డిన్నరు అయ్యాక లివింగ్ రూములో కూర్చుని ఆ ఇంటివాళ్లతో కబుర్లలో పడ్డాడు. పరాగ్గా వాచీ వంక చూసుకునేవరకూ అంత టైమయిందని తెలీనే తెలీలేదు. ఇంకా ఆలస్యమైతే వెనక్కి ఆటోలు దొరకటం కష్టం. అందుకనే కబుర్ల ఉరవడి తగ్గుముఖం పట్టినపుడు తన వైపు నుంచి పెంచే ప్రయత్నం చేయలేదు. అట్టహాసంగా మోకాళ్లపై అరచేతుల్తో చరుచుకుని చిప్పల చుట్టూ నిమురుకున్నాడు. అప్పుడే గుర్తొచ్చినట్టు ఈసారి జనాంతికంగా వాచీ వైపు చూసుకున్నాడు. భార్యని ఓసారి తలపంకిస్తూ సంప్రదించాడు. ఇక బయల్దేరతామంటూ ఇద్దరూ పైకి లేచారు. వీడ్కోలు కూడా అతని అంచనాలకు మించిన సందడితోనే జరిగింది. అతని భార్యకు ఇంటావిడ బొట్టూ జాకెట్టూ పెట్టింది (ఇట్టే వరసలు కలిపేసుకునే ఆడాళ్ల తీరు మీద మగవాళ్లిద్దరూ చిలిపిగా జోకులేసుకున్నారు). ''డ్రాప్ చేస్తా ఉండం''డంటూ ఇంటాయన కారు తాళాలు వెతకబోయాడు. ఆ ఆఫర్ అంగీకరించకపోవటమే మర్యాద అని తెలిసిన అతను ''అయ్యయ్యో భలేవారే అదేం వద్ద''న్నాడు. ఇంటిల్లిపాదీ బయటి గేటు దాకా వచ్చి సాగనంపింది. అతనూ భార్యా వీడ్కోలుగా చేతులూపుతూ రోడ్డు మీదకు నడిచారు. అదృష్టవశాత్తూ సెంటర్లో ఉన్న ఒకే ఒక్క ఆటో, కదలబోతున్నదే, వీళ్లని చూసి ఆగింది.
బోసి రోడ్ల మీద ఆటో సాఫీగా సాగిపోతోంది. ఎడాపెడా చల్లటిగాలి తగులుతోంది. భార్య బోళాగా అతని భుజం మీద తల వాల్చి తన వంతు ఆనందాన్ని ఒప్పేసుకుంది. పైకి గుంభనంగా ఉన్నాడు కానీ లోపల అతనికీ ఆనందంగానే ఉంది. ఏ వ్యవహారం మీద సిటీ వచ్చాడో దానికి సాయపడటమే కాకుండా, ఆ ఇంటాయన తనను సాదరంగా డిన్నరుకి పిలవటం, వాళ్ల అంతస్తుకు తూగేవాళ్లు కాకపోయినా ఆ తేడా చూపించకుండా ఎంతో ఆప్యాయంగా మసలుకోవటం అతనికి నచ్చింది. అతనిలోని సంతృప్తికి చుట్టూ పరిసరాలూ స్పందిస్తున్నట్టున్నాయి. ట్రాఫిక్ పల్చబడటంతో సోడియం స్ట్రీట్ లైట్లు నిలకడైన నీడల్ని మాత్రమే మిగుల్చుకున్నాయి, సేల్స్‌బాయ్స్ షాపు షట్టర్లు దించుతున్నారు, ఒక పళ్లబండివాడు సంపాదన లెక్కబెట్టుకుంటున్నాడు, కొందరు బిచ్చగాళ్లు పీలికల దుప్పట్లు మీదికి లాక్కుంటూ ఫుట్‌పాత్‌పై మునగదీసుకుంటున్నారు... పట్టణం బడలికగా ఆవలిస్తోంది. అతనికి ఈ రాత్రి అచ్చంగా అమరిందనిపించింది. కాసేపటి తర్వాత, భార్యాభర్తలిద్దరూ సిటీలో విడిది చేసిన చుట్టాలింటికి ముందు ఆటో ఆగింది.
కిందకు దిగుతూ పర్సు కోసం వెనక జేబులో చేయి పెట్టి అక్కడ ఏమీ తగలక పోవటంతో కంగారుగా తడుముకున్నాడు. మిగతా జేబులు కూడా చూడమంటున్న భార్యని ''నువ్వుండవే'' అని అదిలిస్తూ మిగతా జేబులు కూడా చూసుకున్నాడు. వెంటనే గుర్తొచ్చింది, ఇందాక డిన్నరు తర్వాతి కబుర్లలో ఏదో విజిటింగ్ కార్డు ఇవ్వటానికి పర్సు బయటకు తీశాడు! అతని ముఖం తెల్లబోయింది. మళ్లీ వెనక్కి వెళ్లటమన్న ఊహ పళ్లు గిట్టకరుచుకునేలా చేసింది. పర్సుపోతే పోయింది, కానీ అంత పరిపూర్ణంగా ముగిసిన కలయికకి ఇలా ఒక నేలబారు కొనసాగింపును జత చేస్తూ అక్కడికి మళ్ళీ వెళ్లాలంటే ముఖం చెల్లలేదు. కానీ వెంటనే గుర్తొచ్చింది, రేపు ఊరెళ్లాల్సిన రైలు టికెట్టు ఆ పర్సులోనే ఉంది, వెళ్లక తప్పదు. భార్యని ఇంట్లోకి పంపి, అదే ఆటోవాణ్ణి రానూపోనూ మాట్లాడుకుని బయల్దేరాడు.
ఎదురు కానున్న సన్నివేశాన్నీ, ప్రవర్తించాల్సిన విధాన్నీ అన్ని వేరియేషన్స్‌తోనూ ఉత్కంఠగా అల్లుకుంటూ వెళ్లాడు. తలుపు తెరిచిన ఇంటాయన ఆశ్చర్యంగా ముఖం పెట్టాడు, ఇంటిల్లిపాదీ పర్సు కోసం హంగామాగా వెతికారు, దొరికిందాన్ని ఛలోక్తులతో తీసుకొచ్చి అతని చేతిలో పెట్టారు. వాళ్లు మళ్లీ బయటి గేటు దాగా వచ్చి సాగనంపుతారేమో అని (సాగనంపరేమో అని కూడా), అతను హడావుడిగా ఇంటి గుమ్మం దగ్గరే వీడ్కోలు తీసుకుని బయల్దేరాడు.
ఈ అనవసరపు మారు ప్రయాణం మొత్తాన్నీ కలలోలా దాటేసి, ఇందాకటి సంతృప్తిని అవిచ్ఛిన్నంగా కొనసాగించాలని ఉంది. కానీ ఆటో మళ్లీ అవే బోసి రోడ్ల గుండా వాస్తవపు అతిక్రమించలేని నిడివిని పాటిస్తూ సాగుతోంది. అవే సోడియం లైటు నీడలు. రోడ్డుపై పాంప్లెట్లు గాలివాటుకి బద్ధకంగా కదులుతున్నాయి. ఓ ఆవు డివైడర్ మీద పరిచిన నకిలీ గడ్డిని వాసన చూస్తోంది. మున్సిపాలిటీ వాళ్లు పనికిలోకి దిగేముందు బీడీలు కాల్చుకుంటున్నారు. అతనికి అసహనంగా అనిపించింది. అసలేమిటిది? అంత చక్కగా పూర్తయిన మొదటి ప్రయాణానికి మళ్ళీ ఈ రెండో ప్రయాణం తోకలా ఎందుకు వచ్చి చేరింది? ఇలా అర్ధరాత్రిపూట పడకేసిన ప్రపంచపు వీపు వెనక సాగుతోన్న ఈ పునరుక్తి వల్ల ఎవరికి లాభం?--అంటూ మొదలైన ప్రశ్నలు--ఇక్కడ ప్రతీదానికీ ఓ పద్ధతీ పరమార్థమూ ఉంటాయనుకోవటం భ్రమేనా? ఇది నిజంగానే ఏ పర్యవేక్షణా లేని అనాథ లోకమా?--దాకా సాగాయి. కానీ ఆటో ఇంటి దగ్గర ఆగేసరికి, బహుశా ఇందాక ఆనందం ఎక్కడ తెగిందో మళ్లీ ఆ చోటుకే రావటం మూలానేమో, అతను ఈ ప్రశ్నల్ని మర్చిపోయాడు, పునరుక్తిని మనసులోంచి చెరిపేశాడు. ఆటోవాడికి ఆ రెండో ట్రిప్పుగ్గాను ఇంకో రెండొందలు ఇచ్చేసి మెట్లు ఎక్కాడు.
ఆటోవాడు నోట్లు ముద్దుపెట్టుకుని కాబినెట్లో పెట్టుకున్నాడు. ఎవళ్నయినా ఏమార్చచ్చు గానీ, రేపు ఎంకటేసుగాణ్ణి తప్పించుకోటం కష్టమే. తన బర్త్ డే అని తెలీగానే పీక పుచ్చుకుని పార్టీ ఏదిరా మరి అని దొబ్బుతాడు. కనీసం దేవికాలో బిర్యానీ ఐనా ఇప్పించకపోతే ఎదవ నరగోల. అసలే బేరాలేయీ తగల్లేదీ రోజు ఎలారా బాబూ అనుకున్నాడు. కానీ తక్కువ పడిందనుకున్న రెండొందలూ గభాల్న భలే చేతిలో పడ్డాయి. కిక్కురాడ్డుని చేత్తో జప్పున లాగి దడదడళ్లాడ్తున్న ఆటోని ఇంటికి పోనిచ్చాడు.
(కినిగె పత్రికలో ప్రచురితం)

0 comments:
మీ మాట...