చివరికెలాగో మా సైన్యాలు కోట దక్షిణ ద్వారం గుండా నగరంలోకి చొరబడ్డాయి. మా దళంవాళ్ళం మాత్రం ఇంకా కోట బయటే ఉన్నాం. నగర శివార్లలోని ఒక తోటలో, సగం కాలిన చెర్రీ చెట్ల మధ్య కూర్చొని, తర్వాతి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాం. కానీ ఎప్పుడైతే దక్షిణ ద్వారం నుంచి పెద్దగా విజయ దుందుభుల మోత విన్నామో, ఇక ఆగటం మా వల్ల కాలేకపోయింది. చేతికందిన ఆయుధాలని దొరకపుచ్చుకొని, ఒకరి చేయి ఒకరం గట్టిగా పట్టుకొని, 'కహీరా! కహీరా!' అంటూ మా యుద్ధనినాదాల్ని గట్టిగా అరుచుకుంటూ, బురద నేలల్లోంచి బారులు తీరి నగరం వైపు నడిచాం. దక్షిణద్వారం దగ్గర మాకు గుట్టలు గుట్టలుగా శవాలూ, ఏదీ కనపడకుండా కమ్మేసిన పసుపురంగు పొగా ఎదురయ్యాయి. యుద్ధం అంతా అయిపోయాకా వచ్చిన దండులాగా మేం మిగిలిపోదల్చుకోలేదు. ఆత్రంగా, ఇంకా యుద్ధపు సెగ తాకని ఇరుకు సందుల్లోకి పరిగెత్తాం. నా ఒకేవొక్క గొడ్డలి వేటుకి మొదటి ఇంటి తలుపు ముక్కలుచెక్కలైపోయింది. లోపలికి ఎంత ఉన్మాదంగా దూసుకుపోయామంటే, దాన్ని చల్లార్చేది ఏదీ కంటపడక కాసేపు ఒకరి చుట్టూ ఒకరం కలదిరిగాం. ఇంటి లోపల్నించి, పొడవాటి వరండా గుండా, ముసలివాడొకడు మా వైపు వస్తున్నాడు. వింత ముసలివాడు- వాడి వీపు వెనకాల రెక్కలు ఉన్నాయి. విశాలంగా విచ్చుకున్న ఆ రెక్కల పైఅంచులు అతని కంటే ఎత్తులో ఉన్నాయి. "వాడికి రెక్కలున్నాయ్!" నేను మా దళంవాళ్ళ వైపు అరిచాను. అందరం కాస్త వెనక్కి జంకాం, వెనక నుంచి లోపలికి తోసుకొస్తున్నవాళ్ళు అడ్డం తగిలేదాకా. నన్ను చూసి ఆ ముసలివాడు మాట్లాడాడు, "అంత ఆశ్చర్యపోనక్కర్లేదు. నాకొక్కడికే కాదు. మా అందరికీ రెక్కలున్నాయి. కానీ వాటి వల్ల ఒనగూడిందేమీ లేదు. వాటిని పెరికేసుకునే అవకాశమే గనక ఉంటే అలాగే చేసుండేవాళ్ళం," అన్నాడు. "ఇక్కడి నుంచి ఎగిరిపోవచ్చు కదా?" అని అడిగాను. "మా నగరాన్ని వదిలి ఎగిరిపోవాలా? మా ఇంటినీ, చనిపోయిన మా వాళ్ళనీ, మా దేవతల్నీ విడిచిపెట్టి?" అన్నాడు.
Thank you.. Nice Translation
ReplyDeleteఅనువాదం బాగుంది మెహెర్.
ReplyDelete"చిత్తడి నేలలు" - చక్కటి సూచన(వారిది), సవరణ(మీది).
వంశీ గారి మూడవ వ్యాఖ్యతో నేనూ ఏకీభవిస్తాను. "వైపు చూసి" అన్నదే మూలంలో ఉన్న అర్థాన్ని సరిగ్గా ప్రతిఫలింపజేస్తోందని నా అభిప్రాయం. జర్మన్ నుండి గూగుల్ ఉపయోగించి ఆగ్లంలోకి అనువదించినప్పుడూ, అర్థం ఇలాగే వచ్చినట్టు తోచింది.
కానైతే, రాసేటప్పుడు, రచయితకి మాత్రమే వరమయ్యే ఒక అదృశ్య దిక్సూచి, మిమ్మల్ని ఈ అభిప్రాయనికొచ్చేందుకు సాయపడిందని భావిస్తూ, దానిని గౌరవిస్తాను.
-మానస