నలుగురూ నవ్వేచోట గుర్తు రాకూడని మనిషి. పేరెందుకు గానీ, టైపిస్టు కాబట్టి అలాగే పిలుస్తాను. వాడు రాకముందూ టైప్ మిషను ఉండేది గానీ, ముసుగేసుకుని ఓ టేబిలు మీద అలా పడుండేది. హెడ్ గుమాస్తాగారికి ఎపుడన్నా నడుం లాగినపుడు కుర్చీ లోంచి లేచి అటూయిటూ పచార్లు చేస్తూ ఆ టేబిలు మీద కూర్చుని మాతో కబుర్లు చెప్పేవారు. ఆయన మనవళ్లు ఎపుడన్నా ఆదివారం సరదాగా ఆఫీసుకి వచ్చినపుడు ఆ మిషను మీద కవరు తీసి పేపరెక్కించి ఆడుకునేవారు. లేకపోతే దాని జోలికే ఎవరూ పోయేవాళ్ళు కాదు.
ఒక రోజు ఉన్నట్టుండి పై నుంచి నోటీసు--ప్రతి డిపార్టుమెంటుకీ టైపిస్టుల్ని ఇస్తున్నామని. మేవేం అడగలేదు కదా మాకెందుకని హెడ్ గుమాస్తాగారూ, సీనియరసిస్టెంటుగారూ పైవాళ్ళ దగ్గరకెళ్ళి మరీ చెప్పారు. మాటొచ్చింది కదాని చెప్తున్నాను. అసలు మాకు టైపిస్టు అవసరమే లేదు. నా దస్తూరీ ముత్యాల కోవలా ఉంటుందని అంటారు మావాళ్ళంతా. పైగా చాలా వేగంగా కూడా రాస్తాన్నేను. అక్షరదోషాలూ, గ్రామరు మిస్టేకులూ అస్సలుండవు. ఎపుడో నేను చేరకముందు ఒక ముసలాయన ఉండేవాడట టైపిస్టుగా. వాళ్ళావిడకి పాపం అనారోగ్యమైతే వాలంట్రీ రిటైర్మెంటు పెట్టుకునెళ్ళిపోయాడు. అప్పట్నించీ, ఫాను చప్పుడుకే రీసౌండొచ్చే మా పెద్ద హాల్లో ఆ దరిద్రపు టైపు మిషను మోత తప్పిందని మా సర్వేయరుగారంటూ ఉంటారు. ఎపుడో తప్పితే ఆఫీసులో ఉండని ఆయనే అలాగంటే మరి మిగతావాళ్ళ బాధ! అందుకే పైకెళ్ళి మరీ టైపిస్టు అవసరం లేదని చెప్పుకున్నారు. కానీ అందరికీ ఓ రూలూ మీకో రూలూ కుదరదన్నారంట పై వాళ్లు. ఆ తర్వాత రెండ్రోజులకే దిగబడ్డాడు... కొత్త టైపిస్టు.
నేను ఉత్తపుణ్యానికి ఒకళ్ళ గురించి పొల్లుమాటనే మనిషిని కాదు. అందరితో మంచిగా ఉంటాను. తోటి మనుషుల్నీ, చేసే పనినీ ప్రేమిస్తాను. మనసులో ఒకటుంచుకుని, బైటకొకలా మాట్లాట్టం తెలీదు. నేననే కాదు, మా ఐదుగురమూ అంతే. హెడ్ గుమాస్తాగారు అప్పుడపుడూ చిరాకొచ్చినపుడు అరిచినా, దాని వెనక పనవటం లేదన్న బాధా, మళ్ళీ అందుమూలాన మేమేవన్నా పైవాళ్ళ నుంచి మాట పడాల్సి వస్తుందేమోనన్న అక్కరా తప్పిస్తే ఇంకేం ఉండదు--ఇంట్లో పిల్లల్ని గదమాయించినట్టే. ఇక సీనియరసిస్టెంటుగారైతే చెప్పనే అక్కర్లేదు. మంచి సరదా మనిషి. ఒట్టి గళ్ళచొక్కాల్లోనే ఇన్ని రంగులూ రకాలూ మార్చొచ్చా అనిపిస్తుంది ఆయన డ్రస్సింగదీ చూస్తే. వాచీ చైను లూజుగా మణికట్టు మీద ఆడించుకుంటా ఆయన మాకు తెలిసిన సంగతుల్నే మళ్ళా జోకుల్లా చెప్పి నవ్విస్తాడు. ఇంక సర్వేయరుగారు వయసుకు తగ్గట్టే కాస్త గంభీరంగా అంటీముట్టనట్టు ఉంటారు. దగ్గరకొచ్చి మెల్లిగా మాట్లాడతారు. కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయంటారు కాబట్టి ఉద్యోగం చేస్తున్నాడు కానీ ఆయనకా అవసరమే లేదు. నాలుగోవాడు మణి. వాడ్ని మేవెవరం అటెండరు లాగా చూడం. బతికి చెడిన కుటుంబం నుంచొచ్చి ఈ ఉద్యోగం చేస్తున్నాడు. కాస్త పుష్టిగా వయసుకు మించి కనిపిస్తాడు కానీ ఇంకా కుర్రాడే, గెడ్డం ఓ పదిసార్లయినా గీసుండడు. వాడూ సీనియరసిస్టెంటుగారూ కూర్చుని కత్తు కలిపారంటే ఇంక మేం పని పక్కనపెట్టి నవ్వుకుంటా కూచోవాల్సిందే.
మణి వరండాలో కూర్చుంటే ఊసుపోటం లేదని హెడ్ గుమాస్తాగారు నా పక్కనే ఓ బల్ల వేయించారు. కానీ వాడందులో కుదురుగా ఓ నిమిషం ఎపుడైనా కూర్చుంటేనా. మొత్తం అన్ని డిపార్టుమెంట్లూ వాడివే అన్నట్టు తిరుగుతాడు. ఎక్కడెక్కడి వార్తలూ మోసుకొస్తాడు. సర్క్యులర్లూ, నోటీసులూ పైన టైపింగ్ అవుతుండగానే మాకిక్కడ తెలిసిపోతుంటాయి. వాడి అల్లరి వెనక ఉన్న మరో మనిషి మాత్రం నాకే తెలుసు. వాడి లక్ష్యాలు, బాధ్యతలూ, కష్టాలూ... అన్నీ. ఎన్నో రాత్రుళ్ళు వాడు జీవితంలో పైకి రావటానికి ఏం చేయాలనుకుంటున్నాడో కళ్ళక్కట్టినట్టు చెప్తుంటే నేను అవన్నీ నా జీవితానికి సంబంధమున్నాయే అన్నట్టు విన్నాను.
ఇక నా గురించి పెద్దేంలేదు చెప్పుకోవటానికి. పెళ్ళయిన బ్రహ్మచారిని. ఆ మనిషి వెళ్ళిపోయిందన్న బాధేం లేదు. పనిని ప్రేమిస్తాను. మాట తెచ్చుకోను. సాయంత్రాలు పార్కులో నడవటం, కలం స్నేహితులు కొంతమందికి ఉత్తరాలు రాసుకోవటం, లేదంటే లైబ్రరీ నుంచి పుస్తకాలు తెచ్చుకుని చదువుకోవటం, రేడియోలో పాటలు వింటూ పడుకోవటం. ప్రతీదీ ఏ మోతాదులో ఉండాలో ఆ మోతాదులో ఉంది.
* * *
మనుషుల్ని వాళ్ళ రూపం బట్టి అంచనా వేయటం తప్పని నాకు తెలుసు. కానీ నేను గమనించిందేమిటంటే- ఒక మనిషి మనసు అష్టవంకర్లుగా ఉన్నప్పుడు ఆ ప్రభావం నెమ్మదిగా ఆ మనిషి రూపం మీద కూడా పడుతుంది. అందుకే మొదటిసారి చూసినప్పుడే కొత్త టైపిస్టు తేడా కొట్టేడు. చూట్టానికి మనిషి ఎత్తుగా, బలంగానే ఉంటాడు. తన ఎత్తుకి సిగ్గుపడుతున్నట్టు కొద్దిగా ఒంగి నడుస్తూంటాడు. నల్లటి ముఖం కాస్త పెద్దది కావటంతో కళ్ళూ ముక్కూ నోరూ అన్నీ ఖాళీగా సర్దినట్టుంటాయి. బుగ్గల మీద మొటిమల మచ్చలు గుంటలుపడి ఉంటాయి. ఎదర కొంత జుట్టూడిపోయి, నుదుటి మీద నరాలు వానపాముల్లా కదులుతుంటాయి. వేసుకునే బట్టల్లో ఎప్పుడూ ఓ రంగూపాడూ ఉండదు. ఒక చొక్కా వేలాడేసుకుని చేతుల దగ్గర పైకి మడతపెట్టుకుంటాడు. ఎత్తువల్ల పాంటుకి కిందెప్పుడూ చీలమండలు కనిపిస్తుంటాయి. ఇంత వర్ణించినా ఆ మనిషిలో నాకు తేడా కొట్టిందేమిటో చెప్పలేకపోతున్నాను. అతని ఫోటో తీసి చూపించినా అర్థంగాకపోవచ్చు. అతను మసలుకునే తీరులోనే ఆ అందవికారం ఉందేమో. ఎపుడూ ఏదో తడబాటుగా సంకోచంగా ఉంటాడు. కళ్ళల్లో కళ్ళుపెట్టి తిన్నగా చూడలేడు. అన్నీ పక్కచూపులు, దొంగచూపులు. చేరినకొత్తలోవుండే కంగారేమో అనుకున్నాం మొదట్లో. అలవాటయ్యాకా మాలో కలిసిపోతాళ్ళే అనుకున్నాం. కానీ ఆర్నెల్లయినా అదే తీరు. హెడ్ గుమాస్తాగారికి తన ధోరణేదో తనది. పనిచేస్తే చాలు ఎవరెలా ఉన్నా పట్టించుకోరు. సీనియరసిస్టెంటు మాత్రం మొదట్లో అతని దగ్గరకు వెళ్ళి సరదాగా పలకరించేవారు. అలాంటప్పుడు అతను ప్రవర్తించే తీరు తేడాగా ఉండేది. ముఖమంతా తెచ్చిపెట్టుకున్న నవ్వుతో ఎంతో ఒదిగున్నట్టు సమాధానాలిచ్చేవాడు. అన్నీ ముక్తసరిగానే ఉండేవి. సీనియరసిస్టెంటు చూసిచూసి పట్టించుకోవటం మానేశారు. మొదట్లో లంచ్‌కి వెళ్ళేటప్పుడు రమ్మంటే మాతోపాటు వచ్చేవాడు. మా వరసలో ఎప్పుడూ చివర్న కూర్చునేవాడు. కలిపించుకుని మాట్లాడేవాడు కాదు. మేం ఏదన్నా కదిపితే మాత్రం ముఖమంతా ఎంతో ఇదిగా మార్చేసుకుని సమాధానం చెప్పేవాడు. అదంతా నటన అని తెలిసిపోయేది. మేం మాట్లాడే మాటల్లో అతనికేం ఇంట్రస్టు లేదని తొందర్లోనే అర్థమైపోయింది. ఎపుడో అరుదుగా అతనే కలగజేసుకుని ఓ మాట అన్నా, అది కూడా ఇంట్రస్టుండి కాదని, తన వంతుగా ఏదోటి మాట్లాడాల్సిన బరువు ఫీలయి మాట్లాడుతున్నాడని మాకనిపించేది. దాంతో పక్కనే కూర్చున్నా పట్టించుకోవటం మానేశాం. అంత పొడవైన చేతులు ఎబ్బెట్టుగా ఊపుకుంటూ మా వెనక నడుస్తుంటే మోయలేని తోకలా అనిపించేవాడు. తర్వాత్తర్వాత మెల్లిగా తనే మాతో భోజనానికి రావటం మానేశాడు.
కానీ అంత పెద్ద హాల్లో ఆ మూల అతని జాడ మరీ పట్టించుకోకుండా ఉండలేం కదా; పైగా ఆ టైప్ మిషను చప్పుడోటి. అసలు అతను మాట్లాడకపోవటాన్ని ఆ టైపు టకటకల్తో భర్తీ చేసుకుంటున్నాడేమో అనిపించేది. ఒక్కోసారి మా నుంచి తనని వేరు చేసుకోవటానికి ఆ టైపు చప్పుడుని ఒక గోడలా వాడుతున్నాడేమో అనీ అనిపించేది. మా సీనియరసిస్టెంటుగారు ఏదో జోకేసినపుడో, మా మణి ఏదన్నా ఊళ్ళో విషయం మాట్లాడుతున్నప్పుడో, ఇలా మేం ఐదుగురం ఒక కుటుంబంలా సందడిగా ఉన్నప్పుడల్లా, మాలో కలవాల్సిన అవసరాన్నించి తప్పించుకోవటానికన్నట్టు ఆ టైపు మిషను మామూలుకన్నా జోరుగా టకటకలాడేది, మిషను కేరేజీ డుర్రున వెనక్కి మళ్ళేది. ఎపుడో ఒకసారి ఏదో తప్పనిసరి అవసరం వచ్చి మా టేబిళ్ళ దగ్గరకొచ్చి నిలబడి గొణిగేవాడు. రెట్టిస్తే తప్ప ఏమంటున్నాడో అర్థమయేది కాదు. చెప్పాపోటమే... అప్పుడప్పుడూ అతని మీద జాలేసిన సందర్భాలున్నాయి. సీనియరసిస్టెంటుగారు అతను చేతులు వేలాడేసుకుంటూ నడిచే తీరు చూసి ఒరాంగుటాన్ అని పేరు పెట్టారు. ఒకసారి అతను లేనప్పుడు గుప్పిళ్ళు వదులుగా మూసి అతన్లాగ నడిచి కూడా చూపెట్టారు. అప్పుడు నవ్వొచ్చింది గానీ తర్వాత జాలేసింది. మణి కూడా లోకువ కట్టేసాడు. ఒకసారి టైపిస్టు రికార్డు రూమ్‌లోంచి ఏదో ఫైలడిగితే, ''తీసుకోండి సార్, ఆ దుమ్ములోకి వెళ్ళటం నా వల్ల కాదు,'' అనేసి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి మణి నా గదికి వచ్చినపుడు వాడి కోసం ఆమ్లెట్టదీ వేస్తూ, ''జీవితంలో ఏం దెబ్బలు తిన్నాడో మనకేం తెలుసురా!'' అని నచ్చచెప్పాను. ''నువ్వో అమాయకుడివి, పైకి అలా కనపడేవోళ్ళు చాలా డేంజరు,'' అన్నాడు. వాడన్నది నిజమే, నేను ఊరికే అందర్నీ నమ్మేస్తాను.
మనుషులెపుడూ చలాకిగా, కలుపుగోలుగా ఉండాలని నేను అనుకుంటాను. భూమ్మీద పుట్టి పోయేలోగా పదిమందినీ కలేసుకోవాలి, మన పాడె లేచినపుడు అందరూ కన్నీటితో సాగనంపాలి. ఎందుకెపుడూ ఏదో కోల్పోయినట్టుండాలీ? ఓ చిరునవ్వుతో, ఓ ఆప్యాయమైన పలకరింపుతో గెలవలేందెవర్నీ? అదీ నా పద్ధతి. నలుగురూ ఒకలా ఉన్న చోట, ఒకడు ఎడంగా నన్నంటుకోకు నామాలకాకీ అన్నట్టుంటే బాగోదు, నిజమే. అయితే అతనికేం కష్టాలున్నాయో అనుకుని ఉండిపోయాను. సర్వేయరుగారంటే అసలిలాంటియ్యి పట్టించుకోడు. హెడ్ గుమాస్తాగారూ పెద్ద పట్టించుకునే మనిషేం కాదు గానీ, ఆ మధ్యోసారి ఆయనకీ ఒళ్ళుమండింది. ఆదివారాలెపుడైనా పనుండి ఆఫీసుకి రావాల్సొస్తే సరదాగా మనవళ్ళిద్దర్నీ వెంటబెట్టకుని రావటం ఆయనకలవాటు. ఒకరోజు ఆళ్ళ పెద్దమనవడు టైపు మిషనుతో ఆడుకుంటుంటే, అపుడే లోపలికొచ్చిన టైపిస్ట్ ''ఒయ్యోయ్!'' అంటూ గదమాయించేడు. నేను అప్పటికీ ''మన సార్ మనవడండీ,'' అన్నాను కూడా. ''రిబ్బను ఊడొచ్చేసిందండీ,'' అంటూ దాన్ని పైకెత్తి చూపించేడు. హెడ్ గుమాస్తాగారు అప్పటికైతే ఏమనలేదు. ఫైల్లో తల దూరుస్తూ ''పెట్టుకోవచ్చు లేవయ్యా మాయదారి రిబ్బను,'' అని ఊరుకున్నారు. తర్వాత ఓ రెండ్రోజులకి టైపిస్టు కొట్టిన లెటర్లో గ్రామరు మిస్టేకులతో సహా రెడ్డింకుతో నోట్ చేసేరు. దగ్గరికి పిలిచి కడిగిపారేసారు. ఆయనకి కోపమొస్తే వీరభద్రుడే! కాయితాలు ఇలాగ మొహం మీదకు ఇసిరికొట్టేశారు. మరెందుకు దూల నోరు కాకపోతే. కిందపడిన పేపర్లన్నీ ఏరుకుని వెళ్ళి సీట్లో కూర్చున్నాడు.
ఆ రోజు సాయంత్రం ఇంటికెళ్ళిపోతున్నప్పుడు ఆఫీసు బైట రావిచెట్ల కిందున్న చప్టా మీద ఒక్కడే కూర్చుని సిగరెట్టు కాలుస్తూ కనపడ్డాడు. నేను దగ్గరికెళ్ళి కాసేపు ఈ మాటా ఆ మాటా మాట్లాడి తిన్నగా అడిగేసాను-
''అసలేంటి మీ ప్రాబ్లెం? ఏమన్నా కుటుంబ సమస్యలా?''
అతను అర్థం కానట్టు ముఖం పెట్టి ''నా ప్రాబ్లెం ఏముంది సార్?'' అన్నాడు.
''కాదూ, ఎందుకలా డల్లుగా ఉంటారూ. హేపీగా నవ్వుతా ఉండాలండీ. కష్టాలెవరికి లేవు మన ఆఫీసులో... మన మణిగాడు మనసులో ఎన్నెన్ని బరువులు మోస్తా ఎంత సరదాగా ఉంటాడో చూడండి. బీ పాజిటివ్ అండీ!'' అన్నాను.
వంకర నవ్వు నవ్వి ''నాకు కష్టాలేవీ లేవండీ,'' అన్నాడు.
''మరెందుకలా ఎపుడూ ఏదో కోల్పోయినట్టుంటారు? ఇక్కడంతా మనవాళ్ళేనండీ. హెడ్ గుమాస్తాగారి మాట కొద్దిగా కటువనేగానీ, మళ్ళీ కష్టం వస్తే మాత్రం ఫస్టు మన పక్కనుండేది ఆయనే,'' అన్నాను మంచిగా.
''ఏవండీ, ఆయన అనే పొజిషన్లో ఉన్నాడు, నేను పడే పొజిషన్లో ఉన్నాను. నాకీ ఉద్యోగం అవసరం. ఇది పర్మినెంటు అయ్యేదాకా ఏ ఆఫీసు కాకి నా మీద రెట్టేసినా తుడుచుకుని పోతాను,'' అన్నాడు.
అలా మాట్లాడేసరికి నాకు చాలా బాధేసింది. హెడ్ గుమాస్తాగారి గురించి ఆయన వెనకాల కూడా ఎప్పుడూ ఓ పొల్లుమాట అనుకుని ఎరగం మేము. మనిషి అలాంటోడు.
''మీ మెంటాల్టీ మార్చుకోకపోతే మాత్రం కష్టమండీ,'' అని చెప్పి వచ్చేశాను.
అప్పట్నుంచీ నాకు అతని మీద జాలి కూడా పోయింది. ఎపుడన్నా ఏదో స్టేషనరీ కోసం నా టేబిల్ దగ్గరకొచ్చి గొణిగినా లేవనో, ఉన్నా కూడా నాకు కావాలనో చెప్పేసేవాడ్ని. ఒకసారి అలానే అంటే, ''ఏం సార్ అన్ని పిన్నులూ వాడేస్తారా మరీని,'' అని గొణిగేడు. ''వాడతావాఁ లేదా అన్నది కాదు సార్, నాకని ఇచ్చినవి నేను ఓ లెక్కలో ఖర్చు పెట్టుకుంటాను. ఆ లెక్క తప్పటం నాకు ఇష్టం లేదు,'' అని నిక్కచ్చిగా చెప్పేశాను. అసలతని జోలికేరాని హెడ్ గుమాస్తాగారి గురించే మనసులో అలా అనుకున్నాడంటే, మన గురించి లోపల్లోపల ఏమనుకుంటున్నాడో ఆ మాత్రం ఊహించలేమా!
అంతా సఖ్యంగా మంచితనంతో మసలే చోట ఒకడు మనసు నిండా ఇలాగ విషం నింపుకున్నాడని తెలిస్తే ఎలా ఉంటుంది. ఒక్కోసారి అతని లోపల కుళ్ళు బాగా బైటపడిపోయేది. మా హెడ్ గుమాస్తాగారి యాభయ్యో పుట్టిన రోజప్పుడు జరిగిన సంగతి బా గుర్తు. మాకు ప్రతి ఏటా ఆయన పుట్టిన్రోజంటే పండగతో సమానం. పైగా అది యాభయ్యో పుట్టిన్రోజు. అంతకుముందు రోజు రాత్రే సీనియరసిస్టెంటుగారూ, మణీ బండి మీద టౌన్ కెళ్ళి పెద్ద కేకు తెప్పించి సర్వేయరుగారింట్లో ఫ్రిజ్ ఉంటే అందులో పెట్టివుంచారు. నేనూ, మణీ తెల్లారే ఆఫీసుకొచ్చేసి హాలంతా అందంగా రంగు కాయితాలయ్యీ అతికించాం. హెడ్ గుమాస్తాగారొచ్చేసరికి అంతా సిద్ధం చేసుంచాం. ఆయన కేకు కోస్తూండగా, మేం అంతా చుట్టూ నిలబడి బర్త్ డే సాంగ్ పాడుతుంటే వచ్చాడు టైపిస్టు. కాసేపు ఏం అర్థంకానట్టు చూస్తూ నిలబడిపోతే సీనియరసిస్టెంటుగారు ''రండ్రండి,'' అని పిలిచారు. మా మధ్యకు వచ్చి మాతోపాటు చప్పట్లుకొట్టాడు మొక్కుబడిగా, పాటకి నోరు కూడా కదపలేదు. అదే నాకర్థం కాంది! ఏదన్నా అందరూ కలిసికట్టుగా ఓ పని చేస్తున్నప్పుడు అందులో వచ్చి కలిసిపోకుండా పక్కగా నిలబడి ప్రేక్షకుడిలా చూస్తుంటే ఎలా ఉంటాది మిగతావాళ్ళకి, అక్కడికేదో మేమంతా వెర్రోళ్లవన్నట్టు. ప్రతీ ఏటా పుట్టిన రోజుకి హెడ్ గుమాస్తాగారు స్వయంగా ఆయన చేతుల్తో కేకు ముక్కల్ని తినిపించడమూ, మేవందరం--సర్వేయరుగారంటే పెద్దాయన కాబట్టి ఆయన తప్ప మిగతా అందరం--వందనంగా ఆయన పాదాలు తాకి ఆశీర్వాదం తీసుకోవటమూ ఓ ఆనవాయితీగా అలా సాగుతుంది. ఆ ప్రకారంగానే సీనియరసిస్టెంటుగారూ, నేనూ, మణీ వంగి దణ్ణం పెట్టుకున్నాం. ఆయన మొహమాటంగా ''ఎందుకయ్యా ఇవన్నీను,'' అంటున్నా కానీ. తర్వాత ఆ పక్కన ఎడ్డావతారంలా నిలబడి చూస్తున్న టైపిస్టుని కూడా సీనియరసిస్టెంటుగారు కాస్త రహస్యంగానే 'రండి మీరూనూ' అన్నట్టు సైగ చేసేరు. దానికతను- ఏదో తాయిలం ఇవ్వబోతుంటే మొహమాటపడుతున్నట్టు మొహంపెట్టి 'ఫర్లేదు ఫర్లేద'న్నట్టు చేతులాడిస్తూ వెనక్కు జరుగుతున్నాడు. వెనకాల ఉన్న మణి కాళ్ళు తొక్కేసరికి మణి అతన్ని కొద్దిగా ముందుకి తోసాడు. అతని చేయి అందిపుచ్చుకుని నేనే చొరవగా ''ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుంటే మంచిదండీ,'' అని ముందుకు లాగబోయాను. అతను నా చేతిని విదుల్చుకున్నాడు. ఇక్కడేదో జరుగుతున్నదని అప్పుడే గమనించిన హెడ్ గుమాస్తాగారు ''ఏంటయ్యా ఏంటి?'' అని మా మధ్యలోకి వచ్చారు. ''మీ బ్లెస్సింగ్స్ తీసుకోమంటే టైపిస్టుగారు మొహమాటపడుతున్నారు సార్,'' అన్నాడు వెనక నుంచి మణి. హెడ్ గుమాస్తాగారు మా వైపు మందలిస్తున్న నవ్వుతో ''ఏంటండి ఇదంతా,'' అని, టైపిస్టుతో ''ఏదో వీళ్ళ చాదస్తమయ్యా, అలాంటివేం వద్దు,'' అన్నారు. పోనీ అపుడైనా వయసులో పెద్దాయనా, కేడర్లో పెద్దాయనా అనేసి ఓ మారు వంగి ఆయన కాలు తాకుండచ్చు కదా? వాడి కుచ్చు కిరీటమేవైనా ఊడిపోతుందా? అలాగే వెనక్కి తిరిగి వెళ్ళి సీట్లో కూర్చుండిపోయాడు పెద్దమనిషి!
ఆ తర్వాతే నేను మణితోనీ సీనియరసిస్టెంటుగారితోనీ ఆ రోజు రావి చెట్టు దగ్గర హెడ్ గుమాస్తాగారి గురించి టైపిస్టు ఏమన్నాడో చెప్పాను. వాళ్ళిద్దరూ అవునా అని బాధపడ్డారు. నేనంటే ఊరుకున్నాను కానీ సీనియరసిస్టెంటుగారు ఊరుకుంటారా! ఆయనైతే మరీని. అప్పుడ్నించీ అదను దొరికినప్పుడల్లా టైపిస్టుకి ఏదో ఒక చురక అంటిస్తూనే ఉండేవారు. మాతో ఏదో ఊళ్ళో విషయం గురించి మాట్లాడుతూనో, లేదంటే ఏదో ప్రొసీజరు డిస్కస్ చేస్తూనో ఉన్నట్టుండి టైపిస్టు వైపు తిరిగి ''ఏ సార్ అంతేనా?'' అని అడిగేవారు. టైపిస్టు కాసేపు అయోమయంగా కలదొక్కేసుకుంటూంటే ఓ ఆటాడుకునేవారు. అప్పుడప్పుడూ మణి కూడా ఆయనకి తోడొచ్చేవాడు.
ఒకసారి టైపిస్టు మా ముందు నుంచీ నడిచి సీటు దగ్గరికి వెళ్తూంటే సీనియర్ అసిస్టెంటుగారు ''ఏయ్, ఏంటా నడక ఒరాంగుటాన్ లాగా!'' అని గట్టిగా అన్నారు. టైపిస్టు వెనక్కు తిరిగి చూడగానే, అతనివైపు ఎత్తిన చేయిని చప్పున అక్కడే ఉన్న మణి వైపు తిప్పేశారు, ఆ మాట వాడినుద్దేశించి అన్నట్టుగా. మణిగాడు కూడా చేతులేలాడేసుకుని, కాళ్ళు కొద్దిగా పంగజాపి నడిచాడు. ''రికార్డు రూంలో మెట్లెక్కీ ఎక్కీ తొడలు ఒరుసుకుపోతున్నాయ్ సార్,'' అని ఏదో దొంగమాటతో కప్పిపుచ్చాడు. టైపిస్టు తలతిప్పుకుని వెళిపోయాడు, ఓ వెర్రి నవ్వు కూడా నవ్వేసి. అప్పుడు తననే అంటున్నారని అర్థమయ్యిందో లేదో కానీ, ఇలాంటి జోకుల్నే తిప్పి తిప్పి వాడటం వల్లా, పదే పదే ''ఒరాంగుటాన్'' అన్న పేరు తనుండగానే వినపడటంతోనీ బహుశా గ్రహించే వుంటాడు. ఒక్కోసారి ఆ పదం వినపడినా, తల కూడా తిప్పకుండా ముఖం మాడ్చుకుని వెళ్ళి సీట్లో కూర్చునేవాడు. నేను అప్పటికీ అన్నాను కూడా సీనియరసిస్టెంటుగారితో, ''సార్ ఆపండి సార్ మీరు మరీ చిన్నపిల్లాడిలా,'' అని. అయినా ఆయన ఏదైనా మనసులో పెట్టేసుకుంటే అంతే ఇక. ఒక్కోసారి అందరికీ టీలు తెప్పించి కూడా టైపిస్టుకి తెప్పించడం మానేసేవారు.
సీనియరసిస్టెంటుగారు సెటైరేసినప్పుడల్లా అతనూ అదేలెక్కలో తిరిగి మాటకు మాటంటే బావుండేది. కానీ అతనేం మనిషో, అంతకంతకూ ముడుచుకుపోయేవాడు. అలాంటప్పుడు మాకు ఇంకా ఇంకా ఏడిపించాలనిపించేది. మొన్నటికి మొన్న మాతో చిట్టీల్లో కలుస్తాడేమోనని అడిగితే కలవనన్నాడు, ఎందుకనడిగితే జీతం డబ్బులు అంత మిగలవని చెప్పాడు. ''ఏవండి రెండు ఫేమిలీసేఁవన్నా మెయింటైన్ చేస్తన్నారేటి?'' అన్నాడు సీనియరసిస్టెంటుగారు సరదాకి. అందరూ నవ్వేసేం. అతను ముఖం అలాగే పెట్టుకుని సీనియరసిస్టెంటుగారి వైపు చూస్తున్నాడు.
''కానీ మీకే గనక ఇద్దరు పెళ్ళాలుంటే ఆళ్ళకీ ఆళ్ళకీ మధ్య కాలక్షేపం అవ్వాలే తప్ప మీతో మాత్రం కాదండోయ్,'' అన్నాడు సీనియరసిస్టెంటుగారు.
''సార్ మీరు... ఎంతలో ఉండాలో అంతలో... మంచిద్సార్... ఎంతలో ఉండాలో అంతలో ఉంటే మంచిదిసార్,'' అన్నాడు ఆవేశంతో నత్తొచ్చేస్తుంటే.
''అయ్యో ఏంటయ్యా సావీ ఈయన సీరియస్సైపోతున్నారు. రెండు ఫేమిలీసని నేనేదో కాంప్లిమెంటుగా అన్నానండీ,''
''దాని గురించని అంటంలేదు. మీరీ మధ్య చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. నా మీద సెటైర్లయ్యీని. నాకర్థం కావనుకుంట్నారా ఏంటి,''
''బాబూ మణీ కాస్త మంచినీళ్ళు పట్రా ఆయనికి,'' అన్నారు సీనియర్ అసిస్టెంటు. తర్వాత హెడ్ గుమాస్తా వైపు చూసి 'ఏంటి సార్ ఇది మాకు' అన్నట్టు నవ్వారు.
హెడ్ గుమాస్తాగారు పని ఆపి టైపిస్టు వైపే చూస్తున్నారు.
టైపిస్టు ఈసారి దిగ్గున సీట్లోంచి లేచి నుంచొని హెడ్ గుమాస్తాగారికేసి చూసి మాట్లాడుతూ, ''సార్, ఇలా అంట్నానని మీరేవనుకోవద్దు. ఎవరి మర్యాదాళ్లకుంటాది. ఎలా పడితే అలా మాట్లాడితే ఎలా సార్,'' అని అడిగాడు న్యాయం చెప్పమని దబాయిస్తున్నట్టు.
హెడ్ గుమాస్తాగారికి వీరభద్రుడు పూనేసేడు. ''ఓయ్... నువ్వు కూర్చో ముందు. ఎందుకలా రైజై పోతున్నావయ్యా? ఆఫీసన్నాకా అందరూ నీలా మొఖం గంటుపెట్టుకుని కూర్చూనుంటే పన్లవ్వవు. మనుషులు సరదాగా ఉంటే పనీ సరదాగా అయిపోద్ది. ఏంట్నీకేవన్నా మా కన్నా ఎక్కువ జీతవిస్తన్నారా తలెత్తకుండా ఊ సీరియస్‌గా పని చేయమని? కొత్తగా ఒచ్చేవు కాబట్టీ, నీకు చెప్తే తప్ప అర్థవయ్యేట్టు లేదు కాబట్టీ, ఇక్కడ పద్ధతులు చెప్తున్నాను ఇను. ఇప్పటిదాకా మేవెవరం దీన్ని ఆఫీసనుకోలేదు, ఒకరికొకళ్ళం కొలీగ్సనీ అనుకోలేదు. ఇదో ఫేమిలీ, మేం ఫేమిలీ మెంబర్స్‌మి. ఒకళ్ళ మీదొకళ్ళు జోకులేసుకుంటాం, పనీ అలాగే చేసుకుంటాం. ఇప్పటిదాకా అలాగే నడిచింది. నువ్వొచ్చినంత మాత్రాన ఇక్కడ పద్ధతులేవీ మారిపోవు. నువ్వూ నలుగురిలో ఒకడిగా కలిసిపోవటం నేర్చుకో ముందు. కూర్చో,'' గద్దించినట్టన్నారు హెడ్ గుమాస్తాగారు.
నేనూ నా మాటగా అన్నాను. ''అలాక్కాదండీ, పోనీ మిమ్మల్నేవన్నా దూరం పెట్టేవా మేము. ఎప్పుడూ కలుపుకుందామనే చూసేం కదా. సర్లే మీరు కలాపోయేసరికి ఏమో మీకేం ప్రోబ్లెంస్ ఉన్నాయోనని అలా వదిలేసేవంతే,'' అనునయంగానే అన్నాను.
''వదిలేయటం అంటే ఇలా అయిందానికీ కాందానికీ ఎటకారాలాడ్డవాండీ?'' అనడిగేడు.
సీనియరసిస్టెంటుగారు ''అయ్ బాబోయ్ బాబూ మీకో దణ్ణం!'' అని తల మీద చేతులు చప్పట్లు చరిచి, ''నేను అందరితో ఒకలా ఉండి మీతో ఒకలా ఉండ్లేను. లోపల్లోపల మీరంత ఇదైపోతున్నారని నాకు తెలీదిప్పటిదాకాని. మీకది ఇబ్బందైతే ఇదిగో ఈ రోజు నుంచి నేను నోరు మెదిపితే ఒట్టు,'' అని చుట్టూతా అందరి వైపూ ఓసారి చూసి, ''ఏం సార్, ఈ రోజు నుంచీ మీరు నా వైపు చూస్తే నేను కనపడతాను, నా గొంతు వినపడితే మాత్రం చెప్పుతీసుక్కొట్టండి. సరేనా,'' అన్నాడు.
''మీరెందుకు మీ పద్ధతులు మార్చుకోవాలండీ. అవసరమైతే ఆయనే సీటు బైటేసుక్కూచుంటాడు రేపణ్ణించీ,'' అన్నాడు హెడ్ గుమాస్తాగారు.
మణి మధ్యలోకొచ్చి చాకచక్యంగా గొడవ సర్దేశాడు. టైపిస్టు మళ్ళీ ఏదో మాట్లాడబోతుంటే, ''సార్ సార్! కూర్చోండి సార్ మీరు. ఎందుకూరికేని ఒకాఫీసులో ఉంటా మన్లో మనం ఆఁ?'' అని ఆయన భుజం పట్టుకుని కూర్చోపెట్టేశాడు.
అతను ముఖం ఇలా పెట్టుకుని టైపు టిక్కు టిక్కులాడించేడు. కాసేపు హాల్లో ఆ చప్పుడు తప్ప ఇంకో చప్పుడు లేదు.
సీనియరసిస్టెంటుగారే మళ్ళీ ''ఏదో ప్రతిజ్ఞ అయితే చేస్సేను కానీ, ఊరుకొమ్మన్నంత మాత్రాన ఊరుకునే నోరు కాదు సార్ నాది, ఓ జోకు గుర్తొస్తంది చెప్మంటారా?'' అనడిగేడు గిల్టీగా మొహం పెట్టి.
అందరం నవ్వేసేం.
టైపిస్టు లేచి పనున్నట్టు బయటికెళిపోయేడు.
* * *
ఇవ్వాళ పొద్దున్నే మణి పైనుంచి ఓ వార్త మోసుకొచ్చాడు. ''మన టైపిస్టుగారు డిపార్టుమెంటు మార్పించేమని అర్జీ పెట్టుకున్నారంట సార్,'' అన్నాడు హెడ్ గుమాస్తాగారితో. పైన బంట్రోతు మణికి ఆ లెటర్ చూపించాడట. ఆ ఉత్తరంలో చదివిన విషయాల్ని గుర్తున్న మేరకి చెప్పటానికి ప్రయత్నించాడు: ''పూజ్యులైన అయ్యా... మీరు నన్ను నియమించిన విభాగమునందు నాకు అనుకూలముగా లేదు. నా సహోద్యోగులలో కొందరి వల్ల నేను నా విధులు సక్రమంగా నిర్వహించలేకున్నాను. దయచేసి నన్ను వేరే విభాగమునకు బదిలీ కావించగలరు. విధేయుడు, ఫలానా ఫలానా, టైపిస్టు, ఫలానా ఫలానా విభాగం''.
సీనియరసిస్టెంటుగారు ''దయిద్రం ఒదిలింది,'' అన్నారు హెడ్ గుమాస్తాగారి వైపు చూస్తూ. నాకూ అలాగే అనిపించింది.
హెడ్ గుమాస్తాగారి ముఖం ఎర్రబడిపోయింది. ''ఏం వదలటం అండీ. వెళ్తా వెళ్తా అంతా పెంటేట్టేసి వెళ్తేనీ,'' అన్నారు.
''అవున్నిజమే సార్, ఆ మాట ఆలోచించలేదు,''
''ఏరా మణీ, బంట్రోతు లెటర్స్ తీసికెళిపోయేడా?''
''లేద్సార్, ఇంకా సార్ రాలేదు,''
''పైకి పోయి నేనిమ్మన్నానని చెప్పి ఆ లెటరిలా తీసుకురా!''
మణి పైకి వెళ్లాడు.
''ఆ లెటరు సార్ దాకా వెళ్తే మొత్తం డిపార్టుమెంట్లో మన పరువు పోయినట్టే కదా. అంటే, మనవూఁ విషయం చెప్తావనుకోండీ. నాన్ కోపరేటివ్‌గా బిహేవ్ చేస్తనాడనేసి. కానీ సారు ఓ మాటైతే అడుగుతాడు కదా పైకి పిలిచి. మనం నిలబడి జవాబు చెప్పాలి కదా. ఎంత దయిద్రంగా ఉంటదా సిట్యువేషను?'' అన్నారు.
నేనూ అవునన్నాను.
''తత్తుకొడుకున్రానీయండి చెప్తాను,'' అన్నారు హెడ్ గుమాస్తాగారు.
మణి లెటరు తీసుకువచ్చే లోపలే టైపిస్టు వచ్చేశాడు. వస్తూ విష్ చేసేడు కానీ ఎవళం రెస్పాండ్ కాలేదు. మణి లెటర్ తెచ్చి హెడ్ గుమాస్తాగారి చేతుల్లో పెట్టేడు. ఆయన దబ్బపండు చాయ ముఖంలో ఏం తేడా అయినా ఇట్టే తెల్సిపోతుంది. లెటర్ చదువుతూ ఎర్రగా అయిపోయిందాయన ముఖం. టైపిస్టు మాత్రం ఇదంతా ఏం తెలీదు కాబట్టి ఏదో తన మానాన టైపు కొట్టుకుంటున్నాడు. హెడ్ గుమాస్తాగారు నిశ్శబ్దంగా లేచి టైపిస్టు టేబిల్ దగ్గరికి వెళ్లారు. టైపిస్టు ఏంటన్నట్టు లేవబోతుంటే కూర్చోమని సైగ చేసి, తను కూడా పక్కనో స్టూలుంటే లాక్కుని అతనికెదురుగా కూర్చున్నారు.
''ఈ లెటరొకటి కొద్దిగా మార్చి రాయాలి. నేను డిక్టేట్ చేస్తాను మీరు కొట్టిపెట్టండి,'' అంటూ టైపిస్టు లెటర్ని అతని చేతికే ఇచ్చారు. అదీ హెడ్ గుమాస్తాగారంటే!
టైపిస్టు ఆ లెటర్‌ని వినయంగా చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ లెటర్లోకి తొంగి చూస్తానే మెల్లగా లేచి నుంచున్నాడు. ''ఏంటి సార్ ఇది, మీ దగ్గిరికి ఎలా వచ్చింది?'' అన్నాడు.
హెడ్ గుమాస్తాగారు అలాగే బల్ల మీద మోచేతులు నిలబెట్టి వేళ్ళు జతకలిపి అతని ముఖం వంక చూస్తున్నారు.
టైపిస్టు ముఖంలో కంగారు ఇంకా పెరుగుతుంటే మా అందరి వొంకా చూసాడు. మళ్ళీ హెడ్ గుమాస్తాగారి వైపే చూసి, ''ఏంటి సార్, ఇదెలా వచ్చింది మీ దగ్గిరికి. నేనేదో సార్‌కి రాసుకున్నాను నా ప్రాబ్లెంస్...'' అన్నాడు.
''ఎలా వచ్చిందో చెప్తాను. ముందు నాకు చెప్పు. సార్ నీకేవైనా చుట్టమవుతాడా?''
''లేదు?''
''వేరే రకంగా ఏవన్నా పరిచయమా?''
''లేద్సార్...''
''నీ డిపార్టుమెంటు హెడ్ ఎవరు?''
''... మీరే''
''మరి రోజూ కళ్ళ ముందుండే నాకు నీ ప్రాబ్లెం ఏంటో చెప్పకుండా నువ్వు తిన్నగా సార్‌కి ఎందుకు ఉత్తరం రాసేవు?''
''మీకు తెలీదాండి, నా ప్రాబ్లం ఏంటో?''
''తెలుసు... నీ ప్రాబ్లెం ఏంటో తెలుసు. అది నీకు నువ్వు తెచ్చిపెట్టుకున్నదే తప్ప బయటివాళ్ళెవరూ బాధ్యులు కాదనీ తెల్సు. కానీ నువ్వేం రాసావ్ ఈ లెటర్లో... ఆ? చదువయ్యా పైకి చదువూ? ఆళ్ళ గురించి నాలుగు మంచి మాటలు వినాలనుండదా నీ కొలీగ్స్‌కి?''
టైపిస్టు ఆ లెటర్ అలాగే పట్టుకుని చూస్తుంటే హెడ్ గుమాస్తాగారే బర్రున స్టూలు వెనక్కి జరుపుకుంటూ పైకి లేచి అతని చేతుల్లోంచి లెటర్ లాక్కున్నారు. అందులో రాసున్నది గట్టిగా చదివి వినిపించేరు. మధ్య మధ్యలో ఒక్కో వాక్యం దగ్గర ఆగి, ఒకసారి సీనియరసిస్టెంటుగారికేసి చూస్తూ ''ఇది మీ గురించి ఈయన అభిప్రాయవండీ,'' అనీ, ఇంకోసారి నా వైపు తిరిగి, ''ఇదిగో జూనియర్ అసిస్టెంటుగారు మీరు తప్పించుకుంటున్నా అనుకుంటున్నారా, చూడండి మీ గురించేం రాసేడో,'' అనీ, ఇంకోసారి మణి వైపు చూస్తూ, ''రేయ్, ఆఖరికి నిన్నూ వదల్లేదు ఇందులో,'' అనీ అంతా చదివి, ''ఇట్లు, మీ విధేయుడు,'' అంటూ పూర్తి చేసారు. తర్వాత టైపిస్టు వైపు చూస్తూ ఉత్తరాన్ని ముక్కలు ముక్కలుగా చింపి ఉండలాగా చేసి అతని టేబిలు మీదే ఓ పక్కన పెట్టారు.
''నువ్వు నీ బుర్రలోకి ఏ చెత్తొస్తే ఆ చెత్త రాసేసి సార్‌కి పంపేవు. ఆయన ఈ తలపోటు యవ్వారమేదో నన్నే చూసుకొమ్మని పిలిచి దీన్ని నా చేతికిచ్చారు. నేను అక్కడే చెప్పుండచ్చు- నీకు పని రాదనీ, నలుగురితో కలిసి పన్చేసే గుణం అస్సలు లేదనీని. అక్కడే నిన్ను పీకి పారదొబ్బమని ఓ మాట అనేసి ఉండొచ్చు. కానీ ఒకడి కడుపు కొట్టే పన్లు నేనెప్పుడూ చెయ్యను. అంత నీతిలేని లంజాకొడుకుని కాదు.''
టైపిస్టు, ''మీ గురించేం రాయలేదు అందులో...'' అనేదో గొణగబోయాడు.
''నా డిపార్టుమెంటునంటే నన్ను అన్నట్టు కాదా!!'' హాలంతా మార్మోగిపోయేలా అరిచేరు హెడ్ గుమాస్తాగారు. నాకైతే వళ్ళు జలదరించిపోయింది. సీనియరసిస్టెంటుగారు సీట్లోంచి లేచి, ''సార్ సార్ మీరు ఆవేశపడొద్దు,'' అంటూ దగ్గరకు రాబోతుంటే ఒక చేతో దగ్గరకు రావద్దన్నట్టు ఆపారు హెడ్ గుమాస్తాగారు. కొంతసేపు అలాగే నిలకడగా ఊపిరి పీల్చుకుని తర్వాత మాట్లాడేరు. ''నువ్వు చేసింది లత్కోరు పని. ఓ రకంగా ఎడ్డి పని కూడా. ఎందుకంటే ఇదే ఆఫీసులో పదేళ్ళ పైన సర్వీసుంది నాకు. నన్నిక్కణ్ణించి కదిలిద్దామని ఇదిగో ఇంతమంది ట్రై చేసారు. నా ముందూ, నా వీపెనకాలా కూడాని. మరెందుకు ఏం చేయలేకపోయారు? పైకెళ్ళి నువ్వే ఏ డిపార్టుమెంటు వాళ్ళనైనా అడిగి విను నా గురించి ఏం చెప్తారో. నేను ఏ డిపార్టుమెంటులోనైనా ఇలా అడుగుపెడితే ముందు కూర్చోబెట్టి టీ తెప్పించి తర్వాత మాట్లాడతారు. 'ఏం పుణ్యం చేసుకున్నాం సార్ ఇవాళ' అన్నట్టు రిసీవ్ చేసుకుంటారు. నా పేరు పలికితే పనులు చేసిపెట్టే మనుషులున్నారు పైన. ఆఖరికి సార్ కూడా ఆయనింట్లో ఏదైనా ఫంక్షనుంటే ఫస్టుకంట ఇన్విటేషనిచ్చేది నాకు. ఏవనుకుంటున్నావ్... ఈ సీట్లో కూర్చుని గచ్చకాయలాడుకున్నాననుకున్నావా ఇన్నేళ్ళూని? ఇదిగో ఇదే మొదటిసారీ ఆఖరుసారీని చెప్పటం. నువ్వుంటే ఈ సీట్లో ఉంటావు. లేకపోతే సీటు సర్దుకుని ఇంటికెళిపోతావు. రెండే దార్లు.''
అప్పటికి కాస్త ఆవేశం తగ్గి గొంతు కాస్త అనునయంగా మార్చి మాట్లాడారు. ''కాదయ్యా, నీకు ఇంతకన్నా మంచి డిపార్టుమెంటూ, ఇంతకన్నా మంచి కొలీగ్సూ అసలు వేరే ఎక్కడన్నా దొరుకుతారనుకుంటున్నావా? ఇదే పని నువ్వింకెక్కడైనా చేసుంటే అప్పుడు తెలిసొచ్చును నీకు. నలుగురు మంచోళ్ళ మధ్యన మంచిగా ఉంటానికేంటయ్యా దొబ్బుడాయి? ఆ...? కూర్చో యింక,'' అని తన సీటు దగ్గరికి నడిచారు.
నాకైతే తుఫాను వెలిసినట్టే అనిపించింది. ఆయన సీట్లోకెళ్ళి కూర్చున్నాకా కూడా ఎవరం ఏం మాట్లాడలేదు. సీనియరసిస్టెంటుగారే కాసేపటి కదిలించారు, ''జడిపించేహేరు సార్ మొత్తానికి,'' అంటూను. ''ఆయన అప్పుడపుడూ అయినా అలా విశ్వరూపం చూపిత్తేనేనండీ, మనవిలా ఉండగలిగేది,'' అన్నాను నేను.
హెడ్ గుమాస్తాగారు మురిపెంగా నవ్వుతూ అన్నారు, ''నన్నెవరూ గిల్లనంత వరకేనండీ,'' అని.
* * *
ఇందాకే ఒక విషయం జరిగింది. ఏం తోచక సెకండ్‌షో సినిమాకి వెళ్ళాను. ఆ ఎదవ థియేటరు ఊరంతటికీ చివార్న ఉంటుంది. బూతుబొమ్మలు తెచ్చేస్తూ ఉంటారు ఎక్కువగా. కానీ ఈసారి పాత సినిమా మంచిది ఒకటి తెచ్చేరు. పాటలు బాగుంటాయని వెళ్ళాను. జనం వచ్చిందే తక్కువ. వచ్చిన కొద్దిమందీ సినిమా ఇలా వదలగానే సైకిళ్ళెక్కి ఇట్టే మాయమైపోయారు. రిక్షాలు కూడా లేవు. నేను అప్పటికే ప్రింటు బాలేని సినిమాకి ఎందుకొచ్చాంరా దేవుడా అనుకుంటున్నాను. ఇప్పుడు నడిచిపోయే కష్టం ముందుండేసరికి ఇంకా నీరసం వచ్చేసింది. సరే, బాట్రీ లైటు ఊపుకుంటూ నడిచి వెళ్తున్నాను రోడ్డువారని. ఊళ్ళోకి వచ్చేసి, ఒక వీధిలో పోతే కుక్కలుంటాయని గుర్తొచ్చి, ఆ పక్క వీధిలోకి మళ్ళాను. అది మొత్తం ఊరికే చెడ్డపేరు తెచ్చిన వీధి. అడుగుపెడితే ఎవరూ లేరన్నట్టే అనిపించింది కానీ, కాస్త దూరం నడిచేసరికి ఏదో అలికిడి తెలిసింది. ఒకే ఒక్క వీధిలైటు ఆ చివర కనపడుతుంటే బాట్రీ లైటు ఆపేసి వడివడిగా నడుస్తున్నాను. ''ఓసార్ ఏవండీ జూనియరుగారు ఆగండాగండి,'' అని గట్టిగా వినిపించింది.
వెనక్కి తిరిగి చూస్తే ఓ ఇంటి అరుగు మీద నవారు మంచం తడికెలాగా అడ్డం నిలబెట్టి ఉంది. దాని వెనక నుంచి పంచె అంచుల్ని చేతుల్లో ఊపుతూ వీధిలోకి అడుగుపెడుతున్నాడో మనిషి. నవారు మంచం వెనక ఏవో నీడలు మాట్లాడుకుంటున్నాయి గుడ్డిదీపం వెలుగులో. ఒక నీడేదో గట్టిగా మాట్లాడింది కూడా. దానికి జవాబుగా ''రేయ్ నా గ్లాసుగానీ, ముక్కలుగానీ కదిపినట్టు తెలిసిందో...'' అని వెనక్కి వేలు ఊపుతున్నాడు టైపిస్టు. నా ముందుకొచ్చి నిలబడ్డాకా గుర్తుపట్టగలిగాను అతని గొంతు కానీ, వాలకం కానీ.
''నమస్తే సార్... ఇయ్యేళప్పుడు ఈ వీధమ్మటా ఎల్తన్నారు. ఆఁ ఆఁ...!'' అని ఆరా తీస్తున్నట్టు వెకిలిగా నవ్వుతున్నాడు.
అసలు ఆ మనిషి అలా నవ్వగలడనీ, అలా మాట్లాడగలడనీ నేనెప్పుడూ ఊహించలేదు. సినిమా నుంచి వస్తున్నానని చెప్పాను.
''అవునా, సరేమరి పదండి మీరొక్కళ్ళూ ఒంటరిగా ఎల్లగలరా. ఉండండి ఆ లైటు దాకా దింపేహొత్తాను. అసల్రోజులేం మంచిగా లేవు,'' అని కికిక్కీ మని నవ్వుతూ వాసన కొడ్తున్న వంటితో నా భుజం చుట్టూ చెయ్యి వేసాడు.
నేను విదిలించుకున్నాను. ''బాగా ఎక్కినట్టుంది,'' అన్నాను.
''అయ్యో అదేంటండీ, మనం మనం ఫేమిలీ కదా. మరి ఏదో ఫ్రెండ్లీగా చెయ్యేస్తే తీసేస్తన్నారేంటి?'' అన్నాడు.
''ఆలస్యం అయింది కదా. ఇంతకీ మీ ఇల్లు ఇక్కడేనా,'' అన్నాను పొరబాట్న.
''ఆ ఇక్కడే. ఈ వీధి వీధంతా మా ఇల్లే. చాలామంది పెళ్లాలున్నారిక్కడ నాకు. మొన్నా లంజొడుకు అన్నాడు కదా... సెకండ్ ఫేమిలీ మైంటైన్ చేస్తనావా అని. థర్డూ ఫోర్తూ కూడా ఉన్నాయిక్కడ. రండి పరిచయం చేస్తాను,'' అని చెయ్యి పట్టుకుని లాగబోయాడు.
''వద్దులెండి. పొద్దున్న కలుద్దాం,'' అని నేను వెనక్కి తిరిగి నడిచాను.
అయినా మళ్ళీ వెనకనుంచి వచ్చి చేయేసి మీద వాలిపోతూ వెంట అడుగులేస్తున్నాడు. ''కాదండీ నాకోటి అర్థంకాకడుగుతున్నా చెప్పండి. మీరంతా ఎందుకు ఉంచుకున్న ముండల్లాగా ఎప్పుడూ ఆ హెడ్ గుమాస్తాగాడ్ని పిసుకుతూ ఉంటారు,'' అంటున్నాడు.
నేను బలం కూడదీసుకుని భుజం చుట్టూ కొండచిలువలాగా చుట్టుకున్న అతని చెయ్యి విప్పదీసి పక్కకి విసిరేసాను. ఆ విసురుకి అంత మనిషీ, పైగా తాగున్నాడేమో, నిలదొక్కుకోలేక లుంగీ తొక్కుకుని తూలి ముందుకి పడ్డాడు మోకాళ్ళ మీద.
ఓ క్షణం ఆగి లేపుదామా అనుకున్నాను కానీ మళ్ళీ ఎందుకులెమ్మని తిరిగి నడిచాను.
వెనక నుంచి అతని అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి. ''రేయ్ కొజ్జా నాకొడకా ఆగరా నువ్వలాగ. మీరూ మీ బతుకులూ... త్ఫూ! ఒక్కొక్కడి బాగోతం తెలుసు నాకు. ఏఁ నాకు హెడ్డాఫీసు ఎడ్రస్ తెలీదనుకుంటున్నారా ఏంట్రా? ఎక్కడికి ఏం రాయాలో, ఎలా రాస్తే మీకు తగలాల్సిన చోట తగులుద్దో నాకు బాగా తెల్సురా,'' అని లేచి వెనకాల నడుస్తూ అరుస్తున్నాడు. ఇందాక అతను దిగొచ్చిన ఇంటి నుంచీ ఇంకెవరో మనుషులు వీధిలోకి వస్తూ నీడల్లాగా కనిపిస్తున్నారు. నాకు భయమేసి కాళ్ళ సత్తువకొద్దీ పరిగెట్టేను.
అతను ఓ చోట ఆగిపోయి విరగబడి నవ్వుతున్నాడు, ''రేయ్, కుచ్చిళ్ళు జారిపోతాయేమో నెమ్మదిగా పరిగెట్టు...'' అంటున్నాడు.
* * *
అదే పరుగు మీద ఇంటికెలా వచ్చానో, తలుపులన్నీ మళ్ళీ మళ్ళీ చూసుకొని గెడవేసి ఎలా మంచం మీదకొచ్చి పడ్డానో తెలీదు. పడుకున్నానన్న మాటేకానీ గుండె దడ తగ్గలేదు. జరిగింది తల్చుకున్నకొద్దీ కసొచ్చేస్తోంది. గొంతంతా కోపంతో బూతుల్తో ఉబ్బరించి నట్టుంది. బుర్ర నిండా చేపలగుంపుల్లాగా ఆలోచనలు తిరుగుతున్నాయి. కిటికీ బయట రాత్రి దాని మానాన అది సాగిపోతోంది. పక్క మీద అటు దొర్లి ఇటు దొర్లి చెమట్లతో కాసేపటికి జ్వరం కూడా మొదలైందనిపిస్తోంది. అయినా మనసు నిలబెట్టి ఆలోచించాను. రేపు ఏంచేయాలీ, అందరికీ జరిగింది ఎలాచెప్పాలీ అన్న ఊహలు కళ్ళముందాడాయి. అబ్బే ఆఫీసు మొదలయ్యేదాకా ఆగితే లాభం లేదు. తెల్లారగానే తిన్నగా హెడ్ గుమాస్తా గారింటికి వెళ్ళి చెప్పేస్తాను. పొద్దున్నే ఆయన ఆసనాలవీ పూర్తిచేసి గచ్చు మీద కూర్చొని పేపరు చదువుకుంటుండగా, గేటు తీసుకు వస్తున్న నన్ను చూసి, కొద్దిగా ఆశ్చర్యం కలిసిన నవ్వుతోటి, ''రండ్రండి!'' అంటారు పేపరుపక్కన పెడుతూ. తూర్పెండ కటకటాల్లోంచి లోపలకి పడుతుంది. నా చేతిలో వున్న కప్పులోంచి టీ చప్పరించి పక్కన పెట్టేసి గబగబా మాట్లాడుతున్నాను. హెడ్ గుమాస్తాగారు పడక్కుర్చీలో వెనక్కివాలి అలవాటుగా చూపుడు వేలి మీద బొటన వేలు తిప్పుతున్నారు. నేను ఎంత మాట్లాడుతున్నా చెప్పాల్సింది ఇంకా నోట్లోంచి వస్తూనే ఉంది. హెడ్ గుమాస్తాగారు కూడా- ఇంత స్పష్టంగా, ఇంత విశదంగా మాట్లాడగల నా శక్తిని అబ్బరంగా చూస్తున్నారు. టైపిస్ట్ హెడ్డాఫీసు దాకా వెళ్తానంటున్నాడన్న సంగతి చెప్పేశాకా నా గుండెల మీంచి పెద్ద బరువు దిగిపోయినట్టుంది. హెడ్డాఫీసు ప్రస్తావన వచ్చిందో లేదో, హెడ్ గుమాస్తాగారు చప్పున ముందుకు వంగారు. ఆ మాటతో ఆయన్ని అలా కదిలించగలిగానన్న తృప్తితో మాట్లాట్టం ఆపాను. ఆయన లోపలి గుమ్మం వైపు తొంగి చూస్తూ, ''రేయ్ మణీ!'' అని పిలుస్తున్నారు. నేను అప్పటిదాకా నాకు టీ ఇచ్చింది వాళ్ళావిడేమో అనుకున్నాను. మణిగాడు చొక్కా తొడుక్కుంటూ వస్తున్నాడు లోపల్నించి. చాలా గడపలున్నాయి దాటి రావటానికి. ఈలోగానే మేమందరం ఆఫీసులో ఉన్నాం. నేను చూట్టంచూట్టమే హెడ్ గుమాస్తాగారు పట్టుకొని దులిపేస్తున్నారు టైపిస్టుని. కానీ నిన్న జరిగిన విషయం గురించి కాదు, ఏదో సర్వే లెక్కలు తప్పు టైప్ చేశాడని. హెడ్ గుమాస్తాగారి ముఖమంతా ఎర్రగా అయిపోయి నోట్లోంచి బూతులు కక్కేస్తున్నారు. ఆయన కోపం చూస్తోంటే నాకు టేబిల్ కిందకి దూరిపోయి దాక్కోవాలనిపిస్తోంది. కానీ నేనక్కడ ఉన్నానని ఆయనకి ఇదివరకే తెలుసు కదా, అప్పుడిక దాక్కోవటం ఏం బాగుంటుంది. ఆయన మాత్రం ఆయనపాటికి--ఇటు నేనూ, అటు సీనియరసిస్టెంటుగారు ఉన్నావని తెలీనే తెలీనట్టు--తిడుతున్నారు. ఆయనకి టైపిస్టొక్కడే కళ్ళ ముందు కనిపిస్తున్నాడు, తల కొద్దిగా వొంచుకొని. ఆయన పేపర్లన్నీ టైపిస్ట్ వైపు గాల్లోకి విసిరేస్తున్నారు. ఎగిరిపడుతోన్న పేపర్ల మధ్యన టైపిస్టు వొంగుతున్నాడు కింద పడిన పేపర్లని ఏరుకోవటానికి.
''మాటంటే కోపం వచ్చేస్తుంది. బుసలు కొట్టేస్తున్నావు. అంత పౌరుషం వున్నవాడివి పని సరిగ్గా చేయి,'' అంటున్నారు హెడ్ గుమాస్తాగారు.
టైపిస్టు వొంగినవాడే మళ్ళీ లేచి ఎదురు సమాధానం చెప్తున్నాడు.
నాకు అతడ్ని రక్షిద్దామనే అతని మీద పడి నోరు నొక్కేయాలనిపించింది. అదే ఉద్దేశంతోనన్నట్టు సీనియరసిస్టెంటుగారు ముందుకొచ్చి టైపిస్టు భుజం మీద చేయి వేసి ''నేను చూపిస్తాను రండి ఫైలు'' అని రికార్డు రూమ్ వైపు తీసుకెళ్తున్నారు.
టైపిస్టు అటువైపు కదులుతూనే, ''మన పనాండి ఇది? ఆ మణిగాడు చేయాల్సిన పని!'' అంటున్నాడు.
వాళ్ళిద్దరు అలా బరువైన రికార్డు రూము తలుపు తోసుకొని లోపలికి వెళ్ళారో లేదో, మణిగాడు, అప్పటిదాకా నా వెనక ఉన్నాడనే తెలీదు, మహవిసురుగా రికార్డ్ రూములోకి వెళ్ళి తలుపు వేసేసుకున్నాడు.
హాల్లో ఇప్పుడు హెడ్ గుమాస్తాగారూ నేనే వున్నామని అర్థమైంది. ఆయన వైపు భయంగా తల తిప్పాను. ఆయన మాత్రం చాలా ప్రసన్నంగా భరోసాగా నావైపు చూస్తూ, కనిపించీ కనిపించనట్టు నవ్వుతున్నారు. రికార్డు రూము లోపల్నించి పెద్దగా అరుపులూ శోకండాల్లాగా వినిపిస్తున్నాయి. హెడ్ గుమాస్తాగారు నెమ్మదిగా లేచారు. వొళ్ళోని అట్టని దాని మీద ఫైలుతో సహా జార్తగా టేబిల్ మీద పెట్టి, పేజీలు మారకుండా రూళ్ళ కర్ర ఒత్తుపెట్టి, పొట్ట కింద కాటన్ చొక్కా మడతలు సాఫు చేసుకొన్నారు. నా పక్క నుండి నడిచి, రికార్డు రూములోకి వెళ్ళి తలుపు వేసుకున్నారు.
నోరంతా ఎండిపోయినట్టు దాహం దాహంగా అనిపిస్తోంది నాకు. హాల్లో ఒక్కణ్ణీ కూర్చొని గాలికి కొట్టుకుంటున్న కిటికీ రెక్కని చూస్తున్నాను. రెక్క తెరుచుకున్నప్పుడల్లా బైట రావిచెట్టు ఆకులు ఎండలో కనిపిస్తున్నాయి. హాల్లో బల్లల మీద కాయితాలు రెపరెపలాడుతున్నాయి. ఎవరో వెక్కిళ్ళు పెడుతున్న శబ్దం వినిపించినట్టయి అటు చూస్తే టైపిస్టు తన కుర్చీలో కూర్చుని టైపు మిషను వెనకాల మొహం కనపడనివ్వకుండా దాచుకొని ఏడుస్తున్నాడు. టేబిల్ కిందకి చూస్తే మటుకు పాంటు కిందనుంచి కాలి మీద పాయలు పాయలుగా కారుతున్న రక్తం నేల మీద పేరుకుపోతోంది. నేను హడిలిపోయి రికార్డు రూము ముందు నిలబడి తలుపులు బాదుతున్నాను. ఎంతకీ ఎవరూ తలుపు తీయటం లేదు. టైపిస్టు లేచి నా దగ్గరికి వస్తున్నాడేమోనన్న భయంతో ఇంకా గట్టిగా బాదుతున్నాను. మధ్యలో అటువైపు చూస్తే ఈ సారి టైపు మిషను దగ్గిర ఒక ఆడ మనిషి కూర్చొని ఉంది. నా భార్య. ఆమె ఏడవటం లేదుగానీ, వేళ్ళు కూడా కనిపించనంత స్పీడుగా ఆమె టైపు చేస్తున్న ఉత్తరం నాకోసమేనని తెలిసిపోయింది. ఈలోగా తలుపు తెరుచుకుంది. సీనియరసిస్టెంటుగారి నవ్వు ముఖం లోపలికి రమ్మంటోంది.
లోపల మసక చీకట్లో ఒక పెద్ద అల్మరా మొత్తం ఓ పక్కకి ఒరిగిపోయి వుంది. ఫైళ్ళన్నీ ఎలా పడితే అలా నేల మీదకి జారిపోయాయి. టైపిస్టు గోడకి ఆనుకుని కూలబడిపోయి రొప్పుతున్నాడు. మణి అతని జుట్టు పట్టుకుని కిందకీ పైకీ గుంజుతున్నాడు. హెడ్ గుమాస్తాగారు అతని ముందు నిల్చుని చేతులు నడుం మీద ఆన్చి, ''నీయ్యమ్మా లంఝకొడకా... నీదసలు మనిషి పుట్టుకేనారా,'' అని అడుగుతున్నారు. సీనియరసిస్టెంటు గారు తలుపు వేసేసి నా పక్కకి వచ్చి నిల్చున్నారు. నేను ఆయన వైపు చూసేసరికి నవ్వుతూ చేతులు ఒరాంగుటాన్ లాగా పెట్టి పక్కలకి ఊగినట్టు నడుస్తూ టైపిస్టు ముందుకెళ్లారు.
టైపిస్టు లేవటానికి ప్రయత్నం చేస్తున్న కొద్దీ మణిగాడు మోకాలు వాడి మెడ మీద వేసి ఇంకా కిందకి నొక్కుతున్నాడు. టైపిస్టు వికృతంగా అరుపుల్లాగా ఏడవటం మొదలుపెట్టాడు. అతని ఏడుపు మొహాన్ని మాకు చూపించటానికి మణి జుట్టుతో అతని తలని వెనక్కి వొంచుతున్నాడు. టైపిస్టు ముఖమంతా చెమట్లూ, కన్నీళ్ళూ, పెదాల దగ్గిర రక్తంతో కలిసిపోయి బందబందగా వుంది. గొంతుకాయ పైకీ కిందకీ కదుల్తోంది. అయినా ఎలాగో బలమంతా కూడదీసుకుని లేచాడు. మీదకు రాబోతున్న సీనియరసిస్టెంటుగారిని గెంటేసి నా పక్కనుంచే తలుపువైపు పరిగెడుతున్నాడు. మా ఆధిక్యమంతా చేతుల్లోంచి జారిపోతోందనిపించింది. నాకు లోపల్నించి ఎక్కళ్ళేని ధైర్యం తోసుకొచ్చింది. ఇంక నన్ను దాటిపోతాడనగా వాడి కాలర్ని వెనక నుంచి పట్టుకున్నాను. ఇంకో చెయ్యి మెడ చుట్టూ బంధం వేశాను. కానీ ఆ ఎద్దులాంటి మనిషి నన్నూ తనతో తలుపు దాకా లాక్కుపోతున్నాడు. నా కాలొకటి తలుపుకి తన్నిపెట్టేసరికి ఇద్దరం నేల మీద పడిపోయాం. వాడ్ని నేలమీద కుదేసి నేను పైకి లేస్తుంటే మణీ, సీనియరసిస్టెంటుగారూ, హెడ్ గుమాస్తాగారూ నా వైపు వస్తున్నారు, మెచ్చుకోలుగా చూస్తూ.
(Story revised on December 2018)
chaala engaging ga bagundhandhandi.
ReplyDelete'Hate' anoka Danish film chusaanu similar lines meedha.
చాలా బావుంది మెహర్ గారు
ReplyDelete