May 1, 2017

నీలా టీచరూ ఇంకో పెద్దకళ్ళ అమ్మాయీ


నా చిన్నతనం ఆలమూరులో గడిచింది. నీలా టీచరు నాకు నాలుగో తరగతిలో టీచరు (ఆమెని ఉత్తి ‘నీల’గా ఎపుడూ చూడలేదు. ‘టీచర్’ అన్నది కూడా ఆమె పేరులో భాగమైపోయింది). ఆమెను చూడగానే మొదట ఎవరికైనా తట్టేది ఆమె అందమే. నాకు ఆ ఏడెనిమిదేళ్ళ వయస్సులో కూడా ఆమె చాలా అందగత్తె అని తెలుస్తూండేది; లేక ఆమె రూపం మనసులో ముద్రించుకుపోయి, తర్వాత అందచందాల విచక్షణ ఎపుడో వచ్చాకా వెనక్కి గతంలోకి చూసి ఆలోచించినపుడు, ఆమెది అరుదైన అందమని తెలిసిందో మరి. ఖచ్చితంగా చెప్పలేను. ఒకవేళ అప్పుడే ఆమె అందగత్తె అని తెలిసినా, అప్పటికే నేను ఎంత ముదురైనా, అందమైన ఆడాళ్ళ పట్ల మగాళ్ళలో ఉండే స్పందన ఏదీ ఉండే అవకాశమైతే లేదు. ఈరోజు కాపోతే రేపైనా “టీచర్, పాస్‌కి టీచర్” అని ఏ మనిషి ముందు చిటికెన వేలు నిలబెట్టాక తప్పదో ఆవిడ అందగత్తె అయితే మాత్రం ఏం ప్రయోజనం. ఇవన్నీ కాదు కానీ, ఇంత అందంగా ఉన్న మనిషి మాకు రోజూ కనపడి పాఠాలు చెబుతోందీ, కోపం వస్తే తిడుతుందీ, చేయి చాపమని బెత్తంతో దెబ్బ వేసేంత దగ్గరగా మసులుతుందీ అన్న గర్వం మాత్రమే ఉండేదేమో. అంటే, మాకు టీచరు కావటం అనే కారణం వల్ల తప్ప వేరే ఏ రకంగానూ బడి బయట ఉండే ప్రపంచంలో అలాంటి మనిషితో మసలుకునే అవకాశం లేదని ఆ వయసులో కూడా ఏ మూలో తెలియటం వల్ల కలిగిన అబ్బరం. ఇది మా మగపిల్లలకే కాదు, మా క్లాసు ఆడపిల్లలకూ ఉండేది అనుకుంటాను.

ఆమెది రాజసపు అందం. అప్పటికి ముప్ఫై-ముప్ఫై ఐదేళ్ళు ఉంటాయేమో. గోధుమ రంగు నిగారింపుతో సాయంత్రమయ్యేకొద్దీ కాస్త జిడ్డు తేలి వెలుగులీనే చర్మం. ఆ ఉంగరాల జుట్టుని పొద్దున్న ఎలాగో జడలోకి బిగించినా, సాయంత్రమయ్యేసరికి తల చుట్టూ పల్చని వెంట్రుకల ఆవరణగా రేగిపోయేది. ఆమె అంత అందగత్తె కాకపోయుంటే దాన్ని చింపిరి జుట్టు అనాల్సి వచ్చేది. ఆమె రూపంలో చప్పున కొట్టొచ్చినట్టు కనిపించేది ముక్కు. మాలో చాలామంది పిల్లలు పెద్దయ్యాకా కూడా అలాంటి ముక్కులు ఎక్కడ కనిపించినా వాటికి ‘నీలా టీచరు ముక్కు’ అనే పేరు పెట్టుకుని ఉంటారేమో. అది బాగా కలిగిన కుటుంబాల్లో, పెద్ద కులాల్లో, మంచి రూపసులైన వారు దట్టించి ఉన్న వంశవృక్షాల్లో మాత్రమే కనిపించే ముక్కు. ఎదుట నుంచి కన్నా పక్క నుంచి చూస్తే దాని అందం తెలుస్తుంది. ఆ ముక్కుకి పైనున్న కళ్ళల్లోనూ, కిందున్న మూతిలోనూ, చుట్టూ చెంపల్లోనూ ఏ ప్రత్యేకతా లేదో, లేక ఆ ముక్కు అందం ముందు అవన్నీ దిగదుడుపైపోయి వాటి వైనం జ్ఞాపకంలో మిగల్లేదో. అందానికి దాహపడటం ఇంకా తెలియని నా చిన్నప్పటి కళ్ళు చుట్టూ ఉన్న అందరి ముక్కుల కన్నా వేరేగా ఉందన్న కారణంతో మాత్రమే ఆ ముక్కుని జ్ఞాపకంలో ఉంచుకున్నదని అనుకుంటాను. ఆమె లావనీ, సన్నమనీ చెప్పలేం. వెడల్పాటి అస్థిపంజరం మీద నిండుగా అమరిన దేహం. ఎప్పుడూ నేత చీరలే కట్టుకునేదని గుర్తు. చూపులు మరీ ముసురుకోకుండా ఉంటం కోసం అవి కట్టుకునేదేమో.

నీలా టీచరుది రాజుల కులం అని అనుకునేవాడ్ని. నాకెవరైనా అలాగని చెప్పారో, లేక ఆమె రూపాన్ని కథల్లో కనిపించే క్షత్రియ వంశ రాణుల రాజసంతో పోల్చుకుని అలా అనుకున్నానో. ఆమె భర్త ఊళ్ళో ఒక పెద్ద మనిషి. ఆయన పేరు పెద్దబ్బుగారనో, బాబ్జీ గారనో, రాపండు గారనో… ఇలా అసలైన పేరుతో సంబంధం లేకుండా, అసలైన పేరు పెట్టి పిలవటం గౌరవం కాదని ఊళ్ళోవాళ్ళు ఆపాదించే పేర్ల లాంటి పేరు. వాళ్ళ ఇల్లు రథం వీధిలో ఉండేది. విశాలంగా, రెండంతస్తుల్లో.

అసలు నీలా టీచరుకి మేం చదివే ప్రభుత్వ ఎలిమెంట్రీ స్కూల్లో ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. బహుశా ఎంతో నిండైన వ్యక్తిత్వం గల ఆ మనిషి, ఇంటి గేటు దాటి బయటకి వచ్చే అవకాశమే లేని ఆ ఊళ్ళో, వేరే ఏ వ్యాపకమూ లేక ఆ స్కూల్లో పాఠాలు చెప్పటానికి చేరిందేమో. ఆమె వంట చేసి,  బట్టలు ఉతికి, బాత్రూం కడిగి, ఇంక ఆ పరిధికి అతీతంగా ఏ ఆలోచనా లేని మనుషుల్లాంటి మనిషి కాదని ఒక్కసారి చూస్తే చాలు తెలిసిపోతుంది. డబ్బు బాగా ఉండటం వల్ల అలాంటి పనులన్నీ చేసిపెట్టేందుకు పనిమనుషులు ఎలాగా ఉండి ఉంటారు. అదని కాదు. ఎందుకో తర్వాతి రోజుల్లో ఆమెను గుర్తుకు తెచ్చుకుంటే- లౌకికాల్ని మించిన విషయాలకీ, గుంభనంగా దాచుకునే ప్రేమలకీ, లోతుల్లో తొలిచే విషాదాలకీ, భౌతికం కాని అసంతృప్తులకీ, స్వార్థాన్ని దాటిన నునులేత ఆదర్శాలకీ చెందిన మనిషి అని అనిపించేది.

ఒకట్రెండుసార్లు ఆమె ఇంట్లోకి వెళ్ళే అవకాశం నాకు నా చిన్న తమ్ముడి వల్ల వచ్చింది. వాడికి అప్పటికి ఇంకా స్కూల్లో చేరే వయస్సు రాకపోయినా ఊరకే మాతో పాటూ వస్తూండేవాడు. చిన్నప్పుడు వాడు చూట్టానికి ముద్దుగా, తెలివితేటల్లో వయసుకు మించిన ఆరిందాతనంతో ఉండేవాడు. అంటే ఈ కారణాలకే నీలా టీచరు మా వాడ్ని ముద్దు చేసేదని కాదు. ఆ మాత్రం ఆరిందాతనం ఆ పల్లెటూళ్ళో మా చిన్నబడి పిల్లలకు చాలామందికి ఉండేదేమో. కానీ మేం ఊళ్ళో రైతుల పిల్లలమో, పేటలో పిల్లలమో కాదు. ఉద్యోగస్థుల పిల్లలం. మా అమ్మ రెవెన్యూ ఆఫీసులో జూనియరసిస్టెంటుగా పని చేసేది. నాన్న అనే మనిషి ఎపుడో ఏడాదికొకసారి కన్పిస్తూ, చుట్టరికమేంటో అర్థంకాని దూరపు చుట్టంలాగా మాత్రమే మా జీవితాల్లో ఉండేవాడు. అమ్మ అతడ్ని వదుల్చుకునే ప్రయత్నంలో ఉన్నదని తర్వాత్తర్వాత తెలిసింది. బహుశా నీలా టీచరు ఆ పల్లెటూళ్ళో తనలాగా ఉద్యోగం చేసే ఒకావిడ పిల్లలం కాబట్టి మమ్మల్ని ప్రత్యేకంగా చూసి ఇంటికి రానిచ్చిందేమో (కానీ మేమేం ఉద్యోగస్థుల పిల్లల్లా పెరగలేదు. ముఖ్యంగా నేను. అప్పటికే నాకు చాలా బూతులు వచ్చు).

నేను మెట్లు ఎక్కి రెండో అంతస్తులోకి వెళ్ళడం జరిగిన తొలి సందర్భాల్లో అదొకటి. అది కొన్ని తరాల్ని దాటుకుని నిలబడిన ఇల్లని కట్టుబడిలో తెలుస్తుంది. అందులో ఉంటున్న వాళ్ళు తరాలుగా డబ్బుకి ఇబ్బంది లేని జీవితాల్ని గడిపారనీ, ఇక ముందు గడుపుతారనీ కూడా తెలుస్తుంది. మా ఇద్దరు తమ్ముళ్ళనీ ఆమె తీసుకురమ్మంటే నేను తీసుకెళ్ళానో, లేదా స్కూలు తర్వాత ఆమే మమ్మల్ని వెంటబెట్టుకుని వెళ్ళిందో గుర్తు లేదు. మాకు తాగటానికి ఏదో ఇచ్చింది. తర్వాత టేపు రికార్డర్ లో పాటలు పెట్టి మా తమ్ముడు చేసే బ్రేక్ డాన్సు చూసి నవ్వింది. నాకు మా తమ్ముడిలా ఆమె కళ్ళల్లో ప్రత్యేకంగా నిలబెట్టగలిగే ప్రతిభలు ఏమైనా ఉండుంటే బాగుండునని అనిపించింది. కానీ అలా వున్నా ఏం ఒరిగేది కాదేమో. నా మూణ్ణాలుగేళ్ళ తమ్ముడిలా నాది ప్రపంచమింకా ఒరుసుకోని మెత్తటి చర్మమున్న పసి వయస్సు కాదు. పైగా బాల్యపు అమాయకత్వం నా కళ్ళను చాలా త్వరగా వదిలి వెళ్ళిపోయింది.

నీలా టీచరు మా స్కూల్లో ఉద్యోగాన్ని ఏదో కాలక్షేపానికే చేసినట్టు కూడా నాకు అనిపించదు. అందరూ చిన్నబడి అని పిలిచే మా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదు వరకూ చెప్పేవారు. రెండు పెద్ద గదుల్లో, బాచీమటం వేసుకుని కూర్చోవటానికి వీలుగా పీటలంత నేలబారుగా చేసిన బల్లల మీద పిల్లలు కూర్చొనేవారు. రెండు, నాలుగు తరగతులు నీలా టీచర్ చెప్తే, అదే గదిలో పిల్లల్ని ఇంకో వైపు కూర్చోబెట్టి ఒకటో తరగతిని ఇంకో మేడం చెప్పేది. పక్క గదిలో మూడు, ఐదు తరగతుల్ని ఇంకో ఇద్దరు మగ మేస్టార్లు చెప్పేవారు. మా స్కూల్లో ఒక టీవీ ఉండేది. అందులో అప్పుడప్పుడూ పిల్లలు చూడదగిన సినిమాలూ, ఏనిమేటెడ్ పిల్లల పాఠాలూ వీడియో కేసెట్లు తెచ్చి వేసేవారు. ఆ టీవీనీ, వీడియో ప్లేయర్నీ, కేసెట్లనీ స్పాన్సర్ చేసింది నీలా టీచరే.

నా జ్ఞాపకం పదే పదే ఈ చిన్నబడి చుట్టూ తిరగటానికి నీలా టీచరు కన్నా ముఖ్యమైన కారణం ఒకటుంది. ఈ స్కూల్లోనే నేను మొదటిసారి ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, ఆ అమ్మాయినే తర్వాత పెళ్ళి చేసుకున్నాను. నేను ముదురేనని చెప్పటానికి ఇదో తిరుగులేని ఋజువు. ప్రేమించటం అంటే ఏంటో తెలిసిపోవటానికి అప్పటికి నేను చూసిన సినిమాలు కూడా మహా అయితే ఓ ఐదారు మాత్రమే అయ్యుంటాయి. ఈ ప్రపంచంలో అదొకటి ఉందని చెప్పే వాతావరణం నా చుట్టూ ఏదీ లేదు. కానీ శ్రీవల్లిని వాళ్ళ నాన్న తీసుకొని వచ్చి నాలుగో తరగతిలో చేర్చిన మొదటి రోజు నుంచే ఆమెని ఇష్టపడటం మొదలుపెట్టాను (అప్పటికి నేను ఐదో తరగతి). ఇది ఎలా జరిగిందీ అని హేతుబద్ధంగా ఆలోచించటం మొదలుపెడితే నాకు నికరంగా తేలేదల్లా హేతువు ఎంత బలహీనమన్నదే. వల్లీ కళ్ళు చాలా అందంగా ఉంటాయి. కిందా పైనా బరువైన కనురెప్పలతో, వాటి మధ్యన కాంతులీనే బరువైన మణులు పొదిగినట్టు ఉబుకుతూ ఉంటాయి. నాకు ఆ తొమ్మిదేళ్ళ పిల్లని ఒకసారి చూడగానే మళ్ళీమళ్ళీ చూడాలనిపించటానికి ఆ కళ్ళు ఏమైనా కారణం అనుకోవచ్చా? కానీ అలాంటి కళ్ళు అందమైనవీ అని తేల్చగలిగే లెక్క ఆ వయసులోనే నాకెక్కడిదీ? ఏమో అప్పటికే పుట్టినప్పటి నుంచీ వేల జతల కళ్ళు చూసి ఉంటాను. ఈ ఒక్క జతా ప్రత్యేకంగా అనిపించి ఉండొచ్చు. మా చిన్నబడిలో ఆ పిల్ల వచ్చి చేరిన మరుక్షణం నుంచీ ఆమె దృష్టిని ఆకట్టుకోవటానికి నేను ప్రయత్నించానని గుర్తుంది. అలాంటి ప్రయత్నాల్లో ఒకటేంటంటే- ఆమె చూస్తున్నదని అనుకుంటూ బ్లాక్ బోర్డు మీద సుద్దతో కృష్ణుడి బొమ్మ గీయటం. నాకు కృష్ణుడి బొమ్మను సులువుగా గీయటం ఎవరో నేర్పారు. రెండు కళ్ళు, కనుబొమ్మల మధ్య ‘యు’ ఆకారంలో నామం, జట్టు మీద ఒక పక్కగా కొప్పు, దాని వెనక వాలినట్టూ నెమలి పింఛం… ఇలా గీశాను. మామూలుగా క్లాసంతా ఉండగా బోర్డు ముందు నిలబడి దాని మీద ఏదైనా రాయటం నాలాంటి బెదురుగొడ్డు పిల్లాడికి చాలా ధైర్యం కావాల్సి వచ్చే పని. పాస్‌బెల్లులో ఆ పిల్ల ఫ్రెండ్స్ తో ఆడుకోవటాన్ని గమనించేవాడిని. నేరుగా వెళ్ళి మాట్లాడవచ్చని తోచలేదు. ఎందుకంటే నా మనసులో ఆమెపై కలుగుతున్నది ఏదో కూడని భావమని నాకు అనిపించేది. కొన్ని రోజుల తర్వాత ఈ విషయాన్ని నా ఫ్రెండ్ తో చెప్పినప్పుడు వాడి రియాక్షన్ కూడా దానికి తగ్గట్టే ఉంది. మేస్టారు లేక ఊరకే అందరం కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు, నాకు ఒకణ్ణే మోయటానికి మరీ బరువైపోతున్న ఈ రహస్యాన్ని ఎవరితోనన్నా చెప్పుకోవాలనిపించింది. పక్కన కూర్చున్న అబ్బాయితో “ఓరే, నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానురా” అని చెప్పేసాను. వాడు “అయ్ బాబోయ్!” అని నవ్వు కలిసిన భయంతో చేత్తో నోరు మూసుకున్నాడు. వాడి వాలకం చూసి నాకూ భయం వేసి ఎవరితోనూ చెప్పవద్దని బతిమాలాను. కానీ ఇది వాడికీ బరువైపోయి మరుసటి రోజే ఎవరికో చెప్పేశాడు. నెమ్మదిగా ఇది క్లాసంతా పాకిపోయింది. ఇది ఎంత ప్రమాదమైన విషయమో తెలియక ఎవడన్నా క్లాసులో లేచి “టీచర్, నాగూ శ్రీవల్లిని ప్రేమిస్తున్నాడంట” అని ఎక్కడ చెప్పేస్తాడోనని హళ్ళిపోయేవాడ్ని. ఎపుడూ అంతదాకా వెళ్ళలేదు కానీ పిల్లల్లో పిల్లల్లోనే అందరికీ తెలిసిపోయింది. ఎంతలా అంటే- ఒక ఏడాది తర్వాత ఈ చిన్నబడిలో ఐదో తరగతి అవగొట్టుకుని, తర్వాత ఆరో తరగతి చదవటానికి మెయిన్ రోడ్డుకి ఆనుకుని ఉన్న పెద్ద బడిలో చేరినపుడు, ఆ ప్రేమ వార్త నాతో పాటూ వచ్చి పెద్దబడిలో చేరిపోయింది (ఇక్కడ ప్రేమని కొటేషన్స్ లో పెట్టాలనిపిస్తుంది కానీ, అసలు అవసరమా అని కూడా అనిపిస్తుంది; మనిషికి చావనేదే లేకపోతే ఖచ్చితంగా అన్ని వయసుల ప్రేమల్నీ కొటేషన్స్ లోనే పెట్టాల్సి వస్తుంది గనుక).

వల్లీ నా కన్నా ఒక క్లాసు తక్కువ కాబట్టి ఇంకా చిన్నబడిలోనే చదివేది. మా తమ్ముళ్ళు కూడా అక్కడే చదువుతున్నారన్న నెపంతో నేను అప్పుడప్పుడూ పెద్దబడి నుంచి బయల్దేరి ఊరి లోపల పెద్ద చెరువునానుకుని ఉండే ఈ చిన్నబడి దాకా పనిగట్టుకు వచ్చి ఆ పిల్లను చూసేవాడ్ని– వీధులమ్మటా పరిగెత్తుకుంటూ, నాలో ఈ భావం నన్ను ఆకాశంలో గాలిపటంలా వెంట లాక్కెళ్తుంటే. ఒక రోజు నీలా టీచర్ నన్ను గమనించి, “ఈ స్కూలు కానపుడు ఎందుకు వస్తున్నావ్ ఇక్కడికి?” అని గదమాయించి పంపేసింది కూడా. ఇంత జరుగుతున్నా, ఆ మొదటి రోజు బోర్డు మీద బొమ్మ గీసి వల్లీ కంట్లో పడటానికి చేసిన ప్రయత్నం తర్వాత, మళ్ళీ ఎప్పుడూ ఆమె కళ్ళల్లో పడాలని ప్రయత్నించ లేదు. నాకు ఆమెని చూస్తే బాగా అనిపించేదంతే. ఆమెని చూడటం కుదరని రోజు, అప్పటికింకా చిన్నబళ్ళోనే చదువుతున్న మా తమ్ముళ్ళు బడి అయిపోయి ఇంటికి వచ్చాకా, “ఒరే వల్లీ ఇవాళ ఏం డ్రస్ వేసుకుని వచ్చిందిరా?” అని అడిగి వేధించేవాడ్ని. అప్పటికే ఆమె గౌన్లూ, పరికిణీ లంగాలూ అన్నీ నాకు గుర్తే. మా తమ్ముళ్ళు ఫలానా డ్రస్ అని చెబితే, ఆ వర్ణన సాయంతో నాకు కనపడని ఆ రోజు ఆమె ఎలా ఉందో ఊహలో చూడగలిగేవాడ్ని. తమ్ముళ్ళిద్దరికీ ఇదేం అర్థమయ్యేది కాదు. వాళ్ళల్లో ఆటల్లో వాళ్ళుండి విసుక్కుంటుంటే వెంటపడి అడగాల్సొచ్చేది. పెద్దన్నయ్య మిగతా వాళ్ళల్లాగాక కొత్తగా ఇదేదో “ప్రేమించటం” అన్న పని చేయగలగటం మాత్రం వాళ్ళకీ గొప్పగానే ఉండేది. నా పెద్దబడి స్నేహితుల్లో కూడా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్న అబ్బాయిగా నాకు గుర్తింపు ఉండేది. అది నాకు ప్రత్యేకంగా, గొప్పగా అనిపించేది. బడిలో ఒక్కడి దగ్గరే కొత్త సైకిలు ఉన్నప్పుడు వాడికి కలిగే బడాయి లాంటిది.

బళ్ళు అయిపోయి మేం ముగ్గురం ఇంటికి వచ్చాకా అమ్మ ఇంకా ఆఫీసు నుంచి ఇంటికి రావటానికి చాలాసేపు పట్టేది. ఒక మూణ్ణాలుగు గంటలు మా అంతట మేం ఇంటి దగ్గర అమ్మ కోసం ఎదురు చూస్తూ గడపాల్సి వచ్చేది. అమ్మ ఆ నాలుగు గదుల ఇంట్లో రెండు గదులకు తాళం వేసి ఇంకో రెండు గదుల్ని మాకోసం వదిలిపెట్టేది. వెలుగు నుంచి చీకట్లోకి రోజు మారుతుంటే ఇంటి చుట్టూ రకరకాల ఆటలు ఆడుకునేవాళ్ళం. వల్లీ తెలిసాకా మాత్రం నేను సాయంత్రాలు తమ్ముళ్ళతో ఆటలు తగ్గించాను. వాళ్ళని ఇంటి దగ్గరే వదిలి, వల్లీ కనిపించే అవకాశమున్న చోట్ల కోసం– అంతకు రెండేళ్ళ క్రితమే అమ్మకు బదిలీ అయితే వచ్చిన ఈ కొత్త ఊరిలో– తెలియని వీధులమ్మటా తిరిగేవాడ్ని. వల్లీని ప్రేమించటం అనేది నాకు ఒక వొళ్ళు జలదరించే సాహసంలాగా అనిపించేది. నా స్నేహితులెవ్వరికీ చేతకాని, పెద్దవాళ్ళు మాత్రమే చేసే పని నేను చేస్తున్నానని అనిపించేది. ఒక రోజు ఆ పిల్లకి తెలియకుండా వెంట వెళ్ళి తన ఇల్లెక్కడో కనుక్కోవటం ఒక సాహసం. ఆ ఇంటి నుంచి ఆమె సాయంత్రాలు బయటికి వచ్చి ఆడే అవకాశమున్న స్థలాల్లో, ఆమె ఎదురయ్యే క్షణం కోసం ఎదురుచూస్తూ తిరగటం ఒక సాహసం. పులి లేనప్పుడు దాని గుహలో సంచరిస్తున్నట్టు భయోద్విగ్నంగా ఉండేది. ఆ అమ్మాయి అనుకోకుండా ఎదురైతే అచ్చం భయమేసినట్టే వొళ్ళు గగుర్పొడిచేది. రాన్రానూ ఆ పిల్ల ఒక ప్రత్యేకమైన, మానవాతీతమైన జీవం అయిపోయింది. నన్ను వశం చేసుకుని ఉన్న చోట ఉండనీయక బలవంతంగా వెంట తిప్పించుకునే భూతం. ఒక పసివాడ్ని లక్ష్యం లేకుండా తెలియని వీధుల్లోకి లాగే శక్తి క్షేత్రం. ఊరిలో దేవీ నవరాత్రులో, అయ్యప్పస్వామి తెప్పోత్సవమో ఇలా ఏవన్నా ఉత్సవాలు జరిగి, అక్కడికి వల్లీ కచ్చితంగా తన ఇద్దరు చెల్లెళ్ళనూ, చిట్టి తమ్ముడ్నీ వెంటేసుకుని వస్తుందనిపిస్తే, నేను అప్పటికే అమ్మ ఇంటికి వచ్చేసినా ఆమెకి ఏదో ఒక అబద్ధం చెప్పి ఆ ఉత్సవానికి చేరుకునేవాడ్ని. అక్కడ మగవాళ్ళు కొత్త చొక్కాలతో, తువ్వాళ్ళు భుజాన్నేసుకునీ, ఆడవాళ్ళు బీరువా పైఅరల్లోంచి తీసిన మడత నలగని చీరల్లో, పూల బుట్టలు చేతపట్టుకునీ తిరిగేవారు; మైకుల్లోంచి దేవుడి పాటలు పక్కనున్నవాడితో కూడా అరిచి మాట్లాడాల్సినంత గట్టిగా మోగుతూండేవి; వీధి వారగా పాతిన గెడకర్రల మీదుగా వేలాడే చిట్టి బల్బుల తోరణాలు నా కళ్ళల్లో వెలుగుతూండేవి; నేను ఆ సందడి మధ్యన, మృగమే చల్లిన మాయలో పడి అడవి మధ్యన దారితప్పిన వేటగాడిలాగా తిరిగేవాడ్ని. ఆ వాతావరణమంతా నా ప్రేమకు నేపథ్యంగా పని చేయటానికే అలా ఏర్పాటైందని అనిపించేది. ఏ గరగల నృత్యమో, ఏ ఆలయపు క్రతువో, ఆకాశంలో విప్పారే ఏ టపాసుల వెలుగో నా పరుగుని ఆపి కాసేపు నన్ను నిలబెట్టినా, మళ్ళీ వాటన్నింటికన్నా ముఖ్యమైన లక్ష్యం నన్ను నిమంత్రిస్తుంటే తెప్పరిల్లి ముందుకు సాగిపోయేవాడ్ని. గరగరమని ఒరుసుకొనే ఈ చీర మడతలూ మెరిసే మట్టిగాజుల మధ్య తిరిగేవాడ్ని; చెవులు హోరెత్తించేలా వినిపిస్తున్నా ఒక్క ముక్కా అర్థం కాని భక్తి పాటలూ పూజారి మంత్రాల మధ్య తిరిగేవాడ్ని; గుడి గోపురం పక్కన తూములో పారే పాలూ కొబ్బరి నీళ్ళ మొహం మొత్తే వాసనల మధ్య, నూనె దీపాల మైకం కమ్మే పొగల మధ్య వెతుక్కొంటూ తిరిగేవాడ్ని. ఇలా ఎంత తిరిగినా, ఎంతసేపవుతున్నా, ఒక్కోసారి ఆ అమ్మాయి కనిపించేది కాదు. అమ్మ నాకు బయట తిరగటానికి ఇచ్చిన సమయం అయిపోయే కొద్దీ నా ఉత్సాహం నీరుగారిపోయేది. అప్పటిదాకా ఆమె ఇక్కడే ఎక్కడో ఉండివుంటుందనే కారణంగా ఎంతో అర్థవంతంగా, గుంభనంగా కనిపించిన ఈ పరిసరాలన్నీ క్రమంగా సారవిహీనమై డొల్లగా మారిపోయేవి. అప్పటిదాకా ఈ మెలికల వీధులన్నీ ఒక ప్రహేళికని పన్ని కావాలని ఆమెను ఎక్కడో దాచాయనీ; నన్ను తిప్పించి తిప్పించి, అలిసిపోయేదాకా నాతో దోబూచులాడి, నా చిత్తశుద్ధిని ఎంతుందో పట్టుదల ఏమాత్రముందో పరీక్షించి, చివరికెప్పుడో అనుకోని క్షణంలో ఆమెను నా ముందుకు తోయటం ద్వారా నా వెతుకులాటనీ నా అలసటనీ మరింత వీరోచితమూ సార్థకమూ చేస్తాయనీ అనుకున్న నాకు, నెమ్మదిగా నాదో ప్రయోజనంలేని పరుగని అర్థమయ్యేది. వీధులన్నీ తమ మాయజాలాన్ని జారవిడుచుకొని జడంగా చచ్చిపోయేవి. ఇంకా అక్కడ పూజలైతే జరిగేవి, జనం ఇదివరకటి కన్నా పల్చబడినా అప్పటికీ ఆ వీధులు మిగతా ఊరికన్నా ప్రకాశంగానే వెలిగేవి, అడపాదడపా ఓ తారాజువ్వ చీకటి ఆకాశంలోకి లేచి టప్‌మని ఒంటరి చప్పుడు చేసేది. నేను మాత్రం ఆ సందడికి వీపు చూపిస్తూ ఒక్కడ్నీ దూరంగా వచ్చేసేవాడ్ని.

వీధి దీపాల కింద తలలు తిప్పి చూసే కుక్కలు; బైట నులక మంచం మీద పడుకుని విసనకర్ర విసురుకుంటూ అలికిడికి తలెత్తిచూసి మళ్ళీ తలగడ సర్దుకుని పడుకునే ముసలాయన; గుడ్డి దీపంతో వెలుగుతున్న ఓ కిటికీ లోపలినుంచి ఆగాగి వినిపిస్తున్న మాటలు; పేడ నీళ్ళ కళ్ళాపులతో నున్నగా మారిన నేల మీద పైకి లేచి కనిపించిన ఒక కంకర్రాయిని తన్నుతూ ఇంటికి వెళ్ళే నేను.

ఒకసారి ఇలాగే ఆమె కనపడని ఉత్సవం నుంచి ఇంటికి నడిచి వస్తూ దారిలో చిన్నబడి దగ్గర ఆగాను. పొద్దున్నపూట పిల్లల మూకుమ్మడి గొంతుల కల్లోలంతో హోరెత్తే ఆ బడి, ఈ రాత్రి పూట మాత్రం, చుట్టుపక్కల గుడ్డిదీపాలతో చప్పుడు లేకుండా ఉన్న ఇళ్ళ కన్నా కూడా చీకటిగా, ఇంకా నీరవంగా ఉంది. చుట్టుపక్కల ఎవరూ లేకపోవటం చూసి, ధైర్యం చేసి బడికి దగ్గరగా వెళ్ళాను. కటకటాల్లోంచి తొంగి చూసాను. ఖాళీ వరండా, మూసి ఉన్న తలుపులూ తప్ప ఏమీ కన్పించలేదు. గోడ వెంట నడుచుకుంటూ బడికి వారకి వెళ్తే పైన ఒక కిటికీ తెరిచి కన్పించింది. అది ఐదో తరగతివాళ్ళు కూర్చునే చోటు పక్కనే ఉన్న కిటికీ. బడి పునాది అంచు కాస్త బయటకొచ్చి ఉంటే దాని మీద ఎక్కి, కిటికీ లోంచి తొంగి చూసాను. అటుపక్క తలుపు చీలిక గూండా సన్నని రేఖలా వచ్చిపడుతున్న వీధి దీపం మసక వెలుగులో ఖాళీ బల్లలు కనిపించాయి. కిటికీ పక్కనే పొడవాటి చెక్కల స్టాండు పైన నల్ల బోర్డు నిలబెట్టి ఉంది. దాని పైన ఏదో లెక్కల పాఠం కనిపిస్తోంది. కిటికీ చువ్వల్ని ఆసరాగా పట్టుకుని, ఒకే కాలు పట్టే ఇరుకు పునాది మెట్టు మీద కాళ్ళు మార్చుకుంటూ, బోర్డు మీద కనిపిస్తున్న అంకెల్ని చూశాను. బహుశా రాఘవయ్య మేస్టారు చెప్పిన ఆ లెక్కల పాఠాన్ని– ఇప్పుడు నా కళ్ల ముందు కనపడుతున్న ఆ అంకెల్నీ, గీతల్నీ– పొద్దున్న క్లాసులో వల్లీ తన కళ్ళతో చూసి ఉంటుంది. బహుశా ఇప్పుడు ఈ రాత్రి ఇదే క్షణాన తన ఇంట్లో కూర్చుని ఇవే లెక్కలపై హోం వర్కు చేస్తూండి వుంటుంది. లేదంటే ఇవే లెక్కల్ని ఎక్కించుకున్న పుస్తకం ఆమె మసలుకునే ఇంట్లో ఏ మూలో ఆమె బ్యాగ్ లో ఉండి వుంటుంది. అవే లెక్కల్ని ఇప్పుడు నా కళ్ళతో నేను చూస్తున్నాను! బడి వెనుక చెరువు మీంచి వణికిస్తూ వస్తున్న తేట గాలికీ, నా వెనుక దూరపు సముద్రంలా వినిపిస్తున్న రావి ఆకుల ఘోషకీ, తుప్పల్లోంచి కీచురాళ్ళ మోతకీ వొళ్ళు జలదరిస్తుంటే, చోటు చాలని ఇరుకు మెట్టు మీద కాళ్లు నొప్పెడుతుంటే ఎక్కువ సేపు నిలబడలేకపోయాను. కానీ ఆమెతో నన్ను కలుపుతూ ఏర్పడిన ఆ చిన్న లంకె, ఆమె లోకంలోకి తెరుచుకున్న ఆ చిన్న ద్వారం– ఆ రోజు ఉత్సవంలో ఆమె కనిపించని దిగులుని తుడిచేయలేకపోయినా– ఇంటికి ఇంకాస్త తక్కువ దిగులుతో వెళ్ళగలిగేట్టు చేసింది.

ఒక్కోసారి ఆమె కనిపించేది కూడా. నేను రావటమే ఆమె కోసం వచ్చినా, ఆమె ఖచ్చితంగా వస్తుందని అనుకునే వచ్చినా, అలా ఆమె హఠాత్తుగా కనిపిస్తే నాకు ఒక అద్భుతం జరిగినట్టే ఉండేది. నేను ఆమె ప్రతి కదలికనీ మళ్ళీ ఆమె కళ్ల ముందు లేనప్పుడు కూడా గుర్తుగా వుండేట్టు అతి శ్రద్ధగా మనసు మీద ముద్రించుకునేవాడ్ని. అయితే ఇన్ని చోట్ల నా సమక్షం తారసపడుతున్నా అది ఆమె గమనింపుకు వచ్చి ఉండదు. ఎందుకంటే తన అల్లరిలో తనుండేది. క్షణం కుదురులేకుండా ఎప్పుడూ ఒక సందడి నుంచి మరో సందడికి పరిగెడుతున్నట్టు ఉండేది (ఆమె వదిలి వెళ్ళిన సందడీ, ఆమె వచ్చి చేరిన సందడీ రెండూ ఆమె పుట్టించినవే అయినా). ఆమె కాళ్ళ చుట్టూ గౌను అంచు ఎప్పుడూ మొదలూ తుదీ లేని అలలా అల్లల్లాడుతూనే ఉండేది. పళ్ళు కనిపించే పెద్ద సిరి నవ్వుతో, క్షణం కళ్ళు తిప్పితే మళ్ళీ అక్కడ కనిపించని చంచలత్వంతో ఒక తుళ్ళింతగా ఉండేది.

అయితే నా బడి తర్వాత చక్కర్లు మాన్పించటానికి అమ్మ మా ముగ్గురన్నదమ్ముల్నీ ట్యూషన్ లో పడేయాలనీ, ఆ విధంగా తను ఆఫీసు నుంచి లేటుగా తిరిగి వచ్చేదాకా మేం కుదురుగా ఉంటామనీ అనుకుంది. చిన్న బడిలో మూడో తరగతికి పాఠం చెప్పే సూర్రావుగారి దగ్గర మా ముగ్గుర్నీ ట్యూషన్లో చేర్చింది. సూర్రావుగారు ఒక హేపీ మనిషి, ఆయనది ఒక హేపీ కుటుంబం. ఆయన భార్యకీ ఆయనకీ మధ్య ఎప్పుడూ మేం పిల్లలమే ప్రేక్షకులుగా ఏదో ఒక పరాచికాల యుద్ధం నడుస్తూండేది. వాళ్ళ మధ్య ఎప్పుడూ తీరని కోపాలు ఉండేవి కాదు. ఆమె కోపాన్ని తగ్గించటానికి ఆయన హ్యూమర్ సాయపడేది. నవ్వించే శక్తితో జీవితాన్ని నెట్టుకువచ్చేసే మనిషని ఇప్పుడనిపిస్తుంది. ఆ ఇంటి గొళ్ళెం తలుపు తీస్తే, కుళాయి పళ్ళెం ఎదురయ్యేది, తర్వాత లోపలికి చిన్న సందుండేది, అది దాటితే పెంకుటింటి వసారాలోకి వచ్చేవాళ్ళం. అక్కడ కూర్చోపెట్టి ట్యూషన్ చెప్పేవాడు. రెండు మూడు రోజులకే ఆ ట్యూషన్‌లో నన్ను కట్టిపడేసినట్టు అనిపించటం మొదలైంది. పైగా ఆయన లెక్కల మీదే శ్రద్ధపెట్టేవాడు. నాకు లెక్కలు వచ్చేవి కాదు. ఏదన్నా లెక్క చేయమంటే, టెక్స్ట్‌బుక్‌ చివరి పేజీల్లో జవాబు చూసి, అక్కడున్న సంఖ్య వచ్చేదాకా కూడికలూ తీసివేతలూ భాగాహారాలూ ఇలా నానా రకాలుగా ఏదో ఒకటి చేసేసి ఆ అంకె రప్పించేవాడ్ని– ఆయన జవాబు చూస్తాడే తప్ప దాన్ని ఎలా రప్పించాననేది గమనించడన్న ఆశతో. ఆయన నేను ఇచ్చిన తెల్లకాయితాల నోటు బుక్కు ఒక చేతిలో పట్టుకుని, రెండో చేత్తో నా చెవితమ్మె పట్టుకుని, కాసేపు వదలకుండా నన్ను దాన్తో పట్టి ఊపుతూ “కిట్టించేసావురా ఎదవకానా” అని తిట్టేవాడు. ఈ బాధ పడలేక ఆ ట్యూషన్ ఎగ్గొట్టేందుకు కుట్రలు పన్నటం మొదలుపెట్టాను. ట్యూషన్‍కి బయల్దేరినట్టే బయల్దేరి, నా పుస్తకాలూ, తమ్ముళ్ళ పుస్తకాలూ కరెంటు స్తంభాలకు ఉండే తుప్పు పట్టిన ఇనుప బాక్సుల్లో దాచేసి, కొత్తగా కట్టిన రామాలయం చుట్టూ గచ్చు మీద పాల కనికెలతో దాడీ ఇప్పి దాడీ వేసే ఆట ఆడుకునేవాళ్ళం. లేదంటే, అప్పుడప్పుడూ ఆ గుళ్ళో టీవీలో అదేపనిగా వేసే లవకుశ లాంటి సినిమాలు చూసేవాళ్ళం. (ఈ కథలో ఇన్ని గుళ్ళు ఉండటం కోఇన్సిడెన్స్‌ కాదు. దక్షిణ కాశీ అని పిలిచే ఊళ్ళలో ఆలమూరు కూడా ఒకటి.) ఒక్కోసారి ఇంకో ఫ్రెండు తోడు దొరికితే ఊరి చివర పాడుబడిన ఒక రైస్ మిల్లుదాకా పోయేవాళ్ళం. పని చేయని యంత్రాల మధ్య ఆడుకునేవాళ్ళం. అక్కడ దొరికే అభ్రకం పెచ్చుల్ని పగలగొట్టుకుని ఆ మెరుపుల్ని మేం చూసే వీధి నాటకాల్లో నటుల్లాగా చెంపలకి పూతలాగా పూసుకునేవాళ్ళం. ఒక్కోసారి అటూయిటూ తోటలే ఉన్న నిర్మానుష్యపు దారుల్లో నడుస్తూ దెయ్యాల కథలు చెప్పుకునేవాళ్ళం. దొరికితే చెట్టుకు కట్టేస్తారన్న భయం వల్ల ఇంకా రంజుగా ఉండే ఆట కాబట్టి- మామిడి తోటల మీదకి గుంపులుగా వెళ్ళి కాయల్ని దొంగతనాలు చేసేవాళ్ళం. ఇక ట్యూషన్ అయిపోతుందనే టైముకి మళ్ళీ కరెంటు స్తంభాల మెయిన్ బాక్సుల్లోంచి పుస్తకాలు తీసుకుని ఇంటికి వచ్చేసేవాళ్ళం. నెల తర్వాత సూర్రావు మేస్టారికి ఫీజు ఇవ్వటానికి కలిసినపుడు కానీ అమ్మ ముందు మా బండారం బయటపడలేదు.

అమ్మకి అదేదో పాత సినిమాలో ఒక అమ్మ కోరిక లాగా మా ముగ్గుర్లో ఒకడు డాక్టరూ, ఒకడు ఇంజనీరు, ఒకడు కలెక్టరూ అవ్వాలని ఉండేది. కానీ మమ్మల్ని పెద్దగా ప్రైవేటు స్కూళ్ళలో చదివించటానికి తగినంత జీతం గానీ, ఆఫీసు పని వల్ల దగ్గర కూర్చోబెట్టుకుని చదివించేంత టైము గానీ ఉండేవి కాదు. మేం చుట్టుపక్కల పేటల్లో ఉండే పిల్లలతో తిరుగుతూ, బూతు పాటలు నేర్చుకుంటూ, పనికి మాలిన అల్లరి చేస్తూ తిరిగేవాళ్ళం. అప్పుడప్పుడూ మేం తాను అనుకున్న దారిలో ఏ మాత్రం వెళ్ళటం లేదని తెలిసినప్పుడల్లా అమ్మ అగ్నిపర్వతంలా బద్దలైపోయేది. “నువ్వు పెద్దవాడిగా ముందుండి మిగతా ఇద్దరికీ వివరం చెప్పాల్సింది పోయి” అనేది మా ఇంట్లో స్టాకు డైలాగు. మరీ అంత చిన్నప్పటి నుంచీ ఈ బాధ్యతల అవగాహన నాలో కల్పించటానికి చేసిన ఈ అతి ప్రయత్నం ఎదురు దెబ్బకొట్టి ఏం జరిగిందంటే- నేను నిజంగా బాధ్యతలు భుజాన్నేసుకోవాల్సిన వయసు వచ్చినా కూడా ఆ పని చేయలేదు. దానికి అప్పుడప్పుడూ సిగ్గుపడతాను కానీ, సిగ్గుపడి మారాలని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు (అందుకే నాకు చెల్లెళ్ళు లేనందుకు ఎన్నిసార్లు బాధపడినా, ఉండుంటే వాళ్ళకు పెళ్ళి చేసి సాగనంపాల్సిన బాధ్యత నుంచి తప్పించినందుకు దేవుడికి థాంక్స్ కూడా చెప్పుకుంటాను.)

మేం సుర్రావు మాస్టారి ట్యూషన్‌కి వెళ్ళటం లేదని తెలిసిన సందర్భం అమ్మ అగ్నిపర్వతంలా బద్దలైన, నాకు గుర్తుండిపోయిన, ఒక సందర్భం. అలా బద్దలవటంలో కూడా అమ్మకి ఒక పద్ధతి ఉండేది. ఆరోజూ రోజూలాగే ఆఫీసు నుంచి వచ్చింది. బయట్నించి చూస్తే అమ్మకు విషయం తెలిసిపోయిన జాడలేం లేవు. నెమ్మదిగా సైకిలు స్టాండు వేసి, గచ్చు మీద కబుర్లు చెప్పుకుంటున్న మా వైపు తిన్నగా రాకుండా, ఇంటి వార పొడుగ్గా పెరిగిన కరివేరు చెట్టు వైపు వెళ్ళి, దాని కొమ్మ ఒకటి పీకి, దాని నిండా ఉన్న ఆకుల్ని శ్రద్ధగా తురిమి, తర్వాత నన్ను లోపలికి తీసుకెళ్ళి, నాచేత నాట్యం చేయిస్తూ చితక్కొట్టింది. “నాన్న బుద్ధులు ఎక్కడికిపోతాయ్ దరిద్రుడా” అని చెడ తిట్టింది. తర్వాత కాసేపటికి అంత కోపమూ ద్రవించిపోయి, తను కూడా కళ్ళనీళ్ళు పెట్టుకుని, నన్ను దగ్గరికి తీసుకుని ముద్దు చేసి, ఈసారి మెత్తగా బుద్ధి చెప్పింది, నేను గునుస్తూ గారం గుడుస్తూ వింటూంటే.

ఈసారి మేం ట్యూషన్‌కి సక్రమంగా వెళ్ళేట్టు చేయడానికి అమ్మ ఓ కొత్త పథకం ప్రారంభించింది. ఏరోజుకారోజు ట్యూషన్‍కి వెళ్ళినట్టు సూర్రావు మేస్టారి చేత సంతకం పెట్టించుకుని తారీకు వేయించుకుని రావాలి. అయితే నెల తర్వాత మళ్ళీ ట్యూషన్‌లో అడుగుపెట్టిన నాకు మళ్ళీ ఇంకెప్పుడూ మానేయాలని అనిపించలేదు. ఎందుకంటే అదే ట్యూషన్లో వల్లీ తన చెల్లెళ్ళూ, తమ్ముడితో సహా చేరి కనిపించింది. వల్లీకి మనుషులంటే వాళ్ళెంత మంది ఉంటే అంత సరదా. మేం ముగ్గురం, వాళ్ళు నలుగురు- మాతో స్నేహం చేస్తే మేం పెద్ద జట్టయిపోతాం. తొందర్లోనే నన్ను తన జట్టులో చేర్చుకుంది. నాకు చిన్నప్పుడు కోఇన్సిడెన్స్‌లనేవి ఎప్పుడో ఓసారి మాత్రమే జరుగుతాయని తెలీదు. అందుకే నేను ఎంతో ఇష్టపడిన ఈ పిల్ల మసలుకునే ఆవరణలోకి నా ప్రయత్నం ఏమీ లేకుండానే వచ్చిపడటంలోని కోఇన్సిడెన్స్‌ని గొప్పగా అనుకుని సంబరపడిపోలేదు. పుట్టిబుద్ధెరిగి కొన్నాళ్ళే అవటం మూలాన ప్రపంచమంటేనే ఇంత అనీ, మనం అనుకున్నవన్నీ మన మనసెరిగినట్టు ఇక్కడ జరిగిపోతాయనీ అనుకున్నాను. అలాగని ప్రతి రోజూ ట్యూషన్‌కి వెళ్ళేముందు దేవుడి పటం ముందు కళ్ళు గట్టిగా మూసుకుని, “ఓం నమశ్శివాయ, ఈ రోజు వల్లీ ట్యూషన్‌కి వచ్చేలా చేయి, ఓం నమశ్శివాయ ఈ రోజు వల్లీ ట్యూషన్‌కి వచ్చేలా చేయి” అని ప్రార్థించటం మాత్రం మర్చిపోయేవాడ్ని కాదు. ఒకవేళ ప్రార్థించాక కూడా ఆమె రాకపోతే ఆ రోజు ప్రార్థనలోనే ఏదో లోటు చేసానని బాధపడేవాడ్ని. మరుసటి రోజు మనస్సు ఏ పక్కకీ పోనివ్వకుండా ఇంకాస్త శ్రద్ధగా ప్రార్థించేవాడ్ని. అప్పుడే కాదు, ఇప్పటికీ వల్లీకీ నాకూ మధ్యనున్న బంధంలోని సిమ్మెట్రీ దేవుడున్నాడేమోనని అనుమానం కలిగేలా చేస్తుంది. విశ్వం మంత్రజాలమయం అనిపిస్తుంది. మేం ముగ్గురన్నదమ్ములం, వాళ్ళు ముగ్గురక్కచెల్లెళ్ళు– తోకలా ఒక తమ్ముడు. వల్లీ అంటే పెద్దన్నయ్యకి ఇష్టమని అమ్మతో ఎక్కడ చెప్పేస్తారోనని, మా ఇద్దరు తమ్ముళ్ళనీ కూడా మిగిలిన ఇద్దరు అక్క చెల్లెళ్ళనీ ప్రేమించమని చెప్పి చెడగొట్టే ప్రయత్నం చేసేవాడిని. అయితే వాళ్ళు మరీ చిన్నపిల్లలు. మా పెద్ద తమ్ముడికి వల్లీ పెద్ద చెల్లెలంటే వళ్ళు మంట. ఇద్దరూ ఎప్పుడూ కొట్టుకునేవారు. వల్లీ చిన్న చెల్లి మా చిన్న తమ్ముడ్ని మేకపిల్ల ఎక్కించుకునేది. వల్లీ నేనూ అంతకన్నా పెద్దరికంతో ఏం ప్రవర్తించేవాళ్ళం కాదు. ఆమె రమ్మన్న చోటికల్లా వెళ్ళి, ఆడమన్న ఆటల్లా ఆడేవాడ్ని. చివరకు శివాలయంలో దేవగన్నేరు చెట్టు కింద తనతో ఆడపిల్లలా ఉప్పులగుప్ప కూడా తిరిగేవాడ్ని. నాకు ఆ శివాలయం, ఉత్తపుణ్యానికి పూలు రాల్చే ఆ దేవగన్నేరు చెట్టూ అలాగే మనసులో ఉండిపోయాయి. మన వాళ్ళు మాట్లాడితే మల్లెలూ, గులాబీలూ అంటారు కానీ, అటు అందానికి అందమూ, మంచి వాసనకి వాసనా ఉండే ఈ దేవగన్నేరు పూవు పేరెందుకు ఎత్తరో అర్థం కాదు. రేకల అంచులో తెల్లగా ఉండి, బొడ్డులోకి పోయే కొద్దీ మెల్లగా పసుపు రంగులోకి మారే పువ్వు రూపాన్ని అక్షరాల్లో వర్ణించగలను కానీ, బొడ్డులో ముక్కు దూర్చి ఎంత పీల్చినా తనివి తీరని వాసనని ఎలా వర్ణించాలి. పదును అంచులున్న పళ్ల మధ్య దళసరి పూరేకని పెట్టి చిన్నగా కొరికితే పళ్ళకు దారిస్తూ వేరయ్యే రేక మృదుత్వమూ, నాలిక్కి అంటే చిరు చేదూ నాకు తెలుసు. రేకలు పట్టు లేకుండా చప్పున విడిపోతాయన్న మాటేగానీ మిగతా విషయాల్లో నా వరకూ ఈ పువ్వుకి సాటి వచ్చే పువ్వు లేదు. శివాలయంలో వల్లీతో ఆడిన ఆటల వల్లనో ఏమో ఈ పువ్వు ఎప్పుడు చూసినా తర్వాత చాలా ఏళ్ళ దాకా వల్లీయే చప్పున గుర్తొచ్చేది– మళ్ళీ స్వయంగా వల్లీనే నా జీవితంలోకి వచ్చి, ఇక పువ్వుల్లోనూ, అందమైన కళ్ళల్లోనూ, రాత్రి వచ్చి పగలు మరుపులోకి జారిపోయే కలల మనోజ్ఞతలోనూ ఆమెని వెతుక్కోవాల్సిన అవసరం తీరిపోయేంత వరకూ. నిజానికి ఇప్పటికీ మనం కోఇన్సిడెన్స్‌ల తరచుదనాన్ని తక్కువ అంచనా వేస్తామేమోననిపిస్తుంది. ప్రపంచంలో మనం ఊహించిన దానికన్నా ఎక్కువ సిమ్మెట్రీనే ఉన్నదనిపిస్తుంది.

ప్రతి రోజూ సమయానికన్నా ముందే వచ్చి ట్యూషన్ లో కూర్చుని, వల్లీ వస్తుందా రాదా అని తను వచ్చేదాకా వేరే ఏమీ పట్టనట్టు అయిపోయి, తలుపు బయట అడుగుల చప్పుడు కోసమూ, గొళ్ళెం కదిలిన చప్పుడు కోసమూ ఎదురు చూడటం నా వల్ల కాకపోయింది. కాబట్టి అవసరం లేకపోయినా సందులూ గొందుల్లోంచి చుట్టుతిరిగి వల్లీ వాళ్ల ఇల్లున్న సందులోంచి వెళ్ళటమూ, ఏదో అటుగా వెళ్తూ ఆగినట్టు వల్లీ ఇంటి ముందు ఆగి వాళ్ళనీ మాతో పాటు ట్యూషన్‌కి పిలుచుకుని వెళ్ళటమూ మొదలుపెట్టాను. మొదటి రోజు గడప మీద మునివేళ్ళపై లేచి వాళ్ళ ఇంటి తలుపు గొళ్ళెం కొట్టినపుడు గుండె గట్టిగా కొట్టుకుంది. బుర్ర మీసంతో, ఛాతీ నిండా వెంట్రుకలతో, వంటి మీద లుంగీ మాత్రమే కట్టుకున్నాయన తలుపు తీశాడు. నేను పిరికితనాన్ని దాచుకుని వల్లీని ట్యూషన్‌కి పిలుచుకునివెళ్ళటానికి వచ్చామని చెప్పాను. ఆయనకి ఈ ముగ్గురు డింభకుల్నీ చూసి ఏమనిపించిందో! తన పిల్లల్ని పిలుచుకుని వచ్చేందుకు తలుపుకు అడ్డం తొలిగాడు. లోపల ఒక వాకిలీ, తులసికోట, తులసి కోటకు ఎదురుగా మేం నిలబడిన ద్వారానికి కుడివైపున కాస్త పాడుపడ్డ ఇల్లు. తర్వాతి నుంచీ రోజూ వాళ్ళింటి మీంచి వెళ్తూ వాళ్ళని పిలుచుకుని వెళ్ళేవాళ్ళం. ఒక వర్షం రోజున రెండే గొడుగుల్లో ఆరుగురమూ ఇరుక్కుని తడిసీ తడవకుండా వెళ్ళటం గుర్తుంది. వాళ్ళ ఇల్లున్న వీధి నుంచి బయటకొస్తే శివాలయం వీధిలోకి వస్తాం, శివాలయం చుట్టుతిరిగి పైకి వెళ్తే కమ్మోళ్ళ పెద్ద ఇళ్ళున్న వీధిలోకి వెళ్తాం, తర్వాత గ్రంథాలయం వీధి, తర్వాత విశాలంగా బ్యాంకు వీధి, అది వెళ్ళే కొద్దీ సన్నంగా చివరికి చిన్న వీధిలాగా మారిపోయేది, ఆ చిన్న వీధిలో ఒక పెంకుటింటి ముందాగి గొళ్ళెం తలుపు తీస్తే ట్యూషన్‌లో ఉంటాం.

వల్లీ కొన్నాళ్ళకి చిన్నబడిలో చదువు పూర్తి చేసుకుని నేను చదివే పెద్ద బడికే వచ్చి చేరింది. ఆమె వచ్చేసరికే ఆ స్కూల్లో ఒక ప్రేమికుడిగా నా గుర్తింపు క్లాసులో చాలామంది పిల్లలకి పాకిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఇదే బడిలో చేరటంతో నాకు వెక్కిరింపులు మొదలయ్యాయి. ఆమె కనిపించినప్పుడల్లా మా క్లాసు పిల్లలు కొంతమంది నా వైపు తల తిప్పి చూసేవారు. అప్పుడప్పుడూ పాస్‌బెల్లులో ఆమె అటుగా వెళ్తున్నప్పుడు నన్ను “నాగ-వల్లి” అని గట్టిగా పిలిచి ఏడిపించేవారు.

నాకు బొమ్మలు వేయటం వచ్చు. అలాగే షాపుల మీద ఉండే పేర్లలాగా ఇంగ్లీషులో అందంగా అక్షరాలు రాసేవాడ్ని. ఒకసారి పెద్దబడిలో బెంచీలో నా పక్కన కూర్చున్న ఒక అబ్బాయి ఎందుకో గుర్తు లేదు అలా అందంగా “LOVE” అనే అక్షరాల్ని రాయమన్నాడు. నేను దళసరిగా పెద్దబరిలో రాసి, అక్షరాల వెనుక వాటి నీడలు కిందకి సాగినట్టు షేడింగ్ కూడా ఇచ్చాను. ఇంటి దగ్గర దానికి స్కెచ్ పెన్నులతో రంగులు వేసి తెద్దామని జేబులో పెట్టుకున్నాను. నాకు ప్రేమ లేఖలు అనే కాన్సెప్ట్ తెలియదు. ఎందుకో ఆ సాయంత్రం ట్యూషన్ అయ్యాకా వల్లీవాళ్ళూ, మేం ముగ్గురమూ కలిసి వస్తుంటే, నా పెద్ద తమ్ముడు నా జేబులో ఉన్న ఆ కాయితాన్ని తీసి వల్లీకి ఇచ్చాడు. నేను లాక్కోవటానికి ప్రయత్నించాను. ఆమె అందకుండా పరిగెత్తింది. పరిగెత్తి దూరంగా ఆగి కాయితం విప్పి చూసుకుంది. ఇంటి వైపు పరిగెత్తడం మొదలుపెట్టింది. ఆమె నుంచీ ఆ కాయితాన్ని లాక్కొని ప్రమాదాన్ని ఆపాలని నేను వెనక పరిగెట్టాను. కానీ కాసేపటికి తనని అందుకోలేక, పైగా భయంతో కాళ్ళు కూడా వణుకుతుండటంతో, ఆగి నడుస్తూ వెళ్ళాను. వీధులన్నీ దాటి శివాలయం దగ్గరకు వచ్చేసరికి బయట గోడకి ఆనుకుని ఉన్న మెట్టు మీద కూర్చుని ఉంది వల్లీ, తల వళ్ళో పెట్టుకుని ఏడుస్తూ. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ ఆ ఏడుపు చూస్తే ఎందుకో తను ఇంట్లో ఈ విషయం చెప్పదేమోలే అనిపించింది. ఏడిచే ఆడపిల్లని ఏం చేయాలో నాకు తెలీలేదు. అందుకే తిన్నగా నడుస్తూ తన పక్క నుంచే వెళ్ళిపోయాను.

మరసటి రోజు ఓపక్క గుండెలు గుబగుబ లాడుతుండగానే, మరో పక్క అన్నిటికీ తెగించిన ధైర్యంతో ఆమె ఇంటి తలుపు తట్టాను. తలుపు వల్లీనే తీసింది. ముఖం కోపంగా పెట్టుకుని పక్కకు జరిగి నిలబడింది. తులసి కోట దగ్గర కూరలు తరుగుతూ ఒకామె నన్ను చూసింది. లోపలికి రమ్మంది. ఆమె, వల్లీ అమ్మ, “నువ్వెంత, నీ వయసెంత, నువ్వు చేసే పనులేంటి?” అని మొదలుపెట్టి తిట్టింది. మళ్ళీ ఈ వీధిలోకి వస్తే కాళ్ళూ చేతులూ విరగ్గొడతానని కూడా చెప్పింది. బుద్ధిగా చదువుకోపొమ్మంది.

నాకు అది చాలా పెద్ద అవమానంలా అనిపించింది. ట్యూషన్‌లో వల్లీతో మాట్లాడటం మానేశాను. వాళ్ళింటి మీద నుంచి వెళ్ళటం మానేశాను. కొన్ని రోజులకి వల్లీనే వాళ్ళ చెల్లెలు చేతికి చిన్న చీటీ ఇచ్చి పంపింది. అందులో తన కొక్కిరాయి అక్షరాల్లో “మళ్ళీ ఇదివరకట్లా స్నేహంగా ఉందాం” అని ఉంది. కానీ నాకు మాట్లాడబుద్ధి వేయలేదు. వల్లీ మామూలుగానే నవ్వేది. మా తమ్ముళ్ళతో మాట్లాడేది. కానీ ఒక మనిషిని ఇష్టపడుతున్నాననే దాచుకోవాల్సిన నిజాన్ని తడబడి అలా తన ముందే ఎబ్బెట్టుగా బయటపడి ఒప్పేసుకోవటం, ఆమె మళ్ళీ దాన్ని క్షమించి ఫర్లేదులే నువ్వు చిన్నబుచ్చుకోవటం నేను గమనించనట్టే ఇదివరకట్లా మామూలుగా ఉందాం అన్నట్టు వుండటం నాకు నచ్చక, ఎంతో పరువు తక్కువలాగా అనిపించి మాట్లాడలేకపోయాను. వల్లీ ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తించేది. ఒక్కోసారి జట్టు పీసు కొట్టిన ఫ్రెండ్‌తో మసలుకొన్నట్టు నన్ను చూడగానే ముఖం ఇలా పెట్టుకుని వెళ్ళిపోయేది. ఒక్కోసారి ఉన్నట్టుండి ఎదురైతే నవ్వు ఆపుకోలేకపోయేది.

స్కూల్లో, ట్యూషన్‌లలోనే గాక బయట కూడా ఎదురుపడేవాళ్లం. చిన్నబడి పక్కనుండే రావి చెట్టు కొమ్మలకి అట్లతద్ది రోజున ఉయ్యాళ్లు కట్టేవారు. అదంతా పడుచులూ, పడుచువాళ్ల పండగ. అమ్మాయిలు ఎక్కేసరికి అబ్బాయిలు ఉయ్యాళ్ళని మరింత దురుసుగా ఊపేవారు. ఉయ్యాలకున్న పీట చెరువు అంచు దాటి నీటి మీది దాకా వెళ్ళిపోయేది. బయటపడలేక భయాన్ని దిగమింగుకుని ఏడవలేక నవ్వే ఆడవాళ్ళ ముఖాలూ, అలా దిగమింగుకోలేక వెర్రి కేకలు పెట్టే ఆడవాళ్ళ ముఖాలూ కూడా చూడటానికి బాగుండేవి. అపుడపుడూ సందు దొరకబుచ్చుకుని పిల్లలం దూరేవాళ్ళం. ఆటల్లో కింది బొత్తాం చిరిగిన చొక్కాతో వల్లీ ఉయ్యాలూగుతుంటే పచ్చగా ఆమె పొట్ట కనిపించింది. వినాయక నవరాత్రులకి రథం వీధికి అడ్డంగా తెర కట్టి సినిమాలు వేసేవారు. ఎపుడూ ఒకట్రెండు పాత సినిమాలే తిప్పి తిప్పి వేసేవారు. కానీ మాకు సినిమా మీద పెద్ద దృష్టి ఉండేది కాదు. ఆరు బయట ఆకాశం కింద నడి వీధిన అలా తెల్లని తెరపై పెద్ద పెద్ద ఆకారాలు తేలుతుంటే, ఆ వెలుగులో కింద రోడ్డు ఇసకలో పిల్లలమందరం ఇరుకిరుగ్గా కూర్చుని ఆడుకోవటం ఒక అనుభవం. తెరకి అటు వైపు చూస్తే సినిమా ఒకలానూ, ఇటు వైపు నుంచి చూస్తే మరోలానూ కనిపిస్తుంది. ఇట్నించి చూసినపుడు మన పద్ధతిలో పవిట వేసుకున్న హీరోయిన్, అటు వెళ్ళి చూసేసరికి ఉత్తరాది వాళ్ళలా పవిట తిరగేసి వేసుకుని కన్పిస్తుంది. ఇటు వైపు హీరో కుడి చేత్తో పట్టుకున్న పిస్తోలు, అటు వైపు వెళ్ళేసరికి ఎడం చేతిలోకి మారుతుంది. ఈ సినిమాకి ఒకసారి వల్లీ వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి వచ్చింది. ఆమె రావటం నేను చూడకముందే మా ఫ్రెండ్స్‌ చూసేసి గుసగుసగా నాకు చెప్పారు. వీధివార ఒక పెద్ద ఇంటి ఎత్తయిన గచ్చు మీద ఆడవాళ్ల మధ్యన కూర్చుని తెరవంక చూస్తున్న వల్లీ ముఖం వైపు చూస్తూండిపోయాను, ఆమెకి ఎవరో చూస్తున్నారనిపించి నా వైపు తల తిప్పి చూసేవరకూ.

దోబూచులాటలతో ఒక ఏడాది గడిచిపోయింది. ఆ వేసవి సెలవుల్లో చెప్పాపెట్టకుండా వల్లీ్వాళ్ళు ఆలమూరు వదిలి వెళిపోయారు. కొత్త తరగతిలోనూ, అదీ కొత్త స్కూల్లోనూ చేరిన ధ్యాసలో నేను ఆమె లేకపోవటాన్ని పట్టించుకుని బాధపడింది తక్కువే. కానీ ఎదిగేకొద్దీ ఆమె నాలో అంతకంతకూ బలపడింది. యవ్వనంలోకి వచ్చాకా కూడా, నేను ఎవరితోనూ ప్రేమలో లేకుండా నా మనసుని ఖాళీగా ఉంచిన విరామాల్లో, ఆమె నాకు గట్టిగా గుర్తుకువచ్చేది. ఎందుకో అలాంటి అమ్మాయే నాకు నప్పుతుందని నాలో ముద్రపడిపోయింది. నేను చదువయ్యాకా ఇంటి నుంచి బయటకు వచ్చి ఒంటరిగా నగరంలో ఉన్న రోజుల్లో, నాతో పాటు సమాంతరంగా ఎదిగివున్న ఆమె ఊహే నా ప్రేయసి అయ్యేది, నన్ను కాపాడేది. నాకు వాస్తవంలో ఆదర్శంగా అనిపించిన భావాలన్నీ కలల్లో ఆమెకు ఆపాదించబడేవి. ఆమె కలలోకి వచ్చాకా నిద్ర లేచిన పగళ్ళు ఎంతో ఉత్తేజంతో జీవితం పట్ల ప్రేమనీ అనురక్తినీ పెంచేవిగా ఉండేవి. నేను కొత్తగా ఎవరితో ప్రేమలో పడినా వాళ్ళల్లో ఎంతో కొంత ఆమెను వెతుక్కున్నాను. ఎంతైనా నా ప్రేమల వరుసలో ఆమె మొదటిది కాబట్టో మరేమో. ఇంతిలా ఉన్నా ఎప్పుడూ ఆమెని వెతికే ప్రయత్నం చేయలేదు. కోఇన్సిడెన్స్‌ల మీద పెట్టుకున్న నమ్మకమో, నా జీవితానికి శాపమైన ఒళ్ళు బద్దకమో, ఒకవేళ కలిసినా మున్ముందు ఎంతో అందమైన ఆడపిల్లగా ఎదుగుతుందని నాకు కచ్చితంగా తెలిసిన ఆ అమ్మాయి చుట్టూ ముసురుకునే ఎందరో మగాళ్ళ మధ్య చిన్నప్పడు ఒక ప్రేమలేఖ కాని ప్రేమలేఖ ఇచ్చిన ఈ నల్ల పిల్లాడ్ని ఎందుకు గుర్తుంచుకుంటుందిలేమ్మన్న నిరాశో, ‘పదోతరగతి అయ్యాకా పెళ్ళి చేసుకోవడం’ తన లక్ష్యమని అప్పుడే చెప్పిన పిల్లని వెతికి దొరకబుచ్చుకున్నా ఆమె నాది కావటం అసాధ్యమని తెలియటమో… ఇన్ని కలిసి నన్ను మరీ పట్టుబట్టి ఆమెను వెతక్కుండా చేశాయి.

కానీ మళ్ళీ పంతొమ్మిదేళ్ళ తర్వాత ఆమె కలిసింది. అప్పటి నన్ను గుర్తుంచుకుంది, ఇప్పటి నన్ను ఇష్టపడింది. మా పెళ్ళయి మాకు బిడ్డ పుట్టిన నాలుగేళ్ళకి కానీ మా ఇద్దరికీ ఆలమూరు వెళ్ళడం కుదరలేదు.

బైక్ మీద రావులపాలెం గోదారి దాటి, జొన్నాడ దాటి, ఇంకా వున్న ఇటిక బట్టీలు దాటి, జ్ఞాపకం కన్నా ఎంతో ఇరుకనిపించిన ఆలమూరు వీధుల్లోకి వచ్చాం. చిన్నప్పుడు మా ఇంటి నుండి ఎంతో దూరం అనిపించిన చిన్నబడి ఇప్పుడు చప్పున వచ్చేసింది. రావి చెట్టు కొన్ని కొమ్మల్ని కోల్పోయి, విశాలత్వాన్ని కుదించుకున్నట్టు అనిపిస్తూ, ఉండటమైతే ఉంది. పక్కన చిన్నబడి కూడా ఉంది. సాయంత్రం కాబట్టి బడి మూసి ఉంది. కొంతమంది పిల్లలు ఇంకా స్కూలు యూనిఫారాల్లోనే పక్కనున్న ఇసుక గుట్టల్లో ఆడుకుంటున్నారు. బండి ఆపి వల్లీ నేనూ బడిని చూసుకున్నాం. ఇప్పుడు వర్తమానంలో నిజంగా కళ్ళ ముందున్న పరిసరాలకూ, ఇన్నాళ్ళుగా మా మనసులో ఊహలుగా మెదిలిన పరిసరాలకూ పొంతన కుదరటం లేదు. మా మనసులో ఉన్న చిన్నబడి రూపం ఏదో ఒక్కనాటిది కాదు; వేర్వేరు ఋతువుల్లో వేళల్లో, వేర్వేరు మూలల నుంచి కనిపించిన దాని వేర్వేరు వైనాలన్నీ ఒకదానిపై ఒకటిగా పేరుకున్న దృశ్యాల దొంతర– చిన్నప్పుడు పలక మీద ఒకే అక్షరాన్ని పదే పదే ఒరవడి దిద్దితే ఏర్పడే అక్షరాల దొంతర లాంటిది. అది ఇప్పుడు మా కళ్ళ ముందున్న ఈ ఒక్కనాటి వాస్తవాన్ని మించిన వాస్తవం. బడి వరండాకు అప్పటిలాగే కటకటాలు ఉన్నాయి. తలుపులకు మాత్రం రంగు మారింది. చుట్టూ ప్రహరీ గోడ వచ్చి చేరింది. ఆ కట్టడంలో అప్పటిలాగే మిగిలిన కొన్ని భాగాల్ని చూస్తూంటే మనసులో ఏదో మడత విప్పుకుంటోంది, ఏదో జ్ఞాపకం రెక్కలు విదిలించుకుని లేవబోతోంది. అంతలోనే అదే కట్టడంలో మారిపోయిన భాగాలు కంటపడగానే జ్ఞాపకం రెక్కలు తెగి వర్తమానంలోకి వచ్చి పడుతోంది. ఒక పక్కన కాలంలో వెనక్కి కదులుతున్నట్టు ప్రయాణపు కుదుపూ, మరో పక్క అదంతా భ్రమేనని తేలి ఉన్నచోటే తెప్పరిల్లటం… ఇదంతా ఎలా ఉందంటే, మన చుట్టూ మనం గిర్రున బొంగరంలా తిరిగి తిరిగి ఒక్కసారే ఆగితే, అప్పటిదాకా సాగిన చలనానికీ ఉన్నట్టుండి ఈ స్థిరత్వానికీ మధ్య భౌతికమైన సర్దుబాటులో మెదడు ఎలాంటి అయోమయానికి గురవుతుందో, అలాంటి అయోమయమే నా మనసుకు కలుగుతూ చిరాకనిపించింది. శ్రీవల్లి ఫోటోలు తీస్తోంది. ఇసకలో ఆడుకుంటున్న పిల్లలు ఆగి మమ్మల్ని చూస్తున్నారు. బడి ఎదుట ఇళ్ళల్లో పనులు ముగించుకుని కబుర్లు చెప్పుకుంటున్న ఆడవాళ్ళు మా వంక కుతూహలంగా, అనుమానంగా చూస్తున్నారు. తడుముతున్నట్టు ఉన్న వాళ్ళ చూపులూ, ఇక్కడ ఏదీ వెనక్కి తిరిగి రాదని తెలిసిన నిరాశా మమ్మల్ని అక్కడ ఎక్కువ సేపు ఉండనీయలేదు. పరిసరాల మూగతనాన్ని మనసులోనే తిట్టుకుంటూ, “పోదాం పద” అన్నాను. వల్లీ ఈసారి బండెక్కేటప్పుడు రెండు వైపులా కాళ్ళేసి కాక, ఊళ్ళో ఆడవాళ్ళలా రెండు కాళ్ళూ ఒక పక్కకు పెట్టుకుని కూర్చుంది. నెమ్మదిగా వల్లీ పాత ఇంటి మీదుగా పక్కనే శివాలయం వైపు వెళ్ళాం. మంటపం ముందు పిల్లలు క్రికెట్ ఆడుకుంటున్నారు. ఆశ్చర్యంగా చుట్టూ పూలను పారేసుకుని దేవగన్నేరు చెట్టు అలాగే నిలబడి ఉంది. వల్లీ కొన్ని పూలు తలలో తురుముకుంది. గుళ్ళోకి ఎవరో వెళ్ళటం చూసిన పూజారి భార్య లోపలికి వచ్చి వల్లీతో మాట్లాడింది. మెట్టినింట్లో అడుగుపెట్టినప్పటి నుంచీ ఇదే ఊళ్ళో జీవితం గడిపేసిన ఆమెకి- ఇలా జ్ఞాపకాల్ని వెతుక్కుంటూ ఇంకో ఊరికి అది తప్ప మరో పనేం లేకుండా రావటమనేది తన తర్వాతి తరం పిల్లలకు మాత్రమే వీలయ్యే ఒక పాషనబుల్ విషయంగా అనిపిస్తున్నదన్న సంగతి దయగా నవ్వుతోన్న ఆమె ముఖ కవళికే చెబుతోంది.

బండి మీద ఇంకొన్ని వీధులు తిరుగుతూ రథం వీదికి వచ్చాం. నీలా టీచరు ఇంటి మీంచీ వెళ్తుంటే మా ఇద్దరికీ ఆమెని చూడాలనిపించింది. ఇంటి గడపకీ, గేటుకీ మధ్యన బోలెడు దూరంతో, పై అంతస్థుకి పెంకుల కప్పుతో ఆ పెద్ద ఇల్లు ఇంకా అలానే ఉంది. తమ దగ్గర చదువుకున్న పిల్లలు పెద్ద ఉద్యోగాల్లో కుదురుకుంటే సంతోషపడే టీచర్లుంటారు కానీ, చదువుకున్న పిల్లల్లో ఓ ఇద్దరు ఒకర్నొకరు పెళ్ళి చేసుకుంటే సంతోషించే టీచర్లు ఉండరనీ, అదొక తుంటరితనంగా చిరాగ్గా కూడా చూస్తారనీ ఇద్దరికీ తెలుసు. కాబట్టి మా ఇద్దరిలో ఎవరో ఒక్కరే ఆమె దగ్గర చదువుకున్నట్టు చెబుదాం అనుకున్నాం. నువ్వంటే నువ్వనుకుంటూ, ఎవరన్నది తేలకుండానే గేటు తోసుకుంటూ లోపలికి వెళ్లాం. ఎవరో వచ్చారని లోపలివాళ్ళు గ్రహించేంత గట్టిగానే గేటు వేస్తూ చప్పుడు చేసాం. ఇంటి చీకట్ల లోంచి ఎవరో కదిలి రావటం కనిపించింది. నాకు ఒక క్షణం ఇక్కడిదాకా వచ్చాకా ఇక వెనక్కి వెళ్ళలేం అనిపించింది. కానీ బయటకు వచ్చిన మనిషి నీలా టీచరు కాదు. ఆమె బంధువు. నీలా టీచరు ఇప్పుడు ఈ ఇంట్లో ఉంటం లేదనీ, ఊరి చివర కొత్తగా ఇల్లు కట్టుకుని అక్కడకు మారిపోయారనీ చెప్పిందావిడ. మాకు నీలా టీచర్ని తప్పకుండా చూడాలనేం లేదు. మా ఇద్దరిలో ఎవరమూ చిన్నప్పటి టీచర్లని మళ్లా కలిస్తే వాళ్ళు “మేం పాఠాలు చెప్పిన తీరు వల్లే కదా ఇదంతా” అని మురిసిపోయేంత పెద్ద ఉద్యోగాలు చేయటం లేదు. మేం ఆనందంగా ఉన్నాం. కానీ మన జనానికి అది పెద్ద సాధించటం కిందకి రాదు. మళ్ళీ బండెక్కి ఇంకొన్ని వీధులు తిరుగుతుంటే మళ్ళీ అదే భావం– పరిసరాలన్నీ ‘మీరసలు ఎందుకొచ్చారిక్కడికీ’ అని ఇబ్బందిగా, నిరసనగా అడుగుతున్నట్టు.

కాసేపు ఏ లక్ష్యమూ లేకుండా బండి మా ఇద్దర్నీ మోసుకుంటూ, హేండిల్‌బార్ మీద నా చేతులు అప్పుడు పుట్టిన బుద్ధికి ఎటు తిప్పితే అటు తీసుకువెళ్తూ చాలా వీధులు తిరిగాం. సూర్రావు మాస్టారు అద్దెకుండి మాకు ట్యూషన్ చెప్పిన ఇల్లు అలానే ఉంది. స్థలం కొనుక్కునేవాళ్ళు సంప్రదించాల్సిన నంబరు ఆ పెంకుటింటి చూరుకి వేలాడదీసి ఉంది. మరికొన్ని వీధులు తిరిగాకా బండి తెలియకుండానే మమ్మల్ని ఊర్నించి బైటకు పోయే రోడ్డు మీదకు తీసుకు వచ్చింది. చూస్తూ పోతుంటే, అసలు ఊరు కూడా ఊర్నించి బయటకు వచ్చేస్తున్నట్టుంది. ఎందుకంటే, ఊరి లోపల అంతా పాతబడినట్టు ఉంటే, ఊరి చివర మాత్రం వరుసగా కొత్తగా కట్టిన ఇళ్ళు చాలా ఉన్నాయి, అవన్నీ ఊరిని వదిలి ఆ రోడ్డు మీదుగా పోతే వచ్చే మండపేట టౌను వైపుగా బారులు తీరి నడుస్తున్నట్టు.

మేము ఒక సందు మలుపు తిరిగి లోపలకు వెళ్ళాం. నీలా టీచరు కొత్త ఇల్లు మోడ్రన్‌గా ఉంది. పాత ఇంటిలా తరాల్ని చూసిన గంభీరత్వంతో కాక, కోణాలన్నీ చక్కగా తీర్చి, ఏ భాగాలకి నప్పే రంగు ఆ భాగానికి వేసుండి, అక్కడక్కడా అద్దాలతో ఉంది. గేటు తాళం వేసి ఉంది. గేటు గ్రిల్ లోంచి లోపల చిన్న తోట కనిపిస్తోంది. కాసేపు ఊహలో నీలా టీచరు ఆ తోటలో తిరుగుతున్నట్టు ఊహించుకున్నాను. వరండాలో ఖాళీగా ఉన్న కుర్చీలో ఆమె కూర్చున్నట్టు ఊహించుకున్నాను. ఇంతలో ఎవరో అబ్బాయొచ్చి ఇంట్లోవాళ్ళు హైదరాబాద్‌ చుట్టాలింటికి వెళ్లారని చెప్పాడు. వల్లీ ఇంక అక్కడ తనకు ఉండబుద్ధేయటం లేదన్నది. బయల్దేరి వచ్చేశాం.

తర్వాత కొన్ని వారాలకి ఒక రాత్రి నిద్రపట్టకపోతే ఎందుకో మళ్ళీ ఆ రోజు మేమిద్దరం నీలా టీచరు ఇంటికి వెళ్ళిన సన్నివేశం గుర్తుకువచ్చింది. అపుడు నా గురించి నాకు ఓ విషయం ఆశ్చర్యమనిపించింది. ఆ రోజు నీలా టీచరు కోసం వెళ్ళిన రెండు ఇళ్ళల్లోనూ, ఆమె కాసేపట్లో మా ముందుకొస్తుందని ఎదురుచూసిన ఆ కొద్ది క్షణాల్లోనూ, ఆ వచ్చే ఆమె నేను చిన్నప్పుడు ఎలా చూసానో అలాగే ఉంటుందనుకున్నాను. పాతికేళ్ళ తర్వాత- ఆ గిరజాల జుట్టు నెరిసిపోయి, ఆ చర్మం వడలిపోయి, ఆ కళ్ళు అలసిపోయీ, కళ్లజోడుతో ఉన్న మనిషి వచ్చే అవకాశం ఉందని నాకు కనీసం తట్టలేదు కూడా. నేను మళ్ళీ ఆమెను కలిసే ప్రయత్నం చేయకపోతే, ఆమె ఎప్పటికీ అలానే ఉండిపోతుంది. చిన్నబడిని రెండోసారి చూసి అంతకుముందు నా జ్ఞాపకంలో ఉన్న పాత చిన్నబడిని కొంతైనా కల్తీ చేసుకున్నాను. నీలా టీచరు రూపాన్ని కూడా అలా కల్తీ చేసుకోవాలా? ఆ రాత్రే ఆమె గురించి ఏదైనా రాయాలనిపించింది. కానీ ఆమెనీ, నన్నూ కలుపుకొని ఒక కథ అంటూ ఏమీ లేదు. అసలు ఆమె రూపం గురించి తప్ప, అంతరంగం గురించి నాకు ఏమీ తెలీదు. ఆమె కళ్ళ వెనుక, కపాలపు చీకట్లలో ఏం జరిగేది. ఆమె సంతోషం తెలిసిన మనిషేనా, లేక దిగులు మనిషా. గదిలో ఒక్కతే ఉన్నప్పుడు ఆమె ఎక్కడకు ఎగిరిపోవాలని అనుకునేది, అసలు ఆ ధ్యాస ఉండేదా. ఆమె ఎవర్నైనా ప్రేమించిందా, లేక బాబ్జీ/ అబ్బుగారు/ రాంపండుని మినహాయించి మరో తోడు లేని, ఆ నిమిత్తమూ అవసరమూ లేని లోకమా. నిజమైన నీలా టీచర్ గురించి అంచనాలు తప్ప నా దగ్గర ఏదీ లేవు. అంచనాలతో సృష్టించే కల్పన నిజమైన నీలా టీచర్‌ని కల్తీ చేస్తుంది. ఆమె కథేమీ నా దగ్గర లేకుండా ఆమె గురించి కథ ఎలా చెప్పటం…

Published in : vaakili.com, may 2017 issue. 

Art work by : B. Kiran Kumari 

7 comments:

  1. "నీలా టీచరు రూపాన్ని కూడా అలా కల్తీ చేసుకోవాలా?
    అఖర్లేదు. కొన్ని జ్ఞాపకాలు అలా మిగిలిపోతేనే బాగుంటుంది.
    ఇలా,

    ఆటల్లో కింది బొత్తాం చిరిగిన చొక్కాతో వల్లీ ఉయ్యాలూగుతుంటే పచ్చగా ఆమె పొట్ట కనిపించింది.

    ఇంత స్వచ్చంగా!
    చి న

    ReplyDelete
  2. బాల్య కౌమారాల ప్రథమ ప్రేమల జ్ఞాపకాలను ఎంత భద్రంగా దాచేరు!చదివేవాడిని కూడా గతస్మృతులలో ఓలలాడించేరుగా!

    ReplyDelete
  3. Meher garu, love the way you write!!

    My favorite lines are:

    లౌకికాల్ని మించిన విషయాలకీ, గుంభనంగా దాచుకునే ప్రేమలకీ, లోతుల్లో తొలిచే విషాదాలకీ, భౌతికం కాని అసంతృప్తులకీ, స్వార్థాన్ని దాటిన నునులేత ఆదర్శాలకీ చెందిన మనిషి అని అనిపించేది.

    నా మూణ్ణాలుగేళ్ళ తమ్ముడిలా నాది ప్రపంచమింకా ఒరుసుకోని మెత్తటి చర్మమున్న పసి వయస్సు కాదు.

    ............... ఆ ప్రేమ వార్త నాతో పాటూ వచ్చి పెద్దబడిలో చేరిపోయింది

    .........................మళ్ళీ వాటన్నింటికన్నా ముఖ్యమైన లక్ష్యం నన్ను నిమంత్రిస్తుంటే తెప్పరిల్లి ముందుకు సాగిపోయేవాడ్ని.

    ఒకసారి ఇలాగే ఆమె కనపడని ఉత్సవం నుంచి ఇంటికి నడిచి వస్తూ......

    అలా బద్దలవటంలో కూడా అమ్మకి ఒక పద్ధతి ఉండేది.

    ..........ఇక పువ్వుల్లోనూ, అందమైన కళ్ళల్లోనూ, రాత్రి వచ్చి పగలు మరుపులోకి జారిపోయే కలల మనోజ్ఞతలోనూ .............

    నిజానికి ఇప్పటికీ మనం యాదృచ్ఛికాల తరచుదనాన్ని తక్కువ అంచనా వేస్తామేమోననిపిస్తుంది. ప్రపంచంలో మనం ఊహించిన దానికన్నా ఎక్కువ సిమ్మెట్రీనే ఉన్నదనిపిస్తుంది.

    నీ ఒక మనిషిని ఇష్టపడుతున్నాననే దాచుకోవాల్సిన నిజాన్ని తడబడి అలా తన ముందే ఎబ్బెట్టుగా బయటపడి ఒప్పేసుకోవటం, ........

    నేను ఎవరితోనూ ప్రేమలో లేకుండా నా మనసుని ఖాళీగా ఉంచిన విరామాల్లో,

    నాతో పాటు సమాంతరంగా ఎదిగివున్న ఆమె ఊహే...

    నాకు వాస్తవంలో ఆదర్శంగా అనిపించిన భావాలన్నీ కలల్లో ఆమెకు ఆపాదించబడేవి.

    చూస్తూ పోతుంటే, అసలు ఊరు కూడా ఊర్నించి బయటకు వచ్చేస్తున్నట్టుంది.

    ఆమె కళ్ళ వెనుక, కపాలపు చీకట్లలో ఏం జరిగేది.

    ReplyDelete
  4. fantastic narration.... చదువుతున్నంత సేపూ ఉక్కిరి బిక్కిరి చేసేసింది....

    ........ మెట్టినింట్లో అడుగుపెట్టినప్పటి నుంచీ ఇదే ఊళ్ళో జీవితం గడిపేసిన ఆమెకి- ఇలా జ్ఞాపకాల్ని వెతుక్కుంటూ ఇంకో ఊరికి అది తప్ప మరో పనేం లేకుండా రావటమనేది తన తర్వాతి తరం పిల్లలకు మాత్రమే వీలయ్యే ఒక పాషనబుల్ విషయంగా అనిపిస్తున్నదన్న సంగతి దయగా నవ్వుతోన్న ఆమె ముఖ కవళికే చెబుతోంది...... ఈ వాక్యంలో ఉన్న క్రిస్ప్ నెస్, బరువు, ఇంటలెక్చువాలిటీ ... వాహ్... హాట్సాఫ్ సర్.

    ReplyDelete
  5. చదివించలేదు.... కళ్ళకు చూపించారు. అద్భుతం ��

    ReplyDelete
  6. This is the story I wish I could write.

    ReplyDelete
  7. హ్యాట్సాఫ్ సర్!కొంతమంది అలా ..జ్ఞాపకాలల్లో నిలిచి పోతారు..

    ReplyDelete