February 24, 2017

కన్నగాడి నాన్న

షాపు తెరిచి మిషను తొక్కుకుంటున్న సూర్రావుకి గుడిమెట్లోడు వచ్చి చెప్తేనే తప్ప తెలీలేదు- ఆ రోజు జానిబాబుని పెళ్లికొడుకుని చేస్తున్నారన్న సంగతి. మామూలుగానైతే గుడిమెట్లోడు లుంగీ ఎగ్గొట్టుకుంటూ వచ్చి ఎంత సోది చెప్పినా సూర్రావు పని ఆపడు. తలెత్తకుండా మిషను తొక్కుకుంటూనే నాలుగు మాటలకి ఓ మాట అంటాడు. జానిబాబు పెళ్లి మాట వచ్చినపుడు మాత్రం పని ఆపి గుడిమెట్లోడి వంక చూసాడు.

గుడిమెట్లోడు సూర్రావు వాలకం చూసి, “ఏఁ నిన్ను పిల్లేదేటీ కిట్నగారు పెళ్లికీ?” అన్నాడు.

సూర్రావు మళ్ళీ తలొంచుకుని సూది కింద చొక్కా అంచుని సర్దుతూ, “నన్నెందుకు పిలాలీ, నేనేవఁన్నా ఆళ్ల చుట్టాన్నేటీ?” అన్నాడు.

“అదేటయ్యా... ఇపుడంటే కిట్నగారు బాగా సంపాయించి సెంటరు కాడ ఇల్లు కట్టేడు గానీ, ఇదొరకూ మీరూ మీరూ ఒక యీదోళ్లే కదా. ఎదురెదురు కొంపలు పైగానీ!” అన్నాడు గుడిమెట్లోడు.

సూర్రావు ఏం మాట్లాడ లేదు. అతని కళ్ల ముందు జానిబాబు పెళ్లికొడుకు లాగా గుర్తుకొచ్చాడు. దాంతోపాటే చనిపోయిన కొడుకు కూడా గుర్తుకొచ్చాడు. ఈపాటికి కన్నగాడికీ పాతికేళ్లు వచ్చుండేవి. ఏదో ఒక సంబంధం చూసి చేసేద్దుడు. ఇప్పుడంటే ఆ ఇల్లు లేదుగానీ, ఉండుంటే పక్కన రెండు గదుల్లోనీ కాపరం పెట్టించేద్దుడు. అసలు కన్నగాడుంటే దాన్ని అమ్మనిచ్చేవోడా. చెల్లి పెళ్లి వాడే దగ్గరుండి చేసేవాడు కాదూ. అల్లుడు ఇప్పుడు లోకువ కట్టినట్టు కడితే ఊరుకునేవాడా....

గుడిమెట్లోడికి కాసేపటికి అనిపించింది- తనకి తనే మాట్లాడుకుంటున్నాడని. సూర్రావు మిషను దగ్గరి నుంచి లేచి దండెం మీది చొక్కా తొడుక్కోవటంలో ఉన్నాడు.

“ఏంటి పన్నెండయినా అవలేదు షట్టరు దించేత్తన్నావ్?”

సూర్రావు మాట్లాడకుండా బొత్తాలు పెట్టుకుంటున్నాడు.

“ఏటప్పుడే వైను షాపు కాడికా? మీ యావిడికి తెలియాలి, సీపిరికట్ట ఇరగ్గొట్టేద్ది ఈపు మీద....”

“లే ఎహె పనికి మాలినెదవా!” అని గుడిమెట్లోడ్ని అదిలించి లేపి, అతను కూర్చున్న బల్లని లోపల పెట్టేసి మడతల తలుపు దగ్గిరికి లాగాడు సూర్రావు.

“నీ అయ్యా నిన్ను నమ్మి ఇంకా బట్టలిత్తన్నారు చూడు కుట్టమని, ఆళ్లననాలి,” అంటూ గుడిమెట్లోడు లుంగీ దులుపుకుని రోడ్డు మీదికి వెళ్లిపోయాడు, తన కబుర్లు వినేవాడు ఇంకొకడ్ని వెతుక్కుంటూ.

అందరూ ఎవరిపనుల్లో వాళ్లుండి ఈ మధ్యాహ్నం వేళ వీధంతా ఖాళీగా ఉంది. సూర్రావు కొడుకుని తలుచుకుంటూ పరాకుగా ఇంటివైపు నడిచాడు. రాన్రానూ అతని మనసులో కన్నగాడి గుర్తులన్నీ అలుక్కుపోతున్నాయి. పదే పదే తల్చుకోవటం వల్ల బండబారిపోతున్నాయి. ఊరికే చీకట్లో బొమ్మల్లా కళ్ల ముందుకొచ్చి ఏమీ అనిపించకుండానే వెళిపోతున్నాయి. దానికి తోడు, భార్య జరిగినవాటికి చిలువలు పలువలు కల్పించి జ్ఞాపకాల్ని కల్తీ చేస్తుంది. వెలిసిపోయే జ్ఞాపకాల మధ్యలో కన్నగాడి రూపం ఆనవాలు తప్పిపోకుండా కాచుకునేందుకు సూర్రావుకు మిగిలిన ఆసరా అల్లా మూడే మూడు ఫోటోలు. ఒకటి ఏడోతరగతికి స్కూల్లో తీయించుకున్న పాస్‌పోర్టు ఫొటో, రెండోది చుట్టాలెవరిదో పెళ్లి ఫొటోల ఆల్బంలో కనపడితే వాళ్లని అడిగి తెచ్చుకున్న ఫొటో, మూడోది వాడపల్లి తీర్థానికి వెళ్ళినప్పుడు స్టూడియోలో తీయించుకున్న ఫొటో. ఈ ఫొటోలో కన్నగాడు సూర్రావు ముచ్చటపడి కుట్టించిన పొట్టి ఫేంటు వేసుకుని, టక్ చేసుకుని, జేబులో చేతులు పెట్టుకుని చూస్తుంటాడు. ఆ వయసుకే పేద్ద ఫోజు! వాళ్ల నాన్నకీ అమ్మకీ కొడుకు కాదన్నట్టు వాళ్ళకు ఎడంగా నిలబడి సొంత ఫోజొకటి పెట్టుకున్నాడు. చిరంజీవిలా కనపడాలని ఫౌడరు పులిమిన ముఖంలో తెచ్చిపెట్టుకున్న కోపంతో చూస్తుంటాడు. చుట్టాల పెళ్లి ఆల్బమ్ నుంచి తెచ్చుకున్న ఫోటోలో అర్ధరాత్రి ముహూర్తానికి జరుగుతున్న పెళ్లిలో ఎవరి ఒళ్లోనో నోరు తెరిచి నిద్రకు జోగుతుంటాడు. బళ్లో తీసిన పాస్‌పోర్టు ఫోటోలో నూనె జిడ్డు ముఖంతో ఉంటాడు. ఆ ఫొటోలో కన్నగాడి చెంపల మీద నుంచి స్కూలు స్టాంపుని కొట్టిన మనిషెవరో తెలీదుకానీ సూర్రావు ఆ మనిషిని చాలాసార్లు తిట్టుకున్నాడు. కానీ ఈ ఫోటోలు వేటిల్లోనీ కన్నగాడిలో ఎంతో బాగుండే నవ్వు ఉండదు.

సూర్రావు సంత దాకా వచ్చాక బడ్డీకొట్టు దగ్గర ఆగి సిగరెట్టు కొనుక్కున్నాడు. దాన్ని వెలిగించుకుని అలా బజారు షెడ్ల వైపు వెళ్లాడు. ఆ రోజు సంత లేదు. షెడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. నేల మీద కుళ్ళిన కూరగాయలూ, మొండి అరటి గెలలూ, ఉల్లిపొరలూ. ఓ ఇనప స్తంభానికి జారగిలి కూర్చున్నాడు. ఇంటికి వెళ్లాలనిపించలేదు. వెళ్తే భార్య షాపు ఎందుకు కట్టేసావని అడుగుతుంది. ఎందుకో చెప్పాలి. ఆళ్లెవరిదో పెళ్లయితే నీకెందుకు బాధ అంటుంది. ఎందుకో దానికి తెలుసు. కన్నగాడూ, జానిబాబూ ఒకే క్లాసు. ఎనిమిదో తరగతిలో ఓ రోజు బడి ఎగ్గొట్టి కపిలేశ్వరపురం గోదావరి స్నానాలకి వెళ్ళారు. ఆటల ధ్యాసలో ఒడ్డుకి దూరం జరిగితే ఇద్దర్నీ వరద లాగేసింది. కన్నగాడు చచ్చిపోయాడు, అక్కడున్న పల్లోళ్లు జానిబాబుని మాత్రం బయటికి లాగగలిగేరు. ఇదంతా సూర్రావు భార్యకి తెలీక కాదు. కన్నగాడు పోయిన తర్వాత ఆమె కూడా జానిబాబుని చూసినపుడల్లా ఏడ్చేది. ఆ కుర్రాడు మరి భయపడ్డాడో, లేదంటే ఎందుకు పాపం అస్తమానం కంటపడి ఆమెను ఏడిపించటం అనుకున్నాడో- ఇంటికి రావటం మానేశాడు. అయినా ఆమెకి భ్రమ తీరలేదు. మరుసటి ఏడాది కన్నగాడి పుట్టిన రోజుకి “బట్టలు కుట్టిపెట్టు జానిబాబుకి ఇద్దాం” అన్నది. సూర్రావు అది పద్ధతి కాదని తిట్టాడు. అయినా అప్పటికి ఊరుకుంది గానీ, జానిబాబు పుట్టిన రోజు వచ్చే దాకా ఆగి కొత్తబట్టలు తీసుకెళ్లి వాళ్ల ఇంట్లో ఇచ్చింది. కృష్ణగారాళ్లావిడ మొదట వద్దన్నదే తర్వాత కృష్ణగారు ఫర్లేదు తీసుకొమ్మంటే తీసుకుంది. కానీ దీని దరిద్రానికి, ఓ వారం తర్వాత ఆ కుర్రాడికి జ్వరం పట్టుకుంది. అది జడుపు జ్వరమని చెప్పి ఆ రోజు కృష్ణగారాళ్లావిడ తిట్టిన తిట్లు వీధివీధంతా వినపడ్డాయి.

జానిబాబు కళ్ల ముందే ఎదిగాడు. ఆ అబ్బాయి పది పాసయ్యేదాకా కృష్ణంరాజు గారు అదే వీధిలో ఉన్నారు. తర్వాత ఆయనకి వ్యాపారంలో కలిసొచ్చింది. ఒక డీసీఎం నడిపేవాడల్లా, ఇంకో రెండు డీసీఎంలూ, ఒక లారీ కొన్నాడు. మండపేటలో ఆఫీసు కూడా తెరిచాడు. ఊళ్లో సెంటరు దగ్గర డాబా ఇల్లు కట్టించుకుని, ఈ వీధిలో ఉన్న ఇంటిని అద్దెకిచ్చేసాడు. ఆ తర్వాత జానిబాబు సూర్రావుకి కనిపించింది తక్కువే. ఎపుడో కాలేజీలో సూర్రావు కూతుర్ని ఎవరో ఏడిపిస్తే వాడి మీదకి కొట్టడానికెళ్ళేడట. కూతురే ఇంటికొచ్చి చెప్పింది. తర్వాత ఎపుడో ఒకసారి చదువైపోయాకా షాపు దగ్గరికి వచ్చి, “హైదరాబాదులో ఉద్యోగానికి వెళ్తున్నానంకుల్” అని చెప్పాడు. అలా చెప్పాలనిపించినందుకు సూర్రావుకి ఆ కుర్రోడి మీద ఎంతో మమకారం కలిగింది. జేబులో ఓ మూడొందలుంటే తీసి ఏవన్నా ఖర్చులకు ఉంచుకొమ్మని ఇచ్చి పంపాడు. ఆ తర్వాత జానిబాబు ఎపుడు ఊరొచ్చేవాడో, ఎపుడు హైదరాబాదు వెళ్లిపోయేవాడో సూర్రావుకి తెలిసేది కాదు. అతనికి జీవితం మీద శ్రద్ధ పోయింది. తాగుడు మరిగి షాపు ఇష్టం వచ్చినప్పుడు తెరిచేవాడు. ఒకవేళ తెరిచినా గానీ అతను కుట్టే ‘అల్లుడుగారు’, ‘గ్యాంగ్ లీడరు’ స్టయిలు చొక్కాలకీ పంట్లాములకీ గిరాకీ లేక, అతన్నే అంటిపెట్టుకున్న కొద్దిమంది తప్పితే కొత్త బేరాలేవీ వచ్చేవి కాదు. ఎలాగో ఇల్లమ్మి కూతురు పెళ్లయితే చేసి పంపగలిగేడు.

భార్య కన్నగాడిని తలుచుకుని ఏడిచినపుడల్లా సూర్రావుకి చిరాకు కలిగేది. కొడుకు చావు ఆమెలో ఏ మార్పూ తేవకపోవటం, ఆమె తాపత్రయాలూ రాగద్వేషాలూ అన్నీ పూర్వంలాగే ఉండటం చూసి సూర్రావుకి ఆమె దిగులంతా పైపైనే అనిపించేది. అతడ్ని లోపలి నుంచీ తినేసి భవిష్యత్తుపైన నీడలు వాల్చిన దిగులుకూ, భార్య అందరితోనూ కన్నీటి పర్యంతమై చవగ్గా పంచుకునే దిగులుకూ మధ్య ఉన్న తేడాయే అతడ్ని భార్యకు దూరం చేసింది. ఆమె దగ్గర కన్నగాడి ఊసెప్పుడూ ఎత్తేవాడు కాదు. ఇప్పుడు కూడా ఈ స్థితిలో ఇంటికి వెళ్ళి దానికి ఎదురుపడి మాట్లాడాలనీ, అది తీసే ఆరాలకి జవాబులు చెప్పాలనీ లేదు. చెప్పినా అర్థం కాదు. పైగా అదొదిలేసి- కృష్ణగారాళ్లావిడతో ఉన్న గొడవలు గుర్తు తెచ్చుకోవటమో, వాళ్లు గొప్పోళ్ళయిపోయి కళ్ళు నెత్తికెక్కి పెళ్ళికి పిలవలేదని సణుక్కోవటమో చేస్తుంది.

సూర్రావు సిగరెట్టు పడేసిలేచి వచ్చినదారినే వెనక్కి నడవటం మొదలుపెట్టాడు. కన్నగాడు బతికుంటే తన జీవితం ఎలా వుండేదో అతను అపుడపుడూ ఊహించుకుంటూ ఉంటాడు. కూతురికి రూపంలో సూర్రావు పోలిక వచ్చింది కానీ గుణం మాత్రం తల్లే. కానీ కన్నగాడి రూపం తల్లిదే అయినా గుణం సూర్రావుదే. చదువు మీద అస్సలు శ్రద్ధ ఉండేది కాదు. ఏడో తరగతి ఎలాగో గట్టెక్కించాడు. వాడు బాగా చదువుకోవాలని సూర్రావుకి ఉండేది. వాడు మాత్రం వేసవి సెలవుల్లో నాన్న దగ్గర కుట్టుపనిలో సాయం చేయటానికే ఎక్కువ ఇష్టపడేవాడు. బతికుండుంటే తనకి పనిలో సాయంగా ఉండేవాడేమో. ఏముంది, సెంటరు లోనో, మండపేటలోనో ఇంకో షాపు పెట్టుకునుండేవాడు. ఇల్లు అమ్మే పని లేకుండానే చెల్లి పెళ్ళి చేసుండేవాడు. ఆళ్లమ్మ ఆపరేషనుకి అప్పుచేయాల్సిన పని లేకుండా సాయంగా ఉండేవాడు. సూర్రావు జీవితంలో ఓడిపోయిన, అవమానాలు పాలైన సన్నివేశాలని తలుచుకున్నాడు. ఆ సమయాల్లో తన పక్కన ఒక పెద్దరికం ఉట్టిపడే యువకుడి సమక్షాన్ని ఆసరాగా ఊహించుకున్నాడు.

గాంధీ బొమ్మ సెంటరుకి అవతలిపక్క వీధిలో కృష్ణగారి ఇల్లు. సూర్రావు వీధి మలుపు తిరిగేసరికి కృష్ణగారి ఇంటి ముందు పందిరి వేసి కనిపించింది. దానికి అవతల దారిని కప్పేసివున్న ఒక టెంటులో భోజనాల బల్లలు పరిచి ఉన్నాయి. ఇంకా వడ్డనలు మొదలు కాలేదు. ఎవరో కుర్రాళ్లు జానిబాబు ఫ్రెండ్స్ కాబోలు బల్లల దగ్గర అల్లరల్లరిగా మాట్లాడుకుంటున్నారు. గుమ్మం ముందున్న పందిరి కింద పంచెల్లోనీ, మడత నలగని ఖద్దరు చొక్కాల్లోనీ పెద్దాళ్లు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. పందిరికి ఇవతల తూము దగ్గర ఒక కారు రంగురిబ్బన్లతో, ప్లాస్టిక్ పూలతో ముస్తాబై ఉంది. అద్దానికి ఓ పక్కన లవ్ గుర్తు మీద “జ్ఞానేష్ వెడ్స్ సుహాసిని” అనీ, బంపరు పైన థెర్మాకోలు అట్ట మీద “బలుసువారి పెళ్లి సందడి” అనీ రంగుల్లో పేర్లు ఉన్నాయి.

సూర్రావు కుర్చీల వెనక నుంచి ఇంటి వైపు నడిచాడు. అరుగు మెట్లెక్కి, కర్టెన్లు వేసున్న కటకటాల గదిలోకి వెళ్ళాడు. గుమ్మానికి ఎదురుగా కెమెరా స్టాండు ముందు ఫొటోగ్రాఫరు నిలబడి ఉన్నాడు. అతనికి అటూయిటూ కొంతమంది కుర్రాళ్లు సెల్‌ఫోనుల్లో ఫొటోలు తీస్తున్నారు. ఈ గుంపుకి ఎదురుగా, పళ్లేల్లో స్వీట్లూ పళ్లూ పెట్టివున్న టీపాయికి అవతల, షామియానా సప్లయిర్స్ వాళ్ళ వెండి రంగు డిజైన్లున్న ఎరుపు కుర్చీలో కూర్చుని ఉన్నాడు జానిబాబు. అతని మీద అక్షింతలు వేస్తూ ఫోటోలు దిగుతున్నారు చుట్టాలూ, ఊళ్లో దంపతులూ. ఆ వెనకాల గాగ్రా చోళీల్లోనూ, పట్టు చీరల్లోనూ అమ్మాయిలూ, ఆడవాళ్లూ సందడిగా తిరుగుతున్నారు. సూర్రావు ఓ క్షణం గడప మీంచి కాలు వెనక్కి తీసుకోబోయినవాడే మళ్లీ లోపలికి అడుగుపెట్టాడు. ఎవరూ అతడ్ని గమనించలేదు. కటకటాలకి ఆనుకుని నిలబడిన గుంపులో చేరాడు. ఆ గది అంతా ఆనందపు మాటలతో, నవ్వులతో, కెమెరా ప్లాష్ లతో ఉంది.  జానిబాబు అక్షింతల కింద నుంచి చూస్తూ, కొత్తగా కనిపిస్తున్న మీసకట్టు కింద నుంచి నవ్వుతున్నాడు.

సూర్రావు తన కొడుకుని అలాగే పెళ్లి బట్టల్లో ఊహించుకోవడానికి ప్రయత్నించాడు. అర్ధాంతరమైన మరణం వల్ల ఎప్పటికీ పసితనంతోనే మిగిలిపోయిన కన్నగాడిని తన ఊహలోనే వయసు పెరిగేట్టు చేసాడు. కన్నగాడి పెదాలపై పసి నూగుని గరుకు మీసంతో మార్చి, తెల్ల చొక్కా పంట్లామూ తొడిగి, నుదుటన పెళ్లి బొట్టు దిద్దబోయాడు. కానీ లోపలికళ్ల ముందుకొచ్చి కదలాడిన రూపం అతని కొడుకులా లేదు. అది కూడా పరకాయించే కొద్దీ దూరమై మసకగా మారి మాయమైపోయింది. ఆ ప్రయత్నం మానుకుని చిన్నప్పటి కన్నగాడినే పెళ్లి ముస్తాబులో ఊహించుకున్నాడు. బడి నుంచి పరుగుల పరుగుల మీద షాపుకి వచ్చి పుస్తకాల సంచీ విసిరేసి తనని వెనకాల నుంచీ చెంపలు తగిలేలా కావిలించుకున్నప్పటి పసిరూపాన్నే, ఇప్పుడు జానిబాబు కూర్చున్న స్థానంలో వరుడిగా కూర్చోబెట్టుకున్నాడు. అక్షింతల కింద నుంచి నవ్వాడు కన్నగాడు. వాడు చనిపోయాకా అలవాటైపోయిన, కుమ్మరించినట్టు మీదికొచ్చి పడే దిగులును-- తను తాగినపుడు మాత్రమే రానిచ్చే ధైర్యం చేసే దిగులును-- గొంతులో మెలిపడిన మడతలా దిగమింగుకుని, అక్కడి పరాచికాల వాతావరణం మీదికి మనసు మళ్ళించుకున్నాడు. ఎవరో ముత్తయిదువ జానిబాబుని ఆటపట్టిస్తుంటే దాన్ని పట్టించుకుని నవ్వుతున్నాడు.

కాస్త నిలదొక్కుకున్నాకా, చేతులు విప్పుకుని ముందుకెళ్ళి బల్ల మీద ప్లేట్లో అక్షింతలు అందుకుంటూ, “ఏ జానిబాబూ బావున్నావా,” అన్నాడు.

జానిబాబు “అంకుల్!” అని నవ్వుతూ గుర్తుపట్టాడు. షాపు గురించి అడిగాడు, ఆంటీ రాలేదేమని అడిగాడు, చెల్లిని ఎక్కడిచ్చారో కనుక్కున్నాడు.

సూర్రావు అక్షింతలు చల్లి, జానిబాబు అరచేతిని చేతుల్లో తీసుకుని నిమురుతూ సమాధానాలు చెప్పుకొచ్చాడు. హైదరాబాదులో జానిబాబు ఉద్యోగం గురించి అడిగాడు. సాయంత్రం పానింగిపల్లిలో పెళ్లికొస్తానని మాటిచ్చాడు. “పెద్దోడివైపోయావురా, ఎంబట్నే ఆనవాలు కట్టలేపోయాను,” అని జానిబాబు వీపు మీద మెత్తగా రుద్దాడు. ఎవరో పలకరించి జానిబాబు వాళ్ల వైపు తిరిగితే, బైటుంటానని బయల్దేరాడు.

బయట సూర్రావు నడిచి వెళ్ళిపోతుంటే, కృష్ణగారు ఎవరితోనో కారు దగ్గర నిల్చొని మాట్లాడుతున్నవాడల్లా, “ఏం సూర్రావ్, ఎక్కడికి? బోయనం చేస్సెళ్ళు,” అన్నాడు.

“మళ్లొత్తానండి,” అని గబగబా నడిచి వెళ్లిపోయాడు.

జానిబాబుకి అప్పటికి ఏం గుర్తు రాలేదు. ఎవరో భోజనాలకని లేపినపుడు పెరట్లో కాళ్లు కడుక్కుంటుంటే గుర్తొచ్చింది- ఎనిమిదో తరగతిలో ఆ రోజు బడి ఎగ్గొట్టి గోదాటి స్నానాలకెళ్లిన రోజు, స్నానాల రేవు దగ్గర, రాతి పలకల మీద, తడిసివున్న కన్నగాడి శరీరాన్ని ఒళ్లోకి తీసుకుని సూర్రావు గారు ఏడుస్తున్న దృశ్యం. జానిబాబు చెంబు బకెట్లో వదిలేసి గదులు దాటుకుని అరుగు మీదకు వచ్చి చూసాడు. భోజనాలు చేస్తున్నవాళ్ళలో ఎక్కడా సూర్రావు కనపడలేదు. కృష్ణగారు “ఏరా, ఏం కావాలి,” అని అడిగారు కింద నుంచి. “ఏం లేదు నానగారు,” అంటూ వీధి మలుపు వైపు చూస్తూండిపోయేడు.

*
"నవ్యాంధ్ర సాహిత్య ప్రత్యేక సంచిక" (ఫిబ్రవరి)లో ప్రచురితం

2 comments:

  1. "అందరితోనూ కన్నీటి పర్యంతమై చవగ్గా పంచుకునే దిగులు" లో ఉండే shallowness నచ్చదు. అలాగని "లోపలి నుంచీ తినేసి భవిష్యత్తుపైన నీడలు వాల్చిన దిగులు" ని భరించలేం. బహుశా అలాంటి లోతైన దుఖ్ఖాన్ని మ్యానేజ్ చేయటం కోసమే అన్నీ తత్వాలు పుట్టాయనుకుంటా.

    కథలో చాలా ఆర్తి ఉంది. జ్ఞాపకాలుగ మిగిలిన మూడు ఫోటోల్లోనూ, ఎంతో బాగుండే కన్నగాడి నవ్వు దక్కకపోవటం దుఖ్ఖం కలిగించింది.

    ReplyDelete
  2. చాలా బావుంది. ఆ కడుపు కోతని, అతని తండ్రి మనసుని చాలా బాగా రాసారు.

    ReplyDelete