February 16, 2010

బేల

ఆమె కాఫీ మిషన్ నుంచి తన సీటు దగ్గరకు తిరిగి వచ్చింది. జడని భుజాల మీంచి ముందుకేసుకుంటూ కూర్చుంది. కీబోర్డు మీద చేతులు ఆన్చింది. మణికట్టు ఎముక దగ్గరే ఆగిపోయిన ఓ గాజుని వెనక్కి లాగి మిగతావాటితో కలిపింది. తన ఉద్యోగ అస్తిత్వాన్ని సమీకరించుకునేందుకు కొన్ని శూన్య క్షణాలు. కానీ పూర్తిగా కూడగట్టుకోకముందే అతను గుర్తొచ్చాడు. అప్రయత్నంగా నిట్టూర్చింది. అప్పటివరకూ తన నెత్తిపైనే వేలాడుతున్న దిగులు కుండేదో పగిలి అర్థంకాని భావ ద్రవ్య భారమేదో మీద ఒలికినట్టనిపించింది. ఎందుకు ఎప్పుడూ ఏదో గుండె గొంతులో అడ్డపడినట్టు? ఎన్నాళ్ళిలా? ఏంటి నా ఇబ్బంది? తన ప్రేమ లేనప్పటి జీవితం ఎలా వుండేదో మర్చిపోయాననుకుంటా. మార్దవమైన పాటేదో సాగి సాగి అర్థాంతరంగా టేప్ తెగి ఆగిపోయినట్టుంది. ఊరకనే ఏడిపించే పాట. మళ్ళీ వినమన్నా వినలేని పాట. అలా అని అది లేదంటే ఆ ఖాళీలో వేరే ఏది వుండాలో అర్థంకాని పాట. ఇప్పుడు నాకు మిగిలిందల్లా మరమ్మత్తు పని. టేప్ని బాగు చేయాలి. పాట వున్న భాగాన్ని మాత్రం కత్తిరించి, దాని ఆద్యంతాల్లో నిశ్శబ్దాన్ని పలికే టేపు ముక్కల్ని ఒకదానికొకటి తెచ్చి అతకాలి. అక్కడ అంతకుముందో పాట ఉన్నట్టే తెలియకూడదు. ఒక్కదాన్నే చేయాలి ఇదంతా! ఆమెకు కళ్ళు చెమ్మగిల్లినట్టయింది. కానీ ఏడ్చేందుకు అనువైన ప్రదేశం కాదాయె. ఫర్లేదు. రానీ, ఎన్ని వస్తాయో బయటకు వచ్చేయనీ. ఎన్నాళ్ళని వెనక్కి తొక్కి పెట్టడం. అంతగా నిబ్బరించుకోలేకపోతే రెస్ట్రూమ్ ఎలానూ వుందిగా. అలా అనుకోగానే, ఎదుటి ఎల్.సి.డి స్క్రీన్ని అలుక్కుపోయేట్టు చేస్తూ, కళ్ళు సజలాలయ్యాయి. కానీ బయటకి వలికేంతగా ఇంకా పేరుకోలేదు. చున్నీకి అప్పుడే పనిచెప్పాలనిపించలేదు.
         నువ్వు లేని తనం ఎంత కటువుగా వుంటుందో తెలిస్తే, ఎంత కర్కశంగా నన్ను అణగదొక్కుతుందో తెలిస్తే, ప్రియతమా, నువ్వు నన్నసలు వదిలివెళ్ళనే వెళ్ళవు తెలుసా! మంచి వాడివి నువ్వు. అలా ఎప్పుడూ చేయవు. కానీ నీకు తెలీదే ఇక్కడ ఇలా అవుతుందని! నీకు తెలియకూడదు కూడా. మంచివాడివి నువ్వు. నీకు ఇదంతా చెప్పి ఎలా బాధ పెట్టడం. వద్దు! ఎంత మోయలేనిదైనా నేనే మోసేస్తాలే. నువ్వు నవ్వు! ఆ నవ్వు నాది కాకపోయినా, నువ్వు మాత్రం నవ్వాలి! మరలా ఆమె మనసులోనే ఏదో రాటుదేలిన కోణం మాత్రం ఈ అన్యాయాన్ని ఒప్పుకోలేకపోయింది. ఏం? నా నవ్వులే అతనికి తెలియాలా? నా ఏడుపులు మాత్రం నేనే ఏడవాలా? ఇదేనా ప్రేమంటే? నవ్వులు కలిసి పంచుకోవటం. ఏడుపులు మాత్రం విడి విడిగా ఏడవటం. అసలు తను ఏడుస్తున్నాడా? లేక నా ఏడుపు నాదేనా? ఈ ఆలోచన రాగానే కంటి చెమ్మకు కన్నీటి చుక్కగా మారేందుకు తగినంత ద్రవ్యం సమకూరినట్టయింది. ఒకటి చనువుగా చెంపపైకి జారింది. గులాబీ మొటిమ దగ్గర సొగసైన వంపు తిరిగి దవడ అంచుకొచ్చి వేలాడింది. దాని స్పర్శతో ఆమెకు హఠాత్తుగా చుట్టుపక్కల ప్రపంచపు స్పృహ తెలిసొచ్చింది. పక్కన ఎవరో కీబోర్టు టకటకలాడిస్తున్నారు. వెనక ఎవరి వీపు మీదో ఎవరో చొరవగా చరిచారు. ఏదో రివాల్వింగ్ చైర్ గచ్చు మీద జారుకుంటూ పక్క క్యూబికల్ వైపుకు వెళ్ళిన శబ్దం. బహుశా పట్టించుకుంటే అర్థమయ్యే మాటలు. చప్పున చున్నీ తీసి ఏదో చెమట తుడుచుకుంటున్నట్టు మొహమంతా ఓసారి గట్టిగా అలికింది. కళ్ళు మిటకరించి రెప్పలు అల్లల్లాడించి స్క్రీన్ని తేరిపార చూసింది. కళ్ళైతే తేటపడ్డాయి గానీ, మనసు తేట పడందే! అందుకే, ఆలోచనా స్రవంతిలో ఉన్నట్టుండి పైకి తేలిన "ఎన్నాళ్ళిలా?" అన్న ఒక్క చిన్న ప్రశ్న సరిపోయింది, అప్పుడే శుభ్రం చేసిన కళ్ళు మరలా కన్నీటి చిత్తడి కావటానికి. ఇక ఆగేట్టు లేదు. కీబోర్డు లోనికి నెట్టి రెస్ట్రూమ్ వైపుకి నడిచింది. ఇవాళ దీని సంగతేదో తేల్చేయాలి! దారిలో ఓ నేస్తం చొరవగా చేయి లాగి "ఏయ్, హౌ ఎబౌటె కాఫీ డాలింగ్?" అని చిలిపిగా అడిగింది. మొహం తిప్పకుండానే "ఇప్పుడే తాగానే..." అని సున్నితంగా విదిలించుకుని వెళిపోయింది.
        రెస్ట్‌రూమ్‌లోకి చేరి తలుపు బిగించేదాకా మనసులోకి ఏ ఆలోచననీ రానివ్వలేదు. లోపల వెచ్చని ఒంటరితనం. పైన ఎగ్జాస్ట్ ఫేన్ ఎక్కువ శబ్దం చేస్తుంది. కాబట్టి వెక్కిళ్ళ రేంజ్కి శోకండాలు పెట్టినా ఫర్లేదు. తన ఆలోచనకి తనే నవ్వుకుంటూ, సింక్ దగ్గరికి వచ్చి అద్దం ముందు నిలబడింది. — రామ రామా! బిందీ ఏమైంది? చున్నీకి అంటుకుందేమోనని అటూ ఇటూ తేరిపార తిప్పింది. లేదు. పోనీలెమ్మని సమాధానపడి, రేగిన జుత్తును రెండు చేతుల్తోనూ చెవుల వెనక్కి దోపుతూ, అద్దంలోకి చూసుకుంది. మొహం కాస్త ఉబ్బి అప్పుడే నిద్రనుంచి లేచినట్టుంది. కనురెప్ప రోమాలు తడికి అట్టకట్టి దళసరిగా కనపడ్డాయి. తను ఇలా బాగుంది. పెదాల్ని కనిపించీ కనిపించనట్టు ముందుకు ముడిచి చూసుకుంది. యూ ఐంట్ నో కేట్ మాస్ లేడీ! నవ్వుకుంది. ఆ నవ్వు చూసేసరికి తను వచ్చిన పని గుర్తొచ్చింది. అద్దంలో ఆమె బొమ్మ అకస్మాత్తుగా అంతర్ముఖమై కళ్ళు నేలకి వాల్చింది. నిలుచున్నపళంగా అలానే ఆలోచనలోకి జారుకుంది. ఏంటిదసలు? ఎన్నాళ్ళీ చిత్రహింస! కనీసం నా బాధ బయటపెట్టుకునే అవకాశం కూడా లేదు. అలాచేస్తే నువ్వు బాధపడతావు. పాంటోమైమ్ ఆర్టిస్టులా మొహానికి నవ్వు పులుముకుని కనపడుతూండాలి ఎప్పుడూ. నువ్వురాక ముందు ఎలావుండేదాన్నో కూడా మర్చిపోయాను. నిద్రపట్టి చావట్లేదు. బెడ్ మీద అటు దొర్లనూ ఇటుదొర్లనూ! ఎప్పుడు ఎలా ఎక్కణ్ణించి సందు చేసుకుంటుందో తెలీదు నీ ఆలోచన. పొద్దున్న కేలండర్లో నీ పేరు కన్పించింది. దార్లో ఓ సూపర్ మార్కెట్కి నీ పేరు వుంది. చాలు, చిన్న సాకు చాలు; ఎంతో నియమంగా నిష్టగా కట్టుదిట్టంగా పాటించిన నిషేదాలన్నీ భళ్ళుమని తొలగిపోతాయి. ఇక ఆ తర్వాత చూడాలి నా పాట్లు. ఆలోచనని నీనుంచి మరల్చగలిగే పుస్తకాల కోసం, నేస్తాలకోసం, పనుల కోసం ఆత్రంగా దేబిరించటం. నేనంటే నాకే భయంకలిగేట్టు చేసి వదిలిపెట్టావుగా చివరకు? అప్పుడు గమనించిందామె: ఆలోచనలు తనకు తెలియకుండానే మాటల్ని తొడిగేసుకుంటున్నాయనీ, తను గుసగుసగా బయటకే మాట్లాడుతుందనీను. ఏం పిచ్చిదాన్నవుతున్నానా నేను! అద్దంలోకి చూసింది. "ఏంటే ఇదీ...!" తన బొమ్మని తనే జాలిగా అడిగింది. ఆ బొమ్మ మొహంలోని దైన్యం చూడగానే గుండె లోతుల్లోంచి గబుక్కున ఏదో పైకి ఎగదన్నుకుని వచ్చినట్టయింది. "ఎన్నాళ్ళిలా ఎన్నాళ్ళిలా!" భృకుటి ముడి పడి, ముక్కుపుటాలు నిగిడి, బుగ్గలు పైకి తేలి వంకరలు పోతూ... త్వరితంగా వికృతమయిపోతున్న తన మొహాన్ని చూడలేక అద్దం మీంచి దృష్టి మరల్చేసింది. కొద్దిగా వెనక్కి నడిచి గోడకి జారగిలబడింది. పెదాల్ని పంటికింద నొక్కిపట్టి చూరు వైపు చూస్తూ కన్నీటిని వదిలింది. చూరు మసకబారింది. కాసేపటికే ఎగశ్వాసతో గుండెలు అదుపు తప్పి అదిరిపడటం మొదలైంది. చేత్తో కణతలు నొక్కుకుంటూ, పళ్ళుగిట్టకరచి సాధ్యమైనంత నిశ్శబ్దంగా ఏడవడానికి ప్రయత్నిస్తోంది. సాధ్యంగాక అలాగే కిందికి జారి నేలమీద గొంతుక్కూర్చుంది. "నేన్నిన్ను మర్చిపోతాను, నేన్నిన్ను మర్చిపోతాను. ఇంతలా ఏడిపిస్తే నువ్వు నాకక్కర్లేదు" ఏడుస్తునే గొణుక్కుంది. కానీ అతను కోరుకునేదీ అదే అన్నది గుర్తురాగానే, ఈ మొత్తం సమస్యలో తనెంత ఒంటరిదో స్ఫురించి, మరో కెరటం ఎగదన్నినట్టయింది. వెక్కిళ్ళు మొదలయ్యాయి. వెక్కుతూనే, ఓ చేత్తో పక్కనున్న కుళాయి సీల తిప్పింది. బకెట్లో పడే నీళ్ళ శబ్దం తన ఏడుపు శబ్దాన్ని మించేట్టు బోలుగా ధార వదిలింది. మోకాళ్ళని కావిలించుకుని, చేతుల మధ్య మొహం దూర్చి, తనలోకి తను వెచ్చగా మునగదీసుకుపోయి, మనసారా ఏడ్చింది. చిత్రంగా, ఇంతసేపూ అతను తనని చూస్తున్నట్టే ఊహించుకుంది. ఇంతవేదనా వృథాగా పోతుందని నమ్మడం ఇష్టంలేక, ఇదంతా ఎలాగో అతనికి తెలుస్తుందని నమ్మింది. ఆ కాసేపూ అతను దేవునిలా సర్వాంతర్యామి అయ్యాడు. స్వయంగా పక్కన కూర్చుని ఆమె జుట్టు నిమరడమొకటే తక్కువ. కంటి ధారా ముక్కు ధారా ఏకమయ్యేంతదాకా ఏడ్చింది. కణతలు నొచ్చడం మొదలైంది. ఏడుపు ఆగి పొడి వెక్కిళ్ళు మాత్రమే మిగిలాయి. బకెట్ పొంగి పొర్లి సల్వార్కి తడి అంటడంతో బరువుగా లేచింది. కుళాయి కట్టింది. ఎగ్జాస్ట్ ఫేన్ రొద తప్ప అంతా నిశ్శబ్దం. లేచి అద్దం దగ్గరకు నడిచింది. తన మొహం చూసుకోవటానికి తనకే సిగ్గేసింది. కుళాయి తిప్పి మొహం రుద్ది రుద్ది కడుక్కుంది. చున్నీతో మొహం అద్దుకుంటూ గుండెల నిండా ఊపిరి పీల్చుకుంది. బరువంతా దిగేలా పెద్దగా నిశ్వసించింది. తలుపు తెరుచుకుని సీటు దగ్గరకు నడిచింది.
        కంప్యూటర్ ముందు ఏదో టైప్ చేస్తున్న నేస్తం భుజం చరిచి అడిగింది. "ఏమే, బిందీ వుంటే ఒకటివ్వు."

0 comments:

మీ మాట...