July 29, 2022

002 : ఇరుకిరుకు

శేషుకి మూడేళ్ల డిగ్రీలో పదమూడు సబ్జెక్టులు తన్నేశాయి. ఆ సంగతి అమ్మకి ఆఖరి ఏడాది దాకా తెలీదు. అప్పుడు కూడా వేరే వాళ్ల ద్వారా తెలిసింది. అప్పుడు ఆవిడ ఆఫీసులో ఉంది. ఆ రోజంతా ఫైళ్లు దిద్దుతూ ఆలోచించింది. కొడుకు మీద అంతస్తులంతస్తులుగా కట్టుకున్న ఆశలు నిశ్శబ్దంగా కూలుతున్నాయి. సాయంత్రం తలుపు తీసుకుని లోపలికి వచ్చింది. హేండ్ బాగు టేబిలు మీద పెట్టింది. శేషు మంచం మీద పడుకుని ఏదో లైబ్రరీ పుస్తకం చదువుకుంటున్నాడు. అమ్మ అడగటం గట్టిగానే అడిగింది. వాడు తల దించుకుని కూర్చున్నాడు. వాడి ముఖం ఆవిడ చేత తిట్లు తింటూ తింటూ ఇన్నేళ్లలో చాలా మారింది. ఆ ముఖం మీద ఇప్పుడు మీసాలు కూడా మొలుస్తున్నాయి. అమ్మకి ఇంక తిట్టి ప్రయోజనం లేదనిపించింది. గొంతులో నిరాశ మాత్రమే మిగిలింది.

‘‘మరీ అన్ని సబ్జెక్టులు ఎలా పోయాయిరా?’’

వాడేమీ మాట్లాడలేదు.

‘‘అబద్ధాలతో ఎన్నాళ్లు నెట్టుకొద్దామనుకున్నావు?’’

ఏమీ మాట్లాడలేదు.

‘‘సరే. ఏం చేస్తావో చేయి మరి,’’ అని లోపలికి వెళ్లిపోయింది. 

కొన్ని రోజుల దాకా అమ్మ శేషుతో మాట్లాడటమే మానేసింది. శేషుకి మాత్రం రెండేళ్లు గుండెల మీద మోసిన అబద్ధం బరువు దిగిపోయినందుకు సంతోషంగా ఉంది. వాడి మీద ఇప్పుడు ఎవ్వరికీ ఏ భ్రమలూ లేవు. వాడి ముందు ఒక ఖాళీ ఉంది. వాడిని వాడు కట్టుకోవాల్సిన ఖాళీ. అది ఒక ఆటలా ఊరిస్తోంది.

జీవితంలో ఈ చివరాఖరి వేసవి సెలవులకి శేషు కడియంలో ఉన్నాడు. అమ్మ ఏం మాట్లాడకుండా అన్నం వండిపెట్టేసి రోజూ ఆఫీసుకి వెళ్లిపోతోంది. వాడు చెప్పులేసుకుని లైబ్రరీ దాకా వెళ్లి పుస్తకాలు తెచ్చుకుంటున్నాడు. ఆ పుస్తకాలన్నీ వర్షాలకి చెమ్మగిల్లిన లైబ్రరీ గోడల మధ్య చీకిపోయినవి. ఎప్పుడో చనిపోయిన రచయితలు రాసినవి. ఆ పేజీల మధ్య రకరకాల లోకాలు రెపరెపలాడేవి. ‘‘ఏదో ఒకటి ఏరుకో, ఏదో ఒకటి ఎంచుకో’’ అన్నట్టు. కొన్ని పుస్తకాలకి బలంగా ఎదురుతిరిగేవాడు. కొన్ని పుస్తకాలని ఆత్రంగా ఒప్పుకునేవాడు. ‘నా అంతరంగ కథనం’ అన్న పుస్తకంలో బుచ్చిబాబు సున్నితత్వం అస్సలు నచ్చలేదు. ‘ఘుమక్కడ్ శాస్త్ర’ అన్న అనువాద పుస్తకంలో రాహుల్ సాంకృత్యాయన్ బాటసారిలా బతకటమెలాగో చెప్పిందంతా చాలా నచ్చింది. ఆ పుస్తకాలు తన మెదడు కొలతల్ని పెంచుతున్నట్టూ, చుట్టూ పరిసరాలు ఇరుకవుతున్నట్టూ.... 

అమ్మకి కడియం ట్రాన్స్‌ఫరైంది ఈమధ్యనే. శేషూకి ఆ ఊరి వైనం ఇంకా తెలీదు. ఒక సాయంత్రం ఊరి పొలిమేర చూద్దామని సందుల్లోంచి ఒకే దిక్కుకు సైకిలు తొక్కుకుంటూ పోయాడు. చివర్లో ఇళ్లు ఆఖరైపోయాకా, ఎర్ర మట్టి దిబ్బలు మొదలయ్యాయి. ఆ ఎత్తుకి సీటు మీదనుంచి లేచి నుంచొని తొక్కాల్సి వచ్చింది. కాసేపటికి మనుషుల కాలిబాటలు ఆగిపోయాయి. నాగజెముడు మొక్కలు ఎదురయ్యాయి. చిన్న దిబ్బ అనుకున్నది కొండలాగా పైకి పోతూనే ఉంది. కొండ కొమ్ము దాకా వచ్చాకా సైకిలు స్టాండు వేశాడు. అంచు దాకా నడిచి తొంగి చూశాడు. కింద క్రేన్లు కొండని తొలుస్తున్నాయి. ముందుకి చూస్తే ప్రపంచమంతా కాళ్ల కిందే ఉన్నట్టుంది. దూరంగా రైలు పట్టాలు కనపడుతున్నాయి. చాలాసేపటికి ఒక రైలు వెళ్ళింది. అది చేతివేళ్ల మధ్య పట్టే బొమ్మ రైల్లాగే ఉంది. రైలు వెళ్లిపోయిన తర్వాత పట్టాల అవతల ఒక చెట్టు ఒంటరిగా కనపడింది. తను ఆ చెట్టు మొదట్లో కూర్చున్నట్టు, రైలు తనను దాటుకుపోయినట్టూ ఊహించుకున్నాడు. ఆ రైలు అలా వొంపు తిరిగి కడియం రైల్వే స్టేషను వైపు వెళ్తోంది. ఈ ఎర్రమట్టి దిబ్బలు ఊరికి ఇటు చివర ఉంటే, ఆ స్టేషను అటు చివర ఉంది. 

ఆ మరుసటి రోజు ఆ స్టేషన్ను వెతుక్కుంటూ వెళ్లాడు. అది నాపరాళ్లు నున్నగా అరిగిపోయిన పాత స్టేషను. జనం పెద్దగా లేరు. ఫ్లాట్ ఫాం మీద నుంచి చూస్తే పట్టాల అవతల కనిపించినంత మేరా పొలాలు. ఆ పొలాల అంచున నలుసుల్లాగ ఫాక్టరీ గొట్టాలు. వాటిల్లోంచి ఎగజిమ్మి మబ్బుల్లో కలుస్తున్న పొగలు. ప్లాట్ ఫాం వెంట నడుచుకుంటూ వెళ్లాడు. దాన్నానుకొని ఇనుప చువ్వల కంచె ఉంది. దానవతల క్వార్టర్స్ లాగ ఒకే రంగులో ఇళ్లున్నాయి. చివ్వరి చప్టా మీద కూర్చుని పుస్తకం చదవటానికి ట్రై చేశాడు. కానీ పరిసరాలు పుస్తకం మీదికి దృష్టి పోనీయటం లేదు. ఆఖర్న ఉన్న పట్టాల మీద గూడ్సు ట్రైను ఒకటి ఆగి ఉంది. పట్టాలు దాటుకుని దాని వైపు వెళ్లాడు. పెట్టెల వారన కొంత దూరం నడిచాడు. ఆ భారీ యంత్రం పక్కన ఆగి వింటే సీతాకోకలూ బెదరని నిశ్శబ్దం. గూడ్సు ట్రైను తలుపులు లక్కముద్దలతో సీల్ చేసి ఉన్నాయి. ఆ ముద్దల్లోని ఊచలకి ఏవో కార్డులు గుచ్చి ఉన్నాయి. వాటిలో ఒకటి తెంపి చూశాడు. దాని మీద ఏదో నార్త్ ఇండియన్ సిటీ పేరు రాసి ఉంది. అక్కడి చేరాలంటే ఈ గూడ్సు బండి ఎన్ని నగరాలు దాటి వెళ్లాలో ఊహించాడు. ఆ నగరాలు మనసులో మిలమిల మెరిశాయి. అవన్నీ పెద్ద పెద్ద పనులు జరిగే నగరాలు, మనుషులంతా కలిసి మానవ శక్తికి మించిన పనులు చేసే నగరాలు, రైలు పట్టాలు వొంటి నిండా నరాల్లా పాకిన నగరాలు, ఓడరేవుల్లోంచి ఊపిరి పీల్చుకునే నగరాలు, ఇనుప పిడికిళ్లను బిగించి భవన కండరాల్ని ఉప్పొంగించే నగరాలు.... ఆ గూడ్సు ట్రైను ఎక్కి వెళ్లిపోతే ఎలా ఉంటుందా అనుకున్నాడు. ఆ గూడ్సు పెట్టెల తొట్టిలో రాక్షసబొగ్గు సరుకు మీద వెల్లకిలా పడుకుని, అది ఎక్కడికి తీసుకుపోతే అక్కడికి వెళ్లిపోతే.... కళ్ల ముందు భారత దేశ విస్తారం విప్పారింది.... ఆ పెట్టెలోనే వర్షానికి తడుస్తాడు, ఎండకి ఎండుతాడు, జ్వరమొస్తే బరకం కప్పుకుని పడుకుంటాడు. లేతాకుల‌ మీద నీరెండ మెరిసే పొద్దుల్లో అడవుల మధ్య నుంచి వెళ్తాడు, చలికి కీచురాళ్ళు రెక్కలు రాపాడించుకునే రాత్రుల్లో వెలుగుల గలాటా చేసే నగరాల్ని దాటుతాడు. ఒకానొక నగరంలో ఏదో వైనం నచ్చి దిగుతాడు. తెలియని వీధులమ్మటా తిరుగుతాడు. ఆ సంరంభంలో భాగమవుతాడు. పని అడుగుతాడు. పని చేస్తాడు. పని చేసే మనుషుల సమూహంలో భాగమవుతాడు. జీవితం మొదలుపెడతాడు.

ఎవరో పిలిచినట్టనిపించి వెనక్కి తిరిగి చూశాడు. ప్లాట్ ఫాం మీద ఒక మనిషి నిలబడి ఇటురమ్మన్నట్టు చేయాడిస్తున్నాడు. అతను ఇక్కడ పని చేసే మనిషిలా ఉన్నాడు. శేషుకి తను కార్డు తెంపటం ఎవరైనా చూశారా అని డౌటొచ్చింది. పట్టాలు దాటుకుంటూ వెళ్లాడు. ఆ మనిషి ‘‘సార్ రమ్మంటున్నాడు,’’ అన్నాడు. “ఎందుకూ” అని శేషు అడుగుతున్నా సమాధానమేం చెప్పకుండా నడిచాడు. తను ‘తీసికెళ్లబడుతున్నట్టు’ శేషుకి అర్థమైంది. అయినా బింకంగా వెంట నడిచాడు. దారిలో ఇందాక తను లోపలికి వచ్చిన ద్వారం మీంచే వెళ్ళాడు. అక్కడి నుంచి బైటికి చెక్కేద్దామా అనిపించింది ఓ క్షణం కానీ, పిరికితనాన్ని అలా ఒప్పుకోబుద్ధి కాలేదు. ఆ మనిషి ఒక గది గుమ్మం ముందు ఆగాడు. గదిలోకి చూస్తూ శేషూ వస్తున్నాడన్నట్టు లోపల ఎవ్వరికో తలూపాడు. అతని తీరునుబట్టి లోపల ఉన్నది పైఆఫీసరని అర్థమవుతోంది. 

శేషు గుమ్మం దగ్గరకి వచ్చాడు. లోపల పెద్ద మెషీన్ మీద చిన్న చిన్న బల్బులు వెలుగుతున్నాయి. టేబిల్ మీద రెండు మూడు ఫోన్లున్నాయి. దాని వెనక తెల్ల యూనిఫాంలో స్టేషన్ మాస్టరు కూర్చొని ఉన్నాడు. అతను కుర్చీలో వెనక్కి వాలి శేషుని ఇలా రమ్మన్నట్టు బల్ల మీద తట్టాడు. శేషు గదిలోకి నడిచాడు. గుమ్మం దగ్గర ఆగిన మనిషి కూడా తన వెనకే నడుస్తున్నట్టు అనిపించింది శేషూకి.  

‘‘ఏం పనిరా నీకిక్కడ?’’ అన్నాడు స్టేషన్ మాస్టరు.

‘‘చూద్దామని వచ్చాను.’’

“గూడ్సు బండి దగ్గరేం చేస్తున్నావ్?”

“ఏం లేదు ఊరికే—”

‘‘—సరుకు దెంగేసి పోదామని వచ్చావా’’ అన్నాడు ఒకేసారి గొంతు పెంచేసి, బల్ల మీద చేత్తో చరుస్తూ.

శేషుకు బెదురూ, కోపం ఒకేసారి వచ్చేశాయి. ‘‘సరిగ్గా మాట్లాడు’’ అన్నాడు.

స్టేషను మాస్టరు కుర్చీలోంచి టప్ మని పైకి లేచాడు. 

‘‘లంజా కొడకా, ఇనుము దెంగుకు పోదామని వచ్చి, పైగా ఎదురు మాట్లాడతన్నావా. పట్టుకోరా ఈడ్ని,’’ అన్నాడు వెనకాల మనిషితో. 

ఆ మనిషి వీపుకు తగిలేంత దగ్గరగా ఉన్నట్టు అనిపించింది శేషుకి. 

కాళ్లు వణకటం మొదలైంది. కానీ నోరు మాత్రం దాని పనిలో అదుంది. ‘‘ఏంట్రా అమ్మల్దాకా ఎళ్తన్నావ్? నాకొడకా మర్యాద్దక్కదు,’’ అన్నాడు తలెగరేస్తూ.

వెనకాల మనిషి, ‘‘ఓయ్.. బాబూ. ఏం మాట్లాడతన్నావు. ఎవరనుకున్నావు. అలాగ పట్టాలకాడదీ తిరక్కూడదు. తెలీదా నీకు?’’ అంటున్నాడు.

‘‘పొమ్మంటే పోతాను. నోటికొచ్చినట్టు మాట్లాడతాడేంటి.’’ శేషుకి పట్టాల దగ్గర తిరక్కూడదని తెలీదు. అసలు ఎక్కడ ఎంత మాట్లాడాలో కూడా తెలీదు. అందుకే తగ్గటం లేదు. 

స్టేషను మాస్టరు ఏదో బెదిరించి పంపిద్దామనుకున్నాడు. కానీ శేషు నోటి దూల వల్ల, పైగా తన కింద పని చేసే మనిషి అక్కడే ఉంటం వల్ల కొనసాగించక తప్పలేదు. టేబుల్ దగ్గర నుంచి కదిలి ముందుకు వస్తూ, ‘‘ఈడ్ని తీసుకెళ్లి ఆ గదిలో వేయిరా,’’ అంటున్నాడు.

వెనకాల మనిషి భుజం పట్టుకున్నాడు.

‘‘ఏం పీకుతావో పీక్కోబే. ఈ స్టేషను దాటితే ఆతుముక్కకి పనికి రాడు ఒక్కొక్కడూ. ఎదవ బిల్డప్పులు.’’ 

‘‘అసలేం మాట్లాడుతున్నావురా నువ్వూ? కుర్రలంజాకొడుకు ఇంత లేడు, ఏంట్రా ఈడికింత బలుపూ?’’ స్టేషను మాస్టరు నిజంగానే డౌటొచ్చినట్టు అడిగాడు.

వెనకాల మనిషికి శేషుకి నిజంగానే ఏం తెలీదని అర్థమైంది. పిల్లలున్న తండ్రిగా ఇప్పుడు కలగజేసుకోవాల్సిన బాధ్యత ఉందనిపించింది. ‘‘ఏ బాబు! పెద్దంతరం చిన్నంతరం లేదా నీకు? ఎయ్… నడు, బైటికి నడు,’’ అంటూ శేషుని ప్లాట్ ఫాం మీదకి గుంజుకుపోయాడు. 

శేషు కదలనన్నట్టు గింజుకుంటూనే, లోపల్లోపల ఆ గదిలోంచి బైటపడుతున్నందుకు సంతోషించాడు.

ఆ మనిషి స్టేషను బైట దాకా శేషు వెంట వచ్చాడు. ‘‘ఆళ్లు తల్చుకుంటే ఏం చేస్తారో తెలుసా? ఏంటసలు తెలివి లేదా నీకు? సెంట్రల్ గవర్నమెంటు ఎంప్లాయీసు. ఇంక ఇటు రామాకు,’’ అన్నాడు. 

శేషు భుజం విదిలించుకుని మెట్లు దిగాడు. 

సైకిలు స్టాండ్ తీసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోయాడు.

ఆ మనిషి మెట్ల దగ్గర కాసేపు నిలబడి తలాడిస్తూ నవ్వుకుని లోపలికి వెళ్లిపోయాడు. 

మళ్లీ స్టేషనుకి రాలేనంటే శేషుకి బాధగా అనిపించింది. ఇందాక గూడ్సు ట్రైను దగ్గర వచ్చిన ఊహలు గుర్తొచ్చాయి. సైకిలు ఎత్తురోడ్డు మీదకి ఎగశ్వాసగా తొక్కుతున్నాడు. వెంకటేశ్వరస్వామి గుడి దాటాక ఊరు మొదలైంది. ఈ మబ్బు పట్టిన రోజు మెయిన్ రోడ్డు మీద పెద్ద సందడి లేదు. కూరగాయల కొట్ల ముందు కుళ్లిన టమాటాలు పడున్నాయి. బస్టాండులో ఒక తాత మోకాలి మీద కురుపు చుట్టూ ఈగలు ముసురుతుంటే తోలుకుంటున్నాడు. ‘దాంపత్య రహస్యాలు’ పోస్టరుని ఒక మేక కాళ్లు గోడకి నిగడదన్ని తింటోంది. పిండిమిల్లు గొట్రుకి తుమ్ము ఆపుకుంటూ సందులోకి సైకిలు తిప్పాడు శేషు. పాలాయన సైకిలు మెట్టుకి ఆనించి తలపాగా చుట్టుకుంటున్నాడు. ‘ఏసాకాలమని పట్టేను వొడియాలు నాకేం తెలుసమ్మా’ అని సాగదీస్తోంది దడి వెనకాల ఒక ఆడ గొంతు. శేషుకి మనసంతా ఇరుగ్గా చిరాగ్గా ఉంది. అవమానం మనసుని సలుపుతూనే ఉంది. ‘‘అక్కడే దవడ మీద పీకేసుండాల్సింది ఎదవని,’’ అనుకున్నాడు. ‘‘బతుకంతా ఇంతే ఈళ్లకి’’ అనుకున్నాడు. ‘‘ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి ఎక్కడికైనా’’ అనుకున్నాడు.


July 23, 2022

001 : “తోస్తే తప్ప కదలకపోతే ఎలారా!”

స్టేట్లీ, ప్లంప్ తాతయ్య మెట్లెక్కుతుంటే, శేషూ వెనకాల ఫాలో అయ్యాడు. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, అడ్మిషన్స్ సమయం. తాతయ్య గుమాస్తాల దగ్గరకు వెళ్లి మాట్లాడాడు. తర్వాత చొరవగా ప్రిన్సిపల్ గదిలోకి కూడా వెళ్ళిపోయాడు. శేషు మాత్రం ఆఫీసు హాల్లోనే ఆగిపోయాడు. సొట్టల బీరువాల్లోంచి బ్రౌన్ రంగు ఫైళ్లు, పై పెచ్చులూడి ఇనుము కనిపిస్తున్న టైపు రైటర్లు… శేషు దిక్కులు చూస్తున్నాడు. పంజాబీ డ్రెస్సుల్లో అమ్మాయిలు, మోచేతుల మీదకి షర్టులు మడత పెట్టిన అబ్బాయిలూ గుమాస్తాల్ని విసిగిస్తున్నారు. అక్కడ శేషు స్థానంలో ఓ పదేళ్ల కుర్రాడున్నా ఇంకాస్త చొరవగా ఉండేవాడేమో. శేషుకి ఎన్నో మిల్లీ మీటరు దగ్గర జుట్టు పాపిడి తీయాలో తెలుసు, టీషర్టు కూడా ఇస్త్రీ చేసి వేసుకోవటం తెలుసు. ఏ కాలేజీ ఎంచుకోవాలో ఏ కోర్సు తీసుకోవాలో మటుకు తెలీదు. ఇంటర్ అయింతర్వాత వేసవి సెలవులన్నీ వాణీ వాళ్ల ఇంటి చుట్టూ రేంజర్ సైకిలు మీద తిరగటంతోనే సరిపొయ్యింది. వాణీ చిరాగ్గా ఉన్నప్పుడు చిరాగ్గా చూసేది, ప్రసన్నంగా ఉన్నప్పుడు ప్రసన్నంగా చూసేది. ఆ పిల్లకి వీడు ఉన్నా లేకపోయినా తేడాపడని జీవితం ఉంది. అందులో దూరాలని వీడి ప్రయత్నం. అదేం తేలకుండానే, ఒకరితో ఒకరు ఒక్క మాటా మాట్లాడకుండానే, వేసవి సెలవులు అయిపోయాయి. ఆ రోజు తాతయ్యే గుర్తు చేసి బయల్దేరదీశాడు. 

తాతయ్య టీవీఎస్ నడిపాడు. శేషు వెనకాల కూర్చున్నాడు. దారంతా పొలాల మీంచి చెమ్మ గాలి. మండపేట పొలిమేరల్లో ఒకసారి తాతయ్య బండి ఆపి దిగాడు. శేషు కాసేపట్లో కురిసే వానకి ఈ ఎర్ర కంకర్రోడ్డు మీద దుమ్మంతా ఎలా అణగారి పోతుందో ఆలోచించాడు. తాతయ్య జిప్ పెట్టుకుని నడిచి వస్తూ, బండి మీద ఆపిన తిట్లు కొనసాగించాడు, “ఎవడో ఒకడు వెనక నుంచి తోస్తే తప్ప కదలకపోతే ఎలారా? మూతి మీదకి మీసాలు, ముడ్డి కిందకి పద్దెనిమిదేళ్లూ వస్తున్నాయి”. శేషుకి నాన్న లేడు కాబట్టి అధికారమంతా తాతయ్యదే. శేషుకి ఆపైన ఇంకో పద్దెనిమిదేళ్లు వచ్చినా చొరవా పెద్దరికం రాబోవని అప్పుడు తాతయ్యకింకా తెలీదు. కానీ అప్పుడప్పుడూ ధైర్యం పాలపొంగులా వచ్చిపోతుండేది. ఆ ధైర్యంలో తీసుకున్న నిర్ణయాల ఫలితాల్ని మాత్రం, ఆ పొంగు చల్లారింతర్వాత, ఏ చొరవా పెద్దరికం లేని మనిషే మళ్ళీ ఫేస్ చేయాల్సి వచ్చేది. 

ప్రిన్సిపల్ రూము తలుపు తెరుచుకుంది. తాతయ్య దళసరి ఫ్రేము కళ్ళజోడు తొంగి చూసింది. “రావేం లోపలికి?” అన్నాడు. శేషుకి ఇంక తప్పలేదు. లోపల ప్రిన్సిపల్ తెల్ల చొక్కాని నల్ల ఫాంటులోకి టక్ చేసుకుని, గ్లోబ్ ఉన్న టేబిలు వెనక కూర్చున్నాడు. తాతయ్య కూర్చుంటూ, “వీడేనండీ,” అన్నాడు. “ఇంటరు బైపీసీ ఎందుకు తీసుకున్నావు, ఎంపీసీలో చేరకపోయావా?” అన్నాడు ప్రిన్సిపల్. శేషుకి ఇప్పుడు ఏదో ఒకటి ప్రత్యేకంగా మాట్లాడి రానున్న మూడేళ్లూ ఈ ప్రిన్సిపల్ దృష్టిలో ‘నోటెడ్’ ఐపోవటం ఇష్టం లేదు. అందుకే ఏం మాట్లాడలేదు. “లెక్కల మాస్టారి మనవడివి లెక్కలంటే భయపడితే ఎట్లారా… ?” అన్నాడు మళ్లీ ప్రిన్సిపల్. శేషుకి ఈమధ్యనే ఎవరన్నా “రా”, “ఒరే” అంటే ఒళ్లు మండటం మొదలైంది. నవ్వొకటి మూతికి అతికించాడు. తాతయ్య చేతులు రెండూ వదులుగా జోడించి, “మీరే ఓ కంట కనిపెడుతుండాలి మావాడ్ని, మీ చేతుల్లో పెడుతున్నాను” అన్నాడు. తర్వాత ముసలాళ్లిద్దరూ వాళ్ల టీచింగ్ కెరీర్లు ఎక్కడ కలిసినట్టే కలిసి ఎలా వేరైపోయాయో మాట్లాడుకున్నారు.

బైటికి వచ్చాకా తాతయ్య అంతకుముందులేని హుషారుతో ఉన్నాడు. బండి తీయబోతూ కాలేజీ బిల్డింగు వైపు చూశాడు. “అలా పోయొద్దామేంట్రా ఒకసారి అన్నాడు.” ఇద్దరూ చినుకుల్ని దాటుకుంటూ వరండాలోకి నడిచారు. ఇనుప దూలాల మీద నిలబడిన పాత బిల్డింగు. క్లాసు రూముల్లో బల్లలన్నీ ఖాళీగా ఉన్నాయి. తాతయ్య క్లాసు గుమ్మాల పైన రాసున్న పేర్లు చదువుతూ నడుస్తున్నాడు. శేషు చెవుల్లో కాలేజీ లైఫ్ మీద సినిమా పాటలేవో విన్పిస్తున్నాయి. ఆ ఖాళీ వరండాలో గుండెలకి పుస్తకాలానించుకుని అమ్మాయిలు ఎదురొస్తున్నట్టు ఊహించుకున్నాడు. మనసంతా జలపాతం వచ్చిపడుతున్నంత బరువుగా, అది వెదజల్లే నురగంత తేలిగ్గా కూడా ఉంది. “డిగ్రీ ఫస్ట్ ఇయర్, బైపీసీ,” అని చదివాడు తాతయ్య. నీలం రంగు గుమ్మం మీద తెల్లటి పెయింటుతో ఆ అక్షరాలు రాసి ఉన్నాయి. తలుపు తీసుకుని లోపలికి నడిచారు. ఖాళీ బ్లాక్ బోర్డు మీద సుద్దపొడి తుడిచిన ఆనవాళ్లున్నాయి. తాతయ్య అటువైపున్న కిటికీల దగ్గరకు వెళ్ళి బైట ఏముందో తొంగి చూస్తున్నాడు. శేషు బల్లల దగ్గర ఆగాడు. బల్లల మీద బాణం దూసుకెళ్లిన లవ్ గుర్తుల్లో అమ్మాయిలవీ అబ్బాయిలవీ పేర్లున్నాయి. వృత్తలేఖినుల్లో యవ్వనపు బలం అంతా చొప్పించి చెక్కల్ని తొలిచేసారు. బల్లల మధ్య నడిచాడు. అలవాటుగా ఆఖరి బెంచీ మీద కూర్చున్నాడు. అక్కడి నుంచి బ్లాక్ బోర్డు వైపు చూస్తుంటే, మున్ముందు ఆ గదిని హోరెత్తించబోయే స్టూడెంట్స్ సందడి కళ్ళ ముందు మెదిలింది. “పదరా” అంటున్నాడు తాతయ్య టీచింగ్ ప్లాట్ ఫాం దగ్గర నిలబడి. ఆయన మొహంలో నవ్వుంది. ఏదో అనబోతున్నాడేమో అనిపించింది. కానీ ఏం అనకుండానే బైటకి నడిచాడు. శేషు బల్లల మధ్య నుంచి నడిచి బైటికి వచ్చేసరికి ఆయన వరండాలో పిట్టగోడకి జారబడి ఉన్నాడు. వెనకాల అశోక వృక్షాలూ, పచ్చగడ్డీ అన్నీ తడిచిన రంగుల్లో ఉన్నాయి. శేషు తాతయ్య ముందు నిలబడి “పదా?” అన్నాడు. 

తాతయ్య బొజ్జ మీద చేతులు కట్టుకుని ఏదో మాట్లాడేదుంది ఆగమన్నట్టు తల ఆడించాడు. నిట్టూర్చి, “చాలా ముఖ్యమైన రోజులురా ముందున్నవి. బాగా చదువుకోవాలి మరి!” అన్నాడు. ఇద్దరూ నడిచారు. తాతయ్య శేషూ భుజం మీద చేయి వేసాడు. ఇద్దరికీ అలవాటు లేని ఆ చేయి కాసేపు అక్కడే ఉంది. శేషుకి అది బరువుగా అనిపించింది. తాతయ్య మాటలు కూడా మోయటానికి బరువుగానే ఉన్నాయి. అప్పటిదాకా మొగ్గల్లోంచి పుప్పొళ్లు చిప్పిల్లే లోకం వాడి కళ్ల ముందు ఉంది. ఇప్పుడు బాధ్యతల దిట్టమైన చెట్టుమాను ల్లోంచి భవిష్యత్తు ఇరుగ్గా కనపడుతోంది. ఫాంట్ అంచు దులుపుకుంటున్న సాకుతో కిందికి వొంగాడు. తాతయ్య చేయి భుజం మీంచి జారిపోయింది. మళ్ళీ పైకి లేచి, తేలికపడ్డ భుజాలతో ముందుకు నడిచాడు.


July 8, 2022

ప్రతి అడుగూ పట్టి పట్టి నడవటం Vs కాలు జారి పడి ప్రవాహంలో కొట్టుకుపోవటం

"The book just came to me. All I had to do was be there with buckets to catch it,” అంటాడు సాల్ బెల్లో తన 'ఆగీమార్చ్' నవల రాయటం గురించి. ఆ నవల మొదటి పేరా చదువుతుంటేనే అది వరదలా రచయిత వొళ్లో వచ్చి పడిందన్న సంగతి మనకు అర్థమవుతుంది. రాసేవాళ్లకి అలా ఎప్పుడో తప్ప జరగదు. అలా జరిగిన రోజే- అది ‘‘మన రోజు’’. అలాంటి రోజొకటి వస్తుందని ఎదురుచూట్టం కోసమే- మిగతా రోజులన్నీ ఉంటాయి. ఈ మిగతా రోజుల్లో రాయటం రాయటంలా ఉండదు. తుప్పుపట్టి బిగుసుకుపోయిన నట్లను రెంచీతో విప్పటంలా ఉంటుంది. అసలు రాయటమంటేనే ఇలా అక్షరాల్ని ముందేసుకుని చెమటోడ్చటం అంటారు కొంతమంది. హెమింగ్వే రాయటమంటే టైప్ రైటరు ముందు కూర్చుని రక్తం కక్కుకోవటం అంటాడు. కానీ ఆయన పొంగి కాయితంపైకి ప్రవహించిన రోజుల్లేవంటేనూ, అవే రైటరుగా ఉండటాన్ని జస్టిఫై చేసే రోజులని ఆయన అనుకోడంటేనూ- నేను నమ్మలేను. 

‘‘ఆగీమార్చ్’’ నవలకి ముందు కూడా సాల్ బెల్లో రెండు నవలలు రాశాడు. కానీ అవి రాస్తున్నప్పుడు ఆయన ఫ్రెంచి రచయిత ఫ్లాబెర్ట్ ప్రభావంలో ఉన్నాడు. వచనం మీద కూడా కవిత్వమంతటి శ్రద్ధ పెట్టడమన్నదీ, ఒక వచన వాక్యం మీద రోజులకొద్దీ పని చేయటమన్నదీ బహుశా సాహిత్యంలో ఫ్లాబెర్ట్ తోనే మొదలైంది. మెల్లగా ఆధునిక వెస్ట్రన్ సాహిత్యంలో అదో ప్రమాణంగా చెలామణీలోకి వచ్చేసింది. కానీ ఆ మోడల్ సాల్ బెల్లోకి నప్పలేదు: “In writing [my first two books] I accepted a Flaubertian standard. Not a bad standard, to be sure, but one which, in the end, I found repressive.” (నా మొదటి రెండు పుస్తకాలూ రాయటంలో ఫ్లాబెర్టియన్ ప్రమాణాన్ని ఒప్పుకున్నాను. అందులో లోటేం లేదు నిజానికి, కానీ నాకు మాత్రం అదో కట్టడిలా మారింది.)

ఏ రచయితకైనా సరే తొలిరోజుల్లో రాయటంలో ఒక ‘‘సులువు’’ ఉంటుంది. అది లేకపోతే అసలు ఎవ్వరూ రాయటం జోలికే రారు. కానీ రాను రానూ చుట్టూ ఉన్న సాహిత్య వ్యవస్థ గురించి తెలిసేకొద్దీ, అందులో ఏం చెల్లుబాటవుతాయన్నది అర్థమయ్యేకొద్దీ, ఆ ప్రమాణాలని మన్నించేకొద్దీ, కొంతమందిలో ఆ సులువు మెల్లగా పోతుంది. మళ్ళీ ఆ ధారలాంటి వేగాన్ని పట్టుకోగలగటం- ఎలాంటిదంటే- పికాసో తన చిత్రకళా నైపుణ్యాన్నంతా మధ్యలో వదిలిపడేసి మళ్లీ పిల్లల్లా గీయటం మొదలుపెట్టడం లాంటిది. తొలిరోజుల్లో ఉండే ఆ సులువును నిలబెట్టుకోగలిగినవాళ్లు అదృష్టవంతులు. కొంతమంది దాన్ని నిలబెట్టుకోలేరు, అలాగని ప్రతి వాక్యం పట్టిపట్టి రాయటమన్న పద్ధతికి పూర్తిగా అలవాటూ పడలేరు. దాన్తో ఇక రాయటం అంటేనే ఇటుకా ఇటుకా పేర్చి కట్టే ఏ సరదా లేని తాపీ పని అన్న అర్థం ఇచ్చుకుని రాజీపడతారు. పరధ్యాసగా రెయిలింగ్ లో పెట్టిన చేయి ఇరుక్కుపోతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది పరిస్థితి. ముందసలు రాయటం అంటే ఇది కాదనీ, ఇక్కడ ఇరుక్కుపోయామని ఒప్పుకోగలగటం అవసరం. అప్పుడే అన్ లెర్నింగ్ వీలవుతుంది. అదో పెద్ద ప్రయాస. రాయటం మొదలెట్టిన రోజుల్లో మన చేతికి మన పెన్నుతో ఏ సౌకర్యం ఉంటుందో అది మళ్లీ రావాలంటే, ముందు మనతో మనకి ఆ పాత సౌకర్యం రావాలి. సాహిత్య మనే ఆర్గనైజేషన్ మనమీద పన్నిన ఉచ్చుల్ని వొల్చుకోవాలి. మనసులోని ఎచ్చులన్నీ కక్కుకోవాలి. తొలి అమాయకత్వం తలుపు తట్టాలి. అదీ మనమూ ఇక ఎప్పటికీ ఒక్కటైతే కాము. కానీ సయోధ్య సాధ్యమే. పైగా ఈ తప్పిపోయి మళ్లీ వెనక్కి దారి వెతుక్కునేవాళ్లకి ఆ ప్రయాణం మంచే చేస్తుంది, వాళ్ల రాతలో. 

***

దాస్తోయెవస్కీని తీసిపడేస్తూ నబొకొవ్ అన్న ఒక మాటని బోర్హెస్ ఇలా తిప్పికొడతాడు (ఒక్క వాక్యంలో ముగ్గురు మెగాస్టార్లు పట్టేశారు!):

"In the preface to an anthology of Russian literature, Vladimir Nabokov stated that he had not found a single page of Dostoevsky worthy of inclusion. This ought to mean that Dostoevsky should not be judged by each page but rather by the total of all the pages that comprise the book." 

బోర్హెస్ మాటల్ని ఇలా అనువదించొచ్చు: "రష్యన్ సాహిత్య సంకలనానికి నబొకొవ్ ముందుమాట రాస్తూ, దాస్తోయెవస్కీ సాహిత్యంలో ఒక్క పేజీకి కూడా అందులో చేరే అర్హత లేదన్నాడు. బహుశా ఆయన దాస్తోయెవ‌స్కీ అర్హతని ఒకొక్క పేజీని బట్టి కాకుండా, పుస్తకంలోని అన్ని పేజీలనీ కలిపి అంచనా వేసుండాల్సింది." ఇది చదివినప్పుడు చప్పట్లు కొట్టబుద్ధేసింది. 

దాస్తోయెవస్కీ మొదట్నుంచీ ఒక సలువుని, వేగాన్ని నిలుపుకున్న రచయిత. ఆయనకి అద్దకం పని చేతకాదు. ఈ విషయంలో టాల్ స్టాయితో పోల్చుకుని చిన్నబుచ్చుకునేవాడు. అసలు తనకు జీవితమే తీరుబడిగా రాసే వెసులుబాటు కల్పించలేదని వాపోయేవాడు: ‘‘ఇలా కంగారు కంగారుగా రాయాల్సి రావటం ఎంత బాధో నాకే తెలుసు... దేవుడా! జీవితమంతా నాది ఇదే పరిస్థితి. …టాల్‌స్టాయి అలాక్కాదు, అతనికి డబ్బుకి లోటు లేదు, మర్నాటి కోసం తడుముకోవాల్సిన అవసరం లేదు, కాబట్టి రాసినవాటికి తీరుబడిగా కూర్చొని ఎన్నైనా మెరుగులు దిద్దుకోవచ్చు”. కానీ నిజానికి ఇది జీవితం పెట్టిన ఇబ్బందేం కాదు. దాస్తోయెవస్కీ తత్త్వమే అంత. రాయటం మొదలుపెడితే ఆపటం కష్టం. వాక్యం గీక్యం అని పట్టింపులుండవు. డెడ్ లైన్ హడావిడిలో సెక్రటరీకి డిక్టేట్ చేయాల్సివచ్చినప్పుడు రాసిన ‘గాంబ్లర్’ నవలని ఎంత వేగంతో రాశాడో, లైఫ్ లో కాస్తో కూస్తో సెటిలయ్యాకా రాసిన ‘బ్రదర్స్ కరమజవ్’ నవలనూ అంతే వేగంతో రాశాడు. నబొకొవ్ అలాక్కాదు. వాక్యం మీద శ్రమించే బాపతు. "My Pencils Outlast Their Erasers" (నా పెన్సిళ్ల కంటే ముందే ఎరేజర్లు అరిగిపోతాయి) అంటాడు ఒక ఇంటర్వ్యూలో. అలాంటి నబొకొవ్ కూడా ఒక ఇంటర్వ్యూలో ‘‘రచయితగా మీ ముఖ్యమై ఫెయిల్యూర్ ఏంటి’’ అని అడిగితే మొదటగా చెప్పింది, ‘స్పాంటేనిటీ’ లేకపోవటం గురించి: ‘‘Lack of spontaneity; the nuisance of parallel thoughts, second thoughts, third thoughts; inability to express myself properly in any language unless I compose every damned sentence in my bath, in my mind, at my desk.’’ కానీ ఇదే నబొకొవ్ ఆ స్పాంటేనిటీ లేకపోవటాన్నే చాలాచోట్ల గొప్పగా ప్రచారం చేసుకున్నాడనిపిస్తుంది. అంటే, ప్రతిపేరా అబ్బరంగా ఒక ఇండెక్స్ కార్డు మీద రాయటం, రాస్తున్నది అంతా మైండులో పూర్తయ్యాక మాత్రమే రాయటం మొదలుపెట్టడం… ఇలాంటివి. 

అసలు చదివేవాళ్లకి ఈ తేడాలన్నీ తెలుస్తాయా అంటే- అందరికీ తెలీవు. ఆత్మలేని అద్దకంపనిని గొప్ప రచన అనుకునే పాఠకులూ ఉంటారు. ఇలాంటి ఎక్కువమంది పాఠకులు ఒప్పుకోవటమే తన రచన నాణ్యానికి గీటురాయి అనుకునే రచయితకి అసలీ ఇబ్బందే ఉడదు.