October 26, 2008

ప్రిమెచ్యూర్‌ నొస్టాల్జియా

ఇవాళెందుకో రాయాలనిపిస్తోంది. ఏదో ఒకటి రాయాలనిపిస్తోంది. బహుశా బాధ వల్లననుకుంటా. "కుంగ్‌ఫూ పాండా'' సినిమాలో ఆ పాండా గాడంటాడు, "I eat when I am upset'' అని; అలాగే "I write when I am upset'' అనుకుంటా. ఎందుకు అప్‌సెట్‌ అన్నది అప్రస్తుతం. రాయడం మాత్రం ఓ తక్షణావసరం. దురదొచ్చినప్పుడు కారణాలు వెతకం, గోక్కుంటామంతే. ప్రస్తుతం ఈ రాయాల్సిన అవసరమూ అలాంటిదే. ఇది లోపల్నించీ ఉధృతంగా తన్నుకొస్తున్న తోపుడు. ఎందుకో ఈ మధ్య నాలో ఇలా చాలా తోసుకు వస్తున్నాయి. "మమ్మల్నీ కాస్త పట్టించుకోరా మగడా'' అంటూ సవాలక్ష విషయాలు నా అంతర్నేత్రం ముందు కుప్పి గంతులేస్తున్నాయి. బహుశా ఆడియన్స్‌ ఎవరూ లేరనుకోవడం వల్ల వచ్చిన ఉత్సాహమనుకుంటా.

మామూలుగా అయితే నాకేదన్నా బాధ కలిగితే చౌదరిగాడి సహాయం తీసుకుంటాను. అలాగని వాడితో నా బాధలేం చెప్పేయను; వాడి మాటలు (ఇంకా కాస్త ప్రేమగా చెప్పాలంటే "వాగుడు'') వింటానంతే; బాధంతా హుష్‌కాకీ అయిపోతుంది. ఇప్పుడు వాడిక్కడ లేడు. కాబట్టి అక్షరాలే దిక్కు. సరే, ఏం రాయాలి? పోయి పోయి కష్ట పెట్టే విషయాన్ని గురించే రాస్తే ఆరిపోతున్న కుంపటిని పుల్లెట్టి మరీ కెలికినట్టుంటుంది. మళ్ళీ బాధ రాజుకుంటుంది. కాబట్టి ససేమిరా దాని జోలికి పోకూడదు. నాకో అమ్మాయి చెప్పింది: మనల్నేదన్నా బాధ పెడ్తూంటే మనం అంతకన్నా పెద్ద బాధ సృష్టించు కోవాలంట. పెద్ద గీత ముందు చిన్న గీతలాగా మొదటి బాధ తగ్గిపోతుందట. ఈ లాజిక్కేంటో నాకు అర్థం కాలేదు. అయినా ఇప్పుడంతకన్నా మరో దారి కనిపించడం లేదు. అందుకే, ఉత్త పుణ్యానికి ఇప్పుడో పెద్ద బాధ నా నెత్తిన వేసుకుందామనుకుంటున్నాను. బాధంటే ఆషామాషీ బాధ కాదు, "మన సంస్కృతి'' గురించిన బాధ.

No, not for the heck of it. ఏదో ఒకటి నెత్తిన వేసుకోవాలి కదా అని వేసుకుంటున్నది కాదు. నిజంగా ఇది నన్ను కొద్ది రోజులుగా బాధ పెడతోంది. అంటే మరీ మొదటి బాధంత ఉధృతమైంది, వ్యక్తిగతమైందీ కాదు; గుండెల్లో ఏదో అగ్నిపర్వతం ఆగి ఆగి లావా కక్కుతున్నట్టనిపించే బాపతు భారీ బాధ కాదు. ఇది వేరే రకం. ఈ బాపతు బాధలు మనిషిని ఉక్కిరి బిక్కిరి చేసేయవు. ఆలోచనల పొలిమేరల్లోనే తచ్చాడుతూ ఆదమరిచి ఉన్నప్పుడు చిలిపిగా ఓ పోటు పొడిచి వెళిపోతుంటాయి. అసలు "మన సంస్కృతి''కి ఇప్పుడు నన్ను పోటు పొడవాల్సినంత అవసరమేమొచ్చింది? నాకీ మధ్యన నా బ్లాగు "ఎబౌట్‌ మీ''లో చేర్చడానికి రోజుకొక విశేషణం తడుతోంది. ఇప్పుడే మరొకటి తట్టింది. దానికి "hopelessly neurotic'' అని కూడా చేర్చాలి. అందుకే ఇలా పిసరంత విషయాల్ని కూడా పీక్కుని లాక్కుని కొండంత చేసుకుంటుంటాను. ఇప్పుడు నా బాధకి వెతగ్గా వెతగ్గా మూడు మూలాలు కనిపిస్తున్నాయి: 1) అట్లతద్ది 2) నా కొలీగ్‌తో సంభాషణ 3) తిలక్‌ కవిత. అయితే నా బాధకు నేనీ మూలాలపై పూర్తి దోషం ఆరోపించలేను. అసలు ఈ మూడింటికీ పరస్పర సంబంధం ఉందో లేదో కూడా తెలీదు. బాధ వీటి వల్ల కాదు. ఇవి నాలో రేకెత్తించిన ఆలోచనల వల్ల. ఇప్పుడు నేనా ఆలోచనల్ని పదాల్లోకి జల్లెడ పట్టొచ్చు, పట్టలేకపోవచ్చు; కానీ ప్రయత్నమైతే చేయాలనుకుంటున్నాను.

కొన్ని రోజుల క్రితం అట్లతద్ది పండగ జరిగింది. ఎక్కడ జరిగిందని గట్టిగా అడిగితే, బహుశా, కేలెండర్లలోనే జరిగిందని సమాధానం చెప్పాలేమో. ఆ రోజు అట్లతద్ది అని నా క్కూడా తెలీదు. మా కొలీగ్‌ ఒకావిడ చెప్తే తెలిసింది. రాత్రి ఫోన్ చేసినపుడు మళ్ళా అమ్మ గుర్తు చేసింది. అమ్మమ్మ యధావిధిగా అట్లు, పానకం తయారు చేసిందట. పానకం అన్న మాట చెవిన పడగానే తియ్యగా నోరూరింది. కానీ ఆ "అట్లతద్ది'' అన్న పదం ఇక్కడ ఈ నగరంలో దారుణంగా విలువ కోల్పోయినట్టనిపించింది. చాలా పరాయి పదంలా ధ్వనించింది. పొలంగట్లపై చెట్టాపట్టాలేసుకు తిరిగిన బాల్య స్నేహితుణ్ణి సంవత్సరాల విరామం తర్వాత, హఠాత్తుగా, స్కైస్క్రేపర్ల మధ్య చూస్తే ఎలా ఉంటుంది? వాడెంత పరాయిగా అనిపిస్తాడు? — కానీ బహుశా ఇది అర్థం పర్థం లేని పోలిక. మనిషి వేరు, పదం వేరు. మనిషి స్థల కాలాల స్వభావాన్ని (జ్ఞాపకాల్లో తప్ప) తనలో నిలుపుకోలేడు. అంతా వెనక వదిలేయాల్సిందే. ఏ స్థలానికి ఆ స్థలం, ఏ కాలానికి ఆ కాలం అతణ్ణి లొంగదీస్సుకుంటుంది. లొంగిపోవాలి కూడా, తప్పదు. కాదని మొండికేస్తే ఎబ్బెట్టుగా ఉంటుంది—స్టార్‌ హోటల్‌ రెస్టారెంట్‌లో చేత్తో తినడం లాగా, ఫేడెడ్‌ జీన్సుల మధ్య బెల్‌బాటమ్‌ లాగా. కానీ "అట్లతద్ది'' అనేది ఓ పదమే కదా. దానికేం తెలుసు పాపం స్థల కాలాల్తో పాటూ పరిణామం చెందాలని. అందుకే, దేనికీ లొంగని మొడితనంతో, నాలో కొన్ని బాల్యపు జ్ఞాపకాల్ని కెలికి వదిలేసింది.

అట్లతద్ది అంటే ఆలమూరులో కొన్ని వేకువ జాము ఉదయాలు గుర్తొస్తాయి నాకు. బయట ఆడవాళ్ళ కేరింతల వల్ల పెందలాడే మెలకువ వచ్చేసేది. ఆ కేరింతల్లో అమ్మ గొంతూ ఉండేది. అమ్మ చీకటి పోకుండానే లేచి చుట్టు ప్రక్కల ఆడవాళ్ళతో కలిసి ఏవో ఆటలాడేది. కానీ వాళ్ళు ఆడే ఆటలేంటో నాకు అప్పుడూ తెలీదు, ఇప్పుడూ తెలీదు. ఎందుకంటే, మేం లేచేటప్పటికే ఆ ఆటలు దాదాపు ముగింపుకొచ్చేసేవి. ఒకవేళ తొందరగానే లేచినా అమ్మ మమ్మల్ని ఆ ఆటల్లో చేరనిచ్చేది కాదు. ఆడవాళ్ళు కొన్ని విషయాల్లో మగవాళ్ళని ఊరికే బయటకు నెట్టేస్తుంటారు; బహుశా ఇది అలాంటి ఓ అర్థం పర్థం లేని విషయమనుకుంటా. అయితే అమ్మ అలా చిన్నపిల్లలా ఆడుకోవడం భలే ఉండేది.

అట్లతద్దికి మరో విశేషం ఉయ్యాళ్ళు. ఆలమూరు మధ్యలో ఒక చెరువుండేది. చెరువు చాలా పెద్దది. చెరువుకు తూర్పు దిక్కున మా "చిన్నబడి'', దాని ప్రక్క ఓ రావిచెట్టు; పడమట దిక్కున మొక్కల్తో, తుప్పల్తో, కొబ్బరి చెట్లతో, మధ్య మధ్య పాముల పుట్టల్తో నిండిన ఖాళీ ప్రదేశం; ఉత్తరాన సంతోషిమాత గుడి, చిన్న పార్కు; దక్షిణాన ఊరివాళ్ళ తాటాకు గుడిసెలు, మట్టిగోడల పెంకుటిళ్ళు ఉండేవి. అట్లతద్దికి కొన్ని రోజుల ముందు నుంచే మా బడి పక్కన ఉన్న రావి చెట్టుకు పండగ కళ వచ్చేసేది; అట్లతద్ది ఉయ్యాళ్ళు కట్టేది దానికే. ఆ చెట్టు విశాలమైన ఖాళీ స్థలంలో, మొత్తం ఆకాశాన్ని కప్పేస్తూ చాలా పెద్దదిగా ఉండేది. దాని కొమ్మలకి బలమైన తాళ్ళతో ఉయ్యాళ్ళు కట్టేవారు. అవి చాలా పొడవైన ఉయ్యాళ్ళు. వాటిలో ఊగడం ఆడవాళ్ళ వంతైతే, వాటిని ఊపడం మగవాళ్ళ వంతు. ఉయ్యాల ఊపడానికి ఓ పద్ధతి ఉండేది. ఆ ఉయ్యాల పీటకి కట్టి ఓ పొడవాటి తాడు క్రిందకు వేలాడుతూండేది. ఊపేవాళ్ళు తమ తలల మీంచి ఉయ్యాల వెనక్కి పోగానే, ఆ తాడుని రెండు చేతుల్తో దొరక పుచ్చుకుని, ఉయ్యాల ఉధృతంతో పాటూ గాల్లో కొంత పైకి లేచి, మళ్ళా క్రిందకు బలంగా గుంజేవారు. ఈ గుంజుడు ఎంత బలంగా ఉండేదంటే, కొమ్మని కేంద్ర బిందువుగా చేసుకుని ఉయ్యాల ఓ భారీ లోలకంలా ఇంచుమించు 180 డిగ్రీల కోణంలో ఊగేది. అయితే ఇక్కడో ప్రమాదం ఉంది. ఉయ్యాల కడ కంటా సాగినపుడు ఊగేవాళ్ళు సరిగ్గా చెరువు మధ్యకొస్తారు. ఏ మాత్రం పట్టు జారినా చెరువులోకెళ్ళి పడతాం. కానీ అదెవర్నీ భయపెట్టేది కాదు. నిజానికి ఆ ప్రమాద సూచన ఉయ్యాల ఊగడంలో కాస్త సాహసపు ఎలిమెంట్‌ని కూడా జత చేసి ఆ అనుభవాన్ని మరింత పసందుగా మార్చేదనుకుంటా. పరికిణీవోణీ లేసుకున్న ఆడవాళ్ళు భయం బిగబట్టిన మొహాల్తో ఉయ్యాల ఊగుతుంటే, వాళ్ళ చేత ఎలాగైనా వెర్రికేకలు పెట్టించాలన్న ఉత్సాహంతో అబ్బాయిలు మరింత రెచ్చిపోయి ఊపేవారు. అయితే అమ్మాయిలు వెర్రి కేకలు పెట్టడంలో కూడా ఏదో ముచ్చటైన ఆడతనాన్ని చూపించేవారు. సాధారణంగా అబ్బాయిలెవ్వరూ ఉయ్యాల ఊగేవారు కాదు. అప్పటికి మేమింకా పదేళ్ళలోపు వాళ్ళం కాబట్టి మాకు మినహాయింపు నిచ్చారనుకుంటా. నేను ఎప్పుడూ ఒక్కణ్ణీ ఊగలేదు. మొదటిసారి నా పైతరగతి వాడెవడో నన్ను వళ్ళో కూర్చోపెట్టుకోవడం గుర్తుంది. ఇద్దరం ఎదురుబొదురుగా కావలించుకుని పీట మీద కూర్చున్నాం. ఊపడం మొదలుపెట్టారు. మొదట కాసేపు మాత్రమే పరిసరాల అవగాహన ఉంది. కాసేపు మాత్రమే క్రింద దూరమై దగ్గరవుతున్న భూమిని కళ్ళు తెరిచి చూడగలిగాం. తర్వాత వాణ్ణి నేనూ, నన్ను వాడూ కరిచి పట్టుకుని కళ్ళు మూసేసుకున్నాం. వడి ఎంతగా పెరిగిపోయిందంటే, ఇంకాస్త పెరిగితే మా ఉయ్యాల వెళ్ళిందారిన మళ్ళీ వెనక్కి రాకుండా పైకిపోయి ఆ కొమ్మకి గుండ్రంగా లుంగలు చుట్టేసుకుంటుందేమోనని భయమేసింది. చెవుల్ని ఝమ్మని ఒరుసుకుపోయేగాలి, రావి ఆకుల గలగలలు, భూమ్మీద దగ్గరవుతూ దూరమవుతూ వినిపిస్తున్న జనం కోలాహలం . . . ఉయ్యాల ఆగేకనే జారిపోయిన గుండె తిరిగి యధాస్థితికి వచ్చి చేరేది. ఉయ్యాల దిగిన కాసేపటి వరకూ భూమి కూడా ఉయ్యాలూగుతున్నట్టు అనిపించేది. ఈ సంబరం చల్లారేకా ఇంటికి వెళ్తే బెల్లం తీపి, మిరియాల ఘాటు కలిసిన రుచితో పానకం, అందులో ముంచుకుని తినడానికి బోలెడన్ని అట్లు. ఈ సంరంభం అంతా చూస్తే, అట్లతద్ది ఏడాదిలో వచ్చే ఏ పండక్కీ తీసిపోదనిపించేది. అట్లతద్దనే కాదు; నాగుల చవితి, సుబ్రహ్మణ్యషష్టి, రథ సప్తమి, శివరాత్రి . . . ఇలా ఇప్పుడు కేవలం కేలండర్‌కి మాత్రమే పరిమితమైపోతున్న చాలా పండగలు, ఆ వూళ్ళో నా చిన్నతనంలో చాలా ఘనంగా జరిగేవి. ప్రతీ పండగకీ ఏదో ఒక అందమైన తంతు ఉండేది. ఊరంతా అందులో మునిగి తేలేది.

నాగుల చవితికి పాముల పుట్టల్లో పాలు పోసేవారు. పాముల పుట్టలు నేనిందాక చెప్పిన చెరువుకే ఆవలిగట్టున ఉండేవి. తుప్పలు, పిచ్చిమొక్కల మధ్య ఉండే వాటి దగ్గరకు కాలిబాటమ్మటా నడుస్తూ వెళ్ళాలి. పొద్దున్నే ఆడవాళ్ళు కొత్త బట్టల్తో, మెడ క్రింద గంధపు పూతల్తో, పండగ కళ నిండిన మొహాల్తో, చెంబుల్లో పాలు తీసుకుని వచ్చేవారు. పుట్ట కన్నాల్లో కొంతమంది పాలుపోసేవారు, కొంతమంది గుడ్లు జారవిడిచేవారు. వాళ్ళలా గుడ్లు వేసి వెళ్ళగానే—కూర వండుకోవటానికి అనుకుంటా—కొంతమంది కుర్రాళ్ళు కన్నాల్లో చేతులు పెట్టి గుడ్లు బయటకు తీసి పట్టుకెళిపోయేవారు. ఆ పుట్టల్లో పాములుండటం నేను ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడింకో జ్ఞాపకం రాజుకుంటోంది. ఈ పుట్టల దగ్గరకు వెళ్ళే దారిలోనే నేను మొట్ట మొదటి సారి అత్తిపత్తి ఆకుల్ని చూసింది. ముట్టుకోగానే భలే ముడుచుకుపోయేవి. అప్పుడు నా కూడా ఎవరున్నారో గుర్తులేదు గానీ, ఓ రోజు మధ్యహ్నమంతా కూర్చుని ఆ దారిలో ఉన్న అత్తిపత్తి మొక్కలన్నింటినీ ముడుచుకుపోయేలా చేసాం.

సుబ్రహ్మణ్య షష్టి ఆలమూరులో కన్నా తాతయ్య వాళ్ళ ఊరు అంగరలో బాగా జరిగేది. ముఖ్యంగా తీర్థం చాలా ఘనంగా జరిగేది. గుడి దరిదాపుల్లో ఉన్న వీథులన్నీ కళ్ళకింపైన సందడితో కళకళలాడేవి. బుడగలు, వేణువులు, కమాను వాయిద్యాలు, రంగురంగుల ప్లాస్టిక్‌ కళ్ళ జోళ్ళు, బుల్లి తుపాకులు, బుల్లి కార్లు, బుల్లి బయోస్కోపులు, దేవుళ్ళ పటాలు, విగ్రహాలు, ఇలా ఎటుచూడు రంగులే! వీటి మధ్య ఖర్జూరం, జీళ్ళ కొట్లు తప్పనిసరిగా ఉండేవి. జీళ్ళ కొట్లంటే గుర్తొస్తోంది. ఏదో బేరమాడటానికన్నట్టూ కొట్టు ముందుకెళ్ళే వాళ్ళం. కొట్టు ముందు బల్ల మీద మా తలంత ఎత్తులో జీళ్ళు గుట్టలుగా పోసి ఉండేవి. కొట్టువాడు మేకు కేసి జీడి పాకం సాగదీసే పనిలో పరాకుగా ఉండటం చూసి, చేతికందినన్ని జీళ్ళు నొక్కేసి జేబులో వేస్సుకునేవాళ్ళం. జేబులో డబ్బులున్నా సరే, కొనే తాహతున్నా సరే, ఇలాంటివేవో చేయకపోతే మా తీర్థ విహారానికి సార్థకత లభించేది కాదు. ఎందుకంటే, జీళ్ళ కన్నా ముఖ్యంగా మాక్కావల్సింది దొంగతనంలోని సాహసపు రుచి. ఈ తీర్థం జరిగినన్నాళ్ళూ ఊరి స్వభావమే మారిపోయేది. ఊరు కూడా రక్త మాంసాలు, జవజీవాలు ఉన్న సజీవాంశలా కనిపించేది. పండగలో మాతో పాటూ ఊరు కూడా పాల్గొన్నట్టనిపించేది.

ఇక రథ సప్తమి. రథ యాత్రకి ఓ రెండు వారాల ముందే రథసప్తమినాడు జనార్దన స్వామి గుడి ఎదుట పెద్ద గోడౌన్‌లో ఉంచిన రథాన్ని బయటకు తీసేవారు. ఆలమూరు జనార్దన స్వామి రథం చాలా పెద్దది. రథ యాత్రప్పుడు అడ్డం రాకుండా కరెంటు తీగల్ని కూడా కత్తిరించేవారు. అది గోడౌన్లో ఉన్న సంవత్సర కాలమూ దాంట్లో పావురాలే నివాసం ఉండేవి. దాంతో బయటకు తీసేసరికి రథమంతా వాటి రెట్టల్తో నిండిపోయి ఉండేది. బయటకు తీసి శుభ్రంగా కడిగి సిద్ధం చేసేవారు. రథం అలా బయట ఉన్న రోజులంతా బడి అయిపోయిన తర్వాత పిల్లలందరం అక్కడికే చేరేవాళ్ళం. రథమెక్కి ఆడుకునే వాళ్ళం. రథం మొత్తం ఐదంతస్థులుగా ఉండేది. క్రింద నుండి పైకి పోయే కొలదీ అంతస్తుల ఎత్తు తగ్గేది. పెద్ద వాళ్ళు పై అంతస్తుల్లోకి రావలంటే పాక్కుంటూ రావాల్సిందే. చిన్న వాళ్ళం కాబట్టి సులభంగా జొరబడిపోయి ఆడుకునే వాళ్ళం. దొంగ - పోలీసు లాంటి ఆటలు ఆడటానికి అది భలే చోటు. ఏ అంతస్తులో దాక్కున్నామో తెలుసుకోవడానికి పోలీసు చాలా కష్టపడాలి. తెలుసుకున్నా ముట్టుకోవడం కష్టమే. ఆ రథం నిర్మాణం అంతా ఓ labyrinth లా ఉండేది.

ఇక శివరాత్రికైతే శివాలయం దగ్గర మరో సందడి: దేవాలయం ఆవరణలో "భక్త జన సందోహాన్ని'' ఉద్దేశించి మైకు చేసే హడావిడి; సీతాకోకచిలకలు బారులు తీరినట్టూ చంచలమైన వరుసలో పరికిణీవోణీలు, పంజాబీలు, చీరలు; కర్పూరం, అగరబత్తుల వాసన; కొబ్బరికాయలు పెఠేల్మని చిట్లుతున్న చప్పుడు; తల మీద శఠగోపం మెత్తని స్పర్శ, గర్భగుడి ఎదుటనున్న నంది నెత్తి మీద చూపుడు వేలు, బొటన వేలూ గోపురం కట్టి మధ్య నుంచీ చూస్తే అభిషేకాలందుకుంటున్న లింగ దర్శనం; రాత్రైతే ఆలయం ముందు ప్రదర్శించే నాటకాల్ని చూస్తూ జాగారం . . . . ఓ బాల్య మిత్రురాలి సాంగత్యం గుర్తొస్తోంది. నంది వర్థనం పూల చెట్టు క్రింద ఆమెతో ఉప్పుల కుప్ప ఆడిన క్షణాల్లోనే అనుకుంటా, స్త్రీత్వంతో నా జీవిత కాలపు ప్రణయానికి తొలి ముహూర్తమెక్కడో పడిపోయింది. ఇప్పటికీ నా మెదడులో నంది వర్థనం పూలకీ ఆమె జ్ఞాపకానికీ ఆ లంకె అలాగే ఉండిపోయింది. ఆ పువ్వుని గట్టిగా వాసన పీలిస్తే చాలు, నా లోపల ఆమె జ్ఞాపకం ప్రాణం పోసుకుంటుంది. అహ! వాసన కూడా పీల్చక్కర్లేదు, ఇక్కడ కారు టైర్ల క్రింద చితికి చిధ్రమైపోయి జాలిగా ఛస్తున్న ఓ పువ్వుని చూసినా చాలు, ఎందుకో ఆమె గుర్తొస్తుంది. చాలా చిత్రం కదూ! వర్తమానంలో, ఈ క్షణాల్లో, మనం ఏవి ముఖ్యమనుకుంటామో అవేమీ మన వెంటరావు. నిజంగా ఏవి ముఖ్యమో ఆ క్షణాల్ని పరాకుతోనే దాటేస్తాం. కాని మన జ్ఞాపకం మనకే తెలియకుండా అన్నింటినీ వడగట్టి, తనకు విలువైనవేవో ఏరుకుని, చాలా జాగ్రత్తగా పదిలపరచుకుంటూ వస్తుంది. పరీక్ష గెలిచిన రోజో, ఉద్యోగంలో పదోన్నతి దొరికిన రోజో గుర్తుండిపోతాయనుకుంటాను; కానీ, బస్టాండ్‌లో దక్కించుకున్న వాలు కంటి చూపులో, గోదావరి ఇసుక తిన్నెల్లో కొట్టిన పల్టీలో మాత్రమే గుర్తుంటాయి.

ఇంతకీ ఈ అట్లతద్ది జ్ఞాపకాలు నన్ను బాధ పెట్టాయంటే నేను స్థల కాలాలు రెండింటిలో స్థలాన్ని తప్పు పట్టలేను; కాలాన్నే తప్పు పట్టాలి పడితే. నేను ఇప్పుడు హైదరాబాదులో కాక ఆలమూరులోనే ఉన్నా, ఆలమూరులో అట్లతద్ది ఉండకపోవచ్చు. అసలా రావి చెట్టు ఉందా కొట్టేశారా అన్నదీ అనుమానమే. అట్లతద్దనే కాదు, నాగుల చవితి, సుబ్రహ్మణ్య షష్టి ఇలా చాలా అందమైన పండగలన్నీ కేలెండర్లలోనే మిగిలిపోతున్నాయి. ఎందుకు వదిలేస్తున్నాం వీటన్నింటినీ? ప్రపంచీకరణ జరుగుతోంది, అంతా ఏకమైపోతోంది, ఇలా కొన్ని వదిలేయక తప్పదంటారు సరే. కానీ, నాకు తెలిసి, ఆ సంగమ స్థలికి అందరూ తమ తమ సంస్కృతుల్ని వెంటబెట్టుకునే వస్తున్నారు. హాలోవిన్లు, టమాటా ఫెస్టివల్లూ, బీటిల్సూ, వాల్ట్‌విట్మానూ, కామిక్‌ బుక్సూ, బుల్‌ ఫైటింగులూ, అందరూ అన్నీ తమ కూడా తెచ్చుకుంటున్నారు. మనమే అన్నీ వెనక విడిచేసి వస్తున్నాం. ఈ ప్రపంచీకరణ అన్న గోదాలోకి అందరూ ఘనమైన సంస్కృతుల దన్నుతో గర్వంగా వచ్చి చేరుతుంటే, మనమే సంస్కృతిలేని అనాధల్లా బేల మొహాల్తో హాజరవుతున్నాం. నేనిక్కడ "ఎందుకు?'' అని ప్రశ్నించటం లేదు, "అయ్యో ఎందుకిలా'' అని బాధపడుతున్నానంతే. డార్విన్‌ 'నేచర్‌ సెలక్షన్‌ థియరీ'నే ఇక్కడా అన్వయించుకోవాలేమో: ప్రకృతి తన పురోగమనానికి అనుకూలమైన సంస్కృతుల్ని ఎన్నుకొని, మిగతా వాటినన్నింటినీ నిర్దాక్షిణ్యంగా చిదిమేస్తుందేమో. బాధే అయినా ఇది అంగీకరించక తప్పదేమో. అయినా బాధ పడటమే ఇక్కడి నా ఉద్దేశ్యం కనుక బాధ పడుతున్నాను.

ఇక నన్ను బాధ పెట్టిన రెండో కారణం, ఇటీవల నా కొలీగ్‌ నాతో మాట్లాడిన కొన్ని మాటలు. ఆయనకో యాభయ్యేళ్ళుంటాయి, మంచి రచయిత, పదాలతో బొమ్మ కట్టించడం అంటే సరదా పడతాడు. మా సంభాషణ తెలుగు భాష గురించి సాగింది. వాళ్ళ ఇరవై రెండేళ్ళ అబ్బాయికి ఐ.బి.ఎం లో ఉద్యోగం. ఆ కుర్రాడు తెలుగు కేవలం మాట్లాడగలడు; చదవడం, రాయడం రాదు. ఆయన ఈ విషయంలో కాసేపు బాధ పడ్డాడు. తర్వాత తేరుకుని, ఇంచుమించు ఈ అర్థం వచ్చేట్టు మాట్లాడాడు: "అయినా ఏం ఫర్లేదు ఫణీ! మా తరం అయిపోయింది. తెలుగు పూర్తిగా లేకపోవడమన్నది మేము చూడం. మేము చూడాల్సినవన్నీ చూసేసాం. శ్రీశ్రీని చూసాం, తిలక్‌ని చూసాం. శ్రీశ్రీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడంటే ఆడవాళ్ళు వంటి మీద నగలు ఒలిచి ఇచ్చేయడం కూడా ఈ కళ్ళతో చూసాన్నేను. దేనికి విలువ అందాలో దానికి విలువ అందిన కాలం మాది,'' అంటూ ముగించాడు. నాకు వెంటనే కడుపులో ఖాళీ ఏర్పడిపోయి నేను లోపలికి కుంచించుకుపోతున్న భావన కలిగింది. ఏమని పేరు పెట్టాలి, అప్పటి నా భావనకు? మనం ఎప్పుడో బతికిన గతం గురించి ఆపేక్ష పడటాన్ని "నోస్టాల్జియా'' అనొచ్చు. కాని మనకెప్పుడూ పరిచయమే లేని గతం పట్ల ఆపేక్ష కలిగితే, దాన్నేమనాలి? నాకు నిజంగా ఆ కాలం పట్ల ఆపేక్ష కలిగింది. ఇక్కడ కాక, అక్కడ బతికుంటే బాగుండేదనిపించింది. ఆ కాలం . . . ఏ సంక్లిష్టతలూ లేని కాలం . . . నాకిప్పుడు "ఐ విష్‌ ఐ వజె ఫంక్‌ రాకర్‌'' పాట వరసలు గుర్తొస్తన్నాయి:

When the head of state didn't play guitar
Not everybody drove a car
When music really mattered and when radio was king
When accountants didn't have control
And the media couldn't buy your soul
And computers were still scary and we didn't know everything

Oh I wish I was a punk rocker with flowers in my hair
In seventy-seven and sixty-nine revolution was in the air
I was born too late into a world that doesn't care
Oh I wish I was a punk rocker with flowers in my hair

అఫ్‌కోర్స్‌, తల్లో పూలు అక్కర్లేదు, పైగా నేను పాడితే గాడిదలు వంతపాటకి సిద్ధమౌతాయి. ఇవన్నీ కాదు గానీ, ఆ కాలంలో నిజంగానే ఏదో ఉంది; ఈ కాలంలో లేనిది. ఆ కాలంలో మెయిన్‌ స్ట్రీమ్‌ లైఫ్‌ నచ్చకపోతే పక్కకి వెళిపోయి అవుట్‌సైడర్‌గా బతికే సౌలభ్యం ఉంది. ఈ వెధవ కాలంలో చివరకు సమాజానికి అవుట్‌ సైడర్‌గా బతకాలన్నా చాలా కష్టం. ఎందుకంటే, ఇక్కడ అవుట్‌ సైడర్లకీ, బొహేమియన్లకీ కూడా ప్రత్యేకమైన సమాజాలున్నాయి. వాళ్ళకోసం ప్రత్యేకమైన ఉత్పత్తులున్నాయి. వాళ్లకు టీ-షర్టులు, చిరిగిన జీన్సులు, చెదిరిన క్రాఫుల్లాంటి ప్రత్యేకమైన ఎటిక్వెటీ, వాళ్ళనుద్దేశించి ప్రత్యేకంగా సినిమాలు, పాటలు, పాషన్లు . . . ఇలా వాళ్ళ మీద ఆధారపడి భారీ ఉత్పత్తి జరుగుతుంది. వరకడ్డంగా బతికేస్తున్నామని సంబరపడిపోయేవాళ్ళు కూడా చివరకు వినియోగదారుల మందలో మరో గొర్రెగానే మిగులుతారు.

మొన్నా మధ్య "రావిశాస్త్రి రచనా సాగరం'' పుస్తకాన్ని కొన్నాను. పుస్తకం మొదట్లో 1935 నుండీ 1941 వరకూ రావిశాస్త్రిగారు తన టీనేజ్‌లో రాసుకున్న డైరీ ఎంట్రీలు ముద్రించారు. అవి చదువుతున్నప్పుడూ నాలో అదే నోస్టాల్జియా లాంటి భావన. ఆ డైరీల నుంచి మచ్చుకు కొన్ని రాండమ్‌ ఉదాహరణలు:

ఆదివారం, 1934 - సెప్టెంబరు 29: ఇవాళ పొద్దున్న ఏడున్నర గంటలకి లేచాను. యుద్ధం వొస్తే ఈ ఊరు మీద కూడా బాంబులు వేస్తారని అనుకుంటున్నారు. కొలువులో గవ్వల్తో తేళ్ళు చేసేను. రోడ్డు అదీ వేసి మనుష్యుల్ని బళ్ళనీ వాట్నీ పెట్టేను. చాలా పెద్ద వర్షం పడింది. పొద్దున్న, 'ది స్కూల్‌ బోయ్‌ ప్రిన్స్‌' చదివీసేను. ఇది కూడా చాలా బాగుంది. పెద్ద నాన్నగారు కాణీ ఇచ్చేరు. ఇవాళ గాన సభ ఏమీ బాగు లేదట.

సోమవారం, 1935 - నవంబర్‌ 25: సాయంత్రం కవి షష్టిపూర్తికి వెళ్లేను. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి హిందీ ప్రచారము అణచెయ్యాలని చెప్పేడు. ఉన్నవ లక్ష్మీనారాయణ దానికెగెనిష్టుగా చెప్పేడు. శివ శంకర శాస్త్రి, బుచ్చి సుందర్రావు ఎటు కాకుండా చెప్పేరు. కందాళ సర్వేశ్వర శాస్త్రి చెప్పేడు. పురిపండా అప్పల స్వామి హిందీకి ఎగెనిష్టు గానే చెప్పేడు . . . చిట్టి పొద్దున్నొచ్చి సాయంత్రం వెళిపోయింది. నాన్నగారు ఊరి నుంచి వచ్చీసేరు. జామిపళ్ళు తెచ్చేరు.

బుధవారం, 1938 - సెప్టెంబరు 7: కాలేజీకి విశ్వనాథ సత్యన్నారాయణ గారు వచ్చి ఉపన్యాసం ఇచ్చేరు. ఆంధ్ర ప్రశస్తిలోవి, కిన్నెరసానిలోవి పద్యాలు చదివేరు. చాలా బాగున్నాయి. ఇంటికి వచ్చి భోజనం చేసి బాబ్జీ కోసం క్రిష్ణ సైకిలు మీద వాల్తేరు వెళ్ళేను. వాడి స్నేహితుల కోసం వడలు, జీడిపప్పు పాకం పట్టుకొని వెళ్ళేను, వాడికిచ్చీసేను. మరో రెండు రూపాయలు కూడా ఏమైనా కొనడానికి ఇచ్చేను. మళ్ళా పందొమ్మిదో తారీఖున వస్తాడట. కోమటి వాడు తన తమ్ముడికి ఒక ఫ్యాంట్‌ ఇచ్చీమని ఇచ్చేడుట... 'వినోదిని' కొన్నాను. నా కథ పడ్డాది. బొమ్మ కూడా వేసేడు.

శుక్రవారం, 1939 - సెప్టెంబరు 1 : సుభాష్‌ చంద్రబోసు కాకినాడ వెళ్తున్నాడు. వాల్తేరు స్టేషన్‌లో విద్యార్థుల మందరం వెళ్ళి చూసేం. టిపికల్‌ బెంగాలీబాబు. అంత ఎమోషనల్‌గా మాట్లాడలేడు. జర్మనీ పోలెండుతో యుద్ధం ప్రారంభించింది. పై వారెవరైనా పోలండుని ఎదుర్కొంటే వాళ్ళకి ఇంగ్లీషు వాళ్ళు, ఫ్రెంచి వాళ్ళు సహాయం చేయడానికి ఇదివరకూ సంధి జరిగింది. ఇప్పుడేమవుతుందో తెలియదు.

శుక్రవారం, 1941 - ఏప్రిల్‌ 4 : సాయంత్రం బీచీని నేనూ దువ్వూరి నరసింహం కూర్చున్నాం. రాత్రి 'ముసాఫిర్‌' సినీమాకి వెళ్దామన్నాడతను. సరేనన్నాను నేను. కాని రాత్రి వెళ్తూ ఉంటే భాస్కర్రావు కనిపించి 'ముసాఫిర్‌' వెళిపోయిందన్నాడు. 'బంధన్‌' సినిమాకి వెళ్ళేం. కొల్లావాడు కూడా వచ్చేడు. రాత్రి భాస్కర్రావింట్లోనే పడుకున్నాను. ఇవాళ నవమి సంబరాల్లో కలియుగ పురాణం అనే వేషం చాలా బాగుంది. రాత్రి నలుగురాడవాళ్ళని సోల్జర్లు పాడు చేయబోయారట. ఒక సోల్జర్ని మన వాళ్ళు చితక తన్నీసేరట.

ఈ డైరీ ఎంట్రీలు చదువుతుంటే, ఆయన ఇందులో నమోదు చేసిన వివరాలన్నింటి నేపథ్యంలోనూ, ఆయన ప్రయత్నమేమీ లేకుండానే, ఓ ("అందమైన'' అనలేను గానీ) ఆకర్షణీయమైన కాలం రూపం పోసుకుంది; అస్పష్టంగా, ఆవిరి పట్టిన గాజు పలకకు ఆవలనున్న దృశ్యంలా, తెలిసీ తెలియకుండా నన్ను కవ్వించింది. అక్కడ బతికుంటే బాగుండుననిపించింది. ఆ కాలానికి విశిష్టత ఏంటంటే అక్కడ పట్టుకోవడానికి ఏదో ఆసరా ఉంది. జీవితాల్ని అల్లుకోవడానికి ఏదో ఆలంబన ఉంది. నేషనలిజమో, మార్క్సిజమో, నక్సలిజమో, వల్లకాడో. . . ఏదైతేనేం, ఒక యుద్ధముంది; భ్రమైతేనేం, వాళ్ళకు శత్రువులున్నారు. వాళ్ళు చాలా నమ్మకంతో, చాలా తేలికగా తమ జీవితాల్ని మిథ్యా సమరాలకు తర్పణాలుగా అర్పించేశారు. తమ జీవితాల్ని అర్థవంతంగా గడిపామన్న నమ్మకంతో ఆనందంగా చచ్చిపోయారు. వాళ్ళకా అనుకూలత ఉంది. కానీ నాకేం ఉంది? నా తరం ముందు పెద్ద ఖాళీ ఉంది. "ఫైట్‌ క్లబ్‌'' సినిమాలో టైలర్‌ డర్డన్‌ మాటల్లో చెప్పాలంటే:

"I see all this potential, and I see it squandered. God damn it, an entire generation pumping gas, waiting tables; slaves with white collars. Advertising has us chasing cars and clothes, working jobs we hate so we can buy shit we don't need. We are the middle children of history man! No purpose, no place. We have no Great War. No Great Depression. Our Great War is a spiritual war . . . our Great Depression is our lives."

అంతో ఇంతో ఇది నిజమనే చెప్పాలి. టైలర్‌ డర్డన్‌ ఒక చార్మింగ్‌ బాస్టర్డ్‌. సమస్యను చాలా బాగా ఎత్తి చూపుతాడు. కాని దానికి చూపించే పరిష్కారమే వింతగా ఉంటుంది. ప్రస్తుత యాంత్రిక ప్రపంచంలో మనల్నీ ఒక యంత్రంగా ఒదిగిపోయేట్టు సిద్ధం చేసే సోకాల్డ్‌ "సెల్ఫ్‌ ఇంప్రూవ్‌మెంట్‌'' పద్ధతుల్ని అతను వ్యతిరేకిస్తాడు. ఇలా సమస్యను అంచనా కట్టడం వరకూ బాగానే ఉంది. కాని, సమస్య "A'' అనుకుంటే, దానికి పరిష్కారం "~A'' అంటాడు. అక్కడే అతనితో ఇబ్బంది. ఇప్పుడు మనకి కావాల్సింది "సెల్ఫ్‌ ఇంప్రూవ్‌మెంట్‌'' కాదు, "సెల్ఫ్‌ డిస్ట్రక్షన్‌'' అని వాదిస్తాడు. ఇది చాలా ప్రమాదకరమైన వాదన. ఇలాంటి వాదనల ఫలితం తర్వాత్తర్వాత అమెరికాకే అనుభవానికొచ్చింది. సెప్టెంబరు 11న, ట్విన్‌టవర్స్‌ శిథిలమయ్యే కొద్ది క్షణాల ముందు, విమానం కాక్‌పిట్‌లోంచి వాటిని చివరి సారి చూసిన వాళ్ళు టైలర్‌ డర్డన్‌ లాంటి వాళ్ళే. టైలర్‌ డర్డన్‌ వినడానికి చాలా ఇంపుగా వాదిస్తాడు; అనుసరిస్తే గుడిపించేస్తాడు.

అయితే, "వ్యక్తిత్వ వికాసం'' కాదు, "వ్యక్తిత్వ విధ్వంసం'' కావాలి అన్న అతని వాదనలోని రెండో భాగాన్ని వదిలేస్తే, అతని వాదన నిజంగా సమంజసమే. ప్రస్తుతం ఒక ఉద్యమంగా చెలామణీ అవుతున్న "వ్యక్తిత్వ వికాసం'' నిజంగా ఒక జాడ్యమే. ఈ జాడ్యపు పర్యవసానాలు ఇంకా బయటపడలేదు గానీ, ఎటు చూసినా రోగ పీడితులే. ఈ ఉద్యమకారులు—మనం "ఎఫెక్టివ్‌ పీపుల్‌''గా మారడానికి ఏ 7 అలవాట్లు అలవరచుకోవాలో చెప్తారు; విజయం సాధించాలంటే ఏ 5 మెట్లు ఎక్కాలో బోధిస్తారు. ముందే పోసిన మూసల్లో సామరస్యంగా ఒదిగిపోయేలా మనకు తర్ఫీదునిస్తారు, దువ్వుతారు. ఈ వ్యక్తిత్వ వికాస పుస్తకాలన్నీ ప్రాథమికంగా ఒకే ప్రాతిపదిక మీద మొదలౌతాయి: పుస్తకం తెరిచిన చదువరి ఎలాంటివాడైనా, వాడు మారాలి. ప్రతీ మనిషికీ ఒక unique identity ఉంటుందన్న సంగతి, ఈ వైవిధ్యం సృష్టి స్వభావం అన్న సంగతి ఇలాంటి పుస్తకాలు రాసేవాళ్ళకి గుర్తుండదనుకుంటా. ఇవి విజయం సాధించడమే, లేదా "నెంబర్‌వన్‌'' కావడమే (దేవుడికే తెలియాలి అదేంటో) మనిషి జీవిత పరమార్థంగా చెప్తాయి. ఆ ప్రయాణంలో మనిషి తనమైన తనే యుద్ధం చేసుకోవాలంటాయి; తనలోని ప్రత్యేక వ్యక్తిత్వాన్ని (లేదా వాళ్ళ భాషలో "బలహీనతల్ని'') చంపేసుకోమంటాయి. ఎక్కడకో చేరుకుంటే తప్ప ఆనందం లభ్యం కాదన్న భ్రమని చాప క్రింద నీరులా పాఠకుల మనసుల్లోకి ఎక్కిస్తాయి. "లక్ష్యం'', "గమ్యం'' లాంటి పదాలు రెండు మూడు వాక్యాలకోసారి వీటిల్లో తగుల్తుంటాయి. —అయినా నేను విషయం మళ్ళుతున్నట్టున్నాను.

నా కొలీగ్‌ ఆ మాటలన్నపుడు నాకు చాలా దిగులేసింది. సగం దిగులు నేను బతకవలసిన కాలంలో బతకటం లేదనిపించడం వల్ల. మరి సగం దిగులు నా ఆలోచనలు ఈ రీతిలో సాగడం చూసి. అంటే, పాతికేళ్ళ వాణ్ణి, ఎంత తక్కువ అంచనా వేసినా ఇంకో నలభయ్యేళ్ళు నిక్షేపంలా బతక వలసిన వాణ్ణి, అప్పుడే గతం పట్ల—అది కూడా నాకు అస్సలు పరిచయమే లేని గతం పట్ల—ఆపేక్ష పడుతున్నానంటే, ఏదో తేడా ఉన్నట్టే కదా.

సరే, ఇక మూడో కారణం: ఒక తిలక్‌ కవిత. ముందు తిలక్‌తో నా స్నేహం గురించి కాస్త చెప్పుకోవాలి. మాది ఆరేళ్ళ స్నేహం. ఆరేళ్ళ క్రితం హైదరాబాద్‌ వచ్చిన కొత్తలో "అమృతం కురిసిన రాత్రి'' కొన్నాను. ఇప్పటికీ దాంతో నా స్నేహం పాతబడలేదు. పాతబడకపోవడానికి కారణం తిలక్‌ నాకు ఇప్పటికీ పూర్తిగా పరిచయం కాకపోవడమనుకుంటా. అసలెప్పటికీ పూర్తిగా పరిచయం కాడేమో కూడా. అంతా తెలిసిపోయాడనుకున్న తరుణంలో అంత వరకూ చూడని తళుకేదో చూపిస్తాడు; మళ్ళీ కొత్త కోణంలో ప్రత్యక్షమవుతాడు. తిలక్‌ ఓ పూల తోటలాంటి వాడు. పూలతోటని ఎప్పటికీ పూర్తిగా పరిచయం చేసుకోలేం. అంతా తెలిసిపోయిందనుకున్న తరుణంలో, తెల్లారి లేవగానే, ఏదో మూల ఓ కొత్త మొగ్గ కనిపించి మురిపిస్తుంది. బహుశా ఈ సాదృశ్యం కూడా సరైంది కాదేమో. ఈ సందర్భంలో కొత్త మొగ్గలు వికసించేది తోటలో కాదు; కొత్త మొగ్గలు నాలో వికసిస్తున్నాయి, వాటి ప్రతిబింబాల్నే తోటలో చూసుకుంటున్నాను.

బయటకొస్తే చచ్చిపోతానేమోననే మార్బిడ్‌ భయంతో చాలా కాలం తనను తాను ఓ ఇరుకు గదిలో బంధించుకున్న ఈ వ్యక్తి ఇలా "నవ నవాలైన ఊహా వర్ణార్ణవాల''ను ఎలా అక్షరబద్ధం చేసాడా అనిపిస్తుంది; కొన్ని పంక్తుల నిర్మాణంలో, డిగో మారడోనా "దైవ హస్తం'' లాగా, ఏవన్నా అతీంద్రియ హస్తం సహాయపడిందా అనిపిస్తుంది. ఉదాహరణకి "అదృష్టాధ్వగమనం'':

"ఇప్పటికీ ఈ చీకటి మొగలో
నిలిచి పాడుతున్న నా కోసం
కుబుసం విప్పిన గోధుమ వన్నె తాచు
మొగలి పొదల నుండి పడగ విప్పి ఆడుతుంది
ప్రాగ్దిశా సుందరి ఖండ చంద్ర పరిదీపిత కపోలాల హసిస్తుంది
నా గుండెలపై శుక్రతార కిరణం సూటిగా వచ్చి వాలుతుంది.''

కవిత చివరి పంక్తి పూర్తికాగానే నిజంగానే నక్షత్రపు మెత్తని వెలుగులాంటి మధుర భావనేదో సూటిగా వచ్చి గుండెలపై వాలిన అనుభూతి కలుగుతుంది.

ఇంతకీ నన్ను బాధపెట్టిన—సరిగ్గా చెప్పాలంటే చికాకు పరచిన—కవిత పేరు "మన సంస్కృతి''. నిజానికి దీన్ని కవిత అనే కన్నా, కవిత అనే ముసుగు తొడుక్కున్న రెటోరిక్‌ అని చెప్పొచ్చు:

మన సంస్కృతి

మన సంస్కృతి నశించిపోతూందన్న
మన పెద్దల విచారానికి
మనవాడు పిలక మాని క్రాపింగ్‌ పెట్టుకున్నాడనేది ఆధారం
మనగలిగినదీ
కాలానికి నిలబడ గలిగినదీ వద్దన్నా పోదు
మరణించిన అవ్వ నగలు
మన కాలేజీ అమ్మాయి ఎంత పోరినా పెట్టుకోదు
యుగ యుగానికీ స్వభావం మారుతుంది
అగుపించని ప్రభావానికి లొంగుతుంది
అంతమాత్రాన మనని మనం చిన్నబుచ్చుకొన్నట్లు ఊహించకు
సంతత సమన్వయావిష్కృత వినూత్న వేషం ధరించడానికి జంకకు
మాధుర్యం, సౌందర్యం, కవితా
మాధ్వీక చషకంలో రంగరించి పంచి పెట్టిన
ప్రాచేతస కాళిదాస కవి సమ్రాటులనీ,
ఊహా వ్యూహోత్కర భేదనచణ
ఉపనిషదర్థ మహోదధినిహిత మహిత రత్నరాసుల్నీ
పోగొట్టుకునే బుద్ధి హీనుడెవరు?

ఎటోచ్చీ
విధవలకీ వ్యాకరణానికీ మనుశిక్షాస్మృతికీ గౌరవం లేదని
వీరికి లోపల దిగులు
వర్తమానావర్త ఝంఝూ వీచికలికి కాళ్ళు తేలిపోయే వీళ్ళేం చెప్పగలరు?
అందరూ లోకంలో శప్తులూ పాపులూ
మనం మాత్రం భగవదంశ సంభూతులమని వీరి నమ్మిక
సూర్యుడూ చంద్రుడూ దేవతలూ దేవుళ్ళూ
కేవలం వీరికే తమ వోటిచ్చినట్లు వీరి అహమిక
ఇది కూపస్థ మండూకోపనిషత్తు
ఇది జాతికీ ప్రగతికీ కనబడని విపత్తు
మన వేషం, మన భాషా, మన సంస్కృతీ,
ఆది నుండీ, ద్రవిడ బర్బర యవన తురుష్క హూణుల నుండీ,
ఇచ్చినదీ పుచ్చుకున్నదీ ఎంతైనా ఉన్నదనీ
అయిదు ఖండాల మానవ సంస్కృతి
అఖండ వసుధైక రూపాన్ని ధరిస్తోందనీ,
భవిష్యత్‌ సింహ ద్వారం
తెరుస్తోందనీ,

గ్రహించలేరు పాపం వీరు
ఆలోచించలేని మంచి వాళ్ళు
ఏ దేశ సంస్కృతి అయినా ఏనాడు కాదొక స్థిర బిందువు
నైక నదీ నదాలు అదృశ్యంగా కలిసిన అంతస్సిధువు.

- 1965

అసలే పై రెండు బాధలతో అచేతనంగా సతమతమవుతున్న నన్ను ఈ కవిత ఇన్నాళ్ళూ లేనిది ఎందుకో కాస్త రెచ్చగొడుతున్నట్టనిపించింది. "తిలక్‌ చెప్తోందంతా నిజమేనా'' అనిపించింది కాసేపు. నాకు తెలుసు, "అయిదు ఖండాల మానవ సంస్కృతి అఖండ వసుధైక రూపాన్ని ధరిస్తోందనీ, భవిష్యత్‌ సింహ ద్వారం తెరుస్తోందనీ''; నేను దానికి సిద్ధమయ్యే ఉన్నాను, "సంతత సమన్వయావిష్కృత వినూత్న వేషం ధరించి'' ఠీవిగానే నించొన్నాను; జంకేమీ లేకుండా బాబుగాళ్ళకి బాబుగాడిలా ఈ వేషం ధరించగలను, నటించగలను. కానీ ఎంతైనా వేషం వేషమే కదా, నటన నటనే కదా. Deep down inside, I know that I am fucking faking it. (ఇప్పుడూ ఈ నాల్గక్షరాల ఇంగ్లీషు బూతు పదానికి రెండక్షరాల్లోనే అచ్చ తెలుగు ప్రత్యామ్నయం ఉన్నా, ఇది వాడినంత అలవోకగా దాన్ని వాడలేకపోతున్నాను. ఇదేదో ఆలోచించాలి. "అంతరించిపోతున్న అచ్చ తెలుగు బూతులు'' అని ఒక వ్యాసం రాస్తే క్లారిటీ వస్తుందేమో. మెటీరియల్‌ కూడా వెతక్కోనక్కర్లేదు, నాలిక చివర ఉంటుంది.)

ఈ కవిత చదువుతున్నపుడు "నిజమేనా'' అనిపించింది ఎక్కడంటే, మనం నిజంగానే "మాధుర్యం, సౌందర్యం, కవితా మాధ్వీక చషకంలో రంగరించి పంచి పెట్టిన ప్రాచేతస కాళిదాస కవి సమ్రాటులనీ, ఊహా వ్యూహోత్కర భేదనచణ ఉపనిషదర్థ మహోదధినిహిత మహిత రత్నరాసుల్నీ'' పోగొట్టుకోకుండా దాచుకుంటున్నామా, మన వెంట తెచ్చుకుంటున్నామా? ఈ ప్రశ్నకి సమాధానంగా నలభయ్యేళ్ళు దాటిన అంకుల్స్‌ అందరూ "మేమున్నాం'' అని ముందుకు రావొచ్చు; ఏమో మరి, నాదాకా అయితే ఇవేమీ రావడం లేదు. మొన్నా మధ్య సీటీ సెంట్రల్‌ లైబ్రరీలో, డస్ట్‌ ఎలర్జీ ఉన్న వాళ్ళు తలచుకోవడానిక్కూడా జంకే తెలుగు పుస్తకాల సెక్షన్‌లో, మూల అరల్లో మూలుగుతూ నిర్లక్ష్యం కాబడుతున్న కొన్ని తెలుగు మెదళ్ళని రాండమ్‌గా పలకరిస్తున్నాను. అవన్నీ సల్ఫర్‌ ప్రభావం వల్ల పసుపుబారి, పెళుసై పేజీలు విరిగిపోతున్న పుస్తకాలే. వెతుకులాటలో కట్టమంచి రామలింగారెడ్డిగారు "కళా పూర్ణోదయం'' గురించి రాసిన పుస్తకం ఒకటి కనిపించింది. అంతకుముందే వినివుండటం వల్ల ఆసక్తిగా తెచ్చుకుని చదివాను. తర్వాత "కళాపూర్ణోదయం'' ఎలాగైనా చదవాలనిపించింది. విశాలాంధ్రాకెళ్ళి వెతికి పట్టుకున్నాను. కానీ అందులో టీకా తాత్పర్యాలేవీ లేవు. కేవలం రచన ఉంది. టీకాతాత్పర్యాలతో పుస్తకాలేవన్నా ఉన్నాయా అని అడిగితే ప్రచురణలో లేవన్నాడు షాపువాడు. సరే ఎలాగో దీంతోనే కుస్తీ పడదామని అదే కొనితెచ్చుకున్నాను. కొన్ని రోజులు కష్టపడ్డాను. ఆ పుస్తకంతో నా కష్టం భుజం మీద నాగలేసుకు బీడు భూమిని దున్నినట్టే ఉంది (వెధవ ఉదాహరణ! చివరికి ఇక్కడ కూడా "ploughing through'' అనే ఇంగ్లీషు పదబంధం మీద ఆధారపడ్డమే! నా మెదడు నెర్రెలు బారిపోతోంది. ఆపద్ధర్మంగానైనా తెలుగు జాతీయాల పుస్తకం ఒకటి తెచ్చుకుని బట్టీ పట్టాలి.) సరే ఇలా కొన్ని రోజులు తంటాలు పడ్డాను. నా దగ్గర ఉన్న శబ్దరత్నాకరం ఏ మాత్రం అక్కరకు రాలేదు. చివరకు ఈ పుస్తకం నా వరకూ కళా అసంపూర్ణోదయంగానే మిగిలిపోయింది. ఇలా ఓ తెలుగు రచనకే దిక్కు లేకపోతే, ప్రాచేతస కాళిదాస కవి సమ్రాటుల్నీ, ఉపనిషదర్థ మహోదధుల్నీ ఒంటరిగా ఈదడం నా వల్లనవుతుందా? వాటిలో నిహితమైన రత్న రాసుల్ని ఏ సహాయమూ లేకుండా వెలికితీయగలనా? మరి నిజంగానే తిలక్‌కు బుద్దిహీనులెవ్వరూ కనపడలేదా?

నన్ను బాధ పెట్టిన ఈ మూడు కారణాలకూ ఏదో సంబంధం ఉందని తెలుస్తోంది. నేనేదో కోల్పోతున్నాను, ఈసరికే కోల్పోయాను కూడా. కొన్ని అనుభవించి కోల్పోయాను, కొన్ని అనుభవించకనే కోల్పోయాను. అందుకే ఇప్పుడిలా శిథిలాల మధ్య నిలబడి జ్ఞాపకాల పునాదులపై అక్షరాల ఇటుకల్తో మళ్ళీ అంతా పేర్చుకుంటున్నాను; పేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాను. అందులో సేద తీరుతున్నాను. అయినా నేను కాస్త అతిగా బాధపడుతున్నానేమో. బహుశా నేను కాస్త తేడానేమో. బహుశా అందరూ జీవిత రహదారుల్లో ముందుకు చూస్తూ ముందుకు నడిచే వాళ్ళైతే, నేను వెనక్కి చూస్తూ ముందుకి నడిచే బాపతేమో. ఏం చేస్తాం. మన మౌలిక నిర్మాణమే అలా ఏడిచింది. మారాలంటే గోరోజనం ఎక్కువాయె! ఈ జన్మకిలా కానిచ్చేద్దాం.

(సరే, చిన్న గీత ముందు పెద్ద గీత గీసాను. మొదటి బాధ తగ్గినట్టే కనిపిస్తుంది. మరి ఇప్పుడీ రెండో బాధ సంగతేం చేయాలి. దీని ప్రక్కన ఏ పెద్ద గీత గీస్తే ఈ గీత చిన్నదౌతుంది. ఆ అమ్మాయినే అడగాలి.)

2 comments:

  1. ఆ కాలానికి విశిష్టత ఏంటంటే అక్కడ పట్టుకోవడానికి ఏదో ఆసరా ఉంది. జీవితాల్ని అల్లుకోవడానికి ఏదో ఆలంబన ఉంది. నేషనలిజమో, మార్క్సిజమో, నక్సలిజమో, వల్లకాడో. . . ఏదైతేనేం, ఒక యుద్ధముంది; భ్రమైతేనేం, వాళ్ళకు శత్రువులున్నారు. వాళ్ళు చాలా నమ్మకంతో, చాలా తేలికగా తమ జీవితాల్ని మిథ్యా సమరాలకు తర్పణాలుగా అర్పించేశారు. తమ జీవితాల్ని అర్థవంతంగా గడిపామన్న నమ్మకంతో ఆనందంగా చచ్చిపోయారు. వాళ్ళకా అనుకూలత ఉంది. కానీ నాకేం ఉంది?

    ReplyDelete
  2. మధ్యలో తెలుగు జాతీయాల బదులు ఆంగ్ల జాతీయాలు వస్తున్నాయని బాధపడ్డారు కదా. నాకై నేను వెతుక్కున్న గురువుగారు గుర్తొచ్చారు. 19 సంవత్సరాల వయసులో 20వ శతాబ్ది తెలుగు సాహిత్యాన్ని పిచ్చిగా చదువుకుంటూండగా, ఆ స్థాయిలో ఆంగ్లాన్ని చదువుకోలేదని బాధకల్గేది. ఆయనతో చెప్తే మంచికే కానీ చెడుక్కాదులే. ఫర్లేదు హాయిగా మరికొన్నాళ్ళు తెలుగే చదువుకున్నా నష్టం లేదన్నారు. అలాగే చదువుకునే ఇంగ్లీషులో అన్నప్రాశన చేశాను. ఇవ్వాళ అర్థమౌతోంది ఎందుకలా అన్నారో.

    ReplyDelete