లావుగా, దర్జాగా తాతయ్య మెట్లెక్కుతుంటే, శేషూ వెనకాల ఫాలో అయ్యాడు. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, అడ్మిషన్స్ సమయం. తాతయ్య గుమాస్తాల దగ్గరకు వెళ్లి మాట్లాడాడు. తర్వాత చొరవగా ప్రిన్సిపల్ గదిలోకి కూడా వెళ్ళిపోయాడు. శేషు మాత్రం ఆఫీసు హాల్లోనే ఆగిపోయాడు. సొట్టల బీరువాల్లోంచి బ్రౌన్ రంగు ఫైళ్లు, పై పెచ్చులూడి ఇనుము కనిపిస్తున్న టైపు రైటర్లు… శేషు దిక్కులు చూస్తున్నాడు. పంజాబీ డ్రెస్సుల్లో అమ్మాయిలు, మోచేతుల మీదకి షర్టులు మడత పెట్టిన అబ్బాయిలూ గుమాస్తాల్ని విసిగిస్తున్నారు. అక్కడ శేషు స్థానంలో ఓ పదేళ్ల కుర్రాడున్నా ఇంకాస్త చొరవగా ఉండేవాడేమో. శేషుకి ఎన్నో మిల్లీ మీటరు దగ్గర జుట్టు పాపిడి తీయాలో తెలుసు, టీషర్టు కూడా ఇస్త్రీ చేసి వేసుకోవటం తెలుసు. ఏ కాలేజీ ఎంచుకోవాలో ఏ కోర్సు తీసుకోవాలో మటుకు తెలీదు. ఇంటర్ అయింతర్వాత వేసవి సెలవులన్నీ వాణీ వాళ్ల ఇంటి చుట్టూ రేంజర్ సైకిలు మీద తిరగటంతోనే సరిపొయ్యింది. వాణీ చిరాగ్గా ఉన్నప్పుడు చిరాగ్గా చూసేది, ప్రసన్నంగా ఉన్నప్పుడు ప్రసన్నంగా చూసేది. ఆ పిల్లకి వీడు ఉన్నా లేకపోయినా తేడాపడని జీవితం ఉంది. అందులో దూరాలని వీడి ప్రయత్నం. అదేం తేలకుండానే, ఒకరితో ఒకరు ఒక్క మాటా మాట్లాడకుండానే, వేసవి సెలవులు అయిపోయాయి. ఆ రోజు తాతయ్యే గుర్తు చేసి బయల్దేరదీశాడు.
తాతయ్య టీవీఎస్ నడిపాడు. శేషు వెనకాల కూర్చున్నాడు. దారంతా పొలాల మీంచి చెమ్మ గాలి. మండపేట పొలిమేరల్లో ఒకసారి తాతయ్య బండి ఆపి దిగాడు. శేషు కాసేపట్లో కురిసే వానకి ఈ ఎర్ర కంకర్రోడ్డు మీద దుమ్మంతా ఎలా అణగారి పోతుందో ఆలోచించాడు. తాతయ్య జిప్ పెట్టుకుని నడిచి వస్తూ, బండి మీద ఆపిన తిట్లు కొనసాగించాడు, “ఎవడో ఒకడు వెనక నుంచి తోస్తే తప్ప కదలకపోతే ఎలారా? మూతి మీదకి మీసాలు, ముడ్డి కిందకి పద్దెనిమిదేళ్లూ వస్తున్నాయి”. శేషుకి నాన్న లేడు కాబట్టి అధికారమంతా తాతయ్యదే. శేషుకి ఆపైన ఇంకో పద్దెనిమిదేళ్లు వచ్చినా చొరవా పెద్దరికం రాబోవని అప్పుడు తాతయ్యకింకా తెలీదు. కానీ అప్పుడప్పుడూ ధైర్యం పాలపొంగులా వచ్చిపోతుండేది. ఆ ధైర్యంలో తీసుకున్న నిర్ణయాల ఫలితాల్ని మాత్రం, ఆ పొంగు చల్లారింతర్వాత, ఏ చొరవా పెద్దరికం లేని మనిషే మళ్ళీ ఫేస్ చేయాల్సి వచ్చేది.
ప్రిన్సిపల్ రూము తలుపు తెరుచుకుంది. తాతయ్య దళసరి ఫ్రేము కళ్ళజోడు తొంగి చూసింది. “రావేం లోపలికి?” అన్నాడు. శేషుకి ఇంక తప్పలేదు. లోపల ప్రిన్సిపల్ తెల్ల చొక్కాని నల్ల ఫాంటులోకి టక్ చేసుకుని, గ్లోబ్ ఉన్న టేబిలు వెనక కూర్చున్నాడు. తాతయ్య కూర్చుంటూ, “వీడేనండీ,” అన్నాడు. “ఇంటరు బైపీసీ ఎందుకు తీసుకున్నావు, ఎంపీసీలో చేరకపోయావా?” అన్నాడు ప్రిన్సిపల్. శేషుకి ఇప్పుడు ఏదో ఒకటి ప్రత్యేకంగా మాట్లాడి రానున్న మూడేళ్లూ ఈ ప్రిన్సిపల్ దృష్టిలో ‘నోటెడ్’ ఐపోవటం ఇష్టం లేదు. అందుకే ఏం మాట్లాడలేదు. “లెక్కల మాస్టారి మనవడివి లెక్కలంటే భయపడితే ఎట్లారా… ?” అన్నాడు మళ్లీ ప్రిన్సిపల్. శేషుకి ఈమధ్యనే ఎవరన్నా “రా”, “ఒరే” అంటే ఒళ్లు మండటం మొదలైంది. నవ్వొకటి మూతికి అతికించాడు. తాతయ్య చేతులు రెండూ వదులుగా జోడించి, “మీరే ఓ కంట కనిపెడుతుండాలి మావాడ్ని, మీ చేతుల్లో పెడుతున్నాను” అన్నాడు. తర్వాత ముసలాళ్లిద్దరూ వాళ్ల టీచింగ్ కెరీర్లు ఎక్కడ కలిసినట్టే కలిసి ఎలా వేరైపోయాయో మాట్లాడుకున్నారు.
బైటికి వచ్చాకా తాతయ్య అంతకుముందులేని హుషారుతో ఉన్నాడు. బండి తీయబోతూ కాలేజీ బిల్డింగు వైపు చూశాడు. “అలా పోయొద్దామేంట్రా ఒకసారి అన్నాడు.” ఇద్దరూ చినుకుల్ని దాటుకుంటూ వరండాలోకి నడిచారు. ఇనుప దూలాల మీద నిలబడిన పాత బిల్డింగు. క్లాసు రూముల్లో బల్లలన్నీ ఖాళీగా ఉన్నాయి. తాతయ్య క్లాసు గుమ్మాల పైన రాసున్న పేర్లు చదువుతూ నడుస్తున్నాడు. శేషు చెవుల్లో కాలేజీ లైఫ్ మీద సినిమా పాటలేవో విన్పిస్తున్నాయి. ఆ ఖాళీ వరండాలో గుండెలకి పుస్తకాలానించుకుని అమ్మాయిలు ఎదురొస్తున్నట్టు ఊహించుకున్నాడు. మనసంతా జలపాతం వచ్చిపడుతున్నంత బరువుగా, అది వెదజల్లే నురగంత తేలిగ్గా కూడా ఉంది. “డిగ్రీ ఫస్ట్ ఇయర్, బైపీసీ,” అని చదివాడు తాతయ్య. నీలం రంగు గుమ్మం మీద తెల్లటి పెయింటుతో ఆ అక్షరాలు రాసి ఉన్నాయి. తలుపు తీసుకుని లోపలికి నడిచారు. ఖాళీ బ్లాక్ బోర్డు మీద సుద్దపొడి తుడిచిన ఆనవాళ్లున్నాయి. తాతయ్య అటువైపున్న కిటికీల దగ్గరకు వెళ్ళి బైట ఏముందో తొంగి చూస్తున్నాడు. శేషు బల్లల దగ్గర ఆగాడు. బల్లల మీద బాణం దూసుకెళ్లిన లవ్ గుర్తుల్లో అమ్మాయిలవీ అబ్బాయిలవీ పేర్లున్నాయి. వృత్తలేఖినుల్లో యవ్వనపు బలం అంతా చొప్పించి చెక్కల్ని తొలిచేసారు. బల్లల మధ్య నడిచాడు. అలవాటుగా ఆఖరి బెంచీ మీద కూర్చున్నాడు. అక్కడి నుంచి బ్లాక్ బోర్డు వైపు చూస్తుంటే, మున్ముందు ఆ గదిని హోరెత్తించబోయే స్టూడెంట్స్ సందడి కళ్ళ ముందు మెదిలింది. “పదరా” అంటున్నాడు తాతయ్య టీచింగ్ ప్లాట్ ఫాం దగ్గర నిలబడి. ఆయన మొహంలో నవ్వుంది. ఏదో అనబోతున్నాడేమో అనిపించింది. కానీ ఏం అనకుండానే బైటకి నడిచాడు. శేషు బల్లల మధ్య నుంచి నడిచి బైటికి వచ్చేసరికి ఆయన వరండాలో పిట్టగోడకి జారబడి ఉన్నాడు. వెనకాల అశోక వృక్షాలూ, పచ్చగడ్డీ అన్నీ తడిచిన రంగుల్లో ఉన్నాయి. శేషు తాతయ్య ముందు నిలబడి “పదా?” అన్నాడు.
తాతయ్య బొజ్జ మీద చేతులు కట్టుకుని ఏదో మాట్లాడేదుంది ఆగమన్నట్టు తల ఆడించాడు. నిట్టూర్చి, “చాలా ముఖ్యమైన రోజులురా ముందున్నవి. బాగా చదువుకోవాలి మరి!” అన్నాడు. ఇద్దరూ నడిచారు. తాతయ్య శేషూ భుజం మీద చేయి వేసాడు. ఇద్దరికీ అలవాటు లేని ఆ చేయి కాసేపు అక్కడే ఉంది. శేషుకి అది బరువుగా అనిపించింది. తాతయ్య మాటలు కూడా మోయటానికి బరువుగానే ఉన్నాయి. అప్పటిదాకా మొగ్గల్లోంచి పుప్పొళ్లు చిప్పిల్లే లోకం వాడి కళ్ల ముందు ఉంది. ఇప్పుడు బాధ్యతల దిట్టమైన చెట్టుమాను ల్లోంచి భవిష్యత్తు ఇరుగ్గా కనపడుతోంది. ఫాంట్ అంచు దులుపుకుంటున్న సాకుతో కిందికి వొంగాడు. తాతయ్య చేయి భుజం మీంచి జారిపోయింది. మళ్ళీ పైకి లేచి, తేలికపడ్డ భుజాలతో ముందుకు నడిచాడు.
అభినందనలు సార్
ReplyDeleteసింపుల్....సుపర్బ్
ReplyDeleteబావుంది మెహర్
ReplyDelete👌✌️❤️😊🌈🌹💕😍
ReplyDelete