April 17, 2011

ఓ సెకండ్ హాండ్ బుక్ షాప్ గురించి

హైదరాబాదులో పుస్తకాల షాపులన్నీ నాకు కరతలామలకమని నమ్మకం. అందుకే కాశీభట్ల గారు ఫలానా లక్డీకాపూల్లో అశోకాహోటల్ పక్కనున్న షాపులో మంచి పుస్తకాలు దొరుకుతాయని రెండుమూడుసార్లు చెప్పినా, “ఆఁ! నన్ను ఆశ్చర్యపరచే పుస్తకాల షాపులు హైదరాబాదులో యింకేం మిగిలున్నాయిలేఅనుకున్నాను. కానీ మొన్న అనుకోకుండా బైక్ చేతికందితే ఆఫీసులో ఖాళీని పురస్కరించుకుని  వెతుక్కుంటూ వెళ్లాను. చిరునామా సులువే. లక్డీకాపూల్ నుండి రవీంద్రభారతికి వెళ్ళే దారిలో బస్టాపుకు ఎదురుగా వుంది. పేరు బెస్ట్ బుక్ సెంటర్”. 


ఫలానా పుస్తకాల షాపు మనకు ఎంత సంతృప్తిని కలిగించిందీ అన్నది మనకు ఏ రకం పుస్తకాలు కావాలీ అన్నదానిపై ఆధారపడివుంటుంది. నాకు ఆంగ్ల సాహిత్యమంటే ఆసక్తి. నన్ను ఏ రచయితలు ఆకట్టుకుంటారో ఏ రచయితలు ఆకట్టుకోరో, వాళ్ళల్లో చాలామందిని చదవకపోయినా కూడా, నాకు తెలుసు. అంతేకాదు, మొత్తం షాపులో నాకు నచ్చే పుస్తకాలు ఎక్కడ వుంటాయన్నది మొదటి చూపులోనే వాటి spines చూసి గుర్తుపట్టగలను. సరే... షాపు మెట్లెక్కి లోపలికి వెళ్లంగానే కొన్ని పాత తెలుగు పుస్తకాలతో పాటు కాల్పనికేతర ఆంగ్ల సాహిత్యం వుంది. కాల్పనిక సాహిత్యం పై అంతస్తులో వుంది. వంపు తిరిగిన ఇనుప మెట్లు పైకి తీసికెళ్తున్నాయి. మామూలుగా ఒడిస్సీ’, ‘క్రాస్ వర్డ్స్లాంటి ఆడంబరమైన షాపుల్లో పుస్తకాలన్నీ ఒద్దికగా ఏ విభాగానికా విభాగం వేరు చేసి సర్ది వుంచుతారు. కనుక అక్కడ పుస్తకాలు వెతకడంలో పెద్ద ఉత్సాహం వుండదు. ఏ మూల ఏం దొరకవచ్చునో అన్న ఉత్కంఠ వుండదు. అంతదాకా కేవలం యశస్సు విని ప్రేమించిన పుస్తకం హఠాత్తుగా మన కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ ఎదురై ఆశ్చర్యపరచడం జరగదు. అటువంటి షాపుల్లో ఒక రాక్‌ నుంచి ఏ పుస్తకం తీసినా ఆ రాక్‌లో మిగతా పుస్తకాలేమై వుండొచ్చో చెప్పేయవచ్చు. అన్ని పుస్తకాల్లాగే అక్కడి పుస్తకాలు కూడా ఎంతో గంభీరమైన ఆలోచనా చైతన్యాన్ని నింపుకుని, మనిషి జీవితానికి సమూలంగా కొత్త చిగుర్లు తొడిగే భావవీచికల్ని నిశ్వసిస్తూ, ఎన్నో స్వయంసమృద్ధమైన ప్రపంచాల్ని సందడిగా తమ పేజీల మధ్య పొందుపరుచుకున్నప్పటికీ, ఎందుకో ఆ వరుసల్లోని క్రమబద్ధతా, ఒకే ప్రచురణకర్త ప్రచురించిన పుస్తకాలన్నింటినీ ఒకే చోట అమర్చడం, “క్లాసిక్ ఫిక్షన్” “లిటరరీ ఫిక్షన్” “పాపులర్ ఫిక్షన్” “ఇండియన్ ఫిక్షన్లాంటి విభజనలూ... ఇవన్నీ వాటి వైభవాన్ని మరుగుపరుస్తాయి. ఆ స్థలమంతా విశృంఖల మేధో బాహుళ్యంతో ప్రజ్వరిల్లుతుందన్న సంగతిని అక్కడి పద్ధతైన అమరిక దాచేస్తుంది. స్కూలు ప్రార్థనాసమయంలో యూనిఫాం తొడుక్కుని పరధ్యానంగా వరుసల్లో నిలబడ్డ పసిపిల్లల దృశ్యం తోస్తుంది.

అందుకే పాత పుస్తకాల షాపులంటే ఆసక్తి. అక్కడ పుస్తకాలు ఓ వరుసలో వుండవు. పద్ధతిగా పేర్చివుండవు. ఆశ్చర్యానికి అవకాశం వుంటుంది. (పుస్తకాల షాపుల్లో యిలా ఆశ్చర్యం కోసం అలమటించడ మన్నది నాకు చిన్నప్పుడు మా వూరి గ్రంథాలయంలో పుస్తకాల వెతుకులాట నుంచీ అలవాటైంది.) అంతేకాదు, యిక్కడ ప్రతీ పుస్తకం ఒక వ్యక్తిత్వాన్ని కలిగి వున్నట్టనిపిస్తుంది. ఇవన్నీ ఎవరో చదివినవి. వాళ్ళ ప్రేమకు గుర్తుగా అక్కడక్కడా అండర్లైన్డ్ వాక్యాల్ని అలంకరించుకున్నవి. వాళ్ళ అల్మరాల్లో తమ యౌవనజీవితాన్ని గడిపి చివరికి భారంగా పసుపు పెళుసు పేజీల్ని మోసుకుంటూ ఇక్కడకు చేరినవి. వాటికో చరిత్ర వుంది. జ్ఞాపకాల్ని మోస్తున్న బరువు వుంది. వార్థక్యానికీ, జ్ఞానానికీ వున్న ఏదో సంబంధాన్ని అందమైన భ్రమగా ఈ వృద్ధ గ్రంథాలు భలే పోషిస్తాయి.

పైకి వెళ్లాక నిండా పుస్తకాలున్న పెద్ద హాలు ఎదురవుతుంది. దాదాపు మూడు గంటలు గడిపాను. ఒక మూణ్ణాలుగు పుస్తకాల పేజీలు తిప్పగానే చేతులకు చాలినంత దుమ్ము పడుతోంది. బాగా పట్టనిచ్చాకా నలుపుకుని వుండలుగా రాల్చడం బాగుంటుంది. యిలాంటి షాపుల్లో యూసువల్ సస్పెక్ట్స్ అయిన రచయితలు యిక్కడా ఎడాపెడా తగలకపోలేదు. కానీ అక్కడక్కడా అనుకోనివి తగిలాయి. వంద రూపాయల్ని మించిన ధర కలవి అరుదు.

మొన్నా మధ్య కొన్నాళ్ళు పుస్తకాల కొనుగోలు మీద విరక్తి పుట్టింది. నా గది అంతా అవే. అల్మరాలు సరిపోక, వరుసల మీద వరుసలు పైకెక్కి, రైటింగ్ టేబిల్ మీదా కిందా కూడా చేరి, నేల మీద దొర్లుతూ... ఎటు చూసినా అవే. ఏ బాదరబందీ లేకుండా ఇప్పటికిప్పుడు మకాం మార్చాలంటే భుజానో బాగ్ తప్ప ఏ సామానూ వుండకూడదనుకునే నాలోని జిప్సీ అంశ పాలిటికి ఇవి పెద్ద బాధ్యతగా మారిపోయాయి. హైదరాబాద్‌కి భూకంపం వచ్చి శిథిలాల క్రింద శాశ్వతంగా కప్పడిపోయిన నా పుస్తకాలూ, లేదా అగ్నిప్రమాదం జరిగి బూడిదగా మిగిలిపోయే నా పుస్తకాలూ... యిలా ఇవి నా పీడకలలకి ప్రధాన ఇతివృత్తాలుగా తయారయాయి. తీరా చూస్తే వీటిల్లో చదివినవాటి కంటే చదవనివే ఎక్కువ. అందుకే ఇంకేమీ కొన కూడదని కొన్నాళ్ల క్రితం నిర్ణయం తీసుకున్నాను. కానీ నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఎందుకో మామూలు కన్నా ఎక్కువ కొన్నాను. తాగుబోతోడు కొన్నాళ్ళు మానేయాలనుకుంటాడు. తన మీద తాను విధించుకున్న కట్టడి వాడికి మందుసీసాల్ని మరింతగా జ్ఞప్తికి తెస్తుంది. చివరికి ఓ బలహీనక్షణంలో, పోరాడే మనస్సాక్షిని ఒక్క గుద్దుతో నేలకంటుకుపోయేలా చేసి, చరచరా వెళ్ళి గటగటా తాగేసి వస్తాడు. ఈసారి మనస్సాక్షిని చావచితక్కొట్టానే అనే బాధతో మరింత ఎక్కువ తాగుతాడు. నా పుస్తకాలు కొనే బలహీనతా అంతే అనుకుంటాను. ఈ సారి యిక్కడ కొన్న పుస్తకాలు:

“India: A wounded civilization” by V.S. Naipaul

“Preface to Shakespeare” by Samuel Johnson

“A.E. Housman poems”

“Madame Bovary” by Flaubert (నా దగ్గర యిప్పటికే ఇది రెండు వేర్వేరు అనువాదాల్లో వుంది, ఇది మరో అనువాదమని కొన్నాను.)

“My Story” by Kamaladas (ఇది ఒకరికి బహుమతిగా కొన్నాను.)

12 comments:

  1. టపా చూడగానే నాక్కూడా చేతులకు ఉండలుండలుగా పేరుకున్న దుమ్మును దులుపుకోవాలన్న దురాశ పుట్టింది...కానీ ప్రస్తుతం ఆ పని చెయ్యలేను. డస్ట్ ఎలర్జీ అనే అదనపు సౌకర్యం తోడైనప్పటినుంచీ ఇలాంటి పనులు చెయ్యటానికి వెనకాడాల్సివస్తోంది..:)
    బాగున్నాయండీ పుస్తకాల కబుర్లు.

    ReplyDelete
  2. How beautiful your thoughts are.

    ReplyDelete
  3. ఆడంబరమైన షాపుల్లో పుస్తకాలన్నీ ఒద్దికగా ఏ విభాగానికా విభాగం వేరు చేసి సర్ది వుంచుతారు. కనుక అక్కడ పుస్తకాలు వెతకడంలో పెద్ద ఉత్సాహం వుండదు. ఏ మూల ఏం దొరకవచ్చునో అన్న ఉత్కంఠ వుండదు_____________________అవును :-)

    ఒక మూణ్ణాలుగు పుస్తకాల పేజీలు తిప్పగానే చేతులకు చాలినంత దుమ్ము పడుతోంది. బాగా పట్టనిచ్చాకా నలుపుకుని వుండలుగా రాల్చడం బాగుంటుంది._________మళ్ళీ అవును ! ఫాంటసీలు బాగుంటాయి!

    ReplyDelete
  4. తృష్ణగారూ... అలాగయితే నేనో ఉపాయం చెపుతా, వినాయక చవితి దాకా ఎదురు చూడకుండా తాలీకులు తయారు చేసుకోండి. తర్వాత చేతులకు అట్టకట్టిన బియ్యప్పిండిని నులిమినా అదే ఎఫెక్టు! :)

    శరత్, సుజాత... థాంక్స్!

    ReplyDelete
  5. 'అల్మరాల్లో తమ యౌవనజీవితాన్ని గడిపి చివరికి భారంగా పసుపు పెళుసు పేజీల్ని మోసుకుంటూ ఇక్కడకు చేరినవి. వాటికో చరిత్ర వుంది. జ్ఞాపకాల్ని మోస్తున్న బరువు వుంది. వార్థక్యానికీ, జ్ఞానానికీ వున్న ఏదో సంబంధాన్ని అందమైన భ్రమగా....' అంటూ మీరు రాసినది చదివినపుడు ఒకప్పుడు చదివిన పాత పేజీల వాసనలతో, ధూళితో తడిసిన హోయసల సామ్రాజ్యపు రాణి ' శాంతల 'నవల,లత గారి ' ఊహాగానం 'గుర్తోచ్చేసాయి .నిజంగా మీరన్నట్టు పుస్తకాల వెదుకులాట లో ఉన్న ఆనందం,ఆశ్చర్యం పద్దతిగా పేర్చిన వాటిలో ఉండదు .

    ReplyDelete
  6. విజయ గారు, మీ వలన మా పెద్దవారి 'వశిష్ఠగీత' 'కాలజ్ఞానం' రూపు మదిలో మెదిలింది. లత "ఊహాగానం" గూర్చి మునుపు విని ఉన్నాను. చదవాల్సిన వాటిల్లో ఉంది - ఒకసారి పైపైన తిప్పి వదిలాను. కానీ "హోయసల సామ్రాజ్యం" వారి రాణి మాట నాకిదే తెలియటం. చారిత్రక గాథలు ఇష్టం కనుక ఆ పరమ్గా కాస్త గూగిలించి అసలు నవల కాదు గాని మిగిలిన వివరాలు దొరికితే చదివాను. మెహెర్ కి చెప్పాను - నేను స్వయంగా అడగటం, తెలుసుకోవటం కన్నా - తన పోస్ట్లు (మేము రాసేసే వరకు ఒకరికొకరికీ తెలియదు ముందుగా), తనని ఇతరులు అడిగే వాటి మూలంగానో, తను చెప్పే/తనకి చెప్పే విషయాల వలననో నేనే లబ్ది పొందుతున్నానని. తననిమ్కా తోయాలి ;) పడతాడు అనుకోను గాని. మీకు థాంక్స్!

    ReplyDelete
  7. అందుకే ఇంకేమీ కొన కూడదని కొన్నాళ్ల క్రితం నిర్ణయం తీసుకున్నాను. కానీ నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఎందుకో మామూలు కన్నా ఎక్కువ కొన్నాను.
    ..................నేను సైతం!!!

    ReplyDelete
  8. కాకతాళీయంగా ఈ పోస్టు చూశాను. ఈ షాపుకు కుదిరితే రేపు వెళ్ళాలి. ఇలాంటి మరో పుస్తకాల దుకాణం: నాంపల్లి, పుల్లారెడ్డి స్వీటు దుకాణం ఎదురుగా ఉన్న ఇస్కాన్ గుడి కేంపస్ లో ఉన్న సంస్కృతభారతి వారి ఆఫీసు. అక్కడ పుస్తకాలు అమ్ముతారు. సంస్కృతభారతి కదా అని అన్నీ సంస్కృతపుస్తకాలే ఉండవు. మూల అరల్లో అద్భుతమైన పాత తెలుగు పుస్తకాలు దొరుకుతాయి. మనకు వెతికే ఓపిక ఉండాలంతే.

    ReplyDelete
  9. మెహెర్,

    Thanks for introducing a great place for books, especially for antique book lovers. మొన్న సాయంత్రం అక్కడ గడిచిపోయింది. కొనడం వరకూ సరే కానీ, చదవడం ఎంతవరకూ కుదురుతుందో ఇక చూడాలి. అజ్ఞాతగా నా వ్యాఖ్య ప్రచురించినందుకు కూడా thanks. :)

    ReplyDelete
  10. మీ ఈ పోస్ట్ చదివితే నా ఆలోచనలను అక్షర రూపంలో చూస్తున్న ఆనందం కలుగుతుంది నాకు. నిజ్జంగా నిజ్జం నాకు కూడా పాత పుస్తకాల షాపులో తిరిగితే కలిగే ఆనందం landmark, crossword లో కలగదండీ. ధన్యవాదాలు మంచి పోస్ట్ వేసారు.

    -శ్రీకరుడు

    ReplyDelete
  11. inkemi cheppali, pustakalasopullo gadipina kalanni gurthu thechharu

    ReplyDelete