March 17, 2012

మిత్రభేదం (ఏడవభాగం)

ముందుమాట | మొదటిభాగం | రెండవభాగం | మూడవభాగం | నాలుగవభాగం | ఐదవభాగం
ఆరవభాగం | ఎనిమిదవభాగం | తొమ్మిదవభాగం | పదవభాగంఆఖరిభాగం | పూర్తి కథ pdf |     

‘అది జరగక ముందూ’, ‘అది జరిగిన తర్వాత’ అంటూ జీవితాన్ని రెండు ముక్కలుగా విడగొట్టే సంఘటనల్లో చాలావాటికి ముందస్తు శకునాలేవీ అందవు. శేషూ విషయంలోనూ అంతే. నిజానికి ఆ భీష్మేకాదశి రోజు వేరే రకంగా గుర్తుండిపోతుంద నుకున్నాడు. ఎందుకంటే ఆ రోజు జనార్దనస్వామి రథోత్సవంలో తొలిసారి రథం చిటారు కొమ్ము దాకా యెక్కగలిగాడు. అదేమంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఆ యెత్తుకి కళ్ళు తిరగుతాయన్నది ఒక కారణం. నలభై అడుగుల రథం మనిషెత్తు వుండే చక్రాల మీద కదులుతుంటే, సాక్షాత్తూ స్వామి ఆలయమే గోపురంతో సహా కదలి వచ్చినట్టనిపిస్తుంది. ఇక రెండో కారణమేమంటే, వూరేగింపు జరిగేటపుడు రథం పైఅంతస్తు అంతా వూళ్ళో కోడెగాళ్ళు ఆక్రమించుకుంటారు, శేషూ లాంటి పిలకాయల్ని చేరనివ్వరు. ఇక్కడ వీళ్ళ రద్దీకి కూడా ఒక కారణం వుంది. కళ్యాణ జనార్దనుడు కొత్తగా రంగులేసిన రథమెక్కి శ్రీపాదపట్నం వీధుల్లో వూరేగుతుంటే, వూరి జనం యెవరి ముంగిట్లో వాళ్ళు నిలబడి అరటిపళ్ళూ, చిల్లర నాణేలూ, పూలదండలూ రథం మీదకి విసురుతారు. విసిరేటపుడు వీటన్నింటినీ శక్తి మేరకు రథం పైఅంతస్తుకే యెక్కుపెడతారు. అందుకే దానికి అంత గిరాకీ. అయితే శేషూ రథం యెక్కాలనుకోవడానికి మాత్రం, యెక్కాలనుకోవడం తప్ప వేరే పరమార్థమేమీ లేదు. దాన్ని యెక్కగలిగితే తనకు పెద్దరికం వచ్చినట్టేనన్న భావన అతని మనసులో యెప్పటి నుంచో నాటుకుపోయింది. కిందటేడాది దాకా అతనికెప్పుడూ అవకాశం చిక్కలేదు. ప్రయత్నం చేసినా రథం కదలకముందే పిలకాయలని చెప్పి దింపేసేవారు. ఇప్పుడు తొమ్మిదో తరగతిలో కొచ్చాక మూతి మీద లేతగా నూగుమీసం మొలవటంతో కొత్త ధీమా మొదలైంది. భద్రీతో కలిసి ముందు నుంచీ కసరత్తులు మొదలుపెట్టాడు. భీష్మేకాదశికి నాలుగు రోజుల ముందే రథసప్తమి నాడు రథాన్ని కొట్టంలోంచి బయటకు తీసి పావురాల రెట్టలు కడిగి రంగులు వేస్తారు. ఈ నాలుగురోజులూ కుర్రాళ్ళిద్దరూ బడి అయిపోగానే తిన్నగా రథం దగ్గరకు వచ్చేసేవారు. అయితే యెవరూ పట్టించుకోనపుడు యిలా చిన్నపిల్లలాటగా రథం యెక్కడం వేరు, వూరేగింపు రోజు ఆ సంరంభంలో రథం యెక్కడం వేరు. దాని కోసం బోలెడు పథకాలు వేసుకున్నారు.

ఎదురుచూసిన రోజు యెట్టకేలకు రానే వచ్చింది. ఊరేగింపు యింకా కొన్ని గంటలుందనగానే యిద్దరూ రథం పైకెక్కి, తిరణాలలో కొనుక్కున్న జీళ్ళూ, ఖర్జూరాలు తింటూ, కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. శేషు ఖర్జూరం తిన్నాకా పిక్కల్ని వూరకనే పోనియ్యలేదు; క్రింద రావిచెట్టు కొమ్మలకి వూగుతున్న వుయ్యాళ్ల దగ్గర గాని, కాస్త యెడంగా యేటివొడ్డున గింగిరాలు తిరుగుతున్న రంగులరాట్నం దగ్గరగాని, తోటివాళ్ళెవరైనా వున్నారేమో చూసి వాళ్ళ మీదకు విసిరాడు. ఎవరికైనా తగిలి తలెత్తి చూస్తే చప్పున వెనక్కి నక్కాడు. నెమ్మదిగా గుడి గోపురం వెనక సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఏటి మీంచి సాయంత్రపు గాలులు జుట్టు చెదరేస్తున్నాయి. ముహూర్తసమయం ఆసన్నమవుతుండగా వూరి జనం  రథం చుట్టూ చీమలదండులా గుమికూడారు. క్రింది అంతస్తులో  స్వామి వుత్సవవిగ్రహాన్ని రథారోహణ చేయించే కార్యక్రమం మొదలైంది. ఆలయ అర్చకుల మంత్రోచ్ఛారణలు వినిపిస్తున్నాయి. సుబ్బరాజు గారు ప్రధానార్చకుల దగ్గర్నించి తీర్థం పుచ్చుకుంటున్నారు. రేణుకాదేవి కూడా పక్కనే వుంది. శేషూ పై నుంచి అరిచాడు గానీ, గోలలో ఆమెకు వినపడలేదు.  ఈలోగా పైకి యెక్కిన కొందరు యువకులు వీళ్ళని దిగిపొమ్మని అదిలించారు. అదృష్టవశాత్తూ వాళ్ళలో భద్రీకి అన్నయ్య వరసవాడు వుండటంతో యిద్దరూ వాణ్ణి బతిమాలుకున్నారు. కొన్ని జీళ్ళు లంచం కూడా యిచ్చారు.

సుబ్బరాజుగారు కొబ్బరికాయ కొట్టడంతో వూరేగింపు మొదలైంది. జనం చెరోవైపూ రెండు వరుసలుగా నిలబడి, పిడికిళ్ళకు పట్టు దొరికీ దొరకని తాళ్ళ సాయంతో, ‘జైజనార్దనా’అని అరుస్తూ రథాన్ని లాగడం మొదలుపెట్టారు. ఒక్కసారి కాళ్ళక్రింద భూమి కదిలినట్టనిపించడంతో శేషూ, భద్రీ రథం దూలాల్ని పట్టుకుని వెర్రికేకలు పెట్టారు. అలంకరణకు వేలాడేసిన పూలదండలన్నీ దారిలో గతుకులకి లయగా వూగుతోంటే రథం రాజసంగా శ్రీపాదపట్నం ప్రధాన వీధులన్నీ తిరుగుతోంది. దాని చుట్టూ జనసందోహాన్ని చూస్తే, అది తిరుగుతున్న వీధులు తప్ప మిగతా వూరంతా నిర్జనమైపోయిందా అనిపిస్తోంది. ప్రతీ వీధిలోనూ కాసేపు ఆగినపుడు ఆ వీధి ముత్తయిదువులంతా యెదురెళ్ళి హారతులిస్తున్నారు. పై అంతస్తులో కుర్రాళ్లిద్దరూ మీదకు యెగిరి వస్తున్న చిల్లరని అందుకునేందుకు మిగతా యువకుల్తో పోటీ పడుతున్నారు. ఊరేగింపు సగంలో వుండగానే మసక చీకట్లు అలుముకున్నాయి. క్రింద జనం కాగడాలు వెలిగించారు. వాటితోపాటూ వీధి కిరువైపులా గెడకర్రలపై వేలాడేసిన విద్యుద్దీపాలంకరణ కూడా వెలగడం మొదలైంది. పైన ఆకాశంలో నక్షత్రాల మినుకుమినుకులూ, క్రింద భూమ్మీద సీరియల్ లైట్ల మిలమిలలూ, నడి మధ్యన శేషూ! చీకట్లో నాణేల్ని పట్టుకోవడం కష్టమవుతోంది. ఒక్కో నాణెమైతే ఠపీమని తల వాచేట్టు తగుల్తోంది కూడా. ఊరేగింపు మొత్తం పూర్తయేసరికి అతని జేబులో ఐదు రూపాయలు పైగా చిల్లర పోగుపడింది. కొన్ని అరటిపళ్ళు కూడా దొరికాయి. ఊరంతా చుట్టి వచ్చి రథం మళ్ళీ గుడి చేరింది. స్వామిని పల్లకీలో యెక్కించి గుడిలోకి తీసుకుపోయారు. శేషూని అలా మోసేవాళ్ళెవరూ లేకపోవడంతో రథం కమ్మీలు పట్టుకుని నేల మీదకు దిగాడు. ఇంకా రథం తాలూకు వూపు వంటిని వదిలిపోనట్టే వుంది. కాళ్ళు యిప్పటికీ కష్టపడనవసరం లేకుండా గాల్లో జారుకుంటూపోవాలని ఆశపడుతున్నాయి. మనసు విజయగర్వంతో కుప్పిగెంతులు వేస్తోంది. ఈ రోజు తొలిసారి రథం యెక్కిన రోజుగా యెప్పటికీ గుర్తుండిపోతుందనుకున్నాడు.

భద్రీ  పోగైన చిల్లర యింటి దగ్గర దాచుకోవటానికి వెళ్లాడు. శేషూ అరటిపండొకటి వలుచుకుంటూ గుళ్ళోకి బయల్దేరాడు. గుడి ఆవరణ అంతా సందడిగా వుంది. పండగ దుస్తుల్లో వూరిజనం రోజూ చూసేవాళ్ళే కొత్తగా కనిపిస్తున్నారు. పెద్దలు ప్రదక్షిణలు చేస్తుంటే, పిల్లలు వాళ్ళ కాళ్ళకు అడ్డం పడుతూ ఒప్పులకుప్పా, దాగుడుమూతలూ ఆడుతున్నారు. ధ్వజస్తంభం చుట్టూ పేర్చిన ప్రమిదల్లోని దీపకళికలు చీరల విసురుగాలులకు కుదురులేకుండా తైతక్కలాడుతున్నాయి. ముఖమండపంలో గంట వుండుండి మోగుతోంది. ధూపదీపనైవేద్యాల్తో గర్భగుడిలో స్వామి వుక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు. శేషు కులాసాగా ఒక మూలనున్న ఖాళీ మండపం యెక్కి కూర్చుని, చుట్టూ పరికిస్తూ అరటిపండు తింటున్నాడు. ఇంతలో యీ సందడి మధ్య రేణుకాదేవి కనిపించింది. ముఖమండపం మెట్లు దిగి అతని వైపే నవ్వుతూ నడిచి వస్తోంది. చిలకాకుపచ్చరంగు పట్టుపరికిణీ మీద వంకాయరంగు బుట్టచేతుల జాకెట్టు వేసుకుంది. తల మీద పాపిడిబిళ్ళ మెరుస్తోంది. ఆమె దగ్గరకు వచ్చి నిలబడటంతో కాళ్ళాడించడం ఆపాడు. ఎక్కడికి వెళ్లావని అడిగింది. శేషు వుత్సాహంగా రథం మీద చేసిన విన్యాసాలు చెప్పటం మొదలుపెట్టాడు. అవన్నీ తర్వాత, ముందు మండపం దిగమంది. ఎందుకని అడిగితే, పని ఒకటి పురమాయించింది. ఆలయనిర్మాతల వంశం గనుక సుబ్బరాజుగారి కుటుంబానికి స్వామి సేవలన్నిటిలోనూ ప్రాముఖ్యత వుంటుంది. రాత్రి పవళింపుసేవకి స్వామి శయ్యాలంకరణ బాధ్యత రేణు తలకెత్తుకుంది. దాని కోసమని యిపుడు గుడి వెనుక కోనేట్లో తామరపూలు కావాలట. శేషూ బట్టలు తడిసిపోతాయన్నాడు. ఇంటి కెళ్ళి మార్చుకోవచ్చులెమ్మంది. కోనేటి దగ్గర చీకటిగా వుంటుందన్నాడు. వెంట తోడు వస్తానంది. అసలు తామరపూలు అలంకరణకి వాడకూడదన్నాడు. నీకు తెలీదు వాడవచ్చంది. ఆమె యిక యేం చెప్పినా వినేట్టు లేదని అర్థమై, మండపం నుండి దూకి, ఆమె వెనుక నడిచాడు.

జడగంటలు కట్టుకుని జళ్ళో మల్లెపూలు తురుముకుందామె. చెవులకు బుట్టలు, వాటి వెనక నుండి చెంపసరాలూ కూడా కనపడుతున్నాయి. రేణూ యీ అలంకరణలో కొత్తగా కనిపిస్తోంది. నిజానికి మనిషిలో కూడా యీ మధ్య కొత్త మార్పొచ్చింది. గత యేడాది వాళ్ళింట్లో ఆమె సమర్తాడిన వేడుక జరిగినప్పట్నించీ యీ మార్పు గమనిస్తున్నాడు. అతనితో సాన్నిహిత్యం యెప్పటిలానే వుంది. కానీ యిదివరకూ అతనికి మాత్రమే ప్రవేశార్హత వున్న ఆమె సాన్నిహిత్యపు సౌధంలో, యిప్పుడు వేరే ప్రపంచానికి కూడా తలుపులు తెరుచుకుంటున్నాయి. తోటి ఆడపిల్లల్లో యిద్దరు ముగ్గురు తరచూ ఆమె వెంట కనిపిస్తున్నారు. ఇదివరకట్లా అతని కూడాపడి తిరగడం తగ్గించింది. అతనితో మంకుపట్లు పట్టడం మానేసింది. అతని ధ్యాస దబాయించి లాక్కోవడం లేదు. అయితే ఆమె యిదివరకూ అలా వుండేదీ అన్న సంగతి, అలా వుండటం మానేసాకనే అతనికి తెలిసింది. ఆమెలో చిగురుతొడుగుతున్న యీ స్వయంప్రతిపత్తి అతనికి యే మూలో కొంచెం యిబ్బందిని కలిగించింది. కాని దాన్ని యిదమిత్థమని యెపుడూ తరచి చూసుకోలేదు.

ఇద్దరూ గుడి వెనుక మండపాలన్నీ దాటి పెద్ద రావి చెట్టు దగ్గరకు వచ్చారు. రావి చెట్టుకు అవతల నలువైపులా మెట్లతో కోనేరు వుంది. రావి గుబుర్లు అడ్డం రావటం మూలాన ప్రస్తుతం అక్కడ మసకచీకట్లు ఆవరించి వున్నాయి. వెనుక గుడిలోంచి లీలగా వినిపిస్తున్న గంటానాదం తప్ప అక్కడ అంతా నిశ్శబ్దంగా వుంది. ఇద్దరూ మెట్లు దిగారు. తామరపూలేవీ ఒడ్డుకు చేరువగా లేవు. అన్నీ కోనేటి మధ్య వున్న చిన్ని మండపం చుట్టూ గుమికూడి వున్నాయి. ఆ మండపం అవతలి ఒడ్డుకు దగ్గర కావడంతో యిద్దరూ మెట్ల మీదుగా అటు నడిచారు. గుడి కోలాహలంతో నిమిత్తం లేదన్నట్టు కోనేరు నిశ్చలంగా నిద్రిస్తోంది. దాన్ని తమ రాకకు జాగృతం చేయడానికన్నట్టు, రేణుకాదేవి మామూలుగా నడుస్తున్నదల్లా పరికిణీని మడమల పైకెత్తి ఒక కాలు మెట్టు మీద వేస్తూ, ఒక కాలితో నీటిని కలచివేస్తూ నడవసాగింది. నాచు వుంటుంది జాగ్రత్త అన్నాడు శేషు. అదేం పట్టనట్టు కూనిరాగం తీస్తోంది. పడితే నా పూచీ కాదన్నాడు. అయినా మానలేదు. ఆమె పాట అక్కడి నిశ్చలత్వాన్ని మరింత యెత్తి చూపుతోంది. ప్రకృతి మొత్తం అప్రమత్తంగా వూపిరిబిగబట్టి వింటున్నట్టుంది.

ఇద్దరూ అటుప్రక్కకి చేరారు. శేషూ జేబులో చిల్లర తీసి ఆమెను జాగ్రత్త చేయమన్నాడు. అరటిపండొకటి తీసి తినమని యిచ్చాడు. ముందు బట్టలు తడవకుండా పనవుతుందేమో చూద్దామనిపించి, అక్కడ వున్న ఒక జామచెట్టు దగ్గరకు వెళ్లాడు. చెట్టును చంపేస్తున్నావని రేణూ గోలపెట్టడంతో కొమ్మ విరిచే ప్రయత్నం మానేసాడు. చుట్టూ వెతికి ఒక ఎండు కొబ్బరిమట్ట దొరికితే పట్టుకొచ్చాడు. మోకాలిలోతు వచ్చేదాకా నీట్లో మెట్లు దిగి ఆ కొబ్బరిమట్ట చాపాడు. అయినా పూలు అందేట్టు లేవు. యింకో మెట్టు దిగితే లాగూ తడిచిపోయేట్టుంది. ఒక వుపాయం ఆలోచించాడు. రేణూని వెనక నుంచి చొక్కా అంచు పట్టుకోమన్నాడు. ఆమె మిగిలిన అరటిపండు బుగ్గన కూరేసుకుని, వచ్చి పట్టుకుంది. ఆ దన్ను మీద యింకాస్త ముందుకు వాలాడు. రేణూ కాసేపు పళ్ళుబిగబట్టి బరువు మోసింది గానీ, వల్ల కాలేకపోయింది. పిడికిళ్లలోంచి చొక్కా జారిపోయింది. శేషూ భళ్లుమని నీటిలో పడ్డాడు. కోనేరు తరంగితమైంది. రేణూ  గుప్పిళ్ళతో నోరు మూసుకుని నవ్వాపుకుంది. శేషూ కాసేపు నీళ్ళలో కొట్టుకుని నెమ్మదిగా అడుగుమెట్టు మీద కాళ్లు నిలదొక్కుకున్నాడు. తడిసిన వళ్ళు పుట్టిస్తున్న చలికి చంకల్లో చేతులు దూర్పుకుంటూ మా తల్లే! నిన్ను నమ్మినందుకు చెప్పుచ్చుక్కొట్టుకోవాలి! అన్నాడు నిష్టూరంగా.

రేణూకి యింకా నవ్వాగటం లేదు. తెరలు తెరలుగా నవ్వుతూ, జారిపోయింది శేషూ! నిన్ను కావాలని నీళ్ళపాలు చేస్తానా, అంది, బుజ్జగింతలో కాస్త యెకసక్కెం కలిపి.

అదే యెటకారవంటే, నిన్ను తోత్తే తెలిసొస్తాది అంటూ కొబ్బరిమట్ట ఒడ్డు మీదకు విసిరేసి, వెనుదిరిగి తామరపూల వైపు యీదటం మొదలుపెట్టాడు. ఈత అదురుకి చుట్టూ వున్న పూలన్నీ చెదిరిపోతున్నాయి. తామరాకులు తలకిందులవుతున్నాయి. వాటిలోంచే కొన్నింటిని యేరడానికి  ప్రయత్నిస్తుంటే రేణు వారించింది. మండపం దగ్గరున్న పూలు తాజాగా వున్నాయి అవి తెమ్మంది. సరేండమ్మగారూ, వొడ్డునుండి బానే చెప్తున్నారు కవుర్లు, అని గునుస్తూ, అటు యీదాడు. మండపం యెక్కి, దాని స్తంభం ఒకదాన్ని ఆసరాగా పట్టుకుని, తన యీతకి నీరు చెదరని వైపు వంగి కొన్ని పూలు లాగాడు. అతను పూలు తెంచుతున్నంత సేపూ రేణూ యేవో సూచనలు చేస్తూనే వుంది. ఆమె యేరమన్న వాటినే యేరి, వాటన్నింటినీ జాగ్రత్తగా యెత్తి పట్టుకుని నెమ్మదికా యీదుకుంటూ ఒడ్డుకు వచ్చాడు. నీట్లోంచి బయటపడగానే మళ్ళీ చలి ఆవరించింది అతణ్ణి. అమ్మీడెమ్మా నీట్లో తెలీటం లేదు చలి! అంటూ వణికిపోతూ మెట్లెక్కుతున్నాడు. అతని చంకలో పూలు తీసుకోవడానికి రేణూ దగ్గరకొచ్చింది. పూలు యివ్వకుండా, ఆమె మీద జుట్టు దులిపి నీళ్ళు చిలకరించాడు.  ఓయ్! వేషాలేయకు అంటూ వెనక్కు గెంతింది.

యేం మరి పై నుండి పెద్ద పిల్లజమిందార్లా దర్జా వలకబోస్తన్నావూ?

ఆమె పెదాల వెనక నవ్వు నొక్కిపెట్టి, తెచ్చిపెట్టుకున్న కోపంతో, ఇదిగో తొందరగా వెళ్లాలి, యిస్తావా యివ్వవా,” అంటూ  దగ్గరకొచ్చింది. మళ్ళీ జుట్టు విదిలించాడు. మళ్ళీ వెనక్కి జంకింది. నడుంపై చేతులాన్చి యేవిటీ అల్లరి అన్నట్టు చూసింది. వెంటనే యేదో గుర్తొచ్చినట్టు జామచెట్టు దగ్గరకు వెళ్ళింది. అక్కడ జార్త చేసిన అతని తాలూకు చిల్లర చేతిలోకి తీసుకుంది, పోన్లే, ఆ పూలన్నీ నువ్వే వుంచుకో. యీ చిల్లరేమో నేను కోనేట్లో నిమజ్జనం చేస్తాను. సరేనా? అంటూ మెట్ల దగ్గరకొచ్చి చేతిని నీటి మీదకు చాపింది నాణేలు జారవిడబోతున్నట్టు.

అతను కంగారుగా కాళ్లబేరానికొచ్చాడు. ఓయ్ మాతల్లి! ఆటితో చాలా పనుంది. ఏం చేయకు. దా, వచ్చి తీసుకో నీ మాయదారి పూలు!

అలారా దారికి! అంటూ దగ్గరకు వచ్చింది. చంకలోంచి పూలు తీసి ఆమె కిస్తున్నట్టే చేయిసాచాడు. వాటిని అందుకోబోతోందనగా, రెండో చేత్తో చిల్లర దాచిన ఆమె చేయి పట్టుకుని తన వైపు గుంజాడు. అరిచి పారిపోబోయింది. పూలున్న చేతికి కూడా పనిచెప్పి ఆమె నడుమును వెనక నుంచి ఒడిసిపట్టుకున్నాడు. గుప్పిలి విప్పి చిల్లర లాక్కోవాలని ప్రయత్నిస్తున్నాడు. వదలమని గింజుకున్న కొద్దీ ఆమె వీపును తన కడుపుకేసి మరింతగా అదుముకుంటున్నాడు. ఆమె మెడ వంపులోకి చుబుకాన్ని జొనిపి భుజాన్ని నొక్కిపట్టాడు. చెంప నునుపుదనమూ, చెవిబుట్టల గరుకుదనమూ జమిలిగా స్పర్శ తెలుస్తున్నాయి. ఎపుడు మొదలైందో తెలియదు, కాంక్ష క్షణక్షణ ప్రవర్ధమానమైంది. చిల్లర లాక్కునే ప్రయత్నం వదిలేసి చేత్తో ఆమె పొత్తి కడుపును నిమిరాడు. చెంపల్ని తన వేడి చెంపలతో రుద్దాడు. ఆమె యిందాకట్లా గింజుకోవటం లేదు. చేష్టలుడిగిన ఆమె జడత్వాన్ని సమ్మతిగా అర్థం చేసుకుని, ఆమె శరీరాన్ని సాంతం తన వైపు తిప్పుకుని, అరటిపండు వాసన వేస్తున్న పెదాల్ని తన పెదాల్తో గట్టిగా నలిపాడు. రేణు అపుడే స్పృహలోకి వచ్చినట్టు శక్తి కొద్దీ అతని ఛాతీ మీద చేయి వేసి తోసేసింది. రెండంగలు వెనక్కి తూలినవాడల్లా, మళ్ళీ ముందుకు రాబోతోంటే, చిల్లర వున్న గుప్పిలి విప్పార్చి అతని చెంప మీద బలంగా కొట్టింది. నాణేలు ఘల్లుమంటూ నేల రాలాయి. ఒక నాణెం బొంగరంలా తిరిగి ఆగింది. మరొక నాణెం రెండంగల్లో మెట్లు దిగి బుడుంగుమని నీటిలో మునిగింది. ఆమె ఏ క్షణానైనా ఏడ్చేసేట్టు చూస్తోంది. అతను యింకా శిఖరం నుండి లోయలోకి జారిపోతున్న దిమ్ములోనే వున్నాడు. నొప్పిగా చెంప తడుముకున్నాడు. భయవిహ్వలమైన ఆమె ముఖకవళిక చూసి అలవాటుగా ఒక అడుగు ముందుకు వేసాడు. ఆమె గిరుక్కున వెనుదిరిగి పరిగెత్తింది. మెట్ల మీదుగా, రావి చెట్టు దాటి, యెక్కడా వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయింది.

అతనికి పరిసర స్పృహ వెంటనే కలగలేదు. చేతిలో నలిగిన తామరతూళ్ళను నేల మీదకు జారవిడిచాడు. మెట్ల మీద చెల్లాచెదురైన నాణేల్ని యేరుకోవటం మొదలుపెట్టాడు. ఇంతలో అకస్మాత్తుగా యేదో గుర్తొచ్చినట్టు, జుట్టు పిడికిట పట్టి నలుపుకుంటూ, అయబాబోయ్! అని గొణుక్కున్నాడు. ఒక్క వుదుటున పులి అలికిడి పసిగట్టిన జింకలా కదిలి గుళ్ళోకి పరిగెత్తాడు. ముఖమండపం దాకా వచ్చాక అతని చూపులు ఆదరాబాదరాగా జనమంతా వెతికాయి. రేణూ యెక్కడా కనపడలేదు. అంటే యింటికి వెళ్లి వుంటుంది, విషయం సుబ్బరాజుగారికి చెప్పటానికి!  గుడి బయటకు పరిగెత్తాడు. ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు. ఇంటికి వెళ్ళే సమస్యే లేదు.  అప్పటికే అతని మనసు సుబ్బరాజుగారి పాలేరు యింటికొచ్చి మాట్లాడుతున్న దృశ్యాన్ని వూహిస్తోంది. వెంటనే బాలా గుర్తొచ్చి అతని యింటి వైపు పరిగెత్తాడు.

దారిలో వాతావరణమంతా యిందాకటిలానే సందడిగా వుంది. వీధికి చెరోవైపూ విద్యుద్దీపాలంకరణ యింకా వెలుగుతోంది. రథోత్సవం పూర్తి అవంగానే తిరణాల మళ్ళీ  జోరందుకుంది. జీళ్ళ దుకాణాల్లో రాటకేసి బెల్లంపాకాన్ని సాగలాగుతున్నారు. తడిక భుజానేసుకుని గాజులూ పూసలూ సవరాలూ అమ్మే అమ్మి, గాజులూ పూసలూ సవరాలోయ్ అని అరుస్తూ పచార్లు చేస్తోంది. పిల్లంగోవిలమ్మేవాడు పిల్లంగోవి వూదుకుంటూ తిరుగుతున్నాడు. పిడతకిందిపప్పు బండి దగ్గర పిల్లలు గుంపుగా మూగివున్నారు. కాసేపటికి క్రితం వరకూ యీ పండగ వాతావరణమంతా యెంతో సానుకూలంగా కనిపించింది. ఇపుడు మాత్రం అతని నరకాన్ని నిర్దయగా వెక్కిరిస్తున్న విపరీత నేపథ్యంలా వుంది. కాసేపటి క్రితం వరకూ యీ వీధుల్లోనే రాజాలా రథమెక్కి వూరేగాడు. ఇపుడు బెదురుగొడ్డులా నేలమ్మటా పరిగెడుతున్నాడు. అసలు `కాసేపటి క్రితం' అనేది కాసేపటి క్రితంలానే లేదు, ఏదో కలలా వుంది. ఇలా జరగాలని రాసిపెట్టి వుండబట్టే, దేవుడు ఆ కాసేపూ సుఖపెట్టాడేమో. ఇవాళ దేవుడికేవన్నా అపచారం చేసాడా. ఇందాక రథం పై నుంచుని జనాల మీదకి ఖర్జూరం పిక్కలు యిసరలేదూ. అందుకే యిలాంటి శిక్ష వేసి వుంటాడా. లేకపోతే శుభమా అంటూ పండగరోజు తనకలాంటి బుద్ది యెందుకొచ్చింది. అలా జరగకుండా వుంటే యెంత బాగుండును. అసలు రేణు కనపడకపోయుంటే యెంత బాగుండును. తిన్నగా గుడి నుండి యింటికి వెళిపోయేవాడు. అమ్మ యివాళ పులిహోర, పరవాణ్ణం చేస్తానంది. ఈ పాటికి అవి తింటూ వుండేవాడు. ఇపుడు అన్నాని క్కూడా దిక్కు లేదు. పోనీ యివాళ మాట దేవుడెరుగు. రేపైనా యింటికెళ్లగలడా. వెళితే అమ్మా నాన్నా యేం చేస్తారన్న సంగతి తరువాయి, ముందు సుబ్బరాజుగారికి అప్పజెప్పేయకుండా వుంటే అదే పదివేలు. అసలే కూతురు విషయంలో అల్లుణ్ణి చంపేసాడంటారు. ఆయనకి అప్పజెపితే తనకి డప్పడిపోయినట్టే. అలాంటి పరిస్థితే వస్తే యిల్లు వదిలి పారిపోవడం తప్ప యింకో దారి లేదు. అసలు అందాకా రానివ్వడమెందుకు, యిపుడే వెళిపోతే.  జేబులో డబ్బులున్నాయి. గడియారస్తంభం దాకా పోయి ముసిలోడి జట్కా బండి యెక్కితే అరగంట్లో రైల్వేస్టేషను దగ్గర దిగొచ్చు. ఏ రైలు ముందొస్తే ఆ రైలెక్కి కూచోవటమే. ఎక్కడ దింపితే అక్కడ దిగిపోవడమే. కొత్త ప్రదేశంలో కొత్త జీవితం మొదలుపెడతాడు.

ఈలోగా బాలా యిల్లు రావడంతో, ఆ కొత్త జీవితానికి సంబంధించిన పగటికలల చలనచిత్రానికి రీలు తెగింది. గుమ్మంలోకి వెళ్లబోయిన వాడే గట్టిగా మాటలు వినపడటంతో ఆగాడు. అవి బాలావాళ్ల నాన్న సూర్రావు గారి మాటలు. మాటలు కూడా కాదు, తిట్లు. వరండాలో నక్కి కిటికీ లోంచి తొంగి చూసాడు. అక్కణ్ణించి సూర్రావుగారు కనపడటం లేదు గానీ, బాలా కనపడుతున్నాడు. బాసింపట్టు వేసుక్కూర్చుని పుస్తకంలో తల దూర్చేసి వున్నాడు. చదవనంటే యిపుడే చెప్పేసేయి, రెండు గేదెలు కొనిపెడతాను, అలాగైనా వుద్ధరిద్దువుగాని! అంటున్నారు సూర్రావుగారు. ఆయనకి ఒక్కోసారి వున్నట్టుండి పిల్లల భవిష్యత్తు పట్ల విపరీతాందోళన కలుగుతూంటుంది. తాను వుద్యోగ బాధ్యతల్లో పడి పట్టించుకోకపోవడం వలన తల్లి లేని పిల్లలు పాడయిపోతున్నారా అన్న అనుమానం పుడుతుంది. కూతురు యెలాగూ యెప్పటికైనా గడప దాటి పోయేదే గనుక, కొడుకు చదువు మీద ధ్యాస మళ్ళుతుంది. అప్పటికప్పుడు ఆ కుర్రాడి పురోగతిపై తనిఖీ మొదలుపెడతాడు. ఈ ఆకస్మిక తనిఖీల్లో ఆయన అనుకున్న ఫలితం కనపడకపోతే, ఆ రోజుకారోజే వాణ్ణి ఉద్ధరించేయాలన్నంత ఆవేశపడతాడు. ఆ ఆవేశం నిలిచినన్ని రోజులూ యింట్లో సైనిక క్రమశిక్షణ అమల్లోకి వుంటుంది. అది చల్లారిన తరువాత మళ్ళీ అంతా మామూలే. బాలా యివాళ తిరణాల్లో యెందుకు కనపడలేదో అర్థమైంది శేషూకి. ఇప్పుడు వెళితే బాలాని పంపడం మాట అటుంచితే, ఆయన తనని కూడా కలిపి రేవాడేసేలాగున్నాడు. చప్పుడు చేయకుండా మెల్లగా బయటపడ్డాడు. ఈ భద్రీ గాడైనా యింటి దగ్గర తగలడ్డాడో, వూరి మీద పడి తిరుగుతున్నాడో చూడాలి. వాడూ లేకపోతే దిక్కులేనట్టే.

ఈ లోగా తిరణాల్లో కొనుక్కున్న బుడగ యెగరేసుకుంటూ  బాలా చెల్లెలు సుధ ఆపద్బాంధవిలా యెదురువచ్చింది. శేషూని చూడగానే మెడలో వేలాడుతున్న రంగుకళ్ళజోడు కళ్లకు తగిలించుకుని నవ్వుతోంది. బడాయి చాల్లేవే అంటూ ఆ పిల్లని నిలేసాడు. వాళ్ళన్నయ్యని బయటికి తీసుకు రాగలదేమో అడిగాడు. అమ్మో నాన్న తిడతాడంది. ఏదో వంక పెట్టి బయటకు తీసుకు వస్తే జీళ్ళు కొనిపెడతానన్నాడు. దాని బదులు ఆ డబ్బులిచ్చేస్తే రంగులరాట్నం యెక్కుతానంది. ఏదో ఒకటి చేద్దువుగాని ముందు వెళ్ళమని తొందరపెట్టాడు. ఉత్సాహంగా గెంతుకుంటూ లోపలికి వెళ్లింది. కాసేపట్లోనే బాలాని వెంటబెట్టుకు వచ్చింది. ఏం చెప్పి తీసుకు వచ్చావని అడిగితే, రంగులరాట్నం యెక్కడానికి భయమేస్తుంది, అన్నయ్య తోడు కావాలని చెప్పానంది.

శేషూ తన చెల్లెలికి డబ్బులివ్వడం చూసి బాలాకి వళ్ళుమండింది. అతను యింట్లో మగ్గిపోతుంటే యీ పిల్లేమో తిరణాలంతా బలాదూరు తిరుగుతోంది. ఎందుకే డబ్బులు నీకు, పోయి పన్చూసుకో, అని గసిరాడు. శేషూ నువ్వుండరా బాబూ అంటూ బాలాని సముదాయించి, ముఖం చిన్నబుచ్చుకున్న ఆ పిల్లకి డబ్బులు యిచ్చి పంపాడు. తరువాత అతణ్ణి పక్కనున్న చీకటి సందులోకి లాక్కుపోయి విషయమంతా క్లుప్తంగా చెప్పాడు. ఒకసారి తన యింటికి వెళ్ళి యెవరైనా వచ్చారేమో చూసి రమ్మన్నాడు. అలా వెళ్ళేటపుడు యెలాగూ దారే గనక సుబ్బరాజుగారి మేడ దగ్గర కూడా ఆగి యేవైనా గొడవ అవుతుందేమో చూడమన్నాడు. ఈలోగా బాలా కోసం తాను బడి మైదానంలో యెదురు చూస్తుంటానని చెప్పి అటువైపు పరిగెత్తాడు.

బాలా రెండో వైపు వెళ్లాడు. అతనికి యీ వ్యవహారమంతా రోమాంచితమైన వుత్కంఠని కలగజేసింది. ఇందాకటి దాకా యే తిరణాల్లోకి ప్రవేశం నిషిద్ధమై తాను యింట్లోనే కుతకుతా వుడికిపోయాడో, యిపుడు అదే తిరణాల చుట్టూ వూరిస్తున్నా పట్టించుకోబుద్ధి వేయలేదు. సుబ్బరాజుగారి మేడ దాకా వెళ్ళి కాసేపు బయట తచ్చాడాడు. గొడవ తనది కాదు కాబట్టి, యేది యెటు తిరిగినా తనకు పోయేదేమీ లేదు కాబట్టి, లోపలికి వెళ్ళి రేణూని కలుద్దామా అన్నంత ధైర్యం కూడా కలిగింది. కానీ రేణూ నిజంగా చెప్పేసి వుంటే లోపల పరిస్థితి యెలా వుందో తెలియదు. సుబ్బరాజు గారు యెదురైతే తనకు మాట పెగలదు. కాసేపు చూసి అట్నుంచటు శేషూ వాళ్ల పాకకి వెళ్లాడు. ఏమీ యెరగనట్టు శేషూ గురించి వాళ్ళమ్మని అడిగాడు. ఎక్కడ బలాదూరు తిరుగుతున్నాడో తెలియదని విసుక్కుంది.  బాలాకి మల్లే యెప్పుడూ యింటి పట్టున వుండే బుద్ధి వాడికెందుకు రాదో అని వాపోయింది. అంతటితో అతణ్ణి వెళ్లనివ్వక, కూర్చోపెట్టి పరవాణ్ణమదీ కూడా వడ్డించింది. బయటెక్కడన్నా శేషు కనిపిస్తే  త్వరగా రమ్మనమని చెప్పి వదిలింది.

అక్కణ్ణించి బాలా తిన్నగా బడి చేరుకున్నాడు. బయటనున్న వేపచెట్టు కొమ్మల సాయంతో ప్రహరీగోడ యెక్కి లోపలికి దూకాడు. అతను బడిని పగలే తప్ప రాత్రి యెపుడూ చూడలేదు. నక్షత్రాల మసక వెలుగు తప్ప అంతా చీకటిగా వుంది. ఎక్కణ్ణించో మైకులో లీలగా వినిపిస్తున్న భజనపాట తప్ప అంతా నిశ్శబ్దంగా వుంది. భయమేసి శేషూ అని పిలిచాడు. ఓ మూల నుంచి, ఇంత బేగా వచ్చేసేవారా, నింపాదిగా రేపొద్దున్న రావాల్సింది, నీ యబ్బా! అంటూ తిట్లు వినిపించడంతో అటు పరిగెత్తాడు. శేషూ బాదం చెట్టు చప్టా మీద కాళ్ళను కడుపుకేసి కౌగలించుకుని కూర్చునున్నాడు.

మీ అమ్మేరా బాబు, పరవాణ్ణమదీ తినేదాకా కదలనివ్వలేదు.

ఒరే, నాక్కూతైనా వుంచేవా, మొత్తం మెక్కేహేవా?

కొంచెవే తిన్నానెహె! కానీ మీ అమ్మ భలే చేస్తుందిరా. మా నాన్న చేస్తే వుట్టి పందారన్నం తిన్నట్టుంటుంది. మళ్ళీ అన్నీ బానే యేత్తాడేంటో మరి.

ఒరే! యెదగ్గోలాపి, విషయం చెప్తావా? అని గసురుకుంటూ, సుబ్బరాజుగారి యింటి దగ్గర గత్తర యేవన్నా చూసాడేమో అడిగాడు శేషు.

అతణ్ణి యిలా భయపడుతూన్నపుడు చూడగలగటం బాలాకి ముచ్చటగా వుంది. అతనికి సాయపడగల పరిస్థితిలో తానుండటం గర్వంగా కూడా వుంది.  అంతా ప్రశాంతంగానే వుందని భరోసా యిచ్చాడు. తాను దాదాపు యెలా సుబ్బరాజుగారి యింట్లోకి వెళిపోబోయిందీ, మళ్ళీ యేమన్నా తేడా జరిగితే శేషూకి ప్రమాదమని ఆలోచించి యెలా ఆగిపోయిందీ, యిలా చేసిందీ చేయందీ రసవత్తరంగా చెప్పుకొచ్చాడు. శేషూకి అంతా ప్రశాంతంగా యెలా వుందో అర్థం కాలేదు. కానీ వుందంటే వూపిరి పీల్చుకున్నాడు.

ఇద్దరూ భవిష్యత్తు కార్యాచరణ గురించి కాసేపు మాట్లాడుకున్నారు. బాలాకి ఒక వుపాయం తోచింది. దాని ప్రకారం శేషూ రేపు యేదో వంక పెట్టి బడి మానేయాలి. బాలా వెళ్లి పరిస్థితి గమనిస్తాడు. అంతా బానే వుందనిపిస్తే బడయ్యాక వచ్చి శేషూకి విషయం చెప్తాడు. శేషూకి యీ వుపాయం బానే వుందనిపించింది. ఇలా ఓ నిశ్చయానికొచ్చాకా, అతనిలో కాస్త స్థిమితం వచ్చింది. ఇద్దరూ మళ్ళీ బడి గోడ దూకి యిళ్ళ వైపు నడుస్తున్నపుడు, బాలా కుతూహలంగా ముద్దు వివరాలు చెప్పమని అడిగితే, అతను యిదివరకట్లా ఆ సంఘటనని జ్ఞప్తికి తెచ్చుకోవటానికి భయపడలేదు. ముద్దు గురించేం చెప్పలేదు గానీ, యివాళ రేణూ ముస్తాబైన తీరు వుదహరిస్తూ, పరిస్థితులన్నీ కలిసి తనని ముద్దుపెట్టుకునేలా యెలా బలవంతం చేసాయో చెప్పుకొచ్చాడు. బాలాకి యిదంతా చెప్తూనే, తనకు తాను మళ్ళీ ఆ అనుభవపు దినుసులన్నీ ఒకసారి నెమరువేసుకున్నాడు. ఆమె చెంప నునుపుదనాన్నీ, పెదాల తడినీ, పొత్తికడుపు వేడిమినీ గుర్తు చేసుకున్నాడు. కానీ వాటిని తనకు తెలిసిన రేణూలో భాగంగా చూడలేకపోయాడు. మనసులో ఆ జ్ఞాపకానికి విడి అస్తిత్వమేదో యేర్పడింది. దరిమిలా శరీరం ఆధిపత్యం చెలాయించే కొన్ని తరుణాల్లో ఆ జ్ఞాపకం అక్కరకొచ్చేది.

0 comments:

మీ మాట...