నా మొదటి నవల ‘ఇద్దరూ కలవక ముందు’ పబ్లిష్ అయ్యింది. ఇప్పటిదాకా కథలే రాసినోడ్ని ఇప్పుడో నవల కూడా రాసానన్న ఫీలింగ్ బావుంది. కథల్లో చేయలేనివి కొన్ని నవల కాబట్టి చేయగలిగాను అనిపించింది. నవల రాయటానికి పెద్ద కష్టమైతే పడలేదు. రాయటానికి కూర్చుంటే చాలు రాయాల్సింది ఒళ్ళోకి వచ్చి పడతానే ఉంది. ఒకప్పటితో పోలిస్తే నాకు రాయటంతో పెరిగిన సౌకర్యమే దీనికి కారణం అనుకుంటాను. అలాగే ‘వెళ్ళిపోవాలి’ అనే సినిమా తీయటం కూడా దీనికి ఇన్‌డైరెక్టుగా ఒక కారణం. కొన్ని నెలల పాటు వీలు చిక్కినప్పుడల్లా నేనే డైరెక్ట్ చేసి, నా కెమెరాతో షూట్ చేసి, నా కంప్యూటర్లో ఎడిట్ చేసి బైట పెట్టిన ఆ సినిమా నాకు లాంగ్ టెర్మ్‌లో ఒక ఎఫర్ట్ పెట్టడం ఎలాగో నేర్పింది. అలాగే ధైర్యం చేసి పనిలో దూకేశాక సమయానికి వచ్చి ఆదుకునే serendipities మీద నమ్మకాన్ని కలిగించింది. ఈ క్వాలిటీస్ నాకు నవల రాయటంలో ఉపయోగపడ్డాయి. అలాగే సినిమా తీయగలిగినోడ్ని పుస్తకం వేయలేనా అన్న ధీమాతో ఈ పుస్తకాన్ని నేనే డిజైన్ చేసుకుని నేనే ప్రింటర్ కి ఇచ్చి వేసుకున్నాను (ఈ మినిమలిస్ట్ కవర్ డిజైన్ చేసింది చారీ పిఎస్). ఇక మీదట ‘ఒరవడి బుక్స్’ అన్న పేరు మీద నా పుస్తకాలు వస్తాయి. ఈ సందర్భంగా ఇంతకుముందు మూడు పుస్తకాలు వేసి నా పేరుని రీడర్స్ ముందుకి తీసికెళ్ళిన నా ముగ్గురు పబ్లిషర్స్ ‘పల్లవి’ (కాఫ్కా అనువాదం), ‘ఛాయా’ (నా కథలు), ‘బోధి’ (వ్యాసాలు) వాళ్ళకి కూడా థాంక్స్ చెప్పుకోవాలి. ఆ ఎక్స్‌పోజరే ఇప్పుడీ పుస్తకానికి హెల్ప్ ఐతే అవ్వాలి. ఐనా ఎందుకైనా మంచిదని చాలా తక్కువ కాపీలే వేశాను.
ఈ నవల రాసినంత కాలం ఫిక్షన్ రాయటాన్ని ఫుల్ వాల్యూమ్‌లో ఎంజాయ్ చేశాను. ఇలా ఒక పెద్ద నెరేటివ్ ఊహించటంలో, రాయటంలో ఉండే సరదా వేరే అని అర్థమైంది. టైటిల్ ఏం చెప్తుందో అదే ఈ నవల్లోని కథ. ఒక అబ్బాయీ అమ్మాయీ కలుసుకోకముందు వాళ్ళ వాళ్ళ జీవితాల్లో జరిగే కథ. వాళ్ళ ప్రపంచాలు ఎలా ఉంటాయో, ఆ ప్రపంచంలో ఏముంటాయో అవే ఈ పుస్తకంలో ఉంటాయి. అంతకుమించి ఎగస్ట్రాలేం చేయలేదు. కథని ఎంత నేరుగా, ఎంత దగ్గరగా చెప్పొచ్చూ అని తప్ప, ఇంకే పెద్ద పెద్ద సైకలాజికల్, సోషిలాజికల్, ఫిలసాఫికల్ ఫోజులూ కొట్టలేదు. పుస్తకం లోంచి బైటకొచ్చి కూడా నిలబడి మాట్లాడగలిగే కోటబుల్ కోట్స్ జోలికీ, అద్దంలో చూసుకుంటూ సెల్ఫీలు తీసుకునే సొగసరి వాక్యాల జోలికీ అస్సలు పోలేదు. భాషని ఎక్కడా బడాయి పోనివ్వలేదు. నాకైతే నేనిలాంటిది రాయగలగటం చాలా నచ్చింది. This cute little simple beautiful book is also the happiest thing I ever wrote.
0 comments:
మీ మాట...