October 4, 2011

దేవుణ్ణి అటకాయించిన మనిషి

అతణ్ణి మొదట గౌస్‌ మియా హోటల్లో చూసాను. ఆ రోజు జరిగిన గలాటాలో అతను పోషించిన పాత్ర అంత తొందరగా మర్చిపోగలనా! ఆ హోటలుకేదో వేరే పేరు వుంది, ఏదో ఫలానా 'కెఫె' అని పైన రాసి వుంటుంది గానీ, పెయింటూడొచ్చేసి చదవడానికి రాదు. అందరూ గౌస్‌ మియా పేరుతోనే దాన్ని పిలుస్తుంటారు. ఈ చిన్న మురికి హోటల్లో ఇరానీ చాయీ, ఉస్మానియా బిస్కట్లూ, సమోసాల్తో పాటూ, చవగ్గా భోజనం దొరుకుతుంది. రుచుల పట్టింపు లేకుండా కడుపు నిండడమే ముఖ్యమయినవాళ్ళు యిక్కడ తింటారు. గోడకోమూల గౌస్‌ మియా నెత్తి పైన తగిలించిన టీవీలో ఏదొస్తే అది చూస్తూ నాలిక మీంచి ఏం లోపలికి వెళ్తుందన్నదన్న పట్టింపు లేకుండా పొట్ట నింపుకోవచ్చు. భోజనమైం తర్వాత పక్కనే వున్న పాన్‌బడ్డీలో సిగరెట్‌ తాగితే అంతా ఒకటే రుచి. నేనుండే సందు చివర్నే ఈ హోటలు కావటంతో నా అన్న పానాదులన్నీ దాదాపు యిక్కడే అయిపోతాయి.

ఆ రోజు అలాగే టీవీ చూస్తూ సమోసా పుణుకుతున్నాను. ఈలోగా ఐదుగురు అట్టహాసంగా లోపలికి వచ్చారు. హోటలంతా కలయజూస్తున్నారు. అదెంత హోటలుందని అదేపనిగా కలయజూడ్డానికి! వాళ్లక్కావాల్సిన వాళ్ళెవరో వెంటనే కనపడ్డారు. ఓ మూల కూర్చుని చాయి తాగుతున్న ఆ ఇద్దరు కుర్రాళ్లూ కూడా వీళ్లని చూడనే చూసారు. వెంటనే కప్పులు కింద పెట్టి లేచారు. బల్లల మధ్య నుంచి పారిపోయే ప్రయత్నం చేసారు. కానీ ఆగంతుకులు వెంటనే చుట్టూ కాసేసారు. అప్పటికీ ఇద్దర్లో ఒక కుర్రాడు టిఫిన్లూ, టీలూ సర్వు చేసే పెద్ద కిటికీలాంటి కంతలోంచి వంటగదిలోకి దూకి వెనక తోవ గూండా పారిపోయాడు. ఒకడు మిగిలిపోయాడు. ఈ ఐదుగురూ వాణ్ణి చుట్టుముట్టేసారు. వాడి మొహంలో భయం లేదు సరికదా, ఎవడో శంకరన్న పేరు చెప్పి బెదరిస్తున్నాడు. వీళ్లు "క్యా బతాయెగారే తెరీ మాక్కీ..." అని మొదట చెంపలు వాయించడంతో మొదలు పెట్టి, తర్వాత బల్లల మూల కుదేసి తన్నుల్లోకి దిగారు. అందరితోపాటూ నేనూ లేచి నా ప్లేటు సమోసాతో సహా బయట పాన్‌ షాపు దగ్గరకొచ్చేసాను. తింటూ చూస్తున్నాను. మా బస్తీలో అడపాదడపా యీ గొడవలు మామూలే. గౌస్‌ మియా కౌంటరు వెనక నుంచి లేచి వచ్చి బూతులు తిడుతున్నాడు. బయటికి పోయి కొట్టుకొమ్మని అదిలిస్తున్నాడు. వాళ్ళు గౌస్ మియాని పట్టించుకోకపోలేదు. కానీ, "నువ్వుండన్నా యీ నాకొడుకు..." అనేదో సర్ది చెప్తూనే, ఆ కుర్రాణ్ని బాదుతున్నారు. యింతలో అక్కడ ఊహించనిది ఒకటి జరిగింది. అంతదాకా నేను గమనించ లేదుగానీ నా ఎదుట టేబిల్‌ మీదే కూర్చుని ఓ బక్కపలచని రోగిష్టి మనిషి దాల్చావల్ తింటున్నాడు. కస్టమర్లందరూ గొడవకి బయటకొచ్చేసారు గానీ అతను అక్కడే కూర్చుని వున్నాడు. ఇప్పుడు ఉన్నట్టుండి లేచాడు. తిన్నగా ఆ గలాటా మధ్యలోకి వెళ్లి తన్నుల తింటున్న కుర్రాడికి తను అడ్డబడిపోయాడు. కాళ్లా వేళ్లా పడి బతిమాలడం మొదలుపెట్టాడు కొట్టవద్దని. "తూ కౌన్‌ రే" అంటూ అతణ్ణీ కలిపి కొడుతున్నారు వీళ్లు. చిత్రమేమిటంటే, అప్పటిదాకా తన్నులు తింటున్న కుర్రాడు కూడా ఇతణ్ణి తన మీద నుంచి లెమ్మని విదిలించుకుంటున్నాడు. అందరికీ కాసేపట్లోనే అర్థమైంది, అతనికీ ఈ గొడవకీ ఏ సంబంధమూ లేదని. సంబంధం లేని వాణ్ణి ఉత్తపుణ్యానికి వాళ్లు మాత్రం ఎంతని తన్నుతారు. గొడవాపి "అరె తూ బీచ్‌ మే క్యుం ఆతారే" అని అయోమయం మొహాల్తో అతణ్ణి అడుగుతున్నారు. తప్పుకోపోతే చస్తావని బెదిరించారు. అతను మాత్రం కన్నీళ్లు కార్చేస్తూ "అన్నా మనం మనం... వద్దన్నా... బాధపెట్టుకోద్దన్నా...!" అని వాళ్ల కాళ్లు పట్టుకుంటూనే వున్నాడు. ఈ అదను చూసుకుని అప్పటిదాకా తన్నులు తిన్న కుర్రాడు చటుక్కున టేబిల్స్‌ మీద ఎక్కి  ప్లేట్లు ఎడాపెడా తన్నేస్తూ పరిగెట్టి మా మధ్య నించి సందు చేసుకుని రోడ్డు మీదకి పారిపోయాడు. ఆగంతుకులకి యింకా తమ కాళ్ల దగ్గర దేకుతున్న అతణ్ణి ఏం చేయాలో తెలియలేదు. అతను కలగజేసుకోనంతవరకూ యీ సన్నివేశంలో తాము హీరోలు, యిప్పుడు విలన్లు. "అరె పోరా భయ్‌ పాగల్‌గా!" అని కాళ్లతో పక్కకి నెట్టేసి బయటికి నడుచుకుపోయారు. గందరగోళం సద్దుమణిగింది. అందరం లోపలికి వెళ్ళాం. అతను వొళ్లు దులుపుకుంటూ లేచి మళ్లీ తన కంచం దగ్గరకొచ్చి కూర్చున్నాడు. ఎవరో అతణ్ణి పిచ్చోడివా అని అడిగారు. యింకెవరో, అతని మంచికే అన్నట్టు బండబూతులు తిట్టారు. అతను తింటూనే తన జాలి గొంతేసుకుని అందర్నీ ఉద్దేశించి మాట్లాడటం మొదలు పెట్టాడు. అందరూ ఒక అమ్మకి పుట్టిన కొడుకులమే అన్నా అంటూ మొదలెట్టి మమ్మల్నీ, రోడ్డు మీద ట్రాఫిక్‌నీ, చూపుకందని నగరాన్నీ, పరివ్యాప్త సప్త సముద్రాల్నీ, కక్ష్యలో తిరిగే భూమినీ అంతట్నీ తనతో కలిపేసుకుని ఏదో పిచ్చి వాగుడు వాగాడు. కాసేపటికే అందరూ అతణ్ణి పట్టించుకోవడం మానేసారు. గౌస్‌ మియా టీవీలో ఏదో ఛానెల్‌ మార్చాడు. నా ధ్యాస అటు మళ్ళింది.

తర్వాత మళ్లీ చాన్నాళ్లకి గానీ అతను నాకు కనపడలేదు. సిటీలో ఒకసారి తారసపడిన ఏ యిద్దరి అపరిచితుల త్రోవలూ మళ్లీ ఎప్పుడుకోగాని దగ్గరకు రావు. అలా వచ్చేటప్పటికి అవతలివాళ్లని ఎపుడైనా కలిసామని కూడా మర్చిపోతాం. వాళ్లు మళ్లీ మనకు అపరిచితులే అయిపోతారు. కానీ అతణ్ణి కలిసిన సందర్భం నన్ను తొందరగా మర్చిపోనియ్యలేదు. పైగా అతణ్ణి రెండోమారు కలిసింది కూడా అలాంటి సందర్భంలోనే.

నేను ఉద్యోగానికి లోకల్‌ రైల్లో పోవాలి. మా బస్తీకున్న స్టేషనులో లోకల్‌ రైళ్లు మాత్రమే ఆగుతాయి. రాత్రి సమయాల్లో అది దాదాపు నిర్మానుష్యంగా వుంటుంది. ఒక రోజు రాత్రి రైలు దిగి వస్తుంటే అల్లంత దూరంలో ప్లాట్ఫాం మీద జనం గుంపుగా కనిపించారు. దగ్గరికి వెళ్లేసరికి మళ్లీ అతనే! మళ్లీ ఏదో గలాటాలోనే! ఇప్పుడు పాత్రధారులు యిద్దరే. ఒకడు తన్నేవాడు, ఒకడు తన్నించుకునేవాడు. తన్నుతున్నది ఒక తెల్లగడ్డం పంజాబీ ముసలాయన. తన్నించుకునేవాడు అతను. ఇద్దరూ బలహీనులే. కాబట్టి చుట్టూ వున్న వాళ్ళు తొందరగానే, తమకు వినోదపు మోతాదు చాలినంత అందిందనుకోగానే, కలగజేసుకున్నారు. ఈ తెల్లగడ్డం ముసలాయన నాకు ఓ పది రోజుల్నించీ ఈ స్టేషన్‌ ప్లాట్ఫాం మీదే కనిపిస్తున్నాడు. అతను ఉత్తరాది వాడని, ఈ ప్రదేశానికి కొత్త అని చూస్తేనే తెలుస్తుంది. ఏదో రైలు తప్పి జేబులో డబ్బుల్లేక ఇక్కడ దిగి వుండచ్చని నేననుకున్నాను. నా కంటపడిన తొలి రోజుల్లో తెల్లని బట్టల్లో మల్లెపూవులా వున్నాడు. ఆరడుగుల ఎత్తూ, దబ్బపండులాంటి ఛాయతో వుంటాడేమో... ఆ మురికి పరిసరాల్లో మరీ కొట్టొచ్చినట్టు కనపడేవాడు. పంచెకున్న పటకాలో తోలు తొడుగున్న ఓ చురకత్తి కూడా కనపడేది. కానీ చూస్తుండగానే కొన్ని రోజుల్లోనే అతని దర్జా వడలిపోయింది. పరిస్థితి అధ్వాన్నమయిపోయింది. ప్లాట్ఫాం చివర చీకటిలో రాత్రుళ్ళు గుడుంబా తాగడానికొచ్చే బస్తీ జనం కొందరు ఆయన్ని ఏడిపించడం మొదలుపెట్టారు. పట్టుసడలిన ముసలి శరీరం పట్టుసడలని పంజాబీ దర్పాన్ని కాపు కాయలేకపోయింది. వాళ్లు అతని చురకత్తిని కూడా లాగేసుకున్నారు. చూస్తుండగానే మల్లెపూవులా వుండేవాడల్లా, చెత్తకుండీలో నివసించేవాడిలా తయారయాడు.

నేను దగ్గరకు వెళ్లేసరికే ముసలాయన్ని వెనక్కి లాగారు. ముసలాయన మాంచి వేడి మీద వున్నాడు. ఎవర్నీ తన మీద చేయి వేయనివ్వడం లేదు. ఎవర్నీ దగ్గరకు రానివ్వడం లేదు. తను 'దరోగా' చేసి రిటైరయ్యాననీ, దగ్గరకొస్తే చమ్డాల్లేవదీస్తాననీ పంజాబీలో బెదిరిస్తున్నాడు. అందరూ యిదెక్కడి గోల అని నవ్వుకుంటూ పక్కకి తొలగిపోతున్నారు. ఆయన్నెందుకు కెలికావని అతణ్ణి తిడుతున్నారు. అపుడే మరో అనూహ్య సన్నివేశం జరిగింది. అతను ప్రయాసగా లేచి నిలబడ్డాడు. ముసలాయన దగ్గరికి వెళ్లాడు. ముసలాయన తర్జని చూపించి బెదిరిస్తూనే వెనక్కి అడుగులు వేసాడు. అతను తన జేబులోంచి డబ్బుకాయితాలు తీసి, ముసలాయనకి యివ్వచూపాడు. ఇది ఊహించని ముసలాయన అపనమ్మకంతో ఆగాడు. కాసేపు డబ్బుల వంకా అతని వంకా మార్చి మార్చి చూసాడు. ఉన్నట్టుండి డబ్బులు లాక్కుని, తన మురికి జుబ్బా జేబులో కుక్కుకుంటూ, సణుక్కుంటూ వెనుదిరిగి వెళిపోయాడు. అదే ఆ ముసలాయన్ని నేను చివరిసారి చూడటం. ఆ డబ్బుల్తో ఎక్కడికి చేరాలో అక్కడికి చేరి వుంటాడనుకుంటాను.

అపుడే చీకటి ప్లాట్ఫాం మీదకి వెలుగు తివాచీ పరుస్తూ లోకల్‌ ట్రయిన్‌ రావడంతో చుట్టూవున్నవాళ్లలో చలనం వచ్చింది. గొడవసంగతి వదిలేసి రైలెక్కే హడావుడిలో పడ్డారు. అతనికి దెబ్బలు గట్టిగానే తగిలాయనుకుంటా కాస్త కుంటుతూ నడుస్తున్నాడు. నేనూ నెమ్మదిగా పక్కనే నడిచాను. అసలేమైందని అడిగాను. "నా బాష అర్థం కాలేదన్నా ఆయినికి, ఎక్కడికెల్లాలని అడిగా, తన్నేసాడు" అని నవ్వాడు. అలాంటి అపార్థం సాధ్యమే అనిపించింది. అసలే ముసలాయన యిక్కడి మనుషుల పట్ల చాలా అపనమ్మకంతో వున్నాడు. కొన్ని రోజులుగా వాళ్ళ వల్ల నానా బాధలూ పడి రగిలిపోతున్నాడు. ఇతని భాష, యాసా అర్థమై వుండవు. ఇతని బక్కవాలకాన్ని అలుసుగా తీసుకుని అందరిపై కసీ యితనిపై చూపించి వుంటాడు. ప్లాట్ఫాం చివరిదాకా మాట్లాడుకోకుండానే పక్క పక్కన నడిచాం. రోడ్డు మీదకెళ్లాలంటే ఇళ్ల మధ్య ఓ ఇరుకు సందులోంచి వెళ్లాలి. సందు చివర ట్రాఫిక్ వెలుగు కనిపిస్తున్నా సందు మాత్రం కటిక చీకటిగా వుంది. అతను ఆ సందులోనే ఒక ఇంటి దగ్గర ఆగి పైకి మెట్లెక్కబోయి తూలాడు. నేను దగ్గరకెళ్లి సెల్‌ఫోను లైటు మెట్ల మీద వేసాను. పైనుంటావా అని అడిగితే అవునన్నాడు. ఇంటి సైడుగోడకానుకుని కట్టిన ఆ మెట్లు తిన్నగా పై వాటాకెళ్తున్నాయి. నాకు కుతూహలం కలిగింది. పద తీసికెళ్తానన్నాను సెల్‌ఫోను లైటు మెట్ల మీద వేస్తూ. కుంటుకుంటూ, మధ్యమధ్య నా మంచితనాన్ని పొగుడుతూ, పైకి నడిచాడు. గుమ్మం పైనున్న గూట్లో తాళం చెవికోసం కాసేపు తడిమి, తలుపు తీసాడు. అలవాటుగా లోపల గుడ్డిబల్బు ఆన్ చేసి నన్ను ఆహ్వానిస్తూ కుంటుకుంటూనే వెళ్ళి చొక్కా విప్పి మేకుకి తగిలించాడు. లోపల గదికి ప్లాస్టరింగేమీ కాలేదు. ఇటుకల కట్టుబడి అంతా బయటకే కనిపిస్తుంది. గదికి ఓ మూల నేల మీద బొంత పరుపు, మరో మూల కిరోసిన్ పొయ్యితో వంట సామాను. గదిలోకి వచ్చీరాగానే కొట్టొచ్చినట్టు కనిపించేది కిటికీ ప్రక్కన వేలాడుతున్న పెద్ద పసుపురంగు మికీమౌస్ కాస్ట్యూము. దాన్ని పరకాయిస్తుండగానే అతను అక్కడున్న ఇనప కుర్చీ ఖాళీ చేసి కుర్చోమని ఇచ్చాడు. కూర్చుంటూ ఆ కాస్ట్యూము గురించి అడిగాను. "అదా! నేను బట్టల షాపులో పన్చేస్తా అనా. పండగల టఁయాల్లో ఆ తొడుగేసుకుని మా షాపు ముంగట ఎగరాల" లుంగీ నడుం చుట్టూ మొలత్రాడు బిగించి పరుపు మీద కూర్చుంటూ చెప్పాడు. ఆ స్పాంజి కాస్ట్యూము నైనా మోయగలదా అనిపించే బక్క శరీరం అతనిది. మోకాలి చిప్ప దగ్గర దెబ్బ గట్టిగా తగిలిందనుకుంటా, లుంగీ పైకి లాగి నిమురుకుంటున్నాడు. ఈనుపుల్లల్లాంటి కాళ్ళు. నా కుతూహలాన్ని దాచుకోదలచుకోలేదు. ఆ రోజు గౌస్ మియా హోటల్లో జరిగింది అతనికి గుర్తు తెచ్చి, సంబంధం లేకపోయినా ఎందుకలా వాళ్ళకు అడ్డపడ్డావని అడిగాను.

"అలా ఎట్లా అంటావనా. నీకూ నాకూ అందరికీ సంబంధం వుంది. అలా జరగనీకూడదనా..."

మళ్ళీ అప్పటి హోటల్లో వాగిన పిచ్చి వాగుడే మొదలుపెట్టాడు. నేను అతని విపరీత చర్యల వెనుక ఒక తాత్త్విక భూమికని ఆశిస్తున్నానని నాకు తెలియదు. కానీ అతని మాటల్లో అలాంటిదేమీ కనపడకపోయేసరికి అసహనంగా అనిపించింది. వెళిపోదామనిపించింది. అది నా మొహంలో కనిపించిందనుకుంటా. ఉన్నట్టుండి "ఉండనా నువు, నీకు చెప్తాను" అని లేచాడు. ఇందాక నాకీ కుర్చీ ఇచ్చేటపుడు దీని పైనున్న సామాను తీసి పక్కనపెట్టాడు. ఇపుడు అందులోని ఓ ప్లాస్టిక్ బాక్సులోంచి ఒక ఫోటో తీసి నా చేతికిచ్చాడు. అది బ్లాక్ అండ్ వైట్ పాస్‌పోర్టు ఫొటో. ఎవరో అమ్మాయిది. ఎనిమిది పదేళ్లుంటాయి. "ఈ పిల్ల పేరు దుర్గ అనా. మన బస్తీలో ఆ చివరాఖర మోరీల కాడ లాండ్రీవోళ్ళుంటారే. ఆళ్ల పిల్ల. ఇపుడు చచ్చిపోయింది. ఆళ్ళమ్మనడిగి తెచ్చినా యిది."  పిల్ల మొహం కళగా వుంది. పాపం అనిపించింది. ఈ ఫోటో నాకెందుకిచ్చావని అడిగాను. అప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు. అతని మాట తీరు కాస్త చిత్రంగా వుంటుంది. వేర్వేరు మాండలికాల కిచిడీలా వుంటుంది. పైగా ఒక వరసలో పద్ధతిగా మాట్లాడడు. అటుపోయి ఇటుపోయి చుట్టుతిరిగి చెప్తాడు. కాబట్టి అతను చెప్పిందాని సారాంశం నేనిక్కడ చెప్తాను.

దుర్గ ఇతణ్ణి మొదటిసారి కలిసినపుడు ఈ మికీమౌస్ కాస్ట్యూము లోనే బట్టల షాపు ముందు ఎగురుతున్నాడు. ఆ రోజు బడి మానేసి చెక్కర్లు కొడుతూన్న దుర్గకి ఈ పెద్ద మికీమౌస్‌ నచ్చింది. ఆ పూటంతా దాని చుట్టూతానే తిరుగుతూ కాలక్షేపం చేసింది. ఆమెకి ఒక మనిషి అందులో వున్నాడన్న స్పృహ వుందో లేదో తెలియదు గానీ, లేనట్టే ప్రవర్తించింది. అతనూ అలాగే నటించాడు. విసుగొచ్చే దాకా ఆడి వెళ్లిపోయింది. బడి ఎగ్గొట్టడం ఆమెకి రోజువారీ దినచర్య అనుకుంటా. ఏదో నిజంగా బడికి బయల్దేరినట్టే భుజాన బాగుతో సహా అన్నీ సర్దుకుని బయల్దేరేది. కాసేపు బస్టాండులో ఏ బస్సూ ఎక్కని ప్రయాణికురాలిలాగా, కాసేపు వినాయకుడి గుడి దగ్గర ఏ కోరికా లేని భక్తురాలిలా, కాసేపు క్రికెట్ గ్రౌండ్లో ఏ పక్షమూ వహించని ప్రేక్షకురాలిలా కాలక్షేపం చేసి బడివిడిచిపెట్టే సమయానికి ఇంటికి వెళిపోయేది. ఈసారి ఆమె మజిలీల్లో ఈ బట్టలషాపు కూడా చేరింది. దాదాపు ప్రతీ పూటా ఏదో ఒక సమయంలో బట్టల షాపు దగ్గరికి వచ్చి మికీమౌస్‌ని పలకరించడం మొదలుపెట్టింది. అతను గొంతు మార్చి కవుర్లు కూడా చెప్పేవాడు. మొత్తానికి మికీమౌసూ, దుర్గా ఒకరికొకరు అలవాటయిపోయారు. ఒకరోజు మంచినీళ్ళు తాగడం కోసం ముసుగు తీసి పట్టుకున్నప్పుడు అతని అసలు రూపు చూసింది. కాసేపు అతని దగ్గరికి రావడానికి కూడా సిగ్గుపడింది. కానీ అప్పటికే యిద్దరి మధ్యా బాహ్యరూపాల కొక్కేల్ని విడిచి గాల్లో మాయలా మనగలిగే స్నేహం ఏర్పడిపోయివుండటంతో, కాసేపటికే మళ్ళీ దగ్గరకొచ్చేసింది. అడపాదడపా గదికి కూడా వచ్చి కవుర్లు చెప్పేది. అతను చేసిచ్చిన టీ తాగాక ఇంటికి వెళ్లిపోయేది. తాను చావబోతుందని దుర్గకీ తెలుసు. అందుకనేమో ఏదో ఆరిందాతనం వుండేదామెలో. తన గురించి పెద్దవాళ్ళు మాట్లాడుకునే మాటలు అడపాదడపా విన్నదో ఏమో, చావు గురించి వాళ్ళు మాట్లాడే ముదురు మాటలే మాట్లాడేది. కానీ తనకి నిజంగా చావంటే ఏంటో తెలియదు. ఒకానొక రోజు తను హఠాత్తుగా వుండటం మానేసాకా, తన తోటి ప్రపంచం మాత్రం యథావిధిగా వుంటూ పోవడమంటే ఏమిటో ఊహించలేదు. మొదట్లో తను చనిపోబోతున్నానని దుర్గ చెప్పినపుడు, అతను నమ్మలేదు. అదే పనిగా అంటంతో ఓసారి ఇంటి దాకా దింపి వాళ్ళమ్మని అడిగాడు సంగతి. ఆమె అవునంది.

తల్లి తన వంతు చేయగలిగింది చేసింది. పిల్లని తీసుకుని గాంధీ హాస్పటల్ చుట్టూ తిరిగింది. కాని వాళ్ళు చెప్పినవన్నీ విన్న తర్వాత ఆమె ఓ నరకప్రాయమైన మీమాంసని ఎదుర్కోవాల్సివచ్చింది. ఆసుపత్రి ఖర్చులన్నీ భరించి ఈ పిల్లకి చావు కొన్నాళ్ళు వాయిదా వేసి, ఎలాగూ చనిపోవడం ఖాయం కాబట్టి, తర్వాత ఆ ఖర్చుల బరువుని మిగిలిన పిల్లల భవిష్యత్తుపై మోపడమా, లేక ఇప్పుడే వైద్యం మానేసి, ఆసుపత్రి ఖర్చులు మిగుల్చుకుని, అవేవో మిగిలిన పిల్లలకి పనికొచ్చేలా చూడటమా అన్న మీమాంస అది. ఆమె రెండో మార్గాన్నే ఎన్నుకుంది.

అతిసన్నిహితుల సమక్షం మన నుంచి హఠాత్తుగా లాక్కోబడినపుడు మాత్రమే చావు స్వరూపం ఏవిటో మనకి తెలిసేది. దుర్గ చనిపోబోతోందన్న నిజానికి సంసిద్ధుడవ్వగలిగేంత సమయం అతనికి దొరకలేదు. కొన్ని నెలల్లోనే ఆమె చనిపోయింది. ప్రపంచం అంతా అతని చుట్టూ యథాతథంగానే వుందిగానీ, ప్రపంచాన్ని అర్థవంతంగా నిలబెట్టే లోపలి పునాది ఏదో కూలిపోయింది. ఇప్పుడీ పై నిర్మాణం అంతా వట్టి డొల్ల. చిన్న అపనమ్మకానికి అంతా కుప్పకూలిపోతుంది. పిచ్చితనంలోకి నెట్టేస్తుంది.

కథ యిక్కడిదాకా నాకు చెప్పాకా అతను సంయమనం కోల్పోతున్నట్టనిపించాడు. మళ్ళీ వెనక్కి వెళ్ళి దుర్గ తనతో వున్న రోజులన్నీ గుర్తు తెచ్చుకోవడం మొదలుపెట్టాడు. నేను టైము చూసుకున్నాను. కాసేపయితే గౌస్‌మియా హోటలు కట్టేస్తాడు. రాత్రికి తిండి వుండదు. సంభాషణని మళ్ళీ దారికి తెద్దామని అతణ్ణి అనునయిస్తూ కొన్ని మాటలు చెప్పాను. ఒడుపుగా అసలు విషయానికి తీసుకొచ్చాను. కానీ నిన్ను నువ్వెందుకిలా బాధ పెట్టుకుంటున్నావని అడిగాను. సమాధానం చెప్పబోయేముందు కాసేపు నన్ను ఖాళీ కళ్ళతో చూశాడు.

"అర్థమవ్వట్లేదా అన్నా! నిన్నూ నన్నూ అలా చంపేసినా, ఏదో పాపంగా ఆలోచన చేసుంటాం, ఏదో పాపం పని చేసుంటాం, అందికే దేవుడులా చేసాడూ అనుకుంటాం. ఈ పిల్ల సంగతికొచ్చేతలికి అలా ఏవుందన్నా? అది పసిది! ఆలోచించు ఒక్కమాటు. నేనాలోచించాను. డూటీ కూడా మానేసి, తిండి తినకండా, నిద్రపోకండా ఆలోచించాను. ఒకటే అర్థవైంది. ఇక్కడ జరిగే క్రూరత్వం అన్నాయం యిదంతా, ఈ పద్ధతి లేకుండా జరిగే పతీదీ, ఆ దేవుడికి ఒప్పుదల మీదే జరుగుతుంది. ఇదంతా ఆయన యిలాగే సృష్టి చేసిపెట్టేడు. ఆయన మనల్ని సుఖం పెట్టే టఁయాలకన్నా కన్నా, బాధ పెట్టే టఁయాలే ఎక్కువ, నువ్వే చూడు. ఒక్కోపాలి ఎవళ్ళం ఏం చేయలేం. దుర్గ సంగతే చూడు. దాన్ని ఆయన సొయంగా బాధపెట్టేడు. అదాయన చేతుల్లో పవరు, తిన్నగా పసిపిల్ల మీద చూపెట్టేడు. ఆయన పవర్‌ని ఎవళం ఏం చేయలేం. కానీ యింకో రకంగా కూడా చేస్తాడు. మనలో మనకి పెట్టి, మనకి మనల్నే ఎదురు నిలబెట్టి, మనకి మనవే తోడు రాకండా చేసి బాధలు పెడతాడు. నేను ఏంటి ఆలోచించానంటే, అలాంటాటికి ఎదురెళ్ళచ్చు. దేవుడికి ఎదురెళ్ళచ్చు. ఆయన అనుకున్నదాన్ని అవకుండా చేయచ్చు. నా కళ్ళముందు ఆ కుర్రాడా రోజు తన్నులు తిన్నాడు. ఇయ్యాల్దాకా పాపం ఆ ముసలాయన ఊరూపేరూ తెలీని చోట బాధలు పడ్డాడు. మరియ్యన్నీ ఆ దేవుడు చేసిన లోకంలో జరుగుతున్నయే కదా. నేనేం చేసాను? నేనడ్డం వెళ్ళాను. అలా జరగనివ్వలేదు. నాకేం పెద్ద బలం లేపోవచ్చు. ఆ రోజు చూసావుగా నన్ను చితకబాదేసేరు. కానీ... నేను లొంగిపోతన్నానన్నా! నా మీద పడే పతీ దెబ్బా కూడా ఆయన దాష్టీకానికి ఎదురెళ్ళటవే. నేనేం చేయలేపోవచ్చు. కానీ నేనాయనకి ఎదురుంగున్నానని ఆయనకి తెలియాల! అందికే యిదంతా!" మాటలు పూర్తయేసరికి అతను చెమటలు పట్టి వున్నాడు.

బహుశా నిన్ను తనకు వ్యతిరేకంగా నియమించుకున్నదీ దేవుడేనేమో, అందామనుకున్నాను. కానీ ఎందుకో ఆ ముతక వాదన అతని ముందు వినిపించాలనిపించలేదు. చాలామంది మంచి చేయడం ద్వారా దేవుని మార్గంలో ప్రయాణిస్తున్నామని అనుకుంటారు. ఇతను మంచి చేయడం ద్వారా దేవుణ్ణి ఎదుర్కుంటున్నాను అనుకుంటున్నాడు. దేవుడున్నాడో లేదో నాకు తెలియదు. ఉన్నాడంటే మంచివాడా చెడ్డవాడా అన్న ప్రశ్నొస్తుంది. దానికి మన మంచి ఆయనకి మంచి కాదు, మన చెడ్డ ఆయనకి చెడ్డ కాదు అన్న సమాధానమొస్తుంది. లేదా అసలాయనకి మంచీ చెడ్డా లేనేలేవన్న సమాధానమొస్తుంది. కానీ మన మనుష్యజాతి మనుగడ కోసం మనకో మంచీచెడ్డా వున్నాయి. మన మంచి నిలవాలి, మన చెడ్డ పోవాలి. అది దేవుడికి మిత్ర పక్షాన నుంచుని చేసినా, వైరి పక్షాన నుంచుని చేసినా పెద్ద తేడా పడదనుకుంటాను.  పైగా ఎలాగూ ప్రేమ కన్నా ద్వేషం తీక్షణమైన భావం. అది తరుముతుంది. పని చేయిస్తుంది. అతడి చేత అదే పని చేయిస్తుంది.

కుండలో మంచినీళ్ళు ఓ గ్లాసు తను తాగి ఓ గ్లాసు నాకిచ్చాడు. నేను అతడి వాదనకు అంగీకార సూచకంగా రెండు మూడు మాటలు చెప్పాను. నువ్వున్నంత సేపే దేవుణ్ణి ఎదుర్కోగలవు, ఏదైనా చేయగలవు, కాబట్టి ప్రమాదాల్లోకి వెళ్ళవద్దని చెప్పాను. సెలవు తీసుకుని మెట్ల మీంచి తడుముకుంటూ క్రిందకి దిగి చీకటి సందులోకి వచ్చాను. ఎందుకో తల పైకెత్తి చూసాను. అతని గది కిటికీలోంచి గుడ్డి బల్బు వెలుగు కనిపిస్తోంది. తల యింకాస్త పైకెత్తి చూస్తే నగరాకాశంలో నక్షత్రాలు లీలగా వెలిసిపోయినట్టు వెలుగుతున్నాయి.

(ఈ కథ "సాహితీ స్రవంతి" మాసపత్రిక జనవరి 2012 సంచికలో ప్రచురితమైంది.) 

July 7, 2011

రంగు వెలిసిన రాజుగారి మేడ కథ

శ్రీపాదపట్నాన్ని పావురాళ్ల పట్నమని కూడా అంటారు. ఆ వూరిని నిర్మానుష్యంగానైనా వూహించవచ్చు గానీ, పావురాళ్ళు లేకుండా ఊహించలేం. ఇళ్ళ వాకిళ్ళలోనూ, అంగళ్ళ ముంగిటా, బడి పెంకులపైనా, గుడి గోపురం గూళ్ళలోనూ... ఎటు చూసినా పావురాలే! ఒక్కోసారి వాటి చొరవ చూస్తే, అసలిదంతా అవి నిర్మించుకున్న వూరేనేమో, ప్రజలే పాపం కాందిశీకులై వలస వచ్చారేమో అనిపిస్తుంది.  ఊరి వాళ్ళకి వీటితో మసలుకోవడం అలవాటైపోయింది. ఎండిన రెట్టల్తో తమ అరుగులన్నీ గరుకుబారినా గోకిగోకి కడుక్కుంటారేగానీ ఏ హానీ తలపెట్టరు. యిక్కడి ఊరకుక్కలు సైతం, పెంటకుప్పల మీద పులిస్తరాకులేరుకుంటున్న తొందరలో కూడా, వెన్నుపై వాలి అల్లరి చేసే తుంటరిపావురాళ్ళని పెద్దన్నల్లా ఓపిగ్గా భరిస్తాయేగానీ కసురుకోవు. వీటి పరపతికి జడిసి కాకులైతే శ్రీపాదపట్నంవైపు రానేరావు.

ఈ ఊరిపై వీటికింత మక్కువ కలగడానికి ముఖ్యకారణం యిక్కడి పాతమేడలు. నిండా గోపీచందనపు పూతతో మెరుగుపోయిన బంగారపు దిమ్మెల్లా మెరిసిపోయే యీ పాత మేడల అందం వర్ణనాతీతం. సాయంసంధ్యవేళ పల్చని ఎండలో అయితే మరీను. అటువంటి సమయాల్లో ఊర్నానుకుని పారే ఏటి మీదుగా ఎగిరే ఏ పొరుగూరి పావురమైనా సరే, ఈ పాతమేడల్ని చూసింతర్వాత కూడా శ్రీపాదపట్నానికి మకాం మార్చేయాలనే చాపల్యాన్ని నిగ్రహించుకోగలిగిందంటే, ముక్కు తిప్పుకుని ముందుకుపోగలిగిందంటే, అలా దాటిపోయిందని తోటి పావురాళ్ళకు తెలిసిందంటే, దాని మెదళ్ళో యిసుమంత రసత్వం కూడా లేదని ఈసడింపులు ఖాయం.

ఒకప్పుడు యేటి వొడ్డున జనార్దనస్వామి గుడి వున్న వీధి శ్రీపాదపట్నానికి ప్రధాన వీధిగా వుండేది. ఆ గుడిని కట్టించిన రాజవంశీకులు ఆ ప్రక్కనే రెండంతస్తుల భవంతిలో వుండేవారు. ఎన్నో తరాల బట్టి దాని బాగోగులు వాళ్ళే చూసుకుంటూ వచ్చారు. ఆ వరసలోనే జనార్దనస్వామి రథం నిలబెట్టిన పెద్ద కొట్టమూ, దూరప్రాంతాల్నించీ గుడి సందర్శనార్థం వచ్చే యాత్రికుల కోసం సత్రమూ, అర్చక కుటుంబం వుండే మండువా, యివన్నీ గాక పూజా ద్రవ్యాల్ని అమ్మే దుకాణాలూ, పూల కొట్లూ... వీటన్నింటితోనూ ఆ వీధి నిత్య సమ్మర్ధంగా వుండేది. అశ్వాలు పూన్చిన రథాలూ, పట్టుజరీతెరలు వాల్చిన పల్లకీలూ వస్తూపోతూండేవి. రాజుల ఆహ్వానంపై దూర దేశాల్నించి కళాకారులూ, ప్రదర్శకులూ వచ్చి విద్యల్ని చూపించేవారు. అయితే ఇదంతా ఒకనాటి మాట. రాజుల పరంపరలో చివరివాడైన సుబ్బరాజు గారి హయాం వచ్చేసరికే ఆ రాజవీధి ప్రాభవాన్ని కోల్పోయింది. ఆయన చనిపోయాకా చెడ్డపేరు కూడా తెచ్చుకుంది.

చెడ్డపేరుకి సుబ్బరాజు గారికన్నా, ఆయన ప్రేతాత్మ కారణమని చెప్పాలి. రెండంతస్తుల రాజభవంతిలో క్రింద అంతస్తులో యిప్పుడాయన ఆత్మ తిరుగుతోంది. పై అంతస్తులో ఆయన మనవరాలు రేణుకాదేవి వుంటోంది. ఆయన ఆత్మ పైలోకాలకు పోకుండా యింకా అక్కడే తిరగడానికి కారణం ఈ మనవరాలే అంటారు. బతికివుండగా కూతుర్ని కాపాడుకోలేకపోయాడు, చచ్చి యీ మనవరాల్ని కాపాడుకోవాలని చూస్తున్నాడని జనం మాట. ఒకప్పుడు ఆయనకు కూతురంటే పంచప్రాణాలు. ఆమె దేశంలోకే పెద్ద అందగత్తె. ఒక పొరుగూరి జమీందారు ప్రేమలో పడి సుబ్బరాజు గార్ని ఎదిరించి పెళ్ళి చేసుకుంది. వాడు ఆమె అందంలోని రాజసాన్ని, స్వభావసిద్ధమైన నిర్మలత్వాన్ని భరించగలిగే మనసున్నవాడు కాదు. కాస్త కురూపి కూడా కావడంతో ఆమె ప్రక్కన ఎప్పుడూ మాసిపోయినట్టు కన్పించేవాడు. ఆ న్యూనతను భరించలేక ఆమెను హింసించడం మొదలుపెట్టాడు. పురుడు పోయడానికని వెళ్ళిన మంత్రసానికి ఆమె గుర్రపుశాలలో నొప్పులు పడుతూ ఎదురవడాన్ని బట్టి వాడి చిత్రహింసలెలాంటివో ఊరికి తెలిసింది. రేణుకాదేవి భూమ్మీద పడిన కొన్నేళ్ళకే ఆమె మరణించింది. సహజమరణమో, బలవన్మరణమో తెలియదు. అప్పటిదాకా కూతురు పడుతున్న బాధలు సుబ్బరాజుగారు ఆ నోటా ఈ నోటా వినివుండకపోలేదు. కాని, తన మాట వినని ఫలితమేమిటో తెలుసుకున్నాక కూతురే వెనక్కి వచ్చేస్తుందని ఆశించాడు. యిలా శవం వస్తుందని ఊహించలేకపోయాడు. ఆగ్రహోదగ్రుడై పాలేళ్ళని  వెంటేసుకుని వెళ్ళి జమీందార్ని చావచితక్కొట్టాడు. ఈడ్చుకెళ్ళి అతని చెరుకుతోటలోనే అతణ్ణి సజీవంగా పాతిపెట్టి, మనవరాల్ని వెనక్కి తెచ్చేసుకున్నాడు. యిప్పటికీ అక్కడ చెరుకు పంట కాపంతా చేదుగానే వుంటుందని అంటారు.

మనవరాలు రేణుకాదేవి ముమ్మూర్తులా కూతురి పోలికల్తోనే ఎదుగుతుండటం చూసాకా, ఆమెను కూడా బయటి ప్రపంచానికి పణంగా పెట్టడానికి యిష్టపడలేదు సుబ్బరాజుగారు. తన రెక్కల క్రిందే దాచేసుకోవాలనుకున్నాడు. దరిమిలా ఆ యింట్లో ఆయన మరో యిరవయ్యేళ్ళు బతికాడు. అన్నాళ్ళూ ఆ తాతామనవరాళ్ళెలా బతికారో బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు. పొలాలు కౌలుకి వదిలేశాడు. గుడిని పట్టించుకోవడం మానేసాడు. ఎప్పుడో రథసప్తమికి ఊరివాళ్ళే చొరవజేసుకుని రథాన్ని ఊరేగించేవారు. పొద్దస్తమానం మనిషెత్తు వుండే బయటి అరుగుల మీద పడక్కుర్చీలో కూర్చుని పావురాళ్లకి నూకలు చల్లేవాడు. పాలేర్లే బయటికెళ్ళి చేయాల్సిన కాసిని పనులూ చేసిపెట్టేవారు.

రేణుకాదేవి యుక్తవయస్సుకొచ్చేసరికి ఆయన చనిపోయాడు. యిక ఆమె బయటకి రాక తప్పదని శ్రీపాదపట్నం ఎదురుచూసింది. ఎవరూ బయటకి రాలేదు. భవంతి అదే నిశ్శబ్దాన్ని యథాతథంగా కొనసాగించింది. ఆ నిశ్శబ్దం వెనుక ఏవో ఘోరాలు ఊహించబడ్డాయి. అవన్నీ ఊరంతా పుకార్లుగా ప్రచారమయ్యాయి. ఆ దారంటా పోయే వాళ్ళు తలెత్తి చూస్తే అప్పుడపుడూ కిటికీ దగ్గర ఆమె ముఖం కన్పించేది. అది ఎపుడో గాని క్రిందకి చూస్తూ కన్పించేది కాదు. ఎక్కడో ఏటి కావల క్షితిజరేఖ వైపు చూస్తూ కనిపించేది. మొదట్లో ఆ ముఖంతో ప్రేమలో పడిపోయినవారెందరో వున్నారు. వాళ్ళెవరూ సాహసించని తెంపరితనం ఊళ్ళో ఓ భూస్వామి కొడుకు ప్రదర్శించాడు. ఈ ప్రపంచంలో తన మగతనానికి నిషిద్ధం ఏమీ లేదన్న గీర గలవాడు కావడంతో ఒకనాడు తెగించి ఎత్తు అరుగుల మెట్లెక్కి భవంతి లోపలికి వెళ్ళాడు. సాయంత్రానికి పిచ్చివాడై బయటికి వచ్చాడు. అతణ్ణించి తలాతోకా వున్న సంగతేదన్నా రాబట్టాలని వూరివాళ్ళు విఫల ప్రయత్నాలు చాలా చేశారు. బెదురు కళ్ళతో, చొంగ కార్చుకుంటూ, కన్నీరుమున్నీరవుతూ, “ఖాళీ ఊయల బల్ల ఊగుతోంది”, “మెడ తెగిన గొర్రెకి కళ్ళు బతికే వున్నాయి”, “కుక్కంత గండు చీమ కాపలా కాస్తుంది”... యిలా పరస్పరం సంబంధం లేని గజిబిజి దృశ్యాలు నెమరువేసుకు వణికిపోయాడు. ఈ సంఘటన ఊరివాళ్లకు కోపం తెప్పించింది. కొందరైతే భూతవైద్యుల్ని రప్పించి భవంతి వాకిట ముగ్గులేయించి నిమ్మకాయలు పెట్టి పూజలు కూడా చేయించారు. కానీ ఏ ప్రయత్నమూ దాని నిశ్శబ్దాన్ని భంగపరచలేకపోయింది.

జరిగిన అనర్థానికి కారణం మొదట్లో రేణుకాదేవే అనుకున్నారు జనం. ఆమెను ద్వేషించారు. ఆ కొన్నాళ్ళు మగరాయుళ్ళు భవంతి ముందు గుంపులుగా చేరి చుట్టలు కాలుస్తూ గుసగుసగా మాట్లాడేవారు. అమ్మలక్కలు కిటికీ వైపు మెటికలు విరిచేవారు. ఒక రథసప్తమినాటి ఊరేగింపులో నయితే, కొంతమంది దుడుకు కుర్రాళ్ళు రథం చిటారుకొమ్ము దాకా ఎక్కి, అక్కణ్ణించి ఒకే ఎత్తులో వుండే భవంతి కిటికీ మీదకి అరటిపళ్ళూ, కొబ్బరి పెచ్చులూ విసిరారు. కిటికీ ఊచల్లోంచి దూరిన ఓ పెచ్చు తగిలి ఆమె నుదురమ్మటా రక్తం కారడం కూడా చూశారు. ఆమె బాధతో తల పట్టుకుని కిటికీ తలుపు వేసేసింది. కక్షతో ఆమె ఏ దుష్టశక్తి ప్రయోగిస్తుందోనని జనం భయపడ్డారు. ఆ కుర్రాళ్ళ జీవితానికి అదే ఆఖరు రాత్రి అన్నట్టు తల్లులు శోకండాలు పెట్టారు. కానీ ఎవరికీ ఏమీ కాలేదు. దాంతో భూస్వామి కొడుక్కి పిచ్చెక్కడానికి కారణం సుబ్బరాజుగారి ప్రేతాత్మేననీ, ఆమె కాదనీ తీర్మానించారు. ఆ ప్రేతాత్మ కూడా జోలికి వచ్చినవాళ్ళనే పట్టించుకుంటున్నట్టు తోచింది. దాంతో కొన్నాళ్లకి అంతా భవంతిని పట్టించుకోవడం మానేసారు. దాని పసుపుగోడల మీద బొగ్గుతో పుర్రెబొమ్మలు గీసి, హెచ్చరికలు రాసారు.

యీ సంఘటనల వల్ల రాజవీధి మర్యాద మాత్రం దిగజారిపోయింది. ఒకప్పుడు ఆ వీధమ్మటా గేదెల్ని తీసుకెళ్ళాల్సి వస్తే వాటి పేడ నేల మీద పడకుండా రైతులు వెనక తట్టలు పట్టుకుని నడిచేవారు. యిప్పుడు అవి వేసిన పేడలు అలానే వీధిలో ఎండిపోతున్నాయి. వీధిలో సందడంతా చచ్చిపోయింది. గుడికి వచ్చేవాళ్ళు తగ్గిపోయారు. దాంతో పూల కొట్లు పండగకు తప్ప తెరవటం లేదు. సత్రం పాడుబెట్టేశారు. అప్పటిదాకా శ్రీపాదపట్నానికి నడిబొడ్డుగా మెలిగిన ఈ వీధి క్రమేపీ పక్కకి నెట్టివేయబడింది. ఊరు మరో వైపు ఎదిగింది. ఊరికి అటుచివర గడియారస్తంభం వున్న దుకాణాల కూడలి నడిబొడ్డుగా మారింది. ఏటి వొడ్డున రాజవీధి మాత్రం ఓ శిథిలవాడగా మిగిలింది.

రోజులు గడుస్తున్నాయి. రేణుకాదేవి రోజులెలా గడుస్తున్నాయో మాత్రం ఎవరికీ తెలియదు. ఆమెకి పావురాలే తిండి తెచ్చి పెడుతున్నాయనుకునేవారు. శ్రీపాదపట్నం పావురాళ్ళు అంగళ్ళలో షావుకార్లు విసిరిన నూకల్తో సరిపెట్టుకోక, ఒక్కోసారి తిండిపదార్థాలూ నిత్యావసరవస్తువులూ కూడా దొంగిలించడమే దీనికి సాక్ష్యంగా కనపడేది. దీనికి తగ్గట్టే ఆ భవంతి కిటికీ చుట్టూ పొడుచుకు వచ్చినట్టుండే గూడు ఎప్పుడూ పావురాల్తో కిటకిటలాడుతూ వుండేది. ఆమె ఎవరికి రాణి అయినా కాకపోయినా ఆ పావురాళ్లకి రాణిలానే కన్పించేది. అవి కబుర్లూ, కష్టాలూ, గొప్పలూ, చాడీలూ అన్నీ ఆమెతోనే ఏకరువు పెట్టుకునేవి. మార్దవమైన, స్నేహితం తెలిసిన రాణి! ఈ బూడిదరంగు పావురాళ్ళన్నింటిలోనూ ఆమెకు ఒక తెలుపురంగు పావురం అంటే బాగా మచ్చిక. మిగిలినవన్నీ ఊళ్ళో పచార్లకు, సొంత పెత్తనాలకూ అటూయిటూ పోతూ వస్తూ వున్నా, అది మాత్రం ఎక్కువ కిటికీ దగ్గరే గడిపేది. దాన్నొక్కదాన్నే ఆమె కిటికీ ఊచల మధ్య నుంచి లోపలికి తీసుకునేది. వళ్ళో పెట్టుకు ఆడుకునేది. ఒకవేళ ఈ పావురం కూడా తన గూటి వ్యవహారాలు చక్కదిద్దుకోవడానికి బైటకి వెళిపోతే, ఆమె కలం కాగితాలూ పుచ్చుకుని బొమ్మలేసుకునేది. ఒకసారి ఈ తెల్ల పావురాన్ని కాగితం మీద ఒంటికాలితో నిలబెట్టి దాని గోళ్ళ అంచులమ్మటా కలం కదుపుతూ గీసి, వచ్చిన ఆకృతిని చీకటాకాశంలో పెద్ద నక్షత్రంగా వాడుకుంటూ బొమ్మ గీసింది. గోడకి అతికించిన ఆ బొమ్మ చూసినపుడల్లా తెల్ల పావురం రొమ్ము విరుచుకునేది.

రేణుకాదేవి దగ్గర తనకు దక్కింది చాలా ప్రత్యేకమైన హోదా అని దానికి తెలుసు. దానికి తోడు, ఆమె చేతి స్పర్శ తన కుచ్చుటీకల కన్నా మృదువైందేదో తడుముతున్నట్టూ, ఆమె వడి వెచ్చదనం తన గూటి కన్నా భద్రమైందేదో చుట్టూ ఆవరించుకున్నట్టూ వుండేవి. దాంతో విడిచిపెట్టేది కాదు. ఆమెకు మరింత ముద్దొచ్చే చేష్టలే ప్రదర్శించాలని తపించేది. ఆమె మనసు విరిగేలా ఎపుడూ ప్రవర్తించేది కాదు. అయితే కొన్నాళ్ళకే ఆమె మనసు విరిగే పరిస్థితి కలిగింది. పావురం వల్ల కాదు, మరో వైపరీత్యం వల్ల. ఒకనాడు ఆమె వళ్ళో ఒదిగి అర్థనిమీలిత నేత్రాల్తోవున్న పావురంపై రేణుకాదేవి భళ్ళున గుక్కెడు రక్తం కక్కింది. పావురపు తెల్లని వళ్ళంతా రక్త స్నానం చేసినట్టయింది. అది బెదిరి కిందకు దూకింది. రేణుకాదేవి బాధతో కడుపుపట్టుకుని మెలి తిరుగుతూ నేల మీదకు జారి దొర్లసాగింది. పావురం బెంబేలెత్తి రెక్కలల్లార్చుకుంటూ ఆమె చుట్టూ గెంతింది. కిటికీ ఊచల్లోంచి మిగతా పావురాలూ తలలు లోపలికి పెట్టి కళవళంగా అరవసాగాయి. ఎవరికీ ఏమీ పాలుపోలేదు. చివరికి తెల్లారగట్ల ఎప్పటికో ఆమె తనంతటతానుగా స్పృహలోకి వచ్చింది.

తర్వాతి రోజులు పావురాళ్లకి భారంగా నడిచాయి. ముఖ్యంగా తెల్లపావురాయికి. దానికి యిదివరకటి మాలిమి లేదు. రేణుకాదేవి యిదివరకట్లా వుండట్లేదు. వళ్ళో తీసుకు నిమరడమైతే చేస్తోంది గానీ, ఆ పావురాయికీ తెలుస్తోంది, తన స్థానంలో వేరే ఏ పావురమున్నా, అసలు ఏదన్నా కాకి వున్నా కూడా అట్లానే నిమురుతుందని. ఆమె ఎక్కువ సమయం పందిరిమంచం మీద నిద్రపోవడంలోనే గడుపుతోంది. కిటికీ దగ్గరకు రావడం తగ్గిపోయింది. లోపలికి వచ్చే చొరవ ఎలాగూలేని పావురాలు ఏం చేసేది లేక కిటికీ దగ్గరే చక్కర్లు కొడుతున్నాయి. ఆ చొరవ వున్న తెల్ల పావురం కూడా, ఈ నిర్లక్ష్యం పట్ల తాను కినుక చెందినట్టు ఆమె గ్రహించాలనీ, తను లేని లోటు తెలిసొచ్చి ఆమే స్వయంగా రమ్మనే దాకా లోపలికి వెళ్ళకూడదనీ నిశ్చయించుకుని, ఎక్కువగా బయటే మసలుకుంటోంది. ఒకనాటి ఉదయం కిటికీ దగ్గర మిగతా పావురాళ్ళు గుంపుగా గుమికూడటం చూసి, వాటిని ఆదరాబాదరాగా తప్పించుకొని, తెల్లపావురం లోపలికి వెళ్ళేసరికి, రేణుకాదేవి నేల మీద బోర్లా వాలి తెల్ల కాగితం మీద ఏదో గీస్తోంది. అలికిడి విని తలెత్తి అలసటగా నవ్వింది కూడా. పావురాయి ఊపిరి పీల్చుకుని, గెంతుకుంటూ ఆమె భుజం ప్రక్కకు చేరింది. ఆమె వేసే బొమ్మని తల చకచకా వంకర్లు తిప్పుతూ  ఆసక్తిగా చూసింది. అర్థం కాకపోయినా ఆమెను ఉత్సాహపరిచేందుకు రెక్కలల్లాడించి కువకువలాడింది. ఆమె నవ్వుతూ పావురాన్ని చేతుల్లోకి తీస్కొని ఎండిన రక్తం మరకలతో వున్న దాని శరీరాన్ని జాలిగా నిమిరింది. ముద్దుపెట్టుకుంది. తర్వాత అప్పటిదాకా గీసిన కాయితాన్ని మడిచి దాన్నో దారంతో పావురాయి కాళ్లకు కట్టింది. పొందిగ్గా దోసిట్లో ఎత్తుకు కిటికీ దగ్గరకు వచ్చి ఊచల సందుల్లోంచి గాల్లోకి వదిలింది. మిగతా పావురాళ్ళు కొంత దూరం కుతూహలంతో దాని వెనక ఎగిరాయి గాని, అది కసురుకోవడంతో తిరిగి కిటికీ దగ్గరకు వెళిపోయాయి.

ఎగరడమైతే ఎగిరింది గాని, పావురానికి ఎటువెళ్లాలో తెలియలేదు. కానీ రేణుకాదేవి దగ్గర పాత హోదా తిరిగి దక్కిన ఉత్సాహం ఎటో ఎగరమంటోంది.  రేవు దగ్గర రావి చెట్టు కొమ్మల్లోంచి పలకరించిన పిట్టల్ని పట్టించుకోకుండా, పడవల తెరచాపల్ని చుట్టుతిరుక్కుంటూ, ఏరు దాటి ఉత్సాహంగా క్షితిజరేఖ వైపు సాగిపోయింది. ఎన్నో ఊళ్ళూ పొలాలూ దాటుకుంటూ పోయింది. ఒక చోట ఊరి చివర పొలం మధ్యనున్న ఓ గుడిసె దాన్ని ఆకర్షించింది. ఆ గుడిసె వాకిట్లో పాతిన కర్ర పైని చెక్కగూట్లో పావురాల సందడి కనిపించింది. ముఖ్యంగా పెంటిపావురాల వాసన మదమెక్కించేట్టు వస్తోంది. ఎగురుతున్న పావురం కాస్తా రెక్కల జోరు తగ్గించి, ఆ గూటివైపు దిగింది. దిగుతోంటే తెలిసింది అదో కుమ్మరి గుడిసె అని. కుమ్మరి వాడు అడుసు తొక్కడంలో మునిగి వున్నాడు. పావురం ఉబలాటంగా వచ్చి చెక్కగూట్లో వాలింది. అనుకున్నట్టే అక్కడున్న వాటిల్లో అందమైన పెంటిపావురమొకటి వుంది. దాని వంటి తెలుపూ, రెక్కల నాజూకూ, తోక సోకూ!... పావురానికి కైపెక్కిపోయి దాని చుట్టూ గెంతసాగింది. కాని అదేమంత ఉత్సాహం చూపించలేదు సరి కదా, దీని వంటిపై రక్తపు మరకలు చూసి రోతగా మొహం పెట్టి పక్కకు పోయింది. తెల్లపావురం అంత త్వరగా వెనక్కి తగ్గేది కాదు. కానీ యింతలోనే గూటి చుట్టుప్రక్కలా, పైనా వున్న మిగతా పావురాళ్ళన్నీ వచ్చి దీన్ని అవతలికి పొమ్మని కసురుకోవడం మొదలెట్టాయి. ఈ గలాటా అంతా విన్న కుమ్మరివాడు కొంపదీసి ఏదన్నా గ్రద్ద వచ్చివాలిందేమోనని కంగారు పడి గూటి దగ్గరకు పరిగెత్తుకొచ్చాడు. సరిగ్గా అపుడే గూట్లోంచి నెట్టబడిన తెల్లపావురం సరాసరి వాడి చేతుల్లో పడింది. అయినా అది సిగ్గులేకుండా యింకా గూట్లో పెంటిపావురం కేసే నిక్కినిక్కి చూస్తోంది. తాను కుమ్మరివాడి చేతుల్లో వున్నాననీ, వాడు తన కాళ్ళకున్న కాగితం చుట్టని విప్పదీసుకుంటున్నాడనీ కూడా దానికి స్పృహ లేదు. వాడు కాగితం తీసుకుని పావురాన్ని నేల మీదకు వదిలిపెట్టాడు. పావురానికి అదో కొత్త లోకంలా వుంది. ప్రేమకి అనువైన కొత్త బంగారు లోకం! కుమ్మరి వాడు గుడిసంతా కళ్ళకింపుగా సర్దుకున్నాడు. చుట్టూ దడికి బదులు రంగురంగుల అయిరేణి కుండలు పేర్చుకున్నాడు. గుడిసె మీదకి గుమ్మడి పాదులు దట్టంగా పాకివున్నాయి. గుడిసె చూరు క్రింద సారె తిరుగుతోంది. వాకిట్లో ఓ మూల ఆవం తెల్లటి పొగలు కక్కుతోంది. వాకిలి దాటితే చుట్టూ పచ్చగా పొలాలు ఆవరించి వున్నాయి. ఓ పద్ధతంటూ లేకుండా విసిరేసినట్టున్న ఈ అందాలన్నీ, గుడిసె వాకిట్లో నిలబెట్టిన పావురాల గూటిని ములుకుగా చేసుకుని చుట్టూ పరిభ్రమిస్తున్నట్టున్నాయి. ఆ గూటిలో పావురాలన్నింటి మధ్యా రాణిలాగా తన పావురం! తెల్లపావురానికి, తననిలా పట్టి లాగేస్తోంది ఈ అందానికి మధ్యలో వున్న పెంటిపావురమా, లేక దాని చుట్టూ వున్న ఈ అందమా అన్నది అర్థం కాలేదు. ఆలోచించలేక తల విదుల్చుకుంది. ఓ ప్రక్క కుమ్మరి వాడు అప్పటిదాకా అడుసు తొక్కిన బురద కాళ్ళతోనే గుడిసె గుమ్మంలో కూచుని రేణుకాదేవి పంపిన బొమ్మని ఏకదీక్షగా చూస్తున్నాడు. ఇదే అదనుగా మళ్ళీ ఓసారి గూటి మీదకు ఎగురుదామా అని చూసింది తెల్లపావురం. కానీ పైన అవి యింకా గోల చేస్తూనే వున్నాయి. పెంటిపావురమైతే లోకంలో ఆడజాతి నిరసన అంతా తన కళ్ళల్లోనే పెట్టుకు చూస్తోంది. తెల్లాపావురం మాత్రం ఆ నిరసనను పెద్దగా పట్టించుకోలేదు. రేణుకాదేవి మిగతా పావురాలన్నింటినీ కాదని దీన్ని మాలిమి చేసినప్పటి నుంచీ, దీనికి తన ఆకట్టుకునే శక్తి మీద బోలెడు భరోసా వచ్చేసింది. అయితే అన్నీ తొలిచూపులోనే అయిపోవాలంటే ఎలాగని తనకు తానే సర్ది చెప్పుకుని, మళ్ళీ వచ్చి ప్రయత్నిద్దాంలే, అప్పటికీ కాకపోతే, మళ్ళీ మళ్ళీ వచ్చి ప్రయత్నిద్దాం లెమ్మనుకుంది. ఈ నిర్ణయం యిచ్చిన ఉత్సాహంతో ఉవ్వెత్తున రెక్కల మీద లేచి వచ్చిందారినే వెనక్కుపోయింది. యిక మర్నాటి నుంచి ప్రయత్నాలు మొదలయ్యాయి. రోజూ రేణుకాదేవి ఏదో బొమ్మ గీసి కాళ్లకు కట్టి పంపించడం, తెల్లపావురం తిన్నగా ఈ గుడిసె దగ్గర వచ్చి వాలడం. దానికి ఒకటర్థమైంది, రేణుకాదేవి పంపే బొమ్మలేవో ఈ కుమ్మరి మొహాన పడేస్తే, ఆ తర్వాత తాను గూట్లో దూరి పెంటిపావురంతో ఎన్ని సరాగాలాడినా, అది పెంకిగా ఎంత గోల చేసినా, కుమ్మరి వాడిక పట్టించునే ధ్యాసలో వుండడు. కాబట్టి అది వచ్చి వాలీవాలడమే కుమ్మరి వాడెక్కడుంటే అక్కడ వాలేది. వాడు అడుసు తొక్కుతున్నా, సారె తిప్పుతున్నా, కుండలకు మట్టు కొడుతున్నా, బానల్ని ఆవంలో కాల్చుతున్నా, ఎంత హడావిడి పనిలో వున్నా సరే, అన్నీ వదిలేసి పావురం దగ్గరకు వచ్చేసేవాడు. పావురం కాలికి కట్టివున్న కాగితం విప్పుకుని, ఓ మూలకి పోయి, దాన్నే చూస్తూ కూచునేవాడు. ఈ పరధ్యాసని అనుకూలంగా మార్చుకుని తెల్లపావురం నానా తైతక్కలూ ఆడి తొందర్లోనే పెంటిపావురాన్ని గెల్చేసుకుంది.

కుమ్మరివాడు యువకుడు. ఎన్నేళ్ళమట్టో సారె తిప్పుతున్న భుజాలతో, అడుసు తొక్కుతున్న కాళ్ళతో శరీరమైతే బిరుసెక్కింది గానీ, సారెపై మట్టిముద్దని వేలి అంచుల నిపుణమైన కదలికల్తో కుండగా మలిచేటప్పుడు కలిగే సీతాకోక రెక్కంత పల్చనైన పులకలురేపే ఆనందానికి స్పందించడంలో, మనసు మాత్రం స్నిగ్ధత్వాన్ని కోల్పోలేదు. అవే కుండలూ అవే బానలూ ఎన్నిసార్లు చేసినా, అంచు దగ్గర కొత్తగా పెట్టిన మెలికో, మూత మీద కొత్తగా తిప్పిన వంపో అతనికి ప్రతీ కుండ తయారీలోనూ ప్రత్యేకమైన సాఫల్య సంతృప్తిని కలిగించేది. అతని పనంటే అతనికి ప్రాణం. ఎలాగూ పూట గడవడానికి అక్కరకొస్తుంది కాబట్టి కానీ, లేదంటే ఎదురుడబ్బిచ్చైనా చేసేవాడే. రాత్రి పనికట్టేసి గుడిసె వాకిట్లో నులకమంచం వాల్చుకుని పడుకున్నపుడు మాత్రం, గుండెని బంకలా అంటుకున్న ఖాళీతనమేదో ఆవిరిలా అతణ్ణి ఆవరించుకునేది. ఈమధ్య పావురం తెస్తున్న బొమ్మలతో ఈ ఖాళీ కొంత భర్తీ అయింది. యిదివరకట్లా పైన నక్షత్ర ఖచిత ఆకాశమూ, అడపాదడపా తాగితూల్తున్న నక్షత్రాల్లా వంకర్లు తిరుగుతూ ఎగిరే మిణుగురులూ, ప్రక్కన పావురాళ్ళ గుడగుడలూ... యివన్నీ అతణ్ణి వశపర్చుకోలేకపోతున్నాయి. పడుకున్నపుడల్లా ఆ రోజొచ్చిన బొమ్మ గురించి ఆలోచించేవాడు. అవన్నీ అతణ్ణి ఆకట్టుకున్నాయి. బూడిదరంగు పావురాల్ని పూసిన రావిచెట్టూ, తెరచాపలు విడిచి వీధుల్లో తేల్తూ ప్రయాణిస్తూన్న మేడలూ, గిట్టలకు అంటిన పుప్పొడితో దేవగన్నేరు పూల చుట్టూ తుమ్మెదరెక్కల్తో చక్కర్లు కొడుతున్న బుల్లి గేదెలూ... యిలా వింతగా వుండేవి ఆ బొమ్మలు. ఒక్కో బొమ్మలో ఆహ్లాదం వుండేది, ఒక్కో బొమ్మలో దిగులు వుండేది, కానీ ప్రతీ బొమ్మలోనూ ఏదో తరుముకొస్తున్న తొందర వుండేది. బొమ్మల గీతల్లో ఏదో అందమైన మనసు శ్రద్ధ పెట్టి గీసినట్టు తెలిపే అపరిపక్వత వుండేది. అది అతనికి బాగా నచ్చింది. కానీ ఎవరికో నిర్దేశించబడిన ఈ సంకేతాలన్నీ పావురం కామ ప్రకోపం కారణంగా దారి తప్పుతున్నాయని ఆ పంపేవాళ్ళకెలా తెలియజెప్పాలో కుమ్మరివాడికి తెలిసింది కాదు. పావురం వెనక్కి వెళ్తున్నపుడు తిరుగుటపాలో ఏదన్నా రాసి పంపుదామంటే అతనికి చదువు రాదు. పైగా బోలెడంత కుతూహలం పెరిగిపోతోంది. చదువైతే రాదుగానీ, కుమ్మరిది కుశాగ్రబుద్ధి. ఒకనాడు పావురం తెచ్చిన బొమ్మలో కిటికీ ఊచల్లోంచి కన్పిస్తున్నజనార్దనస్వామి రథం వూరేగింపూ, దాని చిటారు కొమ్మ మీద తాటాకంత రెక్కల్ని అల్లలాడిస్తున్న పెద్ద గ్రద్ద వున్న దృశ్యం చూసాక, ఈ బొమ్మలెక్కణ్ణించి వస్తున్నాయో ఊహించగలిగాడు. కుంభవృష్టిగా వర్షం కురుస్తున్న ఓ రోజు, గుడిసె గొళ్ళెం వేసి, గొడుగు చేతపట్టుకుని, శ్రీపాదపట్నానికి ప్రయాణమయ్యాడు.

శ్రీపాదపట్నం పోవడానికి ఏరు దాటాలి. పడవలో వున్నంతసేపూ బొమ్మలున్న కాగితాల్ని కండువాలో మడతపెట్టి చంకలో దోపుకున్నాడు. తెడ్డేస్తున్న పడవవాడు వాన ధాటికి చుట్ట మాటిమాటికీ ఆరిపోతుంటే కాసేపు తెడ్డేయడం ఆపి కుమ్మరి పట్టుకున్న గొడుగులో దూరి కాల్చుకున్నాడు. చంకలో వున్నవేంటని అడిగాడు. సొమ్ములన్నాడు కుమ్మరివాడు. ఒకే గొడుగులో వున్నాక మాట కలపకపోతే బావుండదని, శ్రీపాదపట్నంలో ఆ యేడు రథంవూరేగింపు ఎలా జరిగిందని అడిగాడు పడవవాణ్ణి. వాడు పొగాకు ఉమ్ము ఏట్లోకి ఊసి, ప్రతీ యేడూ ముంగటి ఏడు కన్నా నాసిగా జరుగుతోందనీ, ఈ యేడూ అల్లానే అయిందనీ, జనార్దనస్వామి అజాపజా పట్టించుకునేవాళ్ళు లేకండాపోయారనీ, తిరణాలక్కూడా జనం రాటం లేదనీ, వేరే యాపారం పెట్టుకుందారని చూస్తన్నాననీ, యిదిగో పడవ అమ్మకానికే బేరం తెవలట్లేదనీ... మొత్తం కథంతా చెప్పుకొచ్చి, చుట్ట వో చివరి పట్టు పీల్చి, మళ్ళీ ఆదరాబాదరాగా తెడ్డేయడానికి వెళిపోయాడు. ఏనుగు తొండాల్తో కుమ్మరించినట్టు కురుస్తున్న వానలో జనార్దనస్వామి గుడిగోపురం లీలగా కనిపించడం మొదలుపెట్టింది.

రేవులో దిగి వీధి పైకి నడిచాక అతనికి రాజ భవంతిని ఆనవాలు పట్టడం కష్టం కాలేదు. ఎందుకంటే పావురం తెచ్చిన చివరిబొమ్మ ప్రకారం రథం చిటారుకొమ్మ కిటికీలోంచి కనపడాలంటే అది రెండంతస్తుల భవంతి అయివుండాలి. ఆ వీధిలో రెండంతస్తులున్న భవంతి అదొక్కటే. దాని ఎదుట నిలబడి కాసేపు పై అంతస్తు కిటికీ వైపు చూసాడు. కానీ దళసరి వానతెర వల్ల ఏమీ స్పష్టంగా కనపడలేదు. చివరికి ఎత్తు అరుగుల మెట్లెక్కి, గొడుగు అరుగు మీద ఆరబెట్టి, లోపలికి తొంగి చూస్తూ పిలిచాడు. ఎవరూ పలకలేదు. చాలాసేపు చూసి చూసి యిక లాభం లేదని జంకుతూనే లోపలికి వెళ్లాడు. మొత్తం అంతా తిరిగాడు గానీ ఎవరూ లేరు. ఒక చోట పచ్చగా చెక్క మెట్లు పై అంతస్తుకి వెళ్తున్నాయి. ఎక్కి పైకి వెళ్ళాడు. లోపల గదిలో పందిరిమంచం మీద ఒకామె నిద్రిస్తోంది. లేపబుద్ది కాలేదు. లేచేదాకా వుందాంలే అని గుమ్మానికి ఆనుకుని నిలబడిపోయాడు. అంత అందమైన ముఖం వాడు అదివరకూ కలల్లో కూడా చూడలేదు. చూస్తూ వుండిపోయాడు. నిద్ర మధ్యలో ఓ సారి కళ్ళు తెరిచిన రేణుకాదేవి, యిలా తన గుమ్మం దగ్గర ఆనుకుని వున్న కొత్త మనిషి కూడా తన కలలో భాగమన్నట్టు, పలకరింపుగా నవ్వి మళ్ళీ నిద్రలోకి జారుకుంది. ఆమె కళ్ళు వెంటనే మూసేసినా, ఆమె నవ్వుకు ప్రతిగా కుమ్మరి నవ్విన నవ్వు మాత్రం కాసేపలానే అతని ముఖం మీద తారాడింది. పూర్తిగా నిద్రలేచింతర్వాత కూడా, ఆమె ఏ కొత్తా కనపరచలేదు. యిందాకటి నవ్వుకు కొనసాగింపులాగా పలకరింపుగా నవ్వి, నింపాదిగా లేచి కూర్చుని, లోనికి రమ్మని పిలిచింది.

కుమ్మరి అణకువగా లోనికి వచ్చి తనను పరిచయం చేసుకున్నాడు. ఉత్తరాలు దారి తప్పుతున్న సంగతి చెప్పి, వాటిని ఆమెకి అందించాడు. ఆమె అదేమీ పెద్ద విషయం కాదన్నట్టూ వాటిని తీసుకుని పక్కన పెట్టేసింది. ప్రయాణం సంగతి అడిగింది. అతను ప్రయాణం బానే జరిగిందని చెప్పి, తనకు చదువురానందువల్లనే ఈ విషయం తిరుగు టపాలో పంపలేక స్వయంగా రావలసివచ్చిందని, సంజాయిషీగా ఏదో మొదలుపెట్టాడు. ఆమె ఆ విషయంపై ఆసక్తి చూపించకుండా, కిటికీ దగ్గరున్న కుర్చీ లాక్కుని కూచోమంది. కుర్చీ లాక్కుంటున్నపుడు అతనికి కిటికీ ఊచల దగ్గర వానలో తడవకుండా మునగదీసుకు వణుకుతున్న తెల్లపావురం కనపడింది. ముద్దుగా పలకరించాడు గానీ, అదేమీ గుర్తించనట్టు ఓసారి ముక్తసరిగా కువకువమని మిన్నకుండిపోయింది. కుర్చీ పందిరిమంచానికి ఎదురువేసుకుని కూర్చున్నాక, రేణుకాదేవి అతని వివరాలు అడిగింది. మొదట్లో ఆమె వంటి రాచరికపు మనిషి తనబోటి వాడి జీవితం నుంచి ఏమి తెలుసుకోగోరుతుందని తను అనుకుంటున్నాడో ఆ వివరాలు చెప్పాడు. తన కుమ్మరి పని గురించీ, తను తయారు చేసే సరుకు రకాల గురించీ, ఈ మధ్య గిరాకీ ఎలా వుందన్న దాని గురించి, తమ వంశంలో మంచి పనివాళ్ళ గురించీ... యివన్నీ చెప్పుకొచ్చాడు. ఆమె తలాడిస్తూ వింది. కానీ కాసేపటికే ఒకటి గమనించాడు. ఆమె ఈ విషయాల మీద కన్నా, యివి చెప్పడంలో మాటవరసగా అడపాదడపా దొర్లే తన మనసుకు నచ్చిన విషయాల పట్లే ఎక్కువ ఆసక్తి చూపిస్తోంది. అవి అల్ప విషయాలు. గొప్పవాళ్ళ దగ్గర ప్రస్తావించేందుకు అనర్హమనిపించే తేలిక విషయాలు. ఒకసారి దొడ్లో బంతిపూల మొక్కల్ని కుందేలు వచ్చి ఊరికే కొరికేస్తుంటే, దాన్ని అదిలిద్దామన్చెప్పి, తిరుగుతున్న సారెని అలానే వదిలేసి పరిగెత్తాడు. తరిమేసింతర్వాత వచ్చి చూస్తే సారె మీద మట్టిముద్దగా కూలిపోయిన కుండ అచ్చంగా కుందేటి తలకాయలా వుందన్న విషయం చెప్పినపుడు ఆమె కళ్ళు విప్పార్చుకు విన్నది. అలాగే పొలాల్లో తిరిగే ఓ తోడేలు రాత్రుళ్ళు తన గుడిసెకి వచ్చి కుండల్లో తల పెట్టి ఊళ వేసేదని, తన పాట సోకుకీ గొంతు గంభీరానికీ తనే మురిసిపోయేదనీ చెప్తూంటే, ఆమె చెంపలు విప్పార్చి నవ్వింది. తన కిటికీ దగ్గర కూడా పావురాలు చేసే అలాంటి అల్లరి చేష్టల్ని చెప్పింది. తనకు నచ్చే మాట ఏది చెప్పినా ఆమెకి నచ్చుతోంది. అతను తొందర్లోనే జంకు వదిలేసాడు. ఎపుడూ వెలుగు చూడని లోపల్లోపలి కలలన్నింటికీ మాటలు ఏరి తెచ్చి బైటికి సాగనంపుతున్నాడు. ఆమె మంచం మీద కాసేపు బాసింపట్టు వేసుక్కూచునీ, కాసేపు కాళ్ళు కిందకి వేలాడేసి, కాసేపు శేషశయనుడైన విష్ణుమూర్తిలా తలగడ మీద వాలిపోయి, ఊ కొడుతూ వింటోంది. తనకు తోచినవి చెప్తోంది. ఒకరికొకరు ఎంత తెలిసిపోయారంటే, ఒకరి సంగతులు చెప్పుకుంటున్నపుడు మరొకరు వింటూ ఊరుకోకుండా, నువ్వలా చేసావంటే నమ్మను! అని ఆశ్చర్యపోవడమో, అబ్బే అందాకా వస్తే నువ్వెందుకూరుకుంటావని ఎగదోయడమో, నీకు చాలా బాధేసివుంటుందని జాలిపడడమో, యిలా ఎదుటివారి స్పందనని స్వంతం చేసేస్కుని మాటలు కలుపుతున్నారు. యిలా గంటలు కరిగించేశారు. కిటికీ దగ్గర తెల్లపావురం తల తిప్పుకుని వానాకాలాన్ని విసుక్కుంటోంది.

చీకటివేళ అయింది. బయట వర్షం నిరంతరాయంగా కురుస్తోంది. తర్వాత వెళ్దువు లెమ్మని రేణుకాదేవి అతణ్ణి నిలేసింది. అతనికీ వెళ్లాలని లేదు. అసలు ముందూ వెనకలేం పట్టడం లేదు. అతని ప్రపంచమంతా ఆమె ప్రభావంలో చకితమైపోయివుంది. క్షణాలు ఉద్విగ్నమై మనోహరమై బిగుస్తూ వదులవుతూ ప్రజ్వలించి సంచలిస్తున్నాయి. మనసు స్థలకాలాలకు అతీతమై చీకటి శూన్యంలో ఒకేవొక్కటై వెలుగుతోంది. నేల మీద చమురుదీపపు వెలుగువలయంలో యిద్దరూ కూర్చున్నపుడు ఆమె తన బొమ్మల్ని చూపిస్తూంటే భుజం మీంచి తొంగి చూస్తున్నవాడల్లా ఆమె చెంపలకి చెంప ఆనించకుండా వుండలేకపోయాడు. అతని వేడి చెంపని ఆమె అనునయంగా స్వీకరించింది. బుజ్జగిస్తూ ముందు బొమ్మలు చూడమంది. అతను అప్పటికే కాలిపోతున్నాడు. ఆమెను వళ్ళో లాక్కున్నాడు. మెత్తని ఆమె శరీరాన్ని వడి నిండా పరచుకున్నాడు. తర్వాత ఏం చేయాలో తెలియని కంగారులో పడ్డాడు. మరో శరీరాన్ని ఎన్నడూ అంత చేరువగా తాకలేదు తడమలేదు అదుముకోలేదు. సారె మీద వేళ్ల మధ్య నలిగే మట్టి ముద్ద కన్నా మెత్తగా వుంది ఆమె శరీరం. తేలికైన ప్రాణాన్ని దాచుకున్న పక్షిఎదను నిమురుతున్నట్టు వుంది. ఆమె కూడా, సర్వాంగాలూ పరాధీనాన్ని అంగీకరించి కొత్త స్పందనల్ని చూపిస్తూంటే ఆసరా అందని భయంలో మొద్దుబారిపోయినట్టయి చాలాసేపటి దాకా మృతశరీరంలా అతను ఎటు తిప్పుకుంటే అటు తిరిగింది. అతని శరీరానికి అనుబంధమైపోయి మసలుకొంది. అతను సున్నితత్వం మర్చిపోయాడు. వేటకందిన జీవి ప్రాణంపోగొట్టుకుంటున్న వేదనామయ వొంటరి క్షణాల్లో చంపుతున్న తనే ఆసరా అందిస్తున్నట్టు పులి తన పంజాల్తో ఎంత దగ్గరగా పొదువుకుంటుందో అలా ఆమెని పొదువుకుంటూ, మెడ నోటకరిచి ఎలా అనువైన భంగిమలకి తిప్పుకుంటుందో అలా ఆమెని తిప్పుకుంటూ రమించాడు. చివరకు చలిగా జలదరించి విగత వీర్యుడై ఆమె చిరుచెమటల ఎదపై నిస్సత్తువుగా వాలినాకనే ఆమె పునర్జీవితురాలైనట్టు మరలా నవ్వింది.

ఆ రాత్రి చాలాసేపు నేల మీదే ఎదురుబొదురు ఒత్తిగిలి పడుకుని చమురుదీపం వెలుగులో మసగ్గా కనిపిస్తున్న ఒకరి మొహాల్ని ఒకరు చూసుకుంటూ, ఊరికే ఒకర్నొకరు తడుముకునేందుకు సాకుగా మధ్య మధ్యలో అల్ప విషయాలను, అవి కేవలం మాటలే కానక్కర్లేదు, ఉచ్ఛ్వాసనిశ్వాసాలైనా మూలుగులైనా నవ్వులైనా సరే గొణుక్కుంటూ, అతను ఆమె చెవి తమ్మెల్నో, ఆమె అతని ఛాతి వెంట్రుకల్నో నిమురుతూంటే, ఒళ్ళిక ఒళ్ళు కాకుండా పోయి మళ్ళీ కాక రేగి, మీదకు జరిగి మైథునానికుపక్రమిస్తూ, మొత్తం రాత్రంతా యిలాగే, అతని ప్రహరణాల్ని ఉరుములూ ఆమె మణికూజితాల్ని పావురాళ్ళ కువకువలూ మింగేస్తూండగా ఎప్పటికో సుదీర్ఘంగా తెల్లారింది. ఆ తర్వాతి కొన్ని రోజులూ కూడా యిలాగే సాగాయి. అయినా ఒకరి శరీరంపై ఒకరికి తనివి తీరలేదు. ఒకరి కబుర్లలో మరొకరికి కొత్త కథలు వినిపిస్తూనే వున్నాయి. కానీ అతనిలో దిగులు మొదలవసాగింది. ఆమెను గుడిసెకు తీసుకుపోవాలన్నది అతని ఆశ. మాటల్లో జంటగా తామిద్దరి భవిష్యత్తును ఆమె కళ్ళకు కట్టించడానికి ప్రయత్నించేవాడు. ఆ ప్రస్తావన వచ్చినపుడు ఆమె ఎపుడూ నిశ్శబ్దాన్ని అవలంబించేది. అతను కాసేపు అనునయంగా బుజ్జగించేవాడు, కాసేపు అసహనంగా వేడుకునేవాడు. ఆమె తల దించుకుని పరికిణీ అంచుల్ని మడతపెట్టడమో, నేల మీద గీతలు గీయడమో చేస్తూండేది. ఆమె ఎప్పుడూ ప్రస్తుతంలోనే వుండేది, ఈ క్షణాలు చాలదా అన్నట్టు ప్రవర్తించేది. ఎందుకు సరిపెట్టుకోవాలో అతనికి తెలియదు.

ఒకనాడు రేణుకాదేవి ప్రవర్తన వింతగా వుంది. చంచల చిత్తంతో కంగారుగా వుంది. అతని కౌగిట్లో వుండీ లేనట్టు వుంది. మునుపటి క్షణం వరకూ ఎంత సన్నిహితంగా వుందో, మరుసటి క్షణమే అంత పరధ్యానంగానూ ప్రవర్తిస్తోంది. అతనిలో దిగులూ అసహనం తారాస్థాయికి చేరుకున్నాయి. ఏదీ తేలని అనిశ్చితి విసుగు పుట్టిస్తోంది. ముందువెనకల్లేని ఈ త్రిశంకు స్వర్గం అయోమయం కలిగిస్తోంది. చివరి అస్త్రం ప్రయోగించి చూద్దామనుకున్నాడు. తాను వెళిపోదల్చుకున్నాననీ, తనతో కలిసి బతకదల్చుకుంటే పావురంతో కబురంపమనీ చెప్పి కదిలాడు. ఆమె ఏమీ మాట్లాడకుండా తలదించుకుంది. కనీసం ఆగమని కూడా అడకపోవడం చూసి విసురుగా గడపదాటి చరచరా మెట్లు దిగేసాడు. క్రిందకి వచ్చేసరికి యిపుడు వెళిపోతే తనకేమి మిగులుతుందో తలచుకుంటే గుబులు వచ్చేసింది. దాంతోపాటే అనుకున్నపుడల్లా మౌనంతో తన అంతరంగ ద్వారాల్ని మూసేసుకుని తనని వెలుపలే నిలబెట్టే ఆమె మంకుతనం మీద కోపం వచ్చేసింది. అదే వేగంతో మెట్లెక్కి గదిలోకి వచ్చి ఆమెను దూషించసాగాడు. తర్జని చూపిస్తూ ఆరోపణలు చేయసాగాడు. బెదిరింపులకూ దిగాడు. అన్నీ బయటకు కక్కేసి ఖాళీ అయిపోయిం తర్వాత, ఈ ఉపద్రవంలో తానెంత వెలికిరాలేనంతగా, వెలికిరాయిచ్ఛగించనంతగా కూరుకుపోయాడో అర్థమై, వెక్కి వెక్కి ఏడ్వసాగాడు. ఆమె కదిలి వచ్చి అతణ్ణి కౌగిలిలోకి తీసుకుంది. అలిసిపోయినవాడై యిక తన జీవితాన్ని నిగూఢమైన ఆమె మనస్సాక్షి యిచ్ఛకు వదిలేసినట్టు నిస్సత్తువగా ఆమె చేతుల్లోకి వాలిపోయాడు. యిద్దరూ నేల మీదకు ఒరిగిపోయారు. ఆమె అతణ్ణి వళ్ళోకి తీసుకుని తల నిమురుతూ చెప్పింది, తనకు చావు రాసిపెట్టి వుందనీ, మృత్యువు తన ప్రాణాన్ని తీసుకుపోవటానికి రేపు రాత్రే వస్తుందనీ, అపుడు ఎక్కడున్నా ఒకటేననీ, కానీ నువ్వు నా దగ్గరుండటం ముఖ్యమనీ చెప్పింది. అతను తలెత్తి ఆమె కళ్ళల్లోకి శూన్యంగా చూశాడు. మొద్దుబారిన మనసుతో అయోమయంగా ఆమెను నలిపేస్తూ కౌగలించుకున్నాడు. ఆమె ఉప్పటి కన్నీటి కళ్ళ మీద ముద్దుపెట్టుకున్నాడు. చావుని రానివ్వనన్నాడు. అడ్డం నిలబడతానన్నాడు. ఆమె ఏదో విషయం గుర్తు వచ్చిననట్టు అతణ్ణి విడిపించుకు లేచింది. పందిరిమంచం వైపు నడిచి, పరుపు పైకెత్తి, అక్కడున్న ఒక పెద్ద దబ్బనాన్ని తెచ్చి అతని చేతికి యిచ్చింది. మృత్యువు వచ్చినపుడు ఈ దబ్బనంతో తన గుండెల్లో పొడిస్తే తాను మారు రూపం దాలుస్తాననీ, మృత్యువు గుర్తుపట్టలేక వెళ్ళిపోతుందనీ, తర్వాత ఆ మారిన రూపాన్ని మళ్ళీ పొడిస్తే తిరిగి పూర్వరూపానికి వస్తాననీ చెప్పింది.  అతనికి ఆ రాత్రి నిద్రపట్టలేదు. ఆమె నిద్రిత ముఖాన్ని చూస్తూ వుండిపోయాడు.

మరుసటి రోజు పౌర్ణమి. ఉదయమంతా ఎవరి లోకం వారిదన్నట్టు వున్నారు యిద్దరూ. లేక అతణ్ణి అతని లోకంలో వుండనియ్యడం కోసం ఆమె దూరంగా వుందేమో, అతనికి తెలియదు. ఆ రోజు వాన వెలియడంతో కిటికీ దగ్గర పావురాళ్ళు మునుపట్లా సందడి చేసాయి. రేణుకాదేవి ఆ రోజు తెల్లపావురాన్ని ఒకటే ముద్దు చేసింది. అతను మాత్రం గదిలో ఓ మూల వొదిగి గుబులు గుండెల్తో ఆమెనే చూస్తూ కూర్చున్నాడు. అతనికి తన గుడిసె, కుండలూ గుర్తొచ్చాయి. అదంతా చేరుకోలేని దూరంగా, తిరిగిరాని గతంగా అన్పించింది. రాత్రి కానే వచ్చింది. పూర్ణచంద్రుడు ఏటి మీద పెద్దగా ఉదయించాడు. కాసేపటికే బయటంతా పిండారబోసినట్టు వెన్నెల. వున్నట్టుండి పావురాళ్ళు ఒక్కొకటిగా కిటికీ వదిలి తమ గూళ్ళకు వెళిపోయాయి. వెళ్ళలేక అక్కడే తచ్చాడుతున్న తెల్లపావురాన్ని ఆమె బుజ్జగించి పంపించేసింది. అతని వైపు తిరిగింది. మూలనున్న అతను చేతులు చాచి రమ్మంటే దిగులుగా వెళ్ళి వళ్ళో కూచుంది. ఎవరూ లేచి చమురు దీపం వెలిగించలేదు. కిటికీలోంచి ముద్దగా పడుతున్న వెన్నెల వెలుగు సరిపోయింది. నేల మీద కిటికీ ఊచల్తో సహా పరుచుకున్న వెన్నెల పలక అతనికి ప్రమాదకరంగా, తమ గూటిలోకి ఆగంతక చొరబాటుగా అనిపించింది. యిద్దరూ గది మూల మసక చీకటిలోనే చాలాసేపు ఒదిగి కూచున్నారు. అతని గడ్డం మీద ముద్దు పెట్టి ధైర్యాన్నిస్తున్నట్టు వీపు నిమిరింది. ఆమె రొమ్ముల కింద నుంచి చేతులు కట్టి దగ్గరకు లాక్కున్నాడు. యిరువురి గుండె సవ్వళ్ళే విరామచిహ్నాలుగా గడియల గద్యం గుబులుగా గడిచింది. అర్థరాత్రి అవుతుందనగా ఆమె అతని కౌగలి విడిపించుకులేచింది. వెళ్ళి పందిరిమంచం మీద పడుకుంది. అతనికి సమయం ఆసన్నమైనట్టు అర్థమైంది. లేచి కిటికీ దగ్గరకు వెళ్ళాడు. వంటి మీద చలి మరకలా వెన్నెల పాకింది. బయట రేవులో పడవలు గాలికి జోగుతున్నాయి. నీళ్ళు ఒడ్డుకేసి కొట్టుకుంటున్నాయి. రావి ఆకులు గలగల్లాడుతున్నాయి. ఎక్కణ్ణించో తోడేటి ఊళ వినిపిస్తోంది. అతనికి ఉన్నట్టుండి పడమటి దిక్కున క్షితిజరేఖకు పైనగా ఏటి అవతల్నించి ఏదో నల్లగా ఎగురుకుంటూ రావడం కన్పించింది. పక్కకు తిరిగి ఆమె వైపు చూసాడు. మసక చీకట్లో ఆమె కళ్లు విప్పారి చూస్తున్నాయి. వేగంగా పందిరిమంచం మీద ఎక్కి ఆమెని వెనక నుంచి కౌగలించుకుని చెక్కిలిపై ముద్దు పెట్టాడు. కళ్ళు మూసుకుని దబ్బనాన్ని పిడికిలి మధ్య బిగించి గుండెల్లో గట్టిగా పొడిచాడు. కౌగిట్లో ఆమె శరీరం విలవిల్లాడటం కాసేపు తెలిసింది. తర్వాత హఠాత్తుగా ఆమె శరీర స్పర్శ  లేకుండాపోయింది. కళ్ళు తెరిచి చూసేసరికి పక్క మీంది ఓ కప్ప క్రిందకి దూకుతూ కన్పించింది. అతను దిగ్గున లేచి కూర్చున్నాడు. అదే సమయానికి కిటికీ దగ్గర రెక్కల చప్పుడూ, ఏదో వాలిన అలికిడీ వినిపించింది. దాని నీడ నేల మీద వెన్నెల పలకలో కన్పిస్తుంది. అతను లేచి కిటికీ దగ్గరకు వెళ్ళాడు. తాటాకంత రెక్కల్తో ఒక పెద్ద గ్రద్ద ఊచల్లోంచి తలపెట్టి తొంగిచూస్తోంది. అతను దబ్బనాన్ని వీపు వెనక దాచుకుని కిటికీకి ఎదురెళ్ళి నుంచున్నాడు. కానీ అది మాత్రం అతనక్కడ లేనేలేడన్నట్టు మెడ అటూయిటూ తిప్పుతూ గది అంతా కలయజూస్తోంది. ఎవరూ కన్పించకపోయేసరికి అసహనంగా అతనివైపు చూసి వికృతమైన అరుపు అరిచింది. రెక్కల్ని తాటించుకుంటూ వెనక్కి ఎగిరిపోయింది. అది రావి చెట్టు దాటి, పడవల తెరచాపలు దాటి, ఏరు దాటి, క్షితిజరేఖపై చిన్న చుక్కగా మారిపోయేంత వరకూ కుమ్మరివాడు కిటికీ దగ్గరే నిలబడి చూశాడు. తర్వాత కూడా చాలాసేపు అక్కడే వుండి, అది మరిక తిరిగి రావటం లేదని నిశ్చయించుకున్నాక, అప్పుడు కప్ప కోసం గదంతా కలయజూసాడు. ఎక్కడా లేదు. చమురు దీపం వెలిగించి పందిరిమంచం పైనా క్రిందా, గది మూలమూలల్లోనూ వెతికాడు. తలుపు సందు ఓరగా తెరిచి వుండడం చూసి ఆందోళనగా మెట్ల మీదకు వెళ్ళాడు. దీపంతో మెట్లు పరీక్షించాడు. కప్ప తడి కాళ్ళ ముద్రలు కన్పించాయి. హఠాత్తుగా అతని మనసులో ఒక అనుమానం ప్రవేశించింది. ఆమెకు మనిషిగా వున్నప్పుడు తాను ప్రియుణ్ణన్న స్పృహ వుంటుంది. కప్పగా వున్నపుడు వుండకపోతే. తనిప్పుడు ఆమెకి ఏమీ కాకపోతే. ఆ తెలివిడి కూడా ఆమెకి లేకపోతే. అతని చేతిలో దీపం వణికిపోసాగింది. అతను మొత్తంగా వణికిపోసాగాడు. జారుతోన్న గుండెల్తో కింద అంతస్తు గదులన్నీ వెతికాడు. పేరుపెట్టి పిలిచాడు. పొంగి వస్తున్న ఏడుపు కంఠంలోనే దిగమింగుకుని కప్ప బెకబెకల కోసం చెవులు రిక్కించి విన్నాడు. చివరకు నిర్మానుష్యమైన నిశీథి వీధిలోకి వెళ్ళి వెన్నెల వెలుగులో కన్నీటి మసకను తుడుచుకుంటూ అంతా వెతికాడు. ఏటి ఒడ్డున బురదలోంచి బెకబెకలు విన్పించి చివ్వున లేచి అటు మళ్ళాడు. కానీ అక్కడ ఒక్కటి కాదు, వందల కప్పల బెకబెకలు వినిపిస్తున్నాయి. అటు పరిగెత్తుకు వెళ్ళాడు గుండెలవిసేలా ఏడుస్తూ.

శ్రీపాదపట్నానికి తెల్లారింది. ఏటి మీదకు పడవలు తీసికెళ్దామని వచ్చిన బెస్తవాళ్ళకు నీటిలో వెల్లకిలా తేల్తున్న కప్పల కళేబరాలు చాలా కన్పించాయి. కాస్త దూరాన వంటినిండా బురదతో తుప్పలన్నీ వెతుకుతున్న మనిషి కూడా ఒకడు కనపడ్డాడు. బెస్తవాళ్ళు వాణ్ణి పట్టుకున్నారు. జనం పోగయ్యారు. పెద్దలు వచ్చారు. కాస్త గొడవా గోలా జరిగింతర్వాత సంగతి అర్థమై వాడి మానాన వాణ్ణి వదిలేశారు. ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు. కాలక్రమేణా బురదగుంటల్లో దబ్బనం పట్టుకు తిరిగే అతని వాలకం జనానికి అలవాటైపోయింది. వాణ్ణి కప్పలోడని పిలిచేవారు. పుణ్యానికి అపుడపుడూ పిలిచి అన్నం పెట్టేవారు. తెల్లపావురం అతణ్ణి జాలితో చూసేది. అది కూడా దొరికిన తిండేదో అతని భుజంపై చనువుగా వాలి నోటి కందియ్యడానికి ప్రయత్నించేది. ఒక్కోసారి నోరు చాపేవాడు, ఒక్కోసారి విదిలించుకునేవాడు. ఆ పావురం తర్వాత చాన్నాళ్ళు బతికింది. బతికినంత కాలం తన రెక్కలపై రేణుకాదేవి రక్తపు మరకలు చెరిగిపోకుండా వుంటానికి వానలో తడవకుండా జాగ్రత్త పడేది.
_______

June 16, 2011

'మల్లెల యువరాజు' (తమిళ జానపద కథ)

ఒకానొక రాజ్యంలో ప్రజలంతా రాజుని మల్లెల యువరాజుఅని పిలిచేవారు. ఎందుకంటే అతనెప్పుడు నవ్వినా మల్లెల పరిమళం మైళ్లవరకూ వ్యాపించేది. కానీ అతను తనంతటతాను నవ్వాలి. ఎవరూ కితకితలు పెట్టకూడదు. బలవంతపెట్టకూడదు. అలా జరిగితే మల్లెల పరిమళం రాదు.
       మల్లెల యువరాజు పాలించే రాజ్యం చిన్నది. సార్వభౌముడైన మరో మహారాజుకి విధేయుడై సామంతునిగా వుండేవాడు. ఆ మహారాజుకి ఈ వార్త చేరింది. కేవలం నవ్వడం ద్వారా మల్లెల పరిమళాన్ని వెదజల్లే ఈ వింతను తనే స్వయంగా చూడాలనుకున్నాడు. యువరాజుని తన రాజధానికి అతిథిగా ఆహ్వానించి, పురప్రముఖులంతా ఆహూతులుగా కొలువుదీరిన నిండుసభలో, నవ్వమని అడిగాడు. కానీ ఆజ్ఞాబద్ధుడై నవ్వడం యువరాజుకు చేతకాదు. ఎంతో ప్రయత్నించినా నవ్వలేకపోయాడు. మహారాజు దీన్ని అవమానంగా భావించాడు. మా ఆజ్ఞ ధిక్కరిస్తున్నాడు! మమ్ము పరిహసిస్తున్నాడు!అనుకున్నాడు. నవ్వే వరకూ యువరాజుని శివార్లలోని చెరసాలలో బంధించమని ఆదేశాలిచ్చాడు.
       చెరసాలకు సరిగ్గా ముందున్న గుడిసెలో ఒక అవిటివాడున్నాడు. వాడి ప్రేమలో పడిన రాజ్యపు పట్టపురాణి వాణ్ణి కలవడానికి ప్రతీ రాత్రీ రహస్యంగా గుడిసెకు వచ్చేది. ఆమె రాకపోకల్ని తన ఊచల కిటికీ నుండి గమనించాడు మల్లెల యువరాజు. ఇది నాకు సంబంధం లేని విషయంఅనుకుంటూ, తానేమీ చూడనట్టే మసలుకున్నాడు. ఒక రాత్రి రాణి రావడం కాస్త ఆలస్యమైంది. అవిటివాడు కోపం పట్టలేకపోయాడు. ఆమె రాగానే మీదపడి చితగ్గొట్టాడు. మొండి చేతులతో పొడుస్తూ, కుంటి కాళ్లతో తన్నాడు. ఆమె ఒక్కమాట అనకుండా దెబ్బలన్నీ భరించింది. వెంట తెచ్చిన రాచభోజ్యాలు అతనికి వడ్డించింది. ఆమె చేతి ముద్దలు తింటూంటే తన క్రూరత్వానికి పశ్చాత్తాపం కలిగింది వాడికి. నిన్ను కొట్టినందుకు బాధగా లేదా?” అనడిగాడు. ఆమె నవ్వుతూ అంది, “ఎందుకు బాధ! ఆనందంగా వుంది. ఒక్కసారే పద్నాలుగులోకాలూ చూసొచ్చాను!
       వాళ్ళిద్దరూ యిలా మాట్లాడుకుంటున్న గుడిసె బయట చూరు క్రింద చీకట్లో ఓ మూలగా పేద చాకలి వాడొకడు చలికి మునగదీసుకుని కూర్చున్నాడు. వాడి గాడిద ఎక్కడో తప్పిపోయింది. నాలుగు రోజులుగా దాని కోసం వెతకని చోటు లేదు. యిక ఎప్పటికీ దొరకదేమోనని దిగాలుగా వున్నాడు. యిపుడు రాణి అన్న మాటలు వినగానే, వాడికో ఆలోచన తోచింది, “ఈ మడిసి పద్నాలుగు లోకాలూ చూసొచ్చి వుంటే, ఈమెకి నా గాడిద ఏడనో కనపడే వుంటది!వాడు గుమ్మం వైపు తలతిప్పి లోపలికి వినపడేట్టు బిగ్గరగా అడిగాడు, “ఓయమ్మా! నా గాడిదనెక్కడన్నా చూసావా?”
       చెరసాల కిటికీ నుంచి యిదంతా వింటున్న మల్లెల యువరాజు, నవ్వు పట్టలేకపోయాడు. తెరలు తెరలుగా వెలువడిన నవ్వు చుట్టూ రాత్రిలోకి పాకింది. గాలిలో కొన్ని మైళ్ల మేర మల్లెల పరిమళం వ్యాపించింది. తెలవారడానికి యింకా కొన్ని గంటలు వుండగానే, చెరసాల భటులు పరుగుపరుగున వెళ్ళి మహారాజుకి నవ్వు సంగతీ, మల్లెల పరిమళం సంగతీ విన్నవించారు. పొద్దుపొడిచేదాకా ఆగలేకపోయాడు మహారాజు. వెంటనే మల్లెల యువరాజుని రాజభవనానికి రప్పించుకుని అడిగాడు, “స్వయానా మాకోసం నవ్వమని అడిగినపుడు నువ్వు ససేమిరా అన్నావు. యిప్పుడు నిన్ను, అదీ అర్థరాత్రివేళ, నవ్వించగలిగేంతటి గొప్ప సంగతేం జరిగింది?”
       యువరాజు తన నవ్వుకు కారణాన్ని దాయాలని చాలా ప్రయత్నిచాడు. కానీ రాజు పట్టుపట్టడంతో చివరకు నిజం చెప్పేసాడు. విషయంతా విన్న తరవాత మహారాజు రెండు ఆజ్ఞల్ని జారీ చేశాడు. ఒకటి మల్లెల యువరాజుని సాదరంగా అతని రాజధానికి పంపించడం, రెండు తన పట్టపురాణిని పట్టికెళ్ళి సున్నపు బట్టిలో కాల్చి చంపించడం. 

*  ——   *  ——   *

This is translated from a Tamil folktale `The Jasmine Prince' collected in A.K. Ramanujan’s “Folktales from India”. I have read only the first six tales. Some are good, like this one; and others are so-so. (I loved the 3rd para of this story especially, which seems like a story within the story. And I liked too the indifference rest of the story is maintaining towards it.) I am particularly fascinated by how amoral all these tales are. They deny you any moral vantage point to judge from. I liked it. I wish that tradition had sustained, without Victorian morality of  the British strangling it in the midway.


'రాబందు' - ఫ్రాంజ్ కాఫ్కా

ఒక రాబందు నా కాళ్ళను పొడుస్తోంది. ఈసరికే నా బూట్లను మేజోళ్ళనూ చింపి చీలికలు చేసింది, యిప్పుడు తిన్నగా నా కాళ్ళ వరకూ వచ్చేసింది. పదే పదే పొడిచిన చోటే పొడుస్తూ, మధ్యమధ్య నా చుట్టూ అసహనంగా చక్కర్లుకొట్టి, మళ్ళీ తిరిగివచ్చి పని ప్రారంభిస్తోంది. ఒక పెద్దమనిషి అటు వచ్చాడు, కాసేపు ఆగిచూసి, ఎందుకు ఆ రాబందుతో అలా బాధపడుతున్నావని అడిగాడు. "నేను నిస్సహాయుణ్ణ"ని చెప్పాను. యిది నా మీద దాడి మొదలుపెట్టినపుడు, నేను దీన్ని అదిలించడమే కాదు, గొంతు నులిమేందుకూ ప్రయత్నించాను, కానీ యీ జంతువులకి చాలా శక్తి వుంటుంది, యిది నా మొహం మీదకు దూకబోయింది, దానికి బదులు కాళ్ళను బలిపెట్టడం మంచిదనుకున్నాను. యిప్పుడవి కూడా దాదాపు ముక్కలైపోయాయి,” అన్నాను. యిలాంటి హింస భరిస్తున్నావంటే ఆశ్చర్యం! ఒక్క తూటా చాలు, రాబందు చస్తుంది,” అన్నాడు. నిజమా? అయితే అలా చేయగలవా!అనడిగాను. ఓ ఆనందంగా! నా యింటికి వెళ్ళి తుపాకీ తెచ్చుకోవాలంతే. ఒక్క అరగంట వేచివుండగలవా?” అన్నాడు. ఏమో చెప్పలేనుఅన్నాను, నొప్పితో మొద్దుబారి క్షణంపాటు అలానే నిల్చున్నాను. చివరికి: ఏదో ఒకటి చేయి దయచేసి!అడిగాను. సరే, వీలైనంత తొందరగా వచ్చేస్తాను,” అన్నాడు. రాబందు నన్నూ పెద్దమనిషినీ మార్చి మార్చి చూస్తూ ఈ సంభాషణంతా నిశ్శబ్దంగా విన్నది. దానికంతా అర్థమైందని నాకు తెలిసిపోయింది; అది గాల్లోకి లేచింది, జోరు అందుకునేందుకు వీలుగా ఈటె విసిరేవాడిలా వెనక్కి వంగి, దాని ముక్కును నా నోటి ద్వారా నా లోపలికంటా దూర్చింది. వెనక్కి పడుతూన్న నేను, అది నా రక్తంలో దుర్లభ్యమై మునిగిపోతూండగా, ఆ తాకిడికి వెల్లువైన రక్తం నాలోని ప్రతీ లోతునీ నింపి ప్రతీ ఒడ్డునీ ముంచెత్తుతుండగా, విముక్తుణ్ణయ్యాను. 

Translated from Kafka's "The Vulture" 

June 11, 2011

పుస్తకాల్ని ఎందుకు పద్ధతిగా సర్దుకోవాలంటే…!

నేను గది చేరే సరికి రాత్రయింది. తలుపు తాళం తీసి లోపలకు అడుగుపెట్టాను. లైటూ ఫానూ వేసి, పగటి దుస్తులు విడిచి, టవల్లోకి మారి స్నానానికి వెళ్ళబోతూ, అదాటున చెంబుడు చన్నీళ్ళు వంటి మీద పడితే కలిగే బిత్తరపాటు భరించడానికి శరీరం అప్పుడే సన్నద్ధంగా లేకపోవడంతో, కాసేపు తాత్సారం చేద్దామని, అరలోంచి పుస్తకం తెచ్చుకుని కుర్చీలో కూర్చున్నాను. అట్ట తీసానో లేదో కరెంటు పోయింది. ఒక్కసారిగా కళ్ళముందు దట్టమైన నలుపు పులుముతూ కటిక చీకటి కమ్ముకుంది. కరెంటుతో పాటూ నా ఉనికిని నిరూపించే నాలోని యింద్రియమేదో కూడా ఆరిపోయినట్టయింది. నేనక్కడ లేను. వట్టి గది వుంది. అప్పటిదాకా నా నిర్లక్ష్యాన్ని భరించిన గది అదను చూసుకుని తన ఉనికిని చాటింది. నేనున్నానంది. నువ్వు లేవంది.

ఈ గది నన్నింకా పూర్తిగా స్వీకరించలేదు. క్షణం క్రితం వరకూ గెడ బయటవేసి వుంది, యిపుడు లోపల వేసి వుంది. అంతే తేడా. యీ గదిలో నా గైర్హాజరీ యింకా కొనసాగుతుంది. ఈ గది...! పొద్దున్న నేను తలుపు తాళం వేసివెళ్ళిందగ్గర్నించి, ఒక నిముషం క్రితం తాళం తీసేవరకూ, తన మానాన తానున్న గది! బయట రోజెలా మారుతుందో పట్టించుకోని అంతర్ముఖీనమైన గది! నేను ఆఫీసులో వున్న క్షణాల్లో యిదిక్కడ యేం చేస్తుందో, నా కోసం ఎదురుచూస్తుందో లేదో, అసలు నేను రావటం దీనికి ఇష్టమో కాదో, నేను వెళ్ళిపోయినప్పుడల్లా వెనక యిది చప్పట్లు కొట్టి సంబరం చేసుకుంటుందో యేమో! నేను లేని క్షణాల్లో నా గది ఎలా సమయం గడుపుతుందో యోచించాను. గది కన్నా ముఖ్యంగా, గదిలో నా పుస్తకాలు ఎలా కాలక్షేపం చేస్తాయోనని ఆలోచించాను.

(అవి గది కన్నా సజీవంగా అనిపిస్తాయి. ఎందరెందరో రచయితలు, ఏవేవో దేశాలవాళ్ళు, ఏవేవో కాలాలవాళ్ళు, వారివారి వ్యక్తిగత జీవిత వేళల్లో, కుదుర్చుకున్న సమయాల్లో, ఏ తెల్లారగట్లో మధ్యాహ్నాలో నిశిరాత్రుళ్ళో, ఏ యిరుకు గదుల్లోనో, విశాలమైన గదుల్లోనో, ఏ తెల్లకాగితాల మీదో, టైపు రైటర్ల మీదో, కంప్యూటర్ తెరల మీదో... సాగించిన స్వీయ చైతన్య మథనానికి ఫలితాలు కదా ఈ పుస్తకాలు. ప్రతీ పుస్తకం యేదో మస్తిష్కపు చైతన్యాన్ని అక్షరాలనే చిహ్నాల్లో నిలుపుకుని వెంట తెచ్చుకున్నదే కదా. కాబట్టి గది కన్నా, అందులో యితర వస్తువుల కన్నా, యివి సజీవత్వపు పాత్రని బాగా పోషిస్తాయి.)

నేను లేని సమయాల్లో నా పుస్తకాలు సామరస్యంగానే వుంటున్నాయా, సఖ్యతతో కాలక్షేపం చేస్తున్నాయా? ఆలోచన యింకా మొదలవకుండానే... భళ్ళున కళ్ళను వెలిగిస్తూ చుట్టూ కరెంటు వచ్చింది. పుస్తకాల అల్మరాని తేరిపార చూసాను. అవి నేను లేనపుడు ఎంత అసహనాన్ని భరిస్తున్నాయో గ్రహించడానికి ఎక్కువసేపు పట్టలేదు.

కొన్నంటే సరే, సఖ్యంగానే వున్నాయనిపించింది. భమిడిపాటి కామేశ్వరరావు ప్రక్కన ముళ్ళపూడి వెంకటరమణ మొదట్లో కాస్త భక్తిగా ఒదిగినా, కాసేపట్లోనే గురువుగారి దగ్గర కొత్త పోగొట్టేసుకుని చిలిపి జోకులు పేల్చేస్తాడు. కొండొకచో అవి పేలేవి చుట్టూ వున్న రచయితల బోడి సీరియస్నెస్ మీదే! క్రింద అరలో శ్రీపాదకీ బానే సాగుతోంది. ప్రక్కనే మల్లాది రామకృష్ణశాస్త్రి వున్నాడుగా. “ఆహా ఒహో మీ వచనం! తెలుగుతనానికి నారాయణ కవచం!” అంటూ మునగచెట్టెక్కించేస్తాడు. ప్రక్క అరలో జి.కె. చెస్టర్‌టన్ ద్వారా చార్లెస్ డికెన్సుకీ యిదే వైభవం జరుగుతుంది. ఆ పై అరలో కాస్త టెన్షన్ లేకపోలేదు. కళ పట్ల ఫ్లొబేర్ మొండి సిద్ధాంతాలకి మనసులో సణుక్కుంటూనే, గొడవెందుకు అందర్లాగే పైకి వినయంగా వుంటే పోలా అని నిమ్మకుంటాడు సాల్‌బెల్లో. దాస్తొయెవ్‌స్కీ ప్రక్కనున్న అల్బెర్ట్ కామూ క్షణాల్ని యిట్టే కరిగించేసుకుంటాడు. ఎడ్మండ్ వైట్ చెప్పే హోమోసెక్సువల్ పిట్ట కథల్ని డి.హెచ్. లారెన్సు “జెండర్ మారితే ఏమైందిలే సెక్సు సెక్సే కదా” అని సరిపుచ్చేసుకుని చెవులప్పజెప్పేస్తాడు.

వీళ్ళందరి సంగతీ ఫర్లేదు. ఏదోలా సఖ్యంగానే కాలక్షేపం చేసేస్తారు. కానీ మిగతా వారందరి సంగతీ! నబొకొవ్‌కి తన ప్రక్కనే వున్న దాస్తొయెవ్‌స్కీ పొడంటేనే గిట్టదాయె. “చవకబారు సెంటిమెంటలిజమూ, లేకితనమూ నువ్వూనూ...” అంటూ నానా మాటలూ లంకించుకుంటాడు. అంతటితో ఆగుతాడా, ఆ ప్రక్కనే దాస్తొయెవ్‌స్కీ నించి అస్తిత్వవాద సారాన్నంతా జుర్రేసుకుంటూ పలవరించిపోతున్న అల్బెర్ట్ కామూని “కాస్త గమ్మునుండగలవా మెస్యూర్ కామూ” అని విసుక్కోడూ! ఇంతున్న విషయాన్ని అంత చేసి మాట్లాడే రవీంద్రనాథ్ ఠాగూర్ తన ప్రక్కన “ప్రతీ మాటా నిశ్శబ్దం మీదో మరక” అంటూ నోరు విప్పని శామ్యూల్ బెకెట్‌ని పాపం ఎలా తట్టుకుంటాడో. ఠాగూర్ మీద ఈ నింద మోపేది పై అరలోనున్న బోర్హెసే. అంతేనా, అతణ్ణి “వట్టి స్వీడీష్ ఇన్వెన్షన్” అని తీసిపారేస్తాడు కూడా. నిజమెంత వున్నా, ఆ నోబెలేదో తనకి రాలేదన్న దుగ్ధే చూడరూ జనం ఆ మాటల్లో! అక్కడికి ఆయనకీ ఏం మహా సుఖం లేదు తన అరలో. ఎందుకంటే, తన మొత్తం పుస్తకాలన్నింటిలోనూ ఒక్కటంటే ఒక్క శృంగారపూరితమైన పేరా కూడా రాయని ఈ కామ విరాగిని తీసుకుపోయి పిలిఫ్ రాత్ ప్రక్కన (అదీ బోలెడు సెక్సున్న ‘పోర్ట్నీస్ కంప్లెయింట్’ ప్రక్కన) పెడితే యిబ్బంది పడడూ! బోర్హెస్‌కి మరో ప్రక్క వున్నది నబొకొవ్! అతనేదో అభిమానం చూపిస్తున్నా, అతని అతిశయం బోర్హెస్‌కి గిట్టదు. గొప్పగా రాస్తాడు సరే! మరీ ఆ విషయాన్ని స్వయానా గుర్తెరిగివున్నట్టు ప్రవర్తిస్తే ఎలా! కాస్త నిరాడంబరంగా ‘అబ్బే అంతేం లేదు’ అని బిడియపడరాదూ, తనలాగా! అందుకే, “కాస్త ఆ పై అరలో ఎడ్గార్ అలెన్‌పోకీ, రాబర్ట్ లూయీ స్టీవెన్సన్‌కీ మధ్య నన్ను పారేయరాదూ” అని అడుగుతున్నాడు. కాఫ్కాకి హొమోఫోబియా వున్నట్టు ఎక్కడా చెప్పబడలేదు. కనుక యిటు ప్రక్కన మార్సెల్ ప్రూస్ట్‌తో బానే కాలక్షేపం చేసేయగలడు. కానీ రెండో ప్రక్కన జిడ్డు కృష్ణమూర్తికి బదులు చివరనున్న ఆర్థర్ షోపనార్ అయితే బాగుండుననుకుంటాడు. జె. డి. శాలింజర్ బాధ వేరు. ఏ సొరుగు మూల్లోనో పడేయక, యిలా బాహటంగా అందరూ వున్న అల్మారాలో యిరికించేసానని సంకటపడతాడు. ప్రక్కనున్న గురువుగారు మార్క్ ట్వయిన్‌ కూడా అతని ఆదుర్దానేమీ తగ్గించలేడు. హెన్రీ డేవిడ్ థొరూ పరిస్థితీ యిదే. ట్రాఫిక్ శబ్దాలు లీలగా వినిపించే గదిలో, యినుప అల్మారాలో, ఒద్దికైన వరుసల్లో పద్ధతైన కృతక జీవనం నచ్చదు. విశృంఖలత్వం కావాలి. ప్రకృతి కావాలి. వాల్డెన్ సరస్సుని కలవరిస్తాడు. మరో అరలో బెర్గ్‌సన్‌ యేమో భావవాదంతోనూ, బెట్రండ్ రస్సెలేమో భౌతికవాదంతోనూ బుర్రలు బాదేసుకుంటారు. డేవిడ్ హ్యూమ్ హేతువుకీ, అరబిందో ఆధ్యాత్మికతకీ పొసగక పోట్లాటలు మొదలవుతాయి. స్పినోజాకి కాఫ్కా బాధ అర్థం కాక అయోమయ పడతాడు. యింకో అరలో రోవెర్తొ బొలాన్యొ సాటి లాటిన్ అమెరికన్ రచయిత మార్కెజ్‌ని "నువ్వూ నీ బొందలో మేజిక్ రియలిజం" అంటూ ఈసడించుకుంటాడు. బాగా క్రింద అరలోనేమో అయాన్ రాండ్ తలవాచేట్టు శామ్యూల్ జాన్సన్ అమ్మనా చీవాట్లూ పెట్టడం ఖాయం. వడ్డెర చండీదాస్‌‌కి యిటుప్రక్కగా ‘అంపశయ్య’ నవీన్ బానే కాలక్షేపం చేస్తాడు గానీ, అటుప్రక్క వున్న మధురాంతకం రాజారాం మాత్రం అమాయకంగా బిక్కచచ్చిపోతాడు. అందరికన్నా యిబ్బంది పడేది విశ్వనాథ. వెంకటచలాన్ని మోయలేక విసుక్కుంటాడు. చలం పాపం ఎక్కడున్నా సర్దుకుపోతాడు. ఆ యిబ్బంది లేదు. ప్రక్కన వున్నది కమలాదాస్ అయితే  యింకస్సలు లేదు. పై అరలోంచి సుబ్బారావు గారి ఎంకిపాటలూ వినపడుతున్నాయాయె. బుచ్చిబాబు గారి ‘దయానిధి’ పడే వున్నతమైన అస్తిత్వ వేదనల్ని చూసి, యిటుప్రక్క గురజాడ వారి గిరీశం మర్యాదగా పొట్టకదలకుండా కిసకిసమని నవ్వుకుంటూంటే, మరోప్రక్క తెన్నేటి వారి చంఘీజ్‌ఖాన్ మాత్రం, ఎంతైనా సూటూ బోడ్గా బట్ టెంగ్రీ కదా, ఎవడికి జడిసేది, ‘ఇహ్హహ్హా’ అని బాహటంగా పగలబడిపోతాడు. అక్కిరాజు ఉమాకాన్తం కసుర్లు వినపడేంత దూరంలోనే వున్నాడు దేవులపల్లి కృష్ణశాస్త్రి. ప్రమాదమే కదా.

యిలా ఒకట్రెండనేమిటి! అల్మరాల్లోని ప్రతీ అరలోనూ ఏవో గొడవలే, గిల్లికజ్జాలే, పొరపొచ్చాలే, ఆరోపణలే, హెచ్చుతగ్గుల పోట్లాటలే కన్పిస్తున్నాయి. యిలాగైతే నేను గది తలుపు మూసుకుని ఆఫీసుకు వెళ్ళిందగ్గర్నించీ గదిలో ఏమన్నా ప్రశాంతత వుంటుందా! పరస్పర సఖ్యత లేని యిలాంటి చోట నిశ్శబ్దపు మధ్యాహ్నాలని పుస్తకాలేమన్నా ఆస్వాదించగలుగుతాయా! అందుకే, పుస్తకాల్ని ఒక పద్ధతిలో సర్దుకోవాలి! పితూరీల్లేకుండా, గొడవలు రాకుండా చూసుకోవాలి!

May 25, 2011

ఫ్రాంజ్ కాఫ్కా బ్లూ అక్టేవో నోట్‌బుక్స్ నుంచి...

చివరికెలాగో మా సైన్యాలు కోట దక్షిణ ద్వారం గుండా నగరంలోకి చొరబడ్డాయి. మా దళంవాళ్ళం మాత్రం ఇంకా కోట బయటే ఉన్నాం. నగర శివార్లలోని ఒక తోటలో, సగం కాలిన చెర్రీ చెట్ల మధ్య కూర్చొని, తర్వాతి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాం. కానీ ఎప్పుడైతే దక్షిణ ద్వారం నుంచి పెద్దగా విజయ దుందుభుల మోత విన్నామో, ఇక ఆగటం మా వల్ల కాలేకపోయింది. చేతికందిన ఆయుధాలని దొరకపుచ్చుకొని, ఒకరి చేయి ఒకరం గట్టిగా పట్టుకొని, 'కహీరా! కహీరా!' అంటూ మా యుద్ధనినాదాల్ని గట్టిగా అరుచుకుంటూ, బురద నేలల్లోంచి బారులు తీరి నగరం వైపు నడిచాం. దక్షిణద్వారం దగ్గర మాకు గుట్టలు గుట్టలుగా శవాలూ, ఏదీ కనపడకుండా కమ్మేసిన పసుపురంగు పొగా ఎదురయ్యాయి. యుద్ధం అంతా అయిపోయాకా వచ్చిన దండులాగా మేం మిగిలిపోదల్చుకోలేదు. ఆత్రంగా, ఇంకా యుద్ధపు సెగ తాకని ఇరుకు సందుల్లోకి పరిగెత్తాం. నా ఒకేవొక్క గొడ్డలి వేటుకి మొదటి ఇంటి తలుపు ముక్కలుచెక్కలైపోయింది. లోపలికి ఎంత ఉన్మాదంగా దూసుకుపోయామంటే, దాన్ని చల్లార్చేది ఏదీ కంటపడక కాసేపు ఒకరి చుట్టూ ఒకరం కలదిరిగాం. ఇంటి లోపల్నించి, పొడవాటి వరండా గుండా, ముసలివాడొకడు మా వైపు వస్తున్నాడు. వింత ముసలివాడు- వాడి వీపు వెనకాల రెక్కలు ఉన్నాయి. విశాలంగా విచ్చుకున్న ఆ రెక్కల పైఅంచులు అతని కంటే ఎత్తులో ఉన్నాయి. "వాడికి రెక్కలున్నాయ్!" నేను మా దళంవాళ్ళ వైపు అరిచాను. అందరం కాస్త వెనక్కి జంకాం, వెనక నుంచి లోపలికి తోసుకొస్తున్నవాళ్ళు అడ్డం తగిలేదాకా. నన్ను చూసి ఆ ముసలివాడు మాట్లాడాడు, "అంత ఆశ్చర్యపోనక్కర్లేదు. నాకొక్కడికే కాదు. మా అందరికీ రెక్కలున్నాయి. కానీ వాటి వల్ల ఒనగూడిందేమీ లేదు. వాటిని పెరికేసుకునే అవకాశమే గనక ఉంటే అలాగే చేసుండేవాళ్ళం," అన్నాడు. "ఇక్కడి నుంచి ఎగిరిపోవచ్చు కదా?" అని అడిగాను. "మా నగరాన్ని వదిలి ఎగిరిపోవాలా? మా ఇంటినీ, చనిపోయిన మా వాళ్ళనీ, మా దేవతల్నీ విడిచిపెట్టి?" అన్నాడు. 

May 20, 2011

'కవి, ప్రపంచమూ' - వీస్వావ షింబోర్‌స్కా

(పోలిష్ కవి వీస్వావ షింబోర్‌స్కా 1996 లో నోబెల్ స్వీకరిస్తూ చేసిన ప్రసంగానికి నా అనువాదం.)

ఏ ప్రసంగంలోనైనా ఎపుడూ మొదటి వాక్యమే బాగా కఠినమైందని అంతా అంటారు. దాన్ని దాటేసాను కాబట్టి ఫర్వాలేదు. అయితే రానున్న వాక్యాలు కూడా—మూడవదీ, ఆరవదీ, పదవదీ ఇలా చివరి వాక్యం వరకూ కూడా—అంతే కష్టంగా ఉండబోతున్నాయేమో అనిపిస్తోంది. ఎందుకంటే నేనిక్కడ మాట్లాడాల్సింది కవిత్వం గురించి. ఇదివరకూ ఈ విషయమై నేను మాట్లాడింది చాలా తక్కువ; నిజానికి అస్సలేమీ లేదనే చెప్పాలి. ఎపుడైనా ఏమన్నా చెప్పినా, ఆ చెప్పటంలో నాకు పెద్ద ప్రజ్ఞ లేదన్న శంక పొంచి వుండనే వుంటుంది. కాబట్టి ఈ ప్రసంగం కాస్త చిన్నగానే ఉండబోతోంది. లోపాల్ని తక్కువ మోతాదుల్లో వడ్డించినట్టయితే భరించటం తేలిక.

సమకాలీన కవులు తమ గురించి ఎప్పుడూ సంశయాలతో అనుమానాలతో ఉంటారు. వారు అయిష్టంగా మాత్రమే తాము కవులమని బహిరంగంగా ఒప్పుకుంటారు, ఏదో కవులైనందుకు సిగ్గుపడుతున్నట్టు. మన ఈ అట్టహాసమైన కాలంలో సొంత లోపాల్ని ప్రకటించుకోవటమే ఎవరికైనా కాస్త సులభం (కనీసం అవి ఆకర్షణీయంగా ముస్తాబు కాబడినంత వరకూ); కానీ సొంత సామర్థ్యాల్ని గుర్తించడం మాత్రం కష్టం, ఎందుకంటే అవి ఎప్పుడూ నిగూఢంగా దాగి ఉంటాయి, పైపెచ్చు వాటిపై సదరు వ్యక్తికే ఎపుడూ పూర్తి విశ్వాసం ఉండదు. దరఖాస్తులు నింపుతున్నపుడో లేదా కొత్త వ్యక్తులతో సంభాషిస్తున్నపుడో—అంటే తమ వృత్తిని బయటపెట్టక తప్పని పరిస్థితి కలిగినపుడు—కవులు “రచయిత” అనే సాధారణ నామాన్ని వాడటానికే సుముఖత చూపిస్తారు; లేదా, “కవి” అనే బదులు, రాయడంతోపాటూ అదనంగా వారు ఏ వృత్తి చేస్తున్నారో దాని పేరు వాడతారు. తోటివుద్యోగులు మొదలుకొని బస్సు ప్రయాణికుల దాకా, తాము వ్యవహరిస్తున్నది ఒక కవితో అని తెలియగానే, కాస్త కంగారూ అపనమ్మకాలతో ప్రతిస్పందిస్తారు. బహుశా తత్త్వశాస్త్రకారులు కూడా ఇలాంటి ప్రతిస్పందనల్నే ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని నేననుకుంటాను. అయితే వారి పరిస్థితి కాస్త మెరుగు. చాలా సందర్భాల్లో వారు తమ ఆసక్తికి ఏదైనా పాండిత్యాన్ని సూచించే పేరుతో అలంకరించగలుగుతారు. తత్త్వశాస్త్ర అధ్యాపకుడు — అంటే అది మరింత గొప్పగా ధ్వనించడం లేదూ!

కానీ ఎక్కడా కవిత్వ అధ్యాపకులు లేరు. అలా ఉన్నట్టయితే, కవిత్వం అనేది ఒక ప్రత్యేక అధ్యయనమూ, క్రమం తప్పని పరీక్షలూ, ఉపయుక్త గ్రంథపట్టికల తోపాటూ పాదసూచికలు జత చేయబడిన సిద్ధాంత వ్యాసాలూ, ఆఖర్లో, వేడుకగా అందజేసే యోగ్యతా పత్రాలూ… ఇవన్నీ అవసరమైన వ్యాసంగమన్న అర్థం వస్తుంది. మరలా దీన్ని బట్టి, అద్భుతమైన కవితలతో కాగితాలు నింపేసినంత మాత్రాన కవిగా అర్హత లభించదన్న అర్థం వస్తుంది. ఏదో ఒక అధికారిక ఆమోద ముద్రతో వున్న కాగితం ముక్క  ఇక్కడ ముఖ్యమవుతుంది. రష్యన్ కవిత్వానికి గర్వకారణమైనవాడూ, దరిమిలా నోబెల్ గ్రహీతా అయిన జోసెఫ్ బ్రాడ్‌స్కీ ఈ కారణంగానే బహిష్కరణ శిక్షకు గురయ్యాడన్న సంగతి ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. కవి కాగలిగే హక్కును ఆయనకు దత్తం చేసే అధికారిక ధృవీకరణ ఏదీ లేదన్న కారణంగా వారు ఆయనపై “పరాన్న జీవి” అన్న ముద్ర వేశారు1.

కొన్ని సంవత్సరాల క్రితం నాకు బ్రాడ్‌స్కీని వ్యక్తిగతంగా కలుసుకునే గౌరవమూ, భాగ్యమూ లభించాయి. నేను గమనించిందేమంటే, నాకు తెలిసిన కవులందరిలోనూ, తాను కవినని కులాసాగా చెప్పుకున్నవాడు ఆయన ఒక్కడే. ఆయన ఆ పదాన్ని ఏ మొహమాటమూ లేకుండా పలికాడు. మొహమాటం మాట అటుంచితే, ధిక్కారపూరితమైన స్వేచ్ఛతో పలికాడు. యువకునిగా తాను ఎదుర్కొన్న క్రూరమైన అవమానాల్ని గుర్తుచేసుకోవడమే దీని కారణమై ఉండవచ్చని నాకనిపించింది.

మనిషి మర్యాద ఇంత సులభంగా దాడికి గురికాని ఇంకాస్త అదృష్టవంతమైన దేశాల్లో, కవులు సహజంగానే ప్రచురింపబడాలనీ, చదవబడాలనీ, అర్థం చేసుకోబడాలనీ ఆశిస్తారు; కానీ, తమను తాము మామూలు గుంపు నుండీ, రోజువారీ నిస్సార వ్యవహారాల్నించీ వేరు చేసుకోవాలని పెద్దగా ప్రయత్నించరు. అయితే మనం దీనికి భిన్నమైన ధోరణిని చూసి కూడా ఎక్కువ కాలమేం కాలేదు. ఈ శతాబ్దపు తొలి దశాబ్దాల్లోనే కవులు తమ విపరీత వేషధారణతోనూ, వింత నడతతోనూ మనల్ని విస్మయపరచాలని ప్రయాసపడటమూ చూసాం. కానీ అదంతా కేవలం జనం ముందు ప్రదర్శన కోసమే. ఇలా ఎన్ని చేసినా, ఎట్టకేలకు, తమ వెనుకనే తలుపులు మూసి, తమ తొడుగుల్నీ, అలంకారాల్నీ, ఇతర అదనపుహంగుల్నీ విడిచిపెట్టి—నిశ్శబ్దంగా, సహనంతో తమ ఆత్మ సాక్షాత్కారానికై ఎదురుచూస్తూ—ఇంకా తెల్లగానే వున్న కాగితానికి ఎదురొడ్డి నిలవాల్సిన క్షణాలు రానే వచ్చేవి. ఎందుకంటే, అంతిమంగా లెక్కలోకొచ్చేది అదే కాబట్టి.

గొప్ప శాస్త్రవేత్తల, చిత్రకారుల జీవితాలపై ఇబ్బడిముబ్బడిగా సినిమాలు రావడంలో యాధృచ్ఛికమేమీ లేదు. అభిలాష వున్న దర్శకులు ఒక ముఖ్యమైన శాస్త్రీయ ఆవిష్కారానికి గానీ, ఒక  చిత్రకళాఖండపు ఉద్భవానికి గానీ దారి తీసిన సృజనాత్మక ప్రక్రియను నమ్మశక్యంగా తెరపైకి ఎక్కించాలని తపన పడతారు. వివిధ రకాల శాస్త్రీయ ప్రయోగాల్ని సమర్థవంతంగా చిత్రీకరించటం సాధ్యమే కూడా.  వాస్తవికత ఉట్టిపడేట్టు నిర్మించిన ప్రయోగశాలలు, రకరకాల పరికరాలు, సవిస్తారమైన యంత్రసామాగ్రి: వీటితో కూడిన సన్నివేశాలు ప్రేక్షకుల్ని కొంత ఆకట్టుకుంటాయి. అలాగే ఆయా సన్నివేశాల్లోని అనిశ్చితిని మంచి నాటకీయతతో చూపించవచ్చు (స్వల్ప మార్పుతో వెయ్యోమారు మళ్ళీ చేస్తోన్న ప్రయోగం చివరకు ఆశించిన ఫలితాన్ని ఇవ్వనుందా లేదా, వగైరా). చిత్రకారులకు సంబంధించిన సినిమాలు కూడా చక్కగా తీయవచ్చు. తొలి పెన్సిల్ గీత నుంచి తుది కుంచె మెరుగు దాకా ఒక గొప్ప కళాఖండపు పరిణామంలో ప్రతీ దశనీ పునఃసృజిస్తూ, కళ్ళు చెదిరేలా తీయవచ్చు. ఇక సంగీతకారులపై తీసిన సినిమాల్లో సంగీతం వెల్లువెత్తుతూ ఉంటుంది: సంగీతకారుని చెవుల్లో మ్రోగే గీతపు తొలి గమకాలు చివరకు సింఫొనీగా పరిణత రూపాన్ని సంతరించుకోవటాన్ని చూపించవచ్చు. నిజానికి ఈ ప్రయత్నాలన్నీ అమాయకత్వమే అయినప్పటికీ, వీటిల్లో ఏ ఒక్కటీ జనం “ప్రేరణ” పేరిట పిలిచే ఆ వింత మానసిక స్థితిని వివరించలేకపోయినప్పటికీ, కనీసం అక్కడ చూడటానికో, వినటానికో ఏదో ఒకటి వుంటుంది.

ఎటొచ్చీ కవుల స్థితే అధమం. వారి వ్యాసంగం చూడటానికి పరమ పేలవంగా ఉంటుంది. ఒకడు టేబిల్ ముందు కూర్చునో సోఫాలో పడుకునో, నిశ్చలంగా గోడనో లేక ఇంటికప్పునో చూస్తుంటాడు. అప్పుడపుడూ ఈ వ్యక్తి కదిలి ఓ ఏడు పంక్తులు రాస్తాడు, రాసిన వాటిలో మళ్ళీ ఓ పంక్తి కొట్టివేస్తాడు, ఇంకో గంట గడుస్తుంది, ఈ పర్యంతం ఏమీ జరగదు… ఇలాంటి సన్నివేశాన్ని చూసే ఓపిక ఎవరికి ఉంటుంది?

నేనిందాక ప్రేరణని ప్రస్తావించాను. సమకాలీన కవులను అది ఏమిటీ, అసలది నిజంగా ఉంటుందా అని అడిగితే జవాబుకు తడబడతారు. దీని అర్థం వారెపుడూ దీవెన ప్రాయమైన ఆ లోపలి ఆవేశాన్ని అనుభవించలేదని కాదు. నీకే అవగతం కాని విషయాన్ని వేరొకరికి వివరించడం కష్టం.

ఈ ప్రశ్న ఎదురైతే అప్పుడపుడూ నేనూ తప్పించుకుంటాను. కానీ నా సమాధానం ఇది: ప్రేరణ అనేది కవులకూ కళాకారులకూ మాత్రమే గుత్తగా లభించే అదృష్టం కాదు. ప్రేరణ తరచూ వచ్చి పలకరించే ఒక ప్రత్యేక మనుష్య సమూహం ఇప్పుడూ ఉంది, ఇదివరకూ ఉండేది, ఎల్లపుడూ ఉంటుంది కూడా. తమకు నచ్చి పనిని ఎన్నుకుని దాన్ని ప్రేమతో, ఊహాశక్తితో చేసే మనుషులతో కూడి ఉంటుంది ఈ సమూహం. ఇందులో ఉండేది వైద్యులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, తోటమాలులు కావచ్చు—నేనింకో వంద వృత్తులను ఈ జాబితాలోనికి చేర్చగలను. కొత్త సవాళ్ళను ఎదుర్కొనే కొద్దీ వారి పని వారికి ఒక నిరంతర సాహసకృత్యంగా మారిపోతుంది. కష్టాలూ, వైఫల్యాలూ వారి కుతూహలాన్ని అణచలేవు. వారు పరిష్కరించే ప్రతీ సమస్య నుంచీ  మరిన్ని సవాళ్ళు ఉద్భవిస్తాయి. ప్రేరణ అనేది ఏదైనా, దాని ఉద్భవం మాత్రం “నాకు తెలీదు” అనే నిరంతర భావన నుంచి.

ఇలాంటి మనుషులు ఎక్కువమందేమీ లేరు. ఈ భూమ్మీద నివసించే వాళ్ళలో చాలామంది బతకటానికి పని చేస్తారు, పని చేయాలి కాబట్టి పని చేస్తారు. వారు ఆ పనో ఈ పనో ఎంచుకునేది ప్రేమతో కాదు; వారి జీవిత పరిస్థితులు వారికై ఆ ఎంపిక చేసి పెట్టాయి. అయిష్టమైన పనీ, నిరాసక్తమైన పనీ, ఎంత అయిష్టమైనా ఎంత నిరాసక్తమైనా వేరే వాళ్ళకి ఆ మాత్రం కూడా లేదన్న కారణంగా మాత్రమే విలువనందుకునే పనీ—ఇది మానవ దౌర్భాగ్యాల్లోకెల్లా కర్కశమైనది. ఈ విషయంలో రానున్న శతాబ్దాలైనా మార్పును తీసుకొస్తాయన్న సూచనేదీ లేదు.

అందుకే, కవులకు ప్రేరణపై గుత్తాధిపత్యాన్ని నేను నిరాకరించినప్పటికీ, ఆ అదృష్టపు ఆపేక్షనందుకున్న ఒక ప్రత్యేక సమూహంలోకి వారిని చేరుస్తాను.

అయితే ఇక్కడే నా శ్రోతల్లో కొన్ని సందేహాలు కలగొచ్చు. చాలామంది ఘాతకులూ, నియంతలూ, మతోన్మాదులూ, నినాదాల పొలికేకల ద్వారా అధికారం కోసం కొట్టుమిట్టాడే ప్రజానాయకులూ వీళ్ళంతా కూడా తమ పనులను ఆస్వాదిస్తారు; వారు కూడా తమ విధులను కల్పనాత్మక కుతూహలంతోనే నిర్వర్తిస్తారు. అవును, ఒప్పుకుంటాను. కానీ వారికి “తెలుసు”.  యిక ఆ తెలిసిందాంతోనే ఎల్లకాలమూ సరిపుచ్చుకోగలరు. ఆ తెలిసింది తప్ప మరేదీ తెలుసుకోవాలనుకోరు. ఎందుకంటే అది తమ వాదనల్లోని తీవ్రతను క్షీణింపచేయగలదు. అయితే కొత్త ప్రశ్నలకు దారితీయని ఏ జ్ఞానమైనా త్వరగా చచ్చిపోతుంది: జీవించడానికి కావలసిన కనీస ఉష్ణోగ్రతను అది నిలబెట్టుకోలేకపోతుంది.

ఇందుకే నేను “నాకు తెలీదు” అనే ఈ పదబంధానికి అంత ఉన్నతమైన విలువనిస్తాను. ఇది చిన్నదే, కానీ బ్రహ్మాండమైన రెక్కలతో ఎగురుతుంది. మన అంతరంగ విస్తారాల్నే గాక, మన ఈ చిన్ని భూమి నిరాధారంగా వ్రేలాడే బాహ్య విస్తారాల్ని కూడా ఇముడ్చుకోగలిగేంతగా మన జీవితాన్ని విశాలపరుస్తుంది. ఐజాక్ న్యూటన్ “నాకు తెలీదు” అని అనుకోకపోయి వుంటే, అతని చిన్ని వనంలో ఆపిల్ పళ్ళు వడగళ్ళలా ఊరకనే నేలరాలి ఊరుకునేవి, మహా అయితే అతను వాటిని వంగి ఏరుకుని గుటకాయస్వాహా చేసి ఉండేవాడు. నా తోటి దేశస్తురాలు మేరీ స్ల్కోదోవ్‌స్కా క్యురీ “నాకు తెలీదు” అని అనుకోకపోయి వుంటే, బహుశా ఏదో ఒక ప్రైవేటు ఉన్నత పాఠశాలలో కులీన యువతులకు రసాయనశాస్త్ర పాఠాలు చెప్పుకుంటూ ఉండిపోయేది, ఈ అన్యథా గౌరవప్రదమైన ఉద్యోగాన్ని నిర్వహిస్తూనే చివరకు మరణించి ఉండేది. కాని ఆమె “నాకు తెలీదు” అని తనకు తాను నిరంతరం చెప్పుకుంటూనే ఉంది; ఈ పదాలే ఆమెను—ఎక్కడైతే అవిశ్రాంతంగా అన్వేషించే వ్యక్తిత్వాలు అప్పుడపుడూ నోబెల్ బహుమతితో సత్కరింపబడతాయో ఆ స్టాక్‌హోమ్‌కు, ఒకసారి కాదు రెండుసార్లు, తీసుకువెళ్ళగలిగాయి.

కవులు కూడా, వారు నిజమైన కవులే అయితే, “నాకు తెలీదు” అనే ఈ మాటని నిత్యం పునశ్చరించుకుంటూనే ఉండాలి. కవి రాసిన ప్రతీ కవితా ఈ మాటకి సమాధానం చెప్పేందుకు చేసిన ఒక ప్రయత్నాన్ని సూచిస్తుంది. కాని కాగితం మీద చివరి పుల్‌స్టాప్ పెట్టగానే అతనిలో మళ్ళా అనిశ్చితి మొదలవుతుంది, సదరు సమాధానం కేవలం తనకు తాను ఆపద్ధర్మంగా కల్పించుకున్నదనీ, పైపెచ్చు అసమగ్రమనీ అతనికి అర్థం కావడం ప్రారంభమవుతుంది. కాబట్టి కవులు నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటారు; చివరికెన్నడో, వారి ఈ స్వీయ-అసంతృప్తుల వరుస ఫలితాలనన్నింటినీ సాహితీ చరిత్రకారులు ఒక పెద్ద పేపర్ క్లిప్‌తో బొత్తంగా గుదిగుచ్చి, దాన్ని ఆ కవుల “రచనా సంచయం” అంటారు.

నేను ఒక్కోసారి అసంభవ సన్నివేశాల్ని కల కంటూంటాను. ఉదాహరణకి, నాకు రచయిత ఇక్లీసియాస్టిస్‌తో సంభాషించే అవకాశం వచ్చినట్టు ఊహించుకుంటాను2.  ఆయన సకల మానవ ప్రయత్నాల నిష్పలత్వం పైనా కదిలించే విధంగా ఓ విలాపాన్ని రాసిన రచయిత. ఆయనకు వెన్ను వంచి ప్రణమిల్లుతాను. ఎందుకంటే ఆయన అత్యద్భుతమైన కవుల్లో ఒకరు, కనీసం నా వరకూ. తర్వాత ఆయన చేయి దొరకబుచ్చుకుంటాను, ” ‘సూర్యుని క్రింద కొత్త విషయంటూ ఏదీ లేదు’ అని నువ్వు రాసావు ఇక్లీసియాస్టిస్! కానీ స్వయానా నువ్వే ఈ సూర్యుని క్రింద కొత్తగా జన్మించ లేదూ. నీకు ముందు జీవించిన వారెవరూ నువ్వు రాసిన కవితను చదవలేకపోయారు కాబట్టి, నీ కవిత కూడా సూర్యుని క్రింద కొత్తదే. అలాగే నువ్వు ఏ సైప్రస్ చెట్టు క్రింద కూర్చున్నావో అది కూడా అనాది నుంచీ పెరుగుతున్నదేం కాదు. అది ఇలాంటిదే మరో సైప్రస్ నుంచి పుట్టింది, అయితే రెండూ ఒకటి మాత్రం కాదు. ఇక్లీసియాస్టిస్! నేన్నింకోటి కూడా అడగాలనుకుంటున్నాను. నువ్వు సూర్యుని క్రింద ఏ కొత్త ఇతివృత్తాన్ని స్వీకరించబోతున్నావ్? ఇదివరకూ వెలిబుచ్చిన ఆలోచనలకే అదనపు చేర్పా? బహుశా వాటిలో కొన్నింటిని ఇప్పుడు ఖండించాలనుకుంటున్నావు కాబోసు? నీ గత రచనలో—ఆనందం క్షణభంగురమైతేనేమి, అన్నావు? కాబట్టి నీ తదుపరి సూర్యుని-క్రింద-కొత్త-కవిత ఆనందం గురించినదై వుంటుంది? ఇప్పటిదాకా ఏమైనా పరిశీలనలు నమోదు చేసుకున్నావా, చిత్తుప్రతులు తయారయ్యాయా? ‘నేను రాయాల్సినదంతా రాసేసాను, ఇక రాయటానికేమీ మిగల్లేదు’ అని నువ్వు అనబోవని నాకనిపిస్తోంది. ప్రపంచంలో ఏ కవీ ఇలా అనలేడు, ముఖ్యంగా నీలాంటి గొప్ప కవి.”

ఈ ప్రపంచం—దీని గురించి మనమేమనుకున్నా,  దీని భారీతనం ముందు మన స్వీయ దుర్బలత్వం స్ఫురించి భీతిల్లినా, లేదూ మనుషులూ జంతువులూ వృక్షాలూ అనుభవించే వేదనల పట్ల దీని ఉదాసీనతను ద్వేషించినా; అలాగే, నక్షత్ర కాంతి రేఖల్తో చొచ్చుకుపోబడిన ఈ శూన్యవిస్తారాల గురించీ, ఆ నక్షత్రాల చుట్టూ మనమిప్పుడిపుడే కనుగొనటం మొదలుపెట్టిన గ్రహాల గురించీ మనమేమనుకున్నా; మనకు ముందస్తుగానే టికెట్లు ఖరారైన ఎల్లలులేని ఈ నాటకరంగం గురించి మనమేమనుకున్నా (రెండు గుడ్డి తేదీలకు కట్టుబడిన ఈ టికెట్ల చెల్లుబాటు గడువు మాత్రం నవ్వొచ్చేంత కురచనైనది); ఈ ప్రపంచం గురించి మనం యింకా యిలా ఎన్ని అనుకున్నా గానీ—ఇది నివ్వెరపరిచే ప్రపంచం.

అయితే ఈ “నివ్వెర పరిచే” అనే విశేషణం ఒక తార్కికమైన ఎరను మరుగుపరుస్తుంది. సాధారణంగా మనల్ని నివ్వెరపాటుకు గురి చేసేవి ఏమంటే—సర్వత్రా తెలిసిన, విశ్వవాప్త ఆమోదాన్ని పొందిన పద్ధతి నుంచి పక్కదారి పట్టిన అంశాలు; మనకు ప్రస్ఫుటంగా అలవాటైన ధోరణి నుంచి దారి మళ్ళిన అంశాలు. ఇక విషయానికొస్తే, ఇక్కడ అలా ప్రస్ఫుట ప్రపంచమంటూ ఒకటి వేరే ఏదీ లేదు. మన నివ్వెరపాటు దానికదే స్వతంత్రంగా మన్నుతుంది, అది సాపేక్షాన్వయం కోసం వేరే దేని పైనా ఆధారపడదు.

ఒప్పుకుంటాను, ప్రతీ పదాన్ని ఆగి సమీక్షించుకోవాల్సిన అవసరం లేని రోజువారీ సంభాషణల్లో మనమంతా “సాధారణ ప్రపంచం”, “సాధారణ జీవితం”, “సాధారణ పరిస్థితుల్లో”… లాంటి పదబంధాలు వాడుతూంటాం. కానీ ప్రతి పదాన్నీ ఆచితూచే కవిత్వపు భాషలో, ఏదీ మామూలు కాదు, సాధారణం కాదు: ఏ ఒక్క రాయీ, దాని పైనున్న ఏ ఒక్క మేఘమూ; ఏ ఒక్క పగలూ, దాని తర్వాతవచ్చే ఏ ఒక్క రాత్రీ ; అన్నింటినీ మించి, యీ ప్రపంచంలో ఏ అస్తిత్వమూ, ఎవ్వరి అస్తిత్వమూ సాధారణం కాదు.

దీన్ని బట్టి చూస్తే, కవుల పని ఎప్పుడూ జటిలమే అనిపిస్తోంది!

*


పాదసూచికలు:

[1] జోసెఫ్ బ్రాడ్‌స్కీ (1940 – 1996) ప్రముఖ రష్యన్ కవి, నోబెల్ సాహిత్య బహుమతి గ్రహీత. సోవియెట్ రష్యాలో ఒక యూదు కుటుంబంలో జన్మించాడు. పేదరికం వల్ల పాఠశాల విద్యని తొందర్లోనే విడిచిపెట్టాడు. రకరకాల చిల్లర ఉద్యోగాలు చేస్తూ తనకు తనే విద్య చెప్పుకున్నాడు. తొందర్లోనే సాహిత్య అనువాదాలతో పాటూ, కవితలూ రాయటం ప్రారంభించాడు. ప్రస్తుత ప్రసంగంలో వీస్వావా షింబోర్‌స్కా ఆయన్ను గూర్చి చేసిన ఈ ప్రస్తావనకు యుక్త వయస్సులో ఆయన ఎదుర్కొన్న ఒక సంఘటన ఆధారం. అప్పటి సామ్యవాద రష్యాలో వయోజనులైన ప్రతీ ఒక్కరూ పని చేయాలన్న నిర్బంధం వుండేది. ప్రజలందరూ శ్రామికుల కిందే లెక్క. ప్రభుత్వం కూడా శ్రామిక ప్రభుత్వమే. అయితే ఈ ప్రభుత్వం దృష్టిలో శ్రమ అంటే ఎప్పుడూ శారీరకమైనదే! మేధోపరమైన శ్రమ లెక్కలోకొచ్చేది కాదు. దాంతో మేధావి వర్గం చాలా కటువైన జీవితాన్ని గడపవలసి వచ్చేది. రోడ్లూడ్చడం, చిమ్నీల్ని వెలిగించడం లాంటి పనులు చేస్తూ, ఖాళీ సమయాల్లో తమ మేధో సంబంధమైన వ్యాసంగాల్ని నిర్వహించుకోవాల్సి వచ్చేది. ఇలా శ్రమ చేయని వాళ్ళని ప్రభుత్వం “పరాన్నజీవులు” (పారసైట్స్) అంటూ ముద్రవేసి, గడ్డు వాతావరణ పరిస్థితులున్న ప్రాంతాల్లోకి బహిష్కార శిక్ష విధించేది. అప్పటికి యువకోత్సాహంతో, ఎవరినీ లెక్కచేయని స్వేచ్ఛతో కవిత్వం రాసుకుంటూ పోతున్న బ్రాడ్‌స్కీ తొందర్లోనే రష్యన్ సీక్రెట్ పోలీస్ దృష్టిలో పడ్డాడు. ఆయన్ని అరెస్టు చేసారు. అప్పటి ఆయన విచారణకు సంబంధించిన పాఠ్యప్రతి దరిమిలా ఒక జర్నలిస్టు ద్వారా బయటి ప్రపంచానికి పొక్కి ప్రసిద్ధమైంది. అది ఇలా సాగుతుంది:

జడ్జి: నువ్వు మామూలుగా ఏం చేస్తుంటావు?
బ్రాడ్‌స్కీ: నేను కవిని, సాహితీ అనువాదకుణ్ణి.
జడ్జి: కవిగా నిన్ను ఎవరు ఆమోదించారు? ఎవరు కవుల జాబితాలో చేర్చారు?
బ్రాడ్‌స్కీ: ఎవరూ కాదు. మనుషుల జాబితాలోకి నన్నెవరు చేర్చారు?
జడ్జి: నువ్విది అధ్యయనం చేసావా?
బ్రాడ్‌స్కీ: ఇదంటే?
జడ్జి: కవి ఎలా కావచ్చన్నది. మామూలుగా కవిత్వం బోధించేది, కవులు తయారయ్యేది పాఠశాలల్లో. నువ్వక్కడ కనీసం ఉన్నత విద్య కూడా పూర్తి చేయలేదు.
బ్రాడ్‌స్కీ: ఇది పాఠశాలల్లో నేర్చుకోవచ్చని నాకనిపించలేదు.
జడ్జి: మరి ఎలా?
బ్రాడ్‌స్కీ: నాకు తెలిసి… ఇది దేవుడి నుంచి వస్తుంది, అవును దేవుడి నుంచే.

ఈ విచారణ తరువాత ఆయనపై “పరాన్న జీవత్వం” అన్న నేరాన్ని నిర్థారించి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. ఇదీ, పై ప్రస్తావన వెనక కథ. తర్వాతి కాలంలో బ్రాడ్‌స్కీ అమెరికా చేరుకుని మేటి కవిగా ప్రసిద్ధి పొందాడు.

[2] హీబ్రూ బైబిల్‌లో భాగంగా వుండే పలు ఉప గ్రంథాల్లో ఒక దాని పేరు ఇక్లీసియాస్టిస్. దీన్ని రాసింది ఇక్లీసియాస్టిస్ (లేదా కొహెలెత్). ఈ గ్రంథంలో ఆయన మానవుల ప్రతీ చర్యా (ప్రతీ ప్రయత్నమూ) నిష్పలమూ, అర్థరహితమూ, అసంబద్ధమూ అని ప్రతిపాదిస్తాడు. ఈ గ్రంథంలో కొన్ని వాక్యాల్ని వీస్వావ షింబోర్‌స్కా ఇక్కడ తన ప్రసంగంలో ప్రస్తావిస్తున్నది. ఆ ప్రస్తావనకు మూలమైన వాక్యాలు ఇవి:

What has been will be again,
what has been done will be done again;
there is nothing new under the sun.

(ఏది వున్నదో అదే మరలా వుండబోతోంది,
ఏది సాగిందో అదే మరలా కొనసాగబోతోంది;
సూర్యుని క్రింద కొత్త విషయంటూ ఏదీ లేదు.)

May 17, 2011

అలా తిరిగి రావాలని...

నాలో తిరగాలన్న యావ మొదలైందీ మధ్య. మొన్న పుస్తకాల షాపుకి వెళ్ళినపుడు  అత్యంత యిష్టంగా కొని తెచ్చుకున్నది ఒకే పుస్తకం: ‘ఎ రోడ్ గైడ్ టు ఆంధ్రప్రదేశ్’! బహుశా స్టేషనరీ షాపుల్లో కూడా దొరికే పుస్తకం. వందరూపాయలు. పుస్తకం కన్నా ముఖ్యంగా పుస్తకం వెనక అట్టకు అతికించి వున్న పేద్ద ఆంధ్రప్రదేశ్ మాప్ నన్నాకర్షించింది. యిలా పుస్తకాలకని వెళ్ళి రోడ్డు మాప్ కొనుక్కురావడమన్నది, గత కొన్ని నెలలుగా నా ఆలోచనలకు తగ్గట్టే ఉంది.

నాకు చిన్నప్పటి నుండీ ప్రయాణాలంటే పెద్ద మక్కువ లేదు, అలాగని మరీ విరక్తీ లేదు. చిన్నప్పుడు తిరిగింది ఎక్కువగా బస్సుల్లోనే. అది ఆహ్లాదకరమైన అనుభవం కాదు. ఆ దుమ్ము రేగే బస్టాండ్లూ, బస్సుల్లో ఇనుము కంపూ, మన అస్థిపంజరం బలమెంతో పరీక్షిస్తున్నట్టు ఆపాదమస్తకం జాడించి వదిలేసే రోడ్లూ, అప్పటిదాకా యింటి చుట్టూ తెలిసిన పరిసరాల్లో అలవాటు మగత కప్పుకు పడుకున్న మనసుపై ఉన్నపళంగా దాడి చేసే తెలియని మొహాలూ పరిసరాలూ, లగేజీ బాధ్యతలూ, రావాల్సిన చిల్లర గుర్తుపెట్టుకోవడాలూ, కిటికీలోంచి జేబురుమాళ్ళు విసిరి సీటేస్సుకునేవాళ్ళూ... ఇవన్నీ చికాకు పెట్టేవి. కానీ, ఒక్కసారి కిటికీ దగ్గర సీటు దొరికిందా... అన్నీ మరిచిపోయేవాణ్ణి.

రైలు ప్రయాణాలంటే మాత్రం చాలా యిష్టం. అసలు రైలంటేనే ఏదో ఆకర్షణ. రైలు డోరు దగ్గర నిల్చునే వీలు దొరికితే చాలు గమ్యం ఎప్పటికీ చేరకపోయినా ప్రయాణపు పరమార్థం దక్కేసినట్టే. (డోరు దగ్గర నుంచున్నంత సేపూ నా సీట్లో ఏం జరుగుతుందన్న ధ్యాస వుండదుగానీ, సీట్లో కూర్చోవాల్సి వచ్చినపుడు మాత్రం ఆ డోరు దగ్గర చోటెవడన్నా ఆక్రమించేస్తాడేమోని కంగారు పడతాను యిప్పటికీ.) ఇరుపక్కలా వెదజల్లబడిన జీవిత పరిమళాల్నెన్నింటినో ఏరి, తన పట్టాల దారానికి ఒద్దికైన కదంబంగా రైలు వేగిరం అల్లుకుంటూ పోతుంటే, ఆ పరిమళాలకు మనసు తలుపు తెరిచిపెట్టి నిల్చోవడం నాకు ఎప్పటికీ పాతబడని ఆనందం. అసలు స్పందించగలిగే మనసుండాలే గానీ రైలు తలుపు దగ్గర నిలబడ్డపుడు ఎంత కవిత్వం వేగంగా వెనక్కు దొర్లుతూ పోతుందనీ!

రైల్ డోర్ రియలైజేషన్స్

మొన్న ఊరెళ్ళినపుడు కూడా అంతే. తెలవారుతుందనగా సీటు వదిలేసి తలుపు దగ్గరకు వెళ్ళి నిలబడ్డాను. ఎన్నిసార్లు చదివినా ఒకే అర్థం చెప్పే కవిత కూడా, ఎపుడో ఏదో అరుదైన మనస్థితిలో చదివినపుడు కొత్త అర్థాన్ని స్ఫురింపజేస్తుంది. అలాగే యిపుడు కూడా బయటి దృశ్యాలు యిదివరకట్లాంటివే అయినా, ఈ సారి నా మనసు వాటికి కొత్త భాష్యాలు చెప్పింది; వాటిని మరి వేటికో ముడి వేసింది; ఆ కొత్త అన్వయాల నుంచి నేనిదివరకూ గమనించని సత్యాల్ని రాబట్టింది. ఓ చిన్నపాటి జ్ఞానోదయం కూడా కలిగిందని చెప్పాలి. వెనక్కి వచ్చాకా ఓ పోస్టు రాయబోయి తర్వాతెందుకో మానేసాను. ‘rail-door realizations’ అనో ‘an exercise to the literary pedant’ అనో కొన్ని శీర్షికలు మనసులో పెట్టుకున్నాను కూడా. ఈ రెండో శీర్షిక గురించి కాస్త వివరించాలి. రైలు ప్రయాణం గురించి రాస్తూ దానికి ‘సాహితీ ఛాందసులకు ఒక అభ్యాసం’ అని పేరెందుకు పెట్టాలనుకున్నాను? ఎందుకంటే, అలాంటి ఛాందసత్వంతో బాధపడే వారికి వేగంగా వెళ్ళే రైల్లో తలుపు దగ్గర ప్రయాణం చేయడం మంచి విరుగుడుగా పని చేస్తుందనిపించింది. ఎలాగో చెప్పే ముందు, అసలు ఈ ఛాందసత్వానికి కారణాలు ఊహిస్తాను. సాహిత్యాన్ని గొప్ప పరంపర కలిగిన ఒక వ్యవస్థగా చూడడంలో కొన్ని ప్రమాదాలున్నాయి. ముఖ్యంగా సాహిత్యమే ప్రధాన వ్యాసంగంగా కలవారికి ఈ ప్రమాదం జరిగే అవకాశాలు మరీ ఎక్కువ. ఈ మహానిర్మాణపు మాయలో పడిపోతాం. యిది స్వచ్ఛందమనీ, స్వయంసమృద్ధమనీ నమ్మడం మొదలుపెడతాం. దీనికి జీవాన్నిచ్చే వేర్లు చుట్టూ జీవితంలో పాతుకొని వున్నాయన్న సంగతి విస్మరిస్తాం. పనిముట్టు సొగసుగా వుందని దానితో పని చేయించుకోవడం మానేసి గూట్లో పెట్టి ఆరాధించే ఎడ్డి పనోడిలాగ, జీవితాన్ని అక్షరాల్లోకి వడగట్టగల సాహిత్యాన్ని పటం కట్టి పూజించడం మొదలుపెడతాం. దాని ఘనమైన పరంపర ముందు భక్తిప్రపత్తులతో సాష్టాంగాలు పడుతూ, ఆ వ్యవస్థకు మనమే ఆపాదించిన మర్యాదని కాపాడేందుకు సిద్ధాంతాల్ని సృష్టిస్తూ, నియమాల్ని అల్లుతూ, వాటి ఆధారంగా బేరీజులు కడుతూ, నేల నిలకడ చూసుకోకుండా దాని మీద బృహన్నిర్మాణాలు కడుతుంటాం. జీవితాన్ని బయటే వదిలేసి, సాహిత్యాన్ని అద్దాల మేడలో బంధిస్తాం. యిదిగో! యిదే మూసలో కరుడుగట్టిపోతే మనమే సాహితీ ఛాందసులమవుతాం.

ఈ ఛాందసత్వం పటాపంచలు కావాలంటే, ఒక్కసారి జీవితపు బహుముఖీన విశ్వరూపం మిరుమిట్లుగొలుపుతూ మన మనోనేత్రాల ముందు సాక్షాత్కారం కావాలి. అలా చూపగలిగే దృష్టిపథం ఒకటి మనకు కావాలి. రైలు డోరు దగ్గర అది సులువుగా దొరుకుతుందని నా నమ్మకం. జీవితంలోని ఎన్నో పార్శ్వాలకు ప్రాతినిధ్యం వహించే చెదురుమదురు దృశ్య శకలాల్ని త్వరిత గతిన ప్రక్కప్రక్కన చేర్చి మనకు చూపించగలిగే ఒకేఒక్క చోటు అది. ఈ చేరిక వల్ల మనం ఒక దృశ్యంతో మరో దృశ్యానికి లంకె వేయగలుగుతాం. వేర్వేరు పార్శ్వాల్ని ఒకదానితో ఒకటి పోల్చుకోగలుగుతాం. వ్యత్యాసం చూడగలుగుతాం. ఈ వ్యత్యాసాల మధ్య దాగివున్న జీవిత స్వభావాన్ని  గ్రహించగలుగుతాం. బస్సూ, కారూ, బైకూ, సైకిలూ...  ఏదీ యిలా పనికి రాదు. ఇవి మనల్ని జీవితపు సందడిలో భాగం చేసేస్తాయి. మనం ఏం గమనించాలను కుంటున్నామో దానికి మరీ దగ్గరైపోతాం. స్థూలంగా చూపించే దృష్టి ఉండదు. కానీ రైలు అలాక్కాదు. వేరు చేయగలిగే దూరాన్ని పాటిస్తూనే, అవగాహనకు చాలినంత దగ్గరగా వెళ్తుంది.

ఇప్పుడు కాస్త ఓపిక పడితే... కొన్ని కామాల పరంపర:— కొండలు, గడ్డి మైదానాలు, మామిడితోటలు, వరి పొలాలు, నల్లగా బిగువైన శరీరాల్తో సేద్యగాళ్ళు, కోతలూ కుప్పనూర్పుళ్ళూ, గేదెలూ, ట్రాక్టరూ, గొట్టంలోంచి ఊక కక్కుతూ రైసుమిల్లూ, ఎదుటి బడ్డీకొట్టుని వేలెత్తి చూపిస్తున్న అంబేద్కర్ విగ్రహం, సంతమార్కెట్టూ, పెంకుటిళ్ళ దొడ్డి గుమ్మాలూ, పళ్ళు తోముకుంటున్న లుంగీ, అంట్లు తోముతున్న చీర, గుడి గోపురం, స్కూలు గ్రౌండ్లో నెట్‌ మీంచి ఎడాపెడా ఎగురుతున్న బంతీ, ముగ్గులేసి వున్న వీధులూ, గాంధీబొమ్మ సెంటరూ, సైకిల్ని వంకరగా తొక్కుతున్న పొట్టి నిక్కరూ, ఊరి చివర ‘రతి రాణి’ని చూపిస్తున్న సినిమా హాలూ, కాసేపు గుప్పున కంపుకొట్టే కోళ్ళ ఫారం, చెరువు గట్టున కొబ్బరి చెట్టుకు ఆనించి వున్న అరిటిగెలల సైకిళ్ళు, పక్కన చుట్ట కాలుస్తూ రెండు తలపాగాలూ, తిరగేసిన ఎక్స్‌క్లమేషన్ మార్కుల్లా దూరంగా తాటి చెట్ల వరస, ఎండలో బంగారంలా మెరుస్తూ గడ్డి మేట్లూ, ఎవరూ కనపడని రైల్వే క్రాసింగూ, వరిపొలాల్లో కొంగల గుంపు, కంకర్రోడ్డు మీద ముఖం చిట్లించుకు పోతూన్న ఎర్ర బస్సూ, దాన్ని ఓవర్టేక్ చేస్తూ నల్ల క్వాలిస్సూ, సంతోషి ఫ్యామిలీ ధాబా, సరుకు లారీలు, పెట్రోలు బంకూ, కిషన్‌చంద్ మార్బల్ టైల్స్ ఫాక్టరీ, క్రిస్టియన్ స్మశానం, బెతెస్త వృద్ధాశ్రమం, అశోక వృక్షాల మరుగులో గవర్నమెంటాఫీసు కాంపౌండూ, ఏవో నడుములూ బొడ్డులూ చూపిస్తున్న పోస్టర్లూ, రైలు బ్రిడ్జి క్రిందనుంచి పోతూ కనిపిస్తున్న ట్రాఫిక్కూ, గడియారస్తంభం, షాపింగ్ కాంప్లెక్సూ, బట్టల షోరూమ్, వేలు చూపిస్తున్న వెంకటేష్ కటౌటూ, బోలెడన్ని స్కూటర్లు గంటు మొహాలు పెట్టుకుని వెయిట్ చేస్తున్న రైల్వే క్రాసింగూ, వీపులు చూపిస్తున్న షాపుల వెంటిలేటర్లలో ఎగ్జాస్టు ఫేన్లూ, బట్టలారేసి వున్న అపార్ట్‌మెంట్ బాల్కనీలు, రెపరెపలాడుతున్న మెడికల్ కాలేజీ యూనిఫారాలూ, పెట్రోలు బంకూ, కనకదుర్గా ఫ్యామిలీ దాభా, కొబ్బరి చెట్లూ, వరి చేలూ, బోరింగు దగ్గర పిల్లల బోసి ముడ్లూ... మళ్ళీ యింకో ఊరూ, మళ్ళీ యింకో పట్టణం, మళ్ళీ యింకో నగరం... యిలా ప్రతీ వీధిలో ప్రతీ యింట్లో ప్రతీ బయలులో ప్రతీ మనిషిలో పై తెరలు తీయగానే ఎన్నెన్నో కథలు ఝుమ్మంటూ ముసురుకుంటుంటే, జీవితం అవిచ్ఛిన్నంగా కళ్ళ ముందు విచ్చుకుంటూంటే, మన చైతన్యపు కొలతకి అందనంత విస్తారంగా పరుచుకుంటూంటే, అప్పుడు, ఆ సమయంలో ఒక్కసారి, కలమూ తెల్లకాగితాలతో నిమిత్తమున్న మన సాహితీ వ్యాసంగాన్ని గుర్తు తెచ్చుకుంటే, అప్పుడు తెలుస్తుంది, అది దాని చేవ ఎంత పరిమితమో. మెలికల గీతల్తో నిర్మితమైన అక్షరాలూ, వాటి కూడికతో నిర్మితమైన పదాలూ, వాటి వెనుక ఏ స్థిరత్వమూ లేక చంచలంగా దోబూచులాడే అర్థాలూ యివన్నీ మొదటికే ఈ విస్తృత జీవిత వైశాల్యాన్ని ఇముడ్చుకునేందుకు ఎంతో చాలీచాలనివీ, అసమగ్రమైనవీను. యిక సాహిత్యాన్ని భాష అంటూ, నిర్మాణ భేదాలంటూ యింకా దాని పరిధిని కుదింపజేస్తే అది జీవితం ముందు పూర్తిగా కుదేలైపోతుంది. కౌగలించుకోవాల్సిన చేతుల్ని వెనక్కి విరిచి కట్టేస్తే మోకాళ్ళ మీద కూలబడిపోతుంది. ఆకాశాన్ని రెక్కల్తో కొలవాలనుకునే పక్షి ప్రయాసలో నిష్పలత్వమే వున్నా, ఆ బృహత్ అభిలాషలో, ఆ స్వేచ్ఛలో ఓ అందం వుంది.  కానీ పంజరంలోంచి ఆకాశాన్ని బెంగగా చూసే పక్షిలో అలాంటి అందమేమీలేదు.

నేను ఈ వ్యాసంలాంటి ఏదో రాతలో విషయం నుంచి పూర్తిగా దారి తప్పుతున్నట్టున్నాను. రాయాలనుకుంది వేరు రాస్తోంది వేరు. నాలో కొత్తగా మొదలయిన భ్రమణకాంక్ష గురించి కదా నేను రాయాలనుకుంది. సాహిత్యం జోలికి ఎందుకు వచ్చాను. (నా విషయంలో ఈ రెంటికీ నాకిప్పుడు ఆలోచించే ఓపిక లేని అవినాభావ సంబంధమేదో వుందనిపిస్తుంది.)

తిరుగుడు యావ నాలో చిన్నప్పట్నించీ వుందేమోనని అనుమానించడానికి బస్సు కిటికీ పట్లా, రైలు తలుపు పట్లా నాకున్న మక్కువ తప్ప వేరే ఆధారం లేదు. అసలు భ్రమణకాంక్ష అనేదొకటి మనుషుల్ని పట్టుకుని ఊపుతుందనీ, ఫలితంగా ఎక్కడా కాలు నిలపలేక, ఎక్కడా ఎక్కువకాలం తమని స్థిరపరుచుకోలేక, నిరంతరం కొత్త చోట్లకై అన్వేషించేవారు వుంటారనీ నాకు తెలియదు. తిరగడం అంటే ఏదో గమ్యానికని మాత్రమే నాకు తెలిసింది. చిన్నప్పుడంతా ఎప్పుడన్నా వేసవి సెలవల్లో చుట్టాల యిళ్ళకు వెళ్ళి వచ్చేయడం తప్ప నేను చేసిన దూర ప్రయాణాలు తక్కువ. అప్పుడపుడూ ఊరి చివర లాకుల దగ్గర స్నానాలకూ, మూతబడిన రైసుమిల్లుల్లో ఆటలకీ అభ్రకం పెచ్చులు ఏరుకోవడానికీ, గోదావరి లంకలకూ, స్మశానాలకూ, మామిడితోటల్లో దొంగతనాలకూ నన్ను పురికొల్పింది ఏకతీరుగా విసుగుపుట్టించే స్కూలు జీవితమే తప్ప, కొత్త స్థలాల పట్ల మక్కువ కాదు. కొత్త ప్రదేశాల్లో, కొత్త మనుషుల్తో గడపాలనే యావ లోపలేవన్నా వుండి వుంటే దాన్ని నావరకూ పుస్తకాలు బాగానే సంతృప్తి పరచాయి. ఒకవేళ అలాంటిదేమీ లేకపోతే, పుస్తకాలు ఆ లోటు తెలియనివ్వలేదు. ముఖ్యంగా మాక్సింగోర్కీ జీవిత చరిత్ర (ట్రయాలజీ) లాంటి పుస్తకాలు నన్ను కేవలం స్థలం లోనే కాదు, కాలంలో కూడా సదూరంగా తీసుకుపోగలిగాయి.

బైట కూడా లోకం వుందన్నమాట బెక బెక! 

డిగ్రీ చదివేటపుడు ఒక సంఘటన మాత్రం నా చిన్ని లోకం మీద బోర్లించిన బుట్టని తిరగేసి ప్రపంచాన్ని కొత్తగా చాలా చూపించింది. పూల మొక్కలకు ప్రసిద్ధి చెందిన కడియపులంకలో ఏడాదేడాదీ ‘ఫలపుష్ప ప్రదర్శన’ జరిగేది. మేం నలుగురు స్నేహితులం కలిసి బయల్దేరాం బస్సులో. అబిద్‌ గాడు యింట్లో చెప్పకుండా మస్కాకొట్టి తెచ్చిన డొక్కు కెమెరా ఒకటి మాతో వుంది (అప్పటికింకా డిజిటల్ కెమెరాలు అంత వ్యాప్తిలోలేవు.) ఇక చూడాలి, ఎగ్జిబిషన్‌లోకి చేరేసరికి ఆ కెమెరాతో మా యవ్వారం ‘తోక యెత్తిన కాకి, తోక దించిన కాకి’ అన్నట్టు తయారయింది. ఏవో పూల బెడ్స్ ప్రక్కనో, బోన్సాయ్ చెట్ల ప్రక్కనో ఫోటోలంటే సరే. కానీ మా ఫోటోల వైవిధ్యానికి అంతులేదు. ఓ స్టాల్లో పూలమొక్కలకి ఎరువులమ్ముతున్న అమ్మాయితో (ఆ అమ్మాయి చాలా అందంగా వుంది; ఒక ఎరువుల పాకెట్ కొంటే తనతో ఫోటో తీసుకోవచ్చంది), ఎగ్జిబిషన్ బయట ఆపివున్న కార్ల ప్రక్కన్నుంచునీ, రోడ్డు మధ్యలో, పొలం గట్ల మీద, చెట్ల క్రింద, చెట్ల మీద, ముగ్గుర్లో ఎవడో తెచ్చిన నల్ల కళ్ళజోడు ఫొటోకి ఒకరొకరం మార్చుకుంటూ, ఒక ఫొటోకి ఇన్‌షర్టూ, ఒక ఫొటోకి పక్కోడి టీషర్టూ... యిలా ఆ ఒక్కరోజులోనే మనిషి జీవపరిణామ దశల్నెంటినో పెద్ద పెద్ద అంగల్తో వెనక్కి దాటేసి విచ్చలవిడిగా ఫొటోలకు ఫోజులిచ్చాం. జీవితంలో అంతకుముందెప్పుడూ మాలో ఎవ్వరమూ అన్ని ఫొటోలు దిగలేదు. బాగా రాత్రి దాకా ఎగ్జిబిషన్ దగ్గరే కాలక్షేపం చేసింతర్వాత, హైవే మీద ఏదో కంకర మోసుకెళ్తూన్న లారీని ఆపి వెనక కంకరలోడు మీద ఎక్కాం. పాటలు పాడుకుంటూ, కేకలూ వేసుకుంటూ వెళ్ళాం. జొన్నాడ దగ్గర దిగాం. అక్కడ వేరే బస్సెక్కాలి. నాలుగడుగులేసామో లేదో, మా కెమెరా ఆ కంకర లారీలోనే వదిలేసి దిగామని అర్థమైంది. లారీ అప్పటికే కనుచూపుమేర దాటేసి చీకట్లో కలిసిపోతోంది. వెనక పరిగెత్తాం ఖాళీ రోడ్డు మీద పొలోమని, ఈసారి కంగారుతో కేకలు వేస్తూ. కానీ అది ఆగలేదు. అబిద్‌ గాడి కంగారు... వాడి ఫ్యామిలీ మొత్తానికి అది ఒక్కగానొక్క కెమెరా! లారీ వెళ్ళిన వైపే వెళ్ళాలని నిశ్చయించాం. వెనక వస్తున్న యింకో లారీ ఆపి ఎక్కితే వాడు చెప్పాడు, బహుశా ముందెళ్ళిన లారీ గోదావరి అవతల వున్న ‘ఎల్ & టి’ వాడి సైటు లోకి కంకర తీసుకెళ్తోందేమోనని. (అప్పుడు రావులపాలెం గోదావరి వంతెనకి ఏవో మరమ్మతులు జరుగుతున్నాయి.) అయితే అక్కడే దిగుతామన్నాం. అబిద్‌ గాడికి కెమెరా పట్ల ఎంత ఆందోళన వుందో, మిగతా ముగ్గురికీ అందులో ఫోటోల పట్ల అంతే ఆందోళనగా వుంది. అయినా విధి మా పట్ల అంత కఠోరంగా వ్యవహరించగలదని యింకా నమ్మలేక, పైకి జోకులు వేసుకుంటూనే వున్నాం. బ్రిడ్జి అవతల దిగి, కన్‌స్ట్రక్షన్ సైటులోకి వెళ్ళాం. లోపల బోలెడన్ని లారీలు, క్రేన్లు, క్రషింగ్ మెషీన్లు, బస్తాలు, ఇసుక, కంకర గుట్టలు... మొత్తం వాతావరణమంతా మనుషుల్లో పిపీలికత్వపు స్పృహ కలిగించి న్యూనత రేకెత్తించేలా వుంది. అప్పటికే అర్ధరాత్రి దాటుతోంది. అయినా లోపల నిర్విరామంగా పని జరుగుతూనే వుంది. ఎవరో మేనేజరనుకుంటా, సంగతి చెప్తే గత కాసేపట్లో లోపలికి ఏయే లారీలు వచ్చాయో రిజిస్టరులో చూశాడు. సెక్యూరిటీ వాణ్ణొకణ్ణి మాకు అప్పజెప్పి ఆ లారీలు వదిలిన కంకర గుట్టల్లోకి పంపించాడు. అతను మా కెమెరా ఎత్తుకెళ్ళిన లారీ తాలూకు కంకర గుట్ట ఏదైవుండచ్చో అది మాకు చూపించాడు. మేం కాసేపు ఆ గుట్ట అటూ యిటూ కెలికి చూసాం. అది చాలా పెద్దది వుంది. అంతా పెకలించినా దొరక్కపోతే! చివరికి అప్పటికే ఆశ చచ్చిపోయింది. విధి మాకు హేండిచ్చిందని కన్ఫర్మయిపోయింది. ముగ్గురం ఓ గంట అక్కడే గడిపి కాళ్ళీడ్చుకుంటూ రోడ్డు మీదకి వచ్చాం. లారీ నుంచి లారీకి మారుతూ మాచవరం వెళ్ళి ఆ రాత్రి రెడ్డి గాడి యింట్లో పడుకున్నాం. ఇప్పటికీ మేం నలుగురం కలిస్తే అడపాదడపా ఆ రాత్రి గురించి ఓ మాట ప్రస్తావనకు వస్తూనే వుంటుంది.

మా కాలేజీ జీవితంలో కొన్ని ఆనంద క్షణాల్ని ఫ్రీజ్ చేసి ఇముడ్చుకున్న ఆ కెమెరా ఫిల్ము వాటిని ఫోటోల రూపంలో విడుదలచేసి వుంటే అవి ఎప్పటికీ మాతో వుండిపోయేవి. ఆ కెమెరాలో ఇమిడిన మా అప్పటి అవతారాలు నాకు యిప్పటికీ లీలగా స్ఫురిస్తాయి. కానీ ఆ రాత్రి ఆ కన్‌స్ట్రక్షన్ సైటులో గడిపిన క్షణాలు నాకు అంతకు మించిన స్పష్టతతో గుర్తున్నాయి. ఫోటోలుగా మారకుండానే తప్పిపోయిన ఆ ఫిల్ము మా కొన్ని జ్ఞాపకాల్ని మాక్కాకుండా చేసినా, అలా తప్పిపోవడం ద్వారా అంతకన్నా మరింత తీక్షణమైన జ్ఞాపకాన్ని ఇచ్చింది. ఆ అర్ధ రాత్రి హైవే రోడ్డూ, లారీలూ, తెలియని స్థలాలూ, తెలియని మనుషులూ... ఒక్కసారిగా ప్రపంచం బట్టలు తిరగేసి తొడుక్కుని వుండగా నా కంటబడినట్టు అనిపించింది.  ఆ లారీ డ్రైవర్ల రోజెలా గడుస్తుందో, ఆ సెక్యూరిటీ వాడి యింట్లో కథేమిటో, ఆ కన్‌స్ట్రక్షన్‌ సైటులో ఎలాంటి వ్యవహారాలు నడుస్తాయో, వాటికి మూలమైన పెద్ద పెద్ద నిర్ణయాలు నగరాల్లో ఏ కాన్స్ఫరెన్సు హాళ్ళనించి వస్తాయో, అక్కడ డెస్కుల వెనుక యింజనీర్ల కథలేమిటో...! అదివరకూ నేను పెద్దగా ఎన్నడూ గమనించని ఒక విషయం ఆ రాత్రి తెలిసింది: ప్రపంచం ఎపుడూ నిదరపోదనీ; ఏదో ఒకటి చేస్తూనేవుంటుందనీ; నాకు ఆనుపానులు తెలియని స్థలాల్లోనూ, నేను పేర్లెన్నడూ వినని ఊళ్ళలోనూ, నగరాల్లోనూ, నగరాల బయట కొండల్లోనూ, కొండల మధ్య అడవుల్లోనూ, అడవుల నిశ్శబ్దంలోనూ... నిత్యం నా చుట్టూ వున్నంత సంపన్నంగానే జీవితం నడుస్తూ వుంటుందనీ; ఎప్పుడూ ఏవో కథలు జరుగుతూనే వుంటాయనీ; కానీ అవన్నీ నాకెప్పటికీ చేరకుండానే, ఆ అగణిత క్షణాలూ, ఎన్నో అద్భుత సమయాలూ ఏ ఫొటో ఫిల్ముపైనా ముద్రితం కాకుండానే, ఈ అనంత నిర్విరామ కాలగతిలో తమ ఆచూకీ కోల్పోతూ వుంటాయనీ... ఇదంతా ఆ రాత్రి గుర్తుండిపోయేట్టు నాకు తొలిసారి తెలియజెప్పింది. ఆ రాత్రిలో ఏ దినుసులు దాన్ని అంత గాఢంగా నా జ్ఞాపకంలో ముద్రితమయ్యేలా చేసాయో నేను స్పష్టంగా చెప్పలేను. నా కూపస్థమండూక అస్తిత్వాన్నించి నన్ను కాసేపు బయటకు లాగి, వేరే ఎంతో విశాల ప్రపంచపు స్పృహను గట్టిగా నాలో కల్పించిన సంఘటనల్లో యిది కీలకమని మాత్రం చెప్పగలను. దానికి ఋజువు ఇదే, యిపుడిలా ఒక్కసారి వెనక్కి తిరిగిచూసుకోగానే వేరే అన్ని జ్ఞాపకాల్నీ తోసుకుని యిలా ముందుకు తోసుకొచ్చేయటమే!

రెక్కల్లేని లోటు తొలిగా తెలిసొచ్చిన కాలం

డిగ్రీ అయిన తర్వాత ఖాళీగా వున్న కొన్ని రోజుల్లోనూ నేను చదివిన కొన్ని పుస్తకాల గురించి యిక్కడ చెప్పాలి. ఎందుకంటే నాలో యిప్పటి భ్రమణకాంక్షకు పాదులు వేసిన పుస్తకాలు వాటిల్లో కొన్ని వున్నాయి. ముఖ్యమైనది ఒక రాహుల్ సాంకృత్యాయన్ పుస్తకం. నేను చదివిన తెలుగు అనువాదం పేరు ‘లోకసంచారి’. (అనువాదకులు ఎవరో గుర్తులేదు.) దాని మూలం పేరు ‘ఘుమక్కడ్ శాస్త్ర’ అని గుర్తుంది. అనువాదానికి పెట్టిన పేరు కన్నా మూలం పేరు ఈ పుస్తక తత్త్వాన్ని యింకా ఖచ్చితంగా చెపుతుంది. పుస్తకంలో ఎక్కువ శాతం రాహుల్ సాంకృత్యాయన్ చేసిన ‘లోక సంచారం’ గురించి కన్నా, అసలు లోక సంచారులు ఎలా మసలుకోవాలి, మానసికంగా ఎలా సంసిద్ధులు కావాలీ మొదలైన వాటి గురించి వుంటాయి. ఈ సమయంలోనే చదివిన మరో పుస్తకం సంజీవ దేవ్ ‘తెగిన జ్ఞాపకాలు’. సంజీవ దేవ్ కూడా రాహుల్ సాంకృత్యాయన్ లాగే చిన్నపుడే యిల్లు విడిచి దేశాటనకు వెళ్ళినవాడు. స్వయానా రాహుల్ సాంకృత్యాయన్‌తో వ్యక్తిగత పరిచయం వున్న వాడు కూడా. ఆయన చాలా చిన్నతనంలో యిల్లు వదిలి హిమాలయాలకు పోవడం, గొప్ప గొప్ప వాళ్లతో పరిచయాలు ఏర్పరుచుకోవడం యివన్నీ చదివిం తర్వాత నాకు న్యూనత కలిగింది. నేను మసులుకున్న లోకపు విస్తీర్ణం పుట్టగొడుగు క్రింద నీడంత మాత్రమేనని అర్థమైంది. బుచ్చిబాబు ‘నా అంతరంగ కథనం’ కూడా యిపుడే చదివాను. అదేమీ లోక సంచారం గురించి కాదుగానీ, అందులో ఓ చోట బుచ్చిబాబు రైళ్ళలో తనకు కనిపించే ఆకర్షణని ప్రస్తావిస్తాడు. అతని యిష్టాన్ని నా యిష్టంతో పోల్చి చూసుకోవడం గుర్తుంది. ఈ పుస్తకాలన్నింటిలో నేనేం చదివానన్నది ఒక్క ముక్క కూడా నాకు జ్ఞాపకం లేదు. (‘తెగిన జ్ఞాపకాలు’ అయితే పేరు కూడా గుర్తు లేదు. ఇది ఈమధ్యే మళ్ళీ పుస్తక రూపేణా విడుదలైనపుడు కొని రెండు మూడు పేజీలు చదివాకా, ఒహో యిది వరకూ చదివిందే కదా అనుకున్నాను.) కానీ చదివినపుడు మాత్రం వీటి ప్రభావం నా మీద వుందని గుర్తుంది.

అప్పట్లో కడియంలో వుండే వాళ్ళం. పగలల్లా పుస్తకాలు చదవడం, సాయంత్రం ఊరి చివర వుండే రైల్వే స్టేషన్‌కి వెళ్ళి కూర్చోవడం. సౌందర్యంలో ఆ రైల్వే స్టేషన్‌తో పోటీ పడే మరో స్టేషన్ నాకింత దాకా తారసపడలేదు. స్టేషన్‌కి కుడి ఎడమల్లో కొన్ని గుడిసెలు. రెండు మూడు చెక్క బల్లల్తో ప్లాట్ ఫాం, దాని ముందు పట్టాలు, తర్వాత వరుసగా క్షితిజ రేఖ అవధిగా విస్తరించిన పొలాలు, ఒక ప్రక్కన కొండలు, మరో ప్రక్కన దూరంగా జి.వి.కె. ఫ్యాక్టరీ. రైలు వస్తుంటే ఆ కొండల్లో దూరంగా ముందే కన్పించేది. అక్కడ పట్టాలు అక్కడ పెద్ద యూటర్న్ తిరిగివుంటాయి. కడియంలో పట్టాలకున్నంత వంపుతో యూటర్న్ దేశంలో యింకెక్కడా లేదని, రైలు డ్రైవరూ గార్డూ ఎదురుబొదురు నిల్చొని చేతులూపుకోవచ్చనీ అమ్మ చెప్పేది. (కొంత అతిశయోక్తి కావొచ్చు.) సాయంత్రాలు అక్కడకు సైకిల్ మీద పోయి కూర్చునేవాణ్ణి. పుస్తకాలు తీసికెళ్ళే వాణ్ణి గానీ చదవబుద్దేసేది కాదు. ఆలోచించబుద్దేసేది. దేశంలో ఎక్కణ్ణించో మొదలై మరి యే మూలకో పోయే గూడ్సు రైళ్ళు అక్కడ గంటలు గంటలు ఆగేవి. చాలాసార్లు యెక్కేసి అదెక్కడికెళ్తే అక్కడికి అలా అలా పోదామా అనిపించేది. ఒకసారి టికెట్టు లేదని దింపేస్తే అక్కడ దిగిన గెడ్డం సాధువొకడు కనపడ్డాడు. అతని పట్ల కుతూహలంతో స్థానికుడొకతను ప్రశ్నలు వేస్తున్నాడు. వినేవాడు దొరికాడన్నట్టు తన జీవన శైలిని ఉత్సాహంగా చెప్తున్నాడు. నేనూ ఆసక్తిగా ఓ చెవి అటు పడేసాను. మామూలుగా యిలా కాషాయం వాళ్ళని రైలు దింపరట. ఇలా ఒక చోటు నుండి మరొక చోటుకి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు ప్రయాణిస్తుంటాడు. ఏ చోటు నచ్చకపోయినా వెంటనే బిచాణా బదిలీ. కలకత్తాలో మంచి గంజాయి ఎక్కడ దొరుకుతుందో చెప్తున్నాడు. మాటల్లో తెలిసే పోతుంది. అతనికి కాషాయం జరుగుబాటు కోసం మాత్రమే. ఆధ్యాత్మికం మాటటుంచి, ఆదమరపుగా వుంటే జేబు కొట్టేవాడిలా వున్నాడు. కానీ అతని కళ్ళు ఎన్నెన్ని ప్రదేశాలు చూసి వుంటాయోనని నాకు కుళ్ళొచ్చింది. కడియానికి ఓ ప్రక్కగా ఎర్రమట్టితో కొండగుట్టలుండేవి. అపుడపుడూ అక్కడకు సైకిల్ మీద పోయి, క్రిందనుండి చిన్నగా వెళ్తూ కన్పించే రైలుని చూడడం కూడా బాగుండేది. బహుశా ఆ పుస్తకాలూ, ఆ పరిసరాలూ, నాలో యిప్పటి తిరగాలన్న కోరికకు తొలి ప్రేరణలేమో. అయితే, ఒక పిట్ట పోయి పోయి పంజరం ఊచలకి గూడు కట్టినట్టు, నేను తర్వాత హైదరాబాదు వచ్చేసాను.

హైదరాబాదాయణం

నేను వచ్చి పదేళ్ళవుతోంది. ఏ నగర స్వరూపమైనా బయటివాళ్లకి అర్థమైనంతగా స్థానికులకి అర్థమవదని నాకన్పిస్తుంది. ఎందుకంటే స్థానికులు ఎడంగా నిలబడి చూడలేనంత మమేకమైవుంటారు నగరంతో. ‘హైదరాబాదీ’లమని ఉత్సాహపడే వాళ్ల కన్నా హైదరాబాదుని నేను ఎక్కువ చూసానని తెలుసు. మిథికల్ హైదరాబాదుని కాదు, ఇపుడున్న హైదరాబాదుని. దట్టంగా కొట్టిన దాని మేకప్ వెనుక దాగి వున్న ముడతల రహస్యాలన్నీ నాకు దగ్గరగా తెలుసు. నాకు దీని మీద ప్రేమా, విసుగూ రెండూ వున్నాయి. ప్రేమ కన్నా విసుగే ఎక్కువ. ఒకప్పుడు హైదరాబాదుకి నిర్వచనంగా నిలబడిన మైథాలజీ అంతా నేను చూస్తుండగానే కూల్చివేతకు గురైంది. దాంతో పాటే నా ప్రేమ కూడా. ఇపుడిది నిర్మాణంలో వున్న నగరం. వేరే ఏదో కాబోతున్న నగరం. ఒక పేద్ద కన్‍స్ట్రక్షన్ సైటు. యిక్కడ ఖరీదైనతనమూ గరీబుతనమూ తమ వ్యత్యాసాన్ని మరింత కొట్టొచ్చేట్టు పెంచుకున్నాయి. చిత్రంగా అదే సమయంలో ప్రాదేశిక దూరాన్ని మరింత తగ్గించుకుని ప్రక్కప్రక్కనే ఒకదాన్నొకటి వొరుసుకుంటూ కనపడుతున్నాయి. ఒక ప్రక్క షాపింగ్ మాల్సూ, టౌన్‌షిప్పులూ, ఆఫీస్ స్పేసెస్ యివన్నీ బ్రోచెర్లలో కన్పించే ‘tranquil’, ‘idyllic’, ‘state of the art’ లాంటి విశేషణాలకు తగ్గట్టుగా గొప్పగానే వుంటున్నాయి; మరోప్రక్క హెల్మెట్లు తగిలించుని సగం జీవితం ట్రాఫిక్లోనే గడిపే మధ్యతరగతి తలలు బోలెడు వుండనే వున్నాయి. ఆ తలల్లో పుట్టే ఆశల్ని ఆసరా చేసుకుని బోలెడంత నగరం వాటి చుట్టూ పరిభ్రమిస్తూంటుంది; యివికాక వీటన్నింటి మధ్యా, వీటన్నింటి ప్రక్కనే, చోటు దొరికిన చోటల్లా మూలమూలల్లోకీ సర్దుకుపోతున్న బీదతనమూ బోలెడువుంది. నాపరాళ్ళు చెదురుమదురుగా పేర్చిన యిరుకు గల్లీలూ, అటూయిటూ ఆస్బెస్టాస్ కప్పులూ, మంజీరా నీళ్ళ కోసం ఆడాళ్ళ పోట్లాటలూ, ఫ్లాట్‌ఫారాల చివర గుడుంబా పేకెట్ల మత్తులో తమ ఉనికి బాధని మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ శిథిలమైపోతున్న మనుషులు, భుజానికి గోనెసంచులు మోస్తూ చేతిలో పదునైన ఇనుప ఊచని చెత్తకుప్పల్లో గుచ్చి కవర్లు యేరుకుంటూ దిశ లేని కసిని kores కరెక్షన్‌ ఫ్లూయిడ్ల మత్తులో చల్లార్చుకునే బాల్యమూ, నిర్మాణంలోని ఎత్తైన భవనాల చుట్టూ తాత్కాలిక వాసాల్లో నిర్మాణ కూలీల దుమ్మూదూగరా జీవితమూ... యిలా లెక్కకు అందనన్ని దృశ్యాలు పేర్చవచ్చు; యివన్నీగాక మిగిలిన మూలలేమన్నా వుంటే అక్కడ ఒకప్పటి మిథికల్ హైదరాబాదు కృశించి అవశేషంగా వుంది. బయటివాళ్ళకి దుర్భేద్యమైన పాతబస్తీ వీధుల్లోనూ, ఆదివారం కోటీలో రోడ్లవార్న పాత పుస్తకాల పేర్పులోనూ, అపుడపుడూ సాంబ్రాణీ సాయిబు వచ్చి సువాసనలు చిమ్మి వెళ్ళే ఇరుకు కెఫెల్లోనూ తప్ప యిది పెద్దగా ఎక్కడా కన్పించదు. ప్రస్తుతానికి హైదరాబాదు ఏదో మధ్య దశలో వుంది. యీ సంచలనమంతా ఎప్పటికి సద్దుమణుగుతుందో తెలియదు. కానీ సద్దుమణుగుతుంది. యిదంతా ఎపుడోకపుడు ఎకడోకక్కడ నెమ్మదిగా నిలకడ సాధించుకుంటుంది. అపుడు ఆ నిలకడలో మరో కొత్త సంస్కృతి ఆవిష్కరించబడుతుంది. దాని లక్షణాల్ని బట్టి హైదరాబాదుకు కొత్త నిర్వచనాలు ఆపాదింపబడతాయి.

ప్రేమైనా విసుగైనా ఏమైనా హైదరాబాదు యిప్పటికే నాలో భాగం. హైదరాబాదు నాకు నేర్పినవో, లేక నేను హైదరాబాదులో వుండగా నేర్చుకున్నవో, చాలా వున్నాయి. నిత్యం అనిశ్చితి అగాధంపైన దారం పాటి ఆధారాలకి వేలాడుతూ కూడా నిశ్చింతగా వుండటం నేర్పింది. బైటి దాడులనుండి రక్షణలేని నా మునుపటి మెతకదనంపై పెళుసుదే అయినా కాస్త దురుసైన కవచాన్ని తొడిగింది. నాకు కావాల్సినన్ని పుస్తకాలిచ్చింది. నాక్కావల్సినంత సంస్కృతిని చుట్టూ అందుబాటులోకి తెచ్చింది. కానీ నేనే స్వేచ్ఛాభిలాషతో యిక్కడ అడుగుపెట్టానో అది యిక్కడా దొరకలేదు. నాకు మొదట్లో కొత్త బంగారు లోకం అనిపించిందంతా పైమెరుగని తేలిపోయింది. కానీ అసలంటూ నిలబడ్డానికి నిలకడైన ఆధారాన్ని సంపాయించేసరికే యేళ్ళు గడిచిపోయాయి. మధ్యలో తోడుకోసం అనువుగాని తావుల్లో వెతుక్కునే నా వైకల్యమొకటి సగం కాలాన్ని తెలియకుండా దాటవేయించింది. అలా పదేళ్ళు ఆదమరుపుగానే గడిచిపోయాయి. ఈలోగా ఈ నగరపు ఇరుకు నన్ను ఉక్కిరిబిక్కిరి చేయకుండా, నా పుస్తకాలు తాము పొదువుకున్న కథల్లోని కల్పిత లోకాల షరతుల్లేని  పౌరసత్వాన్ని అందిస్తూ నన్నాదుకున్నాయి.

బుద్ధిలో కొత్త పురుగు డ్రిల్లింగ్ ప్రారంభించడం 

గత ఏడాది నావైపుగా నేను ఎదురుచూడని గాలులు వీచాయి. వ్యక్తిగత జీవితంలో కొన్ని మార్పుల వల్ల తరచూ ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి కలిగింది. అవి కూడా గమ్యమున్న ప్రయాణాలు కాదు. ఊరకే ఊళ్ళు పట్టి తిరగాల్సి వచ్చింది. ఎన్నడూ చూడని ఊళ్ళూ, చవక లాడ్జీలు, అపరిచిత చౌరస్తాలు, యిరుప్రక్కలా నిద్రగన్నేరు చెట్లు తలపైన చూరు కట్టిన రోడ్లూ, తంగేడు పూల కొమ్మల వెనక సూర్యాస్తమయాలూ, కొండల చిటారున గుడి గోపురాలూ, నదులూ, వంతెనలూ, పొలాలూ, ఎవర్నో గుర్తు తెస్తూనే వారితో ఏ పోలికలోనూ సామ్యం దొరకని కొత్త మొహాలూ... ఏదో కొత్త తరహా జీవితపు చేలాంచలం ఊరించడం మొదలుపెట్టింది. ప్రతీ చోటా ఒకేసారి వుండాలనిపించడం మొదలైంది. ప్రతీ ఊళ్ళోనూ వుండి దానికే ప్రత్యేకమైన ఆత్మని పరిచయం చేసుకోవాలి. ఆ ఊర్లో మనుషులందరి మనసుల్లోనూ ఆ ఊరి కూడలికీ, ఊర్లో స్కూలు మైదానానికీ, ఊరి మధ్య రథం వీధికీ, ఊరి చివర కొండకీ అన్నింటికీ ప్రత్యేకమైన వ్యక్తిత్వం వుంటుంది, అది నాకు అర్థం కావాలి. నా సొంత ఊరిని ఎలా జ్ఞాపకాల రంగుల్లో వడగట్టి చూస్తానో, అలా ఆ ఊరి వాళ్ళ చైతన్యంతో ఆ పరిసరాల్ని చూడగలగాలి, ప్రేమించగలగాలి. ప్రతీ పరిసరమూ — రైల్వే స్టేషనూ, కాఫీ హోటలూ, లాడ్జీ గది, గుడి మంటపం, ఇళ్ల వరస, చెట్టు కొమ్మల అమరికా — తమ అమరిక ద్వారా ఏదో ప్రత్యేకమైన వాతావరణాన్ని కల్పిస్తాయి, ఏవో కథలు చెప్తాయీ, లేదా ఏవో ఊహాజనితమైన కథలకు సామరస్యంగా ఆతిథ్యాన్నిస్తాయి; వాటన్నిటి సందిటా నేను గడపాలి. ఇడ్లీచట్నీలూ, ఉప్మాపెసరట్లూ, మషాలాదోసెలూ వాటిని చేసే హస్తవాసిని బట్టి చిన్న చిన్న తేడాలతో ఎన్ని రుచులు మారగలవో అన్నీ నా నాలిక మీద పడాలి. తెలియని వాళ్ళతో మాట కలపాలి. తెలియని పక్షుల్ని పేరేంటని అడగాలి. రోడ్డు ప్రక్కన దుమ్ములో సీతాకోక చిలుకల అనాథ కళేబరాల్ని చేతుల్లోకి తీసుకుని వాటి చిరిగిన రెక్కల మీద దేవుడు అదృశ్యలిపిలో రాసిన సత్యాల్ని చదువుకోవాలి. ఒక్కముక్కలో చెప్పాలంటే, నా జీవితాన్ని నా చేతిలో వడిసెల లాగా చేసి, గిరగిరా త్రిప్పి ప్రపంచం మీదకు విసిరేసుకోవాలి. — అని అనిపించడం మొదలుపెట్టింది.

అయితే నేనే కాదు, అలా అనిపించీ ఆ అనిపించడాన్ని అనుసరించిన వాళ్ళు నా చుట్టూ వున్నారు. వాళ్ళ ప్రేరేపణ కూడా తోడైంది. ముఖ్యంగా కాశీభట్ల వేణుగోపాల్. ఆయన కూడా దేశం మీద పడి తిరిగినవాడే. ఒకసారి సైకిల్ మీద తిరిగాడు, మరోమారు కాలినడకన మొత్తం భారతదేశం తిరిగాడు. తిరగడమంటే ఒక చోట స్వస్థలమనేది పెట్టుకుని, ఆ బిందువు నుంచి మనమెక్కడకుపోతే అక్కడిదాకా తెలియని బంధనాల్ని మనసులో నిత్యం భరిస్తూ, మళ్ళీ ఎప్పటికో వెనక్కి చేరిపోతామన్న ఎరుకతో తిరగడం కాదు. కుక్క మెళ్ళో గొలుసు ఊరంత పొడవైందైనా దాని రెండో కొస ఒక గేటుకి తగిలించి వున్నంత వరకూ దాన్ని స్వేచ్ఛ అనలేం. కాశీభట్ల సంగతి వేరు. ఆయన యిల్లన్నది మర్చిపోయాడు. వెళ్ళిన చోటల్లా, వున్నంత సేపూ వున్నదే యిల్లనుకున్నాడు. ఎక్కడ వుంటే అక్కడ ఏవో చిరు ఉద్యోగాలు చేసుకుంటూ, కూడబెట్టిన డబ్బుతో మరో చోటకి పోతూ, మళ్ళీ దాన్నే స్వస్థలమనుకుంటూ... యిలా తిరిగాడు. ఆయన ఆ జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నపుడల్లా నా అంతరంగ యవనిక మీద ఆ ఎన్నడూ చూడని ప్రదేశాల దృశ్యమాలిక తెరచుకొనేది. నా మనసు వాటిలో లీనమైపోగా వర్తమానంలో ఉనికిని మర్చిపోయేవాణ్ణి.

ఈ మధ్యనే ఆయనకి నా భ్రమణకాంక్ష గురించి వెల్లడించాను. అపుడాయన యిచ్చిన సలహా, నేను పూర్తిగా పాటించలేకపోయినా, మంత్రముగ్ధుణ్ణి చేసింది: మొదటి సూత్రం, ఎప్పుడూ ఒంటరిగానే ప్రయాణించాలి. రెండుమూడు జతల బట్టల్తో బయల్దేరి పోవాలి. ఒక నోటు పుస్తకం దగ్గరుంచుకుని తోచినవి రాసుకుంటూండాలి. డెబిట్/ క్రెడిట్ కార్డులు పట్టికెళ్ళకూడదు. రైల్వే స్టేషన్‌ కెళ్ళి, ఫ్లాట్‌ఫాం మీద ఏ రైలు ఆగివుంటే దానికి టికెట్టు తీసుకుని ఎక్కేయాలి. ఏ వూరు ఆకర్షిస్తే అక్కడ దిగిపోవాలి. వూళ్ళోకి పోవాలి. మనుషుల్ని కదపాలి. మాట్లాడాలి. చుట్టూ చూడాలి. ఆ స్థలం పాతబడితే లారీలెక్కి యింకో చోటికి పోవాలి. లారీ వాళ్ళు డబ్బుల్లేకపోయినా బ్రతిమాల్తే ఎక్కించేసుకుంటారట. వాళ్ళకీ దూరప్రయాణాల్లో మాట్లాడే తోడు కావాలనుంటుందట. మళ్ళీ కొత్త ప్రదేశం. పని కావాలంటే ధాభాల్లో సులువుగా దొరుకుతుందట. అక్కడ పని చేస్తూ చుట్టు ప్రక్కల ఊళ్ళు తిరిగి రావచ్చు. డబ్బు సమకూరాకా యింకో స్థలం. ఒకవేళ డబ్బు మరీ లేకపోతే అపరిచితుల్నైనా బతిమాలుకోవచ్చు. చాలామంది చీదరించుకుంటారు, enjoy the humiliation! కొంతమంది ఇస్తారు కూడా. అపుడు మళ్ళీ యింకో చోటుకి.

ఆయన యిలా మాట్లాడుతున్నంత సేపూ నేను ఊహించుకున్న దృశ్యాలు నన్ను ఆ రోజే రైల్వే స్టేషన్‌కి పోవాలనిపించేంతగా ఊపేశాయి. ఎపుడో అలాగే వెళ్తాను కూడా. అయితే ఉద్యోగాన్ని వదిలేయగలిగే పరిస్థితులు యిప్పట్లో లేవు గనుక, ఫ్లాట్‌ఫామ్ మీద వున్న రైలు ఏదైనా ఎక్కేసి వెళిపోగలను గానీ, వెంట డెబిట్‌కార్డు లేకుండా వెళ్ళడమంటే సాధ్యం కాదు. పెట్టిన సెలవు పూర్తయ్యేసరికి ఠంచనుగా వెనక్కి వచ్చేయాలిగా. ఇలా తిరిగే ప్రదేశాల్లో టూరిస్టుల రద్దీ ఉండే ప్రదేశాలకు చోటు లేదు. నలువైపులా ప్రకృతి కమ్ముకుని వున్న ప్రదేశాల పట్ల కూడా పెద్ద మక్కువ లేదు. నన్ను ప్రకృతి ఆకట్టుకుంటుంది గానీ, అదేపనిగా నన్ను పట్టివుంచలేదు. యిపుడు ఫ్రెంచి రచయిత ఫ్లాబె (Flaubert) మాటలు గుర్తొస్తున్నాయి. తక్కువ మోతాదులో అవి నాక్కూడా అన్వయించుకోగలను. ఫ్లాబె తన ఆల్ఫ్ పర్వతాల పర్యటన గురించి మరో ప్రముఖ రష్యన్ రచయిత తుర్గెనొవ్‌కు రాసిన ఉత్తరంలో యిలా పేర్కొంటాడు:
నేను ప్రకృతి పుత్రుణ్ణి కాను. ‘ఆమె అద్భుతాలు’ నన్ను కళలోని అద్భుతాల కన్నా తక్కువ స్పదింపజేస్తాయి. ఆమె నాలో ఏ ‘గొప్ప ఆలోచనల’నూ జాగృతం చేయదు సరికదా నన్ను నలిపేస్తుంది. లోపల్లోపల నాకు ఆమెతో యిలా అనబుద్దేస్తుంది: ‘ఇదంతా బానే వుంది. నేను నీ దగ్గర్నుంచి కాసేపటి క్రితమే వచ్చాను, మరికొన్ని క్షణాల్లో మళ్ళీ అక్కడికే చేరుకుంటాను. కాబట్టి నన్ను నామానాన వదిలేయ్. నాకు వేరే సరదాలు కావాలి’.
పైగా ఈ ఆల్ఫ్స్ పర్వతాలు మనిషి అస్తిత్వ పరిధికి అందని కొలత కలవి. అవి ఎందుకూ ఉపయోగపడనంత పెద్దవి. నాలో అవి ఇలాంటి అసంతృప్తి కలిగించడం ఇది మూడోసారి. ఇదే చివరి సారని ఆశిస్తాను.

నాకు మనుషుల్లోనూ, వాళ్ళు నిర్మించిన నాగరికతలోనూ ప్రకృతితో సమానమైన సౌందర్యం కనిపిస్తుంది. ప్రకృతంతా ఏ నూటపద్దెనిమిది పరమాణు మూలకాల్తో నిర్మితమయిందో, వాటితోనేగా మనుషులు కట్టడాలూ నిర్మితమయింది! అంతా చూసే కళ్లలోనే అనిపిస్తుంది.  ప్రకృతి భారీతనం ఈ విశాలవిశ్వంలో మనిషి అస్తిత్వపు విలువేంటన్నది స్ఫురింపజేస్తుందన్నది నిజమే. కానీ చూసే కళ్ళుంటే, నగరంలో ట్రాఫిక్‌లో వున్నా, తలెత్తి చూస్తే కన్పించే నక్షత్రాలు కూడా నిత్యం మన విలువను మనకు గుర్తు చేస్తూనే వుంటాయి.

మొన్నో రోజు అప్పటికపుడు అనుకుని నేనూ చౌదరిగాడూ కలిసి బైకు మీద శ్రీశైలం వెళిపోయాం. యిది నేను తిరగాలనుకున్న పద్ధతిలో జరిగిన ప్రయాణం కాదు. ఒంటరిగా, బస్సుల్లోనూ రైళ్ళలోనూ, ఎక్కడ కావాలంటే అక్కడ ఆగుతూ, తోచిన ఆలోచనలు రాసుకుంటూ... యిలా సాగుతుంది నేననుకున్న పద్ధతి. కాబట్టి లెక్క ప్రకారం దీన్ని నా తిరిగాలన్న ప్లానులో భాగం చేయకూడదు. కానీ ప్రయాణం ఎంత ఆనందంగా సాగిందనీ! తెల్లారి నాలుగింటికి లేచి తాపీగా బయల్దేరాం. తోచిన చోటల్లా ఆగుతూ పోయాం. పైగా అదేంటో, శ్రీశైలం దాకా రోడ్డంతా మాదే అన్నట్టు అస్సలు జనసమ్మర్ధం లేదు. పదైంది చేరేసరికి. రాత్రి తిరుగుప్రయాణాన్ని మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను. శ్రీశైలం నుండి హైదరాబాదు మొత్తం నూటతొంభై కిలోమీటర్ల దూరమయితే, అందులో ఘాట్ రోడ్డే తొంభై కిలోమీటర్లుంటుంది. యిదంతా నల్లమల అడవుల మధ్యగా సాగుతుంది. ఘాట్‌ రోడ్లో లైట్లుండవు. పైగా మేము వెళ్ళిన రోజు రద్దీ లేదని చెప్పాగా. మొత్తం అంత దూరమూ ఆ కటిక చీకట్లో, ఎడాపెడా భయపెట్టే నిశ్శబ్దంతో దట్టంగా కమ్ముకున్న అడవి మధ్య నుంచి, ముందూ వెనకా మా బైక్ యిచ్చే గుడ్డి వెలుగు తప్ప ఏదీ ఆనని రోడ్డు మీద ఆ రాత్రి మా ప్రయాణం అపూర్వానుభవం. మధ్యలో రెండు మూడు సార్లు బైక్ ఆపేసాం. దాని లైటు కూడా ఆర్పేసాం. ఆ చీకట్లో ఆకాశమంతా దట్టంగా అలుమున్న నక్షత్ర సమూహాన్ని చూస్తూ చాలాసేపు గడిపాం. అంత స్పష్టంగా అన్ని నక్షత్రాల్ని నేనదివరకూ అరుదుగా చూసాను. నల్లమల అడవిలో మొత్తం నూటయిరవై దాకా పులులూ, రెండొందల చిరుతలూ వున్నాయట. ఒకటైనా అటువైపు వచ్చి కన్పించేపోతే బాగుండుననుకున్నాం. కానీ రాలేదు.