May 25, 2011

ఫ్రాంజ్ కాఫ్కా బ్లూ అక్టేవో నోట్‌బుక్స్ నుంచి...

చివరికెలాగో మా సైన్యాలు కోట దక్షిణ ద్వారం గుండా నగరంలోకి చొరబడ్డాయి. మా దళంవాళ్ళం మాత్రం ఇంకా కోట బయటే ఉన్నాం. నగర శివార్లలోని ఒక తోటలో, సగం కాలిన చెర్రీ చెట్ల మధ్య కూర్చొని, తర్వాతి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాం. కానీ ఎప్పుడైతే దక్షిణ ద్వారం నుంచి పెద్దగా విజయ దుందుభుల మోత విన్నామో, ఇక ఆగటం మా వల్ల కాలేకపోయింది. చేతికందిన ఆయుధాలని దొరకపుచ్చుకొని, ఒకరి చేయి ఒకరం గట్టిగా పట్టుకొని, 'కహీరా! కహీరా!' అంటూ మా యుద్ధనినాదాల్ని గట్టిగా అరుచుకుంటూ, బురద నేలల్లోంచి బారులు తీరి నగరం వైపు నడిచాం. దక్షిణద్వారం దగ్గర మాకు గుట్టలు గుట్టలుగా శవాలూ, ఏదీ కనపడకుండా కమ్మేసిన పసుపురంగు పొగా ఎదురయ్యాయి. యుద్ధం అంతా అయిపోయాకా వచ్చిన దండులాగా మేం మిగిలిపోదల్చుకోలేదు. ఆత్రంగా, ఇంకా యుద్ధపు సెగ తాకని ఇరుకు సందుల్లోకి పరిగెత్తాం. నా ఒకేవొక్క గొడ్డలి వేటుకి మొదటి ఇంటి తలుపు ముక్కలుచెక్కలైపోయింది. లోపలికి ఎంత ఉన్మాదంగా దూసుకుపోయామంటే, దాన్ని చల్లార్చేది ఏదీ కంటపడక కాసేపు ఒకరి చుట్టూ ఒకరం కలదిరిగాం. ఇంటి లోపల్నించి, పొడవాటి వరండా గుండా, ముసలివాడొకడు మా వైపు వస్తున్నాడు. వింత ముసలివాడు- వాడి వీపు వెనకాల రెక్కలు ఉన్నాయి. విశాలంగా విచ్చుకున్న ఆ రెక్కల పైఅంచులు అతని కంటే ఎత్తులో ఉన్నాయి. "వాడికి రెక్కలున్నాయ్!" నేను మా దళంవాళ్ళ వైపు అరిచాను. అందరం కాస్త వెనక్కి జంకాం, వెనక నుంచి లోపలికి తోసుకొస్తున్నవాళ్ళు అడ్డం తగిలేదాకా. నన్ను చూసి ఆ ముసలివాడు మాట్లాడాడు, "అంత ఆశ్చర్యపోనక్కర్లేదు. నాకొక్కడికే కాదు. మా అందరికీ రెక్కలున్నాయి. కానీ వాటి వల్ల ఒనగూడిందేమీ లేదు. వాటిని పెరికేసుకునే అవకాశమే గనక ఉంటే అలాగే చేసుండేవాళ్ళం," అన్నాడు. "ఇక్కడి నుంచి ఎగిరిపోవచ్చు కదా?" అని అడిగాను. "మా నగరాన్ని వదిలి ఎగిరిపోవాలా? మా ఇంటినీ, చనిపోయిన మా వాళ్ళనీ, మా దేవతల్నీ విడిచిపెట్టి?" అన్నాడు. 

May 20, 2011

'కవి, ప్రపంచమూ' - వీస్వావ షింబోర్‌స్కా

(పోలిష్ కవి వీస్వావ షింబోర్‌స్కా 1996 లో నోబెల్ స్వీకరిస్తూ చేసిన ప్రసంగానికి నా అనువాదం.)

ఏ ప్రసంగంలోనైనా ఎపుడూ మొదటి వాక్యమే బాగా కఠినమైందని అంతా అంటారు. దాన్ని దాటేసాను కాబట్టి ఫర్వాలేదు. అయితే రానున్న వాక్యాలు కూడా—మూడవదీ, ఆరవదీ, పదవదీ ఇలా చివరి వాక్యం వరకూ కూడా—అంతే కష్టంగా ఉండబోతున్నాయేమో అనిపిస్తోంది. ఎందుకంటే నేనిక్కడ మాట్లాడాల్సింది కవిత్వం గురించి. ఇదివరకూ ఈ విషయమై నేను మాట్లాడింది చాలా తక్కువ; నిజానికి అస్సలేమీ లేదనే చెప్పాలి. ఎపుడైనా ఏమన్నా చెప్పినా, ఆ చెప్పటంలో నాకు పెద్ద ప్రజ్ఞ లేదన్న శంక పొంచి వుండనే వుంటుంది. కాబట్టి ఈ ప్రసంగం కాస్త చిన్నగానే ఉండబోతోంది. లోపాల్ని తక్కువ మోతాదుల్లో వడ్డించినట్టయితే భరించటం తేలిక.

సమకాలీన కవులు తమ గురించి ఎప్పుడూ సంశయాలతో అనుమానాలతో ఉంటారు. వారు అయిష్టంగా మాత్రమే తాము కవులమని బహిరంగంగా ఒప్పుకుంటారు, ఏదో కవులైనందుకు సిగ్గుపడుతున్నట్టు. మన ఈ అట్టహాసమైన కాలంలో సొంత లోపాల్ని ప్రకటించుకోవటమే ఎవరికైనా కాస్త సులభం (కనీసం అవి ఆకర్షణీయంగా ముస్తాబు కాబడినంత వరకూ); కానీ సొంత సామర్థ్యాల్ని గుర్తించడం మాత్రం కష్టం, ఎందుకంటే అవి ఎప్పుడూ నిగూఢంగా దాగి ఉంటాయి, పైపెచ్చు వాటిపై సదరు వ్యక్తికే ఎపుడూ పూర్తి విశ్వాసం ఉండదు. దరఖాస్తులు నింపుతున్నపుడో లేదా కొత్త వ్యక్తులతో సంభాషిస్తున్నపుడో—అంటే తమ వృత్తిని బయటపెట్టక తప్పని పరిస్థితి కలిగినపుడు—కవులు “రచయిత” అనే సాధారణ నామాన్ని వాడటానికే సుముఖత చూపిస్తారు; లేదా, “కవి” అనే బదులు, రాయడంతోపాటూ అదనంగా వారు ఏ వృత్తి చేస్తున్నారో దాని పేరు వాడతారు. తోటివుద్యోగులు మొదలుకొని బస్సు ప్రయాణికుల దాకా, తాము వ్యవహరిస్తున్నది ఒక కవితో అని తెలియగానే, కాస్త కంగారూ అపనమ్మకాలతో ప్రతిస్పందిస్తారు. బహుశా తత్త్వశాస్త్రకారులు కూడా ఇలాంటి ప్రతిస్పందనల్నే ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని నేననుకుంటాను. అయితే వారి పరిస్థితి కాస్త మెరుగు. చాలా సందర్భాల్లో వారు తమ ఆసక్తికి ఏదైనా పాండిత్యాన్ని సూచించే పేరుతో అలంకరించగలుగుతారు. తత్త్వశాస్త్ర అధ్యాపకుడు — అంటే అది మరింత గొప్పగా ధ్వనించడం లేదూ!

కానీ ఎక్కడా కవిత్వ అధ్యాపకులు లేరు. అలా ఉన్నట్టయితే, కవిత్వం అనేది ఒక ప్రత్యేక అధ్యయనమూ, క్రమం తప్పని పరీక్షలూ, ఉపయుక్త గ్రంథపట్టికల తోపాటూ పాదసూచికలు జత చేయబడిన సిద్ధాంత వ్యాసాలూ, ఆఖర్లో, వేడుకగా అందజేసే యోగ్యతా పత్రాలూ… ఇవన్నీ అవసరమైన వ్యాసంగమన్న అర్థం వస్తుంది. మరలా దీన్ని బట్టి, అద్భుతమైన కవితలతో కాగితాలు నింపేసినంత మాత్రాన కవిగా అర్హత లభించదన్న అర్థం వస్తుంది. ఏదో ఒక అధికారిక ఆమోద ముద్రతో వున్న కాగితం ముక్క  ఇక్కడ ముఖ్యమవుతుంది. రష్యన్ కవిత్వానికి గర్వకారణమైనవాడూ, దరిమిలా నోబెల్ గ్రహీతా అయిన జోసెఫ్ బ్రాడ్‌స్కీ ఈ కారణంగానే బహిష్కరణ శిక్షకు గురయ్యాడన్న సంగతి ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. కవి కాగలిగే హక్కును ఆయనకు దత్తం చేసే అధికారిక ధృవీకరణ ఏదీ లేదన్న కారణంగా వారు ఆయనపై “పరాన్న జీవి” అన్న ముద్ర వేశారు1.

కొన్ని సంవత్సరాల క్రితం నాకు బ్రాడ్‌స్కీని వ్యక్తిగతంగా కలుసుకునే గౌరవమూ, భాగ్యమూ లభించాయి. నేను గమనించిందేమంటే, నాకు తెలిసిన కవులందరిలోనూ, తాను కవినని కులాసాగా చెప్పుకున్నవాడు ఆయన ఒక్కడే. ఆయన ఆ పదాన్ని ఏ మొహమాటమూ లేకుండా పలికాడు. మొహమాటం మాట అటుంచితే, ధిక్కారపూరితమైన స్వేచ్ఛతో పలికాడు. యువకునిగా తాను ఎదుర్కొన్న క్రూరమైన అవమానాల్ని గుర్తుచేసుకోవడమే దీని కారణమై ఉండవచ్చని నాకనిపించింది.

మనిషి మర్యాద ఇంత సులభంగా దాడికి గురికాని ఇంకాస్త అదృష్టవంతమైన దేశాల్లో, కవులు సహజంగానే ప్రచురింపబడాలనీ, చదవబడాలనీ, అర్థం చేసుకోబడాలనీ ఆశిస్తారు; కానీ, తమను తాము మామూలు గుంపు నుండీ, రోజువారీ నిస్సార వ్యవహారాల్నించీ వేరు చేసుకోవాలని పెద్దగా ప్రయత్నించరు. అయితే మనం దీనికి భిన్నమైన ధోరణిని చూసి కూడా ఎక్కువ కాలమేం కాలేదు. ఈ శతాబ్దపు తొలి దశాబ్దాల్లోనే కవులు తమ విపరీత వేషధారణతోనూ, వింత నడతతోనూ మనల్ని విస్మయపరచాలని ప్రయాసపడటమూ చూసాం. కానీ అదంతా కేవలం జనం ముందు ప్రదర్శన కోసమే. ఇలా ఎన్ని చేసినా, ఎట్టకేలకు, తమ వెనుకనే తలుపులు మూసి, తమ తొడుగుల్నీ, అలంకారాల్నీ, ఇతర అదనపుహంగుల్నీ విడిచిపెట్టి—నిశ్శబ్దంగా, సహనంతో తమ ఆత్మ సాక్షాత్కారానికై ఎదురుచూస్తూ—ఇంకా తెల్లగానే వున్న కాగితానికి ఎదురొడ్డి నిలవాల్సిన క్షణాలు రానే వచ్చేవి. ఎందుకంటే, అంతిమంగా లెక్కలోకొచ్చేది అదే కాబట్టి.

గొప్ప శాస్త్రవేత్తల, చిత్రకారుల జీవితాలపై ఇబ్బడిముబ్బడిగా సినిమాలు రావడంలో యాధృచ్ఛికమేమీ లేదు. అభిలాష వున్న దర్శకులు ఒక ముఖ్యమైన శాస్త్రీయ ఆవిష్కారానికి గానీ, ఒక  చిత్రకళాఖండపు ఉద్భవానికి గానీ దారి తీసిన సృజనాత్మక ప్రక్రియను నమ్మశక్యంగా తెరపైకి ఎక్కించాలని తపన పడతారు. వివిధ రకాల శాస్త్రీయ ప్రయోగాల్ని సమర్థవంతంగా చిత్రీకరించటం సాధ్యమే కూడా.  వాస్తవికత ఉట్టిపడేట్టు నిర్మించిన ప్రయోగశాలలు, రకరకాల పరికరాలు, సవిస్తారమైన యంత్రసామాగ్రి: వీటితో కూడిన సన్నివేశాలు ప్రేక్షకుల్ని కొంత ఆకట్టుకుంటాయి. అలాగే ఆయా సన్నివేశాల్లోని అనిశ్చితిని మంచి నాటకీయతతో చూపించవచ్చు (స్వల్ప మార్పుతో వెయ్యోమారు మళ్ళీ చేస్తోన్న ప్రయోగం చివరకు ఆశించిన ఫలితాన్ని ఇవ్వనుందా లేదా, వగైరా). చిత్రకారులకు సంబంధించిన సినిమాలు కూడా చక్కగా తీయవచ్చు. తొలి పెన్సిల్ గీత నుంచి తుది కుంచె మెరుగు దాకా ఒక గొప్ప కళాఖండపు పరిణామంలో ప్రతీ దశనీ పునఃసృజిస్తూ, కళ్ళు చెదిరేలా తీయవచ్చు. ఇక సంగీతకారులపై తీసిన సినిమాల్లో సంగీతం వెల్లువెత్తుతూ ఉంటుంది: సంగీతకారుని చెవుల్లో మ్రోగే గీతపు తొలి గమకాలు చివరకు సింఫొనీగా పరిణత రూపాన్ని సంతరించుకోవటాన్ని చూపించవచ్చు. నిజానికి ఈ ప్రయత్నాలన్నీ అమాయకత్వమే అయినప్పటికీ, వీటిల్లో ఏ ఒక్కటీ జనం “ప్రేరణ” పేరిట పిలిచే ఆ వింత మానసిక స్థితిని వివరించలేకపోయినప్పటికీ, కనీసం అక్కడ చూడటానికో, వినటానికో ఏదో ఒకటి వుంటుంది.

ఎటొచ్చీ కవుల స్థితే అధమం. వారి వ్యాసంగం చూడటానికి పరమ పేలవంగా ఉంటుంది. ఒకడు టేబిల్ ముందు కూర్చునో సోఫాలో పడుకునో, నిశ్చలంగా గోడనో లేక ఇంటికప్పునో చూస్తుంటాడు. అప్పుడపుడూ ఈ వ్యక్తి కదిలి ఓ ఏడు పంక్తులు రాస్తాడు, రాసిన వాటిలో మళ్ళీ ఓ పంక్తి కొట్టివేస్తాడు, ఇంకో గంట గడుస్తుంది, ఈ పర్యంతం ఏమీ జరగదు… ఇలాంటి సన్నివేశాన్ని చూసే ఓపిక ఎవరికి ఉంటుంది?

నేనిందాక ప్రేరణని ప్రస్తావించాను. సమకాలీన కవులను అది ఏమిటీ, అసలది నిజంగా ఉంటుందా అని అడిగితే జవాబుకు తడబడతారు. దీని అర్థం వారెపుడూ దీవెన ప్రాయమైన ఆ లోపలి ఆవేశాన్ని అనుభవించలేదని కాదు. నీకే అవగతం కాని విషయాన్ని వేరొకరికి వివరించడం కష్టం.

ఈ ప్రశ్న ఎదురైతే అప్పుడపుడూ నేనూ తప్పించుకుంటాను. కానీ నా సమాధానం ఇది: ప్రేరణ అనేది కవులకూ కళాకారులకూ మాత్రమే గుత్తగా లభించే అదృష్టం కాదు. ప్రేరణ తరచూ వచ్చి పలకరించే ఒక ప్రత్యేక మనుష్య సమూహం ఇప్పుడూ ఉంది, ఇదివరకూ ఉండేది, ఎల్లపుడూ ఉంటుంది కూడా. తమకు నచ్చి పనిని ఎన్నుకుని దాన్ని ప్రేమతో, ఊహాశక్తితో చేసే మనుషులతో కూడి ఉంటుంది ఈ సమూహం. ఇందులో ఉండేది వైద్యులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, తోటమాలులు కావచ్చు—నేనింకో వంద వృత్తులను ఈ జాబితాలోనికి చేర్చగలను. కొత్త సవాళ్ళను ఎదుర్కొనే కొద్దీ వారి పని వారికి ఒక నిరంతర సాహసకృత్యంగా మారిపోతుంది. కష్టాలూ, వైఫల్యాలూ వారి కుతూహలాన్ని అణచలేవు. వారు పరిష్కరించే ప్రతీ సమస్య నుంచీ  మరిన్ని సవాళ్ళు ఉద్భవిస్తాయి. ప్రేరణ అనేది ఏదైనా, దాని ఉద్భవం మాత్రం “నాకు తెలీదు” అనే నిరంతర భావన నుంచి.

ఇలాంటి మనుషులు ఎక్కువమందేమీ లేరు. ఈ భూమ్మీద నివసించే వాళ్ళలో చాలామంది బతకటానికి పని చేస్తారు, పని చేయాలి కాబట్టి పని చేస్తారు. వారు ఆ పనో ఈ పనో ఎంచుకునేది ప్రేమతో కాదు; వారి జీవిత పరిస్థితులు వారికై ఆ ఎంపిక చేసి పెట్టాయి. అయిష్టమైన పనీ, నిరాసక్తమైన పనీ, ఎంత అయిష్టమైనా ఎంత నిరాసక్తమైనా వేరే వాళ్ళకి ఆ మాత్రం కూడా లేదన్న కారణంగా మాత్రమే విలువనందుకునే పనీ—ఇది మానవ దౌర్భాగ్యాల్లోకెల్లా కర్కశమైనది. ఈ విషయంలో రానున్న శతాబ్దాలైనా మార్పును తీసుకొస్తాయన్న సూచనేదీ లేదు.

అందుకే, కవులకు ప్రేరణపై గుత్తాధిపత్యాన్ని నేను నిరాకరించినప్పటికీ, ఆ అదృష్టపు ఆపేక్షనందుకున్న ఒక ప్రత్యేక సమూహంలోకి వారిని చేరుస్తాను.

అయితే ఇక్కడే నా శ్రోతల్లో కొన్ని సందేహాలు కలగొచ్చు. చాలామంది ఘాతకులూ, నియంతలూ, మతోన్మాదులూ, నినాదాల పొలికేకల ద్వారా అధికారం కోసం కొట్టుమిట్టాడే ప్రజానాయకులూ వీళ్ళంతా కూడా తమ పనులను ఆస్వాదిస్తారు; వారు కూడా తమ విధులను కల్పనాత్మక కుతూహలంతోనే నిర్వర్తిస్తారు. అవును, ఒప్పుకుంటాను. కానీ వారికి “తెలుసు”.  యిక ఆ తెలిసిందాంతోనే ఎల్లకాలమూ సరిపుచ్చుకోగలరు. ఆ తెలిసింది తప్ప మరేదీ తెలుసుకోవాలనుకోరు. ఎందుకంటే అది తమ వాదనల్లోని తీవ్రతను క్షీణింపచేయగలదు. అయితే కొత్త ప్రశ్నలకు దారితీయని ఏ జ్ఞానమైనా త్వరగా చచ్చిపోతుంది: జీవించడానికి కావలసిన కనీస ఉష్ణోగ్రతను అది నిలబెట్టుకోలేకపోతుంది.

ఇందుకే నేను “నాకు తెలీదు” అనే ఈ పదబంధానికి అంత ఉన్నతమైన విలువనిస్తాను. ఇది చిన్నదే, కానీ బ్రహ్మాండమైన రెక్కలతో ఎగురుతుంది. మన అంతరంగ విస్తారాల్నే గాక, మన ఈ చిన్ని భూమి నిరాధారంగా వ్రేలాడే బాహ్య విస్తారాల్ని కూడా ఇముడ్చుకోగలిగేంతగా మన జీవితాన్ని విశాలపరుస్తుంది. ఐజాక్ న్యూటన్ “నాకు తెలీదు” అని అనుకోకపోయి వుంటే, అతని చిన్ని వనంలో ఆపిల్ పళ్ళు వడగళ్ళలా ఊరకనే నేలరాలి ఊరుకునేవి, మహా అయితే అతను వాటిని వంగి ఏరుకుని గుటకాయస్వాహా చేసి ఉండేవాడు. నా తోటి దేశస్తురాలు మేరీ స్ల్కోదోవ్‌స్కా క్యురీ “నాకు తెలీదు” అని అనుకోకపోయి వుంటే, బహుశా ఏదో ఒక ప్రైవేటు ఉన్నత పాఠశాలలో కులీన యువతులకు రసాయనశాస్త్ర పాఠాలు చెప్పుకుంటూ ఉండిపోయేది, ఈ అన్యథా గౌరవప్రదమైన ఉద్యోగాన్ని నిర్వహిస్తూనే చివరకు మరణించి ఉండేది. కాని ఆమె “నాకు తెలీదు” అని తనకు తాను నిరంతరం చెప్పుకుంటూనే ఉంది; ఈ పదాలే ఆమెను—ఎక్కడైతే అవిశ్రాంతంగా అన్వేషించే వ్యక్తిత్వాలు అప్పుడపుడూ నోబెల్ బహుమతితో సత్కరింపబడతాయో ఆ స్టాక్‌హోమ్‌కు, ఒకసారి కాదు రెండుసార్లు, తీసుకువెళ్ళగలిగాయి.

కవులు కూడా, వారు నిజమైన కవులే అయితే, “నాకు తెలీదు” అనే ఈ మాటని నిత్యం పునశ్చరించుకుంటూనే ఉండాలి. కవి రాసిన ప్రతీ కవితా ఈ మాటకి సమాధానం చెప్పేందుకు చేసిన ఒక ప్రయత్నాన్ని సూచిస్తుంది. కాని కాగితం మీద చివరి పుల్‌స్టాప్ పెట్టగానే అతనిలో మళ్ళా అనిశ్చితి మొదలవుతుంది, సదరు సమాధానం కేవలం తనకు తాను ఆపద్ధర్మంగా కల్పించుకున్నదనీ, పైపెచ్చు అసమగ్రమనీ అతనికి అర్థం కావడం ప్రారంభమవుతుంది. కాబట్టి కవులు నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటారు; చివరికెన్నడో, వారి ఈ స్వీయ-అసంతృప్తుల వరుస ఫలితాలనన్నింటినీ సాహితీ చరిత్రకారులు ఒక పెద్ద పేపర్ క్లిప్‌తో బొత్తంగా గుదిగుచ్చి, దాన్ని ఆ కవుల “రచనా సంచయం” అంటారు.

నేను ఒక్కోసారి అసంభవ సన్నివేశాల్ని కల కంటూంటాను. ఉదాహరణకి, నాకు రచయిత ఇక్లీసియాస్టిస్‌తో సంభాషించే అవకాశం వచ్చినట్టు ఊహించుకుంటాను2.  ఆయన సకల మానవ ప్రయత్నాల నిష్పలత్వం పైనా కదిలించే విధంగా ఓ విలాపాన్ని రాసిన రచయిత. ఆయనకు వెన్ను వంచి ప్రణమిల్లుతాను. ఎందుకంటే ఆయన అత్యద్భుతమైన కవుల్లో ఒకరు, కనీసం నా వరకూ. తర్వాత ఆయన చేయి దొరకబుచ్చుకుంటాను, ” ‘సూర్యుని క్రింద కొత్త విషయంటూ ఏదీ లేదు’ అని నువ్వు రాసావు ఇక్లీసియాస్టిస్! కానీ స్వయానా నువ్వే ఈ సూర్యుని క్రింద కొత్తగా జన్మించ లేదూ. నీకు ముందు జీవించిన వారెవరూ నువ్వు రాసిన కవితను చదవలేకపోయారు కాబట్టి, నీ కవిత కూడా సూర్యుని క్రింద కొత్తదే. అలాగే నువ్వు ఏ సైప్రస్ చెట్టు క్రింద కూర్చున్నావో అది కూడా అనాది నుంచీ పెరుగుతున్నదేం కాదు. అది ఇలాంటిదే మరో సైప్రస్ నుంచి పుట్టింది, అయితే రెండూ ఒకటి మాత్రం కాదు. ఇక్లీసియాస్టిస్! నేన్నింకోటి కూడా అడగాలనుకుంటున్నాను. నువ్వు సూర్యుని క్రింద ఏ కొత్త ఇతివృత్తాన్ని స్వీకరించబోతున్నావ్? ఇదివరకూ వెలిబుచ్చిన ఆలోచనలకే అదనపు చేర్పా? బహుశా వాటిలో కొన్నింటిని ఇప్పుడు ఖండించాలనుకుంటున్నావు కాబోసు? నీ గత రచనలో—ఆనందం క్షణభంగురమైతేనేమి, అన్నావు? కాబట్టి నీ తదుపరి సూర్యుని-క్రింద-కొత్త-కవిత ఆనందం గురించినదై వుంటుంది? ఇప్పటిదాకా ఏమైనా పరిశీలనలు నమోదు చేసుకున్నావా, చిత్తుప్రతులు తయారయ్యాయా? ‘నేను రాయాల్సినదంతా రాసేసాను, ఇక రాయటానికేమీ మిగల్లేదు’ అని నువ్వు అనబోవని నాకనిపిస్తోంది. ప్రపంచంలో ఏ కవీ ఇలా అనలేడు, ముఖ్యంగా నీలాంటి గొప్ప కవి.”

ఈ ప్రపంచం—దీని గురించి మనమేమనుకున్నా,  దీని భారీతనం ముందు మన స్వీయ దుర్బలత్వం స్ఫురించి భీతిల్లినా, లేదూ మనుషులూ జంతువులూ వృక్షాలూ అనుభవించే వేదనల పట్ల దీని ఉదాసీనతను ద్వేషించినా; అలాగే, నక్షత్ర కాంతి రేఖల్తో చొచ్చుకుపోబడిన ఈ శూన్యవిస్తారాల గురించీ, ఆ నక్షత్రాల చుట్టూ మనమిప్పుడిపుడే కనుగొనటం మొదలుపెట్టిన గ్రహాల గురించీ మనమేమనుకున్నా; మనకు ముందస్తుగానే టికెట్లు ఖరారైన ఎల్లలులేని ఈ నాటకరంగం గురించి మనమేమనుకున్నా (రెండు గుడ్డి తేదీలకు కట్టుబడిన ఈ టికెట్ల చెల్లుబాటు గడువు మాత్రం నవ్వొచ్చేంత కురచనైనది); ఈ ప్రపంచం గురించి మనం యింకా యిలా ఎన్ని అనుకున్నా గానీ—ఇది నివ్వెరపరిచే ప్రపంచం.

అయితే ఈ “నివ్వెర పరిచే” అనే విశేషణం ఒక తార్కికమైన ఎరను మరుగుపరుస్తుంది. సాధారణంగా మనల్ని నివ్వెరపాటుకు గురి చేసేవి ఏమంటే—సర్వత్రా తెలిసిన, విశ్వవాప్త ఆమోదాన్ని పొందిన పద్ధతి నుంచి పక్కదారి పట్టిన అంశాలు; మనకు ప్రస్ఫుటంగా అలవాటైన ధోరణి నుంచి దారి మళ్ళిన అంశాలు. ఇక విషయానికొస్తే, ఇక్కడ అలా ప్రస్ఫుట ప్రపంచమంటూ ఒకటి వేరే ఏదీ లేదు. మన నివ్వెరపాటు దానికదే స్వతంత్రంగా మన్నుతుంది, అది సాపేక్షాన్వయం కోసం వేరే దేని పైనా ఆధారపడదు.

ఒప్పుకుంటాను, ప్రతీ పదాన్ని ఆగి సమీక్షించుకోవాల్సిన అవసరం లేని రోజువారీ సంభాషణల్లో మనమంతా “సాధారణ ప్రపంచం”, “సాధారణ జీవితం”, “సాధారణ పరిస్థితుల్లో”… లాంటి పదబంధాలు వాడుతూంటాం. కానీ ప్రతి పదాన్నీ ఆచితూచే కవిత్వపు భాషలో, ఏదీ మామూలు కాదు, సాధారణం కాదు: ఏ ఒక్క రాయీ, దాని పైనున్న ఏ ఒక్క మేఘమూ; ఏ ఒక్క పగలూ, దాని తర్వాతవచ్చే ఏ ఒక్క రాత్రీ ; అన్నింటినీ మించి, యీ ప్రపంచంలో ఏ అస్తిత్వమూ, ఎవ్వరి అస్తిత్వమూ సాధారణం కాదు.

దీన్ని బట్టి చూస్తే, కవుల పని ఎప్పుడూ జటిలమే అనిపిస్తోంది!

*


పాదసూచికలు:

[1] జోసెఫ్ బ్రాడ్‌స్కీ (1940 – 1996) ప్రముఖ రష్యన్ కవి, నోబెల్ సాహిత్య బహుమతి గ్రహీత. సోవియెట్ రష్యాలో ఒక యూదు కుటుంబంలో జన్మించాడు. పేదరికం వల్ల పాఠశాల విద్యని తొందర్లోనే విడిచిపెట్టాడు. రకరకాల చిల్లర ఉద్యోగాలు చేస్తూ తనకు తనే విద్య చెప్పుకున్నాడు. తొందర్లోనే సాహిత్య అనువాదాలతో పాటూ, కవితలూ రాయటం ప్రారంభించాడు. ప్రస్తుత ప్రసంగంలో వీస్వావా షింబోర్‌స్కా ఆయన్ను గూర్చి చేసిన ఈ ప్రస్తావనకు యుక్త వయస్సులో ఆయన ఎదుర్కొన్న ఒక సంఘటన ఆధారం. అప్పటి సామ్యవాద రష్యాలో వయోజనులైన ప్రతీ ఒక్కరూ పని చేయాలన్న నిర్బంధం వుండేది. ప్రజలందరూ శ్రామికుల కిందే లెక్క. ప్రభుత్వం కూడా శ్రామిక ప్రభుత్వమే. అయితే ఈ ప్రభుత్వం దృష్టిలో శ్రమ అంటే ఎప్పుడూ శారీరకమైనదే! మేధోపరమైన శ్రమ లెక్కలోకొచ్చేది కాదు. దాంతో మేధావి వర్గం చాలా కటువైన జీవితాన్ని గడపవలసి వచ్చేది. రోడ్లూడ్చడం, చిమ్నీల్ని వెలిగించడం లాంటి పనులు చేస్తూ, ఖాళీ సమయాల్లో తమ మేధో సంబంధమైన వ్యాసంగాల్ని నిర్వహించుకోవాల్సి వచ్చేది. ఇలా శ్రమ చేయని వాళ్ళని ప్రభుత్వం “పరాన్నజీవులు” (పారసైట్స్) అంటూ ముద్రవేసి, గడ్డు వాతావరణ పరిస్థితులున్న ప్రాంతాల్లోకి బహిష్కార శిక్ష విధించేది. అప్పటికి యువకోత్సాహంతో, ఎవరినీ లెక్కచేయని స్వేచ్ఛతో కవిత్వం రాసుకుంటూ పోతున్న బ్రాడ్‌స్కీ తొందర్లోనే రష్యన్ సీక్రెట్ పోలీస్ దృష్టిలో పడ్డాడు. ఆయన్ని అరెస్టు చేసారు. అప్పటి ఆయన విచారణకు సంబంధించిన పాఠ్యప్రతి దరిమిలా ఒక జర్నలిస్టు ద్వారా బయటి ప్రపంచానికి పొక్కి ప్రసిద్ధమైంది. అది ఇలా సాగుతుంది:

జడ్జి: నువ్వు మామూలుగా ఏం చేస్తుంటావు?
బ్రాడ్‌స్కీ: నేను కవిని, సాహితీ అనువాదకుణ్ణి.
జడ్జి: కవిగా నిన్ను ఎవరు ఆమోదించారు? ఎవరు కవుల జాబితాలో చేర్చారు?
బ్రాడ్‌స్కీ: ఎవరూ కాదు. మనుషుల జాబితాలోకి నన్నెవరు చేర్చారు?
జడ్జి: నువ్విది అధ్యయనం చేసావా?
బ్రాడ్‌స్కీ: ఇదంటే?
జడ్జి: కవి ఎలా కావచ్చన్నది. మామూలుగా కవిత్వం బోధించేది, కవులు తయారయ్యేది పాఠశాలల్లో. నువ్వక్కడ కనీసం ఉన్నత విద్య కూడా పూర్తి చేయలేదు.
బ్రాడ్‌స్కీ: ఇది పాఠశాలల్లో నేర్చుకోవచ్చని నాకనిపించలేదు.
జడ్జి: మరి ఎలా?
బ్రాడ్‌స్కీ: నాకు తెలిసి… ఇది దేవుడి నుంచి వస్తుంది, అవును దేవుడి నుంచే.

ఈ విచారణ తరువాత ఆయనపై “పరాన్న జీవత్వం” అన్న నేరాన్ని నిర్థారించి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. ఇదీ, పై ప్రస్తావన వెనక కథ. తర్వాతి కాలంలో బ్రాడ్‌స్కీ అమెరికా చేరుకుని మేటి కవిగా ప్రసిద్ధి పొందాడు.

[2] హీబ్రూ బైబిల్‌లో భాగంగా వుండే పలు ఉప గ్రంథాల్లో ఒక దాని పేరు ఇక్లీసియాస్టిస్. దీన్ని రాసింది ఇక్లీసియాస్టిస్ (లేదా కొహెలెత్). ఈ గ్రంథంలో ఆయన మానవుల ప్రతీ చర్యా (ప్రతీ ప్రయత్నమూ) నిష్పలమూ, అర్థరహితమూ, అసంబద్ధమూ అని ప్రతిపాదిస్తాడు. ఈ గ్రంథంలో కొన్ని వాక్యాల్ని వీస్వావ షింబోర్‌స్కా ఇక్కడ తన ప్రసంగంలో ప్రస్తావిస్తున్నది. ఆ ప్రస్తావనకు మూలమైన వాక్యాలు ఇవి:

What has been will be again,
what has been done will be done again;
there is nothing new under the sun.

(ఏది వున్నదో అదే మరలా వుండబోతోంది,
ఏది సాగిందో అదే మరలా కొనసాగబోతోంది;
సూర్యుని క్రింద కొత్త విషయంటూ ఏదీ లేదు.)

May 17, 2011

అలా తిరిగి రావాలని...

నాలో తిరగాలన్న యావ మొదలైందీ మధ్య. మొన్న పుస్తకాల షాపుకి వెళ్ళినపుడు  అత్యంత యిష్టంగా కొని తెచ్చుకున్నది ఒకే పుస్తకం: ‘ఎ రోడ్ గైడ్ టు ఆంధ్రప్రదేశ్’! బహుశా స్టేషనరీ షాపుల్లో కూడా దొరికే పుస్తకం. వందరూపాయలు. పుస్తకం కన్నా ముఖ్యంగా పుస్తకం వెనక అట్టకు అతికించి వున్న పేద్ద ఆంధ్రప్రదేశ్ మాప్ నన్నాకర్షించింది. యిలా పుస్తకాలకని వెళ్ళి రోడ్డు మాప్ కొనుక్కురావడమన్నది, గత కొన్ని నెలలుగా నా ఆలోచనలకు తగ్గట్టే ఉంది.

నాకు చిన్నప్పటి నుండీ ప్రయాణాలంటే పెద్ద మక్కువ లేదు, అలాగని మరీ విరక్తీ లేదు. చిన్నప్పుడు తిరిగింది ఎక్కువగా బస్సుల్లోనే. అది ఆహ్లాదకరమైన అనుభవం కాదు. ఆ దుమ్ము రేగే బస్టాండ్లూ, బస్సుల్లో ఇనుము కంపూ, మన అస్థిపంజరం బలమెంతో పరీక్షిస్తున్నట్టు ఆపాదమస్తకం జాడించి వదిలేసే రోడ్లూ, అప్పటిదాకా యింటి చుట్టూ తెలిసిన పరిసరాల్లో అలవాటు మగత కప్పుకు పడుకున్న మనసుపై ఉన్నపళంగా దాడి చేసే తెలియని మొహాలూ పరిసరాలూ, లగేజీ బాధ్యతలూ, రావాల్సిన చిల్లర గుర్తుపెట్టుకోవడాలూ, కిటికీలోంచి జేబురుమాళ్ళు విసిరి సీటేస్సుకునేవాళ్ళూ... ఇవన్నీ చికాకు పెట్టేవి. కానీ, ఒక్కసారి కిటికీ దగ్గర సీటు దొరికిందా... అన్నీ మరిచిపోయేవాణ్ణి.

రైలు ప్రయాణాలంటే మాత్రం చాలా యిష్టం. అసలు రైలంటేనే ఏదో ఆకర్షణ. రైలు డోరు దగ్గర నిల్చునే వీలు దొరికితే చాలు గమ్యం ఎప్పటికీ చేరకపోయినా ప్రయాణపు పరమార్థం దక్కేసినట్టే. (డోరు దగ్గర నుంచున్నంత సేపూ నా సీట్లో ఏం జరుగుతుందన్న ధ్యాస వుండదుగానీ, సీట్లో కూర్చోవాల్సి వచ్చినపుడు మాత్రం ఆ డోరు దగ్గర చోటెవడన్నా ఆక్రమించేస్తాడేమోని కంగారు పడతాను యిప్పటికీ.) ఇరుపక్కలా వెదజల్లబడిన జీవిత పరిమళాల్నెన్నింటినో ఏరి, తన పట్టాల దారానికి ఒద్దికైన కదంబంగా రైలు వేగిరం అల్లుకుంటూ పోతుంటే, ఆ పరిమళాలకు మనసు తలుపు తెరిచిపెట్టి నిల్చోవడం నాకు ఎప్పటికీ పాతబడని ఆనందం. అసలు స్పందించగలిగే మనసుండాలే గానీ రైలు తలుపు దగ్గర నిలబడ్డపుడు ఎంత కవిత్వం వేగంగా వెనక్కు దొర్లుతూ పోతుందనీ!

రైల్ డోర్ రియలైజేషన్స్

మొన్న ఊరెళ్ళినపుడు కూడా అంతే. తెలవారుతుందనగా సీటు వదిలేసి తలుపు దగ్గరకు వెళ్ళి నిలబడ్డాను. ఎన్నిసార్లు చదివినా ఒకే అర్థం చెప్పే కవిత కూడా, ఎపుడో ఏదో అరుదైన మనస్థితిలో చదివినపుడు కొత్త అర్థాన్ని స్ఫురింపజేస్తుంది. అలాగే యిపుడు కూడా బయటి దృశ్యాలు యిదివరకట్లాంటివే అయినా, ఈ సారి నా మనసు వాటికి కొత్త భాష్యాలు చెప్పింది; వాటిని మరి వేటికో ముడి వేసింది; ఆ కొత్త అన్వయాల నుంచి నేనిదివరకూ గమనించని సత్యాల్ని రాబట్టింది. ఓ చిన్నపాటి జ్ఞానోదయం కూడా కలిగిందని చెప్పాలి. వెనక్కి వచ్చాకా ఓ పోస్టు రాయబోయి తర్వాతెందుకో మానేసాను. ‘rail-door realizations’ అనో ‘an exercise to the literary pedant’ అనో కొన్ని శీర్షికలు మనసులో పెట్టుకున్నాను కూడా. ఈ రెండో శీర్షిక గురించి కాస్త వివరించాలి. రైలు ప్రయాణం గురించి రాస్తూ దానికి ‘సాహితీ ఛాందసులకు ఒక అభ్యాసం’ అని పేరెందుకు పెట్టాలనుకున్నాను? ఎందుకంటే, అలాంటి ఛాందసత్వంతో బాధపడే వారికి వేగంగా వెళ్ళే రైల్లో తలుపు దగ్గర ప్రయాణం చేయడం మంచి విరుగుడుగా పని చేస్తుందనిపించింది. ఎలాగో చెప్పే ముందు, అసలు ఈ ఛాందసత్వానికి కారణాలు ఊహిస్తాను. సాహిత్యాన్ని గొప్ప పరంపర కలిగిన ఒక వ్యవస్థగా చూడడంలో కొన్ని ప్రమాదాలున్నాయి. ముఖ్యంగా సాహిత్యమే ప్రధాన వ్యాసంగంగా కలవారికి ఈ ప్రమాదం జరిగే అవకాశాలు మరీ ఎక్కువ. ఈ మహానిర్మాణపు మాయలో పడిపోతాం. యిది స్వచ్ఛందమనీ, స్వయంసమృద్ధమనీ నమ్మడం మొదలుపెడతాం. దీనికి జీవాన్నిచ్చే వేర్లు చుట్టూ జీవితంలో పాతుకొని వున్నాయన్న సంగతి విస్మరిస్తాం. పనిముట్టు సొగసుగా వుందని దానితో పని చేయించుకోవడం మానేసి గూట్లో పెట్టి ఆరాధించే ఎడ్డి పనోడిలాగ, జీవితాన్ని అక్షరాల్లోకి వడగట్టగల సాహిత్యాన్ని పటం కట్టి పూజించడం మొదలుపెడతాం. దాని ఘనమైన పరంపర ముందు భక్తిప్రపత్తులతో సాష్టాంగాలు పడుతూ, ఆ వ్యవస్థకు మనమే ఆపాదించిన మర్యాదని కాపాడేందుకు సిద్ధాంతాల్ని సృష్టిస్తూ, నియమాల్ని అల్లుతూ, వాటి ఆధారంగా బేరీజులు కడుతూ, నేల నిలకడ చూసుకోకుండా దాని మీద బృహన్నిర్మాణాలు కడుతుంటాం. జీవితాన్ని బయటే వదిలేసి, సాహిత్యాన్ని అద్దాల మేడలో బంధిస్తాం. యిదిగో! యిదే మూసలో కరుడుగట్టిపోతే మనమే సాహితీ ఛాందసులమవుతాం.

ఈ ఛాందసత్వం పటాపంచలు కావాలంటే, ఒక్కసారి జీవితపు బహుముఖీన విశ్వరూపం మిరుమిట్లుగొలుపుతూ మన మనోనేత్రాల ముందు సాక్షాత్కారం కావాలి. అలా చూపగలిగే దృష్టిపథం ఒకటి మనకు కావాలి. రైలు డోరు దగ్గర అది సులువుగా దొరుకుతుందని నా నమ్మకం. జీవితంలోని ఎన్నో పార్శ్వాలకు ప్రాతినిధ్యం వహించే చెదురుమదురు దృశ్య శకలాల్ని త్వరిత గతిన ప్రక్కప్రక్కన చేర్చి మనకు చూపించగలిగే ఒకేఒక్క చోటు అది. ఈ చేరిక వల్ల మనం ఒక దృశ్యంతో మరో దృశ్యానికి లంకె వేయగలుగుతాం. వేర్వేరు పార్శ్వాల్ని ఒకదానితో ఒకటి పోల్చుకోగలుగుతాం. వ్యత్యాసం చూడగలుగుతాం. ఈ వ్యత్యాసాల మధ్య దాగివున్న జీవిత స్వభావాన్ని  గ్రహించగలుగుతాం. బస్సూ, కారూ, బైకూ, సైకిలూ...  ఏదీ యిలా పనికి రాదు. ఇవి మనల్ని జీవితపు సందడిలో భాగం చేసేస్తాయి. మనం ఏం గమనించాలను కుంటున్నామో దానికి మరీ దగ్గరైపోతాం. స్థూలంగా చూపించే దృష్టి ఉండదు. కానీ రైలు అలాక్కాదు. వేరు చేయగలిగే దూరాన్ని పాటిస్తూనే, అవగాహనకు చాలినంత దగ్గరగా వెళ్తుంది.

ఇప్పుడు కాస్త ఓపిక పడితే... కొన్ని కామాల పరంపర:— కొండలు, గడ్డి మైదానాలు, మామిడితోటలు, వరి పొలాలు, నల్లగా బిగువైన శరీరాల్తో సేద్యగాళ్ళు, కోతలూ కుప్పనూర్పుళ్ళూ, గేదెలూ, ట్రాక్టరూ, గొట్టంలోంచి ఊక కక్కుతూ రైసుమిల్లూ, ఎదుటి బడ్డీకొట్టుని వేలెత్తి చూపిస్తున్న అంబేద్కర్ విగ్రహం, సంతమార్కెట్టూ, పెంకుటిళ్ళ దొడ్డి గుమ్మాలూ, పళ్ళు తోముకుంటున్న లుంగీ, అంట్లు తోముతున్న చీర, గుడి గోపురం, స్కూలు గ్రౌండ్లో నెట్‌ మీంచి ఎడాపెడా ఎగురుతున్న బంతీ, ముగ్గులేసి వున్న వీధులూ, గాంధీబొమ్మ సెంటరూ, సైకిల్ని వంకరగా తొక్కుతున్న పొట్టి నిక్కరూ, ఊరి చివర ‘రతి రాణి’ని చూపిస్తున్న సినిమా హాలూ, కాసేపు గుప్పున కంపుకొట్టే కోళ్ళ ఫారం, చెరువు గట్టున కొబ్బరి చెట్టుకు ఆనించి వున్న అరిటిగెలల సైకిళ్ళు, పక్కన చుట్ట కాలుస్తూ రెండు తలపాగాలూ, తిరగేసిన ఎక్స్‌క్లమేషన్ మార్కుల్లా దూరంగా తాటి చెట్ల వరస, ఎండలో బంగారంలా మెరుస్తూ గడ్డి మేట్లూ, ఎవరూ కనపడని రైల్వే క్రాసింగూ, వరిపొలాల్లో కొంగల గుంపు, కంకర్రోడ్డు మీద ముఖం చిట్లించుకు పోతూన్న ఎర్ర బస్సూ, దాన్ని ఓవర్టేక్ చేస్తూ నల్ల క్వాలిస్సూ, సంతోషి ఫ్యామిలీ ధాబా, సరుకు లారీలు, పెట్రోలు బంకూ, కిషన్‌చంద్ మార్బల్ టైల్స్ ఫాక్టరీ, క్రిస్టియన్ స్మశానం, బెతెస్త వృద్ధాశ్రమం, అశోక వృక్షాల మరుగులో గవర్నమెంటాఫీసు కాంపౌండూ, ఏవో నడుములూ బొడ్డులూ చూపిస్తున్న పోస్టర్లూ, రైలు బ్రిడ్జి క్రిందనుంచి పోతూ కనిపిస్తున్న ట్రాఫిక్కూ, గడియారస్తంభం, షాపింగ్ కాంప్లెక్సూ, బట్టల షోరూమ్, వేలు చూపిస్తున్న వెంకటేష్ కటౌటూ, బోలెడన్ని స్కూటర్లు గంటు మొహాలు పెట్టుకుని వెయిట్ చేస్తున్న రైల్వే క్రాసింగూ, వీపులు చూపిస్తున్న షాపుల వెంటిలేటర్లలో ఎగ్జాస్టు ఫేన్లూ, బట్టలారేసి వున్న అపార్ట్‌మెంట్ బాల్కనీలు, రెపరెపలాడుతున్న మెడికల్ కాలేజీ యూనిఫారాలూ, పెట్రోలు బంకూ, కనకదుర్గా ఫ్యామిలీ దాభా, కొబ్బరి చెట్లూ, వరి చేలూ, బోరింగు దగ్గర పిల్లల బోసి ముడ్లూ... మళ్ళీ యింకో ఊరూ, మళ్ళీ యింకో పట్టణం, మళ్ళీ యింకో నగరం... యిలా ప్రతీ వీధిలో ప్రతీ యింట్లో ప్రతీ బయలులో ప్రతీ మనిషిలో పై తెరలు తీయగానే ఎన్నెన్నో కథలు ఝుమ్మంటూ ముసురుకుంటుంటే, జీవితం అవిచ్ఛిన్నంగా కళ్ళ ముందు విచ్చుకుంటూంటే, మన చైతన్యపు కొలతకి అందనంత విస్తారంగా పరుచుకుంటూంటే, అప్పుడు, ఆ సమయంలో ఒక్కసారి, కలమూ తెల్లకాగితాలతో నిమిత్తమున్న మన సాహితీ వ్యాసంగాన్ని గుర్తు తెచ్చుకుంటే, అప్పుడు తెలుస్తుంది, అది దాని చేవ ఎంత పరిమితమో. మెలికల గీతల్తో నిర్మితమైన అక్షరాలూ, వాటి కూడికతో నిర్మితమైన పదాలూ, వాటి వెనుక ఏ స్థిరత్వమూ లేక చంచలంగా దోబూచులాడే అర్థాలూ యివన్నీ మొదటికే ఈ విస్తృత జీవిత వైశాల్యాన్ని ఇముడ్చుకునేందుకు ఎంతో చాలీచాలనివీ, అసమగ్రమైనవీను. యిక సాహిత్యాన్ని భాష అంటూ, నిర్మాణ భేదాలంటూ యింకా దాని పరిధిని కుదింపజేస్తే అది జీవితం ముందు పూర్తిగా కుదేలైపోతుంది. కౌగలించుకోవాల్సిన చేతుల్ని వెనక్కి విరిచి కట్టేస్తే మోకాళ్ళ మీద కూలబడిపోతుంది. ఆకాశాన్ని రెక్కల్తో కొలవాలనుకునే పక్షి ప్రయాసలో నిష్పలత్వమే వున్నా, ఆ బృహత్ అభిలాషలో, ఆ స్వేచ్ఛలో ఓ అందం వుంది.  కానీ పంజరంలోంచి ఆకాశాన్ని బెంగగా చూసే పక్షిలో అలాంటి అందమేమీలేదు.

నేను ఈ వ్యాసంలాంటి ఏదో రాతలో విషయం నుంచి పూర్తిగా దారి తప్పుతున్నట్టున్నాను. రాయాలనుకుంది వేరు రాస్తోంది వేరు. నాలో కొత్తగా మొదలయిన భ్రమణకాంక్ష గురించి కదా నేను రాయాలనుకుంది. సాహిత్యం జోలికి ఎందుకు వచ్చాను. (నా విషయంలో ఈ రెంటికీ నాకిప్పుడు ఆలోచించే ఓపిక లేని అవినాభావ సంబంధమేదో వుందనిపిస్తుంది.)

తిరుగుడు యావ నాలో చిన్నప్పట్నించీ వుందేమోనని అనుమానించడానికి బస్సు కిటికీ పట్లా, రైలు తలుపు పట్లా నాకున్న మక్కువ తప్ప వేరే ఆధారం లేదు. అసలు భ్రమణకాంక్ష అనేదొకటి మనుషుల్ని పట్టుకుని ఊపుతుందనీ, ఫలితంగా ఎక్కడా కాలు నిలపలేక, ఎక్కడా ఎక్కువకాలం తమని స్థిరపరుచుకోలేక, నిరంతరం కొత్త చోట్లకై అన్వేషించేవారు వుంటారనీ నాకు తెలియదు. తిరగడం అంటే ఏదో గమ్యానికని మాత్రమే నాకు తెలిసింది. చిన్నప్పుడంతా ఎప్పుడన్నా వేసవి సెలవల్లో చుట్టాల యిళ్ళకు వెళ్ళి వచ్చేయడం తప్ప నేను చేసిన దూర ప్రయాణాలు తక్కువ. అప్పుడపుడూ ఊరి చివర లాకుల దగ్గర స్నానాలకూ, మూతబడిన రైసుమిల్లుల్లో ఆటలకీ అభ్రకం పెచ్చులు ఏరుకోవడానికీ, గోదావరి లంకలకూ, స్మశానాలకూ, మామిడితోటల్లో దొంగతనాలకూ నన్ను పురికొల్పింది ఏకతీరుగా విసుగుపుట్టించే స్కూలు జీవితమే తప్ప, కొత్త స్థలాల పట్ల మక్కువ కాదు. కొత్త ప్రదేశాల్లో, కొత్త మనుషుల్తో గడపాలనే యావ లోపలేవన్నా వుండి వుంటే దాన్ని నావరకూ పుస్తకాలు బాగానే సంతృప్తి పరచాయి. ఒకవేళ అలాంటిదేమీ లేకపోతే, పుస్తకాలు ఆ లోటు తెలియనివ్వలేదు. ముఖ్యంగా మాక్సింగోర్కీ జీవిత చరిత్ర (ట్రయాలజీ) లాంటి పుస్తకాలు నన్ను కేవలం స్థలం లోనే కాదు, కాలంలో కూడా సదూరంగా తీసుకుపోగలిగాయి.

బైట కూడా లోకం వుందన్నమాట బెక బెక! 

డిగ్రీ చదివేటపుడు ఒక సంఘటన మాత్రం నా చిన్ని లోకం మీద బోర్లించిన బుట్టని తిరగేసి ప్రపంచాన్ని కొత్తగా చాలా చూపించింది. పూల మొక్కలకు ప్రసిద్ధి చెందిన కడియపులంకలో ఏడాదేడాదీ ‘ఫలపుష్ప ప్రదర్శన’ జరిగేది. మేం నలుగురు స్నేహితులం కలిసి బయల్దేరాం బస్సులో. అబిద్‌ గాడు యింట్లో చెప్పకుండా మస్కాకొట్టి తెచ్చిన డొక్కు కెమెరా ఒకటి మాతో వుంది (అప్పటికింకా డిజిటల్ కెమెరాలు అంత వ్యాప్తిలోలేవు.) ఇక చూడాలి, ఎగ్జిబిషన్‌లోకి చేరేసరికి ఆ కెమెరాతో మా యవ్వారం ‘తోక యెత్తిన కాకి, తోక దించిన కాకి’ అన్నట్టు తయారయింది. ఏవో పూల బెడ్స్ ప్రక్కనో, బోన్సాయ్ చెట్ల ప్రక్కనో ఫోటోలంటే సరే. కానీ మా ఫోటోల వైవిధ్యానికి అంతులేదు. ఓ స్టాల్లో పూలమొక్కలకి ఎరువులమ్ముతున్న అమ్మాయితో (ఆ అమ్మాయి చాలా అందంగా వుంది; ఒక ఎరువుల పాకెట్ కొంటే తనతో ఫోటో తీసుకోవచ్చంది), ఎగ్జిబిషన్ బయట ఆపివున్న కార్ల ప్రక్కన్నుంచునీ, రోడ్డు మధ్యలో, పొలం గట్ల మీద, చెట్ల క్రింద, చెట్ల మీద, ముగ్గుర్లో ఎవడో తెచ్చిన నల్ల కళ్ళజోడు ఫొటోకి ఒకరొకరం మార్చుకుంటూ, ఒక ఫొటోకి ఇన్‌షర్టూ, ఒక ఫొటోకి పక్కోడి టీషర్టూ... యిలా ఆ ఒక్కరోజులోనే మనిషి జీవపరిణామ దశల్నెంటినో పెద్ద పెద్ద అంగల్తో వెనక్కి దాటేసి విచ్చలవిడిగా ఫొటోలకు ఫోజులిచ్చాం. జీవితంలో అంతకుముందెప్పుడూ మాలో ఎవ్వరమూ అన్ని ఫొటోలు దిగలేదు. బాగా రాత్రి దాకా ఎగ్జిబిషన్ దగ్గరే కాలక్షేపం చేసింతర్వాత, హైవే మీద ఏదో కంకర మోసుకెళ్తూన్న లారీని ఆపి వెనక కంకరలోడు మీద ఎక్కాం. పాటలు పాడుకుంటూ, కేకలూ వేసుకుంటూ వెళ్ళాం. జొన్నాడ దగ్గర దిగాం. అక్కడ వేరే బస్సెక్కాలి. నాలుగడుగులేసామో లేదో, మా కెమెరా ఆ కంకర లారీలోనే వదిలేసి దిగామని అర్థమైంది. లారీ అప్పటికే కనుచూపుమేర దాటేసి చీకట్లో కలిసిపోతోంది. వెనక పరిగెత్తాం ఖాళీ రోడ్డు మీద పొలోమని, ఈసారి కంగారుతో కేకలు వేస్తూ. కానీ అది ఆగలేదు. అబిద్‌ గాడి కంగారు... వాడి ఫ్యామిలీ మొత్తానికి అది ఒక్కగానొక్క కెమెరా! లారీ వెళ్ళిన వైపే వెళ్ళాలని నిశ్చయించాం. వెనక వస్తున్న యింకో లారీ ఆపి ఎక్కితే వాడు చెప్పాడు, బహుశా ముందెళ్ళిన లారీ గోదావరి అవతల వున్న ‘ఎల్ & టి’ వాడి సైటు లోకి కంకర తీసుకెళ్తోందేమోనని. (అప్పుడు రావులపాలెం గోదావరి వంతెనకి ఏవో మరమ్మతులు జరుగుతున్నాయి.) అయితే అక్కడే దిగుతామన్నాం. అబిద్‌ గాడికి కెమెరా పట్ల ఎంత ఆందోళన వుందో, మిగతా ముగ్గురికీ అందులో ఫోటోల పట్ల అంతే ఆందోళనగా వుంది. అయినా విధి మా పట్ల అంత కఠోరంగా వ్యవహరించగలదని యింకా నమ్మలేక, పైకి జోకులు వేసుకుంటూనే వున్నాం. బ్రిడ్జి అవతల దిగి, కన్‌స్ట్రక్షన్ సైటులోకి వెళ్ళాం. లోపల బోలెడన్ని లారీలు, క్రేన్లు, క్రషింగ్ మెషీన్లు, బస్తాలు, ఇసుక, కంకర గుట్టలు... మొత్తం వాతావరణమంతా మనుషుల్లో పిపీలికత్వపు స్పృహ కలిగించి న్యూనత రేకెత్తించేలా వుంది. అప్పటికే అర్ధరాత్రి దాటుతోంది. అయినా లోపల నిర్విరామంగా పని జరుగుతూనే వుంది. ఎవరో మేనేజరనుకుంటా, సంగతి చెప్తే గత కాసేపట్లో లోపలికి ఏయే లారీలు వచ్చాయో రిజిస్టరులో చూశాడు. సెక్యూరిటీ వాణ్ణొకణ్ణి మాకు అప్పజెప్పి ఆ లారీలు వదిలిన కంకర గుట్టల్లోకి పంపించాడు. అతను మా కెమెరా ఎత్తుకెళ్ళిన లారీ తాలూకు కంకర గుట్ట ఏదైవుండచ్చో అది మాకు చూపించాడు. మేం కాసేపు ఆ గుట్ట అటూ యిటూ కెలికి చూసాం. అది చాలా పెద్దది వుంది. అంతా పెకలించినా దొరక్కపోతే! చివరికి అప్పటికే ఆశ చచ్చిపోయింది. విధి మాకు హేండిచ్చిందని కన్ఫర్మయిపోయింది. ముగ్గురం ఓ గంట అక్కడే గడిపి కాళ్ళీడ్చుకుంటూ రోడ్డు మీదకి వచ్చాం. లారీ నుంచి లారీకి మారుతూ మాచవరం వెళ్ళి ఆ రాత్రి రెడ్డి గాడి యింట్లో పడుకున్నాం. ఇప్పటికీ మేం నలుగురం కలిస్తే అడపాదడపా ఆ రాత్రి గురించి ఓ మాట ప్రస్తావనకు వస్తూనే వుంటుంది.

మా కాలేజీ జీవితంలో కొన్ని ఆనంద క్షణాల్ని ఫ్రీజ్ చేసి ఇముడ్చుకున్న ఆ కెమెరా ఫిల్ము వాటిని ఫోటోల రూపంలో విడుదలచేసి వుంటే అవి ఎప్పటికీ మాతో వుండిపోయేవి. ఆ కెమెరాలో ఇమిడిన మా అప్పటి అవతారాలు నాకు యిప్పటికీ లీలగా స్ఫురిస్తాయి. కానీ ఆ రాత్రి ఆ కన్‌స్ట్రక్షన్ సైటులో గడిపిన క్షణాలు నాకు అంతకు మించిన స్పష్టతతో గుర్తున్నాయి. ఫోటోలుగా మారకుండానే తప్పిపోయిన ఆ ఫిల్ము మా కొన్ని జ్ఞాపకాల్ని మాక్కాకుండా చేసినా, అలా తప్పిపోవడం ద్వారా అంతకన్నా మరింత తీక్షణమైన జ్ఞాపకాన్ని ఇచ్చింది. ఆ అర్ధ రాత్రి హైవే రోడ్డూ, లారీలూ, తెలియని స్థలాలూ, తెలియని మనుషులూ... ఒక్కసారిగా ప్రపంచం బట్టలు తిరగేసి తొడుక్కుని వుండగా నా కంటబడినట్టు అనిపించింది.  ఆ లారీ డ్రైవర్ల రోజెలా గడుస్తుందో, ఆ సెక్యూరిటీ వాడి యింట్లో కథేమిటో, ఆ కన్‌స్ట్రక్షన్‌ సైటులో ఎలాంటి వ్యవహారాలు నడుస్తాయో, వాటికి మూలమైన పెద్ద పెద్ద నిర్ణయాలు నగరాల్లో ఏ కాన్స్ఫరెన్సు హాళ్ళనించి వస్తాయో, అక్కడ డెస్కుల వెనుక యింజనీర్ల కథలేమిటో...! అదివరకూ నేను పెద్దగా ఎన్నడూ గమనించని ఒక విషయం ఆ రాత్రి తెలిసింది: ప్రపంచం ఎపుడూ నిదరపోదనీ; ఏదో ఒకటి చేస్తూనేవుంటుందనీ; నాకు ఆనుపానులు తెలియని స్థలాల్లోనూ, నేను పేర్లెన్నడూ వినని ఊళ్ళలోనూ, నగరాల్లోనూ, నగరాల బయట కొండల్లోనూ, కొండల మధ్య అడవుల్లోనూ, అడవుల నిశ్శబ్దంలోనూ... నిత్యం నా చుట్టూ వున్నంత సంపన్నంగానే జీవితం నడుస్తూ వుంటుందనీ; ఎప్పుడూ ఏవో కథలు జరుగుతూనే వుంటాయనీ; కానీ అవన్నీ నాకెప్పటికీ చేరకుండానే, ఆ అగణిత క్షణాలూ, ఎన్నో అద్భుత సమయాలూ ఏ ఫొటో ఫిల్ముపైనా ముద్రితం కాకుండానే, ఈ అనంత నిర్విరామ కాలగతిలో తమ ఆచూకీ కోల్పోతూ వుంటాయనీ... ఇదంతా ఆ రాత్రి గుర్తుండిపోయేట్టు నాకు తొలిసారి తెలియజెప్పింది. ఆ రాత్రిలో ఏ దినుసులు దాన్ని అంత గాఢంగా నా జ్ఞాపకంలో ముద్రితమయ్యేలా చేసాయో నేను స్పష్టంగా చెప్పలేను. నా కూపస్థమండూక అస్తిత్వాన్నించి నన్ను కాసేపు బయటకు లాగి, వేరే ఎంతో విశాల ప్రపంచపు స్పృహను గట్టిగా నాలో కల్పించిన సంఘటనల్లో యిది కీలకమని మాత్రం చెప్పగలను. దానికి ఋజువు ఇదే, యిపుడిలా ఒక్కసారి వెనక్కి తిరిగిచూసుకోగానే వేరే అన్ని జ్ఞాపకాల్నీ తోసుకుని యిలా ముందుకు తోసుకొచ్చేయటమే!

రెక్కల్లేని లోటు తొలిగా తెలిసొచ్చిన కాలం

డిగ్రీ అయిన తర్వాత ఖాళీగా వున్న కొన్ని రోజుల్లోనూ నేను చదివిన కొన్ని పుస్తకాల గురించి యిక్కడ చెప్పాలి. ఎందుకంటే నాలో యిప్పటి భ్రమణకాంక్షకు పాదులు వేసిన పుస్తకాలు వాటిల్లో కొన్ని వున్నాయి. ముఖ్యమైనది ఒక రాహుల్ సాంకృత్యాయన్ పుస్తకం. నేను చదివిన తెలుగు అనువాదం పేరు ‘లోకసంచారి’. (అనువాదకులు ఎవరో గుర్తులేదు.) దాని మూలం పేరు ‘ఘుమక్కడ్ శాస్త్ర’ అని గుర్తుంది. అనువాదానికి పెట్టిన పేరు కన్నా మూలం పేరు ఈ పుస్తక తత్త్వాన్ని యింకా ఖచ్చితంగా చెపుతుంది. పుస్తకంలో ఎక్కువ శాతం రాహుల్ సాంకృత్యాయన్ చేసిన ‘లోక సంచారం’ గురించి కన్నా, అసలు లోక సంచారులు ఎలా మసలుకోవాలి, మానసికంగా ఎలా సంసిద్ధులు కావాలీ మొదలైన వాటి గురించి వుంటాయి. ఈ సమయంలోనే చదివిన మరో పుస్తకం సంజీవ దేవ్ ‘తెగిన జ్ఞాపకాలు’. సంజీవ దేవ్ కూడా రాహుల్ సాంకృత్యాయన్ లాగే చిన్నపుడే యిల్లు విడిచి దేశాటనకు వెళ్ళినవాడు. స్వయానా రాహుల్ సాంకృత్యాయన్‌తో వ్యక్తిగత పరిచయం వున్న వాడు కూడా. ఆయన చాలా చిన్నతనంలో యిల్లు వదిలి హిమాలయాలకు పోవడం, గొప్ప గొప్ప వాళ్లతో పరిచయాలు ఏర్పరుచుకోవడం యివన్నీ చదివిం తర్వాత నాకు న్యూనత కలిగింది. నేను మసులుకున్న లోకపు విస్తీర్ణం పుట్టగొడుగు క్రింద నీడంత మాత్రమేనని అర్థమైంది. బుచ్చిబాబు ‘నా అంతరంగ కథనం’ కూడా యిపుడే చదివాను. అదేమీ లోక సంచారం గురించి కాదుగానీ, అందులో ఓ చోట బుచ్చిబాబు రైళ్ళలో తనకు కనిపించే ఆకర్షణని ప్రస్తావిస్తాడు. అతని యిష్టాన్ని నా యిష్టంతో పోల్చి చూసుకోవడం గుర్తుంది. ఈ పుస్తకాలన్నింటిలో నేనేం చదివానన్నది ఒక్క ముక్క కూడా నాకు జ్ఞాపకం లేదు. (‘తెగిన జ్ఞాపకాలు’ అయితే పేరు కూడా గుర్తు లేదు. ఇది ఈమధ్యే మళ్ళీ పుస్తక రూపేణా విడుదలైనపుడు కొని రెండు మూడు పేజీలు చదివాకా, ఒహో యిది వరకూ చదివిందే కదా అనుకున్నాను.) కానీ చదివినపుడు మాత్రం వీటి ప్రభావం నా మీద వుందని గుర్తుంది.

అప్పట్లో కడియంలో వుండే వాళ్ళం. పగలల్లా పుస్తకాలు చదవడం, సాయంత్రం ఊరి చివర వుండే రైల్వే స్టేషన్‌కి వెళ్ళి కూర్చోవడం. సౌందర్యంలో ఆ రైల్వే స్టేషన్‌తో పోటీ పడే మరో స్టేషన్ నాకింత దాకా తారసపడలేదు. స్టేషన్‌కి కుడి ఎడమల్లో కొన్ని గుడిసెలు. రెండు మూడు చెక్క బల్లల్తో ప్లాట్ ఫాం, దాని ముందు పట్టాలు, తర్వాత వరుసగా క్షితిజ రేఖ అవధిగా విస్తరించిన పొలాలు, ఒక ప్రక్కన కొండలు, మరో ప్రక్కన దూరంగా జి.వి.కె. ఫ్యాక్టరీ. రైలు వస్తుంటే ఆ కొండల్లో దూరంగా ముందే కన్పించేది. అక్కడ పట్టాలు అక్కడ పెద్ద యూటర్న్ తిరిగివుంటాయి. కడియంలో పట్టాలకున్నంత వంపుతో యూటర్న్ దేశంలో యింకెక్కడా లేదని, రైలు డ్రైవరూ గార్డూ ఎదురుబొదురు నిల్చొని చేతులూపుకోవచ్చనీ అమ్మ చెప్పేది. (కొంత అతిశయోక్తి కావొచ్చు.) సాయంత్రాలు అక్కడకు సైకిల్ మీద పోయి కూర్చునేవాణ్ణి. పుస్తకాలు తీసికెళ్ళే వాణ్ణి గానీ చదవబుద్దేసేది కాదు. ఆలోచించబుద్దేసేది. దేశంలో ఎక్కణ్ణించో మొదలై మరి యే మూలకో పోయే గూడ్సు రైళ్ళు అక్కడ గంటలు గంటలు ఆగేవి. చాలాసార్లు యెక్కేసి అదెక్కడికెళ్తే అక్కడికి అలా అలా పోదామా అనిపించేది. ఒకసారి టికెట్టు లేదని దింపేస్తే అక్కడ దిగిన గెడ్డం సాధువొకడు కనపడ్డాడు. అతని పట్ల కుతూహలంతో స్థానికుడొకతను ప్రశ్నలు వేస్తున్నాడు. వినేవాడు దొరికాడన్నట్టు తన జీవన శైలిని ఉత్సాహంగా చెప్తున్నాడు. నేనూ ఆసక్తిగా ఓ చెవి అటు పడేసాను. మామూలుగా యిలా కాషాయం వాళ్ళని రైలు దింపరట. ఇలా ఒక చోటు నుండి మరొక చోటుకి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు ప్రయాణిస్తుంటాడు. ఏ చోటు నచ్చకపోయినా వెంటనే బిచాణా బదిలీ. కలకత్తాలో మంచి గంజాయి ఎక్కడ దొరుకుతుందో చెప్తున్నాడు. మాటల్లో తెలిసే పోతుంది. అతనికి కాషాయం జరుగుబాటు కోసం మాత్రమే. ఆధ్యాత్మికం మాటటుంచి, ఆదమరపుగా వుంటే జేబు కొట్టేవాడిలా వున్నాడు. కానీ అతని కళ్ళు ఎన్నెన్ని ప్రదేశాలు చూసి వుంటాయోనని నాకు కుళ్ళొచ్చింది. కడియానికి ఓ ప్రక్కగా ఎర్రమట్టితో కొండగుట్టలుండేవి. అపుడపుడూ అక్కడకు సైకిల్ మీద పోయి, క్రిందనుండి చిన్నగా వెళ్తూ కన్పించే రైలుని చూడడం కూడా బాగుండేది. బహుశా ఆ పుస్తకాలూ, ఆ పరిసరాలూ, నాలో యిప్పటి తిరగాలన్న కోరికకు తొలి ప్రేరణలేమో. అయితే, ఒక పిట్ట పోయి పోయి పంజరం ఊచలకి గూడు కట్టినట్టు, నేను తర్వాత హైదరాబాదు వచ్చేసాను.

హైదరాబాదాయణం

నేను వచ్చి పదేళ్ళవుతోంది. ఏ నగర స్వరూపమైనా బయటివాళ్లకి అర్థమైనంతగా స్థానికులకి అర్థమవదని నాకన్పిస్తుంది. ఎందుకంటే స్థానికులు ఎడంగా నిలబడి చూడలేనంత మమేకమైవుంటారు నగరంతో. ‘హైదరాబాదీ’లమని ఉత్సాహపడే వాళ్ల కన్నా హైదరాబాదుని నేను ఎక్కువ చూసానని తెలుసు. మిథికల్ హైదరాబాదుని కాదు, ఇపుడున్న హైదరాబాదుని. దట్టంగా కొట్టిన దాని మేకప్ వెనుక దాగి వున్న ముడతల రహస్యాలన్నీ నాకు దగ్గరగా తెలుసు. నాకు దీని మీద ప్రేమా, విసుగూ రెండూ వున్నాయి. ప్రేమ కన్నా విసుగే ఎక్కువ. ఒకప్పుడు హైదరాబాదుకి నిర్వచనంగా నిలబడిన మైథాలజీ అంతా నేను చూస్తుండగానే కూల్చివేతకు గురైంది. దాంతో పాటే నా ప్రేమ కూడా. ఇపుడిది నిర్మాణంలో వున్న నగరం. వేరే ఏదో కాబోతున్న నగరం. ఒక పేద్ద కన్‍స్ట్రక్షన్ సైటు. యిక్కడ ఖరీదైనతనమూ గరీబుతనమూ తమ వ్యత్యాసాన్ని మరింత కొట్టొచ్చేట్టు పెంచుకున్నాయి. చిత్రంగా అదే సమయంలో ప్రాదేశిక దూరాన్ని మరింత తగ్గించుకుని ప్రక్కప్రక్కనే ఒకదాన్నొకటి వొరుసుకుంటూ కనపడుతున్నాయి. ఒక ప్రక్క షాపింగ్ మాల్సూ, టౌన్‌షిప్పులూ, ఆఫీస్ స్పేసెస్ యివన్నీ బ్రోచెర్లలో కన్పించే ‘tranquil’, ‘idyllic’, ‘state of the art’ లాంటి విశేషణాలకు తగ్గట్టుగా గొప్పగానే వుంటున్నాయి; మరోప్రక్క హెల్మెట్లు తగిలించుని సగం జీవితం ట్రాఫిక్లోనే గడిపే మధ్యతరగతి తలలు బోలెడు వుండనే వున్నాయి. ఆ తలల్లో పుట్టే ఆశల్ని ఆసరా చేసుకుని బోలెడంత నగరం వాటి చుట్టూ పరిభ్రమిస్తూంటుంది; యివికాక వీటన్నింటి మధ్యా, వీటన్నింటి ప్రక్కనే, చోటు దొరికిన చోటల్లా మూలమూలల్లోకీ సర్దుకుపోతున్న బీదతనమూ బోలెడువుంది. నాపరాళ్ళు చెదురుమదురుగా పేర్చిన యిరుకు గల్లీలూ, అటూయిటూ ఆస్బెస్టాస్ కప్పులూ, మంజీరా నీళ్ళ కోసం ఆడాళ్ళ పోట్లాటలూ, ఫ్లాట్‌ఫారాల చివర గుడుంబా పేకెట్ల మత్తులో తమ ఉనికి బాధని మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ శిథిలమైపోతున్న మనుషులు, భుజానికి గోనెసంచులు మోస్తూ చేతిలో పదునైన ఇనుప ఊచని చెత్తకుప్పల్లో గుచ్చి కవర్లు యేరుకుంటూ దిశ లేని కసిని kores కరెక్షన్‌ ఫ్లూయిడ్ల మత్తులో చల్లార్చుకునే బాల్యమూ, నిర్మాణంలోని ఎత్తైన భవనాల చుట్టూ తాత్కాలిక వాసాల్లో నిర్మాణ కూలీల దుమ్మూదూగరా జీవితమూ... యిలా లెక్కకు అందనన్ని దృశ్యాలు పేర్చవచ్చు; యివన్నీగాక మిగిలిన మూలలేమన్నా వుంటే అక్కడ ఒకప్పటి మిథికల్ హైదరాబాదు కృశించి అవశేషంగా వుంది. బయటివాళ్ళకి దుర్భేద్యమైన పాతబస్తీ వీధుల్లోనూ, ఆదివారం కోటీలో రోడ్లవార్న పాత పుస్తకాల పేర్పులోనూ, అపుడపుడూ సాంబ్రాణీ సాయిబు వచ్చి సువాసనలు చిమ్మి వెళ్ళే ఇరుకు కెఫెల్లోనూ తప్ప యిది పెద్దగా ఎక్కడా కన్పించదు. ప్రస్తుతానికి హైదరాబాదు ఏదో మధ్య దశలో వుంది. యీ సంచలనమంతా ఎప్పటికి సద్దుమణుగుతుందో తెలియదు. కానీ సద్దుమణుగుతుంది. యిదంతా ఎపుడోకపుడు ఎకడోకక్కడ నెమ్మదిగా నిలకడ సాధించుకుంటుంది. అపుడు ఆ నిలకడలో మరో కొత్త సంస్కృతి ఆవిష్కరించబడుతుంది. దాని లక్షణాల్ని బట్టి హైదరాబాదుకు కొత్త నిర్వచనాలు ఆపాదింపబడతాయి.

ప్రేమైనా విసుగైనా ఏమైనా హైదరాబాదు యిప్పటికే నాలో భాగం. హైదరాబాదు నాకు నేర్పినవో, లేక నేను హైదరాబాదులో వుండగా నేర్చుకున్నవో, చాలా వున్నాయి. నిత్యం అనిశ్చితి అగాధంపైన దారం పాటి ఆధారాలకి వేలాడుతూ కూడా నిశ్చింతగా వుండటం నేర్పింది. బైటి దాడులనుండి రక్షణలేని నా మునుపటి మెతకదనంపై పెళుసుదే అయినా కాస్త దురుసైన కవచాన్ని తొడిగింది. నాకు కావాల్సినన్ని పుస్తకాలిచ్చింది. నాక్కావల్సినంత సంస్కృతిని చుట్టూ అందుబాటులోకి తెచ్చింది. కానీ నేనే స్వేచ్ఛాభిలాషతో యిక్కడ అడుగుపెట్టానో అది యిక్కడా దొరకలేదు. నాకు మొదట్లో కొత్త బంగారు లోకం అనిపించిందంతా పైమెరుగని తేలిపోయింది. కానీ అసలంటూ నిలబడ్డానికి నిలకడైన ఆధారాన్ని సంపాయించేసరికే యేళ్ళు గడిచిపోయాయి. మధ్యలో తోడుకోసం అనువుగాని తావుల్లో వెతుక్కునే నా వైకల్యమొకటి సగం కాలాన్ని తెలియకుండా దాటవేయించింది. అలా పదేళ్ళు ఆదమరుపుగానే గడిచిపోయాయి. ఈలోగా ఈ నగరపు ఇరుకు నన్ను ఉక్కిరిబిక్కిరి చేయకుండా, నా పుస్తకాలు తాము పొదువుకున్న కథల్లోని కల్పిత లోకాల షరతుల్లేని  పౌరసత్వాన్ని అందిస్తూ నన్నాదుకున్నాయి.

బుద్ధిలో కొత్త పురుగు డ్రిల్లింగ్ ప్రారంభించడం 

గత ఏడాది నావైపుగా నేను ఎదురుచూడని గాలులు వీచాయి. వ్యక్తిగత జీవితంలో కొన్ని మార్పుల వల్ల తరచూ ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి కలిగింది. అవి కూడా గమ్యమున్న ప్రయాణాలు కాదు. ఊరకే ఊళ్ళు పట్టి తిరగాల్సి వచ్చింది. ఎన్నడూ చూడని ఊళ్ళూ, చవక లాడ్జీలు, అపరిచిత చౌరస్తాలు, యిరుప్రక్కలా నిద్రగన్నేరు చెట్లు తలపైన చూరు కట్టిన రోడ్లూ, తంగేడు పూల కొమ్మల వెనక సూర్యాస్తమయాలూ, కొండల చిటారున గుడి గోపురాలూ, నదులూ, వంతెనలూ, పొలాలూ, ఎవర్నో గుర్తు తెస్తూనే వారితో ఏ పోలికలోనూ సామ్యం దొరకని కొత్త మొహాలూ... ఏదో కొత్త తరహా జీవితపు చేలాంచలం ఊరించడం మొదలుపెట్టింది. ప్రతీ చోటా ఒకేసారి వుండాలనిపించడం మొదలైంది. ప్రతీ ఊళ్ళోనూ వుండి దానికే ప్రత్యేకమైన ఆత్మని పరిచయం చేసుకోవాలి. ఆ ఊర్లో మనుషులందరి మనసుల్లోనూ ఆ ఊరి కూడలికీ, ఊర్లో స్కూలు మైదానానికీ, ఊరి మధ్య రథం వీధికీ, ఊరి చివర కొండకీ అన్నింటికీ ప్రత్యేకమైన వ్యక్తిత్వం వుంటుంది, అది నాకు అర్థం కావాలి. నా సొంత ఊరిని ఎలా జ్ఞాపకాల రంగుల్లో వడగట్టి చూస్తానో, అలా ఆ ఊరి వాళ్ళ చైతన్యంతో ఆ పరిసరాల్ని చూడగలగాలి, ప్రేమించగలగాలి. ప్రతీ పరిసరమూ — రైల్వే స్టేషనూ, కాఫీ హోటలూ, లాడ్జీ గది, గుడి మంటపం, ఇళ్ల వరస, చెట్టు కొమ్మల అమరికా — తమ అమరిక ద్వారా ఏదో ప్రత్యేకమైన వాతావరణాన్ని కల్పిస్తాయి, ఏవో కథలు చెప్తాయీ, లేదా ఏవో ఊహాజనితమైన కథలకు సామరస్యంగా ఆతిథ్యాన్నిస్తాయి; వాటన్నిటి సందిటా నేను గడపాలి. ఇడ్లీచట్నీలూ, ఉప్మాపెసరట్లూ, మషాలాదోసెలూ వాటిని చేసే హస్తవాసిని బట్టి చిన్న చిన్న తేడాలతో ఎన్ని రుచులు మారగలవో అన్నీ నా నాలిక మీద పడాలి. తెలియని వాళ్ళతో మాట కలపాలి. తెలియని పక్షుల్ని పేరేంటని అడగాలి. రోడ్డు ప్రక్కన దుమ్ములో సీతాకోక చిలుకల అనాథ కళేబరాల్ని చేతుల్లోకి తీసుకుని వాటి చిరిగిన రెక్కల మీద దేవుడు అదృశ్యలిపిలో రాసిన సత్యాల్ని చదువుకోవాలి. ఒక్కముక్కలో చెప్పాలంటే, నా జీవితాన్ని నా చేతిలో వడిసెల లాగా చేసి, గిరగిరా త్రిప్పి ప్రపంచం మీదకు విసిరేసుకోవాలి. — అని అనిపించడం మొదలుపెట్టింది.

అయితే నేనే కాదు, అలా అనిపించీ ఆ అనిపించడాన్ని అనుసరించిన వాళ్ళు నా చుట్టూ వున్నారు. వాళ్ళ ప్రేరేపణ కూడా తోడైంది. ముఖ్యంగా కాశీభట్ల వేణుగోపాల్. ఆయన కూడా దేశం మీద పడి తిరిగినవాడే. ఒకసారి సైకిల్ మీద తిరిగాడు, మరోమారు కాలినడకన మొత్తం భారతదేశం తిరిగాడు. తిరగడమంటే ఒక చోట స్వస్థలమనేది పెట్టుకుని, ఆ బిందువు నుంచి మనమెక్కడకుపోతే అక్కడిదాకా తెలియని బంధనాల్ని మనసులో నిత్యం భరిస్తూ, మళ్ళీ ఎప్పటికో వెనక్కి చేరిపోతామన్న ఎరుకతో తిరగడం కాదు. కుక్క మెళ్ళో గొలుసు ఊరంత పొడవైందైనా దాని రెండో కొస ఒక గేటుకి తగిలించి వున్నంత వరకూ దాన్ని స్వేచ్ఛ అనలేం. కాశీభట్ల సంగతి వేరు. ఆయన యిల్లన్నది మర్చిపోయాడు. వెళ్ళిన చోటల్లా, వున్నంత సేపూ వున్నదే యిల్లనుకున్నాడు. ఎక్కడ వుంటే అక్కడ ఏవో చిరు ఉద్యోగాలు చేసుకుంటూ, కూడబెట్టిన డబ్బుతో మరో చోటకి పోతూ, మళ్ళీ దాన్నే స్వస్థలమనుకుంటూ... యిలా తిరిగాడు. ఆయన ఆ జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నపుడల్లా నా అంతరంగ యవనిక మీద ఆ ఎన్నడూ చూడని ప్రదేశాల దృశ్యమాలిక తెరచుకొనేది. నా మనసు వాటిలో లీనమైపోగా వర్తమానంలో ఉనికిని మర్చిపోయేవాణ్ణి.

ఈ మధ్యనే ఆయనకి నా భ్రమణకాంక్ష గురించి వెల్లడించాను. అపుడాయన యిచ్చిన సలహా, నేను పూర్తిగా పాటించలేకపోయినా, మంత్రముగ్ధుణ్ణి చేసింది: మొదటి సూత్రం, ఎప్పుడూ ఒంటరిగానే ప్రయాణించాలి. రెండుమూడు జతల బట్టల్తో బయల్దేరి పోవాలి. ఒక నోటు పుస్తకం దగ్గరుంచుకుని తోచినవి రాసుకుంటూండాలి. డెబిట్/ క్రెడిట్ కార్డులు పట్టికెళ్ళకూడదు. రైల్వే స్టేషన్‌ కెళ్ళి, ఫ్లాట్‌ఫాం మీద ఏ రైలు ఆగివుంటే దానికి టికెట్టు తీసుకుని ఎక్కేయాలి. ఏ వూరు ఆకర్షిస్తే అక్కడ దిగిపోవాలి. వూళ్ళోకి పోవాలి. మనుషుల్ని కదపాలి. మాట్లాడాలి. చుట్టూ చూడాలి. ఆ స్థలం పాతబడితే లారీలెక్కి యింకో చోటికి పోవాలి. లారీ వాళ్ళు డబ్బుల్లేకపోయినా బ్రతిమాల్తే ఎక్కించేసుకుంటారట. వాళ్ళకీ దూరప్రయాణాల్లో మాట్లాడే తోడు కావాలనుంటుందట. మళ్ళీ కొత్త ప్రదేశం. పని కావాలంటే ధాభాల్లో సులువుగా దొరుకుతుందట. అక్కడ పని చేస్తూ చుట్టు ప్రక్కల ఊళ్ళు తిరిగి రావచ్చు. డబ్బు సమకూరాకా యింకో స్థలం. ఒకవేళ డబ్బు మరీ లేకపోతే అపరిచితుల్నైనా బతిమాలుకోవచ్చు. చాలామంది చీదరించుకుంటారు, enjoy the humiliation! కొంతమంది ఇస్తారు కూడా. అపుడు మళ్ళీ యింకో చోటుకి.

ఆయన యిలా మాట్లాడుతున్నంత సేపూ నేను ఊహించుకున్న దృశ్యాలు నన్ను ఆ రోజే రైల్వే స్టేషన్‌కి పోవాలనిపించేంతగా ఊపేశాయి. ఎపుడో అలాగే వెళ్తాను కూడా. అయితే ఉద్యోగాన్ని వదిలేయగలిగే పరిస్థితులు యిప్పట్లో లేవు గనుక, ఫ్లాట్‌ఫామ్ మీద వున్న రైలు ఏదైనా ఎక్కేసి వెళిపోగలను గానీ, వెంట డెబిట్‌కార్డు లేకుండా వెళ్ళడమంటే సాధ్యం కాదు. పెట్టిన సెలవు పూర్తయ్యేసరికి ఠంచనుగా వెనక్కి వచ్చేయాలిగా. ఇలా తిరిగే ప్రదేశాల్లో టూరిస్టుల రద్దీ ఉండే ప్రదేశాలకు చోటు లేదు. నలువైపులా ప్రకృతి కమ్ముకుని వున్న ప్రదేశాల పట్ల కూడా పెద్ద మక్కువ లేదు. నన్ను ప్రకృతి ఆకట్టుకుంటుంది గానీ, అదేపనిగా నన్ను పట్టివుంచలేదు. యిపుడు ఫ్రెంచి రచయిత ఫ్లాబె (Flaubert) మాటలు గుర్తొస్తున్నాయి. తక్కువ మోతాదులో అవి నాక్కూడా అన్వయించుకోగలను. ఫ్లాబె తన ఆల్ఫ్ పర్వతాల పర్యటన గురించి మరో ప్రముఖ రష్యన్ రచయిత తుర్గెనొవ్‌కు రాసిన ఉత్తరంలో యిలా పేర్కొంటాడు:
నేను ప్రకృతి పుత్రుణ్ణి కాను. ‘ఆమె అద్భుతాలు’ నన్ను కళలోని అద్భుతాల కన్నా తక్కువ స్పదింపజేస్తాయి. ఆమె నాలో ఏ ‘గొప్ప ఆలోచనల’నూ జాగృతం చేయదు సరికదా నన్ను నలిపేస్తుంది. లోపల్లోపల నాకు ఆమెతో యిలా అనబుద్దేస్తుంది: ‘ఇదంతా బానే వుంది. నేను నీ దగ్గర్నుంచి కాసేపటి క్రితమే వచ్చాను, మరికొన్ని క్షణాల్లో మళ్ళీ అక్కడికే చేరుకుంటాను. కాబట్టి నన్ను నామానాన వదిలేయ్. నాకు వేరే సరదాలు కావాలి’.
పైగా ఈ ఆల్ఫ్స్ పర్వతాలు మనిషి అస్తిత్వ పరిధికి అందని కొలత కలవి. అవి ఎందుకూ ఉపయోగపడనంత పెద్దవి. నాలో అవి ఇలాంటి అసంతృప్తి కలిగించడం ఇది మూడోసారి. ఇదే చివరి సారని ఆశిస్తాను.

నాకు మనుషుల్లోనూ, వాళ్ళు నిర్మించిన నాగరికతలోనూ ప్రకృతితో సమానమైన సౌందర్యం కనిపిస్తుంది. ప్రకృతంతా ఏ నూటపద్దెనిమిది పరమాణు మూలకాల్తో నిర్మితమయిందో, వాటితోనేగా మనుషులు కట్టడాలూ నిర్మితమయింది! అంతా చూసే కళ్లలోనే అనిపిస్తుంది.  ప్రకృతి భారీతనం ఈ విశాలవిశ్వంలో మనిషి అస్తిత్వపు విలువేంటన్నది స్ఫురింపజేస్తుందన్నది నిజమే. కానీ చూసే కళ్ళుంటే, నగరంలో ట్రాఫిక్‌లో వున్నా, తలెత్తి చూస్తే కన్పించే నక్షత్రాలు కూడా నిత్యం మన విలువను మనకు గుర్తు చేస్తూనే వుంటాయి.

మొన్నో రోజు అప్పటికపుడు అనుకుని నేనూ చౌదరిగాడూ కలిసి బైకు మీద శ్రీశైలం వెళిపోయాం. యిది నేను తిరగాలనుకున్న పద్ధతిలో జరిగిన ప్రయాణం కాదు. ఒంటరిగా, బస్సుల్లోనూ రైళ్ళలోనూ, ఎక్కడ కావాలంటే అక్కడ ఆగుతూ, తోచిన ఆలోచనలు రాసుకుంటూ... యిలా సాగుతుంది నేననుకున్న పద్ధతి. కాబట్టి లెక్క ప్రకారం దీన్ని నా తిరిగాలన్న ప్లానులో భాగం చేయకూడదు. కానీ ప్రయాణం ఎంత ఆనందంగా సాగిందనీ! తెల్లారి నాలుగింటికి లేచి తాపీగా బయల్దేరాం. తోచిన చోటల్లా ఆగుతూ పోయాం. పైగా అదేంటో, శ్రీశైలం దాకా రోడ్డంతా మాదే అన్నట్టు అస్సలు జనసమ్మర్ధం లేదు. పదైంది చేరేసరికి. రాత్రి తిరుగుప్రయాణాన్ని మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను. శ్రీశైలం నుండి హైదరాబాదు మొత్తం నూటతొంభై కిలోమీటర్ల దూరమయితే, అందులో ఘాట్ రోడ్డే తొంభై కిలోమీటర్లుంటుంది. యిదంతా నల్లమల అడవుల మధ్యగా సాగుతుంది. ఘాట్‌ రోడ్లో లైట్లుండవు. పైగా మేము వెళ్ళిన రోజు రద్దీ లేదని చెప్పాగా. మొత్తం అంత దూరమూ ఆ కటిక చీకట్లో, ఎడాపెడా భయపెట్టే నిశ్శబ్దంతో దట్టంగా కమ్ముకున్న అడవి మధ్య నుంచి, ముందూ వెనకా మా బైక్ యిచ్చే గుడ్డి వెలుగు తప్ప ఏదీ ఆనని రోడ్డు మీద ఆ రాత్రి మా ప్రయాణం అపూర్వానుభవం. మధ్యలో రెండు మూడు సార్లు బైక్ ఆపేసాం. దాని లైటు కూడా ఆర్పేసాం. ఆ చీకట్లో ఆకాశమంతా దట్టంగా అలుమున్న నక్షత్ర సమూహాన్ని చూస్తూ చాలాసేపు గడిపాం. అంత స్పష్టంగా అన్ని నక్షత్రాల్ని నేనదివరకూ అరుదుగా చూసాను. నల్లమల అడవిలో మొత్తం నూటయిరవై దాకా పులులూ, రెండొందల చిరుతలూ వున్నాయట. ఒకటైనా అటువైపు వచ్చి కన్పించేపోతే బాగుండుననుకున్నాం. కానీ రాలేదు.


May 7, 2011

అమీనా – రీడింగ్ నోట్సు

రచయితగా చలం శక్తిని పరిపూర్ణంగా చూపించే నవల ‘అమీనా’. కొన్ని పేజీల్లో అయితే చలం తన సాహిత్యమంతటిలోనూ మరెక్కడా సాధించలేని ఉన్నతమైన స్థాయిని అందుకున్నాడనిపిస్తుంది. చలం పుస్తకాల్లో ఇదో వింత పుస్తకం. మిగతా వాటితో కలవని పుస్తకం.

‘అమీనా’లో చలం నిజజీవితం ఎక్కువ. ముఖ్యపాత్ర అమీనాతో సహా చాలా పాత్రలకు వాస్తవమైన మనుషులే ఆధారం. కథ కూడా జరిగిందే. కానీ చలం కొంత మార్చి కొంత అటుదిటు చేసి ఏమారుస్తాడు. యిందులో నిజం ఎంత కల్పన ఎంత అనేవి శాతాలు నిర్ణయించి ఖచ్చితంగా విభజనరేఖ గీయలేము. యేది నిజమో యేది కల్పనో, ఆ రోజుల్లో ఆ రాత్రులలో ఆ పేజీల మీద ‘అమీనా’ కథ రాసిన చలానికి తప్ప ఎవరికీ తెలియదు. అది మనకు అనవసరం కూడా. వేరే రచయితలతో పోల్చి చలంలో కల్పనా శక్తి తక్కువని తీర్మానించడానికి ఈ అంశం తోడ్పడుతుందేమో. కానీ ఒకసారి రాసి బయటకు వదిలేసాకా ఆ రచన రచయితను దాటి వచ్చేస్తుంది. అతనితో నిమిత్తాన్ని వదిలించుకుని తనదైన ఉనికిని ఏర్పరుచుకుంటుంది. అది యిక వ్యక్తిగా రచయితకు చెందదు, వ్యవస్థగా సాహిత్యానికి చెందుతుంది. చదివినపుడు పాఠకునికే చెందుతుంది. కాబట్టి రచయిత ఏది కల్పనాశక్తితో రాసాడు, ఏది జీవితంలోంచి తీసి రాసాడు అనేది పాఠకులుగా మనకు అనవసరం. దాని ఆధారంగా పుస్తకం విలువను నిర్ధారించడం అసమంజసం.

నేపథ్యం:

కానీ ‘అమీనా’ కథ వెనుక నిజజీవిత నేపథ్యం తెలుసుకోవడం ఒకందుకు అవసరం. ఇందులో కన్పించే వాతావరణం తెలుగు కథల సగటువాతావరణానికి బహుదూరం. పాత్రలు, వాటి మధ్య బంధాలు అనూహ్యం. చలం ఈ కొత్తని ఎక్కడా పాఠకుల కోసమని విడమర్చడానికి ప్రయత్నించడు. ఏ పాత్ర పూర్వాపరాల్నీ, ఏ బంధాల మూలాల్నీ, ఏ స్థలకాలాల్నీ పరిచయం చేయడు. అందమైన గతాన్ని తన అంతరంగానికి మరోమారు తన కోసమే నెమరువేసుకుంటున్నట్టు కథ చెప్పుకుంటూ పోతుంటాడు. ఇది ‘అమీనా’ మొదటి కొన్ని పేజీల్లో పాఠకుల గందరగోళానికి కారణమవుతుంది. ఎవరు ఎవరో, వారెందుకిలా వున్నారో అర్థం కాదు. రెండో పఠనంలో మాత్రమే దీన్ని ఆసాంతం అనుభవించగలరు. అందుకే, కథ వెనుక నిజ జీవిత నేపథ్యాన్ని తెలుసుకోవడం ఈ అయోమయాన్ని కాస్త తగ్గిస్తుంది.

1915లో తన ఇరవయ్యొకటో యేట బ్రహ్మసమాజ సభ్యత్వం తీసుకున్ననాటి నుంచి మొదలు చలం జీవితం సంఘంపోయే త్రోవ నుంచి కొంతకొంతగా విడివడుతూనే వచ్చింది. సంస్కర్త రఘుపతివెంకటరత్నం నాయుడుగారి శిష్యుడైన చలం ఆయన ఆధ్వర్యంలో కాకినాడ బ్రహ్మసమాజానికి సెక్రటరీగా పనిచేశాడు. స్నేహితులైన రామ్మూర్తి, ప్రకాశం, కవి కృష్ణశాస్త్రి యిలా యితర యువకుల్తో కలిసి బ్రహ్మసమాజం ఆదర్శాల్ని ప్రచారం చేసేవాడు. భార్య కూడా అతనితో చేదోడువాదోడుగా నడిచింది. కానీ చలం స్త్రీ యావ తొందర్లోనే అతణ్ణి బ్రహ్మసమాజానికి కూడా వెలిపడేట్టు చేసింది. స్నేహితుడు రామ్మూర్తి మరదలు రత్నమ్మతో అతని సంబంధం బయటకు పొక్కి అతణ్ణి బ్రహ్మసమాజం నుంచి వెలివేసారు. అతనికి కూడా బ్రహ్మసమాజ ఆదర్శాల్లో నమ్మకం పోయింది. అతని సూటి ప్రశ్నలకు నిలవలేని ప్రతీ నీతినీ త్యజిస్తూ వచ్చాడు. అరాచక జీవితం వైపుకు నడిచాడు. కులం విడిచాడు, మతం విడిచాడు, తత్ఫలితంగా బంధువులకూ దూరమయ్యాడు. సంఘపు పొలిమేరల్లోకి నెట్టబడ్డాడు. అతనిలాంటి మానసిక నిర్మాణం గల కొందరు స్నేహితులు మాత్రమే అతనితో మిగిలారు. చలంలో రచయిత అంశ చిన్నప్పట్నించీ వుంది. అది యిప్పుడు ఉబికి యివతలకి వచ్చింది. లోపలి గోడల్ని కూలదోయగా ఏర్పడిన నైతిక వైశాల్యం అతని రచనలకి పదునైన శక్తి నిచ్చింది. పొలిమేరల్లోనే నిలబడి రచనల్ని సంఘంవైపుకు విసరడం ప్రారంభించాడు. స్త్రీ పట్ల విపరీతమైన కుతూహలమూ ఆకర్షణా అతనికి స్వభావపరంగా సహజాతం. ఆధ్యాత్మిక పరంగా అన్ని కట్టళ్ళనూ ఛేదించిన తర్వాత, భౌతికంగా ఈ విషయంలో మాత్రం ఏ కట్టళ్ళకైనా ఎందుకు బద్ధుడై వుండాలో అతనికి సమాధానం దొరకలేదు. స్వేచ్ఛాప్రణయం వైపుకు మళ్ళాడు. స్నేహితులు రామ్మూర్తీ, ప్రకాశం లాంటి వాళ్ళు అతనికి తోడు. కంచె దూకే సాహసంలోని ఆనందం వీళ్ళ జీవితాల్ని ఈ సమయంలో నడిపిస్తూ వచ్చింది. ఈ విశృంఖల జీవితమే అమీనా నేపథ్యంలో కన్పించేది. చలం 1921లో స్కూలు హెడ్మాస్టరుగా హోస్పేటలో ఉద్యోగంలో చేరాడు. ఆ ఏడాదే మొదటి నవల శశిరేఖ రాసాడు. తర్వాత రాజమండ్రీ, బందర్లలో కొన్నాళ్ళు పన్చేసి 1926లో ఏలూరు బదిలీ అయి వచ్చాడు. అమీనా కథా స్థలం ఏలూరే.

అమీనా నవలను చలం రెండు విడతలుగా రాసాడు. మొదటి భాగం 1928లో మొదలుపెట్టి మధ్యలో ఆపేసాడు. మళ్ళా పద్నాలుగేళ్ల విరామం తరువాత 1942లో మిగతా కథ పూర్తి చేసాడు. అయితే చాలామంది 1924లో కథ మొదలుపెట్టినట్టు పేర్కొనడం చూసాను. అది తప్పు. చలం ఏలూరు వచ్చింది 1926 ప్రాంతాల్లో. ఏలూరు లేకపోతే ఈ కథలేదు. నిజజీవితంలోంచి వచ్చి ఈ కథలో పాత్రలుగా మారిన ఎంకిపాటల నండూరి సుబ్బారావు, అమీనా, మరో పాత్ర విమల... వీళ్ళంతా ఏలూరు వచ్చాకనే చలం జీవితంలోకి ప్రవేశించారు. నండూరి సుబ్బారావు మరణించిన తర్వాత చలం ఆయనతో తన జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ 1961లో రాసిన “కవి హృదయం” అనే వ్యాసంలో ఈ విషయం తెలుస్తుంది. యిందులోనే అమీనా, విమల, ప్రస్తుత కథా పరిసరాల ప్రస్తావనా వుంటుంది. ఇది చదివినా అప్పటి చలం జీవితం ఎలా వుండేదో ఒక ఊహా చిత్రం స్ఫురిస్తుంది:
1926 ప్రాంతాలు. [నాకు] ఏలూరు బదిలీ అయింది. అప్పటినించీ సుబ్బారావుగారికీ, [నాకూ] స్నేహం మొదలు. ... అప్పటికింకా సుబ్బారావుగారు పెద్ద వకీలు కాలేదు. ‘కుదేలు’ అంటో చీట్ల పేకలు ఆడుతో వున్నారు. నేను వెళ్ళి పిలవగానే నాతో వొచ్చేసేవారు. నా యిల్లు, నా సహవాసాలు, నేను తిరిగే చోట్లు (రోడ్డు) అన్నీ మర్యాదకి గౌరవానికి దూరం. కాని నా కోసం ఆయన నా వెంటవచ్చి, నా అమర్యాద కథల్ని ఆప్యాయతతో వినేవారు. నాకోసం, నా సహచరులైన స్త్రీలని చూసి బెదరలేదు. ఊరిబైట అపవిత్రమైన ఇళ్ళల్లో నేను ఉండడం పరిపాటి అయినా, తక్కిన మిత్రుల వలె, నా యింటకి రావడానికి సంకోచించలేదు. నీతి బాహ్యులైన నా స్త్రీ మిత్రుల దీనచరిత్రల్ని విని వారికి సలహాలనిచ్చి, అవసరమైనప్పుడు సహాయపడేవారు కూడా. ఆనాటి ఆచార ప్రకారం, అవసర ప్రకారం, నా ఇల్లు రైలుస్టేషన్ వేపు వూరి చివర వుండేది. మైదానం దాటితే ఏరు. ఆ ఏరు మీద వూగే తీగల వంతెన. వంతెన అవతల తోటలు. తోటకీ ఏటికీ మధ్య ఏటిలో ప్రతిఫలించే కంచె. దాని వెనుక బోర్డింగు. బోర్డింగు మర్యాదల ప్రకారం దాంటో సగం కైదు పడ్డ విమల. ఆనాటికీ ఈనాటికీ ఆ దుమ్ము ఏలూరుకి అదొక్కటే (beauty spot) అందమైన స్థలం. బోర్డింగుకి ఎదురుగా ఏటి అవతల గట్టున ఓ మామిడి చెట్టు. సాయంత్రం అయిందా ‘ఆ చెట్టునిండా’ మిణుగురు దీపాలు. ఆ ఏటి చివర, రోడ్డు వంతెన పక్కనే అమీనా గుడిశ. ... 
ఆ విధంగా తిప్పాను, కొన్ని వందల ఏళ్ళకిగాని జన్మలేని ఆ మధుర శృంగార కవిని, ముసల్మాన్ వీధుల, క్రిస్టియను గొందుల, చీకటి సందుల, ఏటిగట్ల పైన, దుమ్ము రోడ్లపైన. తరచూ వొచ్చేవారు మిత్రులు నాతో నా మొండి గోడల యింట్లో గంతులెయ్యడానికి. రామ్మూర్తీ, రత్నమ్మా సరేసరి. ప్రతీసారీ వొచ్చి నా మిత్రులకి, విసుగనకండా వినిపించేవారు తన పాటల్ని సుబ్బారావుగారు. ఎంతో సహృదయంతో, బాధతో పదునెక్కిన అభిలాషతో, ఆయన పాటల్ని ప్రేమించే అనామకులు యువతీయువకులు, అతని పాటలకి కళ్ళు చెవులప్పచెప్పి వింటో, మధ్య ఆపుతో, పాడిందే పాడిస్తో, స్వేచ్ఛగా comment చేస్తో, parody చేస్తో, పాటల్లో, పాడే విధంతో stressesలో సరదాకి మార్పులు సూచిస్తో, పాటలు అంతరార్థాలు, పుట్టుకలు, మర్మాలు, వ్యంగ్యాలు ప్రశ్నిస్తో, నవ్వుతో, కళ్ళనీళ్ళు పెట్టుకుంటో, ప్రియులు ఒకరివంక ఒకరు చూసుకుంటో – యెటువంటి రాత్రులు, అర్థరాత్రులు గడిపామో!
***
1946 ప్రాంతాల నాకు మళ్ళీ మూడోసారి ఏలూరు బదిలీ అయింది. ... కాని, ఎంత భేదమో! ఎంకి లేదు. తీర్థయాత్రలు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏటివొడ్డుకి రాదు. విమల చచ్చిపోయింది. అమీనా యెదిగి ఏళ్ళల్లో మాయమైంది. “పోయి పాడో అంటె/ ఓ యంట పలికేని-” ఆ ఏటి గట్టున బావి, మిణుగురుల మామిడి చెట్టు లేదు. మిణుగురులు లేవు.
కథ:

ఈ “ఎదిగి ఏళ్ళలో మాయమవడ”మనే పదం అమీనా నవల అంకితం పేజీలో కూడా వస్తుంది:
ఏళ్ళలో ఎదిగి
వాకిట్లో నుంచుని, వొచ్చానంటే,
చిన్నప్పటి నీ వొంటి బురదని
కావలించుకున్నా,
పెద్దైన నీ మనసు మీద
లోకం చిమ్మిన మాలిన్యాన్ని
అంగీకరించలేని
చలం
అవమానానికి
లోకపరత్వానికి
పరిహారంగా
నీకు, అమీనా,
ఈ పుస్తకం.
కథ మొత్తం చదివాకా ఈ అంకితం మరోసారి చదివితే యిందులోని విషాదం హృదయాన్ని మెలితిప్పుతుంది. కౌమారం తొలిలో యింకా పసి ఛాయలు వీడని తురక పిల్ల అమీనా. చుట్టూ పెద్దతనపు కపటత్వంతో చిక్కుపడ్డ రచయిత అమీనాలోని పసితనాన్ని ప్రేమిస్తాడు. అయితే ఆమె ప్రేమ తిరిగి స్వచ్ఛంగా, ముసుగుల్లేకుండా, పదునుగా అడిగే బలిదానాల్ని భరించలేకపోతాడు. తనతో కలిసి దాటమనే మర్యాద హద్దుల్ని దాటలేకపోతాడు. చివరికి దూరం చేసుకుంటాడు. ఆమె జ్ఞాపకాన్ని ఇపుడు వెనక్కి తిరిగి చూసుకుని కథగా చెప్తుంటాడు.

మన జీవితంలో చాలా జ్ఞాపకముండిపోయే అనుభవాల్లాగే ‘అమీనా’లో కూడా కథగా చెప్పేందుకేమీ పెద్దగా లేదు. రచయిత ఏలూరులో ఏటి వొడ్డున సంఘ మర్యాదకి దూరంగా ఒక మొండిగోడల యింట్లో వుంటూంటాడు. అతనితో పాటు కథాప్రారంభం నాటికి మరో ముగ్గురు స్నేహితులు వుంటారు. రామ్మూర్తీ, తాతా (అనిపిలవబడే యువకుడు, బహుశా ప్రకాశం) వీరిద్దరూ ఏవో పరీక్షలు రాయడానికి రాజమండ్రి నుండి యిక్కడికి వస్తారు. సత్య అనే అమ్మాయి భర్తకి మస్కా కొట్టి వస్తుంది. ప్రేమించిన శర్మని కలవడానికి ఈ యింటిని వేదికగా చేసుకుంటుంది (కానీ అతను కథ చివరి వరకూ రాడు). ఈ ముగ్గురూ కాక, రచయిత ‘జీవం’ పేరుతో ప్రస్తావించే, బహుశా రచయితను ప్రేమించే ఒక పనిమనిషి కూడా ఆ యింట్లో వుంటుంది. రచయిత భార్య సుబ్బులు వూరెళ్ళింది కథ చివరిదాకా రాదు. ఈ నలుగురూ కలిసి ఆటలూ పాటల్తో తాత్కాలిక మోహాల్తో రోజులు అల్లరచిల్లరగా గడుపుతుంటారు. నండూరి సుబ్బారావు గారు కూడా వీరితో కలుస్తుంటాడు అపుడపుడూ. తన ఎంకి పాటల్తో వీరిని రంజింపజేస్తుంటాడు. ఏటి వొడ్డుకు అవతల క్రిస్టియన్ బోర్డింగులో వుండే విమల మరో పాత్ర. ఆమె రచయితకు పాత ప్రేయసి. ఆమె ప్రస్తుత ప్రేమికుడు శ్రీమన్నారాయణ ఆమెను కలవటానికి కలకత్తా నుండి వచ్చి రచయిత ఇంట్లోనే బస చేస్తాడు. మోహ ప్రధానంగా నడిచే వీరందరి జీవిత వైనాల్ని నవల్లోని ఈ పేరా క్లుప్తంగా చెప్తుంది:
పొద్దుబోక, బహుత్వ చపలత్వం చేత, ఏదో వారం వారం కొత్త అనుభవాల్ని వెతుక్కోవడం ... – నాలుగు చూపులూ, ఇంకా సాహసం వుంటే నాలుగు ముద్దులూ, ఇరుకు మెట్ల మీద బుజాలు రాసుకోవడమూ, జట్కాలోంచి పడే భయంతో మెడలు పట్టుకు వేళ్ళాడ్డమూ, గట్లెక్కుతో పట్టుకున్న చేతుల్ని వొదలక పోవడమూ, సినీమా చీకట్లో నడుములు కావిలించుకోవడమూ, సాముద్రికం చూడడానికి చేతులు వెతికి ప్రేమగాధలు సూచించడమూ, దొంగ భయాల నుంచి, రాని దొంగల నించి రక్షించి కావిలించుకోవడమూ, ప్రేమ పద్యాలూ పాఠాలూ చెప్పి అన్వయించుకోవడమూ, ఇంతలో ప్రయాణమూ, ఇతరుల అనుమానాలో, భర్త జాగ్రత్తో, వేరే ఆకర్షణో విడిపరచటమూ, ఒకర్నొకరు మరిచిపోవడమూ, కొత్త అనుభవాల కోసం మళ్ళీ ప్రయాణం కావడమూ, అవన్నీ కులాసాగా, ఏ సంస్కారాన్నీ, బాధనీ, జ్ఞానాన్నీ యివ్వకుండా, దినాలకు తేలిక రంగులు వేస్తో గడిచిపోయాయి.
ఇలా తేలికగా రోజులు గడిపేస్తూన్న రచయితకు ఒక రోజు యేటి గట్టున అమీనా తారసపడుతుంది. అమీనా స్వేచ్ఛాజీవి. యిల్లు వుంటుంది గానీ యెక్కువ బయటే తిరుగుంటుంది. యింట్లో వున్న అమ్మ తన సొంత అమ్మ కాదంటుంది. కోపమొస్తే అపుడపుడూ యింట్లోంచి పారిపోయి వస్తూంటుంది. యింట్లో వాళ్ళు ఆమెను వదిలేసి ఊరెళిపోతే ఏటి బురదలో తాటాకుబుట్టలో చేపల్ని పట్టి వండుకుతింటూంటుంది. బహుశా రచయిత చుట్టూ కనిపించే కులాసా జీవితానికి ఆకర్షితురాలై అనుకుంటా, వాళ్ళతో వుంటానంటుంది. వాళ్ళు పేరుతో అనకపోయినా నౌకరుగా తీసుకుంటారు. కానీ అమీనాలోని స్వేచ్ఛా రక్తం స్నేహంతోనే వాళ్ళకు వొగ్గుతుంది గానీ, మర్యాదకు ఇచ్ఛకు ఏ భంగాన్నీ సహించదు. వాళ్ళకు కిళ్ళీలూ సిగరెట్లూ తెచ్చిపెడ్తూ, టీలు సరఫరా చేస్తూ, యింటి పనులెన్ని చేసినా, స్నేహంలో మాత్రం సమాన హోదా కావాలి. జీతం కూడా ఆమెకు అక్కర్లేదు. ఆమె పసి వైనాలకూ, పాడే పాటలకూ అంతా ఆమె పట్ల ముగ్ధులవుతారు. ఆమెతో అక్కడ ఒక కొత్త పండగ వచ్చినట్టు అవుతుంది. రచయిత తన పట్ల చూపుతున్న ప్రత్యేకాభిమానానికి అతని పట్ల ఆకర్షితురాలవుతుంది. అతణ్ణి తనవాడుగా నిర్ధారించేసుకుంటుంది.

రచయితకు కూడా తన చుట్టూ వున్న ప్రౌఢత్వపు కాపట్యం, మర్మావయవాల చుట్టూతా తిరిగే దొంగ మోహాలూ, జెలసీలూ వీటన్నింటి మధ్యా అమీనాలోని స్వచ్ఛత ఒక అందుకోవాల్సిన ఆదర్శంగా కన్పిస్తుంది. వీటన్నింటి నించీ తనను కాచుకునేందుకు ఆమె ఒక ఆశ్రయంగా కన్పిస్తుంది. తన చుట్టూ వున్న మర్యాదస్తుల విదూషకత్వానించి, పెద్దతనపు క్రూరమైన శృంగారపుటాటల్నించీ, లోపల్లోపలేవో తెలియని లెక్కల్తోఅంచనాకు చిక్కని ప్రౌఢ స్త్రీ ఆంతర్య ప్రహేళికల్నించీ, నిలబడటానికి ఏ నికార్సైన ఆధారాన్నీ దొరకనివ్వని ప్రేమలోని అభద్రత నించీ... అమీనా ఒక్కతే — లోపల ఏమున్నా అదే పారదర్శకమైన సరస్సులా అంతా బయటికి చూపించేసే పసి అమీనా ఒక్కతే — ఆమె జ్ఞాపకం ఒక్కటే విముక్తిగా కనిపిస్తుంది.

కానీ అమీనా బయటపడినంత పూర్తిగా రచయిత బయటపడడు. అమీనా పట్ల ముసుగులేకుండా ప్రవర్తించే వీలు అతనికి లేదు. తాను పెద్దవాడు. ఆమె చిన్నపిల్ల. తను మర్యాదగల ఉద్యోగస్తుడు. ఆమె చేపలు పట్టుకుతినే వీధి పిల్ల. తామిద్దరి మధ్యా పరస్పరం మౌనంగానే అంగీకృతమైన బంధాన్ని అతను బయటి ప్రపంచానికి ఒప్పుకోలేడు. నిజానికి ఆమె దగ్గర కూడా గుంభనగానే గణించుకుంటూనే బయటపడతాడు. ఆమె తనకెవరో తన మనసుకే సరైన సమాధానం చెప్పుకోలేకపోతాడు. అమీనాలో మాత్రం ఈ సందిగ్దాలేమీ వుండవు. తనకు లోపల ఏముందో అదే చూపించేస్తుంది. ఇతర స్త్రీ మిత్రులతో అతని సాన్నిహిత్యాన్ని భరించదు. “డాక్టరు గారు” పేరిట కథలో ప్రవేశించే చలం వదిన “వొయ్యి” రాక గురించి తెలిసినపుడు అతను ప్రదర్శించే ఉత్సాహం ఆమెకు నచ్చదు. అందీ అందక రచయితను యాతనకు గురిచేసే అతని మరో ప్రేయసి శ్యామలను కూడా ఆమె కాసేపే ఇష్టపడుతుంది. వాళ్ళిద్దరి మధ్యా ఏదో వున్నదని తెలియగానే, ఆమె వల్ల రచయిత బాధపడుతున్నాడని తెలియగానే, ద్వేషించడం మొదలుపెడుతుంది. కాని రచయిత సాంగత్యంలో ఆమెకు అందాల్సిన హోదా ఎప్పటికీ ప్రకటితమవదు. బయటివాళ్ళకి ఆమె అతని నౌకరు అంతే. కథ చివర్లో ఊర్నించి రచయిత భార్య సుబ్బులు వస్తుంది. యింట్లోకి రాగానే కుర్చీలో పడుకున్న ఈ మురికి పిల్లను చూసి “ఎవరని” అడుగుతుంది. “నువ్వెవర”ంటుంది అమీనా. ఆమె గీర చూసి కొట్టి పంపేస్తుంది సుబ్బులు. మర్యాద భంగాన్ని సహించలేని అమీనా మళ్ళీ తన గుడిసెకు వెళిపోతుంది. యేటి బురదలో మునుపటిమల్లె చేపలు పట్టుకుంటుంది. రచయిత వెతికి పట్టుకుంటాడు. ఎంత బతిమాలినా రాదు.
“ఆమె వుంటే నేను రాను. ఎన్నటికీ రాను. నన్ను కొట్టింది.”
“ఆమె ఎప్పుడూ వెళ్ళదు”
“నేను ఎప్పుడూ రాను”
“మరి నిన్ను చూడకుండా నేను—"
తలతిప్పి నా కళ్ళలోకి చూసింది.
“మరి నిన్ను చూడకుండా నేనూ...”
నీ సంగతి సరే. నా సంగతేమిటంటున్నాయి ఆమె కళ్ళు...
కొన్నాళ్ళకు అమీనాకు ఒక ముసలవాడితో పెళ్లి కుదిరిందని తెలుస్తుంది. ఆమె గుడిసెలోంచి యేవో గొడవలు కూడా వినవస్తూంటాయి.

ఒకరోజు ఏడుస్తూ పరిగెత్తుకుంటూ రచయిత ఇంట్లోకి, అతనున్న గదిలోకి వచ్చేస్తుంది అమీనా. అతణ్ణి కౌగలించుకుంటుంది. తనకో చీరె కొనిపెట్టమంటుంది. అప్పటిదాకా ఏదో భావుకత్వపు లోకాల్లో అమీనాను పూజించే రచయితకు ఈ ఫక్తు భౌతికమైన కోరికను అంగీకరించలేకపోతాడు. అతనిలో లౌకికుడు మేల్కొంటాడు. తన సరిహద్దు గోడలు ఎక్కడ అక్రమ చొరబాటుకు గురికానున్నాయోనని తల్లడిల్లే మామూలు మర్యాదస్తుడు తలెత్తుతాడు. ఆమె అతని పొట్టపట్టుకు వెక్కిళ్ళు పడుతుండగానే, ఎందుకు ఆమెకు చీరకొనివ్వాలో తర్కించుకుంటాడు. అందరూ ఏమనుకుంటారో ఊహిస్తాడు.
“ఏమిటి అమీనా! ఎందుకు ఇస్తాను నీకు చీరె? ఎందుకు ఇయ్యాలి?”
నా మొహంలోకి ఒక్క చూపు.
నా నడుం నుంచి ఒక్క తోపు.
గుమ్మంలో అమీనా.
కంఠం వొణుకుతో, కాళ్ళు ఎండవేడిలో వూగుతో —
మనుషుల్లో, మంచితనంలో, ఔదార్యంలో, కుంగి, నలిగి, విశ్వాసం నశించి, చాల సిగ్గుతో —
“పోనీ... పోనీ... నా జీతం... ఇవ్వండి...”
ఆమెకు జీతం ఇచ్చేసి పంపేస్తాడు. “అమ్మా!... వెళ్ళింది తిట్టకుండా పోయింది. ఎంతయినా తురకాళ్లని నమ్మడానికి వీల్లేదు” అని ఊపిరిపీల్చుకుంటాడు కూడా.

కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ప్రత్యక్షం. ఎందుకొచ్చిందో అని రచయిత భయపడుతుండగానే, తన కొత్త వోణీ చూపించి బాగుందా అని అడుగుతుంది. “మీరిచ్చిన డబ్బులతో... కొన్నాను. రెండు గజాలే వచ్చింది... మీ జ్ఞాపకానికి” అంటుంది. అతనిలో ఏదో కదులుతుంది, కరుగుతుంది. ముందుకు రాబోతాడు. తను వెళ్ళిపోతున్నానంటుంది. ఎక్కడికంటే దిగంతం వైపు చూస్తుంది. ఎందుకు అంటే యింట్లో వెళ్లాకొట్టారంటుంది. అంటూ పరిగెత్తుకు వెళిపోతుంది. ఆగమని వెనకాల వెళ్తాడు. కానీ, వీధిలోకి వచ్చేసరికి, అతనికి —
గడ్డిబండి అడ్డం – మర్యాద కట్టుకున్న నా కాళ్ళే అడ్డం. చదివి చదివి గుడ్డివైన నా కళ్ళే అడ్డం. సబ్బుతో కడుక్కున్న నా చేతులే అడ్డం.
అమీనా! అమీనా!
రోడ్డు మలుపు. సైడు కాలువ. బురద.
అస్తమించే సూర్యుడు. కళ్ళలో చీకటి.
అంతే అమీనా!
జన్మానికి ఆఖరు నా చిన్న అమీనా!
ఎదగని పువ్వు నా అమీనా!
అంటూ కథ ముగుస్తుంది.

శైలి:

కథ మొత్తం నాలుగు అధ్యాయాలుగా వుంటుంది. మొదటి రెండు అధ్యాయాలు 1928లోనూ, తర్వాతి రెండు అధ్యాయాలు 1942లోనూ రాసాడు. కథ చదువుతున్నపుడు మాత్రం ఈ రెండు భాగాల మధ్యా యింత కాలభేదం వుందని మనకేమీ అనిపించదు. కథా వస్తువుకూ రచయితకూ మధ్య సాన్నిహిత్యమూ ఏమీ మారినట్టనిపించదు. నిజానికి దూరమైన కొద్దీ మరింత తీవ్రమైన జ్ఞాపకమో ఏమో, కథకు చలం మరింత చేరువై కనిపిస్తాడు. శైలిలో ఈ మార్పు స్పష్టంగా కన్పిస్తుంది. మొదటి రెండు అధ్యాయాలూ మన (పాఠకుల) సాక్షిగా రచయిత తన పాత కథని నెమరు వేసుకుంటున్నట్టు వుంటాయి. అంటే పాఠకులున్నారన్న విషయం కాస్త పట్టించుకుంటాడు. వాళ్ళ ఉనికి పట్ల కాస్తో కూస్తో ఖాతరు కనిపిస్తుంది. అప్పుడు కూడా పాఠకుల్ని పాంపర్ చేస్తూ పూర్తి వివరాలు ఇవ్వడం వుండదు. జీవితంలోలాగానే intelligible obscurity వుంటుంది. అయినా రచన మాత్రం కాస్తో కూస్తో సగటు కథా సంప్రదాయాల్ని పాటిస్తూ సాగుతుంది. మూడో అధ్యాయం నుండి మాత్రం అంతా మారిపోతుంది. రచయిత తనలో తాను కథను గొణుక్కుంటున్నట్టు వుంటుంది. పాఠకుని సంగతి దాదాపు వదిలేస్తాడు. కానీ ఈ వదిలేయడంలోనే మనం రచయితకు మరింత చేరువవుతాం. అతనిలోకి వెళ్ళిపోతాం. రచయిత అంతరంగమనే చీకటి థియేటర్లో అతని మనోఫలకమనే తెరపై కథలాడే బొమ్మల్నీ, వాటికి వ్యాఖ్యానంగా నేపథ్యంలో వస్తోన్న అతని గొంతునీ అతిసన్నిహితంగా లీనమై వింటాం. ఎక్కడా పాత్రల పూర్వాపరాలుండవు, ప్రదేశాల వర్ణనలుండవు, సంభాషణలు కూడా అక్కడ జరిగిన అసలు సంభాషణల్ని క్లుప్తంగా సూచించే చిహ్నాల్లా వుంటాయి. మనకు మనం ఏదైనా జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటున్నపుడు కూడా యింతే కదా! అందులో భాగమైన మనుషుల పుట్టుపూర్వోత్తరాల్ని మనకి మనం పరిచయం చేసుకోం, అందులో వచ్చే ప్రదేశాల్ని మనకి మనం వర్ణించుకోము. అలాగే యిదీను. కథ పూర్తిగా రచయిత అంతరంగ చైతన్యంగా మారిపోతుంది. ఈ చైతన్య స్రవంతి మామూలు వాడిది కాదు కాబట్టి, చలం లాంటి రచయితది కాబట్టీ, ఒక్కోసారి ఇది వచనపు తీరైన దారుల్ని దాటుకుపోయి అచ్చమైన కవిత్వంగా మారిపోతుంది. పైపై పొరల్నంటినీ ఛేదించి జీవితాన్ని అతి దగ్గరగా దాని సారంతో అనుభూతించడం కవిత్వమయితే, జీవితాన్ని అనాచ్ఛాదితం చేసి కావలించుకుని దాని హృదయస్పందనను మనసంతా శ్రవణేంద్రియంగా చేసి ఆన్చి వినడం కవిత్వమయితే, ‘అమీనా’లో చాలా కవిత్వం వుంది. ఉన్నతమైన కవిత్వం వుంది.

మామూలు కవులు కవిత్వంతో తీసికెళ్లలేని జీవితపు అరుదైన మూలల్లోకి కూడా, ఇలా వచనం మధ్యలో కవిత్వాన్ని పొదగగలిగే రచయితలు యింకా సులభంగా తీసికెళ్ళగలరనిపిస్తుంది. ఎందుకనిపిస్తుందో చెప్తాను. కవులు తాము అనుభూతించిన భావోద్వేగాల్ని కవితలుగా మలుస్తారు. ఈ భావోద్వేగాలు స్వయంసమృద్ధమై వుండడమన్నది వారు వ్యక్తీకరణకు ఎంచుకున్న కవిత అనే నిర్మాణాపద్ధతికి తప్పనిసరి. అంటే కవిత మొదలయి ముగిసేలోగా కవి చెప్పదల్చుకున్న భావోద్వేగమేమిటన్నది అక్కడ ఆసాంతం పరవబడాలి. ఈ స్పష్టమైన ఫ్రేమ్‌‍వర్కూ, నిర్మాణ నియమాలూ, పదలయను దృష్టిలో పెట్టుకోవలసి రావడాలూ, క్లుప్తతావసరమూ... యివన్నీ కలిసి కవి తన కవితా వస్తువుల్ని ఎన్నుకోవడాన్ని కొంతవరకూ ప్రభావితం చేస్తాయి. ఇలా నిర్ణీత ఫ్రేమ్‌వర్కులోకి తీసికెళ్ళి పెట్టాల్సిన తన అనుభవమూ, భావోద్వేగమూ ఎంతో కంత విలువైనవే అవ్వాలని కవి మనసులో పడుతుంది. ఏదో ఏకోన్ముఖత సాధించాలని తపన పడతాడు. జీవితానికి విలువైన వ్యాఖ్యానాలు చేయాలనీ, నిర్వచనాలు ఇవ్వాలనీ, ఏదో ఒక సత్యాన్ని సూచించే పదచిత్ర సమూహాన్ని పేర్చాలనీ, లేదా ఏదో ఒక పదచిత్రం సూచించే సత్యాన్ని స్ఫురింపజేయాలనీ యావలో పడతాడు. కానీ జీవితంలో ఎల్లెడలా వెదజల్లబడి వున్న stray detail వైపు అతని చూపు మళ్ళదు. ఏ ఏకత్వానికి అందని జీవితపు అగణిత బహుముఖత్వం అతనికి పట్టదు. ఈ బహుముఖత్వాన్ని తెలుగులో కవుల కంటే సులువుగా, చలం లాంటి సమర్థులైన కథా రచయితలే స్ఫురింపజేయగలిగారనిపిస్తుంది. ఎందుకంటే కథా ప్రపంచపు ఫ్రేమ్‌వర్కు మరింత విశాలం. జీవితమంత విశాలం. అది స్పష్టమైన పాత్రలతో, ప్రదేశాలతో, పేర్లతో, సంభాషణలతో, స్వభావాలతో సృష్టింపబడుతుంది. అక్కడ జీవితం నుంచి ఎన్నుకున్నవి కాదు, జీవితాన్ని యధాతథంగా పరచడం లక్ష్యం. అందుకే వారి పని సులభం. పరస్పరం ఐక్యత లేక ఎల్లెడలా వెదజల్లబడ్డ వివరాల్ని తీసుకొచ్చి పెట్టినా కూడా, ఎబ్బెట్టుగా అన్పించని ఒక స్థానాన్ని వాటికి కేటాయించగలిగేంతటి విస్తృతమైన ఫ్రేంవర్కు వారికి వుంది. అందుకే కవి ఇముడ్చుకోలేక వదిలేసే వివరాలు కథకుడు ఇముడ్చుకోగలడు. కవులు ఎన్నుకునే వివరాల్లా అవి దేనివైపూ సూచించకపోవచ్చు. కానీ ఎటూ చూపని ఈ జీవితానికి ప్రాతినిధ్యం వహించగలిగేవి ఈ ఎటూ చూపని వివరాలే. నిజానికి కవులు చేయాల్సినదీ ఇదే. జీవితానికి ప్రాతినిధ్యం వహించడమే. సమర్థులైన కవులే అది చేయగలరేమో. ఇదంతా అల్టిమేట్‌గా ఆయా రచయితల, కవుల సమర్థత మీదే ఆధారపడివుందేమో. ఏదిఏమైనా తెలుగులో నాకు కథారచయితలు చూపించినన్ని జీవితపు మారుమూలల్ని ఏ కవీ యింతదాకా చూపించలేదూ అన్నది మాత్రం చెప్పగలను.

ముఖ్యంగా అమీనాతో చలం ఆ పని చేయగలిగాడు. ఈ కథలో మూడో అధ్యాయం నుండి వచనం అక్షరాల్ని నిగడదన్నుకుని లేచి కవిత్వానికి ఎగురుతుంది. ఆ కవిత్వ ప్రభావాన్ని చూపించడానికి ఉదహరిద్దామంటే ఈ చోటు సరిపోదు. పూర్తిగా రచన చదివితేనే అర్థమవుతుంది. అయినా కొన్ని ఉదాహరణలిస్తాను. రచయితా, స్నేహితులూ, ఊర్నించి వచ్చిన రచయిత ప్రేయసి శ్యామలా అంతా కలిసి ఓ రాత్రి విందుకు వెళ్తారు. అమీనాను కూడా తీసుకుని వెళ్తారు. అక్కడ అంతా లౌకిక మర్యాదలు, పైపైమెప్పులూ, లోతులేని మాటలు, నమ్మే సత్యాల్ని కూడా హాస్యంగా చేసి ప్రకటించవలసిన వాతావరణం. విందు పూర్తి కావొచ్చేసరికి అమీనా కనపడదు. రచయితకు ఆందోళన ప్రారంభమవుతుంది. అతను యింటికివెళ్ళి చూద్దామంటాడు. కానీ ఆ సందట్లో చుట్టూవాళ్ళకి అదేమీ పట్టదు. విందు యిచ్చిన గృహస్తు రాత్రికి అక్కడే పడుకోమంటాడు. శ్యామల కూడా వుండమంటుంది. ఆమె కళ్ళల్లో ఏవో చిహ్నాలు రాత్రికి శృంగారావకాశం వుండవచ్చునని సూచిస్తాయి రచయితకి. శరీరం యిటు మొగ్గుతూంటుంది. మనసు మాత్రం అమీనా అమీనా అని గోలపెడుతుంటుంది. చివరికి శరీరానికీ, శ్యామలకీ లొంగిపోయి అక్కడ పడుకోవడానికే ఒప్పుకుంటాడు. అంతా పక్కలు వేసుకుంటారు. కబుర్లతో సమయం గడుస్తుంది. అంతదాకా అతనికి దగ్గర్లో పడుకున్న శ్యామల ఇక్కడ నిద్రపట్టడం లేదని పక్కకి వెళిపోతుంది. రచయిత మోసం కాబడినట్టు భావిస్తాడు. అతని అంతరంగం చేదు కషాయమైపోతుంది:
పక్కచుట్ట... గాజుల చప్పుడు... పమిట కొంగు చివర వెళ్ళే కాళ్ళు... చీకటి... చీకటి...
ఒక్క చూపు – ఒక్క మాట, ఒక్క ఓదార్పు...
ఏమీ లేవు –
చీకటి – లోపల బైట, చీకటి.
మోసబడ్డ ద్వేషపు చిక్కని కాంతి.
బలిపడ్డ జంతువు గుండెల్లోని గడ్డకట్టిన నల్లని నెత్తురు...
కొడుకు చేతుల్లో దెబ్బలుతిన్న ముసలిదాని ప్రేమపు మూలుగు...
ఒక్కటే దారి... కసి... కసి... కసి... శాంతి... ఒక్కటే శాంతి... కసి...
క్షమించలేని... ఎన్నాళ్ళకీ ఉపశమించని... మధురమైన కలిదేవత, కసి.
కసీ, ఓ కసీ!
నీ ముందు నా ప్రతిజ్ఞ –
నీ పాదాల ముందు నా కలం –
సిరాతో, నల్లని, అచ్చు సిరాతో నీకు అభిషేకం –
ద్వేష వాక్కులు – నా రుక్కులు –
నా హృదయమే — నలిగిన, మన్నులో తొక్కిన ఈ వేడి హృదయం — నీకు నైవేద్యం.
రా! నీ చేదు రసం పొయ్యి, నా కలంలో నింపు...
నిలవలేను, వెళ్ళాలి.
సమస్తం — మిత్రత్వం, ప్రేమ, ధర్మం... అన్నీ పదాలు, వుత్త పదాలు, మూఢుల అనృతాలు
ఎవరు, ఎవరు, ఇంక ఎవరు
ఏది, ఏది — అమీనా ఏది?
ఇక నిలవలేక గుమ్మం దాటి రోడ్డు యెక్కి ఇంటి దారి పడతాడు అమీనాని కలవరిస్తూ. దారి పొడుగునా అతని మానసాన్ని చలం ఇంతే తీవ్రతతో వర్ణిస్తాడు. అతను యింటికి చేరి చీకట్లో గొళ్ళాన్ని తడుముతుండగా మెట్ల దగ్గర దేన్నో తొక్కుతాడు. అమీనా! ...అక్కడ పడుకుని వుంటుంది. అతని కాళ్ళని కావలించుకుని ఏడుస్తుంది. అతనూ కరిగిపోతాడు. ఆమెను వళ్ళోకి తీసుకుంటాడు:
చీకట్లో – మెట్ల మీద – దుమ్ములో –
ప్రేమలోకంలో దిక్కుమాలిన బిచ్చగాళ్ళం –
దెబ్బతిన్న గుడ్డివాళ్ళం – అనాధలం – అంధకారులం –
ప్రేమని నిరసించే నేను,
ప్రేమని ఆశించే అమీనా.
ఇద్దరం – ఇద్దరం – పొడుగై పాకే నీడలో, పెళ్లలు రాలే గోడలో.
చీమలు, కీచురాళ్ళు, బల్లులు –
కన్నీళ్ళు – ఎక్కిళ్ళు – వేళ్ళు – ఒకళ్ళ చుట్టూ ఒకళ్ళ వేళ్ళు – వేళ్ళ మధ్య వేళ్ళు – పెదిమల మధ్య జుట్టు – రెప్పల మధ్య నీళ్ళు.
మొదటి రెక్కల విదిలింపు.
బండీ గుర్రం సకిలింపు.
అడుగుల కదిలింపు.
నీళ్ళ ధారల వొదిలింపు.
తెల్లారుతోంది.
ఫ్యాక్టరీ, కోడీ కలిసి కూశాయి.
నేను యిందాక కవిత్వం పరిమితుల గురించి పడ్డ అనుమానాలకి మరొకటి జత చేయాలనిపిస్తుంది. ఇక్కడ ఉదహరించిన రెండో భాగంలోని చివర తెల్లవారడాన్ని గురించి రాసిన నాలుగు వాక్యాలూ చదివినపుడు, నేను ఇదివరకూ ఎక్కడా ఆ వస్తువుపై అంతటి ప్రభావవంతమైన పంక్తుల్ని చదివినట్టు అనిపించలేదు. తెలవారడాన్ని ఏ కవిత్వంలోనూ యింతగా అనుభూతి చెందలేదు. నిజానికి కవిత్వంలో ఈ విషయకంగా ఇంతకుమించిన వ్యక్తీకరణలు వందలు వేలు వచ్చి వుంటాయి. నేనూ చదివి వుంటాను. మరి దీన్ని చదివినపుడే ఎందుకు అలా అనిపించింది? తెల్లవారడాన్ని గురించి వర్ణించడానికి ఇది ఎన్నుకున్న స్పష్టమైన నాలుగు పదచిత్రాల్ని: చెట్ల మీద పక్షులు రెక్కలు విదుల్చుకోవడాన్నీ, ఎక్కడో జెట్కాబండికి కట్టిన గుర్రం నెమ్మదిగా సకిలించడాన్నీ, నిద్ర లేచిన ఇరుగుపొరుగు అడుగుల సవ్వడినీ, ఎవరో నీళ్ళు పట్టుకోవడాన్నీ... ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం. ఇవి కాదు ముఖ్యం. ఈ self-contained తెలవారే దృశ్యం కాదు నాలోని అనుభూతికి కారణం (నిజానికి అక్కడున్న పంక్తుల్లో స్వతహాగా వున్న కవిత్వాంశ చాలా తక్కువ). అసలు కారణం – ఆ తెలవారే దృశ్యాన్ని ప్రత్యేకంగా అనుభవించగలిగే ఒక మానసికావస్థను అంతకుముందు నించీ నెమ్మది నెమ్మదిగా నాలో సిద్ధం చేస్తూ వచ్చింది ఈ కథ. వుట్టి తెలవారే దృశ్యాన్నే యివ్వలేదు, దాన్ని అనుభూతించేందుకు ఒక vantage point ని కూడా ఇచ్చింది. ఎక్కడ నుండి చూడాలో అక్కణ్ణించి చూపించింది. ఆ కాలంలో, ఆ ఏలూరులో, ఆ గొళ్ళెం తీయని గుమ్మం ముందు అమీనాని వళ్ళో పెట్టుకుని రచయిత చూస్తున్న ఆ ప్రత్యేకమైన తెలవారి దృశ్యాన్ని — అతని మనసుతో — నేను చూడగలుగుతున్నాను. కవిత్వం తెల్లవారడాన్ని వ్యక్తీకరించవచ్చు అద్భుతంగా. కానీ దాన్ని ఒక ప్రత్యేకమైన కోణంనించి (ఒక ప్రత్యేకమైన పాత్రగా, ఒక ప్రత్యేకమైన మానసిక స్థితితో, ఒక ప్రత్యేకమైన కాలంలో స్థలంలో) అనుభవించడానికి నా మనసుని ఇంత ప్రభావవంతంగా సంసిద్ధం చేయలేదు. బహుశా హెన్రీగ్రీన్ “prose is not quick as poetry but rather a gathering web of insinuations” అన్నప్పుడు ఆ “gathering web of insinuations” అనడంలో ఇదే సూచిస్తున్నాడేమో. అవును, వచనం నెమ్మదిగా చుట్టూ అల్లుకొనబడే వల. అది తన ప్రభావం చూపించడానికి సమయం తీసుకుంటుంది. కానీ ఆల్లుకొనడం పూర్తయ్యాక అంతా కలిసి చూపించే ప్రభావం మాత్రం అనన్య సామాన్యం. అందుకే పుష్కిన్, నబొకొవ్ లాంటి రచయితలు తొలి రోజుల్లో కవిత్వం రాసి తర్వాత వచనానికి మళ్లారేమో.

యిక ‘అమీనా’లో కన్పించే చైతన్యస్రవంతి శిల్పం చలం సహజంగా సాధించిందనిపిస్తుంది. అతని అవసరమే అతనికా శిల్పాన్ని తెచ్చి ఇచ్చింది. బయటి ప్రేరణలు ఏవీ వున్నట్టనిపించవు. చలం 1942లోనే జాయిస్ ని చదివి వుంటాడని నేననుకోను, అసలు వినివుంటాడా అన్నది వేరే సంగతి. అలాగే అంపశయ్య నవీన్ తెలుగులో చైతన్య స్రవంతి శిల్పంతో మొదట రాసింది శ్రీశ్రీ అని తీర్మానిస్తూ ‘కోనేటి రావు’ కథను ఉదహరిస్తాడు. శ్రీశ్రీ తర్వాత బుచ్చిబాబు “చైతన్యస్రవంతి” అని ఆ శిల్పంతో ఒక కథ కూడా రాశాడంటాడు. కానీ శ్రీశ్రీ ‘కోనేటి రావు’ కథ 1946లో రాసాడు. కాబట్టి చలం వీళ్ళిద్దరి కన్నా ముందే రాసాడనుకోవాలి.

***

‘అమీనా’ని నేను రెండ్రోజుల్లో రెండుసార్లు చదివాను. అసలు ఇదివరకూ పదేళ్ళ క్రితం ఒకసారి చదివాను. అయినా ఏమీ కొత్తదనం పోలేదు. ఈ కథ నిజంగా జరగింది కావడం దీనికి ఇచ్చే శక్తిని కాదనను. కానీ తన మనసులో ఆ జ్ఞాపకం ముద్రవేసిన తీరు, అందులోంచి ఆయన పిండుకున్న మనోహరత్వమూ, చూడగలిగిన జాలీ... వీటన్నింటినీ, ఈ అనుభూతిలోని సత్యాన్నంతటినీ, అద్వితీయంగా కథలో ఇమడ్చగలిగాడు చలం. తనలోని సత్యం ఏ జల్లెడలూ లేకుండా అక్షరాల్లోకి ప్రవహింపజేయడంలో చలంకున్న అరుదైన ప్రతిభకు అత్యున్నతమైన ఉదాహరణ ‘అమీనా’.

May 3, 2011

దైవమిచ్చిన భార్య – రీడింగ్ నోట్సు

.
(ఈ బ్లాగులో కొన్నాళ్ళు చలం సందడి కన్పించవచ్చు. చలం మీద ఒక పుస్తకం రాయవలసి వచ్చి ఆయన రచనలు, ముఖ్యంగా నవలలు, క్రమంలో చదువుదామనుకుంటున్నాను. రచన చదవగానే వచ్చే ఆలోచనల్ని మరుపుకు రాకుండా యిక్కడ రాద్దామనుకుంటున్నాను. యివి పూర్తిస్థాయి వ్యాసాలుగా వుండాలని అనుకోవటం లేదు.)

చలం మొదటి నవల “శశిరేఖ” 1921లో రాసాడు. రెండవ నవల “దైవమిచ్చిన భార్య” 1923లో రాసాడు. మొదటి నవలతో పోలిస్తే ఈ నవలలో చాలా పరిణతి కన్పిస్తుంది. మొదటి నవల చాలా ఓపిక పట్టినా పూర్తి చేయలేకపోయాను. అందులో నాకు చలం ముద్ర పెద్దగా కన్పించలేదు. ప్రవాహసదృశమైన ఆయన శైలి లేదు. సంభాషణలు తప్పించి మిగతా వచనం అంతా సరళగ్రాంథికంలో వుంటుంది. వర్ణనల తర్వాత సన్నివేశము, సన్నివేశం తర్వాత సంభాషణలు యిలా ఒకదాని తర్వాత ఒకటి పడికట్టు క్రమంలో సాగుతుంటాయి. చలం కూడా ఈ రచన విషయంలో పెద్ద ఆసక్తుడై ఎపుడూ మాట్లాడలేదు.

“దైవమిచ్చిన భార్య”లో మున్ముందు పాఠకుల్ని మంత్రముగ్ధుల్ని చేయబోయే చలం లీలగా కనిపిస్తాడు. సులువైన మాటల్లో నాటుకుపోయేట్టు కథనాన్ని నడిపించే చలం బలం యిక్కడ రూపం తెచ్చుకుంటూ కనిపిస్తుంది. కథ మొదట్నించీ విధి గుద్దిన విషాదపు ముద్రల్తో కనిపించే యిద్దరు ప్రేమికుల కథ యిది. వాళ్ళ చిన్నతనం నుండి మొదలై వారిలో ఒకరి మరణం దాకా నడుస్తుంది. రాధాకృష్ణ, పద్మావతి చిన్నతనం నుండీ స్నేహితులు. తహసీల్దారు కొడుకు రాధాకృష్ణ. వాళ్ళ పక్క యింటి జమీందార్ల అమ్మాయి పద్మావతి. పద్మావతి చెన్నపట్నంలో వుంటూ అపుడపుడూ చుట్టంచూపుకు ఊరు వస్తూంటుంది. అలా వచ్చినపుడొకసారి యిద్దరూ తొలిసారి కలుస్తారు. ఆటల్లో జట్టుకడతారు. ఆ రోజుల్లోనే పద్మావతికి ముప్ఫయ్యేళ్ళ ఒక న్యాయమూర్తితో బాల్యవివాహం జరిగిపోతుంది. స్నేహితులిద్దరూ ఏడేళ్ళు మళ్ళీ కలుసుకోరు. మరలా ఆమె ఊరు వచ్చేసరికి, యిద్దరూ నిండు యవ్వనంతో వుంటారు. యిద్దరిలోనూ పరస్పరం ప్రేమ మొదలవుతుంది. యిద్దరూ ప్రేమ లోకపు చుక్కల జల్లు కళ్ళను మెరిపిస్తూంటే, అనురాగ గాఢతను అనుభవిస్తారు. ఆమెను తనతో వచ్చేయమంటాడు రాధాకృష్ణ. యిక్కడే పద్మావతి మనల్ని ఆశ్చర్యపరుస్తూ రానంటుంది. దానికి ఆమె చెప్పే కారణం, రాధాకృష్ణకు భార్యగా మారిపోయి పెళ్ళి అనే బంధంలో ఇరికిపోవడం ఆమెకి యిష్టం లేదు. ఒకరికొకరు పాతబడిపోవడం యిష్టంలేదు. యిలా అప్పుడపుడూ కలుసుకోవడంలో ఎప్పటికపుడు తాజాగా ఉత్పన్నమయ్యే ప్రేమావేశపు కొత్తదనం ఆమెకి కావాలి:
“నిన్ను కలుసుకోవడమంటే నాకెంతో యిష్టం – నీ దగ్గర్నించి వెళ్ళిపోయి నిన్ను కొంతకాలం చూడకుండా వుండడం మరీ యిష్టం! మళ్ళీ మనం కలుసుకొన్నప్పుడు మరీ బావుంటుందిగా! యెవరికీ తెలీకుండా నీ దగ్గిర కిలా తప్పించుకు రావడం చాలా యిష్టం... కానీ నేనిప్పుడు లేనూ, అలానే వుంటా యెప్పుడూ. నా మీద యెవరికీ అధికారం యివ్వను. యెవరి సొమ్మునీ అయిపోను. యెవరి వస్తువునీ కాను. ఎప్పుడూ పొద్దున్నా, సాయంత్రమూ ఒకరికి కనబడుతో, రాత్రంతా వాళ్ళతో వుండి వాళ్ళకి పాతదాన్నయి, అసహ్యం అయిపోను. ఆఖరికి నీకు కూడా...”
ఆమె న్యాయమూర్తికి భార్యగానే వుండాలనుకుంటుంది. అలాక్కాక రాధాకృష్ణతో లేచి వచ్చేస్తే సంఘం పెట్టే కష్టాలేవీ ఆమె ఎదుర్కునేందుకు సుముఖంగా లేదు.
“[నీతో వచ్చేసింతర్వాత] యెక్కడికో అసహ్యమైన చోటికనుకో యే సందుల్లోనో, గుడిశల్లో బతకాలనుకో. మనకు డబ్బు వుండదు. పొద్దున్న లేస్తే మన యిద్దరికీ ఆందోళనే. విచారమే, తాపత్రయమే. మన ప్రేమ అనుభవించడానికి సమయమే వుండదు. నేను నీతో వున్నప్పుడల్లా, సంతోషంగా, చింత లేకుండా అందమైన చోట్ల అనుభవించాలని వుంటుంది”
ఆమె వ్యక్తిత్వాన్ని ఒక్కముక్కలో చెప్పాలంటే “నేను” అనే చట్రందాటి బయటకు రాలేని మామూలు స్వార్థపరురాలు. ఆమెకు ప్రేమ వల్ల వచ్చే ఆనందం మాత్రమే కావాలి. ఇద్దరు మనుషులు నిత్యం కలిసి బతుకుతూ ఉమ్మడిగా రాసుకునే ఆనంద-విషాదాల చరిత్ర ఆమెకు అక్కర్లేదు. Her myopic vision is guarded thickly by her own passions. Byronic blindness! ఈ భావోద్వేగాల్ని దాటి చూడగలగడం చూస్తుంది, గానీ ఆమెకు అక్కడ కనిపించే నిస్సారత్వం భయం. దాన్ని ఎదుర్కోవాలనుకోదు. దానికి బదులుగా అబద్ధమయినా అందమైందైతే చాలనుకుంటుంది:
“ఈ నూతనోత్సాహంలో అలానే అనిపిస్తుంది. నేను చాలామందిని చూశాను రాధా!... ప్రేమ అనేది ఆకాశంలో దానంత అది వెలిగే జ్యోతి కాదు. కావ్యాల్లో నాటకాల్లో ఇంగ్లీషు నావెల్సులో రాసే ప్రేమ వేరు; మనుషులం మనకి వుండే ప్రేమ వేరు. పెళ్ళి అయిందని కథ ముగిస్తారు? తరువాత వాళ్ల ప్రేమ ఏమయిందో రాస్తే ఎంత ఘోరమైన సంగతులు బయటపడతాయో! మనం దాన్ని భద్రంగా పెంచి, కాపాడి పోషించాలి. లేకపోతే పువ్వులోని మృధుపరిమళంమల్లే యెరిగిపోతుంది.”
ప్రేమను భద్రంగా పెంచి కాపాడి పోషించాలనీ, లేకపోతే నిలవదనీ, ఆమెకు తెలుసు. కానీ ఆమె ఆ ప్రయత్నానికి సిద్ధం కాదు. దీనికి పలాయనాన్ని విరుగుడుగా ఎంచుకుంటుంది. ఒకరికొకరు దూరంగా వుంటూ, అపుడపుడూ మాత్రమే, జీవితపు నిరాసక్తత చలిగా ముప్పిరిగొని ఆత్మను కొంకర్లు తిరిగిపోయేలా చేస్తున్నపుడు మాత్రమే ఆ ప్రేమ యజ్ఞగుండాన్ని వెలిగించి చలికాచుకుని, ఆ నిత్యాగ్నిహోత్రం స్వభావానుసారం తన కన్నీటి ఆజ్యాన్నిమ్మని నాలుకలు చాచినపుడు మాత్రం ఆర్పేసి దూరం పారిపోవాలి. అదీ ఆమె తత్త్వం. ఆమెకు అతనిపై నిజమైన ప్రేమ వుంది. కానీ ఆమెకు ప్రేమకున్న బలం పైనే నిజమైన నమ్మకం లేదు.

సరే, రాధాకృష్ణకు మరోదారి వుండదు. ఆమెపై ప్రేమ అన్నీ ఒప్పుకునేలా చేస్తుంది. కొన్నాళ్ళు సాగుతుంది. న్యాయమూర్తి విదేశాల్లో చదువుముగించుకుని వచ్చాకా, ఆమె చెన్నపట్నం కాపురానికి వెళ్ళిందని తెలిసినపుడు మాత్రం బాధతో మండిపోతాడు. ఆ బాధలో కూడా, అతనికి మగవాడి సహజమైన అపరాధ భావన తప్పదు. అలా అతని మనసుని పద్మావతి కండీషన్ చేసిపెడ్తుంది. తన ప్రియురాలు తనది కావాలి అనుకోవడం కూడా జెలసీ వల్ల మాత్రమే అని సమాధానపడతాడు:
నా దగ్గర్నించీ పద్మావతి వెళ్ళిపోయిన విరహబాధ కంటె నాకు – నాకు కాకుండా పద్మావతి యింకొకరిదయిందనే బాధ అంత తీవ్రమయింది. ఆమెని నేను ప్రేమించినది మొదలు ఆమెని నా పదార్థం చేసుకోవాలనే ముఖ్య ప్రయత్నం. పద్మావతి సంతోషం కాదు ముఖ్యం. ఆమెకి బాధ కలిగినా సరే, యెవరిదీ కాకుండా ఆమె నాది కావాలి. పద్మావతి, ముందు నాదైపోతే తరవాత నేను ఆమెకి జీవనమంతా ఇస్తాను. యెంత సేవన్నా చేస్తాను. నాది కాకపోతే యేమీ లేదు. నా ప్రేమ అంతా ద్వేషమైపోతుంది. ఇది సాధారణంగా స్త్రీ పురుషులకి ఒకరి మీద ఒకరికి వుండే ప్రేమ. న్యాయమూర్తి నా పద్మావతి దగ్గిరిగా ఒక యింట్లో, ఒక గాలిని పీలుస్తోవున్నాడని నా హృదయం రాత్రింబవళ్ళు దహించుకుపొయ్యేది.
చెన్నపట్నం వెళ్ళి ఆమెకు ద్వేషాన్నంతా వెళ్ళగక్కుతూ ఉత్తరాలు రాస్తాడు. ఆమె మళ్ళీ అతణ్ణి ఎలాగో పాత పాటే పాడి ఒప్పిస్తుంది. ఈ అయోమయ స్థితిలోనే అతను వేరే పెళ్ళి కూడా చేసుకుంటాడు. అయిదేళ్ళ పాటు యింగ్లాండు వెళ్ళిపోతాడు. తిరిగి వచ్చాక పద్మావతితో బంధం మళ్ళీ కొనసాగుతుంది. ఈసారి ఆమె యింట్లోనే. కొన్నాళ్ళకి ఒకరోజు ఇద్దరూ బాహటంగా భర్తకి పట్టుబడిపోతారు. ఈ సందర్భంలో భర్తని బయటి పార్టీగా విలన్‌గా చూపించకుండా, అతణ్ణి కూడా ఈ త్రికోణంలో సానుభూతి పడాల్సిన భాగంగా చూపిస్తాడు చలం. అతను పద్మావతిని కొన్నాళ్ళపాటు సింగపూరు తీసుకుపోతాడు. తర్వాత చెన్నపట్టణం తీసుకువచ్చి ఇంట్లో ఖైదు చేస్తాడు. ఇద్దరూ కలుసుకోకూడదని, ఉత్తరాలు రాసుకోకూడదనీ, లేదంటే రాధాకృష్ణ మీద కేసులు పెట్టిస్తాననీ బెదిరిస్తాడు. షరతులకు ఆమె లొంగిపోతుంది. అంతేకాదు, రాధాకృష్ణ కూడా లొంగిపోయేలా ఒప్పిస్తుంది.

మరో ప్రక్క రాధాకృష్ణ తన భార్యతో సఖ్యత పెంచుకుని, మామూలు సంసారిక జీవనంలో పడతాడు. కొన్నేళ్ళకు ఎపుడో పని మీద మలబారు వెళ్ళినపుడు మళ్ళీ పద్మావతి కన్పిస్తుంది. ఆమె దేశ పర్యటనలో వుంది. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటారు. పడవ యెక్కి సముద్రంలోకి వెళ్తారు. అందమైన ప్రకృతి మధ్య ఒకరి సాంగత్యాన్ని ఒకరు ఆస్వాదిస్తారు. అయితే ఇద్దరి మధ్య భౌతికమైన వాంఛ వుండదు.
ఆ సృష్టి సౌందర్యంలో ఒకరం యింకొకరి సౌందర్యంలో లీనమైపోయినాము. ఒకరికొకరు తాకనన్నా లేదు. తాకాలనే బుద్దే లేదు. తాకనక్కర్లేదు. ఈ భౌతిక శరీరానికి అతీతమైన ఆనందం అనుభవించాము. అంతసేపూ మా యిద్దరికీ శరీరాలు లేనట్టే వుంది. ఆ కాంతి, ఒంటరితనం మా మనసులకి మంత్రం వేశాయి.
ఓ నిర్జనమైన రోడ్డు మీద వెన్నెట్లో, చెట్ల ఆకుల నీడలు నేలంతా పరుచుకున్న చోట, రాధాకృష్ణ ఆమెకు వీడ్కోలు చెప్పి వెళిపోతాడు. వెనక్కి తిరిగి వెళ్ళాలని వుంటుంది. వెళ్తే ఏమవుతుందో తెలిసి అతను ముందుకే సాగిపోతాడు. అతను తిరిగి వస్తాడని ఆమె రాత్రంతా అక్కడే వేచి చూస్తుంది. తర్వాత ఆమె భర్త ఆ రాత్రంతా ఆమె రాధాకృష్ణతోనే వుందని అనుమానిస్తాడు. రాధాకృష్ణను కోర్టు కీడ్చి అంతు చూడాలనుకుంటాడు. పద్మావతి రాధాకృష్ణను కాపాడాలనుకుంటుంది. అతణ్ణి చెన్నై రమ్మని కబురు పంపిస్తుంది. అతను వున్న హోటలుకి వస్తుంది. కోర్టువ్యవహారం లేకుండా చెయబోతున్నానంటుంది, ఇక ఇబ్బందులేమీ వుండవంటుంది, రాధా కృష్ణని కావలించుకుని అతణ్ణింకెప్పటికీ చూడటానికి వీలుపడదంటూ, ఎలా బతుకుతాడో అని దిగులుపడుతుంది, కాస్త ప్రేలాపనగా మాట్లాడుతుంది:
“నా బతుకంతా పాడు చేసుకున్నాను. ఇప్పుడు తెలుస్తోంది. ఆఖరికి ఏం చెయ్యటానికీ వీలులేనప్పుడు, అంతా మించిపోయినప్పుడు. మన సొంతవి, మనవి అనుకున్నవే, నిజంగా మనం యెక్కువగా ప్రేమించేది. మన ప్రాణాన్నిచ్చి కొనుక్కుంటామే, వాటిని మాత్రమే! నేనెంత కఠినురాల్ని అయినా, నేనెంత నా సౌఖ్యమే చూచుకున్నా, రాధా, నా చిన్న రాధా, మొదటి నుంచీ నిన్ను నిష్కపటంగా, నా ఆత్మ నంతటితోనూ ప్రేమించాను. మొదటినుంచి, చిన్నప్పుడు మనం ఆడుకున్నప్పటినించి. యెప్పుడూ, యెప్పుడూ! కాని నేను మాత్రం నీ దాన్ని కాదలుచుకోలేదు. నా దాన్నే అయివుందామనుకున్నా, నీ దాన్నే అయితే ఇద్దరి ఆనందం, ప్రేమ పోతాయనుకున్నాను... ఇప్పుడు విచారించి లాభమేముంది.”
అంటూ, అంతకుముందే పుచ్చుకున్న ఏదో విష ప్రభావం పెరిగి, అతని చేతుల్లో మరణిస్తుంది. న్యాయమూర్తి తటాలున తలుపు తన్నుకు లోపలికి వస్తాడు:
న్యాయమూర్తి మొహం తెల్లపడ్డది. పద్మావతిని చూస్తూ నుంచున్నాడు. అంత విరోధంలోనూ, అతన్ని చూస్తే జాలి వేసింది. నా వొంక తిరిగాడు. కళ్ళల్లో నీళ్ళున్నాయి. 
“మనిద్దరం... కలిసి... చంపాము... ఇద్దరం... ముక్కల కింద చీల్చుకున్నాము” అన్నాడు. 
పోయినసారి నేనూ పద్మావతీ కలుసుకున్నప్పుడు, ఆ రాత్రి ఒకచోట వుండలేదన్నాను. 
“ఇప్పుడెందుకు? ఇంకెందుకు? ఏమయితేనేం? ఇంకేమయితేనేం?” అన్నాడు చాలా విచారంతో! పాపం!
యిలా “దైవమిచ్చిన భార్య” ముగుస్తుంది. ఈ నవలకు ప్రధాన పాత్ర పద్మావతే. ఆమే రాధాకృష్ణకు దైవమిచ్చిన భార్య. ఆమె చుట్టూనే అంతా తిరుగుతుంది. రాధాకృష్ణ ఈ కథ అంతా సింహావలోకనం చేసుకుంటూ ఉత్తమ పురుష కథనంలో చెప్తూంటాడు. పద్మావతి తీసుకున్న ఒక్క నిర్ణయమ్ కారణంగానే వీళ్ళిద్దరి ప్రేమ కథ ఈ రీతిన సాగుతుందనిపిస్తుంది. ప్రేమికులు ఎక్కువకాలం కలిసివుంటే (పెళ్ళి ద్వారా గానీ, మరే రకంగా గానీ) వాళ్ల ప్రేమలో నూతనత్వం చచ్చిపోతుంది అన్నది ఆమె అభిప్రాయం. ఈ అభిప్రాయం ఏం సూచిస్తుందంటే - ప్రేమికుల్ని చెంత నిలుపుకోవడం కన్నా, వాళ్ళని దూరం పెట్టయినా సరె ప్రేమని చెంత నిలుపుకోవడం ఆమెకు ముఖ్యమని. ప్రియునికన్నా, ప్రేమ ముఖ్యం. ప్రేమలో వున్నామన్న భావనని ఆనందించడానికి అవతలి వ్యక్తిని కేవలం ఒక సాకుగా వాడుకోవడమన్నమాట. యిలా స్వకేంద్రకంగా వున్న వ్యక్తుల్లో వాళ్ళ చుట్టూ వుండే దుర్భేద్యమైన గోడలు వాళ్ళే అయివుంటారు. వాళ్ళని దాటి వాళ్ళు బయటికి రాలేరు. వాళ్ళ నించి వాళ్ళు స్వేచ్ఛపొందలేరు. జాలికి పాత్రులు.

పద్మావతి అంటుంది “నేను మాత్రం నీ దాన్ని కాదలుచుకోలేదు. నా దాన్నే అయివుందామనుకున్నా” అని. పెళ్ళి అయినా ఒకరి స్వాతంత్ర్యాన్ని ఒకరు కాపాడుకోవచ్చు. అదీగాక ప్రేమలో వున్నపుడు మనం ఒకరికి చెందినవాళ్ళమైపోవడంలో తప్పేముంది, అర్పితమైన మన వ్యక్తిత్వాన్ని అవతలివ్యక్తి దుబారా చేసేవాడు కాదన్న నమ్మకం వున్నపుడు. పోనీ అదలా వుంచినా, ప్రేమించిన రాధాకృష్ణ దగ్గర అంత స్వాతంత్ర్యాభిలాషని ప్రదర్శించి, చివరకు భర్త దగ్గర లొంగిపోవడం చూస్తే ఆమె ఆదర్శం డొల్లగా కన్పిస్తుంది.

రాధాకృష్ణా, పద్మావతీ మొత్తం జీవితంలో కలిసివున్నది తక్కువే అయినా, కలిసివున్న ఆ కొన్ని క్షణాల సాంద్రతా వాళ్ళ మొత్తం జీవితాన్ని సార్థకం చేస్తుందని సమాధానపడచ్చు పాఠకులు. కానీ ఆ భ్రమకు కారణం నాయికానాయకులు కలిసివున్న క్షణాల్ని మాత్రమే రచయిత నమోదు చేయడం. మిగతా కాలమ్ సంగతో మరి. రాధాకృష్ణ యిగ్లండులో గడిపిన అయిదేళ్ళూ, టిబెట్లో గడిపిన మూడేళ్ళూ, భార్యతో సఖ్యంగా గడుపుతూ పిల్లల్ని కని పెంచుకున్న సంవత్సరాలూ... ఈ క్షణాలేమీ రచయిత మనకి చెప్పడు. కేవలం పద్మావతీ, రాధాకృష్ణ కలిసి వున్న కొన్ని రోజుల, నెలల కాలపు నిడివిని మాత్రమే సవిస్తారంగా చెప్తాడు. మధ్యలో ఎంతెంత కాలం కొట్టుకుపోయిందోనన్న స్పృహ కూడా పెద్దగా కలగదు. ఈ అనాథ ప్రేమ కథ సార్థకమనిపిస్తే గనక అదీ ముఖ్య కారణం.
* ——— * ——— *
అయితే నేను చలం పాత్రల తీరుతెన్నుల్ని ఎందుకు సమీక్షిస్తున్నాను. ఆయన రాసిన తీరుని ఎందుకు పట్టించుకోవటం లేదు? ఎందుకంటే, ఆంగ్ల రచయిత హెచ్.జి. వెల్స్ రాసిన “ద పాషనేట్ ఫ్రెండ్స్” గురించి ప్రస్తావించకుండా, “దైవమిచ్చిన భార్య” సుగుణాల్నీ దుర్గుణాల్నీ పూర్తిగా చలానికి అంటగట్టి అంచనాకట్టలేము. చలం ఈ నవలను హెచ్.జి. వెల్స్ రాసిన ఆంగ్ల నవల నుండి ప్రేరణ పొంది రాసాడని చాలామందికి తెలుసు. యిపుడు చలాన్ని ఈ నవల విషయమై అభినందించాలన్నా విమర్శించాలన్నా అసలు ఇందులో ప్రేరణ శాతమెంతో, అనుకరణ శాతమెంతో తెలుసుకోవాలి. అయితే ఈ విషయం తెలుసుకోవడంకోసమని “ద పాషనేట్ ఫ్రెండ్స్” ఆసాంతం చదివేటంత ముఖ్యం కాదు నా ప్రస్తుతావసరం. కాబట్టి ఆ నవల సంక్షిప్త సారాంశం కోసం వెతికాను. దొరికిందాన్ని బట్టి చలం “దైవమిచ్చిన భార్య”లోని కథా, పాత్రలూ, కొన్ని సంఘటనలూ... అన్నీ దాదాపు మూలం నుండి దిగుమతి చేసుకున్నవే అని తెలుస్తోంది. అయితే మూల రచన కేవలం ప్రేమ గురించే కాదు. యిద్దరు బాల్య స్నేహితుల ఆదర్శాల గురించి. అవి కాల క్రమేణా ఏ మార్పులకు లోనై ఏ పర్యవసానాలకు చేరుకున్నాయన్న దాని గురించి. కథానాయకుడు స్టీఫెన్ తన కొడుకుని ఉద్దేశించి రాస్తున్నట్టు మొదలవుతుంది మూలమ్. ఈ ఎత్తుగడ చలం రచనలో లేదు. బహుశా చలాన్ని ఈ నవలలో ఆకర్షించింది నాయికానాయకుల అనుబంధమయి వుంటుంది. అందుకే అది మాత్రమే మూలం నుండి తీసుకున్నాడు.

హెచ్.జి. వెల్స్ రచనల్లో “ఇన్విసిబుల్ మాన్” “టైంమెషీన్” “వార్ ఆఫ్ ద వరల్డ్స్” లాంటి ఫాంటసీలు పొందినంత ప్రాచుర్యం ఆయన ఇతర వాస్తవిక ఇతివృత్తాల రచనలకు లభించలేదనుకుంటాను. వెబ్ అంతా వెతికినా “ద పాషనేట్ ఫ్రెండ్స్” కథా సారంశం ఈ ఒక్క బ్లాగులో మాత్రమే కన్పించడం దీనికి తార్కాణం. రచన మొత్తం మాత్రం గూటెన్‌బర్గ్ వాళ్ళ దగ్గర లభ్యం.
The Passionate Friends is written by a father to his young son as a sort of didactic autobiography. As a young man, Stephen forms vague ambitions of serving the empire by standing for Parliament. His idealism is flimsy stuff, however, when pitted against his passion for Mary. Mary wants to be more than a wifely ornament, and, when Stephen insists that they marry, she balks, afraid to become his possession. Her own ambitions are just as vague as her lover’s, but she is remorseless in using her sense of futility to draw out Stephen’s love. … But she finally submits to social custom and marries Lord Justin, a wealthy and respectable older man. She stipulates, however, that the marriage never be consummated.
Separated for some years, Mary and Stephen eventually come back together, and the conditions of her marriage give Mary the idea that she can meet Stephen without reservations. It is difficult to guess just how far the lovers go, but discretion is not something either of them practices. … Their intimate relationship comes to Justin’s attention, and he insists that Stephen leave the country. 
The three-year exile that sends Stephen around the world is the second that occurs due to complications with Mary. The first, following Mary’s marriage, Stephen took voluntarily to fight the Second Boer War. 
Stephen repeatedly writes that he is trying for honesty in his portrait of Mary, but it is impossible to see her as anything other than an egotistical manipulator. Rather than elevated by his passion, Stephen is enervated by Mary’s self-centered nature. Mary does care for Stephen, she may even be said to love him, but she is unable to realize unselfish love because she cannot see beyond her own needs. The resulting tragedy is not so much Mary’s suicide as it is Stephen’s insistence on sacrificing his chance for happiness by loving the wrong woman.
ఈ సారాంశం చదివితే చాలు, చలం చాలావరకూ ఉన్నదున్నట్టు వెల్స్ నవల నుండి తీసుకున్నాడని తెలుస్తుంది. అయితే మూలాన్ని కాస్త అలవోకగా అటూయిటూ పరిశీలించిన మీదట తేలిందేమిటంటే, చలం కేవలం కథనే కాదు, సన్నివేశాల్ని, సంభాషణల్ని కూడా చాలాచోట్ల యధాతథంగా వాడుకున్నాడు. ఉదాహరణకి రాధాకృష్ణా, పద్మావతీ పెద్దవాళ్ళయిన తర్వాత తొలిసారి కలిసినపుడు మాట్లాడుకునే మాటలు:
“అపుడు యెన్ని ఆటలు తోచేవి! వాటి సంగతి తలుచుకుంటూ వుంటా.” 
“నేనూనూ; నీ కర్ర ఒకసారి విరిచేశాను జ్ఞాపకముందీ? అది నేను పుచ్చుదంటాను. మంచిదంటావు నువ్వు!” 
ఇద్దరం నవ్వాము. “అప్పుడంత స్నేహంగా వుండేవాళ్ళమే, ఇప్పుడింత కొత్త యెందుకు మనకి?” అని యిద్దరికీ తట్టింది. 
“అప్పుడు కొట్టినట్టు యిప్పుడు నిన్ను చెంపకాయ కొట్టను కదా!... నేను గీకాను కదూ నిన్ను?” 
ఆమె అంత చనువుగా మాటాడేటప్పటికి చాలా సంతోషం కలిగింది. 
“ఛా, లేదు, లేదు” 
“గీకానులే” 
“ఛా లేదు” 
“యెందుకు లేదంటావు? ఒప్పుకుంటేనేం? మనిద్దరం పెద్దవాళ్ళం అవుతున్నాము. ఒచ్చిన యిబ్బంది అదీ. పోట్టాట వచ్చినా, యింకా కాళ్ళూ చేతులూ ఉపయోగపరచం గదా?”
ఈ సంభాషణ మూలంలో వున్న తీరిది:
"I think so often of those games we used to invent," she declares. 
"So do I," I say, "so do I." And then with a sudden boldness: "Once I broke a stick of yours, a rotten stick you thought a sound one. Do you remember?" 
Then we laugh together and seem to approach across a painful, unnecessary distance that has separated us. It vanishes for ever. 
"I couldn't now," she says, "smack your face like that, Stephen." 
That seems to me a brilliantly daring and delightful thing for her to say, and jolly of her to use my Christian name too! "I believe I scratched," she adds. 
"You never scratched," I assert with warm conviction. "Never." 
"I did," she insists; and I deny, "You couldn't." 
"We're growing up," she cries. "That's what has happened to us. We shall never fight again with our hands and feet, never—until death do us part."
ఇక్కడ చలం రచన ప్రేరణా కాదు, అనుసరణా కాదు; అనువాదం అనిపించేట్టు వుంది. “దైవమిచ్చిన భార్య” చదువుతూ నేను పక్కన పెట్టుకున్న నోట్సులో ఒక చోట యిలా రాసుకున్నాను. “చలం రచనా విన్యాసంలో గొప్పగా అనిపిస్తుందేమిటంటే, ఒక సన్నివేశంలోని పాత్రల మనసుల్లో అంత సునాయాసంగా ప్రవేశించగలిగే రచయితలు మనకు అరుదు.” నాకు యిలా అనిపింపజేసిన సన్నివేశం రాధాకృష్ణా, పద్మావతిల సంబంధం గురించి ఆమె భర్తకు తెలిసిన సందర్భంలో వస్తుంది. తెలిసిపోయాకా అక్కడ పెద్ద గొడవ మొదలవుతుంది. రాధాకృష్ణకు మాత్రం లోపల ఆనందంగానే వుంటుంది – భర్తకి తెలిసిపోయినందుకు. ఇక పద్మావతి తనతో వచ్చేస్తుందని అనుకుంటాడు. అనుకోవడమే కాదు, ఆమె వస్తే ఆమెను ఎక్కడికి తీసుకువెళ్లాలి, హోటల్లో వుండనిస్తారా యిద్దర్నీ... యివన్నీ కూడా, అక్కడ ప్రస్తుతం జరుగుతున్న గొడవకు సంబంధం లేని విషయాలను, ఆలోచిస్తూంటాడు. మామూలుగా మనుషుల మనసులు అలానే పనిచేస్తాయి. వింత వింత పోకడలు పోతూంటాయి. అందుకే యిది నాకెంతో సహజంగా అనిపించింది. ఒక రచయిత తన పాత్రలోకి పూర్తిగా పరకాయప్రవేశం చేయగలిగితే తప్ప, రచనలోని వివరాల్లో ఈ నైశిత్యం రాదు:
వెంటనే పద్మావతి నాతో వచ్చేస్తుందనే అనుకున్నాను. చుట్టూ వున్న వుత్తరియ్యంతోటే. ఇంకేమీ బట్టలు తీసుకోవడానికి కూడా బహుశా వీలుండక, ఎలా నాతో బయటికి వస్తుందా అని కూడా సందేహపడ్డాను. ఇద్దరం వొకరి చేతులు వొకరం పట్టుకుని ఆ ఇంటిలోంచి అట్లానే బయలుదేరి చెన్నపట్నం వీధుల్లో నడిచిపోవడం కూడా కళ్ళకి కట్టినట్టు కనబడ్డది. హోటల్లో పద్మావతి కూడా వుండవచ్చా? వీల్లేకపోతే యెక్కడికి వెళ్ళాలి? అని సందేహం కూడా కలిగింది.
నేను మూలాన్ని పరిశీలించేటపుడు నాకు ఇది కూడా గుర్తుకు వచ్చింది. చలానికి నా పొగడ్త ఉదారంగా ఇచ్చేసేముందు ఒకసారి మూలం తరచి చూద్దామనిపించింది. దురదృష్టవశాత్తూ, అది కూడా యధాతథంగా వుంది.
It seemed to me there was nothing for it now but that Mary should stand by my side and face Justin with the world behind him. I remember my confused sense that presently she and I would have to go straight out of Martens. And she was wearing a tea-gown, easy and open, and the flimsiest of slippers. Any packing, any change of clothing, struck me as an incredible anti-climax. I had visions of our going forth, hand in hand. Outside was the soughing of a coming storm, a chill wind drove a tumult of leaves along the terrace, the door slammed and yawned open again, and then came the rain. Justin, I remember, still talking, closed the door. I tried to think how I could get to the station five miles away, and then what we could do in London. We should seem rather odd visitors to an hotel—without luggage. All this was behind my valiant demand that she should come with me, and come now.
మొదటి నవల “శశిరేఖ”లో నాకు చిరాకు పుట్టించిన మామూలుతనం నుండి, చలం కేవలం తన రెండో నవల్లోనే అతితక్కువ కాలంలో పరిణతి సాధించాడని అనుకోవడానికి ఏవైతే అంశాలు తోడ్పడ్డాయో — పడికట్టుతనపు పట్టాలు దాటి ఏయే వినూత్న వివరాలు “దైవమిచ్చిన భార్య”ని మంచి నవల చేసాయో — అవన్నీ నిజానికి హెచ్.జి. వెల్సు నవల్లోంచి వచ్చినవే. నవల చివర్లో గుండెల్ని కోసే క్లుప్తతతో నన్ను కదిలించిన (పైన ఉదహరించిన) రాధాకృష్ణ, న్యాయమూర్తిల ముగింపు సంభాషణ కూడా:
"Stratton," he said, "we two—— We killed her. We tore her to pieces between us...." 
I made no answer to this outbreak. 
"We tore her to pieces," he repeated. "It's so damned silly. One gets angry—like an animal." 
I became grotesquely anxious to assure him that, indeed, she and I had been, as they say, innocent throughout our last day together. "You were wrong in all that," I said. "She kept her faith with you. We never planned to meet and when we met——. If we had been brother and sister——. Indeed there was nothing." 
"I suppose," he said, "I ought to be glad of that. But now it doesn't seem to matter very much. We killed her.... What does that matter to me now?"
మూల నవలపై ఈ స్థాయిలో ఆధారపడ్డాకా యిక రచనా శైలి గురించి చర్చించవలసి వస్తే ఎలా రాసాడన్న దానికన్నా, మూలం నుండి ఎలా ప్రేరణ పొందాడు, మూలాన్ని ఎలా వాడుకున్నాడు అన్న విషయాలు పరిశీలించాల్సి వస్తుంది. అది నాకు అనవసరం. కాబట్టి వదిలేస్తున్నాను.

అయితే మూలాన్ని బట్టి చూసినపుడు, పద్మావతి చలం కథానాయికలా ఎందుకు అనిపించదో ఒక క్లూ దొరుకుతుంది. పద్మావతి హెచ్.జి. వెల్సు కథానాయిక. బహుశా చలం కథానాయిక “యెక్కడికో అసహ్యమైన చోటికనుకో యే సందుల్లోనో, గుడిశల్లో”నో ప్రేమ కోసం ప్రియుడితో వెళిపోవడానికి సందేహించదు. బహుశా ఈ నవల రాసాకే చలానికి అలాంటి కథానాయిక మనసులో మెదిలిందేమో. మెదిలి, కదిపి, మరో ఐదేళ్ళ తర్వాత “మైదానం”లో రాజేశ్వరిగా వెలికి వచ్చిందేమో. అదో ఊహ!
.