూ గ్రెగర్ గదిని శుభ్రం చేయటానికి వీల్లేదని అరిచాడు; ఉద్వేగంతో ఊగిపోతున్న ఆయన్ని తల్లి పడకగది వైపు లాక్కెళ్ళటానికి ప్రయత్నించింది; చెల్లాయి వెక్కిళ్ళతో కంపిస్తూ తన చిన్న పిడికిళ్ళతో టేబిల్ మీద మోదింది; అసలు వీళ్ళలో ఎవ్వరికీ కనీసం ఆ తలుపైనా మూసి తనను ఈ ప్రహసనం నుంచి మినహాయించాలన్న ఆలోచన రానందుకు లోపల గ్రెగర్ ఆగ్రహంతో బుసలు కొట్టాడు.

చెల్లాయి ఉద్యోగంలో అలసిపోయి ఇదివరకట్లా గ్రెగర్‌కి సేవలు చేయలేకపోతోందన్నది నిజమే, కానీ అంతమాత్రాన ఆ బరువును తల్లి భుజానికెత్తుకోవాల్సిన పని లేదు, అలాంటి పనుల కోసం ఇప్పుడు చప్రాసీ ఉంది. ఆ విధవరాల్ని చూడగానే జీవితంలో ఎన్నో కష్టనష్టాలకోర్చిందనీ, తన మొరటు శరీరంతో వాటన్నింటినీ దాటుకుని వచ్చిందనీ తెలిసిపోతుంది. ఆమె గ్రెగర్‌ని చూసి అసహ్యపడేది కాదు. ఒకసారి ఎందుకో యాదృచ్ఛికంగా అతని గది తలుపు తీసి చూసింది, గ్రెగర్ ఆమె కంటపడటం అదే తొలిసారి – ఈ రాకను ఊహించని అతను ఎవరో తరుముతున్నట్టు కంగారుగా గదిలో అటూ ఇటూ పరిగెత్తసాగాడు – ఆమె మాత్రం అబ్బురపాటుతో అలా చేతులు కట్టుకుని చూస్తూ నిలబడిపోయింది. అప్పట్నించీ ఆమె ప్రతీ రోజూ ఉదయమో సాయంత్రమో ఏదో సమయంలో ఒకసారి అతని గది తలుపు కొద్దిగా తీసి అతని వంక చూస్తూ నిలబడేది. మొదట్లో అతణ్ణి తన వైపు రమ్మని పిలిచేది కూడా, ఆమె మాటల వెనుక ధ్వనించేది బహుశా స్నేహమేనేమో: ‘ఇలా రావోయ్, నా పేడపురుగా!’ అనో, ‘మా పేడపురుగేం చేస్తుందండీ!’ అనో పిలిచేది. ఈ మాటల్ని గ్రెగర్ ఏ మాత్రం లెక్క చేయనట్టు స్పందించేవాడు కాదు, అసలు అక్కడ తలుపు తెరుచుకోనే లేదన్నట్టు కదలకుండా మెదలకుండా ఉండిపోయేవాడు. ఈ చప్రాసీకి బుద్ధిపుట్టినపుడల్లా తనను విసిగించగలిగే వీలుకల్పిస్తూ ఆమెనిలా అచ్చోసి వదిలేసే బదులు, ఎవరైనా ఆమె చేత తన గది శుభ్రం చేయిస్తే ఎంత బాగుండును! ఒకసారి, తెల్లవారు ఝామున, వసంతాగమన సూచనగా కురుస్తున్న భారీ వర్షానికి కిటికీ రెక్కలు టపటపా కొట్టుకుంటుంటే, ఆ చప్రాసీ తలుపు తెరిచి మళ్ళీ తన నిలవ మాటలతో అతణ్ణి పలకరించటం మొదలుపెట్టింది, అతనిలో అసహనం ఇక హద్దులు దాటిపోయింది, దాడి చేయటానికన్నట్టు ఆమె మీదకు వచ్చాడు, నిజానికి నీరసంగా నింపాదిగానే వచ్చాడు. ఆమె ఏ మాత్రం భయపడలేదు సరికదా, తలుపు వారనున్న కుర్చీ నొక దాన్ని గాల్లోకి ఎత్తి పట్టుకుంది, ఆమె అలా కుర్చీని పట్టుకున్న తీరు చూస్తే, దాన్ని గ్రెగర్ వీపు మీద పడేసే దాకా ఊరుకునేట్టు లేదనిపించింది. వెనక్కు మళ్ళుతున్న గ్రెగర్‌ని, ‘అంతేగా, అంతకన్నా దగ్గరకు రావుగా?’ అని అడిగింది, తర్వాత కుర్చీని మెల్లగా మూలన పెట్టేసింది.

గ్రెగర్ ఈ మధ్య తిండి తినటమే మానేశాడు. గదిలో అతని కోసం తిండి ఉంచినా, ఎప్పుడన్నా దాన్ని దాటుకుంటూ అటుగా వెళ్తున్నపుడు మాత్రం, ఊరికే కాలక్షేపానికన్నట్టు, ఒక ముక్క నోట్లో వేసుకునేవాడు, దాన్ని గంటల తరబడి అలాగే ఉంచుకుని, ఎప్పుడో మళ్ళీ బయటకు ఊసేసేవాడు. మొదట్లో తన గది పరిస్థితి ఇలా ఉండటం వల్ల తనకు తిండి సయించటం లేదేమో అనుకున్నాడు, కానీ నిజానికి గదిలో రాన్రానూ వచ్చి చేరుతున్న మార్పులకి అతను త్వరగానే రాజీ పడిపోయాడు. ఎక్కడా చోటు దొరకని సామానంతా తెచ్చి ఈ గదిలో పడేయటం ఆ కుటుంబానికి ఒక ఆనవాయితీగా మారింది, ఇప్పుడు ఇలాంటి సామాను మరింత పెరిగి పోయింది, ఎందుకంటే ఫ్లాట్‌లో ఒక గదిని ముగ్గురు కిరాయిదార్లకు అద్దెకిచ్చారు. గంభీరమైన వాలకాలు గల ఈ యువకులు (ఈ ముగ్గురికీ గెడ్డాలు ఉండటం గ్రెగర్ తలుపు సందులోంచి గమనించాడు) శుభ్రత అంటే ప్రాణం పెడతారు, వాళ్ళ గది మాత్రమే శుభ్రంగా ఉంటే సరిపోదు, మొత్తం ఇల్లంతా శుభ్రంగా ఉండాలి, ముఖ్యంగా వంటగది. వస్తువులు మురికిగానే కాదు, అనవసరంగా అదనంగా ఉన్నా భరించలేరు. వాళ్ళకు కావాల్సిన సామానంతా వాళ్ళతోపాటే తెచ్చుకున్నారు. దాంతో చాలా వస్తువులు అదనమై కూచున్నాయి, అవి అమ్మగలిగేవీ కాదు, అలాగని పారేసేవీ కాదు. ఈ బాపతు సామానంతా గ్రెగర్ గదిలోకి బారులు తీరింది. బూడిద బకెట్టు నుంచి వంటగది చెత్తబుట్ట దాకా దీనిలో సర్వం ఉన్నాయి. ప్రస్తుతానికి అవసరం లేదనుకున్న ఏ వస్తువునైనా సరే, చప్రాసీ తీసుకువచ్చి గ్రెగర్ గదిలో పారేసేది; ఆమె ఎప్పుడూ ఆదరాబాదరాగా పని చేయటం వల్ల అదృష్టవశాత్తూ గ్రెగర్‌కి ఆమె చేయీ, ఆ చేతిలో పారేయదల్చుకున్న వస్తువూ తప్ప మరింకేం కనపడేది కాదు. వాటిని పారేయటంలో చప్రాసీ ఉద్దేశం బహుశా మళ్ళా అవసరమైనపుడు తెచ్చి వాడుకోవచ్చనో, లేక అవన్నీ కుప్పలాగా పోగుపడ్డాకా మొత్తం ఒకేసారి వదిలించుకోవచ్చనో అయి ఉంటుంది; కానీ వాస్తవానికి అవి ఎన్నాళ్లయినా విసిరిన చోట అలానే పడి ఉండేవి, అప్పుడప్పుడూ గ్రెగర్ ఆ చెత్త కుప్పలోంచి పాక్కుంటూ వెళ్లినపుడు మాత్రం కాస్త కదిలేవి, ఇలా వెళ్ళక తప్పేది కాదు, అతనికి పాకటానికి ఇంకెక్కడా చోటు మిగల్లేదు, కానీ ఒక్కోసారి ఊరికే సరదాకి కూడా ఇలా చేసేవాడు, కానీ ఇలాంటి సరదా ఆటల అయిన తర్వాత అతనేదో దిగుల్లో కూరుకుపోయి, ఉన్న చోటే మృతప్రాయంగా పడి ఉండేవాడు.

కిరాయిదార్లు తరచూ తమ రాత్రి భోజనాల్ని ఇంటి దగ్గర లివింగ్ రూములోనే కానిచ్చేస్తుండటంతో, సాయంత్రాలు లివింగ్ రూము తలుపు పూర్తిగా మూసే ఉండేది; అయినా ఈ సదుపాయాన్ని కోల్పోయినందుకు గ్రెగర్ పెద్దగా ఏం చింతించలేదు, ఈమధ్య అతను ఆ తలుపు తెరిచి ఉన్నా పెద్ద పట్టించుకోవటం లేదు, తన గది కటిక చీకటి మూలల్లో నిస్తేజంగా పడి ఉంటున్నాడు. కానీ ఒక సందర్భంలో, చప్రాసీ లివింగ్ రూము తలుపు ఎందుకో తీసి మళ్ళీ వేయకుండా అలా వారగా తెరిచే వదిలేసింది, ఆ సాయంత్రం దీపం వెలిగించటమూ, కిరాయిదార్లు లోపలికి రావటమూ అన్నీ గ్రెగర్ కంటపడుతూనే ఉన్నాయి. గతంలో గ్రెగర్, తండ్రీ, తల్లీ టేబిల్‌చుట్టూ ఏ స్థానాల్లో కూర్చునేవారో ఇప్పుడు కిరాయిదార్లు అదే స్థానాల్లో కూర్చుని, నాప్‌కిన్స్ మడత విప్పి, చాకులూ ఫోర్కులూ చేతిల్లోకి తీసుకున్నారు. వెంటనే గుమ్మం దగ్గర తల్లి మాంసం కూర గిన్నెతోనూ, ఆవిడ వెనుకనే చెల్లాయి బంగాళాదుంపల కూర గిన్నెతోనూ ప్రత్యక్షమయ్యారు. ఆహారం పొగలు కక్కుతోంది. కిరాయిదార్లు తమ ముందు పెట్టిన పదార్థాల్ని పరీక్షించటానికన్నట్టు ముందుకు వంగారు, వారిలో మధ్యలో కూచుని, తక్కిన ఇద్దరికీ లీడరులా కనిపిస్తున్నవాడైతే, మాంసం తగినంత మెత్తగా ఉందో లేక వంటగదికి తిప్పిపంపేయాలో అన్నది పరీక్షించటానికి కాబోలు, అదింకా గిన్నెలో ఉండగానే ఒక ముక్క తుంచి రుచి చూశాడు. తృప్తిగా తలపంకించాడు, ఉత్కంఠగా చూస్తున్న తల్లీ చెల్లాయీ ఊరటగా నిట్టూర్చారు, వాళ్ళ మొహాల్లో వెలుగొచ్చింది.

కిరాయిదార్లు లివింగ్ రూములో తినటం మొదలుపెట్టారు కాబట్టి, గ్రెగర్ కుటుంబం తమ భోజనాలు వంటగదిలో కానిచ్చేయటం మొదలుపెట్టింది. తండ్రి మాత్రం వంటగదిలోకి వెళ్ళబోయే ముందు ఒక్కసారి లివింగ్ రూములోకొచ్చి, టోపీ చేత పుచ్చుకుని వినయంగా వంగి, టేబిల్ చుట్టూ ఓ ప్రదక్షిణ చేసేవాడు. కిరాయిదార్లు జట్టుగా పైకి లేచి తమ గడ్డాల్లోకి ఏదో పలకరింపు గొణిగేవారు. తండ్రి వెళ్ళిపోయాకా, వాళ్ళు నిశ్శబ్దంగా తమ భోజనం కానిచ్చేవారు. గ్రెగర్‌కి ఒకటి చిత్రమనిపించేది, భోజనం తింటున్నప్పుడు అయ్యే చప్పుళ్ళన్నింటి మధ్యా వారి నములుతున్న పళ్ళ చప్పుడు మాత్రం అతను పొల్లుపోకుండా పసిగట్టగలిగేవాడు, బహుశా తినటానికి పళ్ళు తప్పనిసరి అనీ, అవి లేనప్పుడు ఎంత పదునైన దవడలు ఉన్నా లాభం లేదనీ అతనికిలా గుర్తుచేయబడుతోందేమో. ‘నాకు ఆకలి బానే ఉంది, కానీ వాళ్ళు తినేలాంటి తిండి మీద లేదు. అయినా ఒకపక్క నేనేమో ఆకలితో చస్తుంటే, వీళ్ళు ఎలా మెక్కుతున్నారో!’ అని అనుకునేవాడు.

అదే రోజు సాయంత్రం – ఇన్నాళ్ళూ గ్రెగర్‌కు ఒక్కసారి కూడా వినపడని వయొలిన్ నాదం – ఇప్పుడు వంటగది నుంచి మంద్రంగా తేలి వస్తూ అతని చెవినపడింది. కిరాయిదార్లు అప్పటికే తమ భోజనాలు ముగించారు, వాళ్ళ లీడరు తాను తెచ్చిన న్యూస్ పేపరు తెరిచి, మిగతా ఇద్దరికీ చెరో పేజీ తీసి ఇచ్చాడు, తర్వాత ముగ్గురూ కుర్చీల్లో వాలి, దమ్ముకొడుతూ చదువుకుంటున్నారు. వయొలిన్ వినపడేసరికి అంతా చెవులు రిక్కించారు, లేచి అడుగులో అడుగు వేసుకుంటూ హాలు గుమ్మం దగ్గరకి వెళ్ళి, అక్కడ గుంపుగా నిలబడ్డారు. వాళ్ళ అలికిడి వంటగదిలోకి వినపడింది కాబోలు, తండ్రి అక్కణ్ణించే గట్టిగా ఇలా అన్నాడు: ‘ఈ సంగీతం మిమ్మల్నేం ఇబ్బంది పెట్టడం లేదుగా? పెడుతుందంటే చెప్పండి, వెంటనే ఆపేస్తాం.’ ‘అబ్బే అదేం లేదు, అయినా ఆ అమ్మాయి ఈ గదిలోకి వచ్చి మా ముందు వాయిస్తే ఇంకా బాగుంటుంది కదా, ఇక్కడ అనువుగా కూడా ఉంటుంది?’ అన్నాడు కిరాయిదార్ల లీడరు. ‘ఓ దానికేం భాగ్యం,’ సంబరపడుతూ అరిచాడు తండ్రి, అక్కడి ఆ వాయించేది తానే ఐనట్టు. కిరాయిదార్లు మళ్ళీ గదిలోకి వచ్చి ఎదురుచూశారు. మొదట తండ్రి మ్యూజిక్ స్టాండు మోసుకొచ్చాడు, వెనకనే తల్లి మ్యూజిక్ నోట్సుతోనూ, చెల్లాయి వయొలిన్‌తోనూ ప్రవేశించారు. చెల్లాయి మౌనంగా ప్రదర్శనకు అన్నీ సిద్ధం చేసుకుంటోంది; తల్లిదండ్రులు ఇప్పటిదాకా ఎవరికీ గదులు అద్దెకు ఇచ్చినవాళ్ళు కాకపోవటంతో ఈ కిరాయిదార్ల పట్ల అతి మర్యాద చూపిస్తున్నారు, కనీసం సొంత కుర్చీల్లో కూర్చునే ధైర్యం కూడా చేయటంలేదు; తండ్రి తలుపుకు ఆనుకుని నిలబడ్డాడు, పూర్తిగా బొత్తాలు పెట్టుకున్న యూనిఫాం జాకెట్ తొడుక్కున్నాడు, కుడి అరచేతిని రెండు బొత్తాల మధ్యన దూర్చి ఉంచాడు; తల్లికి మాత్రం కిరాయిదార్లు ఒక కుర్చీని ఆఫర్ చేశారు, వాళ్ళు దాన్ని ఎక్కడ పెడితే అక్కడే అందులో ఓ మూలకు ఒదిగిపోయి కూర్చుందావిడ.

చెల్లాయి వాయించటం మొదలుపెట్టింది; తల్లీ తండ్రీ చెరో వైపు నుంచీ ఆమె చేతుల కదలికల్ని శ్రద్ధగా గమనిస్తున్నారు. ఈ సంగీతానికి ఆకర్షితుడైన గ్రెగర్, కొంత ముందుకు వచ్చాడు, ఇప్పటికే తన తలను లివింగ్ రూములో పెట్టి చూస్తున్నాడు. ఇదివరకూ ఇతరుల సౌకర్యం పట్ల తాను చూపించే శ్రద్ధకు ఎంతో గర్వపడే గ్రెగర్, ఇప్పుడు తనలో పెరుగుతున్న నిర్లక్ష్యాన్ని గమనించి ఆశ్చర్యపడ్డాడు. నిజానికి ఇప్పుడే అతను ఎవరి కంటా పడకుండా ఉండాల్సిన అవసరం ఎక్కువ ఉంది. ఎందుకంటే, అతని గదిలో బాగా పేరుకుపోయి, చిన్నపాటి కదలికకు కూడా పైకి ఎగుస్తున్న దుమ్మంతా, ఇపుడు అతని వంటి నిండా కూడా పొరలా కప్పుకుపోయి ఉంది; వాటితో పాటూ, అతను ఎక్కడికి వెళ్ళినా తన వీపు మీద మోసుకుంటూ, పక్కలకు వేలాడ్చుకుంటూ బోలెడంత మురికినీ, జుత్తు ఉండల్నీ, ఆహారావశేషాల్నీ తనతో పాటూ తీసుకెళ్తున్నాడు; ఇదివరకూ రోజులో ఎన్నోసార్లు వెల్లకిలా పడుకుని తన్ను తాను తివాచీ కేసి రుద్దుకుంటూ శుభ్రపరచుకునే వాడు, ఇపుడు అది కూడా మానేశాడు. ఇప్పుడు తన అవతారం ఇలా ఉందని తెలిసి కూడా, తళతళ్ళాడే లివింగ్ రూము నేల మీద అడుగుపెట్టడానికి ఏ మాత్రం జంకలేదు.

అయితే ఇంకా అతణ్ణెవరూ గమనించటం లేదు. అతని కుటుంబం వయొలిన్ వినటంలో పూర్తిగా నిమగ్నమైపోయి ఉంది; కిరాయిదార్లు మొదట్లో జేబుల్లో చేతులు ఉంచుకుని, మ్యూజిక్ స్టాండుకు చాలా దగ్గరగా వచ్చి నిలబడ్డారు – మరీ మ్యూజిక్ నోట్సు కూడా చదవగలిగేంత దగ్గరగా నిలబడ్డారు, అది తన చెల్లాయికి ఇబ్బందిగానే ఉండి ఉంటుంది – కానీ కాసేపటి తర్వాత కిటికీ దగ్గరకు వెళ్ళిపోయారు, తలలు దించుకుని ఏదో సణుక్కుంటున్నారు, తన తండ్రేమో వాళ్ళని ఉత్కంఠగా గమనిస్తున్నాడు. వాళ్ళ ధోరణిలో అసంతృప్తి తేటతెల్లమవుతూనే ఉంది, జోరైన సరదా సంగీతాన్ని వినాలనుకున్న తాము నిరాశకు గురయ్యామనీ, ఇంక ఈ ప్రదర్శన చాలించవచ్చనీ, అది తమ ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నా కేవలం మర్యాద కారణంగానే ఇంకా భరిస్తున్నామనీ వాళ్ళు చెప్పకనే చెపుతున్నారు. ముఖ్యంగా వాళ్ళు సిగార్ పొగల్ని ముక్కుల్లోంచీ, నోళ్ళల్లోంచీ పైకప్పు కేసి వదుల్తున్న తీరులో తీవ్రమైన అసహనం వెల్లడవుతోంది. నిజానికి చెల్లాయి ఎంతో చక్కగా వాయిస్తోంది. ఆమె ముఖం ఓ పక్కకు వాలి ఉంది, ఏదో వెతుకులాటతో, విషాదంతో నిండిన ఆమె చూపులు మ్యూజిక్ నోట్సు వెంట నెమ్మదిగా సాగుతున్నాయి. గ్రెగర్ ఇంకాస్త ముందుకి కదిలాడు, తమ ఇద్దరి చూపులూ కలుసుకునేందుకు వీలుగా తన తలను నేలకు దగ్గరగా వంచాడు. సంగీతం ఇంతగా చలింపజేస్తోందంటే తానొక జంతువేనా? తాను దేనికైతే తపిస్తున్నాడో ఆ గమ్యం వైపు తీసుకెళ్ళే దారులు తన కళ్ళ ముందే తెరుచుకుంటున్నట్టు అనిపించింది. చెల్లాయిని చేరేదాకా ఎక్కడా ఆగకూడదని నిశ్చయించుకున్నాడు. కాసేపట్లో ఆమెను చేరి స్కర్టు కొద్దిగా గుంజుతాడు, ఆమె తన వైపు చూడగానే తన గదిలోకి వయొలిన్‌తో సహా వచ్చేయమని ఆహ్వానిస్తాడు, ఇక్కడ ఆమె సంగీతాన్ని వినే అర్హత అతనికి తప్ప ఇంకెవరికీ లేదు. ఆమెను ఇక ఎప్పుడూ తన గది వదిలి వెళ్ళనివ్వడు, కనీసం తాను బతికున్నంత కాలం; తన వికృతమైన ఆకృతి ఎందుకు పనికిరాకపోయినా అందుకు పనికొస్తుంది; తన గదికి ఉన్న ప్రతీ తలుపు దగ్గరా ఏకకాలంలో కాపు కాస్తాడు, ఎవరు చొరబడటానికి ప్రయత్నించినా బుసలు కొడుతూ ఉమ్ములు ఊస్తూ తరిమేస్తాడు; చెల్లాయిని మాత్రం బలవంత పెట్టడు, ఆమె తన ఇష్టం మీదే అతనితో ఉండాలి; ఆమె అతని పక్కనే సోఫా మీద కూర్చుంటుంది, అతనికి చెవి ఒగ్గుతుంది, అప్పుడు నోరు విప్పుతాడు, ఆమెను సంగీత కళాశాలకు పంపే ఆలోచన తనకు ఎప్పట్నుంచో ఉందనీ, ఈ దౌర్భాగ్యమే తనకు పట్టకపోయుంటే గత క్రిస్మస్ నాటికే (ఇంతకీ క్రిస్మస్ దాటిందో లేదో?) ఎవరి అభ్యంతరాలూ లెక్క చేయకుండా అందరి ముందూ ఈ విషయాన్ని ప్రకటించి ఉండేవాడనీ చెప్తాడు. ఈ నిజం తెలుసుకోగానే చెల్లాయి కన్నీటి పర్యంతమైపోతుంది, గ్రెగర్ ఆమె భుజాల మీదకు లేచి ఆమె మెడ మీద ముద్దుపెట్టుకుంటాడు.

‘మిస్టర్ జమ్జా!’ కిరాయిదార్ల లీడరు అరిచాడు, మరో మాట వ్యర్థం చేయకుండా, తన చూపుడువేలు ఎక్కుపెట్టి, నెమ్మదిగా ముందుకొస్తున్న గ్రెగర్ వైపు చూపించాడు. వయొలిన్ మూగబోయింది, కిరాయిదార్ల లీడరు తన స్నేహితుల వైపు తలాడిస్తూ నవ్వి, మళ్ళీ గ్రెగర్ వైపు చూశాడు. తండ్రి గ్రెగర్‌ను తరమటం కన్నా ముందు కిరాయిదార్లను శాంతింపజేయటం ముఖ్యమని భావించాడు, కానీ నిజానికి వాళ్ళేమంత కంగారు పడటం లేదు, వాళ్ళకు వయొలిన్ కన్నా, గ్రెగరే ఎక్కువ సరదా కలగజేసినట్టున్నాడు. తండ్రి ఆదరాబాదరాగా వాళ్ళ వైపు వెళ్ళాడు, తన బారచాపిన చేతులతో వాళ్ళను గదిలోకి పంపేందుకు ప్రయత్నిస్తూనే, గ్రెగర్ వాళ్ళ కంటపడకుండా తన శరీరంతో అడ్డం పడుతున్నాడు. తండ్రి ప్రవర్తిస్తున్న ఈ తీరుకో, లేక ఇన్నాళ్ళూ తమకు తెలియకుండా ఎదుటి గదిలోనే ఇలాంటి పురుగు ఒకటున్నదన్న విషయం ఇపుడే గ్రహించటం వల్లనో తెలియదు గానీ, కిరాయిదార్లలో కోపం అంతకంతకూ పెరిగింది. తండ్రిని సంజాయిషీ ఇమ్మని దబాయించారు, ఆయనలాగే చేతులూపుతూ మాట్లాడారు, విసుగ్గా గడ్డాలు పీక్కున్నారు, చివరకు అయిష్టంగానే తమ గదుల వైపు కదిలారు. ఈ లోగా చెల్లాయి, తన వయొలిన్ ప్రదర్శన ఇలా అవమానకరంగా ముగియగానే పరధ్యానంలోకి వెళ్ళిపోయిందల్లా, ఇపుడు తేరుకుంది; ఆమె ఇప్పటిదాకా తన వయొలిన్‌నూ, దాని కమానునూ నిర్జీవంగా వేలాడుతున్న చేతుల్తో పట్టుకుని, ఇంకా వాయిస్తున్న దానిలాగే తన ముందున్న నోట్సు వంక చూస్తూ నిలబడిపోయింది. ఇపుడు తేరుకోగానే, ఆ వాయిద్యాన్ని తల్లి ఒడిలో పడేసి (ఆవిడ ఇంకా కుర్చీలోనే కూర్చుని శ్వాస అందనట్టు రొమ్ముల్ని ఎగబీలుస్తోంది), ఒక్క ఉదుటన కిరాయిదార్ల గదిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. వాళ్ళింకా తండ్రి బలవంతం మీద తమ గదివైపు నడవటంలోనే ఉన్నారు. ఈలోగానే ఆ గదిలోని మంచం మీది దుప్పట్లూ తలగళ్ళూ చురుకైన ఆమె చేతుల్లోంచి ఎగిరిపడుతూ తమ తమ స్థానాల్లోకి చక్కగా కుదురుకున్నాయి. కిరాయిదార్లు ఇంకా గది దాకా రాకముందే ఆమె వాళ్ళ మంచాలు సర్దేసి బయటకు జారుకుంది. తండ్రిని మళ్ళీ మంకుతనం పూనినట్టుంది, కిరాయిదార్లకు ఇవ్వాల్సిన కనీస మర్యాద కూడా మర్చిపోయి, వాళ్ళను ఇంకా ఇంకా వెనక్కు తోలుతూనే ఉన్నాడు. చివరకు కిరాయిదార్ల లీడరు పడకగది గుమ్మం దగ్గర ఆగి, తన కాలిని నేల మీద గట్టిగా తాటించాడు. తన చేతిని పైకెత్తి, ‘నేనిప్పుడే చెప్తున్నాను,’ అంటూ తన చూపుని తల్లి వైపూ, చెల్లాయి వైపూ కూడా సారిస్తూ, ‘ఈ ఇంట్లోనూ ఈ కుటుంబంలోనూ బయటపడుతున్న జుగుప్సాకరమైన పరిస్థితుల కారణంగా,’ – ఇక్కడ అతను నేల మీద ఉమ్మేశాడు – ‘నేను తక్షణం నోటీసు ఇస్తున్నాను. అంతేకాదు, ఇప్పటిదాకా ఉన్న రోజులకు కూడా ఒక్క పైసా ఇవ్వను; ఇవ్వడం మాట అటుంచితే, అసలు మీ నుంచి నష్టపరిహారం రాబట్టాలా వద్దా అని ఆలోచిస్తున్నాను, రాబట్టాలనుకుంటే – నమ్మండి నమ్మకపొండి – అది చాలా సులువైన పని.’ అతను మాట్లాడటం ఆపి, దేనికోసమో ఎదురుచూస్తున్నవాడిలా, ముందుకే చూస్తూ నిలబడ్డాడు. వెంటనే పక్కనున్న వాళ్ళిద్దరూ వంతపాట అందుకున్నట్టు, ‘మేం కూడా తక్షణం నోటీసు ఇస్తున్నాం,’ అన్నారు. వెంటనే అతను తలుపు పిడి మీద చేయి వేసి, దఢాల్న తలుపు మూసేసాడు.

తండ్రి తడుముకుంటున్న చేతుల్తో, తూలుతూ వచ్చి, పడక్కుర్చీలో కూలబడిపోయాడు; చూడబోతే తన రోజువారీ కునికిపాట్లకు సిద్ధమవుతున్నాడా అనిపించింది, కానీ తన తల అదుపులో లేదన్నట్టు తీవ్రంగా ఆడించటం చూస్తే, నిద్రకు చాలా దూరంలో ఉన్నాడని తెలుస్తోంది. గ్రెగర్ ఇంకా ఉన్న చోటు నుంచి కదల్లేదు, కిరాయిదార్లు చూసినపుడు ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉన్నాడు. అనుకున్నదంతా తలక్రిందులు కావటం వల్ల కలిగిన నిరాశా, దాంతో పాటూ ఈ మధ్య చాన్నాళ్ళుగా సరైన తిండి లేకపోవటం వల్ల కలిగిన నిస్సత్తువా, అతణ్ణి కదల్లేకుండా చేశాయి. ఈ సన్నివేశంలోని ఉద్రిక్తత ఏ క్షణాన్నయినా బద్దలై తన నెత్తి మీద కూలటం ఖాయమని తెలిసినవాడిలా, భయంతో ఎదురుచూస్తున్నాడు. వణుకుతున్న తల్లి వేళ్ళ నుంచి వయొలిన్ జారింది, చెవులు మార్మోగేలా కంపిస్తూ కిందపడింది, కానీ అతను ఇసుమంత కదల్లేదు.

‘అమ్మా, నాన్నా,’ అతని చెల్లాయి ఉపోద్ఘాతం లాగా టేబిల్ మీద ఒక చరుపు చరిచి మాట్లాడటం మొదలుపెట్టింది, ‘ఇదిలాగే సాగితే మనం చాలా ప్రమాదంలో పడతాం. ఆ సంగతి మీకర్థం కావటం లేదేమో గానీ, నాకర్థమవుతోంది. ఈ పురుగు సమక్షంలో నా అన్నయ్య పేరు కూడా ఉచ్ఛరించను, కానీ నేను చెప్పదల్చుకున్నది ఒకటే: మనం దీని అడ్డు తొలగించుకోవాలి. దీన్ని పోషించాం, భరించాం, మన వల్ల అయ్యేదంతా చేశాం, ఆ విషయంలో మనల్నెవరూ వేలెత్తి చూపించటానికి సరిపోరు.’

‘తను చెప్పేది ముమ్మాటికీ నిజం,’ తండ్రి తనలో తాను అనుకున్నాడు. తల్లి ఇంకా శ్వాస అందక ఆయాసపడుతూ, విహ్వలమైన చూపులు చూస్తూ, నోటిని చేత్తో మూసుకుని దగ్గుతోంది.

చెల్లాయి గబగబా తల్లి దగ్గరకు వెళ్ళి నుదుటి మీద ఊరటగా చేయి వేసింది. చెల్లాయి మాట్లాడిన ఈ మాటలతో తండ్రి ఆలోచనలన్నీ ఒక కొలిక్కి వచ్చినట్టున్నాయి; ఆయన ఇప్పుడు నిటారుగా కూర్చున్నాడు, టేబిల్‌ మీద తన యూనిఫాం టోపీతో ఆడుకుంటున్నాడు, చుట్టూ ఇందాక కిరాయిదార్ల భోజనం చేసిన ఎంగిలి పళ్ళేలు ఇంకా అలానే ఉన్నాయి; మధ్య మధ్యలో తలెత్తి కదలకుండా ఉన్న గ్రెగర్ ఆకారం వైపు ఓ చూపు విసురుతున్నాడు.

‘దీని అడ్డు తొలగించుకుని తీరాలి,’ చెల్లాయి ఈ సారి తండ్రిని మాత్రమే ఉద్దేశించి అంది, తల్లి తన దగ్గు తెరలో పడి ఏం పట్టించుకునే స్థితిలో లేదు, ‘లేదంటే ఇది మీ ఇద్దర్నీ ఎక్కువకాలం బతకనివ్వదు, ఆ సూచనలు ఇప్పుడే కనిపిస్తున్నాయి కూడా. అసలే మనం బయట గొడ్డు చాకిరీ చేస్తే తప్ప రోజు గడపలేని స్థితిలో ఉన్నాం, అలాంటప్పుడు ఇంట్లో ఇలాంటి నరకాన్ని ఎవరు భరించగలరు చెప్పు. కనీసం నా వరకూ నేనిక భరించలేను.’ అంటూనే ఆమె భోరున ఏడవనారంభించింది, ఆ తీవ్రతకు ఆమె కన్నీళ్ళు వెల్లువలా కిందకు జారి ఆమె తల్లి ముఖం మీద పడ్డాయి, ఆవిడ వాటిని యాంత్రికంగా తుడుచుకుంది.

‘అవునమ్మా,’ తండ్రి ఆమె బాధ అర్థం చేసుకున్నట్టు సానుభూతితో అన్నాడు, ‘కానీ మనం చేయగలిగేదేముంది?’

చెల్లాయి ఈ ఏడుపు వల్ల కలిగిన నిస్సహాయతతో కాబోలు, ఇందాకటి ఖరాఖండీతనానికి భిన్నంగా, ఏం చేయాలో తనకూ తెలీదన్నట్టు భుజాలు ఎగరేసింది.

‘వాడు మనం చెప్పేది అర్థం చేసుకునే పరిస్థితే ఉంటే,’ గొంతులో కొంత ప్రశ్న కూడా కలిపి అన్నాడు తండ్రి; కానీ చెల్లాయి ఏడుస్తూనే అసలా ఆలోచనే వృథా అన్నట్టు చేయి విసురుగా గాల్లో ఆడించింది.

‘వాడు మనం చెప్పేది అర్థం చేసుకునే పరిస్థితే ఉంటే,’ తండ్రి మళ్ళీ అన్నాడు, అది అసాధ్యమన్న కూతురి నమ్మకాన్ని జీర్ణించుకోవటానికన్నట్టు కళ్ళుమూసుకున్నాడు, ‘అప్పుడు బహుశా వాడితో ఏదో ఒక రాజీకి వచ్చి ఉండేవాళ్ళం. కానీ పరిస్థితుల్ని బట్టి చూస్తే–’

‘వాడిక్కడ ఉండకూడదు,’ చెల్లాయి అరుస్తున్నట్టు అంది, ‘అదొక్కటే పరిష్కారం నాన్నా. ఆ కనపడేది గ్రెగర్ అన్న నమ్మకాన్ని నువ్వు వదిలించుకోవాలి. ఆ నమ్మకమే మన అగచాట్లన్నింటికీ మూల కారణం. అసలు అది గ్రెగర్ ఎలా అవుతుంది? ఒకవేళ అదే గ్రెగర్ అయి ఉంటే, ఇలాంటి పురుగులతో కలిసి బతకటం మనుషులకి సాధ్యం కాదన్న సంగతి ఎప్పుడో అర్థం చేసుకుని, తనంతట తానే ఎటైనా వెళ్ళిపోయుండేవాడు. అప్పుడు ఇంట్లో మనకు అన్నయ్య ఉండడు, నిజమే, కానీ కనీసం మన బతుకేదో మనం బతికేవాళ్ళం, అతని జ్ఞాపకాన్ని గౌరవంగా మనసులో నిలుపుకునేవాళ్ళం. కానీ ఈ పురుగుంది చూశావా, ఇది మనల్ని పట్టి పీడించటానికే నిశ్చయించుకుంది, మన కిరాయిదార్లని తరిమేస్తోంది, నెమ్మదిగా మొత్తం ఫ్లాటంతా ఆక్రమించుకుని మనల్ని వీధుల్లోకి గెంటేయాలన్నది దాని ఆలోచన అని స్పష్టంగానే తెలుస్తోంది. నాన్నా, చూడు, చూడు,’ హఠాత్తుగా పెద్దగా అరిచింది, ‘మళ్ళీ అదేం చేస్తుందో చూడు!’ అంటూ గ్రెగర్‌కి కూడా అర్థం కాని గాభరా ప్రదర్శిస్తూ, ఆమె తల్లి కుర్చీ దగ్గర్నుంచి వేగంగా గెంతి, గ్రెగర్‌కు దగ్గరగా ఉండటం కన్నా తల్లిని త్యాగం చేయటమే తేలిక అన్నట్టుగా, ఒక్క ఉదుటున తండ్రి వెనక్కి పారిపోయింది, ఆమె ప్రవర్తనకు బెదిరి ఆయన కూడా దిగ్గున పైకి లేచాడు, ఆమెని రక్షించటానికన్నట్టు ఆమె ముందుకొచ్చి నిలబడి తన చేతుల్ని అడ్డంగా పైకెత్తాడు.

కానీ నిజానికి గ్రెగర్‌‌కి ఎవర్నీ భయపెట్టే ఉద్దేశం లేదు, చెల్లాయిని భయపెట్టాలని అసలే అనుకోలేదు. తన గదిలోకి వెళ్ళటానికి వెనక్కు తిరగబోయాడంతే, అయితే నిజానికి ఆ ప్రయత్నం చూసేవాళ్ళని కాస్త హడలగొట్టేట్టుగానే ఉంది, ఎందుకంటే, తన బలహీనస్థితి కారణంగా వెనక్కు తిరగటం కష్టమవటంతో, అందుకోసం అతను తన తలను కూడా వాడాల్సి వచ్చింది, దాన్ని మాటిమాటికీ పైకెత్తి మళ్ళా నేలకేసి కొడుతున్నాడు. ఇప్పుడు ఆగి చుట్టూ చూశాడు. అతని సదుద్దేశాన్ని వాళ్ళు గుర్తించారు; వాళ్ళ గాభరా తాత్కాలికమే. ఇప్పుడు అంతా అతణ్ణి నిశ్శబ్దంగా, దిగులుగా చూస్తున్నారు. తల్లి పడక్కుర్చీలో కాళ్ళు వేలాడేసుకు కూర్చుంది, ఆమె కనురెప్పలు అలసటతో వాలిపోతున్నాయి; తండ్రీ చెల్లాయీ పక్క పక్కనే కూర్చున్నారు, చెల్లాయి తన చేతిని తండ్రి మెడ చుట్టూ వేసింది.

‘ఇప్పుడిక నేను వెనక్కు తిరగవచ్చు కాబోలు,’ అనుకుంటూ గ్రెగర్ మళ్ళీ తన ప్రయాసలో పడ్డాడు. ఈ శ్రమ కలిగిస్తున్న ఆయాసాన్ని అదుపుచేసుకోవటం కష్టమవుతోంది, పదే పదే ఆగి విశ్రాంతి తీసుకోవాల్సి వస్తోంది. అయితే ఎవరూ అతణ్ణిక ఇబ్బంది పెట్టలేదు, అతని మానాన వదిలేశారు. అతను నింపాదిగా వెనక్కు తిరిగి, తిన్నగా గది వైపు నడవటం మొదలుపెట్టాడు. తనకీ ఆ గదికీ మధ్య ఉన్న దూరం అతణ్ణి ఆశ్చర్యపరిచింది, అసలు ఈ నీరసంతో ఇంత దూరం ఎలా రాగలిగాడో అర్థం కాలేదు. ఇప్పుడు గది వైపు పాకటమే అతని ఏకైక లక్ష్యం, ఈ పర్యంతం తన కుటుంబం ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నది కూడా గమనించలేదు, ఇక గుమ్మం దాటేశాడనుకున్నాకనే తల వెనక్కు తిప్పాడు; అప్పుడు కూడా, మెడ పట్టేయడం వల్ల, పూర్తిగా తిప్పలేకపోయాడు; తిరిగినంత మేరకు చూస్తే వెనకనున్న దృశ్యం ఏమీ మారలేదు, చెల్లాయి మాత్రం ఇప్పుడు నిలబడి ఉంది. ఆఖరుగా కనిపించింది తల్లి, ఆవిడ అప్పటికే గాఢంగా నిద్రపోతోంది.

అతను గదిలోకి అడుగుపెట్టడం ఆలస్యం, వెనుకనే తలుపు దఢాల్న మూసుకుపోయింది, గొళ్ళెం పడింది, తాళం తిరిగింది. ఈ ఆకస్మిక శబ్దం వల్ల కలిగిన అదురుకు కాళ్ళు చచ్చుబడినట్టయి అతను ఉన్న చోటే కుప్పకూలిపోయాడు. ఈ తొందర అతని చెల్లాయిది. ఆమె ముందుగానే సిద్ధంగా పొంచి నుంచుంది, అదను చూసి చురుగ్గా గుమ్మం దగ్గరకు గెంతింది, ఆ అలికిడి కూడా గ్రెగర్‌కి వినపడ లేదు; తర్వాత ఆమె తల్లిదండ్రుల వైపు చూసి, ‘హమ్మయ్య!’ అని అరుస్తూ తాళం తిప్పింది.

‘ఇప్పుడేంటి?’ గ్రెగర్ చుట్టూ చీకట్లోకి చూస్తూ ప్రశ్నించుకున్నాడు. తానిక కదల్లేడని అర్థం కావటానికి ఎక్కువ సేపు పట్టలేదు. ఏమంత ఆశ్చర్యం కూడా కలగలేదు; అసలు ఆ బక్కపల్చటి కాళ్ళు ఇన్నాళ్ళు తనను మోసాయంటేనే చిత్రం. అదొక్కటీ తప్పించి బానే ఉన్నాడు. వళ్ళంతా నొప్పులైతే ఉన్నాయి గానీ, అవి కూడా క్రమంగా నెమ్మదిస్తాయనీ, చివరకు పూర్తిగా తగ్గిపోతాయనీ అనిపించింది. శరీరం దిగువ భాగంలో కుళ్ళిపోయిన ఆపిలూ, దాని చుట్టూ కట్టిన పుండూ, దాని మీద పేరుకున్న పల్చటి దుమ్మూ, ఇవన్నీ ఇక ఇబ్బంది పెట్టడం మానేశాయి. తన కుటుంబాన్ని ఆత్మీయంగా తలుచుకున్నాడు. తాను ఇక్కణ్ణించి వెళ్ళిపోవటమే మంచిదని తన చెల్లాయి కన్నా గట్టిగానే అనుకున్నాడు. తెల్లవారుఝామున బయట గడియారస్తంభం మూడు గంటలు కొట్టే దాకా, అతను ఇలా శూన్య ప్రశాంత మనస్సుతో ఆలోచిస్తూనే ఉన్నాడు. కిటికీ బయట వెలుగు మారటం అతని చైతన్యానికి అస్పష్టంగా తెలిసింది. కాసేపటికి, అతని తల దానంతటదే వాలిపోయింది, అతని చివరి శ్వాస ముక్కుపుటాల్లోంచి బయటకు జారుకుంది.

మరుసటి రోజు చప్రాసీ పొద్దున్నే యథావిధిగా వచ్చింది – ఎవరెన్నిసార్లు వారించినా, ఆమె తలుపులు వేసేటపుడూ తీసేటపుడు, తన బలమూ అసహనమూ అంతా చూపెడుతూనే ఉంటుంది, ఆమె పనికి రావటమంటూ జరిగాక ఆ చప్పుళ్ళకి ఇక ఆ ఫ్లాట్ లో ఎవరూ నిద్రపోవటమనే ప్రసక్తే లేదు – ఆమె తన రోజువారీ అలవాటు ప్రకారం గ్రెగర్ గదిలోకి తొంగి చూసింది, వెంటనే తేడా ఏమీ పసిగట్టలేకపోయింది. అతను కావాలనే అలా కదలకుండా పడుకున్నాడనీ, మనసు గాయపడిన వాడిమల్లే ఫోజు పెడుతున్నాడనీ అనుకుంది; ఆమె దృష్టిలో గ్రెగర్ పెద్ద కంత్రీ. సమయానికి తన చేతిలో బూజుకర్ర ఉండటంతో, దాన్ని లోపలికి జొనిపి తలుపు దగ్గర్నుంచే గ్రెగర్కు  చక్కిలిగిలి పెట్టింది. ఏ ఫలితం లేకపోవటంతో విసుగెత్తి ఇంకాస్త గట్టిగా పొడిచింది, చివరకు ఉన్న చోటు నుంచి గట్టిగా అవతలకి నెట్టినా కూడా అతణ్ణించి ఏ స్పందనా రాకపోవటంతో అప్పుడు పరిశీలనగా చూసింది. విషయం వెంటనే అర్థమైంది, కళ్ళు పెద్దవి చేసి చిన్నగా ఈల వేసింది; వెంటనే వెళ్ళి పడకగది తలుపు దభాల్న తెరిచింది, తన గొంతంతా ఉపయోగిస్తూ లోపలి చీకట్లలోకి గట్టిగా అరిచింది: ‘ఓయ్, రండి రండి, ఆ పురుగు పనైపోయింది; అక్కడ చచ్చి పడుంది!’

జమ్జా దంపతులు మంచం మీద దిగ్గున లేచి కూర్చున్నారు, చప్రాసీ గొంతు కలిగించిన ఉలికిపాటు నుంచి తేరుకున్నాక గానీ, ఆమె చెప్తున్న దేమిటో వారికి అర్థం కాలేదు. ఇద్దరూ చెరోవైపు నుంచీ వేగంగా మంచం దిగారు; మిస్టర్ జమ్జా దుప్పటి తీసి తన భుజాల చుట్టూ కప్పుకున్నాడు, మిసెస్ జమ్జా తన నైట్ గౌనులోనే బయల్దేరింది; అందరూ గ్రెగర్ గదిలో అడుగుపెట్టారు. ఈలోగా లివింగ్ రూము వైపున్న తలుపు కూడా తెరుచుకుంది, ఒక గదిని కిరాయిదార్లకు అద్దెకిచ్చినప్పణ్ణించీ గ్రెటె అక్కడే పడుకుంటోంది; ఆమె రాత్రంతా నిద్రపోలేదని ఆమె దుస్తులూ, పాలిపోయిన ముఖమూ ఋజువు చేస్తున్నాయి. మిసెస్ జమ్జా సందేహంగా చప్రాసీ వైపు చూస్తూ, ‘చనిపోయిందా?’ అని అడిగింది, నిజానికి చూడాలనుకుంటే ఆమే చూడవచ్చు, పెద్ద పరిశీలించనక్కర్లేకుండానే అర్థమైపోతుందా విషయం. ‘అనే అనుకుంటున్నా,’ అంది చప్రాసీ, నిరూపించటానికన్నట్టు తన చేతిలో బూజుకర్రతో గ్రెగర్ శవాన్ని ఓ పక్కకు నెట్టింది. మిసెస్ జమ్జా బూజుకర్రను అడ్డుకోవటానికన్నట్టు చేయి గాల్లో జాపి మళ్ళీ వెనక్కు తీసేసుకుంది. ‘హ్మ్... దేవుడి దయ,’ అన్నాడు మిస్టర్ జమ్జా. అంటూ తన ఛాతీపై శిలువ గీసుకున్నాడు, తక్కిన ముగ్గురాడవాళ్ళూ ఆయనలానే చేశారు. గ్రెటె ఆ శవాన్ని కళ్ళార్పకుండా చూస్తూ అంది: ‘చూడండి ఎంత బక్కగా ఉన్నాడో. చాన్నాళ్ళుగా సరిగా తినటమే మానేశాడు. పెట్టిన తిండి పెట్టినట్టే వెనక్కు తీసుకురావాల్సి వచ్చేది.’ గ్రెగర్ శరీరం నిజంగానే పూర్తి చదునుగా, ఎండిపోయినట్టు ఉంది; దాన్ని ఇక ఏ కాళ్ళూ మోయటం లేదు కాబట్టి, ఆ సంగతి ఇపుడు స్పష్టంగా తెలుస్తోంది.

‘ఒక్కసారి లోపలికి వస్తావా గ్రెటె,’ విషాదంగా నవ్వుతూ అంది మిసెస్ జమ్జా; గ్రెటె శవం వైపు చూసుకుంటూ తల్లిదండ్రుల వెంట వాళ్ళ పడకగది లోకి వెళ్ళింది. చప్రాసీ తలుపు మూసి, కిటికీ బార్లా తెరిచింది. ఇంకా పూర్తిగా ఎండెక్కకపోయినా, అప్పుడే మార్చి నెల ఆఖరుకు వచ్చేసిందన్న దానికి సూచనగా, గాలిలో ఏదో మందకొడితనం ఉంది.

కిరాయిదార్లు తమ గదిలోంచి బయటకు వచ్చారు, తమకు ఇంకా టిఫిన్ వడ్డించలేదేమిటా అని ఆశ్చర్యంగా చూశారు; తమని నిర్లక్ష్యం చేశారని అర్థమైంది. ‘మా టిఫినెక్కడ?’ కిరాయిదార్ల లీడరు గద్దిస్తున్నట్టుగా చప్రాసీని అడిగాడు. కానీ ఆమె తన చూపుడు వేలును పెదాల మీద నిలువుగా ఆన్చి, ఏ మాట్లాడకుండా గ్రెగర్ గది కేసి చూపించింది. వాళ్ళు ముగ్గురూ తిన్నగా లోపలికి వెళిపోయారు, ఇప్పుడు లోపల వెలుగు పూర్తిగా పడుతోంది, వాళ్ళంతా తమ మాసిన కోటు జేబుల్లో చేతులుంచుకుని, గ్రెగర్ శవం చుట్టూ వలయంలా నిలబడ్డారు.

అప్పుడే జమ్జా దంపతుల పడకగది తెరుచుకుంది, మిస్టర్ జమ్జా యూనిఫాం ధరించి లోపలికి ప్రవేశించాడు, ఆయన చెరొక భుజం మీదా భార్యా కూతురూ వాలి ఉన్నారు, అందరి కళ్ళూ తడిగా ఉన్నాయి; గ్రెటె మధ్య మధ్యలో తన ముఖాన్ని తండ్రి భుజం కేసి తుడుచుకుంటోంది.

‘వెంటనే నా ఇంట్లోంచి బయటకు ఫొండి!’ అన్నాడు మిస్టర్ జమ్జా, ఇద్దరాడవాళ్ళని భుజాల మీదే ఉంచుకుని, తన చూపుడు వేలితో తలుపు వైపు చూపించాడు. కిరాయిదార్ల లీడరు, కొంత బిత్తరపోయి, పేలవంగా నవ్వుతూ, ‘ఏంటి మీరనేది?’ అన్నాడు. తక్కిన ఇద్దరూ, జరగబోతున్న గొడవ పట్ల ఉత్కంఠతో, అందులో గెలుపు ఖచ్చితంగా తమదేనన్న ధీమాతో, వీపుల వెనక చేతులు రుద్దుకుంటున్నారు. ‘ఎన్నిసార్లు చెప్పినా ఒకటే మాట,’ అన్నాడు మిస్టర్ జమ్జా, అంటూనే ఇద్దరాడవాళ్ళతోనూ కలిసి చిన్నసైజు పటాలంలా కిరాయిదారు మీదికి నడిచాడు. ఆ కిరాయిదారు కదలకుండా, కాసేపు నేలవైపే చూస్తుండిపోయాడు, అతని బుర్రలో పరిస్థితులు కొత్త మలుపు తిరుగుతున్నాయి. ‘సరే, వెళ్ళిపోతున్నాం ఐతే,’ అన్నాడతను, అంటూ ముఖంలో ఉన్నట్టుండి కొత్త అణకువ తెచ్చుకుని, తన నిర్ణయానికి మరోమారు ఆమోదం కావాలన్నట్టు, మిస్టర్ జమ్జా వైపు చూశాడు. ఆయన కటువుగా చూస్తూ, అంగీకారంగా పలుమార్లు తలాడించాడు. ఇక తప్పదన్నట్టు ఆ కిరాయిదారు నిజంగానే పెద్ద పెద్ద అంగల్తో హాలు వైపు నడిచాడు; అతని స్నేహితులిద్దరూ (వాళ్ళు చేతులు రుద్దుకోవటం ఎప్పుడో మానేసి ఈ మాటల్ని అప్రమత్తంగా విన్నారు) ఇప్పుడు అతని వెనకే – ఎక్కడ మిస్టర్ జమ్జా అడ్డుపడి తమను తమ లీడర్నించి వేరు చేస్తాడో అన్నట్టు – పరుగు పరుగున వెళ్ళిపోయారు. హాల్లో ముగ్గురూ అల్మారా నుంచి తమ టోపీలు తీసుకున్నారు, గొడుగుల స్టాండు నుంచి తమ ఊతకర్రలు లాక్కున్నారు, మర్యాదపూర్వకంగా ఓమారు వంగి, ఫ్లాట్ నుంచి నిష్క్రమించారు. మిస్టర్ జమ్జా ఆడవాళ్ళిద్దర్నీ వెంటేసుకుని, అర్థంలేని అనుమానంతో, ఆ ముగ్గురి వెనకా మెట్ల లాండింగు దాకా నడిచాడు; అక్కడ మెట్ల రెయిలింగుకు ఆనుకుని అందరూ కిందకు చూశారు, ఆ ముగ్గురు కిరాయిదార్లూ పొడవాటి మెట్లు నెమ్మదిగా దిగుతున్నారు, ప్రతీ అంతస్తులోనూ మెట్లు మలుపు తిరిగే చోట కాసేపు అదృశ్యమవుతున్నారు, తిరిగి ప్రత్యక్షమవుతున్నారు; వాళ్ళు కిందకు దిగే కొద్దీ జమ్జా కుటుంబానికి వాళ్ళ మీద ఆసక్తి తగ్గిపోయింది; ఒక మాంసం కొట్టు కుర్రాడు తల మీద ట్రేను ధీమాగా మోస్తూ వాళ్ళకు ఎదురై, వాళ్ళను దాటుకుని ముందుకు వచ్చేశాడు; అప్పుడిక కుటుంబమంతా రెయిలింగ్ విడిచి వెనక్కు వచ్చేసింది, ఊరటగా తమ ఫ్లాట్‌లో అడుగుపెట్టింది.

వాళ్ళు తక్కిన రోజంతా విశ్రాంతిగా గడపాలని, బయట వాకింగ్‌కి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు; తమ పనుల్నించి ఆ మాత్రం విశ్రాంతి పొందాలనుకోవటం వారి విషయంలో న్యాయమే కాదు, అవసరం కూడా. ముగ్గురూ టేబిల్ చుట్టూ కూచుని, మూడు సెలవు ఉత్తరాలు రాయటం మొదలుపెట్టారు, మిస్టర్ జమ్జా తన బాంకు మేనేజరుకూ, మిసెస్ జమ్జా తనకు కుట్టుపని కేటాయించే వ్యక్తికీ, గ్రెటె తన షాపు యజమానికీ రాస్తున్నారు. వాళ్ళిలా ఉత్తరాల్లో నిమగ్నమై ఉండగా చప్రాసీ వచ్చింది, తన పని అయిపోయిందనీ, ఇక ఈ రోజుకి వెళ్ళిపోతున్నాననీ చెప్పింది. ఉత్తరాల రచయితలు ముగ్గురూ కనీసం కళ్ళు కూడా పైకెత్తకుండా తలాడించి ఊరుకున్నారు, కానీ చప్రాసీ ఇంకా అక్కడే తచ్చాడుతుండటంతో, విసుగ్గా తలెత్తి చూశారు. ‘ఏంటి?’ అని అడిగాడు మిస్టర్ జమ్జా. చప్రాసీ జవాబివ్వకుండా గుమ్మం దగ్గరే నిలబడి నవ్వుతోంది, తన దగ్గర ఈ కుటుంబం కోసం ఏదో మంచి కబురు ఉన్నట్టూ, కానీ సరైన ప్రశ్నలు అడిగి రాబట్టుకుంటే తప్ప అదేంటో చెప్పనన్నట్టూ ఉంది ఆ నవ్వు. ఆమె టోపీలో నిటారుగా గుచ్చి ఉన్న ఆస్ట్రిచ్ ఈక నలువైపులకూ మెల్లగా ఊగుతోంది (ఆమె పనిలో చేరిందగ్గర్నుంచీ దాన్ని చూసినపుడల్లా మిస్టర్ జమ్జాకు వళ్ళు మండేది). ‘ఏం కావాలి నీకు?’ అడిగింది మిసెస్ జమ్జా, మిగతా వాళ్ళ కన్నా ఆవిడంటే చప్రాసీకి కాస్త గౌరవం ఎక్కువ. ‘అదీ,’ అని చెప్పడం మొదలుపెట్టింది గానీ, మధ్యలో తన కులుకు నవ్వు ఆపుకోలేక కాసేపు తంటాలుపడింది, తర్వాత తిరిగి కొనసాగించింది, ‘ఆ పక్క గదిలో ఉన్న దాన్ని వదిలించుకోవటం గురించి చెపుదామని. ఇక మీరేం ఇబ్బంది పడక్కర్లేదు. ఆ పని ఐపోయింది.’ మిసెస్ జమ్జా, గ్రెటె ఇద్దరూ మళ్ళీ రాసుకోవటానికి తమ ఉత్తరాల పైకి వంగారు; చప్రాసీ విషయమంతా వివరంగా చెప్పటానికి ఆరాటపడుతోందని గమనించిన మిస్టర్ జమ్జా, అదేం అవసరం లేదన్నట్టు చేతిని అడ్డంగా ఆడించాడు. తను ఎంతో ఉబలాటపడిన విషయం చెప్పేందుకు అనుమతి రాకపోవటంతో, చప్రాసీ తనకున్న బోలెడు పనుల్ని గుర్తు తెచ్చుకుంది; కినుక దాచలేని ముఖంతో, ‘సరే, వెళ్తున్నా ఐతే!’ అంటూ గట్టిగా చెప్పి, కోపంగా వెనుతిరిగింది, తలుపులు దబదబలాడిస్తూ ఫ్లాట్ నుంచి వెళ్ళిపోయింది.

‘ఆమెకి ఇవాళ్టితో నోటీసిచ్చేస్తాను,’ అన్నాడు మిస్టర్ జమ్జా, కానీ ఈ మాటకి ఆయన భార్య నుంచి గానీ కూతురు నుంచి గానీ, ఏ జవాబు రాలేదు, వాళ్ళకు ఇన్నాళ్ళ తర్వాత దక్కిన మనశ్శాంతిని ఆ చప్రాసీ పాడుచేసినట్టుంది. ఇద్దరూ లేచి, కిటికీ దగ్గరకు వెళ్ళారు, ఒకర్నొకరు నడుం ఒకరు పట్టుకుని అక్కడే నిలబడ్డారు. మిస్టర్ జమ్జా కుర్చీలో వారి వైపు తిరిగి కాసేపు నిశ్శబ్దంగా చూశాడు. తర్వాత ఇలా అన్నాడు: ‘రండి రండి, ఆ పాత విషయాలన్నీ ఇక పక్కన పెట్టేయండి. నా గురించి కూడా కాస్త ఆలోచించండి.’ ఆడవాళ్ళిద్దరూ ఈ మాటలు విన్న వెంటనే, గబగబా ఆయన దగ్గరకు వచ్చి, ఆయన్ను ప్రేమగా నిమిరారు, తమ ఉత్తరాల్ని త్వరగా పూర్తి చేసేశారు.

కాసేపటికి ముగ్గురూ కలిసికట్టుగా ఫ్లాట్ నుంచి బయటకు వచ్చారు, వాళ్ళిలా చేసి చాలా నెలలయింది, అక్కణ్ణించి ఒక ట్రామ్ కారు ఎక్కి ఊరి శివార్లలోని బయళ్ళ వైపు బయల్దేరారు. ట్రామ్ కారులో వాళ్ళు తప్ప ప్రయాణికులెవరూ లేరు, కారు నిండా వెచ్చగా నీరెండ పడుతోంది. సీట్లలో సుఖంగా వాలి కూర్చుని తమ భవిష్యత్తుని సమీక్షించుకున్నారు, ఇప్పుడు తరచి చూస్తే అదేమంత నిరాశాజనకంగా లేదు, ఇంతకుముందెన్నడూ ఒకరి ఉద్యోగాల గురించి ఒకరు మాట్లాడుకోలేదు, కానీ ఇప్పుడు ముగ్గురి ఉద్యోగాలూ పూర్తిగా సంతృప్తికరంగా ఉన్నాయనీ, మున్ముందు ఇంకా మెరుగవనున్నాయనీ తేలింది. వాళ్ళ పరిస్థితుల్లో తక్షణం ఒక మంచి మార్పు రావాలంటే, అన్నింటికన్నా ముందు తాముండే నివాసాన్ని మార్చాలి; వాళ్ళు ప్రస్తుతం ఉంటున్న ఫ్లాటును గ్రెగర్ ఎంపిక చేశాడు, దాని కన్నా ఇంకాస్త చిన్నదీ చవకదీ, కానీ ఇంకా మంచి పరిసరాల్లో ఉండేదీ, మేనేజ్ చేయటానికి సులువైనదీ అయిన ఫ్లాటు తీసుకోవాలి. సంభాషణ ఇలా సాగుతుండగా, తమ కూతురిలో ఉప్పొంగుతున్న ఉత్సాహాన్ని చూసి, తల్లిదండ్రులిద్దరికీ ఏకకాలంలో ఒకే భావం కలిగింది, శ్రమ వల్ల ఆమె చెంపలు కాస్త పాలిపోవటం మినహాయిస్తే, ఆమె ఇటీవల చాలా అందమూ సౌష్టవమూ గల పిల్లగా ఎదిగింది. వాళ్ళిద్దరూ కాసేపు మౌనం దాల్చారు, తమ కూతురికి ఒక మంచి సంబంధం వెతకాల్సిన తరుణం ఆసన్నమైందన్న ఆలోచనతో, చూపుల ద్వారానే పరస్పరం ఒక అవ్యక్త ఒప్పందానికి వచ్చారు. వాళ్ళ ఈ కొత్త కలల్నీ, మంచి ఉద్దేశాల్నీ ధృవీకరిస్తున్నట్టు, ప్రయాణం అయిపోగానే, అందరికన్నా ముందు కూతురే లేచి నిలబడి, తన పడుచు దేహాన్ని బడలికగా సాగదీసింది.

 – సమాప్తం –