నేను Seinfeld రెండోసారి చూద్దామని మొదలుపెట్టి మూడో సీజను దాకా వచ్చేసరికి చిన్నోడికి ఒంటిపూట బళ్లు మొదలయ్యాయి. ఇంక వాడూ నాతో చూట్టం మొదలుపెట్టాడు. అలా ఈ వేసవి సెలవుల్లో రోజుకి రెండు మూడు ఎపిసోడ్లు చొప్పున మిగతా ఏడు సీజన్లూ ఇద్దరం కలిసి చూసేశాం. పెద్దాళ్ల షో అయినా, అందులోని సిల్లీనెస్ ని వాడూ చాలా ఎంజాయ్ చేశాడు. వాడికి నాకూ కూడా Kramer కేరెక్టరు అంటేనే ఇష్టం. ఒకటి రెండు ఎపిసోడ్లు వాడి వయసుకి నప్పవనిపించినవి స్కిప్ చేశాను. ఇంకా ఎండలు ముదరని కొన్నాళ్లు మటుకు కొన్ని రోజులు పొద్దుటిపూట్ల ఊరకే వీధుల్లో తిరిగాం. ఎండలు ముదిరి ఇంట్లోకే confine అయ్యాకా ఇక అక్కడ కాలక్షేపానికి వేరేవి వెతుక్కోవాల్సి వచ్చింది. నేను చూద్దామనుకునే సినిమాలూ, చదవాలనుకునే పుస్తకాలూ పూర్తిగా పక్కన పెట్టేశాను. ఇద్దరం చూడగలిగేవీ చదవగలిగేవీ... వాటి జోలికే వెళ్దాం అని నిశ్చయించుకున్నాను. Seinfeld ఒక్క విషయంలో మాత్రమే నా స్థాయికి వాడ్ని లాక్కొచ్చాను. ఇక మిగతావన్నీ వాడి లెవెల్‍కి నేను వెళ్ళాల్సి వచ్చినవే. ఈ వేసవి సెలవుల్లో వాడికి Anime shows, Manga books పరిచయం చేద్దాం అనుకున్నాను. మామూలుగా నెట్‌ఫ్లిక్స్ ఎకౌంట్ వాడికోసమే మెయిన్‌టైన్ చేస్తుంటాను. కానీ అందులో అమెరికన్ షోస్ అన్నీ ఒకే పాటర్న్‌లో, మరీ పొలిటికల్లీ కరెక్టడ్‌గా, అన్నింటినీ తేలిగ్గా తీసిపారేసే టిపికల్ అమెరికన్ హ్యూమరుతో వెళ్తున్నాయనిపించింది. అందుకే Anime, Manga వాడికి పరిచయం చేద్దామనిపించింది. ఎప్పుడో 80'sలో మొదలై ఇప్పటికీ కొనసాగుతున్న Dragon Ball సిరీసులు మొత్తం డౌన్లోడ్ చేసి చూపించాను. నేను కలిసి అన్ని ఎపిసోడులూ చూడలేదు గానీ, నేను మిస్సయిన ఎపిసోడ్లలో కథ ఏమవుతుందో నెట్‌లో చదివి నన్నునేను అప్డేట్ చేసుకున్నాను, వాడితో మాట్లాడటానికి కామన్ టాపిక్స్ కోసం. ఆ విధంగా Goku అనే ఆధునిక పురుషోత్తముడు ఇద్దరికీ హాట్ టాపిక్ అయ్యాడు. గత ఏడాది నేను సాధించిన గొప్ప విజయాల్లో చిన్నోడికి ఇంగ్లీషు చదవటాన్ని వాళ్లు టీచర్లు నేర్పించలేనిది నేనే ఒంటిచేత్తో నేర్పగలగటం ఒకటి. Diary of a Wimpy Kid మొదటి రెండు వాల్యూములు నేను చదివి వినిపించినా, మూడో వాల్యూము నుంచి ఏడో వాల్యూము దాకా వాడే చదువుకున్నాడు. ఆ ఇన్‍స్పిరేషన్‌తో డైరీ కూడా రాయటం మొదలుపెట్టాడు. దానికి కొనసాగింపుగా ఈ వేసవి సెలవుల్లో One Piece మంగా బుక్స్ కొన్నాను. మూడు వాల్యూములు ఇలా అమెజాన్ నుంచి పుస్తకం రాగానే అలా గంటలో చదివేశాడు. తర్వాతి పుస్తకం కొనటం లేటయితే, ఉన్నదాన్నే మళ్ళీ మళ్ళీ చదువుకున్నాడు. గత వేసవి సెలవుల్లో ఇంగ్లీషు చదవటం నేర్పినట్టే ఈ సెలవుల్లో తెలుగు నేర్పుదాం అని కొన్ని క్లాసులు తీసుకున్నాను కానీ, కంటిన్యువస్‌గా చెప్పటం కానీ నా వల్ల కాలేదు. కలిసి చూసిన సినిమాలు: Ratatoullie, Minnal Murali, The Emperor's New Groove. మిన్నల్ మురళి వాడికి బాగా నచ్చింది. అప్పుడప్పుడూ కలిసి బొమ్మలు కూడా వేశాం. వాడి బొమ్మలు చాలా మెరుగయ్యాయి. అలాగే ఈ నెలతో Chess.com అకౌంటుకి డబ్బులు కట్టాను. ఇద్దరం కలిసి ఆడటం, లేదా ఆ అకౌంటులోకి వెళ్లి అపరిచితులతోనో, చెస్ bots తోనో ఆడటం... అదో కాలక్షేపం. నన్ను తొందరలోనే మించిపోయాడు. అంటే పెద్ద పాయింట్లేమీ కాదు. నాలుగొందలు దాటాడంతే. ఇలా చెస్ ఆడటం, లేదా యూట్యూబులోకి వెళ్లి Magnus Carlsen, Hikaru, Gotham chess... వీళ్లవో, వీళ్ల గురించినవో చెస్ వీడియోలు చూడటం... అదో పెద్ద కాలక్షేపం. ఇంకోటి, వాడిలొ హ్యూమరు, నన్ను నవ్వించగలగటం నేను కొత్తగా గమనిస్తున్న విషయాలు. అలా మొత్తానికి ఎందుకో ఈ వేసవి సెలవులు పొద్దస్తమానం బాగా కలిసి గడిపి ఇవాళ మొదటి రోజు స్కూల్లో దింపుతుంటే చిన్న బెంగ. నా నైట్ డ్యూటీస్ వల్ల మళ్లీ ఏడాదికి గానీ ఇలా దొరకడు.
June 12, 2023
September 29, 2022
Scary Night in the New House
(I wrote it so that I can read it aloud to my son. And he liked it. :) Sparko is our ill-tempered pet parrot.)
I will tell you about the first time I was brought into this new house. It was probably like five months ago. I am not really sure. I don’t know how to count days and months. You see I am still a baby. I was taken to this new house on scooter. Amma brought me here. I mean not MY Amma. I don’t know what to call her. Or any of these three people. They are a family. A family of three people. ‘Naanna’, ‘Amma’, and ‘Chinnamma’. I don’t know their real names. I know only the names that they call each other with. Chinnamma is a small kid. Amma is a big woman. And Naanna is a big man. Naanna is also called Phani, both by the kid and the woman. I guess that’s his real name. He looks weird. He has no hair on his head where it’s supposed to be. And whatever is left is all white. Sometimes he changes his style. Like recently he suddenly took off his beard and colored his hair black. I could not even recognize him. I was scared by this new person. But slowly realised it’s the same old Naana, or Phani (a ‘funny’ sounding name, that one). Ok, let me go back to where I left off my story. I was telling you about the time I entered this new house, right? Amma brought me here on a scooter and left me in a closet. I didn’t even get a chance to look around the house. But by whatever I could see, the house looked empty, without any things in it. Amma opened the lock, entered this empty creepy-looking house, and walked straight to the next room and put me in a closet. And she then left the house, leaving me alone inside my cage. I mean she left me some food and all, but still, it was a scary experience. It would have been even more scarier had she closed the door to the closet. But thankfully she left it open a little. But all I could see through that crack of the door is an empty wall. I thought these people abandoned me for good! I thought I would die here alone. Or some bad guys would come and get me. At first, there was still some light coming in through the window. But slowly the light became dull until it was just plain dark. Darkest of the dark! And me alone in my cage, left to think my scary thoughts.
I am not really sad about these people leaving me. Because it’s not like they are my parents. I know them only for like one month. They used to live in an another house. That’s when Amma bought me for five hundred rupees. I am kind of glad she did that. Because the people who sold me to her were horrible people. You wouldn’t even believe what they did to me! One day a man just took a pair of scissors and cut my wings off! I mean part of them. It was the scariest day of my life! I saw my own little feathers scattered all over the floor, before somebody came in with a broom stick and cleaned them away to probably throw them in the dustbin. Those were a pretty pair of wings. I thought they were the only thing that’s gonna save me from those horrible people. I was thinking about using those wings to escape when the time seemed right. I was thinking about flying back to my parents.
I guess it’s time to tell you about my parents. Both my mom and dad were very good looking and green looking. Me and my brothers used to wait around for them in the nest all through the day. You can’t even believe how red my Mom’s beak was! She was just a beautiful lady. I used to wait all day for that beautiful beak to show up and push some food into my mouth. They used to come very late. I guess it was difficult for them to find food for me and all my brothers and sisters. We were a hungry bunch. We used to make a lot of noise around the nest. Dad used to scold us. He once said, “If you make a lot of noise like this, some snake or cat would hear you, and snatch you away”. I asked him, “What would the snake and cat do to us?” Dad was about to say something, but Mom stopped him. “Don’t frighten the kids!” she angrily said. I don’t know what Dad was about to say! I still wonder what it could be. But no matter what it was, it certainly could not be scarier than being left alone in an empty closet in an even emptier house. The only thought that saved me through that long, dark night was the memories of my parents. They were not many though. It’s not like I lived with my parents for years. I only lived with them for two months. Those days were the happiest of my life. There was nothing much to do. For the first few days after I was born, all that was there to do was to wait around for my parents. Our nest seemed so big, I guess probably because I was so small. I was ugly looking too. All these green feathers I have now were not there when I was born. I was quite crummy looking I must say. Even my brothers and sisters are like that too. You know one funny thing? Before they became my brothers and sisters, they were just eggs! Can you imagine that. But soon, one after the other, eggs kept cracking and these ugly slimey looking creatures started poppinng up. At first I was pretty scared. I thought they were some kind of monsters invading my nest. But Dad told me they were my brothers and sisters. They were a noisy bunch. I am not any less noisy though. After the first few days, everyone of us started getting feathers. We used to fluff ourselves up to show off. Mom was so happy. I was kind of her favorite kid. How do I know that? Because it’s me she chose to teach flying lessons first. Those were difficult at first. I used to be surprised at the heights Mom and Dad could fly to. They were almost touching the clouds. But all I could fly to was the very next branch to our nest. I was ashamed. I wanted to be like Mom and Dad, as soon as possible. But mom said “No hurry, everything in its time”. The tree I used to live in is a ‘Jaaama’ tree. But I hated Jaama kaayalu. I wanted to land on faraway trees and try new fruits. But mom said, “Never go beyond the Jaama tree, you are still too young for that. Just eat the fruits in this tree first”. I said OK. But I wanted to try anyway. That’s when the saddest thing in my entire life happened. I was trying to fly to the other tree but my weak wings gave away and I fell on the ground. I was about to go back to the Jaama tree where my nest was. But suddenly I heard some foot steps and a monster came running around and he just caught me. Well I thought it was a monster anyway. Later I realised it was a human. That’s the first human I ever saw. They are strange creatures, these humans. They don’t have wings and tails. And they are not even like animals. They walk only on two legs. But they are mean. They don’t kill you or anything, but they don’t treat you good either. After that first human snatched me , I went though the hands of several other humans. And finally landed on those horrible people who cut my wings off. I was scared, I thought they would cut my legs too. But, fortunately Amma came and bought me from them. For five hundred rupees. Was I costly or cheap, I don’t know.
At first I thought Amma also belongs to the horrible-kind. Who knows. You can never trust these humans. They can be pretty mean when they want to. So I was very worried when Amma took me to her house. The house was even higher than the tree where our nest used to be. It has many stairs. From there I could see many houses and a whole lot of sky. Amma opened the door and took me inside. She was carrrying me in a cage all this while. Then I saw this kid who was inside the house. That kid just jumped up from the chair he was sitting when he saw me. He was clapping and making a lot of noise. I was scared. They tried to make me come out of the cage. But I just didn’t want to. I started to threaten them with my beak. But they put some cloth around their hands and snatched me away from inside the cage. These two people wanted to pet me or something. But I didn’t even let them near me. I climbed all over the curtains and tried to be out of reach from their hands. But the curtains are not so high. They eventually caught hold of me. God! The kid was jumping all over the place! Amma was kind of gentle and nice. But this kid, you could never know what he would do next! I tried to be as far away from him as parrotly possible. Amma asked HIM to name me. Can you believe it? This crummy looking kid’s gonna name me like he is my parent or something. He didn’t even think much before naming me. He just put his finger on his chin like he was a scientist or something, and just said “Sparko!”. At first that name kinda felt weird. It still feels weird. It’s a nice name and all. But I still have to get used to it.
Then later that day, ‘Naana’ came home (he is also sometimes called “DaaDDa”, I don’t know how many names that guy’s got. I forgot to tell you, Amma also calls him “Phanammaa”!). One good thing, even a funny thing, about him though: he is scared of ME! Can you believe that! He didn’t even try to touch me. Once Amma snached me from the curtains with her hands and tried to put me in his hands. You know what he did? He just ran away to the next room and locked the door from inside! I guess that was the first human I ever saw who was scared of me! It felt funny. It felt good too. Well, one less person to be scared of, I thought. First night was kind of tiresome. They just wound’t let me sleep! They were showing me videos of some parrots. All the parrots in those videos were acting all cute, like they love human beings and stuff! That really surprised me. How can you be so happy around humans who snatched you away from your parents. I don’t know. May be they were different. May be their parents also belong to the humans. Or they were just acting. Amma and Vijju (—Oh, I forgot to tell you, this kid has an another name too. Amma calls him Vijju, Naana calls him Chinnamma. Naanna also calls the kid with many other weird names. Like ‘Chin Chin Mun Mun’, ‘Chin Chineswar’, ‘Bujjamma’, ‘Bungamma’, ‘Bronky’… and many more that I can never remember for the life of me. It’s like he got an endless supply of names for that kid. He even started inventing new names for me. He comes late at night from the office and calls me with all these cutesy sounding names–like Sparkle, Sparkly-thingy, Sparker…. I just want to punch him in the face or go bird-potty on his left eye whenever he calls me with these weird sounding names. But by the time he comes home I am usually too hungry to mind whatever the stupid names he is calling me with). Anyways, what I am about to tell you was, on those first days Amma and Vijju made me watch a whole lot of parrot videos. To make me feel at home I guess. But I hated them. They were all acting all cutesy and happy before humans. That really bugged me. I hated all of them. They were big losers and slaves. Acting nice to humans so that they can get treats and get by nicely. Some of them are even trying to talk like humans! What a sick joke! I cannot forgive those parrots for doing that. Amma and Vijju soon learned that I don’t really care about those losers, so they stopped showing me anymore of those videos.
The days in that house were very hot. I guess it was summer. They put my cage just near the door on a red looking thingy. I hated being just beside the door. Everytime somebody opened the door, I got worried some enemy came. I slowly got used to that. First, I figured out these three people were not my enemies. I mean I still don’t like them and all. But they are not my enemies. And I also figured out that this family is only made up of these three people. That surprised me. Mine was a big family. But these guys got nobody except themselves. Well, I guess I will be the fourth one. But first I have to like them right?
It’s not so easy I tell you. Most of all with that kid! God he is so noisy. He can’t sit on his butt for like one minute. Always moves around like a busy cockroach. And he was always trying to touch me. At the same time he was also kinda scared to touch me. My only weapons to keep him away from me were my poops. He hated my poops. So whenever he tried to hold me, I just pooped on him. My stinky poop. At first he was like “Eewwwww”. But you know one funny thing? Amma and Naana gave HIM the job of cleaning my poops. So my plan to use my poops against him didn’t work anymore. Because, with all that cleaing, he kind of got used to my poops and stopped worrying about them. I pooop, and he just brings a white papery thingy and cleans it up. I slowly got used to that place. I even started to like it to tell you the truth. Because it has a nice view and all. But just when I started thinking that that was the house where I was going to spend the rest of my life, this sudden change happened. Amma brought me on her scooter, and left me in this empty closet in an even emptier house.
That night in this new house is the longest night I have ever been through. It kept going on like forever. All I could do to spend the time is to think about my small nest in a place I can only remember as green. I wondered what my Mom and Dad would be doing right now. Would they even miss me? Or would they just forget me and take care of my brothers and sisters like nothing ever happened. I am sure my mother would miss me. I remembered her beautiful red beak. That night in the empty closet I even dreamed that she came to feed me. In that dream, I forgot that I was in this iron cage, I thought I was still living in the forest. And I swear I even heard the flapping of Mom’s wings too. And her landing on the nest. I was so happy. The happiness became all fluffed up like a balloon inside me, and suddenly, I woke up! But I was still in that damn dark closet. And everything felt heavy and sad.
After many long hours like that, the night was at last over. Suddenly the door of the closet opened and I saw Naana’s face. I was so relieved! I never felt so happy seeing anybody’s face. These guys haven’t abandoned me after all. I still belong to them. That day was a very busy, noisy, dusty, dirty day. People were all over the place. They were carrying things. Some of the things I remembered form the old house. Only then did I realise that these guys were actually changing their houses. I guess they didn’t want me to come along with all these heavy things. That’s why they brought me here a day before. Thank god! I thought they left me for good, and some other bad humans are gonna come and get me. Though I still didn’t like these three people, I was pretty glad to see them back. I guess they are going to be the only family I am ever going to have. I might as well learn to like them.
September 7, 2022
పది
బడిలో బల్లల మీద సందడిలో నీ నూగు చెంపల నవ్వు మొదటిసారి నా కళ్ళల్లో మెరిసీ... ఒప్పులకుప్పాటల్లో ఎగిరే నీ రెండు జెళ్ళపై ఎండ తళుకు నా మనసు గోడలపై వెలుగులుచిమ్మీ... ఉయ్యాల విసురులో అలల నీ గౌను తరగల మీద నా బాల్యం రెపరెపలాడీ... నన్నిప్పుడు కమ్ముకొని కాపాడుతున్న ఒక కౌగిలి కోసం మరి అప్పుడే గాలుల్లో ఏం సమాయత్తాలు జరిగాయో... గోపురం గూళ్ళల్లో ఎర్రముక్కు రాంచిలకలు ఏం జాతకాలు కలిపాయో... దేవుళ్ళు నడిచివెళ్లిన ధూళుల్లోంచి సుళ్ళు తిరుగుతూ రాలిన ఏ దీవెనలు ఆనాడే మనపై దేవగన్నేరు పూలై కురిశాయో... సీవండి మబ్బుల వెలుగులో నాచుఇటికెలగోడ మీద గమ్యంలేని గాజుపురుగుల జంట ఒకదాన్నొకటి మోసుకెళ్తూ... జీవితం మీద మత్తిల్లి వాలిన ఋతువుల్ని సుతారంగా దాటుకుంటూ... ఇలా నన్ను మలిచిన ఇన్నేళ్ళ ప్రయాణానికి... ఉన్నదనే తెలియని కిటికీ ఒకటి తెర్చుకుంటే, సూర్య రేణు సంచలనమై జాల్వారిన ఈ మొదటి పదేళ్ళకి... లవ్యూ షామా! Thank you for shaping me up and putting me back on the rails! 😘
June 28, 2022
picking you up at school on a rainy day
వర్షం వల్ల స్కూలు గేటు ముందు జనం మరీ ఎక్కువమంది ఉంటారని తెలుసు. కాస్త ఆలస్యంగా వెళ్దామని అనుకున్నాను. కొత్త ఇంటిలోకి వెలుతురు సరిగా రాదు. పగలు కూడా లైట్లేయాలి. బైట బళ్లు పార్కింగ్ చేసే చోట కూడా అంతే. ఇవాళ మబ్బుబట్టి చినుకులు పడుతుంటే ఇంకా మరీ చీకటిగా ఉంది. కాసేపు దోమల్ బాట్ పుచ్చుకుని బైట బళ్ళ దగ్గర దోమల్ని కొట్టాను. పట పటమని మెరుస్తూ బాట్ పేలటం బాగుంటుంది. అది పట్టుకుని కాసేపు మినీ Thor లాగా ఫీలయ్యి, మొత్తానికి పది నిమిషాలు ఆలస్యంగా బయల్దేరి వెళ్లాను. అయినా సరే స్కూలు గేటు ముందు జనం కిటకిటలాడిపోతున్నారు. చినుకులు ఎక్కడైనా బావుంటాయి కానీ, బట్టతల మీద బాగోవు. హెల్మెట్ తీయకుండానే ఆ పేరెంట్స్ గుంపులోకి దూరి, అక్కడ మైకుపట్టుకుని పిల్లల్ని పిలుస్తున్న టీచరుకి వినపడేలా, అలవాటులేనంత గట్టిగా నీ పేరు అరిచి చెప్పి, మొత్తానికి నిన్ను బైటకి తీసుకువచ్చాను. You looked tired. And happy. అక్కడున్న రద్దీ వల్ల బండి దూరంగా పార్క్ చేశాను. అక్కడిదాకా ఇద్దరం నడిచి వెళ్తుండగా అప్పటికప్పుడు అబద్ధం చెప్దామనిపించింది. ఇవాళ బండి తేలేదని, మనమిద్దరం నడిచే ఇంటికి వెళ్లాలని చెప్పాను. నువ్వు ఘోరంగా రకరకాలుగా నన్ను తిడుతుండగానే, మనం బండి దగ్గరకి వచ్చాం. నేను దాన్ని చూసి ఆశ్చర్యపోయినట్టు బిల్డప్ ఇచ్చి- "అరె ఈ బండి ఎంత మంచిదిరా.. సీక్రెట్ గా నన్ను ఫాలో అయి ఇక్కడిదాకా ఒచ్చేసిందీ" అన్నాను. నువ్వు వెంటనే జోక్ అందిపుచ్చుకొని- "ఎంత బుజ్జిముండ" అని దాన్ని హెడ్ లైట్ దగ్గర పట్టుకుని ముద్దు చేశావు. బండి డిక్కీ తీసి లోపల నీ కేరేజీ పెడుతుంటే అవినాష్ గురించి చెప్పావు. ఈమధ్య వాడు నీకు స్కూల్లో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాడని, వాడు కనపడ్డం నీకు నచ్చటం లేదని చెప్పుకొచ్చావు. I didn't see any basic human reasoing in it, but I liked how you put it. మీరిద్దరూ సింక్ దగ్గర ఒకరి మీద ఒకరు నీళ్ళు చల్లుకున్నారట. టీచర్ ఇద్దర్నీ మోకాళ్ల మీద నిలబెట్టిందట. నువ్వు చెప్తున్నంత సేపూ నేను ఈ అవినాష్ గాడ్ని అశుతోష్ తో కన్ఫ్యూజ్ అయ్యాను. టీచర్ కొట్టకుండానే 'కొట్టొద్దు టీచర్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్' అని బాడీ మెలికలు తిప్పేసి మరీ ఓవరేక్షన్ చేసే అశుతోష్. నా జెర్కిన్ నీకు తొడిగి, నా హెల్మెట్ నీకు పెట్టాక, బయల్దేరాం. నువ్వు హెల్మెట్ గ్లాస్ మూసుకున్నావు. అందులోంచి మాట్లాడుతుంటే నీ మాటలు స్పష్టంగా వినపడటం లేదు. "ఆ...ఊ" అంటున్నాను. స్కూలు దగ్గరలో ఏదో బిల్డింగ్ కూలగొడుతున్నారు. నీకు చూపిద్దామని ఆపాను. ఆ క్రేన్ అంచుకి ఒక పెద్ద ఇనుప పిడికిలి ఉన్నట్టు ఉంది. It kept punching up the walls like a WWE wrestler. ఇద్దరం కాసేపు ఆగి చూసి బయల్దేరాం. నువ్వు లాంగ్ రూటులో వెళ్దామన్నావు. ఈ వర్షాన్నీ ఈ వాతావరణాన్నీ హెల్మెట్ గ్లాస్ లోంచి చూట్టం నీకు నచ్చిందనుకుంటా. కానీ ఇక్కడ నా బట్టతల మీద చినుకులు.. చిరాకు దొబ్బుతోంది. రోజూ వెళ్ళే రూటులోనే తీసుకొచ్చాను. నువ్వు వెనక నుంచి చేతులు ముందుకుతెచ్చి వాటిని నా పొట్ట మీద కలిపి రెండు చేతులూ వేళ్ళతో మెలేశావు. ఒక స్పీడ్ బ్రేకర్ మీంచి బండి గెంతినప్పుడు అప్పటికే వర్షానికి తడిసిన నీ చేతులు ఒకదాంట్లోంచి ఒకటి జారిపోయి భయపడ్డావు. ఏం మాట్లాడుకున్నాం? I guess we talked about people, how we hated them today for being all over the place. రోడ్డు మీద అక్కడక్కడా విరిగిన తురాయి కొమ్మలు. పళ్ళ మార్కెట్లో నేరేడుపళ్లు చినుకుల్తో మెరవటం చూశాను. ప్రపంచంలోని పర్పుల్ రంగంతా వాటి నుంచే వచ్చిందనిపింది. మధ్యలో గుర్తొచ్చింది- నువ్వు నిన్న 'Behka Mai Behka' పాటని ఇష్టంగా విన్నావని. I tried to hum. You told me to shut up. So I did. మధ్యలో ఒక వేప చెట్టు బాగా లేత అకులతో ఉంది. ఎంత లేత అంటే అస్సలు ముదురాకులే లేవనిపించేట్టు. బండి స్లో చేసి చూపించాను. You seemed to be as surprised and as happy to see it as i did. More than me infact. మలుపులు తిరిగి ఇంటికొచ్చేశాం. గేటు దగ్గర కూడా బురద బురద. గేటు బైటకి తీయాలో లోపలికి తీయాలో నీకు ఎప్పుడూ కన్ఫ్యూజనే. ఇంట్లోపలికి వెళ్లాకా కూడా నువ్వు ఆ పెద్ద హెల్మెట్టూ, నీకు పాదాల దాకా వచ్చే జెర్కిన్నూ తీయకుండా, బుల్లి ఏలియన్ లాగా కాసేపు గెంతావు. అద్దం ముందు ముడ్డూపుతూ డాన్స్. ఇంట్లో తడి చేస్తున్నావని బలవంతంగా విప్పించాను. తర్వాత స్పార్కోని చేతిలోకి తీసుకుని కాసేపు ఆడించటం మొదలుపెట్టావు. నేను కూడా తల తుడుచుకుని, settled back into the dry cosy land of home.
January 30, 2018
నరాలు
కొండంచు మీంచి కన్నీటి పరవళ్ళు తొక్కాలని
కానీ కొండ చాలా ఎత్తు
ఎక్కటంలో పడి
ఏడుపు సంగతి మర్చిపోనూవచ్చు
ఉన్నచోటే కూచుని ఏడుద్దామంటే
ఉట్టి నిట్టూర్పులే వస్తాయి
January 21, 2018
కొత్తమోజు
నీకేమో కొండకొమ్మున వంగి లోయలో పూలను చూస్తున్నట్టు
ఆమెకేమో పడగవిప్పిన పాముకింద పడక సర్దుకున్నట్టు
తామరతూడు చిదిమితే వేళ్ళ మధ్య నలిగే సుఖం
పక్కదుప్పట్ల పరవళ్ళలో సమసిన శ్వాసలు
పడిగాపుల్లో గునిసి నలిగిన బట్టలకు
అప్పుడిక చీర లుంగీగా మారినా,
షర్టు జాకెట్టయినా సంతోషమే
గెలుపు గీరతో నిల్చున్నప్పుడు
ఛాతీ మీద ఆమె చూపులు గుచ్చే పతకాలు
కిటికీ అద్దం మీద ఊపిరి ఆవిర్లను
తుడిచి చూస్తే, అటేపుండాల్సిన సూర్యుడు
ఇటేపెప్పుడు జారుకున్నాడో తెలీక,
మీ పొద్దెరగని మొహాలూ మీరూను
ఈ వివశ సౌందర్య ప్రపంచమొకటి
ఉందనే తెలీని బైటి లోకం మీద
తెరలు మూసేసి మళ్ళీ
రక్తపు గోడల గుడిలోనూ బెదరని మోజుతో
నువు చేసిన పెను పూజలు
మళ్ళీ రాజుకునే లోపు, విప్పిపరచిన దేహ పటాల
మీద వాలి, తప్పించుకునే పుట్టుమచ్చల్ని వేలి
కొసల వెంటాడుతూ, తగిలిన దెబ్బల మిగిలిన
మచ్చలు చెప్పించుకునే చరిత్రలు వింటూ...
ఏమవుతారో మీ ఇద్దరూ చివరికి ఈ
దేహపాలిత ప్రపంచం మత్తు వొదిలాకా...
చెదిరిన జుట్టులో వడలిన కనకాంబరాల్ని దులుపుకొని ఆమే
కడుపు మడతల వెనుక కప్పెట్టిన ఆకలిని పట్టించుకొని నువ్వూ
గడప దాటాకా, మొద్దుబార్చి కసి తీర్చుకునే కాలంలోకి వెళ్ళాకా....
December 18, 2017
స్వభావం
నీరెండ ఒడ్డును కలగన్నట్టు,
తెల్లటి మాయేదో కమ్మిన స్నేహోద్రేకంలో
దొరికిన నెంబర్‌కి ఫోన్ చేస్తావు
వినిపించిన గొంతునల్లా అల్లుకుపోదామని.
ఒక్కో చువ్వా పేర్చి కట్టుకున్న ఇనుప పంజరంలోంచి
నువ్ వెలార్చే యీ స్నేహఋతు కూజితం వెనగ్గా
జీరగా గీరుకునే ఒక ఆలాపనను
అవతలి మనిషి విన్నూవచ్చు వినలేకపోనూవచ్చు.
మీ మాటలు మర మీది బెల్టుల్లా తిరుగుతుండగానే
నీ తలుపులు ఒక్కోటిగా మూతపడుతుంటాయి
నిజం లెక్కలేనన్నోసారి నిన్ను క్షమించి చేతులు చాస్తుంది
దాని అనాదరపు కౌగిట్లోకి నీరసంగా చేరతావు, ఫోన్ పెట్టేసి.
June 30, 2017
ఊరట
ఆమెకు అడ్డుగా నిలబడి
వాడకం చీర, స్నానం సబ్బు,
జాకెట్ చంకల చెమట చంద్రవంక,
వీటి వెనక లీలగా తారాడే ఆమె సొంత
వాసనను ఊపిరితిత్తుల్లోకి పీల్చుకుని
ధ్యాసలన్నీ ఉఫ్ మని ఆర్పేసి
అంతరావయవాల సజీవ ఉష్ణోగ్రత
చర్మం గూండా తెలిసేట్టూ
అణిచే అనాదరించే వాస్తవం
కమ్మటి కలల రంగుల్లోకి చెదిరేట్టూ,
నీకేసి అదుముకొని...
ఆమె ఎడమ చెవీ, నీ ఎడమ చెవీ
లేదూ నీ కుడి చెవీ, ఆమె కుడి చెవీ
నిశ్శబ్దాన్ని మృదులాస్థి మధ్య మర్దిస్తుంటే
ఊపిరులు మెడ మీది అదృశ్య భారాల్ని ఊదేస్తుంటే
ఎదుట ఉన్నదేదీ కనిపించకుండా
లోపల ఉన్నదేదో వినిపించుకుంటూ
దేవుడు ఇంకో మనిషిని ఇచ్చినందుకూ
ఇచ్చీ ఇంకో మనిషిగానే మిగిల్చినందుకూ
నిట్టూర్పులో ఒకసారి మరణించి
“ఏంట్రా పిచ్చోడా” అని వీపు నిమిరితే తేరుకొని
వాస్తవాన్ని సిగ్గుగా ఏరుకొని
ఒకసారి జన్మించి, మళ్ళీ జీవితంలోకి,
ముద్దిచ్చి
విడిపోయి—
*
April 7, 2015
ఆ మాత్రం చాలని
అనుభవం తాకని నీ శరీరం టబ్బులో
ఆనందం తొణికి కేరింతలు పొర్లుతాయి
నాన్నకి నిన్నలా చూడటం ఇష్టం.
నీ ముందు పరుచుకునే కాలాన్ని ఊహిస్తాడు:
నడుస్తావు తోవలో ఎత్తు పెంచుకుంటూ
శరీరం ఋతువుల రాపిడికి గరుకెక్కుతుంది
మనసు దృశ్యాలతో బరువెక్కుతుంది
నిర్ణయాలు తీసుకుంటావు
ప్రేమిస్తావు రమిస్తావు
బాధిస్తావు బాధపడతావు
పెంచుతావు పోషిస్తావు, మీ నాన్న లాగే.
రాలిపోవడం చూస్తావు, మీ నాన్నతో సహా.
కణాలు చచ్చిపుడతాయి
న్యూరాన్లు నిండుతాయి
వెంట్రుకలు రంగుమారతాయి
చప్పుడు చేసే కీళ్ళతో ఏదో కారిడార్లో గదులు వెతుక్కుంటావు
నములుబడని పదార్థం కావాలనిపించినా వద్దంటావు
గుమ్మంలో కదలని దృశ్యాన్ని మంచం మీంచి చూస్తూంటావు
కేరింతల్లేని నీ పసితనాన్ని మన్నించి
వంగిన నీ వెన్నుపై సబ్బు రుద్దే ఒక్క మనిషినైనా
సాధించుకునేపాటి తెలివి మాత్రం నీకుంటే చాలని
కోరుకుంటాడు మీ నాన్న
నిన్ను టర్కీటవల్లో చుట్టబెట్టి తీసికెళ్తూ.
February 11, 2014
లిఫ్ట్ ఇవ్వటం పుచ్చుకోవటం
నేను హైదరాబాదులో ఆరేళ్ళ మట్టీ ఉంటున్నాను. నాకు బండి లేదు. ఒక్కోసారి చాలా నడవాలి. అలాగని అస్తమానం లిఫ్టు అడగను. ఒక్కోసారి నడకకి అనువైన మూడ్లో ఉంటాను. కానీ ఒక్కోసారి పని అర్జంటైనపుడు అడగక తప్పదు. అలా గత కొన్నేళ్లలో లిఫ్టులు అడిగీ అడిగీ నాకు కొంత తత్త్వం బోధపడింది:
1) లిఫ్టు అడిగేటప్పుడు మన దారిన మనం నడుస్తూ ఒకసారి అడిగిచూస్తే పోలా అనుకుని అడుగుతున్నట్టుగా కనపడకూడదు. ఏదో ఉబుసుపోక అడుగుతున్నామని బండి యజమాని అనుకునే అవకాశం ఉంది. కాబట్టి ఒక చోట ఆగి నిలబడి అడగాలి.
2) బండి మరీ దగ్గరకు వచ్చేశాకా చేయి ఎత్తడం వల్ల ప్రయోజనం లేదు. బండి యజమానికి లిఫ్టు ఇవ్వాలా వద్దా అని నిర్ణయించుకునేందుకు తగినంత సమయం ఇవ్వాలి.
3) లిఫ్టు అడిగేటప్పుడు బండి యజమానీ అతని బండీ ఒకే పదార్థమన్నట్టు కలిపేసి వేగ్ గా అటు చూడకూడదు. సూటిగా లిఫ్టు ఇచ్చేవాడి కళ్లల్లోకి చూస్తూ అడగాలి. (హెల్మెట్ ఉంటే అద్దం వైపు).
4) మన బాడీలాంగ్వేజ్ లో అవిశ్వాసం కనపడకూడదు. అతను మనల్ని దాటిపోయేవరకూ అతను లిఫ్టు ఇస్తాడని మనం ఎంతో నమ్మకంగా ఉన్నట్టు కనపడాలి.
5) ఎన్ని బళ్లు దాటిపోయాకా ఇక ప్రయత్నం మానేయవచ్చు అన్న దానికి ఖచ్చితమైన లెక్క లేదు. మన ఓపిక. ఒకసారి పదిమంది దాటిపోయాకా పదకొండో బండి మీదే మనక్కావాల్సిన దయగల ప్రభువు వస్తూండి ఉండొచ్చు.
6) అసలు లిఫ్టు అడిగేముందు మన వాటం ఎలా ఉందో ఒకసారి గమనించుకోవటం కూడా మంచిది. ఒంటరి రోడ్డు మీద రౌడీవాటంతో కనిపించేవాడికి లిఫ్టు ఎవరూ ఇవ్వరు.
7) సాధారణంగా పెళ్లయిన మగవాళ్లు లిఫ్టులు ఇవ్వరు. బ్రహ్మచారులే ఇస్తారు. ఇలా ఎందుకో నాకూ తెలియదు. సంసార సాగరపు క్రూరమైన నియమాల్లో పడ్డాకా, దయ అనేది ఒక పాషనబుల్ ప్రివిలేజ్ గా కనిపించటం మొదలౌతుందనుకుంటా.
8) మనం పదిమంది నిలబడి ఉన్న చోట నిలబడి అడిగితే చాలామంది బండి యజమానులు లిఫ్టు ఇవ్వటానికి ఇష్టపడరు.
9) రాత్రుళ్లు లిఫ్టు అడగటం కష్టమైన పని. హెడ్ లైట్ల వెలుగులో బండి మీద వస్తోంది ఆడా మగా అన్నది తెలియదు. నేను ఒక్కోసారి ఆడవాళ్ళను అడిగిన సందర్భాలూ ఉన్నాయి. వాళ్లు మనది పొరబాటు అనుకుంటారో, మరి వెధవ్వేషాలు వేస్తున్నాం అనుకుంటారో తెలియదు గానీ, ఎప్పుడూ ఆపరు. అలా ఒక అమ్మాయి లిఫ్టు ఇవ్వటం కోసం బండి ఆపటమనేది నా పగటి కలల్లో మాత్రమే జరుగుతుంది. అలా లిఫ్టు ఇచ్చే అమ్మాయి ఈ భరత ఖండంలో తారసపడటం కష్టం. దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు కూడా. ఎందుకంటే ఎవడైనా అలా పొరబాట్న అడిగినా ఒకవేళ నిజంగా ఆ అమ్మాయి ఆపితే, అప్పుడు ఆపింది అమ్మాయి అని గ్రహించి కూడా ఎవడైనా లిఫ్టు తీసుకోవటానికి సిద్ధపడ్డాడంటే, వాడు ఏదో ప్రాణాంతకమైన ఎమర్జన్సీలో ఐనా ఉండి ఉండాలి, లేదా సింపుల్ గా వాడి ఇంటెన్షన్ వెధవ్వేషాలు వేయటమే ఐనా అయి ఉండాలి. ఏమో, మళ్లా ఆలోచిస్తే ఇలా తీర్మానించడం తప్పేమో అనిపిస్తుంది. ఒక అమ్మాయి లిఫ్టు ఇవ్వటానికి బండి ఆపినా, సారీ చెప్పి బండెక్కని వాడు మర్యాదస్తుడే అనుకోనక్కర్లేదు, వట్టి పప్పుసుద్ద అని కూడా అనుకోవచ్చు. ఏదేమైనా ఈ విషయమై ఇన్ని మాటలు అనవసరం, మగాడికి లిఫ్టు ఇద్దామని బండి ఆపే అమ్మాయిలు ఎలాగూ ఉండరు.
10) రాత్రుళ్లు లిఫ్టు అడగటంలో ఇంకో ఇబ్బంది కూడా వుంది. బండి మీద వస్తోంది ఒకరేనా, లేక ఇద్దరా అన్నది తెలియదు. ఇలా నేను చాలాసార్లు భంగపడ్డాను. ఇద్దరు వున్నారని గ్రహించి చేయి దించేసేలోగానే వాళ్లు వెళ్తూ వెళ్తూ ఏదోక సెటైరు వేయక మానరు. “ఇంకెక్కడ ఎక్కుతావు నాయనా, నెత్తి మీదా” లాంటివి. ఒకసారి మాత్రం చిత్రం జరిగింది. అప్పటికే మసక చీకట్లు అలుముకున్నాయి, వాన పడుతోంది. నేను సైబర్ టవర్స్ దగ్గర అనుకుంటా నిలబడి ఉన్నాను. హెడ్ లైట్ల వెలుగు వల్ల బండి మీద ఇద్దరున్నారన్న సంగతి తెలియకుండానే చేయి చాపాను. అయినా ఆపారు. ఇద్దరు స్నేహితులూ ఎదరకి సర్దుకు కూచుని నన్ను మూడోవాడిగా వెనక ఎక్కించుకుని తీసుకుపోయారు. ఇది నా లిఫ్టుల చరిత్రలో ఒక వింత అనుభవం.
అలాగే ఇంకోటి కూడా ఉంది. వింత అనుభవం అని కాదు గానీ, నాకు గుర్తుండిపోయింది. ఒకసారి ఎర్రగడ్డ నుంచి సనత్ నగర్ వైపు నడుస్తున్నాను రాత్రి. అది బతుకుతెరువుకి హైదరాబాదు వచ్చిన కొత్త. జేబులో చిల్లిగవ్వ లేదు. ఒక ఆటో వాడు పక్కన స్లో జేసి “వస్తావాన్నా” అని అడిగాడు. డబ్బులుంటే ఎక్కే వాణ్ణే. లేవు కాబట్టి రానన్నాను. అతను ఊరుకోలేదు, “ఎందుకు రావు అటేగా పోతుంది” అన్నాడు. విసుగొచ్చి “పైసల్లేవన్నా” అని చెప్పేశా. అతను ఫర్లేదు ఎక్కమని ఏం పుచ్చుకోకుండానే సనత్ నగర్ దాకా దింపాడు. ఆటోవాళ్లు లిఫ్టు ఇవ్వటం అరుదైన సంగతేగా మరి. అది కూడా కాదేమో, మన పట్ల దయ ఎవరు చూపించినా అది ఎంత చిన్నదైనా గుర్తుండిపోతుంది.
అన్నింటికన్నా బాగా గుర్తుండిపోయిన ఇంకో లిఫ్టు అనుభవం మొన్న 2011 లో ఇండియా వరల్డ్‌కప్పు గెలిచిన రోజు రాత్రి జరిగింది. ఆ రోజు ఆఫీసులోనే ఇండియా శ్రీలంక మధ్య ఫైనల్స్ చూసి, లేటుగా గదికి బయల్దేరా. బస్సు కోసం పెద్దమ్మగుడి దాకా నడిచాను. రోడ్లంతా గోల గోలగా ఉన్నాయి. వాతావరణం డిసెంబరు థర్టీఫస్ట్ నైటుకి బాబులా ఉంది. కుర్రాళ్లు కార్ల కిటికీ లోంచి తలలూ మొండేలూ బయటపెట్టి చేతుల్తో జెండాలు ఊపుతూ అరుస్తున్నారు, బైకు ఒకడు నడుపుతుంటే ఇంకొకడు వెనక కాళ్ల మీద నిలబడి విజిల్స్ వేస్తున్నారు. ఇలాంటప్పుడు జనం మధ్య సులభంగా ఒక సుహృద్భావం వచ్చేస్తుంది కదా, మర్నాడు పొద్దున్న లేవగానే మర్చిపోయే తరహాది. మరి ఆ కుర్రాడు మామూలుగా అడిగితే లిప్ట్ ఇచ్చేవాడో లేదో, ఇప్పుడు ప్రపంచ కప్ గెలుపు ప్రపంచపు మంచితనం మీద నమ్మకాన్ని కలిగించి, అది ప్రతిగా అతనిలోని మంచితనాన్నీ మేల్కొలిపిందనుకుంటా, నేను చేయి చాపి ఇలా బొటన వేలు ఎత్తానో లేదో వెంటనే బండి బ్రేకు వేసి ఆపాడు. నేను ఎక్కగానే బండి సర్రుమని దూసుకుపోయింది. అతను మధ్య మధ్యలో బండి చేతులొదిలేసి నోటి చుట్టూ చేతుల్తో గూడు కట్టి అరుస్తున్నాడు, తన బండిని అరుస్తూ క్రాస్ చేసి వెళ్లేవాళ్లతో పాటూ తానూ గొంతు నరాలు తెగేలా అరుస్తున్నాడు. దారిలో ఎవరు హై ఫైవ్ ఇచ్చినా బండి స్లో చేసి మరీ తిరిగి వాళ్ల చేతులు చరుస్తున్నాడు. నేను మరీ క్రికెట్ పిచ్చోణ్ణి కాదు గానీ, ఇండియా గెలవటం అనేది నాలో ఏదో మూల దేశభక్తి తాలూకు అవశేషాల్ని ఉత్తేజితం చేసిందనుకుంటా, నాకూ సంతోషంగానే ఉంది. కానీ నాది మరీ ఇలా ఆనందంతో గంగవెర్రులెత్తే స్వభావం కాదు. ఎప్పుడన్నా తాగితే తప్ప. ఐతే ఎంతైనా ఒకే బండి మీదున్నాం కదా ఇద్దరం. అతను అలా ఓపక్క ఆనందంతో బద్దలయిపోతూ ఉంటే నేను ఊరికే మౌనంగా ఉంటే ఏం బాగుంటుంది. అతని ఆనందం ఎబ్బెట్టుగా ఫీలవ్వచ్చు. అందుకే నేనూ గొంతు నొప్పి పుట్టేలా అరవటం మొదలుపెట్టాను. అక్కడ నేను నా స్వభావాన్ని విడిచిపెట్టి మరోలా నటిస్తున్నానన్న సంగతి గమనించటానికి కూడా ఎవరూ లేరు కదా. కానీ ఏ మాటకామాటే చెప్పుకోవాలి, అలా అరుస్తూ సమూహాన్ని కదిలించిన సంబరంలో నేనూ పాలుపంచుకోవటం బాగా అనిపించింది. అయినా మొహమాటానికి పోయినట్టే కదా.
ఇలా లిఫ్టు ఎక్కినప్పుడు చాలాసార్లు జరుగుతుంది. ఒక మనిషి మనకు లిఫ్టిచ్చాడంటే అతను ఏదీ ఆశించకుండా ఉచితంగా ఉత్తపుణ్యానికి మన పట్ల దయగా ఉండటమే. దాన్ని టేకిట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోవచ్చని మొదట్లో తెలిసేది కాదు. దాంతో లిఫ్టు ఎక్కిన కాసేపటి దాకా కనీస స్థాయి హ్యూమన్ ఇంటరాక్షన్ అయినా మా ఇద్దరి మధ్యా ఎస్టాబ్లిష్ చేసుకోవటానికి ప్రయత్నించేవాణ్ణి. వాళ్లు ఎక్కడి దాకా వెళ్తున్నారో అడిగేవాణ్ణి. వాతావరణం గురించో, ట్రాఫిక్ గురించో వ్యాఖ్యానించేవాణ్ణి. క్లుప్తంగా చెప్పాలంటే బండియజమానిని ఎంటర్టయిన్ చేయటానికి చేతనైనంత ప్రయత్నించేవాణ్ణి.
కానీ క్రమేణా అప్పుడప్పుడూ నా చేతుల్లోకీ బండి వచ్చి, నేనూ అప్పుడప్పుడూ లిఫ్టులివ్వటం మొదలుపెట్టినప్పటి నుంచీ (బండి యజమానిగా నాణేనికి రెండో వైపు నేను నిలబడటం కుదిరినప్పణ్ణించీ), అలాంటి అనుబంధమేదీ వాళ్లు కోరుకోరని అర్థమైంది. మనల్ని ఎక్కించుకోగానే వాళ్ల మనసుల్లో ఒక మంచి పని చేశామనే తృప్తి కలుగుతుంది. అదే మనం వాళ్లకి ఇవ్వగలిగేది, అదే వాళ్లు కోరుకునేది. అందుకే “థాంక్స్ అన్నా!” తో సరిపెడుతున్నాను. అందులోనే వీలైనంత కృతజ్ఞత దట్టించటానికి ప్రయత్నిస్తున్నాను.
సరే, ఇక నా చేతుల్లో బండి ఉన్నప్పుడు నేను లిఫ్టులు ఇచ్చే పద్ధతి గురించి చెప్తాను. నిజం చెప్పాలంటే, పైన అన్ని పాయింట్లు రాశాను కదా, ఆ పాయింట్లేవీ నేను లిఫ్టు ఇవ్వబోయే వ్యక్తి విషయంలో పూర్తవుతున్నాయా లేదా అన్నది ఎప్పుడూ ఆలోచించను. ఆ క్షణం ఏమనిపిస్తుందో అదే పాత్ర వహిస్తుందేమో అనిపిస్తుంది. నేను లిఫ్టు ఇచ్చే సందర్భాల్ని నెమరు వేసుకుంటే ఈ కామన్ పాయింట్లు తట్టాయి:
1) లిఫ్టు ఇవ్వాలా వద్దా అన్నది నేను వెళ్తున్న పని అర్జెన్సీని బట్టి ఉంటుది. తీరుబడిగా పోతున్నప్పుడు ఎవరు అడిగినా లిఫ్టు ఇవ్వటానికి సంసిద్ధంగానే ఉంటాను.
2) కొన్ని ముఖాలు ఊరికే ఎందుకో మనకు నచ్చవు. అలాంటి ముఖాలకు ఇవ్వను. వాళ్లు సాధారణంగా నా సమవయస్కులై ఉంటారు. (లిఫ్టు అడిగేటప్పుడు నా ముఖం అలాంటి ముఖాల జాబితాలోకి వస్తుందేమో ఎప్పుడూ ఆలోచించలేదు, వస్తుందేమో).
3) ఎవర్నన్నా లిఫ్టు ఎక్కించుకున్నాకా, నా బండి నిర్జన ప్రదేశాల్లో పోతున్నప్పుడు హఠాత్తుగా ఆ వెనకనున్నవాడు నా పీక మీద కత్తి పెట్టి, బండాపించి, “తియ్యరా పర్సు” అంటాడేమో అని ఒక్కసారైనా భయపడతాను.
4) ఎవరి కన్నా లిఫ్టు ఇచ్చినపుడు బండి మామూలు కన్నా స్పీడుగా పోనిస్తాను – అతను ఏదో అర్జంటు పని మీదే లిఫ్టు అడిగుంటాడు కదా, స్లోగా తీసుకెళ్తే ఎలాగా అని.
సరే ఇక నేను లిఫ్టు ఇచ్చిన సందర్భాల్లో బాగా గుర్తుండిపోయినవి చెప్పమంటే మొన్న వారమే ఇచ్చిన ఒక లిఫ్టు గుర్తొస్తుంది.
జూబ్లీహిల్స్ చెక్పోస్టు దగ్గర పెద్దమ్మ గుడికి వెళ్లే మలుపు తిప్పీ తిప్పగానే ఒక ముసలాయన (అంటే మరీ వంగిపోయిన ముసలాయన కాదు, అరవయ్యేళ్లుంటాయేమో) చేయి ఊపాడు. ఎక్కించుకున్నాను. ఆయన ఫింఛనాఫీసు నుంచి వస్తున్నాడు. అక్కడ ఏదో ప్రభుత్వ పథకం ప్రకారం ఈయనకు నెలకు రెండొందలు రావాలి. కానీ ప్రభుత్వ రికార్డుల్లో ఈయన ఆల్రెడీ చచ్చిపోయాడని రాశారట. అందుకని అక్కడ దెబ్బలాడి, ఏదో అల్టిమేటం ఇచ్చి వస్తున్నాడు. మొత్తం గవర్నమెంటు మీదా వ్యవస్థ మీదా పగతో ఉన్నాడు. బండెక్కగానే తనను ఎక్కించుకున్నందుకు కాసేపటి వరకూ నన్ను చాలా పొగిడాడు. ఆ తర్వాత తన బాధ చెప్పుకున్నాడు. ఆయనది నెల్లూరు, రిటైరయ్యాడు, ఇప్పుడు సిటీలో ఏదో అపార్టుమెంటు ముందు కాపలా పని చేస్తున్నాడు. ఫింఛనాఫీసు వాళ్లని దారంతా తిడుతూనే ఉన్నాడు. ఆయన ఉద్యోగం చేసింది తమిళనాడులో. అక్కడి ప్రభుత్వానికీ ఇక్కడి ప్రభుత్వానికీ మధ్య తేడా ఎత్తి చూపుతున్నాడు. కాంగ్రెస్ మళ్లీ రాదంటున్నాడు. మధ్య మధ్యలో నేను కాస్త స్పీడు పెంచినపుడల్లా, “నెమ్మదిగా పోదాం బాబూ కంగారే వుంది” అంటూ నన్ను నియంత్రిస్తున్నాడు, మళ్లీ “థాంక్స్ బాబూ మీరు వచ్చారు కాబట్టి ఇలా వెళిపోతున్నాను” అని తెగ ఎగదోస్తున్నాడు. ఇలా శిల్పారామం దాటే దాకా అతను ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన జీవిత పరిస్థితులన్నీ టూకీగా ఏకరువు పెట్టేశాడు. ఆయన కుంటి తమ్ముడూ, ఆ తమ్ముడీ మధ్య పెట్టుకున్న బజ్జీల బండీ వగైరా. నెల్లూరి యాసలో మాట్లాడుతున్నాడు, వయసైపోయినా ఇంకా కుర్రతనం వదలని మనసుతో అభాసుపాలయ్యే ముసలాడు. చిన్న లిఫ్టు ఇచ్చినందుకు అంత ఎందుకు హడావిడి చేస్తున్నాడని నాకు మధ్యలో పీకుతూనే ఉంది. ఊరికే వచ్చి కాసేపు దగ్గరగా మాట్లాడి ఒక చిన్న మొహమాటపు అనుబంధం ఎస్టాబ్లిష్ అయ్యేలా చేసి, వెంటనే ఫలానా ఊరు వెళ్లాలి, లేదా ఫలానా అవసరం ఉందీ అని డబ్బులడిగి కాదనలేని పరిస్థితిలోకి తెచ్చి ఇబ్బంది పెడ్తారు కదా కొంతమంది… ఈయన ఆ కోవకు చెందడు కదా అని అనిపించింది. కానీ లిఫ్టు ఎక్కాకా సైలెంటుగా దిగిపోయేవాళ్లనే చూశాను గానీ, ఇలా ఇంత మాట్లాడేవాళ్లు తారసపడలేదు. అదొక్కటీ సరదాగా అనిపించింది. ఇంతా అయ్యాకా అతను చివరికి డబ్బులడిగి ఈ అనుభవాన్ని కల్తీ చేస్తాడేమో అని చిన్న జంకు. కానీ అతని దృష్టిలో కల్తీ చేయటానికి ఇదో పెద్ద అనుబంధం కాదేమో. ఇలాంటి పాసింగ్ అనుభవాల్ని మళ్లీ గుర్తు చేసుకునేవిగా భావించే నాలాంటి ఏబ్రాసి స్థితిలో లేడేమో. శిల్పారామం తర్వాత ఏదో బిల్డింగ్ కాంప్లెక్సు దగ్గర ఆపమన్నాడు. దిగాకా నేను వీడ్కోలు సూచకంగా నవ్వాను. నేను ఎక్కడ గేరు మార్చేస్తానో అన్న తొందరలో ఆయన వెంటనే, “రెండు గంటలు ముందే వచ్చేశాను సార్, టీ తాగటానికి ఓ పది రూపాయలుంటే ఇస్తారా” అనేశాడు. ఇప్పటిదాకా ఏర్పడిన అనుబంధపు ప్రాతిపదికన నేను ఆయనకి పది రూపాయలు ఇవ్వటం పెద్ద విషయం కాదు. కానీ అతని వైపు నుంచి ఈ అనుబంధాన్ని ప్రతిపాదించటం వెనుక కారణమే చివర్లో ఈ పదిరూపాయలు అడగటం అయినపుడు, అంటే నా వైపు నుంచి ఇది ఒక చిన్న అనుబంధం అయి, అతని వైపు నుంచి ఒక పథకం మాత్రమే అయినపుడు, నేను ఆ పది రూపాయలు ఇస్తే అతని పథకాన్ని గెలిపించినట్టు, ఆ తర్వాత అతను ఆ పది రూపాయలు జేబులో పెట్టుకుంటూ “బుట్టలో పడ్డాడు వెధవ” అనుకుంటే…? అది నాకు నచ్చలేదు, కాబట్టి “ఇవ్వను” అని చెప్పి బండి స్టార్ట్ చేసేశాను. కానీ కాస్త దూరం పోగానే “ఇవ్వను” అన్నందుకు ఏమనుకునుంటాడో అన్న ఊహ వచ్చింది. ఏముంది, రెండు గంటలు తొందరగా వెళ్లినందుకు ఎక్కడో అక్కడ కూర్చుని వెయిట్ చేస్తాడు, బహుశా బస్సుల బాధ లేకుండా తొందరగా సునాయాసంగా రాగలిగినందుకు ఆనందిస్తాడు, కానీ ఆనందిస్తూ టీ తాగటానికి డబ్బులు మాత్రం ఉండవు. బహుశా అలా కూర్చుని టీ తాగుతున్నప్పుడు ఇది అతనికి కూడా ఒక చిన్న అనుబంధంగానే అనిపించేదేమో. అనిపించకపోతే ఏం చేసేది లేదు, కానీ అనిపించే అవకాశం కూడా లేకుండా చేశాన్నేను. పెద్ద రిగ్రెట్ అని కాదు, ఇప్పుడు ఇదంతా అందుకే రాస్తున్నా అని నాటకం ఆడను. నేను అంత సున్నితమైన వాణ్ణి కాదు. కానీ, నేను మాత్రం ఆ పది రూపాయలు ఇచ్చేస్తే బాగుండేది.
రచనలో గొప్ప విషయమేంటంటే, రాస్తూ పోతుంటే కొన్ని అనుకోనివి హఠాత్తుగా మనల్ని పలకరించి నిలవరిస్తాయి. ఇప్పుడు ఇదంతా రాస్తుంటే, హఠాత్తుగా, అస్సలు సంబంధమే లేకుండా ఒక జ్ఞాపకం నా ముందుకు వచ్చి నిల్చుంది.
అప్పుడు ఇంటరు చదువుతున్నాను. ఎవరో ప్రైవేటు కాలేజీలో పాఠాలు చెప్పే మాస్టారు సాయంత్రం మాకు వాళ్ల మేడ మీద ట్యూషన్లు చెప్పేవారు. ఆ ట్యూషన్ కి అన్ని తరగతుల వాళ్లూ వచ్చేవారు. ఒక్కో గంట ఒక్కో క్లాసుకి చెప్పుకుంటూ పోయేవారు. చీకటి పడే వరకూ అన్ని తరగతులూ ఆ విశాలమైన మేడ మీద చెల్లా చెదురుగా జట్లు జట్లుగా విడిపోయి ఉండేవి. చీకటి పడ్డాకా మాత్రం ఆ మేడ మధ్యన ఉన్న చిన్న షెడ్డులోనే లైటు ఉండేది కాబట్టి అందరూ అక్కడ గుమికూడేవారు. ఒక రోజు రాత్రి బాగా వర్షం పడుతోంది. ట్యూషన్ మాత్రం అయిపోయింది. పిల్లలెప్పుడూ తడవటానికి జడవరు కదా. చాలామంది వెళిపోతున్నారు. నేను నా గొడుగు తీసుకుని మేడ దిగి గేటు తెరుచుకుని బయట రోడ్డు మీద వడి వడిగా అడుగులేసుకుంటూ పోతున్నాను. ఉన్నట్టుండి హఠాత్తుగా ఒక ఆరో తరగతి పిల్ల అనుకుంటా, “అన్నయ్యా ఆడ దాకా రావద్దా” అంటూ చొరవగా నా గొడుగులోకి దూరేసింది. చిన్న గౌను వేసుకుంది, పుస్తకాలు ఒబ్బిడిగా హత్తుకుంది. తర్వాత మేం ఒక సందు అంతా కలిసే నడిచాం. ఆ సందు అంతా వర్షం నీరు చీలమండల దాకా పారుతోంది. ఒక గొడుగు కింద నడిచాకా పరిచయాలు తప్పవు కదా. ఆ ఆరిందా పిల్ల ఏం మాట్లాడిందో గుర్తు లేదు, నేను ఏం మాట్లాడేనో కూడా గుర్తు లేదు. మా ఇల్లే ముందొచ్చింది, ఆ పిల్ల తర్వాత వర్షంలో తడుస్తూ వెళిపోయింది. ఈ జ్ఞాపకం నేను ఈ లిఫ్టు పురాణం గురించి రాస్తుండగా గుర్తుకు రావటం చిత్రం కదా! మైండ్ వర్క్స్ ఇన్ మిస్టీరియస్ వేస్. ఒక్కోసారి దాన్ని నమ్మాలి. బహుశా నాకు గుర్తుండిపోయిన బెస్ట్ లిఫ్టు ఇదే అనుకుంటా.
*
February 26, 2011
పుస్తకాల్ని పైకి చదవడం గురించి
అయితే ఒక్కడినే వున్నపుడు మాత్రం అపుడపుడూ బిగ్గరగా బయటకి చదువుతూంటాను. దీనికి కారణం వుంది. గొప్ప రచయితలేం చేస్తుంటారంటే, లేదా అప్పుడప్పుడూ ఏం చేయగలుగుతారంటే, భాష ద్వారా సాధ్యమయ్యే అభివ్యక్తి అవధుల్ని దాటేసి, భాషకు ఆవలి భావాల్ని స్ఫురింపజేయగలుగుతారు. చూట్టానికి అచ్చులు హల్లులతో అవే పదాలూ, వ్యాకరణానుగుణమైన అవే వాక్యాలూ ఏదో విషయాన్ని వ్యక్తీకరిస్తూనే వుంటాయి. కానీ దాన్ని మించిన భావమేదో అందీఅందకుండా ఆ వాక్యాల చుట్టూ ఒక ఆవిరిలానో కమ్ముకునో, వాటి వెనక నీడలా తచ్చాడుతూనో ఉంటుంది. అదేమిటాని పట్టిపట్టి అర్థంచేసుకోబోతే-- ఆ ప్రయత్నం చేసినకొద్దీ-- ఇంకా దూరమైపోతుంది. కానీ అర్థంచేసుకోవటాన్ని మించిన అనుభవమేదో స్ఫురిస్తూనే ఉంటుంది. ఈ ఫీట్‌ని అందరు రచయితలూ అన్నిసార్లూ చేయలేరు. కొందరే, అదీ వాళ్ల సామర్థ్యపు అంచుల్ని అప్రయత్నంగా అందుకోగలిగినపుడు మాత్రమే చేయగలుగుతారు. చదువుతూ చదువుతూ వుండగా, హఠాత్తుగా కమ్ముకున్న ఇంద్రజాలం మనల్ని చకితుల్ని చేస్తుంది. వొళ్ళు జలదరిస్తుంది. కానీ కారణం కనిపించదు. వ్యక్తీకరణకు మూలమైన భాష అంతా కళ్ళముందే వుంటుంది, మనకు తట్టిన భావం మాత్రం ఆ భాషలో ఎక్కడినుంచి వచ్చిందో మాత్రం ఎంత తరచినా అంతుచిక్కదు. ఈ కనికట్టు రహస్యం కనుక్కోబుద్ధవుతుంది. ఇంద్రజాలికుడు తన తిరగేసిన టోపీ లోంచి పావురాల్ని వదిలేయటం ఐపోయింది, అవి తపతపా రెక్కల చప్పుడుతో ఈకలు రాల్చుకుంటూ ఆకాశంవైపు ఎగిరిపోయాయి, మనసు వివశమై చప్పట్లు కొట్టేసింది, ప్రదర్శన ముగిసింది. అంతా వెళిపోయాకా, అక్కడ బోర్లా మిగిలిన టోపీలోకి మనం ఎంత తొంగిచూస్తే మాత్రం రహస్యమేం బోధపడుతుంది? నేను ఒంటరిగా వున్నపుడు వాక్యాల్ని బైటికి చదువుకునే సందర్భాలు ఇలా ఖాళీ టోపీని తిరగమరగేసి చూసే తంతు లాంటివే. నన్ను జల్లుమనేట్టు చేసిన ఆ భావం, కనిపిస్తున్న అక్షరాల్లో ఎక్కడుందా అని పదే పదే ఆ వాక్యాల్ని పైకి గట్టిగా చదువుతాను. మొదటిసారి పొందిన ఆనందాన్ని పదే పదే పొందాలన్న చేసుకోవాలన్న ఆశ కూడా అందులో వుంటుంది. (చదివిన ప్రతిసారికీ అంతకంతకూ తరుగుతూ ఈ ఆనందాన్ని పొందుతాను కూడా.) కానీ ఎన్నిసార్లు చదివినా అవే పదాలూ అవే వాక్యాలూ వినపడి పాతబడిపోతాయే గానీ, కనికట్టు వెనక గుట్టు మాత్రం అంతుపట్టదు. పాఠకులుగానే మిగిలిపోతే ఎప్పటికీ అంతుపట్టదేమో! ఎపుడో మనమూ రాయడం మొదలుపెట్టినపుడే, ప్రేరణ అనే నీలపు మంచు పూల తుఫాన్లో మన బుద్ధి దారి పోగొట్టుకున్నప్పుడే, ఆ గుట్టు తెలుస్తుంది. అప్పుడు కూడా తెలియడమనేది వుండదు, అనుభవానికొస్తుంది, అంతే. ఈ ఇంద్రజాల రహస్యం ఆ ఇంద్రజాలికులకే తెలియదు. చేసి చూపించగలరు. ఎలాగంటే చెప్పలేరు. సాహిత్యం మనకు అందించే ఆనందపు మూలాల్ని ఎన్ని కాగ్నిటివ్ సైన్సులొచ్చినా శాస్త్రీయంగా అర్థం చేసుకోలేం అనుకుంటాను. అర్థం చేసుకోగలిగినా అసలు పాయింట్ అర్థం చేసుకోవటం కాదనుకుంటాను.
ఇపుడు అసలు విషయం. ఈ మధ్య నా ఒంటరి పఠనాల్లోకి ఇంకొకర్ని ఆహ్వానించాను. కొన్నిసార్లు ఆత్మీయుల సమక్షంలో అయినా సరే అదేపనిగా గడపాలంటే ఏదో ఒక సాకు కావాలి. ఇలా పుస్తకాలు చదివి వినిపించటమనే సాకు మాకు దొరికింది. వేరేవాళ్ల దగ్గర యిలా ఏ సెల్ఫ్‌కాన్షస్‌నెస్సూ లేకుండా చదవగలగడం నాకు కొత్త. మరొకరి సమక్షంలో కూడా మన ఏకాంతాన్ని మనం ఆనందించగలిగేంతటి చనువు కొందరితో ఎన్నేళ్ల సాంగత్యంలోనూ ఏర్పడదు, మరి కొందరితో ఇట్టే ఏర్పడిపోతుంది. అది నాకు ఈ పఠనాల్లో కొత్త మజానిస్తోంది. అంతేకాదు, నేను ఆనందిస్తూ శ్రోతనీ ఆనందింపజేస్తూ చదవాలి గనుక, రచనల్ని మరింత లోతుగా చదవగలుగుతున్నాను.
మనుషుల మధ్య లౌక్యం పునాదిగా ఏర్పడే సుహృద్భావ వాతావరణం నా మనసుకి వాంతి తెప్పిస్తుంది. అందులో నేనెపుడూ భాగం కాలేను. అలాంటి సందర్భాల్లో spoilsport పదవి వద్దన్నా నన్ను వరిస్తుంది. ఈ పదవి నిర్వహించడం నాకెంతగా అలవాటైపోయిందంటే, ఎపుడన్నా స్వచ్ఛమైన సుహృద్భావ వీచికలు నా వైపు వీచినా, నేను ముక్కు మూసుకుని అనుమానంగా చూస్తుంటాను. మనిషి అలాంటి కరడుగట్టిన గుల్లలోకి ముడుచుకుపోయి వుండటం ఎక్కువ కాలం కొనసాగితే, ఇక తనంతట తాను బయటకి రావడం చాలా కష్టం. గుల్ల బద్దలుకొట్టి మనల్ని బయటకి లాగటానికి ఎక్కువమంది అవసరమూ లేదు. సత్యం పునాదిగా ఒక్క స్నేహమే అయినా చాలు. షోపనార్ గురించి నీషే అంటాడు: "He was an out and out solitary; there was not one really congenial friend to comfort him -- and between one and none there gapes, as always between something and nothing, an infinity." గుల్ల నుంచి బయటకు లాగబడ్డాకా కూడా మనం స్నేహంగా మసలుకోగలిగేది ఆ ఒక్క వ్యక్తితోనే కావచ్చు. కానీ నీషే అన్నట్టు ఒక్క స్నేహితుడుండటానికీ, ఎవరూ లేకపోవడానికీ మధ్య అనంతమైన అంతరం నోరుతెరిచి ఆవలిస్తుంది. ప్రపంచమంతా పరుషత్వంతో పోట్లు పొడిచినా, ఒక్క స్నేహపు ఊరట దగ్గరుంటే పెద్ద బాధ వుండదు. ఈ చిన్ని స్నేహ వృత్తంలో ఒక ప్రపంచాన్నే పుట్టించుకోవచ్చు. అక్కడ నువ్వు నీలా మసలు కోవచ్చు. ఇంతకీ నేనీ పేరా ఎందుకు రాస్తున్నాను? ఏమీ లేదు. నేను నాలా వున్నపుడు చాలా ధీమాగా వుండగలను. చాలా ధీమాగా పుస్తకాల్ని పైకి చదవగలను. వాటిల్లో కథనాన్నే కాదు, మధ్యలో వున్న సంభాషణల్ని కూడా ఆయా పాత్రల గొంతులు అనుకరిస్తూ చదివేయగలను. అలాగని నాకిపుడే తెలిసింది. వచనాన్ని ఏకాంతంలో ఎవరికి వారే చదుకోవాలి తప్ప పైకి చదవకూడదంటాడు హెన్రీ గ్రీన్:
Prose is not be read aloud but to oneself alone at night, and it is not quick as poetry but rather a gathering web of insinuations… Prose should be a long intimacy between strangers with no direct appeal to what both may have known. It should slowly appeal to feelings unexpressed, it should in the end draw tears out of the stone…
విశ్వనాథ ఉపమానాలు ఒక క్రమ పద్ధతిని అనుసరించి సాగుతాయి. ఆయన తెచ్చే పోలికలన్నీ కథలో ఆయా సన్నివేశాలతో సన్నిహితమైన సంబంధాన్ని కలిగివుంటాయి. ఉదాహరణకు శివాలయంలో జరిగే ఒక సన్నివేశంలో, శుక్లాష్టమి వెన్నెలకు తెచ్చిన ఉపమానాలన్నీ శివుని సంబంధించినవే:
శుక్లాష్టమి వెన్నెల శివజటాటవీ నటన్మందాకినీ నవస్మేర వీచీ రామణీయకము వోలె, అంబికా ప్రసన్నాపాంగరేఖా ప్రసారము వోలె, విఘ్ననాయకుని ఏకదంత సితచ్ఛటా స్వచ్ఛతంబోలె శైవమహాత్మ్యమై విరిసెను.
దేవదాసి అనే పాత్రని వర్ణించేటపుడు, ఉపమానాలన్నీ విష్టువుకు సంబంధించినవే వుంటాయి:
దాని తెల్లని పలువరుస సుదర్శనాయుధపు టంచులవలె పదునుపెట్టి నట్లుండెను. దాని చెవులు శ్రీకారములై పాంచజన్యము లట్లుండెను. దాని కన్నులు కమలములు. దాని నాసిక కౌమోదకి. దాని భ్రూయుగము శార్ఙము ద్విథా విభక్తమైనట్లుండెను. దాని మూర్తి వికుంఠమై మనోజ్ఞమయ్యెను. [కౌమోదకి = విష్ణువు గద; శార్ఙము = విష్ణువు విల్లు]
చలం "మ్యూజింగ్స్"లో ఇదివరకూ ప్రపంచం మీద కోపాన్నే ఎక్కువ చూసాను. ఇపుడు నిష్పలమైన బక్క కోపం చివరకు ఎకసెక్కపు హాస్యంలోకి పరిణితి చెందిన వైనాన్నీ గమనించి ఆస్వాదించగలుగుతున్నాను.
చాలామంది సముద్రం వొడ్డుకి ఎందుకు వొస్తారంటే, మార్పు కోసం. ఆఫీసు నించీ, వంటిళ్ల నించీ, నలుగురూ వస్తే యెవరన్నా తెలిసినవారిని కలుసుకోవచ్చుననీ, చల్లగాలిలో విశ్రాంతిగా కబుర్లు చెప్పుకోవచ్చుననీ — బైబిల్ని యింగ్లీషు కోసం చదివే వాళ్ల లాగు.
సౌందర్యం శృంగారం ఏమి వ్రాసినా, బూతూ, వ్యభిచారంగా పరిణమిస్తున్నాయి యీ క్షుద్ర విమర్శకులకి. ... పవిత్రంగా ఆధ్యాత్మికంగా, పరిణయంగా, అగ్నిసాక్షిగా, స్త్రీతో ఏం సంబంధం పెట్టుకుంటావు? విమర్శకుడా! చేతులూ, పెదిమలూ, తొడలూ పనిచెయ్యకుండా, ఎట్లా మోహిస్తావు, ప్రేమిస్తావు స్త్రీని. అదేదో ఆ రహస్యం కొంచెం చెబుదూ? నీరసంగా, ఏడుస్తో, తిడుతూ కళ్లు మూసుకుని, పాపకార్యం సాగిస్తున్నావా, మహామునీ! అనుభవించి పోతున్నారనా, ఆగ్రహం!
"మ్యూజింగ్స్"లోని కవిత్వాన్ని కూడా ఇపుడు మరింత దగ్గరకి తీసుకోగలుగుతున్నాను:
ఈ పక్షి పాట యెట్లా వూపుతోందో ఈ పరిసరాల్ని! ఈ కుర్చీలు కూడా ఆ పాటకి ప్రకంపిస్తున్నాయి. ఏనాడో, ఏ బర్మా అరణ్యాల్లోనో, టేకు మానులై వున్న రోజుల్లో తమ శాఖల మీద కూచుని పాటలతో రంజింపజేసిన పక్షుల రుతాలు జ్ఞాపకం రావడం లేదు కదా యీ కుర్చీలకి?
ఆ గడ్డి మధ్య ఒక్కటే యెర్రని పువ్వు గాలిలో ఊగుతూ అలసిన నా దృష్టిని ఆపి పలకరించింది. అప్పుడే క్రొత్తగా భూమిని బద్దలు చేసుకుని, ముఖాన్నెత్తి, ఎండనీ, చెట్లనీ, చూసి పకపక నవ్వుతో తను కూడా బతుకులోకి దూకాననే సంతోషంతో గంతులు వేసి ఆడుతోంది. ఈ బిడ్డను చూసి చుట్టూ వున్న ముసలమ్మ చెట్లు బోసి చిగుళ్లు బైట పెట్టి ఆనందిస్తున్నాయి.
December 1, 2010
ప్రేమాయణం
బాణం దూసి బంధాన్ని హరించిన కిరాతకమూ నేనే అయి,
ధూళిధూసరిత విగతజీవం చుట్టూ రెక్కలల్లారుస్తున్న నీ శోకానికి
చలించి కన్నీటి శ్లోకాన్ని స్ఖలించిన కారుణ్యమూ నేనే అయితే,
మిగిలిపోయిన ప్రియతమా, ఫలితం అనాథ ప్రేమాయణం.
.
March 2, 2010
Holi
face smeared pink & blue,
feels normal.
* * *
దారిలో ఇద్దరు పిడుగులు స్ప్రైట్ 250 ml బాటిళ్ళ నిండా రంగు నీళ్ళతో నన్ను అటకాయించినప్పుడు, చొక్కా పాడవుతుందన్న తక్షణ స్పందన నన్ను చురుగ్గా చూసేట్టు చేయకుంటే, వాళ్ళు బెరుగ్గా పక్కకు తొలిగేవాళ్ళు కాదు, రోజు ఆనందపు రంగునూ పులుముకునేది.
February 18, 2010
సెలవ
* * *
ఒక ప్రేమజంట. ఆమె మాటిమాటికీ అతని చూపు తన వైపు తిప్పుకోవాలని చూస్తుంది — మాటల్తో, భంగిమల్తో, అర్థం పర్థం లేని స్పర్శలతో.
అడపాదడపా చూపులు ప్రపంచం మీదికి మరల్చినా, అతనికీ తెలుసు, తాను ఆమె సాంగత్యపు వృత్తంలోనే వున్నాననీ, అందులోంచే బయటకు చూస్తున్నాననీను.
ప్రేమ మీ ఇద్దరు మాత్రమే మసలుకోవాల్సిన వృత్తం. ఆ వృత్తాన్ని సృష్టించలేనప్పుడే నీకు తెలియాలి, నువ్వు ప్రేమింపబడటం లేదని.
* * *
నాంపల్లి స్టేషన్‌లో లెక్కకందనన్ని పావురాలు. నువ్వు నుంచొని గంటలు తరబడి చూస్తుండిపోవచ్చు. ఒక పావురం మీదే దృష్టి నిలిపి అదసలు అంత గుంపులో ఏం చేస్తుందో గమనించడం బాగుంటుంది. నిలబడటానికి బహానా కావాలంటే నాలుగు గ్లాసుల చెరుకురసం తాగచ్చు.
July 29, 2009
Who's directing my dreams? David Lynch?
She winces, and muttering some blasphemy (for it is God she is muttering it at), goes back through the corridor to the kitchen. And so ends the dream.
Hey you, Freud, what are you hiding from? Come on out and face up the challenge!
:
July 27, 2009
ఇవాళ...

ఇక్కడ ఇంగ్లీషు సాహిత్యానికి సంబంధించిన అద్భుతమైన సంపదంతా మనకి అనుమతిలేని ఓ రెండస్తుల చీకటి కొట్టంలో వుంటుంది. అయితే, అడిగితే ఎలాగూ అనుమతి లేదంటారు కనుక, మనం అదను చూసి అక్రమంగా చొరబడిపోవచ్చు. ఈ పుస్తకాలు మన లాంటి వాళ్ళకి సంపదా గింపదా గానీ అక్కడెవడికి పట్టిందీ! కాబట్టి లోపల ఎంతసేపున్నా ఎవడూ వచ్చి చెక్ చేయడు. కానీ లోపల గబ్బిలాలు మాత్రమే అలవాటు పడగలిగే చీకటి వుంటుంది. ఇంకో సానుకూలత ఏంటంటే, మల్టీప్లెక్సుల్లో "స్కేరీ హౌసు"ల్లోలా ఇక్కడ డబ్బు పెట్టి భయం కొనుక్కోవాల్సిన పని లేదు; ఆ చీకటికీ, నీరవ నిశ్శబ్దానికీ ఉచితంగా భయం కలుగుతుంది. అందువల్ల, ఆ పుస్తక సంపద చూసి నోరెళ్ళబెట్టడమే తప్ప స్థిమితంగా చదువుకొనే వీలేమీ అక్కడ వుండదన్నమాట. కానీ అంత మంచి పుస్తకాలు చేతుల్లోకి తీస్కొని పేజీలు తిప్పడమూ ఓ అనుభవమే కదా. అందుకే ఓ రోజు లోపల చేరి మొత్తం రాక్‌లన్నీ తిరగదోడేసాను. ఆ పెళుసు పేజీలూ, ఆ సల్ఫర్ కంపూ, చేతుల మీదకి పాకేసే సిల్వర్‌ఫిష్‌లూ . . . దుమ్మంటే పడనివాడైతే చచ్చూరుకునేవాడు. పైగా అది ముసురు పట్టిన రోజు కావటంతో ప్రతీ పుస్తకం కిటికీ దగ్గర మసక వెలుతుర్లోకి తీసుకెళ్ళి చూడాల్సొచ్చేది. అయితేనేం, అప్పటి వరకూ ఊహల్లోనే తడిమిన కొన్ని పుస్తకాల్ని చేతుల్తో ముట్టుకున్నానన్న తృప్తి దక్కింది. ఆ తర్వాత చాలామార్లు పగటి కలలు కనేవాణ్ణి. వాటి ఇతివృత్తం అయితే దోపిడీ అయ్యేది లేకపోతే దొంగతనమయ్యేది. దోపిడీ అనుకుంటే, "కసీనో రాయల్"లో డానియెల్ క్రైగ్‌లాగా పెద్ద బుల్‌డోజర్‌తో లైబ్రరీ గోడల్ని పగలగొట్టుకుంటూ ఎంట్రీ ఇవ్వడం, నాకు అడ్డొచ్చిన ప్రభుత్వ ఉద్యోగులందర్నీ "టెర్మినేటర్-టూ"లో ఆర్నాల్డ్‌లాగా మెషీన్ గన్‌తో కాల్చిపారేయటం, నాకు అడ్డురాలేక భయపడి మూలనక్కి వున్న ఉద్యోగులందర్నీ బయటకీడ్చి వాళ్ల చేత పుస్తకాలన్నీ మోపించి, బయట పార్క్ చేసిన పెద్ద కంటెయినర్ ట్రక్కులో పేర్పించటం... ఇదీ సినేరియో. ఇలా కాక దొంగతనం అనుకుంటే, ఓ చీకటి అర్థరాత్రి బిగుతైన నల్లఫాంటూ నల్ల చొక్కా వేసుకుని, కళ్ళకి జోరో మాస్కు తొడుక్కుని, అందినన్ని పుస్తకాల్ని వీపునున్న "పుష్పక మూట"లో కుక్కేసి, అంతకుముందే గుండ్రంగా కళాత్మకంగా బద్దలుగొట్టిన గోడ కన్నంలోంచి పారిపోవడం... ఇలా అన్నమాట. ఒకవేళ ఈ రెంటిలో ఏదన్నా నేను నిజంగానే చేసున్నా, జీవితాంతం ఇసుమంత పశ్చాత్తాపం లేకుండా—పశ్చాత్తాపం మాటటుంచి, ఆ పుస్తకాలకో సార్థకత కల్పించానన్న సంతృప్తితో—బతికగలిగే వాణ్ణి. కానీ ఏంచేస్తాం! నా అన్ని పగటి కలల్లాగే వీటి పునాదులూ గాల్లో వున్నాయిగా.
ఇక, అందరికీ అనుమతి దొరికే మిగతా విభాగాల్లో వున్న ఆంగ్ల సాహిత్యం మటుకు చాలా వరకూ చచ్చు సరుకై వుంటుంది. కొన్నైతే వ్యక్తిగత గ్రంథాలయాల్లోంచీ చోటు చాలక తన్ని తరిమేస్తే ఇక్కడకొచ్చి చేరినవిలా అనిపిస్తాయి. మహా అయితే రెండు అల్మరాలుంటాయంతే. నేను ఈ విభాగంలోనే ఎక్కువ కూర్చునేవాణ్ణి. ఇక్కడ చాలా చదివాను. ఇప్పటికిప్పుడు గుర్తొచ్చినవి చెప్తాను: పేర్లు గుర్తు లేదు గానీ; ఎక్కువ కాఫ్కా, దాస్తొయెవ్‌స్కీ రచనల మీద విశ్లేషణలు చదివాను. అప్పటికి కొన్నాళ్ళ క్రితమే "సన్స్ అండ్ లవర్స్" చదివున్నాను కాబట్టి డి.హెచ్. లారెన్స్ గురించి కూడా చదివాను. పుష్కిన్ కథలు కొన్ని చదివాను. ఆంగ్ల సాహిత్యాన్ని గురించిన విజ్ఞానసర్వస్వాలు కూడా ఎక్కువ తిరగేసేవాణ్ణి. కొంతమంది జీవిత చరిత్రలు చదివాను (అయాన్‌రాండ్ మీద బురదజల్లుతూ ఎవరో ఆవిడ కుత్సితంగా రాసిన జీవిత చరిత్రొకటి గుర్తొస్తోంది). హెమింగ్వే, ఫిట్జ్‌గెరాల్డ్‌ల స్నేహం గురించి ఏదో పుస్తకం చదివాను. అస్తిత్వవాదం గురించి అక్కర్లేని చెత్త చాలా చదివాను. ఎందుకో నాటకాలు ఎక్కువ చదివాను. టెనెస్ విలియమ్స్ నాటకం "ద గ్లాస్ మెనేజరీ", శామ్యూల్ బెకెట్ నాటకం "క్రెప్స్ లాస్ట్ టేప్" (పూర్తిగా అర్థమయిందని చెప్పలేను), హెరాల్డ్ పింటర్ నాటకం "డంబ్ వెయిటర్" బాగా గుర్తున్నాయి. చెకోవ్ నాటకం "ద త్రీ సిస్టర్స్" సగమే చదవగలిగాను.
ఇక్కడ చదవడానికి చాలా ఏకాగ్రత కుదిరేది. రోడ్డు పక్కనే వున్నా, కిటికీలు తెరిచే వున్నా ట్రాఫిక్ హోరు ఏమాత్రం ఇబ్బంది పెట్టేది కాదు. గది నిలువునా ఓ పొడవాటి బల్ల నిజాం డైనింగ్ టేబులంత పెద్దగా వుండేది. దాని చుట్టూ కుర్చీల్లో కూర్చుని చదువరులు కాలం మరిచిపోయి అక్షరాలు భోంచేస్తుండేవారు. కొంతమందైతే కడుపు నిండిన మగతతో పుస్తకాలు బోర్లించి హాయిగా నిద్రపోయేవాళ్ళు కూడా. నేను మాత్రం, మెదడు మొద్దుబారినప్పుడు దిక్కులు చూడ్డానికి కాస్త విరామం తీసుకుంటూ, ఏదోకటి తిరగేస్తూనే వుండేవాణ్ణి. ఎందుకో అప్పట్లో నాకు ప్రతీ పుస్తకమూ చదివింది చదివినట్లు ఏ విశ్లేషణలూ తొక్కాతోలూ లేకుండా మనసుకు పట్టేసేది; నమ్మకంతో చదివేవాణ్ణి. ఆ శక్తి ఈ మధ్యన మెల్లమెల్లగా హరించుకుపోతూందనిపిస్తూంది. దరిమిలా నేను బ్లాగడం మొదలుపెట్టడం కూడా దీనికి కొంత కారణం అనిపిస్తుంది.
ఇవాళ వెళ్ళటం వెళ్ళటం ఈ విభాగంలోకే వెళ్ళాను. చోటు కాస్త మారింది. పాత పొడుగాటి బల్ల తీసేసి ఆ నిడివిలో నాలుగో అయిదో విడి బల్లలు వేసారు. నిజాని కివాళ చదవటానికన్నా పాత స్నేహితుణ్ణి ఓసారి పలకరిద్దామన్నట్టు వచ్చానంతే ఇక్కడికి. అయితే మనసూరుకోదుగా. చేయి పుస్తకాల్ని తడుముతూ పోయింది. వెన్ను మీద పేరు లేని పుస్తకాల్ని బయటకి లాగి తెరిచి పేర్లు చూసుకుంటూ పోయాను. నాకిలా చేయడమంటే చాలా ఇష్టం. ఎప్పుడన్నా పుస్తకాల కొట్టుకెళ్ళినా కూడా, నాక్కావాల్సిన పుస్తకం దొరికేసినా సరే, అక్కడున్న అరలన్నింటినీ ఓసారి గత్తరబిత్తర చేసిగానీ బయటకిరాను. (ఇంతేగాక పుస్తకాల షాపుల్లో నేను చేసే కంత్రీ పని మరొకటుంది. ఆ నెలకి కేటాయించిన నిధుల పరిధి మించిపోయినాక కూడా ఇంకా ఏవైనా పుస్తకాల మీద మనసు లాగిందనుకోండి, మళ్ళీ నెల వచ్చికొనేదాకా అవి ఎవరి కంటా పడకుండా మూల అరల్లోనో వెనక వరుసల్లోనో దాచేస్తాను.) ఎలాగూ వచ్చాం కాబట్టి కాసేపేదైనా చదువుదాం అనిపించడంతో, మరో పక్క ఆలస్యం కూడా అయిపోతుండటంతో, అరల్లో చేతుల అల్లరి ఆపి అప్పటికప్పుడు దొరికిన ఎరిక్ సీగల్ "ఓన్లీ లవ్" నవలని చేతిలోకి తీసుకున్నాను. వెనుక అట్ట మీద క్లుప్తంగా కథ రాసుంది. ఒక అమ్మాయి అబ్బాయీ ప్రేమించుకుంటారు. తర్వాత దూరమైపోతారు. వేరే పెళ్ళిళ్ళు చేసుకుంటారు. కానీ అబ్బాయికి ఆమె అంటే మమకారం (అచ్చ తెలుగులో చెప్పాలంటే "బెమ") పోదు. అతనిప్పుడు ఓ వైద్యునిగా పనిచేస్తుంటాడు. కొన్నేళ్ళు గడచిన తర్వాత పాత ప్రేయసి భర్త అతన్ని కలుస్తాడు. తన భార్యకు ప్రాణాంతకమైన వ్యాధి వుందనీ, నయం చేయమనీ కోరతాడు. ఆమె మళ్ళీ ఇతని జీవితంలోకి వస్తుంది. మామూలుగా వెనక అట్టల మీది ఇలాంటి సంక్షిప్త కథల్లో వుండే సుత్తి ఉత్కంటనే కలిగిస్తూ ఇక్కడితో ఆగిపోయింది. నేను దాన్ని తీసుకుని కుర్చీలో కూలబడ్డాను. చివరి మూడు అధ్యాయాలూ చిన్నవిగా కనిపించడంతో చదివేసాను. నేను చదివిన అధ్యాయాల్లో నాకు అందిన కథేమిటంటే: ఆమె వ్యాధి ముదిరిందనీ, కొన్నాళ్ళే బతుకుతుందనీ నిర్దారణ అయిపోతుంది. ఇద్దరూ కలిసి గతంలో ప్రేమలో వున్నప్పుడు చూసిన ఓ ఒపెరాకి వెళ్తారు. గతంతో కదిలించినంతగా అది ఇప్పుడు ఇద్దర్నీ కదిలించలేకపోతుంది. తర్వాత ఆమె అతన్ని ఇంటికి భోజనానికి పిలుస్తుంది. అక్కడ తనని స్వీకరించమని అడుగుతుంది. అతను తిరస్కరిస్తాడు. ఆమె మోహాతిశయంతో అతని మీద వాలి ముద్దు పెట్టుకుంటూండగా భర్త తలుపు తీసుకు వస్తాడు. గొడవ జరుగుతుంది. ఆ ఆవేశకావేశాల్లో ఆమెకు వ్యాధి తిరగబెడుతుంది. ఇద్దరూ ఆమెని హాస్పిటల్‌కు తీసుకువెళ్తారు. అక్కడామె మరణిస్తుంది. హాస్పిటల్ కారిడార్లో భర్త ప్రేమికునితో తన భార్య ఎప్పుడూ తననే కోరుకుందని సమర్థించుకోజూస్తాడు. ఈ వాదనంతా ఇప్పుడెందుకూ అని అడిగితే, ఆమె జీవితంలోనూ నాదే మరణంలోనూ నాదే అనేదో చెప్తాడు. చివరి అంకంలో ఈ ప్రేమికుడు ఇంటికి వెళ్ళి, తన పాత ప్రేయసి పునః రంగప్రవేశం కారణంగా తనకు దూరమైపోయిన భార్యని మళ్ళీ ఆత్మీయంగా దగ్గరకు తీసుకుంటాడు. కాస్త విషాదపు చేదు కలిసిన తియ్యని సుఖాంతం. నేను చదివిన కాసిని పేజీల్నీ బట్టి నవల చాలా వేగంగా చదివిస్తుందని అర్థమైంది. ఆ కాస్తా చదవటానికి పావుగంట కూడా పట్టలేదు. కాకపోతే కథే, ఏదో హాలీవుడ్ మెలోడ్రామా లాగా అనిపించింది; కథనాన్ని ముందుకు నడిపేది ప్రధానంగా సంభాషణలే (నాకు నచ్చని పద్ధతి). చదివింది చివరి కాస్తే అయినా మొత్తం పుస్తకం చదివేసినట్టనిపించింది. పుస్తకం అరలో పెట్టేయటానికెళ్తూ పేజీలు తిరగేస్తుంటే, ప్రారంభంలో నవలకు ఎఫిగ్రాఫ్‌గా ఫ్లాబర్ వాక్యం ఒకటి కనిపించింది. నచ్చింది: The better part of life is spent saying: "it's too early", and then "it's too late". అప్పటికే చీకటి పడిపోతుండటంతో, లైబ్రరీకి మళ్ళీ కలుద్దామని వీడ్కోలు చెప్పేసి, బయట పడ్డాను. కథ కంచికి, నేను నా గదికి. ఆ తర్వాత పడుకోబోయే ముందు, వేళ్ళు కాస్త దురద పుడితే, ఇదిగో వాటినిలా కీబోర్డు మీద రాపాడించానన్నమాట.
ఇప్పుడిప్పుడే అనిపిస్తుంది: ఆ ముసురుపట్టిన రోజు చూసిన పుస్తక సంచయపు దృశ్యం నా మనసులో అలానే వుండిపోయిందని; బహుశా దాంతో పోటీ పడాలనే, చదివినా చదవకపోయినా, నా గది అల్మరాల్ని పుస్తకాల్తో నింపేస్తున్నానేమోనని.
:
December 14, 2008
ఒక సాయంత్రం
November 10, 2008
రోడ్డు మీద కోక్ టిన్నుని లాగి పెట్టి తన్నడంలో exhilaration
బహుశా ఆ దిగులంతా ఇంకా ఏ దారో నిశ్చయించుకోలేకపోవడం వల్ల వచ్చిన దిగులేమో; రెండుగా చీలిపోయిన రోడ్డు ముందు నిలబడి, ఒక దారిలో పోతే మరోదారిలోని అందాలు కోల్పోతానేమో అని బాధ పడే వాడికి కలిగే దిగులు లాంటిదేమో. "సిటీ స్లికర్స్'' అని చాన్నాళ్ళ క్రితం చూసిన సినిమా గుర్తొస్తోంది. అందులో బిల్లీ క్రిస్టల్ న్యూయార్క్ నగరంలో, నచ్చని ఉద్యోగంలో, కలతల సంసారంతో యాంత్రికంగా జీవితాన్ని గడిపేస్తుంటాడు. అతని నలభయ్యో పుట్టిన రోజుకి బహుమతిగా అతని ఇద్దరి స్నేహితులూ ఒక విహార యాత్ర ప్లాన్ చేస్తారు. వాళ్ళిద్దరూ కూడా బిల్లీలాగే మిడ్‌లైఫ్ క్రైసిస్‌తో బాధపడుతూంటారు. ఆ యాత్ర ప్రకారం యాత్రికులందరూ కొన్నాళ్ళ పాటు కౌబాయ్స్‌లా ఆవులు మేపుతూ గడపాలి. (నాకు సరిగా గుర్తు లేదు; అంతే అనుకుంటా.) మొదట ముగ్గురూ ఇక్కడ కుదురుకోలేకపోతారు. కాని నెమ్మదిగా నెమ్మదిగా ఈ క్యూబికల్సూ, కాన్ఫరెన్సులూ లేని జీవితం వాళ్ళకు నచ్చటం మొదలౌతుంది. అక్కడ వీళ్ళకి ఒక ముసలి వాడైన కౌబాయ్ తారసపడతాడు. బిల్లీ క్రిస్టల్‌కి అతను బాగా నచ్చుతాడు. జీవితం పట్ల తనలో లేని నిబ్బరం అతనిలో చూస్తాడు. ఒక సన్నివేశంలో ఇద్దరూ కౌబాయ్ వేషాల్లో ప్రక్కన ప్రక్కన గుర్రాల మీద వెళ్తూంటారు. హఠాత్తుగా ఆ కౌబాయ్ బిల్లీ వైపు తిరిగి "నీకు జీవిత రహస్యం ఏంటో తెలుసా?'' అంటాడు.
బిల్లీ చాలా ఉద్విగ్నతతో "ఏమిటి!?'' అని అడుగుతాడు.
కౌబాయ్ నిశ్శబ్దంగా తన చూపుడు వేలు ఎత్తి చూపిస్తాడు.
బిల్లీ: (అర్థం కానట్టూ మొహం పెట్టి) ఏమిటి, నీ వేలా?
కౌబాయ్: ఒకే విషయం . . . కేవలం ఒకే విషయం . . . దానికి బద్దుడవై ఉండిపో. జీవితం సులభమైపోతుంది.
బిల్లీ: అది సరే . . . కాని ఆ ఒక్క విషయమూ ఏమిటి?
కౌబాయ్: అదేంటో నువ్వే తేల్చుకోవాలి.
-- మనదీ ఇంచుమించు ఇదే బాధ. ఇంకా ఆ ఒక్కటీ ఏమిటన్నది నిర్ధుష్టంగా తేలడంలేదు. ఒక వేళ తేలినా, ఆ దారినే గుడ్డిగా నమ్మేసి "ఇదే జీవితం'' అని నిశ్చింతగా వెళిపోగలమా. అలా వెళిపోయినా ఆ దారికి సమాంతరంగా లక్షా తొంభై మార్గాలు ఊరిస్తూంటే మళ్ళా ఏదో కోల్పోయామనిపించదా. కాని ఏదో ఒకటి పట్టుకోక తప్పదని మాత్రం తెలుసు. చార్లీ కఫ్‌మన్ 'అడాప్టేషన్' సినిమాలో ఓ పాత్ర అంటుంది:
"There are too many ideas and things and people. Too many directions to go. I was starting to think that the reason it matters to care so passionately about something is that it whittles the world down to a more manageable size."
--కాబట్టి ఏదో ఒక దాన్ని పట్టుకోకపోతే ఈ బృహత్ ప్రపంచం మన మతి పోగొట్టేస్తుంది. అయినా నిన్న మొన్నటి దాకా నాకో పట్టుగొమ్మ ఉందనే అనుకున్నాను. చాలా అందమైన పట్టుగొమ్మ అది. మానవ అస్తిత్వ సమస్యకు అదే ఒక్కగానొక్క పరిష్కారమని నాకు ఎరిక్‌ఫ్రామ్ చెప్పక ముందే తెలుసు. దాని పేరు ప్రేమ. ఎంత నిజమో కదా. జీవితాన్ని అర్థవంతం చేసుకోవాలంటే ప్రేమించాలి. అంతే, మరో దారి లేదు. ఈ ప్రేమ అనేది లేకపోతే మనిషిగా ఈ భూమ్మీద మన ఉనికిని భరించడం చాలా కష్టమై ఉండేది. స్నేహితులో, ప్రేయసీ ప్రియులో, భార్య భర్తలో, తండ్రీ కొడుకులో, అన్నా చెల్లెళ్ళో, సాటి మనుషులో . . . ఇలా బంధాలేవైనా మనందరి మధ్య ఈ ప్రేమ అనే భావన లేకపోతే మానవ అస్తిత్వం భరించలేనంత దుర్భరమైపోయి ఉండేది. అసలు మనుషులకు ఇంత అర్థం లేని అస్తిత్వాన్ని అంటగట్టినందుకు నష్టపరిహారంగానే ఈ ప్రేమను ఇచ్చాడేమో దేవుడు. అయితే ఇక్కడో చిన్న ఇబ్బంది ఉంది. ఎరిక్‌ఫ్రామ్ ఈ ప్రేమను మనుషులకు మాత్రమే ఉద్దేశించమన్నాడో లేదో నాకు తెలియదు కానీ, మనుషులకు మాత్రమే ఉద్దేశిస్తే కొన్ని సమస్యలుంటాయి. మనుషులతో ప్రేమ షరతులతో కూడి ఉంటుంది. మనం మథర్ థెరిసాలం కాదు గనుక కొన్ని షరతులతో మాత్రమే అవతలి వారికి ప్రేమను ఇవ్వగలం. కొన్ని షరతులతో మాత్రమే అవతలి వారి నుండి ప్రేమను పొందగలం. అలాగాక బేషరతుగా ప్రేమ కావాలనుకుంటే మాత్రం ఈ వ్యవహారంలోంచి మనుషుల్ని పక్కన పెట్టేయక తప్పదు. అక్కడే నా పట్టుగొమ్మ విరిగిపోయింది. నాకు మరో ఆసరా కావాల్సి వచ్చింది. బహుశా ఆ ఒక్కటీ ఏమిటన్నది నా కిప్పుడిప్పుడే నిర్ధుష్టంగా స్పష్టమవుతుందేమో. ఏ షరతులూ లేని ప్రేమ, నా వరకూ, కళతోనే సాధ్యమవుతుంది. అది ఎంత ఇచ్చినా తీసుకుంటుంది; అంతకు అంత తిరిగి ఇస్తుంది. అది ప్రేమ మాత్రమే అడుగుతుంది. ప్రేమను మాత్రమే ఇస్తుంది.
ఇలా నా ఆలోచనల్ని ఫోర్త్‌ఫేజ్ నుండి సైబర్ టవర్స్ దాకా నడిపించాకా అర్థమైంది: మన ఆనందాలకు మనుషుల్ని ఆధారభూతాలుగా నిలుపుకోవడం ఎంత నిష్పలమో, దుఃఖదాయకమో, కొండొకచో ప్రమాదకరమో; నాలోనే ఉండి, నేను అనుమతి ఇస్తే చాలు నన్ను మొత్తంగా కమ్మేద్దామని ఎదురుచూస్తున్న ఆనందాన్ని కాదని బయట దేబిరించడం ఎంత వెర్రితనమో. చౌరస్తా దగ్గర కూడా పెద్దగా జనం లేరు. నియాన్ లైట్ల వెలుగులో సన్నగా మంచు కురవడం కనిపిస్తోంది. ఏమో అది మంచో, దుమ్ము కణాలో . . . ఇక్కడ దేన్నీ నమ్మలేం. ఓ మూల చాయ్ దుకాణం ఇంకా తెరిచే ఉంది. ఎందుకో అలవాటు లేకపోయినా తాగాలనిపించింది. అర్థం పర్థం లేకుండా ముప్పిరిగొంటున్న ఆనందాన్ని నాతో నేను సెలబ్రేట్ చేసుకోవాలనిపించింది. చాయ్ తాగి వెనక్కి నడిచాను. కొన్నిసార్లు, మనం అస్సలు సిద్ధంగా లేనపుడు, ఉధృతమైన ఆనందం చెప్పా పెట్టకుండా దాడి చేస్తుంది. మన ఉనికికి అతీతమైన ఆనందమది. ఆ ఆనందానికి మన శరీరం సరిపోదు. బద్దలైపోతామనిపిస్తుంది. వెన్నులోంచి మొదలై వళ్ళంతా జలదరించిపోతుంది. పిచ్చిగంతులేయాలనిపిస్తుంది. అదృష్టవశాత్తూ ఆ ఖాళీ రోడ్డు మీద నేను పరిగెత్తినా, పిచ్చి గంతులేస్తూ, పిచ్చి పాటలు పాడినా ఎవ్వరూ పట్టించుకునే వాళ్ళు లేరు. చందమామ మనోడే. అర్థం చేసుకున్నట్టు చల్లగా నవ్వుతున్నాడు.
.
October 26, 2008
ప్రిమెచ్యూర్ నొస్టాల్జియా
మామూలుగా అయితే నాకేదన్నా బాధ కలిగితే చౌదరిగాడి సహాయం తీసుకుంటాను. అలాగని వాడితో నా బాధలేం చెప్పేయను; వాడి మాటలు (ఇంకా కాస్త ప్రేమగా చెప్పాలంటే "వాగుడు'') వింటానంతే; బాధంతా హుష్‌కాకీ అయిపోతుంది. ఇప్పుడు వాడిక్కడ లేడు. కాబట్టి అక్షరాలే దిక్కు. సరే, ఏం రాయాలి? పోయి పోయి కష్ట పెట్టే విషయాన్ని గురించే రాస్తే ఆరిపోతున్న కుంపటిని పుల్లెట్టి మరీ కెలికినట్టుంటుంది. మళ్ళీ బాధ రాజుకుంటుంది. కాబట్టి ససేమిరా దాని జోలికి పోకూడదు. నాకో అమ్మాయి చెప్పింది: మనల్నేదన్నా బాధ పెడ్తూంటే మనం అంతకన్నా పెద్ద బాధ సృష్టించు కోవాలంట. పెద్ద గీత ముందు చిన్న గీతలాగా మొదటి బాధ తగ్గిపోతుందట. ఈ లాజిక్కేంటో నాకు అర్థం కాలేదు. అయినా ఇప్పుడంతకన్నా మరో దారి కనిపించడం లేదు. అందుకే, ఉత్త పుణ్యానికి ఇప్పుడో పెద్ద బాధ నా నెత్తిన వేసుకుందామనుకుంటున్నాను. బాధంటే ఆషామాషీ బాధ కాదు, "మన సంస్కృతి'' గురించిన బాధ.
No, not for the heck of it. ఏదో ఒకటి నెత్తిన వేసుకోవాలి కదా అని వేసుకుంటున్నది కాదు. నిజంగా ఇది నన్ను కొద్ది రోజులుగా బాధ పెడతోంది. అంటే మరీ మొదటి బాధంత ఉధృతమైంది, వ్యక్తిగతమైందీ కాదు; గుండెల్లో ఏదో అగ్నిపర్వతం ఆగి ఆగి లావా కక్కుతున్నట్టనిపించే బాపతు భారీ బాధ కాదు. ఇది వేరే రకం. ఈ బాపతు బాధలు మనిషిని ఉక్కిరి బిక్కిరి చేసేయవు. ఆలోచనల పొలిమేరల్లోనే తచ్చాడుతూ ఆదమరిచి ఉన్నప్పుడు చిలిపిగా ఓ పోటు పొడిచి వెళిపోతుంటాయి. అసలు "మన సంస్కృతి''కి ఇప్పుడు నన్ను పోటు పొడవాల్సినంత అవసరమేమొచ్చింది? నాకీ మధ్యన నా బ్లాగు "ఎబౌట్ మీ''లో చేర్చడానికి రోజుకొక విశేషణం తడుతోంది. ఇప్పుడే మరొకటి తట్టింది. దానికి "hopelessly neurotic'' అని కూడా చేర్చాలి. అందుకే ఇలా పిసరంత విషయాల్ని కూడా పీక్కుని లాక్కుని కొండంత చేసుకుంటుంటాను. ఇప్పుడు నా బాధకి వెతగ్గా వెతగ్గా మూడు మూలాలు కనిపిస్తున్నాయి: 1) అట్లతద్ది 2) నా కొలీగ్‌తో సంభాషణ 3) తిలక్ కవిత. అయితే నా బాధకు నేనీ మూలాలపై పూర్తి దోషం ఆరోపించలేను. అసలు ఈ మూడింటికీ పరస్పర సంబంధం ఉందో లేదో కూడా తెలీదు. బాధ వీటి వల్ల కాదు. ఇవి నాలో రేకెత్తించిన ఆలోచనల వల్ల. ఇప్పుడు నేనా ఆలోచనల్ని పదాల్లోకి జల్లెడ పట్టొచ్చు, పట్టలేకపోవచ్చు; కానీ ప్రయత్నమైతే చేయాలనుకుంటున్నాను.
కొన్ని రోజుల క్రితం అట్లతద్ది పండగ జరిగింది. ఎక్కడ జరిగిందని గట్టిగా అడిగితే, బహుశా, కేలెండర్లలోనే జరిగిందని సమాధానం చెప్పాలేమో. ఆ రోజు అట్లతద్ది అని నా క్కూడా తెలీదు. మా కొలీగ్ ఒకావిడ చెప్తే తెలిసింది. రాత్రి ఫోన్ చేసినపుడు మళ్ళా అమ్మ గుర్తు చేసింది. అమ్మమ్మ యధావిధిగా అట్లు, పానకం తయారు చేసిందట. పానకం అన్న మాట చెవిన పడగానే తియ్యగా నోరూరింది. కానీ ఆ "అట్లతద్ది'' అన్న పదం ఇక్కడ ఈ నగరంలో దారుణంగా విలువ కోల్పోయినట్టనిపించింది. చాలా పరాయి పదంలా ధ్వనించింది. పొలంగట్లపై చెట్టాపట్టాలేసుకు తిరిగిన బాల్య స్నేహితుణ్ణి సంవత్సరాల విరామం తర్వాత, హఠాత్తుగా, స్కైస్క్రేపర్ల మధ్య చూస్తే ఎలా ఉంటుంది? వాడెంత పరాయిగా అనిపిస్తాడు? — కానీ బహుశా ఇది అర్థం పర్థం లేని పోలిక. మనిషి వేరు, పదం వేరు. మనిషి స్థల కాలాల స్వభావాన్ని (జ్ఞాపకాల్లో తప్ప) తనలో నిలుపుకోలేడు. అంతా వెనక వదిలేయాల్సిందే. ఏ స్థలానికి ఆ స్థలం, ఏ కాలానికి ఆ కాలం అతణ్ణి లొంగదీస్సుకుంటుంది. లొంగిపోవాలి కూడా, తప్పదు. కాదని మొండికేస్తే ఎబ్బెట్టుగా ఉంటుంది—స్టార్ హోటల్ రెస్టారెంట్‌లో చేత్తో తినడం లాగా, ఫేడెడ్ జీన్సుల మధ్య బెల్‌బాటమ్ లాగా. కానీ "అట్లతద్ది'' అనేది ఓ పదమే కదా. దానికేం తెలుసు పాపం స్థల కాలాల్తో పాటూ పరిణామం చెందాలని. అందుకే, దేనికీ లొంగని మొడితనంతో, నాలో కొన్ని బాల్యపు జ్ఞాపకాల్ని కెలికి వదిలేసింది.
అట్లతద్ది అంటే ఆలమూరులో కొన్ని వేకువ జాము ఉదయాలు గుర్తొస్తాయి నాకు. బయట ఆడవాళ్ళ కేరింతల వల్ల పెందలాడే మెలకువ వచ్చేసేది. ఆ కేరింతల్లో అమ్మ గొంతూ ఉండేది. అమ్మ చీకటి పోకుండానే లేచి చుట్టు ప్రక్కల ఆడవాళ్ళతో కలిసి ఏవో ఆటలాడేది. కానీ వాళ్ళు ఆడే ఆటలేంటో నాకు అప్పుడూ తెలీదు, ఇప్పుడూ తెలీదు. ఎందుకంటే, మేం లేచేటప్పటికే ఆ ఆటలు దాదాపు ముగింపుకొచ్చేసేవి. ఒకవేళ తొందరగానే లేచినా అమ్మ మమ్మల్ని ఆ ఆటల్లో చేరనిచ్చేది కాదు. ఆడవాళ్ళు కొన్ని విషయాల్లో మగవాళ్ళని ఊరికే బయటకు నెట్టేస్తుంటారు; బహుశా ఇది అలాంటి ఓ అర్థం పర్థం లేని విషయమనుకుంటా. అయితే అమ్మ అలా చిన్నపిల్లలా ఆడుకోవడం భలే ఉండేది.
అట్లతద్దికి మరో విశేషం ఉయ్యాళ్ళు. ఆలమూరు మధ్యలో ఒక చెరువుండేది. చెరువు చాలా పెద్దది. చెరువుకు తూర్పు దిక్కున మా "చిన్నబడి'', దాని ప్రక్క ఓ రావిచెట్టు; పడమట దిక్కున మొక్కల్తో, తుప్పల్తో, కొబ్బరి చెట్లతో, మధ్య మధ్య పాముల పుట్టల్తో నిండిన ఖాళీ ప్రదేశం; ఉత్తరాన సంతోషిమాత గుడి, చిన్న పార్కు; దక్షిణాన ఊరివాళ్ళ తాటాకు గుడిసెలు, మట్టిగోడల పెంకుటిళ్ళు ఉండేవి. అట్లతద్దికి కొన్ని రోజుల ముందు నుంచే మా బడి పక్కన ఉన్న రావి చెట్టుకు పండగ కళ వచ్చేసేది; అట్లతద్ది ఉయ్యాళ్ళు కట్టేది దానికే. ఆ చెట్టు విశాలమైన ఖాళీ స్థలంలో, మొత్తం ఆకాశాన్ని కప్పేస్తూ చాలా పెద్దదిగా ఉండేది. దాని కొమ్మలకి బలమైన తాళ్ళతో ఉయ్యాళ్ళు కట్టేవారు. అవి చాలా పొడవైన ఉయ్యాళ్ళు. వాటిలో ఊగడం ఆడవాళ్ళ వంతైతే, వాటిని ఊపడం మగవాళ్ళ వంతు. ఉయ్యాల ఊపడానికి ఓ పద్ధతి ఉండేది. ఆ ఉయ్యాల పీటకి కట్టి ఓ పొడవాటి తాడు క్రిందకు వేలాడుతూండేది. ఊపేవాళ్ళు తమ తలల మీంచి ఉయ్యాల వెనక్కి పోగానే, ఆ తాడుని రెండు చేతుల్తో దొరక పుచ్చుకుని, ఉయ్యాల ఉధృతంతో పాటూ గాల్లో కొంత పైకి లేచి, మళ్ళా క్రిందకు బలంగా గుంజేవారు. ఈ గుంజుడు ఎంత బలంగా ఉండేదంటే, కొమ్మని కేంద్ర బిందువుగా చేసుకుని ఉయ్యాల ఓ భారీ లోలకంలా ఇంచుమించు 180 డిగ్రీల కోణంలో ఊగేది. అయితే ఇక్కడో ప్రమాదం ఉంది. ఉయ్యాల కడ కంటా సాగినపుడు ఊగేవాళ్ళు సరిగ్గా చెరువు మధ్యకొస్తారు. ఏ మాత్రం పట్టు జారినా చెరువులోకెళ్ళి పడతాం. కానీ అదెవర్నీ భయపెట్టేది కాదు. నిజానికి ఆ ప్రమాద సూచన ఉయ్యాల ఊగడంలో కాస్త సాహసపు ఎలిమెంట్‌ని కూడా జత చేసి ఆ అనుభవాన్ని మరింత పసందుగా మార్చేదనుకుంటా. పరికిణీవోణీ లేసుకున్న ఆడవాళ్ళు భయం బిగబట్టిన మొహాల్తో ఉయ్యాల ఊగుతుంటే, వాళ్ళ చేత ఎలాగైనా వెర్రికేకలు పెట్టించాలన్న ఉత్సాహంతో అబ్బాయిలు మరింత రెచ్చిపోయి ఊపేవారు. అయితే అమ్మాయిలు వెర్రి కేకలు పెట్టడంలో కూడా ఏదో ముచ్చటైన ఆడతనాన్ని చూపించేవారు. సాధారణంగా అబ్బాయిలెవ్వరూ ఉయ్యాల ఊగేవారు కాదు. అప్పటికి మేమింకా పదేళ్ళలోపు వాళ్ళం కాబట్టి మాకు మినహాయింపు నిచ్చారనుకుంటా. నేను ఎప్పుడూ ఒక్కణ్ణీ ఊగలేదు. మొదటిసారి నా పైతరగతి వాడెవడో నన్ను వళ్ళో కూర్చోపెట్టుకోవడం గుర్తుంది. ఇద్దరం ఎదురుబొదురుగా కావలించుకుని పీట మీద కూర్చున్నాం. ఊపడం మొదలుపెట్టారు. మొదట కాసేపు మాత్రమే పరిసరాల అవగాహన ఉంది. కాసేపు మాత్రమే క్రింద దూరమై దగ్గరవుతున్న భూమిని కళ్ళు తెరిచి చూడగలిగాం. తర్వాత వాణ్ణి నేనూ, నన్ను వాడూ కరిచి పట్టుకుని కళ్ళు మూసేసుకున్నాం. వడి ఎంతగా పెరిగిపోయిందంటే, ఇంకాస్త పెరిగితే మా ఉయ్యాల వెళ్ళిందారిన మళ్ళీ వెనక్కి రాకుండా పైకిపోయి ఆ కొమ్మకి గుండ్రంగా లుంగలు చుట్టేసుకుంటుందేమోనని భయమేసింది. చెవుల్ని ఝమ్మని ఒరుసుకుపోయేగాలి, రావి ఆకుల గలగలలు, భూమ్మీద దగ్గరవుతూ దూరమవుతూ వినిపిస్తున్న జనం కోలాహలం . . . ఉయ్యాల ఆగేకనే జారిపోయిన గుండె తిరిగి యధాస్థితికి వచ్చి చేరేది. ఉయ్యాల దిగిన కాసేపటి వరకూ భూమి కూడా ఉయ్యాలూగుతున్నట్టు అనిపించేది. ఈ సంబరం చల్లారేకా ఇంటికి వెళ్తే బెల్లం తీపి, మిరియాల ఘాటు కలిసిన రుచితో పానకం, అందులో ముంచుకుని తినడానికి బోలెడన్ని అట్లు. ఈ సంరంభం అంతా చూస్తే, అట్లతద్ది ఏడాదిలో వచ్చే ఏ పండక్కీ తీసిపోదనిపించేది. అట్లతద్దనే కాదు; నాగుల చవితి, సుబ్రహ్మణ్యషష్టి, రథ సప్తమి, శివరాత్రి . . . ఇలా ఇప్పుడు కేవలం కేలండర్‌కి మాత్రమే పరిమితమైపోతున్న చాలా పండగలు, ఆ వూళ్ళో నా చిన్నతనంలో చాలా ఘనంగా జరిగేవి. ప్రతీ పండగకీ ఏదో ఒక అందమైన తంతు ఉండేది. ఊరంతా అందులో మునిగి తేలేది.
నాగుల చవితికి పాముల పుట్టల్లో పాలు పోసేవారు. పాముల పుట్టలు నేనిందాక చెప్పిన చెరువుకే ఆవలిగట్టున ఉండేవి. తుప్పలు, పిచ్చిమొక్కల మధ్య ఉండే వాటి దగ్గరకు కాలిబాటమ్మటా నడుస్తూ వెళ్ళాలి. పొద్దున్నే ఆడవాళ్ళు కొత్త బట్టల్తో, మెడ క్రింద గంధపు పూతల్తో, పండగ కళ నిండిన మొహాల్తో, చెంబుల్లో పాలు తీసుకుని వచ్చేవారు. పుట్ట కన్నాల్లో కొంతమంది పాలుపోసేవారు, కొంతమంది గుడ్లు జారవిడిచేవారు. వాళ్ళలా గుడ్లు వేసి వెళ్ళగానే—కూర వండుకోవటానికి అనుకుంటా—కొంతమంది కుర్రాళ్ళు కన్నాల్లో చేతులు పెట్టి గుడ్లు బయటకు తీసి పట్టుకెళిపోయేవారు. ఆ పుట్టల్లో పాములుండటం నేను ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడింకో జ్ఞాపకం రాజుకుంటోంది. ఈ పుట్టల దగ్గరకు వెళ్ళే దారిలోనే నేను మొట్ట మొదటి సారి అత్తిపత్తి ఆకుల్ని చూసింది. ముట్టుకోగానే భలే ముడుచుకుపోయేవి. అప్పుడు నా కూడా ఎవరున్నారో గుర్తులేదు గానీ, ఓ రోజు మధ్యహ్నమంతా కూర్చుని ఆ దారిలో ఉన్న అత్తిపత్తి మొక్కలన్నింటినీ ముడుచుకుపోయేలా చేసాం.
సుబ్రహ్మణ్య షష్టి ఆలమూరులో కన్నా తాతయ్య వాళ్ళ ఊరు అంగరలో బాగా జరిగేది. ముఖ్యంగా తీర్థం చాలా ఘనంగా జరిగేది. గుడి దరిదాపుల్లో ఉన్న వీథులన్నీ కళ్ళకింపైన సందడితో కళకళలాడేవి. బుడగలు, వేణువులు, కమాను వాయిద్యాలు, రంగురంగుల ప్లాస్టిక్ కళ్ళ జోళ్ళు, బుల్లి తుపాకులు, బుల్లి కార్లు, బుల్లి బయోస్కోపులు, దేవుళ్ళ పటాలు, విగ్రహాలు, ఇలా ఎటుచూడు రంగులే! వీటి మధ్య ఖర్జూరం, జీళ్ళ కొట్లు తప్పనిసరిగా ఉండేవి. జీళ్ళ కొట్లంటే గుర్తొస్తోంది. ఏదో బేరమాడటానికన్నట్టూ కొట్టు ముందుకెళ్ళే వాళ్ళం. కొట్టు ముందు బల్ల మీద మా తలంత ఎత్తులో జీళ్ళు గుట్టలుగా పోసి ఉండేవి. కొట్టువాడు మేకు కేసి జీడి పాకం సాగదీసే పనిలో పరాకుగా ఉండటం చూసి, చేతికందినన్ని జీళ్ళు నొక్కేసి జేబులో వేస్సుకునేవాళ్ళం. జేబులో డబ్బులున్నా సరే, కొనే తాహతున్నా సరే, ఇలాంటివేవో చేయకపోతే మా తీర్థ విహారానికి సార్థకత లభించేది కాదు. ఎందుకంటే, జీళ్ళ కన్నా ముఖ్యంగా మాక్కావల్సింది దొంగతనంలోని సాహసపు రుచి. ఈ తీర్థం జరిగినన్నాళ్ళూ ఊరి స్వభావమే మారిపోయేది. ఊరు కూడా రక్త మాంసాలు, జవజీవాలు ఉన్న సజీవాంశలా కనిపించేది. పండగలో మాతో పాటూ ఊరు కూడా పాల్గొన్నట్టనిపించేది.
ఇక రథ సప్తమి. రథ యాత్రకి ఓ రెండు వారాల ముందే రథసప్తమినాడు జనార్దన స్వామి గుడి ఎదుట పెద్ద గోడౌన్‌లో ఉంచిన రథాన్ని బయటకు తీసేవారు. ఆలమూరు జనార్దన స్వామి రథం చాలా పెద్దది. రథ యాత్రప్పుడు అడ్డం రాకుండా కరెంటు తీగల్ని కూడా కత్తిరించేవారు. అది గోడౌన్లో ఉన్న సంవత్సర కాలమూ దాంట్లో పావురాలే నివాసం ఉండేవి. దాంతో బయటకు తీసేసరికి రథమంతా వాటి రెట్టల్తో నిండిపోయి ఉండేది. బయటకు తీసి శుభ్రంగా కడిగి సిద్ధం చేసేవారు. రథం అలా బయట ఉన్న రోజులంతా బడి అయిపోయిన తర్వాత పిల్లలందరం అక్కడికే చేరేవాళ్ళం. రథమెక్కి ఆడుకునే వాళ్ళం. రథం మొత్తం ఐదంతస్థులుగా ఉండేది. క్రింద నుండి పైకి పోయే కొలదీ అంతస్తుల ఎత్తు తగ్గేది. పెద్ద వాళ్ళు పై అంతస్తుల్లోకి రావలంటే పాక్కుంటూ రావాల్సిందే. చిన్న వాళ్ళం కాబట్టి సులభంగా జొరబడిపోయి ఆడుకునే వాళ్ళం. దొంగ - పోలీసు లాంటి ఆటలు ఆడటానికి అది భలే చోటు. ఏ అంతస్తులో దాక్కున్నామో తెలుసుకోవడానికి పోలీసు చాలా కష్టపడాలి. తెలుసుకున్నా ముట్టుకోవడం కష్టమే. ఆ రథం నిర్మాణం అంతా ఓ labyrinth లా ఉండేది.
ఇక శివరాత్రికైతే శివాలయం దగ్గర మరో సందడి: దేవాలయం ఆవరణలో "భక్త జన సందోహాన్ని'' ఉద్దేశించి మైకు చేసే హడావిడి; సీతాకోకచిలకలు బారులు తీరినట్టూ చంచలమైన వరుసలో పరికిణీవోణీలు, పంజాబీలు, చీరలు; కర్పూరం, అగరబత్తుల వాసన; కొబ్బరికాయలు పెఠేల్మని చిట్లుతున్న చప్పుడు; తల మీద శఠగోపం మెత్తని స్పర్శ, గర్భగుడి ఎదుటనున్న నంది నెత్తి మీద చూపుడు వేలు, బొటన వేలూ గోపురం కట్టి మధ్య నుంచీ చూస్తే అభిషేకాలందుకుంటున్న లింగ దర్శనం; రాత్రైతే ఆలయం ముందు ప్రదర్శించే నాటకాల్ని చూస్తూ జాగారం . . . . ఓ బాల్య మిత్రురాలి సాంగత్యం గుర్తొస్తోంది. నంది వర్థనం పూల చెట్టు క్రింద ఆమెతో ఉప్పుల కుప్ప ఆడిన క్షణాల్లోనే అనుకుంటా, స్త్రీత్వంతో నా జీవిత కాలపు ప్రణయానికి తొలి ముహూర్తమెక్కడో పడిపోయింది. ఇప్పటికీ నా మెదడులో నంది వర్థనం పూలకీ ఆమె జ్ఞాపకానికీ ఆ లంకె అలాగే ఉండిపోయింది. ఆ పువ్వుని గట్టిగా వాసన పీలిస్తే చాలు, నా లోపల ఆమె జ్ఞాపకం ప్రాణం పోసుకుంటుంది. అహ! వాసన కూడా పీల్చక్కర్లేదు, ఇక్కడ కారు టైర్ల క్రింద చితికి చిధ్రమైపోయి జాలిగా ఛస్తున్న ఓ పువ్వుని చూసినా చాలు, ఎందుకో ఆమె గుర్తొస్తుంది. చాలా చిత్రం కదూ! వర్తమానంలో, ఈ క్షణాల్లో, మనం ఏవి ముఖ్యమనుకుంటామో అవేమీ మన వెంటరావు. నిజంగా ఏవి ముఖ్యమో ఆ క్షణాల్ని పరాకుతోనే దాటేస్తాం. కాని మన జ్ఞాపకం మనకే తెలియకుండా అన్నింటినీ వడగట్టి, తనకు విలువైనవేవో ఏరుకుని, చాలా జాగ్రత్తగా పదిలపరచుకుంటూ వస్తుంది. పరీక్ష గెలిచిన రోజో, ఉద్యోగంలో పదోన్నతి దొరికిన రోజో గుర్తుండిపోతాయనుకుంటాను; కానీ, బస్టాండ్‌లో దక్కించుకున్న వాలు కంటి చూపులో, గోదావరి ఇసుక తిన్నెల్లో కొట్టిన పల్టీలో మాత్రమే గుర్తుంటాయి.
ఇంతకీ ఈ అట్లతద్ది జ్ఞాపకాలు నన్ను బాధ పెట్టాయంటే నేను స్థల కాలాలు రెండింటిలో స్థలాన్ని తప్పు పట్టలేను; కాలాన్నే తప్పు పట్టాలి పడితే. నేను ఇప్పుడు హైదరాబాదులో కాక ఆలమూరులోనే ఉన్నా, ఆలమూరులో అట్లతద్ది ఉండకపోవచ్చు. అసలా రావి చెట్టు ఉందా కొట్టేశారా అన్నదీ అనుమానమే. అట్లతద్దనే కాదు, నాగుల చవితి, సుబ్రహ్మణ్య షష్టి ఇలా చాలా అందమైన పండగలన్నీ కేలెండర్లలోనే మిగిలిపోతున్నాయి. ఎందుకు వదిలేస్తున్నాం వీటన్నింటినీ? ప్రపంచీకరణ జరుగుతోంది, అంతా ఏకమైపోతోంది, ఇలా కొన్ని వదిలేయక తప్పదంటారు సరే. కానీ, నాకు తెలిసి, ఆ సంగమ స్థలికి అందరూ తమ తమ సంస్కృతుల్ని వెంటబెట్టుకునే వస్తున్నారు. హాలోవిన్లు, టమాటా ఫెస్టివల్లూ, బీటిల్సూ, వాల్ట్‌విట్మానూ, కామిక్ బుక్సూ, బుల్ ఫైటింగులూ, అందరూ అన్నీ తమ కూడా తెచ్చుకుంటున్నారు. మనమే అన్నీ వెనక విడిచేసి వస్తున్నాం. ఈ ప్రపంచీకరణ అన్న గోదాలోకి అందరూ ఘనమైన సంస్కృతుల దన్నుతో గర్వంగా వచ్చి చేరుతుంటే, మనమే సంస్కృతిలేని అనాధల్లా బేల మొహాల్తో హాజరవుతున్నాం. నేనిక్కడ "ఎందుకు?'' అని ప్రశ్నించటం లేదు, "అయ్యో ఎందుకిలా'' అని బాధపడుతున్నానంతే. డార్విన్ 'నేచర్ సెలక్షన్ థియరీ'నే ఇక్కడా అన్వయించుకోవాలేమో: ప్రకృతి తన పురోగమనానికి అనుకూలమైన సంస్కృతుల్ని ఎన్నుకొని, మిగతా వాటినన్నింటినీ నిర్దాక్షిణ్యంగా చిదిమేస్తుందేమో. బాధే అయినా ఇది అంగీకరించక తప్పదేమో. అయినా బాధ పడటమే ఇక్కడి నా ఉద్దేశ్యం కనుక బాధ పడుతున్నాను.
ఇక నన్ను బాధ పెట్టిన రెండో కారణం, ఇటీవల నా కొలీగ్ నాతో మాట్లాడిన కొన్ని మాటలు. ఆయనకో యాభయ్యేళ్ళుంటాయి, మంచి రచయిత, పదాలతో బొమ్మ కట్టించడం అంటే సరదా పడతాడు. మా సంభాషణ తెలుగు భాష గురించి సాగింది. వాళ్ళ ఇరవై రెండేళ్ళ అబ్బాయికి ఐ.బి.ఎం లో ఉద్యోగం. ఆ కుర్రాడు తెలుగు కేవలం మాట్లాడగలడు; చదవడం, రాయడం రాదు. ఆయన ఈ విషయంలో కాసేపు బాధ పడ్డాడు. తర్వాత తేరుకుని, ఇంచుమించు ఈ అర్థం వచ్చేట్టు మాట్లాడాడు: "అయినా ఏం ఫర్లేదు ఫణీ! మా తరం అయిపోయింది. తెలుగు పూర్తిగా లేకపోవడమన్నది మేము చూడం. మేము చూడాల్సినవన్నీ చూసేసాం. శ్రీశ్రీని చూసాం, తిలక్‌ని చూసాం. శ్రీశ్రీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడంటే ఆడవాళ్ళు వంటి మీద నగలు ఒలిచి ఇచ్చేయడం కూడా ఈ కళ్ళతో చూసాన్నేను. దేనికి విలువ అందాలో దానికి విలువ అందిన కాలం మాది,'' అంటూ ముగించాడు. నాకు వెంటనే కడుపులో ఖాళీ ఏర్పడిపోయి నేను లోపలికి కుంచించుకుపోతున్న భావన కలిగింది. ఏమని పేరు పెట్టాలి, అప్పటి నా భావనకు? మనం ఎప్పుడో బతికిన గతం గురించి ఆపేక్ష పడటాన్ని "నోస్టాల్జియా'' అనొచ్చు. కాని మనకెప్పుడూ పరిచయమే లేని గతం పట్ల ఆపేక్ష కలిగితే, దాన్నేమనాలి? నాకు నిజంగా ఆ కాలం పట్ల ఆపేక్ష కలిగింది. ఇక్కడ కాక, అక్కడ బతికుంటే బాగుండేదనిపించింది. ఆ కాలం . . . ఏ సంక్లిష్టతలూ లేని కాలం . . . నాకిప్పుడు "ఐ విష్ ఐ వజె ఫంక్ రాకర్'' పాట వరసలు గుర్తొస్తన్నాయి:
When the head of state didn't play guitar
Not everybody drove a car
When music really mattered and when radio was king
When accountants didn't have control
And the media couldn't buy your soul
And computers were still scary and we didn't know everything
Oh I wish I was a punk rocker with flowers in my hair
In seventy-seven and sixty-nine revolution was in the air
I was born too late into a world that doesn't care
Oh I wish I was a punk rocker with flowers in my hair
అఫ్‌కోర్స్, తల్లో పూలు అక్కర్లేదు, పైగా నేను పాడితే గాడిదలు వంతపాటకి సిద్ధమౌతాయి. ఇవన్నీ కాదు గానీ, ఆ కాలంలో నిజంగానే ఏదో ఉంది; ఈ కాలంలో లేనిది. ఆ కాలంలో మెయిన్ స్ట్రీమ్ లైఫ్ నచ్చకపోతే పక్కకి వెళిపోయి అవుట్‌సైడర్‌గా బతికే సౌలభ్యం ఉంది. ఈ వెధవ కాలంలో చివరకు సమాజానికి అవుట్ సైడర్‌గా బతకాలన్నా చాలా కష్టం. ఎందుకంటే, ఇక్కడ అవుట్ సైడర్లకీ, బొహేమియన్లకీ కూడా ప్రత్యేకమైన సమాజాలున్నాయి. వాళ్ళకోసం ప్రత్యేకమైన ఉత్పత్తులున్నాయి. వాళ్లకు టీ-షర్టులు, చిరిగిన జీన్సులు, చెదిరిన క్రాఫుల్లాంటి ప్రత్యేకమైన ఎటిక్వెటీ, వాళ్ళనుద్దేశించి ప్రత్యేకంగా సినిమాలు, పాటలు, పాషన్లు . . . ఇలా వాళ్ళ మీద ఆధారపడి భారీ ఉత్పత్తి జరుగుతుంది. వరకడ్డంగా బతికేస్తున్నామని సంబరపడిపోయేవాళ్ళు కూడా చివరకు వినియోగదారుల మందలో మరో గొర్రెగానే మిగులుతారు.
మొన్నా మధ్య "రావిశాస్త్రి రచనా సాగరం'' పుస్తకాన్ని కొన్నాను. పుస్తకం మొదట్లో 1935 నుండీ 1941 వరకూ రావిశాస్త్రిగారు తన టీనేజ్‌లో రాసుకున్న డైరీ ఎంట్రీలు ముద్రించారు. అవి చదువుతున్నప్పుడూ నాలో అదే నోస్టాల్జియా లాంటి భావన. ఆ డైరీల నుంచి మచ్చుకు కొన్ని రాండమ్ ఉదాహరణలు:
ఆదివారం, 1934 - సెప్టెంబరు 29: ఇవాళ పొద్దున్న ఏడున్నర గంటలకి లేచాను. యుద్ధం వొస్తే ఈ ఊరు మీద కూడా బాంబులు వేస్తారని అనుకుంటున్నారు. కొలువులో గవ్వల్తో తేళ్ళు చేసేను. రోడ్డు అదీ వేసి మనుష్యుల్ని బళ్ళనీ వాట్నీ పెట్టేను. చాలా పెద్ద వర్షం పడింది. పొద్దున్న, 'ది స్కూల్ బోయ్ ప్రిన్స్' చదివీసేను. ఇది కూడా చాలా బాగుంది. పెద్ద నాన్నగారు కాణీ ఇచ్చేరు. ఇవాళ గాన సభ ఏమీ బాగు లేదట.
సోమవారం, 1935 - నవంబర్ 25: సాయంత్రం కవి షష్టిపూర్తికి వెళ్లేను. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి హిందీ ప్రచారము అణచెయ్యాలని చెప్పేడు. ఉన్నవ లక్ష్మీనారాయణ దానికెగెనిష్టుగా చెప్పేడు. శివ శంకర శాస్త్రి, బుచ్చి సుందర్రావు ఎటు కాకుండా చెప్పేరు. కందాళ సర్వేశ్వర శాస్త్రి చెప్పేడు. పురిపండా అప్పల స్వామి హిందీకి ఎగెనిష్టు గానే చెప్పేడు . . . చిట్టి పొద్దున్నొచ్చి సాయంత్రం వెళిపోయింది. నాన్నగారు ఊరి నుంచి వచ్చీసేరు. జామిపళ్ళు తెచ్చేరు.
బుధవారం, 1938 - సెప్టెంబరు 7: కాలేజీకి విశ్వనాథ సత్యన్నారాయణ గారు వచ్చి ఉపన్యాసం ఇచ్చేరు. ఆంధ్ర ప్రశస్తిలోవి, కిన్నెరసానిలోవి పద్యాలు చదివేరు. చాలా బాగున్నాయి. ఇంటికి వచ్చి భోజనం చేసి బాబ్జీ కోసం క్రిష్ణ సైకిలు మీద వాల్తేరు వెళ్ళేను. వాడి స్నేహితుల కోసం వడలు, జీడిపప్పు పాకం పట్టుకొని వెళ్ళేను, వాడికిచ్చీసేను. మరో రెండు రూపాయలు కూడా ఏమైనా కొనడానికి ఇచ్చేను. మళ్ళా పందొమ్మిదో తారీఖున వస్తాడట. కోమటి వాడు తన తమ్ముడికి ఒక ఫ్యాంట్ ఇచ్చీమని ఇచ్చేడుట... 'వినోదిని' కొన్నాను. నా కథ పడ్డాది. బొమ్మ కూడా వేసేడు.
శుక్రవారం, 1939 - సెప్టెంబరు 1 : సుభాష్ చంద్రబోసు కాకినాడ వెళ్తున్నాడు. వాల్తేరు స్టేషన్‌లో విద్యార్థుల మందరం వెళ్ళి చూసేం. టిపికల్ బెంగాలీబాబు. అంత ఎమోషనల్‌గా మాట్లాడలేడు. జర్మనీ పోలెండుతో యుద్ధం ప్రారంభించింది. పై వారెవరైనా పోలండుని ఎదుర్కొంటే వాళ్ళకి ఇంగ్లీషు వాళ్ళు, ఫ్రెంచి వాళ్ళు సహాయం చేయడానికి ఇదివరకూ సంధి జరిగింది. ఇప్పుడేమవుతుందో తెలియదు.
శుక్రవారం, 1941 - ఏప్రిల్ 4 : సాయంత్రం బీచీని నేనూ దువ్వూరి నరసింహం కూర్చున్నాం. రాత్రి 'ముసాఫిర్' సినీమాకి వెళ్దామన్నాడతను. సరేనన్నాను నేను. కాని రాత్రి వెళ్తూ ఉంటే భాస్కర్రావు కనిపించి 'ముసాఫిర్' వెళిపోయిందన్నాడు. 'బంధన్' సినిమాకి వెళ్ళేం. కొల్లావాడు కూడా వచ్చేడు. రాత్రి భాస్కర్రావింట్లోనే పడుకున్నాను. ఇవాళ నవమి సంబరాల్లో కలియుగ పురాణం అనే వేషం చాలా బాగుంది. రాత్రి నలుగురాడవాళ్ళని సోల్జర్లు పాడు చేయబోయారట. ఒక సోల్జర్ని మన వాళ్ళు చితక తన్నీసేరట.
ఈ డైరీ ఎంట్రీలు చదువుతుంటే, ఆయన ఇందులో నమోదు చేసిన వివరాలన్నింటి నేపథ్యంలోనూ, ఆయన ప్రయత్నమేమీ లేకుండానే, ఓ ("అందమైన'' అనలేను గానీ) ఆకర్షణీయమైన కాలం రూపం పోసుకుంది; అస్పష్టంగా, ఆవిరి పట్టిన గాజు పలకకు ఆవలనున్న దృశ్యంలా, తెలిసీ తెలియకుండా నన్ను కవ్వించింది. అక్కడ బతికుంటే బాగుండుననిపించింది. ఆ కాలానికి విశిష్టత ఏంటంటే అక్కడ పట్టుకోవడానికి ఏదో ఆసరా ఉంది. జీవితాల్ని అల్లుకోవడానికి ఏదో ఆలంబన ఉంది. నేషనలిజమో, మార్క్సిజమో, నక్సలిజమో, వల్లకాడో. . . ఏదైతేనేం, ఒక యుద్ధముంది; భ్రమైతేనేం, వాళ్ళకు శత్రువులున్నారు. వాళ్ళు చాలా నమ్మకంతో, చాలా తేలికగా తమ జీవితాల్ని మిథ్యా సమరాలకు తర్పణాలుగా అర్పించేశారు. తమ జీవితాల్ని అర్థవంతంగా గడిపామన్న నమ్మకంతో ఆనందంగా చచ్చిపోయారు. వాళ్ళకా అనుకూలత ఉంది. కానీ నాకేం ఉంది? నా తరం ముందు పెద్ద ఖాళీ ఉంది. "ఫైట్ క్లబ్'' సినిమాలో టైలర్ డర్డన్ మాటల్లో చెప్పాలంటే:
"I see all this potential, and I see it squandered. God damn it, an entire generation pumping gas, waiting tables; slaves with white collars. Advertising has us chasing cars and clothes, working jobs we hate so we can buy shit we don't need. We are the middle children of history man! No purpose, no place. We have no Great War. No Great Depression. Our Great War is a spiritual war . . . our Great Depression is our lives."
అంతో ఇంతో ఇది నిజమనే చెప్పాలి. టైలర్ డర్డన్ ఒక చార్మింగ్ బాస్టర్డ్. సమస్యను చాలా బాగా ఎత్తి చూపుతాడు. కాని దానికి చూపించే పరిష్కారమే వింతగా ఉంటుంది. ప్రస్తుత యాంత్రిక ప్రపంచంలో మనల్నీ ఒక యంత్రంగా ఒదిగిపోయేట్టు సిద్ధం చేసే సోకాల్డ్ "సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్'' పద్ధతుల్ని అతను వ్యతిరేకిస్తాడు. ఇలా సమస్యను అంచనా కట్టడం వరకూ బాగానే ఉంది. కాని, సమస్య "A'' అనుకుంటే, దానికి పరిష్కారం "~A'' అంటాడు. అక్కడే అతనితో ఇబ్బంది. ఇప్పుడు మనకి కావాల్సింది "సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్'' కాదు, "సెల్ఫ్ డిస్ట్రక్షన్'' అని వాదిస్తాడు. ఇది చాలా ప్రమాదకరమైన వాదన. ఇలాంటి వాదనల ఫలితం తర్వాత్తర్వాత అమెరికాకే అనుభవానికొచ్చింది. సెప్టెంబరు 11న, ట్విన్‌టవర్స్ శిథిలమయ్యే కొద్ది క్షణాల ముందు, విమానం కాక్‌పిట్‌లోంచి వాటిని చివరి సారి చూసిన వాళ్ళు టైలర్ డర్డన్ లాంటి వాళ్ళే. టైలర్ డర్డన్ వినడానికి చాలా ఇంపుగా వాదిస్తాడు; అనుసరిస్తే గుడిపించేస్తాడు.
అయితే, "వ్యక్తిత్వ వికాసం'' కాదు, "వ్యక్తిత్వ విధ్వంసం'' కావాలి అన్న అతని వాదనలోని రెండో భాగాన్ని వదిలేస్తే, అతని వాదన నిజంగా సమంజసమే. ప్రస్తుతం ఒక ఉద్యమంగా చెలామణీ అవుతున్న "వ్యక్తిత్వ వికాసం'' నిజంగా ఒక జాడ్యమే. ఈ జాడ్యపు పర్యవసానాలు ఇంకా బయటపడలేదు గానీ, ఎటు చూసినా రోగ పీడితులే. ఈ ఉద్యమకారులు—మనం "ఎఫెక్టివ్ పీపుల్''గా మారడానికి ఏ 7 అలవాట్లు అలవరచుకోవాలో చెప్తారు; విజయం సాధించాలంటే ఏ 5 మెట్లు ఎక్కాలో బోధిస్తారు. ముందే పోసిన మూసల్లో సామరస్యంగా ఒదిగిపోయేలా మనకు తర్ఫీదునిస్తారు, దువ్వుతారు. ఈ వ్యక్తిత్వ వికాస పుస్తకాలన్నీ ప్రాథమికంగా ఒకే ప్రాతిపదిక మీద మొదలౌతాయి: పుస్తకం తెరిచిన చదువరి ఎలాంటివాడైనా, వాడు మారాలి. ప్రతీ మనిషికీ ఒక unique identity ఉంటుందన్న సంగతి, ఈ వైవిధ్యం సృష్టి స్వభావం అన్న సంగతి ఇలాంటి పుస్తకాలు రాసేవాళ్ళకి గుర్తుండదనుకుంటా. ఇవి విజయం సాధించడమే, లేదా "నెంబర్‌వన్'' కావడమే (దేవుడికే తెలియాలి అదేంటో) మనిషి జీవిత పరమార్థంగా చెప్తాయి. ఆ ప్రయాణంలో మనిషి తనమైన తనే యుద్ధం చేసుకోవాలంటాయి; తనలోని ప్రత్యేక వ్యక్తిత్వాన్ని (లేదా వాళ్ళ భాషలో "బలహీనతల్ని'') చంపేసుకోమంటాయి. ఎక్కడకో చేరుకుంటే తప్ప ఆనందం లభ్యం కాదన్న భ్రమని చాప క్రింద నీరులా పాఠకుల మనసుల్లోకి ఎక్కిస్తాయి. "లక్ష్యం'', "గమ్యం'' లాంటి పదాలు రెండు మూడు వాక్యాలకోసారి వీటిల్లో తగుల్తుంటాయి. —అయినా నేను విషయం మళ్ళుతున్నట్టున్నాను.
నా కొలీగ్ ఆ మాటలన్నపుడు నాకు చాలా దిగులేసింది. సగం దిగులు నేను బతకవలసిన కాలంలో బతకటం లేదనిపించడం వల్ల. మరి సగం దిగులు నా ఆలోచనలు ఈ రీతిలో సాగడం చూసి. అంటే, పాతికేళ్ళ వాణ్ణి, ఎంత తక్కువ అంచనా వేసినా ఇంకో నలభయ్యేళ్ళు నిక్షేపంలా బతక వలసిన వాణ్ణి, అప్పుడే గతం పట్ల—అది కూడా నాకు అస్సలు పరిచయమే లేని గతం పట్ల—ఆపేక్ష పడుతున్నానంటే, ఏదో తేడా ఉన్నట్టే కదా.
సరే, ఇక మూడో కారణం: ఒక తిలక్ కవిత. ముందు తిలక్‌తో నా స్నేహం గురించి కాస్త చెప్పుకోవాలి. మాది ఆరేళ్ళ స్నేహం. ఆరేళ్ళ క్రితం హైదరాబాద్ వచ్చిన కొత్తలో "అమృతం కురిసిన రాత్రి'' కొన్నాను. ఇప్పటికీ దాంతో నా స్నేహం పాతబడలేదు. పాతబడకపోవడానికి కారణం తిలక్ నాకు ఇప్పటికీ పూర్తిగా పరిచయం కాకపోవడమనుకుంటా. అసలెప్పటికీ పూర్తిగా పరిచయం కాడేమో కూడా. అంతా తెలిసిపోయాడనుకున్న తరుణంలో అంత వరకూ చూడని తళుకేదో చూపిస్తాడు; మళ్ళీ కొత్త కోణంలో ప్రత్యక్షమవుతాడు. తిలక్ ఓ పూల తోటలాంటి వాడు. పూలతోటని ఎప్పటికీ పూర్తిగా పరిచయం చేసుకోలేం. అంతా తెలిసిపోయిందనుకున్న తరుణంలో, తెల్లారి లేవగానే, ఏదో మూల ఓ కొత్త మొగ్గ కనిపించి మురిపిస్తుంది. బహుశా ఈ సాదృశ్యం కూడా సరైంది కాదేమో. ఈ సందర్భంలో కొత్త మొగ్గలు వికసించేది తోటలో కాదు; కొత్త మొగ్గలు నాలో వికసిస్తున్నాయి, వాటి ప్రతిబింబాల్నే తోటలో చూసుకుంటున్నాను.
బయటకొస్తే చచ్చిపోతానేమోననే మార్బిడ్ భయంతో చాలా కాలం తనను తాను ఓ ఇరుకు గదిలో బంధించుకున్న ఈ వ్యక్తి ఇలా "నవ నవాలైన ఊహా వర్ణార్ణవాల''ను ఎలా అక్షరబద్ధం చేసాడా అనిపిస్తుంది; కొన్ని పంక్తుల నిర్మాణంలో, డిగో మారడోనా "దైవ హస్తం'' లాగా, ఏవన్నా అతీంద్రియ హస్తం సహాయపడిందా అనిపిస్తుంది. ఉదాహరణకి "అదృష్టాధ్వగమనం'':
"ఇప్పటికీ ఈ చీకటి మొగలో
నిలిచి పాడుతున్న నా కోసం
కుబుసం విప్పిన గోధుమ వన్నె తాచు
మొగలి పొదల నుండి పడగ విప్పి ఆడుతుంది
ప్రాగ్దిశా సుందరి ఖండ చంద్ర పరిదీపిత కపోలాల హసిస్తుంది
నా గుండెలపై శుక్రతార కిరణం సూటిగా వచ్చి వాలుతుంది.''
కవిత చివరి పంక్తి పూర్తికాగానే నిజంగానే నక్షత్రపు మెత్తని వెలుగులాంటి మధుర భావనేదో సూటిగా వచ్చి గుండెలపై వాలిన అనుభూతి కలుగుతుంది.
ఇంతకీ నన్ను బాధపెట్టిన—సరిగ్గా చెప్పాలంటే చికాకు పరచిన—కవిత పేరు "మన సంస్కృతి''. నిజానికి దీన్ని కవిత అనే కన్నా, కవిత అనే ముసుగు తొడుక్కున్న రెటోరిక్ అని చెప్పొచ్చు:
మన సంస్కృతి
మన సంస్కృతి నశించిపోతూందన్న
మన పెద్దల విచారానికి
మనవాడు పిలక మాని క్రాపింగ్ పెట్టుకున్నాడనేది ఆధారం
మనగలిగినదీ
కాలానికి నిలబడ గలిగినదీ వద్దన్నా పోదు
మరణించిన అవ్వ నగలు
మన కాలేజీ అమ్మాయి ఎంత పోరినా పెట్టుకోదు
యుగ యుగానికీ స్వభావం మారుతుంది
అగుపించని ప్రభావానికి లొంగుతుంది
అంతమాత్రాన మనని మనం చిన్నబుచ్చుకొన్నట్లు ఊహించకు
సంతత సమన్వయావిష్కృత వినూత్న వేషం ధరించడానికి జంకకు
మాధుర్యం, సౌందర్యం, కవితా
మాధ్వీక చషకంలో రంగరించి పంచి పెట్టిన
ప్రాచేతస కాళిదాస కవి సమ్రాటులనీ,
ఊహా వ్యూహోత్కర భేదనచణ
ఉపనిషదర్థ మహోదధినిహిత మహిత రత్నరాసుల్నీ
పోగొట్టుకునే బుద్ధి హీనుడెవరు?
ఎటోచ్చీ
విధవలకీ వ్యాకరణానికీ మనుశిక్షాస్మృతికీ గౌరవం లేదని
వీరికి లోపల దిగులు
వర్తమానావర్త ఝంఝూ వీచికలికి కాళ్ళు తేలిపోయే వీళ్ళేం చెప్పగలరు?
అందరూ లోకంలో శప్తులూ పాపులూ
మనం మాత్రం భగవదంశ సంభూతులమని వీరి నమ్మిక
సూర్యుడూ చంద్రుడూ దేవతలూ దేవుళ్ళూ
కేవలం వీరికే తమ వోటిచ్చినట్లు వీరి అహమిక
ఇది కూపస్థ మండూకోపనిషత్తు
ఇది జాతికీ ప్రగతికీ కనబడని విపత్తు
మన వేషం, మన భాషా, మన సంస్కృతీ,
ఆది నుండీ, ద్రవిడ బర్బర యవన తురుష్క హూణుల నుండీ,
ఇచ్చినదీ పుచ్చుకున్నదీ ఎంతైనా ఉన్నదనీ
అయిదు ఖండాల మానవ సంస్కృతి
అఖండ వసుధైక రూపాన్ని ధరిస్తోందనీ,
భవిష్యత్ సింహ ద్వారం
తెరుస్తోందనీ,
గ్రహించలేరు పాపం వీరు
ఆలోచించలేని మంచి వాళ్ళు
ఏ దేశ సంస్కృతి అయినా ఏనాడు కాదొక స్థిర బిందువు
నైక నదీ నదాలు అదృశ్యంగా కలిసిన అంతస్సిధువు.
- 1965
అసలే పై రెండు బాధలతో అచేతనంగా సతమతమవుతున్న నన్ను ఈ కవిత ఇన్నాళ్ళూ లేనిది ఎందుకో కాస్త రెచ్చగొడుతున్నట్టనిపించింది. "తిలక్ చెప్తోందంతా నిజమేనా'' అనిపించింది కాసేపు. నాకు తెలుసు, "అయిదు ఖండాల మానవ సంస్కృతి అఖండ వసుధైక రూపాన్ని ధరిస్తోందనీ, భవిష్యత్ సింహ ద్వారం తెరుస్తోందనీ''; నేను దానికి సిద్ధమయ్యే ఉన్నాను, "సంతత సమన్వయావిష్కృత వినూత్న వేషం ధరించి'' ఠీవిగానే నించొన్నాను; జంకేమీ లేకుండా బాబుగాళ్ళకి బాబుగాడిలా ఈ వేషం ధరించగలను, నటించగలను. కానీ ఎంతైనా వేషం వేషమే కదా, నటన నటనే కదా. Deep down inside, I know that I am fucking faking it. (ఇప్పుడూ ఈ నాల్గక్షరాల ఇంగ్లీషు బూతు పదానికి రెండక్షరాల్లోనే అచ్చ తెలుగు ప్రత్యామ్నయం ఉన్నా, ఇది వాడినంత అలవోకగా దాన్ని వాడలేకపోతున్నాను. ఇదేదో ఆలోచించాలి. "అంతరించిపోతున్న అచ్చ తెలుగు బూతులు'' అని ఒక వ్యాసం రాస్తే క్లారిటీ వస్తుందేమో. మెటీరియల్ కూడా వెతక్కోనక్కర్లేదు, నాలిక చివర ఉంటుంది.)
ఈ కవిత చదువుతున్నపుడు "నిజమేనా'' అనిపించింది ఎక్కడంటే, మనం నిజంగానే "మాధుర్యం, సౌందర్యం, కవితా మాధ్వీక చషకంలో రంగరించి పంచి పెట్టిన ప్రాచేతస కాళిదాస కవి సమ్రాటులనీ, ఊహా వ్యూహోత్కర భేదనచణ ఉపనిషదర్థ మహోదధినిహిత మహిత రత్నరాసుల్నీ'' పోగొట్టుకోకుండా దాచుకుంటున్నామా, మన వెంట తెచ్చుకుంటున్నామా? ఈ ప్రశ్నకి సమాధానంగా నలభయ్యేళ్ళు దాటిన అంకుల్స్ అందరూ "మేమున్నాం'' అని ముందుకు రావొచ్చు; ఏమో మరి, నాదాకా అయితే ఇవేమీ రావడం లేదు. మొన్నా మధ్య సీటీ సెంట్రల్ లైబ్రరీలో, డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళు తలచుకోవడానిక్కూడా జంకే తెలుగు పుస్తకాల సెక్షన్‌లో, మూల అరల్లో మూలుగుతూ నిర్లక్ష్యం కాబడుతున్న కొన్ని తెలుగు మెదళ్ళని రాండమ్‌గా పలకరిస్తున్నాను. అవన్నీ సల్ఫర్ ప్రభావం వల్ల పసుపుబారి, పెళుసై పేజీలు విరిగిపోతున్న పుస్తకాలే. వెతుకులాటలో కట్టమంచి రామలింగారెడ్డిగారు "కళా పూర్ణోదయం'' గురించి రాసిన పుస్తకం ఒకటి కనిపించింది. అంతకుముందే వినివుండటం వల్ల ఆసక్తిగా తెచ్చుకుని చదివాను. తర్వాత "కళాపూర్ణోదయం'' ఎలాగైనా చదవాలనిపించింది. విశాలాంధ్రాకెళ్ళి వెతికి పట్టుకున్నాను. కానీ అందులో టీకా తాత్పర్యాలేవీ లేవు. కేవలం రచన ఉంది. టీకాతాత్పర్యాలతో పుస్తకాలేవన్నా ఉన్నాయా అని అడిగితే ప్రచురణలో లేవన్నాడు షాపువాడు. సరే ఎలాగో దీంతోనే కుస్తీ పడదామని అదే కొనితెచ్చుకున్నాను. కొన్ని రోజులు కష్టపడ్డాను. ఆ పుస్తకంతో నా కష్టం భుజం మీద నాగలేసుకు బీడు భూమిని దున్నినట్టే ఉంది (వెధవ ఉదాహరణ! చివరికి ఇక్కడ కూడా "ploughing through'' అనే ఇంగ్లీషు పదబంధం మీద ఆధారపడ్డమే! నా మెదడు నెర్రెలు బారిపోతోంది. ఆపద్ధర్మంగానైనా తెలుగు జాతీయాల పుస్తకం ఒకటి తెచ్చుకుని బట్టీ పట్టాలి.) సరే ఇలా కొన్ని రోజులు తంటాలు పడ్డాను. నా దగ్గర ఉన్న శబ్దరత్నాకరం ఏ మాత్రం అక్కరకు రాలేదు. చివరకు ఈ పుస్తకం నా వరకూ కళా అసంపూర్ణోదయంగానే మిగిలిపోయింది. ఇలా ఓ తెలుగు రచనకే దిక్కు లేకపోతే, ప్రాచేతస కాళిదాస కవి సమ్రాటుల్నీ, ఉపనిషదర్థ మహోదధుల్నీ ఒంటరిగా ఈదడం నా వల్లనవుతుందా? వాటిలో నిహితమైన రత్న రాసుల్ని ఏ సహాయమూ లేకుండా వెలికితీయగలనా? మరి నిజంగానే తిలక్‌కు బుద్దిహీనులెవ్వరూ కనపడలేదా?
నన్ను బాధ పెట్టిన ఈ మూడు కారణాలకూ ఏదో సంబంధం ఉందని తెలుస్తోంది. నేనేదో కోల్పోతున్నాను, ఈసరికే కోల్పోయాను కూడా. కొన్ని అనుభవించి కోల్పోయాను, కొన్ని అనుభవించకనే కోల్పోయాను. అందుకే ఇప్పుడిలా శిథిలాల మధ్య నిలబడి జ్ఞాపకాల పునాదులపై అక్షరాల ఇటుకల్తో మళ్ళీ అంతా పేర్చుకుంటున్నాను; పేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాను. అందులో సేద తీరుతున్నాను. అయినా నేను కాస్త అతిగా బాధపడుతున్నానేమో. బహుశా నేను కాస్త తేడానేమో. బహుశా అందరూ జీవిత రహదారుల్లో ముందుకు చూస్తూ ముందుకు నడిచే వాళ్ళైతే, నేను వెనక్కి చూస్తూ ముందుకి నడిచే బాపతేమో. ఏం చేస్తాం. మన మౌలిక నిర్మాణమే అలా ఏడిచింది. మారాలంటే గోరోజనం ఎక్కువాయె! ఈ జన్మకిలా కానిచ్చేద్దాం.
(సరే, చిన్న గీత ముందు పెద్ద గీత గీసాను. మొదటి బాధ తగ్గినట్టే కనిపిస్తుంది. మరి ఇప్పుడీ రెండో బాధ సంగతేం చేయాలి. దీని ప్రక్కన ఏ పెద్ద గీత గీస్తే ఈ గీత చిన్నదౌతుంది. ఆ అమ్మాయినే అడగాలి.)