February 11, 2014

లిఫ్ట్ ఇవ్వటం పుచ్చుకోవటం

ఇరవై రూపాయల పాల పాకెట్టుకి ఐదొందల కాయితం ఇచ్చినా కొట్టువాడు ఏమాత్రం సణగకుండా చిల్లర తిరిగిచ్చాడన్న కృతజ్ఞతతో, ఆ ఇచ్చిన చిల్లరలో ఓ పది నోటు అడ్డంగా చిరిగి ఉన్నా కిమ్మనకుండా పుచ్చుకునే రకం నేను. మాట్లాడుకునే విషయం మీద ఈ స్వభావం తాలూకు ప్రభావం ఉండొచ్చన్న ఉద్దేశంతో ఈ సంగతి చెప్పాల్సి వచ్చింది.

నేను హైదరాబాదులో ఆరేళ్ళ మట్టీ ఉంటున్నాను. నాకు బండి లేదు. ఒక్కోసారి చాలా నడవాలి. అలాగని అస్తమానం లిఫ్టు అడగను. ఒక్కోసారి నడకకి అనువైన మూడ్లో ఉంటాను. కానీ ఒక్కోసారి పని అర్జంటైనపుడు అడగక తప్పదు. అలా గత కొన్నేళ్లలో లిఫ్టులు అడిగీ అడిగీ నాకు కొంత తత్త్వం బోధపడింది:

1) లిఫ్టు అడిగేటప్పుడు మన దారిన మనం నడుస్తూ ఒకసారి అడిగిచూస్తే పోలా అనుకుని అడుగుతున్నట్టుగా కనపడకూడదు. ఏదో ఉబుసుపోక అడుగుతున్నామని బండి యజమాని అనుకునే అవకాశం ఉంది. కాబట్టి ఒక చోట ఆగి నిలబడి అడగాలి.

2) బండి మరీ దగ్గరకు వచ్చేశాకా చేయి ఎత్తడం వల్ల ప్రయోజనం లేదు. బండి యజమానికి లిఫ్టు ఇవ్వాలా వద్దా అని నిర్ణయించుకునేందుకు తగినంత సమయం ఇవ్వాలి.

3) లిఫ్టు అడిగేటప్పుడు బండి యజమానీ అతని బండీ ఒకే పదార్థమన్నట్టు కలిపేసి వేగ్ గా అటు చూడకూడదు. సూటిగా లిఫ్టు ఇచ్చేవాడి కళ్లల్లోకి చూస్తూ అడగాలి. (హెల్మెట్ ఉంటే అద్దం వైపు).

4) మన బాడీలాంగ్వేజ్ లో అవిశ్వాసం కనపడకూడదు. అతను మనల్ని దాటిపోయేవరకూ అతను లిఫ్టు ఇస్తాడని మనం ఎంతో నమ్మకంగా ఉన్నట్టు కనపడాలి.

5) ఎన్ని బళ్లు దాటిపోయాకా ఇక ప్రయత్నం మానేయవచ్చు అన్న దానికి ఖచ్చితమైన లెక్క లేదు. మన ఓపిక. ఒకసారి పదిమంది దాటిపోయాకా పదకొండో బండి మీదే మనక్కావాల్సిన దయగల ప్రభువు వస్తూండి ఉండొచ్చు.

6) అసలు లిఫ్టు అడిగేముందు మన వాటం ఎలా ఉందో ఒకసారి గమనించుకోవటం కూడా మంచిది. ఒంటరి రోడ్డు మీద రౌడీవాటంతో కనిపించేవాడికి లిఫ్టు ఎవరూ ఇవ్వరు.

7) సాధారణంగా పెళ్లయిన మగవాళ్లు లిఫ్టులు ఇవ్వరు. బ్రహ్మచారులే ఇస్తారు. ఇలా ఎందుకో నాకూ తెలియదు. సంసార సాగరపు క్రూరమైన నియమాల్లో పడ్డాకా, దయ అనేది ఒక పాషనబుల్ ప్రివిలేజ్ గా కనిపించటం మొదలౌతుందనుకుంటా.

8) మనం పదిమంది నిలబడి ఉన్న చోట నిలబడి అడిగితే చాలామంది బండి యజమానులు లిఫ్టు ఇవ్వటానికి ఇష్టపడరు.

9) రాత్రుళ్లు లిఫ్టు అడగటం కష్టమైన పని. హెడ్ లైట్ల వెలుగులో బండి మీద వస్తోంది ఆడా మగా అన్నది తెలియదు. నేను ఒక్కోసారి ఆడవాళ్ళను అడిగిన సందర్భాలూ ఉన్నాయి. వాళ్లు మనది పొరబాటు అనుకుంటారో, మరి వెధవ్వేషాలు వేస్తున్నాం అనుకుంటారో తెలియదు గానీ, ఎప్పుడూ ఆపరు. అలా ఒక అమ్మాయి లిఫ్టు ఇవ్వటం కోసం బండి ఆపటమనేది నా పగటి కలల్లో మాత్రమే జరుగుతుంది. అలా లిఫ్టు ఇచ్చే అమ్మాయి ఈ భరత ఖండంలో తారసపడటం కష్టం. దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు కూడా. ఎందుకంటే ఎవడైనా అలా పొరబాట్న అడిగినా ఒకవేళ నిజంగా ఆ అమ్మాయి ఆపితే, అప్పుడు ఆపింది అమ్మాయి అని గ్రహించి కూడా ఎవడైనా లిఫ్టు తీసుకోవటానికి సిద్ధపడ్డాడంటే, వాడు ఏదో ప్రాణాంతకమైన ఎమర్జన్సీలో ఐనా ఉండి ఉండాలి, లేదా సింపుల్ గా వాడి ఇంటెన్షన్ వెధవ్వేషాలు వేయటమే ఐనా అయి ఉండాలి. ఏమో, మళ్లా ఆలోచిస్తే ఇలా తీర్మానించడం తప్పేమో అనిపిస్తుంది. ఒక అమ్మాయి లిఫ్టు ఇవ్వటానికి బండి ఆపినా, సారీ చెప్పి బండెక్కని వాడు మర్యాదస్తుడే అనుకోనక్కర్లేదు, వట్టి పప్పుసుద్ద అని కూడా అనుకోవచ్చు. ఏదేమైనా ఈ విషయమై ఇన్ని మాటలు అనవసరం, మగాడికి లిఫ్టు ఇద్దామని బండి ఆపే అమ్మాయిలు ఎలాగూ ఉండరు.

10) రాత్రుళ్లు లిఫ్టు అడగటంలో ఇంకో ఇబ్బంది కూడా వుంది. బండి మీద వస్తోంది ఒకరేనా, లేక ఇద్దరా అన్నది తెలియదు. ఇలా నేను చాలాసార్లు భంగపడ్డాను. ఇద్దరు వున్నారని గ్రహించి చేయి దించేసేలోగానే వాళ్లు వెళ్తూ వెళ్తూ ఏదోక సెటైరు వేయక మానరు. “ఇంకెక్కడ ఎక్కుతావు నాయనా, నెత్తి మీదా” లాంటివి. ఒకసారి మాత్రం చిత్రం జరిగింది. అప్పటికే మసక చీకట్లు అలుముకున్నాయి, వాన పడుతోంది. నేను సైబర్ టవర్స్ దగ్గర అనుకుంటా నిలబడి ఉన్నాను. హెడ్ లైట్ల వెలుగు వల్ల బండి మీద ఇద్దరున్నారన్న సంగతి తెలియకుండానే చేయి చాపాను. అయినా ఆపారు. ఇద్దరు స్నేహితులూ ఎదరకి సర్దుకు కూచుని నన్ను మూడోవాడిగా వెనక ఎక్కించుకుని తీసుకుపోయారు. ఇది నా లిఫ్టుల చరిత్రలో ఒక వింత అనుభవం.

అలాగే ఇంకోటి కూడా ఉంది. వింత అనుభవం అని కాదు గానీ, నాకు గుర్తుండిపోయింది. ఒకసారి ఎర్రగడ్డ నుంచి సనత్ నగర్ వైపు నడుస్తున్నాను రాత్రి. అది బతుకుతెరువుకి హైదరాబాదు వచ్చిన కొత్త. జేబులో చిల్లిగవ్వ లేదు. ఒక ఆటో వాడు పక్కన స్లో జేసి “వస్తావాన్నా” అని అడిగాడు. డబ్బులుంటే ఎక్కే వాణ్ణే. లేవు కాబట్టి రానన్నాను. అతను ఊరుకోలేదు, “ఎందుకు రావు అటేగా పోతుంది” అన్నాడు. విసుగొచ్చి “పైసల్లేవన్నా” అని చెప్పేశా. అతను ఫర్లేదు ఎక్కమని ఏం పుచ్చుకోకుండానే సనత్ నగర్ దాకా దింపాడు. ఆటోవాళ్లు లిఫ్టు ఇవ్వటం అరుదైన సంగతేగా మరి. అది కూడా కాదేమో, మన పట్ల దయ ఎవరు చూపించినా అది ఎంత చిన్నదైనా గుర్తుండిపోతుంది.

అన్నింటికన్నా బాగా గుర్తుండిపోయిన ఇంకో లిఫ్టు అనుభవం మొన్న 2011 లో ఇండియా వరల్డ్‌కప్పు గెలిచిన రోజు రాత్రి జరిగింది. ఆ రోజు ఆఫీసులోనే ఇండియా శ్రీలంక మధ్య ఫైనల్స్ చూసి, లేటుగా గదికి బయల్దేరా. బస్సు కోసం పెద్దమ్మగుడి దాకా నడిచాను. రోడ్లంతా గోల గోలగా ఉన్నాయి. వాతావరణం డిసెంబరు థర్టీఫస్ట్ నైటుకి బాబులా ఉంది. కుర్రాళ్లు కార్ల కిటికీ లోంచి తలలూ మొండేలూ బయటపెట్టి చేతుల్తో జెండాలు ఊపుతూ అరుస్తున్నారు, బైకు ఒకడు నడుపుతుంటే ఇంకొకడు వెనక కాళ్ల మీద నిలబడి విజిల్స్ వేస్తున్నారు. ఇలాంటప్పుడు జనం మధ్య సులభంగా ఒక సుహృద్భావం వచ్చేస్తుంది కదా, మర్నాడు పొద్దున్న లేవగానే మర్చిపోయే తరహాది. మరి ఆ కుర్రాడు మామూలుగా అడిగితే లిప్ట్ ఇచ్చేవాడో లేదో, ఇప్పుడు ప్రపంచ కప్ గెలుపు ప్రపంచపు మంచితనం మీద నమ్మకాన్ని కలిగించి, అది ప్రతిగా అతనిలోని మంచితనాన్నీ మేల్కొలిపిందనుకుంటా, నేను చేయి చాపి ఇలా బొటన వేలు ఎత్తానో లేదో వెంటనే బండి బ్రేకు వేసి ఆపాడు. నేను ఎక్కగానే బండి సర్రుమని దూసుకుపోయింది. అతను మధ్య మధ్యలో బండి చేతులొదిలేసి నోటి చుట్టూ చేతుల్తో గూడు కట్టి అరుస్తున్నాడు, తన బండిని అరుస్తూ క్రాస్ చేసి వెళ్లేవాళ్లతో పాటూ తానూ గొంతు నరాలు తెగేలా అరుస్తున్నాడు. దారిలో ఎవరు హై ఫైవ్ ఇచ్చినా బండి స్లో చేసి మరీ తిరిగి వాళ్ల చేతులు చరుస్తున్నాడు. నేను మరీ క్రికెట్ పిచ్చోణ్ణి కాదు గానీ, ఇండియా గెలవటం అనేది నాలో ఏదో మూల దేశభక్తి తాలూకు అవశేషాల్ని ఉత్తేజితం చేసిందనుకుంటా, నాకూ సంతోషంగానే ఉంది. కానీ నాది మరీ ఇలా ఆనందంతో గంగవెర్రులెత్తే స్వభావం కాదు. ఎప్పుడన్నా తాగితే తప్ప. ఐతే ఎంతైనా ఒకే బండి మీదున్నాం కదా ఇద్దరం. అతను అలా ఓపక్క ఆనందంతో బద్దలయిపోతూ ఉంటే నేను ఊరికే మౌనంగా ఉంటే ఏం బాగుంటుంది. అతని ఆనందం ఎబ్బెట్టుగా ఫీలవ్వచ్చు. అందుకే నేనూ గొంతు నొప్పి పుట్టేలా అరవటం మొదలుపెట్టాను. అక్కడ నేను నా స్వభావాన్ని విడిచిపెట్టి మరోలా నటిస్తున్నానన్న సంగతి గమనించటానికి కూడా ఎవరూ లేరు కదా. కానీ ఏ మాటకామాటే చెప్పుకోవాలి, అలా అరుస్తూ సమూహాన్ని కదిలించిన సంబరంలో నేనూ పాలుపంచుకోవటం బాగా అనిపించింది. అయినా మొహమాటానికి పోయినట్టే కదా.

ఇలా లిఫ్టు ఎక్కినప్పుడు చాలాసార్లు జరుగుతుంది. ఒక మనిషి మనకు లిఫ్టిచ్చాడంటే అతను ఏదీ ఆశించకుండా ఉచితంగా ఉత్తపుణ్యానికి మన పట్ల దయగా ఉండటమే. దాన్ని టేకిట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోవచ్చని మొదట్లో తెలిసేది కాదు. దాంతో లిఫ్టు ఎక్కిన కాసేపటి దాకా కనీస స్థాయి హ్యూమన్ ఇంటరాక్షన్ అయినా మా ఇద్దరి మధ్యా ఎస్టాబ్లిష్ చేసుకోవటానికి ప్రయత్నించేవాణ్ణి. వాళ్లు ఎక్కడి దాకా వెళ్తున్నారో అడిగేవాణ్ణి. వాతావరణం గురించో, ట్రాఫిక్ గురించో వ్యాఖ్యానించేవాణ్ణి. క్లుప్తంగా చెప్పాలంటే బండియజమానిని ఎంటర్టయిన్ చేయటానికి చేతనైనంత ప్రయత్నించేవాణ్ణి.

కానీ క్రమేణా అప్పుడప్పుడూ నా చేతుల్లోకీ బండి వచ్చి, నేనూ అప్పుడప్పుడూ లిఫ్టులివ్వటం మొదలుపెట్టినప్పటి నుంచీ (బండి యజమానిగా నాణేనికి రెండో వైపు నేను నిలబడటం కుదిరినప్పణ్ణించీ), అలాంటి అనుబంధమేదీ వాళ్లు కోరుకోరని అర్థమైంది. మనల్ని ఎక్కించుకోగానే వాళ్ల మనసుల్లో ఒక మంచి పని చేశామనే తృప్తి కలుగుతుంది. అదే మనం వాళ్లకి ఇవ్వగలిగేది, అదే వాళ్లు కోరుకునేది. అందుకే “థాంక్స్ అన్నా!” తో సరిపెడుతున్నాను. అందులోనే వీలైనంత కృతజ్ఞత దట్టించటానికి ప్రయత్నిస్తున్నాను.

సరే, ఇక నా చేతుల్లో బండి ఉన్నప్పుడు నేను లిఫ్టులు ఇచ్చే పద్ధతి గురించి చెప్తాను. నిజం చెప్పాలంటే, పైన అన్ని పాయింట్లు రాశాను కదా, ఆ పాయింట్లేవీ నేను లిఫ్టు ఇవ్వబోయే వ్యక్తి విషయంలో పూర్తవుతున్నాయా లేదా అన్నది ఎప్పుడూ ఆలోచించను. ఆ క్షణం ఏమనిపిస్తుందో అదే పాత్ర వహిస్తుందేమో అనిపిస్తుంది. నేను లిఫ్టు ఇచ్చే సందర్భాల్ని నెమరు వేసుకుంటే ఈ కామన్ పాయింట్లు తట్టాయి:

1) లిఫ్టు ఇవ్వాలా వద్దా అన్నది నేను వెళ్తున్న పని అర్జెన్సీని బట్టి ఉంటుది. తీరుబడిగా పోతున్నప్పుడు ఎవరు అడిగినా లిఫ్టు ఇవ్వటానికి సంసిద్ధంగానే ఉంటాను.

2) కొన్ని ముఖాలు ఊరికే ఎందుకో మనకు నచ్చవు. అలాంటి ముఖాలకు ఇవ్వను. వాళ్లు సాధారణంగా నా సమవయస్కులై ఉంటారు. (లిఫ్టు అడిగేటప్పుడు నా ముఖం అలాంటి ముఖాల జాబితాలోకి వస్తుందేమో ఎప్పుడూ ఆలోచించలేదు, వస్తుందేమో).

3) ఎవర్నన్నా లిఫ్టు ఎక్కించుకున్నాకా, నా బండి నిర్జన ప్రదేశాల్లో పోతున్నప్పుడు హఠాత్తుగా ఆ వెనకనున్నవాడు నా పీక మీద కత్తి పెట్టి, బండాపించి, “తియ్యరా పర్సు” అంటాడేమో అని ఒక్కసారైనా భయపడతాను.

4) ఎవరి కన్నా లిఫ్టు ఇచ్చినపుడు బండి మామూలు కన్నా స్పీడుగా పోనిస్తాను – అతను ఏదో అర్జంటు పని మీదే లిఫ్టు అడిగుంటాడు కదా, స్లోగా తీసుకెళ్తే ఎలాగా అని.

సరే ఇక నేను లిఫ్టు ఇచ్చిన సందర్భాల్లో బాగా గుర్తుండిపోయినవి చెప్పమంటే మొన్న వారమే ఇచ్చిన ఒక లిఫ్టు గుర్తొస్తుంది.

జూబ్లీహిల్స్ చెక్పోస్టు దగ్గర పెద్దమ్మ గుడికి వెళ్లే మలుపు తిప్పీ తిప్పగానే ఒక ముసలాయన (అంటే మరీ వంగిపోయిన ముసలాయన కాదు, అరవయ్యేళ్లుంటాయేమో) చేయి ఊపాడు. ఎక్కించుకున్నాను. ఆయన ఫింఛనాఫీసు నుంచి వస్తున్నాడు. అక్కడ ఏదో ప్రభుత్వ పథకం ప్రకారం ఈయనకు నెలకు రెండొందలు రావాలి. కానీ ప్రభుత్వ రికార్డుల్లో ఈయన ఆల్రెడీ చచ్చిపోయాడని రాశారట. అందుకని అక్కడ దెబ్బలాడి, ఏదో అల్టిమేటం ఇచ్చి వస్తున్నాడు. మొత్తం గవర్నమెంటు మీదా వ్యవస్థ మీదా పగతో ఉన్నాడు. బండెక్కగానే తనను ఎక్కించుకున్నందుకు కాసేపటి వరకూ నన్ను చాలా పొగిడాడు. ఆ తర్వాత తన బాధ చెప్పుకున్నాడు. ఆయనది నెల్లూరు, రిటైరయ్యాడు, ఇప్పుడు సిటీలో ఏదో అపార్టుమెంటు ముందు కాపలా పని చేస్తున్నాడు. ఫింఛనాఫీసు వాళ్లని దారంతా తిడుతూనే ఉన్నాడు. ఆయన ఉద్యోగం చేసింది తమిళనాడులో. అక్కడి ప్రభుత్వానికీ ఇక్కడి ప్రభుత్వానికీ మధ్య తేడా ఎత్తి చూపుతున్నాడు. కాంగ్రెస్ మళ్లీ రాదంటున్నాడు. మధ్య మధ్యలో నేను కాస్త స్పీడు పెంచినపుడల్లా, “నెమ్మదిగా పోదాం బాబూ కంగారే వుంది” అంటూ నన్ను నియంత్రిస్తున్నాడు, మళ్లీ “థాంక్స్ బాబూ మీరు వచ్చారు కాబట్టి ఇలా వెళిపోతున్నాను” అని తెగ ఎగదోస్తున్నాడు. ఇలా శిల్పారామం దాటే దాకా అతను ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన జీవిత పరిస్థితులన్నీ టూకీగా ఏకరువు పెట్టేశాడు. ఆయన కుంటి తమ్ముడూ, ఆ తమ్ముడీ మధ్య పెట్టుకున్న బజ్జీల బండీ వగైరా. నెల్లూరి యాసలో మాట్లాడుతున్నాడు, వయసైపోయినా ఇంకా కుర్రతనం వదలని మనసుతో అభాసుపాలయ్యే ముసలాడు. చిన్న లిఫ్టు ఇచ్చినందుకు అంత ఎందుకు హడావిడి చేస్తున్నాడని నాకు మధ్యలో పీకుతూనే ఉంది. ఊరికే వచ్చి కాసేపు దగ్గరగా మాట్లాడి ఒక చిన్న మొహమాటపు అనుబంధం ఎస్టాబ్లిష్ అయ్యేలా చేసి, వెంటనే ఫలానా ఊరు వెళ్లాలి, లేదా ఫలానా అవసరం ఉందీ అని డబ్బులడిగి కాదనలేని పరిస్థితిలోకి తెచ్చి ఇబ్బంది పెడ్తారు కదా కొంతమంది… ఈయన ఆ కోవకు చెందడు కదా అని అనిపించింది. కానీ లిఫ్టు ఎక్కాకా సైలెంటుగా దిగిపోయేవాళ్లనే చూశాను గానీ, ఇలా ఇంత మాట్లాడేవాళ్లు తారసపడలేదు. అదొక్కటీ సరదాగా అనిపించింది. ఇంతా అయ్యాకా అతను చివరికి డబ్బులడిగి ఈ అనుభవాన్ని కల్తీ చేస్తాడేమో అని చిన్న జంకు. కానీ అతని దృష్టిలో కల్తీ చేయటానికి ఇదో పెద్ద అనుబంధం కాదేమో. ఇలాంటి పాసింగ్ అనుభవాల్ని మళ్లీ గుర్తు చేసుకునేవిగా భావించే నాలాంటి ఏబ్రాసి స్థితిలో లేడేమో. శిల్పారామం తర్వాత ఏదో బిల్డింగ్ కాంప్లెక్సు దగ్గర ఆపమన్నాడు. దిగాకా నేను వీడ్కోలు సూచకంగా నవ్వాను. నేను ఎక్కడ గేరు మార్చేస్తానో అన్న తొందరలో ఆయన వెంటనే, “రెండు గంటలు ముందే వచ్చేశాను సార్, టీ తాగటానికి ఓ పది రూపాయలుంటే ఇస్తారా” అనేశాడు. ఇప్పటిదాకా ఏర్పడిన అనుబంధపు ప్రాతిపదికన నేను ఆయనకి పది రూపాయలు ఇవ్వటం పెద్ద విషయం కాదు. కానీ అతని వైపు నుంచి ఈ అనుబంధాన్ని ప్రతిపాదించటం వెనుక కారణమే చివర్లో ఈ పదిరూపాయలు అడగటం అయినపుడు, అంటే నా వైపు నుంచి ఇది ఒక చిన్న అనుబంధం అయి, అతని వైపు నుంచి ఒక పథకం మాత్రమే అయినపుడు, నేను ఆ పది రూపాయలు ఇస్తే అతని పథకాన్ని గెలిపించినట్టు, ఆ తర్వాత అతను ఆ పది రూపాయలు జేబులో పెట్టుకుంటూ “బుట్టలో పడ్డాడు వెధవ” అనుకుంటే…? అది నాకు నచ్చలేదు, కాబట్టి “ఇవ్వను” అని చెప్పి బండి స్టార్ట్ చేసేశాను. కానీ కాస్త దూరం పోగానే “ఇవ్వను” అన్నందుకు ఏమనుకునుంటాడో అన్న ఊహ వచ్చింది. ఏముంది, రెండు గంటలు తొందరగా వెళ్లినందుకు ఎక్కడో అక్కడ కూర్చుని వెయిట్ చేస్తాడు, బహుశా బస్సుల బాధ లేకుండా తొందరగా సునాయాసంగా రాగలిగినందుకు ఆనందిస్తాడు, కానీ ఆనందిస్తూ టీ తాగటానికి డబ్బులు మాత్రం ఉండవు. బహుశా అలా కూర్చుని టీ తాగుతున్నప్పుడు ఇది అతనికి కూడా ఒక చిన్న అనుబంధంగానే అనిపించేదేమో. అనిపించకపోతే ఏం చేసేది లేదు, కానీ అనిపించే అవకాశం కూడా లేకుండా చేశాన్నేను. పెద్ద రిగ్రెట్ అని కాదు, ఇప్పుడు ఇదంతా అందుకే రాస్తున్నా అని నాటకం ఆడను. నేను అంత సున్నితమైన వాణ్ణి కాదు. కానీ, నేను మాత్రం ఆ పది రూపాయలు ఇచ్చేస్తే బాగుండేది.

రచనలో గొప్ప విషయమేంటంటే, రాస్తూ పోతుంటే కొన్ని అనుకోనివి హఠాత్తుగా మనల్ని పలకరించి నిలవరిస్తాయి. ఇప్పుడు ఇదంతా రాస్తుంటే, హఠాత్తుగా, అస్సలు సంబంధమే లేకుండా ఒక జ్ఞాపకం నా ముందుకు వచ్చి నిల్చుంది.

అప్పుడు ఇంటరు చదువుతున్నాను. ఎవరో ప్రైవేటు కాలేజీలో పాఠాలు చెప్పే మాస్టారు సాయంత్రం మాకు వాళ్ల మేడ మీద ట్యూషన్లు చెప్పేవారు. ఆ ట్యూషన్ కి అన్ని తరగతుల వాళ్లూ వచ్చేవారు. ఒక్కో గంట ఒక్కో క్లాసుకి చెప్పుకుంటూ పోయేవారు. చీకటి పడే వరకూ అన్ని తరగతులూ ఆ విశాలమైన మేడ మీద చెల్లా చెదురుగా జట్లు జట్లుగా విడిపోయి ఉండేవి. చీకటి పడ్డాకా మాత్రం ఆ మేడ మధ్యన ఉన్న చిన్న షెడ్డులోనే లైటు ఉండేది కాబట్టి అందరూ అక్కడ గుమికూడేవారు. ఒక రోజు రాత్రి బాగా వర్షం పడుతోంది. ట్యూషన్ మాత్రం అయిపోయింది. పిల్లలెప్పుడూ తడవటానికి జడవరు కదా. చాలామంది వెళిపోతున్నారు. నేను నా గొడుగు తీసుకుని మేడ దిగి గేటు తెరుచుకుని బయట రోడ్డు మీద వడి వడిగా అడుగులేసుకుంటూ పోతున్నాను. ఉన్నట్టుండి హఠాత్తుగా ఒక ఆరో తరగతి పిల్ల అనుకుంటా, “అన్నయ్యా ఆడ దాకా రావద్దా” అంటూ చొరవగా నా గొడుగులోకి దూరేసింది. చిన్న గౌను వేసుకుంది, పుస్తకాలు ఒబ్బిడిగా హత్తుకుంది. తర్వాత మేం ఒక సందు అంతా కలిసే నడిచాం. ఆ సందు అంతా వర్షం నీరు చీలమండల దాకా పారుతోంది. ఒక గొడుగు కింద నడిచాకా పరిచయాలు తప్పవు కదా. ఆ ఆరిందా పిల్ల ఏం మాట్లాడిందో గుర్తు లేదు, నేను ఏం మాట్లాడేనో కూడా గుర్తు లేదు. మా ఇల్లే ముందొచ్చింది, ఆ పిల్ల తర్వాత వర్షంలో తడుస్తూ వెళిపోయింది. ఈ జ్ఞాపకం నేను ఈ లిఫ్టు పురాణం గురించి రాస్తుండగా గుర్తుకు రావటం చిత్రం కదా! మైండ్ వర్క్స్ ఇన్ మిస్టీరియస్ వేస్. ఒక్కోసారి దాన్ని నమ్మాలి. బహుశా నాకు గుర్తుండిపోయిన బెస్ట్ లిఫ్టు ఇదే అనుకుంటా.

*

1 comment:

  1. మొదట లిఫ్టు అడగటానికీ ఇవ్వటానికీ చెప్పిన పాయింట్లతో సీరియస్సుగా నవ్వించారు:-)
    అతనికి మీరు పది రూపాయలు ఇచ్చుంతేనే బాగుండేది.మీ సిన్సియారిటీ బాగుంది__/\__
    హఠాత్తుగా వూదిపడిన మీ చిన్నప్పటి గొడుగు లిఫ్టు కూడా బాగుంది - కాస్తంత తడిగా!

    ReplyDelete