May 13, 2009

On reading "Disgrace"

మొన్న ఆదివారం జె.ఎమ్. కొట్జీ (J.M. Coetzee) నవల "డిస్‌గ్రేస్" పూర్తి చేసాను. మామూలుగా నాకిలాంటి బుకర్ ప్రైజు నవలలంటే అపనమ్మకం. బుకర్ హంగామాలోంచి బయటకొచ్చేవి నిజమైన సరుకున్న నవలలు కాదని, కళ పట్ల కపటాసక్తి చూపించే హంగుదారులకు అలంకారప్రాయంగా పనికొచ్చే పుస్తకాలు మాత్రమేననీ నాకో నిశ్చితాభిప్రాయం ఏర్పడిపోయింది. ఈ హంగుదారుల్ని చాలా చోట్ల చూస్తాను. ఉత్తప్పుడు పుస్తకాల ఊసే ఎత్తని వాళ్ళు కూడా బుకర్ ఫలితాలు వెలువడగానే ఉన్నపళాన బహుమతి పొందిన వాటిని కొనేసి అలమారల్లో సర్దేస్తారు. నిజంగా ఏ మాత్రం వంటబట్టించుకుంటారో తెలీదుగానీ అప్పుడప్పుడూ లోకల్‌ట్రైన్లలో బస్‌స్టాండుల్లో కూడా, అట్ట మీది పేర్లు కనిపించేలా పట్టుకుని, తెగ చదివేస్తూంటారు. వీళ్ళంతా ఈ ఆసక్తిని ఇలాగే నిలుపుకుని పఠనాప్రపంచంలో మరింత పురోగమిస్తారా, లేక మళ్ళా హారీపోటరో చేతన్‌భగత్తో విడుదలవంగానే వాటివైపుకు మళ్ళిపోతారా అన్నది అర్థం కాదు. కొంతమంది నాకూ తగులుతుంటారు. నేను కాస్త చదువుతానని తెలియగానే వెంటనే ఉత్సాహంగా "అరుంధతీరాయ్‌ని చదివారా, కిరణ్ దేశాయ్‌ని చదివారా, అరవింద్ అడిగాని చదివారా" అని అడిగేస్తారు. నేను లేదని చెప్పడం తడవు—తర్వాత కాఫ్కా అన్నా గీఫ్కా అన్నా లాభం లేదు—వాళ్ళ దృష్టిలో low-brow సజ్జుగానే మిగిలిపోతాను. కొంత ఇలాంటి వాళ్ళ వల్ల, మరికొంత ఆ బహుమతిని ఆవరించి వుండే హంగామా వల్ల నాకు బుకర్ పుస్తకాలంటే ఏవగింపు ఏర్పడిపోయింది. చివరకు, కేవలం బుకర్ ప్రైజు పొందాయన్న కారణంగా, జాన్‌బాన్‌విలే లాంటి మంచి రచయితల పుస్తకాలు కూడా కొనడానికి సందేహిస్తాను. "డిస్‌గ్రేస్" 1999లో బుకర్ బహుమానం అందుకుంది. రచయితగా కొట్జీకి ఇది రెండో బుకర్.
"డిస్‌గ్రేస్" విషయంలో మినహాయింపు ఇవ్వడానికి కారణం ఉంది. నాకు నచ్చిన ఓ రచయిత దీన్ని సిఫారసు చేసారు. కొనేటప్పుడైతే చదివేది ఎప్పుడో తెలీదన్నట్లుగానే కొన్నాను. కానీ మొన్న శనివారం ఓ విషయం గుర్తొచ్చింది. ఈ మధ్య నేను పుస్తకాలు మొదలుపెడుతున్నానే గానీ పూర్తి చేయడం లేదు. దాదాపు ప్రతీ పుస్తకాన్ని నచ్చినందాక చదవడం, పక్కనపెట్టేయడం, మళ్ళీ మరొకటి ఎత్తుకోవడం, అది కూడా నచ్చినందాక చదవడం, పక్కన పెట్టేయడం, మళ్ళీ పక్కన పెట్టేసిన మొదటి పుస్తకాన్ని సగంలోంచి ఎత్తుకోవడం, మరింకాస్త చదివి పక్కనపెట్టి మళ్ళీ ఇంకో పుస్తకం ఎత్తుకోవడం. . . యిలా గత నెలరోజులుగా నేను ఓ ఐదారు పుస్తకాల్నే పట్టుకుని అనంతప్రాయంగా చదువుతున్నానే గానీ ఏదీ కడదాకా పూర్తి చేయడం లేదు. అందుకని ఈ వారాంతంలో ఎలాగైనా ఓ పుస్తకాన్ని మొదలు పెట్టి పూర్తి చేసేయాలన్న నిశ్చయానికి వచ్చాను. అదే నిశ్చయంతో పుస్తకాల అర ముందు నిలబడితే రెండు పుస్తకాలు నన్ను వూరించాయి. ఒకటి "డిస్‌గ్రేస్" కాగా, మరొకటి జాన్ అప్‌డైక్ "రాబిట్, రన్". (ఇక్కడ ఇంకొకటి చెప్పుకోవాలి. రచయితల మరణం వల్ల సాహితీలోకానికి కలిగే లోటు సంగతి ఎలావున్నా, నాలాంటి సదూర ప్రాంతాల పాఠకులకి జరిగే మేలు ఒకటి వుంటుంది. అప్పటి వరకూ ఆచూకీ దొరకని వాళ్ళ పుస్తకాలు ఇకమీదట సులభంగా లభ్యమవుతాయి. మొన్నటిదాకా ఎంత వెతికినా జాన్ అప్‌డైక్‌వి "బ్రెజిల్", "టెర్రరిస్ట్" లాంటి ఓ మోస్తరు పుస్తకాలే కనిపించేవి. ఆయన చనిపోయింది తడవు, ముఖ్యమైన పుస్తకాలన్నీ "హిమాలయా"లో ప్రత్యక్షమయ్యాయి. "రాబిట్, రన్", "సెంటార్"లు కొని తెచ్చుకున్నాను.) "రాబిట్, రన్" పేజీలు ఎక్కువ. పైగా జాన్ అప్‌డైక్‌ని పాప్‌కార్న్ నమిలినంత సులభంగా చదివేసే వీలుండదు. ఘాటైన సాంద్రత గల వచనాన్ని ఓపిగ్గా దిగమింగాలి. అదీగాక "రాబిట్, రన్" ప్రెజెంట్ టెన్స్‌లో సాగే నవల అని విన్నాను. నేను ఆ టెన్స్‌లో నవల ఎప్పుడూ చదవలేదు. కాబట్టి అది కాస్త సావకాశంగా మొదలుపెట్టాల్సిన పుస్తకంగా నిర్ణయించుకుని, రెండొందల పేజీలతో బుల్లి పుస్తకంలా కనిపిస్తోన్న "డిస్‌గ్రేస్"ని ఎంచుకున్నాను.
నేను ఊహించనిదేమిటంటే, "డిస్‌గ్రేస్" కూడా ప్రెజెంట్‌టెన్స్‌తో సాగే పుస్తకమే. ఇది నాకు ఐదారు పేజీలు చదివేదాకా గానీ తట్టలేదు. అయితే అప్పటికే కథనపు ఉరవడిలో పడిపోయాను. ఇలా వర్తమానకాలంలో సాగే కథనాన్ని రచయిత, ఓ శిల్పపరమైన హంగుగా కాకుండా, ఈ ఉరవడికి తోడ్పడేలా వాడుకున్నాడు. దీనిసాయంతో—కథనపు కాలగతి సన్నివేశాలు నడుస్తున్న పర్యంతం నెమ్మదిగానూ, సన్నివేశానికీ సన్నివేశానికీ మధ్య మాత్రం వేగంగా దుమికిపోయే లాగానూ—రచయిత సులభంగా మానిప్యులేట్ చేయగలిగాడు. అలాగే కథని, పాత్రల్ని, సంఘటనల్నీ, సన్నివేశాల్నీ రచయిత ప్రయత్నపూర్వకంగా రూపుదిద్దుతున్నట్టో, లేదా వాటికి దిశా నిర్దేశం చేస్తున్నట్టో అనిపించదు; వాటి మానాన అవి పోతుంటే రచయిత వెంట నడుస్తున్నట్టు వుంటుందంతే.
"For a man of his age, fifty-two, divorced, he has, to his mind, solved the problem of sex rather well."
— అన్న వాక్యంతో నవల మొదలవుతుంది. యాభై రెండేళ్ళ వయస్సులో, విడాకులు పుచ్చుకుని కూడా, పొందు సమస్యని తేలిగ్గా తీర్చుకోగలిగాననుకుంటున్న ఈ వ్యక్తి పేరు డేవిడ్ లూరి. కేప్‌టౌన్‌, సౌత్‌ఆఫ్రికాలో ఓ టెక్నికల్ యూనివర్శిటీలో కమ్యూనికేషన్స్ పాఠాలు చెప్పే ప్రొఫెసర్. భావకవిత్వంపై కూడా ఒక కోర్సు చెప్తుంటాడు. పాతికేళ్ళ కెరీర్‌లో మూడు విమర్శనాత్మకమైన పుస్తకాలు రాస్తాడు. ఏ మాత్రం పేరు తీసుకురావు. ప్రస్తుతం కవి బైరన్‌ ప్రేమ జీవితంపై ఒక చాంబర్ ఒపెరా రాయాలన్న సంకల్పంతో ఉంటాడు. రెండు సార్లు పెళ్ళిళ్ళై, రెండు సార్లూ విడాకులు పుచ్చుకుని ఒంటరిగా నివసిస్తూంటాడు. పొందుకోసం వేశ్యలపై గానీ, తాత్కాలిక సంబంధాల మీద గానీ ఆధారపడతాడు. అతనికి మనసుకు నైతికమైన బాదరబందీలేమీ వుండవు. అలాగని అతనిలోని అనైతికాంశా తీవ్రమైనది కాదు.
"His needs turn out be quite light, after all, light and fleeting, like those of a butterfly."
ఉన్నంతలో సాఫీగా సాగిపోతున్న జీవితాన్ని స్వయానా కష్టాల్లోకి నెట్టుకుంటాడు. ప్రేమేమీ లేకపోయినా, తీవ్రమైన వాంఛ కూడా కాకపోయినా, ఏదో తాత్కాలిక అవసరానికన్నట్టు తన క్లాసుకొచ్చే ఓ ఇరవయ్యేళ్ళ అమ్మాయిని మభ్య పెట్టి కోరిక తీర్చుకుంటాడు. అది బలవంతమేమీ కాదు; అలాగని పూర్తి అంగీకారమూ ఉండదు. ఆ అమ్మాయికి ఆసక్తి కన్నా ఉత్సుకత ఎక్కువ ఉంటుంది. కానీ విషయం కాలేజీలో పొక్కుతుంది. గుసగుసలు మొదలౌతాయి. అతని క్లాసులకు స్టూడెంట్స్ తగ్గుతారు. ఆ అమ్మాయి నాన్న కాలేజీ కొచ్చి గొడవ చేస్తాడు. కాలేజీ వాళ్ళు విచారణ కమిటీ వేస్తారు. విచారణలో తప్పు ఒప్పుకుని పశ్చాత్తాప పడితే ఉద్యోగం దక్కే అవకాశం ఉందని అంతా నచ్చచెప్పినా, మొండితనం చూపించి క్షమాపణ అడగనంటాడు. ఉద్యోగవిరమణ తర్వాత లభ్యమయ్యే పింఛను వగైరా సదుపాయాలు కూడా దక్కక ఉద్యోగాన్ని కోల్పోతాడు. ఈ పరాభవంతో నగరాన్ని వదిలి, ఓ పల్లెటూర్లో వుంటున్న తన మొదటి భార్య కూతురు లూసీ దగ్గరకు చేరతాడు.
లూసీ పల్లెటూర్లో పెద్ద తోటను సేద్యం చేస్తూ ఒంటరిగా జీవిస్తూంటుంది. డేవిడ్‌కు ఎట్టకేలకు కూతురి సమక్షంలో ప్రశాంతత దొరికినట్టనిపిస్తుంది. పరిసరాల్లో పరిస్థితుల్లో లీనమయ్యేందుకు ఉద్యుక్తుడవుతాడు. ఆమెతో కలిసి తోటలో పండించిన కూరగాయల్ని వారంతం సంతలో అమ్మటానికి వెళ్ళటం మొదలుపెడతాడు. ఆమె స్నేహితురాలు ఒకావిడ పెంపుడు జంతువులకు ఉచిత వైద్యాన్నందిస్తుంటే ఆ క్లినిక్‌లో వాలంటీర్‌గా చేరతాడు. అంతా సాఫీగా సాగిపోతున్నట్టనిపిస్తుంది. సరిగ్గా ఇప్పుడు, ఇంతవరకూ కథలో కనిపించని దక్షిణాఫ్రికా రాజకీయ పరిస్థితులు, ఒక హింసాత్మకమైన సంఘటన ద్వారా తమ ఉనికి చాటుకుంటాయి. ఓ ముగ్గురు నల్ల ఆఫ్రికన్లు లూసీ ఇంటిపై దాడి చేస్తారు. ఆమెపై మూకుమ్మడిగా అత్యాచారం చేస్తారు. డేవిడ్‌ను తీవ్రంగా గాయపరుస్తారు. ఇంటిని దోచుకుని వెళిపోతారు. (దశాబ్దాలుగా చట్టబద్ధంగా కొనసాగిన వర్ణవివక్ష 1994లో అంతమయింది. అప్పటి నుంచీ స్థానిక ఆఫ్రికన్లకీ, శ్వేతజాతీయులకీ మధ్య ఏర్పడిన ఘర్షణపూరితమైన వాతావరణం కొనసాగుతూ వస్తోంది. అదే ఈ సంఘటనకు రాజకీయ నేపథ్యం.) దీంతో అప్పటివరకూ కనీసం మినుకు మినుకు ఆశగానైనా డేవిడ్‌ని ఊరించిన ప్రశాంతత పూర్తిగా కొడిగట్టేస్తుంది. లూసీకి ఇక్కడ రక్షణ లేదని భావించి, ఆమెను తోట అమ్మేసి తనతో నగరానికి వచ్చేయమంటాడు డేవిడ్. తన జీవితం ఇదేననీ ఇక్కడే ఉంటాననీ మొండిపట్టుపడుతుంది లూసీ. ఆమె మొండిపట్టు తండ్రికి అర్థంకాదు (నిజానికి మనకీ అర్థం కాదు). క్రమ క్రమంగా తండ్రి కూతుళ్ళ మధ్య దూరం పెరిగిపోతుంది. ప్రపంచంలో తనకున్న ఒకే ఒక్క అనుబంధం తనకు మిగలాలనుకుంటాడు డేవిడ్; ఇకనైనా తండ్రి అజమాయిషీ నుంచి తనకు స్వతంత్రత కావాలనుకుంటుంది లూసీ:
"David, I can't run my life according to whether or not you like what I do. Not anymore. You behave as if everything I do is part of the story of your life. You are the main character, I am a minor character who doesn't make an appearance until halfway through. Well, contrary to what you think, people are not divided into major and minor. I am not minor. I have a life of my own, just as important to me as yours is to you, and in my life I am the one who makes the decisions."
అత్యాచారపు నింద పడటం మొదలు, ఆ పరాభవపు అగాథంలో ఇంకా జారుతూనే వున్న డేవిడ్‌ పిడికిలి నుంచి, ఆదుకుంటుందీ అనుకున్న ఈ చివరి ఆసరా కూడా జారిపోతుంది. ఇద్దరూ వేరై పోతారు. కలిసి వుంటే కలతలు వస్తున్నాయని డేవిడ్ అదే ఊళ్ళో వేరే గది అద్దెకు తీసుకుంటాడు. తన చాంబర్ ఒపెరా మీద దృష్టి పెడతాడు. అదైనా అగాథం నుంచి తనను రక్షిస్తుందనుకుంటాడు:
"It would have been nice to be returned triumphant to society as the author of an eccentric little chamber opera. [...] it would have been nice for Lucy to hear proof in her lifetime, and think a little better of him."
కానీ అందులో కూడా విఫలమవుతాడు. దానిపై ఏకాగ్రత నిలపలేక పోతాడు. ఇంతలో అత్యాచారం కారణంగా లూసీ గర్భవతి అవుతుంది. అతను ఎంత నచ్చచెప్పచూసినా ఆమె గర్భస్రావానికి ఒప్పుకోదు. చివరకు అదే ఊళ్ళో, అదే జంతువైద్యశాలకు వాలంటీర్‌గా పనిచేస్తూ, తనను చావు పలకరించేవరకూ వరకూ కూతురికి రక్షణగా వుండిపోవాలన్న నిశ్చయానికి వస్తాడు ముసలి డేవిడ్.
ఏదో చెప్పాలని చెప్పాను గానీ ఈ నవలకు కథ చెప్పడం అసంబధ్దం. మన రోజువారీ ఆనందాల్లో, అలవాట్లలో, వేదనల్లో, విపత్తుల్లో ఉండదు మన జీవితపు సారం. వీటికి నేపథ్యంలో అందీ అందని అల్లికగా వుంటుంది. ఈ నవల సారం కూడా అంతే. పైన వివరించిన కథాక్రమంలో అది కనిపించదు. సూక్ష్మ స్థాయిలో చూస్తే ఈ కథ దక్షిణాఫ్రికాలో డేవిడ్‌లూరీగా బతకడమంటే ఏమిటో చెప్తుంది. స్థూలంగా చూస్తే ఈ విశ్వంలో మనిషిగా బతకడమంటే ఏమిటో చెప్తుంది. ఈ విషయంలో రచయిత నైపుణ్యం నన్ను అబ్బురపరచింది. చాలా అనాయాసంగా కనిపించే శైలిలో సులభమైన నిర్మాణం గల వాక్యాల్లో ఈ మనిషితనపు అవగాహనను గాఢంగా మన అనుభూతికి తేగలడు కొట్జీ. ఉదాహరణగా నవల చివర్లోని ఓ పేరా ఇస్తున్నాను:
(వేరే గది తీసుకున్న చాన్నాళ్ళ తర్వాత కూతుర్ని చూడటానికి ఆమె ఫాంకి వస్తాడు డేవిడ్. గర్భవతి అయిన లూసీ ఏవో పూల మొక్కలకు అంటుకడుతూంటుంది. అతన్ని గమనించదు. అతనికీ వెంటనే పలకరించాలనిపించదు. ఆ దృశ్యం అతని మనసును హత్తుకుంటుంది. అలాగే చూస్తుండిపోతాడు.)
"So: once she was only a little tadpole in her mother's body, and now here she is, solid in her existence, more solid than he has ever been. With luck she will last a long time, long beyond him. When he is dead she will, with luck, still be here doing her ordinary tasks among flowerbeds. And from within her will have issued another existence, that with luck will be just as solid, just as long-lasting. So it will go on, a line of existences in which his share, his gift, will grow inexorably less and less, till it may as well be forgotten."

"డిస్‌గ్రేస్" నవల నబొకొవ్ చెప్పిన ఈస్థటిక్ బ్లిస్ కలిగించకపోవచ్చు; సోకాల్డ్ "ఆలోచింపజేసే" పుస్తకాల జాబితాలోనూ చేరకపోవచ్చు. కానీ, చదువుతున్నంత సేపూ, నాలో ఏదో కాపు లేని సున్నితమైన భాగాన్ని కెలికి వదిలేసిన పుస్తకంగా చాన్నాళ్ళు గుర్తుండిపోతుంది.

2 comments:

  1. చాలా చక్కని పరిచయం.. వెంటనే నవల చదవాలనిపించేలా.. పైగా తక్కువ పేజీలు అంటున్నారు కూడా..

    ReplyDelete
  2. ఫణి గారు, బాగుంది. మీరు ఉదహరించిన (పుస్తకంలోని) వాక్యాలు నన్నంతగా ఆకట్టుకోలేదు. ఐనా మీరన్నట్టు పుస్తకం చదివితే గాని పూర్తిగా enjoy చేయలేము. త్వరలో చదువుతా.

    ReplyDelete