February 8, 2014

'తీర్పు' - ఫ్రాంజ్ కాఫ్కా

(కాఫ్కా 'ది జడ్జిమెంట్' కు నా అనువాదం)


కాఫ్కా డైరీలోని ఒక స్కెచ్

వసంతకాలంలో ఒక ఆదివారం ఉదయం. జార్జి బెండెమన్ అనే యువ వ్యాపారి పైఅంతస్తులో ఉన్న తన గదిలో కూర్చుని ఉన్నాడు. ఆ ఇల్లు నది ఒడ్డున వరుసగా బారు తీరిన ఇళ్ళలో ఒకటి. అవన్నీ పొట్టిగా నాసిరకమైన కట్టుబడితో ఉన్నాయి. చూట్టానికి ఎత్తులోనూ రంగులోనూ ఒకేలా కనిపిస్తున్నాయి. అతను ఇప్పుడే విదేశాల్లో ఉంటున్న స్నేహితునికి ఉత్తరం రాయటం పూర్తి చేశాడు, పరధ్యాసగా దాన్ని మడిచి కవర్లో పెట్టాడు, మోచేతుల్ని రాతబల్ల మీద ఆనించి కిటికీ లోంచి బయట నది వైపూ, వంతెన వైపూ, దూరంగా ఆవలి ఒడ్డున నున్నని పచ్చదనంతో కనిపిస్తున్న కొండల వైపూ చూస్తూ కూచున్నాడు.

అతను స్నేహితుని గురించి ఆలోచిస్తున్నాడు. ఈ స్నేహితుడు స్వదేశంలో తనకు సరైన అవకాశాల్లేవన్న అసంతృప్తితో, కొన్నేళ్ళ క్రితం రష్యాకి వలసపోయి, అక్కడ సెయింట్ పీటర్సుబర్గులో వ్యాపారం మొదలుపెట్టాడు. ఆ వ్యాపారం మొదట్లో మంచి జోరుగానే సాగింది కానీ ఈమధ్య కొన్నాళ్ళుగా అంతకంతకూ నష్టాల్లో కూరుకుపోతోంది, ఈ మధ్య స్వదేశానికి వచ్చినపుడల్లా అతను ఈ విషయమై చాలా వాపోతున్నాడు (అసలు అతను రావటం కూడా రాన్రానూ అరుదైపోతోంది). పరాయి దేశంలో తన్ను తాను నిష్పలంగా అలవగొట్టుకుంటున్నాడు. గెడ్డం మాసిపోయింది, చర్మం ఎంత పసుపుగా పాలిపోయిందంటే అది నిద్రాణంగా ఉన్న ఏదో వ్యాధి లక్షణమేమో అనిపిస్తోంది. తనలాగే ఈ దేశం నుంచి వెళ్ళి అక్కడ స్థిరపడిన తోటి ప్రవాసులతో అతనికి పెద్దగా పరిచయాల్లేవు, స్థానిక రష్యన్ కుటుంబాలతో సంబంధాలూ అంతంత మాత్రమే, ఇక బ్రహ్మచారిగా మిగిలిపోక తప్పని ఖర్మకు తల వంచుతున్నాడు.

అలాంటి మనిషికి ఉత్తరం ఏమని రాయాలి, అతను దారి తప్పాడని తెలుస్తూనే ఉంది, అతని గురించి బాధపడటం తప్ప చేయగలిగిన సాయమేదీ లేదు. సలహా ఇవ్వాలంటే ఇవ్వచ్చు. అతణ్ణి ఇంటికొచ్చేయమనీ, ఇక్కడే నిలదొక్కుకొమ్మనీ, పాత స్నేహితుల్ని కలేసుకొమ్మనీ, వాళ్ళ ఆసరా తీసుకొమ్మనీ చెప్పచ్చు. కానీ అతనికి వేరేలా అర్థం అవ్వొచ్చు. ఎంత మెత్తగా చెప్తే అంత లోతుగానూ గాయపడే అవకాశం ఉంది. ఇప్పటి దాకా అతని ప్రయత్నాలన్నీ వృథా అనీ, ఇక అతను ఓటమి ఒప్పుకుని ఇంటికి తిరిగి రావాలనీ, అందరి అంచనా కట్టే చూపులకూ గురిగా మిగలాలనీ, బతకనేర్చిన తోటి స్నేహితులందరితో పోలిస్తే అతనింకా ఏళ్ళొచ్చిన పసివాడేననీ, సొంత ఊళ్ళోనే నెగ్గుకురాగలిగిన స్నేహితుల్ని చూసి ఇకనైనా నేర్చుకోవాలనీ... ఇలాంటి అర్థాలేవో స్ఫురించే అవకాశం ఉంది. పోనీ అతణ్ణి ఇంత బాధపెట్టినందుకు జరిగే మంచేమన్నా ఉంటుందా అంటే అదీ ఖాయంగా చెప్పడానికి లేదు. అసలు అతణ్ణి ఇక్కడికి రప్పించటం సాధ్యమేనా అన్నది మొదటి అనుమానం – ఆ మధ్య ఎపుడో అతనే అన్నాడు, స్వదేశంలోని వ్యాపార లావాదేవీల్తో తనకు పూర్తిగా పరిచయం తప్పిపోయిందని – రప్పించలేకపోతే, అతను ఎప్పటిలాగే పరాయిదేశంలో ప్రవాసిగానే మిగిలిపోతాడు, అది చాలదన్నట్టు ఈ సలహాకి చిర్రెత్తి ఇక్కడి స్నేహితులకు కూడా దూరమైపోయే అవకాశం ఉంది. ఒకవేళ సలహా పాటించి వచ్చినా, తర్వాత ఇక్కడ కుదురుకోలేకపోతే, ఎవరితోనూ కలవలేక అలాగని ఒక్కడూ మనలేక, చివరికి తనదని చెప్పుకునే దేశం గానీ, తనవాళ్ళని చెప్పుకునే స్నేహితులు గానీ లేని వాడై పోతాడు, అంతకన్నా ఎలా ఉన్నవాడు అలా ఆ పరాయిదేశంలోనే ఉండిపోవటమే నయం. ఇదంతా లెక్కలోకి తీసుకుని ఆలోచిస్తే, ఒకవేళ అతను ఇక్కడకు వచ్చినా ఏ మాత్రం నెగ్గుకురాగలడూ అన్నదీ అనుమానమే.

ఇలాంటి కారణాల వల్ల, ఓమాదిరి పరిచయస్తుడితో కూడా అలవోకగా పంచుకోగలిగే ఇక్కడి ముఖ్యమైన విశేషాలన్నీ, అతనితో ఉత్తరాల్లో పంచుకోవటానికి మాత్రం కష్టమనిపించేది. అతను ఆఖరుసారి ఇక్కడకు వచ్చి మూడేళ్ళ పైనే అవుతోంది, రష్యాలోని రాజకీయ పరిస్థితి వల్ల రాలేకపోయానంటూ తలాతోకాలేని కారణమొకటి చెప్పాడు, ఓపక్క వేలాదిమంది రష్యన్లు పరాయి దేశాలు వలసపోవటానికి వీలు కల్పిస్తున్న అక్కడి రాజకీయపరిస్థితి, ఈ చిన్న వ్యాపారి కొన్నాళ్ళపాటు సొంతదేశం వెళ్ళిరావటానికి ఎందుకు అనుమతించదో అర్థం కాలేదు. ఈ మూడేళ్ళలో ఇటు జార్జి జీవితంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. రెండేళ్ళ క్రితం అతని తల్లి చనిపోయింది, అప్పట్నించీ ఇంట్లో అతనూ అతని తండ్రీ ఇద్దరే ఉంటున్నారు, ఈ విషయం స్నేహితునికి రాశాడు, బదులుగా అతని నుంచి వచ్చిన సానుభూతి ఉత్తరం ఎంత మొక్కుబడిగా ఉందంటే, ఇలాంటి సంఘటనల్లోని విషాదం దూర దేశాల్లో ఆకళింపుకు రాదేమో అనిపించింది. తల్లి మరణం తర్వాత జార్జి వ్యాపారం మీదా, మిగతా విషయాల మీదా, బాగా శ్రద్ధ పెట్టాడు.

బహుశా, తల్లి బతికున్నంతకాలం, తండ్రి వ్యాపారమంతా తన చెప్పుచేతల్లోనే నడవాలని పట్టుబట్టడం వల్లనో (దీని వల్ల జార్జి సొంతంగా ఏ నిర్ణయమూ తీసుకునే వీల్లేకపోయేది); లేక, తల్లి చనిపోయాకా, తండ్రి ఏదో నామమాత్రంగా తప్ప ఇదివరకట్లా కలగజేసుకోకపోవటం వల్లనో; లేదంటే మరి కేవలం అదృష్టం వల్లనో – ఈ చివరిదే అసలు కారణమై ఉంటుంది – ఏదేమైనా, ఈ రెండేళ్ళలోనూ వ్యాపారం అనుకోని రీతిలో వృద్ధి చెందింది, సిబ్బందిని రెట్టింపు చేయాల్సొచ్చింది, రాబడి ఐదు రెట్లు పైనే పెరిగింది; ఇంకా ముందుకు పోబోతోంది అనటంలో సందేహం లేదు.
స్నేహితునికి మాత్రం ఈ వృద్ధి గురించి ఏమీ తెలియదు. అందుకే అతను ఇదివరకూ చాలాసార్లు జార్జిని రష్యా వచ్చేయమని నచ్చచెప్పటానికి ప్రయత్నించాడు (బహుశా ఆ సానుభూతి ఉత్తరంలో చివరిసారి కాబోలు), జార్జి నడిపే వ్యాపారాల్లాంటి వాటికి సెయింట్ పీటర్సుబర్గులో మంచి గిరాకీ ఉందని చెప్పుకొచ్చాడు. అది ఋజువు చేయటానికి పంపిన రాబడి లెక్కలు జార్జి ప్రస్తుత వ్యాపార రాబడితో పోలిస్తే పూచికపుల్లతో సమానం. అయినా అతను తన వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతుందని స్నేహితునికి ఎందుకో అపుడు చెప్పలేకపోయాడు, ఇన్నాళ్ళ తర్వాత ఇపుడు చెప్తే వింతగా ఉండచ్చు.

అందుకే జార్జి తన స్నేహితునికి రాసే ఉత్తరాల్లో అప్రధానమైన సంగతుల గురించే రాస్తాడు, ఇలా స్తబ్ధుగా సాగే ఆదివారాల్లో తీరుబాటుగా ఆలోచిస్తున్నపుడు ఓ వరసావాయీ లేకుండా మనసులోంచి పైకి తేలే సంగతులవి. అక్కడ స్నేహితుడు తన ఆత్మసంతృప్తి కోసం సొంత ఊరి గురించి ఎలాంటి ఊహలు నిర్మించుకున్నాడో వాటిని భంగపరచని రీతిలో ఉత్తరాలు రాయాలి. అదీ జార్జి ఉద్దేశం. ఒకసారి అలాగే, ఏదో ఒకటి రాయాలి గనక, ఊళ్ళో ఎవరో కోన్‌కిస్కా అబ్బాయికీ అమ్మాయికీ జరిగిన ఎంగేజ్మెంటు గురించి రాస్తే, స్నేహితుడు ఆ విషయం గురించి అనుకోని ఆసక్తి చూపించడం కూడా మొదలుపెట్టాడు.

అయినా గ్రెగర్ ఇలా అప్రధానమైన సంగతులే రాస్తూ వచ్చాడు గానీ, ఒక నెల క్రితం స్వయంగా తనకే ఫ్రీడా బ్రాండెన్‌ఫెల్డ్ అనే సంపన్న కుటుంబపు అమ్మాయితో ఎంగేజ్మెంటు అయిందన్న సంగతి మాత్రం రాయలేకపోయాడు. అతను అప్పుడప్పుడూ కాబోయే భార్యతో ఈ స్నేహితుని గురించీ, తామిద్దరి ఉత్తరప్రత్యుత్తరాల్లోనూ ఇటీవల నెలకొన్న చిత్రమైన పరిస్థితి గురించీ చెప్పేవాడు. “అయితే అతను మన పెళ్ళికి రాడన్నమాట, కానీ నాకు నీ స్నేహితులందర్నీ కలుసుకోవాలని ఉంది,” అందామె. “నాకు అతణ్ణి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. అర్థం చేసుకో. అడిగే వస్తాడు. వస్తాడనే అనుకుంటున్నాను. కానీ మొహమాటం కొద్దీ రావచ్చు, ఇబ్బంది పడొచ్చు, ఇక్కడకు వచ్చాకా నన్ను చూసి ఈర్ష్య పడనూవచ్చు; ఏదేమైనా చివరకు అతనికి మిగిలేది అసంతృప్తే, ఆ బరువును మోసుకుంటూ, ఒక్కడూ ఒంటరిగా వెనక్కు వెళ్ళాలి. ఒంటరిగా – అదెంత బాధో నీకు తెలుసా,” అన్నాడు జార్జి. “కానీ నీకు పెళ్ళయిందని మరే రకంగానో అతనికి తెలియకుండా పోదు కదా?” “అలా తెలిస్తే నేనేం చేయలేననుకో. కానీ అతను ఉన్న స్థితిని బట్టి తెలియకపోయినా ఆశ్చర్యం లేదు.” “ఇలాంటి స్నేహితులున్న నువ్వు అసలు పెళ్ళే చేసుకోకూడదు జార్జ్.” “దానికి మనిద్దరమూ బాధ్యులమేగా, ఇప్పటికి ఇలా కానిచ్చేద్దాం.” కానీ ఆమె ఊరుకోక, అతని ముద్దుల జడి కింద వేగంగా ఊపిరి పీలుస్తూ, “నాకు మాత్రం ఇది నచ్చలేదు,” అంటూ గట్టిగా అనేసరికి, తన స్నేహితునికి ఎంగేజ్మెంటు సంగతి చెప్పేద్దామా అనుకున్నాడు జార్జి. “నా తత్త్వం ఇది, అతను నన్ను ఇలానే అంగీకరించక తప్పదు. అతనికి స్నేహితునిగా ఉండటం కోసం నన్ను నేను వేరే వ్యక్తిలా మార్చుకోలేను కదా,” అనుకున్నాడు.

ఈ ఆదివారం ఉదయం అతను పూర్తి చేసిన ఉత్తరంలో, అతను తన ఎంగేజ్మెంటు గురించి తన స్నేహితునికి ఇలా రాశాడు: “అన్నింటికన్నా మంచి వార్తను ఆఖర్న చెప్పాలని దాచి ఉంచాను. నా ఎంగేజ్మెంటు అయిపోయింది, అమ్మాయి పేరు ఫ్రీడా బ్రాండెన్‌ఫీల్డ్, బాగా సంపన్న కుటుంబం నుంచి వచ్చింది, వాళ్ళు నువ్వు దేశం వదిలి వెళ్ళిపోయిన చాన్నాళ్ళ తర్వాత ఇక్కడికొచ్చి స్థిరపడ్డారు, కాబట్టి బహుశా నీకు వాళ్ళ గురించి తెలిసుండకపోవచ్చు. నా కాబోయే భార్య గురించి మున్ముందు నీకు ఎలాగూ తెలుస్తుంది, ప్రస్తుతానికి నేను చాలా ఆనందంగా ఉన్నానని మాత్రం చెప్పి ఊరుకుంటాను, ఇక మన స్నేహానికి సంబంధించినంతవరకూ కొత్తగా వచ్చిన మార్పు ఒక్కటే, ఇదివరకూ నీకున్న మామూలు స్నేహితుని స్థానంలో ఇప్పుడు ఒక ఆనందకరమైన స్నేహితుడు వచ్చిచేరాడు. అంతేకాదు, నా భార్య రూపేణా (ఆమె నిన్నడిగానని చెప్పమంది, తొందర్లో స్వయంగా తనే నీకు ఉత్తరం రాస్తుంది), నీకు ఆడవాళ్ళలో కూడా ఒక మంచి స్నేహితురాలు దొరకబోతోంది, పెళ్ళి కావాల్సిన బ్రహ్మచారికి అది ఎంతో కొంత మంచిదే. ఇక్కడకు రావాలంటే నీకు చాలా అడ్డంకులు ఉన్నాయని తెలుసు, కానీ అలాంటి అడ్డంకులన్నింటినీ అధిగమించటానికి నా పెళ్ళి ఒక సముచితమైన సందర్భం కాదంటావా? చెప్పటం చెప్తున్నాను, ఇక నీకు ఎలా వీలు ఎలా కుదిరితే అలా చేయి, ఇబ్బంది మాత్రం పడకు.”

జార్జి ఈ ఉత్తరం చేతిలో ఉంచుకుని చాలాసేపు మేజాబల్ల దగ్గరే కూర్చుని కిటికీ వైపు చూస్తూండిపోయాడు, పరిచయస్తుడెవరో కింద రోడ్డు మీద వెళ్తూ పలకరిస్తే, పరాకుగా, డొల్లనవ్వుతో తలూపాడు.

చివరకు ఉత్తరాన్ని జేబులో దోపుకుని, గది బయటకు వచ్చి, ఇరుకైన నడవాని దాటి, అటు పక్కనున్న తండ్రి గదిలోకి వెళ్ళాడు, అతనీ గదిలో కాలు మోపి నెలలు గడిచిపోయింది. నిజానికి ఆ అవసరం లేదు, తండ్రి ఆఫీసులో కలుస్తూనే ఉంటాడు; మధ్యాహ్నాలు ఇద్దరూ ఒకే రెస్టారెంటులో కలిసి భోజనం చేస్తారు, సాయంత్రాలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు గడిపినా, అప్పుడు కూడా – జార్జి ఎప్పటిలా తన స్నేహితుల్నో, లేక ఈ మధ్య తరచూ చేస్తున్నట్టు తన కాబోయే భార్యనో కలవడానికి వెళ్తే తప్ప – ఇద్దరూ కాసేపు తమ ఉమ్మడి లివింగ్ రూములో కూర్చుని ఎవరి న్యూస్ పేపరు వాళ్ళు తిరగేస్తారు.

పగటిపూట ఇంత ఎండ కాస్తున్నప్పుడు కూడా తండ్రి గది ఎంత చీకటిగా ఉందో చూసి జార్జి ఆశ్చర్యపోయాడు. ఇంటి వారనున్న సందుకి అటువైపున్న ఎత్తయిన గోడ వల్ల గదంతా నీడలో ఉంది. చనిపోయిన తల్లి తాలూకు జ్ఞాపికలతో అలంకరింపబడిన ఒకమూల, కిటికీ దగ్గర కూర్చున్నాడు తండ్రి, చూపు మందగించటంతో న్యూస్ పేపర్ని కళ్ళకు బాగా దగ్గరగా పట్టుకుని చదువుతున్నాడు. టేబిల్ మీద టిఫిన్ కాస్త పుణికి వదిలేసినట్టు తెలుస్తోంది.

“ఆహ్, జార్జ్!” అంటూ అతని తండ్రి వెంటనే పైకి లేచాడు. ముందుకు నడుస్తుంటే ఆయన బరువైన డ్రెస్సింగ్ గౌన్ విడిపోయి అంచులు ఆయన చుట్టూ రెపరెపలాడాయి. — “నా తండ్రి ఇంకా దిట్టమైన మనిషే,” అనుకున్నాడు జార్జి.

“ఇక్కడ మరీ చీకటిగా ఉంది,” అన్నాడతను.

“అవును, చీకటిగానే ఉంది,” తండ్రి ఒప్పుకున్నాడు.

“మరి కిటికీ కూడా మూసేసావేం?”

“నాకలాగే బాగుంది.”

“బయట ఎండగానే ఉంది,” అని తన ముందు మాటను కొనసాగిస్తూ, కూర్చున్నాడు జార్జి.

తండ్రి టిఫిన్ పాత్రలన్నీ పక్కకి తీసి సొరుగుల బల్ల మీద పెట్టాడు.

తండ్రి కదలికల్ని లీనమైపోయి గమనిస్తూ, జార్జి అన్నాడు, “ఏం లేదు నాన్నా, ఓ విషయం చెప్దామని వచ్చాను. నా ఎంగేజ్మెంటు అయిన సంగతి చెప్తూ సెయింట్ పీటర్సుబర్గుకు ఉత్తరం రాశాను.” అంటూ జేబులోంచి ఉత్తరాన్ని కొద్దిగా పైకి లాగి మళ్ళీ లోపలికి వదిలేశాడు.

“సెయింట్ పీటర్సుబర్గుకా?” అడిగాడు తండ్రి.

“అవును, అక్కడున్న నా స్నేహితునికి,” తండ్రి కళ్ళల్లోకి చూట్టానికి ప్రయత్నిస్తూ అన్నాడు జార్జి. — “ఆఫీసులో నాన్నకీ, ఇక్కడి నాన్నకీ పోలికే లేదు, ఇక్కడ ఛాతీ మీద చేతులు కట్టుకుని ఎంత దిట్టంగా కూర్చున్నాడో,” అనుకున్నాడు.

“ఓ, నీ స్నేహితునికా,” తండ్రి నొక్కి అన్నాడు.

“అవును నాన్నా. ఇప్పటిదాకా అతనికి నా ఎంగేజ్మెంటు గురించి చెప్పాలనుకోలేదు. పెద్ద కారణాలేం లేవు, అతని మంచి కోసమే. నీక్కూడా తెలుసుగా అతను కాస్త సున్నితమైన మనిషని. అతనికి నా పెళ్ళి గురించి వేరే ఎవరి ద్వారా అన్నా తెలియనీ, అదెలాగూ నేను ఆపలేను (అతని ఏకాకి జీవితాన్ని బట్టి ఆ అవకాశం తక్కువే), కానీ నా అంతట నేను మాత్రం చెప్పకూడదనుకున్నాను.”

“ఇప్పుడు నీ మనసు మార్చుకున్నానంటావ్?” అన్నాడు అతని తండ్రి, పెద్ద న్యూస్ పేపర్ని కిటికీ గట్టు మీద పెట్టాడు, దాని మీద తన కళ్ళ జోడు పెట్టి, వాటిని కప్పుతూ పైన చేయి వేశాడు.

“అవును, మార్చుకున్నాను. ఒకటే అనుకున్నాను, అతను నాకు నిజమైన స్నేహితుడే అయితే నా ఎంగేజ్మెంటు అతనికీ ఆనందమే కలిగించాలి. కాబట్టి ఇక తటపటాయించటం మానేశాను. కానీ ఉత్తరం పోస్టు చేసే ముందు నీకు ఒకసారి చెప్దామనిపించింది.”

“జార్జ్,” తండ్రి తన పళ్ళు లేని నోటిని బార్లా తెరుస్తూ అన్నాడు, “ఒకటి చెప్తున్నా విను! ఈ విషయం మీద నన్ను సంప్రదించటానికి వచ్చావు. మంచి పనే చేశావు, కాదనను. కానీ, నువ్వు పూర్తి నిజం చెప్పకపోతే దీని వల్ల ఏ లాభమూ లేదు. కొన్ని సంగతులు ఇక్కడ మాట్లాడటం సబబు కాదు కాబట్టి ఊరుకుంటాను. మీ అమ్మ చనిపోయిన దగ్గర్నుంచీ, కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి. వాటి గురించి మాట్లాడే సమయం వస్తుంది, అనుకున్న దానికన్నా త్వరగానే వస్తుందేమో కూడా. ఆఫీసులో చాలా విషయాలు నా దృష్టికి రావటం లేదు, బహుశా నా నుంచి కావాలనేం దాయకపోవచ్చు – అలా దాస్తున్నారని నేను అనను – నాలో ఇదివరకటి బలం లేదు: నా జ్ఞాపకశక్తి క్షీణించిపోతోంది, అన్నీ గుర్తుంచుకోలేకపోతున్నాను. వయసైపోవడం ఒక కారణమైతే, రెండోది, అమ్మ చనిపోవటమనే దెబ్బ నీకన్నా గట్టిగా నాకు తగిలింది. – సరే ప్రస్తుతానికి మాట్లాడుతున్నది ఈ ఉత్తరం గురించి మాత్రమే కాబట్టి, జార్జ్, నేనొకటే బతిమాలుతున్నాను, దయచేసి నాకు అబద్ధం చెపొద్దు. ఇది చాలా చిన్న విషయం, అసలు చెప్పకపోయినా పెద్ద తేడా పడని విషయం, కాబట్టి అబద్ధం చెప్పొద్దు. నీకు నిజంగా సెయింట్ పీటర్సుబర్గులో ఒక స్నేహితుడు ఉన్నాడా?”

గ్రెగర్ ఇబ్బందిగా లేచి నిలబడ్డాడు. “పోనిలే నాన్నా, నా స్నేహితుల సంగతి మర్చిపో. వందమంది స్నేహితులైనా నా నాన్న సాటి కాదు. నేను ఏమనుకుంటున్నానో చెప్పనా? నువ్వు నీ ఆరోగ్యంపై సరైన శ్రద్ధ పెట్టడం లేదు. నువ్వు లేకుండా ఒక్కణ్ణీ వ్యాపారం నడపలేనని నీకూ తెలుసు, కానీ ఆ వ్యాపారమే నీ ఆరోగ్యానికి నష్టం కలిగిస్తుందంటే, రేపే వెళ్ళి దాన్ని మూసేస్తాను. కానీ అదొక్కటే సరిపోదు. నీ దినచర్యలో చాలా మార్పులు తీసుకురావాలి. అంతా సమూలంగా మార్చేయాలి. ఓ పక్క లివింగ్ రూము నిండా వెలుగుంటే, నువ్వేమో ఇక్కడ చీకటిలో కూర్చుంటావు. పొట్ట నిండకుండా టిఫిన్ ఏదో అంతంతమాత్రంగా కెలికి వదిలేస్తావు. నీ ఆరోగ్యానికి మంచి చేసే గాలిని రానివ్వకుండా కిటికీ మూసుకుని కూర్చుంటావు. ఇక లాభం లేదు నాన్నా! రేపే డాక్టర్ని తీసుకువస్తాను, అతని సూచనల్ని పాటిద్దాం. మన గదులు మార్చుకుందాం, నువ్వు ముందు గది తీసుకో, నేను ఈ గది తీసుకుంటాను. కొత్తగా ఏం ఉండదు, నీ సామానంతా అక్కడికి మార్చేస్తాను. ప్రస్తుతానికి నువ్వు పడుకుని విశ్రాంతి తీసుకో. రా, నీ బట్టలు తీసేస్తాను, ఇలాంటివన్నీ నేను చేయలేననుకుంటావేమో కదూ, నీకే తెలుస్తుంది. పోనీ ఇప్పుడే ముందు గదిలోకి వెళ్ళి నా మంచం మీద పడుకుంటావా? అదే మంచిది.”

జార్జి తండ్రి దగ్గరగా వెళ్ళి నుంచున్నాడు. ఆయన చెదిరిన తెల్ల వెంట్రుకల తల ఛాతీలోకి కూరుకుపోయి ఉంది.

“జార్జ్!” అతని తండ్రి సన్నని గొంతుతో కదలకుండా పిలిచాడు.

జార్జి వెంటనే తండ్రి పక్కన మోకరిల్లాడు, వడలిన ముసలాయన ముఖంలో కనుపాపలు పెద్దవై కంటి మూలల్లోంచి అతణ్ణి చూస్తున్నాయి.

“నీకు సెయింట్ పీటర్సుబర్గులో ఏ స్నేహితుడూ లేడు. నువ్వు ఎప్పుడూ తుంటరివే, ఇప్పుడు ఆ తుంటరితనం నా మీద చూపించటానికి కూడా వెనుకాడటం లేదు. నీకు అక్కడో స్నేహితుడు ఉండటం ఎలా సాధ్యం. నేను నమ్మను.”
“కాస్త గతం గుర్తు తెచ్చుకో నాన్నా,” అన్నాడు జార్జి, అంటూ తండ్రిని కుర్చీ లోంచి పైకి లేపి, ఆయన నీరసంగా నిలబడి ఉండగా, వంటి మీది డ్రెస్సింగ్ గౌనుని తొలగించటం మొదలుపెట్టాడు, “ఆ స్నేహితుడు మన దగ్గరకు చివరిసారి వచ్చి మూడేళ్ళవుతోంది. నువ్వు మొదట్లో అతణ్ణి అంతగా ఇష్టపడేవాడివి కాదు. అందుకే, ఓ రెండు సందర్భాల్లో, అతను నా గదిలోనే ఉన్నా, నీకా సంగతి తెలియనివ్వలేదు. నీ అయిష్టతను అర్థం చేసుకోగలిగాను, అతని ధోరణి కాస్త చిత్రమైనదే. కానీ రాన్రానూ నీకు అతనితో మంచి చనువు ఏర్పడింది. అతని మాటలు నువ్వు వింటూ, తలూపుతూ, ప్రశ్నలడుగుతూంటే నాకు గర్వంగా కూడా అనిపించేది. కాస్త ప్రయత్నించి చూడు, నీకే గుర్తొస్తుంది. అతను రష్యన్ విప్లవం గురించి వింత వింత కథలు చెప్తూండేవాడు. గుర్తుందా, ఒకసారి అతను కియెవ్ పట్టణానికి ఏదో వ్యాపారపు పని మీద వెళ్తే, అక్కడ ఒక ఆందోళనకారుల గుంపు ఎదురైందట, కింద దొమ్మీ జరుగుతోంటే, పైన బాల్కనీలో ఒక పూజారి తన అరచేతి మీద రక్తంతో పెద్ద శిలువ కోసుకుని, దాన్ని కింద గుంపుకేసి చూపిస్తూ ప్రాధేయపడుతూ కనిపించాడట. ఈ కథని తర్వాత నువ్వే ఒకట్రెండుసార్లు ఇంకెవరికో చెప్పావు కూడా.”

ఈలోగా జార్జి నెమ్మదిగా తండ్రిని మళ్ళీ కుర్చీలో కూర్చో పెట్టాడు, ఆయన మేజోళ్ళనీ, అండర్వేర్ పైన వేసుకున్న పొడవాటి ఊలు నిక్కర్నీ తొలగించాడు. మురికి పట్టిన లోదుస్తుల్ని చూసి, తండ్రిని అంతగా నిర్లక్ష్యం చేస్తున్నందుకు తన్ను తానే నిందించుకున్నాడు. ఆయన శుభ్రమైన బట్టలు తొడుక్కునేలా జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత కొడుగ్గా తనదే. ఇప్పటిదాకా తండ్రి భవిష్యత్తేమిటన్నది తన కాబోయే భార్యతో చర్చించలేదు, ఆయన పాత ఇంట్లోనే ఉండిపోతాడని ఇద్దరూ అప్రకటితంగానే ఓ అంగీకారానికి వచ్చేశారు. కానీ ఇప్పుడు తండ్రిని కూడా తమతో పాటూ కొత్త ఇంట్లోకి తీసుకు వెళ్ళాలన్న గట్టి నిర్ణయానికి వచ్చాడు జార్జి.

తండ్రిని రెండు చేతుల మీదా ఎత్తుకుని మంచం వైపు నడిచాడు. ఇలా నడుస్తోంటే తండ్రి తన ఛాతీని గట్టిగా హత్తుకుని తన గడియారపు గొలుసుతో ఆడుకోవటం చూసి జార్జికి భయం కలిగింది. ఆయన ఆ గొలుసును ఎంత గట్టిగా పట్టుకున్నాడంటే, దాన్ని విడిపించి, ఆయన్ని మంచం మీద పడుకోబెట్టడం కష్టమైంది.

కానీ మంచం మీద పడుకోగానే కుదురుగా మారిపోయాడు. దుప్పటి కప్పుకుని దాన్ని భుజాల పై దాకా లాక్కున్నాడు. జార్జి వైపు సామరస్యంగానే చూశాడు.

“నీకు అతనెవరో గుర్తొస్తోంది కదూ?” అన్నాడు జార్జి, ప్రోత్సాహకంగా తల పంకిస్తూ.

“దుప్పటి పూర్తిగా కప్పి ఉందా?” తన కాళ్ళ వైపు చూసుకోలేనట్టు అడిగాడు తండ్రి.

“అప్పుడే మంచం మీద కుదురుకుపోయావన్న మాట,” అంటూ జార్జి దుప్పటిని ఆయనకు మరింత దగ్గరగా సర్దాడు.

“దుప్పటి పూర్తిగా కప్పి ఉందా?” మళ్ళీ అడిగాడు తండ్రి, ఆ సమాధానం తనకు చాలా అవసరమన్నట్టు ఉంది ఆయన ధోరణి.

“పడుకో ప్రశాంతంగా, పూర్తిగా కప్పే ఉంది.”

అతని జవాబును మధ్యలోనే తుంచేస్తూ, “లేదు!” అని అరిచాడు తండ్రి, ఆయన విసిరిన జోరుకి దుప్పటి ఓ క్షణం పాటు గాల్లో పూర్తిగా తెరుచుకుని ఉండిపోయింది, దిగ్గున లేచి మంచం మీద నుంచున్నాడు. “నా మీద గుడ్డ కప్పేద్దామనుకున్నావు కదా, నాకు తెలుసురా, కుర్రకుంకా, కానీ నేనంత తొందరగా కప్పడిపోవటానికి సిద్ధంగా లేను. నాకు మిగిలిన సత్తువ ఇసుమంతే ఐనా, అదే చాలురా నీకు, అదే చాలా ఎక్కువ. అవును, నీ స్నేహితుడు నాకు తెలుసు. అసలు వాడే నాకు సరైన కొడుకై ఉండేవాడేమో. అందుకే కదా వాణ్ణి మోసపుచ్చుతూ వచ్చావ్ ఇన్నేళ్ళూ? వాడి కోసం నేను కంటతడి పెట్టని రోజుందనుకుంటున్నావా? అందుకే కదూ, ఆఫీసులో నీ గది తలుపులన్నీ బిడాయించేసుకునేది – అయ్యగారు పనిలో బిజీగా ఉన్నారు, ఎవరూ డిస్టర్బ్ చేయకూడదు – అక్కడ కూర్చునే కదూ నువ్వు రష్యాకి నీ అబద్ధపు ఉత్తరాలు రాసేది. కానీ కొడుకు గుట్టు పసిగట్టడం తండ్రికెవరూ నేర్పనక్కర్లేదురోయ్. చివరికి పాపం వాణ్ణి కిందకు తొక్కేశాకా, అట్టడుక్కి కాలరాసేశాకా, వాణ్ణిక కదలనివ్వకుండా వాడి మీద నీ ముడ్డి పెట్టి కూర్చునేంతగా అణిచేశాకా, అదిగో అప్పుడు పెళ్ళికి తయారయ్యాడండీ నా సుపుత్రుడు.”

జార్జి భూతంలా నిల్చొన్న తండ్రి వైపు చూశాడు. ఉన్నట్టుండి తన తండ్రికి చాలా ఆత్మీయుడైపోయిన సెయింట్ పీటర్సుబర్గు స్నేహితుడు, ఇప్పుడు అతని ఊహలో ఇదివరకెన్నడూ లేనంత స్పష్టంగా కనపడుతున్నాడు. అంతూపొంతూ లేని రష్యాలో దారీతెన్నూ లేని అతణ్ణి చూడగలుగుతున్నాడు. కొల్లగొట్టబడి ఖాళీగా ఉన్న గోదాం తలుపు దగ్గర అతణ్ణి చూడగలుగుతున్నాడు. శిథిలమైన షోకేసుల మధ్యన, నాశనమైన సరుకు మధ్యన, కూలిపోతున్న చూరు పెచ్చుల మధ్యన, అతను అతి కష్టం మీద లేచి నిలబడుతున్నాడు.

“ముందు నే చెప్పేది వినరా!” అతని తండ్రి అరిచాడు, పరాకులో ఉన్న జార్జి వెంటనే తండ్రి చెప్పేదంతా వినటానికి మంచం వైపు పరిగెత్తాడు, కానీ మధ్యలోనే ఆగిపోయాడు.

“అదేమో స్కర్టు పైకెత్తింది,” తండ్రి వికటంగా నవ్వుతూ అన్నాడు, “ఇదిగో ఇలా స్కర్టు పైకెత్తింది, తప్పుడు ముండ,” అంటూ ఎలాగో చూపించటానికి తన చొక్కాను బాగా పైకెత్తాడు, ఆయన తొడల మీద యుద్ధం తాలూకు గాయం కూడా కనిపిస్తోంది, “కాసేపిలాగా, కాసేపలాగా స్కర్టు పైకెత్తి ఆడిందే ఆలస్యం, దాని కాళ్ళ మీద పడి దాసోహం అన్నావు, దాన్తో కులకటానికి ఏ అడ్డం రాకూడదని, నీ తల్లి జ్ఞాపకాన్ని అవమానించావు, నీ స్నేహితుణ్ణి మోసం చేశావు, నీ తండ్రిని కదలకుండా మంచం మీదకు తోసేద్దామనుకున్నావు. మరి వాడు కదలగలడో లేడో చూపించమంటావా?” అంటూ ఆయన ఏ దన్నూ లేకుండా నిటారుగా నిలబడ్డాడు, కాళ్ళు గాల్లో ఆడించాడు. ఈ ఎరుక ఆయన్ని వెలిగిపోయేలా చేసింది.

తండ్రి నుంచి వీలైనంత దూరంగా గది మూలకి వచ్చేశాడు జార్జి. చాలా కాలం క్రితమే అతనో నిర్ణయం తీసుకున్నాడు: ప్రతీ చిన్న కదలికనీ అప్రమత్తంగా గమనిస్తూ ఉండాలనీ, అదాటుగా పైనుంచో వెనుకనుంచో వచ్చి పడే ఏ పరోక్ష దాడినైనా సరే బిత్తరపోకుండా కాచుకోవాలనీ అనుకున్నాడు. కానీ ఎప్పుడో మర్చిపోయిన ఈ నిర్ణయాన్ని ఇప్పుడు గుర్తు తెచ్చుకున్న మరుక్షణమే – సూది బెజ్జంలోంచి పొట్టి దారాన్ని లాగుతున్నవాడిలా – మళ్ళీ మర్చిపోయాడు.

“కానీ నీ స్నేహితుడు మోసపోలేదురోయ్!” చూపుడు వేలిని ఆడిస్తూ బిగ్గరగా అన్నాడు అతని తండ్రి, “వాడికి ప్రతినిధిగా నేనొకణ్ణి ఇక్కడ పని చేస్తూనే ఉన్నాను.”

“పగటివేషగాడు నయం!” టపీమని అన్నాడు జార్జి, కానీ మరుక్షణం తన పొరబాటు గ్రహించాడు, జరగాల్సిన నష్టం జరిగిపోయాకా, ముఖంలోంచి జారిపోతాయనిపించేంతగా కళ్ళు పెద్దవి చేసి, నాలికని ఎంత గట్టిగా కరుచుకున్నాడంటే, ఆ బాధకి వళ్ళంతా వణికిపోయింది.

“అవున్రా నేను పగటివేషమే వేస్తున్నాను! పగటివేషం! ఎంత మంచి మాటన్నావురా! భార్యలేని ఈ ముసలివాడికి అంతకన్నా మిగిలిందేముంది? చెప్పరా – కానీ ఆ చెప్పే జవాబేదో, ఇప్పటికీ బతికున్నాడనే నేననుకుంటున్న నా కొడుగ్గా చెప్పు – ఏం మిగిలిందిరా నాకు, నా మూల గదిలో, నమ్మకద్రోహులైన సిబ్బందితో యాతనపడుతూ, ఎముకల్లోని మజ్జ దాకా ముసలితనం నిండిపోయిన వాడికి ఇంకేం మిగిలిందిరా? నేను అరటిపండు వలిచిపెట్టినట్టు బిజినెస్ డీల్సన్నీ సిద్ధంగా చేసి పెడితే, నా కొడుకేమో వాటిని పూర్తి చేస్తూ, లోకం ముందు కాలరెగరేసుకుని తిరుగుతుంటాడు, మర్యాదగల వ్యాపారస్తుడి మల్లే గంభీరమైన ముఖం పెట్టి తండ్రి నుంచి దూరంగా వెళిపోతుంటాడు! ఒరే, నేను నిన్ను, నా నుంచి ఊడిపడ్డవాణ్ణి, ఎప్పుడూ ప్రేమించలేదనుకుంటున్నావా?”

“ఇప్పుడీయన ముందుకి వంగుతాడు,” జార్జి అనుకున్నాడు, “తూలిపడి కాళ్ళూ చేతులూ విరగ్గొట్టుకుంటే ఎలా ఉంటుంది.” ఈ మాటలు అతని మనసు గూండా బుసలు కొడుతూ పాక్కుపోయాయి.

అతని తండ్రి ముందు వంగాడు, కానీ తూలిపడలేదు. ఆయన ఆశించినట్టు జార్జి దగ్గరకు రాకపోవటంతో, మళ్లా నిటారుగా నిలబడ్డాడు.

“సరే అక్కడే ఉండు, నాకు నీ అవసరం లేదు! నీకు ఇక్కడకు రాగల శక్తి ఉందనీ, అయినా కూడా నీ ఇష్ట ప్రకారం వెనక్కు ఆగుతున్నావనీ అనుకుంటున్నావు కదూ. అలాంటి భ్రమలేం పెట్టుకోకు! నేను ఇప్పటికీ నీ కన్నా శక్తివంతుణ్ణే. ఒంటరివాణ్ణయితే ఏమన్నా తల వంచేవాణ్ణేమో, కానీ నీ తల్లి నాకు బోలెడంత శక్తిని ఇచ్చి వెళిపోయింది, నీ స్నేహితునితో నాకు బలమైన అనుబంధం ఉంది, నీ కస్టమర్లందరూ నా జేబులో ఉన్నారు!”

“ఈయనగారి నైట్‌షర్టుకి కూడా జేబులున్నాయి కాబోలు!” జార్జి తనలో తాను అనుకున్నాడు, ఈ మాటతో ఆయన్ని ప్రపంచం దృష్టిలో పరిహాసాస్పదుణ్ణి చేయగలిగాననే నమ్మకం కలిగింది. కానీ ఈ ఆలోచన ఒక క్షణం మాత్రమే ఉంది, అతనూ ప్రతీదీ వెంటనే మర్చిపోతున్నాడు.

“అసలు నీ పెళ్ళాన్ని వెంటబెట్టుకుని నా దారికడ్డంగా వచ్చి చూడు! దాన్ని నీ పక్క నుంచి ఇట్టే ఎలా లాక్కుంటానో చూసి నువ్వే బిత్తరపోతావ్!”

జార్జి నమ్మలేనట్టు ముఖం పెట్టాడు. తండ్రి తన మాటల్లో నిజాన్ని ఖారారు చేస్తున్నట్టు జార్జి ఉన్న మూలకి తలాడించి ఊరుకున్నాడు.

“ఏం నవ్వు తెప్పించావురా ఇవాళ నాకు. నీ స్నేహితుడికి నీ ఎంగేజ్మెంటు గురించి చెప్పాలా వద్దా అని నన్నడగటానికి వచ్చావా. ఒరే వెర్రి బాగులోడా, ఆ సంగతి వాడికి ఎప్పుడో తెలుసు, అంతా తెలుసు! నువ్వు నా పెన్నూ పేపర్లు నా నుంచి లాక్కోవటం మర్చిపోయావు, నేను వాడికి ఉత్తరాలు రాస్తూనే ఉన్నాను. అందుకే ఏళ్ళు గడుస్తున్నా వాడిక్కడికి రావటం లేదు, వాడికి అన్నీ నీ కన్నా బాగా తెలుసు, వందరెట్లు బాగా తెలుసు; వాడు కుడి చేత్తో నా ఉత్తరం పట్టుకుని చదువుతూనే, పుర్ర చేత్తో నీ ఉత్తరాల్ని కనీసం చదవను కూడా చదవకుండా నలిపేస్తాడు!”

ఆయన ఉత్సాహంగా గాల్లో చేతులు ఆడిస్తూ, “వాడికి అన్నీ వెయ్యి రెట్లు బాగా తెలుసు!” అని అరిచాడు.

“పది వేల రెట్లు!” తండ్రిని వెక్కిరించటానికి అన్నాడు జార్జి, కానీ ఆ మాటలు అతని నోటి నుండి బయటకి రాగానే అనుకోని గంభీరత సంతరించుకున్నాయి.

“ఈ ప్రశ్నతో ఎప్పుడు నా దగ్గరకు వస్తావా అని నేను ఎన్నో ఏళ్ళ తరబడి ఎదురుచూస్తున్నాను! నాకు అది తప్ప వేరే ధ్యాస ఏదన్నా ఉందనుకున్నావా? నేను నిజంగానే రోజూ న్యూస్ పేపర్లు చదువుతాననుకున్నావా? చూడు!” అంటూ ఆయన ఎలాగో ఇక్కడి దాకా తీసుకొచ్చిన తన న్యూస్ పేపర్ని జార్జి మీదకు విసిరాడు. అది ఒక పాత న్యూస్ పేపరు, దాని పేరు కూడా జార్జికి తెలీదు.

“ఎంత కాలం పట్టిందిరా నాయనా నీకు ఎదగటానికి! చివరకు ఆ మంచి రోజు రాకుండానే నీ తల్లి చనిపోయింది. నీ స్నేహితుడు రష్యాలో శిథిలమవుతున్నాడు, మూడేళ్ళ క్రితమే అతని వళ్ళంతా పసుపుగా పాలిపోయి బయట తుక్కులో పారేయటానికి తగ్గట్టు ఉన్నాడు, ఇక నా విషయానికొస్తే, నా పరిస్థితి ఎలా ఉందో నువ్వే చూస్తున్నావు, ఆ మాత్రం చూట్టానికి దేవుడు నీకు కళ్ళిచ్చాడనే అనుకుంటున్నాను!”

“అంటే నువ్వు నా మీదకు ఎప్పుడు ఎగబడదామా అని కాచుక్కూర్చున్నావన్నమాట!” అరిచాడు జార్జి.

అతని తండ్రి సానుభూతిగా, యథాలాపంగా, “నువ్వు ఆ మాట ఇంకాస్త ముందు అంటే అర్థం ఉండేదేమో. ఇప్పుడిక లాభం లేదు!” అన్నాడు. తర్వాత ఉన్నట్టుండి బిగ్గరగా: “ప్రపంచంలో నువ్వే గాక ఇంకా ఏమేం ఉన్నాయో ఇప్పుడు నీకు తెలిసి ఉంటుంది, ఇదివరకూ నీకు నీ గురించి తప్ప ఇంకేం తెలియదు! అవును, నువ్వు అమాయకపు పిల్లాడివే, నిజమే, కానీ అంతకుమించిన నిజమేంటంటే, నువ్వో దుర్మార్గపు మనిషివి! – అందుకే, నువ్వు తక్షణం మునిగి చావాలని శిక్ష విధిస్తున్నాను!”

జార్జికి తననెవరో గదిలోంచి బలవంతంగా బయటకు నెడుతున్నట్టు అనిపించింది, వెనకాల తండ్రి మంచం మీద కూలబడిన చప్పుడు పరిగెడుతోన్న అతని చెవుల్లో ఇంకా మార్మోగుతూనే ఉంది, జారుడుబల్ల జారుతున్నట్టు మెట్ల మీంచి వేగంగా కిందికి వస్తూంటే, పొద్దున్నే ఇల్లు తుడవటానికి వస్తున్న పనమ్మాయి ఎదురైంది. ఆమె “బాబోయ్!” అని కేక పెట్టి ఏప్రానులో ముఖం దాచుకుంది, కానీ అప్పటికే ఆమెను దాటి వెళ్ళిపోయాడు. బయటి తలుపు లోంచి దూసుకుపోయి, రోడ్డు దాటి, నది వైపు పరిగెత్తాడు. అన్నార్తుడు ముద్ద వైపు చేయి చాచినట్టు రెయిలింగ్‌ని పట్టుకున్నాడు. తల్లిదండ్రులు ఎంతగానో మురిసిపోయిన తన యవ్వన దినాల జిమ్నాస్టిక్ కౌశలాన్ని ప్రదర్శిస్తూ ఒక్క ఉదుటున దాని మీంచి దూకాడు. చేతి పట్టు వదులవుతుండగానే, రెయిలింగ్స్ సందుల్లోంచి చూశాడు, అటుగా వస్తోన్న బస్సు తాను నీళ్ళలో పడిన శబ్దాన్ని కప్పేస్తుంది; మెల్లనైన గొంతుతో, “అమ్మా నాన్నా, అయినా సరే, మీరంటే నాకెప్పుడూ ప్రేమే,” అంటూ పట్టు వదిలేశాడు.

అదే క్షణంలో ఎడతెగని ట్రాఫిక్ ప్రవాహం వంతెన దాటుతోంది.

*


0 comments:

మీ మాట...