October 14, 2015

My review of Balagopal 'రూపం-సారం' in the form of a polemic with some Virasamites

Here is the link to original discussion

* * *

As there was some discussion going on in the comments section of 'Saaranga' under an essay by a Virasamite (my guess), I thought relevant and posted a link of an interview by Balagopal, and quoted these lines from them:—


http://4.bp.blogspot.com/_K31WGNFjAbE/StMPzJMu5xI/AAAAAAAAAVM/Ofede4B4VdY/s1600-h/12+Balagopal+vyasam+2.jpg

శిల్పం గురించి మాట్లాడితే వస్తువు మీద నుండి దృష్టి తొలగిపోతుందనే కృత్రిమమైన భయం నుండి బయటపడగలిగితే, సాహిత్యానికి ‘సాహిత్యం’ లక్షణం ఇచ్చేది శిల్పమే తప్ప వస్తువు కాదనే విషయం స్పష్టమే. సాహిత్యానికీ జర్నలిజానికీ తేడా శిల్పమే. సాహిత్యాన్ని శిల్పమే రూపొందిస్తుంది. Form is constitutive of literature అని అడార్నో అంటాడు. అతను వర్గపోరాటం మీద అచంచల విశ్వాసం ఉన్న మార్క్సిస్టే మళ్లీ.
………………………..
‘ఆధునికతను మనస్ఫూర్తిగా ఆహ్వానించిన గురజాడ అప్పారావు’ కన్యాశుల్కం హీరోగా ఆధునికతను నిజాయితీగా ఆహ్వానించిన వ్యక్తిని ఎంచుకోలేదు. విరసం వంటి సాహిత్య సిద్ధాంతకారుల మాటాలు విని ఉంటే ఆ పని చేసి ఉండేవాడు. అప్పుడు కన్యాశుల్కాన్ని ఈ రోజు ఎవరూ చదివేవారు కాదు.
………………………..
సాహిత్యాన్ని కేవలం ఉద్యమాల నేపథ్యంలో చర్చించడం పొరబాటు. ఉద్యమాలు మానవ జీవితంలో ఎప్పుడూ ఒక చిన్న భాగం మాత్రమే. సాహిత్యం పాత్ర దానికి పరిమితం కాదు. అది జీవితమంత విస్తృతమైనది.

My next reply to the author's reaction:—


I don’t have a horse in this race. నేను కోట్ చేసినవి నా మాటలు కాదు, బాలగోపాల్ గారివి. మీ ప్రస్తుత చర్చకు సంబంధించిన అంశాలు ఉన్నాయని ఆ ఇంటర్వ్యూ లింక్ ఇక్కడ ఇచ్చానంతే. మీరు ఆ లింక్ నొక్కి చదవనట్టుంది. చదవండి, మీరు నాకు పెట్టిన కామెంట్లో ప్రస్తావించిన అంశాల మీద ఆయన వివరణలు కూడా ఉన్నాయి. అవి నాకైతే పడికట్టు విమర్శల్లా అనిపించలేదు, ఉద్యమాలతో దగ్గరగా పని చేసిన మనిషిగా ఆయన పరిశీలనలోకి వచ్చిన అంశాలేమో అనిపించాయి. ఆయన జీవితం ఆఖర్లో ఆయన దృక్పథం చేరుకున్న పర్యవసానాల్లా ఉన్నాయి. మార్క్సిస్టులు సాహిత్యం పట్ల వ్యవహరిస్తున్న తీరు వాళ్ళకీ సాహిత్యానికీ ఉన్న ఉండాల్సిన సంబంధాన్ని ఎలా పలచన చేసిందన్నది చర్చిస్తూ ఆయన తన ‘రూపం – సారం, సాహిత్యం పై బాలగోపాల్’ అన్న పుస్తకంలో ‘మనిషి, చరిత్ర, మార్క్సిజం’, ‘ఖాళీలు పూరించడమే సాహిత్యం పని’ లాంటి వ్యాసాల్లో కూడా రాశారు.


After this, the author of the essay asked me whether I support the views expressed by Balagopal in that interview, and wanted me to defend my stance. And I did:—


బాలగోపాల్ ఇంటర్వ్యూలోని అభిప్రాయాలతో నాకు పూర్తి సమ్మతి లేదు. అది నాకు ఆపాదింపబడే అవకాశం ఉన్నందునే మొదటి కామెంట్ నా పేరుతో చేయలేదు. ఐతే నాకు ఆ అభిప్రాయాల పై ఉన్న అభ్యంతరాలు మరో లెవెల్లోవి. (బాలగోపాల్ సాహిత్యాన్ని ట్రెండ్స్ గా మాత్రమే ఆకళింపు చేసుకున్నారు. మార్క్సిస్టు దృక్పథం నుంచి విశాలమై ఎగ్జిస్టెన్షియలిజాన్నీ, పోస్ట్ మోడర్నిజాన్నీ అర్థం చేసుకుని అన్వయించే ప్రయత్నం చేశారు. కానీ నేను సాహిత్యాన్ని అలా చూడలేను. హోమర్ నుంచి జాయ్స్ దాకా జెన్యూన్ సాహిత్యాన్ని కలిపే దారం ఒకటే ఉందని నమ్ముతాను. అదేంటో చెప్పగలిగేంత జ్ఞానం నాకు లేదు, నేను కోరుకోను.)

బాలగోపాల్ కూడా మొదట్లో మార్క్సిజమే మానవ జీవితాన్ని సాకల్యంగా ఆకళింపు చేసుకునే దృక్పథాన్ని ఇస్తుందనీ, సాహిత్యం దాన్ని అందుకుని ఉద్యమానికి అనుబంధంగా పని చేయాలనీ అనుకున్నా, మలిదశలో ఆయన అభిప్రాయాలు మారినట్టున్నాయి. (నా దృష్టిలో పరిణతి చెందాయి.)

ఉద్యమాలు తమ స్వభావానికీ, లక్ష్యాలకూ తగ్గట్టే మనిషి జీవితాన్ని మెటీరియల్ దృక్కోణం నుంచి చూస్తాయి. కానీ సాహిత్యం మనిషి జీవితాన్ని భౌతికంగా మాత్రమే కాదు, ఆత్మిక కోణాల్నుంచీ పట్టించుకుంటుంది. అతని ఏకాకి ఉద్వేగాల్నీ, అంతరంగిక ఆనందాల్నీ దుఃఖాల్నీ, అనుభవాన్ని పునర్మించగలిగే జ్ఞాపకాల్నీ, కోల్పోయిన ప్రపంచాల పట్ల బెంగల్నీ, వైయక్తిక వైకల్యాల్నీ, విలువల వక్కాణింపుల్నీ, ముక్కుపట్టి గుంజే వాంఛల్నీ, గుంపుతో రాపిడి వల్ల పుట్టే నైతిక ఒత్తిడుల్నీ, ఉనికి అర్థ సంశయాల్నీ… ఇంకా ఎన్నింటినో పట్టించుకుంటుంది. వర్గ దృక్పథానికి అతీతంగా దాన్ని సమీక్షిస్తుంది. ఒక్కోసారి విడుదల భావమే కేవల లక్ష్యంగా వ్యక్తమవుతుంది. సాహిత్యానికి కావాల్సింది మొత్తం మానవ స్థితి (human condition) కాగా, ఉద్యమాలకి కావాల్సింది చరిత్రనీ, రాజ్యభవితవ్యాన్నీ నిర్దేశించేటువంటి మనుషుల్లోని వర్గపరమైన పార్శ్వాలు మాత్రమే. ఇలాంటి సులభమైన చూపు ఉండటం మూలంగానే బహుశా ఉద్యమాల్లోని మనుషులు, ముఖ్యంగా మార్క్సిస్టులు, జీవితం తాలూకు తలాతోకా అంత సులభంగా అర్థమైపోయినట్టు మాట్లాడతారు. ఈ విషయకంగానే బాలగోపాల్ ఇలా అంటున్నారు – “జీవిత మూలాలకు సంబంధించిన సత్యాన్వేషణ ఇంకా బాకీ ఉందని మన దగ్గర మార్క్సిస్టులు అనుకోవడం లేదు. అది ప్రాథమికంగా ముగిసిందనీ దాన్ని ఆచరించడం, అన్వయించడం, మెరుగులు దిద్దడం మాత్రమే మిగిలివుందనీ అనుకుంటున్నారు”. పై కామెంటులో కూర్మానాథ్ కూడా తేల్చేశారు కదా, “జీవితం బ్రహ్మపదార్థం కాద”ని. జీవితాన్ని అంత తేలికైన టెర్మ్స్ లో అర్థం చేసుకోబట్టే “ప్రజా ఉద్యమాలకు జీవితమంత విస్తృతి ఉందని” తేలిగ్గా తీర్మానించేయగలిగారు. వాననీటి చెలమలో నీరు తాగుతున్న పిట్టకి అందులో ఆకాశం కనిపిస్తుంది. ఆ చెలమకి ఆకాశమంత విస్తృతీ ఉందని అది అనుకుంటే అనుకోవచ్చు. ఇక దాంతో వాదించేదేమీ ఉండదు. మనిషి జీవితంలోని వ్యక్తిగత శూన్యాల్ని పట్టించుకోని అభ్యుదయవాదుల ఈ సులభమైన ధీమాకు వ్యతిరేకంగానే దాస్తవిస్కీ తన ‘నోట్స్ ఫ్రం ద అండర్‌గ్రౌండ్’ లాంటి నవలల్లో అవేమిటో ఎత్తి చూపిస్తూ రాశాడు.

ఇక్కడ ఉద్యమం గొప్పదా సాహిత్యం గొప్పదా అన్నది కాదు మనం మాట్లాడుకుంటోంది. మానవ జీవితంలో సాహిత్యం పట్టించుకునే అన్ని పార్శ్వాల్లో ఒక పార్శ్వం (భౌతిక పార్శ్వం) తో మాత్రమే ఉద్యమాలకు అవసరం ఉంది. సాహిత్యాన్ని వారు అందుకే వాడుకున్నారు, వాడుకుంటారు కూడా. కాదనేవాళ్ళు ఎవరూ లేరు. కానీ సాహిత్యానికి ఉన్న మిగతా బహుముఖ పార్శ్వాలన్నీ అనవసరమనీ, అవి “ఊసుపోక” రాసుకునే రాతలనీ తీర్మానించడంతోనే వస్తుంది అసలు సమస్య. “ప్రజలచేతిలో వజ్రాయుధంలా పనిచేసేదే నిజమైన సాహిత్యం” లాంటి ఏకపక్ష నిస్సందేహ ప్రతిపాదనలు గమ్మత్తుగా ఉంటాయి. సాహిత్యాన్ని అలా కూడా వాడుకుంటే వాడుకోండి. కానీ అదే “నిజమైన” సాహిత్యమంటే అది మీ అభిప్రాయం మాత్రమే అనాల్సి వస్తుంది. అసలు సమూహాల్ని నీరుగార్చే ఈ సబ్జెక్టివ్ ప్రపంచాల్ని ఒప్పుకోరు కాబట్టే మార్క్సిస్టు రచయితలు ఇలా బల్లగుద్దినట్టు స్వీపింగ్ జెనరలైజేషన్లని విసిరిపారేయగలరనుకుంటాను. జీవితం అన్ని మూలల్నీ పట్టించుకునే రచయిత ప్రయాణం ఎప్పుడూ సంశయాల దారుల్లోనే. అతనికి జీవితం బ్రహ్మపదార్థమే మరి.

ఇప్పటికీ ఇంకా రూపం, వస్తువుల్ని ద్వంద్వాలుగా చేసి మాట్లాడటం మన తెలుగులో తప్ప ఇంకెక్కడా జరుగుతున్నట్టు లేదు. సాహిత్యానికి రూపం వేరు, వస్తువు వేరూ ఉండవు. అలాగే వస్తువుల్లో మంచి చెడూ ఉండవు. అవి రిలెటివ్ వాల్యూసే.

ఇప్పుడు మీరంటున్నారుగా – నిజంగా విరసం వాళ్ళు సమావేశాలవీ కూడా పెట్టుకుని కథా రచన గురించి చర్చలు చేస్తున్నారని. సంతోషంగా ఉంది. ఈ విరసం 2.0 నుంచి వచ్చే రచనల కోసం ఎదురుచూస్తాను.

And then another commentator tried to dismiss all this as a mere debate between Materialism and Idealism. So I responded:—


పొరబాటు. పదార్థం వల్లనే చైతన్యం నిలబడుతుందనీ, లేదూ చైతన్యం వల్లనే పదార్థం కనబడుతుందనీ… ఈ మీమాంసలు తత్త్వశాస్త్ర పరిధికి చెందినవి. సాహిత్యానికి ఉన్నదేదో దానితోనే నిమిత్తం . అంతేతప్ప ఆ ఉన్నదంతా ఎక్కడ్నుంచి వచ్చిందీ, ఎలా వచ్చిందీ, దాని దినుసులేమిటీ, వాటిలో ఏది సత్యం అన్నది దానికి అక్కర్లేదు.
పైన మీరు వాగాడంబర భావవాదం అన్నదంతా అటు భావవాదులు ఇటు భౌతికవాదులూ ఒప్పుకోవలసిందే. రెండిటిలో ఏది సత్యం అన్న విషయంలో ఇద్దరికీ పేచీలుండవచ్చు గానీ, మనిషి బతికి ఉన్నంతవరకూ భావం, భౌతికం రెండూ ఒకదాన్నొకటి అంటిపెట్టుకుని ఉంటాయన్నది ఇద్దరూ అంగీకరించేదే.

కానీ పాపం మార్క్సిస్టులకు ఈ పరిస్థితి కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతపు పూర్తి అన్వయానికి అడ్డం వచ్చేది మనిషికి ఉండే ఈ చైతన్యమే (కాన్షస్నెస్). పైన ఇచ్చిన బాలగోపాల్ ఇంటర్వ్యూలోనే ఆయన ఇలా అంటున్నారు: “చైతన్యయుతంగా బతకాలనే ‘శాపం’ మనిషికి లేనట్టయితే జీవితంలో ఖాళీలు ఉండవు. ఇతర జంతువులు ఒక జంతు జాతిగా తమకు ఉండే జన్యు లక్షణాలననుసరించి బతుకుతాయి.”

అంటే అలా జంతువుల్లా జన్యులక్షణాలను అనుసరించి బతకని మనిషి చైతన్యం మార్క్సిస్టుల సిద్ధాంత అన్వయానికి ఇబ్బంది కలగజేస్తుంది. ఎందుకంటే ఈ చైతన్యం వాళ్ళ సిద్ధాంత పరిధికి అతీతమైన, అందని ఖాళీల్ని కలగజేస్తుంది (దాన్ని పూరించడానికే సాహిత్యం అని బాలగోపాల్ అంటారు). అందుకు వాళ్ళ దృష్టిలో చైతన్యం ఓ ‘శాపం’. మనిషి కూడా జంతువుల్లా ఆదిమ చైతన్యం కలిగినవాడైతే అప్పుడు మార్క్సిజపు అప్లికేషన్ సులభతరమవుతుంది. బహుశా అందుకే కాబోలు మార్క్సిస్టులు మాట్లాడితే ఆదర్శ సమాజానికి ఉపమానంగా చీమల్నీ వాటి పుట్టల్నీ ఎంచుకుంటారు.

అలాగే… భావ భౌతికాల ప్రస్తావన వచ్చింది కాబట్టి నాకు నచ్చే ఓ Bergson మాట:
“Consciousness depends upon the brain, and falls with it; but so does a coat fall with the nail on which it hangs, — which does not prove that the coat is an ‘epiphenomenon,’ an ornamental ectoplasm of the nail.”

Then the same commentator wanted to know whether I meant that Balagopal later converted to Idealism, and asked me what do I mean by "మలిదశలో ఆయన అభిప్రాయాలు మారినట్టున్నాయి. (నా దృష్టిలో పరిణతి చెందాయి.)". And he was confused as to in what sense Balagopal used (and I interpreted) the word "చైతన్యం". I clarified:—


​బాలగోపాల్​ భావవాదిగా మారిపోయారు అని నేననలేదు. అసలు ఈ భావ – భౌతికాల ప్రస్తావన ఎందుకు వస్తోంది సాహిత్యం విషయంలో? “గ్రేట్ ఎక్స్‌పెక్టేషన్స్” రాయటానికి డికెన్సుకూ, “డెత్ ఆఫ్ ఇవాన్ ఇల్విచ్” రాయటానికి టాల్‌స్టాయి కీ, “మెటమార్ఫసిస్” రాయటానికి కాఫ్కాకు తాము భావ-భౌతిక వాదాల్లో ఎటువున్నారో తేల్చుకోవాల్సిన అవసరం ఉందా? ఆ రచనలు ఆస్వాదించే పాఠకులకైనా అవి తేలాల్సిన అవసరం ఉందా? సాహిత్యాన్ని సైద్ధాంతికంగా పరామర్శించే, సైద్ధాంతిక చట్రంలోనే సాహిత్యాన్ని సృజించదలిచే మార్క్సిస్టులకు ఆ అవసరం ఉంటుందేమో. పిడి భౌతికవాదం వల్ల వాళ్ళు తమ ఆవరణలోనికి రానిచ్చే ప్రతీదాన్ని ఇలా భావ-భౌతికాల మెటల్ డిటెక్టర్లతో చెక్ చేసి అంచనా కట్టాల్సిన అగత్యం ఉంటుందేమో — మీరు నా కామెంటు ని భావవాదం వైపున్నదని చప్పున అంచనా కట్టినట్టు. కానీ సాహిత్యం విషయంలో ఆ కొలమానం అవసరం లేదు. కాకపోతే, మార్క్సిస్టు దృక్పథం నుంచి మాట్లాడుతున్నారు కాబట్టి సహజంగానే బాలగోపాల్ కి కూడా ఇది తప్పలేదు.

ఇక మీ కామెంట్లో పైఅప్రస్తుతాన్ని పక్కనపెట్టి, బాలగోపాల్ విషయంలో నేను పరిణతి అని దేని గురించి అన్నానో చెప్తాను. ​తొంభైల తర్వాత ​​​సాహిత్యం పట్ల ​బాలగోపాల్ అభిప్రాయాలు మారాయని ఆయన రచనల వల్ల తెలుస్తుంది. అప్పటి మన మార్క్సిస్టుల అవగాహన సాహిత్యపు పూర్తి సారాన్ని అందుకోలేకపోతోందని ఆయన​ గమనించారు.​ జీవితాన్ని సాకల్యంగా ఇముడ్చుకోగలిగే సాహిత్యంతో మార్క్సిజం తన సంబంధాన్ని విస్తృతం చేసుకోవాలంటే భౌతికవాద చట్రాన్ని కొంత వదులు చేసుకోవాలనీ, అప్పటిదాకా సైద్ధాంతిక​ ప్రతిబంధకాల​ వల్ల అది ఏ మానవ అస్తిత్వ కోణాల్ని పట్టించుకోలేదో వాటినీ పరిగణనలోనికి తీసుకోక తప్పదనీ ఆయన భావించారు. ఈ సంసిద్ధతనే నేను ఆయనలో పరిణతీ అని అన్నాను. అంతమాత్రాన ఆయన భావవాది అయ్యారని అనటం లేదు. భౌతికవాద పరిధిని కాస్త సడలిస్తూ​, తోటి మార్క్సిస్టుల్లో​ సాహిత్యం​ పట్ల సైద్ధాంతిక అవగాహనను విశాలం చేయటానికి ప్రయత్నించారు. నేను​ ఈ క్రింద ఇస్తోన్న పేరాలు ఆయన ‘రూపం సారం’ పుస్తకం నుంచి తీసుకున్నవే. వీటిని నేను అంగీకరిస్తున్నానని కాదు. ఆయనలో మార్పుని ఉదహరించటానికి తీసుకున్నాను:—
“కాల్పనిక సాహిత్యం ‘వాస్తవికతా’ నియమాలేవీ పాటించనవసరం లేదనీ, పాటించనంత మాత్రాన అది భావవాద సాహిత్యం అయిపోదనీ, నిజానికి అత్యంత ప్రగతిశీల స్వభావం గల సందేశాన్ని ‘అవాస్తవిక’ ఊహాశిల్పం ద్వారా ఇవ్వవచ్చుననీ ఇతర భాషల సాహిత్యం చదివితే అర్థం అవుతుంది. ఉదాహరణకు అర్థరహితంగా అనిపించే కథనశైలి ద్వారా ఆధునిక జీవితంలో అర్థరాహిత్యాన్ని బలంగా చూపించే రచనలు కాఫ్కా కాలం నుండి యూరప్ సాహిత్యంలో చాలా వచ్చాయి. కానీ ఆధునిక జీవితం అర్థరహితమా అని అడగవచ్చు. దానిని అర్థరహితంగా చూపించడం పోరాటాల నుండి పక్క దోవ పట్టించే తప్పుడు చైతన్యం అని విమర్శించవచ్చు. ఈ తార్కిక అభ్యంతరంతోనే మార్క్సిస్టులు అధివాస్తవిక సాహిత్య శిల్పాన్ని తిరస్కరించారు. దానిని సామ్రాజ్యవాద పతన సంస్కృతి నుండి పుట్టిన పెటీ బూర్జువా నైరాశ్యవాదం అన్నారు. ఇప్పటికీ ‘రియలిజం’ పరిధి దాటిపోయే శిల్ప సంబంధమైన ప్రయోగాలను అనుమానంగా చూసే అలవాటు పోలేదు. ప్రతీ ఆలోచనా రీతికీ ఒక వర్గమూలాన్ని వెతికే వైఖరే చాలా యాంత్రికమైనది. జీవితంలో అర్థం కానిది ఎప్పుడూ ఎంతో కొంత ఉంటుంది.” – మరణానంతర ఊహ, 1994
పేరును బట్టే ఈ వ్యాసం దేని గురించో తెలుస్తోందనుకుంటాను. భౌతికవాది అయిన బాలగోపాల్ కూడా భౌతికవాదం అంగీకరించని మరణానంతర స్థితికి వెళ్లి ఊహలు చేసే వెసులుబాటు సాహిత్యపరంగా సబబేనని సమర్థించేందుకు పాట్లు పడతారు ఈ వ్యాసంలో. ఇది భావవాదం వైపు మొగ్గు కాదు, సాహిత్యపు విశ్వరూపంతో మరుగుజ్జు మార్క్సిజానికి పొత్తు కలిపే ప్రయాస అంతే. ఇదే వ్యాసం నుంచి ​మరో కొటేషన్​ చూడండి. ఇక్కడ డయలెక్టికల్ మెటీరియలిజానికి అందని మనిషిలోని మూలల్ని మార్క్సిజం పట్టించుకోక పోవటం గురించి చెప్తున్నారు:—
“మనిషికి ఉన్న వివిధమైన మానసిక అవసరాలు, స్థితులు, వైపరీత్యాలు పాలక భావజాలానికి మనుషుల ఆలోచనలను ఆక్రమించుకునే అవకాశం కల్పిస్తున్నాయని గుర్తిస్తున్నామంటే ఆ మానసిక స్థితులనూ అవసరాలనూ ‘కండెమ్’ చేస్తున్నామని కాదు. అవి మన అస్తిత్వంలో భాగం. మన కాళ్లూ చేతులూ ఎట్లాగో అవీ అట్లాగే. వాటి ఫలితంగా మన జీవితం అమానుషంగా తయారు కాకుండా వాటి అభివ్యక్తిని మానవీయంగా మలచుకోవడం ఒకటే మనం చేయగల పని. ఆ అవసరాన్ని మార్క్సిజం ఇప్పటివరకు గుర్తించలేదు. దీని గురించి కొంత ఆలోచించింది మార్క్సిస్టుల చేత పెటీ బూర్జువా సోషలిస్టులుగా తిరస్కరించబడిన ఎరిక్ ఫ్రాం, బెర్ట్రాండ్ రస్సెల్ వంటి వారే.” – మరణానంతర ఊహ, 1994
అసలు మనుషుల మానసిక అవసరాల్ని సైద్ధాంతికంగా ‘కండెమ్’ చేయాలనే ఈ ఆలోచన వెనుక నుంచి తగుల్తోన్న ఉక్కపోత పట్ల నా అసహనాన్ని కాసేపు పక్కన పెడ్తాను. ఈయన మార్క్సిజం తరపు నుంచి ఈపాటి మినహాయింపైనా ఇవ్వటం కాసింత పరిణతే అని అనుకుంటున్నాను. చారిత్రక భౌతికవాద సిద్ధాంతంలోని పరిమితుల గురించి ‘చరిత్ర, మనిషి, మార్క్సిజం’ అన్న వ్యాసంలో ఇలా రాస్తారు:—
“సోవియట్ రష్యా, చైనా తదితర దేశాలలో వచ్చిన రాజకీయ మార్పులకు పాక్షికమైన జవాబులు చెప్పి ఊరుకోకుండా సంక్షోభాన్ని సంక్షోభంగా స్వీకరించి చర్చిస్తే మార్క్సిస్టు అవగాహనలో ఉన్న కొన్ని ఖాళీలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. వీటిలో ప్రధానమయినవి మానవ ప్రవృత్తికీ సమసమాజ ఆదర్శానికీ మధ్యనున్న జవాబు దొరకని ప్రశ్నలు. మనిషిని చరిత్ర నిర్మాతగా మార్క్సిజం గుర్తించింది గానీ ఆ చరిత్రకూ దాని నిర్మాతకూ మధ్య నున్న సంబంధాన్ని వివరంగా ప్రతిపాదించలేదు. దానిలోని ఎగుడుదిగుళ్ళను గుర్తించలేదు. ఆ సంబంధం ‘గతితార్కికం’ అని ముందు జాగ్రత్తగా ప్రకటించి ఊరుకుంది. మనిషికీ బయటి ప్రపంచానికీ మధ్యనున్న ఏ సంబంధమయితే ప్రపంచవ్యాప్తంగా గొప్ప కాల్పనిక సాహిత్య వస్తువుకు మూలంగా ఉంటూ ఉందో ఆ సంబంధానికి చారిత్రక భౌతికవాద సిద్ధాంతంలో స్పష్టమయిన చోటు లేదు. […] మానవ ప్రవృత్తి అనేది ఆలోచించకుండా కొట్టి పారేయగల విషయం కాదు. భావవాద ఆలోచన నుంచి పుట్టిన భ్రమ కాదు. […] సామాజిక వ్యవస్థలో మౌలికమైన మార్పు వచ్చినప్పుడు దానికి తగినట్టు మానవ ప్రవృత్తి కూడా మారిపోతుందని భావించి ఆ ప్రవృత్తి గురించి ఆలోచించనవసరం లేదని చారిత్రక భౌతిక సిద్ధాంతం ఇప్పటిదాకా చెప్తూ ఉంది. మార్క్సిస్టులందరికీ కాకున్నా కనీసం మార్క్సిస్టు సాహిత్యకారులకు ఇది నిజం కాదని తెలియదంటే నమ్మడం కష్టం.” – చరిత్ర, మనిషి, మార్క్సిజం, 1993
అయినప్పటికీ బాలగోపాల్ సాహిత్యాన్ని సకల పార్శ్వాలతోనూ అర్థం చేసుకుని ఆలింగనం చేసుకోగలిగారని నేను అనుకోను (సైద్ధాంతిక పరిమితుల వల్ల). కానీ మన లోకల్ బ్రాండు మార్క్సిస్టులు చాలామంది కంటే ఆ దారిలో ముందుకు రాగలిగారని చెప్తాను. తన సంశయాత్మ గొంతుని సైద్ధాంతిక పిడిబాకుతో కోసేయకుండా సజీవంగా తనతో నిలుపుకున్నందుకు అభినందిస్తాను.

ఇక మీ కామెంట్లో రెండో భాగం – బాలగోపాల్ మాటల్లోని ‘చైతన్యం’ అన్న పదాన్ని “చిత్తు – చిత్తం – కాన్షస్నెస్” అన్న అర్థాల్లో గాక, మీరు “కొత్త అవగాహన” అన్న అర్థంలో తీసుకున్నట్టయితే మీరు ​అక్కడి విషయాన్ని సరిగా అర్థం చేసుకోలేదు. ఆయన చైతన్యం అన్న పదాన్ని తాత్త్వికార్థంలోనే వాడినట్టు​ నాకు స్పష్టంగానే తెలుస్తోంది.​

& he said whatever he said:—


మార్క్సిజం తాలూకు ఆలోచనా వ్యవస్థలు చాలావరకూ మార్క్సిజపు గోడల మధ్యనే చెల్లుతాయి. బయట నిలబడి మాట్లాడేవాళ్ళకు అది లోపలికి వచ్చి మాట్లాడమని మాత్రమే చెప్పగలుగుతుంది. కార్యకారణ సంబంధం గురించి మార్క్సిజపు నిర్వచనం కూడా అంతే. అది కార్యకారణ సంబంధాల్ని భౌతిక కోణం నుంచి మాత్రమే అర్థం చేసుకుంటుంది. కానీ అవి ఎప్పుడూ మనుషుల వర్గ తారతమ్యాల మీదనే ఆధారపడి ఉండవు. పైన బాలగోపాల్ అన్నట్టు “ప్రతీ ఆలోచనా రీతికీ ఒక వర్గమూలాన్ని వెతికే వైఖరే చాలా యాంత్రికమైనది. జీవితంలో అర్థం కానిది ఎప్పుడూ ఎంతో కొంత ఉంటుంది.” వర్గ దృక్పథానికి అర్థం కాని అట్లాంటి ఖాళీల్లోకి పోయి వెతగ్గలిగేది సాహిత్యం. నేనో పాత బ్లాగు పోస్టులో ఇలా రాశాను:—
“మార్క్సిజం మనిషి జీవితాన్నంతా పరిధిలోకి తీసుకున్న సిద్ధాంతం కాదు. అతని సంఘజీవనాన్ని మాత్రమే పరిధిగా ఎంచుకున్న సిద్ధాంతం. (మార్క్సిజాన్ని తత్త్వశాస్త్ర శాఖగా పరిగణించేవారు ఈ సంగతే మర్చిపోతారు.) మనుషుల మధ్య పరస్పరం ఆహార వనరుల సమాన పంపిణీ, ఆర్థిక వనరుల సమాన పంపిణీ… యిలా దాని దృష్టి అంతా మనిషి జీవితంలోని భౌతికపార్శ్వం వైపే! అది వీధిలోకొచ్చి పరస్పరం లావాదేవీలు నడిపే మనుషుల ప్రశ్నలకే జవాబులిస్తుంది గానీ, ఏకాంతంలో వున్న మనిషి మనసు ఎదుర్కొనే ప్రశ్నలకు జవాబులివ్వలేదు.”
సాహిత్యం అలాంటి మూలల్లోకి వెళ్ళి ఆ ప్రశ్నల్ని అడ్రస్ చేయగలదు. కాబట్టి సాహిత్యానికి మార్క్సిజం కాదు, మార్క్సిజానికే సాహిత్యం అవసరం చాలా ఉంది. అది మార్క్సిజమూ గ్రహించింది కూడా. అందుకే కదా, మార్క్సిస్టు విమర్శ పుట్టింది. ఇంకోటేమిటంటే – మార్క్సిజం నిజంగా ఎక్కడన్నా ఏమైనా చేయగలిగినాక మాత్రమే దాన్ని ఊటోపియాల కేటగిరీ నుంచి బైటకు తెద్దాం.

సాహిత్యానికి తాత్త్విక పునాదులు ఉండవని నేను అనలేదు. భౌతిక – భావవాదాల తత్త్వమీమాంస దానికి అనవసరం అన్నాను. రచయిత తాలూకు తాత్త్వికత అతని సృజన ప్రపంచాల్లోంచి పారదర్శకంగా వ్యక్తమవుతూనే ఉంటుంది. అది భౌతిక – భావవాదాల మధ్య స్పష్టమైన విభజనను ఆవశ్యకం అనుకోదు.

భావవాదం అనగానే మీకు మరిక మాట్లాడటానికి ఏమీ కనపడకపోయినా ఒక డైలాగ్ మొదలుపెట్టినందుకు థాంక్స్.

&  Then some, and I ended the discussion with this:—


If you are craving for one last word, I will be happy to give it to you.. but that doesn’t necessarily make it a final word.


ఇలా ఎవరి సోది వాళ్ళు పార్లల్ గా మాట్లాడుకుంటూ పోవడం వల్ల ప్రయోజనం లేదు. ముఖ్యంగా మీ మాటల్లో కాంట్రడిక్షన్లని మీరు గుర్తించటం లేనప్పుడు. ఒక పక్క మార్క్సిజం “సగలరంగాలకూ విస్తరించి మానవజీవితంలో ప్రతి సమస్యనూ పరిష్కరిస్తుంది” అంటూనే, మరోపక్క “సామాజిక రంగం తాలూకు ప్రభావం మాత్రమే మానవ జీవిత వాస్తవికత అని గుర్తిస్తుంది” అంటున్నారు. మరి అక్కడే దాని పరిమితి ఏంటో తెలిసిపోతుంది కదా? నేను పైనంతా చెప్తున్నది ఏమంటే, సామాజిక రంగం మాత్రమే మానవజీవిత వాస్తవికత కాదూ, మనిషి వైయక్తిక ప్రపంచాన్ని అన్నిసార్లూ సామాజికతే నిర్దేశించదూ అని. ఈ మాటొస్తే చాలు దానిపై భావవాదం అనో, ఇప్పుడు ఇంకా పేలవంగా “గుడ్డి పెట్టుబడిదారీ” దృక్పథం అనో లేబెల్స్ వేయటానికి మీరు చాలా ఉత్సాహపడుతున్నారు. ఆల్రెడీ మట్టిగొట్టుకుపోయిందాని మీద బురదచల్లే సరదా ఎవరికీ లేదు. నేను మార్క్సిజం గురించి మాట్లాడటం లేదు. నేను మాట్లాడుతున్నది సాహిత్యం గురించి. సాహిత్యం సామాజిక వైయక్తిక ప్రపంచాలన్నింటినీ పట్టించుకుంటుందీ (మీరూ ఒప్పుకునేదే), వైయక్తిక ప్రపంచాలు మార్క్సిజం పరిధి కాదు కాబట్టి (మీరంటున్న మాటే) సాహిత్యాన్ని మార్క్సిస్టులు వారి అవసరాలకు తగ్గట్టు వాడుకుంటే వాడుకోవచ్చు, అంతేతప్ప తమ సిద్ధాంతపు పరిమితుల్ని దాని మీద అప్లయి చేయటం వల్ల జరిగే మంచేమీ లేదూ అని. మీ టైపు వాదనలన్నీ ముందే ఊహించిన బాలగోపాల్ మాటలపై మీ స్పందన ఏమీ ఉన్నట్టు లేదు. ఇప్పుడు వైయక్తికాన్ని పట్టించుకునే సాహిత్యాన్ని మీరు ‘పెట్టుబడిదారీ’ అంటున్నారే, అలాగే ఆయన కాఫ్కా రచనల్లాంటి వాటిని మార్క్సిస్టులు పెటీ బూర్జువా సాహిత్యంగా తీసిపారేస్తారని ఊహించి దానిపై స్పందించాడు. ఆయన ఊహించిన మూసల్లోకి మీరు ఇంత చక్కగా కుదురకోవడం చూస్తే నాకు సరదాగా ఉంది.

*   *   *