Showing posts with label మ్యూజింగ్స్. Show all posts
Showing posts with label మ్యూజింగ్స్. Show all posts

September 23, 2014

చింతల్లికి, నాన్న


బండి మీద వెళ్ళేటప్పుడు ఇదివరకు కూడా కనపడేవి కొన్ని హోర్డింగులు. జాలికళ్ళతో ఒక పసిపిల్లో పిల్లోడో కెమెరా వైపు చూస్తుంటారు, పక్కన కేప్షన్ ఉంటుంది, బండిజోరు తగ్గించమని సూచిస్తూ “మీ కోసం మీ కుటుంబం ఎదురుచూస్తోంది” అనో ఇంకోటో. అలాంటి ప్రకటనలు చూసినపుడు నేను వాటిల్లో క్రియేటివిటీ గురించి ఆలోచించేవాణ్ణి. “వీళ్లు భలేగా ఎమోషనల్ స్పాటు చూసి కొడుతున్నార”ని అనుకునేవాణ్ణి. కానీ ఇప్పుడు నువ్వొకడివి వచ్చి నన్ను నాన్నని చేసి నిలబెట్టాకా, అలాంటివి తిన్నగా నన్ను అడ్రెస్ చేస్తున్నాయి. బండి నడిపేటపుడు ఇదివరకట్లా ఎదర వున్న దాన్నల్లా దాటేసిపోవాలనే తొందర ఉంటం లేదు. ఇలా చిన్నచిన్న విషయాలు మొదలుకొని నా జీవితాన్ని ప్రభావితం చేస్తున్నావు నువ్వు. చాపకిందనీరు లాంటిది నీ మోహరింపు.

నువ్వు రాకముందు తండ్రిహోదా పట్ల నాకు కేవలం ఎవల్యూషనరీ ఇంట్రెస్టు మాత్రమే వుండేది. తండ్రి కావటం అంటే ఒక మనిషి జీవపరిణామ దశలన్నింటినీ అతిదగ్గరగా పరికించే అవకాశమని మాత్రమే తోచేది. అప్పుడు కూడా ఆ మనిషి ఒక స్త్రీయే కావాలనుకునేవాణ్ణి. నా బిడ్డలకోసమని నేను ఏరివుంచుకున్న పేర్లన్నీ అమ్మాయిలవే (అందుకే నీ పేరు పెట్టే అవకాశాన్ని పూర్తిగా అమ్మకే వదిలేశాను). అక్కలూ చెల్లెళ్ళూ మరదళ్ళూ మేనకోడళ్ళూ ఎవరూ లేకపోవటం వల్ల నాకు ఆడాళ్ళు ఎందుకు అలా ఉంటారు అనేది ఎప్పుడూ గోడ ఆవలి రహస్యమే. వారి స్నిగ్ధమైన ప్రపంచాలకి (జడరిబ్బన్ల, పూలదండల, డాన్స్‌క్లాసుల, సాయిబాబాగుడుల, హాండ్‌బాగుల, స్కూటీల ప్రపంచానికి) మొట్టమొదటి ఆంతరంగికుడిగా ఉండగలగటం నా దృష్టిలో అద్వితీయమైన పదవి. ఆ లోటు అలాగే ఉంది. కానీ అది అదే, నువ్వు నువ్వే.

ఆ ఎవల్యూషనరీ ఇంట్రెస్టు కూడా ఇప్పుడేం లేదు. సరే నువ్వంటూ ఉన్నావు గనుక, నీ ఎదుగుదల అంటూ నా కళ్ళ ముందు జరుగుతోంది గనుక, ఆ ముచ్చటా తీరుతున్నా, నన్ను నీ వైపు పట్టిలాగే కారణాల్లో అది వెయ్యోవంతు కూడా కాదు. మరి ఏమిటీ అంటే, అవేంటో తెలిస్తే ఇదంతా రాసే సందర్భమే కలిగేది కాదేమో. లేదూ, నిజానికి ఇదంతా బడాయేనేమో, మనిషిని కాబట్టి బుద్ధి కలిగించే అహంభావం వల్ల దీన్నంతట్నీ కేవలం ఒక జంతుసహజాతంగా చూడలేకపోతున్నానేమో. For all i know, ఇప్పటికైతే నీ మీద ఇష్టం నువ్వు ఒక కీ ఇవ్వకుండా ఆడే బొమ్మవి కావటం వల్లనే మాత్రమేనేమో.

నీ మీద నా ఇష్టం పూర్తిగా మానసికమైనదే కాదు; నాకు నువ్వో స్నిగ్ధమైన చర్మంతో కప్పివున్న చిన్ని అవయవాల చలిమిడిముద్దగా కూడా నచ్చుతావు. నీ చర్మం క్వాలిటీని స్నిగ్ధమని సరిపెట్టేయలేము. కాలపు కరుకురాపిడికి అది మున్ముందు నాకు నిగూఢమూ, నానుంచి భిన్నమూ, మరో అన్‌టచబుల్ సమక్షమూ అవుతుందని తెలుసు. ప్రస్తుతానికైతే నిన్నెత్తుకున్నప్పుడు నన్ను నేనే మోస్తున్నట్టు ఉంటుంది. ఎంత పీల్చినా సారం ముక్కుతో పాటూ తీసుకెళ్దామంటే పట్టుబడని నీ వాసన బాగుంటుంది. ఎత్తుకున్నప్పుడు నీ మెడలో ముక్కుదూర్చి పీలుస్తూంటాను. కానీ నువ్వు నా గడ్డం పెట్టే చక్కిలిగిలికి నవ్విస్తున్నాననుకుని నవ్వేస్తూ ఉంటావు. ఈమధ్య నీకు కింద వో రెండు పళ్ళు మొలిచాయి. దాంతో ఇప్పటికే నా పేలవమైన పెన్నుకి వర్ణనాతీతమైన నీ నవ్వు ఇప్పుడింకా అందని దూరమైపోయింది.

ప్రస్తుతానికి నువ్వో pure animal వి. ఇది రాస్తున్నప్పుడు కూడా, నాకు దూరంగా నేల మీద దొర్లాడుతున్న నువ్వు నా వైపు పాక్కొచ్చి ఈ కాగితం చింపటానికి ట్రై చేస్తున్నావు. అది కుదరనివ్వకపోవటంతో, నా జుట్టుని పట్టుకుని కిందకు గుంజే ప్రయత్నంలో పడ్డావు, అదైన తర్వాత ఇప్పుడు నా పక్కకు వచ్చి నిన్నూ నీ మొహాన్ని నా భుజంకేసి రాసుకుంటున్నావు. ఊరికే చెంగనాలు కడుతూ మధ్యమధ్యలో తల్లిని ఒకసారి ఒరుసుకుని మళ్లీ వెళ్ళిపోయే దూడకన్నా ఏమంత భిన్నం కాదు నువ్విప్పుడు. (ఆ తల్లికన్నా నేనూ ఏమంత భిన్నం కాదు. సుమతీసూక్తికి భిన్నంగా నాకు పుత్రోత్సాహం కలిగించటానికి నీ కేవలమైన ఉనికే సరిపోతుంది; చివరకు ఫేస్బుక్లో పెట్టిన నీ ఫొటోకి వచ్చిన లైకులు కూడా సరిపోతున్నాయి.)

అయినా నీ వైనాల్లో ఒక వ్యక్తిత్వాన్ని చదవటానికి విపరీతంగా ప్రయత్నిస్తుంటాం మేం. నాకన్నా ముఖ్యంగా అమ్మ. నీ అన్ని చర్యలూ తనకి ఉద్దేశపూర్వకమైనవిగా కనపడతాయి. ఆ ఉద్దేశాల్ని గెస్ చేయాల్సిన అవసరం కూడా లేదన్నట్టు, విశదంగా తెలిసిపోతున్న విషయాల్లా మీ అమ్మ చదివి చెప్పేస్తూంటుంది. నేను మాత్రం ఇంకా నీ చర్యలకి బయటి ఉద్దీపనల్నే తప్ప, నీ లోపలి ఉద్దేశాల్ని కారణంగా చూడలేకపోతున్నాను. నువ్వు నాలిక బయటపెట్టి ఆడిస్తున్నప్పుడు తనని వెక్కిరిస్తున్నావంటుంది మీ అమ్మ. కొత్తగా వచ్చిన నీ పళ్ళ పదును మీద సరదాగా నాలిక ఆడిస్తున్నావంటాను నేను. ఇలాంటి నీ వేషాల్లో ఏమాత్రం తేడాగా అనిపించినా అది సహజమేనని ఇంటర్నెట్లో వెతికి ఖాయం చేసుకునేదాకా ఇద్దరికీ మనశ్శాంతి ఉండదు.

కానీ నా మనసంతా ఇలా రంగురంగుల బెలూన్లమయం మాత్రమే కాదు. వాటిని గుచ్చి పేల్చే శంకలూ ఉన్నాయి. అప్పుడప్పుడూ ఏమనిపిస్తుందంటే, ఇన్ని కోట్లమంది లోకజ్ఞులూ సజ్జనులూ ఋజువర్తనులూ ఐన మగవాళ్ళున్న లోకంలో, నువ్వు ఇలాంటి ఒక మగవాడి హయాంలోకే వాడినే తండ్రిగా చేస్తూ ఎందుకు ఊడిపడ్డావా అని. అప్పుడు నీ మీద ఒక తటస్థమైన జాలి కలుగుతుంది. ఎందుకంటే, అలా ఎలా కుదిరిందో చెప్పలేనుగానీ, నేను ఒక సామాజిక మానవునిగా ఎదగలేదు. కనీసం పైపై అప్పియరెన్సెస్ వరకూ పద్ధతైన సంసారి వేషాన్ని ఎలాగో నెట్టుకొస్తున్నాను గానీ, నా మనసు ఏ విలువనూ అబ్సొల్యూట్‌ అని నమ్మదు, ప్రతి అవధికీ కన్నాలు తవ్వి అవతలికి దూరుదామని చూస్తుంది. ఇలాగుండటంపై నాకు ఏ ఫిర్యాదులూ లేవు సరికదా గొప్పగా కూడా ఫీలవుతుంటాను. కానీ ఈ స్థితికి వచ్చే క్రమంలో మనసు చేసిన ప్రయాణం సురక్షితమైంది కాదు. అది ఆవలించే లోయల పైన బార్బ్‌డ్‌వైరు మీదుగా దొమ్మరి నడక. ఇప్పటికీ చాలా డెలికేట్ బాలెన్సే. అలాంటి ప్రయాణం నువ్వు చేయటం నాకు ఇష్టం లేదు. ఈ స్థితికి నువ్వు చేరటం ఇష్టం లేదు. అదికూడా కేవలం ఇలాంటి ఒక నేను నీ తండ్రినవ్వటం అన్న కారణంగా జరగటం అస్సలు ఇష్టం లేదు. లోకపు లౌక్యపుటిరుసుకి ఏ రాపిడీ లేకుండా కందెన సులువుతో ఒదిగి సాగిపోవాలి నీ జీవితం. (ఒక్కోసారి నువ్వు పుడుతూనే నాలో ఎక్కడో స్టాప్‌వాచీని క్లిక్ చేశావనిపిస్తుంది. నాకు ఎంతో టైం లేదు. మరీ నిన్ను అయోమయపరిచేంత బొహేమియన్ వాతావరణం ఏం లేకపోయినా, ఉన్న కాస్త అస్తవ్యస్తాన్నీ చక్కదిద్దుకుని నిన్ను లోకరీతికి అనుగుణంగా పెంచగలిగే నాన్నలాగా మారిపోవాలి. క్లాక్ ఈజ్ టికింగ్!)

అలాగని మళ్ళీ నువ్వు అందరుపిల్లల్లాగా పెరగటం కూడా ఊహించుకోలేను. ఆ పసుపురంగు స్కూలు బస్సుల కిటికీల్లోంచి కనిపించే అనేక యూనిఫారాల్లో ఒక యూనిఫాంగా నువ్వు మారటం నాకిష్టం లేదు. నాన్ననో ధృవనక్షత్రంగా చూసే అమ్మ మరీ నాన్న లోకంలోకి ఇమ్మెర్స్ అయిపోయి అవును వీణ్ణి బడికిపంపవద్దంటూ వంతపాడటం మొదలుపెట్టింది గానీ, నాన్నకైనా బుద్ధుండాలిగా. స్కూలుకి పంపక ఏం చేయను. నగరంలో బతక్క ఏం చేయను. ఈమధ్య నిన్ను ఎత్తుకుని బయటకు తీసుకెళ్ళినపుడు మరీ అనిపిస్తుంది. నువ్వు నా భుజం మీద చుబుకం ఆన్చి వచ్చే పోయే కార్లనో, బైకుల్నో చూస్తూంటావు. గట్టిగా హార్న్ వినపడినప్పుడల్లా ఉలికిపడతావు, అహ, పడేవాడివి, ఇప్పుడు అలవాటుపడిపోయి అటు మామూలుగా చూస్తావు. నిన్ను అలా తీసుకెళ్ళి నా బాల్యాన్ని ఆవరించిన దృశ్యాల్లాంటివి చూపించాలని ఉంటుంది. బాటంతా గొద్దెలమయం చేసే మేకలమందల్నో, అష్టాచెమ్మా ముగ్గులు గీసున్న రామాలయం గచ్చునో, మాగన్ను మధ్యాహ్నాలు చల్లగా గలగలల సందడి చేసే రావిచెట్టునో, నత్తలు రథం ముగ్గులేస్తున్న ఆఖరి కోనేటిమెట్టునో, కోసిన పొలంలో గడ్డిమేటు వెనుక కుంగే మెత్తటిబింబాన్నో చూపించాలని ఉంటుంది. నా బాల్యానికి అవన్నీ ఉన్నాయి. నిన్ను మాత్రం ఒక కరుకైన లోకంలోకి తీసుకొచ్చి పడేశాను. ఇది ట్రాఫిక్‌ వల్లనూ, కాంక్రీటు వల్లనూ మాత్రమే కరుకైన లోకం కాదు. శివార్లలో గొంతులుకోసే ముఠాలు తిరిగే లోకం, తల నుంచి గోనెసంచులు వేలాడే పిల్లలు చెత్తకుప్పల్లో ఇనుపచువ్వలు పుచ్చుకుని పాలిథీన్ కాగితాలు ఏరుకునే లోకం, లిప్తమాత్ర యథాలాపపు డ్రైవింగ్ వల్లనే పుచ్చెలు పగిలి చచ్చే అవకాశాలతో కిక్కిరిసిన లోకం, భుక్తిరీత్యా నిత్యం కదుల్తూనే తప్ప నిలకడగా నిలబడిన మనుషులు అరుదుగా కనిపించే ప్రాగ్మాటిక్ లోకం.

మరి ఇలాంటి చోట్ల పిల్లలు పుట్టటం లేదా ఆరోగ్యవంతంగా పెరగడం లేదా అనొచ్చు. ఆమధ్య కొన్నాళ్లపాటు చిత్రమైన రీతుల్లో సమాధానపడేవాణ్ణి. సృష్టిలో ప్రతీదీ ఆ నూటపద్దెనిమిది రసాయనికమూలకాలతో నిర్మితమైనదే కదా. మరి, అవే మూలకాల్లో కొన్నింటితో తయారైన చెట్టుని అందమనీ, ఇంకొన్నింటితో తయారైన కాంక్రీటు భవనాన్ని వికారమనీ ఎందుకు అనుకోవాలీ అనీ ఇలా. కానీ అందమూ వికారమూ కాదు అసలు డిస్టింక్షను. సహజమూ అసహజమూ, ఇంకోలా చెప్తే ప్రకృతిసహజమూ మానవనిర్మితమూను. ప్రకృతి పరివృతమై పెరిగిన బాల్యం ఆలోచనకి కలిగించే విశాలత్వం వేరు. ఎదిగాకా అది చుట్టూ లేకపోయినా, మెదడులో ఒక పచ్చటి విశాలమైన అర అలా ఉండిపోతుంది. అది ఎంత రద్దీలోనైనా నిమ్మళాన్ని ఇస్తుంది. ఎంత ఇరుకులోనైనా వెసులుబాటు ఇస్తుంది. నీకు అది లేదు. నువ్వు కంప్లయిన్ కూడా చేయలేవు. ఎందుకంటే నీకు ఇది తప్ప ఇంకోటేదీ తెలియదు. ఎంపికకి అవకాశం లేదు. అదింకా విషాదం. నిజంగా నువ్వే నా మొట్టమొదటి ప్రయారిటీవైతే వెంటనే ఊరెళిపోయి ఏ కిరాణాషాపో పెట్టుకోవాలి. కానీ ఇందాక చెప్పినట్టు ఎదిగే క్రమంలో ఎక్కడో నేనిలా నగరాటవిలో మాత్రమే శరణులభించే మృగంగా మారిపోయాను.

ఇవి చాలవన్నట్టు ఇంకో పెద్ద గుంజాటన ఉంది. బహుశా వీటన్నింటికీ అదే మూలమై నన్నిలా రాయిస్తుందేమో. నాకు నాన్న అనే శాల్తీ లేకపోవటం వల్ల నిన్ను పెంచటానికి నాకు ఒక మోడల్ లేకుండా పోయింది. అది మంచో చెడో నికరంగా చెప్పలేను గానీ, అది అలా ఉంది. ఒక చెడు ఎగ్జాంపుల్ ఉండుంటే మంచి వైపు వెళ్ళటం సులువయ్యేది, ఒక మంచి ఎగ్జాంపుల్ ఉండుంటే అనుసరించేవాణ్ణి. ఇప్పుడు నా రోడ్డు నేనే వేసుకోవాలి. నువ్వింకా పాకగలిగే చిన్నిప్రపంచంలో మాత్రమే ఉన్నావు కాబట్టి అదింకా పెద్ద కన్సెర్న్ కాదు. కానీ కొన్ని భయాలు. I fucked up so many relationships. I want us to be a success.

February 15, 2014

త్రిపుర కల

త్రిపురని ఇంటర్వ్యూ చేస్తున్నట్టు కల. ఆయన లుంగీ మీద పింక్‌ నెక్ షర్టు వేసుకున్నాడు. కలంతా నేను సరిగా ప్రిపేరవలేదే అన్న మైల్డ్ పానిక్‌తో ఉంటాను. But he is so laid back and giving all the crazy answers in the world. నేను అడిగిన ప్రశ్నల్లో నాకు గుర్తున్నది: "Celine మీ అభిమాన రచయిత అని చెప్పారు కదా, మరి అతని antisemitism మీద మీ అభిప్రాయం ఏంటి?" అని.

This is only the second time that i dreamed about a writer. First time, it's Nabokov.

February 11, 2014

లిఫ్ట్ ఇవ్వటం పుచ్చుకోవటం

ఇరవై రూపాయల పాల పాకెట్టుకి ఐదొందల కాయితం ఇచ్చినా కొట్టువాడు ఏమాత్రం సణగకుండా చిల్లర తిరిగిచ్చాడన్న కృతజ్ఞతతో, ఆ ఇచ్చిన చిల్లరలో ఓ పది నోటు అడ్డంగా చిరిగి ఉన్నా కిమ్మనకుండా పుచ్చుకునే రకం నేను. మాట్లాడుకునే విషయం మీద ఈ స్వభావం తాలూకు ప్రభావం ఉండొచ్చన్న ఉద్దేశంతో ఈ సంగతి చెప్పాల్సి వచ్చింది.

నేను హైదరాబాదులో ఆరేళ్ళ మట్టీ ఉంటున్నాను. నాకు బండి లేదు. ఒక్కోసారి చాలా నడవాలి. అలాగని అస్తమానం లిఫ్టు అడగను. ఒక్కోసారి నడకకి అనువైన మూడ్లో ఉంటాను. కానీ ఒక్కోసారి పని అర్జంటైనపుడు అడగక తప్పదు. అలా గత కొన్నేళ్లలో లిఫ్టులు అడిగీ అడిగీ నాకు కొంత తత్త్వం బోధపడింది:

1) లిఫ్టు అడిగేటప్పుడు మన దారిన మనం నడుస్తూ ఒకసారి అడిగిచూస్తే పోలా అనుకుని అడుగుతున్నట్టుగా కనపడకూడదు. ఏదో ఉబుసుపోక అడుగుతున్నామని బండి యజమాని అనుకునే అవకాశం ఉంది. కాబట్టి ఒక చోట ఆగి నిలబడి అడగాలి.

2) బండి మరీ దగ్గరకు వచ్చేశాకా చేయి ఎత్తడం వల్ల ప్రయోజనం లేదు. బండి యజమానికి లిఫ్టు ఇవ్వాలా వద్దా అని నిర్ణయించుకునేందుకు తగినంత సమయం ఇవ్వాలి.

3) లిఫ్టు అడిగేటప్పుడు బండి యజమానీ అతని బండీ ఒకే పదార్థమన్నట్టు కలిపేసి వేగ్ గా అటు చూడకూడదు. సూటిగా లిఫ్టు ఇచ్చేవాడి కళ్లల్లోకి చూస్తూ అడగాలి. (హెల్మెట్ ఉంటే అద్దం వైపు).

4) మన బాడీలాంగ్వేజ్ లో అవిశ్వాసం కనపడకూడదు. అతను మనల్ని దాటిపోయేవరకూ అతను లిఫ్టు ఇస్తాడని మనం ఎంతో నమ్మకంగా ఉన్నట్టు కనపడాలి.

5) ఎన్ని బళ్లు దాటిపోయాకా ఇక ప్రయత్నం మానేయవచ్చు అన్న దానికి ఖచ్చితమైన లెక్క లేదు. మన ఓపిక. ఒకసారి పదిమంది దాటిపోయాకా పదకొండో బండి మీదే మనక్కావాల్సిన దయగల ప్రభువు వస్తూండి ఉండొచ్చు.

6) అసలు లిఫ్టు అడిగేముందు మన వాటం ఎలా ఉందో ఒకసారి గమనించుకోవటం కూడా మంచిది. ఒంటరి రోడ్డు మీద రౌడీవాటంతో కనిపించేవాడికి లిఫ్టు ఎవరూ ఇవ్వరు.

7) సాధారణంగా పెళ్లయిన మగవాళ్లు లిఫ్టులు ఇవ్వరు. బ్రహ్మచారులే ఇస్తారు. ఇలా ఎందుకో నాకూ తెలియదు. సంసార సాగరపు క్రూరమైన నియమాల్లో పడ్డాకా, దయ అనేది ఒక పాషనబుల్ ప్రివిలేజ్ గా కనిపించటం మొదలౌతుందనుకుంటా.

8) మనం పదిమంది నిలబడి ఉన్న చోట నిలబడి అడిగితే చాలామంది బండి యజమానులు లిఫ్టు ఇవ్వటానికి ఇష్టపడరు.

9) రాత్రుళ్లు లిఫ్టు అడగటం కష్టమైన పని. హెడ్ లైట్ల వెలుగులో బండి మీద వస్తోంది ఆడా మగా అన్నది తెలియదు. నేను ఒక్కోసారి ఆడవాళ్ళను అడిగిన సందర్భాలూ ఉన్నాయి. వాళ్లు మనది పొరబాటు అనుకుంటారో, మరి వెధవ్వేషాలు వేస్తున్నాం అనుకుంటారో తెలియదు గానీ, ఎప్పుడూ ఆపరు. అలా ఒక అమ్మాయి లిఫ్టు ఇవ్వటం కోసం బండి ఆపటమనేది నా పగటి కలల్లో మాత్రమే జరుగుతుంది. అలా లిఫ్టు ఇచ్చే అమ్మాయి ఈ భరత ఖండంలో తారసపడటం కష్టం. దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు కూడా. ఎందుకంటే ఎవడైనా అలా పొరబాట్న అడిగినా ఒకవేళ నిజంగా ఆ అమ్మాయి ఆపితే, అప్పుడు ఆపింది అమ్మాయి అని గ్రహించి కూడా ఎవడైనా లిఫ్టు తీసుకోవటానికి సిద్ధపడ్డాడంటే, వాడు ఏదో ప్రాణాంతకమైన ఎమర్జన్సీలో ఐనా ఉండి ఉండాలి, లేదా సింపుల్ గా వాడి ఇంటెన్షన్ వెధవ్వేషాలు వేయటమే ఐనా అయి ఉండాలి. ఏమో, మళ్లా ఆలోచిస్తే ఇలా తీర్మానించడం తప్పేమో అనిపిస్తుంది. ఒక అమ్మాయి లిఫ్టు ఇవ్వటానికి బండి ఆపినా, సారీ చెప్పి బండెక్కని వాడు మర్యాదస్తుడే అనుకోనక్కర్లేదు, వట్టి పప్పుసుద్ద అని కూడా అనుకోవచ్చు. ఏదేమైనా ఈ విషయమై ఇన్ని మాటలు అనవసరం, మగాడికి లిఫ్టు ఇద్దామని బండి ఆపే అమ్మాయిలు ఎలాగూ ఉండరు.

10) రాత్రుళ్లు లిఫ్టు అడగటంలో ఇంకో ఇబ్బంది కూడా వుంది. బండి మీద వస్తోంది ఒకరేనా, లేక ఇద్దరా అన్నది తెలియదు. ఇలా నేను చాలాసార్లు భంగపడ్డాను. ఇద్దరు వున్నారని గ్రహించి చేయి దించేసేలోగానే వాళ్లు వెళ్తూ వెళ్తూ ఏదోక సెటైరు వేయక మానరు. “ఇంకెక్కడ ఎక్కుతావు నాయనా, నెత్తి మీదా” లాంటివి. ఒకసారి మాత్రం చిత్రం జరిగింది. అప్పటికే మసక చీకట్లు అలుముకున్నాయి, వాన పడుతోంది. నేను సైబర్ టవర్స్ దగ్గర అనుకుంటా నిలబడి ఉన్నాను. హెడ్ లైట్ల వెలుగు వల్ల బండి మీద ఇద్దరున్నారన్న సంగతి తెలియకుండానే చేయి చాపాను. అయినా ఆపారు. ఇద్దరు స్నేహితులూ ఎదరకి సర్దుకు కూచుని నన్ను మూడోవాడిగా వెనక ఎక్కించుకుని తీసుకుపోయారు. ఇది నా లిఫ్టుల చరిత్రలో ఒక వింత అనుభవం.

అలాగే ఇంకోటి కూడా ఉంది. వింత అనుభవం అని కాదు గానీ, నాకు గుర్తుండిపోయింది. ఒకసారి ఎర్రగడ్డ నుంచి సనత్ నగర్ వైపు నడుస్తున్నాను రాత్రి. అది బతుకుతెరువుకి హైదరాబాదు వచ్చిన కొత్త. జేబులో చిల్లిగవ్వ లేదు. ఒక ఆటో వాడు పక్కన స్లో జేసి “వస్తావాన్నా” అని అడిగాడు. డబ్బులుంటే ఎక్కే వాణ్ణే. లేవు కాబట్టి రానన్నాను. అతను ఊరుకోలేదు, “ఎందుకు రావు అటేగా పోతుంది” అన్నాడు. విసుగొచ్చి “పైసల్లేవన్నా” అని చెప్పేశా. అతను ఫర్లేదు ఎక్కమని ఏం పుచ్చుకోకుండానే సనత్ నగర్ దాకా దింపాడు. ఆటోవాళ్లు లిఫ్టు ఇవ్వటం అరుదైన సంగతేగా మరి. అది కూడా కాదేమో, మన పట్ల దయ ఎవరు చూపించినా అది ఎంత చిన్నదైనా గుర్తుండిపోతుంది.

అన్నింటికన్నా బాగా గుర్తుండిపోయిన ఇంకో లిఫ్టు అనుభవం మొన్న 2011 లో ఇండియా వరల్డ్‌కప్పు గెలిచిన రోజు రాత్రి జరిగింది. ఆ రోజు ఆఫీసులోనే ఇండియా శ్రీలంక మధ్య ఫైనల్స్ చూసి, లేటుగా గదికి బయల్దేరా. బస్సు కోసం పెద్దమ్మగుడి దాకా నడిచాను. రోడ్లంతా గోల గోలగా ఉన్నాయి. వాతావరణం డిసెంబరు థర్టీఫస్ట్ నైటుకి బాబులా ఉంది. కుర్రాళ్లు కార్ల కిటికీ లోంచి తలలూ మొండేలూ బయటపెట్టి చేతుల్తో జెండాలు ఊపుతూ అరుస్తున్నారు, బైకు ఒకడు నడుపుతుంటే ఇంకొకడు వెనక కాళ్ల మీద నిలబడి విజిల్స్ వేస్తున్నారు. ఇలాంటప్పుడు జనం మధ్య సులభంగా ఒక సుహృద్భావం వచ్చేస్తుంది కదా, మర్నాడు పొద్దున్న లేవగానే మర్చిపోయే తరహాది. మరి ఆ కుర్రాడు మామూలుగా అడిగితే లిప్ట్ ఇచ్చేవాడో లేదో, ఇప్పుడు ప్రపంచ కప్ గెలుపు ప్రపంచపు మంచితనం మీద నమ్మకాన్ని కలిగించి, అది ప్రతిగా అతనిలోని మంచితనాన్నీ మేల్కొలిపిందనుకుంటా, నేను చేయి చాపి ఇలా బొటన వేలు ఎత్తానో లేదో వెంటనే బండి బ్రేకు వేసి ఆపాడు. నేను ఎక్కగానే బండి సర్రుమని దూసుకుపోయింది. అతను మధ్య మధ్యలో బండి చేతులొదిలేసి నోటి చుట్టూ చేతుల్తో గూడు కట్టి అరుస్తున్నాడు, తన బండిని అరుస్తూ క్రాస్ చేసి వెళ్లేవాళ్లతో పాటూ తానూ గొంతు నరాలు తెగేలా అరుస్తున్నాడు. దారిలో ఎవరు హై ఫైవ్ ఇచ్చినా బండి స్లో చేసి మరీ తిరిగి వాళ్ల చేతులు చరుస్తున్నాడు. నేను మరీ క్రికెట్ పిచ్చోణ్ణి కాదు గానీ, ఇండియా గెలవటం అనేది నాలో ఏదో మూల దేశభక్తి తాలూకు అవశేషాల్ని ఉత్తేజితం చేసిందనుకుంటా, నాకూ సంతోషంగానే ఉంది. కానీ నాది మరీ ఇలా ఆనందంతో గంగవెర్రులెత్తే స్వభావం కాదు. ఎప్పుడన్నా తాగితే తప్ప. ఐతే ఎంతైనా ఒకే బండి మీదున్నాం కదా ఇద్దరం. అతను అలా ఓపక్క ఆనందంతో బద్దలయిపోతూ ఉంటే నేను ఊరికే మౌనంగా ఉంటే ఏం బాగుంటుంది. అతని ఆనందం ఎబ్బెట్టుగా ఫీలవ్వచ్చు. అందుకే నేనూ గొంతు నొప్పి పుట్టేలా అరవటం మొదలుపెట్టాను. అక్కడ నేను నా స్వభావాన్ని విడిచిపెట్టి మరోలా నటిస్తున్నానన్న సంగతి గమనించటానికి కూడా ఎవరూ లేరు కదా. కానీ ఏ మాటకామాటే చెప్పుకోవాలి, అలా అరుస్తూ సమూహాన్ని కదిలించిన సంబరంలో నేనూ పాలుపంచుకోవటం బాగా అనిపించింది. అయినా మొహమాటానికి పోయినట్టే కదా.

ఇలా లిఫ్టు ఎక్కినప్పుడు చాలాసార్లు జరుగుతుంది. ఒక మనిషి మనకు లిఫ్టిచ్చాడంటే అతను ఏదీ ఆశించకుండా ఉచితంగా ఉత్తపుణ్యానికి మన పట్ల దయగా ఉండటమే. దాన్ని టేకిట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోవచ్చని మొదట్లో తెలిసేది కాదు. దాంతో లిఫ్టు ఎక్కిన కాసేపటి దాకా కనీస స్థాయి హ్యూమన్ ఇంటరాక్షన్ అయినా మా ఇద్దరి మధ్యా ఎస్టాబ్లిష్ చేసుకోవటానికి ప్రయత్నించేవాణ్ణి. వాళ్లు ఎక్కడి దాకా వెళ్తున్నారో అడిగేవాణ్ణి. వాతావరణం గురించో, ట్రాఫిక్ గురించో వ్యాఖ్యానించేవాణ్ణి. క్లుప్తంగా చెప్పాలంటే బండియజమానిని ఎంటర్టయిన్ చేయటానికి చేతనైనంత ప్రయత్నించేవాణ్ణి.

కానీ క్రమేణా అప్పుడప్పుడూ నా చేతుల్లోకీ బండి వచ్చి, నేనూ అప్పుడప్పుడూ లిఫ్టులివ్వటం మొదలుపెట్టినప్పటి నుంచీ (బండి యజమానిగా నాణేనికి రెండో వైపు నేను నిలబడటం కుదిరినప్పణ్ణించీ), అలాంటి అనుబంధమేదీ వాళ్లు కోరుకోరని అర్థమైంది. మనల్ని ఎక్కించుకోగానే వాళ్ల మనసుల్లో ఒక మంచి పని చేశామనే తృప్తి కలుగుతుంది. అదే మనం వాళ్లకి ఇవ్వగలిగేది, అదే వాళ్లు కోరుకునేది. అందుకే “థాంక్స్ అన్నా!” తో సరిపెడుతున్నాను. అందులోనే వీలైనంత కృతజ్ఞత దట్టించటానికి ప్రయత్నిస్తున్నాను.

సరే, ఇక నా చేతుల్లో బండి ఉన్నప్పుడు నేను లిఫ్టులు ఇచ్చే పద్ధతి గురించి చెప్తాను. నిజం చెప్పాలంటే, పైన అన్ని పాయింట్లు రాశాను కదా, ఆ పాయింట్లేవీ నేను లిఫ్టు ఇవ్వబోయే వ్యక్తి విషయంలో పూర్తవుతున్నాయా లేదా అన్నది ఎప్పుడూ ఆలోచించను. ఆ క్షణం ఏమనిపిస్తుందో అదే పాత్ర వహిస్తుందేమో అనిపిస్తుంది. నేను లిఫ్టు ఇచ్చే సందర్భాల్ని నెమరు వేసుకుంటే ఈ కామన్ పాయింట్లు తట్టాయి:

1) లిఫ్టు ఇవ్వాలా వద్దా అన్నది నేను వెళ్తున్న పని అర్జెన్సీని బట్టి ఉంటుది. తీరుబడిగా పోతున్నప్పుడు ఎవరు అడిగినా లిఫ్టు ఇవ్వటానికి సంసిద్ధంగానే ఉంటాను.

2) కొన్ని ముఖాలు ఊరికే ఎందుకో మనకు నచ్చవు. అలాంటి ముఖాలకు ఇవ్వను. వాళ్లు సాధారణంగా నా సమవయస్కులై ఉంటారు. (లిఫ్టు అడిగేటప్పుడు నా ముఖం అలాంటి ముఖాల జాబితాలోకి వస్తుందేమో ఎప్పుడూ ఆలోచించలేదు, వస్తుందేమో).

3) ఎవర్నన్నా లిఫ్టు ఎక్కించుకున్నాకా, నా బండి నిర్జన ప్రదేశాల్లో పోతున్నప్పుడు హఠాత్తుగా ఆ వెనకనున్నవాడు నా పీక మీద కత్తి పెట్టి, బండాపించి, “తియ్యరా పర్సు” అంటాడేమో అని ఒక్కసారైనా భయపడతాను.

4) ఎవరి కన్నా లిఫ్టు ఇచ్చినపుడు బండి మామూలు కన్నా స్పీడుగా పోనిస్తాను – అతను ఏదో అర్జంటు పని మీదే లిఫ్టు అడిగుంటాడు కదా, స్లోగా తీసుకెళ్తే ఎలాగా అని.

సరే ఇక నేను లిఫ్టు ఇచ్చిన సందర్భాల్లో బాగా గుర్తుండిపోయినవి చెప్పమంటే మొన్న వారమే ఇచ్చిన ఒక లిఫ్టు గుర్తొస్తుంది.

జూబ్లీహిల్స్ చెక్పోస్టు దగ్గర పెద్దమ్మ గుడికి వెళ్లే మలుపు తిప్పీ తిప్పగానే ఒక ముసలాయన (అంటే మరీ వంగిపోయిన ముసలాయన కాదు, అరవయ్యేళ్లుంటాయేమో) చేయి ఊపాడు. ఎక్కించుకున్నాను. ఆయన ఫింఛనాఫీసు నుంచి వస్తున్నాడు. అక్కడ ఏదో ప్రభుత్వ పథకం ప్రకారం ఈయనకు నెలకు రెండొందలు రావాలి. కానీ ప్రభుత్వ రికార్డుల్లో ఈయన ఆల్రెడీ చచ్చిపోయాడని రాశారట. అందుకని అక్కడ దెబ్బలాడి, ఏదో అల్టిమేటం ఇచ్చి వస్తున్నాడు. మొత్తం గవర్నమెంటు మీదా వ్యవస్థ మీదా పగతో ఉన్నాడు. బండెక్కగానే తనను ఎక్కించుకున్నందుకు కాసేపటి వరకూ నన్ను చాలా పొగిడాడు. ఆ తర్వాత తన బాధ చెప్పుకున్నాడు. ఆయనది నెల్లూరు, రిటైరయ్యాడు, ఇప్పుడు సిటీలో ఏదో అపార్టుమెంటు ముందు కాపలా పని చేస్తున్నాడు. ఫింఛనాఫీసు వాళ్లని దారంతా తిడుతూనే ఉన్నాడు. ఆయన ఉద్యోగం చేసింది తమిళనాడులో. అక్కడి ప్రభుత్వానికీ ఇక్కడి ప్రభుత్వానికీ మధ్య తేడా ఎత్తి చూపుతున్నాడు. కాంగ్రెస్ మళ్లీ రాదంటున్నాడు. మధ్య మధ్యలో నేను కాస్త స్పీడు పెంచినపుడల్లా, “నెమ్మదిగా పోదాం బాబూ కంగారే వుంది” అంటూ నన్ను నియంత్రిస్తున్నాడు, మళ్లీ “థాంక్స్ బాబూ మీరు వచ్చారు కాబట్టి ఇలా వెళిపోతున్నాను” అని తెగ ఎగదోస్తున్నాడు. ఇలా శిల్పారామం దాటే దాకా అతను ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన జీవిత పరిస్థితులన్నీ టూకీగా ఏకరువు పెట్టేశాడు. ఆయన కుంటి తమ్ముడూ, ఆ తమ్ముడీ మధ్య పెట్టుకున్న బజ్జీల బండీ వగైరా. నెల్లూరి యాసలో మాట్లాడుతున్నాడు, వయసైపోయినా ఇంకా కుర్రతనం వదలని మనసుతో అభాసుపాలయ్యే ముసలాడు. చిన్న లిఫ్టు ఇచ్చినందుకు అంత ఎందుకు హడావిడి చేస్తున్నాడని నాకు మధ్యలో పీకుతూనే ఉంది. ఊరికే వచ్చి కాసేపు దగ్గరగా మాట్లాడి ఒక చిన్న మొహమాటపు అనుబంధం ఎస్టాబ్లిష్ అయ్యేలా చేసి, వెంటనే ఫలానా ఊరు వెళ్లాలి, లేదా ఫలానా అవసరం ఉందీ అని డబ్బులడిగి కాదనలేని పరిస్థితిలోకి తెచ్చి ఇబ్బంది పెడ్తారు కదా కొంతమంది… ఈయన ఆ కోవకు చెందడు కదా అని అనిపించింది. కానీ లిఫ్టు ఎక్కాకా సైలెంటుగా దిగిపోయేవాళ్లనే చూశాను గానీ, ఇలా ఇంత మాట్లాడేవాళ్లు తారసపడలేదు. అదొక్కటీ సరదాగా అనిపించింది. ఇంతా అయ్యాకా అతను చివరికి డబ్బులడిగి ఈ అనుభవాన్ని కల్తీ చేస్తాడేమో అని చిన్న జంకు. కానీ అతని దృష్టిలో కల్తీ చేయటానికి ఇదో పెద్ద అనుబంధం కాదేమో. ఇలాంటి పాసింగ్ అనుభవాల్ని మళ్లీ గుర్తు చేసుకునేవిగా భావించే నాలాంటి ఏబ్రాసి స్థితిలో లేడేమో. శిల్పారామం తర్వాత ఏదో బిల్డింగ్ కాంప్లెక్సు దగ్గర ఆపమన్నాడు. దిగాకా నేను వీడ్కోలు సూచకంగా నవ్వాను. నేను ఎక్కడ గేరు మార్చేస్తానో అన్న తొందరలో ఆయన వెంటనే, “రెండు గంటలు ముందే వచ్చేశాను సార్, టీ తాగటానికి ఓ పది రూపాయలుంటే ఇస్తారా” అనేశాడు. ఇప్పటిదాకా ఏర్పడిన అనుబంధపు ప్రాతిపదికన నేను ఆయనకి పది రూపాయలు ఇవ్వటం పెద్ద విషయం కాదు. కానీ అతని వైపు నుంచి ఈ అనుబంధాన్ని ప్రతిపాదించటం వెనుక కారణమే చివర్లో ఈ పదిరూపాయలు అడగటం అయినపుడు, అంటే నా వైపు నుంచి ఇది ఒక చిన్న అనుబంధం అయి, అతని వైపు నుంచి ఒక పథకం మాత్రమే అయినపుడు, నేను ఆ పది రూపాయలు ఇస్తే అతని పథకాన్ని గెలిపించినట్టు, ఆ తర్వాత అతను ఆ పది రూపాయలు జేబులో పెట్టుకుంటూ “బుట్టలో పడ్డాడు వెధవ” అనుకుంటే…? అది నాకు నచ్చలేదు, కాబట్టి “ఇవ్వను” అని చెప్పి బండి స్టార్ట్ చేసేశాను. కానీ కాస్త దూరం పోగానే “ఇవ్వను” అన్నందుకు ఏమనుకునుంటాడో అన్న ఊహ వచ్చింది. ఏముంది, రెండు గంటలు తొందరగా వెళ్లినందుకు ఎక్కడో అక్కడ కూర్చుని వెయిట్ చేస్తాడు, బహుశా బస్సుల బాధ లేకుండా తొందరగా సునాయాసంగా రాగలిగినందుకు ఆనందిస్తాడు, కానీ ఆనందిస్తూ టీ తాగటానికి డబ్బులు మాత్రం ఉండవు. బహుశా అలా కూర్చుని టీ తాగుతున్నప్పుడు ఇది అతనికి కూడా ఒక చిన్న అనుబంధంగానే అనిపించేదేమో. అనిపించకపోతే ఏం చేసేది లేదు, కానీ అనిపించే అవకాశం కూడా లేకుండా చేశాన్నేను. పెద్ద రిగ్రెట్ అని కాదు, ఇప్పుడు ఇదంతా అందుకే రాస్తున్నా అని నాటకం ఆడను. నేను అంత సున్నితమైన వాణ్ణి కాదు. కానీ, నేను మాత్రం ఆ పది రూపాయలు ఇచ్చేస్తే బాగుండేది.

రచనలో గొప్ప విషయమేంటంటే, రాస్తూ పోతుంటే కొన్ని అనుకోనివి హఠాత్తుగా మనల్ని పలకరించి నిలవరిస్తాయి. ఇప్పుడు ఇదంతా రాస్తుంటే, హఠాత్తుగా, అస్సలు సంబంధమే లేకుండా ఒక జ్ఞాపకం నా ముందుకు వచ్చి నిల్చుంది.

అప్పుడు ఇంటరు చదువుతున్నాను. ఎవరో ప్రైవేటు కాలేజీలో పాఠాలు చెప్పే మాస్టారు సాయంత్రం మాకు వాళ్ల మేడ మీద ట్యూషన్లు చెప్పేవారు. ఆ ట్యూషన్ కి అన్ని తరగతుల వాళ్లూ వచ్చేవారు. ఒక్కో గంట ఒక్కో క్లాసుకి చెప్పుకుంటూ పోయేవారు. చీకటి పడే వరకూ అన్ని తరగతులూ ఆ విశాలమైన మేడ మీద చెల్లా చెదురుగా జట్లు జట్లుగా విడిపోయి ఉండేవి. చీకటి పడ్డాకా మాత్రం ఆ మేడ మధ్యన ఉన్న చిన్న షెడ్డులోనే లైటు ఉండేది కాబట్టి అందరూ అక్కడ గుమికూడేవారు. ఒక రోజు రాత్రి బాగా వర్షం పడుతోంది. ట్యూషన్ మాత్రం అయిపోయింది. పిల్లలెప్పుడూ తడవటానికి జడవరు కదా. చాలామంది వెళిపోతున్నారు. నేను నా గొడుగు తీసుకుని మేడ దిగి గేటు తెరుచుకుని బయట రోడ్డు మీద వడి వడిగా అడుగులేసుకుంటూ పోతున్నాను. ఉన్నట్టుండి హఠాత్తుగా ఒక ఆరో తరగతి పిల్ల అనుకుంటా, “అన్నయ్యా ఆడ దాకా రావద్దా” అంటూ చొరవగా నా గొడుగులోకి దూరేసింది. చిన్న గౌను వేసుకుంది, పుస్తకాలు ఒబ్బిడిగా హత్తుకుంది. తర్వాత మేం ఒక సందు అంతా కలిసే నడిచాం. ఆ సందు అంతా వర్షం నీరు చీలమండల దాకా పారుతోంది. ఒక గొడుగు కింద నడిచాకా పరిచయాలు తప్పవు కదా. ఆ ఆరిందా పిల్ల ఏం మాట్లాడిందో గుర్తు లేదు, నేను ఏం మాట్లాడేనో కూడా గుర్తు లేదు. మా ఇల్లే ముందొచ్చింది, ఆ పిల్ల తర్వాత వర్షంలో తడుస్తూ వెళిపోయింది. ఈ జ్ఞాపకం నేను ఈ లిఫ్టు పురాణం గురించి రాస్తుండగా గుర్తుకు రావటం చిత్రం కదా! మైండ్ వర్క్స్ ఇన్ మిస్టీరియస్ వేస్. ఒక్కోసారి దాన్ని నమ్మాలి. బహుశా నాకు గుర్తుండిపోయిన బెస్ట్ లిఫ్టు ఇదే అనుకుంటా.

*

June 11, 2011

పుస్తకాల్ని ఎందుకు పద్ధతిగా సర్దుకోవాలంటే…!

నేను గది చేరే సరికి రాత్రయింది. తలుపు తాళం తీసి లోపలకు అడుగుపెట్టాను. లైటూ ఫానూ వేసి, పగటి దుస్తులు విడిచి, టవల్లోకి మారి స్నానానికి వెళ్ళబోతూ, అదాటున చెంబుడు చన్నీళ్ళు వంటి మీద పడితే కలిగే బిత్తరపాటు భరించడానికి శరీరం అప్పుడే సన్నద్ధంగా లేకపోవడంతో, కాసేపు తాత్సారం చేద్దామని, అరలోంచి పుస్తకం తెచ్చుకుని కుర్చీలో కూర్చున్నాను. అట్ట తీసానో లేదో కరెంటు పోయింది. ఒక్కసారిగా కళ్ళముందు దట్టమైన నలుపు పులుముతూ కటిక చీకటి కమ్ముకుంది. కరెంటుతో పాటూ నా ఉనికిని నిరూపించే నాలోని యింద్రియమేదో కూడా ఆరిపోయినట్టయింది. నేనక్కడ లేను. వట్టి గది వుంది. అప్పటిదాకా నా నిర్లక్ష్యాన్ని భరించిన గది అదను చూసుకుని తన ఉనికిని చాటింది. నేనున్నానంది. నువ్వు లేవంది.

ఈ గది నన్నింకా పూర్తిగా స్వీకరించలేదు. క్షణం క్రితం వరకూ గెడ బయటవేసి వుంది, యిపుడు లోపల వేసి వుంది. అంతే తేడా. యీ గదిలో నా గైర్హాజరీ యింకా కొనసాగుతుంది. ఈ గది...! పొద్దున్న నేను తలుపు తాళం వేసివెళ్ళిందగ్గర్నించి, ఒక నిముషం క్రితం తాళం తీసేవరకూ, తన మానాన తానున్న గది! బయట రోజెలా మారుతుందో పట్టించుకోని అంతర్ముఖీనమైన గది! నేను ఆఫీసులో వున్న క్షణాల్లో యిదిక్కడ యేం చేస్తుందో, నా కోసం ఎదురుచూస్తుందో లేదో, అసలు నేను రావటం దీనికి ఇష్టమో కాదో, నేను వెళ్ళిపోయినప్పుడల్లా వెనక యిది చప్పట్లు కొట్టి సంబరం చేసుకుంటుందో యేమో! నేను లేని క్షణాల్లో నా గది ఎలా సమయం గడుపుతుందో యోచించాను. గది కన్నా ముఖ్యంగా, గదిలో నా పుస్తకాలు ఎలా కాలక్షేపం చేస్తాయోనని ఆలోచించాను.

(అవి గది కన్నా సజీవంగా అనిపిస్తాయి. ఎందరెందరో రచయితలు, ఏవేవో దేశాలవాళ్ళు, ఏవేవో కాలాలవాళ్ళు, వారివారి వ్యక్తిగత జీవిత వేళల్లో, కుదుర్చుకున్న సమయాల్లో, ఏ తెల్లారగట్లో మధ్యాహ్నాలో నిశిరాత్రుళ్ళో, ఏ యిరుకు గదుల్లోనో, విశాలమైన గదుల్లోనో, ఏ తెల్లకాగితాల మీదో, టైపు రైటర్ల మీదో, కంప్యూటర్ తెరల మీదో... సాగించిన స్వీయ చైతన్య మథనానికి ఫలితాలు కదా ఈ పుస్తకాలు. ప్రతీ పుస్తకం యేదో మస్తిష్కపు చైతన్యాన్ని అక్షరాలనే చిహ్నాల్లో నిలుపుకుని వెంట తెచ్చుకున్నదే కదా. కాబట్టి గది కన్నా, అందులో యితర వస్తువుల కన్నా, యివి సజీవత్వపు పాత్రని బాగా పోషిస్తాయి.)

నేను లేని సమయాల్లో నా పుస్తకాలు సామరస్యంగానే వుంటున్నాయా, సఖ్యతతో కాలక్షేపం చేస్తున్నాయా? ఆలోచన యింకా మొదలవకుండానే... భళ్ళున కళ్ళను వెలిగిస్తూ చుట్టూ కరెంటు వచ్చింది. పుస్తకాల అల్మరాని తేరిపార చూసాను. అవి నేను లేనపుడు ఎంత అసహనాన్ని భరిస్తున్నాయో గ్రహించడానికి ఎక్కువసేపు పట్టలేదు.

కొన్నంటే సరే, సఖ్యంగానే వున్నాయనిపించింది. భమిడిపాటి కామేశ్వరరావు ప్రక్కన ముళ్ళపూడి వెంకటరమణ మొదట్లో కాస్త భక్తిగా ఒదిగినా, కాసేపట్లోనే గురువుగారి దగ్గర కొత్త పోగొట్టేసుకుని చిలిపి జోకులు పేల్చేస్తాడు. కొండొకచో అవి పేలేవి చుట్టూ వున్న రచయితల బోడి సీరియస్నెస్ మీదే! క్రింద అరలో శ్రీపాదకీ బానే సాగుతోంది. ప్రక్కనే మల్లాది రామకృష్ణశాస్త్రి వున్నాడుగా. “ఆహా ఒహో మీ వచనం! తెలుగుతనానికి నారాయణ కవచం!” అంటూ మునగచెట్టెక్కించేస్తాడు. ప్రక్క అరలో జి.కె. చెస్టర్‌టన్ ద్వారా చార్లెస్ డికెన్సుకీ యిదే వైభవం జరుగుతుంది. ఆ పై అరలో కాస్త టెన్షన్ లేకపోలేదు. కళ పట్ల ఫ్లొబేర్ మొండి సిద్ధాంతాలకి మనసులో సణుక్కుంటూనే, గొడవెందుకు అందర్లాగే పైకి వినయంగా వుంటే పోలా అని నిమ్మకుంటాడు సాల్‌బెల్లో. దాస్తొయెవ్‌స్కీ ప్రక్కనున్న అల్బెర్ట్ కామూ క్షణాల్ని యిట్టే కరిగించేసుకుంటాడు. ఎడ్మండ్ వైట్ చెప్పే హోమోసెక్సువల్ పిట్ట కథల్ని డి.హెచ్. లారెన్సు “జెండర్ మారితే ఏమైందిలే సెక్సు సెక్సే కదా” అని సరిపుచ్చేసుకుని చెవులప్పజెప్పేస్తాడు.

వీళ్ళందరి సంగతీ ఫర్లేదు. ఏదోలా సఖ్యంగానే కాలక్షేపం చేసేస్తారు. కానీ మిగతా వారందరి సంగతీ! నబొకొవ్‌కి తన ప్రక్కనే వున్న దాస్తొయెవ్‌స్కీ పొడంటేనే గిట్టదాయె. “చవకబారు సెంటిమెంటలిజమూ, లేకితనమూ నువ్వూనూ...” అంటూ నానా మాటలూ లంకించుకుంటాడు. అంతటితో ఆగుతాడా, ఆ ప్రక్కనే దాస్తొయెవ్‌స్కీ నించి అస్తిత్వవాద సారాన్నంతా జుర్రేసుకుంటూ పలవరించిపోతున్న అల్బెర్ట్ కామూని “కాస్త గమ్మునుండగలవా మెస్యూర్ కామూ” అని విసుక్కోడూ! ఇంతున్న విషయాన్ని అంత చేసి మాట్లాడే రవీంద్రనాథ్ ఠాగూర్ తన ప్రక్కన “ప్రతీ మాటా నిశ్శబ్దం మీదో మరక” అంటూ నోరు విప్పని శామ్యూల్ బెకెట్‌ని పాపం ఎలా తట్టుకుంటాడో. ఠాగూర్ మీద ఈ నింద మోపేది పై అరలోనున్న బోర్హెసే. అంతేనా, అతణ్ణి “వట్టి స్వీడీష్ ఇన్వెన్షన్” అని తీసిపారేస్తాడు కూడా. నిజమెంత వున్నా, ఆ నోబెలేదో తనకి రాలేదన్న దుగ్ధే చూడరూ జనం ఆ మాటల్లో! అక్కడికి ఆయనకీ ఏం మహా సుఖం లేదు తన అరలో. ఎందుకంటే, తన మొత్తం పుస్తకాలన్నింటిలోనూ ఒక్కటంటే ఒక్క శృంగారపూరితమైన పేరా కూడా రాయని ఈ కామ విరాగిని తీసుకుపోయి పిలిఫ్ రాత్ ప్రక్కన (అదీ బోలెడు సెక్సున్న ‘పోర్ట్నీస్ కంప్లెయింట్’ ప్రక్కన) పెడితే యిబ్బంది పడడూ! బోర్హెస్‌కి మరో ప్రక్క వున్నది నబొకొవ్! అతనేదో అభిమానం చూపిస్తున్నా, అతని అతిశయం బోర్హెస్‌కి గిట్టదు. గొప్పగా రాస్తాడు సరే! మరీ ఆ విషయాన్ని స్వయానా గుర్తెరిగివున్నట్టు ప్రవర్తిస్తే ఎలా! కాస్త నిరాడంబరంగా ‘అబ్బే అంతేం లేదు’ అని బిడియపడరాదూ, తనలాగా! అందుకే, “కాస్త ఆ పై అరలో ఎడ్గార్ అలెన్‌పోకీ, రాబర్ట్ లూయీ స్టీవెన్సన్‌కీ మధ్య నన్ను పారేయరాదూ” అని అడుగుతున్నాడు. కాఫ్కాకి హొమోఫోబియా వున్నట్టు ఎక్కడా చెప్పబడలేదు. కనుక యిటు ప్రక్కన మార్సెల్ ప్రూస్ట్‌తో బానే కాలక్షేపం చేసేయగలడు. కానీ రెండో ప్రక్కన జిడ్డు కృష్ణమూర్తికి బదులు చివరనున్న ఆర్థర్ షోపనార్ అయితే బాగుండుననుకుంటాడు. జె. డి. శాలింజర్ బాధ వేరు. ఏ సొరుగు మూల్లోనో పడేయక, యిలా బాహటంగా అందరూ వున్న అల్మారాలో యిరికించేసానని సంకటపడతాడు. ప్రక్కనున్న గురువుగారు మార్క్ ట్వయిన్‌ కూడా అతని ఆదుర్దానేమీ తగ్గించలేడు. హెన్రీ డేవిడ్ థొరూ పరిస్థితీ యిదే. ట్రాఫిక్ శబ్దాలు లీలగా వినిపించే గదిలో, యినుప అల్మారాలో, ఒద్దికైన వరుసల్లో పద్ధతైన కృతక జీవనం నచ్చదు. విశృంఖలత్వం కావాలి. ప్రకృతి కావాలి. వాల్డెన్ సరస్సుని కలవరిస్తాడు. మరో అరలో బెర్గ్‌సన్‌ యేమో భావవాదంతోనూ, బెట్రండ్ రస్సెలేమో భౌతికవాదంతోనూ బుర్రలు బాదేసుకుంటారు. డేవిడ్ హ్యూమ్ హేతువుకీ, అరబిందో ఆధ్యాత్మికతకీ పొసగక పోట్లాటలు మొదలవుతాయి. స్పినోజాకి కాఫ్కా బాధ అర్థం కాక అయోమయ పడతాడు. యింకో అరలో రోవెర్తొ బొలాన్యొ సాటి లాటిన్ అమెరికన్ రచయిత మార్కెజ్‌ని "నువ్వూ నీ బొందలో మేజిక్ రియలిజం" అంటూ ఈసడించుకుంటాడు. బాగా క్రింద అరలోనేమో అయాన్ రాండ్ తలవాచేట్టు శామ్యూల్ జాన్సన్ అమ్మనా చీవాట్లూ పెట్టడం ఖాయం. వడ్డెర చండీదాస్‌‌కి యిటుప్రక్కగా ‘అంపశయ్య’ నవీన్ బానే కాలక్షేపం చేస్తాడు గానీ, అటుప్రక్క వున్న మధురాంతకం రాజారాం మాత్రం అమాయకంగా బిక్కచచ్చిపోతాడు. అందరికన్నా యిబ్బంది పడేది విశ్వనాథ. వెంకటచలాన్ని మోయలేక విసుక్కుంటాడు. చలం పాపం ఎక్కడున్నా సర్దుకుపోతాడు. ఆ యిబ్బంది లేదు. ప్రక్కన వున్నది కమలాదాస్ అయితే  యింకస్సలు లేదు. పై అరలోంచి సుబ్బారావు గారి ఎంకిపాటలూ వినపడుతున్నాయాయె. బుచ్చిబాబు గారి ‘దయానిధి’ పడే వున్నతమైన అస్తిత్వ వేదనల్ని చూసి, యిటుప్రక్క గురజాడ వారి గిరీశం మర్యాదగా పొట్టకదలకుండా కిసకిసమని నవ్వుకుంటూంటే, మరోప్రక్క తెన్నేటి వారి చంఘీజ్‌ఖాన్ మాత్రం, ఎంతైనా సూటూ బోడ్గా బట్ టెంగ్రీ కదా, ఎవడికి జడిసేది, ‘ఇహ్హహ్హా’ అని బాహటంగా పగలబడిపోతాడు. అక్కిరాజు ఉమాకాన్తం కసుర్లు వినపడేంత దూరంలోనే వున్నాడు దేవులపల్లి కృష్ణశాస్త్రి. ప్రమాదమే కదా.

యిలా ఒకట్రెండనేమిటి! అల్మరాల్లోని ప్రతీ అరలోనూ ఏవో గొడవలే, గిల్లికజ్జాలే, పొరపొచ్చాలే, ఆరోపణలే, హెచ్చుతగ్గుల పోట్లాటలే కన్పిస్తున్నాయి. యిలాగైతే నేను గది తలుపు మూసుకుని ఆఫీసుకు వెళ్ళిందగ్గర్నించీ గదిలో ఏమన్నా ప్రశాంతత వుంటుందా! పరస్పర సఖ్యత లేని యిలాంటి చోట నిశ్శబ్దపు మధ్యాహ్నాలని పుస్తకాలేమన్నా ఆస్వాదించగలుగుతాయా! అందుకే, పుస్తకాల్ని ఒక పద్ధతిలో సర్దుకోవాలి! పితూరీల్లేకుండా, గొడవలు రాకుండా చూసుకోవాలి!

May 17, 2011

అలా తిరిగి రావాలని...

నాలో తిరగాలన్న యావ మొదలైందీ మధ్య. మొన్న పుస్తకాల షాపుకి వెళ్ళినపుడు  అత్యంత యిష్టంగా కొని తెచ్చుకున్నది ఒకే పుస్తకం: ‘ఎ రోడ్ గైడ్ టు ఆంధ్రప్రదేశ్’! బహుశా స్టేషనరీ షాపుల్లో కూడా దొరికే పుస్తకం. వందరూపాయలు. పుస్తకం కన్నా ముఖ్యంగా పుస్తకం వెనక అట్టకు అతికించి వున్న పేద్ద ఆంధ్రప్రదేశ్ మాప్ నన్నాకర్షించింది. యిలా పుస్తకాలకని వెళ్ళి రోడ్డు మాప్ కొనుక్కురావడమన్నది, గత కొన్ని నెలలుగా నా ఆలోచనలకు తగ్గట్టే ఉంది.

నాకు చిన్నప్పటి నుండీ ప్రయాణాలంటే పెద్ద మక్కువ లేదు, అలాగని మరీ విరక్తీ లేదు. చిన్నప్పుడు తిరిగింది ఎక్కువగా బస్సుల్లోనే. అది ఆహ్లాదకరమైన అనుభవం కాదు. ఆ దుమ్ము రేగే బస్టాండ్లూ, బస్సుల్లో ఇనుము కంపూ, మన అస్థిపంజరం బలమెంతో పరీక్షిస్తున్నట్టు ఆపాదమస్తకం జాడించి వదిలేసే రోడ్లూ, అప్పటిదాకా యింటి చుట్టూ తెలిసిన పరిసరాల్లో అలవాటు మగత కప్పుకు పడుకున్న మనసుపై ఉన్నపళంగా దాడి చేసే తెలియని మొహాలూ పరిసరాలూ, లగేజీ బాధ్యతలూ, రావాల్సిన చిల్లర గుర్తుపెట్టుకోవడాలూ, కిటికీలోంచి జేబురుమాళ్ళు విసిరి సీటేస్సుకునేవాళ్ళూ... ఇవన్నీ చికాకు పెట్టేవి. కానీ, ఒక్కసారి కిటికీ దగ్గర సీటు దొరికిందా... అన్నీ మరిచిపోయేవాణ్ణి.

రైలు ప్రయాణాలంటే మాత్రం చాలా యిష్టం. అసలు రైలంటేనే ఏదో ఆకర్షణ. రైలు డోరు దగ్గర నిల్చునే వీలు దొరికితే చాలు గమ్యం ఎప్పటికీ చేరకపోయినా ప్రయాణపు పరమార్థం దక్కేసినట్టే. (డోరు దగ్గర నుంచున్నంత సేపూ నా సీట్లో ఏం జరుగుతుందన్న ధ్యాస వుండదుగానీ, సీట్లో కూర్చోవాల్సి వచ్చినపుడు మాత్రం ఆ డోరు దగ్గర చోటెవడన్నా ఆక్రమించేస్తాడేమోని కంగారు పడతాను యిప్పటికీ.) ఇరుపక్కలా వెదజల్లబడిన జీవిత పరిమళాల్నెన్నింటినో ఏరి, తన పట్టాల దారానికి ఒద్దికైన కదంబంగా రైలు వేగిరం అల్లుకుంటూ పోతుంటే, ఆ పరిమళాలకు మనసు తలుపు తెరిచిపెట్టి నిల్చోవడం నాకు ఎప్పటికీ పాతబడని ఆనందం. అసలు స్పందించగలిగే మనసుండాలే గానీ రైలు తలుపు దగ్గర నిలబడ్డపుడు ఎంత కవిత్వం వేగంగా వెనక్కు దొర్లుతూ పోతుందనీ!

రైల్ డోర్ రియలైజేషన్స్

మొన్న ఊరెళ్ళినపుడు కూడా అంతే. తెలవారుతుందనగా సీటు వదిలేసి తలుపు దగ్గరకు వెళ్ళి నిలబడ్డాను. ఎన్నిసార్లు చదివినా ఒకే అర్థం చెప్పే కవిత కూడా, ఎపుడో ఏదో అరుదైన మనస్థితిలో చదివినపుడు కొత్త అర్థాన్ని స్ఫురింపజేస్తుంది. అలాగే యిపుడు కూడా బయటి దృశ్యాలు యిదివరకట్లాంటివే అయినా, ఈ సారి నా మనసు వాటికి కొత్త భాష్యాలు చెప్పింది; వాటిని మరి వేటికో ముడి వేసింది; ఆ కొత్త అన్వయాల నుంచి నేనిదివరకూ గమనించని సత్యాల్ని రాబట్టింది. ఓ చిన్నపాటి జ్ఞానోదయం కూడా కలిగిందని చెప్పాలి. వెనక్కి వచ్చాకా ఓ పోస్టు రాయబోయి తర్వాతెందుకో మానేసాను. ‘rail-door realizations’ అనో ‘an exercise to the literary pedant’ అనో కొన్ని శీర్షికలు మనసులో పెట్టుకున్నాను కూడా. ఈ రెండో శీర్షిక గురించి కాస్త వివరించాలి. రైలు ప్రయాణం గురించి రాస్తూ దానికి ‘సాహితీ ఛాందసులకు ఒక అభ్యాసం’ అని పేరెందుకు పెట్టాలనుకున్నాను? ఎందుకంటే, అలాంటి ఛాందసత్వంతో బాధపడే వారికి వేగంగా వెళ్ళే రైల్లో తలుపు దగ్గర ప్రయాణం చేయడం మంచి విరుగుడుగా పని చేస్తుందనిపించింది. ఎలాగో చెప్పే ముందు, అసలు ఈ ఛాందసత్వానికి కారణాలు ఊహిస్తాను. సాహిత్యాన్ని గొప్ప పరంపర కలిగిన ఒక వ్యవస్థగా చూడడంలో కొన్ని ప్రమాదాలున్నాయి. ముఖ్యంగా సాహిత్యమే ప్రధాన వ్యాసంగంగా కలవారికి ఈ ప్రమాదం జరిగే అవకాశాలు మరీ ఎక్కువ. ఈ మహానిర్మాణపు మాయలో పడిపోతాం. యిది స్వచ్ఛందమనీ, స్వయంసమృద్ధమనీ నమ్మడం మొదలుపెడతాం. దీనికి జీవాన్నిచ్చే వేర్లు చుట్టూ జీవితంలో పాతుకొని వున్నాయన్న సంగతి విస్మరిస్తాం. పనిముట్టు సొగసుగా వుందని దానితో పని చేయించుకోవడం మానేసి గూట్లో పెట్టి ఆరాధించే ఎడ్డి పనోడిలాగ, జీవితాన్ని అక్షరాల్లోకి వడగట్టగల సాహిత్యాన్ని పటం కట్టి పూజించడం మొదలుపెడతాం. దాని ఘనమైన పరంపర ముందు భక్తిప్రపత్తులతో సాష్టాంగాలు పడుతూ, ఆ వ్యవస్థకు మనమే ఆపాదించిన మర్యాదని కాపాడేందుకు సిద్ధాంతాల్ని సృష్టిస్తూ, నియమాల్ని అల్లుతూ, వాటి ఆధారంగా బేరీజులు కడుతూ, నేల నిలకడ చూసుకోకుండా దాని మీద బృహన్నిర్మాణాలు కడుతుంటాం. జీవితాన్ని బయటే వదిలేసి, సాహిత్యాన్ని అద్దాల మేడలో బంధిస్తాం. యిదిగో! యిదే మూసలో కరుడుగట్టిపోతే మనమే సాహితీ ఛాందసులమవుతాం.

ఈ ఛాందసత్వం పటాపంచలు కావాలంటే, ఒక్కసారి జీవితపు బహుముఖీన విశ్వరూపం మిరుమిట్లుగొలుపుతూ మన మనోనేత్రాల ముందు సాక్షాత్కారం కావాలి. అలా చూపగలిగే దృష్టిపథం ఒకటి మనకు కావాలి. రైలు డోరు దగ్గర అది సులువుగా దొరుకుతుందని నా నమ్మకం. జీవితంలోని ఎన్నో పార్శ్వాలకు ప్రాతినిధ్యం వహించే చెదురుమదురు దృశ్య శకలాల్ని త్వరిత గతిన ప్రక్కప్రక్కన చేర్చి మనకు చూపించగలిగే ఒకేఒక్క చోటు అది. ఈ చేరిక వల్ల మనం ఒక దృశ్యంతో మరో దృశ్యానికి లంకె వేయగలుగుతాం. వేర్వేరు పార్శ్వాల్ని ఒకదానితో ఒకటి పోల్చుకోగలుగుతాం. వ్యత్యాసం చూడగలుగుతాం. ఈ వ్యత్యాసాల మధ్య దాగివున్న జీవిత స్వభావాన్ని  గ్రహించగలుగుతాం. బస్సూ, కారూ, బైకూ, సైకిలూ...  ఏదీ యిలా పనికి రాదు. ఇవి మనల్ని జీవితపు సందడిలో భాగం చేసేస్తాయి. మనం ఏం గమనించాలను కుంటున్నామో దానికి మరీ దగ్గరైపోతాం. స్థూలంగా చూపించే దృష్టి ఉండదు. కానీ రైలు అలాక్కాదు. వేరు చేయగలిగే దూరాన్ని పాటిస్తూనే, అవగాహనకు చాలినంత దగ్గరగా వెళ్తుంది.

ఇప్పుడు కాస్త ఓపిక పడితే... కొన్ని కామాల పరంపర:— కొండలు, గడ్డి మైదానాలు, మామిడితోటలు, వరి పొలాలు, నల్లగా బిగువైన శరీరాల్తో సేద్యగాళ్ళు, కోతలూ కుప్పనూర్పుళ్ళూ, గేదెలూ, ట్రాక్టరూ, గొట్టంలోంచి ఊక కక్కుతూ రైసుమిల్లూ, ఎదుటి బడ్డీకొట్టుని వేలెత్తి చూపిస్తున్న అంబేద్కర్ విగ్రహం, సంతమార్కెట్టూ, పెంకుటిళ్ళ దొడ్డి గుమ్మాలూ, పళ్ళు తోముకుంటున్న లుంగీ, అంట్లు తోముతున్న చీర, గుడి గోపురం, స్కూలు గ్రౌండ్లో నెట్‌ మీంచి ఎడాపెడా ఎగురుతున్న బంతీ, ముగ్గులేసి వున్న వీధులూ, గాంధీబొమ్మ సెంటరూ, సైకిల్ని వంకరగా తొక్కుతున్న పొట్టి నిక్కరూ, ఊరి చివర ‘రతి రాణి’ని చూపిస్తున్న సినిమా హాలూ, కాసేపు గుప్పున కంపుకొట్టే కోళ్ళ ఫారం, చెరువు గట్టున కొబ్బరి చెట్టుకు ఆనించి వున్న అరిటిగెలల సైకిళ్ళు, పక్కన చుట్ట కాలుస్తూ రెండు తలపాగాలూ, తిరగేసిన ఎక్స్‌క్లమేషన్ మార్కుల్లా దూరంగా తాటి చెట్ల వరస, ఎండలో బంగారంలా మెరుస్తూ గడ్డి మేట్లూ, ఎవరూ కనపడని రైల్వే క్రాసింగూ, వరిపొలాల్లో కొంగల గుంపు, కంకర్రోడ్డు మీద ముఖం చిట్లించుకు పోతూన్న ఎర్ర బస్సూ, దాన్ని ఓవర్టేక్ చేస్తూ నల్ల క్వాలిస్సూ, సంతోషి ఫ్యామిలీ ధాబా, సరుకు లారీలు, పెట్రోలు బంకూ, కిషన్‌చంద్ మార్బల్ టైల్స్ ఫాక్టరీ, క్రిస్టియన్ స్మశానం, బెతెస్త వృద్ధాశ్రమం, అశోక వృక్షాల మరుగులో గవర్నమెంటాఫీసు కాంపౌండూ, ఏవో నడుములూ బొడ్డులూ చూపిస్తున్న పోస్టర్లూ, రైలు బ్రిడ్జి క్రిందనుంచి పోతూ కనిపిస్తున్న ట్రాఫిక్కూ, గడియారస్తంభం, షాపింగ్ కాంప్లెక్సూ, బట్టల షోరూమ్, వేలు చూపిస్తున్న వెంకటేష్ కటౌటూ, బోలెడన్ని స్కూటర్లు గంటు మొహాలు పెట్టుకుని వెయిట్ చేస్తున్న రైల్వే క్రాసింగూ, వీపులు చూపిస్తున్న షాపుల వెంటిలేటర్లలో ఎగ్జాస్టు ఫేన్లూ, బట్టలారేసి వున్న అపార్ట్‌మెంట్ బాల్కనీలు, రెపరెపలాడుతున్న మెడికల్ కాలేజీ యూనిఫారాలూ, పెట్రోలు బంకూ, కనకదుర్గా ఫ్యామిలీ దాభా, కొబ్బరి చెట్లూ, వరి చేలూ, బోరింగు దగ్గర పిల్లల బోసి ముడ్లూ... మళ్ళీ యింకో ఊరూ, మళ్ళీ యింకో పట్టణం, మళ్ళీ యింకో నగరం... యిలా ప్రతీ వీధిలో ప్రతీ యింట్లో ప్రతీ బయలులో ప్రతీ మనిషిలో పై తెరలు తీయగానే ఎన్నెన్నో కథలు ఝుమ్మంటూ ముసురుకుంటుంటే, జీవితం అవిచ్ఛిన్నంగా కళ్ళ ముందు విచ్చుకుంటూంటే, మన చైతన్యపు కొలతకి అందనంత విస్తారంగా పరుచుకుంటూంటే, అప్పుడు, ఆ సమయంలో ఒక్కసారి, కలమూ తెల్లకాగితాలతో నిమిత్తమున్న మన సాహితీ వ్యాసంగాన్ని గుర్తు తెచ్చుకుంటే, అప్పుడు తెలుస్తుంది, అది దాని చేవ ఎంత పరిమితమో. మెలికల గీతల్తో నిర్మితమైన అక్షరాలూ, వాటి కూడికతో నిర్మితమైన పదాలూ, వాటి వెనుక ఏ స్థిరత్వమూ లేక చంచలంగా దోబూచులాడే అర్థాలూ యివన్నీ మొదటికే ఈ విస్తృత జీవిత వైశాల్యాన్ని ఇముడ్చుకునేందుకు ఎంతో చాలీచాలనివీ, అసమగ్రమైనవీను. యిక సాహిత్యాన్ని భాష అంటూ, నిర్మాణ భేదాలంటూ యింకా దాని పరిధిని కుదింపజేస్తే అది జీవితం ముందు పూర్తిగా కుదేలైపోతుంది. కౌగలించుకోవాల్సిన చేతుల్ని వెనక్కి విరిచి కట్టేస్తే మోకాళ్ళ మీద కూలబడిపోతుంది. ఆకాశాన్ని రెక్కల్తో కొలవాలనుకునే పక్షి ప్రయాసలో నిష్పలత్వమే వున్నా, ఆ బృహత్ అభిలాషలో, ఆ స్వేచ్ఛలో ఓ అందం వుంది.  కానీ పంజరంలోంచి ఆకాశాన్ని బెంగగా చూసే పక్షిలో అలాంటి అందమేమీలేదు.

నేను ఈ వ్యాసంలాంటి ఏదో రాతలో విషయం నుంచి పూర్తిగా దారి తప్పుతున్నట్టున్నాను. రాయాలనుకుంది వేరు రాస్తోంది వేరు. నాలో కొత్తగా మొదలయిన భ్రమణకాంక్ష గురించి కదా నేను రాయాలనుకుంది. సాహిత్యం జోలికి ఎందుకు వచ్చాను. (నా విషయంలో ఈ రెంటికీ నాకిప్పుడు ఆలోచించే ఓపిక లేని అవినాభావ సంబంధమేదో వుందనిపిస్తుంది.)

తిరుగుడు యావ నాలో చిన్నప్పట్నించీ వుందేమోనని అనుమానించడానికి బస్సు కిటికీ పట్లా, రైలు తలుపు పట్లా నాకున్న మక్కువ తప్ప వేరే ఆధారం లేదు. అసలు భ్రమణకాంక్ష అనేదొకటి మనుషుల్ని పట్టుకుని ఊపుతుందనీ, ఫలితంగా ఎక్కడా కాలు నిలపలేక, ఎక్కడా ఎక్కువకాలం తమని స్థిరపరుచుకోలేక, నిరంతరం కొత్త చోట్లకై అన్వేషించేవారు వుంటారనీ నాకు తెలియదు. తిరగడం అంటే ఏదో గమ్యానికని మాత్రమే నాకు తెలిసింది. చిన్నప్పుడంతా ఎప్పుడన్నా వేసవి సెలవల్లో చుట్టాల యిళ్ళకు వెళ్ళి వచ్చేయడం తప్ప నేను చేసిన దూర ప్రయాణాలు తక్కువ. అప్పుడపుడూ ఊరి చివర లాకుల దగ్గర స్నానాలకూ, మూతబడిన రైసుమిల్లుల్లో ఆటలకీ అభ్రకం పెచ్చులు ఏరుకోవడానికీ, గోదావరి లంకలకూ, స్మశానాలకూ, మామిడితోటల్లో దొంగతనాలకూ నన్ను పురికొల్పింది ఏకతీరుగా విసుగుపుట్టించే స్కూలు జీవితమే తప్ప, కొత్త స్థలాల పట్ల మక్కువ కాదు. కొత్త ప్రదేశాల్లో, కొత్త మనుషుల్తో గడపాలనే యావ లోపలేవన్నా వుండి వుంటే దాన్ని నావరకూ పుస్తకాలు బాగానే సంతృప్తి పరచాయి. ఒకవేళ అలాంటిదేమీ లేకపోతే, పుస్తకాలు ఆ లోటు తెలియనివ్వలేదు. ముఖ్యంగా మాక్సింగోర్కీ జీవిత చరిత్ర (ట్రయాలజీ) లాంటి పుస్తకాలు నన్ను కేవలం స్థలం లోనే కాదు, కాలంలో కూడా సదూరంగా తీసుకుపోగలిగాయి.

బైట కూడా లోకం వుందన్నమాట బెక బెక! 

డిగ్రీ చదివేటపుడు ఒక సంఘటన మాత్రం నా చిన్ని లోకం మీద బోర్లించిన బుట్టని తిరగేసి ప్రపంచాన్ని కొత్తగా చాలా చూపించింది. పూల మొక్కలకు ప్రసిద్ధి చెందిన కడియపులంకలో ఏడాదేడాదీ ‘ఫలపుష్ప ప్రదర్శన’ జరిగేది. మేం నలుగురు స్నేహితులం కలిసి బయల్దేరాం బస్సులో. అబిద్‌ గాడు యింట్లో చెప్పకుండా మస్కాకొట్టి తెచ్చిన డొక్కు కెమెరా ఒకటి మాతో వుంది (అప్పటికింకా డిజిటల్ కెమెరాలు అంత వ్యాప్తిలోలేవు.) ఇక చూడాలి, ఎగ్జిబిషన్‌లోకి చేరేసరికి ఆ కెమెరాతో మా యవ్వారం ‘తోక యెత్తిన కాకి, తోక దించిన కాకి’ అన్నట్టు తయారయింది. ఏవో పూల బెడ్స్ ప్రక్కనో, బోన్సాయ్ చెట్ల ప్రక్కనో ఫోటోలంటే సరే. కానీ మా ఫోటోల వైవిధ్యానికి అంతులేదు. ఓ స్టాల్లో పూలమొక్కలకి ఎరువులమ్ముతున్న అమ్మాయితో (ఆ అమ్మాయి చాలా అందంగా వుంది; ఒక ఎరువుల పాకెట్ కొంటే తనతో ఫోటో తీసుకోవచ్చంది), ఎగ్జిబిషన్ బయట ఆపివున్న కార్ల ప్రక్కన్నుంచునీ, రోడ్డు మధ్యలో, పొలం గట్ల మీద, చెట్ల క్రింద, చెట్ల మీద, ముగ్గుర్లో ఎవడో తెచ్చిన నల్ల కళ్ళజోడు ఫొటోకి ఒకరొకరం మార్చుకుంటూ, ఒక ఫొటోకి ఇన్‌షర్టూ, ఒక ఫొటోకి పక్కోడి టీషర్టూ... యిలా ఆ ఒక్కరోజులోనే మనిషి జీవపరిణామ దశల్నెంటినో పెద్ద పెద్ద అంగల్తో వెనక్కి దాటేసి విచ్చలవిడిగా ఫొటోలకు ఫోజులిచ్చాం. జీవితంలో అంతకుముందెప్పుడూ మాలో ఎవ్వరమూ అన్ని ఫొటోలు దిగలేదు. బాగా రాత్రి దాకా ఎగ్జిబిషన్ దగ్గరే కాలక్షేపం చేసింతర్వాత, హైవే మీద ఏదో కంకర మోసుకెళ్తూన్న లారీని ఆపి వెనక కంకరలోడు మీద ఎక్కాం. పాటలు పాడుకుంటూ, కేకలూ వేసుకుంటూ వెళ్ళాం. జొన్నాడ దగ్గర దిగాం. అక్కడ వేరే బస్సెక్కాలి. నాలుగడుగులేసామో లేదో, మా కెమెరా ఆ కంకర లారీలోనే వదిలేసి దిగామని అర్థమైంది. లారీ అప్పటికే కనుచూపుమేర దాటేసి చీకట్లో కలిసిపోతోంది. వెనక పరిగెత్తాం ఖాళీ రోడ్డు మీద పొలోమని, ఈసారి కంగారుతో కేకలు వేస్తూ. కానీ అది ఆగలేదు. అబిద్‌ గాడి కంగారు... వాడి ఫ్యామిలీ మొత్తానికి అది ఒక్కగానొక్క కెమెరా! లారీ వెళ్ళిన వైపే వెళ్ళాలని నిశ్చయించాం. వెనక వస్తున్న యింకో లారీ ఆపి ఎక్కితే వాడు చెప్పాడు, బహుశా ముందెళ్ళిన లారీ గోదావరి అవతల వున్న ‘ఎల్ & టి’ వాడి సైటు లోకి కంకర తీసుకెళ్తోందేమోనని. (అప్పుడు రావులపాలెం గోదావరి వంతెనకి ఏవో మరమ్మతులు జరుగుతున్నాయి.) అయితే అక్కడే దిగుతామన్నాం. అబిద్‌ గాడికి కెమెరా పట్ల ఎంత ఆందోళన వుందో, మిగతా ముగ్గురికీ అందులో ఫోటోల పట్ల అంతే ఆందోళనగా వుంది. అయినా విధి మా పట్ల అంత కఠోరంగా వ్యవహరించగలదని యింకా నమ్మలేక, పైకి జోకులు వేసుకుంటూనే వున్నాం. బ్రిడ్జి అవతల దిగి, కన్‌స్ట్రక్షన్ సైటులోకి వెళ్ళాం. లోపల బోలెడన్ని లారీలు, క్రేన్లు, క్రషింగ్ మెషీన్లు, బస్తాలు, ఇసుక, కంకర గుట్టలు... మొత్తం వాతావరణమంతా మనుషుల్లో పిపీలికత్వపు స్పృహ కలిగించి న్యూనత రేకెత్తించేలా వుంది. అప్పటికే అర్ధరాత్రి దాటుతోంది. అయినా లోపల నిర్విరామంగా పని జరుగుతూనే వుంది. ఎవరో మేనేజరనుకుంటా, సంగతి చెప్తే గత కాసేపట్లో లోపలికి ఏయే లారీలు వచ్చాయో రిజిస్టరులో చూశాడు. సెక్యూరిటీ వాణ్ణొకణ్ణి మాకు అప్పజెప్పి ఆ లారీలు వదిలిన కంకర గుట్టల్లోకి పంపించాడు. అతను మా కెమెరా ఎత్తుకెళ్ళిన లారీ తాలూకు కంకర గుట్ట ఏదైవుండచ్చో అది మాకు చూపించాడు. మేం కాసేపు ఆ గుట్ట అటూ యిటూ కెలికి చూసాం. అది చాలా పెద్దది వుంది. అంతా పెకలించినా దొరక్కపోతే! చివరికి అప్పటికే ఆశ చచ్చిపోయింది. విధి మాకు హేండిచ్చిందని కన్ఫర్మయిపోయింది. ముగ్గురం ఓ గంట అక్కడే గడిపి కాళ్ళీడ్చుకుంటూ రోడ్డు మీదకి వచ్చాం. లారీ నుంచి లారీకి మారుతూ మాచవరం వెళ్ళి ఆ రాత్రి రెడ్డి గాడి యింట్లో పడుకున్నాం. ఇప్పటికీ మేం నలుగురం కలిస్తే అడపాదడపా ఆ రాత్రి గురించి ఓ మాట ప్రస్తావనకు వస్తూనే వుంటుంది.

మా కాలేజీ జీవితంలో కొన్ని ఆనంద క్షణాల్ని ఫ్రీజ్ చేసి ఇముడ్చుకున్న ఆ కెమెరా ఫిల్ము వాటిని ఫోటోల రూపంలో విడుదలచేసి వుంటే అవి ఎప్పటికీ మాతో వుండిపోయేవి. ఆ కెమెరాలో ఇమిడిన మా అప్పటి అవతారాలు నాకు యిప్పటికీ లీలగా స్ఫురిస్తాయి. కానీ ఆ రాత్రి ఆ కన్‌స్ట్రక్షన్ సైటులో గడిపిన క్షణాలు నాకు అంతకు మించిన స్పష్టతతో గుర్తున్నాయి. ఫోటోలుగా మారకుండానే తప్పిపోయిన ఆ ఫిల్ము మా కొన్ని జ్ఞాపకాల్ని మాక్కాకుండా చేసినా, అలా తప్పిపోవడం ద్వారా అంతకన్నా మరింత తీక్షణమైన జ్ఞాపకాన్ని ఇచ్చింది. ఆ అర్ధ రాత్రి హైవే రోడ్డూ, లారీలూ, తెలియని స్థలాలూ, తెలియని మనుషులూ... ఒక్కసారిగా ప్రపంచం బట్టలు తిరగేసి తొడుక్కుని వుండగా నా కంటబడినట్టు అనిపించింది.  ఆ లారీ డ్రైవర్ల రోజెలా గడుస్తుందో, ఆ సెక్యూరిటీ వాడి యింట్లో కథేమిటో, ఆ కన్‌స్ట్రక్షన్‌ సైటులో ఎలాంటి వ్యవహారాలు నడుస్తాయో, వాటికి మూలమైన పెద్ద పెద్ద నిర్ణయాలు నగరాల్లో ఏ కాన్స్ఫరెన్సు హాళ్ళనించి వస్తాయో, అక్కడ డెస్కుల వెనుక యింజనీర్ల కథలేమిటో...! అదివరకూ నేను పెద్దగా ఎన్నడూ గమనించని ఒక విషయం ఆ రాత్రి తెలిసింది: ప్రపంచం ఎపుడూ నిదరపోదనీ; ఏదో ఒకటి చేస్తూనేవుంటుందనీ; నాకు ఆనుపానులు తెలియని స్థలాల్లోనూ, నేను పేర్లెన్నడూ వినని ఊళ్ళలోనూ, నగరాల్లోనూ, నగరాల బయట కొండల్లోనూ, కొండల మధ్య అడవుల్లోనూ, అడవుల నిశ్శబ్దంలోనూ... నిత్యం నా చుట్టూ వున్నంత సంపన్నంగానే జీవితం నడుస్తూ వుంటుందనీ; ఎప్పుడూ ఏవో కథలు జరుగుతూనే వుంటాయనీ; కానీ అవన్నీ నాకెప్పటికీ చేరకుండానే, ఆ అగణిత క్షణాలూ, ఎన్నో అద్భుత సమయాలూ ఏ ఫొటో ఫిల్ముపైనా ముద్రితం కాకుండానే, ఈ అనంత నిర్విరామ కాలగతిలో తమ ఆచూకీ కోల్పోతూ వుంటాయనీ... ఇదంతా ఆ రాత్రి గుర్తుండిపోయేట్టు నాకు తొలిసారి తెలియజెప్పింది. ఆ రాత్రిలో ఏ దినుసులు దాన్ని అంత గాఢంగా నా జ్ఞాపకంలో ముద్రితమయ్యేలా చేసాయో నేను స్పష్టంగా చెప్పలేను. నా కూపస్థమండూక అస్తిత్వాన్నించి నన్ను కాసేపు బయటకు లాగి, వేరే ఎంతో విశాల ప్రపంచపు స్పృహను గట్టిగా నాలో కల్పించిన సంఘటనల్లో యిది కీలకమని మాత్రం చెప్పగలను. దానికి ఋజువు ఇదే, యిపుడిలా ఒక్కసారి వెనక్కి తిరిగిచూసుకోగానే వేరే అన్ని జ్ఞాపకాల్నీ తోసుకుని యిలా ముందుకు తోసుకొచ్చేయటమే!

రెక్కల్లేని లోటు తొలిగా తెలిసొచ్చిన కాలం

డిగ్రీ అయిన తర్వాత ఖాళీగా వున్న కొన్ని రోజుల్లోనూ నేను చదివిన కొన్ని పుస్తకాల గురించి యిక్కడ చెప్పాలి. ఎందుకంటే నాలో యిప్పటి భ్రమణకాంక్షకు పాదులు వేసిన పుస్తకాలు వాటిల్లో కొన్ని వున్నాయి. ముఖ్యమైనది ఒక రాహుల్ సాంకృత్యాయన్ పుస్తకం. నేను చదివిన తెలుగు అనువాదం పేరు ‘లోకసంచారి’. (అనువాదకులు ఎవరో గుర్తులేదు.) దాని మూలం పేరు ‘ఘుమక్కడ్ శాస్త్ర’ అని గుర్తుంది. అనువాదానికి పెట్టిన పేరు కన్నా మూలం పేరు ఈ పుస్తక తత్త్వాన్ని యింకా ఖచ్చితంగా చెపుతుంది. పుస్తకంలో ఎక్కువ శాతం రాహుల్ సాంకృత్యాయన్ చేసిన ‘లోక సంచారం’ గురించి కన్నా, అసలు లోక సంచారులు ఎలా మసలుకోవాలి, మానసికంగా ఎలా సంసిద్ధులు కావాలీ మొదలైన వాటి గురించి వుంటాయి. ఈ సమయంలోనే చదివిన మరో పుస్తకం సంజీవ దేవ్ ‘తెగిన జ్ఞాపకాలు’. సంజీవ దేవ్ కూడా రాహుల్ సాంకృత్యాయన్ లాగే చిన్నపుడే యిల్లు విడిచి దేశాటనకు వెళ్ళినవాడు. స్వయానా రాహుల్ సాంకృత్యాయన్‌తో వ్యక్తిగత పరిచయం వున్న వాడు కూడా. ఆయన చాలా చిన్నతనంలో యిల్లు వదిలి హిమాలయాలకు పోవడం, గొప్ప గొప్ప వాళ్లతో పరిచయాలు ఏర్పరుచుకోవడం యివన్నీ చదివిం తర్వాత నాకు న్యూనత కలిగింది. నేను మసులుకున్న లోకపు విస్తీర్ణం పుట్టగొడుగు క్రింద నీడంత మాత్రమేనని అర్థమైంది. బుచ్చిబాబు ‘నా అంతరంగ కథనం’ కూడా యిపుడే చదివాను. అదేమీ లోక సంచారం గురించి కాదుగానీ, అందులో ఓ చోట బుచ్చిబాబు రైళ్ళలో తనకు కనిపించే ఆకర్షణని ప్రస్తావిస్తాడు. అతని యిష్టాన్ని నా యిష్టంతో పోల్చి చూసుకోవడం గుర్తుంది. ఈ పుస్తకాలన్నింటిలో నేనేం చదివానన్నది ఒక్క ముక్క కూడా నాకు జ్ఞాపకం లేదు. (‘తెగిన జ్ఞాపకాలు’ అయితే పేరు కూడా గుర్తు లేదు. ఇది ఈమధ్యే మళ్ళీ పుస్తక రూపేణా విడుదలైనపుడు కొని రెండు మూడు పేజీలు చదివాకా, ఒహో యిది వరకూ చదివిందే కదా అనుకున్నాను.) కానీ చదివినపుడు మాత్రం వీటి ప్రభావం నా మీద వుందని గుర్తుంది.

అప్పట్లో కడియంలో వుండే వాళ్ళం. పగలల్లా పుస్తకాలు చదవడం, సాయంత్రం ఊరి చివర వుండే రైల్వే స్టేషన్‌కి వెళ్ళి కూర్చోవడం. సౌందర్యంలో ఆ రైల్వే స్టేషన్‌తో పోటీ పడే మరో స్టేషన్ నాకింత దాకా తారసపడలేదు. స్టేషన్‌కి కుడి ఎడమల్లో కొన్ని గుడిసెలు. రెండు మూడు చెక్క బల్లల్తో ప్లాట్ ఫాం, దాని ముందు పట్టాలు, తర్వాత వరుసగా క్షితిజ రేఖ అవధిగా విస్తరించిన పొలాలు, ఒక ప్రక్కన కొండలు, మరో ప్రక్కన దూరంగా జి.వి.కె. ఫ్యాక్టరీ. రైలు వస్తుంటే ఆ కొండల్లో దూరంగా ముందే కన్పించేది. అక్కడ పట్టాలు అక్కడ పెద్ద యూటర్న్ తిరిగివుంటాయి. కడియంలో పట్టాలకున్నంత వంపుతో యూటర్న్ దేశంలో యింకెక్కడా లేదని, రైలు డ్రైవరూ గార్డూ ఎదురుబొదురు నిల్చొని చేతులూపుకోవచ్చనీ అమ్మ చెప్పేది. (కొంత అతిశయోక్తి కావొచ్చు.) సాయంత్రాలు అక్కడకు సైకిల్ మీద పోయి కూర్చునేవాణ్ణి. పుస్తకాలు తీసికెళ్ళే వాణ్ణి గానీ చదవబుద్దేసేది కాదు. ఆలోచించబుద్దేసేది. దేశంలో ఎక్కణ్ణించో మొదలై మరి యే మూలకో పోయే గూడ్సు రైళ్ళు అక్కడ గంటలు గంటలు ఆగేవి. చాలాసార్లు యెక్కేసి అదెక్కడికెళ్తే అక్కడికి అలా అలా పోదామా అనిపించేది. ఒకసారి టికెట్టు లేదని దింపేస్తే అక్కడ దిగిన గెడ్డం సాధువొకడు కనపడ్డాడు. అతని పట్ల కుతూహలంతో స్థానికుడొకతను ప్రశ్నలు వేస్తున్నాడు. వినేవాడు దొరికాడన్నట్టు తన జీవన శైలిని ఉత్సాహంగా చెప్తున్నాడు. నేనూ ఆసక్తిగా ఓ చెవి అటు పడేసాను. మామూలుగా యిలా కాషాయం వాళ్ళని రైలు దింపరట. ఇలా ఒక చోటు నుండి మరొక చోటుకి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు ప్రయాణిస్తుంటాడు. ఏ చోటు నచ్చకపోయినా వెంటనే బిచాణా బదిలీ. కలకత్తాలో మంచి గంజాయి ఎక్కడ దొరుకుతుందో చెప్తున్నాడు. మాటల్లో తెలిసే పోతుంది. అతనికి కాషాయం జరుగుబాటు కోసం మాత్రమే. ఆధ్యాత్మికం మాటటుంచి, ఆదమరపుగా వుంటే జేబు కొట్టేవాడిలా వున్నాడు. కానీ అతని కళ్ళు ఎన్నెన్ని ప్రదేశాలు చూసి వుంటాయోనని నాకు కుళ్ళొచ్చింది. కడియానికి ఓ ప్రక్కగా ఎర్రమట్టితో కొండగుట్టలుండేవి. అపుడపుడూ అక్కడకు సైకిల్ మీద పోయి, క్రిందనుండి చిన్నగా వెళ్తూ కన్పించే రైలుని చూడడం కూడా బాగుండేది. బహుశా ఆ పుస్తకాలూ, ఆ పరిసరాలూ, నాలో యిప్పటి తిరగాలన్న కోరికకు తొలి ప్రేరణలేమో. అయితే, ఒక పిట్ట పోయి పోయి పంజరం ఊచలకి గూడు కట్టినట్టు, నేను తర్వాత హైదరాబాదు వచ్చేసాను.

హైదరాబాదాయణం

నేను వచ్చి పదేళ్ళవుతోంది. ఏ నగర స్వరూపమైనా బయటివాళ్లకి అర్థమైనంతగా స్థానికులకి అర్థమవదని నాకన్పిస్తుంది. ఎందుకంటే స్థానికులు ఎడంగా నిలబడి చూడలేనంత మమేకమైవుంటారు నగరంతో. ‘హైదరాబాదీ’లమని ఉత్సాహపడే వాళ్ల కన్నా హైదరాబాదుని నేను ఎక్కువ చూసానని తెలుసు. మిథికల్ హైదరాబాదుని కాదు, ఇపుడున్న హైదరాబాదుని. దట్టంగా కొట్టిన దాని మేకప్ వెనుక దాగి వున్న ముడతల రహస్యాలన్నీ నాకు దగ్గరగా తెలుసు. నాకు దీని మీద ప్రేమా, విసుగూ రెండూ వున్నాయి. ప్రేమ కన్నా విసుగే ఎక్కువ. ఒకప్పుడు హైదరాబాదుకి నిర్వచనంగా నిలబడిన మైథాలజీ అంతా నేను చూస్తుండగానే కూల్చివేతకు గురైంది. దాంతో పాటే నా ప్రేమ కూడా. ఇపుడిది నిర్మాణంలో వున్న నగరం. వేరే ఏదో కాబోతున్న నగరం. ఒక పేద్ద కన్‍స్ట్రక్షన్ సైటు. యిక్కడ ఖరీదైనతనమూ గరీబుతనమూ తమ వ్యత్యాసాన్ని మరింత కొట్టొచ్చేట్టు పెంచుకున్నాయి. చిత్రంగా అదే సమయంలో ప్రాదేశిక దూరాన్ని మరింత తగ్గించుకుని ప్రక్కప్రక్కనే ఒకదాన్నొకటి వొరుసుకుంటూ కనపడుతున్నాయి. ఒక ప్రక్క షాపింగ్ మాల్సూ, టౌన్‌షిప్పులూ, ఆఫీస్ స్పేసెస్ యివన్నీ బ్రోచెర్లలో కన్పించే ‘tranquil’, ‘idyllic’, ‘state of the art’ లాంటి విశేషణాలకు తగ్గట్టుగా గొప్పగానే వుంటున్నాయి; మరోప్రక్క హెల్మెట్లు తగిలించుని సగం జీవితం ట్రాఫిక్లోనే గడిపే మధ్యతరగతి తలలు బోలెడు వుండనే వున్నాయి. ఆ తలల్లో పుట్టే ఆశల్ని ఆసరా చేసుకుని బోలెడంత నగరం వాటి చుట్టూ పరిభ్రమిస్తూంటుంది; యివికాక వీటన్నింటి మధ్యా, వీటన్నింటి ప్రక్కనే, చోటు దొరికిన చోటల్లా మూలమూలల్లోకీ సర్దుకుపోతున్న బీదతనమూ బోలెడువుంది. నాపరాళ్ళు చెదురుమదురుగా పేర్చిన యిరుకు గల్లీలూ, అటూయిటూ ఆస్బెస్టాస్ కప్పులూ, మంజీరా నీళ్ళ కోసం ఆడాళ్ళ పోట్లాటలూ, ఫ్లాట్‌ఫారాల చివర గుడుంబా పేకెట్ల మత్తులో తమ ఉనికి బాధని మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ శిథిలమైపోతున్న మనుషులు, భుజానికి గోనెసంచులు మోస్తూ చేతిలో పదునైన ఇనుప ఊచని చెత్తకుప్పల్లో గుచ్చి కవర్లు యేరుకుంటూ దిశ లేని కసిని kores కరెక్షన్‌ ఫ్లూయిడ్ల మత్తులో చల్లార్చుకునే బాల్యమూ, నిర్మాణంలోని ఎత్తైన భవనాల చుట్టూ తాత్కాలిక వాసాల్లో నిర్మాణ కూలీల దుమ్మూదూగరా జీవితమూ... యిలా లెక్కకు అందనన్ని దృశ్యాలు పేర్చవచ్చు; యివన్నీగాక మిగిలిన మూలలేమన్నా వుంటే అక్కడ ఒకప్పటి మిథికల్ హైదరాబాదు కృశించి అవశేషంగా వుంది. బయటివాళ్ళకి దుర్భేద్యమైన పాతబస్తీ వీధుల్లోనూ, ఆదివారం కోటీలో రోడ్లవార్న పాత పుస్తకాల పేర్పులోనూ, అపుడపుడూ సాంబ్రాణీ సాయిబు వచ్చి సువాసనలు చిమ్మి వెళ్ళే ఇరుకు కెఫెల్లోనూ తప్ప యిది పెద్దగా ఎక్కడా కన్పించదు. ప్రస్తుతానికి హైదరాబాదు ఏదో మధ్య దశలో వుంది. యీ సంచలనమంతా ఎప్పటికి సద్దుమణుగుతుందో తెలియదు. కానీ సద్దుమణుగుతుంది. యిదంతా ఎపుడోకపుడు ఎకడోకక్కడ నెమ్మదిగా నిలకడ సాధించుకుంటుంది. అపుడు ఆ నిలకడలో మరో కొత్త సంస్కృతి ఆవిష్కరించబడుతుంది. దాని లక్షణాల్ని బట్టి హైదరాబాదుకు కొత్త నిర్వచనాలు ఆపాదింపబడతాయి.

ప్రేమైనా విసుగైనా ఏమైనా హైదరాబాదు యిప్పటికే నాలో భాగం. హైదరాబాదు నాకు నేర్పినవో, లేక నేను హైదరాబాదులో వుండగా నేర్చుకున్నవో, చాలా వున్నాయి. నిత్యం అనిశ్చితి అగాధంపైన దారం పాటి ఆధారాలకి వేలాడుతూ కూడా నిశ్చింతగా వుండటం నేర్పింది. బైటి దాడులనుండి రక్షణలేని నా మునుపటి మెతకదనంపై పెళుసుదే అయినా కాస్త దురుసైన కవచాన్ని తొడిగింది. నాకు కావాల్సినన్ని పుస్తకాలిచ్చింది. నాక్కావల్సినంత సంస్కృతిని చుట్టూ అందుబాటులోకి తెచ్చింది. కానీ నేనే స్వేచ్ఛాభిలాషతో యిక్కడ అడుగుపెట్టానో అది యిక్కడా దొరకలేదు. నాకు మొదట్లో కొత్త బంగారు లోకం అనిపించిందంతా పైమెరుగని తేలిపోయింది. కానీ అసలంటూ నిలబడ్డానికి నిలకడైన ఆధారాన్ని సంపాయించేసరికే యేళ్ళు గడిచిపోయాయి. మధ్యలో తోడుకోసం అనువుగాని తావుల్లో వెతుక్కునే నా వైకల్యమొకటి సగం కాలాన్ని తెలియకుండా దాటవేయించింది. అలా పదేళ్ళు ఆదమరుపుగానే గడిచిపోయాయి. ఈలోగా ఈ నగరపు ఇరుకు నన్ను ఉక్కిరిబిక్కిరి చేయకుండా, నా పుస్తకాలు తాము పొదువుకున్న కథల్లోని కల్పిత లోకాల షరతుల్లేని  పౌరసత్వాన్ని అందిస్తూ నన్నాదుకున్నాయి.

బుద్ధిలో కొత్త పురుగు డ్రిల్లింగ్ ప్రారంభించడం 

గత ఏడాది నావైపుగా నేను ఎదురుచూడని గాలులు వీచాయి. వ్యక్తిగత జీవితంలో కొన్ని మార్పుల వల్ల తరచూ ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి కలిగింది. అవి కూడా గమ్యమున్న ప్రయాణాలు కాదు. ఊరకే ఊళ్ళు పట్టి తిరగాల్సి వచ్చింది. ఎన్నడూ చూడని ఊళ్ళూ, చవక లాడ్జీలు, అపరిచిత చౌరస్తాలు, యిరుప్రక్కలా నిద్రగన్నేరు చెట్లు తలపైన చూరు కట్టిన రోడ్లూ, తంగేడు పూల కొమ్మల వెనక సూర్యాస్తమయాలూ, కొండల చిటారున గుడి గోపురాలూ, నదులూ, వంతెనలూ, పొలాలూ, ఎవర్నో గుర్తు తెస్తూనే వారితో ఏ పోలికలోనూ సామ్యం దొరకని కొత్త మొహాలూ... ఏదో కొత్త తరహా జీవితపు చేలాంచలం ఊరించడం మొదలుపెట్టింది. ప్రతీ చోటా ఒకేసారి వుండాలనిపించడం మొదలైంది. ప్రతీ ఊళ్ళోనూ వుండి దానికే ప్రత్యేకమైన ఆత్మని పరిచయం చేసుకోవాలి. ఆ ఊర్లో మనుషులందరి మనసుల్లోనూ ఆ ఊరి కూడలికీ, ఊర్లో స్కూలు మైదానానికీ, ఊరి మధ్య రథం వీధికీ, ఊరి చివర కొండకీ అన్నింటికీ ప్రత్యేకమైన వ్యక్తిత్వం వుంటుంది, అది నాకు అర్థం కావాలి. నా సొంత ఊరిని ఎలా జ్ఞాపకాల రంగుల్లో వడగట్టి చూస్తానో, అలా ఆ ఊరి వాళ్ళ చైతన్యంతో ఆ పరిసరాల్ని చూడగలగాలి, ప్రేమించగలగాలి. ప్రతీ పరిసరమూ — రైల్వే స్టేషనూ, కాఫీ హోటలూ, లాడ్జీ గది, గుడి మంటపం, ఇళ్ల వరస, చెట్టు కొమ్మల అమరికా — తమ అమరిక ద్వారా ఏదో ప్రత్యేకమైన వాతావరణాన్ని కల్పిస్తాయి, ఏవో కథలు చెప్తాయీ, లేదా ఏవో ఊహాజనితమైన కథలకు సామరస్యంగా ఆతిథ్యాన్నిస్తాయి; వాటన్నిటి సందిటా నేను గడపాలి. ఇడ్లీచట్నీలూ, ఉప్మాపెసరట్లూ, మషాలాదోసెలూ వాటిని చేసే హస్తవాసిని బట్టి చిన్న చిన్న తేడాలతో ఎన్ని రుచులు మారగలవో అన్నీ నా నాలిక మీద పడాలి. తెలియని వాళ్ళతో మాట కలపాలి. తెలియని పక్షుల్ని పేరేంటని అడగాలి. రోడ్డు ప్రక్కన దుమ్ములో సీతాకోక చిలుకల అనాథ కళేబరాల్ని చేతుల్లోకి తీసుకుని వాటి చిరిగిన రెక్కల మీద దేవుడు అదృశ్యలిపిలో రాసిన సత్యాల్ని చదువుకోవాలి. ఒక్కముక్కలో చెప్పాలంటే, నా జీవితాన్ని నా చేతిలో వడిసెల లాగా చేసి, గిరగిరా త్రిప్పి ప్రపంచం మీదకు విసిరేసుకోవాలి. — అని అనిపించడం మొదలుపెట్టింది.

అయితే నేనే కాదు, అలా అనిపించీ ఆ అనిపించడాన్ని అనుసరించిన వాళ్ళు నా చుట్టూ వున్నారు. వాళ్ళ ప్రేరేపణ కూడా తోడైంది. ముఖ్యంగా కాశీభట్ల వేణుగోపాల్. ఆయన కూడా దేశం మీద పడి తిరిగినవాడే. ఒకసారి సైకిల్ మీద తిరిగాడు, మరోమారు కాలినడకన మొత్తం భారతదేశం తిరిగాడు. తిరగడమంటే ఒక చోట స్వస్థలమనేది పెట్టుకుని, ఆ బిందువు నుంచి మనమెక్కడకుపోతే అక్కడిదాకా తెలియని బంధనాల్ని మనసులో నిత్యం భరిస్తూ, మళ్ళీ ఎప్పటికో వెనక్కి చేరిపోతామన్న ఎరుకతో తిరగడం కాదు. కుక్క మెళ్ళో గొలుసు ఊరంత పొడవైందైనా దాని రెండో కొస ఒక గేటుకి తగిలించి వున్నంత వరకూ దాన్ని స్వేచ్ఛ అనలేం. కాశీభట్ల సంగతి వేరు. ఆయన యిల్లన్నది మర్చిపోయాడు. వెళ్ళిన చోటల్లా, వున్నంత సేపూ వున్నదే యిల్లనుకున్నాడు. ఎక్కడ వుంటే అక్కడ ఏవో చిరు ఉద్యోగాలు చేసుకుంటూ, కూడబెట్టిన డబ్బుతో మరో చోటకి పోతూ, మళ్ళీ దాన్నే స్వస్థలమనుకుంటూ... యిలా తిరిగాడు. ఆయన ఆ జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నపుడల్లా నా అంతరంగ యవనిక మీద ఆ ఎన్నడూ చూడని ప్రదేశాల దృశ్యమాలిక తెరచుకొనేది. నా మనసు వాటిలో లీనమైపోగా వర్తమానంలో ఉనికిని మర్చిపోయేవాణ్ణి.

ఈ మధ్యనే ఆయనకి నా భ్రమణకాంక్ష గురించి వెల్లడించాను. అపుడాయన యిచ్చిన సలహా, నేను పూర్తిగా పాటించలేకపోయినా, మంత్రముగ్ధుణ్ణి చేసింది: మొదటి సూత్రం, ఎప్పుడూ ఒంటరిగానే ప్రయాణించాలి. రెండుమూడు జతల బట్టల్తో బయల్దేరి పోవాలి. ఒక నోటు పుస్తకం దగ్గరుంచుకుని తోచినవి రాసుకుంటూండాలి. డెబిట్/ క్రెడిట్ కార్డులు పట్టికెళ్ళకూడదు. రైల్వే స్టేషన్‌ కెళ్ళి, ఫ్లాట్‌ఫాం మీద ఏ రైలు ఆగివుంటే దానికి టికెట్టు తీసుకుని ఎక్కేయాలి. ఏ వూరు ఆకర్షిస్తే అక్కడ దిగిపోవాలి. వూళ్ళోకి పోవాలి. మనుషుల్ని కదపాలి. మాట్లాడాలి. చుట్టూ చూడాలి. ఆ స్థలం పాతబడితే లారీలెక్కి యింకో చోటికి పోవాలి. లారీ వాళ్ళు డబ్బుల్లేకపోయినా బ్రతిమాల్తే ఎక్కించేసుకుంటారట. వాళ్ళకీ దూరప్రయాణాల్లో మాట్లాడే తోడు కావాలనుంటుందట. మళ్ళీ కొత్త ప్రదేశం. పని కావాలంటే ధాభాల్లో సులువుగా దొరుకుతుందట. అక్కడ పని చేస్తూ చుట్టు ప్రక్కల ఊళ్ళు తిరిగి రావచ్చు. డబ్బు సమకూరాకా యింకో స్థలం. ఒకవేళ డబ్బు మరీ లేకపోతే అపరిచితుల్నైనా బతిమాలుకోవచ్చు. చాలామంది చీదరించుకుంటారు, enjoy the humiliation! కొంతమంది ఇస్తారు కూడా. అపుడు మళ్ళీ యింకో చోటుకి.

ఆయన యిలా మాట్లాడుతున్నంత సేపూ నేను ఊహించుకున్న దృశ్యాలు నన్ను ఆ రోజే రైల్వే స్టేషన్‌కి పోవాలనిపించేంతగా ఊపేశాయి. ఎపుడో అలాగే వెళ్తాను కూడా. అయితే ఉద్యోగాన్ని వదిలేయగలిగే పరిస్థితులు యిప్పట్లో లేవు గనుక, ఫ్లాట్‌ఫామ్ మీద వున్న రైలు ఏదైనా ఎక్కేసి వెళిపోగలను గానీ, వెంట డెబిట్‌కార్డు లేకుండా వెళ్ళడమంటే సాధ్యం కాదు. పెట్టిన సెలవు పూర్తయ్యేసరికి ఠంచనుగా వెనక్కి వచ్చేయాలిగా. ఇలా తిరిగే ప్రదేశాల్లో టూరిస్టుల రద్దీ ఉండే ప్రదేశాలకు చోటు లేదు. నలువైపులా ప్రకృతి కమ్ముకుని వున్న ప్రదేశాల పట్ల కూడా పెద్ద మక్కువ లేదు. నన్ను ప్రకృతి ఆకట్టుకుంటుంది గానీ, అదేపనిగా నన్ను పట్టివుంచలేదు. యిపుడు ఫ్రెంచి రచయిత ఫ్లాబె (Flaubert) మాటలు గుర్తొస్తున్నాయి. తక్కువ మోతాదులో అవి నాక్కూడా అన్వయించుకోగలను. ఫ్లాబె తన ఆల్ఫ్ పర్వతాల పర్యటన గురించి మరో ప్రముఖ రష్యన్ రచయిత తుర్గెనొవ్‌కు రాసిన ఉత్తరంలో యిలా పేర్కొంటాడు:
నేను ప్రకృతి పుత్రుణ్ణి కాను. ‘ఆమె అద్భుతాలు’ నన్ను కళలోని అద్భుతాల కన్నా తక్కువ స్పదింపజేస్తాయి. ఆమె నాలో ఏ ‘గొప్ప ఆలోచనల’నూ జాగృతం చేయదు సరికదా నన్ను నలిపేస్తుంది. లోపల్లోపల నాకు ఆమెతో యిలా అనబుద్దేస్తుంది: ‘ఇదంతా బానే వుంది. నేను నీ దగ్గర్నుంచి కాసేపటి క్రితమే వచ్చాను, మరికొన్ని క్షణాల్లో మళ్ళీ అక్కడికే చేరుకుంటాను. కాబట్టి నన్ను నామానాన వదిలేయ్. నాకు వేరే సరదాలు కావాలి’.
పైగా ఈ ఆల్ఫ్స్ పర్వతాలు మనిషి అస్తిత్వ పరిధికి అందని కొలత కలవి. అవి ఎందుకూ ఉపయోగపడనంత పెద్దవి. నాలో అవి ఇలాంటి అసంతృప్తి కలిగించడం ఇది మూడోసారి. ఇదే చివరి సారని ఆశిస్తాను.

నాకు మనుషుల్లోనూ, వాళ్ళు నిర్మించిన నాగరికతలోనూ ప్రకృతితో సమానమైన సౌందర్యం కనిపిస్తుంది. ప్రకృతంతా ఏ నూటపద్దెనిమిది పరమాణు మూలకాల్తో నిర్మితమయిందో, వాటితోనేగా మనుషులు కట్టడాలూ నిర్మితమయింది! అంతా చూసే కళ్లలోనే అనిపిస్తుంది.  ప్రకృతి భారీతనం ఈ విశాలవిశ్వంలో మనిషి అస్తిత్వపు విలువేంటన్నది స్ఫురింపజేస్తుందన్నది నిజమే. కానీ చూసే కళ్ళుంటే, నగరంలో ట్రాఫిక్‌లో వున్నా, తలెత్తి చూస్తే కన్పించే నక్షత్రాలు కూడా నిత్యం మన విలువను మనకు గుర్తు చేస్తూనే వుంటాయి.

మొన్నో రోజు అప్పటికపుడు అనుకుని నేనూ చౌదరిగాడూ కలిసి బైకు మీద శ్రీశైలం వెళిపోయాం. యిది నేను తిరగాలనుకున్న పద్ధతిలో జరిగిన ప్రయాణం కాదు. ఒంటరిగా, బస్సుల్లోనూ రైళ్ళలోనూ, ఎక్కడ కావాలంటే అక్కడ ఆగుతూ, తోచిన ఆలోచనలు రాసుకుంటూ... యిలా సాగుతుంది నేననుకున్న పద్ధతి. కాబట్టి లెక్క ప్రకారం దీన్ని నా తిరిగాలన్న ప్లానులో భాగం చేయకూడదు. కానీ ప్రయాణం ఎంత ఆనందంగా సాగిందనీ! తెల్లారి నాలుగింటికి లేచి తాపీగా బయల్దేరాం. తోచిన చోటల్లా ఆగుతూ పోయాం. పైగా అదేంటో, శ్రీశైలం దాకా రోడ్డంతా మాదే అన్నట్టు అస్సలు జనసమ్మర్ధం లేదు. పదైంది చేరేసరికి. రాత్రి తిరుగుప్రయాణాన్ని మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను. శ్రీశైలం నుండి హైదరాబాదు మొత్తం నూటతొంభై కిలోమీటర్ల దూరమయితే, అందులో ఘాట్ రోడ్డే తొంభై కిలోమీటర్లుంటుంది. యిదంతా నల్లమల అడవుల మధ్యగా సాగుతుంది. ఘాట్‌ రోడ్లో లైట్లుండవు. పైగా మేము వెళ్ళిన రోజు రద్దీ లేదని చెప్పాగా. మొత్తం అంత దూరమూ ఆ కటిక చీకట్లో, ఎడాపెడా భయపెట్టే నిశ్శబ్దంతో దట్టంగా కమ్ముకున్న అడవి మధ్య నుంచి, ముందూ వెనకా మా బైక్ యిచ్చే గుడ్డి వెలుగు తప్ప ఏదీ ఆనని రోడ్డు మీద ఆ రాత్రి మా ప్రయాణం అపూర్వానుభవం. మధ్యలో రెండు మూడు సార్లు బైక్ ఆపేసాం. దాని లైటు కూడా ఆర్పేసాం. ఆ చీకట్లో ఆకాశమంతా దట్టంగా అలుమున్న నక్షత్ర సమూహాన్ని చూస్తూ చాలాసేపు గడిపాం. అంత స్పష్టంగా అన్ని నక్షత్రాల్ని నేనదివరకూ అరుదుగా చూసాను. నల్లమల అడవిలో మొత్తం నూటయిరవై దాకా పులులూ, రెండొందల చిరుతలూ వున్నాయట. ఒకటైనా అటువైపు వచ్చి కన్పించేపోతే బాగుండుననుకున్నాం. కానీ రాలేదు.


April 17, 2011

ఓ సెకండ్ హాండ్ బుక్ షాప్ గురించి

హైదరాబాదులో పుస్తకాల షాపులన్నీ నాకు కరతలామలకమని నమ్మకం. అందుకే కాశీభట్ల గారు ఫలానా లక్డీకాపూల్లో అశోకాహోటల్ పక్కనున్న షాపులో మంచి పుస్తకాలు దొరుకుతాయని రెండుమూడుసార్లు చెప్పినా, “ఆఁ! నన్ను ఆశ్చర్యపరచే పుస్తకాల షాపులు హైదరాబాదులో యింకేం మిగిలున్నాయిలేఅనుకున్నాను. కానీ మొన్న అనుకోకుండా బైక్ చేతికందితే ఆఫీసులో ఖాళీని పురస్కరించుకుని  వెతుక్కుంటూ వెళ్లాను. చిరునామా సులువే. లక్డీకాపూల్ నుండి రవీంద్రభారతికి వెళ్ళే దారిలో బస్టాపుకు ఎదురుగా వుంది. పేరు బెస్ట్ బుక్ సెంటర్”. 


ఫలానా పుస్తకాల షాపు మనకు ఎంత సంతృప్తిని కలిగించిందీ అన్నది మనకు ఏ రకం పుస్తకాలు కావాలీ అన్నదానిపై ఆధారపడివుంటుంది. నాకు ఆంగ్ల సాహిత్యమంటే ఆసక్తి. నన్ను ఏ రచయితలు ఆకట్టుకుంటారో ఏ రచయితలు ఆకట్టుకోరో, వాళ్ళల్లో చాలామందిని చదవకపోయినా కూడా, నాకు తెలుసు. అంతేకాదు, మొత్తం షాపులో నాకు నచ్చే పుస్తకాలు ఎక్కడ వుంటాయన్నది మొదటి చూపులోనే వాటి spines చూసి గుర్తుపట్టగలను. సరే... షాపు మెట్లెక్కి లోపలికి వెళ్లంగానే కొన్ని పాత తెలుగు పుస్తకాలతో పాటు కాల్పనికేతర ఆంగ్ల సాహిత్యం వుంది. కాల్పనిక సాహిత్యం పై అంతస్తులో వుంది. వంపు తిరిగిన ఇనుప మెట్లు పైకి తీసికెళ్తున్నాయి. మామూలుగా ఒడిస్సీ’, ‘క్రాస్ వర్డ్స్లాంటి ఆడంబరమైన షాపుల్లో పుస్తకాలన్నీ ఒద్దికగా ఏ విభాగానికా విభాగం వేరు చేసి సర్ది వుంచుతారు. కనుక అక్కడ పుస్తకాలు వెతకడంలో పెద్ద ఉత్సాహం వుండదు. ఏ మూల ఏం దొరకవచ్చునో అన్న ఉత్కంఠ వుండదు. అంతదాకా కేవలం యశస్సు విని ప్రేమించిన పుస్తకం హఠాత్తుగా మన కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ ఎదురై ఆశ్చర్యపరచడం జరగదు. అటువంటి షాపుల్లో ఒక రాక్‌ నుంచి ఏ పుస్తకం తీసినా ఆ రాక్‌లో మిగతా పుస్తకాలేమై వుండొచ్చో చెప్పేయవచ్చు. అన్ని పుస్తకాల్లాగే అక్కడి పుస్తకాలు కూడా ఎంతో గంభీరమైన ఆలోచనా చైతన్యాన్ని నింపుకుని, మనిషి జీవితానికి సమూలంగా కొత్త చిగుర్లు తొడిగే భావవీచికల్ని నిశ్వసిస్తూ, ఎన్నో స్వయంసమృద్ధమైన ప్రపంచాల్ని సందడిగా తమ పేజీల మధ్య పొందుపరుచుకున్నప్పటికీ, ఎందుకో ఆ వరుసల్లోని క్రమబద్ధతా, ఒకే ప్రచురణకర్త ప్రచురించిన పుస్తకాలన్నింటినీ ఒకే చోట అమర్చడం, “క్లాసిక్ ఫిక్షన్” “లిటరరీ ఫిక్షన్” “పాపులర్ ఫిక్షన్” “ఇండియన్ ఫిక్షన్లాంటి విభజనలూ... ఇవన్నీ వాటి వైభవాన్ని మరుగుపరుస్తాయి. ఆ స్థలమంతా విశృంఖల మేధో బాహుళ్యంతో ప్రజ్వరిల్లుతుందన్న సంగతిని అక్కడి పద్ధతైన అమరిక దాచేస్తుంది. స్కూలు ప్రార్థనాసమయంలో యూనిఫాం తొడుక్కుని పరధ్యానంగా వరుసల్లో నిలబడ్డ పసిపిల్లల దృశ్యం తోస్తుంది.

అందుకే పాత పుస్తకాల షాపులంటే ఆసక్తి. అక్కడ పుస్తకాలు ఓ వరుసలో వుండవు. పద్ధతిగా పేర్చివుండవు. ఆశ్చర్యానికి అవకాశం వుంటుంది. (పుస్తకాల షాపుల్లో యిలా ఆశ్చర్యం కోసం అలమటించడ మన్నది నాకు చిన్నప్పుడు మా వూరి గ్రంథాలయంలో పుస్తకాల వెతుకులాట నుంచీ అలవాటైంది.) అంతేకాదు, యిక్కడ ప్రతీ పుస్తకం ఒక వ్యక్తిత్వాన్ని కలిగి వున్నట్టనిపిస్తుంది. ఇవన్నీ ఎవరో చదివినవి. వాళ్ళ ప్రేమకు గుర్తుగా అక్కడక్కడా అండర్లైన్డ్ వాక్యాల్ని అలంకరించుకున్నవి. వాళ్ళ అల్మరాల్లో తమ యౌవనజీవితాన్ని గడిపి చివరికి భారంగా పసుపు పెళుసు పేజీల్ని మోసుకుంటూ ఇక్కడకు చేరినవి. వాటికో చరిత్ర వుంది. జ్ఞాపకాల్ని మోస్తున్న బరువు వుంది. వార్థక్యానికీ, జ్ఞానానికీ వున్న ఏదో సంబంధాన్ని అందమైన భ్రమగా ఈ వృద్ధ గ్రంథాలు భలే పోషిస్తాయి.

పైకి వెళ్లాక నిండా పుస్తకాలున్న పెద్ద హాలు ఎదురవుతుంది. దాదాపు మూడు గంటలు గడిపాను. ఒక మూణ్ణాలుగు పుస్తకాల పేజీలు తిప్పగానే చేతులకు చాలినంత దుమ్ము పడుతోంది. బాగా పట్టనిచ్చాకా నలుపుకుని వుండలుగా రాల్చడం బాగుంటుంది. యిలాంటి షాపుల్లో యూసువల్ సస్పెక్ట్స్ అయిన రచయితలు యిక్కడా ఎడాపెడా తగలకపోలేదు. కానీ అక్కడక్కడా అనుకోనివి తగిలాయి. వంద రూపాయల్ని మించిన ధర కలవి అరుదు.

మొన్నా మధ్య కొన్నాళ్ళు పుస్తకాల కొనుగోలు మీద విరక్తి పుట్టింది. నా గది అంతా అవే. అల్మరాలు సరిపోక, వరుసల మీద వరుసలు పైకెక్కి, రైటింగ్ టేబిల్ మీదా కిందా కూడా చేరి, నేల మీద దొర్లుతూ... ఎటు చూసినా అవే. ఏ బాదరబందీ లేకుండా ఇప్పటికిప్పుడు మకాం మార్చాలంటే భుజానో బాగ్ తప్ప ఏ సామానూ వుండకూడదనుకునే నాలోని జిప్సీ అంశ పాలిటికి ఇవి పెద్ద బాధ్యతగా మారిపోయాయి. హైదరాబాద్‌కి భూకంపం వచ్చి శిథిలాల క్రింద శాశ్వతంగా కప్పడిపోయిన నా పుస్తకాలూ, లేదా అగ్నిప్రమాదం జరిగి బూడిదగా మిగిలిపోయే నా పుస్తకాలూ... యిలా ఇవి నా పీడకలలకి ప్రధాన ఇతివృత్తాలుగా తయారయాయి. తీరా చూస్తే వీటిల్లో చదివినవాటి కంటే చదవనివే ఎక్కువ. అందుకే ఇంకేమీ కొన కూడదని కొన్నాళ్ల క్రితం నిర్ణయం తీసుకున్నాను. కానీ నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఎందుకో మామూలు కన్నా ఎక్కువ కొన్నాను. తాగుబోతోడు కొన్నాళ్ళు మానేయాలనుకుంటాడు. తన మీద తాను విధించుకున్న కట్టడి వాడికి మందుసీసాల్ని మరింతగా జ్ఞప్తికి తెస్తుంది. చివరికి ఓ బలహీనక్షణంలో, పోరాడే మనస్సాక్షిని ఒక్క గుద్దుతో నేలకంటుకుపోయేలా చేసి, చరచరా వెళ్ళి గటగటా తాగేసి వస్తాడు. ఈసారి మనస్సాక్షిని చావచితక్కొట్టానే అనే బాధతో మరింత ఎక్కువ తాగుతాడు. నా పుస్తకాలు కొనే బలహీనతా అంతే అనుకుంటాను. ఈ సారి యిక్కడ కొన్న పుస్తకాలు:

“India: A wounded civilization” by V.S. Naipaul

“Preface to Shakespeare” by Samuel Johnson

“A.E. Housman poems”

“Madame Bovary” by Flaubert (నా దగ్గర యిప్పటికే ఇది రెండు వేర్వేరు అనువాదాల్లో వుంది, ఇది మరో అనువాదమని కొన్నాను.)

“My Story” by Kamaladas (ఇది ఒకరికి బహుమతిగా కొన్నాను.)

February 26, 2011

పుస్తకాల్ని పైకి చదవడం గురించి

పుస్తకాల్ని పదిమందిలో పైకి చదవడం నాకు అస్సలు అలవాటు లేదు. చిన్నప్పుడు క్లాసులో టీచర్లు రెండుమూడుసార్లు పాఠాల్ని పైకి చదివించిన గుర్తుంది. కానీ నాకు మందిలో మసలుకోవడమంటే అంత సౌకర్యంగా ఉండదు. అలాంటి సందర్భాల్లో నా స్వభావాన్ని ఎక్కువసేపు అంటిపెట్టుకు వుండలేను. అది నాకే మసకగా మారిపోతుంది. చుట్టూ జనాల అంతరంగాల్లో బహుశా నేను ఎవరినై ఉంటానని అనుకుంటానో, ఆ పొగదెయ్యాల్లాంటి ప్రతిబింబాలు నన్ను చుట్టుముట్టి శాసిస్తాయి. ఒకేసారి అన్ని "నేను"ల గోల తికమకపెడుతుంది. నిభాయించుకోలేక అభాసుపాలవుతాను. చిన్నప్పుడు నేను మొత్తం క్లాసు ముందు నిలబడి పాఠం చదివిన కొన్ని సందర్భాలూ ఇలాంటివే. దీనికి తోడు నాకు నా గొంతే ఒక అడ్డం. మామూలుగా తక్కువగా మాట్లాడేవాళ్లకి తమ గొంతు వినే అవకాశం తక్కువ. ఇలా ఏదైనా పైకి చదవటం మొదలుపెట్టిన కాసేపటికే నా ధ్యాస చదవబడే విషయాన్ని వదిలి, చదువుతున్న నా గొంతు వైపు మళ్ళుతుంది. స్వరంలో హెచ్చుతగ్గులు, విషయాని కనుగుణంగా గొంతు మార్చటం... వీటిపైకి దృష్టిపోతుంది. దీంతో ఒకేసారి పుస్తకంలోని విషయం మీదా, నా వ్యక్తీకరణ మీదా శ్రద్ధ పెట్టగలిగేంతటి ఏకాగ్రత లేని నా మెదడుకు పేజీ మీద వున్న విషయం అలుక్కుపోతుంది. నేను తడబడతాను. మనకు చేతకానివి క్రమేణా మనకు నచ్చనివిగా మారిపోతాయి. నచ్చకపోవడానికి సమృద్ధిగా కారణాలు కూడా వచ్చి చేరతాయి. నావరకూ బహిరంగ పుస్తక పఠనాలు వ్యర్థ ప్రహసనాల విభాగంలోకి మళ్ళిపోయాయి. రచనను ఒకరు చదవడం, పదిమంది వినడం అనేది అసలు పుస్తకాల్ని ఆస్వాదించేందుకు పనికిరాని పద్ధతి అనీ, పుస్తకాల్ని చదవటమనేది ఒంటరిగా వున్నపుడు మాత్రమే అర్థవంతంగా సాగే పని అనీ అభిప్రాయం బలపడింది. ప్రేయసితో ఏకాంతం కావాలి. పుస్తకాలతో కూడా అంతేనని.

అయితే ఒక్కడినే వున్నపుడు మాత్రం అపుడపుడూ బిగ్గరగా బయటకి చదువుతూంటాను. దీనికి కారణం వుంది. గొప్ప రచయితలేం చేస్తుంటారంటే, లేదా అప్పుడప్పుడూ ఏం చేయగలుగుతారంటే, భాష ద్వారా సాధ్యమయ్యే అభివ్యక్తి అవధుల్ని దాటేసి, భాషకు ఆవలి భావాల్ని స్ఫురింపజేయగలుగుతారు. చూట్టానికి అచ్చులు హల్లులతో అవే పదాలూ, వ్యాకరణానుగుణమైన అవే వాక్యాలూ ఏదో విషయాన్ని వ్యక్తీకరిస్తూనే వుంటాయి. కానీ దాన్ని మించిన భావమేదో అందీఅందకుండా ఆ వాక్యాల చుట్టూ ఒక ఆవిరిలానో కమ్ముకునో, వాటి వెనక నీడలా తచ్చాడుతూనో ఉంటుంది. అదేమిటాని పట్టిపట్టి అర్థంచేసుకోబోతే-- ఆ ప్రయత్నం చేసినకొద్దీ-- ఇంకా దూరమైపోతుంది. కానీ అర్థంచేసుకోవటాన్ని మించిన అనుభవమేదో స్ఫురిస్తూనే ఉంటుంది. ఈ ఫీట్‌ని అందరు రచయితలూ అన్నిసార్లూ చేయలేరు. కొందరే, అదీ వాళ్ల సామర్థ్యపు అంచుల్ని అప్రయత్నంగా అందుకోగలిగినపుడు మాత్రమే చేయగలుగుతారు. చదువుతూ చదువుతూ వుండగా, హఠాత్తుగా కమ్ముకున్న ఇంద్రజాలం మనల్ని చకితుల్ని చేస్తుంది. వొళ్ళు జలదరిస్తుంది. కానీ కారణం కనిపించదు. వ్యక్తీకరణకు మూలమైన భాష అంతా కళ్ళముందే వుంటుంది, మనకు తట్టిన భావం మాత్రం ఆ భాషలో ఎక్కడినుంచి వచ్చిందో మాత్రం ఎంత తరచినా అంతుచిక్కదు. ఈ కనికట్టు రహస్యం కనుక్కోబుద్ధవుతుంది. ఇంద్రజాలికుడు తన తిరగేసిన టోపీ లోంచి పావురాల్ని వదిలేయటం ఐపోయింది, అవి తపతపా రెక్కల చప్పుడుతో ఈకలు రాల్చుకుంటూ ఆకాశంవైపు ఎగిరిపోయాయి, మనసు వివశమై చప్పట్లు కొట్టేసింది, ప్రదర్శన ముగిసింది. అంతా వెళిపోయాకా, అక్కడ బోర్లా మిగిలిన టోపీలోకి మనం ఎంత తొంగిచూస్తే మాత్రం రహస్యమేం బోధపడుతుంది? నేను ఒంటరిగా వున్నపుడు వాక్యాల్ని బైటికి చదువుకునే సందర్భాలు ఇలా ఖాళీ టోపీని తిరగమరగేసి చూసే తంతు లాంటివే. నన్ను జల్లుమనేట్టు చేసిన ఆ భావం, కనిపిస్తున్న అక్షరాల్లో ఎక్కడుందా అని పదే పదే ఆ వాక్యాల్ని పైకి గట్టిగా చదువుతాను. మొదటిసారి పొందిన ఆనందాన్ని పదే పదే పొందాలన్న చేసుకోవాలన్న ఆశ కూడా అందులో వుంటుంది. (చదివిన ప్రతిసారికీ అంతకంతకూ తరుగుతూ ఈ ఆనందాన్ని పొందుతాను కూడా.) కానీ ఎన్నిసార్లు చదివినా అవే పదాలూ అవే వాక్యాలూ 
వినపడి పాతబడిపోతాయే గానీ, కనికట్టు వెనక గుట్టు మాత్రం అంతుపట్టదు. పాఠకులుగానే మిగిలిపోతే ఎప్పటికీ అంతుపట్టదేమో! ఎపుడో మనమూ రాయడం మొదలుపెట్టినపుడే, ప్రేరణ అనే నీలపు మంచు పూల తుఫాన్లో మన బుద్ధి దారి పోగొట్టుకున్నప్పుడే, ఆ గుట్టు తెలుస్తుంది. అప్పుడు కూడా తెలియడమనేది వుండదు, అనుభవానికొస్తుంది, అంతే. ఈ ఇంద్రజాల రహస్యం ఆ ఇంద్రజాలికులకే తెలియదు. చేసి చూపించగలరు. ఎలాగంటే చెప్పలేరు. సాహిత్యం మనకు అందించే ఆనందపు మూలాల్ని ఎన్ని కాగ్నిటివ్ సైన్సులొచ్చినా శాస్త్రీయంగా అర్థం చేసుకోలేం అనుకుంటాను. అర్థం చేసుకోగలిగినా అసలు పాయింట్ అర్థం చేసుకోవటం కాదనుకుంటాను.

ఇపుడు అసలు విషయం. ఈ మధ్య నా ఒంటరి పఠనాల్లోకి ఇంకొకర్ని ఆహ్వానించాను. కొన్నిసార్లు ఆత్మీయుల సమక్షంలో అయినా సరే అదేపనిగా గడపాలంటే ఏదో ఒక సాకు కావాలి. ఇలా పుస్తకాలు చదివి వినిపించటమనే సాకు మాకు దొరికింది. వేరేవాళ్ల దగ్గర యిలా ఏ సెల్ఫ్‌కాన్షస్‌నెస్సూ లేకుండా చదవగలగడం నాకు కొత్త. మరొకరి సమక్షంలో కూడా మన ఏకాంతాన్ని మనం ఆనందించగలిగేంతటి చనువు కొందరితో ఎన్నేళ్ల సాంగత్యంలోనూ ఏర్పడదు, మరి కొందరితో ఇట్టే ఏర్పడిపోతుంది. అది నాకు ఈ పఠనాల్లో కొత్త మజానిస్తోంది. అంతేకాదు, నేను ఆనందిస్తూ శ్రోతనీ ఆనందింపజేస్తూ చదవాలి గనుక, రచనల్ని మరింత లోతుగా చదవగలుగుతున్నాను.

మనుషుల మధ్య లౌక్యం పునాదిగా ఏర్పడే సుహృద్భావ వాతావరణం నా మనసుకి వాంతి తెప్పిస్తుంది. అందులో నేనెపుడూ భాగం కాలేను. అలాంటి సందర్భాల్లో spoilsport పదవి వద్దన్నా నన్ను వరిస్తుంది. ఈ పదవి నిర్వహించడం నాకెంతగా అలవాటైపోయిందంటే, ఎపుడన్నా స్వచ్ఛమైన సుహృద్భావ వీచికలు నా వైపు వీచినా, నేను ముక్కు మూసుకుని అనుమానంగా చూస్తుంటాను. మనిషి అలాంటి కరడుగట్టిన గుల్లలోకి ముడుచుకుపోయి వుండటం ఎక్కువ కాలం కొనసాగితే, ఇక తనంతట తాను బయటకి రావడం చాలా కష్టం. గుల్ల బద్దలుకొట్టి మనల్ని బయటకి లాగటానికి ఎక్కువమంది అవసరమూ లేదు. సత్యం పునాదిగా ఒక్క స్నేహమే అయినా చాలు. 
షోపనార్ గురించి నీషే అంటాడు: "He was an out and out solitary; there was not one really congenial friend to comfort him -- and between one and none there gapes, as always between something and nothing, an infinity." గుల్ల నుంచి బయటకు లాగబడ్డాకా కూడా మనం స్నేహంగా మసలుకోగలిగేది ఆ ఒక్క వ్యక్తితోనే కావచ్చు. కానీ నీషే అన్నట్టు ఒక్క స్నేహితుడుండటానికీ, ఎవరూ లేకపోవడానికీ మధ్య అనంతమైన అంతరం నోరుతెరిచి ఆవలిస్తుంది. ప్రపంచమంతా పరుషత్వంతో పోట్లు పొడిచినా, ఒక్క స్నేహపు ఊరట దగ్గరుంటే పెద్ద బాధ వుండదు. ఈ చిన్ని స్నేహ వృత్తంలో ఒక ప్రపంచాన్నే పుట్టించుకోవచ్చు. అక్కడ నువ్వు నీలా మసలు కోవచ్చు. ఇంతకీ నేనీ పేరా ఎందుకు రాస్తున్నాను? ఏమీ లేదు. నేను నాలా వున్నపుడు చాలా ధీమాగా వుండగలను. చాలా ధీమాగా పుస్తకాల్ని పైకి చదవగలను. వాటిల్లో కథనాన్నే కాదు, మధ్యలో వున్న సంభాషణల్ని కూడా ఆయా పాత్రల గొంతులు అనుకరిస్తూ చదివేయగలను. అలాగని నాకిపుడే తెలిసింది. వచనాన్ని ఏకాంతంలో ఎవరికి వారే చదుకోవాలి తప్ప పైకి చదవకూడదంటాడు హెన్రీ గ్రీన్:

Prose is not be read aloud but to oneself alone at night, and it is not quick as poetry but rather a gathering web of insinuations… Prose should be a long intimacy between strangers with no direct appeal to what both may have known. It should slowly appeal to feelings unexpressed, it should in the end draw tears out of the stone…

కానీ మరొకరి సమక్షంలో కూడా మనతో మనం మసలుకోగలిగే ఏకాంతాన్ని అందుకోగలిగినపుడు, వచనాన్ని బయటకి చదివినా ప్రభావం పోదంటాను. ప్రస్తుతం తనకు నేను "వేయి పడగలు", తను నాకు "మ్యూజింగ్స్" చదివి వినిపించుకుంటున్నాం. "వేయిపడగలు" ఇద్దరం చదవలేదు. నేను ఇదివరకోసారి మొదలుపెట్టాను గానీ, బయటేవో ఒత్తిళ్ల వల్ల మధ్యలో పక్కనపెట్టేసాను. "మ్యూజింగ్స్" ఇదివరకూ చదివాను, మళ్ళీ చదవాలని చాన్నాళ్ళనుంచీ అనుకుంటున్నాను. రెండూ పెద్ద పుస్తకాలే కాబట్టి ఇవి చాన్నాళ్ళు కొనసాగే పఠనాలు. అందుకని మొనాటనీ రాకుండా మధ్య మధ్యలో కథలూ కవితలూ కూడా ఇరికిస్తున్నాం. ఈ పఠనాల్లో నేను రచనల వైనాల్ని మరింత తీక్ష్ణంగా గమనించగలుగుతున్నాను. ఏ రచయితకారచయితకుండే ప్రత్యేకమైన సాధనాల్ని గుర్తించగలుగుతున్నాను. వచనపు లయని మరింత ఆస్వాదించగలుగుతున్నాను.

విశ్వనాథ ఉపమానాలు ఒక క్రమ పద్ధతిని అనుసరించి సాగుతాయి. ఆయన తెచ్చే పోలికలన్నీ కథలో ఆయా సన్నివేశాలతో సన్నిహితమైన సంబంధాన్ని కలిగివుంటాయి. ఉదాహరణకు శివాలయంలో జరిగే ఒక సన్నివేశంలో, శుక్లాష్టమి వెన్నెలకు తెచ్చిన ఉపమానాలన్నీ శివుని సంబంధించినవే:
శుక్లాష్టమి వెన్నెల శివజటాటవీ నటన్మందాకినీ నవస్మేర వీచీ రామణీయకము వోలె, అంబికా ప్రసన్నాపాంగరేఖా ప్రసారము వోలె, విఘ్ననాయకుని ఏకదంత సితచ్ఛటా స్వచ్ఛతంబోలె శైవమహాత్మ్యమై విరిసెను.

దేవదాసి అనే పాత్రని వర్ణించేటపుడు, ఉపమానాలన్నీ విష్టువుకు సంబంధించినవే వుంటాయి:
దాని తెల్లని పలువరుస సుదర్శనాయుధపు టంచులవలె పదునుపెట్టి నట్లుండెను. దాని చెవులు శ్రీకారములై పాంచజన్యము లట్లుండెను. దాని కన్నులు కమలములు. దాని నాసిక కౌమోదకి. దాని భ్రూయుగము శార్ఙము ద్విథా విభక్తమైనట్లుండెను. దాని మూర్తి వికుంఠమై మనోజ్ఞమయ్యెను. [కౌమోదకి = విష్ణువు గద; శార్ఙము = విష్ణువు విల్లు]

చలం "మ్యూజింగ్స్"లో ఇదివరకూ ప్రపంచం మీద కోపాన్నే ఎక్కువ చూసాను. ఇపుడు నిష్పలమైన బక్క కోపం చివరకు ఎకసెక్కపు హాస్యంలోకి పరిణితి చెందిన వైనాన్నీ గమనించి ఆస్వాదించగలుగుతున్నాను.
చాలామంది సముద్రం వొడ్డుకి ఎందుకు వొస్తారంటే, మార్పు కోసం. ఆఫీసు నించీ, వంటిళ్ల నించీ, నలుగురూ వస్తే యెవరన్నా తెలిసినవారిని కలుసుకోవచ్చుననీ, చల్లగాలిలో విశ్రాంతిగా కబుర్లు చెప్పుకోవచ్చుననీ బైబిల్ని యింగ్లీషు కోసం చదివే వాళ్ల లాగు.
-- -- --
సౌందర్యం శృంగారం ఏమి వ్రాసినా, బూతూ, వ్యభిచారంగా పరిణమిస్తున్నాయి యీ క్షుద్ర విమర్శకులకి. ... పవిత్రంగా ఆధ్యాత్మికంగా, పరిణయంగా, అగ్నిసాక్షిగా, స్త్రీతో ఏం సంబంధం పెట్టుకుంటావు? విమర్శకుడా! చేతులూ, పెదిమలూ, తొడలూ పనిచెయ్యకుండా, ఎట్లా మోహిస్తావు, ప్రేమిస్తావు స్త్రీని. అదేదో ఆ రహస్యం కొంచెం చెబుదూ? నీరసంగా, ఏడుస్తో, తిడుతూ కళ్లు మూసుకుని, పాపకార్యం సాగిస్తున్నావా, మహామునీ! అనుభవించి పోతున్నారనా, ఆగ్రహం!

"
మ్యూజింగ్స్"లోని కవిత్వాన్ని కూడా ఇపుడు మరింత దగ్గరకి తీసుకోగలుగుతున్నాను:
ఈ పక్షి పాట యెట్లా వూపుతోందో ఈ పరిసరాల్ని! ఈ కుర్చీలు కూడా ఆ పాటకి ప్రకంపిస్తున్నాయి. ఏనాడో, ఏ బర్మా అరణ్యాల్లోనో, టేకు మానులై వున్న రోజుల్లో తమ శాఖల మీద కూచుని పాటలతో రంజింపజేసిన పక్షుల రుతాలు జ్ఞాపకం రావడం లేదు కదా యీ కుర్చీలకి?
-- -- --

ఆ గడ్డి మధ్య ఒక్కటే యెర్రని పువ్వు గాలిలో ఊగుతూ అలసిన నా దృష్టిని ఆపి పలకరించింది. అప్పుడే క్రొత్తగా భూమిని బద్దలు చేసుకుని, ముఖాన్నెత్తి, ఎండనీ, చెట్లనీ, చూసి పకపక నవ్వుతో తను కూడా బతుకులోకి దూకాననే సంతోషంతో గంతులు వేసి ఆడుతోంది. ఈ బిడ్డను చూసి చుట్టూ వున్న ముసలమ్మ చెట్లు బోసి చిగుళ్లు బైట పెట్టి ఆనందిస్తున్నాయి.
ఇలాంటివన్నీ నేను ఒక్కడ్నే కూర్చుని చదువుకున్నా గమనించేవాణ్ణేమో. కానీ మరో దగ్గరి మనిషితో కలిసి చదువుతున్నపుడు వట్టి గమనింపుతో ఆగిపోం, గమనించినవాటిని వారితో కలిసి సెలబ్రేట్ చేసుకోబుద్ధవుతుంది. అది పఠనానందం పక్కన శతసహస్రగుణకాన్ని తెచ్చి పెడుతుంది. 
. . .