"The book just came to me. All I had to do was be there with buckets to catch it,” అంటాడు సాల్ బెల్లో తన 'ఆగీమార్చ్' నవల రాయటం గురించి. ఆ నవల మొదటి పేరా చదువుతుంటేనే అది వరదలా రచయిత వొళ్లో వచ్చి పడిందన్న సంగతి మనకు అర్థమవుతుంది. రాసేవాళ్లకి అలా ఎప్పుడో తప్ప జరగదు. అలా జరిగిన రోజే- అది ‘‘మన రోజు’’. అలాంటి రోజొకటి వస్తుందని ఎదురుచూట్టం కోసమే- మిగతా రోజులన్నీ ఉంటాయి. ఈ మిగతా రోజుల్లో రాయటం రాయటంలా ఉండదు. తుప్పుపట్టి బిగుసుకుపోయిన నట్లను రెంచీతో విప్పటంలా ఉంటుంది. అసలు రాయటమంటేనే ఇలా అక్షరాల్ని ముందేసుకుని చెమటోడ్చటం అంటారు కొంతమంది. హెమింగ్వే రాయటమంటే టైప్ రైటరు ముందు కూర్చుని రక్తం కక్కుకోవటం అంటాడు. కానీ ఆయన పొంగి కాయితంపైకి ప్రవహించిన రోజుల్లేవంటేనూ, అవే రైటరుగా ఉండటాన్ని జస్టిఫై చేసే రోజులని ఆయన అనుకోడంటేనూ- నేను నమ్మలేను.
‘‘ఆగీమార్చ్’’ నవలకి ముందు కూడా సాల్ బెల్లో రెండు నవలలు రాశాడు. కానీ అవి రాస్తున్నప్పుడు ఆయన ఫ్రెంచి రచయిత ఫ్లాబెర్ట్ ప్రభావంలో ఉన్నాడు. వచనం మీద కూడా కవిత్వమంతటి శ్రద్ధ పెట్టడమన్నదీ, ఒక వచన వాక్యం మీద రోజులకొద్దీ పని చేయటమన్నదీ బహుశా సాహిత్యంలో ఫ్లాబెర్ట్ తోనే మొదలైంది. మెల్లగా ఆధునిక వెస్ట్రన్ సాహిత్యంలో అదో ప్రమాణంగా చెలామణీలోకి వచ్చేసింది. కానీ ఆ మోడల్ సాల్ బెల్లోకి నప్పలేదు: “In writing [my first two books] I accepted a Flaubertian standard. Not a bad standard, to be sure, but one which, in the end, I found repressive.” (నా మొదటి రెండు పుస్తకాలూ రాయటంలో ఫ్లాబెర్టియన్ ప్రమాణాన్ని ఒప్పుకున్నాను. అందులో లోటేం లేదు నిజానికి, కానీ నాకు మాత్రం అదో కట్టడిలా మారింది.)
ఏ రచయితకైనా సరే తొలిరోజుల్లో రాయటంలో ఒక ‘‘సులువు’’ ఉంటుంది. అది లేకపోతే అసలు ఎవ్వరూ రాయటం జోలికే రారు. కానీ రాను రానూ చుట్టూ ఉన్న సాహిత్య వ్యవస్థ గురించి తెలిసేకొద్దీ, అందులో ఏం చెల్లుబాటవుతాయన్నది అర్థమయ్యేకొద్దీ, ఆ ప్రమాణాలని మన్నించేకొద్దీ, కొంతమందిలో ఆ సులువు మెల్లగా పోతుంది. మళ్ళీ ఆ ధారలాంటి వేగాన్ని పట్టుకోగలగటం- ఎలాంటిదంటే- పికాసో తన చిత్రకళా నైపుణ్యాన్నంతా మధ్యలో వదిలిపడేసి మళ్లీ పిల్లల్లా గీయటం మొదలుపెట్టడం లాంటిది. తొలిరోజుల్లో ఉండే ఆ సులువును నిలబెట్టుకోగలిగినవాళ్లు అదృష్టవంతులు. కొంతమంది దాన్ని నిలబెట్టుకోలేరు, అలాగని ప్రతి వాక్యం పట్టిపట్టి రాయటమన్న పద్ధతికి పూర్తిగా అలవాటూ పడలేరు. దాన్తో ఇక రాయటం అంటేనే ఇటుకా ఇటుకా పేర్చి కట్టే ఏ సరదా లేని తాపీ పని అన్న అర్థం ఇచ్చుకుని రాజీపడతారు. పరధ్యాసగా రెయిలింగ్ లో పెట్టిన చేయి ఇరుక్కుపోతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది పరిస్థితి. ముందసలు రాయటం అంటే ఇది కాదనీ, ఇక్కడ ఇరుక్కుపోయామని ఒప్పుకోగలగటం అవసరం. అప్పుడే అన్ లెర్నింగ్ వీలవుతుంది. అదో పెద్ద ప్రయాస. రాయటం మొదలెట్టిన రోజుల్లో మన చేతికి మన పెన్నుతో ఏ సౌకర్యం ఉంటుందో అది మళ్లీ రావాలంటే, ముందు మనతో మనకి ఆ పాత సౌకర్యం రావాలి. సాహిత్య మనే ఆర్గనైజేషన్ మనమీద పన్నిన ఉచ్చుల్ని వొల్చుకోవాలి. మనసులోని ఎచ్చులన్నీ కక్కుకోవాలి. తొలి అమాయకత్వం తలుపు తట్టాలి. అదీ మనమూ ఇక ఎప్పటికీ ఒక్కటైతే కాము. కానీ సయోధ్య సాధ్యమే. పైగా ఈ తప్పిపోయి మళ్లీ వెనక్కి దారి వెతుక్కునేవాళ్లకి ఆ ప్రయాణం మంచే చేస్తుంది, వాళ్ల రాతలో.
దాస్తోయెవస్కీని తీసిపడేస్తూ నబొకొవ్ అన్న ఒక మాటని బోర్హెస్ ఇలా తిప్పికొడతాడు (ఒక్క వాక్యంలో ముగ్గురు మెగాస్టార్లు పట్టేశారు!):
"In the preface to an anthology of Russian literature, Vladimir Nabokov stated that he had not found a single page of Dostoevsky worthy of inclusion. This ought to mean that Dostoevsky should not be judged by each page but rather by the total of all the pages that comprise the book."
బోర్హెస్ మాటల్ని ఇలా అనువదించొచ్చు: "రష్యన్ సాహిత్య సంకలనానికి నబొకొవ్ ముందుమాట రాస్తూ, దాస్తోయెవస్కీ సాహిత్యంలో ఒక్క పేజీకి కూడా అందులో చేరే అర్హత లేదన్నాడు. బహుశా ఆయన దాస్తోయెవస్కీ అర్హతని ఒకొక్క పేజీని బట్టి కాకుండా, పుస్తకంలోని అన్ని పేజీలనీ కలిపి అంచనా వేసుండాల్సింది." ఇది చదివినప్పుడు చప్పట్లు కొట్టబుద్ధేసింది.
దాస్తోయెవస్కీ మొదట్నుంచీ ఒక సలువుని, వేగాన్ని నిలుపుకున్న రచయిత. ఆయనకి అద్దకం పని చేతకాదు. ఈ విషయంలో టాల్ స్టాయితో పోల్చుకుని చిన్నబుచ్చుకునేవాడు. అసలు తనకు జీవితమే తీరుబడిగా రాసే వెసులుబాటు కల్పించలేదని వాపోయేవాడు: ‘‘ఇలా కంగారు కంగారుగా రాయాల్సి రావటం ఎంత బాధో నాకే తెలుసు... దేవుడా! జీవితమంతా నాది ఇదే పరిస్థితి. …టాల్‌స్టాయి అలాక్కాదు, అతనికి డబ్బుకి లోటు లేదు, మర్నాటి కోసం తడుముకోవాల్సిన అవసరం లేదు, కాబట్టి రాసినవాటికి తీరుబడిగా కూర్చొని ఎన్నైనా మెరుగులు దిద్దుకోవచ్చు”. కానీ నిజానికి ఇది జీవితం పెట్టిన ఇబ్బందేం కాదు. దాస్తోయెవస్కీ తత్త్వమే అంత. రాయటం మొదలుపెడితే ఆపటం కష్టం. వాక్యం గీక్యం అని పట్టింపులుండవు. డెడ్ లైన్ హడావిడిలో సెక్రటరీకి డిక్టేట్ చేయాల్సివచ్చినప్పుడు రాసిన ‘గాంబ్లర్’ నవలని ఎంత వేగంతో రాశాడో, లైఫ్ లో కాస్తో కూస్తో సెటిలయ్యాకా రాసిన ‘బ్రదర్స్ కరమజవ్’ నవలనూ అంతే వేగంతో రాశాడు. నబొకొవ్ అలాక్కాదు. వాక్యం మీద శ్రమించే బాపతు. "My Pencils Outlast Their Erasers" (నా పెన్సిళ్ల కంటే ముందే ఎరేజర్లు అరిగిపోతాయి) అంటాడు ఒక ఇంటర్వ్యూలో. అలాంటి నబొకొవ్ కూడా ఒక ఇంటర్వ్యూలో ‘‘రచయితగా మీ ముఖ్యమై ఫెయిల్యూర్ ఏంటి’’ అని అడిగితే మొదటగా చెప్పింది, ‘స్పాంటేనిటీ’ లేకపోవటం గురించి: ‘‘Lack of spontaneity; the nuisance of parallel thoughts, second thoughts, third thoughts; inability to express myself properly in any language unless I compose every damned sentence in my bath, in my mind, at my desk.’’ కానీ ఇదే నబొకొవ్ ఆ స్పాంటేనిటీ లేకపోవటాన్నే చాలాచోట్ల గొప్పగా ప్రచారం చేసుకున్నాడనిపిస్తుంది. అంటే, ప్రతిపేరా అబ్బరంగా ఒక ఇండెక్స్ కార్డు మీద రాయటం, రాస్తున్నది అంతా మైండులో పూర్తయ్యాక మాత్రమే రాయటం మొదలుపెట్టడం… ఇలాంటివి.
అసలు చదివేవాళ్లకి ఈ తేడాలన్నీ తెలుస్తాయా అంటే- అందరికీ తెలీవు. ఆత్మలేని అద్దకంపనిని గొప్ప రచన అనుకునే పాఠకులూ ఉంటారు. ఇలాంటి ఎక్కువమంది పాఠకులు ఒప్పుకోవటమే తన రచన నాణ్యానికి గీటురాయి అనుకునే రచయితకి అసలీ ఇబ్బందే ఉడదు.
0 comments:
మీ మాట...