December 18, 2017

స్వభావం

తుఫాను అలలపై సొమ్మసిల్లిన ఓడ
నీరెండ ఒడ్డును కలగన్నట్టు,
తెల్లటి మాయేదో కమ్మిన స్నేహోద్రేకంలో
దొరికిన నెంబర్‌కి ఫోన్‌ చేస్తావు
వినిపించిన గొంతునల్లా అల్లుకుపోదామని.

ఒక్కో చువ్వా పేర్చి కట్టుకున్న ఇనుప పంజరంలోంచి
నువ్‌ వెలార్చే యీ స్నేహఋతు కూజితం వెనగ్గా
జీరగా గీరుకునే ఒక ఆలాపనను
అవతలి మనిషి విన్నూవచ్చు వినలేకపోనూవచ్చు.

మీ మాటలు మర మీది బెల్టుల్లా తిరుగుతుండగానే
నీ తలుపులు ఒక్కోటిగా మూతపడుతుంటాయి
నిజం లెక్కలేనన్నోసారి నిన్ను క్షమించి చేతులు చాస్తుంది
దాని అనాదరపు కౌగిట్లోకి నీరసంగా చేరతావు, ఫోన్‌ పెట్టేసి.

December 1, 2017

స్కూలెల్లను!

లైన్లో పిల్లలందరితో పాటు శివగాడు చిన్న చిన్న అడుగులు వేస్తూ గేటు వైపు నడుస్తున్నాడు. వెనకాలున్న పిల్లాడు షూ తొక్కితే పడబోయాడు. లైన్‌ ఆగిపోయి పిల్లలు ఒకర్నొకరు గుద్దుకున్నారు. కలదొక్కుకుంటూ ఊరికే నవ్వుతున్నారు. ఆయా అరుస్తూ ముందుకొచ్చింది. శివగాడు కోపంగా ముఖంపెట్టి ఫిర్యాదు చెప్పాడు. లైన్లో వాడి ముందున్న పిల్ల చేయిపట్టుకు లాగింది నడవమని.

శివవాళ్ళ నాన్నకి తను లేనప్పుడు శివగాడు బయట ఎలా ఉంటాడో చూడటం ఇష్టం. అందుకని రోడ్డుకి ఇవతలే నిలబడి గేటు కమ్మీల్లోంచి లోపలికి చూస్తున్నాడు. పిల్లల లైను మెట్ల దాగా వచ్చి విడిపోయింది. శివగాడు పైమెట్టు మీద ఆగి పిల్లల భుజాలు తగుల్తుంటే నిలదొక్కుకుంటున్నాడు. బ్యాగ్‌ స్ట్రాప్స్‌ లోకి వేళ్లు దూర్చి, ముందుకి వంగి అటూ ఇటూ వెతుకుతున్నాడు. నాన్న కనిపిస్తే ముఖమంతా నవ్వు. మెట్ల మీంచి గెంతి వీధి దాటబోతోంటే నాన్న ''జార్తరా!'' అని ముందుకొచ్చి ఎత్తుకొన్నాడు.

అక్కడ అమ్మలూ నాన్నలూ పిల్లల్ని ఎత్తుకొంటున్నారు. వాళ్ళ భుజానున్న బాగ్గులు తమ భుజాల మీద వేసుకుంటున్నారు. వేళ్ళు పట్టుకొని నడిపిస్తున్నారు. తలలు చెరుపుతున్నారు. శివా, నాన్నా కూడా వాళ్ళిదరి లోకంలో వాళ్ళున్నారు. నాన్న శివ ముఖంలోకి చూస్తూ అడిగాడు:

''చిన్నిమామా... ఏం చేసేవే ఇవాళ?''

''ఆ...?''

''స్కూల్లో ఏం చేశావూ... అంటున్నా,''

''ఏబీ చదుకున్నా. చదుకుంటే... స్కేలు కొట్టింది.''

''టీచరు కొట్టిందా?''

శివగాడు ఇంకోవైపు చూస్తూ అక్కడ ఎవరో ఉన్నట్టు చూపుడువేలు గాల్లో ఆడించి, '' 'దెబ్బపడతయ్‌!' చెప్పింది. మెప్పెట్టేసింది ఇక్కడా...'' అన్నాడు భుజం చూపిస్తూ.

''మరి కొట్టరా, చదూకోపోతే?''

''స్కూల్‌ బాలే.''

''తప్పమ్మా. ఏబీ చదుకోవాలి. ఏబీ చదూకుంటేనే డబ్బులొస్తాయి.''

''ఆ?''

''డబ్బులొస్తే ఐస్క్రీమ్‌, లాలీపాపా కొనుక్కోవచ్చు''

''లాలీపాప కొనేస్తావా?''

''ఇప్పుడు కాదే. స్కూలెల్లి ఏబీ చదూకొంటే ఆఫీసెళ్ళి డబ్బులు తెచ్చుకోవచ్చు''

''లాలీపాప కావాలి.''

''రేపు కొంటా, స్కూల్‌ వెళ్తావ్‌ కదా, అప్పుడు.''

''స్కూలెల్లను అస్సల''

''తప్పలా అనకూడదు''

''స్కూల్‌ బాలేదే.''

''సర్సరే... రేపు చూద్దాం. అమ్మ అప్పచ్చి చేసింది తిందాం పద.''

''...లాలిపాపా?''

నాన్న తలుపు తీసి లోపలికి వెళ్ళాడు.

అమ్మ వంటింట్లో మూకుట్లో ఏదో తిప్పుతూ వీళ్ళని చూసింది.

నాన్న శివగాడ్ని వొళ్ళో కూచోపెట్టుకొని షూ, సాక్సులు విప్పుతూ, వెనక్కి చూస్తూ చెప్పాడు, ''ఇదిగో నీ కొడుకు స్కూలుకెళ్లడంట.''

''ఏంటీ అప్పుడే!'' అంది అమ్మ.

''టీచర్‌ కొట్టిందట.''

అమ్మ గరిటె గట్టు మీద పెట్టి హాల్లోకి వచ్చింది. నడుం మీద చేయి వేసి నిలబడింది. స్కూల్లో చేర్చి ఇది నాలుగో రోజే. వాళ్ళ కొడుకు మీద ఇంకోళ్ళు చేయి చేసుకోవడం అంటే ఇంకా అలవాటు కాలేదు ఇద్దరికీ. ''కొట్టిందా? ఏరా నాన్నా... మిస్‌ కొట్టిందా?''

శివగాడు తలూపాడు.

''అదేం పొయ్యేకాలం దానికీ. నువ్వెళ్ళి అడక్కపోయావా?''

''ఏం అడుగుతామే. టీచర్లన్నాకా ఓ దెబ్బెయ్యరా? నువ్వూ నేనూ తినలేదా?''

''ఐతే మాత్రం! ఆడెంత ఉన్నాడనీ. వెళ్ళి చెప్పాల్సింది.''

శివగాడు మధ్యలో మాట్లాడాడు, ''ఏబీ రాయ్‌... దెబ్బపడతయ్‌ చెప్పి... స్కేల్‌ కొత్తింది.''

అమ్మ వాడ్ని నాన్న వొళ్ళోంచి ఎత్తుకొంది. ''రా నాన్న... నా తల్లే బంగారం. స్కేల్తో కొట్టిందా. ముండ. నువ్వెళ్ళి చెప్పాల్సింది ప్రిన్సిపాల్‌కి.''

''ఏం చెప్తామే. మళ్ళీ చెప్పామని తెలిస్తే వీడి మీదే ఉంటుంది వాళ్ళ దృష్టంతా,'' అన్నాడు నాన్న.

''నిజమేలే. ఓమ్‌ తల్లి. చిన్నిముండ. కొట్టదులే, నాన్న చెప్తాడు. గులాబ్‌ జామ్‌ చేశా తింటావా?'' అంటూ వంటింట్లోకి వెళ్ళింది.

''స్కూలెల్లను,'' అన్నాడు శివగాడు.

నాన్న హాల్లో చొక్కా బొత్తాలు విప్పుకుంటూ గట్టిగా అన్నాడు, ''ఆ వెళ్ళకు! ఇంట్లోనే అడుక్కోడిపెట్టలా కూర్చొనీ, గుడ్లెట్టు. మూడెళ్లి నాలుగొస్తుంది, సిగ్గులేదు మళ్ళా''.

శివగాడ్ని నడుం మీద పెట్టుకునే అమ్మ గరిటె తిప్పుతోంది. ''ఆ చదివినంతే చదువుతాడు. నువ్వు పెద్ద చదివేసేవా, నేను చదివేసేనా, ఈడిప్పుడు ఊడబొడిచెయ్టానికి. చిన్నపిల్లోణ్ణి పట్టుకుని ఊరికేని. ఏంరా.. బుజిముండా...''

''వంట తినాలా మనం...?''

''ఊ... అయిపోయింది. చల్లారేకా, గిన్నెలో పెడతాను. తిందుగానీ.''

''చాల వేడిగా ఉంతదా...''

అమ్మ వాడి బొజ్జ మీద రుద్దింది. ''ఆకలేస్తుందా చిచ్చితల్లికి,'' అంది. వాడికి కితకితలొచ్చి నవ్వాడు.

బయట నెమ్మదిగా చీకటిపడింది. నాన్న లుంగీ కట్టుకుని మంచం మీద వాలాడు. ఆఫీసులో విషయాలు ఆలోచిస్తూ కణతలు నులుముకొంటున్నాడు, బనీన్లోంచి గుండెల మీద రాసుకుంటున్నాడు. చివరికి మోచేతిలో ముఖం పెట్టుకుని కునికాడు. కాసేపటికి వీపు వెనక ఎవరో ఆనుకున్నట్టు అనిపిస్తే మెలకువ వచ్చి చూశాడు. శివగాడు అటు తిరిగి కూర్చున్నాడు. చేతిలో కారుబొమ్మ పట్టుకొని, పైన గోడ మూలలోకి అక్కడేం లేకపోయినా చూస్తున్నాడు.

నాన్నకి వాణ్ణలా చూస్తే ముచ్చటనిపించింది. వాడెంతసేపుకీ కదలకపోతే ''చింతల్లీ...'' అని పిలిచాడు.

శివగాడు ''ఉం'' అని తిరిగి చూశాడు.

నాన్న వాడి చంకల్లో చేతులేసి గుండెల మీదికి లాక్కొన్నాడు. వాడు రానన్నట్టు గింజుకుంటూ బరువుగా వచ్చాడు.

''ఏం చూత్తన్నావే? పిచ్చిముండ,''

శివగాడు సిగ్గుగా నవ్వి కారుబొమ్మ వేపు చూశాడు. వాడిలోపల ఏముందో అని నాన్నకి బాధగా అనిపించింది.

''అమ్మేదిరా?'' అని అడిగాడు.

శివగాడు ''లాల'' అని బాత్రూం వైపు చూపించాడు- చెంబుడు నీళ్ళు పడిన చప్పుడు వైపుకి.

''బజ్జో కాసేపు'' అని చంకల్లోకి పడుకోపెట్టుకున్నాడు నాన్న.

శివగాడు కారుబొమ్మ గుండెల మీద పెట్టుకొని నాన్న చంకలో పడుకొని ఫ్యాన్‌ వైపు చూస్తున్నాడు.

నాన్నకి మళ్ళీ ఆఫీసు గుర్తొచ్చింది. అక్కడ ఉన్న ఇబ్బంది ఏదో ఉండకపోతేనో అనీ, ఆ పరిస్థితిలో తను ఇంకోలా మాట్లాడివుంటేనో అనీ, మళ్ళీ అలాంటి పరిస్థితే వస్తే 'అప్పుడు ఇలా అనాలి' అనీ ఆలోచించుకుంటున్నాడు.

మధ్యలో ఒకసారి శివగాడు పిలిస్తే చంకలోకి చూసాడు.

శివగాడి కళ్ళు దగ్గరగా పెద్దగా కనిపించాయి. ''స్కూలెల్లాలా?'' అంటున్నాడు.

నాన్న వాడి బుగ్గలు నలిగేలా గుండెల మీదికి లాక్కొన్నాడు. ''చదూకోపోతే ఎలారా మరీ,'' అన్నాడు.

శివగాడు ఇంక ఏడుపుగొంతుతో గట్టిగా మాట్లాడాడు, ''స్కూలు బాలేదే...! బాబులు బాలేదు. ఆంతీ బాలేదు. జారీ బల్ల బాలేదు. బాలేదు అసల!''

''సర్సరె. రేపటి సంగతి కదా. నేను చెప్తాన్లే టీచరుతోటి. టీచరండీ, మా శివని కొట్టద్దండీ. బంగారుతల్లీ, బాగా చదువుకుంటాడూ అని చెబుతాగా రేపు వచ్చి? చెప్పనా?''

''వొద్దు''

''మరి వెళతావా?''

''వొద్దు, బాలేదసల.''

అమ్మ బాత్రూంలోంచి కొత్త నైటీలో వచ్చింది. ''ఊరికే ఎందుకు రాపాడించేస్తన్నావు పిల్లోడ్ని పట్టుకొనీ. వెళ్ళాపోతే మానేస్తాడు. ఏది పట్టుకుంటే అదేనబ్బా మనిషికి...'' అంది అద్దం ముందర జుట్టు తువ్వాల్తో రుద్దుకుంటూ.

శివగాడు చప్పున నాన్న చంకలోంచి లేచివెళ్లి అమ్మ కాలిని కావలించుకున్నాడు. ''అమ్మా... స్కూలెల్లనే,'' అన్నాడు పైకి చూస్తూ.

''వెళ్ళద్దు తల్లీ. నాన్న అలాగే అంటాడు బుద్ధి లేదు అస్సలు.''

''స్కూలెలు ఎలు అంతున్నారు,'' నాన్నని వేలుపెట్టి చూపించాడు.

''నీకేవే, కూర్చొని ఎన్నయినా చెబుతావు. ఐదు వేలు కట్టొచ్చానక్కడ. లెక్కాపత్రం లేకుండా పోతుంది అమ్మా కొడుకులికి. యూనిఫాం అయిపోయింది వచ్చి తీసుకోండని ఆ టైలర్‌గాడు రెండోసారి ఫోన్‌ చేసాడు. జీతం పడనియ్యరా బాబూ అని నా బాధ,'' అన్నాడు నాన్న.

''అసలు ఫీజంతా ఒకేసారి ధారబోసెయ్యమని ఎవడు చెప్పాడు నీకు. మూడు టెరంలు కట్టొచ్చు. అంతా నాకే తెలుసని బయల్దేరతావు. నోరిప్పి మాట్లాడితే కదా అసలు.''

''ఓ నెల ఉండొచ్చు, ఓ నెల వుండాపోవచ్చు. ఉన్నప్పుడే కట్టిపడేస్తే వొదిలిపోతుంది కదాని.''

''ఆ... మరిప్పుడు వాడెళ్ళనంటనాడు ఏం చేస్తావు?''

''అంటాడంటాడు. వాడిష్టమూ, నీ ఇష్టమూని. ఎన్నో రోజని చేరి? ఓ రెండ్రోజులెళ్తే మూడో రోజుకి అదే అలవాటవుతుంది.''

శివగాడు అమ్మ వైపుకీ, నాన్న వైపుకీ మార్చి మార్చి చూస్తున్నాడు. ఇంక తనే మాట్లాడాలని ముందుకొచ్చాడు. ''స్కూలెల్లనసల! బాలేదు స్కూలు. స్కేలు కొత్తింది. మెప్పెస్తుంది,'' అన్నాడు గట్టిగా.

''నోర్ముయ్యరా. వేషాలు,'' అని గొణిగి నాన్న మళ్ళీ మోచేతిలో ముఖం పెట్టుకున్నాడు.

ఈలోగా తలుపు దగ్గర్నుంచి, ''పాలండీ!'' అని వినిపించింది. అమ్మ శివగాడ్ని ''ఉండు నానా,'' అని విడిపించుకుని గిన్నె కోసం వంటగదిలోకి వెళ్ళింది.

శివగాడు మంచం మీద కారు బొమ్మ వైపు చూశాడు. దాన్ని తీసుకోకుండా, చేతులు వేలాడేసుకుని గుమ్మం వైపు నడిచి వెళ్ళాడు. పాలాయన వీడ్ని చూసి, ''టిర్రిక్‌,'' అని నాలికతో చప్పుడు చేశాడు.

శివగాడు నవ్వనా మాననా అన్నట్టు నవ్వాడు.

''పాలు తాగుతున్నావా రోజూనీ?'' అని అడిగాడు ఆయన వంగి.

''ఆ?''

''పాలు... పాలు తాగితే బలమొస్తాది. చూడు కండలు,'' అని చొక్కా చెయ్యి పైకి లాగాడు.

శివ కూడా చొక్కా చేయి లాగి చేతిని చూపించాడు. ''బలం!''

తాత ''అబ్బో'' అన్నాడు.

తర్వాత శివగాడు ముఖం మార్చుకుని తాత దగ్గరికి వెళ్ళి, ''స్కేలు కొత్తింది,'' అని చొక్కా చేతిని భుజం దాకా లాగి చూపించాడు.

శివ వాళ్ళమ్మ గిన్నెతో వచ్చింది. ''ఇంకో రెండ్రోజులాగాలండీ, జీతాలింకా పళ్ళేదు. మొత్తం నాలుగు నాగాలు,'' అంది.

''చూడండమ్మా... చిట్టీలున్నాయి కట్టాల్సినయి,'' అన్నాడు పాలాయన తల గోక్కుంటూ.

శివ చొక్కా కిందికి లాక్కుని మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. మంచం ఎక్కి, నాన్న వీపుకి వీపు ఆనించి, కారు బొమ్మని కావిలించుకున్నాడు. చాలా సేపు కళ్ళు తెరిచి చూస్తూనే  ఉన్నాడు.

ఆఫీసులో గొడవలేవో పెరిగిపెద్దవైపోయినట్టూ, ఉద్యోగం ప్రమాదంలో పడేదాకా వచ్చినట్టూ, ఏవేవో పిచ్చిపిచ్చి కలలొచ్చి నాన్నకి అర్ధరాత్రి ఎప్పుడో మెలకువొచ్చింది. ఇటు తిరిగి చెయ్యేస్తే శివగాడు తగిలాడు. మోచేతి ఊతంతో తలగడ మీద లేచి వాడి ముఖంలోకి చూశాడు. నుదురంతా చెమట చుక్కలున్నాయి. నాన్న వాడి లోకంలోకీ, కలల్లోకీ వెళ్ళాలని ప్రయత్నించాడు; వెళ్ళలేకపోయాడు. కాసేపు నిద్రపోయిన ముఖంలోకి చూశాడు. వాడ్ని మెల్లిగా తలగడ మీదకి లాగి, సందిట్లో పొదువుకొని, వాడి చిన్ని పొట్టని చేత్తో నిమురుతూ మళ్ళీ పడుకున్నాడు.

*


Published in Vaakili