సుబ్బిగాడు నేనూ మేట్నీ నుండి ఆటోలో వస్తూంటే, అప్పటికప్పుడు మెదిలిన ఆలోచనతో, మలేషియన్ టౌన్‌షిప్ దగ్గర ఆపమన్నాను. ఇద్దరం కలిసి టౌన్‌షిప్ ఎదురుగా పెద్ద గుట్ట మీదున్న గుడికి బయల్దేరాం. ఇలా యీ సడెన్ షికారుకి సుబ్బిగాడు మొన్నెప్పుడో ఆ గుడికి వెళ్దామని అడగడం ఒక కారణమైతే, ఇప్పుడే చూసిన చెత్త సినిమా తెప్పించిన తలపోటు నుండి ఇది మమ్మల్ని కాస్త బయట పడేయగలదేమోనన్న ఆశ మరో కారణం. పైకి ఎక్కే దారిలో మాకెదురైన రెండు మూడు ప్రేమ జంటల్ని చూసి సుబ్బిగాడు కావాలని నిట్టూర్చాడు, నేను నవ్వాను. పైన పెద్ద జనం లేరు. గుడి తలుపులు మూసి ఉన్నాయి. గుడి వెనుక ఉన్న పెద్ద రాతి బండ మీద ఇద్దరం సాగిలబడ్డాం. ఈ గుట్ట క్రింద కాస్త దూరంలో కొత్తగా ఏదో టౌన్‌షిప్ కడుతున్నారు. ఏటవాలు కప్పులతో పదుల సంఖ్యలో ఉన్న డూప్లెక్సులు మా ముందు వరసాగ్గా పేర్చి ఉన్నాయి. వాటి మధ్యలో ఇంకా ఎత్తుగా పైకి లేచి నాలుగైదు అపార్ట్‌మెంట్ టవర్లు కూడా నిర్మాణంలో ఉన్నాయి. ఆ సాయంత్రపు వెలుగులో కూడా చాలా దూరంలో ఉన్న నేమ్‌బోర్డు మీద "ఫార్ట్యూన్ ఫీల్డ్స్" అన్న పేరుని మేం కూడబలుక్కుంటూ చదవగలిగాం, మా చురుకైన కంటి చూపుని మేమే పొగుడుకున్నాం. ఈ "ఫార్ట్యూన్ ఫీల్డ్స్"కి వెనుకగా, దిగంతం మీద, సూర్యబింబం అస్తమించే పనిలో ఉంది. కాషాయపుటెరుపు రంగులో ఉన్న ఆ బింబపు కాంతి ఎంత మృదువుగా ఉందంటే- కళ్ళు ఏ మాత్రం బైర్లు కమ్మకుండా దాన్ని ఎంతసేపైనా చూస్తూండిపోవచ్చు. కళ్ళ ముందు చేయి ఉంచి, ఆ బింబాన్ని బొటన వేలి క్రింద పెట్టి, ఆకాశంలోకి ఓ జానెడు కొలత కొలిస్తే ఎంత దూరం ఉంటుందో ఆ మాత్రపు దూరంలో ఒక జెట్ విమానం నిశ్శబ్దంగా వెళ్తూంది. దాని వెనుక తెల్లని వాయుమేఘం తోకలా విప్పారుతోంది. ఇద్దరం ఆ విమానం గురించి కాసేపు మాట్లాడుకున్నాం. అది కంట్రోల్ తప్పి తిన్నగా మేం కూర్చున్న గుట్ట మీదకు దూసుకొస్తే ఎలా ఉంటుందో ఊహించమన్నాను. సుబ్బిగాడు నావన్నీ పనికిమాలిన ఊహలని తిట్టాడు. తర్వాత, మా కంటి చూపుని మరింత పరీక్షించుకోవాలని, దూరంగా ఉన్న ఓ ఖాళీ హోర్డింగ్ మీద పెద్ద అక్షరాలతో రాసి ఉన్న సెల్ నెంబరు చదవడానికి ప్రయత్నించాం. ఆ నెంబర్లో వరుసగా ఐదు ఆర్లున్నాయి. అవి లెక్కపెట్టడానికి కాస్త కష్టమైంది. కాసేపటికి మా మాటల్లోంచి తేరుకుని చూస్తే సూర్య బింబం అక్కడ లేదు. ఇప్పుడు అక్కడ బూడిద రంగు ఆకాశం బోసిపోయి కనిపిస్తోంది. అయితే పైన జెట్ విమానం మాత్రం ఇంకా సూర్య కాంతి పడి బంగారపు పలుకులాగ మెరుస్తూనే ఉంది. మాకు అస్తమించిన సూర్యుడు ఆ విమానంలోని పైలట్‌కి ఇంకా అస్తమించలేదన్నమాట, మాకు కనపడని సూర్యుణ్ణి అతనింకా చూస్తున్నాడన్నమాట. జెట్ విమానం వెళ్తున్న దారిని గమనిస్తూ ఇద్దరం రాతి మీద వెల్లకిలా పడుకున్నాం. ఇలాంటి ప్రాకృతికమైన నిశ్శబ్దంలో, ప్రేమలో ఉన్నవారెవరైనా ప్రేమిస్తున్నవాళ్ళని గుర్తు చేసుకోవడం సహజమేమో. సుబ్బిగాడు వాడి మరదలి గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయి గురించి వాడు ఎక్కువ మాట్లాడేది నాతోనే. పాపం వాడి దగ్గర వాడి ఇష్టాన్ని సాకల్యంగా వర్ణించగలిగినన్ని పదాలు లేవు. కాని వాటిని వెతుక్కోవటానికి వాడు పడే ప్రయాసలో, ఆ నట్టడంలో, తడబాటులో, ఆ ప్రేమ అందం ఇంకా ఇనుమడిస్తుంది. కొన్నిసార్లు లోపల్నించీ తన్నుకొస్తున్న ప్రేమ తీవ్రతకూ, దానికి వీడు అరువిచ్చే సాదాసీదా పదాలకూ మధ్య పొందిక కుదరక, తడబడి, "నేన్చెప్పలేన్రా బాబూ" అని ఇబ్బందిగా నవ్వేస్తాడు. అయితే అంతకుముందు వాడిన బోలెడన్ని పదాల కన్నా ఈ ఒక్క పదం వాడి ప్రేమ లోతును సంపూర్ణంగా వ్యక్తం చేస్తుంది. నేను ఊకొట్టాల్సినచోట ఊకొట్టాను. తోచినచోట సలహా ఇచ్చాను. ధ్యాసపెట్టి వింటున్నానని తెలియజేయడానికి (నిజంగానే వింటున్నాను), కొన్ని అర్థమైనా సరే ఆపి వివరమడిగాను. మా సంభాషణ అంతా పూర్తయ్యాక, ఇదంతా విన్నందుకు నా పట్ల వాడిలో ఉండే కృతజ్ఞత కన్నా, చెప్పినందుకు వాడి పట్ల నాలో ఎక్కువ కృతజ్ఞత ఉంటుందనిపించింది. అప్పటికిక సినిమా వల్ల వచ్చిన తలపోటు పోయింది. ప్రేమ గురించి కదా మాట్లడుకుందీ... మనసు తేటగా, ఖాళీగా ఉంది. వెళ్దామంటే వెళ్దామనుకున్నాం. తృప్తిగా, తీరుబడిగా బండ దిగి కిందకి నడిచాం.
మ్మ్మ్ .. మొత్తం దృశ్యం కనపడింది. భలే ఉంది.
ReplyDeleteమ్యూజింగ్స్ అంటే తెలీదు కాని ఇది చాలా బావుంది.