March 27, 2010

కళాప్రపూర్ణ దువ్వూరి వేంకటరమణశాస్త్రి స్వీయచరిత్ర

స్వీయకథనాల విషయంలో నచ్చడానికీ నచ్చకపోవడానికీ పుస్తకపరమైన కారణాలేం చెప్పలేం. ఎందుకంటే మనకు వాటిలో మిగతా పుస్తకాల్లా ఒక కల్పితప్రపంచం గానీ ఒక ఆలోచనాధార గానీ కనిపించదు, ఒక వ్యక్తి కనిపిస్తాడు. నిజాయితీగా రాసినంతవరకూ, ఆ వ్యక్తిని బట్టే అతని కథనం నచ్చడమూ నచ్చకపోవడమూ జరుగుతుంది. “ఫలానా వ్యక్తి స్వీయకథనం నాకు నచ్చలేదూ” అంటున్నానంటే “ఫలానా వ్యక్తి నాకు నచ్చలేదూ” అంటున్నట్టే అర్థం చేసుకోవచ్చు. ఇలా సదరు వ్యక్తి నచ్చనపుడు ఇక ఆ స్వీయకథనంలో నిజాయితీ వున్నా దాన్ని ఒక విలువగా పరిగణించలేను. దీనికి ఉదాహరణ “అనంతం”, నేను చదివినవాటిలోకెల్లా నాకు రోత పుట్టించిన స్వీయకథనం. అలాగాక సదరు వ్యక్తి నచ్చితే మాత్రం ఏం చెప్తున్నా వినబుద్ధవుతుంది. దువ్వూరి వేంకటరమణశాస్త్రి నాకు నచ్చాడు.

ఎందుకు నచ్చాడూ అంటే ఆయన పాతకాలం మనిషి కాబట్టి, పాతకాలం మనుషులకు మాత్రమే పరిమితమైందేదో ఆయనలో వుంది కాబట్టి. ఆ కాలం పట్ల నాకు ఏదో వ్యామోహం వుంది. ఆ “ఏదో” ఏంటో చెప్పమంటే, ఇక్కడ దాని సందర్భౌచిత్యాన్ని మించి వివరణ ఇవ్వాల్సి వస్తుంది. అయినా ప్రయత్నిస్తాను. నేను పుట్టి పెరుగుతున్న ప్రస్తుత కాలంలో దాదాపు ప్రతీ మనిషీ, పైకి ఎంత నిబ్బరంగా కనిపించినా, లోలోపల ఏదో ఒక వైకల్యపు స్పృహ వున్నవాడే. ఈ వైకల్యాలేవీ ఇప్పుడు కొత్తగా పుట్టినవి కాకపోవచ్చు, అనాది నుంచీ వున్నవే కావొచ్చు. కానీ సైకోఅనాలసిస్ అనే పనికిమాలిన శాస్త్రం బాగా విస్తరించింది మాత్రం ఇటీవలి కాలంలోనే. ఇప్పుడు ఏ తరహా మనస్తత్వాన్ని చూపించినా సైకాలజిస్టు దానికి ఒక పేరూ, ఒక వర్గీకరణా, ఒక లక్షణ సంగ్రహమూ తగిలిస్తాడు. ప్రస్తుతం ఎవరి వైకల్యాల పేర్లు వాళ్ళకి తెలుసు. బడిలో తోటివాళ్ళతో జట్టుకట్టలేకపోతున్న బుడ్డోడ్ని కదిలించినా తనది ఫలానా “కాంప్లెక్స్‌” అని సులువుగా చెప్పేయగలడు. ఇన్ఫీరియార్టీ కాంప్లెక్సూ, గిల్ట్ కాంప్లెక్సూ, ఒడిపస్ కాంప్లెక్సూ, ఎలక్ట్రా కాంప్లెక్సూ, బస్ కాంప్లెక్సూ, లారీ కాంప్లెక్సూ, వల్లకాడు కాంప్లెక్సూ…! ఇవిగాక సిండ్రోములూ, డిజార్డర్లూ వేరే వున్నాయి! ఇన్‌సెక్యూరిటీలు ఇంకా బండెడున్నాయి! పోనీ ఇన్ని రకాల రుగ్మతల్ని నామకరణం చేసి పుట్టించే ఈ సైకాలజీ అంతిమంగా ఏదైనా ఆదర్శస్థితి వైపు మనుషుల్ని మళ్ళిస్తుందా అంటే అదీ లేదు. అసలలాంటి స్థితే భ్రమ కదా! ఇలా ప్రతీదానికీ పేరు తగిలించి “నేతి నేతి” అనుకుంటూ లెక్కలోంచి తీసేయడమే తప్ప ఆ మాయదారి బ్రహ్మపదార్థం ఎక్కడా తగలి చావదు. చివరికి మిగిలేది శూన్యమే. అది అర్థం చేసుకోలేని వాళ్ళ జేబుల మీద పడి బతకడం మాత్రమే సైకాలజీ చేసేది. అసలు నన్నడిగితే వైకల్యం లేకపోవటం అంటే వైకల్యం వుందన్న ఎరుక లేకపోవడమే అంటాను. అలాంటి పనికిమాలిన ఎరుక లేని కాలం పాతకాలం. తత్ఫలితమైన తేటదనం ఆనాటి మనుషుల్లో కనిపిస్తుంది. దువ్వూరిలో వేంకటరమణశాస్త్రిలో నాకు కనిపించింది. అసలేం చెప్పదలచుకున్నాను ఇక్కడ? ఈ పేరా దువ్వూరి గురించి కన్నా నాగురించే ఎక్కువచెప్తుందని తెలుసు. ఈ వ్యాసం ముఖ్యోద్దేశం పుస్తకం గురించి కన్నా, పుస్తకంతో నా అనుభవం గురించి చెప్పటమే గనుక ఆ సంకోచమేమీ లేదు. దువ్వూరిలో నాకు మొదట నచ్చిన గుణం తేటదనం. అట్టడుగున చేపలగుంపులూ గులకరాళ్ళూ స్పష్టంగా కనపడే సెలయేటిజాలులాంటి తేటదనం. తన మెతక కొలతల్తోనే కరుడుగట్టిన ప్రపంచాన్ని ఆయన అంచనా కట్టే తీరు నాకు నచ్చింది. ఆయనకు గిట్టని, అర్థంకాని, బాధపెట్టే మనస్తత్వాలు తారసపడినా ఆయన్నుంచి వచ్చే మహగట్టి విమర్శ “అదో రకం మనిషి” అన్న ఒక్క ముక్క మాత్రమే. ఉదాహరణ చెప్తాను. దువ్వూరికి ఇరవయ్యేళ్ళు వచ్చేసరికే తండ్రి పోయారు. బతికుండగా ఆయన తన ఒక్కగానొక్క కొడుకుతో ఎన్నడూ ఓ నాలుగు నిముషాలైనా తీరుబడిగా మాట్లాడలేదట! ఆయన గురించి దువ్వూరి మాటలివి:
ఊళ్ళో అందరితోనూ ఎంత కలిసికట్టుతనం ఉండేదో ఇంట్లో అంత ముభావం. ఇంట్లో ఎవ్వరితోనూ మాట్లాడే అలవాటే లేదు. అదో వింతైన స్వభావం. మాకందరికీ పెద్దపులిని చూస్తున్నట్లుండేది. ముఖంలో క్రూరత ఉందేమో అంటే సౌమ్యమయిన ముఖం, ఎత్తైన విగ్రహం. పచ్చగా కోమలంగా ఉండే శరీరం. అతిశుభ్రంగా ఉండే అలవాటు. మంచి ఆరోగ్యం. ఎంతో చురుకుదనం. ఎప్పుడూ ఉల్లాసమే. చింతా చీకూ ఉండేది కాదు. ఆయన నవ్వులో ఒక విలక్షణమైన అందం ఉండేది. ఆ మాట చాలామంది అంటూండేవారు. పై వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆ నవ్వు చూడాలని నేను ముచ్చటపడే వాణ్ణి. ఇంట్లో నవ్వు కనబడేదే కాదు. పోనీ మామీద ప్రేమ లేదనుకుందామా అంటే అమితమైన ప్రేమ. ఎందుకుండదు? నేను ఒక్కణ్ణే కుమారుణ్ణి. అయితే అంత ముభావం ఏమిటంటే; చనువిస్తే ఇంట్లో వాళ్ళకీ పిల్లలకీ భయభక్తులుండవని తెచ్చిపెట్టుకున్న గాంభీర్యం గాని ఇంట్లో ఎవరి మీదా కోపమూ కాదు. అయిష్టమూ కాదు. అదో రకం ప్రకృతి.
సరీగా చెప్పాలంటే; ఆయన జీవితం మొత్తంలో నాలుగు నిముషాలు వరసగా నాతో మాట్లాడిన జ్ఞాపకం లేదు. ఒకటి రెండు నిముషాలు మాత్రం మాట్లాడిన సందర్భాలు కొన్ని జ్ఞాపకం ఉన్నాయి. చాలా కొద్ది. అవయినా ఎప్పుడు? నాకు పదహారేళ్లు దాటిన తరువాత. ఇంకొక్క మాట, నాకు రెండు మూడేళ్ళ వయస్సులో కూడా నన్ను ఒక్కసారయినా ఎత్తుకున్నట్లుగాని ఎప్పుడయినా దగ్గిర పరుండబెట్టుకున్నట్లు గాని చూచిన వారెవ్వరూ లేరు. ఆ అలవాటు  అసలే లేనట్లు మా తల్లిగారి వల్లే విన్నాను. […] 
మరేమీ కాదుగాని, తండ్రికి మరింత సన్నిహితంగా ఉండి ఇంకా కొంత ఆనందం పొందే అవకాశం మనకు లేకపోయిందే అని మాత్రం అప్పుడప్పుడు ఇప్పటికీ అనుకుంటూంటాను. అంతేగాని ఆయనవల్ల ఆ యిరవై యేళ్లూ కలిగింది నిరుత్సాహమే అని మాత్రం అనుకోవడం లేదు.
దువ్వూరి వాక్యాలు మనతో మాట్లాడే తీరులో, అంటే ఆయన వచనపు గొంతులో, ఆయన స్వభావం ఏ మరుగూ లేకుండా బయటపడిపోతుంది. ఒక గుంపులో అందరూ నాకు సానుకూలమైన వ్యక్తులే ఉన్నప్పటి సందర్భంలో నా ప్రవర్తన ఒకలా వుంటుంది; ఆ అందరిలోనూ నాపట్ల అమనమ్మకం గల వ్యక్తి ఒకరున్నప్పటి సందర్భంలో నా ప్రవర్తన మరొకలా వుంటుంది. రెండో సందర్భంలో నన్ను నేను చూసుకోవటం మొదలు పెడతాను, నా వాక్యాలు ఆచితూచాకనే బయటకొస్తాయి. అదే సన్నివేశంలో ఇంకెవరన్నా అయితే ఏం లెక్కచేయక ధీమాతో మాట్లాడవచ్చు, మరికొందరు మేకపోతు గాంభీర్యంతో నెట్టుకురావచ్చు. దువ్వూరి మాత్రం అసలలా తన పట్ల అపనమ్మకం గల వ్యక్తులు వుండటమే ఊహాతీతం అన్నట్టు మాట్లాడతాడు. ఆయన వాక్యాలు మొత్తం ప్రపంచమంతటినీ విశ్వసిస్తూ మాట్లాడే వాక్యాలు. అది ధీమా అనను. ఒక అమాయకమైన విశ్వాసం అంటాను. అది నాకు నచ్చింది. అలాంటి మనుషులు నాకు నచ్చుతారు. ఒక ఉదాహరణ ఇస్తాను. ఇది ఆయన భార్య గురించి చెప్పే సందర్భం. మొత్తం పుస్తకంలో ఆవిడ గురించి రాసిన రెండే సందర్భాల్లో ఇది మొదటి సందర్భం. దీనికి ముందున్న మూడు పేరాల్లోనూ ఆమె చత్వారం వచ్చినా షోకనుకుంటారేమోనని కళ్ళజోడు వేయించుకోవడానికి ఎలా బిడియపడిందో చెప్తాడు. చివరికి ఇలా ముగిస్తాడు:
కొసకి ఎనాళ్ళు చెప్పినా ఆవిడకి మాత్రం నచ్చలేదు. జోడు పెట్టుకోనే లేదు. చత్వారం రానూ వచ్చింది. పోనూ పోయింది. 70 ఏళ్ళు దాటినా ఇప్పటి వయస్సులో సన్నసూదిలో ముతక దారం కూడా అవలీలగా ఎక్కిస్తోంది. కాలాన్ని బట్టి పూర్వకాలపు వేషభాషలు మార్చడమంటే ఆవిడకి నచ్చదు. మారిస్తే అదో షోకని అనుకుంటారేమో అని ఆమెకు సంకోచం – ఆ పూర్వపు వేషభాషలను గూర్చీ, చదువు లేకపోవడాన్ని గూర్చీ ఆవిడ విషయంలో ఇంకా వ్రాయవలసిన చిత్ర విచిత్రమైన సంగతులు నా తల్లో చాలా ఉన్నాయి. అవన్నీ రాశానంటే మీ అందరితోనూ చెప్పేనని ఆవిడ బిడియపడుతుందేమో! అంచేత అట్టే వ్రాయను. ఊరికే మచ్చుకి రెండు మాటలు వ్రాశాను.
నా వాదనకి ఈ పేరా ఎలా ఊతంగా నిలుస్తుందో చెప్పమంటే ఖచ్చితంగా చెప్పలేను. అహ! కాస్త ఆలోచిస్తే చెప్పగలనేమో. కాస్త ఆలోచిస్తే, “అవన్నీ రాశానంటే మీ అందరితోనూ చెప్పేనని ఆవిడ బిడియపడుతుందేమో!” అన్న ఆ వాక్యం నాకు అంతగా ఎందుకు నచ్చిందో సవిశ్లేషణాత్మకంగా వివరించగలనేమో. కానీ వివరించను. ఆ ప్రయత్నం చేసి అందులో నాకు కనిపించిన (బహుశా నాకు మాత్రమే కనిపించే) అందాన్ని జావ కార్చడం ఇష్టం లేదు. ఇందుకే పుస్తక పరిచయాలు నిష్పలం అనిపిస్తాయి. నాకు తెలుసు, దువ్వూరే గనుక నేను పైన రాసిందంతా చదివితే ఇబ్బంది పడతాడు, ఎబ్బెట్టుగా ఫీలవుతాడు, కొండొకచో చికాకు పడతాడు; తనకు సంబంధం లేని వ్యవహారంలో తననిలా ఇరికిస్తున్నందుకు బహుశా స్వీయధోరణిలో నన్ను “అదో రకం మనిషి” అని విసుక్కున్నా విసుక్కుంటాడు. సాక్షాత్తూ ఈ పుస్తక రచయితే ఇచ్చగించని స్పందన ఈ పుస్తకం నాలో కలిగించిందన్నమాట. ఈ ఒక్క పుస్తకమనే కాదు, చాలావరకూ పుస్తకాలు మనలో కలిగించే భావాలు ఇంత ఆత్మీయంగానే వుంటాయి. కానీ పరిచయాలు రాయాల్సి వస్తే మాత్రం ఈ ఆత్మీయమైన అంశాలను లోపలే తొక్కి పట్టి వేరే చప్పిడి అంశాలను పట్టించుకుంటూ రాయాలి. అంతేగానీ ఇవన్నీ బయట పెడితే ఇంటిగుట్టు రచ్చకెక్కించినట్టు ఛండాలంగా వుంటుంది. రాసే వాళ్ళకూ చదివే వాళ్ళకూ లజ్జాకరంగా తయారవుతుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు, దీన్ని ఇంతటితో వదిలేసి చప్పిడి అంశాల దగ్గరకొచ్చేస్తాను.


దువ్వూరి వేంకటరమణశాస్త్రి 1898లో జన్మించాడు (తెలుగు కాలమానం ప్రకారం విలంబి సంవత్సరం వైశాఖ శుద్ధ పంచమి నాడు; నా కాలమానం ప్రకారం నబొకొవ్‌ పుట్టడానికి ఒక సంవత్సరం ముందు). బాల్యంలో విద్యాభ్యాసం సాదాసీదాగానే మొదలైనా, పన్నెండేళ్ళ వయస్సులో తండ్రి తరపు తాతగారి చెంత గడిపిన రెండేళ్ళలోనూ జ్ఞానార్జన పట్ల అనురక్తి మొదలైంది. ఆయన శబ్దమంజరి మొదలుకొని రఘువంశం దాకా మనవడికి అన్నీ దగ్గర కూచోపెట్టుకుని బోధించాడు. దువ్వూరి అటుపిమ్మట చుట్టు పక్కల ఊళ్ళలోని సంస్కృత పాఠశాలల్లో చదువు సాగించి పదిహేడేళ్ళకు విజయనగరం సంస్కృత కాలేజీలో చేరాడు. చదువులో ప్రతిభ చూపించటం తోబాటూ, సానుకూలమైన నడతతో గురువుల మన్నన అందుకుని, దరిమిలా చదివిన కాలేజీలోనే అధ్యాపకునిగా చేరాడు. అది మొదలుకొని, వ్యాకరణశాస్త్రాన్ని బోధిస్తూ కొవ్వూరు, చిట్టిగూడూరు, గుంటూరు, విశాఖపట్టణాల్లో నలభైఅయిదేళ్ళ పాటు అధ్యాపకవృత్తిలో కొనసాగాడు. వీటిలో ఎక్కువకాలం పన్చేసిన స్థానాలు పద్దెనిమిదేళ్ళ పాటు చిట్టిగూడూరు సంస్కృతకాలేజీ, ఇరవైమూడేళ్ళపాటు విశాఖపట్నం ఆంధ్రాయూనివర్శిటీ. పదవీవిరమణ అనంతరం, తాను గత నాలుగు దశాబ్దాలుగా విద్యార్థులకు బోధిస్తూ వస్తున్న చిన్నయసూరి బాలవ్యాకరణానికి “రమణీయం” పేరుతో వ్యాఖ్య రాసాడు. “అగ్ని సాక్షికాలైన అనుబంధాలు కూడా అక్కడక్కడ శిథిలమై ఆషామాషీగా ఉండవచ్చునేమోగాని ఆచార్య సాక్షికాలైన అనుబంధాలకు ఎన్నడూ శైథిల్యం రాదు” అన్న తన మాటల ప్రకారమే అభిమానించే గురువులు, మిత్రులు, శిష్యుల సాంగత్యంలో చరమకాలం గడిపాడు. 1976లో చనిపోయాడు (నబొకొవ్ చనిపోవడానికి ఒక సంవత్సరం ముందు). ఇక రెండేళ్ళలో చనిపోతాడనగా 1974లో ప్రస్తుత స్వీయకథనం పూర్తిచేశాడు. ఈ రచన చివర్లో తన జీవితాన్ని క్లుప్తంగా ఇలా సింహావలోకన చేసుకున్నాడు:
ఈ మాదిరిగా జీవిత సమాచారాన్ని సింహావలోకనం చేసుకోవడంలో నాలో నాకు కొన్ని ప్రశ్నలూ సమాధానాలూ స్ఫురిస్తున్నాయి. 
అసలీ గడ్డ మీది కెందుకొచ్చాం?
పురాకృత కర్మఫలంగా సుఖమో దుఃఖమో అనుభవించడానికొచ్చాం. 
ఎప్పుడొచ్చాం?
రమారమి 80 ఏళ్లు కావస్తోంది. 
ఎక్కడున్నాము?
ఎక్కడెక్కడ అన్నోదక ఋణానుబంధం ఉందో అక్కడక్కడల్లా ఉన్నాము. 
ఏమి చూచాము?
ఈ యాత్రలో ఏవో కొన్ని ప్రదేశాలు చూచాము, తీర్థాలూ క్షేత్రాలూ కొంతవరకు చూచాము. చాలామంది పెద్దల్ని చూచాము. కొంతమంది సన్మార్గుల్ని చూచాము. దుర్మార్గులూ, స్వార్థపరులూ, మాయావులూ, మోసగాళ్లూ, లోభులూ, అసూయాపరులూ, అవినీతిపరులూ మధ్యమధ్య చాలామంది కనబడ్డారు. వింతలు చాలా చూచాము. అన్నిటికన్నా ముఖ్యం మనకు వెనుక ముందు తరముల వారికి లభ్యముకాని అవతారమూర్తి అయిన గాంధీమహాత్ముని సన్నిహితంగా సావధానంగా చూచాము. 
ఏమి చేశాము?
మానవమాత్రులు చేసే మామూలు పనులే తప్ప ప్రత్యేకంగా చెప్పుకోతగినంతటి ఘనకార్యాలేమీ చేయలేదు. ఘోరమయిన క్రూర కార్యాలేమీ చేసినట్లు లేదు. చాలామందితో స్నేహం చేశాము. గురువుల వాత్సల్యం ఎక్కువగా సంపాదించుకున్నాం. ఏవో నాలుగు ముక్కలు చదువుకున్నాం. తృప్తికరమైన శిష్యవర్గాన్ని సంపాదించుకున్నాం. కుటుంబ కర్తవ్యాలు పిల్లల కప్పగించి తటస్థంగా తప్పుకున్నాం. ఇదీ చేసిన పని. 
ఏమి చెప్పాము?
ఏదో కొద్దిగా పదిమంది పిల్లలకి నాలుగక్షరాలు చెప్పేము. 
ఏమి విన్నాము?
పెద్దలూ గ్రంథకర్తలూ చెప్పిన మంచి మాటలు కొన్ని విన్నాం. 
ఏమి తెలిసింది? ఎంత తెలిసింది?
ఏవేవో తెలిశాయిగాని తెలియవలసింది మాత్రం ఏమీ తెలిసినట్లు లేదు. తెలిసిందైనా ఆవగింజలో అరవైయో వంతనీ తెలియనిది కొండంత ఉందనీ తెలిసింది. 
ఐహిక విషయాల మాట అటుంచి ఆముష్మికానికి ఏమయినా ప్రయత్నం జరిగిందా?
ఏమో! జరిగిన జీవిత చర్యలో ఆముష్మికానికి ఉపకరించేది ఏ కొంచెమయినా ఉన్నదా అనే సంగతి దైవం నిర్ణయించాలి. అది మనకు చేతనైన పని కాదు. 
ఇక చరమదశలో ఈ శేషకాలంలో కార్యక్రమం ఏమిటి? కర్తవ్యమేమిటి?
ఏమీ లేదు. ఇక్కడి దృష్టులు అట్టేపెట్టుకోక ఇష్టదేవతను ధ్యానిస్తూ “వాసాంసి జీర్ణాని యధావిహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి” అన్న గీతోపదేశం అర్థమయింది గనుక చివికి శిథిలమై చిందరవందరగా ఉన్న ఈ ఇల్లు విడిచి కొత్త యింట్లో ప్రవేశించడం ఎప్పుడూ? ఈ చింకి గుడ్డలు పారవేసి కొత్త బట్ట కట్టడం ఎప్పుడు? అని నిరీక్షించడం ఒక్కటే కర్తవ్యంగా కనబడుతోంది.
చాలా స్వీయకథనాల్లో ఆయా రచయితలు తమ జీవితాన్ని ఏదో రకంగా సార్థకమని నిరూపించుకోవడానికి పడే తాపత్రయం స్పష్టాస్పష్టంగా కనిపిస్తూనే వుంటుంది. సాధారణంగా స్వీయకథనాలు రాసేది జీవిత చరమదశలో కాబట్టి ఆ యావ సహజం. అందువల్ల వాటికి వారే కేంద్రబిందువులుగా వుంటారు. అందులో తప్పు పట్టేందుకేమీ లేదు. దువ్వూరి స్వీయకథనంలో మాత్రం కొట్టొచ్చినట్టు కనిపించేదేమిటంటే, ఆయన తన గురించి ఎంత తక్కువ చెప్తున్నాడో కదా! అన్న సంగతి. తన గురించి చెప్పే ఆ తక్కువ సందర్భాల్లో కూడా, జీవితం తనకు అందించిన ఫలానా అదృష్టాన్ని మరొక్కసారి నెమరు వేసుకుని కృతజ్ఞత వ్యక్తపరచుకోవాలన్న ధ్యాసో, జీవితం తనకు నేర్పిన ఫలానా పాఠాన్ని మరొక్కసారి గుర్తు తెచ్చుకుని జాగరూకత బోధించాలన్న ఉద్దేశమో కనిపిస్తాయి తప్ప, మరుగున మిగిలిపోయిన ప్రజ్ఞల్ని ఎట్టకేలకు లోకం వెలుగులోకి తీసుకువస్తున్న హడావిడేమీ కనిపించదు. జీవితంలో తనకు తారసిల్లిన కొందరు వ్యక్తుల స్నేహసాంగత్యాలూ, తాను మసలుకున్న ప్రత్యేక వాతావరణమూ తన అస్తిత్వం కన్నా ముఖ్యమైనవన్న స్పృహ ఆయనకుంది. అందుకే తనని కాసేపు పక్కనపెట్టి ఆయా వ్యక్తుల గురించి, ఆ వాతావరణాన్ని గురించీ పలువురికీ చెప్పాలన్న తపన ఆయనలో కనిపిస్తుంది. ఆ తపనే లేకపోతే, “జీవిత రంగంలో జరిగిన ఘట్టాలు జ్ఞాపకం తెచ్చుకొని సమీక్షించుకోవడానికి వ్రాసుకునే డయిరీ” అంటూ మొదలు పెట్టిన ఈ పుస్తకంలో, తన జీవితం మాట అటుంచి, అసలు తాను జీవించిన కాలంతోనే సంబంధంలేని కాటన్‌దొర ప్రసక్తి అంతగా ఎందుకు చెప్పండి. వజ్రసంకల్పంతో గోదావరిపై ఆనకట్ట నిర్మించి  ఆ జిల్లాల్ని సస్యశ్యామలం చేసిన సర్ ఆర్థర్ కాటన్‌దొర గురించి ఆయన చెప్పిన ఆసక్తిగొలిపే (నాలాంటి గోదావరిజిల్లాల వాడికి మరింత ఆసక్తి గొలిపే) ఒక పిట్టకథ ఇది:
కాటన్‌దొర ఆనకట్టా, కాలవలు వీటి నిర్మాణం యావత్తూ పూర్తయిన తరువాత పొలాల్లో పుష్కలంగా నీరు ప్రవహిస్తూ ఉంటే పైరు పచ్చలతో ముచ్చటగా కన్నులపండువుగా ఉన్న భూములన్నిటినీ ఒక్కమాటు స్వయంగా కంటితో చూచి ఆనందించాలని బోటు వేసుకుని ఆ కాలవలన్నిటి మీద కొన్నాళ్లపాటు నెమ్మదిగా సంచారం చేశాడట. అన్నీ సావకాశంగా చూచి జీవితం సార్థకమయిందని ఎంతో తృప్తిపడ్డాడట. 
ధవళేశ్వరమునుంచి తాళ్ళరేవు దాకా ప్రవహించే మా కాలవను ఆనుకుని కపిళేశ్వరపురం అని ఒక గ్రామం వుంది. ఊరు పెద్దది. అరవై యిళ్ళ అగ్రహారం. ఆ కాలంలో సుమారు డెబ్బయి ఎనభైమంది వేదవేత్తలు అక్కడుండేవారు. అందులో క్రతువులు చేసినవారు కూడా చాలామంది ఉండేవారు. గొప్ప శిష్టులు. వారంతా ఉదయాన్నే ఆ కాలవలోనే స్నానాలు చేస్తూండేవారు. ఎప్పుడు చేసినా సంకల్పం చెప్పుకుని స్నానం చెయ్యడం శిష్టుల సంప్రదాయం. కాలవలు తవ్వించి యింత మహాసౌఖ్యం కలిగించిన ఆ కాటన్‌దొరను అతి కృతజ్ఞతతో నిత్యమూ తలచుకుంటూండేవారట. అతణ్ణి భగీరధునిలాగ భావించి, మనస్సులో పూజిస్తూండేవారట. ఆ వూరు పెద్దది గనక ఒక్క స్నానాల రేవు సరిపడక ఊరి రెండో కొసను మరొక రేవు కూడా తాత్కాలికంగా ఏర్పరుచుచున్నారట. 
ఒకరోజున పెద్దరేవులో అయిదారుగురు బ్రాహ్మలు “కాటన్‌దొర స్నానమహం కరిష్యే కాటన్‌దొరస్నాన మహం కరిష్యే” అని సంకల్పం చెప్పుకుంటూ స్నానం చేస్తున్నారట. కాలవలన్నీ పరిశీలించ బయలుదేరిన దొరగారి బోటు సరీగా ఆ స్నానాల సమయానికి కపిళేశ్వరపురం కాలవరేవులోకి వచ్చిందట. వారి స్నాన సంకల్పంలో ‘కాటన్‌దొర’ అన్నమాట అతనికి వినిపించిందట. తనపేరు వారెందుకు అంటున్నారో అని అది మరేదేనా శబ్దమేమో అనీ అతనికి సందేహం కలిగి, ఆ మాటేమిటో కనుక్కురమ్మని బోటు ఆపి, తన గుమస్తాను పంపించాడట. అతడు వెళ్ళి “కాటన్‌దొర అంటున్నారే అదేమిటండీ?” అని వారిని అడిగితే వారు “అయ్యా! కాటన్‌దొరగారని ఒక గొప్ప ఇంజనీరు. మహామంచివాడు. ఆ మహానుభావుడే యీ కాలవలన్నీ తవ్వించాడు. స్నానపానాదులకు సౌకర్యం లేకుండా తరతరాల నుంచి కష్టపడుతున్నాం. అతని దయవల్ల ఇలాటి సౌఖ్యం మాకు కలిగిందని నిత్యమూ చెప్పుకుంటూంటాం” అన్నారట. ఆ మాటలు గుమాస్తా వల్ల తెలుసుకుని “ఆ అమాయకులది ఎంత కృతజ్ఞతో” అని మెచ్చుకుంటూ, ఆ సంతోషంలో పెట్టెలో డబ్బు తీసి పదేసి రూపాయల చొప్పున రేవులో ఉన్న వారికందరికీ బహుమతులు ఇచ్చేడట. ఈ సంగతి విని స్నానావసరం లేని మరికొందరు బ్రాహ్మలు ఊరుకు రెండో కొసనున్న ఆ యెగువరేవుకు మరోదారిని వెళ్ళి బోటు వచ్చేదాకా కనిపెట్టుకుని ఉండి అది వచ్చేసరికి బాగా వినబడాలని గట్టిగా “కాటన్‌దొర స్నానమహం కరిష్యే” అని పెద్ద గొంతుకలతో సంకల్పం చెపుతూ స్నానాలు మొదలు పెట్టేరట. – వాళ్ళ వాలకం చూచి, బహుమతుల సంగతి ఆ రేవు నుంచి యిళ్లకు వెళ్ళిన బ్రాహ్మల వల్ల విని ఆ బహుమతి కోసం చెపుతున్న మోసపు సంకల్పంగాని వీళ్ళది నిజమయిన సంకల్పం కాదని కనిపెట్టి బోటు తాడులాగుతున్న సరంగులను కేకవేసి “గవర్నమెంటు ఏర్పరిచిన అసలు రేవులో కాకుండా తప్పు రేవులో ఇటుపైని స్నానాలు చేస్తే ఖయిదులో పెడతామని గట్టిగా చెప్పి వాళ్ళందరినీ ఒడ్డుకు తరమండి” అని చెప్పేడట – అయ్యా! కర్రలు పుచ్చుకుని వాళ్ళు ఒకటే తరమడం ఆరంభించారట. వారంతా ఒళ్ళయినా ఒత్తుకోకుండా ఒడ్డెక్కి నీళ్ళోడుతూ పట్టుకువచ్చిన చెంబులు కొందరు చేతపట్టుకునీ, కొందరక్కడే వదిలిపెట్టి పడుతూ లేస్తూ పరుగులెత్తేరట. ఇదంతా ఎందుకు చెప్పేనంటే గోదావరీ ప్రసంగం వచ్చినా కాలవల మాట వచ్చినా కాటన్‌దొరగారు జ్ఞప్తికి రాకతప్పదు. ఆయనలో శతాంశమయినా ఉపాయం ఎరిగిన ఉద్యోగస్థులు ఈనాడు ఉంటే గోదావరి భయం తప్పిపోను గదా అని తీరవాసులు తరచు అనుకుంటూంటారు. అలాటి ఉపాయశాలులు లేకనే చాలా భూములకు నదీ ప్రవేశయోగం ఇప్పటికీ తప్పలేదు.
ఇదొక్కటనే కాదు. పుస్తకంలో ఇలాంటి ఘట్టాలు చాలా వున్నాయి. మొత్తం పుస్తకంలో తన తల్లిదండ్రుల వివరాలకూ తన సంసారజీవితపు ముచ్చట్లకూ ఓ మూణ్ణాలుగు పేజీలు కన్నా ఎక్కువ కేటాయించని ఆయన, తన పద్దెనిమిదేళ్ళ చిట్టిగూడూరు సర్వీసును ఒక్కటంటే ఒక్క పేజీలో తేల్చేసిన ఆయన, ఉదాహరణకి, అప్పట్లో విద్యార్థుల చేత అక్షరాలు ఒరవడి దిద్దించేందుకు గురువులు అనుసరించే ప్రత్యేకమైన పద్ధతి గురించీ, తన తాతగారి మజ్జిగ అలవాటు గురించీ, తానెన్నడూ సంభాషించి కూడా ఎరుగని పోలిశెట్టి వెంకటరత్నం అనే కాపు గురించీ, తనకు స్వల్ప పరిచయం మాత్రమే వున్న కాశీనాధశాస్త్రి అనే పండితుని గురించీ, కనీసం ముఖ పరిచయం కూడా లేని దండిభట్ల విశ్వనాధశాస్త్రి అనే మరో పండితుని గురించీ మాత్రం పేజీలకు పేజీలు రాస్తాడు. ప్రపంచంలో తమకన్నా విలువైన విషయాలున్నాయన్న స్పృహ వున్నవాళ్ళు జీవితం నుంచి ఎగుడుదిగుళ్ళులేని స్థిరమైన ఆనందాన్ని అందుకుంటారు, స్థిమితంగా వుంటారు. అహాన్ని పక్కన పెట్టి వారు అక్కున చేర్చుకునే విలువల్ని మనమూ నమ్మకంతో స్వీకరించవచ్చు. ఈ పుస్తకం ఓ శిథిల ప్రపంచాన్ని నా కళ్ల ముందు తిరిగి నిలబెట్టింది. అది జ్ఞానం ప్రధానమైన ప్రపంచం, మధ్యతరగతి మెటీరియల్ దేబిరింపుల కంపు ఇంకా అంతటా అలుముకోని ప్రపంచం. ఒక వ్యక్తి ఇంత భరోసాతో తన జీవితాన్ని ఈ విలువలకి అంకితం చేసుకున్నాడని తెలిసినపుడు, అదే కాలం అయితేనేం, ఆ భరోసాలో కొంత ఈ కాలపు చదువరికీ బదిలీ అవుతుంది.

ఇందులో కొందరు అరుదైన వ్యక్తుల గురించి, వారి పాండిత్యం గురించీ దువ్వూరి చెప్పిన సంగతులు నాకు నచ్చాయి. మధ్య మధ్యన స్వీయజీవితంలోంచి తీసి చెప్పిన విశేషాలు కూడా నచ్చాయి. అలాంటి ఓ విశేషం ఇక్కడ ఇస్తున్నాను. పద్యాల్లో పదచ్ఛేదం తప్పితే పుట్టే సరదా ఇది. దువ్వూరి కొవ్వూరు సంస్కృతకాలేజీలో చేరినప్పటి సంగతి. ఆ కాలేజీ కమిటీ కార్యదర్శి సూర్యనారాయణరావు అనే ఒకాయన, స్వయంగా పండితులు కావటంతో, కాలేజీలో కొత్తగా చేరే పండితులకు సందేహాలడిగే మిషతో పాండిత్య పరీక్షలు చేస్తుండేవారట:
నేను కొవ్వూరు కాలేజీలో ప్రవేశించిన 10-15 రోజులకు ఓ రోజున సూర్యనారాయణరావుగారు కాలేజీలో నేనుండే గది కొచ్చారు. అప్పటికప్పుడే ఇద్దరికీ బాగా పరిచయం కలిగింది. ఏదో ఆమాటా ఈమాటా చెపుతున్నారు. మామూలు ఇష్టాగోష్ఠే అనుకున్నాను. కాని ఆయన మనస్సులో ఒక ఆలోచన ఉన్నట్లు తరువాత గ్రహించాను. […] నన్ను కొంచెం కదిపి చూడాలని ఆయన మనస్సులో ఉంది. పరీక్ష చేసినట్లు కనబడకుండా పరీక్షించాలని కబుర్లేవో చెప్పి చెప్పి “ఏమండి! ప్రౌఢ వ్యాకరణంలో ఉదాహరణగా ఒక భారత పద్యం ‘అనిన నలుగాలివాన గోవును నశేష శబ్దముల మంత్రమును లోహజాతి గాంచనమును మనుజుల విప్రుండు సమధికత్వభాజనము లండ్రు వేద ప్రపంచ విదులు’ అని యిచ్చేడు కదూ! అందులో ‘గాలివాన గోవు’ అనేవి పద్యంలో అన్వయించడం లేదు. ఏదో తప్పు పడ్డట్టుంది. అది మీరెలా సరిపెడతారో కొంచెం చూడండి” అని అడిగేరు. అడిగేటప్పుడు ఆయన ముఖవైఖరి చూస్తే యిది కుదిరేది కాదనీ, ఎవ్వరూ చెప్పలేని ప్రశ్ననీ నిశ్చయంతో ధీమాతో అడుగుతున్నట్లు గోచరించింది. కాని అదో దైవ సంఘటన. ఆ పద్యం నేను చాలాసార్లు చూచింది, బాగా బోధపడిందీ, చక్కగా అన్వయిస్తున్నదీనూ. ఈయనకి సందేహం ఎక్కడో తెలుసుకుందామని “పద్యంలో కుదరనిది ఎక్కడండీ” అని అడిగేను. ” ‘గాలివాన గోవు దగ్గర సరిపడ్డం లేదు. పద్యంలో ఏవేవి గొప్ప వస్తువులో చెపుతున్నాడు. అని ననలు అంటే యుద్ధంలో పువ్వులు, అంటే పుష్పమాల వీర్యసూచకాలూ, విజయ సూచకాలూ గనుక అవి గొప్పవి. అన్ని శబ్దములలో మంత్రం గొప్పది. లోహాల్లో బంగారం గొప్పది. మనుష్యుల్లో విప్రుడూ గొప్పవాడే. అన్నీ బాగానే ఉన్నాయి. గాలివానలో గోవు గొప్పదంటే సరిపడ్డం లేదు” అన్నారు. ఆ పద్యం ప్రౌఢ వ్యాకరణంలో ఎన్నోసార్లు చూచిందీ అర్థం సరిపడిందీ గాని నాకు కొత్తది కాదు. అరెరే ఈ గాలివాన ఈయనకి ఎంత భ్రాంతి కలిగించిందీ అని చాలా ఆశ్చర్యపడ్డాను. నవ్వు కూడా వచ్చింది. బాగుండదని ఎలాగో ఆపుకున్నాను. “అయ్యా? ఇందులో గాలివాన లేదండి. పదచ్ఛేదం అది కాదు” అన్నాను. “అయితే మీరు మొత్తం భావమంతా చెప్పండి” అన్నారు. “అనిన (అనగా) అది వేరే పదం ‘నలుగాలివానన్’ నాలుగు కాళ్ళ వాటిలో (చతుష్పాజ్జంతువులలో), గోవు గొప్పది అని అర్థం. తక్కిన అన్వయం అంతా మీరు చెప్పిందేను. ‘గాలివాన’ అని కాకుండా నలు+కాలి+వానన్ అని పదచ్ఛేదం చేస్తేనే సూత్రంలో ఉన్న వానన్ అనే దాని ఉదాహరణ కుదురుతుంది. అలాకాకపోతే ఈ పద్యం ఉదాహరణకే పనికిరాదు” అన్నాను. అయ్యా! ఇక చూచుకోండి. ఆయనకి కలిగిన సంతోషానికి మేర లేదు.
ఇలాంటి జీవిత విశేషాలను మరింత హృదయరంజకం చేసేది దువ్వూరి శైలి. నలభైఅయిదేళ్ళు నిర్విరామంగా పాఠాలు చెప్పిన మాస్టారు గనుక ఏదైనా మనసుకు పట్టేట్టు ఎలా చెప్పాలో ఆయనకు బాగా తెలుసనిపిస్తుంది. ఏ విషయం తర్వాత ఏ విషయం చెప్పాలో, అసలు ఏ విషయాన్ని చెప్పేందుకు ఎన్నుకోవాలో, ఒకవేళ ఒక విషయం నుంచి మరో విషయానికి దారి మళ్ళాల్సి వస్తే పెద్దగా అయోమయమేమీ లేకుండానే మరలా వెనక్కి ఎలా తీసుకురావాలో, ఇదంతా ఆయనకు సహజంగా అబ్బిన ప్రతిభగా అనిపిస్తుంది. అందుకే మొత్తం పుస్తకంలో ఎక్కడా అధ్యాయాల విభజన గానీ, భాగాల విభజన గానీ లేకపోయినా ఆ లోటు ఎక్కడా తెలీదు. చెవి దగ్గర కూచుని ఊసులు చెప్తున్నట్టుండే వాక్యాలాయనవి. భేషజాలేవీ లేకపోవటంతో వినబుద్ధవుతుంది. “అది అలా వుంచండి, ప్రకృత ప్రసంగంలోకి వెళదాం”, “ఈ పయిమాటలకేం గాని”, “ఇప్పుడు వారినలా వుంచండి, మళ్ళీ వారిని గూర్చి ఎదర మాట్లాడుకుందాం”, “పూర్వకాలపు పండితుల ప్రసంగం గనుక వినేవారు శ్రద్ధగా వినాలి”, ఇట్లా చనువుగా చేయిపట్టుకు తనతో తీసుకెళ్తారు. “ఈ ఘట్టం ఆత్మీయులకు తెలియాలనే ముచ్చటతో వ్రాశాను. చదువరులు విసుగు చెందుతారోయేమో!” అని అప్పుడపుడూ మొహమాట పడ్తారు కూడా. ఎంతైనా వ్యాకరణశాస్త్ర పండితుడు కాబట్టి వాక్యనిర్మాణం తెలుగు భాషామతల్లి ఉబ్బితబ్బిబ్బయ్యేంత అందంగా వుంటుంది. బహుశా పరిస్థితులతో సులభంగా రాజీ పడిపోయే, ఎక్కడైనా ఒద్దికగా ఇమిడిపోయే తత్త్వం ఆయన్ని కథకునిగా మార్చి వుండదు. లేదంటే మంచి కథలు చెప్పేవాడనిపిస్తుంది.

ఇప్పుడు పూర్తిగా రూపుమాసిపోయిన ఓ ప్రపంచం గురించి తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాలంటాను. ఎందుకు తెలుసుకోవాలి, అనడిగేట్టయితే చదవక్కర్లేదంటాను; అదెలాగూ జవాబు ఆశించని మూర్ఖపు ప్రశ్న కాబట్టి. పుస్తకం ముద్రణ దిట్టంగా బాగుంది. ముఖచిత్రం బాగుంది. అట్ట, కాగితం నాణ్యత అన్నీ బాగున్నాయి. కొని, చదివి, దాచుకోవాల్సిన పుస్తకం. చుట్టూ మతిలేని గొంతులెక్కువై  అయోమయం అలుముకున్నపుడు, ఓ దిటవైన గొంతు విని స్థిమితం తెచ్చుకునేందుకు మళ్ళీ మళ్ళీ చదువుకోదగ్గ పుస్తకం.

(పుస్తకం.నెట్ లో ప్రచురితం)

March 2, 2010

Holi

An albino,
face smeared pink & blue,
feels normal.

* * *

దారిలో ఇద్దరు పిడుగులు స్ప్రైట్ 250 ml బాటిళ్ళ నిండా రంగు నీళ్ళతో నన్ను అటకాయించినప్పుడు, చొక్కా పాడవుతుందన్న తక్షణ స్పందన నన్ను చురుగ్గా చూసేట్టు చేయకుంటే, వాళ్ళు బెరుగ్గా పక్కకు తొలిగేవాళ్ళు కాదు, రోజు ఆనందపు రంగునూ పులుముకునేది.