ఒక రాబందు నా
కాళ్ళను పొడుస్తోంది. ఈసరికే నా బూట్లను మేజోళ్ళనూ చింపి చీలికలు చేసింది, యిప్పుడు తిన్నగా నా కాళ్ళ వరకూ వచ్చేసింది. పదే పదే
పొడిచిన చోటే పొడుస్తూ, మధ్యమధ్య నా చుట్టూ అసహనంగా
చక్కర్లుకొట్టి, మళ్ళీ తిరిగివచ్చి పని ప్రారంభిస్తోంది. ఒక
పెద్దమనిషి అటు వచ్చాడు, కాసేపు ఆగిచూసి, ఎందుకు ఆ రాబందుతో అలా బాధపడుతున్నావని అడిగాడు. "నేను
నిస్సహాయుణ్ణ"ని చెప్పాను. “యిది నా మీద దాడి
మొదలుపెట్టినపుడు, నేను దీన్ని అదిలించడమే కాదు, గొంతు నులిమేందుకూ ప్రయత్నించాను, కానీ యీ జంతువులకి చాలా శక్తి వుంటుంది, యిది నా మొహం మీదకు దూకబోయింది, దానికి బదులు కాళ్ళను బలిపెట్టడం మంచిదనుకున్నాను. యిప్పుడవి
కూడా దాదాపు ముక్కలైపోయాయి,” అన్నాను. “యిలాంటి హింస భరిస్తున్నావంటే ఆశ్చర్యం! ఒక్క తూటా చాలు, రాబందు చస్తుంది,” అన్నాడు. “నిజమా? అయితే అలా చేయగలవా!” అనడిగాను. “ఓ ఆనందంగా! నా యింటికి వెళ్ళి తుపాకీ తెచ్చుకోవాలంతే. ఒక్క అరగంట వేచివుండగలవా?” అన్నాడు. “ఏమో చెప్పలేను” అన్నాను, నొప్పితో
మొద్దుబారి క్షణంపాటు అలానే నిల్చున్నాను. చివరికి: “ఏదో ఒకటి చేయి దయచేసి!” అడిగాను. “సరే, వీలైనంత తొందరగా వచ్చేస్తాను,” అన్నాడు. రాబందు నన్నూ
పెద్దమనిషినీ మార్చి మార్చి చూస్తూ ఈ సంభాషణంతా నిశ్శబ్దంగా విన్నది. దానికంతా
అర్థమైందని నాకు తెలిసిపోయింది; అది గాల్లోకి
లేచింది, జోరు అందుకునేందుకు వీలుగా ఈటె
విసిరేవాడిలా వెనక్కి వంగి, దాని ముక్కును నా నోటి ద్వారా నా లోపలికంటా
దూర్చింది. వెనక్కి పడుతూన్న నేను, అది నా రక్తంలో దుర్లభ్యమై మునిగిపోతూండగా, ఆ తాకిడికి వెల్లువైన రక్తం నాలోని ప్రతీ లోతునీ నింపి ప్రతీ ఒడ్డునీ
ముంచెత్తుతుండగా, విముక్తుణ్ణయ్యాను.
Translated from Kafka's "The Vulture"
Translated from Kafka's "The Vulture"
WOW. you have great capability and taste...
ReplyDeleteఅనువాదం బాగా వచ్చింది. ముఖ్యంగా చివరి వాక్యం
ReplyDelete