February 18, 2010

సెలవ

లోకల్ రైల్లో తలుపు దగ్గర కాళ్ళు క్రిందకి వేలాడేసి కూర్చోవడం. బయట భవనాలు, రేకుల షెడ్లు, వాటిల్లో వివిధ భంగిమల్లో మనుషులూ, కుటుంబ సన్నివేశాలూ, ఆరేసిన బట్టలూ, పట్టాల పక్కనే రొచ్చు గుంటలూ వెనక్కి పారుతున్నాయి. ఫతేనగర్లో ఓ బోసిముడ్డి బుజ్జిగాడు రైలు చూసి చేయి వూపాడు. బదులుగా చేయెత్తేసరికే వాడి దృష్టి నా మీద నుంచి పక్క పెట్టి మీదకు మరలిపోయింది. నేను ఎత్తిన చేయితో బుర్రగోక్కుని క్రిందకు దించేసాను. కాసేపటికి ఉన్నట్టుండి పక్కనో కుర్రాడు సెల్‌ఫోన్‌లోంచి "మసకలీ" పాట పెట్టాడు. పాటంతా అయ్యాకా లేచి చెయ్యూపేస్తూ థాంక్స్ చెప్పాలనిపించింది.

* * *

ఒక ప్రేమజంట. ఆమె మాటిమాటికీ అతని చూపు తన వైపు తిప్పుకోవాలని చూస్తుంది — మాటల్తో, భంగిమల్తో, అర్థం పర్థం లేని స్పర్శలతో.

అడపాదడపా చూపులు ప్రపంచం మీదికి మరల్చినా, అతనికీ తెలుసు, తాను ఆమె సాంగత్యపు వృత్తంలోనే వున్నాననీ, అందులోంచే బయటకు చూస్తున్నాననీను.

ప్రేమ మీ ఇద్దరు మాత్రమే మసలుకోవాల్సిన వృత్తం. ఆ వృత్తాన్ని సృష్టించలేనప్పుడే నీకు తెలియాలి, నువ్వు ప్రేమింపబడటం లేదని.

* * *

నాంపల్లి స్టేషన్‌లో లెక్కకందనన్ని పావురాలు. నువ్వు నుంచొని గంటలు తరబడి చూస్తుండిపోవచ్చు. ఒక పావురం మీదే దృష్టి నిలిపి అదసలు అంత గుంపులో ఏం చేస్తుందో గమనించడం బాగుంటుంది. నిలబడటానికి బహానా కావాలంటే నాలుగు గ్లాసుల చెరుకురసం తాగచ్చు.

0 comments:

మీ మాట...