May 10, 2009

చివర్లో ఒక స్నేహం

కూతురు ఆఫీసు నుంచి యింటికి వచ్చేసరికి ముసలాయన వంటగది బాల్కనీలో వున్నాడు. పేము కుర్చీలో ముందుకు వంగి కూర్చున్నాడు. పిట్టగోడ మీద చేతులు వేసి వీధిలోకి చూస్తున్నాడు. సాయంత్రం ఎండలో ఆయన ముగ్గుబుట్ట జుట్టు పసుపుగా మెరుస్తోంది.

కూతురు ఫ్రిజ్‌లోంచి నీళ్ళ బాటిల్ తీస్తూ, "ఏం నాన్నా ఎండలో కూర్చున్నావేం?" అంది.

వినికిడి తగ్గిన ఆయన చెవులకు ఏదో చప్పుడైనట్టు తెలిసింది తప్ప ఆమె ప్రశ్న వినపడలేదు. వెనక్కి చూడకుండా కొద్దిగా తల మాత్రం తిప్పి "వచ్చావా" అన్నాడు. మళ్ళీ వీధి వైపు చూస్తున్నాడు.

ఆమె బాటిల్‌తో బాల్కనీలోకి వచ్చింది. కళ్ళ కింద నలిగిన చర్మంలో యాభై ఏళ్ళని చూసిన అలసట. పాపిట్లోంచి బయల్దేరి చెవి వెనగ్గా జారిన తెల్లటి సిగపాయ. నీళ్ళు తాగటానికి చుబుకం పైకెత్తినా డబల్‌చిన్ కనిపిస్తూనే వుంది. కొన్ని గుక్కలు తాగి, పిట్టగోడ మీద బాటిల్ పెట్టి మూత బిగించింది. ఇందాకటి ప్రశ్నే అడిగింది.

ఈసారి ముసలాయనకి వినిపించింది. ఆమె వంకా, ఆకాశం వంకా చూసాడు. మరలా వీధిలోకే చూస్తూ, "ఎండేముందమ్మా... ఐదయిపోయింది కదా" అన్నాడు. అంటూనే చెమటతో మెడకి ఒరుసుకుంటున్న లాల్చీ కాలర్‌ను వెనక్కి లాక్కున్నాడు. ఆమె నవ్వితే పెదవి పైన చెమట మెరిసింది. ఆయన చూస్తున్న వైపే చూస్తూ, "ఏంటి అంత దీక్షగా చూస్తున్నావ్?" అంది.

ఆయన మెల్లగా కుర్చీలో వెనక్కి వాలాడు. ఏం జవాబు చెప్పాలనుకున్నట్టు లేడు. కాసేపు కాళ్ళాడించి, "అన్నట్టూ... ఈ కుర్రాడు ఇంకా రాలేదేం. రోజూ నువ్వు ఆఫీసుకు వెళ్తున్నావనగా వచ్చేసేవాడు కదూ..." అన్నాడు.

"ఓహ్ శేఖర్ కోసమా! మర్చిపోయాన్నానా చెప్పడం. ఇవాళ సాయంత్రంజేసి వస్తానన్నాడు. గదిలో సామానేదో సర్దుకోవాలట. రేపొద్దున్న వాళ్ళ వూరెళ్ళిపోతున్నాడు. ఇవాళొచ్చి డబ్బులు తీసుకుంటానన్నాడు..." అంది. ఈ మాటలంటూనే కింద వెళ్తున్న కూరగాయల బండివాణ్ణి గట్టిగా కేకేసి పిలిచింది. "నాన్నా కిందకి వెళ్తున్నా. లోపలికి వచ్చేయ్ రాదూ... ఎండ మొహానికి కొడుతుంటేనూ," అంటూ వెళ్ళింది.

ముసలాయన కూతురు విడిచిపెట్టిన చోటు వైపే చూశాడు. "మరి నాకు చెప్పాడు కాదేం?" గట్టిగా అన్నాడు.

"చెప్పేవుంటాడు. నీకు వినపడి వుండదు," ఆమె హాల్లో నడుస్తూ అంది. ఆయనకు వినపడలేదు.

పిట్టగోడ పట్టుకొని కుర్చీలోంచి లేచాడు. వయసు ఎనభైల్లో ఉంటుంది. అవసరానికి మించిన చర్మాన్ని అస్థిపంజరంపై వదులుగా ఆరేసినట్టుగా, బక్కగా వున్నాడు. దవళ్ళు ఏదో నవుల్తూన్నట్టు కదులుతాయి. నీలం లుంగీ మీద తెల్లటి లాల్చీ. లుంగీ అంచు కింద ఎడమ పాదానికి సిమెంట్‌కట్టు కనిపిస్తోంది. ఆ కాలిపైన బరువు తక్కువ మోపి కుంటుతూ హాల్లోకి వచ్చాడు.

డైనింగ్ టేబిల్ కుర్చీకి తగిలించి వున్న హాండ్‌బాగ్‌ని తీసి, "ఎక్కడ పడితే అక్కడే," అని గొణుక్కుంటూ గోడకున్న హాంగర్‌కి తగిలించాడు. ఫేన్ స్విచ్ నొక్కాడు. కరెంట్ లేదు. డైనింగ్ కుర్చీ లాక్కుని మెల్లగా కూర్చున్నాడు. ముందుకు చూస్తూ ఆలోచించాడు. చీకట్లో ఫ్లాట్‌ఫాం మీద నిలుచున్నపుడు రైలు వెళ్తోంటే ఎదుటి కిటికీల్లోంచి క్షణానికొకటిగా మారుతూ కనిపించే దృశ్యాల్లా, ఆయన నుదురు వెనక చీకట్లలో కొన్ని దృశ్యాలు మారుతున్నాయి. వాటన్నింటిలోనూ శేఖర్ వున్నాడు: మంచంపై తన కాళ్ళ దగ్గర కూర్చుని న్యూస్‌పేపర్ ఎడిటోరియల్ గట్టిగా చదివి వినిపిస్తున్నాడు, తను విసిగిస్తుంటే దవడలు విప్పదీసి టానిక్‌ నోట్లో పోయటానికి ప్రయత్నిస్తున్నాడు, తను పార్కు బెంచీ మీద కూర్చుంటే ముందు నుంచొని నవ్వుతూ ఏదో చెబుతున్నాడు, బయట కారిడార్‌లో లిఫ్టు దగ్గర నుంచొని బటన్ నొక్కి తన వైపు బై చెప్పి చేయి ఊపుతున్నాడు. ముసలాయన ప్రస్తుతంలోకి వచ్చాడు. ఉక్క పోస్తోంది. డైనింగ్ టేబిల్ మీద బోర్లించిన గాజు గ్లాసుల్ని ఒక్కొక్కటే తీసి గోడకేసి బద్దలుగొట్టాలనిపిస్తోంది.

కూతురు కూరగాయల సంచితో లోపలికి వచ్చింది. డైనింగ్ టేబుల్ దగ్గర తండ్రిని చూసి, వెనక ఎవరితోనో, "రా రా! యిదిగో నీ కోసమే వెయిటింగు," అంటోంది. వంటగదిలోకి వెళ్తూ తండ్రితో "కూరగాయలు కొంటుంటే వస్తున్నాడు," అని చెప్పింది. ముసలాయన గుమ్మం దగ్గర చెప్పులు విడుస్తున్న శేఖర్‌ని చూసాడు. శేఖర్ డైనింగ్ టేబుల్ వైపు వస్తూ "ఏం సార్, నా కోసం చూస్తున్నారా?" అన్నాడు. ముసలాయన ఏం మాట్లాడ లేదు. శేఖర్ కుర్చీ లాగి కూర్చున్నాడు. ఇరవైల్లో ఉంటాడు. తల్లుల పోలిక రావడం వల్ల సున్నితమైన అందాన్ని సంతరించుకునే ముఖాల తీరు....

"ఏంటి సీరియస్‌గా ఉన్నారు?"

ముసలాయన గ్లాసుల వైపు చూపు తిప్పుకున్నాడు.

"నాన్నా! బయల్దేరండిక పార్కుకి, మళ్ళా చీకటి పడుతుంది," వంటగదిలో గిన్నెల మోత వెనకాల్నించి కూతురి గొంతు.

"నీరసంగా వుందమ్మా, కాస్త నడుం వాలుస్తాను," అని కుర్చీలోంచి లేచాడు ముసలాయన.

"అయ్యో! అదేంటి నాన్నా... యిప్పటి దాకా ఎండనపడి మరీ ఎదురు చూసీ.... తీరా వచ్చాక పడుకుంటానంటారేమిటి?" అంది కూతురు.

"ఓ ఎండలో కూర్చున్నారా? అందుకే నీరసం," అన్నాడు శేఖర్, పడగ్గది వైపు వెళ్తూన్న ముసలాయన్ని చూస్తూ.

ముసలాయనకి శేఖర్ ఆటకట్టించే మాటేదీ తోచలేదు. తలుపు దఢాలున శబ్దం వచ్చేట్టు మూసి లోపలికొచ్చేశాడు. కిటికీని తెరల్లోంచి సాయంత్రం వెలుగు ఇంకా తగ్గి లోపలికి వస్తోంది. ముసలాయన మంచం హెడ్‌బోర్డుకు తలగడ వొత్తిపెట్టి దానికి జారగిలబడ్డాడు. గోడకున్న గడియారం వైపు చూసాడు. ఐదున్నర. చేసేదేం లేక ఆ గడియారాన్నే చూస్తూ కూర్చున్నాడు. కాలం మాయమై మరలా నుదుటి వెనక చీకట్లలో దృశ్యాలు: పక్కన టౌన్‌షిప్‌లో జరిగే లాఫింగ్ సెషన్స్‌ గుర్తు రాగానే ముఖం చేదు తిన్నట్టు చిట్లింది. రేపణ్ణించీ అక్కడికెళ్ళాలేమో! పాసిపోయిన వాతావరణం. వర్తమానం లేదు. భవిష్యత్తు మాటే రాదు. ఎప్పుడు చావొచ్చి వీపు చరుస్తుందోనన్న భయాన్నీ, లేదూ, యింకా వచ్చి చావదేమన్న ఏకాకి వైరాగ్యాన్నీ తాత్కాలికంగానైనా మర్చిపోటానికి అందరూ చెట్టపట్టాలేసుకుని ఉన్మాదుల్లా నవ్వటం. మాటల్లో కూడా ఎప్పుడూ అవే టాపిక్స్... వాతావరణం గురించో, మనవళ్ళ అల్లరి గురించో, రోగాల బేరీజులో, కాస్త రంగు పులిమి గతంలోంచి ఎత్తుకొచ్చిన పిట్ట కథలో.... వాళ్ళ వాళ్ళ ప్రత్యేక స్వభావాల్ని వదిలేసి, ఏదో ఓడమునిగితే ఒడ్డుకు చేరినవాళ్ళలాగా ఒకరినొకరు పిరికిగా కరచుకుపోవడం.... కళ్ళముందు గడియారం ఏర్పడింది. టైం ఐదూ ముప్ఫై ఐదు. శేఖర్ తలుపు తెరిచి జీన్స్‌ఫాంట్ జేబుల్లో డబ్బులు కుక్కుకుంటూ వచ్చాడు. మంచం మీద ముసలాయన కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. ముసలాయన గడియారం వైపు చూసాడు.

"ఏంటీ, సీరియస్‌నెస్సు? ఎవరి మీద కోపం?" అన్నాడు శేఖర్.

ముసలాయన రాని నిట్టూర్పొకటి విడిచాడు: "మాకెవరి మీద కోపం వుంటుందిరా? అయినా మా కోపంతో ఎవరికేం పని? పేషెంట్‌కి నయమైపోయింది. మీ డ్యూటీ అయిపోయింది. ఇవాళ జీతం తీసుకుని చెక్కేస్తున్నారు, అయ్యగారు..."

"వెటకారమా?"

ముసలాయన గడియారం వైపే చూస్తున్నాడు.

"అంటే ఈ నాలుగు నెలలూ డ్యూటీ చేసానంటారు."

ముసలాయన సెకన్ల ముల్లుని చూస్తున్నాడు.

"ఇదంతా జీతం లెక్కే అన్నమాట."

శేఖర్‌లో ఇలా తను ఆశించిన స్పందన కనిపించాక-- తన అక్కసు వెళ్ళగక్కేందుకు తగిన పునాది ఏర్పడిందని తేలాకా-- ముసలాయన శేఖర్ వైపు చూసాడు. తలగడ మీద కొద్దిగా పైకి లేచి కూర్చుని, "నీ పద్ధతులలా వున్నాయిరా మరి. రేపెళ్ళిపోతున్న వాడివి, ముందో మాట చెప్పొద్దూ? మీ ఆంటీకి చెప్తే సరిపోతుందా? జీతం యిచ్చేది ఆవిడ గనుకనా?".

శేఖర్ మాట్లాడలేదు. చిన్నగా నవ్వుతున్నాడు.

ముసలాయన చూపుడు వేలు ఆడిస్తూ, "వీపు విమానం మోతెక్కిపోతుందొరే, నవ్వావంటేను," అన్నాడు.

శేఖర్ నవ్వుతూనే లేచి నిలబడ్డాడు. "పదండి, అలా పార్కు దాకా వెళ్ళొద్దాం," అన్నాడు చేయందిస్తూ.

"ఓపిక లేదురా యివాళా...."

"లేవాలి! మళ్ళీ రేపు నేనుండను."

"ఇదో వెదవ బెదిరింపేమో మళ్ళీమాకు," అని గునుస్తూనే శేఖర్ చేయందుకుని మంచం దిగాడు.
* * *
తర్వాత కారిడార్‌లోనూ, లిఫ్టులోనూ, అపార్ట్‌మెంటు గేటు దగ్గర నుండి పార్కు గేటు దాకానూ యిద్దరూ ఈ విషయమై వాదించుకుంటూనే వున్నారు. "క్లాసులు పూర్తవగానే వూరెళిపోతానని మీకు తెలుసు కదా"ని శేఖరూ, "నీ కోచింగ్ ఎప్పుడు పూర్తవుతుందో నాకేం తెలుస"ని ముసలాయనా, "తెలుసనుకున్నాన"ని శేఖరూ, "అనుకోవడమేమి"టంటూ ముసలాయన. నిజానికి ఈ వాదులాట సగంలో వుండగానే ముసలాయనకి శేఖర్ తను వెళ్ళబోయే తారీకు ముందే చెప్పాడన్న సంగతి గుర్తొచ్చింది. అయితే వెళ్ళిపోవాలనుకోవడమే శేఖర్ అసలు నేరంగా మనసులో ఓ రహస్య నిశ్చయానికొచ్చేసిన ఆయన, హేతువుకు నిలబడని ఈ వాదాన్ని బయటపెట్టలేక, శేఖర్‌దే తప్పని బుకాయిస్తూనే వున్నాడు. చివరికి శేఖరే ఓ మెట్టు దిగి తనదే తప్పని ఒప్పుకున్నాడు. కాని అతనలా ఒప్పుకోగానే ఈ వాదనంతా ఎంత నిష్పలమో అర్థమైంది ముసలాయనకి. ఎంత వాదించినా అతను వెళ్ళిపోతున్నాడన్న నిజం ఎలానూ మారదు. ఇది గుర్తు రాగానే, ఇదివరకట్లా రాగద్వేషాల్తో మలినం కాని, స్వచ్ఛమైన, సొంతమైన దిగులు కమ్ముకొంది ఆయన్ని.

వాళ్ళు కూర్చున్న మునిసిపల్ పార్కు చిన్నదే. మధ్యలో నీళ్ళు రాని ఫౌంటెన్; దాని చుట్టూ విశాలంగా పచ్చిక బయలు; ఈ పచ్చికకు అంచులాగా వాకింగ్ చేసేవాళ్ల కోసం ఎర్రమట్టితో వేసిన బాట; ఆ బాట పక్కన సమాన దూరాల్లో సిమెంటు బెంచీలు; ఆ బెంచీల వెనకగా, బాట పైకి వంగి చూస్తూ, నిద్ర గన్నేరు, తురాయి, మోదుగ చెట్ల వరుసలు.... పార్కుకు వచ్చేవాళ్ళు ఈ చెట్ల కాండాల మధ్య నుంచీ కనిపిస్తున్న ట్రాఫిక్‌నీ, చెట్ల చిటారు కొమ్మల మీంచీ తొంగి చూసే భవనాల్నీ పట్టించుకోకుండా ఉండగలిగితే, మేరలేని పచ్చదనం మధ్య వున్న భ్రమని సాధించినట్టే. సూర్యుడు భవనాల వెనక్కి  వెళ్ళిపోవడంతో పార్కంతా నీడలోనే వుంది. చాలా సిమెంటు బెంచీల్ని జంటలు ఆక్రమించారు. పచ్చిక బయల్లో కూడా కొంతమంది కూర్చున్నారు. ఓ పసివాడు వాళ్ళ నాన్న మునివేళ్ళు పట్టుకొని కేరింతలు కొడుతూ ఫౌంటెన్ గట్టు మీద నడుస్తున్నాడు; వాళ్ళమ్మ పచ్చికలో కూర్చుని చప్పట్లు కొడుతూ వాడ్ని ఉత్సాహపరుస్తోంది. ట్రాక్ ఫేంటు వేసుకున్న ఓ నడివయస్సు బట్టతలాయన బలమైన గ్రేహౌండ్‌ను గొలుసుతో అదుపు చేయలేక దాంతో పాటూ వురుకుతున్నాడు.

"ఫిట్‌నెస్ మీద మంచి శ్రద్ధ వుంది ఆ కుక్కకి," అని ముసలాయన వైపు చూసాడు శేఖర్. ముసలాయన పరధ్యానం నుంచి తేరుకుని శేఖర్ వైపు చూసాడు. ఏమిటన్నట్టు తల ఎగరేశాడు. ఆయనకి వినపడేంత గట్టిగా చెప్పేసరికి ఎలాగూ జోకులో విషయం తేలిపోతుంది. శేఖర్ ఏంలేదన్నట్టు తల వూపాడు.

"అయితే మళ్ళీ పరీక్ష రాయడానికే వస్తావేమో?" అన్నాడు ముసలాయన.

"లేదు. సెంటర్ మా వూరికి దగ్గర్లోనే యిస్తారు."

ముసలాయన తల పంకిస్తూ కిందికి చూసాడు. వాళ్ళిద్దరూ ఓ నిద్రగన్నేరు చెట్టు కింద వున్న బెంచీ మీద కూర్చున్నారు. గాలి వీచినప్పుడల్లా కాసిని ఎండుటాకులు గింగిరాలు తిరుగుతూ రాలుతున్నాయి. నేల మీద పడిన ఆకుల్ని ముసలాయన వూతకర్రతో సర్దుతున్నాడు. శేఖర్‌కి జాలిగా అనిపించింది: "సెలక్టయి అంతా తేలితే వచ్చిపోతుంటాన్లెండి. ఏమో ఎవరికి తెలుసు, ఇక్కడే రావొచ్చేమో. అదే గనగ జరిగితే మీరు ముప్పొద్దులా భరించాల్సిందే నన్ను" అన్నాడు.

"అదంతా తేలేసరికి ఎంత కాలం పడుతుందో?"

"ఓ ఏడాది పడుతుంది, నాకు తెలిసి."

ముసలాయన నవ్వాడు. "నేనుండొద్దురా అప్పటిదాకానీ..."

శేఖర్ విసుగ్గా మొహం పెట్టాడు. "మొదలెట్టారా మళ్ళీ..."

"అదికాదురా, ఈ అబిట్యురీ పేజీలుంటాయి చూడు... అదేవిటో అందులో ఎనభై దాటినవాళ్ళు ఎప్పుడో తప్ప కనపరు. నాకు ఎనభై నాలుగు. అసలు మొన్నటి దెబ్బకే టపా కట్టేయాల్సింది. ఏదో దేవుడి దయ వల్ల దీనితో వదిలిపోయింది," అంటూ వూతకర్రతో కాలి కట్టు మీద కొట్టుకున్నాడు.

"ఆ అబిట్యురీ పేజీల్ని ఫాలో అవటం మానండి ముందు..."

"మీకు క్రికెట్ పేజీలెలాగో, మాకు అబిట్యురీ పేజీ అలాగ. నీకు ఒరిగేదేం లేకపోయినా ఎవడెంత కొట్టాడో చూడవూ?"

"మీరు సెంచరీ కొట్టేస్తార్లెండి..."

"అంత ఆశ లేదురా. ఆ వచ్చేదేదో వచ్చేస్తే ఓ పనయిపోతుంది కదా అన్నట్టుంది ప్రస్తుతానికి. ఏదో ఈ నాల్నెల్లూ అలా గడిచిపోయాయి. ఇంక రేపణ్ణించీ అంటావా... చూద్దాం..." ఏదో మాట్లాడబోయి ఆగిపోయాడు.

ముసలాయన మాట్లాడబోయింది తను వెళిపోవడం గురించేనని శేఖర్‌కి తెలుసు. కాని తానిప్పుడు ఓదార్చే పాత్ర పోషిస్తే ఈ విడిపోవటం పట్ల తనకే బాధా లేదని చెప్పినట్టు ఉంటుంది. అందుకే మాట్లాడకుండా వుండిపోయాడు. ఆయనీ ప్రస్తావన తేకుండా వుంటే బాగుండేదనిపించింది. మాటలు వెదుక్కుంటూ మౌనంలోకి జారుకున్నాడు.

పిల్లాడ్ని ఫౌంటెన్ గట్టు మీద వదిలేసి వాళ్ళ నాన్న కొద్దిగా ఎడంగా వెళ్ళి నిలబడ్డాడు. కానీ పిల్లాడి పట్టుతప్పితే ముందుకు గెంతి పట్టుకోవటానికన్నట్టు అప్రమత్తంగా వంగాడు. పిల్లాడు నాన్నని దగ్గరికి రమ్మన్నట్టు చేతి వేళ్ళు గాల్లో మూసి తెరుస్తున్నాడు. మోకాళ్ళలో స్ప్రింగ్ ఆడుతున్నట్టు పైకీ కిందకీ ఊగుతున్నాడు. పక్కబెంచీ దగ్గర ఒక అబ్బాయి సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ పచార్లు చేస్తున్నాడు. ఆ బెంచీలో కాలుమీద కాలేసి కూర్చున్న అమ్మాయి అతన్ని మురిపెంగా అధికారంగా చూసుకుంటోంది. రేపటి నుంచీ తను ఈ పార్కుకి రాలేడని ముసలాయనకి చప్పున అర్థమైంది. తామిద్దరితోనూ కలిసి ఎన్నో వేడుకైన సాయంత్రాల్లో ఒక భాగమైంది ఈ పార్కు. ఇకమీదట ఇక్కడికి ఎప్పుడొచ్చినా దీని మూగతనం బాధ పెడ్తూనే వుంటుంది. శేఖర్ వైపు చూసాడు. బెంచీ అంచు మీద తల వాల్చి నిద్రగన్నేరు కొమ్మల్లోకి చూస్తున్నాడు. ఏదో గుండెల్లోంచి మొదలై గొంతు దాకా ఎగతన్నినట్టైంది ముసలాయనకి. తల తిప్పి నేల వైపు చూస్తూ "గుర్తుంచుకోరోయ్ మమ్మల్ని!" అన్నాడు నెమ్మదిగా. చనిపోయాకా ఈ కుర్రాడి జ్ఞాపకంలో మిగలడమొక్కటే తన జీవితాన్ని సార్థకం చేసేది అనిపించింది ఆ క్షణాన.

శేఖర్ ఇబ్బందిగా నవ్వాడు: "ఊరుకోండి మీరూ..."

"గుర్తుంచుకుంటావా"

"ఎందుకు మర్చిపోతానూ..."

"వీలు కుదుర్చుకుని రారా ఓ సారి... పోయేలోపూ..."

"అదిగో మళ్ళీ!"

నవ్వాడు. "అదికాదురా... నా తోటివాళ్ళంతా పోయేరు దాదాపు. నేను కింద వదిలెళ్ళే ఫ్రెండు నువ్వొక్కడివే. అందుకే అడుగుతున్నా..."

"సరే."

"మంచి వుద్యోగం సంపాయించు. కుటుంబాన్ని చక్కగా చూసుకోవాలి. అన్నింటికంటే ఆర్థికంగా నిలదొక్కుకోవటం ముఖ్యం... ఒకళ్ళ దగ్గర చేయిజాచే పరిస్థితి రాకూడదు మనకి... అర్థమైందా!"

శేఖర్ అరచేతి రేఖల మీద గోరుతో జాడలు తీస్తున్నాడు.

ముసలాయన గుండెల నిండా గాలి పీల్చి వదిలాడు."వెళ్దాం మరి, చీకటి పడుతోంది."

శేఖర్ పైకి లేచాడు. ముసలాయన అలవాటు ప్రకారం శేఖర్ భుజం చుట్టూ ఓ చేయి వేసి మరో చేత్తో వూతకర్ర పట్టుకుని నడిచాడు. ఇదే చివరిసారి వీడ్ని ముట్టుకొనేది అన్నట్టు వేళ్ళతో భుజం మీద రాస్తున్నాడు. గేటు దాకా యిద్దరూ మాట్లాడ లేదు. దారిలో గ్రేహౌండ్, దాని బట్టతల యజమాని ఎదురొచ్చారు. పార్కు రివాల్వింగ్ గేటు తిప్పుకుంటూ లోపలికి వచ్చిన యిద్దరు కుర్రాళ్ళు ఏదో జోక్ చెప్పుకుని హై ఫైవ్ ఇచ్చుకొంటూ నవ్వారు. ముందు శేఖర్ గేటు గుండా బయటకు వెళ్ళి ముసలాయనకి చేత్తో సాయం చేశాడు.

రోజులాగే శేఖర్ ముసలాయన్ని ఇంటి దాకా దిగబెట్టేందుకు రాబోయాడు. ముసలాయన మాత్రం అలా వీల్లేదన్నాడు. శేఖర్‌ని యిక్కణ్ణించే సాగనంపి వెళతానన్నాడు. శేఖర్ కాసేపు వాదించాడు. ముసలాయన వినలేదు. ఆటో మాట్లాడటం పూర్తయ్యాక, లోపల కూర్చొని, జాగ్రత్తగా వుండమనీ, బాత్రూం కెళ్ళేటపుడు తలుపు గెడ వేసుకోవద్దనీ, ఫోన్ చేస్తుంటాననీ చెప్పాడు శేఖర్.

ముసలాయన ఆటో మలుపు తిరిగే దాకా పుట్‌పాత్ మీద నుంచుని చూసాడు.
* * *
అలికిడైతే కూతురు వంటగదిలోంచి హాల్లోకి తొంగి చూసింది. ముసలాయన తలుపు దగ్గర కదలకుండా నిలబడి వున్నాడు. "ఏంటి నాన్నా! ఏమైందీ? శేఖర్ ఏడీ?" అంటూ దగ్గరకు వచ్చింది. ముసలాయన కలలోంచి తేరుకున్నట్టూ, ఆమెను వెంటనే గుర్తుపట్టనట్టూ చూసాడు. "ఏమైంది నాన్నా?" వీపు మీద చేయివేసి కొంత కంగారుగా అడిగింది.

"అట్నుంచటు వెళ్ళిపొమ్మన్నాను వాడ్ని," అన్నాడు.

ఆమె తండ్రి కళ్ళల్లోకి చూసింది. అక్కడ తడి కదిలినట్టు అనిపించింది. ప్రేమ పొంగింది. భుజం చుట్టూ చేయి వేసి, "ఛా.. ఏంటి నాన్నా ఇది... నేనున్నాను కదా. మనకి మనం ఉన్నాం కదా," అంది.

ఇప్పుడిలా ఓదారుస్తోంది తను ఒకప్పుడు మోకాళ్ళ మీద బోర్లా వేసుకొని లాల పోసిన పాపాయి కాకపోతే, ఆయన గొంతులో అడ్డంపడినదానికి మాటల్ని తోడిచ్చి పంపేవాడే. "ఊరుకోమ్మా, మరీ హడావిడి చేస్తావ్!" అంటూ ఆమె చేతుల్లోంచి జరిగి, కుంటుతూ పడగ్గది వైపు నడిచాడు.
*
ఈ కథ "పొద్దు"లో ప్రచురితం.

3 comments:

  1. 'పొద్దు' లో చదివానిది. ఇంగ్లిష్ పదాలు కొంచం ఎక్కువగా ఉన్నాయనిపించింది. మరో బ్లాగు మిత్రుడు కూడా ఇదే మాట అన్నారు. కథ, కథనం బాగున్నాయి. అభినందనలు.

    ReplyDelete
  2. మీ కథలన్నింటిలోకెల్లా హృద్యమైన కథ. చాలా నచ్చింది. కళ్లలో నీళ్లు తిరిగాయి.

    ReplyDelete
  3. మే, 2009 పొద్దు లో ఇప్పుడు వెతికితే దొరకలేదు మరి. కధల పుస్తకం వచ్చిందా? ఈ కధో మరొకటో కాని లీలగా చదివిన గుర్తుంది. ఇది ఇక్కడిది బాగానే ఉంది.
    పొద్దు లింక్ కూడా ఇచ్చి ఉంటే బాగుండేది, మార్పులు తెలుసుకోవడానికి.

    ReplyDelete