June 11, 2011

పుస్తకాల్ని ఎందుకు పద్ధతిగా సర్దుకోవాలంటే…!

నేను గది చేరే సరికి రాత్రయింది. తలుపు తాళం తీసి లోపలకు అడుగుపెట్టాను. లైటూ ఫానూ వేసి, పగటి దుస్తులు విడిచి, టవల్లోకి మారి స్నానానికి వెళ్ళబోతూ, అదాటున చెంబుడు చన్నీళ్ళు వంటి మీద పడితే కలిగే బిత్తరపాటు భరించడానికి శరీరం అప్పుడే సన్నద్ధంగా లేకపోవడంతో, కాసేపు తాత్సారం చేద్దామని, అరలోంచి పుస్తకం తెచ్చుకుని కుర్చీలో కూర్చున్నాను. అట్ట తీసానో లేదో కరెంటు పోయింది. ఒక్కసారిగా కళ్ళముందు దట్టమైన నలుపు పులుముతూ కటిక చీకటి కమ్ముకుంది. కరెంటుతో పాటూ నా ఉనికిని నిరూపించే నాలోని యింద్రియమేదో కూడా ఆరిపోయినట్టయింది. నేనక్కడ లేను. వట్టి గది వుంది. అప్పటిదాకా నా నిర్లక్ష్యాన్ని భరించిన గది అదను చూసుకుని తన ఉనికిని చాటింది. నేనున్నానంది. నువ్వు లేవంది.

ఈ గది నన్నింకా పూర్తిగా స్వీకరించలేదు. క్షణం క్రితం వరకూ గెడ బయటవేసి వుంది, యిపుడు లోపల వేసి వుంది. అంతే తేడా. యీ గదిలో నా గైర్హాజరీ యింకా కొనసాగుతుంది. ఈ గది...! పొద్దున్న నేను తలుపు తాళం వేసివెళ్ళిందగ్గర్నించి, ఒక నిముషం క్రితం తాళం తీసేవరకూ, తన మానాన తానున్న గది! బయట రోజెలా మారుతుందో పట్టించుకోని అంతర్ముఖీనమైన గది! నేను ఆఫీసులో వున్న క్షణాల్లో యిదిక్కడ యేం చేస్తుందో, నా కోసం ఎదురుచూస్తుందో లేదో, అసలు నేను రావటం దీనికి ఇష్టమో కాదో, నేను వెళ్ళిపోయినప్పుడల్లా వెనక యిది చప్పట్లు కొట్టి సంబరం చేసుకుంటుందో యేమో! నేను లేని క్షణాల్లో నా గది ఎలా సమయం గడుపుతుందో యోచించాను. గది కన్నా ముఖ్యంగా, గదిలో నా పుస్తకాలు ఎలా కాలక్షేపం చేస్తాయోనని ఆలోచించాను.

(అవి గది కన్నా సజీవంగా అనిపిస్తాయి. ఎందరెందరో రచయితలు, ఏవేవో దేశాలవాళ్ళు, ఏవేవో కాలాలవాళ్ళు, వారివారి వ్యక్తిగత జీవిత వేళల్లో, కుదుర్చుకున్న సమయాల్లో, ఏ తెల్లారగట్లో మధ్యాహ్నాలో నిశిరాత్రుళ్ళో, ఏ యిరుకు గదుల్లోనో, విశాలమైన గదుల్లోనో, ఏ తెల్లకాగితాల మీదో, టైపు రైటర్ల మీదో, కంప్యూటర్ తెరల మీదో... సాగించిన స్వీయ చైతన్య మథనానికి ఫలితాలు కదా ఈ పుస్తకాలు. ప్రతీ పుస్తకం యేదో మస్తిష్కపు చైతన్యాన్ని అక్షరాలనే చిహ్నాల్లో నిలుపుకుని వెంట తెచ్చుకున్నదే కదా. కాబట్టి గది కన్నా, అందులో యితర వస్తువుల కన్నా, యివి సజీవత్వపు పాత్రని బాగా పోషిస్తాయి.)

నేను లేని సమయాల్లో నా పుస్తకాలు సామరస్యంగానే వుంటున్నాయా, సఖ్యతతో కాలక్షేపం చేస్తున్నాయా? ఆలోచన యింకా మొదలవకుండానే... భళ్ళున కళ్ళను వెలిగిస్తూ చుట్టూ కరెంటు వచ్చింది. పుస్తకాల అల్మరాని తేరిపార చూసాను. అవి నేను లేనపుడు ఎంత అసహనాన్ని భరిస్తున్నాయో గ్రహించడానికి ఎక్కువసేపు పట్టలేదు.

కొన్నంటే సరే, సఖ్యంగానే వున్నాయనిపించింది. భమిడిపాటి కామేశ్వరరావు ప్రక్కన ముళ్ళపూడి వెంకటరమణ మొదట్లో కాస్త భక్తిగా ఒదిగినా, కాసేపట్లోనే గురువుగారి దగ్గర కొత్త పోగొట్టేసుకుని చిలిపి జోకులు పేల్చేస్తాడు. కొండొకచో అవి పేలేవి చుట్టూ వున్న రచయితల బోడి సీరియస్నెస్ మీదే! క్రింద అరలో శ్రీపాదకీ బానే సాగుతోంది. ప్రక్కనే మల్లాది రామకృష్ణశాస్త్రి వున్నాడుగా. “ఆహా ఒహో మీ వచనం! తెలుగుతనానికి నారాయణ కవచం!” అంటూ మునగచెట్టెక్కించేస్తాడు. ప్రక్క అరలో జి.కె. చెస్టర్‌టన్ ద్వారా చార్లెస్ డికెన్సుకీ యిదే వైభవం జరుగుతుంది. ఆ పై అరలో కాస్త టెన్షన్ లేకపోలేదు. కళ పట్ల ఫ్లొబేర్ మొండి సిద్ధాంతాలకి మనసులో సణుక్కుంటూనే, గొడవెందుకు అందర్లాగే పైకి వినయంగా వుంటే పోలా అని నిమ్మకుంటాడు సాల్‌బెల్లో. దాస్తొయెవ్‌స్కీ ప్రక్కనున్న అల్బెర్ట్ కామూ క్షణాల్ని యిట్టే కరిగించేసుకుంటాడు. ఎడ్మండ్ వైట్ చెప్పే హోమోసెక్సువల్ పిట్ట కథల్ని డి.హెచ్. లారెన్సు “జెండర్ మారితే ఏమైందిలే సెక్సు సెక్సే కదా” అని సరిపుచ్చేసుకుని చెవులప్పజెప్పేస్తాడు.

వీళ్ళందరి సంగతీ ఫర్లేదు. ఏదోలా సఖ్యంగానే కాలక్షేపం చేసేస్తారు. కానీ మిగతా వారందరి సంగతీ! నబొకొవ్‌కి తన ప్రక్కనే వున్న దాస్తొయెవ్‌స్కీ పొడంటేనే గిట్టదాయె. “చవకబారు సెంటిమెంటలిజమూ, లేకితనమూ నువ్వూనూ...” అంటూ నానా మాటలూ లంకించుకుంటాడు. అంతటితో ఆగుతాడా, ఆ ప్రక్కనే దాస్తొయెవ్‌స్కీ నించి అస్తిత్వవాద సారాన్నంతా జుర్రేసుకుంటూ పలవరించిపోతున్న అల్బెర్ట్ కామూని “కాస్త గమ్మునుండగలవా మెస్యూర్ కామూ” అని విసుక్కోడూ! ఇంతున్న విషయాన్ని అంత చేసి మాట్లాడే రవీంద్రనాథ్ ఠాగూర్ తన ప్రక్కన “ప్రతీ మాటా నిశ్శబ్దం మీదో మరక” అంటూ నోరు విప్పని శామ్యూల్ బెకెట్‌ని పాపం ఎలా తట్టుకుంటాడో. ఠాగూర్ మీద ఈ నింద మోపేది పై అరలోనున్న బోర్హెసే. అంతేనా, అతణ్ణి “వట్టి స్వీడీష్ ఇన్వెన్షన్” అని తీసిపారేస్తాడు కూడా. నిజమెంత వున్నా, ఆ నోబెలేదో తనకి రాలేదన్న దుగ్ధే చూడరూ జనం ఆ మాటల్లో! అక్కడికి ఆయనకీ ఏం మహా సుఖం లేదు తన అరలో. ఎందుకంటే, తన మొత్తం పుస్తకాలన్నింటిలోనూ ఒక్కటంటే ఒక్క శృంగారపూరితమైన పేరా కూడా రాయని ఈ కామ విరాగిని తీసుకుపోయి పిలిఫ్ రాత్ ప్రక్కన (అదీ బోలెడు సెక్సున్న ‘పోర్ట్నీస్ కంప్లెయింట్’ ప్రక్కన) పెడితే యిబ్బంది పడడూ! బోర్హెస్‌కి మరో ప్రక్క వున్నది నబొకొవ్! అతనేదో అభిమానం చూపిస్తున్నా, అతని అతిశయం బోర్హెస్‌కి గిట్టదు. గొప్పగా రాస్తాడు సరే! మరీ ఆ విషయాన్ని స్వయానా గుర్తెరిగివున్నట్టు ప్రవర్తిస్తే ఎలా! కాస్త నిరాడంబరంగా ‘అబ్బే అంతేం లేదు’ అని బిడియపడరాదూ, తనలాగా! అందుకే, “కాస్త ఆ పై అరలో ఎడ్గార్ అలెన్‌పోకీ, రాబర్ట్ లూయీ స్టీవెన్సన్‌కీ మధ్య నన్ను పారేయరాదూ” అని అడుగుతున్నాడు. కాఫ్కాకి హొమోఫోబియా వున్నట్టు ఎక్కడా చెప్పబడలేదు. కనుక యిటు ప్రక్కన మార్సెల్ ప్రూస్ట్‌తో బానే కాలక్షేపం చేసేయగలడు. కానీ రెండో ప్రక్కన జిడ్డు కృష్ణమూర్తికి బదులు చివరనున్న ఆర్థర్ షోపనార్ అయితే బాగుండుననుకుంటాడు. జె. డి. శాలింజర్ బాధ వేరు. ఏ సొరుగు మూల్లోనో పడేయక, యిలా బాహటంగా అందరూ వున్న అల్మారాలో యిరికించేసానని సంకటపడతాడు. ప్రక్కనున్న గురువుగారు మార్క్ ట్వయిన్‌ కూడా అతని ఆదుర్దానేమీ తగ్గించలేడు. హెన్రీ డేవిడ్ థొరూ పరిస్థితీ యిదే. ట్రాఫిక్ శబ్దాలు లీలగా వినిపించే గదిలో, యినుప అల్మారాలో, ఒద్దికైన వరుసల్లో పద్ధతైన కృతక జీవనం నచ్చదు. విశృంఖలత్వం కావాలి. ప్రకృతి కావాలి. వాల్డెన్ సరస్సుని కలవరిస్తాడు. మరో అరలో బెర్గ్‌సన్‌ యేమో భావవాదంతోనూ, బెట్రండ్ రస్సెలేమో భౌతికవాదంతోనూ బుర్రలు బాదేసుకుంటారు. డేవిడ్ హ్యూమ్ హేతువుకీ, అరబిందో ఆధ్యాత్మికతకీ పొసగక పోట్లాటలు మొదలవుతాయి. స్పినోజాకి కాఫ్కా బాధ అర్థం కాక అయోమయ పడతాడు. యింకో అరలో రోవెర్తొ బొలాన్యొ సాటి లాటిన్ అమెరికన్ రచయిత మార్కెజ్‌ని "నువ్వూ నీ బొందలో మేజిక్ రియలిజం" అంటూ ఈసడించుకుంటాడు. బాగా క్రింద అరలోనేమో అయాన్ రాండ్ తలవాచేట్టు శామ్యూల్ జాన్సన్ అమ్మనా చీవాట్లూ పెట్టడం ఖాయం. వడ్డెర చండీదాస్‌‌కి యిటుప్రక్కగా ‘అంపశయ్య’ నవీన్ బానే కాలక్షేపం చేస్తాడు గానీ, అటుప్రక్క వున్న మధురాంతకం రాజారాం మాత్రం అమాయకంగా బిక్కచచ్చిపోతాడు. అందరికన్నా యిబ్బంది పడేది విశ్వనాథ. వెంకటచలాన్ని మోయలేక విసుక్కుంటాడు. చలం పాపం ఎక్కడున్నా సర్దుకుపోతాడు. ఆ యిబ్బంది లేదు. ప్రక్కన వున్నది కమలాదాస్ అయితే  యింకస్సలు లేదు. పై అరలోంచి సుబ్బారావు గారి ఎంకిపాటలూ వినపడుతున్నాయాయె. బుచ్చిబాబు గారి ‘దయానిధి’ పడే వున్నతమైన అస్తిత్వ వేదనల్ని చూసి, యిటుప్రక్క గురజాడ వారి గిరీశం మర్యాదగా పొట్టకదలకుండా కిసకిసమని నవ్వుకుంటూంటే, మరోప్రక్క తెన్నేటి వారి చంఘీజ్‌ఖాన్ మాత్రం, ఎంతైనా సూటూ బోడ్గా బట్ టెంగ్రీ కదా, ఎవడికి జడిసేది, ‘ఇహ్హహ్హా’ అని బాహటంగా పగలబడిపోతాడు. అక్కిరాజు ఉమాకాన్తం కసుర్లు వినపడేంత దూరంలోనే వున్నాడు దేవులపల్లి కృష్ణశాస్త్రి. ప్రమాదమే కదా.

యిలా ఒకట్రెండనేమిటి! అల్మరాల్లోని ప్రతీ అరలోనూ ఏవో గొడవలే, గిల్లికజ్జాలే, పొరపొచ్చాలే, ఆరోపణలే, హెచ్చుతగ్గుల పోట్లాటలే కన్పిస్తున్నాయి. యిలాగైతే నేను గది తలుపు మూసుకుని ఆఫీసుకు వెళ్ళిందగ్గర్నించీ గదిలో ఏమన్నా ప్రశాంతత వుంటుందా! పరస్పర సఖ్యత లేని యిలాంటి చోట నిశ్శబ్దపు మధ్యాహ్నాలని పుస్తకాలేమన్నా ఆస్వాదించగలుగుతాయా! అందుకే, పుస్తకాల్ని ఒక పద్ధతిలో సర్దుకోవాలి! పితూరీల్లేకుండా, గొడవలు రాకుండా చూసుకోవాలి!

17 comments:

  1. అద్భుతంగా రాసారు. నేనూ నా పుస్తకాలని ప్రాణం వున్నట్టుగానే భావిస్తాను. నా లాంటి వాళ్ళు ఇంకా వున్నారని సంతోషం వేసింది. మా అబ్బాయి పుస్తకాన్ని గట్టిగా లాగితే , దాని విలువ తెలుసుకుని ప్రవర్తించమని చెబుతాను. మీ రాతలు బాగా నచ్చేసాయి. దీన్ని పోస్ట్ చేసి మళ్ళీ చదువుతాను. అందరినీ(పుస్తకాలని) అడిగానని చెప్పండి.

    ReplyDelete
  2. హహహ! ఇది చదివిన వెంటనే, కాలేజీ రోజుల్లో ఒకే కేసట్లో ఒక పక్క గాంగ్ లీడర్ మరో పక్క దేవదాసు పాటలు రికార్డు చేసుకున్న సంగతి గుర్తుకువచ్చింది. :-)
    మొన్నీ మధ్య పుస్తకాల అర సద్దినప్పుడు పనిగట్టుకొని శ్రీశ్రీని విశ్వనాథని పక్కపక్కన పెట్టాను. అసలు ఒకరి మధ్యలో ఒకర్ని పెడదామనుకున్నా కాని శ్రీశ్రీ సిగరెట్టు పొగకి పాపం పెద్దాయన ఇబ్బంది పడతాడేమోనని ఊరుకున్నా. ఎందుకైనా మంచిదని విషవృక్షాన్ని మాత్రం కల్పవృక్షానికి సాధ్యమైనంత దూరంగా ఉంచా.
    అలమారా అయితే అలా సర్దడం వీలవుతుంది గాని మనసులో కుదరదుగా!

    ReplyDelete
  3. bertrand russell,dickens,kamala das,D.H.lawrence,thoreau's walden...arobindo..feelt like smelling the first rain !!

    superb imagination !! remembered the film 'night in the museum'.hpoe u know the story..:)

    ReplyDelete
  4. lot of problem in this comment form..took 20 mins to publish my previous comment. pl.check if there's any problem.

    ReplyDelete
  5. చాలా బాగుందండీ..

    ReplyDelete
  6. అయ్ బాబోయ్ నా పుస్తకాలు చెప్పే ఊసులు వినాలి. ఇలా గొడవ పడకుండా సర్దేసుకోవాలి..లేకుంటే అందరు కలిసి నన్ను తన్నేస్తారేమో.. నా పుస్తకాలంటే పసిడి, పట్టుచీరలకంటే ప్రాణం.. అవి మాత్రం ఎవ్వరికీ ఇవ్వను.

    ReplyDelete
  7. :-))Nice imagination ...!

    పుస్తకాలు సర్దటం ఒక వ్యాధిలాగా పట్టుకుంటుంది నాకు. అప్పుడు నేనూ ఇలాంటి కాలిక్యులేషన్స్ వేసి చలాన్నీ రంగనాయకమ్మనీ ఓల్గానీ ఒక వరసలో ఉంచుతాను. కుటుంబరావుగారికి ఒక అరంతా ప్రత్యేకం! ఆయనవి ఎన్ని చదివినా సరే, ఇంకెవరితోనూ కలపబుద్ధి కాదు. వంశీ,భరణి ఇత్యాదులంతా ఒక చోట.......ఇలా!

    ReplyDelete
  8. పుస్తకాలకి ఇంతకన్నా అందంగా ఐలవ్యూ అని ఎవరు చెప్పగలరు. చదువుతుంటే ముచ్చటేస్తోంది. "చూడరా బొమ్మలకీ ప్రాణం ఉందని ఆలోచించాలంటే అసలా రైటర్ కి ఎంత సున్నితత్వం ఉండాల్రా" అని టాయ్ స్టోరీని చూసి ముచ్చటపడ్డ మా సురేష్ కి చదివి వినిపిస్తానీ టపా. మురిసి మూర్ఛపోతాడు.
    --సూరంపూడి పవన్ సంతోష్.

    ReplyDelete
  9. @ tolakari, teresa, Sravya, భాను, జ్యోతి, సుజాత, సంతోష్... I am glad! :)

    కామేశ్వర రావు గారు, సిగరెట్ కాదు గానీ, ఎందుకో ఎక్కడా చదవకపోయినా వినకపోయినా, నా ఊహల్లో విశ్వనాథ చుట్ట కాలుస్తాడని ఊహించేసుకున్నానే... కాదన్నమాట.

    తృష్ణ గారూ, థాంక్స్. నేను కామెంట్ పెట్టి చూసాను. కొన్ని బ్రౌజర్లలో ఈ embedded comment box సరిగా పనిచేయదనుకుంటా. అదే మీ యిబ్బంది బహుశా.

    ReplyDelete
  10. విశ్వనాథకి వక్కపలుకు అలవాటుండేదని తెలుసుకానీ చుట్టా కాల్చేవారని నేనూ ఎక్కడా చదివిన గుర్తులేదు. అయినా అది స్వదేశీ, సిగరెట్టు విదేశీ :-)
    పొగతాగే కవుల మీద (బహుశా శ్రీశ్రీని ఉద్దేశించే) ఒక విసురు మాత్రం విసిరారని తెలుసు, ఈ పద్య రూపంలో:

    సొరిది భారతమును వ్రాయ సోమయాజి
    అగ్నిహోత్రాలు చేసినాడనుట నిజమె
    అగ్నిహోత్రాలు లేకుండ నక్షరంబు
    సాగదే కద నేటి మా సత్కవులకు

    ReplyDelete
  11. :) బావుంది. థాంక్యూ వెరీ మచ్!

    ReplyDelete
  12. మెహెర్ గారు
    ఇలాంటి చిలిపి ఊహలు నాకూ వచ్చినప్పుడు నవ్వుకున్నాను కానీ ఇంత అందమైన వాక్యాలుగా పేర్చి పంచుకోవడం మాత్రం అద్భుతంగా అనిపించింది. చిన్నప్పుడు బొమ్మల కొలువు పెట్టి..ఒక్కో మెట్టు మీద ఒక్కోరకం బొమ్మలు, పౌరాణికం, సాంఘికం, జానపదం అలా వర్గీకరించి పెట్టేవాళ్ళం...అలాగే పార్క్ తయారుచేసి పల్లెటూరు, పట్నం రెండూ విడదీస్తూ రైలు పట్టాలు పెట్టేవాళ్ళం. జూపార్క్ లో జంతువులు పెట్టేవాళ్ళం...రాత్రి ఓ చిన్న లైట్ వేసి చిన్నపిల్లలు, ఇంట్లో కుక్కపిల్లలు అటు వెళ్ళి పాడుచేయకుండా తలుపు వేసేసి వెళ్ళేది అమ్మ...ఇక చెల్లీ నేను నిద్రపోయినట్టు నటిస్తూ అమ్మ వెళ్ళగానే ఆ బొమ్మలు ఒక్కొక్కటీ ఎలా ప్రవర్తిస్తాయో ఊహిస్తూ, ఆ ఊహల్లోనే అద్భుతంగా ఆనందాన్ని అనుభవిస్తూ ఉండేవాళ్ళం...మళ్ళీ ఆ చిన్ననాటి అనుభూతులను నెమరేసాను..పుస్తకాల పేర్పులో చూపించాల్సిన నేర్పు ను ఎంతో చక్కగా చెప్పారు.పైన చెప్పినట్టు పుస్తకాలకు ఇంతకన్నా చక్కగా ఐలవ్యూ ఎవరు చెప్పగలరు...

    ReplyDelete
  13. ఎంత చక్కటి ఊహ!!! నాకూ నైట్ ఎట్ ద మ్యూజియం గుర్తొచ్చేసింది. ఇంకో సంగతి కూడా!
    నా చిన్నప్పటి బొమ్మల కొలువులో రెండు అందమైన కృష్ణ జింకలుండేవి. వాటిని సింహ వాహని దుర్గ దరిదాపుల్లో పెట్టేదాన్ని కాదు. నాగరీకం బొమ్మలైన శెట్టిగారు, శెట్టమ్మలను దేముళ్ళ పక్కన కూర్చోబెట్టనిచ్చేది కాదు మా నాయనమ్మ. బొమ్మలకే రూల్స్ ఉన్నప్పుడు, పుస్తకాలకి ఉండడం ఇంకా అందంగా ఉంది వినడానికి. భలే! :)

    ReplyDelete
  14. సుధ, కొత్తావకాయ గారు, glad you liked it! :)

    ReplyDelete
  15. నాకు చాలా బాగా నచ్చింది. ఇంగ్లీషు పుస్తకాలు ఇంకా చదవలేదు కానీ, నా దగ్గర ఉన్న తెలుగు పుస్తకాలను చూసినపుడు ఇంటువంటి ఊహలు కలిగేవి. నా దగ్గరైతే విశ్వనాధ, రంగనాయకమ్మ పక్కపక్కనే. దయానిధిని కాపాడటానికి నవీన్, చండీదాస్, వేణుగోపాల్ ముగ్గుగు కాపలాగా ఉంటారు చుట్టూ.

    ReplyDelete