March 19, 2012

మిత్రభేదం (తొమ్మిదవభాగం)

ముందుమాట | మొదటిభాగం | రెండవభాగం | మూడవభాగం | నాలుగవభాగం | ఐదవభాగం
ఆరవభాగం | ఏడవభాగం | ఎనిమిదవభాగం | పదవభాగంఆఖరిభాగం | పూర్తి కథ pdf |   

శేషూ నగరం చేరిన కొన్ని నెలలకే అతని కుటుంబం కూడా పూర్తిగా అక్కడికి మకాం మార్చేసింది. అతను మొదట్లో కొత్త స్కూల్లో కుదురుకోవడానికి చాలా కష్టపడ్డాడు. ఊరి బడిలో తనకి వున్న హోదాని యిక్కడ అవలీలగా సంపాదించగలననుకున్నాడు. కానీ చాలా యెదురుదెబ్బలు తగిలాయి. తరగతి అగ్రశ్రేణిలో భాగం కావడానికి వట్టి చలాకీతనం సరిపోలేదు. మార్కులు కూడా కావలసి వచ్చాయి. అవి వుంటే చాలు చలిమిడిముద్దగాళ్ళు కూడా క్లాసు లీడర్లుగా చెలామణీ అయిపోతారు. వాళ్ళే గనక శ్రీపాదపట్నం బడిలో వుంటే అసలు పట్టించుకునేవాడే కాదు. ఇక్కడ మాత్రం వాళ్ళకు తలొగ్గాల్సి వచ్చేది.  టీచర్లు కూడా మార్కులు వచ్చిన వాళ్ళ పేర్లనే గుర్తుంచుకునేవారు. అవి రాక శేషు చాలా తొందరగా వెనక బెంచీలోకి వెళ్ళిపోయాడు. ఈ అవమానం  చాలదన్నట్టు తోటివాళ్ళ అపహాస్యం ఒకటి. అతని పల్లెటూరి యాస దగ్గర్నించి, చాలా తొందరగా అందరితో చనువు ఆపాదించుకునే అతని మనస్తత్త్వం వరకూ అన్నింటినీ అపహాస్యానికి వాడుకునేవారు. రాత్రుళ్ళు పక్క మీద నిద్రపట్టని కళ్ళతో శ్రీపాదపట్నాన్ని కల కనేవాడు. పగళ్ళు యిదివరకెన్నడూ అనుభవం లేని గుబులుతో స్కూలుకు వెళ్ళేవాడు. ఖాళీ దొరికినపుడు తన బాధల్ని వుత్తరాల్లో యెబ్బెట్టు వాక్యాల్లో పొదిగి  స్నేహితులతో పంచుకునేవాడు. తొలి రోజుల్లో వుత్తరం అందుకున్న ప్రతీ ఒక్కరూ కన్నీరు తెప్పించేంత ఆప్యాయతతో ప్రత్యుత్తరాలు రాసేవారు. కాలక్రమేణా చాలా మంది జారిపోయారు. క్లాసులో నెమ్మదిగా కుదురుకోగలుగుతున్న కొద్దీ శేషూ కూడా రాయటం తగ్గించాడు. ఒక్క బాలాతోనే వుత్తరాల్లో ఆ స్నేహధార, ఒక్కోసారి అడుగంటిన సన్నని పాయలా, ఒక్కోసారి ఒడ్డులు ఒరుసుకునే కూలంకష ప్రవాహంలా, యేది యేమైనా పూర్తిగా యెపుడూ యింకిపోకుండా సాగుతూ వచ్చింది.

పదోతరగతి తక్కుతూ తారుతూ యెలాగో గట్టెక్కించాడు. ఇంటరు నుండి నెమ్మదిగా పుంజుకున్నాడు. అక్కడి మనుగడ నియమాలు తెలిసి వచ్చాయి. తన అనుభవ పరిధుల్ని నగర జీవితపు కొలతలకు తగ్గట్టు కత్తిరించుకోగలిగాడు. కానీ తొలి రోజుల్లోని తడబాట్లు, యెదురుదెబ్బలూ అతని దూకుడును తగ్గించాయి. తర్వాత్తర్వాత వాటి వల్ల తాను చాలా యెదిగినట్టు భావించుకునేవాడు.

మొదట్లో అతనికి రేణూ కన్నా తరచుగా ఆమెని పెట్టుకున్న ముద్దు గుర్తొస్తూండేది. కౌమారంలో అడుగుపెట్టాకా, అమ్మాయిలు మునుపెరుగని ఆనందాలకు నెలవులుగా కనిపించడం మొదలయ్యాకా, అతని శరీరం అలాంటి అనుభవాలకై తపించేది. కానీ ఆ పాడు ఆలోచనల తరచుదనంతో పోలిస్తే, వాటిని చర్యలతో పరిపూర్ణం చేసుకోగల అవకాశాలు సగటున నూటికొక్కటి కూడా దొరికేవి కాదు. ఎట్టకేలకు యింటర్ చదివేటపుడు, వాళ్ళ క్వార్టర్సులో డిగ్రీ చదివే పక్కింటి అమ్మాయితో, తొలిసారి పూర్తిస్థాయి అనుభవం సాధ్యమైంది. మిద్దె మీద నీళ్ళ టాంకుకీ, పిట్టగోడకీ మధ్యనున్న యిరుకుసందులో, వాళ్లిద్దరూ తమ సాహసయాత్రని మొదట తడుములాటలతో మొదలుపెట్టి వయా తడిముద్దుల మీదుగా తొలికలయిక దాకా సాగించారు. కానీ యీ దొంగచాటు మైథునాలు యెన్నాళ్ళో సాగలేదు. ఒకరోజు పక్కింటావిడ  పైన యెండబెట్టిన వడియాలు తీసుకోవటానికి వచ్చి, మొదట వీళ్ళ నీడలు చూసి యేదో అనుకుని కెవ్వుమన్నా, వెంటనే విషయమర్థమై విసవిసా కిందకి వెళ్ళిపోయింది. అమ్మాయి తరపు వాళ్ళు యే క్షణంలో యింటి మీదకు పోట్లాటకు వస్తారో తెలియక ఆ రాత్రంతా  శేషూ యెవరికీ తెలియని స్వంత నరకంలో బిక్కుబిక్కుమంటూ గడిపాడు. కానీ ఆ రాత్రే కాదు, తర్వాతి రోజూ యేం జరగలేదు. ఆ అమ్మాయి కుటుంబం కొన్ని రోజులకే నిశ్శబ్దంగా వేరే యిల్లు చుసుకుని మారిపోయింది. ఆ యింటి చిరునామా తెలుసుకోగలిగాడు గానీ, యెందుకో వెళ్ళి కలవటానికి జంకాడు. పరిస్థితి యింత జటిలమయ్యాకా తాను ఆ అమ్మాయి నుంచి ఆశించింది యిదివరకటి తేలికదనంతో యెలాగూ లభ్యంకాదనిపించింది.

ఈ శరీర యావతో పోలిస్తే, అతనిలో మనసు యావ కాస్త  ఆలస్యంగానే మొదలైంది. అది కూడా కొందరి విషయంలోలా జీవితాన్ని అంచుల్తో సహా లోనికి లాక్కునే కృష్ణబిలపు రాక్షసతీవ్రతతో యెపుడూ లేదు. సినిమాలు చూసి వాటి హీరోల స్థానంలో తనను వూహించుకున్నంత కాలం, ప్రేమానుభవమంటే ఒక వుత్తేజవంతమైన సాహసంలా అనిపించేది. అమ్మాయి తరపువాళ్ళు అతణ్ణి వ్యతిరేకించి హింసాత్మకంగా ప్రతిస్పందించడం, అతను ధైర్యంగా రొమ్ములు యెదురొడ్డి నిలబడటం, యిలాంటివి వూహించుకునేవాడు. అదృష్టవశాత్తూ యిలాంటి సాహసాలకు తావున్న ప్రేమ యేదీ యెదురవకముందే ఆ దశ దాటిపోగలిగాడు. దరిమిలా యింట్లో వదిన దగ్గరుండే కొన్ని చవకబారు నవలలు చదివి వాటి పాత్రల స్థానంలో తనను చూసుకున్నంత కాలం, ప్రేమానుభవం ఒక లెక్కల సమీకరణంలా అనిపించేది. అమ్మాయి అభిప్రాయాలూ అతని అభిప్రాయాలూ సమగ్రంగా కలవటం, యిరువురూ యెవరి వ్యక్తిత్వాల్ని వాళ్ళు కాపాడుకుంటూ పరస్పరం గౌరవించుకుంటూ పురోగమించటం, యిలాంటివి వూహించుకునేవాడు. ఈసారి దురదృష్టవశాత్తూ అతనీ దశ దాటక ముందే యిలాంటి సమీకరణాల ప్రేమ దారి కాచి పట్టేసింది.

పోస్టుగ్రాడ్యుయేషన్ మధ్యలో వుండగా ఒక సహవిద్యార్థిని అతణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పింది. ఇలా అమ్మాయి వైపు నుండి ప్రతిపాదన రావడం అతనికెపుడూ జరగ లేదు. క్లాసులో ఆమెతో మామూలు పరిచయం వుంది. కానీ యీ దృష్టితో యెపుడూ చూడలేదు. చూడటం మొదలుపెట్టాకా, అతనిలో యింకా నిర్మాణదశలో వున్న ఆకాంక్షలన్నింటికీ ఆమెయే అంతిమరూపం అనిపించింది. ఆమె అందంగా వుంటుంది, కానీ అలంకరణను యిష్టపడదు, బోలెడు భావుకంగా ఆలోచిస్తుంది, పుట్టిన రోజునాడు అనాథాశ్రమాలకి వెళ్ళి గడిపి వస్తుంది, తండ్రి అంటే చాలా అభిమానం, చదువు తర్వాత భావి వృత్తిజీవితం పట్ల స్పష్టమైన అవగాహన వుంది. శేషూ ఆమెని నమ్మశక్యం కాని దైవలీలగా భావించి స్వీకరించాడు. ఒకసారి యేం నచ్చి నన్ను యిష్టపడ్డావని అడిగితే, అతని దృఢవ్యక్తిత్వాన్ని వెల్లడించే కొన్ని అంశాలని వుదహరించింది. అవి విన్నాక, భక్తుని అంచనాలు అందుకోగలనా అని ఒత్తిడికి లోనయ్యే భగవంతునిలా ఇబ్బందిపడేవాడు. ఆమె అంచనాలు భంగపడతాయన్న బెరుకుతోనే, కాలేజీ తర్వాత కలిసి తిరిగిన తిరుగుళ్ళలో యెపుడూ చనువు తీసుకోలేకపోయేవాడు. ఒకసారి పార్కులో ఆమె నడుం వంపు కలిగించిన తిమ్మిరి తట్టుకోలేక అల్లరి చేయబోయాడు గానీ, ప్రతీ దానికీ సమయం వుంటుందని సర్ది చెప్పింది. వాళ్ళు కలిసి తిరిగిన రెండేళ్ళలోనూ ఆ సమయం యెపుడూ రాలేదు. తర్వాత కూడా రాలేదు. ఒకరోజు తండ్రి పెళ్ళికి ఒప్పుకోవటం లేదని చెప్పింది. ఇది అతను వూహించలేదు. ఇద్దరం రిజిస్టరు పెళ్లి చేసేసుకుందామనీ, మనవలు పుడితే ఆయనే దగ్గరవుతాడనీ యేదో సర్ది చెప్పబోయాడు. ఆమె తండ్రి మాట కాదనలేనంది. బతిమాలినంత సేపు బతిమాలి, చివరికి విసుగొచ్చి, యింత తెగింపు లేని దానివి నన్నెందుకు యిందులోకి లాగావని కసరుకున్నాడు. నువ్వింత అపరిపక్వంగా ఆలోచిస్తావనుకోలేదంది. ఎన్నో రకాలుగా సర్ది చెప్పాడు. చివరికి ఒకరోజు అన్నయ్యని వాళ్ళ యింటికి మాట్లాడమని కూడా పంపించాడు. ఆమె తండ్రి, మాట్లాడటం అటుంచి, కులం గోత్రం చూసుకోకుండా యిలా పెళ్ళిసంబంధాలంటూ యిళ్ళ మీదకు వచ్చిపడటమేమిటని విరుచుకుపడ్డాడు. ఈ రాయబారం సంగతి ఆమెకి తర్వాత తెలిసి శేషుతో గొడవపడింది. హార్టు పేషంటయిన నాన్నగారిని అలాంటి పరిస్థితిలోకి నెట్టడం ఆమెకు నచ్చలేదు. కొన్ని రోజులు మాట్లాడలేదు. తెలియకుండానే ఆమెతో వర్తమానాన్నీ, భవిష్యత్తుని యెంత గాఢంగా అల్లేసుకున్నాడో అప్పుడు అతనికి అర్థమైంది. ఎపుడూ యేడవననుకున్నవాడు అపుడపుడూ యేడ్చాడు కూడా. అతని పరిస్థితి చూసి జాలిపడి కొన్నాళ్ళు దూరంగా వుందామంది. ఇలా ముందుచూపు లేకుండా భావోద్వేగాల్లో పడికొట్టుకుపోతే యిద్దరి జీవితాలూ నాశనమవుతాయని బుద్ధి చెప్పింది. అన్నట్టే కలవడం మానేసింది. తర్వాతెపుడో పెళ్ళికి పిలిచింది గానీ, శేషూ వెళ్ళలేదు.

ఎక్కడ తప్పు జరిగిందో, తనకే యెందుకిలా జరిగిందో అతనికి అర్థమయ్యేది కాదు. కొన్నాళ్ళు గెడ్డాలు పెంచి, తిండి తినక పిచ్చివాలకంలా తయారయ్యాడు. చివరికి వాళ్లన్నయ్య బలవంతం మీదా, సాయం మీదా, చదువుకోవటానికి వేరే దేశం వెళ్ళాడు. మొదట్లో అక్కడి పరిసరాల్ని తన విషాదానికి అత్యంత అనువైన నేపథ్యంగా స్వీకరించాడు. అక్కడి ఒంటరితనం కూడా బాగా కలిసొచ్చేది. కానీ కొంతకాలానికే యిలా విషాదోపాసనలో గడుస్తున్న క్షణాలు విసుగుతెప్పించాయి. కుక్క ఖాళీ ముడుసును నోరు నొప్పెట్టేదాకా కొరికి, చివరికి అది డొల్ల అన్న నిజాన్ని ఒప్పుకోక తప్పక పారేసి తన దారిన పోయినట్టు, ఆ అనుభవాన్ని అవతలకు పారేయగలిగాడు. క్రమేపీ ఆమెతో బంధాన్ని విడిగా నుంచుని చూడగలిగాడు. ఆమె తరపు నుంచి ఆలోచిస్తూ ఆమె చర్యల్లో మంచిని వెతికే బానిస స్థితి నుండి, ఆమెని మనస్ఫూర్తిగా ద్వేషింగలిగే స్థితికి చేరుకున్నాడు. తర్వాత ఆ ద్వేషం కూడా చప్పబడిపోయి, వ్యర్థమైన కాలాన్ని గురించీ, కోల్పోయిన మనసు కన్యత్వాన్ని గురించీ పశ్చాత్తాపం మాత్రమే మిగిలింది.

శ్రీపాదపట్నాన్ని విడిచిపెట్టిన తర్వాత రేణుకాదేవి జ్ఞాపకం అతని దైనందిన జీవితాన్ని యేమాత్రం కలవర పెట్టకుండా, ఒక ప్రశాంత అంతర్వాహినిలా అట్టడుగునే పారేది. మొదట్లో అయితే నెలల తరబడి అసలు గుర్తుకు వచ్చేదే కాదు. వచ్చినా అది ప్రయత్నపూర్వకం కాదు. ఏదో బాహ్యప్రేరణ భౌతికేంద్రియాల్ని కదిలించడం వల్ల గుర్తుకు వచ్చేది. ఆమె సాన్నిధ్యంతో ముడిపడిన వాసనలేవైనా సోకినా, ఆమెతో వున్నప్పటి సందర్భాల్లాంటివి పునరావృతమైనా, ఆమె సిగ్గరి నవ్వును పోలిన నవ్వెక్కడన్నా కనిపించినా హఠాత్తుగా మస్తిష్క కాసారంలోంచి చేపపిల్లలా ఆమె జ్ఞాపకం వువ్వెత్తున పైకి యెగసి గాల్లో వంకీ కొడుతూ జారి మునిగిపోయేది. కాసేపు చైతన్యమంతా మృదు మంద తరంగితమయ్యేది. కాని తక్షణ వ్యాపకమేదో అతని ధ్యాస మళ్ళించగానే మళ్ళీ అంతా మామూలయిపోయేది. ఇంచుమించు డిగ్రీలోకి వచ్చాకా యీ తరహా మారింది. బహుశా జత కోరుకునే వయసులో సహజంగా కలిగే వంటరితనం వల్ల కావచ్చు. పడమటి యెండలో తురాయిపూలు రాలిన రోడ్డు మీద కాలేజీ నుండి కాళ్ళీడ్చుకుంటూ యింటికి నడుస్తున్నపుడో, సెలవురోజుల మధ్యాహ్నాలు కిటికీ దగ్గర కూర్చుని క్రింద కాలనీపార్కులో పిల్లలాడే ఆటలు చూస్తున్నపుడో — యిలా గుండె కవాటాల గుండా ఒంటరితనం మన్ను తిన్న పాములా దూరి పాకుతున్న సందర్భాల్లో  — ఆమె జ్ఞాపకం తనంత తానుగా గాక, అతని ఆహ్వానం మీద అక్కున చేరేది.

ఒక్కోసారి పిలవని అతిథిలా కలల ముసుగేసుకుని నిద్రలోకి కూడా జొరబడేది. ఆమె వున్న కలలన్నీ అతనికి స్పష్టంగా గుర్తుండేవి. ముఖ్యంగా ఒక కల అతని జ్ఞాపకంలో చాన్నాళ్ళు నిలిచిపోయింది: అతను కాలేజీ నుండి యింటికి వచ్చి తోరణాలు కట్టిన గుమ్మం ద్వారా లోపలికి ప్రవేశిస్తాడు, మధ్యగదిలో టీపాయి మీద స్వీట్లూ పళ్ళూ పేర్చి వుంటాయి, వాటి వెనుక సోఫాలో వాళ్ళ నాన్న ఒక కాలు పైకి మడిచి కూర్చుని చుట్ట నవుల్తూంటాడు, కొడుకును చూడగానే వచ్చి ప్రక్కన కూర్చోమని సైగ చేస్తాడు, అమ్మ కనపడకపోయినా ఆమె సందడి మాత్రం వినిపిస్తుంది, వాతావరణమంతా యేదో జరగబోతోందన్న ఆనందమయ వుద్విగ్నతతో ప్రకంపిస్తూ వుంటుంది, యింతలో ప్రక్క గుమ్మంలోంచి వదిన రేణూని భుజం చుట్టూ చేయి వేసి తీసుకువస్తుంది, ఆమె పరికిణీజాకెట్టులో వుంటుంది, అతణ్ణి చూసి పలకరింపుగా నవ్వుతుంది. అంతే, తర్వాత కల చెదిరిపోయింది. కలలోంచి మేల్కొన్నాక కూడా ఆనందం చాలాసేపు వదల్లేదు. తర్వాత తన రోజువారీ జీవితంలోంచి యీ కలకి కొన్ని అనాసక్తికరమైన ప్రేరణలేవో యేరి అన్వయించుకోగలిగాడు. కానీ కలలో జరిగిన మామూలు సంఘటనకి, నిద్ర లేచింతర్వాత వుబికివచ్చిన ఆనందానికీ పొంతన కుదుర్చుకోలేకపోయాడు. కలలో ఆమె కంటపడగానే, అప్పటిదాకా యేడు ఖండాలూ వెతికినదేదో చివరికి యింట్లోనే దొరికినంత ఆనందం యెందుకు కలిగిందో అతనికి అర్థం కాలేదు.

కలల్లోనే కాదు, అతని జ్ఞాపకాల్లో కూడా ఆమె యెప్పుడూ చిన్నప్పటి పరికిణీ జాకెట్లలోనే కనిపించేది. అతని వయసుతో పాటే ఆమె వయసు కూడా అక్కడ పెరుగుతూండి వుంటుందని తెలిసినా, అలా యెదిగిన యువతిలా ఆమెను వూహించుకోలేకపోయేవాడు. కానీ ప్రేమలో విఫలుడై విదేశంలో ఒంటరిగా గడుపుతున్నపుడు యిదీ మారింది. అసలు యెపుడూ ప్రేమానుభవాన్ని నింపుకోని మనసు సంగతి వేరు. అతని మనసు అప్పటిదాకా ప్రేమతో తొణికిసలాడిందల్లా వున్నట్టుండి ఖాళీ అవడంతో, ఆ ఖాళీ నింపుకోవటానికి ఆత్రంగా అంగలార్చింది. తదనుగుణంగా రేణుకాదేవి జ్ఞాపకమూ స్వభావాన్ని మార్చుకుంది. దేశం కాని దేశంలో ప్రమాదకరమైన చీకటి సందులమ్మటా స్వర్గబహిష్కృతునిలా తిరిగినపుడో, సెలవురోజుల్లో సబ్వే ట్రయిన్లెక్కి దిక్కులేని దేశదిమ్మరిలా చక్కర్లు కొట్టినపుడో, యెపుడన్నది యిదమిత్థంగా చెప్పలేడుగానీ, ఆమె యిదివరకట్లా చిన్నపిల్లలా కనిపించడం మానేసింది. తనను యీ ఆత్మవినాశేచ్ఛ నుండి రక్షించి పొత్తిళ్ళలో కాపాడుకోగలిగే పరిణత ప్రౌఢలా కనిపించసాగింది. అసలు ఆమె నిజంగా రేణుకాదేవేనో, లేక తాను ఆశ్రయం పొందాలనుకునే ఒకానొక భద్రభావానికి ఆమె మూర్తిని తెచ్చి తగిలించాడో అతనికీ తెలియదు. విదేశంలో వున్నపుడే సుబ్బరాజుగారు చనిపోవడం, ఆయన కర్మకాండకు వెళ్లొచ్చిన అన్నయ్య ఆ వివరాలు తెలియజేస్తూ రాసిన వుత్తరంలో రేణూ గురించి కూడా కొంత రాయడం, యివన్నీ కూడా ఆమె వైపు ఆలోచనలు మళ్ళేలా చేసాయి. అపుడపుడూ తమ స్నేహపు చివరి రోజులు గుర్తుకొచ్చేవి. అతని పట్ల అతనికే కోపం వచ్చేది. చిన్నపాటి తగువుతో కలతపడ్డ స్నేహాన్ని, మరమ్మతు చేసే ప్రయత్నం మానేసి, అది వీగిపోయేదాకా దాని మానాన దాన్ని వదిలేసినందుకు ఆ చిన్నతనపు శేషూ మీద చికాకు కలిగేది.

రెండేళ్ళ తర్వాత స్వదేశం తిరిగివచ్చాడు. ఒక మంచి వుద్యోగంలో కుదురుకున్నాడు. ఆమెను యెలా సమీపించాలో మాత్రం అర్థం కాలేదు. పైగా అతను ప్రస్తుతం ఒంటరితనపు ప్రమాదకరమైన కొండచరియ మీద నుంచి ఆమె పట్ల పెంచుకున్న ఆశే పట్టుగొమ్మగా వేలాడుతున్నాడు; తీరా ఆమెని కలిసాక అది అడియాసగా తేలితే తన పరిస్థితి యేమిటన్న భయం కూడా వెనక్కిపట్టి ఆపేది. ఈలోగా కొత్త వుద్యోగంలో కుదురుకునే ప్రయాసలో పడి చూస్తుండగానే యేడాది గడిచిపోయింది. చివరికి, దేవుడి దయలా, ఒకరోజు బాలా నుండి పూర్వవిద్యార్థుల పునస్సమ్మేళనోత్సవాన్ని గురించి కబురు వచ్చింది.

4 comments:

  1. పాత్రల మధ్య నడిచే పొట్టి పొట్టి సంభాషణలైనా, ఇలా ఠావుల కొద్దీ కథ రచయితగా వెనకుండి చెప్పడమైనా, మీరు భలే నేర్పుతో చేస్తారు...మగ్‌లో కాఫీ అయ్యేసరికి మెల్లగా కథ చదవడం కూడా పూర్తయిపోయింది. వాటి తాలుకు అనుభవాలు మాత్రం ఇంకా వెంటాడుతున్నాయి :) ~ సూపర్ లైక్ ~

    ReplyDelete
    Replies
    1. నాకు యిలా ఠావుల కొద్దీ వచనం రాయడంలో వున్న ఆసక్తి, యెందుకో సంభాషణలు రాయడం మీద వుండదు; అవి మరీ సులువుగా వచ్చేయడం వల్లనేమో. వాటిని బాగా రాస్తానా అన్నది యెప్పుడూ అనుమానమే. కాబట్టి థాంక్స్!

      Delete
  2. అయ్యో, ఇంకా రెండు భాగాలే..రేణుకాదేవి ఈ రోజు కూడా దర్శనం ఇవ్వలేదు! కలం కలల్లోకి రేపైనా వస్తుందా ?
    ఇంతకీ మీరు విషాదాంతం చేయరు కదా, ఇదో కొత్త బెంగ మాకు. :)

    ReplyDelete
    Replies
    1. రేణూ ఆఖరి భాగంలో వస్తుంది. ఈ కథకి అనుకున్న వస్తువుల్లో ఆమెది ఒకటి మాత్రమే. కాబట్టి మిగతావాటికి ముగింపునిచ్చాకానే ఆమె దగ్గరకి రావడం.

      ఇక సుఖాంతమా, దుఃఖాంతమా అనేది రచయిత చేతుల్లో లేదు. కథలో ఒక నిజముంటుంది, మనం రాయకముందే. దాన్ని అనుసరించటమే రచయిత చేయగలిగింది. కాబట్టి మీరు యే రకమైన ముగింపుకీ ఆశ్చర్యపోనక్కర్లేదు. :)

      Delete