April 20, 2015

'ప్రపంచానికి ఆఖరు రాత్రి' - రే బ్రాడ్బరీ

“ప్రపంచానికి ఇదే ఆఖరు రాత్రయితే ఏం చేస్తావు?”

“సరదాకి అడుగుతున్నావా?”

“నిజంగానే.”

“ఏమో తెలీదు – ఎప్పుడూ అలా ఆలోచించలేదు.” ఆమె రెండు టీ కప్పులతో నడిచి వచ్చి తానూ డైనింగ్ టేబిల్ దగ్గర కూర్చుంది. ఒక కప్పు అతని వైపు జరిపింది.

అతను టీ వేడిని అనుభవిస్తూ దాన్ని అరచేతుల మధ్య తిప్పుకుంటున్నాడు. వెనక సోఫా మీద టేబిల్ లాంప్ వెలుగులో ఇద్దరు ఆడపిల్లలు చిన్న చిన్న ప్లాస్టిక్ పాత్రలతో వంటాట ఆడుకుంటున్నారు. సాయంత్రపు గాలిలో చిక్కటి టీ వాసన తేలుతోంది.

“అయితే, ఇప్పుడు ఆలోచించడం మంచిదేమో,” అన్నాడతను.

“నిజంగానే అంటున్నావా?” అడిగింది భార్య.

తలూపాడు.

“యుద్ధమా?”

తల అడ్డంగా ఆడించాడు.

“హైడ్రోజన్, ఆటం బాంబులేవీ కాదా?”

“కాదు.”

“బయో వార్?”

“అవేమీ కాదు,” అంటూ తల దించుకున్నాడు. టీ నురగల్లోకి చూస్తున్నాడు. “ఒక పుస్తకం మూతపడటం లాగా, అనుకో.”

“అర్థం కాలేదు నాకు.”

“నిజానికి నాకూ అర్థం కాలేదు. అదొక ఫీలింగ్ అంతే; ఒక్కోసారి చాలా భయపెడుతుంది, ఒక్కోసారి అస్సలు భయమే ఉండదు, సరికదా – ప్రశాంతంగా ఉంటుంది.” అతను తల తిప్పి కూతుళ్ల వైపు చూశాడు. టేబుల్ లాంప్ కింద వెలుగుతున్న వారి నవ్వుల్ని చూశాడు. తర్వాత గొంతు బాగా తగ్గించి అన్నాడు. “నేను నీకు ఇప్పటిదాకా చెప్పలేదు. నాలుగు రోజుల క్రితం రాత్రి ఒకటి జరిగింది.”

“ఏం జరిగింది?”

“ఒక కల కన్నాను. ఇదంతా ముగిసిపోబోతోందని కల కన్నాను. ఒక గొంతు చెప్పింది అలాగని. నేను గుర్తు పట్టే ఏ గొంతూ కాదది, కానీ ఖచ్చితంగా ఏదో గొంతే, ఈ భూమి మీద అన్నీ ఆగిపోతాయని స్పష్టంగా చెప్పింది. మర్నాడు లేచాకా దీని గురించి పెద్దగా ఏమీ ఆలోచించలేదు. మామూలుగా ఆఫీసుకి వెళిపోయాను. కానీ ఈ ఫీలింగ్ మాత్రం రోజంతా నాతోనే ఉంది. మధ్యాహ్నం ఎందుకో కారిడార్‌లోకి వస్తే స్టాన్‌ ఎల్లిస్‌ కిటికీ లోంచి ఆకాశంలోకి చూస్తున్నాడు, ‘ఏంట్రా అంత దీర్ఘాలోచన,’ అంటే ‘ఒక కల వచ్చిందిరా’ అన్నాడు, వాడు ఆ కల ఏంటో చెప్పకుండానే నాకు తెలిసిపోయింది. నేనే చెప్పుండచ్చు, కానీ అతను చెప్తుంటే విన్నానంతే.”

“అదే కలా?”

“అవును. వాడికి తర్వాత చెప్పాను నాకూ అదే కల వచ్చిందని. వాడేం ఆశ్చర్యపోయినట్టు కనపడలేదు. పైగా కాస్త ఊపిరిపీల్చుకున్నట్టు అనిపించింది. తర్వాత మేం ఊరికే మా ఫ్లోర్‌లోని ఆఫీసుల గూండా అలా నడుచుకుంటూ పోయాం. నడుద్దాం పద అని కూడా చెప్పుకోలేదు. నడవాలనిపించింది అంతే. మేం వెళ్లిన ప్రతి చోటా ఎక్కడ చూసినా జనం అంతా తమ డెస్కుల వంకో, చేతుల వంకో, లేక కిటికీల్లోంచి బైటికో, ఇలా ఎవరూ తమ కళ్ల ముందున్న దాన్ని చూస్తున్నట్టు లేరు. కొందరితో మాట్లాడాను; రమేష్ కూడా మాట్లాడాడు.”

“వాళ్ళందరికీ కూడా ఆ కల వచ్చిందా?”

“అందరికీ, అదే కల, ఏమాత్రం తేడా లేకుండా.”

“నువ్వా కలని నమ్ముతున్నావా?”

“అవును. ఇంత కంటే ఖచ్చితంగా ఎప్పుడూ దేన్నీ నమ్మలేదు.”

“మరి ఎప్పుడు ముగిసిపోతుంది ఇది? ఈ ప్రపంచమంతా?”

“ఇదే రాత్రి ఏదో ఒక సమయంలో. ముందు మనం పోతాం. తర్వాత భూమ్మీద ఈ రాత్రి ముందుకి పాకే కొద్దీ ఆ పాకినంత మేరా ప్రాంతాలన్నీ పోతాయి. అలా అంతా ముగిసిపోవడానికి ఒక ఇరవైనాలుగంటలు పడుతుంది.”

వాళ్ళు కాసేపు నిశ్శబ్దంగా టీ కప్పుల్ని పట్టుకుని కూర్చున్నారు. తర్వాత ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ టీ తాగారు.

“మనమేం పాపం చేశాం” అందామె.

“పాప పుణ్యాల ప్రసక్తి లేదు. ఎక్కడో అంతా దారి తప్పాం అంతే. ఈ విషయం చెప్తుంటే నువ్వేం కాదనలేదు. ఎందుకలా?”

“నాకూ కారణం ఉంది,” అందామె.

“ఆఫీసులో అందరికీ ఉన్న కారణం లాంటిదేనా?”

ఆమె తలూపింది. “నేను చెప్పాలనుకోలేదు. రాత్రి వచ్చిందది. తర్వాత వీధిలో ఆడవాళ్లు వాళ్లలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు.” ఆమె న్యూస్‌పేపరు అతని వైపు జరిపింది. “పేపర్లో మాత్రం ఎక్కడా వార్త లేదు.”

“అందరికీ తెలిసినపుడు వార్త అవసరం ఏముంది?” అతను పేపరు తీసుకుని కుర్చీలో వెనక్కి వాలాడు, కూతుళ్ల వైపు, ఆమె వైపూ చూసుకున్నాడు. “నీకు భయంగా ఉందా?”

“లేదు. పిల్లల విషయంలో కూడా లేదు. ఇలాంటి పరిస్థితి వస్తే బిక్కచచ్చిపోతాను అనుకునేదాన్ని, కానీ అలా ఏం లేదు.”

“అందరూ అంటుంటారే, ఆత్మరక్షణ బలం అని, అదంతా ఏది?”

“ఏమో నాకు తెలీదు. అంతా ఒక లెక్క ప్రకారం జరుగుతున్నప్పుడు మనకు కంగారు ఉండదు. ఇది లెక్క ప్రకారం జరగాల్సిందే. మనం ఇంతదాకా జీవించిన తీరును బట్టి ఇది తప్ప ఇంకే దారీ లేదు.”

“మనం మరీ అంత చెడ్డగా ఉన్నామంటావా?”

“లేదు, అలాగని మరీ మంచిగానూ లేము కదా. బహుశా అదే సమస్య అనుకుంటాను. ఓ పక్క ప్రపంచంలో సింహభాగం చాలా అధ్వాన్నంగా ఉండటంలో బిజీగా ఉంటే, మనం మనలా తప్ప ఇంకెలాగూ లేము.”

కూతుళ్ళు కిలకిలా నవ్వుకుంటూ ఉత్తుత్తి కంచాల్లో భోజనాలు చేస్తున్నారు.

“నేనెప్పుడూ అనుకునేవాడ్ని, ఇలాంటి సమయంలో జనం వీధుల్లోకి అరుచుకుంటూ వచ్చి దిక్కులు తెలియకుండా పరిగెడతారని.”

“బహుశా నిజాన్ని చూసి ఎవరూ అరవరేమో.”

“ఒకటి చెప్పనా, నిన్నూ పిల్లల్నీ తప్ప నేను దేన్నీ మిస్ కాను. నాకు మీ ముగ్గురూ తప్ప ఈ పెద్ద నగరాలు, ఆటోలూ, ఫాక్టరీలు, నా ఉద్యోగమూ… వేటి మీదా ఇష్టం లేదు. నా ఈ కుటుంబాన్ని మినహాయిస్తే, బహుశా ఋతువుల్లో మార్పులూ, ఎండగా ఉన్నప్పుడు గ్లాసులో చల్లటి నీళ్ళు, లేదా నిద్ర సుఖం. ఇలాంటి చిన్న విషయాలే, నిజంగా. అసలు మనం ఇలా కూర్చుని ఎలా మాట్లాడుకోగలుగుతున్నామో అనిపిస్తోంది?”

“ఇంకేమీ చేయలేం కాబట్టి.”

“అవును నిజమే, ఇంకేమన్నా చేయగలిగితే ఈపాటికి చేస్తూండేవాళ్ళమే. ఈ అఖరురాత్రి తామేం చేయబోతున్నారో అందరికీ స్పష్టంగా తెలిసివుండటం అనేది బహుశా ప్రపంచ చరిత్రలోనే మొదటి సారేమో”

“ఈ సాయంత్రం మిగిలిన ఈ కొన్ని గంటలూ మిగతావాళ్లు ఎలా గడుపుతారో?”

“బహుశా సినిమాలకి వెళ్తారు, పాటలు వింటారు, టీవీ చూస్తారు, పేకాడతారు, పిల్లల్ని నిద్రపుచ్చుతారు, తామూ నిద్రపోతారు, ఎప్పటిలాగే.”

“ఒకలా చూస్తే ఈ ‘ఎప్పటిలాగే’ అనేది గర్వపడాల్సిన విషయం కదూ.”

“మనం మరీ చెడుగా ఏం లేము.”

వాళ్లు కాసేపు అలాగే కూర్చున్నారు. అతను చల్లారుతున్న టీ తాగేశాడు. “ఈ రాత్రే ఎందుకు ఇలా కావాలి?”

“ఎందుకు.”

“గత దశాబ్దంలోనో, గత శతాబ్దంలోనో, ఐదు శతాబ్దాల క్రిందటో, ఇంకే రాత్రో ఎందుకు కాదు.”

“బహుశా చరిత్రలో ఫిబ్రవరి 30, 2022 ఎప్పుడూ రాలేదు. అసలెప్పుడూ రానిది ఇప్పుడు వచ్చింది, అంతే. బహుశా ఈ తేదీకి వేరే ఏ తేదీకి లేనంత ప్రాముఖ్యత ఉంది. బహుశా ఈ ఏడాది ప్రపంచం ఇప్పుడెలాంటి పరిస్థితులున్నాయో అలాంటి స్థితికి చేరింది, కనుక ముగుస్తోంది.”

“ఆకాశంలోకి లేచిన యుద్ధవిమానాలు ఎన్నో ఉండుంటాయి. అవి ఎప్పటికీ నేలను చూడవు.”

“బహుశా అది కూడా ఒక కారణం కావచ్చును.”

“సరే మరి,” అన్నాడతను, “ఏం చేద్దాం ఇప్పుడు? అంట్ల పని కానిచ్చేద్దామా?”

ఇద్దరూ పాత్రల్ని శుభ్రంగా తోమి ప్రత్యేకమైన శ్రద్ధతో వాటిని ఒక పక్కన పేర్చారు. ఎనిమిదిన్నరకి పిల్లలు ఇద్దర్నీ పడుకోబెట్టారు. నిద్రపోయిన వారి చెంపల్ని ముద్దాడి, తలుపు జారేసి, బయటకు నడిచారు.

అతను మధ్యలో ఆగి వెనక్కు చూశాడు.

“ఏంటి?”

“తలుపు పూర్తిగా ముసేద్దామా, లేక పిల్లలు పిలిస్తే వినపడేట్టు కొంచెం తెరిచి ఉంచుదామా.”

“అసలు వాళ్లకి తెలుసా – ఎవరన్నా చెప్పి వుంటారంటావా?”

“తెలిసివుండదు. లేదంటే అడుగుతారుగా.”

తర్వాత ఇద్దరూ కూర్చుని కాసేపు పేపర్లు చదివారు, మాట్లాడుకున్నారు, పాటలు విన్నారు. చివరికి నిశ్శబ్దంగా కూర్చుని గడియారం పదిన్నర దాటే దాకా పదకొండు దాటే దాకా పదకొండున్నర దాటే దాకా ఎదురు చూసారు. ప్రపంచంలో మిగతా జనమంతా ఈ రాత్రికి తమకే ప్రత్యేకమైన రీతుల్లో ఎలా గడిపివుంటారో ఊహించారు.

“హ్మ్,” నిట్టూర్చి లేచాడు చివరికి. భార్యని దగ్గరకు తీసుకుని చాలాసేపు ముద్దుపెట్టుకున్నాడు.

“మనం ఒకరి పట్ల ఒకరం బాగున్నాం కదూ.”

“ఏడుపొస్తోందా?” అడిగాడు.

“లేదు.”

ఒకసారి ఇల్లంతా తిరిగి లైట్లు ఆర్పేశారు, తలుపులు మూసేశారు, పడకగదిలోకి వెళ్ళి చల్లని రాత్రి చీకటిలో దుస్తులు మార్చుకున్నారు. ఆమె దుప్పటి సవరించింది. “దుప్పటి ఎంత చల్లగా శుభ్రంగా బాగుందో,” అందామె.

“నేను బాగా అలిసిపోయాను.”

“ఇద్దరం అలిసిపోయాం.”

మంచం మీదకు చేరి వెనక్కు వాలారు.

కాసేపటికి ఆమె పైకి లేవటం అతనికి వినపడింది. తలుపు తీసిన చప్పుడు. మళ్ళీ వెనక్కు వచ్చింది. “వంటగదిలో నీళ్లు పోతున్నాయి. టాప్ కట్టేసి వచ్చాను,” అంది.

ఎందుకో అతనికి ఆపలేని నవ్వు వచ్చింది. బయటికే నవ్వాడు.

అతనికి నవ్వు తెప్పించింది తనేనని తెలిసి ఆమె కూడా నవ్వింది. నవ్వులు ఆగిపోయాక చల్లటి మంచం మీద చేతులు ముడేసుకుని, తలలు తాకించి పడుకున్నారు.

క్షణం తర్వాత అతను “గుడ్ నైట్,” అన్నాడు.

ఆమె “గుడ్ నైట్,” అన్నాక “బంగారం…” అని మృదువుగా పూర్తి చేసింది.

* * *


(రే బ్రాడ్బరీ కథ “ద లాస్ట్ నైట్ ఆఫ్ ద వరల్డ్” కు ఇది తెలుగు అనువాదం. కినిగె పత్రికలో మారుపేరుతో ప్రచురితమైంది.)

April 7, 2015

ఆ మాత్రం చాలని

నీకు నీళ్ళంటే ఇష్టం
అనుభవం తాకని నీ శరీరం టబ్బులో
ఆనందం తొణికి కేరింతలు పొర్లుతాయి
నాన్నకి నిన్నలా చూడటం ఇష్టం.

నీ ముందు పరుచుకునే కాలాన్ని ఊహిస్తాడు:
నడుస్తావు తోవలో ఎత్తు పెంచుకుంటూ
శరీరం ఋతువుల రాపిడికి గరుకెక్కుతుంది
మనసు దృశ్యాలతో బరువెక్కుతుంది
నిర్ణయాలు తీసుకుంటావు
ప్రేమిస్తావు రమిస్తావు
బాధిస్తావు బాధపడతావు
పెంచుతావు పోషిస్తావు, మీ నాన్న లాగే.
రాలిపోవడం చూస్తావు, మీ నాన్నతో సహా.

కణాలు చచ్చిపుడతాయి
న్యూరాన్లు నిండుతాయి
వెంట్రుకలు రంగుమారతాయి

చప్పుడు చేసే కీళ్ళతో ఏదో కారిడార్లో గదులు వెతుక్కుంటావు
నములుబడని పదార్థం కావాలనిపించినా వద్దంటావు
గుమ్మంలో కదలని దృశ్యాన్ని మంచం మీంచి చూస్తూంటావు

కేరింతల్లేని నీ పసితనాన్ని మన్నించి
వంగిన నీ వెన్నుపై సబ్బు రుద్దే ఒక్క మనిషినైనా
సాధించుకునేపాటి తెలివి మాత్రం నీకుంటే చాలని
కోరుకుంటాడు మీ నాన్న
నిన్ను టర్కీటవల్లో చుట్టబెట్టి తీసికెళ్తూ.