March 21, 2012

మిత్రభేదం (ఆఖరిభాగం)

ముందుమాట | మొదటిభాగం | రెండవభాగం | మూడవభాగం | నాలుగవభాగం | ఐదవభాగం |
ఆరవభాగం | ఏడవభాగం | ఎనిమిదవభాగం | తొమ్మిదవభాగం | పదవభాగం | పూర్తి కథ pdf |  

సోషల్ టీచరు ప్రసంగం ముగియడంతో, అప్పటికి వుపాధ్యాయులందరి ప్రసంగాలూ పూర్తయ్యాయి. కానీ ఆయన కూర్చునేవాడు వూరకనే కూర్చోకుండా, విద్యార్థులు ప్రస్తుతం యెవరెవరు యేమేం చేస్తున్నారో ఒక్కొక్కర్నీ లేచి చెప్పమన్నాడు. అది విన్నాక కొందరు కుంచించుకుపోతే, కొందరు వుత్సాహాన్ని వుగ్గబట్టుకున్నారు. భద్రీ యేదో గొణుక్కున్నాడు. ముందు ఆడవాళ్ళతో ప్రారంభమైంది. వరసగా యిద్దరు-ముగ్గురు అమ్మాయిలు గృహిణులమంటూ ఒకే రకం సమాధానం చెప్పటంతో, సోషల్ టీచరు యిలాకాదని, మీ భర్తలు యేమేం చేస్తున్నారో కూడా చెప్పమన్నాడు. ఎక్కువమంది అమ్మాయిలు తమ భర్తలు వ్యవసాయం చేస్తున్నారని చెప్పారు. తర్వాతి స్థానం వృత్తిపనులు చేసే భర్తలు గల వారిదయింది. మెండు కనకమాలక్ష్మి మాత్రం తన భర్త పాలకేంద్రం నడుపుతాడని క్లుప్తంగా ముగించి, తర్వాత వార్డు మెంబరుగా తాను చేసిన పనులు చెప్పింది. తమ పార్టీ తరపున వూళ్ళో చందాలు వసూలు చేసి బడికి కొత్త పెంకు లేయించామనీ, బాదం చెట్టు చప్టా మీద వున్న సరస్వతీదేవి విగ్రహానికి చిన్న మండపం కట్టించామనీ చెప్పుకొచ్చింది. వచ్చినవాళ్ళలో పెళ్ళికాని వాళ్ళు ముగ్గురున్నారు: ఒకమ్మాయి అంగన్‌వాడీ టీచరుగా పని చేస్తోంది; ఒకమ్మాయి తండ్రి చనిపోతే తాలూకాఫీసులో ఆయన వుద్యోగం చేస్తోంది; ఒక క్రైస్తవుల అమ్మాయి నర్సుగా పని చేస్తోంది.

ఆడవాళ్ళ పరిచయాలు దాదాపు పూర్తయ్యాకా, రేణుకాదేవి వచ్చింది.

వెనుక గుమ్మంలోంచి రావటంతో యెవరూ ఆమె రాకను గమనించలేదు. ఆమె కూడా యెవరి ధ్యాసా మళ్ళించకుండా ఒబ్బిడిగా వచ్చి వనజాక్షి ప్రక్కన కూచుంది. శేషు మాత్రం యేదో అతీంద్రియ జ్ఞానం కబురందించినట్టు చటుక్కున తల తిప్పి చూసాడు. ఆ క్షణాన వర్తమానం చెర్నాకోల దెబ్బతిన్న గుర్రంలా గతి మార్చింది. ఆ వురవడికి సర్వేంద్రియాలు మ్రాన్పడి అయోమయపడ్డాడు. అప్రయత్నంగా బాలా వైపు చూసాడు. అతను శేషు వైపు సన్నగా నవ్వుతున్నాడు. హృదయస్పందన గతుకులో పడి లేచినట్టయింది. దేహంలో సిరల కుహురాల్లో రక్తప్రవాహం వరద గోదారిలా పరవళ్ళుతొక్కింది. వెన్ను చివర్నుంచి ఒక జలదరింపు విద్యుద్ఘాతంలా పాకి మెడ వెనుక భాగాన్ని రోమాంచితం చేసింది. ఆమె నవ్వుతూ యేదో మాట్లాడుతోంది. వనజాక్షి వళ్ళో వున్న బుడ్డాడి బుగ్గ పుణుకుతోంది. అది యిందాక తాను పుణికిన బుగ్గేనా అని గుర్తుతెచ్చుకున్నాడు. ఇదో శుభశకునంలా అనిపించింది. భద్రీతో మాట్లాడే మిష మీద అతని మెడ వెనుక నుంచి రేణూని చూస్తున్నాడు. ఆమె యిటు చూస్తుందని ఆశించాడు. కానీ యిటువున్నదేదో గోడ అన్నట్టు ఆమె చూపు మరలటమే లేదు. జరీలేని కనకాంబరం రంగు కంచిసిల్కు చీర కట్టుకుంది. చీరలో యేమన్నా కాస్త ఆడంబరం వుంటే, దాన్ని ఆమె మిగతా వైఖరి రద్దు చేస్తోంది. ముఖంలో పెద్ద సజాయింపులేని సాదాతనం కనిపిస్తోంది. తలంటి పోసుకున్న జుట్టు జడకట్టులోంచి అలలుగా చెదిరి వుంది. ఇన్నాళ్ళూ శేషు ఆమె యెదిగాక యెలా వుంటుందని వూహించుకున్నాడో ఆ రూపానికీ, యీ రూపానికీ సామ్యం తక్కువే వుంది. కానీ యీమెను ఒక్కసారి చూడటంతోనే వూహల్లోని రూపం చిరునామా లేకుండా చెరిగిపోయింది. అతని ఆశలన్నీ రివ్వుమంటూ యిప్పటి రూపం చుట్టూ వచ్చి ముసురుకున్నాయి.

ఆడవాళ్ళ పరిచయాలయ్యాక మగవాళ్ల పరిచయాలు ప్రారంభమయ్యాయి. శేషు తన వంతు కోసం అసహనంగా యెదురు చూసాడు. మాట్లాడటానికి లేచి నుంచున్నపుడైనా తాను ఆమె కంటపడతాడని ఆశ. వాళ్ళు కూర్చున్న బెంచీలో ముందు భద్రీ వంతు వచ్చింది. అతను తనేం చేస్తున్నాడో చెప్పటం మానేసి, వేదిక నలంకరించిన గురువులకి నవస్కారాలు అంటూ ముందు దణ్ణం పెట్టి, నా మనసులో చాణాల మట్టీ వున్న ఓ సంగతి యీ రోజు యావన్మంది తోటీ చెప్దారనుకుంటున్నా, అని మొదలుపెట్టి, చిన్నపుడు తామందరి మధ్యా వున్న స్నేహపూరితమైన వాతావరణం యిప్పుడు కొన్ని కారణాల వల్ల పలచబడిపోతోందనీ, అవేమిటో అందరి మనస్సాక్షిలకీ తెలుసు కాబట్టి తాను చెప్పననీ, అవన్నీ లేకుండా చిన్నప్పటి లాగే ఒకళతో ఒకళు మంచిగా వుంటే, అంతా కలిసి వూరి బాగు కోసం పన్చేయచ్చనీ, యిలా యేదో మాట్లాడాడు. ఫక్తు పల్లెటూరి యాస మధ్య యెక్కణ్ణించో తెచ్చి అతుకులేసిన మర్యాదపూర్వకమైన పదాలు అతని ప్రసంగాన్ని యెబ్బెట్టుగా ధ్వనించేలా చేశాయి. శేషు యిబ్బందిగా విన్నాడు. అందరూ తప్పనిసరి మర్యాదగా చప్పట్లు కొట్టారు. చివరకు తానేం పని చేస్తున్నాడో చెప్పకుండానే భద్రీ పరిచయం ముగించి కూర్చున్నాడు. తర్వాత శేషు వంతు వచ్చింది. అతను లేచి, గొంతు సాధ్యమైనంత నాజూకుగా మార్చుకుని, మాటలోంచి యాస అరికట్టాలన్న శ్రద్ధలో పడి తెలుగు వాక్యాల్ని ఆంగ్ల వుచ్ఛారణతో పలుకుతూ మాట్లాడాడు. కూర్చున్నాక, కాసేపు ఆమె వైపు చూడకుండా నిగ్రహించుకుని, తర్వాత అలవోకగా చూసినట్టు చూసాడు. ఆమె తల దించుకుని వళ్ళోకి చూస్తోంది.

ఈ పరిచయాల ప్రకరణం పూర్తయ్యాక, అందరూ లేచి బయటకు వచ్చారు. అప్పటికే బాగా ఆలస్యమవటంతో, బయట టెంటు క్రింద వేసిన భోజనాల బల్లల మీద కొందరు విద్యార్థులు చకచకా అరిటాకులు పరుస్తున్నారు. మైదానం వెనుక నుంచి లుంగీలు కట్టుకున్న వంటలవాళ్ళు యిద్దరిద్దరుగా భారీ డేగిసాలని మోసుకు తెస్తున్నారు. వాటిని వసారాలో దించి మూతలు తీయగానే గాల్లోకి కమ్మగా విందు పరిమళం వ్యాపించింది. పొద్దుట్నించీ యీ ముహూర్తం కోసం యిక్కడే తచ్చాడుతున్న వీధి కుక్క, యీ వాసనలకి తనలో జాగృతమవుతున్న జాతి సహజమైన యావని అణచుకుని, మనిషి ఆమోదానికై తనకు అర్థం కాని మర్యాదను పాటిస్తూ, వెన్ను నిటారు చేసుకుని తన వంతు కోసం బుద్దిగా ఓ మూల కూచుంది; తోకని మాత్రం ఆపలేకపోతోంది. విద్యార్థులే పదార్థాల్ని చిన్న పాత్రల్లోకి బదలాయించి వడ్డనకు సిద్ధమయ్యారు. మొదట వుపాధ్యాయుల పంక్తితో భోజనాలు ప్రారంభమయ్యాయి.

శేషు రెండో పంక్తి కోసం ఓ ప్రక్కన నిలబడ్డ స్నేహితుల గుంపులో వున్నాడు. రేణూ వంక ఆదుర్దాగా చూస్తున్నాడు. ఆమె బడి వసారాకి రెండో చివర్న బాలాతో మాట్లాడుతోంది. బాలా భోజనపంక్తి వైపు చేయి చూపించి యేదో అంటున్నాడు. ఆమె బతిమాలుతున్న ముఖం పెట్టి తల అడ్డంగా వూపుతూ యేదో అంది. తర్వాత వెనుదిరిగింది. మైదానం మీదుగా గేటు వైపు నడుస్తోంది. శేషు కంగారుగా, యిటేవస్తున్న బాలాకి యెదురెళ్ళాడు. ఏమైందని అడిగాడు.

వెళిపోతుందటరా, యింట్లో వంటావిడ ఒక్కతే తినలేదంట.

మరిప్పుడెలారా?

వెళ్ళి భోంచేయి ముందు. ఇక రేపు చూద్దాంలే!

నిన్నా, యివాళా తన సహనం పరీక్షించిన నిరీక్షణ మళ్ళీ యిపుడు మరుసటి రోజుకు కూడా కొనసాగితే భరించడం కష్టమనిపించింది. ఇక యేదైతే అదైంది, యివాళే విషయమేంటో తేల్చేసుకోవాలనుకున్నాడు. బాలా వారిస్తున్నా వినకుండా, ఆమెని దార్లో ఆపి మాట్లాడతానని బయల్దేరాడు. బడి గేటు బయటకొచ్చి చూసేసరికే, రేణుకాదేవి అతని పాత యింటి దాకా వెళ్ళిపోయింది. ఇంకొన్ని యిళ్ళు దాటితే రథాన్ని వుంచే కొట్టం వస్తుంది, ఆ తరువాత జనార్దనస్వామి ఆలయం. అక్కడ పెద్దగా యెవరూ మసులుకోరు. పైగా మిట్టమధ్యాహ్నం కాబట్టి మామూలుగానే వూరు భోజనానంతర మగతలో జోగుతూంటుంది. అక్కడ ఆమెని అందిపుచ్చుకోగలిగితే కాసేపు మాట్లాడవచ్చు. నిమ్మళంగా పరుగుపెడుతూనే యివన్నీ ఆలోచించాడు. దహన దాహమేదో అతణ్ణి ముందుకు నెడుతోంది. ఈ యెండలో, ఆ కనకాంబరం రంగు చీరలో, ఆమె నడిచి వెళ్తున్న దీపశిఖలా వుంది.

ఇంతలో అతను అనుకోనిది జరిగింది. పొద్దున్న గేటు మీద వూగుతూ ఆడుకున్న బోసిముడ్డి చంటాడు, ఆమెని యెక్కణ్ణించి చూసాడో, హఠాత్తుగా యింట్లోంచి వీధిలోకి వచ్చి బుడిబుడి అంగల్తో ఆమె వెనుక పరిగెత్తాడు. అలికిడికి ఆమె వెనుదిరగ్గానే, కాళ్ళని చుట్టేసుకున్నాడు. ఆమె వంగి వాడి పిర్రల మీద కొడుతూ యేదో అంటోంది. ఇది చూసి శేషు చటుక్కున పరిగెత్తడం ఆపేసాడు. ఆ చంటాడు ఆ కాస్త పిర్రల వాయింపుతో తన వాటా ప్రేమ తనకి దక్కేసినట్టు ఆమెను వదిలి వెనుదిరిగాడు. టాటా చెపుతూ మళ్ళీ గేటు దగ్గరికి గునగునా నడుస్తున్నాడు. వాడికేసి చెయ్యి వూపుతున్నదల్లా, ఆమె శేషుని చూసింది. ఇక అతనికి తప్పలేదు. పలకరింపుగా నవ్వుతూ చెయ్యి వూపాడు. ముఖం మీద పడుతున్న యెండకి ముకుళించిన ఆమె ముఖంలో నవ్వుజాడ వచ్చిందో లేదో అతనికి తెలియలేదు. పరుగుతెచ్చిన ఆయాసం ఆమెకి కనపడకుండా వూపిరిని నియంత్రించుకుంటూ, దగ్గరకు నడిచాడు. హాయ్ రేణూ! అన్నాడు.

బావున్నావా! నవ్వుతూ అంది. కానీ ఆ నవ్వులో స్నేహం కన్నా మర్యాద కనిపించింది.

అతను తల పంకించాడు. కలిసి నడుద్దామా అన్నట్టు దారి వైపు చేయి చూపించాడు. ఆమె సమ్మతిగా కదిలింది.

సారీ, తాతయ్య చనిపోయినపుడు రాలేకపోయాను, అన్నాడు.

దాందేవుంది, మీ అన్నయ్య వచ్చాడుగా. చెప్పాడు నువ్విక్కడ లేవని. చాలా సాయం చేసాడు. దారి వంక చూస్తూనే మాట్లాడింది.

ఆయన మాకు చేసిందాంతో పోలిస్తే అదేముందిలే. కానీ చాలా బాధేసింది. ఎందుకో ఆ రావిచెట్టులా, ఆ గుడిలా ఆయన కూడా యెల్లకాలం వుండిపోతాడనిపించేది నాకు.

తప్పదుగా, ఆ రావిచెట్టుకైనా, గుడికైనా.

ఆమె చూపిస్తున్న నిర్వికార ధోరణికి అతని అంచనాలన్నీ కకావికలవుతున్నాయి. కానీ అనుకున్న ప్రణాళికని యేది యేమైనా సరే పాటించే సైనికునిలా ముందుకు పోవటానికే నిశ్చయించుకున్నాడు. ఇద్దరూ గుడి ముంగిటకు చేరుకున్నాక ఆగాడు. ఆమె యేమిటన్నట్టు చూసింది. అతను తలెత్తి గుడి సింహద్వారాన్ని చూస్తూ అన్నాడు, యెన్నాళ్లయిందో, ఒకసారి లోపలికెళ్దామా?

దేనికి.

దేనికేంటి రేణూ, పన్నెండేళ్లయింది కలిసి, మాట్లాడుకోవటానికేవీ వుండదా?

కొన్ని సంశయ క్షణాలు గడిచాక, అలా అనేం కాదులే.... పద,” అంటూ నడిచింది.

ఇద్దరూ మెట్ల అరుగెక్కారు. గుడిలో యెవరూ లేరు. గర్భగుడి కటకటాలు మూసి వున్నాయి. ముఖమండపంలో పాత రాతి గచ్చు స్థానే టైల్స్ పరచివున్నాయి. నందీశ్వరుని ప్రక్కన యిదివరకూ లేని పెద్ద హుండీ ఒకటి కనపడుతోంది. ద్వారం దగ్గర పాదరక్షలు విడిచి లోనికి నడిచారు. శేషు మనసులో ప్రణాళిక స్పష్టమవుతూ వస్తోంది. ఆమెను గుడి వెనుక వున్న కోనేటి దగ్గరకు తీసుకువెళ్ళి మాట్లాడితే ప్రభావం బాగుంటుందనిపించింది. అక్కడికి యెందుకని అడిగే అవకాశం ఆమెకు యివ్వకుండా, ఆమె కన్నా ముందు నడుస్తున్నాడు. రాతి గచ్చు మీద కాళ్ళు తిమ్మిరిగా కాల్తున్నాయి. దారిలో దేవగన్నేరు చెట్టుక్రింద కొన్ని పూలు రాలి వుంటే వంగి చేతిలోకి తీసుకున్నాడు. వాటి పసుపుపొట్టల్లోకి ముక్కుపెట్టి వాసన పీలుస్తూ, ఈ పూలు యెక్కడ చూసినా నాకు మనూరే గుర్తొచ్చేది అని ఆగి, సంకోచంగా, నువ్వు కూడా గుర్తొచ్చేదానివి, అంటూ ముగించాడు. వెనక నుంచి యే మాటా వినపడలేదు. ఆమె పట్టీల శబ్ద గతిలో మాత్రం మార్పు లేదు. వెనుదిరిగి ఆమె ముఖంలో స్పందన చూసే ధైర్యం లేకపోయింది. తన చొరవ తిరస్కరింపబడిందన్న అవమానం మనసుపై బరువుగా తిష్టవేయకముందే, ప్రసక్తి మార్చాడు. నిన్నటి వానకి రాలిపోయినట్టున్నాయి అన్నీ, అన్నాడు. ఆమె వూకొట్టింది.

మండపాలన్నీ దాటుకుని కోనేటి దగ్గరకు చేరుకున్నారు. రావిచెట్టు నీడ మెట్ల మీద చల్లగా పడుతోంది. కోనేటి నీలిమలో దూదిపింజె మేఘ మొకటి యీదుతోంది. కోనేటి మధ్యనున్న మండపం చుట్టూ తామరాకులు చెల్లాచెదురై వున్నాయి.

కూర్చుందామా, అంటూ కూర్చున్నాడు.

రేణు కాస్త యెడంగా ఒక శుభ్రమైన మెట్టు చూసుకుని కూర్చుంది.

ఆమె ధోరణి అతనికి యేమీ పాలుపోకుండా చేస్తోంది. తమ మధ్య యీ సన్నివేశాన్ని గురించి యెన్నో కల్పించుకున్నాడు. కానీ ఆ కల్పనలన్నింటికీ దర్శకుడు అతనే; ఈ అసలు సన్నివేశానికి మాత్రం దర్శకుడు దేవుడు. ఇక్కడ తనది నటుని పాత్ర. దర్శకుని నుంచి యే సూచనలూ అందని నటునిలా వుంది ప్రస్తుతం పరిస్థితి.

ఇక్కడకు వస్తుంటావా రేణూ?

ఊ... అపుడపుడూ!

మళ్ళీ కాసేపు మౌనం.

నిన్న వాన చూస్తే యివాళ వాతావరణం యిలా వుంటుందనిపించలేదు. బానే పడుతున్నట్టున్నాయి.

లేదు, నిన్న ఒక్క రోజే.

ఓ గులకరాయి తీసి కోనేట్లో విసిరాడు. ఆ చప్పుడుకి, అప్పటిదాకా అక్కడ వున్నట్టే తెలియని ఓ పావురం, కోనేటి మండపం మీంచి రెక్కలు తపతపలాడిస్తూ  యెగిరిపోయింది.

ఆమె మీద కోపం వస్తోంది. ఎందుకు సాయం చేయదు. పన్నెండేళ్ళ తర్వాత కలసిన వాడు, యేదో మాట్లాడాలంటూ యిలా యేకాంతానికి తీసుకొచ్చిన వాడు, వాతావరణ వివరాల గురించా మాట్లాడాలనుకునేది. అయినా యేం మాట్లాడతాడు. తాను అనుకున్నది నిజంగా మాట్లాడగలడా. అసలు యేమనుకున్నాడు తాను? ఏ అవాస్తవంలో మసలుకున్నాడిన్నాళ్ళూ! ప్రక్కనున్న యీ మనిషి గురించి అసలు తనకేం తెలుసు! ఇపుడామెకు వున్నట్టుండి ప్రేమ ప్రతిపాదన చేయాలా!

తన మొత్తం ప్రయత్నంలోని మౌలికమైన అసంబద్ధత యిలా బయటపడగానే, యీ ప్రయత్నానికి రాసిపెట్టున్న ఫలితం ఖచ్చితంగా వైఫల్యమేనని ఖరారైపోగానే, యెక్కణ్ణించో కొత్త తెగింపూ పుట్టుకువచ్చింది.

నీకొకటి చెప్పాలి రేణూ.

చెప్పు.

అలా అనీ యిలా అనీ చాలా అనుకున్నా గానీ, యేవీ గుర్తు రావటం లేదు. కాబట్టి తిన్నగా చెప్పేస్తున్నాను. నువ్వంటే నాకు యిష్టం రేణూ. అంటే చిన్నప్పటిలాంటి యిష్టం కాదు. ఇన్నేళ్ళలోనీ ఆ యిష్టం ప్రేమగా మారింది, అన్నాడు. పెరిగిన గుండె వేగం యింక మాట్లాడనియ్యలేదు. ఆమె వైపు చూసాడు. ఆమె నుండి యేదో ఒకటి వినకపోతే యిక నిబ్బరం నిలిచేట్టు లేదు. మాట్లాడు రేణూ? అన్నాడు.

ఆమె నవ్వింది. ఏం మాట్లాడాలి?

బావుంది నన్నడుగుతావేంటి.

అలా అని కాదు శేషు. పన్నెండేళ్ళ తర్వాత యీ ఫంక్షన్ పుణ్యమాని కలిసాం. ఒకరి ముఖాలొకరు చూసుకున్నాం. రేపట్నించి యెప్పటిలా యెవరి జీవితాల్లో వాళ్ళం పడిపోతాం. ఇపుడివన్నీ బయట పెట్టుకుని లాభం యేమిటి.

అదేంటి రేణు. ఎలాగూ ఫంక్షన్‌‌కి వచ్చాను కాబట్టి పన్లో పని నీకీ మాట చెప్తున్నా అనుకుంటున్నావా! వచ్చింది నిన్ను కలవాలనే. నీకీ మాట చెప్పాలనే. ఫంక్షనన్నది ఒక సాకు అంతే. ఈ రోజు కోసం యెన్నాళ్ల నుంచి వెయిట్ చేస్తున్నానో నీకు తెలీదు. 

ఇన్నేళ్ళలో యీ ఒక్క సాకే దొరికిందా?

ఈ మాటతో చప్పున యెందుకో ఆమెలో చిన్నప్పటి రేణు కనపడింది. ధీమా కలిగింది. చెప్పానుగా రేణూ, మొదట్లో నాకూ తెలీదు, యిలా అవుతుందని. నా మనసు పూర్తిగా నీకు అంకితమైపోతుందని. మనసులన్నాక మారుతుంటాయిగా!

మరి మనసులు యిక్కడా మారుతుంటాయిగా?

కాదని యెవరన్నారు. అదేగా నేను చెప్పమనేది!

ఇంకా నా మీద యేదో అధికారం వున్నట్టు భలే మాట్లాడుతున్నావు. నిజంగా ఆశ్చర్యంగా వుంది!

మరి నువ్వు యేదీ సూటిగా చెప్పవెందుకు?

సూటిగా లేకపోవడమేవుంది! నేను నా బతుకేదో బతుకుతున్నాను. నువ్వూ చక్కగా వుద్యోగం సంపాయించుకుని నీ బతుకు బతుకుతున్నావు. యిన్నేళ్ళలో నేనెలా మారివుంటానో నీకు తెలియదు. నువ్వెలా మారివుంటావో నాకు తెలియదు. యెవరి జీవితాల్లో వాళ్ళం చక్కా సర్దుకుపోయి వున్నాం. ఇవాళ వున్నట్టుండి వూడిపడి యెందుకిలా చేస్తున్నావో నాకు అర్థం కావటం లేదు.

ఎందుకంటే మనిద్దరికీ రాసిపెట్టివుందని నాకు అర్థమైంది కాబట్టి. నా వరకూ నేను యేవీ మారలేదు. ఎప్పటిలాగానే వున్నాను. నువ్వు మారావేమో మరి నాకు తెలియదు—

మారాను! ఒకప్పుడు నువ్వు జట్టుండకపోతే బెంబేలెత్తిపోయిన అమ్మాయైతే మాత్రం యిపుడు లేదు.

నేనేం ఆమెను ఆశించి రాలేదు.

నువ్వేం ఆశించావన్నది నాకనవసరం. నేను మారానని చెప్తున్నా అంతే.

ఒప్పుకుంటున్నాను రేణూ! ఆ మార్పును అంగీకరించగలను కూడా.

పోనిలే! నువ్వు అంగీకరించకపోతే యెలారా భగవంతుడా అనుకున్నా యిన్నాళ్ళూ!

వెటకారమెందుకులే రేణు!

ఆమె మాట్లాడలేదు.

నువ్వంటే నాకు యిష్టమని చెప్తున్నాను, నేనంటే నీకు యిష్టమా అని అడుగుతున్నాను... చిన్న ప్రశ్న!

చిటికెలో తేలిపోవాలేం!

తొందరేమీ లేదు! ఆలోచించే చెప్పు.

ఆలోచించటానికి యేమీ లేదు.

అయితే చెప్పు.

చెప్పానుగా, యేమీ లేదు.

నేనంటే నీకు యిష్టం లేదా?

లేదు!

అబద్ధం చెప్పకు రేణూ...

ఆమె విసురుగా పైకి లేచి నుంచుంది. నాకొకటి అర్థం కాదు! ఎందుకు యిన్నేళ్ళ తర్వాత కూడా మనం ఓ మూడేళ్ళ పరిచయాన్ని పట్టుకుని తెగ యిదయిపోతున్నాం. మొత్తం జీవితంతో పోలిస్తే మాయదారి మూడేళ్ళు యేం లెక్క. ఎన్నాళ్ళని అక్కడే చిక్కుబడిపోతాం. అక్కడ లేని దేని కోసమో వెతుక్కుంటూ యెన్నాళ్లని అక్కడే వూడిగం చేస్తాం?

ఈ తీవ్రతకి శేషు ఆశ్చర్యపోయాడు. ఆమె మాటల్లో వ్యక్తమైనంత తీవ్రంగా ఆ మూడేళ్ళ ప్రభావం అతనిపై యెపుడూ లేదు. అది స్ఫురించగానే తనకు తాను దోషిలా కనపడ్డాడు. కానీ ఆమె ముఖంపై నిర్వికారపు గోడల్ని బద్దలు కొట్టి, ఆమె లోపలితనాన్ని బయటకు రప్పించగలిగినందుకు సంతోషం కూడా కలిదింది. ఇంకొంచెం కదిలిస్తే చాలనిపించింది. అతనూ లేచి నిల్చున్నాడు. ఆమె దగ్గరకెళ్ళి క్రింద మెట్టు మీద నిలబడ్డాడు. అవున్నిజమే, మొత్తం జీవితంతో పోలిస్తే మూడేళ్ళు చాలా చిన్నవే. కానీ ఆ మూడేళ్ళతో పోలిస్తే మనం గొడవపడ్డ మూణ్ణెల్లు యింకెంత చిన్నవో ఆలోచించు. అపుడు చిన్నవాళ్లం రేణూ! ఇంకా ఆ గొడవే పట్టుకునే వేలాడుతున్నామంటే ఆశ్చర్యంగా వుంది!

ఇప్పుడు మనం పెద్దవాళ్ళమైనంత మాత్రాన చిన్నప్పుడు జరిగిన విషయాలన్నీ చిన్నవైపోవు.

బుద్ది గడ్డితిని ఒక ముద్దు పెట్టుకున్నదానికి నేనేదో హత్య చేసినట్టు మాట్లాడుతున్నావు రేణూ నువ్వు!

అది నాకసలో విషయమే కాదు.

మరి? సరే, తర్వాత సారీ చెప్పి మాట్లాడకపోవడం నా తప్పే. కానీ నా కారణాలు నాకున్నాయి. ఏమో! అప్పట్లో నువ్వు మారిపోయావు. నాతో అదివరకట్లా వుండటం మానేసావు. నీకు నీ ఫ్రెండ్సొచ్చారు. నీకో లోకం వచ్చింది. అందులో నాకెక్కడా చోటు కనపళ్ళేదు. బహుశా ఆ ఇన్‌సెక్యూరిటీ—

ఇక నువ్వు చెప్పదలుచుకుంది అయిపోతే వెళ్తాను శేషు. నాకవతల పన్లున్నాయి,” అందామె హఠాత్తుగా. ఆమె ముఖం చుట్టూ మళ్ళీ గోడలు మొలిచేసాయి.

నేను చెప్తున్న విషయం కన్నా యింటికెళ్ళి తినటం ముఖ్యమన్నమాట నీకు!

ఆమె గిరుక్కున వెనుదిరగబోయింది.

అతను చేయి పట్టుకున్నాడు.

ఆగింది.

మాట్లాడుతుంటే వెళిపోతావేంటి రేణు?

చేయి వదులు శేషు!

వదిలేసాడు.

అతని వైపు తిరిగి చేతులు కట్టుకు నిలబడింది. అతని భుజం మీంచి కోనేటి లోకి చూస్తోంది.

అదే గోడల ముఖం! ఏదోటి చేసి వాటిని బద్దలుగొట్టి లోపలికి చొరబడాలనిపించింది, నాకిప్పుడేవనిపిస్తుందో తెలుసా?

అతని వైపు చూసింది.

ఇవాళ మన బళ్ళో అందర్నీ చూసాను కదా. ఎవడూ చిన్నప్పటిలా లేడు. మన చిన్నప్పుడు స్నేహానికి స్నేహమే కారణమై వుండేది. కాని ఇపుడలా కాదు. కులమో, డబ్బో, యింకోటో యింకోటో! బహుశా మన మధ్యనున్నదీ అందుకు మినహాయింపు కాదేమో. అలాంటి కారణాలేవన్నా వుంటే చెప్పేయి రేణూ. అంతేగానీ నేనేదో తిరిగి సరిదిద్దుకోలేనంత తప్పు చేసానని మాత్రం చెప్పకు.

అపనమ్మకంగా తలూపుతూ జీవం లేని నవ్వొకటి నవ్వింది. నీకు బుర్ర పన్చేయటం లేదు శేషు,” అంటూ మళ్ళా వెనుదిరింది.

అతను చేయి పట్టుకున్నాడు.

ఆమె పట్టు విడిపించుకోబోతూ, అదే చేత్తో చప్పున అతని చెంప మీద కొట్టింది.

చెంప మీద గాజు పగిలి చురుక్కుమంది. పైగా అతను క్రింద మెట్టు మీద వుండటం మూలాన, దెబ్బ విసురు యెంత నొప్పెట్టిందంటే, ఆమెను తిరిగి కొట్టాలన్న అసంకల్పిత ప్రతీకారచర్యని నిగ్రహించుకోవటానికి పిచ్చిదానా! అని తిట్టాడు; యెందుకు నీకంత చేయి దురుసు? అన్నాడు.

అవును, పిచ్చిదాన్నే! ఆమె గొంతు వురిమింది; అవును, నాకే తెలియదు అవతలివాళ్ళ మనసులు యెలా ఆలోచిస్తాయో. ఇందాక యేంటన్నావు? అప్పుడు నాకు వేరే ఫ్రెండ్స్ దొరికారు, వేరే లోకం వచ్చింది, నిన్ను పక్కన పెట్టేసానని కదూ. నా వెనకాల నువ్వున్నావన్న నమ్మకంతోనే అలా మారగలిగానేమో, ఆ ధైర్యంతోంనే బయటికి వెళ్ళగలిగానేమో?! ఆ సంగతి యెపుడూ తట్టలేదా మన గొప్ప బుర్రకి! ఇందాకణ్ణించీ చాలా మాట్లాడుతున్నావు. ఇష్టపడ్డానూ, యెదురు చూసానూ అంటూ. కాని నీకు యిష్టపడటమంటే యేవిటో తెలీదు, యెదురుచూడటమంటే యేవిటో తెలీదు. వాటి గురించి యెవరి దగ్గర మాట్లాడినా చెల్లుతుందేమో, నా దగ్గర మాట్లాడమాక! చూపుడు వేలితో తనని తాను చూపించుకుంటూ యీ మాటలు పూర్తి చేసింది. గిరుక్కున వెనుదిరిగింది. ఆమె జడ వడిసెల తిరిగినట్టు గాల్లో తిరిగి నడుం చుట్టూ చుట్టుకుంది. రావి ఆకుల నీడలు జారిపోగానే ఆమె చీర మీద యెండ పడి భగ్గున వెలిగింది. మండపాల మధ్య నుంచి విసవిసా నడిచి వెళిపోయింది.

ఆమె మండపం వెనుక అదృశ్యమయ్యే దాకా అటే చూస్తుండిపోయాడు. చెంప మీద గాజు గాయాన్ని తడుముకుంటూ మెట్ల మీద కూర్చుండిపోయాడు. మొత్తం సంఘటనని నెమరువేసుకున్నాడు. ఆమె చివరి మాటల్ని పదే పదే పునరావృతం చేసుకున్నాడు. గుండెల్నిండా గాలి తీసుకుని నిట్టూర్చాడు. ఇందాకటి దూదిపింజె మేఘం కోనేటి అవతలి ఒడ్డు దాకా యీదేసింది. ప్రక్కన పడివున్న దేవగన్నేరు పూవొకదాన్ని చేతిలోకి తీసుకున్నాడు. దాని తొడిమ పట్టుకు బొంగరంలాగా తిప్పి నీట్లోకి వదిలాడు. కోనేరు తరంగాలుగా నవ్వింది.

*     *     *
బాలా బడి నుండి గుడి వైపు నడుస్తున్నాడు. నిన్న శేషు కొత్త కథ సూచించినప్పటి నుంచీ అది అతనిలో శాఖోపశాఖలుగా పెరుగుతోంది. ఇంకా ఒక్క వాక్యమూ కాగితం మీద పెట్టకుండానే అతణ్ణి ఆక్రమించుకుంది. లెక్కలేనన్ని దృశ్యాలూ, సన్నివేశాలూ, ఆలోచనలూ కథలో తమ చోటు కోసం అతని మస్తిష్క ద్వారం దగ్గర రద్దీగా తోసుకుంటున్నాయి. ఇదివరకట్లా యీ కథ తన అనుభవాలకే పరిమితం కాదు. అహపు చెరసాలలోంచి విడుదలవుతాడు. చుట్టూ విస్తరిస్తాడు. పర మానస చైతన్యాల్లోకి అక్షరాల ద్వారా ప్రవేశిస్తాడు. శేషూ, రేణూ, భద్రీనే కాదు; మొత్తం శ్రీపాదపట్నం చైతన్యాన్నే తనలో ఆవహింపజేసుకుంటాడు. నిన్న రాత్రి యీ ఆలోచనలతో అతనికి చాలా సేపు నిద్ర పట్టలేదు. కథ యెక్కడ మొదలుపెట్టాలో నిర్ణయించుకున్నాడు. ఎలా నడపాలో ఖాయపరుచుకున్నాడు. ఇక ముగింపు ఒక్కటే మిగిలింది. అది యేమై వుంటుందోనన్న ఆలోచన అతణ్ణి నిలవనీయటం లేదు. అందుకే శేషు వచ్చేదాకా ఆగలేకపోయాడు. ఒకప్రక్క బడిలో వేడుక యింకా జరుగుతుండగానే మధ్యలో బయల్దేరి వచ్చేసాడు.

వీధిలోకి వచ్చేసరికి రేణూ దూరంగా గుడిలోంచి బయటకు వెళ్తూ కనిపించింది. రాజుగారి మేడ వైపు విసురుగా నడిచి వెళ్తోంది. వెనక్కి తిరిగి చూస్తుందనుకున్నాడు. చూడలేదు.

గుడి దగ్గరకు చేరుకునేసరికి శేషు అప్పుడే ద్వారం దగ్గర పాదరక్షలు తొడుక్కుంటున్నాడు. బాలాకి విషయం అర్థం కాలేదు.ఏరా, ఏమైంది? ఆ రక్తవేంటి? అని అడిగాడు.

శేషు చెంప తుడుచుకుంటూ, రేణూ వెళ్ళిన వైపు ఖాళీ వీధిని చూస్తూ, మెట్లు దిగాడు. బాలా భుజం మీద చేయి వేసి వచ్చిన దారినే నడిపించాడు.

ఇక కుతూహలాన్ని అణచుకోవటం బాలాకి సాధ్యం కాలేదు, ఏమైందిరా! ముగింపేమిటి కథకి; పుల్‌స్టాపా, కామానా?

ఏవైందో తర్వాత చెప్తా గానీఒరే నువ్వు గనక మా కథ రాస్తే దాన్ని చివర పుల్‌స్టాపుతోనూ ముగించొద్దు, కామాతోనూ ముగించొద్దు. ఏవీ తేల్చని వాక్యాల్ని మూడు చుక్కలు పెట్టి ఆపేస్తారే, ఏవంటారు దాన్ని?

ఎలిప్సిస్?

ఆ అదే, దాంతో ముగించేయి.

బాలాకి యేం జరిగివుంటుందో అర్థం కాలేదు.

కానీ శేషు ముఖకవళిక చెప్పకనే చెపుతోంది...

—— ♦ ——

3 comments:

  1. కథ ముగించడంలో రచయితగా మీ నేర్పంతా ఉట్టి పడుతోంది. ఈ భాగంతో, గత పది రోజులుగా సాగుతున్న మా నిరీక్షణకీ, పన్నెండేళ్ళ వాళ్ళ నిరీక్షణకి చాలా చక్కటి ముగింపునిచ్చారు. ఒక్క నిన్నటి భాగమే కాస్త నిరాశ కలిగించింది -అది కూడా బహుశా రేణూ ని ఇంకా కలవని నిస్పృహలో తలెత్తిన అసహనం వలనే అయి ఉండవచ్చు. నిజానికి నిన్న కాస్త భయం కూడా వేసింది, "రంగు వెలిసిన.." కథలోలా, ఇక్కడా ఏమైనా విషాదం తొంగి చూస్తుందేమోనని.
    ఇన్ని రోజులూ పట్టు చెడకుండా అద్భుతంగా కథను నడిపించినందుకూ, అలతి పదాలతో - కొత్త దారిలో ప్రేమ భావాలని సుస్పష్టంగా పలికించినందుకూ, హృదయపూర్వక అభినందనలతో..

    ReplyDelete
  2. "మలుపు తిరగటానికి కరెక్ట్ ప్లేస్..Dead End..'అంతే అయిపోయింది ఇంకేమీ లేదు' అనుకున్నచోట ఆగిపోకు. ప్రక్కకి తిరుగు. మరోదారి కనపడుతుంది"... కథ కి చక్కటీ ముగింపునిచ్చారు, అద్భుతంగా కథను నడిపించినందుకూ హృదయపూర్వక అభినందనలతో..శివ

    ReplyDelete
  3. ఇంత మంచి కధని ఇంత ఆలస్యంగా చదివానన్న భాధ :-( చాలా బాగారాసారండి. కధ ముగింపు ఇంకా బాగుంది!

    ReplyDelete